సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పోలంకి పిట్ట, పిగిలిపిట్ట, తేనె పిట్ట, నల్ల కొంగ, ఎర్ర గుడ్లగూబ, పెద్ద చిలుక, పసుపు పావురం.. ఈ పక్షులను ఎప్పుడూ చూడలేదు కదూ! చూడటం కాదు, కనీసం పేర్లు కూడా విననివారూ ఎక్కువే. వివిధ కారణాలతో పక్షుల సంఖ్య తగ్గిపోవడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్టులు, చెరువుల వద్ద ఏకంగా 446 రకాల పక్షులు సందడి చేస్తున్నాయి.
మన దేశంలో ప్రస్తుతమున్న 1,300 పక్షి జాతుల్లో మూడో వంతుకుపైగా తెలంగాణలో స్థిరనివాసం ఉండటంగానీ, వలస వచ్చిపోవడం గానీ జరుగుతోందని ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ తాజా నివేదిక వెల్లడించింది. నల్లమల, అనంతగిరి, గుబ్బల మంగమ్మ (అశ్వారావుపేట), పోచారం, కవ్వాల్, ఏటూరునాగారం, నర్సాపూర్ అటవీ ప్రాంతాల్లో చాలా జాతుల పక్షులు ఆవాసాలు ఏర్పర్చుకున్నట్టు తెలిపింది.
కొత్త పక్షులకూ ఆవాసం..
మన రాష్ట్రంలో పలుచోట్ల కొత్తగా తలపై పింఛంతో ఠీవిగా కనిపించే బ్లాక్ బాజా (నల్లడేగ), మూరెడు తోక కలిగిన బ్లిత్స్ పారడైజ్ ఫ్లైక్యాచర్ (తోట పిగిలిపిట్ట)లను గుర్తించారు. వీటికితోడు అనంతగిరిలో బ్లూఅండ్ వైట్ ఫ్లైక్యాచర్ (నీలి– తెల్ల పిగిలిపిట్టలు), అశ్వారావుపేట గుబ్బలమంగమ్మ ఫారెస్ట్‌లో రూఫస్ వుడ్‌పెకర్ (ఒక రకం వడ్రంగి పిట్ట), కవ్వాల్‌లో మార్స్ హారియర్, ఇండియా కోర్సర్, బ్లాక్ బెల్లిట్, లాఫింగ్ డవ్, హార్ట్ స్పాటెడ్ వడ్రంగి పిట్ట తదితర వలస పక్షులను కొత్తగా గుర్తించారు. కొన్నేళ్లుగా మంచి వర్షాలు, వేసవిలో దాహార్తిని తీర్చేందుకు రిజర్వు ఫారెస్టుల్లో ఏర్పాట్లు చేయటంతో.. పక్షుల సంతతి, రాక పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు.
నగరాలు, చెరువుల వద్ద.. ఆందోళనకరం
జీవావరణ సమతుల్యతలో కీలకపాత్ర పోషించే పక్షుల మనుగడ పెద్దగా మనుషుల అలికిడి లేని అటవీ ప్రాంతాల్లో భేషుగ్గా ఉండగా.. నగరాలు, చెరువుల వద్ద ఆందోళనకరంగా ఉందని తేలింది. రిజర్వ్ ఫారెస్ట్‌లలో స్థానికంగా ఉన్నవాటికి తోడు కొత్త రకాల పక్షులు వచ్చి చేరుతున్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని నిపుణులు చెప్తున్నారు.
పక్షుల మనుగడకు తోడ్పడే పండ్లు, పూలచెట్ల స్థానంలో ఎలాంటి ప్రయోజనంలేని మొక్కల పెంపకం, భారీ నిర్మాణాలతో చెట్లు తగ్గిపోవడం, సెల్ టవర్లు, కర్బన ఇంధనాల కాలుష్యం వంటి కారణాలతో పావురాలు తప్ప మిగతా పక్షులేవీ పెద్దగా మనగలిగే పరిస్థితి లేదని ‘హైదరాబాద్ బర్డ్ పాల్స్’ సంస్థ ప్రతినిధి గోపాలకృష్ణ అయ్యర్ తెలిపారు. ఇక కొన్నేళ్లుగా చెరువుల సరిహద్దులు, కట్టల నిర్మాణాలు, వాటిపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, ప్రకాశవంతమైన విద్యుత్ లైట్లు అమర్చడం వంటివాటితో.. వలస పక్షులతోపాటు ఇక్కడి నీటి పక్షులు గుడ్లు పెట్టి, సంతానోత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని అయ్యర్ వివరించారు.
మనుషుల అలికిడి పెరగడం, వేట (పురుగులు, చిన్నచేపలు) దొరకడం కష్టమవడంతో ఆయా పక్షుల మనుగడకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ కారణాలతో.. అక్టోబర్ నుంచి మార్చి వరకు యూరప్, సైబీరియా, ఆ్రస్టేలియాల నుండి వలసవచ్చే పక్షుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. చెరువుల పునర్నీర్మాణంలో పక్షుల మనుగడ అంశాన్ని మర్చిపోయి డిజైన్ చేయడమూ ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు.
♦ కోకిల కిలకిలారావాలు, చిలుకల పలుకులు, పిచ్చుకల కిచకిచలతోపాటు ఏకంగా 304 రకాల పక్షుల సందడితో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రత్యేక జీవావరణ కేంద్రంగా మారింది. ఇక్కడ నల్లగద్ద, పోలంకి పిట్ట, తేనెపిట్ట, నల్లకొంగ, తోక పిగిలిపిట్ట, పెద్ద చిలుక, ఎర్ర గుడ్లగూబ తదితర పక్షులు ఆవాసం ఏర్పరచుకున్నాయి.
♦వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రతి మొక్క ఆయుర్వేద గుణాలున్నదేనన్న పేరు పొందింది. ఈ అడవుల్లో 250 రకాల పక్షులు ఉన్నాయి. బండీడ్ బే కుకూ, బ్లూ బెయిర్డెడ్‌బీ ఈటర్, చెస్ట్‌నట్ టెయిల్డ్ స్టార్లింగ్, పొన్నంగి పిట్ట (ఇండియన్ పిట్ట) లతో పాటు చెవులపిల్లిని ఆహారంగా తీసుకునే కుందేటిసలవ గద్దలు వంటి పక్షు లు అనంతగిరి నుంచి ఉస్మా న్‌సాగర్ రిజర్వాయర్ వరకు సందడి చేస్తున్నాయి.
డేంజర్ జోన్‌లో బుల్‌బుల్ పిట్ట..
♦ చూసేందుకు ముద్దుగా, పలికితే వినసొంపుగా ఉండే బుల్‌బుల్ పిట్ట (ఎల్లో త్రోటెడ్ బర్డ్) అంతరించే స్థితికి చేరింది. దేశంలోపాటు మన రాష్ట్రంలోనూ వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటి నివాసం రాళ్లు, కొండ గుహలే.
♦ కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట, బెజ్జూరులలో రాబందు (వల్చర్) సంరక్షణ కేంద్రం ఏర్పాటు కూడా ప్రయోజనం ఇవ్వలేదు. ప్రాణహిత తీరంలో రాబందుల పర్యవేక్షణ కోసం బయాలజిస్ట్, వాచర్‌ను నియమించి రోజూ ఒక ఆవును ఆహారంగా వదిలినా ఫలితం లేకపోవటంతో ఆ ప్రయత్నాలు ఇటీవలే ఉపసంహరించారు.
♦ జనగాం జిల్లా చిన్నమడూరు, పెద్ద మడూరు గ్రామాలకు ఏటా వచ్చే విదేశీ పక్షులకు అక్కడి కోతుల గుంపులు ప్రతిబంధకంగా మారాయి. ఈ ఏడాది వలస పక్షుల సంఖ్య భారీగా తగ్గింది.
అడవుల్లో పక్షుల జోరు పెరిగింది
తెలంగాణ అటవీ ప్రాంతంలో అన్నిరకాల స్థానిక పక్షు ల సంతతితోపాటు కొత్త పక్షుల వలస పెరిగింది. దేశీజాతి పక్షులు ఈ ప్రాంతానికి హిమాలయాలు మొదలుకుని ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి. అయితే అటవీ ప్రాంతాల్లో జన సందడిని మరింత తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవ సరం ఉంది. – మదన్‌రెడ్డి, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్
చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలి
చాలా చోట్ల చెరువులకు మరమ్మతులు చేస్తూ వాటికి ఒడ్డు లేకుండా చేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే చెరువుల నిర్వహణ ప్రైవేటు చేతుల్లోకి తీసుకుని వాకింగ్ ట్రాక్‌లు, విద్యుత్ లైట్లు వేస్తున్నారు. చుట్టుపక్కల చెట్లు కూడా లేకుండా పోతున్నాయి. వీటి ప్రభావం పక్షులపై తీవ్రంగా పడింది. విదేశీ వలస పక్షుల రాక తగ్గిపోయేందుకు కారణమైంది. – హరికృష్ణ అడపా, హైదరాబాద్ బర్డ్ పాల్స్ సంస్థ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment