Reserve Forest
-
భూంకాల్ పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసంక్ర మణ సిద్ధాంతం, సైన్యసహకార పద్ధతి వంటి కుట్రపూరిత విధానాలతో బస్తర్ రాజ్యాన్ని కూడా ప్రిన్సిలీ స్టేట్‌గా బ్రిటీషర్లు మార్చారు. రాజును నామమాత్రం చేస్తూ పరోక్షంగా పాలన సాగించా రు. ఈ క్రమంలో 1878లో బ్రిటీష్ ప్రభుత్వం రిజ ర్వ్ ఫారెస్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో బస్తర్ అడవుల్లో 66 శాతం భూభాగంపై ఆదివాసీ లు హక్కులు కోల్పోయారు. రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రదేశాల్లో కర్ర పుల్ల తీసుకెళ్లాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మరోవైపు బ్రిటీ షర్ల కాలంలో బస్తర్ పాలకుడిగా ఉన్న భైరామ్ దేవ్ కుష్ఠువ్యాధి బారిన పడ్డారు. దీంతో ఆయన్ను పదవి నుంచి దూరంగా ఉంచి అతని కొడుకైన రుద్ర ప్రతాప్‌దేవ్‌ని 1891లో రాజుగా బ్రిటీష్ సర్కార్ గుర్తించింది. అయితే మేజర్ అయ్యేంత వరకు ఆయనకు పట్టాభిషేకం చేసే అవకాశం లేదు. అలా రాజుతోపాటు రాజకుటుంబంలో ప్రధాన పదవుల్లో ఉన్నవారు తమ అ«ధికారాలు కోల్పోయారు. ఇలా బ్రిటీషర్ల ఆధిపత్య ధోరణి కారణంగా ఇటు రాజవంశానికే కాక అటు ఆదివాసీలకు ఇక్కట్లు మొదలయ్యాయి. తిరుగుబాటుకు పిలుపు1909 అక్టోబర్‌లో జరిగిన దసరా వేడుకల్లో రిజర్వ్ ఫారెస్ట్ చట్టం, దాన్ని అమలు చేస్తున్న బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ బస్తర్ రాజ్య మాజీ దివాన్ లాల్ కాళీంద్రసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానికంగా పేరున్న ఆదివాసీ నేత గుండాధుర్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఫారెస్ట్ చట్టం కారణంగా తాము పడుతున్న బాధలను ఊరూరా ప్రచారం చేస్తూ తిరుగుబాటుకు ప్రజలను సిద్ధం చేశారు. ప్రతీ ఇంటి నుంచి ఒకరు పోరాటానికి రావాలని, ఆయుధాలు పట్టలేనివారు రాళ్లు, కర్రలు, కారం పొడి అయినా అందించాలని స్ఫూర్తి నింపారు. 1909 అక్టోబర్ నుంచి 1910 ఫిబ్రవరి మొదటివారం నాటికి బస్తర్‌లో అటవీ గ్రామాలన్నీ పోరాటానికి సంసిద్ధమయ్యాయి. ముఖ్యంగా బస్తర్‌లో ఉత్తర ప్రాంతమైన కాంకేర్ నిప్పు కణికలా మారింది.మూడు రోజుల్లోనే....1910 ఫిబ్రవరి 4న కుకనార్‌లో గుండాధూర్ నాయకత్వంలో ఆదివాసీలు బ్రిటీష్ అధికార కార్యాలయాలు, గోదాములు, మార్కెట్, ప్రభుత్వ అధికారుల ఇళ్లపై మెరుపుదాడులు జరిపారు. కేవలం మూడురోజుల్లోనే బస్తర్‌లోని 84 పరగణాల్లో 46 పరగణాలు తిరుగుబాటుదారుల అధీనంలోకి వచ్చాయి. కాంకేర్ ప్రాంతంలో బ్రిటీష్ అధికారులు, వ్యాపారులు ఇళ్లు వదిలి పారిపోయారు. దండకారణ్యంలో భూకంపం లాంటి తిరుగుబాటు వచ్చిందని తక్షణ సాయం అవసరమంటూ బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పటి మహారాజు రుద్ర ప్రతాప్‌దేవ్ టెలిగ్రామ్ పంపారు. దీంతో ఈ పోరాటానికి భూంకాల్ పోరాటమని పేరు వచ్చింది. గుండాధూర్ చిక్కలేదుభూంకాల్ విప్లవాన్ని అణచివేసే పనిని కెప్టెన్ గేర్‌కు బ్రిటీష్ సర్కార్ అప్పగించింది. పదిరోజులు బ్రిటీష్, బస్తర్ స్టేట్ సైన్యాలు అడవుల్లో గాలించినా విప్లవకారుల్లో కేవలం 15 మందినే పట్టుకోగలిగారు. మరోవైపు తనను పట్టుకునేందుకు వచ్చిన కెప్టెన్ గేర్‌పైనే నేరుగా దాడి చేసి బ్రిటీషర్ల వెన్నులో గుండాధూర్ వణుకు పుట్టించాడు. తృటిలో కెప్టెన్ గేర్ ఆ దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడు కున్నాడు. దీంతో బెంగాల్, జైపూర్ రాజ్యాల నుంచి అదనపు బలగాలను బస్తర్‌కు రప్పించారు. ఆ తర్వాత గుంఢాదూర్‌కు నమ్మకస్తుడైన సోనుమాంఝీ ద్వారా కోవర్టు ఆపరేషన్ జరిపి 1910 మార్చి 25 రాత్రి గుంఢాధూర్ ఆయన సహచరులు బస చేసిన అటవీ ప్రాంతంపై బ్రిటీష్ సైన్యం దాడి జరిపింది. ఇందులో 21 మంది చనిపోగా మరో ఏడుగురు పట్టుబడ్డారు. కెప్టెన్ గేర్ ఎంతగా ప్రయత్నించినా ఆదివాసీ పోరాట యోధుడు గుండాధూర్ మాత్రం చిక్కలేదు. మెరుపు తిరుగుబాటుతో బ్రిటీషర్లకు చుక్కలు చూపించిన బస్తర్ ఆదివాసీలు ఆ తర్వాత తమ హక్కుల కోసం స్వతంత్ర భారత దేశంలో ఏర్పడిన ప్రభుత్వంతోనూ ఘర్షణ పడ్డారు. ఈ పోరులో తాము దైవంగా భావించే మహారాజునే కోల్పోయారు. -
కొమ్మకొమ్మకో సన్నాయి!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పోలంకి పిట్ట, పిగిలిపిట్ట, తేనె పిట్ట, నల్ల కొంగ, ఎర్ర గుడ్లగూబ, పెద్ద చిలుక, పసుపు పావురం.. ఈ పక్షులను ఎప్పుడూ చూడలేదు కదూ! చూడటం కాదు, కనీసం పేర్లు కూడా విననివారూ ఎక్కువే. వివిధ కారణాలతో పక్షుల సంఖ్య తగ్గిపోవడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్టులు, చెరువుల వద్ద ఏకంగా 446 రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. మన దేశంలో ప్రస్తుతమున్న 1,300 పక్షి జాతుల్లో మూడో వంతుకుపైగా తెలంగాణలో స్థిరనివాసం ఉండటంగానీ, వలస వచ్చిపోవడం గానీ జరుగుతోందని ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ తాజా నివేదిక వెల్లడించింది. నల్లమల, అనంతగిరి, గుబ్బల మంగమ్మ (అశ్వారావుపేట), పోచారం, కవ్వాల్, ఏటూరునాగారం, నర్సాపూర్ అటవీ ప్రాంతాల్లో చాలా జాతుల పక్షులు ఆవాసాలు ఏర్పర్చుకున్నట్టు తెలిపింది. కొత్త పక్షులకూ ఆవాసం.. మన రాష్ట్రంలో పలుచోట్ల కొత్తగా తలపై పింఛంతో ఠీవిగా కనిపించే బ్లాక్ బాజా (నల్లడేగ), మూరెడు తోక కలిగిన బ్లిత్స్ పారడైజ్ ఫ్లైక్యాచర్ (తోట పిగిలిపిట్ట)లను గుర్తించారు. వీటికితోడు అనంతగిరిలో బ్లూఅండ్ వైట్ ఫ్లైక్యాచర్ (నీలి– తెల్ల పిగిలిపిట్టలు), అశ్వారావుపేట గుబ్బలమంగమ్మ ఫారెస్ట్‌లో రూఫస్ వుడ్‌పెకర్ (ఒక రకం వడ్రంగి పిట్ట), కవ్వాల్‌లో మార్స్ హారియర్, ఇండియా కోర్సర్, బ్లాక్ బెల్లిట్, లాఫింగ్ డవ్, హార్ట్ స్పాటెడ్ వడ్రంగి పిట్ట తదితర వలస పక్షులను కొత్తగా గుర్తించారు. కొన్నేళ్లుగా మంచి వర్షాలు, వేసవిలో దాహార్తిని తీర్చేందుకు రిజర్వు ఫారెస్టుల్లో ఏర్పాట్లు చేయటంతో.. పక్షుల సంతతి, రాక పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు. నగరాలు, చెరువుల వద్ద.. ఆందోళనకరం జీవావరణ సమతుల్యతలో కీలకపాత్ర పోషించే పక్షుల మనుగడ పెద్దగా మనుషుల అలికిడి లేని అటవీ ప్రాంతాల్లో భేషుగ్గా ఉండగా.. నగరాలు, చెరువుల వద్ద ఆందోళనకరంగా ఉందని తేలింది. రిజర్వ్ ఫారెస్ట్‌లలో స్థానికంగా ఉన్నవాటికి తోడు కొత్త రకాల పక్షులు వచ్చి చేరుతున్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని నిపుణులు చెప్తున్నారు. పక్షుల మనుగడకు తోడ్పడే పండ్లు, పూలచెట్ల స్థానంలో ఎలాంటి ప్రయోజనంలేని మొక్కల పెంపకం, భారీ నిర్మాణాలతో చెట్లు తగ్గిపోవడం, సెల్ టవర్లు, కర్బన ఇంధనాల కాలుష్యం వంటి కారణాలతో పావురాలు తప్ప మిగతా పక్షులేవీ పెద్దగా మనగలిగే పరిస్థితి లేదని ‘హైదరాబాద్ బర్డ్ పాల్స్’ సంస్థ ప్రతినిధి గోపాలకృష్ణ అయ్యర్ తెలిపారు. ఇక కొన్నేళ్లుగా చెరువుల సరిహద్దులు, కట్టల నిర్మాణాలు, వాటిపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, ప్రకాశవంతమైన విద్యుత్ లైట్లు అమర్చడం వంటివాటితో.. వలస పక్షులతోపాటు ఇక్కడి నీటి పక్షులు గుడ్లు పెట్టి, సంతానోత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని అయ్యర్ వివరించారు. మనుషుల అలికిడి పెరగడం, వేట (పురుగులు, చిన్నచేపలు) దొరకడం కష్టమవడంతో ఆయా పక్షుల మనుగడకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ కారణాలతో.. అక్టోబర్ నుంచి మార్చి వరకు యూరప్, సైబీరియా, ఆ్రస్టేలియాల నుండి వలసవచ్చే పక్షుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. చెరువుల పునర్నీర్మాణంలో పక్షుల మనుగడ అంశాన్ని మర్చిపోయి డిజైన్ చేయడమూ ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. ♦ కోకిల కిలకిలారావాలు, చిలుకల పలుకులు, పిచ్చుకల కిచకిచలతోపాటు ఏకంగా 304 రకాల పక్షుల సందడితో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రత్యేక జీవావరణ కేంద్రంగా మారింది. ఇక్కడ నల్లగద్ద, పోలంకి పిట్ట, తేనెపిట్ట, నల్లకొంగ, తోక పిగిలిపిట్ట, పెద్ద చిలుక, ఎర్ర గుడ్లగూబ తదితర పక్షులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. ♦వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రతి మొక్క ఆయుర్వేద గుణాలున్నదేనన్న పేరు పొందింది. ఈ అడవుల్లో 250 రకాల పక్షులు ఉన్నాయి. బండీడ్ బే కుకూ, బ్లూ బెయిర్డెడ్బీ ఈటర్, చెస్ట్నట్ టెయిల్డ్ స్టార్లింగ్, పొన్నంగి పిట్ట (ఇండియన్ పిట్ట) లతో పాటు చెవులపిల్లిని ఆహారంగా తీసుకునే కుందేటిసలవ గద్దలు వంటి పక్షు లు అనంతగిరి నుంచి ఉస్మా న్‌సాగర్ రిజర్వాయర్ వరకు సందడి చేస్తున్నాయి. డేంజర్ జోన్లో బుల్బుల్ పిట్ట.. ♦ చూసేందుకు ముద్దుగా, పలికితే వినసొంపుగా ఉండే బుల్బుల్ పిట్ట (ఎల్లో త్రోటెడ్ బర్డ్) అంతరించే స్థితికి చేరింది. దేశంలోపాటు మన రాష్ట్రంలోనూ వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటి నివాసం రాళ్లు, కొండ గుహలే. ♦ కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట, బెజ్జూరులలో రాబందు (వల్చర్) సంరక్షణ కేంద్రం ఏర్పాటు కూడా ప్రయోజనం ఇవ్వలేదు. ప్రాణహిత తీరంలో రాబందుల పర్యవేక్షణ కోసం బయాలజిస్ట్, వాచర్‌ను నియమించి రోజూ ఒక ఆవును ఆహారంగా వదిలినా ఫలితం లేకపోవటంతో ఆ ప్రయత్నాలు ఇటీవలే ఉపసంహరించారు. ♦ జనగాం జిల్లా చిన్నమడూరు, పెద్ద మడూరు గ్రామాలకు ఏటా వచ్చే విదేశీ పక్షులకు అక్కడి కోతుల గుంపులు ప్రతిబంధకంగా మారాయి. ఈ ఏడాది వలస పక్షుల సంఖ్య భారీగా తగ్గింది. అడవుల్లో పక్షుల జోరు పెరిగింది తెలంగాణ అటవీ ప్రాంతంలో అన్నిరకాల స్థానిక పక్షు ల సంతతితోపాటు కొత్త పక్షుల వలస పెరిగింది. దేశీజాతి పక్షులు ఈ ప్రాంతానికి హిమాలయాలు మొదలుకుని ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి. అయితే అటవీ ప్రాంతాల్లో జన సందడిని మరింత తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవ సరం ఉంది. – మదన్‌రెడ్డి, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలి చాలా చోట్ల చెరువులకు మరమ్మతులు చేస్తూ వాటికి ఒడ్డు లేకుండా చేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే చెరువుల నిర్వహణ ప్రైవేటు చేతుల్లోకి తీసుకుని వాకింగ్ ట్రాక్‌లు, విద్యుత్ లైట్లు వేస్తున్నారు. చుట్టుపక్కల చెట్లు కూడా లేకుండా పోతున్నాయి. వీటి ప్రభావం పక్షులపై తీవ్రంగా పడింది. విదేశీ వలస పక్షుల రాక తగ్గిపోయేందుకు కారణమైంది. – హరికృష్ణ అడపా, హైదరాబాద్ బర్డ్ పాల్స్ సంస్థ ప్రతినిధి -
పులులు పెరిగాయ్... బతికే చోటేదీ?
దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. కానీ ప్రతి మూడు పులుల్లో ఒకటి రిజర్వ్ ఫారెస్టుకు వెలుపల ఉండాల్సి వస్తోంది. ఇది మానవ–జంతు ఘర్షణలకు దారి తీస్తోంది. రక్షిత ప్రాంతాల వెలుపల పులులు మాత్రమే కాక, అనేక జీవజాతులు కూడా మనుగడ కోసం పోరాడుతున్నాయి. 80–100 పులుల జనాభాను పోషించడానికి పెద్దపులులకు 800 నుంచి 1,200 చదరపు మీటర్ల మేర ఇతరులు చొరబడలేని స్థలం అవసరం. కానీ, మనలాంటి చిక్కటి జనసాంద్రత కలిగిన దేశంలో... అలాంటి సహజమైన అరణ్యాలను ఆశించడం ఆశావహమైన కోరిక మాత్రమే. వన్యప్రాణులు సంచరించే స్థలాలు తగ్గిపోతున్నట్లు పలు శాస్త్రీయ నివేదికలు చెబుతున్నప్పటికీ మనం ఇప్పటికీ పులుల సంఖ్య పెరుగుదలను మాత్రమే పట్టించుకుంటున్నాము. ఈ సంవత్సరం వార్తాయోగ్యమైన రెండు ఘటనలు జరిగాయి. ఒకటి – ప్రపంచంలోనే అత్యధిక జనాభా విషయంలో భారతదేశం చైనాను దాటేసింది. కేవలం 2 శాతం భూప్రాంతం కలిగిన దేశం 145 కోట్ల ప్రజలు లేదా విశ్వ మానవ జనాభాలో 18 శాతం మందికి ఆవాస ప్రాంతంగాఉంటోందని ఊహించండి. జనసాంద్రత రీత్యా, భారతదేశం... చైనా కంటే మూడు రెట్ల రద్దీతో ఉంటోంది. రెండు – భారతదేశంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణి రక్షణ పరిశ్రమ అయిన ప్రాజెక్ట్ టైగర్ ఏర్పడి ఈ ఏప్రిల్ నాటికి 50 ఏళ్లు దాటుతుంది. పెరుగుతున్న పులుల సంఖ్య విషయంలో రికార్డు అంచనాలు ఉన్నాయి. 2022 నాటి పెద్దపులుల జనాభా లెక్కలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో పులుల సంఖ్య 3 వేలను దాటి ఉంటుందని ఒక అంచనా. దేశంలో ప్రాజెక్టు టైగర్ 1973 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. 2014 నాటికి దేశంలో 2,226 పులులు ఉండగా, 2018లో వీటి సంఖ్య 2,967కి పెరిగిందని జాతీయ పులుల పరిరక్షణ అథారిటీ (ఎట్టీసీఏ) నివేదించింది. దేశంలో పులుల సంఖ్యలో అమాంతం 33 శాతం పెరుగుదల నమోదు కావడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. 2006లో పులుల జనాభా లెక్కల ప్రక్రియను శాస్త్రీయమైన బిగువుతో, కెమెరా ట్రాప్ టెక్నాలజీతో సరిదిద్దినప్పటి నుంచి నాలుగేళ్లకోసారి జరిపే పులుల జనాభా లెక్కల్లో సంఖ్యలు పెరుగుతూ వచ్చాయి. 2006లో దేశంలో 1411 పులులు ఉండేవనీ, 2010 నాటికి వాటి సంఖ్య 1706కు పెరిగిందనీ ఎన్టీసీఏ అంచనా వేసింది. విజయవంత మైన పులుల పరిరక్షణ ఏర్పాట్లకు ఈ సంఖ్యలు సాక్ష్యంగా నిలుస్తు న్నప్పటికీ దీనిలో నాణేనికి మరో వైపు కూడా ఉంది. పులులు ఒంటరి జీవులు. వీటికి నిర్దిష్టంగా స్థలం అవసరం. పెద్దపులులు వాటితోపాటు సాధారణంగా వన్యప్రాణులు కూడా మానవులు గీసిన హద్దులు కానీ, మ్యాప్‌లను (జాతీయ పార్కులను, వన్యప్రాణి కేంద్రాలను లేదా టైగర్ రిజర్వ్‌లను) కానీ అర్థం చేసుకోవు. గత నెల అస్సాంలో, ఒక పులి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం వెంబడి 120 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన వార్త పతాక శీర్షికలకు ఎక్కింది. ఒరాంగ్ నేషనల్ పార్కు నుంచి గౌహతిలోని ఉమానంద ద్వీపం వరకు అది నడిచివచ్చింది. 79 చదరపు కిలోమీటర్ల పరిధిలోని చిన్న కీలకమైన ప్రాంతంలో ఉండే ఒరాంగ్, తనలో పెరుగుతున్న పులుల జనాభాకు తగినట్టు ఆశ్రయం ఇవ్వలేక కొట్టుమిట్టాడుతోంది. మానవుల ఆవాసానికి లోపలా, వెలుపలా పులులు తిరగడం రోజువారీ వ్యవహారం అయింది. బిహార్ పశ్చిమ చంపారణ్ ప్రాంతంలోని వాల్మీకి టైగర్ రిజర్వ్ వంటి అతి పెద్ద రక్షిత ప్రాంతాలు కూడా ఇదే విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దశాబ్దం క్రితం వాల్మీకి టైగర్ రిజర్వ్... పెద్ద పులుల సంరక్షణ మ్యాప్‌లో స్థానం కోల్పోయింది. కానీ బిహార్ అటవీ శాఖ, ఇతర లాభరహిత పరిరక్షణ సంస్థల ప్రయత్నాల కారణంగా ఇప్పుడది భారతదేశంలోనే అత్యుత్తమంగా పనిచేసే టైగర్ రిజర్వులలో ఒకటిగా నిలిచింది. 2021లో కన్జర్వేషన్ అస్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ (సీఏటీఎస్) గుర్తింపు పొందిన దేశంలోని 14 టైగర్ రిజ ర్వులలో ఒకటయ్యింది. పులుల పరిరక్షణలో ఉత్తమ ఆచరణలు, ప్రమాణాలకు సంబంధించి ఇది ఒక అంతర్జాతీయ గుర్తింపు. అయితే ఈ విజయం అటు అటవీ శాఖకూ, ఇటు స్థానిక కమ్యూ నిటీకీ కొత్త తలనొప్పికి కారణమైంది. గత అక్టోబర్‌లో తొమ్మిది మంది ప్రజల హత్యకు కారణమైన మూడేళ్ల మగపులిపై కనిపిస్తే కాల్చివేత ఆదేశం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత దాన్ని కాల్చి చంపారు. జనవరి 10న ఈ ప్రాంతం నుంచే ఒక మైనర్ బాలికపై మరో పులి దాడి చేసిన ఘటన వార్తలకెక్కింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కొన్ని దురదృష్టకర ఘటనలు జరగడంతో ప్రజలు పులులకు వ్యతిరేకంగా మారుతున్నారు. మన జాతీయ జంతువును కాపాడే మంచి పరిరక్షణ కృషికి వీరు వ్యతిరేకమవు తున్నారు. పెరుగుతున్న పులుల సంఖ్య పులుల పరిరక్షణ విజయానికి తిరుగులేని నిదర్శనం కాగా, అదే సమయంలో దానికి వ్యతిరేక పరి స్థితి కూడా రంగం మీదికొచ్చింది. ఎన్టీసీఏ అంచనా ప్రకారం చూసినప్పటికీ దేశంలోని ప్రతి మూడు పులుల్లో ఒకటి రక్షిత అభయా రణ్య ప్రాంతాల వెలుపల నివసిస్తున్నాయి. ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం ఉన్న భారత్ అతిపెద్ద టైగర్ జనాభా కేంద్రంగా వెలుగుతోంది. 1973లో దేశంలో 9 టైగర్ రిజర్వులుఉండగా 2022 నాటికి ఈ సంఖ్య 53కు పెరిగింది. ఈ వెయ్యికిపైగా పులులను తరచుగా భారతదేశ నిరుపేద, నిరాశ్రయ పులులుగా పేర్కొంటూ ఉంటారు. ఇప్పుడు దేశంలోని 53 టైగర్ రిజర్వులు 75 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండవచ్చు. కానీ వీటిలో ఎక్కువ భాగం మనుషులు నివసించే ప్రాంతాలే. ఇవి చిన్నవిగానూ, లేదా ముక్కచెక్కలైపోయిన అటవీ భాగాలుగా ఉంటూ వస్తున్నాయి. టైగర్ రిజర్వులు పులులకు, వన్యప్రాణులకు మాత్రమే సంబంధించినవని అందరూ ఊహిస్తుంటారు కానీ వాటిలో అనేక గ్రామీణ ఆవాసాలు ఉంటున్నాయి. వేలాది ప్రజలు, పశువులు ఉండటంతోపాటు రోడ్లు, రైలు పట్టాలు కూడా వీటిగుండా పోతుంటాయి. దీనికి పశ్చిమబెంగాల్ లోని బక్సా టైగర్ రిజర్వ్ ఒక మంచి నిదర్శనం అని చెప్పాలి. కేంద్ర ప్రాంతంలో కనీసం 80–100 పులుల జనాభాను పోషించడానికి పెద్దపులులకు 800 నుంచి 1,200 చదరపు మీటర్ల మేరకు ఇతరులు చొరబడకూడని స్థలం అవసరమవుతుందని రీసెర్చ్ డేటా సూచిస్తోంది. కానీ మనలాంటి చిక్కటి జనసాంద్రత కలిగిన దేశంలో, సహజమైన అరణ్యాలు కోరుకోవడం ఆశావహమైన కోరిక మాత్రమే. దానికి తోడుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రక్షిత ప్రాంతాలను అనుసంధానిస్తున్న అటవీ కారిడార్లు... మనుషులు, వన్యప్రాణుల మధ్య ఇరుకైన స్థలాన్ని మాత్రమే మిగుల్చుతున్నాయి. భారతదేశ స్థానిక ప్రజలు, వెనుకబడిన కమ్యూనిటీలు సాంస్కృతికంగా, సామా జికంగా, ఆర్థికంగా ఈ రిజర్వు ప్రాంతాల్లో నివసించాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ లోపల, వెలుపల నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు అదనంగా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వస్తున్న అటవీ ఏనుగులతో కూడా వ్యవహరించాలి. ఉమరియా జిల్లా (బాంధవ్‌గఢ్) ప్రజలకు తరతరా లుగా ఏనుగులతో తలపడిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు మాత్రం మానవులు–పులులు, మానవులు–ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితులు రావడం వన్యప్రాణుల పరిరక్షణలో కీలకమైన సవాలుకు దారితీస్తోంది. పెరుగుతున్న పులుల సంఖ్యలు మాత్రమే విజయానికి కొల బద్దగా ఉంటున్న సమాజంలో పులుల సంఖ్య క్షీణించడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు. ప్రకృతి మనకు విధిస్తున్న పరిమితులను గుర్తించి మసులుకోవడం మనకు సాధ్యం కావడం లేదు. వన్య ప్రాణులు సంచరించే స్థలాలు తగ్గిపోతున్నట్లు పలు శాస్త్రీయ నివేది కలు చెబుతున్నప్పటికీ మనం పులుల సంఖ్య పెరుగుదలను మాత్రమే పట్టించుకుంటున్నాం. పులులు, సింహాలు, ఏనుగులు లేదా ఖడ్గమృగాల వంటి జీవుల సంఖ్య పట్ల మన ఆసక్తి పెరుగుతోంది. దేశంలో మరిన్ని ప్రాంతాలు శీఘ్రంగా నగరీకరణకు గురవుతుండడంతో... మన నగరాల అంచుల్లో, తగ్గిపోతున్న అడవుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో లేదా ఎస్టేట్లలో పులులు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఒక్క పులులే కాదు... ఈ మారుతున్న ప్రపంచంలో తమ ఉనికి కోసం అనేక జీవజాతుల పరిస్థితీ అదే! ఆనంద బెనర్జీ వ్యాసకర్త రచయిత, ఆర్టిస్ట్, వన్యప్రాణి పరిరక్షణవాది (‘ది హిందుస్తాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Photo Feature: ఏయ్ బిడ్డ.. ఇది మా అడ్డా..
కుమురంభీం జిల్లా పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని అడవులను పెద్ద పులులు అడ్డాగా మార్చుకున్నాయి. పొరుగున మహారాష్ట్రలో ఉన్న తడోబా, తిప్పేశ్వర అభయరణ్యాల నుంచి వస్తున్న పులులు.. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోనిపెంచికల్పేట్ రేంజ్ పరిధిలో నిత్యం సంచరిస్తున్నాయి. గత సంవత్సరం కే8 అనే ఆడపులి పెంచికల్పేట్ రేంజ్‌ను ఆవాసంగా మార్చుకుని మూడు పిల్లలకు జన్మనిచ్చింది. స్థానిక పెద్దవాగు పరీవాహక ప్రాంతంలోని సాసర్‌పిట్‌లో తన బిడ్డతో సేదతీరుతూ.. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇలా చిక్కింది. –పెంచికల్పేట్ -
చీకటి పడితే.. జంగిల్ జిగేల్
దట్టమైన అడవి.. అర్ధరాత్రి పూట.. ఎలా ఉంటుంది? కన్ను పొడుచుకున్నాకానరానంతగా చిమ్మచీకటి కమ్ముకుని ఉంటుంది. కానీ ఈ అడవి మాత్రం వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. రకరకాల చెట్లు, భూమిపై పెరిగే పుట్టగొడుగులు.. అన్నీ ఆకుపచ్చ రంగు కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. ఆ పరిసరాలన్నీ కనిపిస్తుంటాయి. ఇలాంటి అడవి మరెక్కడో కాదు.. మన దేశంలోనే మహారాష్ట్రలో ఉన్న భీమశంకర్ రిజర్వు ఫారెస్టు. ఆ మెరుపులేమిటో, ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. పశ్చిమ కనుమల్లో.. పశ్చిమ కనుమల్లో భాగమైన దట్టమైన అరణ్యం, ఎన్నో రకాల వన్యప్రాణులకు నిలయం భీమశంకర్ రిజర్వు ఫారెస్టు. పుణే నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఈ అడవిలోని పలు ప్రాంతాల్లో రాత్రి అయిందంటే చాలు.. చెట్లు, మొక్కలు, పొదలు, విరిగిపడిపోయిన కొమ్మలు ఆకుపచ్చ రంగు కాంతిని వెదజల్లుతూ, మెరుస్తూ ఉంటాయి. కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా కాంతిని వెదజల్లగలిగే (బయో ల్యూమినిసెంట్) ఫంగస్ వ్యాపించి ఉండటమే దీనికి కారణం. ‘ఫెయిరీ ఫైర్’ పేరుతో.. భీమశంకర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కనిపించే ఈ ఆకుపచ్చని వెలుగును ‘ఫెయిరీ ఫైర్’,‘ఫాక్స్ ఫైర్’ వంటి పేర్లతోనూ పిలుస్తుంటారు. ఇక్కడ ఉండే ఒక రకమైన ఫంగస్ విడుదల చేసే లూసిఫరేస్ అనే ఎంజైమ్ చెట్ల కాండాలపై ఉండే నీటిని తాకినప్పుడు రసాయనిక చర్యలు జరిగి కాంతి వెలువడుతుంది. ఇలా కాంతిని వెదజల్లగలిగే ఫంగస్‌లు చాలా అరుదు. ఎంతగా అంటే.. సుమారు లక్ష రకాలకు పైగా ఫంగస్‌లు ఉండగా, అందులో కేవలం 70 మాత్రమే ఇలా కాంతిని వెదజల్లగలవు. ప్రపంచవ్యాప్తంగా ఇతర ఉష్ణమండల అరణ్యాల్లో కూడా ఇలా కాంతిని వెదజల్లే ప్రాంతాలు ఉన్నాయి. ►భీమశంకర్ అడవితోపాటు పశ్చిమ కనుమల వెంట ఉన్న అడవి అంతటా కూడా వెలుగులు విరజిమ్మే ‘మైసెనా క్లోరోఫోస్’ అనే పుట్టగొడుగులు పెరుగుతాయి. ►అయితే వానాకాలంలో,ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఈ బయో ల్యూమినిసెంట్ ఫంగస్ యాక్టివ్‌గా ఉండి అడవి వెలుగులు విరజిమ్ముతుందని.. సాధారణ సమయాల్లో కనిపించడం చాలా తక్కువ అని స్థానికులు చెబుతున్నారు. పలు రకాల జీవుల్లో కూడా.. భూమిపై పలురకాల జీవులకు కూడా బయో ల్యూమినిసెంట్ సామర్థ్యం ఉంది. అందులో మిణుగురు పురుగులు మనకు తెలిసినవే. ఇక సముద్రాల్లో ఆల్గే, జెల్లీ ఫిష్‌లు, కొన్ని రకాల చేపలు, సముద్ర జీవులకు ఇలా కాంతిని వెదజల్లగలిగే సామర్థ్యం ఉంటుంది. ముఖ్యంగా సముద్రాల్లో లోతైన ప్రాంతాల్లో బతికే జీవులు.. అక్కడి పూర్తి చీకటి పరిస్థితుల కారణంగా ఇలాంటి సామర్థ్యాన్ని సంతరించుకుని ఉంటాయి. కాంతి కోసం.. దారి తప్పకుండా.. ►పూర్వకాలంలో స్కాండినేవియాతో పాటు పలు ఇతర ప్రాంతాల్లోని ఆదివాసీలు ఇలా వెలుగులు విరజిమ్మే చెట్ల కాండాలను తమ దారి వెంట పెట్టుకునేవారని.. అడవుల్లో లోపలికి వెళ్లినప్పుడు దారి తప్పకుండా వినియోగించుకునేవారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ►18వ శతాబ్దంలో అమెరికా శాస్త్రవేత్త తాను రూపొందించిన జలాంతర్గామిలో కాంతి కోసం ఇలాంటి ఫంగస్ ఉన్న కలపను ఉపయోగించేందుకు ప్రయత్నించారట. -
Horsley Hills: అదిరేటి అందం.. ఆంధ్ర ఊటీ సొంతం
సాక్షి, బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ వేసవి విడిది కేంద్రంగా ఎలా మారింది, దీని వెనుక చరిత్ర ఏమి అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరచే ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులవుతారు. చిరుజల్లులు కురిస్తే ఆ ప్రకృతి అందానికి మైమరచే ప్రకృతి ప్రేమికులెందరో. అలాంటి అందమైన హార్సిలీహిల్స్‌ను 153 ఏళ్ల క్రితమే బ్రిటీష్ ప్రభుత్వం వేసవి విడిది కేంద్రంగా ప్రకటించి ఉత్తర్వులు జారీచేసింది. ఆ తర్వాత బ్రిటిష్ కలెక్టర్ హార్సిలీ కొండపై చేపట్టిన పనులు, దాని చరిత్ర ఆనవాళ్లు ఇప్పటికి కళ్లముందు కనిపిస్తున్నాయి. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్‌పై దీన్ని కనుగొన్న డబ్ల్యూడీ హార్సిలీ చెరగని ముద్రవేశారు. డబ్ల్యూడీ హార్సిలీ తొలుత మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై కడప కలెక్టర్ అయ్యాక గుర్రంపై కొండకు రాకపోకలు సాగించారు. మద్రాసు ప్రభుత్వ అనుమతితో వేసవి విడది కేంద్రంగా మార్చారు. తొలి అతిథి గృహ నిర్మాణం కోసం అనుమతి పొంది వాటికి కావాల్సిన పెంకులను ఓడ ద్వారా ఇంగ్లాండు నుంచి దిగుమతి చేసుకొని కొండకు తరలించుకొన్నారు. ఒకప్పటి దట్టమైన అడవితో నిండిన హార్సిలీహిల్స్‌పై భూమి అంతా అటవీశాఖదే. వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు దక్కిన 90 ఏళ్ల తర్వాత అంటే 1959లో అటవీశాఖ 103 ఎకరాలను రెవెన్యూశాఖకు బదలాయించింది. లేదంటే ఈ రోజుకు హార్సిలీహిల్స్ మొత్తం నిషేధిత రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలో ఉండేది. అతిథి గృహానికి ఇంగ్లాండ్ పెంకులు వేసవి విడిది కేంద్రంగా హార్సిలీహిల్స్‌కు బ్రిటీష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇక్కడ విడిది చేసేందుకు అతిథిగృహం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ హార్సిలీ మద్రాసు ప్రభుత్వానికి లేఖ రాయగా రిజర్వ్ ఫారెస్ట్‌లో బంగ్లా నిర్మించుకునేందుకు 1869 జూన్9న జీఓఎంఎస్ నంబర్ 4162ను జారీచేసింది. దీంతో 1869లోనే తొలి అతిథి గృహ నిర్మాణం మొదలైంది. హార్సిలీ ఇంగ్లాండ్ నుంచి ఓడలో పెంకులను మద్రాసుకు తెప్పించి, అక్కడినుంచి కొండకు రవాణా చేయించుకున్నారు. అటవీశాఖ అతిథిగృహాల్లో ఒకటైన ఇప్పుడు కళ్యాణి అతిథిగృహంగా పిలుచుకునే గది పైకప్పుకు ఈ పెంకులు వాడారు. ఇంగ్లాండ్‌లో 1865లో బేస్డ్ మిషన్ టైల్ వర్క్స్ అనే కంపెనీ పెంకులను తయారు చేసినట్టు పెంకులపై అక్షరాలు, కంపెనీ వివరాలు కనిపిస్తున్నాయి. తర్వాత కొన్నేళ్లకు ఘాట్‌రోడ్డు నిర్మాణం చేసింది కూడా బ్రిటిష్ ప్రభుత్వంలోనే. 4,141 అడుగుల ఎత్తులో బావి హార్సిలీహిల్స్‌ను వేసవి విడిది కేంద్రంగా మార్చుకోవడం, అతిథిగృహం నిర్మించుకొన్న కలెక్టర్ హార్సిలీకి నీటికోసం ప్రస్తుత అటవీ ప్రాంగణంలో బావిని తవ్వించగా పుష్కలంగా నీళ్లు లభ్యమయ్యాయి. బావి చుట్టూ ఇటుకల్లా బండరాళ్లను ఒకదానిపై ఒకటిగా పేర్చి నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం అప్పట్లో అద్భుతంగా చెప్పబడుతోంది. బావి నిర్మాణంలో నేటికి ఒక్క రాయి కూడా చెక్కుచెదరలేదు. నీళ్లు నిండుగా ఉంటాయి. కరువు పరిస్థితుల్లో బావి ఎండినా సాధారణ రోజుల్లో నీళ్లుంటాయి. 1869 నుంచి వేసవి విడిది కేంద్రం హార్సిలీహిల్స్‌ను అధికారిక విడిది కేంద్రంగా చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వానికి అనుమతి కోరుతూ కడప కలెక్టర్ హార్సిలీ లేఖ పంపారు. ఈ లేఖపై బ్రిటీష్ మద్రాసు ప్రభుత్వం హార్సిలీహిల్స్‌ను వేసవి విడిది కేంద్రంగా ప్రకటిస్తూ 1869 మే4న జీఓఎంఎస్ నంబర్ 11579ను జారీచేసింది. అప్పటినుంచి 153 ఏళ్లుగా వేసవి విడది కేంద్రంగా హార్సిలీహిల్స్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. 60 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు కూడా అధికారికంగా ఇది వేసవి విడిది కేంద్రంగా గుర్తించారు. పలువురు గవర్నర్లు ఇక్కడ విడిది చేశారు. ఒకేరోజు జననం, మరణం హార్సిలీహిల్స్‌పై మక్కువ పెంచుకొన్న కలెక్టర్ హార్సిలీ నిండుగర్భిణి అయిన సతీమణీతో కొండపై విడిది చేశారు. 1864 మే 31న ప్రసవం జరిగి కుమారుడు జన్మించగా అదేరోజు చనిపోయాడు. ఈ పసిబిడ్డకు జార్జ్హార్సిలీ అని నామకరణం చేసి కొండపై (టూరిజం ముఖద్వారం వద్ద) ఖననం చేశారు. హార్సిలీకి ఇష్టమైన విడిదిచోటనే బిడ్డ పుట్టడం, ఆ ఆనందం అదేరోజు ఆవిరి కావడం బాధాకరం. 90 ఏళ్లకు డీ రిజర్వ్ ఫారెస్ట్ హార్సిలీహిల్స్‌పై రెవెన్యూ, ఇతర శాఖలకు అడుగుపెట్టేందుకు చోటులేదు. 1869లోనే వేసవి విడిది కేంద్రంగా ప్రకటించినప్పటికి అటవీశాఖకు తప్ప ఎవరికి ప్రవేశంలేని పరిస్థితి. బ్రిటీష్ పాలన అంతమైనా మార్పులేదు. వేసవి విడిది కేంద్రంగా మారిన 90 ఏళ్ల తర్వాత 1959 ఏప్రిల్ 15న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 101523/సీ1/58–5 మెమో జారీ చేసింది. ఈ మెమో ద్వారా కోటావూరు రెవెన్యూ గ్రామం పరిధిలోని హార్సిలీహిల్స్‌పై సర్వేనంబర్ 538లోని 103 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను డీ రిజర్వ్‌ఫారెస్ట్‌గా మార్పుచేసింది. ఈ 103 ఎకరాలను రెవెన్యూశాఖ 1959 జూలై 25న స్వాధీనం చేసుకొంది. -
AP: టూరిస్ట్ స్పాట్‌గా ఉబ్బలమడుగు.. వాటర్ ఫాల్స్ స్పెషల్ అట్రాక్షన్
వరదయ్యపాళెం: స్వచ్ఛమైన నీరు, గాలి, పచ్చటి అడవి.. పక్షుల కిలకిలారావాలు, కొండ కోనల్లోంచి నిరంతరం ప్రవహించే సెలయేరు... జలపాతం, చుట్టూ ఎతైన కొండలు... ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉబ్బలమడుగు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తోంది. అటవీశాఖ ఎకో టూరిజం అభివృద్ధి పనులతో ఉబ్బలమడుగు వేసవి విడిది ప్రదేశంగా కొత్త అందాలను దిద్దుకుంటోంది. వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల సరిహద్దుల్లో కాంబాకం రిజర్వు ఫారెస్టులో ఉబ్బలమడుగు వరదయ్యపాళెం నుంచి 10కిలోమీటర్లు దూరంలో ఉంది. ఒకరోజు విహారయాత్రకు ఇది చక్కటి ప్రదేశం. ఆహ్లాదం, విజ్ఞానం పర్యాటకులకు ఆహ్లాదం పంచడంతోపాటు విజ్ఞానం అందించే దిశగా అటవీశాఖ చెట్లు, వాటి శాస్త్రీయ నామం, పుట్టుక లాంటి విశేషాలను దారి పొడవునా పేర్లతో సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. రాజులు వాడిన ఫిరంగి, టన్ను బరువు ఉన్న తిరగలి, పూసలదిబ్బ, ఎలిజబిత్ రాణి బంగ్లా, పాలేగాళ్లు, వారి తోటలు.. ఇలా అన్నింటినీ పర్యాటకులు చూడదగినవే. చూడాల్సిన ప్రాంతాలు వరదయ్యపాళెం నుంచి 7కి.మీ ప్రయాణిస్తే అవంతి ఫ్యాక్టరీ వస్తుంది. ఈ ఫ్యాక్టరీని దాటితే రిజర్వు ఫారెస్టు మెుదలవుతుంది. ఫారెస్టు మెుదట్లో తెలుగుగంగ కాలువ, టోల్ గేట్ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి సుమారు 12 కి.మీలలో సెలయేరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. దీని పక్కన వరుసగా తంతి పందిరి, దొరమడుగు, సీతలమడుగు, తంగశాల, పెద్దక్కమడుగు, ఉబ్బలమడుగు, సిద్ధేశ్వరగుడి, సద్దికూటి మడుగు, అంజూరగంగ, దోగుడుబండ జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సీతాళం అని పిలుస్తారు. సిద్ధేశ్వరగుడి నుంచి 3 కిలోమీటర్లు కొండపై ప్రయాణించడం కష్టసాధ్యం కావడంతో పర్యాటకులు ఉబ్బలమడుగుకే పరిమితవుతారు. ఈ ప్రాంతాలను సందర్శించడానికి అటవీశాఖ నావువూత్రపు రుసుంతో సహాయకులను నియమించింది. తంతిపందిరి(తన్నీర్ పందల్) ఒకప్పుడు బ్రిటీష్ పాలకులు చేపల పెంపకం కోసం ఎంపిక చేసిన ప్రాంతమై ఈ తన్నీర్ పందల్ ఇప్పుడు తంతిపందిరిగా మారింది. వరదయ్యపాళెం నుంచి ఇక్కడి వరకు తారు రోడ్డు ఉంది. ఉబ్బలమడుగు వరకు వెళ్లలేనివారు ఇక్కడి మడుగులోనే సేదదీరుతుంటారు. ఉబ్బలమడుగు(ఉపరి మడుగు) తంతి పందిరి నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉబ్బలమడుగు ఉంది. వాహనాలలో వెళ్లేందుకు గ్రావెల్ మార్గం ఉంది. 1953 ప్రాంతంలో చిత్తూరుకు చెందిన శ్రీనివాసన్ బ్రిటీష్ మిలటరీలో కీలక స్థానంలో విధులు నిర్వహించి తన రిటైర్మెంట్ తర్వాత విశ్రాంత జీవనం కోసం ఈ ప్రాంతాన్ని అంగ్లపాలకుల నుంచి ఇనాంగా పొందారు. ఇక్కడే దొరమడుగు, మామిడి చెట్ల మడుగు, తంగశాలమడుగు, పూలమడుగు, చద్దికూటి మడుగులున్నాయి. శివరాత్రి రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. మిగిలిన సమయాల్లో ఆటోలు నడుస్తుంటాయి. సిద్ధులకోన పూర్వం మునులు ఈ ప్రాంతంలో ఉండటం మూలాన సిద్ధులకోన అనే పేరు వచ్చింది. ఇక్కడకు వెళ్లాలంటే ట్రాక్టరు వంటి వాహనాల్లోగానీ కాలినడకన 2కి.మీ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు పక్కనే ఉన్న సిద్ధుల మడుగులో స్నానమాచరించి సిద్ధేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దిగువ శీతాలం లోతైన మడుగులు, నిలువెత్తు జలపాతాలకు నెలవు ఈ దిగువశీతాలం. రెండు కొండ చరియల నడుమ ఉన్న ఈ ప్రాంతాల్లో ఎటుచూసినా తేనెతుట్టెలు కనిపిస్తుంటాయి. సిద్ధులకోన నుంచి కొండబండల నడుమ 2కి.మీ దూరం కాలినడకన దిగువశీతాలం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడున్న నీటి మడుగులు రెండు తాటిచెట్లకు పైగా లోతున్నా నీరు స్వచ్ఛంగా ఉండడంతో లోపల ఉన్న రాళ్లు సైతం కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తూంటాయి. నీటి మడుగులోకి దిగితే ఎంత వేసవిలోనైనా చలితో వణుకు తెప్పిస్తాయి. పర్యాటకులకు మరిన్ని వసతులు ఉబ్బలమడుగుకు వచ్చే సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే కొన్ని వసతులు కల్పించాం. జలపాతాల వద్ద బోటింగ్ పార్కులు, మరో వన్య పాయింట్, విశ్రాంత గదులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనికి సంబంధించి రూ. 2కోట్ల నిధులు అవసరముంది. నిధులు కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. –జి. జయప్రసాదరావు,ఎఫ్ఆర్ఓ, సత్యవేడు -
అర్బన్ పార్కులతో ఆహ్లాదం, ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్: నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేవిధంగా అర్బన్ పార్కు లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జున అన్నారు. దివంగతనటుడు, తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు పేరిట ఆయన హైదరాబాద్ శివార్లలోని చెంగిచర్ల అటవీ ప్రాంతంలో అర్బన్‌ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలసి నాగార్జున ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలోని 1,080 ఎకరాల భూమిని దత్తత తీసుకుంటు న్నట్టు ఆయన ప్రకటించారు. నాగార్జున వెంట భార్య అక్కినేని అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగ సుశీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అటవీపార్కు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంక ల్పించిన హరితనిధికి రూ.2 కోట్ల చెక్‌ను నాగార్జున అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. బిగ్‌బాస్ ఫైనల్లో ఇచ్చిన మాట ప్రకారం.. గత బిగ్‌బాస్ సీజన్ ఫైనల్ సందర్భంగా అడవి దత్తతపై ప్రకటించినట్లుగానే అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉం దని నాగార్జున అన్నారు. అడవిని దత్తత తీసుకునేం దుకు నాగార్జున ముందుకు రావడాన్ని ఎంపీ సం తోష్ ప్రశంసించారు. అర్బన్ పార్కు అభివృద్ధితో పాటు, అటవీ ప్రాంతంలో దశలవారీగా లక్ష మొక్క లను నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి నట్లు చెప్పారు. నాగార్జున, సంతోష్ వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేకకార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. చదవండి: (సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ) -
అడవిలోకి నడిచొచ్చిన ‘సంక్షేమం’
సాక్షి, తిరుపతి : అదంతా దట్టమైన అటవీ ప్రాంతం... అక్కడకు వెళ్లాలంటే రెండు కొండలు ఎక్కి దిగాలి. సుమారు 12 కి.మీ పైనే నడవాలి. జనావాసాలకు దూరంగా తరతరాలుగా కీకారణ్యంలో గడుపుతున్న నాలుగు ముస్లిం కుటుంబాలకు దాదాపు శతాబ్దం పాటు సర్కారు పథకాలు ఏవీ దరి చేరలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా వారు ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా ప్రతి నెలా పింఛన్ అందుకుంటున్నారు. రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తమకు ఇళ్లు కూడా ఇస్తుందని చెప్పినా ఎందుకనో ఆగిపోయిందని నిట్టూరుస్తున్నారు. ఇల్లు ఇస్తే తాము కూడా జనావాసాల్లోకి వస్తామని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం కల్లూరు రిజర్వు ఫారెస్టులో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం శ్రమించి అక్కడకు చేరుకుంది. నాలుగు తరాలుగా అక్కడే.. సుమారు వందేళ్ల క్రితం ముర్తుజాఖాన్ అనే వ్యక్తి చిట్లిగుట్టకు అటవీ ప్రాంతానికి చేరుకుని నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడే ఉంటూ వివాహం చేసుకున్నాడు. ఆయన కుమారుడు మల్కీఖాన్ కూడా అక్కడే నివసిస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఐదుగురు కుమారులు కూడా అడవితల్లి ఒడిలోనే పెరిగి పెద్దయ్యారు. ప్రస్తుతం వీరంతా పిల్లలతో కలసి అక్కడ ఉంటున్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో సయ్యద్‌ఖాన్ (16) పాముకాటుకు బలి కాగా మరో నలుగురు చిన్నారులు పాముకాటు, ఫిట్స్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఒకసారి అడవికి నిప్పు అంటుకున్న సమయంలో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. అడవి ఒడిలోనే చిన్నారులు.. చిట్లిగుట్టలో 18 మంది చిన్నారులుండగా వీరెవరూ పాఠశాల ముఖం చూసిన దాఖలాలు లేవు. బడికి పంపాలంటే సుమారు 12 కి.మీ. దూరం వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకపోవడంతో చిన్నారులు అడవికే పరిమితమయ్యారు. పంటలు, పండ్లతోటలు.. అక్కడ ఉంటున్న నాలుగు కుటుంబాలు రాళ్లు రప్పలు, చెట్లను తొలగించి సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో వరి, వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. మామిడి, కొబ్బరి చెట్లు పెంపకం ద్వారా పండ్లు, కాయలను సమీపంలోని కల్లూరులో విక్రయిస్తుంటారు. -
రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడో దశ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు శ్రీకారం చుట్టారు. దీంతో ‘పుడమి పచ్చగుండాలే–మన బతుకులు చల్లగుండాలే’అనే నినాదంతో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ మూడో దశ మొదలైంది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ‘సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ఉన్నత విలువలతో కూడుకున్నది. ఇందులో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిచ్చింది. సంతోష్ ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడతాను. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’అని చెప్పారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ను ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రభాస్ది మంచి మనసు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు. ‘గ్రీన్ చాలెంజ్’ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్ఫూర్తిదాయకం. ప్రభాస్ చేతులమీదుగా ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడో దశ కార్యక్రమం జరగడం సంతోషం. కోట్లాదిగా ఉన్న వారి అభిమానులంతా ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి నేలతల్లికి పచ్చని పందిరి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’అని అన్నారు. కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’సమన్వయకర్త సంజీవ్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
హద్దులు చెరిపి.. అటవీ ధ్వంసం
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి అండదండలతో చెలరేగు తున్న మైనింగ్ మాఫియా అటవీ భూముల్లోనూ చొరబడి కొండలను కొల్లగొడుతోంది. కంచికచర్ల మండలం పరిటాల రెవెన్యూ పరిధిలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో హద్దులు చెరిపేసి రాత్రిపగలు తేడా లేకుండా సాగిస్తున్న పేలుళ్లు, అక్రమ మైనింగ్‌తో వన్యప్రాణులు గజగజలాడుతున్నాయి. విలువైన వృక్ష సంపద నేలరాలుతోంది. మంత్రి అనుచరుల అక్రమ క్వారీయింగ్ కంచికచర్ల మండలం పరిటాల రెవెన్యూ పరిధి దొనబండ సర్వే నెంబర్ 801లోని 1,204 ఎకరాల్లో 94 క్వారీలకు స్థానిక టీడీపీ నేతలు అనుమతులు తెచ్చుకున్నారు. ఒక్కోచోట 5 నుంచి 10 హెక్టార్ల లోపు మాత్రమే క్వారీయింగ్‌కు అనుమతించారు. హెక్టార్‌కు రూ.50 వేల చొప్పున రాయల్టీ చెల్లిస్తున్నారు. అయితే క్వారీయింగ్‌కు అనుమతించిన ప్రాంతంలో మూడేళ్ల క్రితమే తవ్వకాలు పూర్తయ్యాయి. ఆ తరువాత వీరి కన్ను రెవెన్యూ భూములను ఆనుకుని వెనుకవైపు ఉన్న కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌పై పడింది. అప్పటికే క్వారీయింగ్ చేసిన ప్రాంతం అనుమతులు చూపిస్తూ కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయారు. అటవీ ప్రాంతంలో కొండలను నిత్యం రిగ్గు బ్లాస్టింగ్లతో పిండిచేస్తూ ఖనిజాలను కొల్లగొడుతున్నారు. అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రతినిధులు శుక్రవారం అక్కడకు చేరుకోవడంతో భారీ యంత్రాలను హడావుడిగా ఫారెస్ట్ నుంచి బయటకు తరలించడం గమనార్హం. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సమీప బంధువులైన చల్లగుండ్ల చిన నాగేశ్వరరావు, చింతల రామ్మోహన్రావులతోపాటు మంత్రికి ప్రధాన అనుచరుడైన మోడరన్ క్రష్షర్స్ యజమాని తోటకూర పూర్ణ ఇక్కడ అక్రమ క్వారీయింగ్ నిర్వహిస్తున్నారు. మైనింగ్ మాఫియాకు సహకరించినందుకు ఎన్నికల సమయంలో టీడీపీకి ఇక్కడ రెండు నియోజకవర్గాల్లో నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వణుకుతున్న వన్యప్రాణులు.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినట్లు 1990లో నిర్వహించిన జియలాజికల్ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ అపార ఖనిజ సంపదతోపాటు వన్యప్రాణులు కూడా ఉన్నాయి. జింకలు, దుప్పిలు, కణితలు, చిరుతలతో పాటు 32 రకాల జంతువులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ అటవీ ప్రాంతంలో 48 రకాల అరుదైన వృక్ష జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ 100 హెక్టార్లలో కొండలు విస్తరించి ఉండగా ఇప్పటికే దాదాపు 80 హెక్టార్ల పరిధిలో కొండలను మైనింగ్ మాఫియా పిండి చేసినట్లు తెలుస్తోంది. క్వారీయింగ్ కోసం అరుదైన వృక్ష జాతులను నాశనం చేస్తున్నారు. జిలెటిన్‌స్టిక్స్ లాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో రిగ్గు బ్లాస్టింగ్లు చేస్తుండడంతో వన్యప్రాణులు భీతిల్లి పరుగులు తీస్తున్నాయి. రాత్రి పగళ్లు తేడా లేకుండా పేలుళ్లు జరుపుతుండడంతో వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. హద్దులను చెరిపి.. మైనింగ్‌శాఖ అనుమతులు ఇచ్చేటప్పుడు సర్వే నిర్వహించి హద్దులు నిర్థారించాలి. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రి దేవినేని ఉమా అండదండలు ఉండడంతో పరిటాల క్వారీలకు నిర్వాహకులు హద్దులే లేకుండా చేశారు. 94 క్వారీలకు హద్దులు ఏమిటో అంతుబట్టవు. హద్దులు చెరిపేసి రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లోకి చొచ్చుకుపోతున్నారు. రెండు కొండల మధ్య రహదారి.. దొనబండలో క్వారీ నిర్వాహకులు 801 సర్వేనెంబర్‌లోని కొండ పోరంబోకు భూములతోపాటు కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో కలిసే రెండు కొండలను తొలిచేశారు. రెండు కొండల మధ్య అనుమతులు లేకుండా 40 అడుగుల మేర దాదాపు రూ.3 కోట్లతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే అక్కడ లభ్యమైన 2 వేల ట్రిప్పుల గ్రావెల్‌ను కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇందులో మంత్రి అనుచరులు కీలకంగా వ్యవహరించడంతో రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులు మౌనం దాల్చారు. అడవిని ఆక్రమించారు.. దొనబొండ క్వారీ నిర్వాహకులు పోరంబోకు, అటవీ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వేల టన్నుల కంకర తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయి క్వారీయింగ్ చేయడంపై అటవీశాఖకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మంత్రి అనుచరులు కావడంతో వారి ఆడిందే ఆటగా ఉంది. – మార్తా శ్రీనివాసరావు (స్థానికుడు, పరిటాల) అటవీ భూముల్లో తవ్వకాలే లేవు.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరగటం లేదు. రెవెన్యూ భూముల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకవేళ అటవీ ఆక్రమణ జరిగి ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – లెనిన్ (అటవీరేంజ్ అధికారి, కంచికచర్ల) -
రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్లాస్టిక్ నిషేధం
మన్ననూర్ (అచ్చంపేట) : అమ్రాబాద్ పులుల రక్షిత ప్రాంతం (కోర్ ఏరియా)లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని వాటి స్థానంలో పేపర్, బట్ట సంచులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీశాఖ ఈసీ సెంటర్ వద్ద డబ్లూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. మానవ మనుగడతో పాటు జీవరాశులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వన్యప్రాణులకు అమ్రాబాద్ అభయారణ్యం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు ప్లాస్టిక్‌ను ఉపయోగించడం, పారబోయడంతో వాటిని తింటున్న వన్యప్రాణులు మృత్యవాతపడుతున్నాయని అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డైరెక్టర్ ఫరీదా టంపల్ మాట్లాడుతూ శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఈ ప్రాంతంలో పేవర్ కవర్ల తయారీ కోసం కుటీర పరిశ్రమను మరో నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేపర్ కవర్ల తయారీ కోసం చెంచు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అడవులను, జంతుజాలాన్ని రక్షించుకోవాలని కళాకారుల ఇచ్చిన ప్రదర్శన, ఆట పాటలు ఆకట్టుకున్నాయి. యాత్రికులకు పేపర్ కవర్లు అందజేత అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్, శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు పేపర్ కవర్లు అందజేశారు. టోల్గేట్ రూ.20లకు అదనంగా రూ.5 వసూలు చేసి కవర్ అందిస్తున్నారు. దీంతోపాటు మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు ఎలాంటి చెత్త, వ్యర్థాలు ఉన్నా రోడ్డు పక్కన వేయకూడదు. కవర్లో వేసి దోమలపెంట చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బందికి కవర్ అందించాలి. వారు రూ.25 తిరిగి ఇస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పర్యావరణ రోజు సందర్భంగా అమ్రాబాద్, మన్ననూర్ రేంజ్ పరిధిలోని ఆయా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్ఓ జోజీ,ఎఫ్ఆర్ఓలు ప్రభాకర్, శ్రీదేవి ఎఫ్ఎస్ఓ రామాంజనేయులు సిబ్బంది బాబలి, వెంకటేశ్వర్లు, కనకయ్య, కళాకారులు మాడ్గుల నర్సింహ, లింగస్వామి, బీముడు, ఆయా చెంచుపెంటల మహిళలు పాల్గొన్నారు. -
వెదురు.. చెట్టు కాదు గడ్డే!
అటవీయేతర ప్రాంతాల్లో గిరిజనులు వెదురును అమ్ముకునేందుకు వీలుగా పార్లమెంట్ 1926 నాటి అటవీ చట్టాన్ని సవరిస్తూ బిల్లును ఆమోదించింది. రిజర్వ్ ఫారెస్టు మినహా మిగిలిన చోట్ల వెదురును చెట్టుగా పిలవరాదని పేర్కొంది. దానిని గడ్డిగానే పరిగణించాలి. రిజర్వ్ ఫారెస్టులో చెట్టుగా వెదురును పిలవాలని దానిలో తెలిపింది. తాజా సవరణ ప్రకారం గిరిజనులు లేదా మైదాన ప్రాంతంలో వెదురును పెంచుకుని విక్రయించుకోవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. కొయ్యూరు (పాడేరు) : మహారాష్ట్రలో మాదిరిగా రాష్ట్రంలో కూడా వెదురును నేరుగా గిరిజనులు అమ్ముకునేందుకు వీలుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2011లో అనుమతి ఇచ్చింది. అప్పట్లో ఆయన నాతవరం మండలంలో దానిని ప్రారంభించారు. తరువాత అది అలానే ఉండిపోయింది తప్ప గిరిజనులకు వెదురుపై అధికారం రాలేదు. గిరిజనుల నుంచి మావోయిస్టులను వేరు చేయాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అయితే తరువాత గిరిజనులకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. తాజాగా కేంద్రం వెదురును అటవీయేతర ప్రాంతాల్లో కూడా అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. దీని మూలంగా కొన్నిచోట్ల గిరిజనులు నేరుగా వెదురును అమ్ముకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. జిల్లాకు సంబంధించి నర్సీపట్నం అటవీ డివిజన్‌లోనే ఎక్కువగా వెదురు కూపీలున్నాయి. వాటి నుంచి యేడాదికి 40–50 లక్షల వెదుర్లను తీస్తారు. మన్యం వెదురుపై హక్కుకు నోచని గిరిజనం ప్రభుత్వం 2011లో ఇచ్చిన సడలింపు ప్రకారం గిరిజన మహిళలు గ్రూపులుగా ఏర్పడి వెదురును నరికి వ్యాపారులకు విక్రయించవచ్చు. అలా విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని పంచుకోవాలి. దీని మూలంగా గిరిజనుల ఆదాయం పెరిగి మావోయిస్టులకు దూరంగా ఉంటారని నాడు భావించారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. నర్సీపట్నం అటవీ డివిజన్లో వెదురు ద్వారా అటవీ శాఖ యేడాదికి రూ.రెండు నుంచి రెండున్నర కోట్ల ఆదాయాన్ని అర్జిస్తుంది. మొత్తం వెదురు ఉత్పత్తిలో అటవీ శాఖ తీస్తున్నది 40 శాతం మాత్రమే. మిగిలినదంతా తీసేందుకు వీలు లేక వదిలిపెడుతున్నారు. అదంతా వృథా అవుతుంది. కొండలపై నుంచి వెదురును తీసుకురావడం కూడా కష్టంగా మారింది. వెదురు సైజ్‌ను అనుసరించి అటవీ శాఖ గిరిజనులకు కూలి చెల్లిస్తుంది. తరువాత దానిని రవాణా చేసి నిల్వ కేంద్రాల వద్ద ఉంచుతుంది. నెలకు ఒకసారి వ్యాపారులకు వేలం నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి వెదురును ఎక్కడ నుంచి తీసుకువచ్చినా దానిని అటవీ శాఖ పట్టుకుంటుంది. తాజాగా పార్లమెంట్ సవరించిన 1926 నాటి చట్టం çప్రకారం గిరిజనులు లేదా మైదాన ప్రాంతంలో వెదురును పెంచుకుని విక్రయించుకోవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. రూ.60–75 మధ్యలో వెదురు ఒకప్పుడు రాజమండ్రి పేపర్మిల్లుకు మన్యంలో వెదురును సరఫరా చేసేవారు. అయితే మైదాన ప్రాంతంలో సుబాబుల్ పెంపకంతో పేపర్‌మిల్లు వెదురును వదిలిపెట్టింది. నాటి నుంచి అటవీ శాఖ వ్యాపారులకు వేలంలో విక్రయిస్తుంది. ప్రస్తుతం ఒక్కో వెదురు ధర రూ.60–75 మధ్య పలుకుతుంది. ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొని వీటిని కొనుగోలు చేస్తున్నారు. వెదురుతో అందమైన వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. మర్రిపాకల రేంజ్‌కు సంబంధించి వై రామవరం మండలం వెదురునగరం వద్ద, గొలుగొండ, నర్సీపట్నం, చింతపల్లి, సీలేరులో డిపోలను ఏర్పాటు చేసింది. నెలకోసారి అక్కడ వేలం నిర్వహిస్తారు. -
అంతా మాయ!
♦ రిజర్వ్ ఫారెస్ట్‌ను అన్ రిజర్వ్డ్గా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు ♦ దేవరకొండ దోపిడీకి సర్కారు అండ ♦ జియో కో ఆర్డినేట్స్‌ను మార్చేసిన పెద్దలు ♦ క్వారీ తవ్వకాలకు అనుకూలంగా మారిపోయిన మ్యాపులు ♦ అది అటవీ శాఖ భూమి అని తేల్చి చెప్పిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ♦ ఈ నెల 22న న్యాయ స్థానానికి నివేదిక అందజేయనున్న అధికారులు తిమ్మిని బమ్మిని చేసి... బమ్మిని తిమ్మిని చేసే కుతంత్రాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. సర్కారు ఆస్తుల్ని దర్జాగా అప్పగించేసేందుకు పెద్ద స్థాయిలో పైరవీలు నడుస్తున్నాయి. గిరిజనుల మనోభావాలను పట్టించుకోకుండా... వారి ఆందోళనలు లెక్క చేయకుండా... తమకు అనుకూలంగా నివేదికలు రూపొందించుకునేందుకు ఆ కొండలపై వాలిన డేగలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎక్కడ కొల్లగొట్టేందుకు అవకాశం ఉంటుందో అక్కడ దోపిడీ చేసేయడానికి పక్కా వ్యూహాలు తయారైపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడానేతల కనుసన్నల్లో అధికారుల నివేదికలు సిద్ధమైపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో బడేదేవరకొండ గ్రానైట్ నిక్షేపాలను దోచుకునేందుకు అధికార పార్టీ నేతల యత్నాలు తారాస్థాయికి చేరాయి. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన మంత్రే అందుకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సర్వే రికార్డులు మార్చిన దగ్గర నుంచి తాజాగా తప్పుడు మ్యాపులు తయారీ వరకూ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, మంత్రి అనుచర గణం చేస్తున్న తెర వెనుక కుట్రలు విస్తుగొలుపుతున్నాయి. మరో భారీ కుంభకోణానికి తెరదీస్తున్నాయి. పార్వతీపురం మండలంలో కోరి సర్వే నెం.1లో అత్యంత విలువైన కాశ్మీరీ గ్రానైట్ నిక్షేపాలను తవ్వుకోవడానికి టీడీపీ ప్రభుత్వం తమిళనాడుకు చెందిన ఫళనివేల్ అనే బడా వ్యాపార వేత్తకు అనుమతులిచ్చింది. 41.25 ఎకరాల్లో గనులు తవ్వుకోవచ్చని చెప్పడంతో ఆయన రోడ్లు కూడా వేసుకున్నాడు. అయితే అతనికి అనుమతిచ్చిన చోట కాకుండా మరోచోట తవ్వుకునేందుకు అక్కడ భారీ అక్రమాలకు తెరదీశారు. సీఎం పేషీలోని కొందరు పెద్దల ద్వారా అధికారులను గుప్పిట్లో పెట్టుకుని, జిల్లా మంత్రి అండదండలతో పథకం ప్రకారం జరిగిన ఈఅక్రమాల్లో రూ.కోట్లు చేతులుమారుతున్నాయి. అసలేం జరుగుతోందంటే... అటవీ భూములను గుర్తించడానికి ఉన్న ప్రధాన మార్గం జియో కో ఆర్డినేట్స్. వాటి ఆధారంగానే ఏ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉంది. ఏ ప్రాంతం అన్ రిజర్వ్‌లో ఉందనే విషయాలను తెలుసుకుంటుంటారు. ఫళనివేల్ ఇక్కడే తన బుద్ధి కుశలతను ఉపయోగించారు. తమకు అనుమతి ఉన్న కోరి ప్రాంతంలో కాకుండా ములగ ప్రాంతంలోని సర్వే నెం.1లో జియో కో ఆర్డినేట్స్‌ను సృష్టించారు. నిజానికి ఈ భూముల్లో దేవరకొండ ఊటనీటితో అక్కడి గిరిజనులు 10వేల ఎకరాలను సాగు చేసుకుంటున్నారు. 1993లో అటవీ భూములను డిజిటలైజ్ చేశారు. దాని ప్రకారం 2005లో ఈ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ అని తేల్చారు. అదే విషయాన్ని తాజాగా ఢిల్లీలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కూడా తన నివేదికలో స్పష్టం చేసింది. రిజర్వ్ ఫారెస్ట్‌కు అటవీ శాఖ లేయర్స్‌ను తయారు చేస్తుంది. వాటి ప్రకారం చూసినా ఈ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌గానే ఉంది. సర్వే పేరుతో సరికొత్త ఎత్తుగడ గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో హైలెవెల్ కమిటీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైంది. గతనెలలో చీఫ్ కమిషనర్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ ఆ కమిటీలోని డైరెక్టర్ ఆఫ్ మైన్స్(ఇన్చార్జ్) శ్రీధర్, డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ విజయమోహన్, ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.సారంగి జిల్లాకు వచ్చి అధ్యయనం చేశారు. ఆ సమయంలో తెర వెనుక జరిగిన అంశాలను రహస్యంగా ఉంచి కోర్టుకు నివేదిక ఇస్తామని ప్రజలకు చెప్పి వారు వెళ్లిపోయారు. ఆ రోజు అటవీ శాఖ నుంచి వారికి అనేక ఆధారాలు లభించాయి. ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పడానికి ఉన్న అన్ని డాక్యుమెంట్లను ఆ శాఖ అధికారులు చూపించారు. ప్లాన్ బెడిసికొడుతుందని భావించిన ప్రభుత్వం, మంత్రి, ఫళనివేల్తో కుమ్మక్కైన ఓ అధికారి కొత్త మెలిక పెట్టారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు విడివిడిగా సర్వే చేయించుకోవడం కాదు రెండూ కలిసి సర్వే చేయాలని చెప్పి కమిటీని తప్పుదోవ పట్టించి పంపించేశారు. దీని వెనుక అసలు కారణం తాజాగా తయారు చేస్తున్న మ్యాపుల్లో తమకు అనుకూలంగా మార్పులు చేయాలనుకోవడమేనని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే పాత మ్యాపులో జియో కో ఆర్డినేట్స్‌ను మార్చేశారు. దానిపై అప్పటి అధికారులు కనీసం చూసుకోకుండా సంతకాలు చేసేశారు. ఇప్పుడు అంతకు మించి పక్కా మ్యాపులు తయారు చేయడానికి మొదటి పాయింట్ నుంచి చేయాల్పిన సర్వేను కేవలం మైనింగ్ ప్రాంతంలో మాత్రమే చేస్తూ మమ అనిపిస్తున్నారు. -
‘డిండి’ మళ్లీ మొదటికి!
- వ్యాప్కోస్ సూచించిన రెండో ప్రతిపాదనలో రిజర్వ్ ఫారెస్ట్ - రీ సర్వే చేయాలని కోరిన నీటి పారుదల శాఖ - నార్లాపూర్–డిండి అలైన్మెంట్ పనుల్లో మరింత జాప్యం సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు సర్వే మళ్లీ మొదటికి వచ్చింది. నార్లాపూర్–డిండి అలైన్‌మెంట్‌కు వ్యాప్కోస్ సూచించిన రెండో ప్రతిపాదనలో రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో రీ సర్వే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో అటవీ సమస్యల కారణంగా కేంద్ర సంస్థల అనుమతులు క్లిష్టంగా మారిన నేపథ్యంలో.. ఇక్కడ అలాంటివి పునరా వృతం కాకుండా ఉండేందుకు నీటి పారుదలశాఖ రీ సర్వేకు ఆదేశించింది. శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీల నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునేందుకు నాలుగు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఇందులో వట్టిపల్లి, ఆలేరు, తెలకపల్లి గ్రామాల మీదుగా నీటిని తీసుకెళ్లి రంగాయపల్లి వద్ద పంప్‌హౌస్, గ్రావిటీ టన్నెల్ నిర్మించే ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనికి రూ.3,384.47 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరం సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వలు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపా దనపై పరిశీలన చేసిన ప్రాజెక్టు అధికా రులు రిజర్వ్ ఫారెస్ట్ అంశాన్ని గుర్తించారు. 5వ కి.మీ. నుంచి 20వ కి.మీ. వరకున్న అలైన్మెంట్ అంతా రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని తేల్చారు. ఇక రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ సైతం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని తేల్చారు. అటవీ ప్రాంతాన్ని తప్పించేందుకు ప్రత్యామ్నాయ అలైన్మెంట్ మార్గాన్ని తెలకపల్లి గ్రామం మీదుగా తరలించే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లుగా తెలిసింది. దీనిపై ప్రస్తుతం వ్యాప్కోస్ సర్వే చేస్తోంది. అది పూర్తయితేనే అలైన్మెంట్ ఖరారు కానుంది. ఏడాదిగా కసరత్తు చేస్తున్నా.. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌పై ఏడాదిగా కసరత్తు చేస్తున్నా ఎటూ తేలడం లేదు. మొదటగా కల్వకుర్తి ఆయకట్టు నష్టంపై అభ్యంతరాలు రాగా.. తర్వాత అలైన్మెంట్ అంచనా వ్యయాల్లో తేడాలొచ్చాయి. దీంతో కల్వకుర్తి ఆయకట్టుకు నష్టం లేకుండా అలైన్మెంట్ ఖరారు అంశాన్ని వ్యాప్కోస్‌కు కట్టబెట్టగా.. ఇదీ ఎటూ తేలడం లేదు. నార్లాపూర్ నుంచి డిండి అలైన్మెంట్ ఖరారు కానుందున.. ఆలోపు సింగరాజు పల్లి(0.8 టీఎంసీలు), గొట్టిముక్కల (1.8), చింతపల్లి(0.99), కిష్టరాంపల్లి (5.68), శివన్నగూడం (11.96 టీఎంసీల) రిజర్వాయర్లు.. వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులకు ప్రభుత్వం టెండ ర్లు పిలిచి పనులు ఆరంభించింది. మొత్తం గా 7 ప్యాకేజీలకుగానూ రూ.3,940 కోట్ల పనులు చేపట్టింది. ఈ పనులు సాగుతు న్నా.. తొలి దశ పనులకు మాత్రం మోక్షం ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులన్నీ ఆపేయండి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీ ఉత్తర్వులు - అటవీ ప్రాంతంలో పనులు చేయడం లేదన్న ప్రభుత్వం - అది అబద్ధమంటూ శాటిలైట్ ఫొటోలు చూపిన పిటిషనర్ - ఈ ప్రాజెక్టు గురించి కేసీఆర్ ప్రసంగం ఎన్జీటీకి సమర్పణ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జరుగుతున్న పనులన్నింటినీ వెంటనే ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ, చెన్నై) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అన్ని అనుమతులు పొందేంత వరకు ఏ ఒక్క పని కూడా చేయరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎస్ నంబియార్, పీఎస్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రాజెక్టు జరుగుతున్న తీరు తెన్నులు.. ప్రభుత్వ ఉల్లంఘనలు తదితర విషయాలను నిగ్గు తేల్చేందుకు నిపుణులతో స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తును ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై స్పందన తెలియజేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాగునీటి ప్రాజెక్టు వాదనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అనుబంధ దరఖాస్తుతో పాటు ప్రధాన పిటిషన్‌ను ఆ రోజు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో ప్రభుత్వ వాదనకు మద్దతు తెలుపుతూ ప్రాజెక్టు పనులను ఆపవద్దని, ఈ కేసులో తమను ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలంటూ కొందరు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. అటవీ, పర్యావరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపించగా, పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్ వాదనలు వినిపించారు. కేసీఆర్ ప్రసంగం కాపీల సమర్పణ విచారణ ప్రారంభం కాగానే వాయిదా కోసం ఏఏజీ కోరగా, సంజయ్ ఉపాధ్యాయ్ దానిని వ్యతిరేకించారు. ఏమీ చేయడం లేదని ఒకవైపు చెబుతూ, మరోవైపు ప్రాజెక్టు పనులను కొనసాగిస్తూనే ఉన్నారని, దీనికి ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగమే సాక్ష్యమన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి ధర్మాసనం ముందుంచారు. కేసీఆర్ తన ప్రసంగంలో ఎన్జీటీని గేలిచేసేలా మాట్లాడారని వివరించారు. ఎన్జీటీ ఇచ్చిన స్టే ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి తీరుతామన్నారని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఈ సమయంలో రామచంద్రరావు స్పందిస్తూ.. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదని చెప్పారు. ఉపాధ్యాయ్ ఈ వాదనలతో విభేదించారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పనులతో పాటు ప్రాజెక్టు కొనసాగుతున్న ప్రాంతాలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. ఉత్తర్వులు ఆటంకం కాదు ‘‘రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులేవీ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరగటం లేదు. కావున ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులు పాలమూరు పనులకు ఆటంకం కాదు’’ – సీఈ లింగరాజు -
వీబీసీతో వన్యప్రాణాలు హరీ!
జయంతిపురం వద్ద 2 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దీనిని ఆనుకునే ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు నాలుగేళ్లలో అంతరించిపోనున్న రిజర్వ్ ఫారెస్ట్‌లోని జంతువులు విజయవాడ : జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ భారీ కర్మాగారం ఏర్పాటుతో ఇక్కడి అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ముంచుకురానుంది. జయంతిపురం సమీపంలోని 500 ఎకరాల్లో వీబీసీ ప్రతిపాదిత స్థలాన్ని ఆనుకొని ఏడు గ్రామాలకు విస్తరించిన రెండు వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అది రిజర్వ్ ఫారెస్ట్ కావటంతో వన్యప్రాణుల సంచారమూ అధికమే. ముప్పయ్యేళ్ల క్రితం ఇక్కడ జింకలు, నెమళ్లు, అడవి పందులు, దుప్పిలు, కొండచిలువలు, అనేక ఇతర జంతువులు ఉండేవి. రిజర్వ్ ఫారెస్ట్ కావటం, పక్కనే అడవిలోనే కృష్ణానది కూడా ఉండటంతో జంతువులకు ఇబ్బందులు ఉండేవి కాదు. గడచిన 20 ఏళ్లలో ఇక్కడ 19 సిమెంట్ ఫ్యాక్టరీలు, వందకు పైగా ఇతర పరిశ్రమలు ఏర్పడ్డాయి. వాయు కాలుష్యంతో గడచిన ఇరవయ్యేళ్లలో పెద్ద సంఖ్యలో జంతువులు మృత్యువాత పడ్డాయి. ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం... ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాలుష్య తీవ్రత సెకనుకు 59 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది 60 దాటితే తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని ఇప్పటికే అనేక సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వీబీసీ ఏర్పాటు చేయనున్న భారీ కర్మాగారంలో అమ్మోనియా ప్లాంట్, నైట్రిక్ యాసిడ్ ప్లాంట్, అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్, యూరియా ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కర్మాగారం కంటే రెట్టింపు స్థాయి ఉత్పత్తితో రెట్టింపు సంఖ్యలో ప్లాంట్లు ఏర్పాటు చేయనుండటం గమనార్హం. దీనివల్ల ప్రమాదకర స్థాయిని దాటి కాలుష్యం పెరగటం ఖాయం. దీనివల్ల మనుషులతో పాటు వన్యప్రాణులకూ ముప్పు తప్పదు. సాధారణంగా ఏడేళ్ల జీవిత కాలం ఉన్న దుప్పిలు ఇక్కడి అటవీ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రభావంతో ఏడాదిన్నరకే మృత్యువాత పడుతున్నాయి. మిగిలిన జంతువులదీ ఇదే పరిస్థితి. ఇప్పటివరకు అడవికి కనీసం 10 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు ఉండటంతో నష్టం తీవ్రత కొంత తక్కువగా ఉండేది. ఇప్పుడు 500 మీటర్ల దూరంలోనే వీబీసీ కర్మాగారం ఏర్పాటు కానుండటంతో మరో నాలుగేళ్లలో అడవిలోని జంతు సంపద పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది. అధికార పార్టీ కనుసన్నల్లోనే... అధికార పార్టీ కనుసన్నల్లోనే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలంగా యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. దీనిపై పట్టించుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలే పూర్తిగా సహకరిస్తుండటం శోచనీయం. పర్యావరణ వేత్తలు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకునేందుకు చేస్తున్న యత్నాలను ప్రభుత్వ పెద్దలు తొక్కిపట్టి మరీ ఆ యాజమాన్యానికి సహకరిస్తుండటం గమనార్హం. -
జిల్లాలో రెండు ఈకో పార్కులు
- జిల్లా ఫారెస్టు అధికారి నరేందర్‌రెడ్డి వనపర్తిరూరల్: మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఈకో పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం మేరకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని జిల్లా ఫారెస్టు అధికారి నరేందర్‌రెడ్డి చెప్పారు. గురువారం వనపర్తి మండలంలోని రిజర్వు ఫారెస్టు స్థలాన్ని ఆయన ఇక్కడి ఫారెస్టు రేంజర్ అధికారి మహెందర్‌రెడ్డి, అసిస్టెంట్ రేంజర్ అధికారి శ్యాంకుమార్‌తో కలిసి పరిశీలించారు. జిల్లాలోని మహబూబ్‌నగర్ అప్పనపల్లి వద్ద ఒకటి, వనపర్తి మండలం పెద్దగూడెం శివారులోని రిజర్వు ఫారెస్టులో మరొకటి ఏర్పాటు చేయటానికి స్థలాన్ని ఎంపిక చేస్తున్నామన్నారు. ఒక్కో పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 2 కోట్ల చొప్పున నిధులు కేటాయించనుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన హరితహారం పథకంలో భాగంగా ఈ పార్కుల నిర్మాణం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పార్కులలో వాకింగ్ ట్రాక్, రన్నింగ్, బైస్కలింగ్ట్రాక్లతో పాటు, వృక్షశాస్త్ర అధ్యయన కోసం ప్రత్యేక సెల్ నిర్మాణం చేస్తామన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న ఔషద మొక్కలను పెంచటానికి ఈ పార్కులను ఉపయోగించు కుంటామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నాచారంలో నిర్మాణం చేసిన ఈకో పార్కుల తరహాలో వీటిని నిర్మాణం చేస్తామన్నారు. ఒక్కో పార్కు సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయనతో పాటు వనపర్తి, మహబూబ్‌నగర్ ఫారెస్టు శాఖ అధికారులు ఉన్నారు. -
గుట్టలను తవ్వేస్తారట..
రిజర్వు ఫారెస్ట్ భూముల్లో గనుల తవ్వకానికి వ్యాపారుల దరఖాస్తు అనుమతులు లభిస్తే ఎడారిలా మారనున్న వ్యవసాయ భూములు ములుగు : మైనింగ్ పేరుతో గుట్టలను తవ్వేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు రిజర్వు ఫారెస్ట్ భూముల్లో ఉన్న గనుల తవ్వకానికి అనుమతులు కావాలని కొందరు వ్యాపారులు మైనింగ్ అండ్ జియాలజీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ములుగు మండలం మల్లంపల్లి, జాకారం, అబ్బాపూర్, బాణాలపల్లి, రేగొండ మండలం కొత్తపల్లి, బాగిర్థిపేట, వెంకటాపురం మండలం ఇంచెన్చెర్వుపల్లి, నర్సాపూర్, కేశవాపూర్ పరిధిలోని రిజర్వు ఫారెస్ట్ భూముల్లో అపారమైన డోలమైట్, లాటరైట్ గనులు ఉన్నాయి. వీటిపై కన్నేసిన వ్యాపారులు గనుల తవ్వకాల కోసం 2014, మార్చి నుంచి ఇప్పటి వరకు 15 మంది వరకు ద రఖాస్తు చేసుకున్నారు. సుమారు 1000 ఎకరాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు ఇటీవల ఓ నాయకుడు సమర్పించిన సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. గతంలో ములుగు డివిజన్లో 82 శాతం ఉన్న అడవులు పోడు వ్యవసాయం, అక్రమ కలప వ్యాపారం కారణంగా ప్రస్తుతం 60 శాతానికి చేరారుు. ఒకవేళ మైనింగ్‌కు అనుమతిస్తే ఈ ప్రాంతం ఏడారిగా మారే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ములుగు, వెంకటాపురం మండలాల్లో భూగర్భ జలాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు భూగర్భ నీటి వనరుల శాఖ నిర్ధారించింది. ఒకవేళ అనుమతులు మంజూరు చేస్తే వాతావరణంలో తీవ్రమార్పులు సంభవించే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు ఇంకిపోయి భూములు ఎడారుల్లా మారనున్నాయి. వ్యాపారుల దరఖాస్తులో రేగొండ మండలం బాగిర్థిపేట సమీపంలోని పర్యాటక ప్రాంతం పాండవులగుట్ట ఉంది. తవ్వకాలు జరిగితే పాండవుల గుట్ట ప్రమాదంలో పడి స్వభాన్నే కోల్పోయే అవకాశం ఉంది. తవ్వకాల అనుమతులపై పర్యాటక శాఖ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో రిట్ దాఖలు చేస్తాం రిజర్వు ఫారెస్ట్ భూముల్లో తవ్వకాలు చేపడితే వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాం. అనుమతులు లభిస్తే వ్యవసాయ భూములు ఎడారుల్లా మారిపోతాయి. అధికారులు స్పందించకుంటే హైకోర్టులో రిట్ దాఖలు చేస్తాం. - మస్రగాని విన య్‌కుమార్, అడ్వకేట్, మాజీ ఎంపీపీ, ములుగు -
మన్యం రోడ్లకు మహర్దశ
రిజర్వ్ ఫారెస్టుపై కేంద్రం నిబంధనలు సడలింపు మావోయిస్టు ప్రభావిత జిల్లాలకు మాత్రమే వర్తింపు ఏజెన్సీ రోడ్ల నిర్మాణాలకు ఇక త్వరితగతిన అనుమతులు 13 రకాలపై తొలగనున్న అడ్డంకులు జాప్యాన్ని నివారించేందుకు ఆన్లైన్ ప్రక్రియ కొయ్యూరు : ఏజెన్సీ రోడ్లకు మహర్దశ పట్టనుంది. అటవీశాఖ అభ్యంతరాలతో ఆగిపోయిన రోడ్లను,ఇతర నిర్మాణాలకు కేంద్రం నిబంధనల సడలింపుతో ఇబ్బందులు తొలగనున్నాయి. మన్యంలో దాదాపుగా 70 కిపైగా రోడ్ల నిర్మాణం ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక మీదట వాటిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలో పూర్తి చేయవచ్చు. విశాఖ మన్యం మావోయిస్టు ప్రభావిత జిల్లా కావడంతో రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సడలించింది. దీని ప్రకారం ఒక గ్రామంలో అంగన్వాడీ భవనం లేదా పాఠశాల భవనం,లేకుంటే సోలార్ కేంద్రం ఎంచక్కా ఏర్పాటు చేసుకోవచ్చు. మొబైల్ టవర్లు ఏర్పాటు కానున్నాయి. 13 అంశాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో హెక్టార్ వరకు అటవీ శాఖకు చెందిన స్థలాన్ని తీసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విషయంలో రిజర్వ్ ఫారెస్టు ఎంత పోయినా నిర్మాణానికి అనుమతి ఇచ్చే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది. గతంలో ఐదు హెక్టార్లు దాటితే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవచ్చు. దీంతో పాటు వాటిలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు వీలుగా ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక రోడ్డు వేసేటప్పుడు ఎంత రిజర్వ్ ఫారెస్టు పోతుందో ఆన్లైన్లో సంబంధిత అధికారులు పేర్కొనాలి. దానిని డీఎఫ్‌వో, సీసీఎఫ్‌తో పాటు పీసీసీఎఫ్ చూస్తారు. అనంతరం పీసీసీఎఫ్ నుంచి డీఎఫ్‌వో వరకు పది రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. నిర్దేశించిన సమయానికి విచారణ పూర్తి చేసి ఆన్‌లైన్‌తో నివేదికను డీఎఫ్‌వో అందజేస్తారు. దానిపై పీసీసీఎఫ్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దానిని పరిశీలించిన ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇస్తుంది. ఇదంతా నెల రోజుల్లో పూర్తి అవుతుంది. నిబంధనలను సడలించకుండా ఉంటే అటవీశాఖ నుంచి అనుమతి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి జిల్లాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీనిపై నర్సీపట్నం డీఎఫ్‌వో లక్ష్మన్ మాట్లాడుతూ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండడంతో కేంద్రం నిబంధనలు సడలించిందని చెప్పారు. ఇప్పుడు నేరుగా రాష్ట్రం అనుమతులు ఇవ్వవచ్చని తెలిపారు. అనుమతుల విషయంలోను జాప్య ం ఉండదన్నారు. -
కాగితపు పరిశ్రమ కలేనా?
అచ్చంపేట : విస్తారమైన వెదురు వనాలు, నిష్ణాతులైన కూలీలు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అటవీప్రాంతంలో కాగితపు పరిశ్రమ దశాబ్దాలుగా హామీగానే మిగిలింది. అటవీ, మైదాన ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు లభిం చకపోవడంతో వలసబాటే మార్గమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో ఈ ప్రాంతంలో నెలకొల్పాల్సిన కాగితపు పరిశ్రమ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనతో నాగర్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు రెండుగా విడిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలో సుమారు 3,568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అటవీప్రాంతం మహబుబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోకి 2,220 చదరపు కిలోమీటర్ల మేర ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూమి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో మూడో వంతున వెదురు వనాలు పుష్కలంగా ఉన్నాయి. సుమారు 1100 చదరపు కిలోమీటర్ల మేర వెదురు వనాలు ఉన్నట్లు అటవీశాఖ అంచనా. అభయార్యణ ప్రాంతం కాకముందు నల్లమల అటవీప్రాంతం నుంచి సేకరించిన వెదురును ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కాగితపు పరిశ్రమకు నెలకు వెయ్యి లారీల చొప్పున తరలించేవారు. ప్రస్తుతం అభయారణ్య ప్రాంతం కాని ప్రదేశాల్లో మాత్రమే వెదురు కలపను సేకరిస్తున్నారు. ఏటా జిల్లాలోని అచ్చంపేట సబ్ డివిజన్ పరిధిలోని కొల్లాపూర్, లింగాల రేంజ్‌లలో మాత్రమే వెదురు కలప సేకరణ జరుగుతుంది. కొల్లాపూర్‌లో డంప్‌యార్డును ఏర్పాటుచేశారు. అచ్చంపేట, మన్ననూర్, అమ్రాబాద్ రేంజ్‌లు అభయారణ్య ప్రాంతం కావడంతో ఇక్కడ వెదురు సేకరణను నిలిపేశారు. ఇదే అదనుగా నల్లమలలోని వెదురువనాలపై స్మగ్లర్ల కన్ను పడింది. లక్షల విలువ చేసే వెదురు కలపను దొంగదారిన ప్రకాశం, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వెదురు సేకరణ ఇలా.. నల్లమలలో వెదురు విస్తారనంగా ఉన్నా సేకరించలేకపోతున్నారు. కాంట్రాక్టర్, కూలీల కొరతే ఇందుకు కారణమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వానికి వెదురు సేకరణ వల్ల ఏటా రూ.75లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతుంది. 2010-11లో 7.50 లక్షల వెదురు కర్రల సేకరణే లక్ష్యంగా నిర్ణయించగా నాలుగు లక్షలను మాత్రమే సేకరించగలిగారు. 2011-12 టార్గెట్ ఆరు లక్షల కర్రలకు రూ.4.87లక్షలు సేకరించారు. 2012-13లో 9లక్షలకు గాను ఐదు లక్షల వెదురుకర్రలను మాత్రమే సేకరించారు. 2013-14లో 15 లక్షలు లక్ష్యం కాగా, నాలుగు లక్షలు వచ్చింది. కాగా, 2014-15 సంవత్సరాన్ని క్రాప్హాలిడేగా ప్రకటించడంతో సేకరణ నిలిచిపోయింది. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వెదురు కలప సేకరణలో నిష్ణాతులైన ఈ ప్రాంత కూలీలు మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు పనులకు వెళ్తున్నారు. కలిసొచ్చే అవకాశాలివే..! మహబూబ్‌నగర్ జిల్లా సమీప నల్లమల అటవీప్రాంతం నుంచే కృష్ణానది ప్రవహిస్తోంది. అచ్చంపేటకు 40 కిలోమీటర్లు, లింగాల మండలానికి కేవలం 10 కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఒకవేళ ఈ ప్రాంతంలో కాగితపు పరిశ్రమను ఏర్పాటుచేస్తే కృష్ణానది నుంచి గ్రావిటీ ద్వారా పుష్కలంగా నీటిని వాడుకోవచ్చు. పరిశ్రమకు అవసరమయ్యే విద్యుత్‌ను అచ్చంపేట నుంచి పొందే అవకాశం ఉంది. ఏటా పాలమూరు జిల్లా నుంచి సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది వివిధ ప్రాంతాలకు వలసవెళ్తున్నట్లు అంచనా. ముఖ్యంగా కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, నారాయణపేట ప్రాంతాల నుంచి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటుచేస్తే వీరికి ఉపాధి దొరకే అవకాశం ఉంది. ఏడాదిగా కలప సేకరణ నిలిపివేత కొల్లాపూర్, లింగాల రేంజ్‌ల పరిధిలో ఈ ఏడాది వెదురు సేకరణ ఉండదు. ఒక టి, రెండు సంవత్సరాల పాటు సేకరణ నిలి పేయడం వల్ల కర్ర దృఢంగా పెరుగుతుం ది. 2014-15 సంవత్సరంలో వెదురు సేకరణ నిలిపేశాం. కూలీల కొరత, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాం. - వెంకటరమణ, డీఎఫ్ఓ. అచ్చంపేట -
ఫారెస్ట్ సిబ్బంది, ఆదివాసీల మధ్య ఘర్షణ
- వెదురు కర్ర తరలిస్తున్న వారి నుంచి గొడ్డళ్లు లాక్కోవడంతో చెలరేగిన వివాదం - రోడ్డు ఎందుకు వేయనీయడం లేదని అధికారులపై కొండాయి, మల్యాల గ్రామస్తుల ఆగ్రహం ఏటూరునాగారం : ఫారెస్ట్ అధికారులు, ఆదివాసీలు ఘర్షణకు దిగిన సంఘటన మండలంలోని మండలంలోని మల్యాల, కొండాయి గ్రామంలో ఆదివారం జరిగింది. మల్యాల - ఊరట్టం రోడ్డు పనులు రిజర్వు ఫారెస్ట్‌లో జరుగుతున్నాయని తెలియడంతో ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు పనులు నిలిపి వేయించేం దుకు వన్యప్రాణి విభాగం రేంజ్ అధికారి యాకయ్య, కొండాయి సెక్షన్ అధికారిణి ఝాన్సీరాణి, బేస్‌క్యాంప్ వాచర్ హరీష్, డ్రైవర్ సతీష్ కలిసి అటవీశాఖ జీపులో వెళ్లారు. అక్కడ రోడ్డు పనులు పరిశీలించి కొండాయి మీదుగా తిరిగి ఏటూరునాగారం వస్తున్నారు. మార్గమధ్యంలో ఇద్దరు గిరిజనులు ఎడ్లబండ్లపై వెదురు కర్రను అడవి నుంచి తీసుకొస్తూ కనిపించారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది వారిని అడ్డగించి బండ్లపై ఉన్న సిద్దబోయిన రామ య్య, మరోవ్యక్తి వద్ద ఉన్న గొడ్డళ్లను లాక్కున్నారు. దీంతో వారు మల్యాలకు వెళ్లి గ్రామస్తులకు విషయం చెప్పారు. దీంతో గ్రామంలోని గిరిజనులంతా జీపులో వెళుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరి గింది. మల్యాల -ఊరట్టం రోడ్డు పనులు జరగకుండా మీరెందుకు అడ్డుపడుతున్నారని ఫారెస్ట్ అధికారులను ఈ సందర్భంగా వారు నిలదీశారు. గిరిజన గ్రామాలకు రవాణా మార్గం లేకుండా చేస్తారా అంటూ కొండాయి, మల్యాల గిరిజనులు రేంజర్ యాకయ్య, ఎస్ఎఫ్ఓ ఝాన్సీ, డ్రైవర్ సతీష్, వాచర్ హరీష్‌పై దాడికి దిగారు. రేంజర్‌ను కిందికి దింపడానికి ప్రయత్నం చేసి అతడి చొక్కా చింపారు. జీప్‌ను అడ్డగించి నాలుగు గంటలపాటు నిర్బంధించారు. చివరికి ఎలాగోలా ఫారెస్ట్ సిబ్బంది ఏటూరునాగారం చేరుకున్నారు. మాపై అధికారులే ముందు దాడి చేసిండ్లు.. మహిళలపై జంగ్లతోల్లు కావాల్ననే దాడి చే సిండ్లు.. అడవిలో జీవిస్తున్న మాకు వీళ్లు స్వేచ్ఛ లేకుండా చేస్తుండ్లు. మమ్ములను ఎప్పుడూ ఏదో పేరుతో వేధిస్తుండ్రు. ఇంట్ల ఉన్న ఆడ, మగ అని తేడా లేకుండా ఇబ్బంది పెడుతూ కేసులు బనాయిస్తున్నరు. మేం అడవిలో బతికేందుకు సోటు లేదా. -తాటి పార్వతి, మల్యాల గొడ్డలి గుంజుకున్నరు అడవిలో ఎండిపోయిన పుల్లలు, వెదురు కర్రలను పొలానికి చుట్టూ కట్టడానికి తెచ్చుకుంటంటే జీపులో సార్లు వచ్చి గొడ్డలి గుంజుకున్నరు. అడవిలో ఎలాంటి చెట్లను నరకలేదని చెప్పినా ఇనిపించుకోలే. అంతకముందు మూడురోజుల కిందట నన్ను కొట్టిండ్లు. అడవిలో ఎవుసాయం చేసి బతికొటల్లం. మమ్ముళ్లికొడితే ఎమత్తది. మాకు న్యాయం చేయాలే. -సిద్దబోయిన రామయ్య, మల్యాల -
‘ఉక్కు’ సంకల్పంతో..
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను అన్వేషించేందుకు సెయిల్ బృందం( స్టీల్ఆధారిటీఆఫ్ ఇండియా) బుధవారం ఇక్కడకు వచ్చింది. తొమ్మిది మందితో కూడిన ఈ బృందం జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌తో కలెక్టరేట్లో సమావేశం అయింది. స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూములు, వనరులు, ఖనిజ నిక్షేపాలు, నీరు, విద్యుత్, రవాణా తదితర వసతులు, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను కూలంకషంగా చర్చించింది. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనుండటం గర్వకారణమని జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ వ్యాఖ్యానించారు. అధికారులందరూ ఈ బృందానికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించాలని ఆదేశించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... ‘ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2,500 ఎకరాల స్థలం అవసరం. దీనికి బయ్యారం, కొత్తగూడెం మండలం కూనారం చుట్టుపక్కల భూములను పరిశీలించాం. బయ్యారం మండలం ధర్మాపురంలోని 452 సర్వేనంబర్‌లో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో రెండువేల ఎకరాలు అసైన్డ్ భూమి. పాల్వంచ మండలం ఉల్వనూరులో 318 సర్వే నెంబర్లో 21,960 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఐదువేల ఎకరాలు అసైన్డ్ భూమి. మిగిలింది రిజర్వ్ ఫారెస్ట్ భూమి. కొత్తగూడెం మండలం కూనారంలో4,300 ఎకరాల ప్రభుత్వ భూమి 3/3 సర్వే నంబర్లో ఉంది. పాల్వంచ మండలం కారేగట్టు అనే గ్రామంలో 38 సర్వేలో 9,111 ఎకరాలు,చంచులగూడెంలో 95/1 సర్వే నంబర్లో 9,680 ఎకరాల భూమి ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అనువైన వాటిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇనుప ఖనిజం నిక్షేపాలు జిల్లాలో బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో అపారంగా ఉన్నాయి. ఈ ఇనుప ఖనిజాలు హెమటైట్ క్వార్ట్లైట్స్తో కలిసి ఉన్నాయి. ఈప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నాయి. బయ్యారానికి 20 కిలోమీటర్ల దూరంలోని మాధారంలో డోలమైట్ యూనిట్ ఉంది. 90 కిలోమీటర్ల దూరంలో నల్లగొండ జిల్లాలో సున్నపురాయి అపారంగా ఉంది.’ అని జేసీ వివరించారు. బయ్యారంలో మండలంలో 230 హెక్టార్లలో ఒక చోట, 318 హెక్టార్లలో మరో చోట ఇనుప ఖనిజం ఉందని ఏపీఎండీసీ పీఓ శివకుమార్ పేర్కొన్నారు. సెయిల్‌బృందం మాటల్లో... ఉక్కు పరిశ్రమ నెలకొల్పుటకు ఇనుపఖనిజం, మాగ్నైట్, హెమటైట్ ఖనిజాలు అవసరమని సెయిల్ బృందం తెలిపింది. సున్నపురాయి వంటి ముడిసరుకు పక్కజిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు అంది. ఇల్లెందు మండలం కాంచనపల్లిలో బొగ్గుగనులు పుష్కలంగా ఉన్నాయని సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ జీవీ రెడ్డి తెలిపారు. ఉక్కుపరిశ్రమకు రోజుకు 49 క్యూసెక్కుల నీరు అవసరమని జేసీ తెలిపారు. ఈ నీటిని బయ్యారం పెదచెరువు, మున్నేరు, కిన్నెరసాని, గోదావరి నుంచి తరలించవచ్చన్నారు. 550 మెగావాట్ల విద్యుత్ అవసరమని, దీనికి 220 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్య నియంత్రణబోర్డు పరిమితులకు లోబడి వ్యవహరించాలని జేసీ సూచించారు. ఈ సమావేశంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులు ఎ. మేథీ, లే అవుట్ డెప్యూటీ జనరల్ మేనేజర్ బి.సర్కార్, డీఎం కుమార్, సీనియర్ మేనేజర్ కేఎస్ సవారి, అసిస్టెంట్ మేనేజర్ బెనర్జీ, డి.సాహూ, డీజీఎం సోమేశ్వర్సింగ్, ఏకే జా, డీజీఎం (ఐరన్) రాజన్‌కుమార్ సిన్హా, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ శ్రీనివాస్‌నాయక్, మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ తిరుమలరావు పాల్గొన్నారు. నేటి పర్యటన ఇలా.... స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం జిల్లాలో క్షేత్ర పర్యటన చేస్తారు. ఉదయం కిన్నెరసాని, పాల్వంచ, కొత్తగూడెం, బయ్యారం తదితర ప్రాంత్లాలో పర్యటించి వనరులు, పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తారు. -
మళ్లీ చర్చలు విఫలం
బాడంగి, న్యూస్‌లైన్:మండలంలోని ఆకులకట్ట రిజర్వు ఫారెస్టు భూ ముల సరిహద్దు విషయమై అటవీ, రెవెన్యూ శాఖల మధ్య పొంతన కుదరడం లేదు. సోమవారం ఆ రెండు శాఖల అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో రెండోసారి జరి పిన చర్చలు కూడా విఫలమయ్యూయి. దీంతో ఈనెల 23 వతేదీకి మళ్లీ చర్చలను వాయిదా వేశారు. అటవీశాఖ వా దన ప్రకారం నోటిఫికేషన్‌లోని సర్వే నంబరు 2-24లోని 73. 36 ఎకరాలు తమ శాఖకు చెందినవిగా వారు చెబుతున్నారు. కాదని రెవెన్యూ శాఖాధికారులు వాదిస్తున్నారు. అటవీ శాఖకు 58 ఎకరాలే చెందుతాయని వారు చెబుతున్నారు. ఈమేరకు ఇరు శాఖల అధికారులు సరిహద్దు మ్యాప్‌లు చూసి వాదులాడుకున్నారు. చివరకు ఈ నెల 23వ తేదీన మరోసారి చర్చలు జరిపి, నేరుగా వివాదానికి కారణమైన భూములవద్దకు వెళ్లి పరిశీలించాలని నిర్ణరుుం చారు. చర్చల్లో పార్వతీపురం ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పి. లక్ష్మీనర్సింహ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సీబీకే పాత్రుడు, షికారుగంజి ఫారెస్టు బీట్ అధికారి ఎస్.భాస్కరరావు, రెవెన్యూ శాఖకు సంబంధించి జిల్లా సర్వే విభాగం డిప్యూ టీ ఇన్స్పెక్టర్ జి.వెంకటరావు, తహశీల్దార్ ఎస్.రమణమూర్తి, హెచ్‌డీటీ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఫారెస్ట్ వర్సెస్ టీటీడీ
సాక్షి, తిరుమల: తెరవెనుక కారణాలు ఏవైనా పాపవినాశం తీర్థ స్థల వివాదం మళ్లీ తెరపైకి వచ్చిం ది. రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని ఆ స్థలం తమదంటే తమదేనని ఫారెస్ట్, టీటీడీ పట్టుబడుతున్నాయి. ఈ రెండు విభాగాల మధ్య దుకాణదారులు నలిగిపోతున్నారు. శ్రీవారి దర్శన టికెట్లే కొత్త వివాదానికి కారణమని చర్చ జోరుగుతోంది. టీటీడీ దివ్యక్షేత్రం పరిధిలో ఏడు కొండలు, పది తీర్థాలు టీటీడీ రెవెన్యూ అధికారులు చెబుతున్న రికార్డుల ప్రకారం శేషాచలంలోని ఏడుకొండలు, పది తీర్థాలు దేవస్థానం పరిధిలోకి వస్తాయి. తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి ఇస్తూ ప్రభుత్వ జీవో ఎంఎస్ 659, 1941 జూన్ 16 ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఉంది. దీనికి అనుబంధంగా ప్రభుత్వ జీవో 338, పం చాయతీ (రెవెన్యూ) 2005 సెప్టెంబర్ 16 ఆ తర్వాత జీవో ఎంఎస్ నం:746, రెవెన్యూ (ఎం డోమెంట్స్3) 2007 జూన్ 2 ప్రకారం ‘తిరుమల దివ్యక్షేత్రం’గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చే సింది. దీని ప్రకా రం తిరుమల ఆలయం, ఏడుకొండలు, పది తీర్థాలు ఈ గెజిట్‌లో చేర్చారు. ఆయా తీర్థాల చు ట్టూ 200 మీటర్ల స్థలం కూడా టీటీడీ అటవీ పరిధిలోకి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ భూముల పరిధిలో సర్వహక్కులూ శ్రీవారి పే రుతో ఉన్న దేవస్థానానికే చెందుతాయని టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి స్పష్టం చేస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్ తమదేనంటున్న ఫారెస్ట్ విభాగం శ్రీ వేంకటేశ్వర అభయారణ్యం పరిధిలోకి వచ్చే రిజర్వు ఫారెస్ట్ ప్రాంతమంతా తమదేనని ఫారెస్ట్ విభాగం చెబుతోంది. దీనిపై టీటీడీకి ఎలాంటి హక్కూలేదని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2008లో ఆకాశగంగ తీర్థం తర్వాత రిజర్వు ఫారెస్ట్ పరిధిలో చెక్‌పోస్టు కూడా ఏర్పాటు చేశామని గుర్తుచేస్తున్నారు. తమ పరిధిలోకి వచ్చే తీర్థాల్లో ఉన్న దుకాణాలు ఖాళీ చేయాల్సిందేనని వారు చెబుతున్నారు. నలుగుతున్న దుకాణదారులు టీటీడీ, ఫారెస్ట్ విభాగాలు ప్రతిష్టలకు పోవడంతో వారి మధ్య దుకాణదారులు నలిగిపోతున్నారు. 1983లో పాపవినాశనం డ్యాం నిర్మా ణం కాకముందే పాత పాపవినాశనంలో దుకాణాలు ఉన్నాయని, 1967 నుంచే తాము టీటీడీకి అద్దెలు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. 1983 లో డ్యాము నిర్మాణం పూర్తయిన తర్వాత పాత పాపవినాశం మూసివేయడంతో అక్కడు న్న దుకాణాలను కూడా కొత్త పాపవినాశనానికి మారుస్తూ టీటీడీ అధికారులు ఉత్తర్వులు ఇ చ్చారు. ఆ తర్వాత షికారీలకు గిరిజన కోటా కింద హాకర్ లెసైన్సులు, దుకాణాలు కేటాయిం చారు. మూడో విడతగా తిరుమలలోని సన్నిధి వీధి విస్తరణ పనుల్లో ఇళ్లు, లెసైన్సు దుకాణాలు కోల్పోయినవారికి పాపవినాశం తీర్థంలో మొ త్తం 78 దుకాణాలు కేటాయించారు. తాజాగా దుకాణాలు ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారు లు హెచ్చరించడంతో వారు శనివారం టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి, డీఆర్వో రాజేంద్రకుమార్‌కు విన్నవించి, తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. వివాదానికి దర్శన టి కెట్లే కారణమా? శ్రీవారి దర్శన టికెట్లే స్థల వివాదానికి కారణమ ని చర్చ జోరుగా సాగుతోంది. ఫారెస్ట్ విభాగానికి అవసరమైన శ్రీవారి దర్శన టికెట్లు ఇవ్వలేదనే వాదనా ఉంది. టీటీడీ అధికారులు తమ ఉన్నతాధికారులకు దర్శన సమయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫారెస్ట్ అధికారులు ఆవేదన చెందుతున్నారు. స్థల వివాదాన్ని తెరపైకి తీసుకొస్తే టీటీడీ ఉన్నతాధికారులు దారికొస్తారనే ఉద్దేశంతోనే పాత వివాదానికి మళ్లీ ప్రా ణం పోసినట్టు అటు టీటీడీ, ఇటు ఫారెస్ట్ విభాగాల్లో చర్చ సాగుతుండడం కొసమెరుపు.