రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులన్నీ ఆపేయండి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్‌జీటీ ఉత్తర్వులు
- అటవీ ప్రాంతంలో పనులు చేయడం లేదన్న ప్రభుత్వం
- అది అబద్ధమంటూ శాటిలైట్ ఫొటోలు చూపిన పిటిషనర్
- ఈ ప్రాజెక్టు గురించి కేసీఆర్ ప్రసంగం ఎన్‌జీటీకి సమర్పణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జరుగుతున్న పనులన్నింటినీ వెంటనే ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ, చెన్నై) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అన్ని అనుమతులు పొందేంత వరకు ఏ ఒక్క పని కూడా చేయరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎస్ నంబియార్, పీఎస్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రాజెక్టు జరుగుతున్న తీరు తెన్నులు.. ప్రభుత్వ ఉల్లంఘనలు తదితర విషయాలను నిగ్గు తేల్చేందుకు నిపుణులతో స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తును ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై స్పందన తెలియజేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాగునీటి ప్రాజెక్టు వాదనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అనుబంధ దరఖాస్తుతో పాటు ప్రధాన పిటిషన్‌ను ఆ రోజు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో ప్రభుత్వ వాదనకు మద్దతు తెలుపుతూ ప్రాజెక్టు పనులను ఆపవద్దని, ఈ కేసులో తమను ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలంటూ కొందరు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. అటవీ, పర్యావరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపించగా, పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్ వాదనలు వినిపించారు.
కేసీఆర్ ప్రసంగం కాపీల సమర్పణ
విచారణ ప్రారంభం కాగానే వాయిదా కోసం ఏఏజీ కోరగా, సంజయ్ ఉపాధ్యాయ్ దానిని వ్యతిరేకించారు. ఏమీ చేయడం లేదని ఒకవైపు చెబుతూ, మరోవైపు ప్రాజెక్టు పనులను కొనసాగిస్తూనే ఉన్నారని, దీనికి ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగమే సాక్ష్యమన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి ధర్మాసనం ముందుంచారు. కేసీఆర్ తన ప్రసంగంలో ఎన్‌జీటీని గేలిచేసేలా మాట్లాడారని వివరించారు. ఎన్‌జీటీ ఇచ్చిన స్టే ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి తీరుతామన్నారని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఈ సమయంలో రామచంద్రరావు స్పందిస్తూ.. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదని చెప్పారు. ఉపాధ్యాయ్ ఈ వాదనలతో విభేదించారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పనులతో పాటు ప్రాజెక్టు కొనసాగుతున్న ప్రాంతాలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు.
ఉత్తర్వులు ఆటంకం కాదు
‘‘రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులేవీ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరగటం లేదు. కావున ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులు పాలమూరు పనులకు ఆటంకం కాదు’’
– సీఈ లింగరాజు