దట్టమైన అడవి.. అర్ధరాత్రి పూట.. ఎలా ఉంటుంది? కన్ను పొడుచుకున్నాకానరానంతగా చిమ్మచీకటి కమ్ముకుని ఉంటుంది. కానీ ఈ అడవి మాత్రం వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. రకరకాల చెట్లు, భూమిపై పెరిగే పుట్టగొడుగులు.. అన్నీ ఆకుపచ్చ రంగు కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. ఆ పరిసరాలన్నీ కనిపిస్తుంటాయి. ఇలాంటి అడవి మరెక్కడో కాదు.. మన దేశంలోనే మహారాష్ట్రలో ఉన్న భీమశంకర్ రిజర్వు ఫారెస్టు. ఆ మెరుపులేమిటో, ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా..
పశ్చిమ కనుమల్లో..
పశ్చిమ కనుమల్లో భాగమైన దట్టమైన అరణ్యం, ఎన్నో రకాల వన్యప్రాణులకు నిలయం భీమశంకర్ రిజర్వు ఫారెస్టు. పుణే నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఈ అడవిలోని పలు ప్రాంతాల్లో రాత్రి అయిందంటే చాలు.. చెట్లు, మొక్కలు, పొదలు, విరిగిపడిపోయిన కొమ్మలు ఆకుపచ్చ రంగు కాంతిని వెదజల్లుతూ, మెరుస్తూ ఉంటాయి. కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా కాంతిని వెదజల్లగలిగే (బయో ల్యూమినిసెంట్) ఫంగస్ వ్యాపించి ఉండటమే దీనికి కారణం.
‘ఫెయిరీ ఫైర్’ పేరుతో..
భీమశంకర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కనిపించే ఈ ఆకుపచ్చని వెలుగును ‘ఫెయిరీ ఫైర్’,‘ఫాక్స్ ఫైర్’ వంటి పేర్లతోనూ పిలుస్తుంటారు. ఇక్కడ ఉండే ఒక రకమైన ఫంగస్ విడుదల చేసే లూసిఫరేస్ అనే ఎంజైమ్ చెట్ల కాండాలపై ఉండే నీటిని తాకినప్పుడు రసాయనిక చర్యలు జరిగి కాంతి వెలువడుతుంది. ఇలా కాంతిని వెదజల్లగలిగే ఫంగస్‌లు చాలా అరుదు. ఎంతగా అంటే.. సుమారు లక్ష రకాలకు పైగా ఫంగస్‌లు ఉండగా, అందులో కేవలం 70 మాత్రమే ఇలా కాంతిని వెదజల్లగలవు. ప్రపంచవ్యాప్తంగా ఇతర ఉష్ణమండల అరణ్యాల్లో కూడా ఇలా కాంతిని వెదజల్లే ప్రాంతాలు ఉన్నాయి.
►భీమశంకర్ అడవితోపాటు పశ్చిమ కనుమల వెంట ఉన్న అడవి అంతటా కూడా వెలుగులు విరజిమ్మే ‘మైసెనా క్లోరోఫోస్’ అనే పుట్టగొడుగులు పెరుగుతాయి.
►అయితే వానాకాలంలో,ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఈ బయో ల్యూమినిసెంట్ ఫంగస్ యాక్టివ్‌గా ఉండి అడవి వెలుగులు విరజిమ్ముతుందని.. సాధారణ సమయాల్లో కనిపించడం చాలా తక్కువ అని స్థానికులు చెబుతున్నారు.
పలు రకాల జీవుల్లో కూడా..
భూమిపై పలురకాల జీవులకు కూడా బయో ల్యూమినిసెంట్ సామర్థ్యం ఉంది. అందులో మిణుగురు పురుగులు మనకు తెలిసినవే. ఇక సముద్రాల్లో ఆల్గే, జెల్లీ ఫిష్‌లు, కొన్ని రకాల చేపలు, సముద్ర జీవులకు ఇలా కాంతిని వెదజల్లగలిగే సామర్థ్యం ఉంటుంది. ముఖ్యంగా సముద్రాల్లో లోతైన ప్రాంతాల్లో బతికే జీవులు.. అక్కడి పూర్తి చీకటి పరిస్థితుల కారణంగా ఇలాంటి సామర్థ్యాన్ని సంతరించుకుని ఉంటాయి.
కాంతి కోసం.. దారి తప్పకుండా..
►పూర్వకాలంలో స్కాండినేవియాతో పాటు పలు ఇతర ప్రాంతాల్లోని ఆదివాసీలు ఇలా వెలుగులు విరజిమ్మే చెట్ల కాండాలను తమ దారి వెంట పెట్టుకునేవారని.. అడవుల్లో లోపలికి వెళ్లినప్పుడు దారి తప్పకుండా వినియోగించుకునేవారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
►18వ శతాబ్దంలో అమెరికా శాస్త్రవేత్త తాను రూపొందించిన జలాంతర్గామిలో కాంతి కోసం ఇలాంటి ఫంగస్ ఉన్న కలపను ఉపయోగించేందుకు ప్రయత్నించారట.
Comments
Please login to add a commentAdd a comment