
ముంబై: మహారాష్ట్రలో అటవీ ప్రాంతంలో ధ్యానం చేసుకుంటున్న బౌద్ధ సన్యాసిని చిరుత పులి చంపేసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. రాజధాని ముంబైకి సుమారు 800 కి.మీ దూరంలో ఉన్న రామ్‌దేగి అడవిలో మంగళవారం రాహుల్ వాల్కే(35) అనే సన్యాసి ధ్యానం చేస్తుండగా చిరుత దాడిచేసి తీవ్రంగా గాయపర్చి అడవిలోనికి లాక్కెళ్లింది. ఆ సమయంలో ఆయనతోనే ఉన్న మరో ఇద్దరు సన్యాసులు తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాల్కే శరీరాన్ని అడవిలో చాలా దూరం లాక్కెళ్లి వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. వార్షిక ప్రార్థనల కోసం రామ్‌దేగికి వచ్చిన సన్యాసులు..అడవి లోనికి వెళ్లొద్దని ప్రజలు హెచ్చరించినా పట్టించుకోలేదని తెలిసింది.