
అదృష్టం ఎప్పుడు.. ఎవరిని వరిస్తుందో తెలియదు. నిన్న రోజున బీకరిని.. రేపటి రోజున కోటీశ్వరుడిని చేస్తుంది. ఇదే సమయంలో కోటిశ్వరుడిని.. బీకరిని సైతం చేయగలదు. అలాగని, అదృష్టం కోసం అక్కడే కూర్చుంటే.. అంతకన్నా బిగ్ మిస్టేక్ మరొకటి ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే.. ఓ రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న ఓ చెట్టుతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దీంతో, సోషల్ మీడియాలో ఆయన పేరు చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో పుసాద్ తాలూకా ఖుర్షి గ్రామంలో కేశవ్ షిండే అనే రైతు ఉన్నాడు. తన ఐదుగురు కొడుకులతో కలిసి తమకు ఉన్న ఏడు ఎకరాల భూమి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అనుకోని ఓ ఘటన వీరి జీవితాన్ని మలుపు తిప్పింది.
కాగా, కేశవ్ షిండే ఊరి మీదుగా వార్దా-నాందేడ్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైల్వే అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేశవ్ షిండే పొలాన్ని కూడా రైల్వే అధికారులు సేకరించారు. షిండే పొలంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని భావించిన రైల్వే శాఖ.. ఆయన పొలంలో ఎక్కువ భాగాన్ని సేకరించింది. ఈ క్రమంలో షిండే తెలియని కొత్త అంశం బయటకు వచ్చింది.
కేశవ్ షిండే పొలంలో ఎర్రచందనం చెట్టు ఉన్న సంగతి అనుకోని విధంగా బయటపడింది. కేశవ్ షిండే పొలంలో మామిడి తోటలు, ఇతర పంటలు ఉండేవి. నిజానికి ఆ చెట్టు వారి పొలంలో ఏళ్ల తరబడిగా ఉన్నా.. వారికి ఆ విషయం తెలియలేదు. రైల్వే లైన్ కోసం భూసేకరణ జరుగుతున్నప్పుడు.. కొంతమంది రైల్వే ఉద్యోగులు సర్వే కోసం కేశవ్ షిండే ఊరికి వచ్చారు. వారిలో ఒక ఉద్యోగి.. ఈ విషయాన్ని గుర్తించి కేశవ్ షిండే కుటుంబానికి చెప్పారు. దీంతో షిండే ఫ్యామిలీ ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేసింది.
పొలంలో రైల్వే లైన్ వెళ్తుండటంతో కేశవ్ షిండే పొలానికి రైల్వే శాఖ పరిహారం అందించింది. అయితే తమ పొలంతో పాటుగా అందులో ఉన్న ఎర్రచందనం చెట్టు, పంటకు కూడా పరిహారం చెల్లించాలని కేశవ్ షిండే, ఆయన కొడుకులు డిమాండ్ చేశారు. ఎర్రచందనం చెట్టు విలువ లెక్కగట్టాలని అటవీ శాఖకు లేఖ రాశారు. కానీ, అధికారులు ఎర్రచందనం చెట్టుకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో కేశవ్ షిండే కుటుంబం.. జిల్లా కలెక్టర్, అటవీ, రైల్వే, నీటి పారుదల శాఖల అధికారులను ఆశ్రయించారు. అయినప్పటికీ, ఎలాంటి పరిహారం అందకపోవటంతో 2024 అక్టోబర్ 7న హైకోర్టులో పిటిషన్ వేశారు.
షిండే పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం చెట్టు పరిహారం కోసం కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని రైల్వే శాఖను బాంబే హైకోర్టు ఆదేశించింది. కోటి రూపాయలను నాగ్‌పూర్ బెంచ్‌లో డిపాజిట్ చేయాలని.. ఇందులో నుంచి రూ.50 లక్షలు కేశవ్ షిండే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 9న బాంబే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేయగా.. రైల్వే శాఖ కోటి రూపాయలు డిపాజిట్ చేసింది. దీంతో, ఈ కేసులో కేవలం ఏడాదిలోనే కేశవ్ షిండే కుటుంబం విజయం సాధించింది. కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు వయసు 100 ఏళ్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు విలువ దాదాపు రూ.5 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.