ఆ రాష్ట్రంలో రుణమాఫీ చేసిన విధానంపై తెలంగాణ ఉన్నతాధికారుల అధ్యయనం
రెండు రోజులు పర్యటించి వచ్చిన వ్యవసాయ, ఆర్థిక శాఖల బృందం
మహారాష్ట్రలో ఒకేసారి రూ.20 వేల కోట్లు మాఫీ చేసినట్టు బృందం వెల్లడి
బ్యాంకులకు కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ
గతంలో రాజస్తాన్‌లోనూ ఒకేసారి విజయవంతంగా రుణమాఫీ అమలు
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విధంగా తెలంగాణలోనూ రైతులకు పంటల రుణమాఫీ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. మహారాష్ట్రలో గతంలో ఒకేసారి రూ.20 వేల కోట్లు మాఫీ చేశారు. సహకార శాఖను నోడల్ ఏజెన్సీగా పెట్టి.. రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాల మాఫీని అమలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఇటీవల మహారాష్ట్రలో రెండు రోజులు పర్యటించి అధ్యయనం చేశారు. ఒకేసారి రూ.20 వేల కోట్లు ఎలా సమకూర్చారన్న దానిపైనా ఆరా తీశారు. రాజస్తాన్‌లోనూ ఇదే పద్ధతిలో రుణమాఫీ చేశారని తెలుసుకున్నారు. ఆ వివరాలతో తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిసింది.
అసలు వడ్డీతో కలిపి మాఫీ..
మహారాష్ట్రలో పర్యటించి వచ్చిన అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఆ రాష్ట్రంలో దాదాపు 1.53 కోట్ల మంది రైతులు ఉన్నారు. వారిలో చాలా మంది జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. అయితే 2015 నుంచి 2019 వరకు కరువు పరిస్థితులతో రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో అప్పటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31వ తేదీ మధ్య రైతులు తీసుకున్న పంట రుణాల్లో రూ.2 లక్షల వరకు ఉన్నవాటిని మాఫీ చేసింది. ఇందుకోసం పెద్దగా షరతులేవీ పెట్టలేదు.
రైతుకు ఎక్కువ భూమి ఉందా, తక్కువ ఉందా అన్న కొర్రీ ఏదీ పెట్టలేదు. నిర్ణీత గడువులో రుణం అసలుతోపాటు వడ్డీ మొత్తాన్ని కూడా మాఫీ చేశారు. రూ.2 లక్షల కంటే ఎక్కువగా పంట రుణాలు తీసుకున్న రైతులకు.. ఆ పరిమితి వరకే మాఫీ చేశారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణఖాతాలకు సంబంధించి ప్రత్యేకంగా బ్యాంకుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఆధార్‌తో లింక్ చేయని రుణ ఖాతాదారులను గుర్తించి లింక్ చేయించారు. రైతుల సమాచారాన్ని పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామస్థాయి పాలనా యంత్రాంగం రుణమాఫీ బాధ్యతను స్వీకరించింది.
కటాఫ్ తేదీనే కీలకం..
తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక దానిపై కొంత కసరత్తు జరిగింది. వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో కసరత్తు చేపట్టిన అధికారులు.. మహారాష్ట్రలో అధ్యయనం చేశారు. తెలంగాణలో రైతుల రుణ బకాయిలు రూ.30 వేల కోట్లు ఉంటే.. వడ్డీతో కలిపి దాదాపు రూ. 35 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు. కటాఫ్ తేదీని బట్టి ఈ మొత్తం మారొచ్చని అధికారులు అంటున్నారు.
అయితే బంగారం కుదువబెట్టి తీసుకున్న పంట రుణాలకు కూడా మాఫీ వర్తింపచేయాలా, వద్దా అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు సంపన్నులకూ రైతుబంధు ఇచ్చి దుర్వినియోగం చేశారంటూ విమర్శలున్న నేపథ్యంలో.. రుణమాఫీని కూడా సమగ్రంగా పరిశీలించాకే ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు ప్రచారం అవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినతేదీ డిసెంబర్ 9ని పంట రుణమాఫీకి కటాఫ్ తేదీగా ప్రకటించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7వ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment