
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో వాడీవేడి చర్చ
100% రుణమాఫీ జరిగితే రాజీనామా చేస్తానన్న పల్లా
హామీల అమలుపై బీఆర్‌ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరించారు: భట్టి
బీఆర్‌ఎస్‌పై మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ఫైర్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో హామీల అమలుతోపాటు పాలనలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దాడి చేయగా.. ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ప్రతిదాడి చేశారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరుస ఆరోపణలు చేస్తుండగా మంత్రులు పదేపదే కల్పించుకుని సమాధానాలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీల అమలుపై బీఆర్‌ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. పల్లా సొంత నియోజకవర్గం జనగామలో 2018లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.124 కోట్ల రుణమాఫీ చేస్తే.. తాము మూడు నెలల్లోనే రూ.263 కోట్లు మాఫీ చేశామన్నారు.
మా సీఎం కూడా మీ సీఎంలాగే ఉండాలా?: భట్టి
సీఎం రేవంత్‌రెడ్డి వద్దే విద్యా శాఖ ఉండడంతో పర్యవేక్షణ కొరవడిందని, 2 లక్షలమంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యా రని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేయగా, భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఖండించారు. మీ సీఎం (కేసీఆర్) తరహాలోనే మా సీఎం ఉండాలని ఊహించుకుంటే ఎలా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎస్సీతో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేశారని, 22వేల మంది టీచర్లకు పదోన్నతులు ఇచ్చారని, 36 వేల మంది టీచర్లకు బదిలీలు కల్పించారన్నారు.
గత ప్రభుత్వం వర్సిటీలను గాలికి వదిలేస్తే, 12 మంది వీసీలను నియమించారన్నారు. మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతోపాటు నిర్మాణానికి రేవంత్ రూ.540 కోట్లు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. గత ప్రభుత్వం మీకు (పల్లాకు), ఇతరులకు ప్రైవేటు వర్సిటీలను ధారాదత్తం చేస్తే వాటికి దీటుగా తాము ప్రభుత్వ వర్సిటీలను తీర్చిదిద్దుతున్నామన్నారు.
బీఆర్‌ఎస్ ధోరణితోనే అన్యాయం: మంత్రి ఉత్తమ్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ధోరణితోనే రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో తీరని నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల సామర్థ్యం పెంపు విషయంలో ఏపీకి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకరించిందన్నారు. తాము కేంద్రం, కృష్ణా బోర్డుతో కొట్లాడి సాగర్ కుడి కాల్వకు ఏపీ తీసుకుంటున్న జలాలను 10వేల నుంచి 5వేల క్యూసెక్కులకు తగ్గించామన్నారు.
మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు నిర్వహించని బీఆర్‌ఎస్ వాళ్లు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రుణమాఫీ చేశామని, రైతులందరికీ బోనస్ చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళా జర్నలిస్టు ‘ఎక్స్’లో పెట్టిన వీడియోలోని భాషను చూసి కూడా ఆమెను సమరి్థస్తారా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

100% రుణమాఫీ జరిగితే ముక్కును నేలకు రాస్తా: పల్లా
రైతు రుణమాఫీ 50 శాతంలోపే జరిగిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జనగామతోపాటు భట్టి నియోజకవర్గం మధిరలోని ఏ ఒక్క గ్రామంలోనైనా 100శాతం రుణమాఫీ జరిగితే తాను ముక్కును నేలకు రాసి, రాజీనామా చేస్తానని ప్రకటించారు. 27 శాతం మంది రైతులకే బోనస్ లభించిందని, ఏడాదిలో 564 మంది రైతులు, 116 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, గురుకులాల్లో 83 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు.
కరెంట్ కోతలపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టారని, అరెస్టైన జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ని విడుదల చేయాలన్నా రు. కాకతీయ కళాతోరణం, చారి్మనార్‌ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తే పోరాడతామన్నారు. తెలంగాణ తల్లి సాధారణంగా ఉండాలని, నగలు, వడ్డాణం ఉండకూడదని చెప్పేటోళ్లు రూ.కోట్ల వాచీలు, వారి కుటుంబ సభ్యులు ఖరీదైన నగలు ధరిస్తున్నారన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 55వేల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment