కాంగ్రెస్ బీఫామ్‌పై గెలిచిన వారికే పదవులు
ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
వచ్చే నెల తొలివారంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం
రుణమాఫీ మా తొలి ప్రాధాన్యత.. మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు
హైదరాబాద్ పాతబస్తీ విద్యుత్ నిర్వహణ అదానీ సంస్థకు అప్పగిస్తాం
రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పులున్నాయి.. వడ్డీలు తగ్గించుకునే పనిలో ఉన్నాం
కొత్త బీసీ కమిషన్ నియామకం తర్వాతే కులగణన చేపడతామని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వస్తున్న వారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చాన్స్‌గానీ, నామినేటెడ్ పదవులుగానీ ఇచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో, పీసీసీ, నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకే పదవులు దక్కుతాయి. కొత్తగా వచి్చ చేరిన నేతలకు పదవులు ఉండవు. కేవలం కాంగ్రెస్ నుంచి బీఫామ్‌లు తీసుకుని గెలిచిన వారికి, కాంగ్రెస్‌లో ఉన్న వారికే పదవులు వస్తాయి..’’ అని చెప్పారు. పార్టీ అనుబంధ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. రేవంత్ గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు.
వచ్చే నెల తొలివారంలో నియామకాలు
కేబినెట్ విస్తరణ, పీసీసీ పదవుల విషయంలో అధిష్టానంతో చర్చ జరిగిందని.. అయితే ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై ఏ నిర్ణయం జరగలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎప్పడూ ఉంటుందని.. పదవులు పొందేవారిలో మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఎవరైనా ఉండవచ్చని చెప్పారు. జూలై మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణతోపాటు పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తవుతాయని వెల్లడించారు.
రుణమాఫీకే మొదటి ప్రాధాన్యత
తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత రైతు రుణమాఫీ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాను అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తామన్నారు. ఒక కుటుంబానికి రూ.2లక్షల వరకు మాత్రమే పంట రుణమాఫీ ఉంటుందని.. కుటుంబాలను గుర్తించడానికి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని వివరించారు. కుటుంబంలోని వారు మూడు, నాలుగు లోన్లు తీసుకుని ఉన్నా.. అందరికీ కలిపి గరిష్టంగా రూ.2లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో డబ్బున్నవారికి, ఫామ్‌హౌజ్‌లకు కూడా పథకాల సొమ్ము ఇచ్చారని.. నిజమైన లబి్ధదారులకు పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో తప్పు జరగవద్దనే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు.
రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు
రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులే రూ.7లక్షల కోట్ల మేర ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇతరత్రా మరో లక్ష కోట్లు అప్పులు ఉంటాయని చెప్పారు. ప్రతి నెలా రూ.7వేల కోట్లు అప్పులు కడుతున్నామన్నారు. కొత్త లోన్ల కోసం ప్రయతి్నస్తూ, వడ్డీలు తగ్గించుకునేందుకు ప్రయతి్నస్తున్నామని వివరించారు. ఆగస్టు చివరి నాటికి బీసీ కమిషన్ కాల పరిమితి పూర్తవుతుందని.. కొత్త కమిషన్ నియామకం తర్వాతే రాష్ట్రంలో కులగణన చేపడతామని రేవంత్ తెలిపారు.
ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ 80శాతానికి పెరిగిందని రేవంత్ చెప్పారు. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు.
జిల్లాలపై కమిషన్ వేసి నిర్ణయం
రాష్ట్రంలో జిల్లాలను కుదిస్తామనిగానీ, పెంచుతామనిగానీ తాము చెప్పలేదని రేవంత్ తెలిపారు. నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు ఎలా కమిషన్ వేస్తారో.. అలా జిల్లాలపై ఒక కమిషన్ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని విమర్శించారు.
పాతబస్తీలో విద్యుత్ నిర్వహణ అదానీ సంస్థకు..
హైదరాబాద్ పాతబస్తీలో సరఫరా చేసిన విద్యుత్‌లో కేవలం 60శాతమే బిల్లులు వస్తున్నాయని రేవంత్ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద పాతబస్తీ విద్యుత్ నిర్వహణ బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రధాని మోదీలా తాము ప్రభుత్వ రంగ సంస్థలను పల్లీబటానీల్లా ప్రైవేటుకు బదలాయించబోమని చెప్పారు. అదానీ వ్యాపారమేదీ చేయవద్దని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పుడు తాము హైదరాబాద్‌లో అదానీ సంస్థకు ఆస్తులు రాసివ్వడం లేదని.. వారితో పెట్టుబడి మాత్రమే పెట్టిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఏది లాభమైతే అదే చేస్తామని.. గదుల్లో కూర్చుని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment