కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజాతీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ విమర్శించడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు.. బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్లు మాట్లాడటం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందని విమర్శించారు.
శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్‌కే అత్యధిక ఓట్లు, సీట్లతో మరోసారి పట్టం కట్టారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని.. మరాఠీలకు అన్యాయం జరుగుతుందని లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసి విపక్షాలు కొంత లబ్ధి పొందాయని.. కానీ 5 నెలల్లోనే ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమై బీజేపీ కూటమికి భారీ విజయం అందించారని కిషన్‌రెడ్డి చెప్పారు.
మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయినప్పుడు జరిగిన ఎన్నికల తర్వాత మహాయుతి కూటమికి ఇంత పెద్ద విజయం లభించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలలో కలిపితే కాంగ్రెస్ 30 సీట్లు కూడా దాటలేదంటే ఆ పార్టీ ఎంతటి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందో స్పష్టమవుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment