రైతుల ఖాతాల్లో జమ
సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
త్వరలో అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు
మారీచుల తరహాలో మారువేషంలో వచ్చే బీఆర్‌ఎస్, బీజేపీ వాళ్లను నమ్మొద్దు
రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని చెప్పారు. రైతు భరోసా విధివిధానాల పై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు.
రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించామని, రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని అన్నారు. మారీచుల తరహాలో మారువేషంలో వచ్చి అబద్ధాలు చెప్పే బీఆర్‌ఎస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దని రైతులను కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు.
మరో నాలుగేళ్లకు అవసరమైన శక్తి లభించింది
‘2023 వానాకాలం రైతుబంధును నాటి సీఎం కేసీఆర్ ఎగ్గొట్టారు. మేము అధికారంలోకి రాగానే రూ.7,625 కోట్లు రైతుబంధు కింద చెల్లించాం. శనివారం పాలమూరులో జరిగిన రైతు పండుగలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చి మా ఏడాది పాలన బాగుందంటూ ఆశీర్వదించారు. తద్వారా మిగిలిన నాలుగేళ్లు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన ఇంధనశక్తి మాకు లభించింది.
తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న కేంద్రంలోని నాటి యూపీఏ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ.69 వేల కోట్ల అప్పులతో ఇచ్చింది. పదేళ్ల కేసీఆర్ పాలన అనంతరం 2023 డిసెంబర్ 7న రూ.7 లక్షల కోట్ల అప్పులతో మా ప్రభుత్వం ఏర్పడింది. అసలు, వడ్డీలు కలిపి ప్రతినెలా రూ.6,500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితిలో మేం అధికారం చేపట్టాం.
రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పులు కలిగి ఉన్నట్టు నాటి సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లు ఎన్నడూ ప్రజలకు చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చాక డిసెంబర్ 9న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను వివరించాం..’ అని సీఎం చెప్పారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ
రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు..
‘రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీల ను అమలు చేస్తున్నాం. రైతును రాజు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణమాఫీని 100 శాతం పూర్తి చేశాం.
బ్యాంకర్లు మాకు ఇచ్చిన రూ.2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేశాం. ఏదైనా కారణాలతో బ్యాంకర్ల నుంచి వివరాలు అందక ఎవరిదైనా రుణమాఫీ జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిశీలించి రుణమాఫీ చేస్తాం. రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు. పంట పొలాలను తనఖా పెట్టి వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సైతం బ్యాంకర్లు పంట రుణాలుగా చూపించడంతోనే గతంలో రూ.31 వేల కోట్ల పంట రుణాలున్నట్టు చెప్పాం.
తప్పుడు సమాచారమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించడంతో బ్యాంకులు వివరాలను సరిచేసి ఇచ్చాయి. మేము అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు సంబంధించిన రూ.17,869 కోట్ల రుణాలు మాఫీ చేశాం. నాలుగో విడతగా శనివారం మహబూబ్‌నగర్ సభలో రూ.2,747 కోట్ల రుణాలు మాఫీ చేశాం. మొత్తం 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616 కోట్ల రుణమాఫీ పూర్తైంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఇది గొప్ప రికార్డు..’ అని రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్ర ధాన్యమే పేదలకు ఇస్తాం..
‘సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లింపు యాసంగి పంటకు సైతం కొనసాగిస్తాం. ఇప్పటివరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇక్కడ పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతాం. ప్రభుత్వ కార్యక్రమాలను మీడియా మరింతగా రైతులకు చేరవేయాలి.
బీఆర్‌ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలనలో సైతం తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. గుజరాత్‌లో మధ్య నిషేధం ఉందని బీజేపీ అంటోంది. కావాలంటే ఇక్కడి నుంచి గుజరాత్‌కు మీడియాను తీసుకెళ్లి ఏయే బ్రాండ్‌లు దొరుకుతున్నాయో చూపిస్తా. కేంద్రంలో మోదీ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో మేమిచ్చిన హామీలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం..’ అని సీఎం చెప్పారు.
విలేకరుల సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మందుల సామ్యేల్, దానం నాగేందర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, శ్రీగణేష్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రుణమాఫీ రూ.3,331 కోట్లే..
‘రెండు పర్యాయాల బీఆర్‌ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఏక మొత్తంగా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు. రెండో పర్యాయంలో అధికారంలోకి వచ్చాక తొలి నాలుగున్నరేళ్లు రుణమాఫీని పట్టించుకోలేదు.
ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి వచ్చిన రూ.11 వేల కోట్లతో రుణమాఫీ చేశారు. ఆ నాలుగున్నరేళ్ల కాలానికి రైతులు వడ్డీల కింద రూ.8,578.97 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. వడ్డీలు పోగా రెండో పర్యాయంలో బీఆర్‌ఎస్ సర్కారు చేసిన వాస్తవ రుణమాఫీ రూ.3,331 కోట్లు మాత్రమే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment