కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి
నేడు లక్షలోపు.. నెలాఖరులోపు లక్షన్నర వరకు... ఆగస్టులో రూ.2 లక్షల వరకు మాఫీ అమలు
ఈ విషయం ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సీఎం
ప్రతి పోలింగ్ బూత్, ఓటర్ వద్దకు వెళ్లాలన్న డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ దేశానికి రోల్‌మోడల్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. వ్యవసాయ విధానంలో రాష్ట్రం మోడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలని అన్నారు. ప్రతి రైతుకు రుణ విముక్తి కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు.
‘గురువారం సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నాం. రూ.7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు మాఫీ చేస్తాం. ఆగస్టులో రూ.2 లక్షల వరకు మాఫీ చేసి ప్రక్రియను పూర్తి చేస్తాం..’అని స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మాట ఇస్తే చేస్తామన్న నమ్మకం కలిగించాలి
‘నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్‌గాంధీ మాట ఇచ్చారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పాం. అయితే ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కానీ ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. పార్టీకి నష్టమని తెలిసి కూడా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. రాహుల్‌గాంధీ కూడా మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రూ.28 వేల కోట్ల రుణాలు కూడా మాఫీ చేయలేకపోయారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే రూ.31 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి..’అని ముఖ్యమంత్రి చెప్పారు.
హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలి
‘కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదు. ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించి హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలి. తెలంగాణలో రైతు రుణమాఫీపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. రాహుల్ ఇచ్చిన హామీని అమలు చేశామన్న విషయాన్ని పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించాలి. ఎక్కడికక్కడ పండుగ వాతావరణంలో రుణమాఫీ సంబురాలు చేయాలి..’అని రేవంత్ పిలుపునిచ్చారు.
నిద్రలేని రాత్రులు గడిపాం: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రూపాయి రూపాయి పోగు చేసి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నామని, ఇందుకోసం నిద్ర లేని రాత్రులు గడిపామని చెప్పా రు. ఎవరినీ వదలకుండా అందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులందరూ తల ఎత్తుకుని ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయాలని, ప్రతి పోలింగ్ బూత్, ఓటర్ వద్దకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
రూ.7 లక్షల కోట్ల అప్పులతో అధికారాన్ని చేపట్టినా, నెలల వ్యవధిలోనే రూ.2 లక్షల రుణమాఫీని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో తగిన ప్రచారం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని చెప్పి రైతులు, ప్రజల హృదయాలను గెలవా లని పిలుపునిచ్చారు. సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షు లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, పలు కార్పొరేషన్ల చైర్మ న్లు, కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.
సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోతున్నాం: సీఎం
సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గత ఏడు నెలల కాలంలో రూ.30 వేల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేసినా 3 పైసల ప్రచారం కూడా చేసుకోలేకపోయామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘చారానా కోడికి బారానా మసాలా’అన్నట్టు మోదీ, కేసీఆర్‌లు ఏమీ చేయకపోయినా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ మనం అలా చేసుకోలేకపోతున్నాం.
ఈ విషయంలో నాతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులందరూ విఫలమైనట్టే. ఇప్పటికైనా జిల్లా ఇన్‌చార్జి మంత్రులు వారానికో రోజైనా తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలి. స్థానిక నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. తామున్నామనే ధీమా కల్పించాలి. ముఖ్యమైన నేతలను కలెక్టర్లు, ఎస్పీలకు పరిచయం చేయాలి.
18,19, 20, 21 తేదీల్లో సంబురాలు
రైతు రుణమాఫీపై 18,19 తేదీల్లో మండల కేంద్రాల్లో, 20, 21 తేదీల్లో గ్రామాల్లో సంబురాలు చేయాలి. అంబేడ్కర్ చౌరస్తాల నుంచి రైతు వేదికల వరకు మోటార్‌సైకిల్, ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించాలి. గతంలో మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా రూ.71 వేల కోట్లు రైతు రుణమాఫీ చేస్తే ఇప్పుడు తెలంగాణలో రూ.31 వేల కోట్లు చేస్తున్నాం. తెలంగాణ మోడల్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఆ బాధ్యతను ఎంపీలు తీసుకోవాలి.’అని సీఎం చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment