
25 ఎకరాలు ఏటేటా రూ.25 లక్షలు!
వెదురు.. గ్రీన్ గోల్డ్.. అవును! ఈ విషయంలో మీకేమైనా సందేహం ఉందా? అయితే.. శివాజీ రాజ్‌పుట్ అనే అద్భుత ఆదర్శ వెదురు రైతు విశేష కృషి గురించి తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన శివాజీ 25 ఎకరాల్లో వెదురును చాలా ఏళ్ల నుంచి సాగు చేస్తూ ప్రతి ఏటా రూ. 25 లక్షలను సునాయాసంగా ఆర్జిస్తున్నారు. తనకున్న 50 ఎకరాల పొలంలో పాతిక ఎకరాల్లో 16 రకాల వెదురు తోటను పెంచుతున్నారు. మిగతా 25 ఎకరాలను ఇతర రైతులకు కౌలుకు ఇచ్చారు.
వెదురు సాగులో కొద్దిపాటి యాజమాన్య చర్యలు తప్ప చీకూ చింతల్లేవు, పెద్దగా కష్టపడాల్సిందేమీ ఉండదు. ఏటేటా నిక్కచ్చిగా ఆదాయం తీసుకోవటమే అంటున్నారు శివాజీ. వెదరు సాగు ద్వారా పర్యావరణానికి బోలెడంత మేలు చేస్తున్న ఈ ఆదర్శ రైతు ఉద్యమ స్ఫూర్తితో బంజరు, ప్రభుత్వ భూముల్లో విరివిగా మొక్కలు నాటటం ద్వారా పర్యావరణానికి మరెంతో మేలు చేస్తున్నారు. ఆయన నాటిన 7 లక్షల చెట్లు ఆయన హరిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఆయనకు 30కి పైగా పర్యావరణ పరిరక్షణ పురస్కారాల పంట పండించాయి!
ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, యుఎస్‌ఎ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వంటి పురస్కారాలు ఆయనకు లభించాయి. పెద్ద కమతాల్లో వెదురు సేద్యానికి సంబంధించి శివాజీ రాజ్‌పుట్ అనుభవాలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
శివాజీ రాజ్‌పుట్ వయసు 60 ఏళ్లు. వినూత్న రీతిలో వెదరును సాగు చేయటం ద్వారా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయటం ద్వారా ఆయన తన జీవితాన్ని ఆకుపచ్చగా మార్చుకోవటమే కాదు ఇతరుల జీవితాలను కూడా ఆకుపచ్చగా మార్చుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాతికేళ్లుగా విశేష కృషి చేస్తున్న శివాజీ గత ఆరేళ్లుగా వెదురు తోటను సాగు చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొనేలా వ్యవసాయాన్ని కొనసాగించటంలో, పర్యావరణ పరిరక్షణ కృషిలో, గ్రామీణాభివృద్ధి రంగంలో మహారాష్ట్రలో ఇప్పుడాయన ఒక మేరు పర్వతం అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేస్తున్న కృషి భూతాపోన్నతిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతోంది.
వెదురు సాగుకు శ్రీకారం..
రాజ్‌పుట్ గతంలో అందరు రైతుల మాదిరిగానే ఒకటో రెండో సీజనల్ పంటలను రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పండించే వారు. అయితే, భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపరీత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడేవారు. ‘భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపత్తులు వచ్చిపడినప్పుడు సాధారణ పంటలు సాగు చేస్తున్నప్పుడు ఒక్కోసారి పంట పూర్తిగా చేజారిపోయేది. కానీ, వెదురు తోట అలాకాదు. నాటిన ఒక సంవత్సరం తర్వాత నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏటేటా నిరంతరం పెట్టుబడుల అవసరమే ఉండదు..’అంటారు శివాజీ.
సాధారణ పంటల సాగును చుట్టుముట్టిన అనిశ్చితే తనను నిశ్చింతనిచ్చే వెదరు సాగువైపు ఆకర్షించిందంటారాయన. ఆయనకు 50 ఎకరాల భూమి ఉంది. 25 ఎకరాలను కౌలుకు ఇచ్చి, 25 ఎకరాల్లో వెదురు నాటారు. ఈ నిర్ణయమే తన వ్యవసాయాన్ని మేలి మలుపు తిప్పింది. ‘వెదురు సాగులో విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిందేమీ ఉండదు.
వెదురు మొక్కలు వేరూనుకొనే వరకు మొదటి ఏడాది కొంచె జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత పెద్ద పని గానీ, పెట్టుబడి గానీ అవసరం ఉండదు. మొదటి ఏడాది తర్వాత నేను పెద్దగా పెట్టిన ఖర్చేమీ లుదు. కానీ, ఏటా ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. వెదురు తోట ద్వారా నాకు ఏటేటా రూ. 25 లక్షల ఆదాయం వస్తోంది..’ అంటారు శివాజీ గర్వంగా!
వెదురు: ఆకుపచ్చని బంగారం
వెదరుకు ఆకుపచ్చని బంగారం అని పేరు. ఈ తోట సాగులో అంత ఆదాయం ఉంది కాబట్టే ఆ పేరొచ్చింది. ‘ఈ భూగోళం మీద అతి త్వరగా పెరిగే చెట్టు వెదురు! పర్యావరణానికి ఇది చేసే మేలు మరేఇతర చెట్టూ చెయ్యలేదు. ఇది 24 గంటల్లో 47.6 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఇతర చెట్ల కన్నా 35% ఎక్కువ కార్బన్ డయాక్సయిడ్‌ను పీల్చుకొని 30% అదనంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. భూతాపోన్నతిని ఎదుర్కొనే కృషిలో ఇందుకే వెదురు అతికీలకంగా మారింది’ అని వివరించారు శివాజీ.
బహుళ ప్రయోజనకారి కావటం అనే మరో కారణం వల్ల కూడా వెదురు సాగు విస్తృతంగా వ్యాపిస్తోంది. రాజ్‌పుట్ తన తోటలో 19 రకాల వెదురును సాగు చేస్తున్నారు. ఒక్కో రకం వెదురు ఒక్కో పనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అగరొత్తుల ఉత్పత్తి ఉపయోగపడేది ఒకటైతే, బొగ్గు తయారీకి మరొకటి, బయోమాస్ ఇంధనం ఉత్పత్తికి మరొకటి.. ఇలా ఒక్కో రకం ఒక్కో పనికి ఎక్కువగా పనికొస్తాయి. ‘వెదురు బొంగులు, ఆకులు పెల్లెట్లు తయారు చేస్తారు.
పౌడర్లు బయోమాస్ ఇంధన ఉత్పత్తికి వాడుతారు. ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి. సాధారణ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడదగినవి అంటారు శివాజీ. వెదురును సాగు చేయటం దగ్గరే ఆయన ఆగిపోవటం లేదు. వెదురు బొంగులతో ఫర్నీచర్‌ను, అగరొత్తులను కూడా తానే తయారు చేయాలన్నది ఆయన సంకల్పం.
సుస్థిర జీవనోపాధిని అందించగలిగిన వెదురు సాగు ప్రయోజనాల గురించి ఆయన ఇతర రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. ‘136 రకాల వెదురు వంగడాలు ఉన్నాయి. వాటిల్లో 19 రకాలను నేను సాగు చేస్తున్నా. ప్రతి రకానికి ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వెదురు బొంగుల బలం, బరువు ఆధారపడి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి ఏ రకాలు కావాలో ఎంపిక చేసుకొని నాటుకోవటం ఉత్తమం’ అనేది ఆయన సూచన.
ఆచరణాత్మకంగా ఉండే ఆయన సూచనలు ఇతర రైతులను అనుసరించేలా చేస్తున్నాయి. మహరాష్ట్ర ప్రభుత్వం నుంచ వనశ్రీ పురస్కారంతో పాటు ఇందిరా ప్రియదర్శిన వృక్షమిత్ర అవార్డు వంటి మొత్తం 30 వరకు అవార్డులు ఆయనను వరించాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటినిపొదుపుగా వాడుకోవటం వీలుకావటంతో పాటు వెదురు మొక్కలు ఏపుగా పెరగానికి కూడా ఇది ఉపయోగపడిందంటారాయన.
వనశ్రీ ఆక్సిజన్ పార్కు
వనశ్రీ ఆక్సిజన్ పార్క్‌ను రాజ్‌పుట్ మూడేళ్ల క్రితం నిర్మించారు. చనిపోయిన తమ ప్రియతముల గౌరవార్థం ఇటువంటి వనశ్రీ ఆక్సిజన్ పార్కులు ్రపారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘నా ప్రియతముల పుట్టిన రోజున మొక్కలు నాటుతున్నా. ఇతరులను కూడా ఇదే కోరుతున్నా’ అన్నారాయన. వెదురు సాగు భవిష్యత్తు తరాల బాగు కోసం, బంగారు భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు పెట్టే తెలివైన పెట్టుబడే అంటారాయన.
ఇతర రైతులకు ప్రేరణ
రాజ్‌పుట్ వెదురు తోట విజయగాథతో ప్రేరణ పొందిన రైతులు పలువురు ఆయనను అనుసరిస్తున్నారు. ధులే జిల్లాలోని షిర్పూర్ తాలూకాలో ఆయన సూచనల ప్రకారం 250 ఎకరాలకు వెదురు తోటలు విస్తరించాయి. పేపరు ఉత్పత్తికి వెదురు ఉపయోగపడుతుంది. స్థానికులకు, గ్రామీణ జనసముదాయాలకు వెదరు సాగు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదంటారాయన. భూమిని పర్యావరణానికి అనుగుణంగా వినియోగించడాన్ని ్రపోత్సహించదలిస్తే వెదురును విస్తృతంగా సాగు చేయించాలని సూచిస్తున్న రాజ్‌పుట్ వెదురు భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉంటుందన్నారు. ఆయన 7 లక్షలకు పైగా ఇతరత్రా మొక్కలు నాటించటం వల్ల ఆ ప్రాంతంలో జీవవైవిధ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పూర్వస్థితికి పెరిగింది. వర్షానికి మట్టి కొట్టుకుపోవటం తగ్గింది. వన్య్రపాణులకు ఆవాసాలు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment