railway line
-
భూములిచ్చేందుకు వ్యతిరేకం... సమీకరణకైతే సిద్ధం
తాడికొండ: అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నంబూరు–ఎర్రుపాలెం రైల్వేలైన్‌కు భూములిచ్చేందుకు తామంతా వ్యతిరేకమని, సమీకరణకైతే సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. తాడికొండలో ఆదివారం గ్రామసభ నిర్వహించి ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. సర్పంచ్ తోకల సరోజినీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైల్వేలైన్ పేరుతో తాము సాగుచేసుకుంటున్న భూములను తీసుకుంటే ఒప్పుకోమన్నారు. తమకు జీవనాధారమైన భూములను కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం స్పందించి అమరావతికి సంబంధించిన ఏ ప్రాజెక్టు చేపట్టినా భూ సేకరణ ద్వారా కాకుండా భూ సమీకరణ ద్వారా తీసుకొని రాజధాని రైతులకు వర్తింపజేసిన ప్రయోజనాలే తమకూ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లామని, వారు సానుకూలంగా స్పందించలేదని, భూములు కోల్పోతున్న రైతులంతా గ్రామసభ ఏర్పాటు చేసి మాకుమ్మడి తీర్మానంతో పాటు వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకిస్తున్నట్లు అంగీకార పత్రాలను సంతకాలు చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో అంతా కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మాణం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమరావతి రైల్వేలైన్‌కు కేంద్రం ఆమోదం..
-
అమరావతి రైల్వేలైన్‌కు కేంద్రం ఆమోదం
సాక్షి, ఢిల్లీ: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కృష్ణానదిపై 3.2 కిమీ మేర రైల్వే వంతెన నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రూ. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరగనుంది. రాజధాని అమరావతికి హైదరాబాద్, చైన్నె, కోల్‌కోత్తాకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేయనున్నారు.ఐదేళ్లలో రైల్వే లైన్ పూర్తిచేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రెండు నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 6798 కోట్ల రూపాయలతో రైల్వే లైన్ల నిర్మాణం చేయనుంది. నర్కతీయ గంజ్-రాక్సౌల్-సీతా మరి-దర్భంగా-సీతా మరి-ముజఫర్‌పూర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ చేపట్టనున్నారు.ఇదీ చదవండి: బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా? -
తెలంగాణలో కొత్త లైన్, ఉప్పల్ స్టేషన్.. రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్–హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్..రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి బండి సంజయ్ లేఖ ఇచ్చారు.ఈ సందర్భంగా బండి సంజయ్ లేఖలో..‘కరీంనగర్ నుండి హసన్‌పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లైన్‌కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుంది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్‌లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కరీంనగర్–వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్దిక వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో లేఖ అందజేశారు. ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్‌లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని, పార్కింగ్‌ను విస్తరించాలన్నారు. అలాగే, సోలార్ ప్యానల్స్‌ను కూడా అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: ఎందుకీ హైడ్రామాలు.. బండి సంజయ్ ఫైర్ -
కొత్త రైలు.. కొండ కోనల్లో హొయలు
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం వరకు సుమారు 173 కిలోమీటర్ల కొత్త రైల్వే లైను ఇటీవల మంజూరైంది. ఈ లైనుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ రైల్వేలైను నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలోని మల్కనగిరి నుంచి ఆంధ్రాలోని విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా తెలంగాణలోని పాండురంగాపురం వరకు కొత్త లైను నిర్మించనున్నారు. లైను నిర్మాణంలో భాగంగా 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలున్నాయి. ముంపు మాటేంటి? విలీన మండలాల్లో ప్రతిపాదించిన రైల్వేలైను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవనుంది. చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరుగట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో నిర్మించనున్న స్టేషన్లు సైతం ముంపునకు గురయ్యే అవకాశముంది. దీంతోపాటు శబరినదిపై నిర్మించే వంతెన సైతం ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే చేసిన మార్గం గుండా కాకుండా ముంపునకు గురికాని మార్గంలో లైను నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. లైనుతో పాటు స్టేషన్లు ముంపు పరిస్థితిపై రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు వేచి చూస్తున్నారు. విలీన మండలాల మీదుగా.. మల్కనగిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక గుండా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడలో, ఆంధ్రాలోని అల్లూరి జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు నిర్మించనున్నారు. అనంతరం నందిగామ నుంచి తెలంగాణలోని భద్రాచలం అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే పనులు పూర్తి చేశారు. దీనిలో భాగంగా కూనవరం మండలం జగ్గవరం వద్ద మహరాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి వచి్చన ప్రత్యేక బృందాలు 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి మట్టి శాంపిల్స్ పంపారు. కాగా ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించేందుకు శబరి నదిపై ఒడిశాలోని మోటు, చింతూరు మండలం వీరాపురం నడుమ వంతెన నిర్మించాల్సి ఉంది. -
తాండూరు–జహీరాబాద్ రైల్వేలైన్ ‘సర్వే’ షురూ
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్‌గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం.. తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్‌కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్‌కు కొత్త రైల్వే లైన్‌ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్‌నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్‌తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్‌లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్‌కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
అద్భుతంగా రూపుదిద్దుకున్న ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్
సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ–కోస్తా జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ పెరిగేందుకు అరుదైన రైల్వే మార్గం..ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద టన్నెల్ ఏర్పాటు చేసి దీనిని నిర్మించారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్‌తో సాంకేతిక పనులు పూర్తి చేశారు. వెలుగొండ అడవుల్లో 7.560 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ను ఈ మార్గం కోసం ఏర్పాటు చేశారు. దీంతో ఓబులవారిపల్లె–కృష్ణపట్నం మార్గంలో గూడ్స్ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అద్భుతమైన ఈ లైన్లో ప్రయాణికుల కోసం రైళ్లు నడిపితే విజయవాడ, విశాఖపట్నం తదితర కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ బాగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి అందాల నడుమ కాశ్మీర్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ మార్గం గుండా ప్రయాణం మరుపురాని అనుభూతినిస్తుంది. ఎగుమతుల కోసం.. ఈ రైలు మార్గాన్ని ఎస్ఆర్ఎస్పీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు నుంచి పలు రకాలైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఏర్పాటు చేశారు. ఏపీఎండీసీ పరిధిలో మంగంపేట నుంచి బైరెటీస్, బళ్లారి నుంచి ఐరన్ ఓర్ కూడా ఇదే మార్గంలో వెళుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో నూతనంగా ఈ మార్గంలో 35 కిలోమీటర్లు, నెల్లూరుజిల్లాలో 58 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ నడుమ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మంగంపేట, నేతివారిపల్లె, చెర్లోపల్లె రైల్వేస్టేషన్లుండగా..నెల్లూరు జిల్లాలో ఎనిమిది స్టేషన్ల ద్వారా గూడ్స్ రైళ్లు కృష్ణపట్నం చేరుకుంటున్నాయి. రూ.470 కోట్లతో టన్నెల్.. ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే లైన్ ఏర్పాటుకు 7.56 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటు చేశారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్‌తో సాంకేతికపనులు చేపట్టారు. స్కాట్లాండ్ మిషనరీతో నిర్మించారు. పెనుశిల అభయారణ్యం కొండల్లో ఈ నిర్మాణం జరిగింది. 2006లో అప్పటి రైల్వేశాఖ మంత్రి నితీశ్‌కుమార్ రైల్వేలైన్‌కు పచ్చ జెండా ఊపారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చొరవ కారణంగా సకాలంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు లభించాయి. రూ.1646 కోట్లతో ఈమార్గం రూపుదిద్దుకుంది. రెండు గుహల మధ్య పచ్చని లోగిళ్లలో రైల్వే లైన్ వెళుతుంది. చుట్టూ కొండలు, పెనుశిల అభయారణ్యం మధ్యన టన్నెల్లో రైల్వే ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైల్వే మార్గాన్ని ఉప రాష్ట్రపతి హోదాలో 2019 సెప్టెంబర్, 1వ తేదీన ఎం.వెంకయ్యనాయుడు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి కృష్ణపట్నం పోర్టుకు గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగుతున్నాయి. కనెక్టివిటీకి సులువు కడప–విజయవాడ మధ్య రైల్వే రాకపోకలు చాలా అరుదుగా ఉన్నాయి. కడప నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్(కడప–విశాఖపట్నం).. యర్రగుంట్ల, ప్రొద్దుటూరుల నుంచి ధర్మవరం–విజయవాడ రైళ్ల ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంది. లేకపోతే తిరుపతి, రేణిగుంటల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే నేరుగా కడప నుంచి విజయవాడకు ప్రత్యేకించి రైళ్లు లేవు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి నిత్యం వేలాది మంది విజయవాడకు వెళ్తున్నారు. ప్రత్యేకించి అక్కడి ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఇక్కడి విద్యార్థులు దాదాపు 20వేల మంది వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేరెంట్స్ రాకపోకలు సాగించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. కడప, రాజంపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వెళ్లేందుకు ఈ మార్గం సులభతరంగా ఉంటుందని రైల్వే నిపుణులు వివరిస్తున్నారు. ఎంతో ఉపయోగకరం ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే మార్గం గుండా రైళ్ల రాకపోకలు నిర్వహిస్తే ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు ఎంతో ఉపయోగకరం. రైల్వే బోర్డు దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం. – తల్లం భరత్‌కుమార్‌రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ పంట ఉత్పత్తులు రవాణా చేసుకోవచ్చు ఈ రైలు మార్గం గుండా రాక పోకలు నిర్వహిస్తే ప్రయాణికులకు వెసులుబాటు లభి స్తుంది. నిత్యం వేలాది మంది విజయవాడకు ప్రయాణాలు సాగిస్తున్నారు. పంట ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవడానికి ఉపయో గకరమే. – శంకర్‌రెడ్డి, నాగవరం, చిట్వేలి -
బెంగళూరు–వాడీ లైన్ల అనుసంధానం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే ప్రాజెక్టు ఎట్టకేలకు జాతికి అంకితం కాబోతోంది. ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంత సరిహద్దు వరకు పనులు పూర్తి కావడంతో సమాంతరంగా ఉన్న రెండు ప్రధాన రైలు మార్గాల అనుసంధానానికి అవకాశం ఏర్పడింది. మహబూబ్‌నగర్–కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య 243 కి.మీ. మేర జరుగుతున్న రైల్వే లైన్ పనుల్లో భాగంగా దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల అనుసంధానంతో ఈ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో పూర్తయింది. ఇది ఇటు సికింద్రాబాద్ (మహబూబ్‌నగర్)–బెంగళూరు లైను, అటు సికింద్రాబాద్–వాడీ–ముంబై లైన్లను అనుసంధానిస్తుంది. బెంగళూరు లైన్లో దేవరకద్ర నుంచి మొదలయ్యే ఈ ప్రాజెక్టు, వాడీ మార్గంలోని కృష్ణా స్టేషన్ వద్ద తెలంగాణ పరిధిలో ముగుస్తుంది. ఇక్కడి వరకు పనులు పూర్తి కావడంతో ఈ అనుసంధాన లైన్‌ను ఇప్పుడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరు సహా కొన్ని ఇతర ప్రాంతాలకు వాడీ మీదుగా రైళ్లు తిరుగుతున్నాయి. దీని బదులు ఆ రైళ్లు ఇకపై దేవరకద్ర మీదుగా బెంగళూరుకు చేరుకోవచ్చు. దీనివల్ల రైల్వేకు దూరాభారం తగ్గుతుంది. సరుకు రవాణా రైళ్లకూ ఇది దగ్గరి దారి కానుంది. అలాగే జక్టేర్, మరికల్, మక్తల్, మాగనూరు లాంటి ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రధాని చేతులమీదుగా కాచిగూడ–సిద్దిపేట డెమూ ప్రారంభం? మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైల్వేలైన్ సిద్ధమై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆమోదముద్ర కూడా రావడంతో రైళ్లను నడిపేందుకు అవకాశం కలిగింది. ఇందులో భాగంగా కాచిగూడ–సిద్దిపేట మధ్య రోజువారీ నడిచేలా డెమూ సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించే రెండు రోజుల్లో ఏదో ఒక రోజు డెమూ రైలు సర్విసును ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ప్రధాని చేతుల మీదుగా రైలును ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందో చూడాల్సి ఉంది. ఇక ముద్ఖేడ్–డోన్ మార్గంలో డబ్లింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు లైన్లు వినియోగానికి సిద్ధమైన నేపథ్యంలో ఆ పనులను కూడా ప్రధాని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు: మహబూబ్‌నగర్–మునీరాబాద్ మంజూరు: 1997–98 నిడివి: 243 కి.మీ. ప్రాజెక్టు వ్యయం: రూ. 3,473 కోట్లు తెలంగాణ పరిధి: 66 కి.మీ. వ్యయం: రూ.943 కోట్లు విద్యుదీకరణ: పూర్తి -
యువర్ అటెన్షన్ ప్లీజ్.. ‘పెద్దపల్లి బైపాస్’కు
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: ఎన్నో దశాబ్దాలుగా కరీంనగర్ నుంచి హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు రైలులో వెళ్లాలన్న పాత కరీంనగర్ వాసుల కల త్వరలో సాకారం కానుంది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్–కాజీపేట–బల్లార్షా సెక్షన్‌ను పెద్దపల్లి–కరీంనగర్–ముంబై సెక్షన్ లైన్‌తో కలపనుంది. ఇటీవల పెద్దపల్లి–కరీంనగర్ మార్గాన్ని డబ్లింగ్ లైన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు ముందుకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా.. కాజీపేట–బల్లార్షా, కరీంనగర్–పెద్దపల్లి లైన్లను కలపడం ద్వారా ఈ సెక్షన్‌లోని రైల్వే ప్రయాణంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం పెద్దపల్లి జిల్లాలోని చీకురాయి–పెద్దబొంకూరు గ్రామాల మధ్య పెద్దపల్లి బైపాస్ పేరుతో కొత్త రైల్వేస్టేషన్ నిర్మించతలపెట్టారు. ఇందుకోసం ఇటీవల రెండు గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. దాదాపు 20 ఎకరాల వరకు భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. వారికి పరిహారం ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. రైల్వేస్టేషన్ నిర్మాణంలో భాగంగా ముందుగా ఎలక్ట్రిక్ లైన్ నిర్మించేందుకు ఇటీవల టెండర్లు పిలిచింది. త్వరలోనే స్టేషన్ నిర్మాణం కోసం టెండర్లు పిలవనుంది. చీకురాయి–పెద్దబొంకూరుల మధ్య పాయింట్‌ను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. ఇది కాజీపేట–బల్లార్షా లైన్‌తో కరీంనగర్–పెద్దపల్లి లైన్ కలిసే ప్రాంతం. ఇంతకాలం ఒక రైలు కరీంనగర్ మీదుగా కాజీపేట/సికింద్రాబాద్ వైపు వెళ్లాలంటే ముందు పెద్దపల్లి జంక్షన్ చేరాలి. అక్కడ బోగీల ముందు ఉన్న ఇంజిన్ విడిపించుకొని, ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి కాజీపేట వైపు ఉన్న బోగీలను లింక్ చేసుకొని వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పెద్దపల్లి బైపాస్ రైల్వేస్టేషన్ పూర్తయితే కాజీపేట వైపు వెళ్లే రైళ్లన్నీ కొత్త స్టేషన్ మీదుగా ఎలాంటి ఇంజిన్ మార్పులు అవసరం లేకుండా సాఫీగా సాగిపోతాయి. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌వాసులకు కాజీపేట/వరంగల్/సికింద్రాబాద్ వైపు ప్రయాణం మరింత సులువు కానుంది. గణనీయంగా పెరిగిన ఫ్రీక్వెన్సీ కరోనాకు ముందు ఇది కేవలం సింగిల్ లైన్ మార్గం. నిజామాబాద్ వరకు కనెక్టివిటీ ఉండటం, ఈ మార్గాన్ని వందే భారత్ వంటి రైళ్లు సైతం నడిచేలా ఇటీవల 100 కి.మీ. వేగం తట్టుకునేలా ట్రాక్ సామర్థ్యం పెంచారు. గతంలో ఖాజీపేట–బల్లార్షా సెక్షన్‌లోని రైళ్లు సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్లేవి. దీనివల్ల చాలా ఇంధనం, సమయం వృథా అయ్యేవి. ఈ మార్గం పూర్తి కావడంతో కరోనా కాలంలో పెద్దపల్లి–నిజామాబాద్ రూట్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ప్రతీరోజు గ్రానైట్, బొగ్గు, బాయిల్డ్ రైస్, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే రైళ్ల ఫ్రీక్వెన్సీ గతంలో ఎన్నడూ లేనంతగా గణనీయంగా పెరిగింది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే జోన్లో సరుకు రవాణా రైళ్ల ద్వారా అత్యధికంగా ఆదాయం తీసుకువచ్చే రైల్వే మార్గాల్లో పెద్దపల్లి–నిజామాబాద్ ఒకటిగా ఆవిర్భవించింది. చెప్పుకోదగ్గ రైళ్లేవీ లేవు కానీ, ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు మాత్రం చెప్పుకోదగ్గవి ఏమీలేవు. ఢిల్లీ, కోల్‌కతా, విశాఖపట్టణం, వారణాసి, బెంగళూరు, చైన్నె, తిరువనంతపురం నగరాలకు రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్గంలో కేవలం రెండు పుష్పుల్ (డెమూ, మెమూ) ఎక్స్‌ప్రెస్ రైళ్లు, కాజీపేట నుంచి దాదర్ ముంబై వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్, తిరుపతి నుంచి కరీంనగర్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ లాంటి ఎక్కువ జనాభా కలిగిన పట్టణాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో డబ్లింగ్ పూర్తయితే ఇటు ముంబై వైపు, అటు సికింద్రాబాద్ వైపు రైళ్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ (ఏఎంఆర్‌యూటీ) పథకం కింద ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌కు రూ.26.6 కోట్లు, రామగుండంకు రూ.26.50 కోట్లు, పెద్దపల్లికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ఈ పనులను రెండు దఫాల్లో చేపట్టనున్న కేంద్రం.. తొలిదశలో కరీంనగర్, రామగుండం స్టేషన్లను అభివృద్ధి చేసి, మరికొన్ని నెలల్లోనే పెద్దపల్లిలోనూ పనులు ప్రారంభించనుంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపయుక్తం చీకురాయి వద్ద రైల్వేస్టేషన్ నిర్మించతలపెట్టడం అభినందనీయం. రెండు మార్గాలు కలిసేచోట స్టేషన్ నిర్మించడం వల్ల మా ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక్క పెద్దపల్లి ప్రజలకే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. – మేకల శ్రీనివాస్, చీకురాయి -
రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పీఎం గతిశక్తిలో భాగంగా రైళ్ల రాకపోకలను క్రమబద్ధికరించడంతోపాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు సహా దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు పనులకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ఏడు ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనాకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ (కర్నూలు జిల్లా) రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టులకు మొత్తం రూ.7,539.32 కోట్లు కేటాయించింది. ఇందులో గుంటూరు – బీబీనగర్ మధ్య 239 కి.మీ. రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు రూ.2,853.23 కోట్లు, ముద్ఖేడ్ – డోన్ మధ్య 417.88 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు రూ.4,686.09 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే ఈ లైన్లలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతోపాటు గూడ్స్ రైళ్ల ద్వారా సరుకు రవాణా మరింత ఊపందుకుంటుంది. దీంతో ఆ పరిధిలో పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. కర్నూలు జిల్లా నుంచి సరుకు రవాణాకు మరింత సౌలభ్యం ముద్ఖేడ్ – డోన్ రైల్వే లైన్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను తెలంగాణలోని పలు జిల్లాలు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాతో మరింతగా అనుసంధానిస్తుంది. దీంతో ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న బలార్షా– ఖాజీపేట– సికింద్రాబాద్ మార్గం, కాజీపేట– విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఈ మార్గంలో బొగ్గు, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య మూడో లైన్ కాగా భద్రక్–విజయనగరం సెక్షన్‌లోని ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య 363 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణానికి రూ.5,618 కోట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని భద్రక్, జాజ్‌పూర్, ఖుర్దా, కటక్, గంజాం జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మూడో లైన్ పనులు జరగనున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలకు ప్రయోజనం గుంటూరు – బీబీనగర్ మధ్య రైల్వే లైన్ గుంటూరు, పల్నాడు ప్రాంతాలను అటు ఒడిశా, ఇటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా గుంటూరు– సికింద్రాబాద్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న గుంటూరు–విజయవాడ–కాజీపేట– సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రయాణ దూరంతో గుంటూరు– సికింద్రాబాద్ లైన్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం గుండా ఇనుము, సిమెంట్, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడుతుంది. -
రెండోలైన్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని రెండు ప్రధాన రూట్లతో రైల్వే ప్రాజెక్టులకు లైన్‌క్లియర్ అయ్యింది. ముద్ఖేడ్–మేడ్చల్–మహబూబ్‌నగర్–డోన్, గుంటూరు–బీబీనగర్ సెక్షన్ల మధ్య రెండో రైల్వేలైన్ చేపట్టేందుకు మార్గం సుగమమైంది. వాస్తవానికి ఈ రెండు రైల్వే రూట్లలో ప్రాజెక్టులు ఎన్నో ఏళ్ల క్రితమై మంజూరై, సర్వేలు కూడా చేశారు. కానీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏడు ప్రాజెక్టులకు మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ల అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారే ముద్ఖేడ్– డోన్, గుంటూరు– బీబీనగర్ ప్రాజెక్టులను రూ. 7,539 కోట్ల నిధులతో చేపట్టనున్నారు. వచ్చే బడ్జెట్లో వీటికి నిధులు మంజూరు చేస్తారు. ► సికింద్రాబాద్ టు డోన్, సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ వరకు డబ్లింగ్ పనులు రెండు భాగాలుగా కొనసాగుతాయి. ► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్‌ను ఒక్కసారి పరిశీలిస్తే...సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ రెండోదశ కింద రెండో లైన్ పూర్తయింది. ఇప్పుడు మేడ్చల్ నుంచి ముద్ఖేడ్ వరకు వయా నిజామాబాద్ మీదుగా డబ్లింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. ► ఇక సికింద్రాబాద్ టు డోన్ రూట్లో ఇప్పటికే మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తయింది. ఇప్పుడు మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు రెండో రైల్వేలైన్ పనులు చేపడతారు. ► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్లో ప్రస్తుతం సింగిల్ రూట్ ఉన్న కారణంగా లైన్ సామర్థ్య వినియోగం 167 శాతానికి చేరుకుంది. ట్రాఫిక్ అధికంగా ఉండటం, సామర్థ్యానికి మించి రైళ్లు తిరుగుతుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. డిమాండ్ దృష్ట్యా కొత్త రైళ్లు నడపటం సాధ్యం కావటం లేదు. దీంతో డబ్లింగ్ అనివార్యమైంది. మూడేళ్ల క్రితమే ప్రాజెక్టు మంజూరు చేసినా, నిధుల విడుదలకు ఇప్పుడు మార్గం సుగమమైంది. ► ముద్ఖేడ్ ఆవల మన్మాడ్ వరకు వెళ్లి ప్రధాన ట్రంక్ లైన్‌తో కలుస్తుంది. ముద్ఖేడ్ తర్వాత పర్బణి–మన్మాడ్ మధ్య డబ్లింగ్ పూర్తి కాగా, ఇప్పుడు ఈ పనులు మొదలవుతున్నాయి. ఇది పూర్తయితే, అటు బెంగుళూరు నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి అనుసంధానం అయ్యే ప్రధాన ప్రత్యా మ్నాయ మార్గంగా మారుతుంది. అప్పుడు బెంగుళూరు–హైదరాబాద్–ముంబై ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల రైళ్ల సంఖ్య పెరగటంతోపాటు వాటి వేగం పెరుగుతుంది. ట్రంక్ లైన్‌తో పోలిస్తే దూరం తగ్గి ప్రయాణ సమయం తగ్గుతుంది. ► బల్హర్షా–కాజీపేట–సికింద్రాబాద్, కాజీపేట –విజయవాడ సెక్షన్ల మధ్య కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. బల్హర్షా–రామగుండం–సికింద్రాబాద్–వాడి– గుంతకల్ సెక్షన్లకు బొగ్గు, స్టీల్ రవాణాకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. ► హైదరాబాద్ నుంచి వరంగల్ రైల్వే రూట్లో బీబీనగర్‌కు డబ్లింగ్ ఉంది. ఇక్కడి నుంచి గుంటూరు మీదుగా తెనాలి వద్ద ప్రధాన లైన్‌ను కలిసే ప్రత్యామ్నాయమార్గంగా బీబీనగర్–గుంటూరు మధ్య రెండో లైన్ నిర్మా ణానికి రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు ఇప్పుడు కేంద్రం కనికరం చూపి దానికి నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్– విజయవాడ ప్రధాన లైన్‌పై ఒత్తిడి బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ట్రంక్‌లైన్ సామర్థ్యానికి మించి 137 శాతం వినియోగంలో ఉంది. ఫలితంగా కొత్త రైళ్లు నడిపేందుకు కష్టంగా మారింది. ౖòప్రధాన ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించే కీలక ప్రాజెక్టు ఇప్పుడు ఎట్టకేలకు సాకారం కాబోతోంది. గుంటూరు–బీబీనగర్ సెక్షన్ లైన్ సామర్థ్య వినియోగం 148 శాతంగా ఉంది. రెండో లైన్నిర్మాణంతో ఆ సమస్య పరిష్కారమై కొత్త రైళ్లు ఆ మార్గంలో మళ్లించేందుకు అవకాశం ఉంటుంది. కొన్నేళ్లలో ఈ మార్గంలో కొత్తగా సిమెంటు కార్మాగారాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గూడ్స్ రైళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రూట్లో ఉన్న ప్రధానమైనవి ► ఇనుము–ఉక్కు: చిట్యాల– నార్కట్‌పల్లి . ► సిమెంట్ ప్లాంట్లు: విష్ణుపురం, నడికుడి, తుమ్మలచెరువు, జాన్‌పహాడ్, మేళ్లచెరువు, మఠంపల్లి, జగ్గయ్యపేట, రామాపురం ► థర్మల్ పవర్ ప్లాంట్: విష్ణుపురం సమీపంలో 4000 ఎంవీ థర్మల్ ప్లాంట్ (అందుబాటులోకి రావాలి) ► ఆహార ధాన్యాలు: నాగిరెడ్డిపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ ఎఫ్‌సీఐలు ► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విష్ణుపురం, నార్కట్‌పల్లి ► గిడ్డంగులు: హైదరాబాద్ చుట్టూ 100కి పైగా వేర్ హౌస్‌లు – గుంటూరు చుట్టూ 50కి పైగా కోల్డ్ స్టోరేజీలు ఈ రూట్లో ఉన్న ప్రధానమైనవి ► బొగ్గు: రామగుండం, మంచిర్యాల, మందమర్రి ► ఆర్థిక కారిడార్లు: రాయచూరు–దేవరకద్ర, కర్నూలు –పీలేరు, కొడంగల్–మహబూబ్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్–చిట్యాల, సంగారెడ్డి–హైదరాబాద్, ముత్తంగి–మంచిరేవుల ► థర్మల్ పవర్ ప్లాంట్లు: పర్లి వద్ద మహా జెన్కో కర్ణాటకలోని రాయచూర్, యెర్మరస్లో కేపీసీసీ, ఆంధ్రప్రదేశ్‌లోని ముద్దనూరు వద్ద ఏపీజెన్కో ► ఆహార ధాన్యాల తరలింపు ప్రాంతాలు: ముద్ఖేడ్, బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కర్నూలు ► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, నిజామాబాద్, నాందేడ్ , మెదక్, కర్నూలు, గద్వాల, ఇటిక్యాల, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి ► గిడ్డంగులు–శీతల గిడ్డంగులు: నిజామాబాద్, బోధన్ , సారంగాపూర్ , బండమల్లారం , మహబూబ్‌నగర్, గద్వాల ఖోర్దా రోడ్ –విజయ నగరం రూట్లో.. భద్రక్–విజయనగరం సెక్షన్‌లోని ఖోర్దా రోడ్–విజయనగరం రూట్లో ఒడిశాలోని భద్రక్, జజ్పూర్, ఖోర్దా, కటక్, గంజాం జిల్లాలో 184 కి.మీ, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలోని 201 కి.మీ మేర మూడోలేన్ పనులు జరుగుతాయి. దీనికి రూ.5618.26 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే ముద్ఖేడ్ –మేడ్చల్, మహబూబ్‌నగర్ –డోన్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. డబుల్ రైల్వేలైన్ పూర్తయితే నిజామాబాద్ నుంచి ముంబై, పూణె, షిరిడీలతో పాటు నిజామాబాద్ నుంచి బెంగళూరుల మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగి, ప్రయాణ మార్గం సులభతరం అవుతుందన్నారు. -
గ్రాండ్ ట్రంక్ రైల్వేలైన్‌పై ఒత్తిడి, వేగంగా మూడో లైన్ పనులు, కొన్ని రైళ్లు రద్దు!
హైదరాబాద్: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గంలో మూడోలైన్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో వివిధ మార్గాల్లో నడిచే రైళ్ల రాకపోకల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మార్గాల్లో గూడూరు– బల్లార్ష గ్రాండ్ ట్రంక్ రైల్వేలైన్ అత్యంత కీలకమైనది. ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో పట్టాలపై ఒత్తిడి కారణంగా రైళ్ల రాకపోకల్లో జాప్యం నెలకొంటోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు దక్షిణమధ్య రైల్వే గూడూరు– బల్లార్ష మధ్య మూడు దశలుగా మూడోలైన్ నిర్మాణ పనులను చేపట్టింది. కాజీపేట్–బల్లార్ష, విజయవాడ–గూడూరు మధ్య పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో సికింద్రాబాద్, కాజీపేట్ల మీదుగా నడిచే రైళ్లలో కొన్నింటిని అధికారులు నిలిపివేశారు. ముఖ్యంగా రద్దీ లేని వేళల్లో కొన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ట్రాక్ నిర్వహణ పనుల దృష్ట్యా ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడింది. మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మూడోలైన్ పరిష్కారంగా.. దక్షిణమధ్య రైల్వే పరిధిలో సుమారు 6,800 ట్రాక్ కిలోమీటర్ల పరిధిలో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 800 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీటిలో 300 వరకు గూడ్స్ రైళ్లు ఉన్నాయి.అలాగే వివిధ జోన్ల నుంచి దక్షిణమధ్య రైల్వే జోన్మీదుగా పెద్ద సంఖ్యలో రైళ్లు నడుస్తాయి. దీంతో ట్రాక్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. సకాలంలో సిగ్నళ్లు లభించకపోవడంతో వివిధ రూట్లలో రైళ్లు ముందుకు కదలలేని పరిస్థితి. ఉదాహరణకు కాజీపేట్ మీదుగా నగరానికి చేరుకొనే రైళ్లకు సిగ్నల్ లభించకపోవడంతో చర్లపల్లి వద్ద నిలిపివేస్తున్నారు. కాజీపేట్ మీదుగా వెళ్లే రైళ్లకు సైతం గూడూరు, బల్లార్ష మధ్యలో బ్రేకులు పడుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు మూడోలైన్ నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. మూడోలైన్ అందుబాటులోకి వస్తే రైళ్ల సగటు వేగం బాగా పెరగనుంది. ట్రాక్‌ల పటిష్టతకు చర్యలు.. మరోవైపు ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అప్రమత్తమైంది. వర్షాకాలం దృష్ట్యా కూడా ట్రాక్‌లలో ఎలాంటి లోపాలు లేకుండా నివారించేందుకు ట్రాక్‌ల పటిష్టతకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు వివిధ డివిజనల్ మేనేజర్లతో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఇటీవల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న రైల్వేలైన్లు, వంతెనలు, సొరంగాలు, తదితర మార్గాల నిర్వహణపైన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అనూహ్యమైన అవాంతరాలు ఏర్పడితే తొలగించేందుకు అత్యవసర పరికరాలను అన్ని చోట్ల అందుబాటులో ఉంచాలని చెప్నారు. ఇసుక, బండరాళ్లు,పైపులు నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న వంతెనల వద్ద 24 గంటల పాటు నిఘాను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాక్‌లపైకి వరదనీరు వచ్చి చేరకుండా ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకొనేందుకు కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. -
తెలంగాణలో రీజనల్ రింగ్‌రోడ్డు వెంట ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు... ఇంకా ఇతర అప్డేట్స్
-
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’ అనే డైలాగ్ ప్రయాణికులు చెప్పుకునేలా.. సరికొత్త ఆధునిక రైల్వే లైన్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా శంషాబాద్, విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించిన పీఈటీఎస్ సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. సాక్షి, విశాఖపట్నం : రైళ్ల వేగంలో మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే వందేభారత్ రైళ్లతో కొత్త శకానికి నాంది పలికిన భారతీయ రైల్వే శాఖ.. ఇప్పడు అంతకు మించి అన్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ అత్యాధునిక సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌ల సామర్థ్యం 110 నుంచి గరిష్టంగా 150 కిలోమీటర్లు. ముఖ్య నగరాల్ని కలుపుతూ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా సెమీ హైస్పీడ్ రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు రాజధానుల్ని అనుసంధానం చేస్తూ.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి కానున్నాయి. తాజాగా వస్తున్న రైల్వే లైన్లు కూడా ఈ మూడు రాజధానుల్ని అనుసంధానిస్తున్నట్లుగానే డిజైన్ చేశారు. అదేవిధంగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో ఈ లైన్లు అనుసంధానం కానున్నాయి. అంటే.. శంషాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ వరకూ ఈ సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. మొత్తం 942 కిలోమీటర్ల మేర.. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా ట్రాక్‌లు నిర్మించనున్నారు. 5 గంటల్లో విశాఖ టూ హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ.. ఈ సెమీ హైస్పీడ్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే.. 4 నుంచి 5 గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు అయినా.. ప్రస్తుతం 80 నుంచి 120 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వందేభారత్‌లోనూ స్లీపర్ కోచ్‌లు రాబోతున్నాయి. కొత్తగా రాబోతున్న ఈ ట్రైన్లు గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా తయారు కాబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో ఎక్కువ శాతం ఈ ట్రైన్లు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకే.. ఈ సెమీ హైస్పీడ్ కారిడార్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పీఈటీఎస్కు టెండర్లు ఈ రెండు కారిడార్లకు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే(పీఈటీఎస్)కు రైల్వే బోర్డు టెండర్లు ఖరారు చేసింది. సింగిల్ పాకెట్లో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. రూ.2.70 కోట్లతో నిర్వహించనున్న ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సదరు సర్వే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి సర్వే పూర్తయిన వెంటనే.. ఈ సెమీ హై స్పీడ్ కారిడార్ పనులకు సంబంధించిన ప్రాథమిక అంచనా వ్యయాన్ని నిర్ధారిస్తూ.. డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే పనులకు టెండర్లు పిలవాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ కారిడార్ పనులు పూర్తయితే.. ఏపీ తెలంగాణ మధ్య రవాణా మరింత సులభతరం, వేగవంతం కానుందని వాల్తేరు డివిజన్ అధికారులు భావిస్తున్నారు. విశాఖను అనుసంధానం చేస్తూ జరుగుతున్న ఈ కారిడార్‌కు రైల్వే శాఖ ప్రాధాన్యమివ్వడం శుభపరిణామంగా చెబుతున్నారు. -
సూపర్‌ఫాస్ట్ రైల్వే లైన్లకు పచ్చ జెండా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. ఇరు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం – విజయవాడ – తెలంగాణలోని శంషాబాద్ మధ్య మొదటిది, విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 కేఎంపీహెచ్ వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఈ సూపర్‌ఫాస్ట్ రైల్వేలైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. -
కాకినాడ సెజ్‌కు ప్రత్యేక రైల్వేలైన్.. దక్షిణ మధ్య రైల్వే గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దాదాపు పదేళ్లపాటు పడకేసిన కాకినాడ ఎస్ఈజడ్లో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. కాకినాడ తీరంలో తొండంగి వద్ద నిర్మాణంలో ఉన్న కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్)ను మెయిన్ రైల్వేలైన్‌తో అనుసందానించే ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కుతోంది. ఇందుకోసం కేజీపీఎల్ నుంచి అన్నవరం వరకు 15 కిలోమీటర్లు మేర ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే కూడా ఇందుకు పచ్చజెండా ఊపింది. ప్రత్యేక రైల్వేలైన్‌తో పాటు దశాబ్దాల కాలంగా సత్యదేవుని భక్తుల కలగా మిగిలిన అన్నవరం రైల్వేస్టేషన్ ఆధునీకరణను కూడా చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రైల్వే పనులను కేజీపీఎల్ సొంతంగా చేపడుతోంది. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు నిజానికి.. చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాల కల్పనను అటకెక్కించేశారు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో బహుళ జాతి కంపెనీలు, ఎగుమతి, దిగుమతి ఆధారిత పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఇస్తోంది. మరోవైపు.. కేజీపీఎల్కు ప్రత్యేక రైల్వేలైన్ కోసం 90 ఎకరాల భూసేకరణకు రైతులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా.. విజయవాడ–విశాఖపట్నం మధ్య అన్నవరం రైల్వేస్టేషన్ నుండి కేజీపీఎల్ వరకు 15 కిలోమీటర్ల మేర సరుకు రవాణా కోసం ప్రత్యేక రైల్వేట్రాక్ నిర్మించనున్నారు. ఇక ప్రాజెక్టులో భాగంగా అన్నవరం రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. వచ్చేనెలలో పనులు మొదలు కానున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణంతో కాకినాడ గేట్‌వే పోర్టుకు ప్రతిరోజు 16వేల టన్నుల సామర్థ్యం కలిగిన బొగ్గు, ఎరువులతో పాటు కంటైనర్లలో ఆయిల్, ఎల్ఎన్జీ రవాణా కానుంది. తొలిదశలో నాలుగు గూడ్స్ రైళ్లను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’ ఈ రైల్వేలైన్ కేఎస్‌ఈజెడ్‌లో ఏర్పాటవుతున్న కేజీపీఎల్, బల్‌్కడ్రగ్ పార్కు, అరబిందో పెన్సిలిన్ జీ, దివీస్ తదితర పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది. వీటిపై కేఎస్ఈజెడ్ ప్రాజెక్టు హెడ్ గరుడ సీతారామయ్య స్పందిస్తూ.. రైల్వేస్టేషన్, రైల్వేట్రాక్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి అనుమతులు కూడా లభించాయన్నారు. -
కరీంనగర్ వాసులకు శుభవార్త.. 2025లో రైలు వస్తోంది!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు తుదిదశకు వచ్చింది. మరో రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యాన్ని విధించుకుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే చాలా వేగంగా పనులు చేపడుతోంది. 2025 మార్చి వరకు ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టు స్వరూపం, ఖర్చు, పూర్తి చేసే తేదీ తదితరాలను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్‌ను కలుపుతూ రూపొందించిన మనోహరాబాద్ (మేడ్చల్)– కొత్తపల్లి (కరీంనగర్) రైల్వే ప్రాజెక్టు ఇది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అధిక ఖర్చు, వయబిలిటీ ఉండదన్న కారణాలతో పక్కనపెట్టిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వినతితో 2016లో దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. ప్రస్తుతం గజ్వేల్ వరకు ట్రయల్ రన్ నడుస్తోంది. ప్రభుత్వం వేములవాడ, కొండగట్టుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తుండటంతో ఈ మార్గంలో ఆధ్యాత్మిక పర్యాటకం ఊపందుకోనుంది. ఏడాది చివరలో సిద్దిపేట, దుద్దెడలకు.. ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం మనోహరాబాద్–గజ్వేల్ మధ్య 32 కి.మీ మేర ట్రాక్ పూర్తయి ట్రయల్‌రన్ నడుస్తోంది. గజ్వేల్ నుంచి కొడకండ్ల వరకు కొత్తగా నిర్మించిన 12.5 కిలోమీటర్ల మార్గం కూడా పూర్తయి ట్రయల్‌రన్‌కు సిద్ధంగా ఉంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో కొడగండ్ల–దుద్దెడను ఆగస్టులో, దుద్దెడ–సిద్దిపేటను డిసెంబరులో, సిద్దిపేట సిరిసిల్ల వచ్చే ఏడాది మార్చిలో, సిరిసిల్ల– కొత్తపల్లి 2025 మార్చిలో పూర్తి చేయనున్నారు. ఇప్పటివరకు పనులన్నీ అనుకున్న విధంగా గడువులోనే జరుగుతుండటం గమనార్హం. మాస్టర్ప్లాన్లతో పెరిగిన డిమాండ్..! ఈ ప్రాజెక్టు పూర్తయితే.. రాష్ట్రంలో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఒకే రైల్వేలైను పరిధిలో దర్శించుకునే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో కొమురవెల్లి, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీ నర్సింహాస్వామి, నాంపల్లి, వేములవాడ పుణ్యక్షేత్రాలు వస్తాయి. కొ త్తపల్లి స్టేషన్ అందుబాటులోకి వస్తే.. అక్కడ నుంచి కరీంనగర్ స్టేషన్ నుంచి కొండగట్టు (నూకపల్లి–మల్యాల)స్టేషన్‌కు కలపవచ్చు. ఇటీవల బడ్జెట్లో వేములవాడ మాస్టర్ ప్లాన్ కోసం రూ.50 కోట్లు, కొండగట్టుకు రూ.600 కోట్లు ప్రకటించడంతో ఈ రెండు పుణ్యక్షేత్రాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ రెండు ఆలయాల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ ప్రాధాన్యం పెరిగింది. ఇదే విషయాన్ని దక్షిణమధ్య రైల్వే కూడా గు ర్తించింది. అందుకే, ఈ రైల్వేలైన్‌ను త్వరగా పూర్తి చేసే పట్టుదలతో ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ధీమాగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 46 శాతం మేర ప్రాజెక్టు పూర్తయింది. షిరిడీ, ముంబై, బెంగళూరులకు రైళ్లు..! కొత్తపల్లి– మనోరాబాద్ రైల్వేలైన్ హైదరాబాద్ డివిజన్లో ఉంది. అదే ఖాజీపేట–బల్లార్షా మార్గం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ రెండు మార్గాలకు కొత్తపల్లి జంక్షన్‌లా మారనుంది. ఉత్తరభారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఇది ముఖద్వారంగా అవతరించనుంది. ఈ మార్గం పూర్తయితే ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ వాసులకు షిరిడీ, ముంబై, షిరిడీ, బెంగళూరులకు రైళ్లు నడపొచ్చని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చదవండి లాభాల గాడిద పాలు.. రోజూ లీటరున్నర వరకు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే! -
తెలంగాణలో మరో కొత్త రైల్వే మార్గం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది. మహబూబ్‌నగర్– కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య నిర్మిస్తున్న కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే మార్గానికి సంబంధించి తెలంగాణ భూభాగంలో పనులు పూర్తి చేయటంతోపాటు ఒకవైపు కాచిగూడ–కర్నూలు మార్గాన్ని, మరోవైపు సికింద్రాబాద్–వాడీ మార్గాన్ని అనుసంధానించింది. దీంతో ఈ రెండు మార్గాలకు ఇదో కొత్త ప్రత్యామ్నాయ మార్గంగా అవతరించింది. ఈ మార్గాన్ని ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే దాని మీదుగా తొలుత సరుకు రవాణా రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇంకా ఈ మార్గాన్ని విద్యుదీకరించలేదు. సెపె్టంబర్ నాటికి ఆ పనులు కూడా పూర్తవుతాయి. అప్పటి వరకు గూడ్సు రైళ్లనే తిప్పాలని అధికారులు నిర్ణయించారు. ఇది దేవరకద్ర– జక్లెయిర్– మక్తల్– మాగనూరు–కృష్ణా మీదుగా నిర్మితమైంది. ఇప్పుడు కర్నూలు మార్గంలో బెంగుళూరు వైపు, వాడీ మార్గంలో వెళ్లే గూడ్సు రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించటం ద్వారా, వాటి ప్రయాణ సమయం తగ్గటమే కాకుండా, ప్రధాన మార్గాల్లో ఓవర్ ట్రాఫిక్‌తో ప్యాసింజర్ రైళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించినట్టవుతుంది. దీంతో ఈ కొత్త మార్గానికి ప్రాధాన్యం ఏర్పడింది. రూ.943 కోట్లతో నిర్మాణం..: మహబూబ్‌నగర్–మునీరాబాద్ మార్గాన్ని రూ.3543 కోట్ల అంచనాతో ప్రారంభించారు. ఇందులో తెలంగాణ పరిధిలో దేవరకద్ర నుంచి కర్ణాటక సరిహద్దులోని కృష్ణా మధ్య 66 కి.మీ. నిడివి ఉంటుంది. తెలంగాణ పరిధిలోని ఈ దూరాన్ని రూ.943 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఆ పనులు ఇప్పుడు పూర్తి చేశారు. దేవరకద్ర–జక్లెయిర్ మధ్య 28.3 కి.మీ. దూరాన్ని 2017 మార్చిలో, జక్లెయిర్–మక్తల్ మధ్య 11.5 కి.మీ. దూరాన్ని 2020లో, మక్తల్–మాగనూరు మధ్య ఉన్న 13.3 కి.మీ. నిడివిని 2022 మార్చిలో పూర్తి చేశారు. మాగనూరు–కృష్ణా మధ్య 12.7 కి.మీ. నిడివిని ఇప్పుడు పూర్తి చేశారు. దీంతో తెలంగాణ పరిధిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 66 కి.మీ. మొత్తం పని పూర్తయింది. దేవరకద్ర వద్ద ఇది కర్నూలు లైన్‌తో, కృష్ణా దాటాక వాడి లైన్‌తో అనుసంధానమైంది. దీంతో ఇటు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన రైళ్లు, అటు వాడీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లను ఈ మార్గం మీదగా నడిపించేందుకు వీలు కలిగింది. హైదరాబాద్ నుంచి రాయచూర్, గుంతకల్, బళ్లారి, హుబ్లీ, గోవా తదితర ప్రాంతాలకు ఈ మార్గం మీదుగా తక్కువ సమయంలో వెళ్లే వీలుంటుంది. బెంగళూరుకు కూడా ఇది ప్రత్యామ్నాయ లైన్‌గా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లోని విద్యుదుత్పత్తి, సిమెంటు తదితర పరిశ్రమలకు సరుకు రవాణా చేసే రైళ్లకు ఇది ముఖ్య మార్గంగా మారుతోంది. దీంతో ఈ మార్గంలో వెంటనే గూడ్సు రైళ్లను నడిపేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కీలక మార్గాన్ని పూర్తి చేయటంలో శ్రమించిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు. -
AP: కొప్పర్తికి రైల్వే లైన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లను అనుసంధానిస్తూ కొత్తగా రైల్వే లైన్ నిర్మిస్తోంది. కొప్పర్తికి సమీపంలోని కృష్ణాపురం రైల్వే స్టేషన్ నుంచి కొప్పర్తి వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌ను అనుసంధానిస్తూ రైల్వే సైడింగ్‌ను అభివృద్ధి చేయనున్నారు. పీఎం గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ) పథకం కింద ఈ రైల్వే సైడింగ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ సృజన తెలిపారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కు నుంచి సులభంగా సరుకు ఎగుమతి, దిగుమతి చేసుకునేలా కృష్ణాపురం ప్రధాన లైన్ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ప్రత్యేక లైన్ నిర్మిస్తారు. ఇందుకు రూ.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పారిశ్రామిక పార్కులో నిర్మించే గోడౌన్లను సైడింగ్ లైనుతో అనుసంధానిస్తారు. దీనివల్ల ప్రధాన లైన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా సరుకు రవాణా చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్‌కు ఏపీఐఐసీ టెండర్లును ఆహ్వానించింది. కొప్పర్తిలో ఈ రైల్వే సైడింగ్‌తో పాటు రూ.100.18 కోట్లతో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా, రూ.21 కోట్లతో అభివృద్ధిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కేంద్రానికి త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధంచేసింది. -
లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అద్భుతమైన ప్రకృతి అందాలు, ఎత్తయిన, పచ్చని కొండలు, వీటిని మించి మరపురాని సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మన పక్కనే ఉన్న ఒడిశాలోని కోరాపుట్‌కు వెళ్తే చాలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతమతాయి. అవేమిటో.. ఈ రూట్ విశేషాలను పర్యాటక ప్రేమికుల కోసం ప్రత్యేకం.. కే–ఆర్ (కోరాపుట్–రాయగడ) రైల్వే లైన్ వాల్తేర్ డివిజన్‌కు ప్రధానంగా ఆదాయాన్నిచ్చే కిరండూల్, బచేలిలో ఉన్న ఐరన్ ఓర్ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా వేరే లైన్‌ను ఏర్పాటుచేసి ఈ సరకు రవాణాను మరింతగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో 1980లలో కోరాపుట్ – రాయగడ (కే–ఆర్) లైన్‌ను ప్రారంభించగా.. 1993–92మధ్య ఈ లైన్ పూర్తయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1995 అక్టోబర్ 31న ప్రారంభించారు. కోరాపుట్ నుంచి రాయగడకు మొత్తం 167 కిలోమిటర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 36 సొరంగాలు, 76 ప్రధాన వంతెనలు, 180 అందమైన మలుపులు ఉన్నాయి. అప్పట్లో ప్రధానంగా ఈ మార్గం వైజాగ్ స్టీల్‌ప్లాంట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్‌లకు అసవరమైన ఐరన్‌ఓర్‌ను రవాణాను పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించేవారు. పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి ఈ మార్గంలో అల్యూమినా పౌడర్ సరఫరా చేసే నాల్కో, ఉత్కళ్ అల్యూమినా, వేదాంత, జేకే పేపర్, ఇంఫా (ఇండియా మెటల్ అండ్ ఫెర్రో అల్లాయ్), హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వంటి పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండో లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2015–16లో రూ.2500 కోట్లు బడ్జెట్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026నాటికి రెండోలైన్ పూర్తి చేయనున్నారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల సమాహారం... ఆంధ్రా, ఒడిశా సదరన్ డివిజన్లో ప్రసిద్ధిచెందిన మజ్జిగైరమ్మ ఆలయం రాయగడ ప్రాంతంలోనే ఉంది రాయగడకు కేవలం 50కి.మీల దూరంలో చిత్రకోన వాటర్ ఫాల్స్ తెరుబలిలో గల ఇంఫా ప్యాక్టరీ వద్ద ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయం కోరాపుట్‌లో రాణి డుడుమ వాటర్‌ఫాల్స్, జగన్నాథస్వామి ఆలయం గుప్తేశ్వర గుహలు డియోమలి హిల్స్ కూడా కోరాపుట్ ప్రాంతంలోనే ఉన్నాయి. కోరాపుట్లోనే కోలాబ్ రిజర్వాయర్ కూడా ఉంది. గుహల్లో, వంతెనలపై మరపురాని ప్రయాణం ఈ మార్గంలో సొరంగాలలో నుండి రైలు దూసుకుపోతుంటే ఆ అనుభూతులే వేరు. సుమారు 36 చిన్న, పెద్ద సొరంగాలు. ఈ మార్గంలోనే రౌలీ స్టేషన్‌కు సమీపంలో తూర్పుప్రాంతంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం ఉంది. దీని పొడవు 1,599 మీటర్లు (1.59 కిలోమిటర్లు). ప్రకృతి సోయగాలు, లోతైన, ఎత్తైన కొండలపై ప్రయాణం. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో కోరాపుట్ రైల్వే స్టేషన్. అందమైన వంతెనలు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్గంలో ఉన్నాయి. సాధారణంగా అరకు, బొర్రాగుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు, కానీ ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వెలుగులోకి తీసుకువచ్చిన వాల్తేర్ డివిజన్ కోరాపుట్–రాయగడ రైల్వే మార్గం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. వాల్తేర్ డివిజన్‌కు డివిజనల్ రైల్వే మేనేజర్ గా వచ్చిన అనూప్‌కుమార్ సత్పతి అతి తక్కువ సమయంలో ఈ మార్గంలో పర్యటించి, తనిఖీలు చేసి దీనిని పర్యాటకులకు పరిచయం చేశారు. ఈ మార్గంలో పర్యాటకుల కోసం తొలిసారిగా విస్టాడోమ్ కోచ్‌ను జతచేశారు. వారానికి మూడుసార్లు నడిచే విశాఖపట్నం–కోరాపుట్ స్పెషల్ ప్యాసింజర్ రైలుకు ఈ విస్టాడోమ్ కోచ్ జతచేస్తున్నారు. (క్లిక్ చేయండి: అడవుల్లోనూ ఆహార పంటలు) 20 ఏళ్ల తరువాత ప్రెస్‌టూర్... దాదాపు 20 ఏళ్ల తరువాత వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో శనివారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో గల ప్రముఖ పాత్రికేయులకు ప్రెస్టూర్ను ఏర్పాటుచేశాం. బహుశా కొద్ది డివిజన్లు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తాయి. ఈ టూర్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన పర్యాటకరంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు పరిచయం చేస్తే బాగుంటుంది. – అనూప్ కుమార్ సత్పతి, డీఆర్ఎం అద్భుతంగా ఉంది మొదటిసారిగా ఈ ప్రాంతాలను సందర్శించా. విస్టాడోమ్కోచ్లో ప్రయాణించడం కూడా మరచిపోలేని అను భూతి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తనతో పాటు మార్కెటింగ్ డివిజన్ నుంచి కృష్ణమోహన్, రాజేంద్రరావు, లోకనాథరావు కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. – కె హరిత, డివిజనల్ మేనేజర్, ఏపీ టూరిజం -
భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బొగ్గు తరలింపు కోసం ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే కారిడార్‌ను త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 12న ప్రారంభోత్సవం ఉంటుందని, అయితే దీనిని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌ను సింగరేణి బొగ్గు గనుల సంస్థతో కలిసి రైల్వే నిర్మించింది. 54.10 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టును రూ.930 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఇందులో సింగరేణి సంస్థ రూ.619 కోట్లు భరించగా, మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ వ్యయం చేసింది. జోన్ పరిధిలో గతంలో సిమెంటు ఫ్యాక్టరీలకు సున్నపురాయిని తరలించేందుకు బీబీనగర్–గుంటూరు మధ్య ఉన్న విష్ణుపురం నుంచి ఖాజీపేట–విజయవాడ సెక్షన్ల మధ్య ఉన్న మోటుమర్రి వరకు ఓ సరుకు రవాణా రైల్వే లైనును నిర్మించారు. దాని తర్వాత రెండో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇదే. లారీలకు ప్రత్యామ్నాయంగా.. సింగరేణి సంస్థ సత్తుపల్లి పరిసరాల్లో భారీ సంఖ్యలో ఓపెన్‌కాస్ట్‌ల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. విస్తరించే క్రమంలో ప్రత్యేకంగా రైల్వే లైన్ అవసరమని భావించి రైల్వే శాఖకు ప్రతిపాదించింది. రైల్వేకు ప్రయాణికుల రైళ్ల ద్వారా కంటే సరుకు రవాణా రైళ్ల ద్వారానే ఆదాయం అధికంగా నమోదవుతుంది. దీంతో సింగరేణి సంస్థ ప్రతిపాదనను వెంటనే అంగీకరించిన రైల్వే 2010లో ప్రాజెక్టును మంజూరు చేసింది. అయితే పదేళ్ల తర్వాత కానీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా అంచనా వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెరిగింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం ప్రస్తుతం పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలోని గనుల నుంచి నిత్యం వేయికి పైగా లారీలతో బొగ్గు వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. మరోవైపు బొగ్గు లోడు లారీల రాకపోకలతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా దుమ్ము రేగుతుండటంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటికీ రైల్వే మార్గమే పరిష్కారమని తేల్చారు. మొత్తం మూడు స్టేషన్లు ఈ ప్రాజెక్టు కోసం 860 ఎకరాల భూమిని సేకరించారు. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. సారవరం క్రాసింగ్ స్టేషన్, చంద్రుగొండ క్రాసింగ్ స్టేషన్, పార్థసారథి పురం టెర్మినల్. సత్తుపల్లిలో పెద్దదైన జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్స్‌కు సంబంధించి సైడింగ్ స్టేషన్ పార్థసారథి పురంలోనే ఉంటుంది. ఈ మార్గంలో 10 మేజర్ బ్రిడ్జిలు, 37 మైనర్ బ్రిడ్జిలు, 40 ఆర్‌యూబీలు, 7 ఆర్ఓబీలు నిర్మించారు. రోజుకు ఐదారు రేక్‌ల బొగ్గు తరలింపు రోజుకు ఐదారు రేక్ (ఒక రైలు)ల లోడు తరలించాల్సి ఉంటుందని సింగరేణి సంస్థ ఆదిలోనే రైల్వే దృష్టికి తెచ్చింది. వచ్చే 30 ఏళ్లలో 200 మిలియన్ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి తరలిస్తారని అంచనా. ప్రస్తుతం ఇక్కడినుంచి 7.5 మిలియన్ టన్నుల బొగ్గును లారీల ద్వారా వేరే ప్రాంతాల్లోని రైల్వే సైడింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ రైల్వే లైను ప్రారంభంతో ఆ బాధ తప్పుతుంది. దాంతోపాటు ఏడాదికి మరో 2.5 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా ఇక్కడ లోడ్ చేయనున్నారు. ప్రస్తుతానికి బొగ్గుకే పరిమితం.. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి ఆంధ్రలోని కొవ్వూరుకు ఓ రైల్వే లైన్‌ను పదేళ్ల కింద మంజూరు చేశారు. ప్రస్తుతం బొగ్గు తరలింపునకు నిర్మించిన మార్గాన్ని దానికి అనుసంధానించి పొడిగిస్తే బాగుటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి మరో అదనపు లైను బదులు, సత్తుపల్లి వరకు నిర్మించిన బొగ్గు తరలింపు లైన్‌ను పొడిగిస్తే ఖర్చు తగ్గుతుందన్నది ఆలోచన. కానీ దీనిని సింగరేణి సంస్థ ఆమోదించాల్సి ఉంది. -
‘పట్టాలు’ తప్పిన ప్రాజెక్టు నష్టం రూ. 2000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అది ఓ కీలక ప్రాజెక్టు.. పూర్తయితే అదనంగా రోజుకు వంద రైళ్లను నడిపేందుకు అవకాశమున్న కారిడార్. ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే జాప్యం చేసింది. ఆ ఆలస్యం ఖరీదు దాదాపు రూ.2 వేల కోట్లు కావడం గమనార్హం. రూ.2,063 కోట్ల వ్యయంతో సిద్ధం కావాల్సిన ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసేందుకు రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కానుంది. అంటే మరో ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు సరిపడా ప్రజాధనాన్ని రైల్వే వృథా చేసినట్టవుతోందన్నమాట. కాజీపేట– బల్లార్షా మూడో లైన్ (ట్రిప్లింగ్) ప్రాజెక్టులో ఈ జాప్యం చోటు చేసుకుంది. కీలకమైన అతిరద్దీతో కూడిన లైన్ దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో జోడించే అతి కీలక రైల్వే లైన్ ఇది. దక్షిణ భారత్ ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రైల్వే లైన్. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్‌గా పరిగణిస్తారు. నిత్యం వందల సంఖ్యలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుంటాయి. లైన్ ప్రాధాన్యం దృష్ట్యా ఇటీవల ఆ కారిడార్‌లో రైలు వేగాన్ని గంటకు 130 కి.మీ.కు పెంచారు. ఈ మార్గంలోని మాణిక్‌ఘర్, రేచిని, ఉప్పల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మందమర్రి, రామగుండం, పెద్దంపేట, సిర్పూర్–కాగజ్‌నగర్.. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు, సిమెంటు పరిశ్రమలు భారీగా ఉన్నాయి. ఎరువుల కర్మాగారం ఉంది. వెరసి వందలాది సరుకు రవాణా రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇది రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా, గోల్డెన్ కారిడార్‌గా వెలుగొందుతోంది. ఒక్క రైలునూ కూడా అదనంగా నడపలేని పరిస్థితి ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజూ 250 రైళ్లు తిరుగుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక రైళ్లతో కలిసి 300 రైళ్ల వరకు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఆ రూట్లో 130 శాతం రైలు ట్రాఫిక్ రికార్డవుతోంది. దీంతో మరో రైలును కూడా అదనంగా తిప్పే పరిస్థితి లేకుండా పోయింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబయి వైపు మరిన్ని రైళ్లు నడపాల్సి ఉన్నా, ఈ మార్గం ఇరుగ్గా మారటంతో నడపలేని దుస్థితి నెలకొంది. అత్యవసరంగా ఓ బొగ్గు రవాణా రైలు ముందుకు సాగాలంటే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిలిపివేయాల్సి వస్తోంది. మూడో లైన్ ఆవశ్యకతను గుర్తించిన కేంద్రం మూడో లైన్ పూర్తయితే ఆ సమస్య తీరడంతో పాటు అదనంగా మరో 100 రైళ్లను నిత్యం నడిపే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే మూడో లైన్ నిర్మాణం అత్యంత ఆవశ్యకమని గుర్తించిన కేంద్రం 2015–16లో ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని నిడివి 202 కి.మీ కాగా అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. ప్రాజెక్టు ప్రారంభం, పనులు రెండూ జాప్యమే.. ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాలేదు. ప్రారంభించాక వేగంగా పనులు చేశారా అంటే.. ఇప్పటికి పూర్తయింది కేవలం 71 కి.మీ (35 శాతం) మాత్రమే. మరో 68 కి.మీ పనులు (33 శాతం) కొనసాగుతున్నాయి. ఇవి 2023 మార్చి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరో 60 కి.మీ పైగా పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే రూ.1,700 కోట్లు ఖర్చయ్యాయి. తాజా పరిస్థితుల్లో మిగతా పనులు పూర్తి కావాలంటే ప్రాజెక్టు వ్యయం రూ.4 వేల కోట్లు దాటుతుందని అంచనా. అంటే ప్రాజెక్టు పనులు ఆలస్యం కావటంతో అంచనా వ్యయం దాదాపు రెట్టింపు అవుతోందన్నమాట. అప్పట్లోనే గుర్తించి ఉంటే.. సరుకు రవాణాలో కీలక మార్గం కావటంతో దాదాపు 12 ఏళ్ల క్రితమే రాఘవాపురం–పెద్దంపేట, మంచిర్యాల–మందమర్రి మధ్య 24 కి.మీ, మంచిర్యాల–పెద్దంపేట మధ్య గోదావరి నదిపై భారీ వంతెన సహా 9 కి.మీ లైన్ మంజూరు చేశారు. ఆ పనులు చేపట్టి దశలవారీగా పూర్తి చేశారు. కానీ కారిడార్ యావత్తు మూడో లైన్ అవసరమన్న విషయాన్ని అప్పుడే గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వ్యయం రెట్టింపు అయ్యే పరిస్థితే తలెత్తేది కాదని రైల్వేవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఎక్కడ ఉందంటే..?
ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ట్రాన్స్-సైబీరియన్. ఇది రష్యాలో ఉంది. దీని పొడవు 9289 కిలో మీటర్లు. ఇది మాస్కోలో మొదలై సీ ఆఫ్ జపాన్ గుండా వ్లాదివోస్టోక్ వరకు విస్తరించింది. ఈ మార్గంలో ఏకంగా 3901 వంతెనలు ఉండటం విశేషం.