మనోహరాబాద్–నాచారం గ్రామాల మధ్య రైల్వేలైన్‌పై ట్రయల్‌రన్
గజ్వేల్/ మనోహరాబాద్(తూప్రాన్): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక మలుపు. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్న... రైలు కూత మరికొద్ది రోజుల్లో వినబోతున్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనుల్లో భాగంగా తొలిదశలో గజ్వేల్ పనులు పూర్తయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతానికి దేశ రాజధాని ఢిల్లీ, మరో మహానగరం కలకత్తాకు ఇక సులువైన మార్గం ఏర్పడనుంది. ఇప్పటికే మనోహరాబాద్–నాచారం వరకు ‘ట్రయల్ రన్’ పూర్తి చేసిన అధికారులు తాజాగా శనివారం గజ్వేల్ వరకు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.
అంతేకాకుండా త్వరలోనే లైన్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగబోతుండగా... రూ.1160.47కోట్లను వెచి్చస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారనుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. ఈ లైన్‌కు కేటాయించిన నిధుల్లో మొదటి విడతగా కేంద్రం రూ.350కోట్లకుపైగా నిధులను విడుదల చేయగా... రెండేళ్లలో ఒకసారి రూ.125 కోట్లను, రూ. 200 కోట్లు, తాజా బడ్జెట్‌లో మరో రూ.235కోట్లు విడుదల చేయడంతో పనులకు మరింత ఊపు వచి్చంది. మొత్తం ఈ లైన్ కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచి్చంది.
ఈ రైల్వేలైన్‌పై మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని స్టేషన్‌తో పాటు వర్గల్ మండలం నాచారంగుట్ట, రాయపోల్ మండలం బేగంపేట, గజ్వేల్, గజ్వేల్ మండలం కొడకండ్ల, కొండపాక మండలం దుద్దెడ, సిద్దిపేట, చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది, చిన్న గంగాపూర్, సిరిసిల్ల, వేములవాడ, బోజపల్లి, వెదిరతోపాటు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రైల్వేస్టేషన్లు ఉండబోతున్నాయి. ఇందులో మనోహరాబాద్, కొత్తపల్లి స్టేషన్లు ఇప్పటికే నిర్మితమై ఉండగా కొత్తగా మిగతా 13స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ లైన్‌వల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది.
ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనున్నది. పెద్దపల్లి గ్రాండ్‌ట్రంక్‌లైన్‌కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తైతే ప్రయాణీకులకు దూరభారం తగ్గనుంది. మొత్తానికి ఈలైన్‌తో సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుందని అధికారులు చెబుతున్నారు.
పూర్తయిన
మనోహరాబాద్–గజ్వేల్ లైన్ పనులు
మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 33 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయి. లైన్‌లపై ఉన్న వంతెన పనులను త్వరలోనే పూర్తి చేసేదిశగా సంబంధిత యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇకపోతే మనోహరాబాద్ దాటిన తర్వాత నాగ్‌పూర్ జాతీయ రహదారిని ఈ రైల్వేలైన్ దాటేందుకు చేపడుతున్న ఆర్‌వోబీ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. గజ్వేల్ వద్ద నిర్మిస్తున్న వంతెనతో పాటు ఆర్‌వోబీ పనులు పూర్తయితే రైలు మార్గం దాదాపు పూర్తయినట్లే. ఈ క్రమంలోనే భద్రతా పరీక్షలు పూర్తి చేసుకొని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్‌ఎస్) ఆమోదం పొందిన తర్వాత ప్రయాణీకుల రైలును పట్టాలు ఎక్కిస్తారు. ఈ క్రమంలోనే గురువారం మనోహారాబాద్ నుంచి వర్గల్ మండలం నాచారం వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడవున ట్రయల్ రన్ చేపట్టారు. గజ్వేల్ వరకు మిగిలిన 21 కిలోమీటర్ల మేర కూడా తాజాగా శనివారం ట్రయల్‌రన్ చేపట్టడానికి సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ అంశంపై మంత్రి హరీశ్‌రావు దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్‌తో పలు సందర్భాల్లో సమావేశమై సమీక్షలు జరపడం పనుల వేగానికి దోహదపడింది. ఈ లైన్‌పై ఏర్పాటు చేయబోతున్న ప్రధాన రైల్వే స్టేషన్లలో నాచారంగుట్ట, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ ముఖ్యమైనవిగా చెబుతుండగా గజ్వేల్ స్టేషన్‌కోసం పట్టణంలోని జాలిగామ రోడ్డు వైపున జిన్నింగ్‌మిల్ వెనుక భాగంలోని 20 ఎకరాల విస్తీర్ణంలో పనులు జోరుగా సాగుతున్నాయి. స్టేషన్ భవనం, 3 ప్లాట్‌ఫాంలు, ఒక మెయిన్ లైన్, 2 లూప్‌లైన్లు, షెల్టర్లు, రెండు ఫుట్‌ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 10కోట్ల వరకు వెచి్చస్తున్నారు. ఇదే తరహాలో వర్గల్ మండలం నాచారం వద్ద మరోస్టేషన్ నిర్మాణమవుతోంది. రాయపోల్ మండలం బేగంపేట వద్ద హాల్ట్ స్టేషన్‌ను త్వరలో నిర్మించనున్నారు. ప్రస్తుతం గజ్వేల్–సిద్దిపేట లైన్ పనులు కూడా జోరుందుకున్నాయి.
వ్యాపార, వాణిజ్యానికి బాటలు...
గజ్వేల్ వాసులు ఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలకు వెళ్లాలంటే ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ఖాజీపేట–పెద్దపల్లి మీదుగా వెళ్లాల్సి ఉండేది. ఇలా వెళ్తే.. సుమారుగా ఇక్కడి నుంచి 20గంటలకుపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం చేయడం వల్ల గజ్వేల్ వాసులు నేరుగా పెద్దపల్లికి మీదుగా ఢిల్లీ, కలకత్తా నగరాలకు చేరుకునే అవకాశం కలుగనుంది. సుమారుగా ఐదారుగంటల ప్రయాణ వ్యవధి దీనివల్ల తగ్గనున్నది. ఈ పరిణామం ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్యరంగ అభివృద్ధికి ఊతంగా నిలవనున్నది. వ్యాపారస్తులు ముడిసరుకును ఎగుమతి, దిగుమతి చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో వెళ్లివచ్చే అవకాశం కలుగనుండడం వల్ల భారీ ప్రయోజనం చేకూరనున్నది.
కూరగాయల సాగులో తెలంగాణలోనే ‘వెజ్‌టబుల్ హబ్’గా ఆవిర్భవించిన గజ్వేల్ నుంచి తాజా కూరగాయలను ఈ రెండు మహానగరాలకు మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు పెరుగనున్నాయి. ఈ పరిణామం కూడా ఇక్కడి కూరగాయల రైతులకు కలిసిరానున్నది. ఇదిలా ఉంటే గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మార్చబోతున్న ఈ రైల్వేలైన్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది. లైన్ పూర్తయిన తర్వాత ఒనగూరే ప్రయోజనాలపై అంతా చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రత్యేకాధికారి మత్యంరెడ్డి మాట్లాడుతూ సీఎం కృషి వల్ల గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కల సాకారమవుతోందని చెప్పారు. త్వరలోనే లైన్‌ను ప్రారంభించడానికి రైల్వే శాఖ సిద్ధమవుతోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment