మెదక్ దశ తిరిగినట్లే | Medak phase tiriginatle | Sakshi
Sakshi News home page

మెదక్ దశ తిరిగినట్లే

Published Sat, Jul 16 2016 6:40 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

మెదక్ దశ తిరిగినట్లే - Sakshi

మెదక్ దశ తిరిగినట్లే

  • రైల్వేరాకతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరబోతుంది
  •  అభివృద్ధికోసం స్థానిక ఎమ్మెల్యే కృషి అమోఘం
  •  భావోద్వేగానికి గురైన డిప్యూటిస్పీకర్
  •  మల్లన్న సాగర్‌తో మెదక్ జిల్లా సస్యశ్యామలం
  •  అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్-టీడీపీలు
  •  రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
  • మెదక్: మెదక్ దశ తిరిగింది. ఓ వైపు జిల్లాకేంద్రం, మరోవైపు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేలైన్ ఏర్పాటు, మెదక్‌లో మినీట్యాంకు బండ్ నిర్మాణం, రూ.50కోట్లతో పట్టణానికి మిషన్ భగీరథ పథకం అమలుతో  మెదక్ దశ తిరిగినట్లేనని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ పనులకు ఆయన మెదక్ మండల పరిధిలోని పాతూర్ గ్రామశివారులో డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ఆరు దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీల హయాంలో తెలంగాణను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావించాక కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికోసం డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కృషి అమోఘమన్నారు. మెదక్ రైల్వేలైన్‌కోసం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా పోరాటాలు చేశారని, వారి కల నేడు మన ప్రత్యేక తీర్చుకోవడం మా అదృష్టమని తెలిపారు.

    రైల్వేలైన్‌కోసం ఇప్పటికే రైతుల వద్ద భూమి సేకరించి వారికి పరిహారం అందించడం జరిగిందన్నారు. ఈ నిధులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు. రైల్వేలైన్ల కోసం రూ.120కోట్లు ఖర్చు అవుతుండగా అందులో సగం రూ.60కోట్లను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. రెండేళ్లలో రైల్వేలైన్ పూర్తి అవుతుందన్నారు. రూ.47కోట్లతో మెదక్ పట్టణంలో 4లైన్ల రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.

    మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మించి అక్కడి నుండి సింగూర్ ద్వారా ఘనపురం ప్రాజెక్ట్ ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మెదక్ అభివృద్ధికోసం స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి రూ.100కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. మినీట్యాంకు బ్యాండ్, ఘనపురం ఆనకట్ట, మెదక్-చేగుంట, మెదక్-రామాయంపేట 4లైన్ల రోడ్లు, మెదక్ పట్టణంలో మిషన్ భగీరథ పథకం, ప్రస్తుతం రైల్వేలైన్‌కోసం 280 ఎకరాలు సేకరించి రైతులకు పరిహారం ఇచ్చామన్నారు.

    అలాగే ఖిల్లాపై హరితహోటల్ నిర్మించి పర్యాటకుల కోసం ప్రత్యేక వసతి కల్పించడం జరిగిందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌నుండి నర్సాపూర్, మెదక్-బోధన్ వరకు జాతీయ రహదారిని మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరందించేందుకు పైప్‌లైన్లు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఒక్క మెదక్ నియోజకవర్గంలోనే రూ.500కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. డిసెంబర్‌లోగా గోదావరి జలాలను తరలించి ఇంటింటికి తాగునీరందిస్తామన్నారు.

    నిజాం పాలనలో నిర్మించిన చెరువు కుంటలకు ఆంధ్రా పాలకులు పూర్తిగా విస్మరించారని, మిషన్ కాకతీయ పథకం ద్వారా మెదక్ నియోజకవర్గంలో రెండు విడుతల్లో 236చెరువుల మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. ఘనపురం ప్రాజెక్ట్‌కు రూ.100కోట్లు కేటాయించామని, సిమెంట్‌లైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. దీంతో చివరాయకట్టుకు సాగునీరందుతుందన్నారు.

    మహిళా రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాలకు రూ.30కోట్లు, రైతు బజార్‌కోసం రూ.3కోట్లు, ముస్లిం మైనార్టీ రెసిడెన్సియల్‌స్కూల్‌కు త్వరలోనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎదిగినకొద్ది ఒదగాలన్న సామెత సీఎం కేసీఆర్ మాకు పదే పదే బోధిస్తున్నాడని, ప్రజలకు సేవచేసే భాగ్యం లభిస్తుందున తాము అదృష్టవంతులమని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్‌కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు కృషి వల్ల మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్‌కోసం 280 ఎకరాల భూమి సేకరించి వారికి రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించడం జరిగిందన్నారు.

    ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి గురైన డిప్యూటీస్పీకర్ ఆనంద భాష్పాలు రాల్చారు. ఒకప్పుడు తెలంగాణకోసం ఉద్యమాలు చేస్తూనే మరోపక్క రైల్వేలైన్ కోసం పోరాటాలు చేశామన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్ రాగి అశోక్, ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ అమీనొద్దీన్, ఎంపీడీఓ రాంబాబు, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఆయా అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement