Haris Rao
-
నన్ను కాపలా కుక్క అంటవా?
సాక్షి, నర్సాపూర్: ఆరిపోయె దీపానికి వెలుతురు ఎక్కువగా వస్తుందని, అలాగే ఓడిపోయే కాంగ్రెస్ నాయకులకు మాటలెక్కువ వస్తున్నాయని రాష్ట్ర అపద్ధరర్మ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి , కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డికి సవాల్ విసిరారు. నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సునీతారెడ్డి 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా , మంత్రిగా ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తాము నాలుగున్నరేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాటిని వివరిస్తూ అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమా? అంటూ సునీతారెడ్డికి సవాల్ చేస్తూ చర్చకు తానే వస్తానని, చర్చను అంబేద్కర్ చౌరస్తాలో పెడుదామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కాలంలో అన్ని కొరతలేనని, టీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన ఎరువులు, కరెంటు కావాల్సినంత అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో పదింటికి పది తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు మదన్‌రెడ్డి దగ్గరివాడని.. అందకే ఆర్టీసీ డిపో సాధించారన్నారు. చెక్ డ్యాంలకు నిధులు , గిరిజన తండాలకు రూ.55 కోట్లు మంజూరు చేయించారన్నారు. కాగా మంత్రిగా ఉండి చెక్ డ్యాంకులకు నిధులు తెచ్చారా? అని మాజీ మంత్రి సునీతారెడ్డిని ప్రశ్నిస్తూ మీరు ఏమీ చేయనపుడు మీకెందుకు ఓటెయ్యాలో ప్రజలకు చెప్పాలన్నారు. వచ్చే జనవరి నాటికి నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో పూర్తి అవుతుందన్నారు. టీఆర్ఎస్ మాట తప్పదని, మడమ తిప్పదని, కాంగ్రెస్ మాట తప్పుతుందని ఆయన చెప్పారు. కాగా మొదటి సారి సునీతారెడ్డి పోటీ చేసినపుడు ఏడవడంతో పాపమని సానుబూతితో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. రెండో సారి సైతం పాపమని ఓట్లు వేశారని, ఊరుకే ఏడుస్తే నడవదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఆ నీటితో సింగూరు నింపితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. అలాగే నర్సాపూర్ చరిత్రలో ఇంత గొప్ప ర్యాలీ ఎపుడూ జరుగలేదన్నారు. శనివారం నాటి ర్యాలీ చరిత్రలో ఉండిపోతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొంటూ ర్యాలీతోనే నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి విజయం ఖాయమని స్పష్టమైందన్నారు. తిట్టడంతో ఐదు వేల ఓట్లు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్‌లో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి తనను తిట్టడంతో తనకు మరో ఐదు వేల మెజారిటీ పెరిగిందని చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డిని ఆయన జోకర్‌గా అభివర్ణిస్తూ తనను కాపలా కుక్క అంటవా అని రేవంత్‌రెడ్డిపై మండిపడ్డాడు. తాను ఓట్ల దొంగను కాదని రేవంత్‌రెడ్డిని పరోక్షంగా ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ ఆరోపించారు. తాను ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటానని ఆయన చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రా గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మోకుకు వెన్నుదన్నుగా నిలిచిన సాక్షి
-
చిన్నబోయిన మోకుకు వెన్నుదన్నుగా నిలిచిన సాక్షి
ఈతవనాల పెంపకానికి భారీగా తరలివచ్చిన గౌడన్నలు గౌడ సమస్యలకు వేదికైన చిట్టాపూర్ సాక్షి చొరవను అభినందించిన మంత్రి హరీష్‌రావు గీతవృత్తిపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామని హామీ ఆనందం వ్యక్తంచేసిన కల్లుగీతాకార్మికులు మెదక్: కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న గీతా వృత్తికి సాక్షి దినపత్రిక వెన్నుదన్నుగా నిలిచింది. ఈతవనాల పెంపకానికి పిలుపునివ్వడంతో జిల్లా నలుమూలల నుండి గౌడజనులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. నిర్వీర్యమవుతున్న గీతా కార్మికుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సాక్షి చేసిన చిన్న ప్రయత్నానికి ప్రశంసల వెల్లువ లభించింది. కనుమరుగ వుతున్న గీత వృత్తిని బతికించేందుకు సాక్షి ఆధ్వర్యంలో ఈత వనాల పెంపుకోసం మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుండి 10వేల చిలుకు గౌడజనులు వాహనాల్లో తరలివచ్చి వేలాది ఈతమొక్కలు నాటారు. జనంతో చిట్టాపూర్ గ్రామం కిక్కిరిసింది. రాజుల కాలం నుండి సురాపానకానికి(కల్లు)కు ఎంతో ప్రత్యేకత ఉండేది. కాగా కల్తీకల్లు విక్రయిస్తున్నారంటూ ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణాలపై మూకుమ్మడి దాడులు చేస్తూ ఎంతో మంది గౌడన్నలను జైళ్లోపెట్టారు. వారిదాడులను భరించలేని ఎంతోమంది గీతాకార్మికులు కల్లు విక్రయించడం తమతోకాదంటూ దుకాణాలను లీజుకివ్వడం మొదలు పెట్టి వృత్తికి దూరమయ్యారు. మరికొందరు గత్యంతరంలేక వారి వద్దనే జీతం ఉంటూ దుర్బర జీవితాలు గడుపుతున్నారు. దీనికంతటికి ఒకే కారణం ఈత వనాలు లేకపోవడమేనన్న విషయాన్ని క్షేత్ర పరిశీలనలో గుర్తించిన సాక్షి దినపత్రిక ప్రతి గ్రామంలో విరివిగా ఈతవనాలు ఉంటే కల్తీకల్లును ఎందుకు తయారుచేస్తారు. అనే ఆలోచనతో మెదక్ జిల్లాలోని చిట్టాపూర్ గ్రామంలో ఈతవనాల పెంపునకు శ్రీకారం చుట్టి అక్కడే బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి పదివేలకుపైగా గౌడ జనులు తరలివచ్చి తమ సమస్యలను రాష్ట్రమంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి హరీష్‌రావు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గౌడజనుల సమస్యలను పరిష్కరిస్తామని హామినిచ్చారు. దీంతో గౌడకులస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్గౌడ్లతోపాటు అనేకమంది ప్రముఖులు తరలివచ్చి సాక్షిని అభినందించారు. -
మెదక్ దశ తిరిగినట్లే
రైల్వేరాకతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరబోతుంది అభివృద్ధికోసం స్థానిక ఎమ్మెల్యే కృషి అమోఘం భావోద్వేగానికి గురైన డిప్యూటిస్పీకర్ మల్లన్న సాగర్‌తో మెదక్ జిల్లా సస్యశ్యామలం అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్-టీడీపీలు రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మెదక్: మెదక్ దశ తిరిగింది. ఓ వైపు జిల్లాకేంద్రం, మరోవైపు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేలైన్ ఏర్పాటు, మెదక్‌లో మినీట్యాంకు బండ్ నిర్మాణం, రూ.50కోట్లతో పట్టణానికి మిషన్ భగీరథ పథకం అమలుతో మెదక్ దశ తిరిగినట్లేనని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ పనులకు ఆయన మెదక్ మండల పరిధిలోని పాతూర్ గ్రామశివారులో డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ఆరు దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీల హయాంలో తెలంగాణను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావించాక కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికోసం డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కృషి అమోఘమన్నారు. మెదక్ రైల్వేలైన్‌కోసం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా పోరాటాలు చేశారని, వారి కల నేడు మన ప్రత్యేక తీర్చుకోవడం మా అదృష్టమని తెలిపారు. రైల్వేలైన్‌కోసం ఇప్పటికే రైతుల వద్ద భూమి సేకరించి వారికి పరిహారం అందించడం జరిగిందన్నారు. ఈ నిధులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు. రైల్వేలైన్ల కోసం రూ.120కోట్లు ఖర్చు అవుతుండగా అందులో సగం రూ.60కోట్లను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. రెండేళ్లలో రైల్వేలైన్ పూర్తి అవుతుందన్నారు. రూ.47కోట్లతో మెదక్ పట్టణంలో 4లైన్ల రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మించి అక్కడి నుండి సింగూర్ ద్వారా ఘనపురం ప్రాజెక్ట్ ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మెదక్ అభివృద్ధికోసం స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి రూ.100కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. మినీట్యాంకు బ్యాండ్, ఘనపురం ఆనకట్ట, మెదక్-చేగుంట, మెదక్-రామాయంపేట 4లైన్ల రోడ్లు, మెదక్ పట్టణంలో మిషన్ భగీరథ పథకం, ప్రస్తుతం రైల్వేలైన్‌కోసం 280 ఎకరాలు సేకరించి రైతులకు పరిహారం ఇచ్చామన్నారు. అలాగే ఖిల్లాపై హరితహోటల్ నిర్మించి పర్యాటకుల కోసం ప్రత్యేక వసతి కల్పించడం జరిగిందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్నుండి నర్సాపూర్, మెదక్-బోధన్ వరకు జాతీయ రహదారిని మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరందించేందుకు పైప్లైన్లు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఒక్క మెదక్ నియోజకవర్గంలోనే రూ.500కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. డిసెంబర్‌లోగా గోదావరి జలాలను తరలించి ఇంటింటికి తాగునీరందిస్తామన్నారు. నిజాం పాలనలో నిర్మించిన చెరువు కుంటలకు ఆంధ్రా పాలకులు పూర్తిగా విస్మరించారని, మిషన్ కాకతీయ పథకం ద్వారా మెదక్ నియోజకవర్గంలో రెండు విడుతల్లో 236చెరువుల మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. ఘనపురం ప్రాజెక్ట్‌కు రూ.100కోట్లు కేటాయించామని, సిమెంట్లైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. దీంతో చివరాయకట్టుకు సాగునీరందుతుందన్నారు. మహిళా రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాలకు రూ.30కోట్లు, రైతు బజార్కోసం రూ.3కోట్లు, ముస్లిం మైనార్టీ రెసిడెన్సియల్స్కూల్కు త్వరలోనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎదిగినకొద్ది ఒదగాలన్న సామెత సీఎం కేసీఆర్ మాకు పదే పదే బోధిస్తున్నాడని, ప్రజలకు సేవచేసే భాగ్యం లభిస్తుందున తాము అదృష్టవంతులమని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్‌కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు కృషి వల్ల మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్‌కోసం 280 ఎకరాల భూమి సేకరించి వారికి రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి గురైన డిప్యూటీస్పీకర్ ఆనంద భాష్పాలు రాల్చారు. ఒకప్పుడు తెలంగాణకోసం ఉద్యమాలు చేస్తూనే మరోపక్క రైల్వేలైన్ కోసం పోరాటాలు చేశామన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్ రాగి అశోక్, ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ అమీనొద్దీన్, ఎంపీడీఓ రాంబాబు, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఆయా అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ భవన నిర్మాణాలకు రూ.18కోట్లు
పాలిటెక్నిక్ భవన నిర్మాణాలకు రూ.18కోట్లు మెదక్‌లో పలు అభివృద్ధి పనులకుశంకుస్థాపనలు భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మెదక్: మెదక్ జిల్లాలో 7పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, వసతి గృహాలు లేని మూడు కళాశాలల్లో భవన నిర్మాణాలకై రూ. 18కోట్లు మంజూరు చేయించడం జరిగిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్జిల్లాలోని జహీరాబాద్, నర్సాపూర్, నారాయణఖేడ్, చేగుంట, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లలో పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో మూడింటికి వసతి గృహాలకోసం రూ.18కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 22 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా రూ.66కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. మెదక్ పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలకు రూ.2.27కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మహిళా జూనియర్ కళాశాల నిర్మాణం కోసం రూ.1.25కోట్లు మంజూరు కాగా శంకుస్థాపన చేశారు. మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో అదనపు గదుల కోసం రూ.1.25కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరిగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రహరిగోడ నిర్మాణానికి రూ.75లక్షలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. మైనార్టీ రెసిడెన్సియల్ కళాశాల భవనం కోసం రూ.20కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే మెదక్,సిద్దిపేట, సంగారెడ్డిలలో ఎస్సీ మహిళా రెసిడెన్సియల్ కళాశాలలకోసం పక్కా భవనాల నిర్మాణానికి రూ.90కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. వచ్చే ఆగస్టు మాసం నుండి అన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజనం సన్నబియ్యం పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్ రాగి అశోక్, ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ అమీనొద్దీన్, ఎంపీడీఓ రాంబాబు, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఆయా అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
వారం రోజుల్లో దేవాదుల రీ ఇంజనీరింగ్
- ప్రతిపాదనలు సిద్ధం చేయండి - అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ ప్రతిపాదనలను వారం రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలోని జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలకు ఇందిరమ్మ వరద కాల్వ ద్వారా నీటిని సరఫరా చేసే విషయాన్ని పరిశీలన చేయాలని సూచించారు. దేవాదుల, దుమ్ముగూడెం ఎల్లంపల్లి ప్రాజెక్టుల పురోగతిపై శనివారం 9 గంటలపాటు హరీశ్ రావు సుదీర్ఘంగా సమీక్షించారు. ఇందులో శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌లతో పాటు సీఈలు వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండేలు పాల్గొన్నారు. దేవాదుల మూడో దశ రెండో ప్యాకేజీ పనుల్లో భీంఘన్‌పూర్ జలాశయం నుంచి రామప్ప జలాశయం వరకు నీటిని పంప్ చేయాల్సి ఉందని, సొరంగ తవ్వకాల కోసం బ్లాస్టింగ్స్ వలన రామప్ప గుడికి ముప్పుందని వరంగల్ జిల్లా ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమైనందున ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌కు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. పనుల తీరు మారినందున కాంట్రాక్టర సమస్యలను పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయని హరీశ్ తెలిపారు. 2017 జూన్ నాటికి పనులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. కాంట్రాక్టు రద్దు చేసుకోండి దుమ్ముగూడెం ప్రాజెక్టు సమీక్షలో కాంట్రాక్ట్ క్లోజర్‌కు సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఒప్పంద రద్దుకు అంగీకరిస్తే కాంట్రాక్టర్లకు బ్యాంకు గ్యారంటీ సెక్యూరిటీ డిపాజిట్లు, ఇన్స్యూరెన్స్ నిధులు, చెల్లించిన బ్యాంకు కమీషన్లను తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి తెలిపారు. ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నిల్వ ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీక్ష సందర్భంగా, వచ్చే సీజన్ నాటికి జలాశయాన్ని 148 మీటర్ల వరకు నింపి 20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్‌కు నీటి సరఫరా, ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి కీలకంగా ఉందని, ప్రాజెక్టు పరిధిలో మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. -
చెరువులను అనుసంధానించండి
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి హరీశ్‌రావు విజ్ఞప్తి న్యూఢిల్లీ: దేశంలోని నదులను అనుసంధానించడంతో పాటు చెరువుల అనుసంధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. నదుల అనుసంధానంతో పోలిస్తే చెరువుల అనుసంధానం తక్కువ సమయంలోనే పూర్తవడంతోపాటు ప్రజలకు సత్వర ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ‘జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)’ నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని.. తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు ప్రతిపాదనలు చేశారు. అనంతరం సాయంత్రం ఉమాభారతితో, కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్గంగ్వార్తో వేర్వేరుగా సమావేశమై పలు విజ్ఞప్తులు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేయొద్దు.. దేశంలోని నదుల అభివృద్ధితో పాటు హిమాలయ, ద్వీపకల్ప నదుల అనుసంధానంపై చర్చలో తెలంగాణ తరఫున పలు అంశాలను కేంద్రం దృష్టికి తెచ్చామని హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ సాగునీటి అవసరాలు తీరకుండా నీళ్లను పక్క ప్రాంతాలకు మళ్లించడానికి అంగీకరించబోమని స్పష్టం చేశామన్నారు. నదుల అనుసంధానానికి పదేళ్లకుపైగా పడుతుండగా చెరువుల అనుసంధానం ఏడాదిన్నరలోగా పూర్తిచేయొచ్చని అన్నారు. జాతీయ హోదా ఇవ్వాలి.. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర అనుమతులు వెంటనే వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరినట్లు హరీశ్ వెల్లడించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, జాతీయ హోదా ఇస్తామని మంత్రి సలహాదారుడు వెదిరె శ్రీరాం సమక్షంలో హమీ ఇచ్చినట్టు తెలిపారు. భూగర్భజలాలను పెంపులో భాగంగా చెరువుల పునరుద్ధరణకు రూ. 248 కోట్లను గ్రాంటుగా ఇవ్వాలని కోరగా.. పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టులో ఏఐబీపీ వాటా కింద తెలంగాణకు రావాల్సిన రూ. 112 కోట్లను విడుదల చేయాలని కోరగా ఆదేశాలిచ్చారని చెప్పారు. సీసీఐ కేంద్రాలు పెంచండి.. తెలంగాణలో వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను హరీశ్ కోరారు. తక్షణమే 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తమ ముందే సీసీఐ చైర్మన్‌ను ఆయన ఆదేశించారని చెప్పారు. పత్తికి రూ. 4,050 మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరగా దానికి మంత్రి హామీ ఇచ్చారని హరీశ్ చెప్పారు. -
మంత్రి హరీశ్ వ్యాఖ్యలపై మనస్తాపం..
సత్యసాయి తాగునీటి పథకం కార్మికుడి హఠాన్మరణం సంగారెడ్డి: కనీస వేతనాలు అమలు కావేమోనన్న బెంగతో సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న మెదక్ జిల్లా పుల్కల్కు చెందిన ఒక కార్మికుడు హఠాన్మరణం చెందాడు. జిల్లాలో సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలు చేపడుతున్నారు. మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. దీంతో మంత్రి స్పందిస్తూ కనీస వేతనాలకు సంబంధించిన జీఓ 11 అమలు కుదరదని తేల్చి చెప్పడంతో నిరాశకు గురయ్యారు. సమ్మె చేస్తున్న కార్మికుల్లో పుల్కల్కు చెందిన ఫిట్టర్ చిన్నరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పుల్కల్లోని ఇంటికి వెళ్లిన ఆయన మంగళవారం అర్ధరాత్రి హఠాన్మరణానికి గురయ్యాడు. -
మార్కెట్‌యార్డుల్లో వినూత్న సంస్కరణలు
గోడౌన్లలో రైతుల ధాన్యానికి రుణం రూ.2లక్షలకు పెంపు అవసరమైతే నాబార్డు సాయంతో మరిన్ని గోడౌన్లు నిర్మిస్తాం : మంత్రి హరీశ్‌రావు మార్కెట్‌యార్డులపై నివేదికను సమర్పించిన పూనం కమిటీ హైదరాబాద్: రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు మార్కెట్‌యార్డులలో మూడుదశల్లో వినూత్న సంస్కరణలను అమలు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. గోడౌన్లలో రైతులు నిల్వచేసే ధాన్యంపై ఇచ్చే రుణాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు ఆయన వెల్లడిం చారు. శుక్రవారం సచివాలయంలో ‘రైతుబంధు’ పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోడౌన్లలో నిల్వధాన్యం రుణంపై ఉన్న మూడునెలలు గడువును ఆరునెలలకు పెంచుతున్నామని మంత్రి తెలిపారు. పత్తికి మద్దతుధరను మరింతగా పెంచేలా కేంద్రప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పారు. మార్కెట్‌యార్డులలో తేవాల్సిన సంస్కరణలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్య నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను ఈ సం దర్భంగా మంత్రి హరీశ్‌రావుకు అందచేసింది. కర్ణాటక కన్నా మెరుగైన విధానం... కర్ణాటక మార్కెట్‌యార్డులలో రైతుల నుంచి పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోలు విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, దానికంటే కూడా మెరుగైన వ్యవస్థను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నట్టు హరీశ్ వివరించారు. మార్కెట్‌యార్డుల ప్రవేశద్వారం వద్దనే రైతులు తీసుకు వచ్చిన ఉత్పత్తులను నమోదు చేసుకోవడం,తూకంలో మోసాలు జరగకుండా ఎలక్ట్రానిక్ మిషన్లను అమర్చడం, మార్కెట్‌యార్డుల్లో ఆ రోజు రైతుల నుంచి కొనుగోలు చేసే ఉత్పత్తుల ధరలను ఆన్లైన్లో పేర్కొనడం వంటి మార్పులు తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాలలో ఉన్న ఉత్పత్తుల ధరలను ప్రతిరోజూ తెలియజేయడం వల్ల ఎక్కడ గిట్టుబాటు ధర అనిపిస్తే అక్కడ విక్రయించుకోవడానికి రైతులకు వీలవుతుందని ఆయన వివరించారు. ఇందుకోసం అన్ని మార్కెట్‌యార్డులలో ప్రత్యేకంగా తెరలను ఏర్పాటు చేస్తామన్నారు. దీని వలన రైతులకు, కమిషన్ ఏజంట్లకు, వ్యాపారులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వర్షాభావం ఉన్నప్పటికీ కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పది లక్షల ఎకరాలలో వరి పండిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గోడౌన్ల కొరత లేదన్నారు. ఇంకా వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ , నాబార్డ్ సంస్థల సహాయంతో మరిన్ని గోడౌన్లు నిర్మిస్తామని తెలిపారు. మార్కెట్ యార్డులలో దళారుల బెడదనుతొలగించడానికే ఈ సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. -
అదనపు నీటి నిల్వ సరికాదు
పులిచింతలపై ఏపీ సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్: గతంలో జరిగిన ఒప్పందాలను విస్మరిస్తూ పులిచింతల ప్రాజెక్టులో అదనపు నీటిని నిల్వ చేస్తూ.. గ్రామాల ముంపునకు కారణమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులో 42.8 మీటర్ల మేర నీటిని నిల్వ చేయడంతో నల్లగొండ జిల్లాలోని నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వారికి ఎలాంటి సహాయ పునరావాసం కల్పించకుండా ఇలా నీటిని నిల్వ చేయడంపై అభ్యం తరం తెలిపింది. తక్షణం నీటి నిల్వను 40 మీటర్లకు తగ్గించాలని కోరింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు లేఖ రాశారు. ‘ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సమావేశంలో 40 మీటర్ల వరకే ప్రాజెక్టులో నీటిని నింపాలని రెండు రాష్ట్రాల అధికారులు అవగాహనకు వచ్చారు. సాగర్ ఇన్‌ఫ్లో కారణంగా పులిచింతల ప్రాజెక్టులో గత అవగాహనకు భిన్నంగా 42.8 మీటర్ల మేర నీటి నిల్వ ఉం చారు. దీంతో నాలుగు గ్రామాల ను నీరు చుట్టుముట్టింది. ఇక్కడి గ్రామస్థులకు సహాయ పునరావాసం కింద అందాల్సిన రూ.60 కోట్లు ఇవ్వకుండా నిల్వను పెంచడం సరికాదు. తక్షణమే నీటి నిల్వను తగ్గించేలా సంబంధిత అధికారులను ఆదేశించండి’ అని వారు వేర్వేరుగా కోరారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్రావత్కు కూడా తెలంగాణ సీఎస్ లేఖ రాశారు. -
నేడు ‘కడెం’ ఆయకట్టుకు నీటి విడుదల
కడెం : కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతన్నలకో శుభవార్త. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు గురువారం నీటిని వదలనున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ సారి కాస్త ఆలస్యంగా కడెం ప్రాజెక్టులోకి నీరు చేరింది. ప్రాజెక్టు మీద ఆశతో ఆయకట్టు రైతులు ఖరీఫ్‌లో వరినారు పోసుకున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక.. ప్రాజెక్టులోకి నీరు చేరక నారుమడులు ఎండిపోయాయి. మరికొన్ని మడులు ముదిరి పశువులకు మేతగా మారాయి. బావుల కింద సాగు చేస్తున్న చేలు సైతం ఎండిపోయే దశకు చేరా యి. ఈ క్రమంలో వారం రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగానే వరద నీరు చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 692 అడుగులకు చేరింది. జలాశయంలో 5.5 టీఎంసీల నీరుంది. దీంతో పంటలకు ప్రాజెక్టు నీటిని వదిలి ఆదుకోవాలని రైతులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ జగన్మోహన్, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావులను ఎమ్మెల్యే రేఖానాయక్ కలిసి పరిస్థితి వివరించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం కడెం ఆయకట్టు పరిధిలోని నీటి సంఘాల చైర్మన్లతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి, నీటి విడుదలపై చర్చించారు. చివరికి జలాశయంలో ఉన్న నీటిని కేవలం డీ-10(కలమడుగు) వరకు మాత్రమే వదలాలని, మిగతా ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నింపాలని తీర్మానించారు. ఈ మేరకు కడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందనున్న డీ-10 వరకు గురువారం ఉదయం 8.30 గంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు డీఈ నూరొద్దీన్ తెలిపారు. ఎడమ కాలువ ద్వారా 4 అడుగులు, కుడి కాలువ ద్వారా 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి దశల వారీగా ప్రవాహాన్ని పెంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు రేఖానాయక్, దివాకర్‌రావు హాజరుకానున్నారని తెలిపారు. -
ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు ఖాయం: హరీశ్
రామచంద్రాపురం: మెదక్ ఉపఎన్నికలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.మెదక్ ఉపఎన్నికలో నిలబెట్టేందుకు ఇతర పార్టీ లకు అభ్యర్థులే దొరకడం లేదని చెప్పారు. ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం ఖాయమన్నారు. -
ఆరు నెలల్లో పూర్తవ్వాలి ‘లెండి’
నిజాంసాగర్ : లెండి ప్రాజెక్టు పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే తెలిపారు. వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే సాగునీటి ప్రాజెక్టుల పనులను కాంట్రాక్టర్లతో సకాలంలో పూర్తిచేయించాలని ఆదేశించారన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేల సమక్షంలో సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సమావేశం వివరాలను ఎమ్మెల్యే ‘సాక్షి’తో వివరించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు సీడీ-1, సీడీ-2 జీరో డిస్ట్రిబ్యూటరి నుంచి ప్రధాన కాలువ 7 ఏ డిస్ట్రిబ్యూటరి వరకు మరమ్మతుల కోసం రూ. 9 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించామన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానన్నారని పేర్కొన్నారు. మండలంలోని నల్లవాగు మత్తడి కుడి, ఎడమ కాలువల సిమెంట్ లైనింగ్ పనులు పునరుద్ధరించాలని కోరానని ఎమ్మెల్యే తెలిపారు. సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టని కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టి 15 రోజుల్లో కొత్త కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టాలని సూచించామన్నారు. పిట్లం మండలంలోని వెంపల్లి మత్తడి పనుల కోసం 15 రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రికి పంపించాలని మంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు మిగులు జలాలకు దిగువ భాగాన బ్యారేజ్ నిర్మించాలని మంత్రిని కోరామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి ఏదుల్కావ్ చెరువులోకి నీటిని నింపి, వజ్రఖండి చెరువు వరకు నీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. బిజ్జల్ వాడి వద్ద ఆనకట్ట నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారని వివరించారు. సమావేశంలో పిట్లం జడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారని తెలిపారు. -
‘ఎంఆర్ఎఫ్’ ఎన్నికల్లో హరీష్‌రావు ఘన విజయం
సదాశివపేట, న్యూస్‌లైన్: ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే హరిష్‌రావు బీఎంఎస్ అభ్యర్థి మల్లేశంపై 576 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన ఎంఆర్ఎఫ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా విజయం సాధించడం ఇది రెండోసారి. ఈ ఎన్నికల్లో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా హరీష్‌రావు, బీఎంఎస్ తరఫున మల్లేశం పోటీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో పరిశ్రమ పర్మినెంట్ కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిశ్రమలో మొత్తం 1524 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1471 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో వచ్చిన హరీష్‌రావు తనను గెలిపిస్తే తెలంగాణ ప్రభుత్వంలో కార్మికులకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇస్తూ బస్సు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ వెళ్లిపోయారు. హరీష్‌రావు గెలుపునకు సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లాగౌడ్, అల్లం బస్వరాజ్, రాధాకృష్ణ దేశ్‌పాండే, రాచిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చింతగోపాల్, కోడూరి అంజయ్య పట్టణ అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు సుకుమార్, ఉల్లిగడ్డల శాంత్కుమార్తో పాటు ఎంఆర్ఎఫ్ వర్కర్స్ యూనియన్, ఐఎన్టీయుసీ నాయకులు తదితరులు హరీష్‌రావుకు ఓటు వేసి గెలిపించాలని పరిశ్రమ వద్ద కార్మికులను కోరారు. మల్లేశం తరఫున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరి సంగమేశ్వర్, పట్టణ, మండల బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, సత్యనారాయణ, బీఎంఎస్ నాయకులు శంకర్, అంబయ్య, శ్రీనివాస్,ఆశోక్, వీరేందర్, బీఎంఎస్ కాగడా గుర్తుకు ఓటు వేయాలని కార్మికులను అభ్యర్ధించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. లెక్కింపులో హరీష్‌రావుకు 1023 ఓట్లు రాగా మల్లేశంకు 447 ఓట్లు వచ్చాయి. దీంతో హరీష్‌రావు ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోటేశ్వర్రావు అధికారికంగా ప్రకటించారు. హరీష్‌రావు గెలుపు సందర్భంగా కార్మికులు పరిశ్రమ ఎదుట భారీగా టపాసులు కాలుస్తూ నినాదాలు చేశారు. ఎంఆర్ఎఫ్ కార్మికులు టీఆర్ఎస్, టీఎంఎస్ నాయకులు నినాదానాలు చేశారు. ఓటు వేసి గెలిపించిన ఎంఆర్ఎఫ్ వర్కర్స్ యూనియన్, ఐఎన్టీయుసీ నాయకులకు ఎంఆర్ఎఫ్ కార్మికులకు టీఆర్ఎస్, టీఎంఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సంబరాలు చేసుకొన్న టీఆర్ ఎస్ శ్రేణులు జహీరాబాద్ టౌన్: ఎంఆర్ఎఫ్ కర్మాగారంలో గురువారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో హరీష్‌రావు గెలుపొందడంతో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకుంటున్నారు. నాయకులు, కార్మికులు రోడ్డుపైకి వచ్చి టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాకు టీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని పెద్ద పెట్టున నినాదాలు చే శారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు,మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు అందరివాడన్నారు. సామాన్య ప్రజలతో పాటు కార్మికులు,కర్షకుల కష్టాలు తెలిసిన నాయకుడన్నారు. ఎంఆర్ఎఫ్లో చేపట్టిన కార్యక్రమాలే ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే బాగన్న, పట్టణ అధ్యక్షుడు యాకూబ్, జిల్లా కార్యదర్శి నామ రవికిరణ్ గుప్తా, నాయకులు, సినీ నిర్మాత ఎం.శివకుమార్, కౌన్సిలర్ రాములు నేత, మురళీకృష్ణ గౌడ్,విజయ్‌కుమార్, కలీం, టీఆర్ఎస్వీ తాలుకా అధ్యక్షుడు ఖాజా, పట్టణాధ్యక్షుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.