అపద్ధరర్మ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, నర్సాపూర్: ఆరిపోయె దీపానికి వెలుతురు ఎక్కువగా వస్తుందని, అలాగే ఓడిపోయే కాంగ్రెస్ నాయకులకు మాటలెక్కువ వస్తున్నాయని రాష్ట్ర అపద్ధరర్మ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం నర్సాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి , కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డికి సవాల్ విసిరారు. నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సునీతారెడ్డి 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా , మంత్రిగా ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
తాము నాలుగున్నరేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాటిని వివరిస్తూ అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమా? అంటూ సునీతారెడ్డికి సవాల్ చేస్తూ చర్చకు తానే వస్తానని, చర్చను అంబేద్కర్ చౌరస్తాలో పెడుదామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కాలంలో అన్ని కొరతలేనని, టీఆర్‌ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన ఎరువులు, కరెంటు కావాల్సినంత అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో పదింటికి పది తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు మదన్‌రెడ్డి దగ్గరివాడని.. అందకే ఆర్టీసీ డిపో సాధించారన్నారు. చెక్ డ్యాంలకు నిధులు , గిరిజన తండాలకు రూ.55 కోట్లు మంజూరు చేయించారన్నారు.
కాగా మంత్రిగా ఉండి చెక్ డ్యాంకులకు నిధులు తెచ్చారా? అని మాజీ మంత్రి సునీతారెడ్డిని ప్రశ్నిస్తూ మీరు ఏమీ చేయనపుడు మీకెందుకు ఓటెయ్యాలో ప్రజలకు చెప్పాలన్నారు. వచ్చే జనవరి నాటికి నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో పూర్తి అవుతుందన్నారు. టీఆర్‌ఎస్ మాట తప్పదని, మడమ తిప్పదని, కాంగ్రెస్ మాట తప్పుతుందని ఆయన చెప్పారు. కాగా మొదటి సారి సునీతారెడ్డి పోటీ చేసినపుడు ఏడవడంతో పాపమని సానుబూతితో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు.
రెండో సారి సైతం పాపమని ఓట్లు వేశారని, ఊరుకే ఏడుస్తే నడవదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఆ నీటితో సింగూరు నింపితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. అలాగే నర్సాపూర్ చరిత్రలో ఇంత గొప్ప ర్యాలీ ఎపుడూ జరుగలేదన్నారు. శనివారం నాటి ర్యాలీ చరిత్రలో ఉండిపోతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొంటూ ర్యాలీతోనే నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి విజయం ఖాయమని స్పష్టమైందన్నారు.
తిట్టడంతో ఐదు వేల ఓట్లు
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్‌లో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి తనను తిట్టడంతో తనకు మరో ఐదు వేల మెజారిటీ పెరిగిందని చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డిని ఆయన జోకర్‌గా అభివర్ణిస్తూ తనను కాపలా కుక్క అంటవా అని రేవంత్‌రెడ్డిపై మండిపడ్డాడు. తాను ఓట్ల దొంగను కాదని రేవంత్‌రెడ్డిని పరోక్షంగా ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ ఆరోపించారు. తాను ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటానని ఆయన చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, టీఆర్‌ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రా గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment