
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమి తమపై మరింత బాధ్యతను పెంచిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో తాను గెలిచినా ఓడినా.. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలపై పోరాడుతానన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓడిపోతే కుంగిపోవడం.. గెలిస్తే పొంగిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం కాదన్నారు. 1956 నుంచి అనేక సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ గెలుపు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటంబ పాలనకు పట్టం కట్టినట్లు, రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలు ఇచ్చిన లైసెన్స్ కాదని సూచించారు.
ఈ ఫలితాలతో ప్రజల తరఫున వారి సమస్యలను లేవనెత్తడంలో ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తన వ్యవహారి శైలిని మార్చుకొని.. ఫామ్‌హౌస్ నుంచి కాకుండా.. ప్రజల మధ్య ఉండి పాలన చేయాలని సూచించారు. తక్షణమే తెలంగాణ అమరవీరులను గుర్తించి ఆదుకోవాలని, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా, విద్యార్థులకు మంచి విద్యను అందించేలా పాలన చేయాలని సూచించారు. చంద్రబాబుతో పొత్తు కారణంగానే కూటమి ఓటమి చెందిందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఎన్నికల ఓటమిపై అందరం కూర్చొని విశ్లేషణ చేస్తామని, ఆ తర్వాతే కారణాలు చెబుతానన్నారు.
చదవండి: టీఆర్‌ఎస్ ప్రభంజనం.!
Comments
Please login to add a commentAdd a comment