సదాశివపేట, న్యూస్‌లైన్: ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే హరిష్‌రావు బీఎంఎస్ అభ్యర్థి మల్లేశంపై 576 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన ఎంఆర్‌ఎఫ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా విజయం సాధించడం ఇది రెండోసారి. ఈ ఎన్నికల్లో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా హరీష్‌రావు, బీఎంఎస్ తరఫున మల్లేశం పోటీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో పరిశ్రమ పర్మినెంట్ కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పరిశ్రమలో మొత్తం 1524 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1471 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో వచ్చిన హరీష్‌రావు తనను గెలిపిస్తే తెలంగాణ ప్రభుత్వంలో కార్మికులకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇస్తూ బస్సు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ వెళ్లిపోయారు. హరీష్‌రావు గెలుపునకు సంగారెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మల్లాగౌడ్, అల్లం బస్వరాజ్, రాధాకృష్ణ దేశ్‌పాండే, రాచిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చింతగోపాల్, కోడూరి అంజయ్య పట్టణ అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు సుకుమార్, ఉల్లిగడ్డల శాంత్‌కుమార్‌తో పాటు ఎంఆర్‌ఎఫ్ వర్కర్స్ యూనియన్, ఐఎన్‌టీయుసీ నాయకులు తదితరులు హరీష్‌రావుకు ఓటు వేసి గెలిపించాలని పరిశ్రమ వద్ద కార్మికులను కోరారు.
మల్లేశం తరఫున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరి సంగమేశ్వర్, పట్టణ, మండల బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, సత్యనారాయణ, బీఎంఎస్ నాయకులు శంకర్, అంబయ్య, శ్రీనివాస్,ఆశోక్, వీరేందర్, బీఎంఎస్ కాగడా గుర్తుకు ఓటు వేయాలని కార్మికులను అభ్యర్ధించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. లెక్కింపులో హరీష్‌రావుకు 1023 ఓట్లు రాగా మల్లేశంకు 447 ఓట్లు వచ్చాయి.
దీంతో హరీష్‌రావు ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోటేశ్వర్‌రావు అధికారికంగా ప్రకటించారు. హరీష్‌రావు గెలుపు సందర్భంగా కార్మికులు పరిశ్రమ ఎదుట భారీగా టపాసులు కాలుస్తూ నినాదాలు చేశారు. ఎంఆర్‌ఎఫ్ కార్మికులు టీఆర్‌ఎస్, టీఎంఎస్ నాయకులు నినాదానాలు చేశారు. ఓటు వేసి గెలిపించిన ఎంఆర్‌ఎఫ్ వర్కర్స్ యూనియన్, ఐఎన్‌టీయుసీ నాయకులకు ఎంఆర్‌ఎఫ్ కార్మికులకు టీఆర్‌ఎస్, టీఎంఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
సంబరాలు చేసుకొన్న టీఆర్ ఎస్ శ్రేణులు
జహీరాబాద్ టౌన్: ఎంఆర్‌ఎఫ్ కర్మాగారంలో గురువారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో హరీష్‌రావు గెలుపొందడంతో టీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు జరుపుకుంటున్నారు. నాయకులు, కార్మికులు రోడ్డుపైకి వచ్చి టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాకు టీఆర్‌ఎస్ శ్రేణులు చేరుకొని పెద్ద పెట్టున నినాదాలు చే శారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు,మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు అందరివాడన్నారు. సామాన్య ప్రజలతో పాటు కార్మికులు,కర్షకుల కష్టాలు తెలిసిన నాయకుడన్నారు.
ఎంఆర్‌ఎఫ్‌లో చేపట్టిన కార్యక్రమాలే ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే బాగన్న, పట్టణ అధ్యక్షుడు యాకూబ్, జిల్లా కార్యదర్శి నామ రవికిరణ్ గుప్తా, నాయకులు, సినీ నిర్మాత ఎం.శివకుమార్, కౌన్సిలర్ రాములు నేత, మురళీకృష్ణ గౌడ్,విజయ్‌కుమార్, కలీం, టీఆర్‌ఎస్‌వీ తాలుకా అధ్యక్షుడు ఖాజా, పట్టణాధ్యక్షుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
‘ఎంఆర్‌ఎఫ్’ ఎన్నికల్లో హరీష్‌రావు ఘన విజయం
Published Thu, May 15 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement