సైకో కిల్లర్స్!
ఒక్కొక్కరు..ఇద్దరిని చంపారు
కోరుట్ల సర్కిల్‌లో కలకలం
కోరుట్ల : చూడటానికి సాదాసీదాగా ఉంటారు.. అందరితో మాములుగానే మెదులుతారు. మాటమంతీ బాగానే ఉంటుంది.. ఒక్కోసారి ఏమవుతుందో తెలియదు.. తరతమ బేధాలు మరిచిపోతారు. ఉన్మాదులుగా మారిపోతారు. తెలిసినవారు..తెలియని వారు అన్న తేడా ఉండదు. కర్కశత్వం నింపుకుని కనబడిన వారిని కడ తేరుస్తారు. నాలుగు రోజుల వ్యవధిలో కోరుట్ల సర్కిల్ పరిధిలోనే జరిగిన రెండు హత్యల్లో నిందితులు సైకోకిల్లర్స్‌ను తలపిస్తూ కలకలం సృష్టించారు.
అమ్మో మల్లేశ్..
కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లికి చెందిన జెల్లపల్లి మల్లేశం(28) గతనెల 25న కథలాపూర్ మండలం దుంపెటలో తన మామ దండిక భూమయ్యపై రోకలిబండతో దాడి చేసి హతమార్చాడు. అత్త గంగరాజు, భార్య వనజపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. వీరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జెల్లపల్లి మల్లేష్‌ను రెండురోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడికి గతంలో మేనత్తను మంత్రాలనెపంతో హత్య చేసిన గతం ఉండటం గమనార్హం. 2008లో మల్లేష్ తన మేనత్త జెల్లపల్లి చిన్నక్క(55) తలను మొండెం నుంచి వేరు చేసి హతమార్చాడు. అక్కడితో సరిపెట్టుకోకుండా చిన్నక్కను ఎవరో చంపారని పోలీసులకు ఫోన్ చేసి అందరితోపాటు ఏడుస్తూ ఉన్నారు. ఈ హత్య వెనక కారణాలు అంతుపట్టని క్రమంలో లోతుగా ఆరా తీసిన పోలీసులు చివరికి మల్లేష్‌ను నిందితునిగా తేల్చి అరెస్టు చేశారు. ఇతనిపై పోలీసులు రౌడీషీట్ ఒపెన్ చేయడం గమనార్హం.
ఊరంతా..హడల్!
పోరుమల్లకు చెందిన అలకుంట శేఖర్(26) ఇతని పేరు చెబితే చాలు.. ఊరంతా హడలిపోతారు. గతేడాది మార్చి16న రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారులో మామిడితోటలో ఉన్న రఘుపతిరెడ్డి అనే వ్యక్తి కేవలం బీడీ ఇవ్వనందుకు బండతో మోది హతమార్చాడు. ఆ తరువాత రఘుపతి రెడ్డి శవాన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు కాల్చివేశాడు. ఆ కేసులో కరీంనగర్ జైలులో రిమాండ్‌లో ఉన్న అలకుంట శేఖర్ అవస్థలు చూడలేక తల్లి శంకరమ్మ ఇరవై రోజుల క్రితం బెయిల్‌పై ఇంటికి తీసుకువచ్చింది. ఇంటికి వచ్చిన శేఖర్ ఎప్పటిలాగే గ్రామస్తులను హడలగొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మానసిక వైద్యులతో చికిత్స చేయించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. వైద్యులు లేక మళ్లీ ఇంటికి పంపించారు. ఇంటికి చేరిన శేఖర్ శుక్రవారం అర్ధరాత్రి తల్లి శంకరమ్మపై దాడి చేసి దారుణంగా హతమార్చి పరారయ్యాడు. ఈ రెండు సంఘటనల్లో ఇద్దరు నిందితులు డబుల్ మర్డర్లు చేసి సైకోలు కావడం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.