విశాఖపట్నం పోలీసు కమిషనర్ టి. యోగానంద్ (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం/విజయవాడ/ఏలూరు : కిడ్నాప్, సైకో ముఠాల వదంతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న రూమర్లతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ‘సైకోలు వచ్చారు... పిల్లలను ఎత్తుకుపోతున్నారు.. రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ వదంతులని, వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వదంతులు నమ్మకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి వార్తలు నమ్మొద్దని విశాఖపట్నం పోలీసు కమిషనర్ టి. యోగానంద్ కోరారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిన్నపిల్లలను నరికి చంపుతున్నారనే వాట్సప్ మెసేజ్‌లు వచ్చిన నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరం మండలం చనుపల్లివారిగూడెం గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వదంతులు నమ్మవద్దని విజయవాడ డీసీపీ గజరావు భూపాల్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత కొద్ది రోజులుగా జిల్లాలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలు, ఫోటోల్లో నిజం లేదని పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ ఈశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వదంతుల వల్ల ఇప్పటికే ఏలూరు డివిజన్ పరిధిలో ఐదు చోట్ల అమాయకులపై దాడి జరిగాయని, ఏలూరు డివిజన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వదంతులు వ్యాపించి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment