పాలిటెక్నిక్ భవన నిర్మాణాలకు రూ.18కోట్లు
- పాలిటెక్నిక్ భవన నిర్మాణాలకు రూ.18కోట్లు
- మెదక్‌లో పలు అభివృద్ధి పనులకుశంకుస్థాపనలు
- భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
మెదక్: మెదక్ జిల్లాలో 7పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, వసతి గృహాలు లేని మూడు కళాశాలల్లో భవన నిర్మాణాలకై రూ. 18కోట్లు మంజూరు చేయించడం జరిగిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్‌జిల్లాలోని జహీరాబాద్, నర్సాపూర్, నారాయణఖేడ్, చేగుంట, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లలో పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో మూడింటికి వసతి గృహాలకోసం రూ.18కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం 22 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా రూ.66కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. మెదక్ పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలకు రూ.2.27కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మహిళా జూనియర్ కళాశాల నిర్మాణం కోసం రూ.1.25కోట్లు మంజూరు కాగా శంకుస్థాపన చేశారు. మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో అదనపు గదుల కోసం రూ.1.25కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరిగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రహరిగోడ నిర్మాణానికి రూ.75లక్షలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. మైనార్టీ రెసిడెన్సియల్ కళాశాల భవనం కోసం రూ.20కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే మెదక్,సిద్దిపేట, సంగారెడ్డిలలో ఎస్సీ మహిళా రెసిడెన్సియల్ కళాశాలలకోసం పక్కా భవనాల నిర్మాణానికి రూ.90కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. వచ్చే ఆగస్టు మాసం నుండి అన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజనం సన్నబియ్యం పెట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్ రాగి అశోక్, ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ అమీనొద్దీన్, ఎంపీడీఓ రాంబాబు, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఆయా అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.