అనాథ బాలల టూరిజం ఎక్స్చేంజ్
హైదారాబాద్ నుంచి చెన్నైకి ఎన్జీఓ చిన్నారులు
విధిగా హైదారాబాద్‌కు అక్కడి పిల్లలు..
వినూత్న సంస్కృతికి నాంది పలికిన వాల్మికి సంస్థ, చెన్నైకి చెందిన స్కల్
విజ్ఞానం, వినోదం, మానసిక తోడ్పాటుకు వేదిక
సాక్షి, సిటీబ్యూరో: మన చుట్టూనే ప్రేమ, ఆదరణ నోచుకోని బాల్యాలెన్నో..తల్లిదండ్రులు లేకపోవడం వలనో, పేదరికం కారణంగానో అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు ఎందరో.. అందమైన భవిష్యత్ కలలు కంటూ, ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతుంటాయి ఆ పసి హృదయాలు. ఆ పిల్లలకు ప్రపంచ విజ్ఞానం, సంస్కృతుల సమ్మేళనం, ప్రస్తుత ఆధునిక జీవన శైలి గురించి తెలియాల్సిన అవసరం ఉందని కొందరి ఆలోచన. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని అనాథ చిన్నారులను హైదరాబాద్‌కు ఆహ్వానించి, విలాసవంతమైన ఆతిథ్యమిచ్చి వారి సంతోషాలకు, విజ్ఞానానికి ప్రోత్సాహం అందించే ‘యూనిటీ–ఎక్స్’ అనే అద్భుత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడి చిన్నారులను సైతం వివిధ నగరాలకు తీసుకెళ్లే నూతన సంస్కృతికి నాంది పలికారు.
గతేడాది సెప్టెంబర్ నెలలో చెన్నైలోని ఫరెవర్ ట్రస్ట్‌కు చెందిన 45 మంది చిన్నారులు నగరానికి చేరుకుని 4 రోజుల విజ్ఞాన, వినోద పర్యటనను ఆస్వాదించారు. ఈ యూనిటీ–ఎక్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని పర్యాటక ప్రాంతాలు, పరిశోధన కేంద్రాలను వీక్షించారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే నగరంలోని వాల్మీకి గురుకుల్‌కు చెందిన 20 మంది చిన్నారులు చెన్నైకి సుసంపన్నమైన యాత్ర చేశారు. ఐకమత్యం, కల్చరల్ ఎక్స్చేంజ్ లో భాగంగా ఈ చిన్నారులు ఎన్నో మధుర జ్ఞాపకాలను, సామాజిక–వాస్తవిక అవగాహన పెంచుకుంటున్నారు. ఇలాంటి వినూత్న ప్రాజెక్టును హైదరాబాద్‌లోని వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజం సొల్యూషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ హరి కిషన్ వాల్మీకి ప్రారంభించారు. ఈ గొప్ప ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా భాగస్వామిగా చేరింది. ఈ సంస్థల సీఎస్‌ఆర్ నిధులతో యూనిటీ–ఎక్స్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా
జీఆర్‌టీ రాడిసన్, టెంపుల్ బే, రెయిన్ ట్రీ, ది పార్క్ హోటల్, రెసిడెన్సీ హోటల్స్ తదితర 5–స్టార్ హోటళ్లలో బస చేయడం, అక్కడి ఆహారాన్ని విందు చేయడం, విలాసవంతమైన బెంజ్ బస్సులతో గరుడ లాజిస్టిక్స్‌లో ప్రయాణం చేయడం వంటి అవకాశాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా విద్య, విజ్ఞానం, కెరీర్ సెమినార్స్ తదితర అంశాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు
విభిన్న సంస్కృతుల సమ్మిళిత ప్రయాణం, అనుభవాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గొప్ప ఉపాధ్యాయుడితో సమానం. ఈ కోణంలోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వ్యవస్థాపకులు డాక్టర్ హరికిషన్ వాల్మీకి తెలిపారు. మా ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ అధ్యక్షుడు షబిన్ సర్వోత్తమ్ వంటి వారు భాగస్వామ్య సహకారం అందించడం శుభపరిణామం అన్నారు. ఈ ప్రాజెక్టును నగరంలోని వాల్మీకి ఫౌండేషన్ పర్యవేక్షిస్తూ, అవసరమైన మద్దతు, సహకారం అందిస్తోంది.
ఐక్యతకు నిదర్శనంగా
ప్రేమ, ఆదరణ పొందకపోవడమే కాకుండా సామాజికంగా నిర్లక్ష్యానికి గురైన పిల్లలు ఈ అనాథలు. వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటే సౌలభ్యాలు, విద్య మాత్రమే సరిపోదు. అధునాతన ప్రపంచం, ఈ తరం జీవనశైలి, సామాజిక పరిపక్వత చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఇలాంటి చిన్నారులు సైతం అందరి పిల్లలమాదిరిగానే వారి జీవితాన్ని ఆస్వాదించడంలో ప్రాజెక్ట్ యూనిటీ–ఎక్స్ విశేషంగా కృషి చేస్తుంది. ఈ తరహా కార్యక్రమాలు సామాజిక
సమానత్వానికి, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి.
– డాక్టర్ సూర్య గణేష్ వాల్మీకి, వాల్మీకి ఫౌండేషన్ అధ్యక్షుడు.
ఆలోచన మారింది..
మా ఆశ్రమం తప్ప మరే ప్రపంచం తెలియని మేమంతా చెన్నై వెళ్లడం మంచి అనుభూతి. ఈ ప్రయాణం విజ్ఞానంతో పాటు చెన్నైలో మంచి మిత్రులనూ చేరుకునేలా చేసింది. మళ్లీ అక్కడి పిల్లలు హైదరాబాద్ రావడం కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. యూనిటీ–ఎక్స్ నా ఆలోచనా విధానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను మార్చింది. ప్రపంచం చాలా పెద్దది, అవకాశాలకు కొదువ లేదు అనే నమ్మకాన్ని ఇచ్చింది.
– మారుతి, వాల్మీకి గురుకుల్ విద్యార్థి
ఇదీ చదవండి: 2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..బెస్ట్ టిప్స్!
Comments
Please login to add a commentAdd a comment