Orphaned Children
-
ఆ ఘటనపై చలించిపోయిన సీఎం జగన్.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి/తూర్పుగోదావరి: ఆన్లైన్ లోన్ యాప్ బారినపడి రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు నాగసాయి(4), లిఖిత(2) ఇద్దరికి చెరో రూ.5 లక్షల సాయం అందించాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మాధవీలతకి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య కాగా, అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు గత కొంతకాలంగా రాజమహేంద్ర వరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం సెల్‌ఫోన్ ద్వారా లోన్ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించేవారు. ‘మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి.. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం’ అని బెదిరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో లోన్ యాప్‌ల ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
Kakinada: కలెక్టర్, జేసీ పెద్ద మనసు.. కోవిడ్‌తో అనాథలైన చిన్నారులను
కాకినాడ సిటీ: కలెక్టరు కృతికాశుక్లా, జేసీ ఇలక్కియ పెద్ద మనసు చాటుకున్నారు. కోవిడ్‌తో అనాథలైన చిన్నారుల్లో తలో బిడ్డ బాధ్యతను స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. వారికి సంబంధించిన అన్ని విషయాలు ఇకపై వీరు చూస్తారు. మిగిలిన అధికారులు కూడా చొరవ తీసుకుని తలో చిన్నారి దత్తత బాధ్యతలను తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. సోమవారం కలెక్టరేట్ స్పందన హాలులో స్పందన అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్–19 కారణంగా 23 మంది చిన్నారులు అనాథలయ్యారన్నారు. చదవండి: నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో! వీరి విషయంలో జిల్లా స్థాయి మహిళా అధికారులు ఆలన, పాలన పరంగా చొరవ చూపాలని కలెక్టర్ కోరారు. మాతృత్వ భావనతో చిన్నారులు మహిళ అధికారులకు చేరువ అవుతారనే ఉద్దేశంతో తాము దత్తత బాధ్యత తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. పురుష జిల్లా అధికారులు కూడా ఔదార్యంతో పిల్లల సంక్షేమానికి తమ వంతు సేవలను అందించవచ్చన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం 44 ల్యాప్‌టాప్‌లు, 19 స్మార్ట్ టచ్ ఫోన్లు, 300 హియరింగ్ ఎయిడ్లు, 40 కాలిపర్స్ పరికరాలు జిల్లా విభాగానికి కేటాయించామన్నారు. వీటికి అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టి ఆన్లైన్ దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో ముగ్గురు బధిరులకు స్మార్ట్ టచ్ ఫోన్లను, ఒక దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్‌ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. స్పందనలో 237 అర్జీలు అధికారులకు అందాయి. -
ప్రశంసనీయమైన నిర్ణయం
కరోనా మహమ్మారి పంజా విసిరిననాటినుంచీ వినబడుతున్న కథనాలు గుండెలు బద్దలు చేస్తున్నాయి. ఆసరాగా వున్నవారు, పెద్ద దిక్కుగా వున్నవారు హఠాత్తుగా కరోనా వాతబడి కనుమరుగుకావడం ఏ కుటుంబాన్నయినా కోలుకోలేనంతగా దెబ్బతీస్తుంది. ఇక అమ్మానాన్న తప్ప వేరేవెరూ లేని పిల్లలకైతే భవిష్యత్తు నరకం. ఇష్టంలేని పెళ్లి చేసుకుని అందరికీ దూరం కావడం వల్లనో, వారి బంధువులు అంత స్థోమత వున్నవారు కాకపోవడం వల్లనో పిల్లలు అనాథలైనప్పుడు వారిని సాకేవారు ఎవరూ వుండరు. ఇలాంటి పిల్లలకు ‘నేనున్నాన’ ంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగ్గది. కరోనా కారణంగా మృత్యువాత పడినవారి పిల్లలు అనాథలైనపక్షంలో అలాంటివారి పేరుపై తక్షణం రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని, ఇరవై అయిదు సంవత్సరాలపాటు దానిపై వచ్చే వడ్డీతో ఆ పిల్లల బాగోగులు చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించారు. అనంతరకాలంలో ఆ డబ్బును పిల్లలు తీసుకునే అవకాశం కల్పించారు. అలాంటివారి కోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు నెలకొల్పాలని ఇప్పటికే ఆయన ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేద వర్గాలు, మధ్యతరగతి వర్గాల పిల్లలకు వివిధ పథకాల కింద ఉచిత విద్య, మధ్యాహ్న భోజనంవంటివి అందుతున్నాయి. పై తరగతులకు వెళ్లేకొద్దీ ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టళ్ల సదుపాయాలు, మెస్ చార్జీల చెల్లింపు వంటివి అందుబాటులో వున్నాయి గనుక అలాంటి పిల్లలు పై చదువులు చదవడానికి, భవిష్యత్తులో మంచి ఉపాధి పొందడానికి వీలవుతుంది. మన ప్రజారోగ్యరంగ అవ్యవస్థకు కరోనా వైరస్ పెను సవాల్ విసిరింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆసుపత్రులు అరకొర సదుపాయాలతో కూనారిల్లుతున్నాయి. ఫలితంగా సరైన వైద్య సాయం అందక రోజుకు కొన్ని వేలమంది మృత్యువాత పడుతున్నారు. పచ్చగా వర్థిల్లిన కుటుంబాలు తీరని శోకంలో కూరుకుపోతున్నాయి. అమ్మానాన్నల్లో ఎవరో ఒకరున్నవారి పరిస్థితి కొంత మెరుగు. హఠాత్తుగా సంభవించిన పరిణామంతో వెంటనే దిగ్భ్రమలో కూరుకు పోయినా సర్వశక్తులూ కూడదీసుకుని మళ్లీ సాధారణ జీవనం సాగించేందుకు కృషి చేస్తారు. కానీ తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు ఎవరో ఒకరు ఆసరాగా నిలబడకపోతే మళ్లీ ఎప్ప టికీ మామూలు మనుషులు కాలేరు. ఆడపిల్లలకైతే లైంగిక వేధింపులు అదనం. దేశం నలు మూలలనుంచీ అలాంటి పిల్లల గురించి మీడియాలో వెలువడుతున్న కథనాలు భీతిగొలు పుతున్నాయి. ఢిల్లీ పిల్లల హక్కుల కమిషన్ చైర్పర్సన్ అనురాగ్ కుందూ ఈమధ్య ఒక సంగతి చెప్పారు. అమ్మానాన్నలిద్దరూ ఆసుపత్రుల్లో వుండటంవల్లనో, ఆ వ్యాధికి బలికావడంవల్లనో ఒంటరైన పిల్లల గురించి ఈమధ్య నిరంతరాయంగా తనకు మెసేజ్‌లు వస్తున్నాయని అన్నారు. నోబెల్ గ్రహీత, బచ్పన్ బచావో ఆందోళన సంస్థ సారథి కైలాష్ సత్యార్థి కేవలం రెండు రోజుల వ్యవధిలో తనకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి అనాథ పిల్లల్ని ఆదుకోవా లంటూ 200 కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. ఇలాంటివారంతా చివరకు ఏమవుతు న్నారు...ఎటుపోతున్నారనే బెంగ హృదయమున్న ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. మనదగ్గర మోసా లకు కొదవలేదు. ప్రాణావసరమైన ఔషధాలనూ, ఆక్సిజన్‌నూ బ్లాక్మార్కెట్చేసి అమ్ముకుం టున్న అథముల తరహాలోనే పిల్లల్ని అక్కున చేర్చుకున్నట్టు నటించి వ్యాపారం చేసే కేటుగాళ్లు కూడా తయారయ్యారు. అందుకే ఇలాంటి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు సృజనాత్మకంగా ఆలోచించడం, మెరుగైన పథకాలతో వారికి ఆసరాగా నిలవడం అత్యవసరం. కేంద్రం కూడా ఈమధ్యే అనాథ పిల్లల విషయంలో కొన్ని ప్రతిపాదనలు చేసింది. వారికి అండదండలు అందించే విషయమై రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. కానీ ఆ ప్రతిపాదనలు అరకొరగానే వున్నాయి. అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం లేదా అందుకు ప్రోత్సహించడం చట్ట వ్యతిరేకమని చెప్పడం వరకూ బాగుంది. అలాంటి పిల్లలను జిల్లా శిశు సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచి వారిని సంరక్షకులకు అప్పగించడమో, ఇతర సంస్థల్లో పునరావాసం కల్పించడమో చేయాలని సూచిం చడం కూడా మంచిదే. దాంతోపాటు అలాంటి చిన్నారుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో ఆర్థిక సాయం అందించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలి. పిల్లల సంరక్షణ సక్రమంగా వుండాలంటే వారికయ్యే ఖర్చులకు సరిపడా ఆదాయం కనబడాలి. అది లేనప్పుడు ఆ పిల్లలకు మెరుగైన సంరక్షణ లభిస్తుందని విశ్వసించలేం. కనీసం అలాంటి ఆదాయ వనరు చూపితే, ఆ పిల్లల్ని సరిగా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించటానికి వీలు కలుగుతుంది. ఆ పిల్లలకు రోజువారీ అవసరాలే కాదు...వారి భావోద్వేగాలను పరిరక్షించడం కూడా ముఖ్యమే. బెంగ ళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) అంచనాబట్టి వచ్చే జూన్ 11నాటికి దేశంలో 4,04,000మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం వుంది. వాషింగ్టన్ యూనివర్సిటీ విభాగం వచ్చే జూలై నాటికి 10 లక్షలమంది చనిపోవచ్చని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్ నమూనాలో అనాథ పిల్లల కోసం మెరుగైన పథకాలు రూపకల్పన చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలి. తన వంతుగా అలాంటి పిల్లల సంరక్షణకు అదనంగా ఆర్థిక సాయం అందించాలి. -
కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు ప్రతి నెల రూ.2500
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ కోవిడ్ కొన్ని కుటుంబాల్లో తల్లితండ్రులకు పిల్లలను దూరం చేస్తే, మరి కొన్ని కుటుంబాల్లో పిల్లలకు వారి తల్లితండ్రులను దూరం చేసింది. ఇలా కొవిడ్‌తో తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిన్నారులకు 25ఏళ్లు వచ్చేదాకా ప్రతి నెల రూ.2,500 జమ చేయడంతో పాటు ఉచిత విద్య అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే, పేద కుటుంబాలకు చెందిన 72 లక్షల మందికి ఈ నెలలో 10 కిలోల ఉచిత రేషన్ లభిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇందులో సగం ఢిల్లీ ప్రభుత్వం, మిగిలినవి కేంద్ర ప్రభుత్వ పథకం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో సంపాదించే వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ కుటుంబాలకు నెలకు రూ.2,500 అందజేయనున్నట్లు తెలిపారు. ఇంట్లో సంపాదించే భర్తను కోల్పోతే భార్యకు, వివాహం కాని కొడుకును కోల్పోతే తల్లితండ్రులకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు. మీ బాధను మేము అర్థం చేసుకున్నాము. వారిని తిరిగి మేము తీసుకురాలేమని మాకు తెలుసు, కాని ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని” ముఖ్యమంత్రి అన్నారు. దిల్లీలో కరోనాతో నిన్నటివరకు 21,846మంది మృత్యువాత పడ్డారు. గత కొద్దీ రోజుల నుంచి ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. చదవండి: ఈ పెన్షన్ పథకంలో చేరితే ప్రతి నెల రూ.5 వేలు -
ఆ చిన్నారుల అకౌంట్లలో రూ.10లక్షల ఫిక్స్డ్ డిపాజిట్
అమరావతి: దేశంలో కరోనా మహమ్మరి వేగంగా విజృంభిస్తుంది. ఈ మహమ్మరి భారీనా పడ్డ పేద, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. దీని వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కోవిడ్ కారణంగా ఒకేసారి తల్లిదండ్రులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఇలా ఏపీ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ఏకే సింఘాల్ తెలిపారు. ఆ మేరకు తదుపరి ఉత్తర్వులను రేపు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద రూ.10 లక్షలు డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా ప్రతి నెలా పిల్లలకు అందజేయనున్నమని సింఘాల్ పేర్కొన్నారు. వారికి 25ఏళ్లు వచ్చేవరకూ ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పిల్లలకు వారికి 25ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుంది. దీనికోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేశారు. చదవండి: రెండు తెలుగు రాష్ట్రాలకు రిలయన్స్ మద్దతు -
సిస్టర్... అమ్మను మరిపించింది
బిడ్డను కన్న తల్లి కూడా అప్పుడే పుట్టినట్లుగా ఉండే చోటు ప్రసూతి వార్డు! రెండు ప్రాణాలు ఒత్తిగిలే పొత్తిలి. ప్రశాంత వనం. దేవదూతల మందిరం. అకస్మాత్తుగా తుపాకీ చప్పుళ్లు! ఎవరు మీరు?! ఎవరు కావాలి? ‘తల్లీ బిడ్డా.. ఇద్దరూ’!!!! కరోనా కాలమైనా, కారుణ్య మాసమైనా ఉగ్రవాదుల పని ఉగ్రవాదులకు ఉంటుంది. అందుకే చొరబాట్లు, మారణహోమాలు ఆగడంలేదు. ఈ నెల 12 మంగళవారం ఉదయం ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని బార్చి నేషనల్ ఆసుపత్రి లోపలికి ప్రవేశించిన ముగ్గురు సాయుధులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 24 మంది మరణించారు. చనిపోయిన వారిలో అప్పుడే పుట్టిన పసికందులు ఇద్దరు, పద్దెనిమిది మంది బాలింతలు, నర్సులు ఉన్నారు. ఆ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులతో పాటు ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే అంతర్జాతీయ చారిటీ సంస్థ ఒక ప్రసూతి వార్డును నిర్వహిస్తోంది. ఆ వార్డుతో కలిపి మొత్తం 26 మంది బిడ్డ తల్లులు.. కాల్పులు జరుగుతున్న సమయంలో ఆసుపత్రి లోపల ఉన్నారు. ఆఫ్ఘన్ భద్రతా దళాలుగా చెప్పుకున్న ఆ ముగ్గురు సాయుధులు సరాసరి ఆసుపత్రి లోపలికి వెళ్లి తల్లుల్ని వెదకి వెదకి కాల్పులు జరిపారు. వారిని నుంచి కొందరినైనా కాపాడేందుకు ఆసుపత్రి సిబ్బంది తల్లీ బిడ్డల్ని ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ ప్రసూతి వార్డులోకి తరలించి తలుపులు బిగించారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక గర్భిణికి నొప్పులు మొదలయ్యాయి. ‘‘ఆ క్షణంలో నాకు చాలా భయం వేసింది. పురుటి నొప్పుల అరుపులు బయటికి వినిపించకూడదు. బిడ్డ భూమి మీదకు వచ్చాక బిడ్డ ఏడుపూ వినిపించకూడదు. వినిపిస్తే ఆ దుండగులు లోపలికి వచ్చి చంపేయడం ఖాయం. వాళ్లు ప్రసూతి వార్డులను మాత్రమే లక్ష్యం చేసుకుని, పడకల మీద ఉన్న తల్లీబిడ్డలను చంపుతున్నట్లు మాకు వెంటనే అర్థమైంది. కొందరిని ‘సేఫ్ రూమ్’ల లోనికి, కొందరిని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వాళ్ల ప్రసూతి వార్డులోకి తీసుకురాగలిగాం. ఆ క్రమంలోనే మాలో ఒక నర్సు తూటాలకు ఒరిగిపోయింది. నేను తప్పించుకోగలిగాను’’ అని శుక్రవారం ఫోన్ ద్వారా ఎ.ఎఫ్.పి. (ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్) వార్తా సంస్థ ప్రతినిధికి అందుబాటులోకి వచ్చిన మిడ్వైఫ్ ఒకరు ఆనాటి దారుణాన్ని గుర్తుకొస్తున్నంత వరకు చెప్పగలిగారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కూడా ఆమె గొంతు వణుకుతుండటాన్ని ఆ ప్రతినిధి గమనించారు. ‘‘బయటి నుంచి వాళ్లు తలుపులు బాదుతూనే ఉన్నారు. నొప్పులు పడుతున్న తల్లి పక్కన నేను, ఇంకో నర్సు ఉన్నాం. డెలివరీకి అవసరమైన సామగ్రి ఉండే లేబర్ రూము కాదది. అరుపులు వినిపించకుండా నొప్పుల్ని భరించమని ఆ తల్లిని వేడుకున్నాం. ఆమె తన ప్రాణాల్ని బిగబట్టుకుని శిశువును ప్రసవించింది. అప్పుడు మాకు రెండు సమస్యలు వచ్చాయి. బిడ్డ ఏడుపు బయటికి వినిపించకూడదు. బొడ్డు తాడు కత్తిరించడానికి బ్లేడు లేదు. వట్టి చేతులతోనే నేను బొడ్డతాడు తెంపగలిగాను. బిడ్డ ఏడుపును ఆపలేకున్నా, నా వేలిని బిడ్డ పెదవులపై ఆన్చి కొంత శబ్దాన్ని తగ్గించగలిగాను. గదిలో టాయ్‌లెట్ పేపర్లు తప్ప వేరే ఏమీ లేవు. బిడ్డను, తల్లిని చుట్టడానికి నేను, నాతో ఉన్న నర్సు మా హెడ్ స్కార్ఫ్‌లను ఉపయోగించాం’’ అని చెప్పారు మిడ్ వైఫ్. కరోనాతో సతమతమౌతున్న ప్రపంచం మంగళవారం నాటి ఉగ్రదాడితో ఒక్కసారిగా నివ్వెరపోయింది. తల్లీబిడ్డల్ని లక్ష్యంగా చేసుకుని మారణహోమాన్ని సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ చరిత్రలో ఎన్నడూ జరగని అమానుష ఘటన ఇది. భద్రతాదళాలు వచ్చి ముగ్గురు దుండగుల్ని మట్టుపెట్టాక, గట్టి రక్షణ మధ్య తల్లుల్ని కోల్పోయిన పద్దెనిమిది మంది శిశువుల్ని చికిత్స కోసం అక్కడికి దగ్గరల్లోని అటాటుర్క్ ఆసుపత్రికి తరలించారు. అమృతం పట్టిన అమ్మ కాల్పుల అనంతరం బార్చి నేషనల్ ఆసుపత్రి నుంచి అటాటుర్క్ ఆసుపత్రికి తరలించిన పద్దెనిమిది మంది శిశువులకు తల్లులు లేకపోవడంతో పాలు దొరకడం కష్టమైపోయింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న ఫెరోజా ఒమర్ అనే 27 ఏళ్ల కాబూల్ మహిళ.. ఆకలితో అలమటిస్తున్న శిశువులకు తన స్తన్యం పట్టారు! మూడు గంటల వ్యవధిలో ఆమె తన పాలచుక్కలతో నలుగురు పసికందుల ప్రాణాలు నిలబెట్టారు. తల్లులపై ఉగ్రవాదులు దాడి చేశారన్న వార్త చూస్తున్న సమయంలో ఇంట్లో తన నాలుగు నెలల బిడ్డకు పాలు పడుతూ ఉన్నారు ఫెరోజా. ఆసుపత్రిలో ఆనాథ శిశువుకు పాలు పడుతున్న ఫెరోజా -
పదిలమైన పొదరిల్లు
అనాథ పిల్లలను, ఆదరణ కోల్పోయిన వృద్ధులను చేరదీసి పదిలంగా సంరక్షించాలన్న తన సంకల్పానికి కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందకపోవడంతో కుటుంబాన్నే వదులుకుని.. తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో ‘మాతృశ్య చైల్డ్ అండ్ ఓల్డేజ్ హోమ్’ను నెలకొల్పిన శ్రీదేవి మాటల్లో.. ఆమె జీవితాశయం, అవరోధాలు, సడలని సంకల్ప బలం ఇవన్నీ వ్యక్తం అయ్యాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే క్రాసింగ్ దగ్గర రైలు హఠాత్తుగా ఆగింది! ప్రయాణికులు కొందరు రైలు దిగి ముందు ఉన్న పట్టాలపై తదేకంగా చూస్తున్నారు. అప్పటివరకు ఆ పట్టాలపై తల పెట్టి పడుకున్న ఓ మహిళ చంటి బిడ్డను భుజంపై నుంచి చంకలోకి తీసుకుని లేచి పక్కకు వెళ్లింది. ఆ మహిళ బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిందని అక్కడున్న వారందరికీ అర్థమైంది. కానీ ఎవరూ ఆమెను పలకరించడానికి ముందుకు రాలేదు. ఆ మహిళ ముఖంలో బెరుకు, దుఃఖం కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణికుల్లో నుంచి ఒక మహిళ దిగి వచ్చి ‘‘ఎందుకు చనిపోవాలనుకున్నావు’’ అంటూ ఆమెను అడిగింది. ఆ బిడ్డ తల్లి తన జీవితంలోని కష్టాలను ఏకరువు పెట్టింది. చివరకు కట్టుకున్నవాడే తనను, తన బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ‘‘అయితే నా వెంట రా అంటూ’’ రైలు దిగిన మహిళ ఆమెను తనతో తీసుకెళ్లింది. పదేళ్ల క్రితం నాటి విషయం ఇది. ఆ తల్లీ బిడ్డను రక్షించి, సంరక్షించిన మహిళ శ్రీదేవి. ఆమె ఇంట్లో ఇప్పుడు తొంభై మంది పిల్లలు, పదమూడు మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. నాన్న మాట మనసులో పడింది ‘‘నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని సింగపేట మా ఊరు. మాది ఉమ్మడి కుటుంబం. మేము ఐదుగురు సంతానం. అందరం ఆడ పిల్లలమే. నాన్న రాజగోపాల్ తపాలా శాఖలో పనిచేసేవారు. చాలీ చాలని జీతం, కుటుంబ భారాన్ని మోయడానికి పంచాయతీ కార్యాలయంలో గుమాస్తాగా, ఓ లాయర్ వద్ద అసిస్టెంటుగా పనిచేసేవారు నాన్న. నేను పెద్ద కూతురు కావడంతో కొడుకులా పెంచారు. నాన్న ఎక్కడికి వెళ్లినా నన్ను తీసుకెళ్లేవారు. అలా ఓ రోజు నెల్లూరు పట్టణానికి వెళ్లాం. అక్కడ వడ్రంగి పని చేస్తున్న చిన్న పిల్లాడిని షాపు యజమాని కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నారని నాన్నను అడిగాను. ‘‘తల్లిదండ్రులు లేని పిల్లలు ఈ ధరణికి కూడా భారమే’’ అని నాన్న ఆవేదనగా అన్న మాట ఇప్పటికీ నా చెవిలో మారుమోగుతూనే ఉంది. అప్పుడే అనుకున్నాను అనాథలకు అండగా ఉండాలని. డిగ్రీ వరకు చదివాను. సాయం చేసే గుణం నాకు నా తండ్రి నుంచి అలవడింది. చిన్నతనంలోనే అనాథ పిల్లలను ఇంటికే తీసుకొచ్చేదాన్ని. అందుకు ఇంట్లోవాళ్లు అభ్యంతరం చెప్పేవారు. నాకు వివాహం జరిగిన తరువాత కూడా కుటుంబ సభ్యుల సహకారం అందలేదు. దీంతో తిరుపతికి వచ్చేశాను. మెస్‌కి అడ్రస్ చెప్పి పంపేవారు తిరుపతి డీఆర్ మహల్ వద్ద ‘నెల్లూరు వారి మెస్’ అనే పేరుతో హాటల్ ఆరంభించాను. అప్పుడు వంట చేయడంలో అనుభవం వచ్చింది. అప్పుడు కూడా ఆకలితో వచ్చేవారికి డబ్బులు లేకున్నా అన్నం పెట్టే పంపించేదాన్ని. అలా క్రమ క్రమంగా ఎక్కడెక్కడి అనాథలు, అభాగ్యులు మెస్‌కు వచ్చేవారు. పోలీసులు, ఆటోవాళ్లుకూడా శ్రీదేవి మెస్‌కు వెళ్లండి అన్నం పెడుతుంది అని యాచకులకు, అనామకులకు చెప్పేవాళ్లు. ఆ తరువాత క్రమంగా రైల్వేస్టేషన్, బస్స్టేషన్లలో ఉన్న పిల్లలను ఇంటికి తీసుకొచ్చాను. ఒకసారి ఒక పిల్లవాడికి జబ్బు చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్లాను. నాతో పాటు ముప్పై మంది పిల్లలు వచ్చారు. డాక్టర్ ఆశ్చర్యపోయి ఆరా తీశాడు. ఇలా పిల్లలను చేరదీస్తే, చట్టపరమైన ఇబ్బందులొస్తాయని, అనాథ శరణాలయం నడిపేందుకు అనుమతి తీసుకోవాలని చెప్పాడు. 2014లో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే తరువాత అనుమతి వచ్చింది. మాతృశ్య చైల్డ్ అండ్ ఓల్డేజ్ హోమ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాను. అవిలాలలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడే హోమ్ నడుపుతున్నాను. ఇల్లు.. బంగారం అమ్ముకున్నాను కుటుంబ సభ్యులు, భర్త సహకారం లేకపోయినప్పటికీ కష్టార్జితంతో హోమ్‌ను నడుపుతున్నాను. దీనికోసం సొంత ఇల్లు, బంగారు నగలు, హోటల్‌ను అమ్ముకున్నాను. ప్రస్తుతం కొందరు దాతలు సహకారం అందిస్తున్నారు. వారి సహకారంతో హోమ్‌లోని ముప్పై మంది పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నాం. నలభై మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వచ్చిన పిల్లలకు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నాం. కొంత మంది పిల్లలను వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అప్పగించాం. తోడూ నీడగా నా ఇద్దరు పిల్లలు నా ఇద్దరు పిల్లలు నాకు తోడునీడగా ఉంటూ హోమ్ నిర్వహణలో బాధ్యత పంచుకుంటున్నారు. మా అమ్మాయి శశికళ ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ పూర్తి చేసింది. అబ్బాయి సూర్య డిగ్రీ పూర్తి చేసి సీఏ వైపు వెళ్తున్నాడు. వీరిద్దరు పూర్తి స్థాయిలో హోమ్ బాధ్యత చూసుకుంటున్నారు. మానవ జన్మ అరుదు. ఈ జన్మను సార్థకత చేసుకోవడానికి ఈ సేవ చేసుకుంటున్నా. నలుగురు చెల్లెల్లో ఒక చెల్లి, మరిది మాత్రం నన్ను అర్థం చేసుకుని నా సేవను ప్రోత్సహిస్తున్నారు. హోమ్ పెట్టినప్పుడు నాన్న నన్ను ఆశీర్వదించి, భరోసా ఇచ్చారు. నాన్న చనిపోయి ఆరేళ్లవుతోంది. అయినప్పటికీ ఆయన నా వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు. ఇక్కడే చదివి.. ఇక్కడే సేవకు.. మానస (పేరు మార్చాం) పదో తరగతి సమయంలో హోమ్‌కు వచ్చింది. ఆ అమ్మాయి కోరిక మేరకు నర్సింగ్ చదివించాము. ప్రస్తుతం నర్సింగ్ పూర్తయి హోమ్‌లో పిల్లలు, వృద్ధులకు సేవలందిస్తోంది. చిన్నపాటి జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటికి మందులిస్తూ హోమ్‌లోనే ఉంటోంది. చిన్మయి (పేరు మార్చాం) చిన్నప్పటి నుంచి హోమ్‌లోనే ఉంటోంది. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంకో అబ్బాయి పలమనేరులో ఉన్న కేటిల్ ఫారం కోర్సు చదువుతున్నాడు. తీసుకెళ్లి.. తీసుకొస్తున్నాం వాణికి పుట్టుకతోనే అంధత్వం. అనంతపురం జిల్లాలోని ఓ పల్లెటూరుకు చెందిన వాణి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో అమ్మాయి తండ్రి, బంధువులు హోమ్‌లో చేర్పించారు. ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు తిరుచానూరులోని నవజీవన్ అంధుల పాఠశాలలో చదివించాం. ప్రస్తుతం శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతి రోజు ఉదయం కళాశాలకు తీసుకెళ్లి, సాయంత్రం హోమ్‌కు తీసుకువస్తున్నాం. హోమ్‌లో వృద్ధులలో బీపీ, షుగర్, పక్షవాతం, నడవలేని వారు ఉన్నారు. వీరిలో ఇద్దరికి మతిస్థిమితం లేదు. అయినా వారికి అన్ని రకాల వైద్య చికిత్సలు చేయిస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం. హోమ్‌కు అవసరమైన స్థలం ప్రభుత్వం కానీ, దాతలు కానీ ముందుకొచ్చి ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం అద్దె భవనంలో హోమ్ నడుపుతున్నాం. సొంతంగా స్థలం ఉంటే అద్దె డబ్బు మిగులుతుంది. ఆ డబ్బుతో పిల్లలకు, వృద్ధులకు మరింత మంచి సదుపాయాలు అందివ్వచ్చు’’ అన్నారు శ్రీదేవి. క్యాటరింగ్ చేసి, చీరలు విక్రయించి, పశుపోషణ ద్వారా పాలు విక్రయించి వచ్చే డబ్బుతో శ్రీదేవి ఈ హోమ్‌ను నడుపుతున్నారు. ఈ సంగతి పుట్టింటి వారికి, మెట్టినింటి వారికి తెలియడం ఆమెకు ఇష్టం లేదు. చిన్నతనంగా భావిస్తారని శ్రీదేవి భావన. మనసు పెద్దదైనప్పుడు.. ఏ పని మాత్రం చిన్నదౌతుంది?! – ఎస్.శశికుమార్ (ఎడ్యుకేషన్), సాక్షి, తిరుపతి -
అనాథ పిల్లలతో కళా వ్యాపారం?
మదనపల్లె టౌన్ : తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కున చేర్చుకుంటున్నట్టు చూపిస్తూ వారితో వ్యాపారం చేస్తున్నారు. కళను అడ్డుపెట్టుకుని అనాథల సేవ ముసుగులో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే పసిపిల్లలను రోజూ ఏదో ఒక ప్రాంతంలో జరిగే జాతరలు, కార్యక్రమాలకు తీసుకెళ్లి సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారుజాము వరకు కోలా టాలు, చెక్క భజనలు చేయిస్తున్నారు. ఇందుకు గాను నిర్వాహకుల నుంచి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు తీసుకుంటున్నట్టు తెలిసింది. రాత్రంతా ప్రదర్శన కారణంగా పిల్లలు నిద్రలేమితో అనారోగ్యంతో బాధపడుతూ చదువులు కొనసాగించలేకపోతున్నారు. అనాథలైన పిల్లలు తమకు అన్నం పెట్టే యజమానిని ఎదిరించలేక వారి ధనార్జనకు పావులుగా మారుతున్నారు. మదనపల్లె పట్టణం బర్మా వీధిలో ఒక వ్యక్తి 15 ఏళ్లుగా అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇక్కడ సుమారు 70 మందికి పైగా 2 నుంచి 18 ఏళ్లలోపు అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమ నిర్వహణకు మదనపల్లెతోపాటు రూరల్‌లోని పలువురు దాతలు విరాళాలతోపాటు విద్యకు సంబంధించి సామగ్రి, దుస్తులు ఇస్తున్నారు. అలాగే పౌష్టికాహారాన్ని సరాఫరా చేస్తున్నారు. అవి పిల్లలకు అందడం లేదు. నిర్వాహకుడు అవి చాలలేదని పేర్కొంటూ రూ.వేలకు వేలు ఒప్పందం కుదుర్చుకుని పిల్లలతో రాత్రిళ్లు కోలాటాలు, చెక్క భజనలు చేయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అనాథ ఆశ్రమంలో పిల్లలకు సేవ చేస్తున్నట్టు అధికారులను, స్థానికులను నమ్మిస్తూ ధనాన్ని ఆర్జిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా తన స్వార్థ ప్రయోజనానికి సేవ ముసుగు తొడిగాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా చేస్తున్నట్టు చెబుతున్నారు. వారం రోజులుగా కోలాటాలు, చెక్క భజనలు మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగ జాతర సందర్భంగా వారం రోజుల నుంచి పిల్లలు రాత్రిళ్లు కోలాటాలు, చెక్క భజనలు చేశారు. మంగళవారం రాత్రి కదిరి రోడ్డులో ఉన్న అమ్మచెరువుమిట్టపై జరిగిన గంగజాతరలోనూ రికార్డు డ్యా న్సు చేశారు. వారికి విశ్రాంతి ఇవ్వకుండా బుధవారం రాత్రి మళ్లీ రాయచోటిలో జరుగుతున్న జాతరలో చెక్కభజనలు, కోలాటాల కోసం పంపించారు. ఇంత జరుగుతున్నా సీడీపీవోగాని, చైల్డ్ కమిషన్ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమం పేరుతో జరుగుతున్న కళావ్యాపారంపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది. దీనిపై ఆశ్రమ నిర్వాహకుడిని వివరణ కోరగా ఆశ్రమంలో 70 మంది పిల్లలు ఉన్నారని తెలి పారు. వారికి విద్య సామగ్రితోపాటు దుస్తులు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. అంతేగాక భోజనాలు కూడా సమకూర్చేందుకు డబ్బు సరిపోకపోవడం లేదని, అందువల్లే చెక్క భజన లు, కోలాటాలు చేయిస్తున్నామని తెలిపారు. వ్యాపారం కోసం కాకుండా పిల్లలను సాకేందుకే ఇలా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎస్పీకి ఫిర్యాదు పిల్లలకు విశ్రాంతి లేకుండా కళల పేరుతో పిల్లలతో వ్యాపారం చేస్తున్న ఆశ్రమ నిర్వాహకుడిపై చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. కలెక్టర్‌కు లేఖ రాశాం. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. – అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్ అధ్యక్షుడు, హైదరాబాద్ -
ఎనిమిదడుగుల బంధం
ఇద్దరు ఒకటవ్వాలంటే.. ఏడడుగుల బంధం సరిపోతుంది. కానీ పెళ్లిచేసుకున్నాక ఉండేదిఈ సమాజంలోనే..బతికేది ఈ ప్రకృతిలోనే.. కదా. అందుకే పెళ్లిచేసుకునేటప్పుడుతనూ నేనే లోకం అని కాకుండాతను, నేను, లోకమూ ఉండాలనిఏడడుగులకు ఇంకొక్క అడుగు వేస్తే..ఎనిమిదో అడుగూ వేస్తే..అదే నిజమైన వివాహబంధం అవుతుంది! కట్నంగా ఐదు మొక్కలు ఉత్తర ప్రదేశ్‌లో ఓ పెళ్లికొడుకు. పేరు తపన్ పాండే. పెళ్లికి స్పెషల్ గెస్ట్‌లను ఆహ్వానించాలను కున్నాడు. వధువు అంజలి మిశ్రా కూడా ఓకే చెప్పింది. అలా వారి పెళ్లికి ఆ ప్రత్యేక ఆహ్వానితులు విచ్చేసి సంతోషంగా గడిపారు. ఆ ఆహ్వానితులు అనాథపిల్లలు! వాళ్లలో కొందరు వికలాంగులు. అంతటితో అయిపోలేదు. వధూవరులిద్దరూ తమ కళ్లను దానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. పెళ్లికి కట్నం ఇచ్చి తీరాలని కూడా డిమాండ్ చేశాడు పెళ్లి కొడుకు! అయితే ఆ కట్నం.. అతడిని నేరస్థుడిని చేసి జైలు పాలు చేసేది కాదు. కట్నంగా అతడు అడిగి తీసుకున్నవి ఐదు మొక్కలు! పెళ్లి సందర్భంగా మామగారిచ్చిన ఆ మొక్కలను ఇంటి పెరట్లో నాటుకున్నాడు అల్లుడుగారు. మూగ జీవులకు రిసెప్షన్ మహారాష్ట్రలో మరో పెళ్లి కొడుకు ఆదిత్య తివారి. అతడు పెళ్లి నాటికే ఓ బిడ్డకు తండ్రి! సింగిల్ పేరెంట్. దత్తత స్వీకార నిబంధన మార్పు కోసం రెండేళ్లుగా సామాజిక పోరాటం చేస్తున్న ఆదిత్య.. తన పెళ్లి సందర్భంగా ‘డౌన్స్ సిండ్రోమ్’తో బాధపడుతున్న ఓ బిడ్డను దత్తత చేసుకున్నాడు. అతడి పెళ్లి వేడుకకు హాజరైన వారిలో పది వేల మంది నిర్వాసితులు, వృద్ధులు, అనాథలే. ఆ రోజు స్థానిక జూలోని వెయ్యి జంతువులకు, వందలాది వీథి కుక్కలకు ఆహారం పెట్టారు. ఆహ్వానితులు వెయ్యి మొక్కలు నాటారు. వచ్చిన కానుకలకు బదులుగా అందరికీ పుస్తకాలు, మందులు తిరుగు కానుకగా ఇచ్చాడు ఆదిత్య. వధువుకు మంచి పుస్తకాలు మలయాళీ వధువుది మరో మార్గం. అత్తవారింటి వారు పెళ్లి సందర్భంగా వధువుకి ఖరీదైన దుస్తులు, నగలు బహుమతిగా ఇవ్వడం అక్కడి సంప్రదాయం. అయితే వాటికి బదులుగా యాభై మంచి పుస్తకాలను బహుమతిగా ఇవ్వమని కోరింది. వధువు సాహ్లా ముచ్చట తీర్చడానికి వరుడు అనీష్ స్వయంగా బెంగళూరు వెళ్లాడు. అవును మరి, ఆమె కోరిన పుస్తకాలు చిన్న పట్టణాలలో దొరికేవి కావు. ఆమె కోరిన అరుదైన పుస్తకాల కోసం బ్లోసమ్స్, గంగారామ్స్, బుక్‌వార్మ్ వంటి షాపులన్నీ గాలించాడు. వాటిలో ఇస్లామిక్ ఫెమినిస్ట్ లిటరేచర్, ఫిక్షన్, పాలిటిక్స్ వంటివి ఉన్నాయి. ‘‘మెహర్ అనేది మహిళ హక్కు. ఆమె హక్కును గౌరవంగా తీర్చాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. ఆ బాధ్యతను నెరవేర్చాను. అంతే తప్ప ఇదేమీ నా ఉదారత కాదు’’ అంటున్నాడు అనీస్. వితంతువులకు ప్రత్యేక ఆహ్వానం గుజరాత్‌లోని వ్యాపారి జితేంద్ర పటేల్ తన కొడుకు పెళ్లికి పాటించిన వైవిధ్యత మూఢనమ్మకాలకు చెంపపెట్టుగా నిలిచింది. దేశం ఎంత అభివృద్ధి చెందినా, మన సమాజంలో శుభకార్యాలకు వితంతువులను ఆహ్వానించడానికి వెనుకాడే దుస్సంప్రదా యం ఇంకా ఉంది. దానిని చెరిపేసే ప్రయత్నంలో భాగంగా తన పెళ్లికి వితంతువులను ఆహ్వానించాడు జితేంద్ర. పెళ్లికి వచ్చిన 18 వేల మంది వితంతువులకు అతడు అందమైన శాలువాలు, ఫలాలనిచ్చే మొక్కలు పంచారు. వారిలో జీవనాధారం లేని ఐదు వందల మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలిచ్చే ఆవుని కూడా ఇచ్చాడు జితేంద్ర పటేల్. ప్రమాణాలకు బదులు ప్రతిజ్ఞ గుజరాత్‌కే చెందిన మరో వ్యాపారి గోపాల్ వస్తాపారా తన కొడుకు పెళ్లితోపాటు ‘తోడుపెళ్లి’లా మరో వంద మంది ఆడపిల్లలకు పెళ్లి చేశాడు! చెవులు చిల్లులు పడే బ్యాండ్ బాజాలకు, ఇతరత్రా హంగామాలకు చేసే దుబారాను తగ్గించి ఆ డబ్బుతో అల్పాదాయ వర్గాల వధూవరులకు సామూహికంగా వివాçహాలు జరిపించాడు. గోపాల్ వస్తాపారా కొత్త దుస్తులిచ్చి, పెళ్లి చేసి, అక్షింతలు వేసి ఆశీర్వదించి అంతటితో ఊరుకోలేదు. ఆ వందమంది దంపతులతో ‘ఆడపిల్లలను కాపాడుతాం, అలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తాం’’ అని ప్రతిజ్ఞ చేయించాడు. కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలియగానే భ్రూణహత్యలకు పాల్పడడం, పుట్టగానే చంపేయడం అనే దుస్సంప్రదాయానికి అడ్డు కట్ట వేయడానికి తన వంతుగా బాధ్యత తీసుకున్నాడు. ‘బేటీ బచావో’ అని వందల మంది చేత వందలసార్లు ప్రమాణాలు చేయించడం కంటే వైవాహిక జీవితం మొదలు పెట్టిన కొత్త దంపతుల చేత ప్రతిజ్ఞ చేయించడం మంచిదనుకున్నాడు. సైకిల్ ర్యాలీ సందేశం సూరత్‌లో దాదాపు 250 మంది పెళ్లి కొడుకులు సైకిల్ ఎక్కి సందేశం ఇచ్చారు. వాతావరణ కాలుష్యం పట్ల అవేర్నెస్ తీసుకురావడానికి ఆ యువకులు చేసిన ప్రయత్నం ఇది. ఉత్తర భారత దేశంలోని ఢిల్లీ, సూరత్ వంటి అనేక నగరాలు విపరీతమైన వాయు కాలుష్యానికి లోనయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ సంగతి గుర్తు చేస్తూ వాహనాల వాడకం తగ్గించాలని, లేకపోతే ఊపిరి తిత్తుల సమస్యలు ఎదురవుతాయని, జనజీవనం ప్రమాదంలో పడనుందని ఏటా హెచ్చరికలు ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సూరత్‌లో యువకులు వాయు కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాల మీద చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టయిల్‌ను పరిచయం చేయాలనుకున్నారు. పెళ్లి దుస్తుల్లో బంధువులతో కలసి సైకిళ్లెక్కి సూరత్ పట్టణంలో చక్కర్లు కొట్టారు. ‘ఆత్మహత్య’ రైతుల పిల్లలకు విరాళం ఈ వధూవరుల పేర్లు అబే దివారే, ప్రీతీ కుంభారే. వీళ్లది మహారాష్ట్ర. ఇద్దరూ ఐఆర్ఎస్ ఉద్యోగులు. నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లికి ఖర్చు చేయాలనుకున్న డబ్బుని ఆత్మహత్య చేసుకున్న పదిమంది రైతుల పిల్లల చదువు కోసం ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇంకా వారందరికీ కలిపి 50 వేల రూపాయల పుస్తకాలు, ఐదు లైబ్రరీలకు కూడా ఆర్థిక సహాయం చేశారు. – మంజీర -
అందమైన ప్రేమ
ప్రేమలో అందం.. అందం కానిది.. రెండూ ఉంటాయా? ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది కదా? మరి హన్సిక ప్రేమే అందమైనదని ఎందుకనుకోవాలి? చిన్నప్పుడు అమ్మను ప్రేమిస్తాం.. టీచర్ని ప్రేమిస్తాం... తోబుట్టువులను ప్రేమిస్తాం.. మరీ స్ట్రిక్ట్‌గా లేకపోతే నాన్నని కూడా ప్రేమించేస్తాం హన్సిక అంత వయసొచ్చిన తర్వాత ‘ఆ... ప్రేమలు’ ఎలాగూ ఉంటాయి. కానీ, హన్సిక మాత్రం... 30 మంది అనాథ పిల్లల్ని ప్రేమించింది. సైనికులను ప్రేమించింది.. వృద్ధుల్ని ప్రేమించింది. ప్రేమలో ఇంతకు మించిన అందం ఉంటుందా? మరి... ఇంతగా ప్రేమించే అమ్మాయికి అంతే అందంగా ప్రేమించే అబ్బాయి దొరకాలి కదా... వియ్ హోప్ సో... ⇔ అప్పుడప్పుడూ తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగు ఇండస్ట్రీకి గెస్ట్‌లా అయ్యారు. మీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు తెలుసా? నా మీద అంత ప్రేమ ఉందని వినడానికి బాగుంది. సేమ్ టైమ్ బాధగానూ ఉంది. ఇప్పుడు గోపీచంద్ పక్కన చేసిన ‘గౌతమ్ నంద’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగులో ఇప్పటివరకూ చేయని పాత్రని ఇందులో చేశా. అంత వెరైటీ రోల్లో చూసి, నా ఫ్యాన్స్ ఖుష్ అవుతారనుకుంటున్నా. ⇔ ఇంతకీ తెలుగు ఇండస్ట్రీలో ఏమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా ఏంటి? ఇక్కడ సినిమాలు తగ్గించేశారు? అబ్బే.. అలాంటిదేమీ లేదండీ. ఇక్కడివాళ్లు వెరీ స్వీట్. ఇక చేదు అనుభవాలు ఎందుకుంటాయి చెప్పండి? సౌత్‌లో నాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చినది తెలుగు పరిశ్రమే. నాకు తల్లిలాంటిది. బిడ్డను తల్లి ఇబ్బందుల పాలు చేస్తుందా? ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఛాన్స్ ఇస్తుంది. ముఖ్యంగా మంచి క్యారెక్టర్ ఉంటే ఇక్కడివాళ్లు నాకు ఆఫర్ చేయకుండా ఉండరు. తమిళంలో ఈ మధ్య మంచి ఆఫర్స్ రావడంతో అక్కడి సినిమాలకు సైన్ చేశా. ⇔ అంటే... తెలుగులో ఎగై్జటింగ్ ప్రాజెక్ట్స్ తగ్గాయంటున్నారా? నా ఉద్దేశం అది కాదు. నేనేదో ఒక తమిళ సినిమాకి డేట్స్ ఇచ్చిన టైమ్‌లో సరిగ్గా తెలుగు నుంచి ఒక మంచి ఆఫర్ వస్తుంది. బాధపడుతూనే ఆ సినిమా వదులుకుంటా. ఇలా డేట్స్ క్లాష్ వల్ల ఈ మధ్య కొన్ని సినిమాలు వదులుకున్నా. ఎంత బిజీగా ఉన్నానంటే.. ప్రతి సంవత్సరం రెండు వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటా. ఈ సమ్మర్లో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుందామని ట్రై చేశా. ఊహూ.. కుదరలేదు. మరి.. ఈ ఇయర్లో ఇంకో వెకేషన్ కుదురుతుందో లేదో చూడాలి. ⇔ తెలుగు, తమిళ్ చేసేశారు.. సౌత్‌లో వేరే భాషల్లో ..? ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నా. అందులో మోహన్‌లాల్ హీరో. నాది గెస్ట్ రోల్. కొంచెం నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్. ⇔ బహుశా మీరు గత జన్మలో సౌత్‌లో పుట్టి ఉంటారేమో.. అందుకే ఇక్కడ హీరోయిన్గా సెటిలైపోయారు? మా అమ్మగారు కూడా ఇలానే అంటారు. నాక్కూడా ఆ ఫీలింగ్ ఉంది. మరి.. తెలుగు వాళ్లింట్లో పుట్టానో... తమిళ వాళ్లింట్లో పుట్టానో. ఇప్పుడు మలయాళ సినిమా చేస్తున్నా కాబట్టి, కేరళలో పుట్టానో (నవ్వుతూ). మొత్తానికి సౌత్‌తో స్ట్రాంగ్ కనెక్షనే ఉందనిపిస్తోంది. ⇔ గత జన్మలను నమ్ముతారా ? అసలెప్పుడూ వాటి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అలా అన్నాను. మన ఊహకందని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయ్. గత జన్మ అనేది ఉంటుందా? ఆ విషయంలో నా నమ్మకం ఎలా ఉన్నా దేవుణ్ణి మాత్రం ఫుల్‌గా నమ్ముతాను. ⇔ దేవుణ్ణి నమ్ముతారు కానీ, పాపం గుడికి వెళ్లి ప్రశాంతంగా దండం పెట్టుకోవడం కష్టం కదా? అది నిజమే. వారంలో ఒక్కసారైనా నాకు ఏదో ఒక గుడికి వెళ్లే అలవాటు ఉంది. దర్శనం చేసుకుని, ప్రదక్షిణాలు చేయడం ఇష్టం. నేనేమో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే, నా చుట్టూ కొంతమంది తిరుగుతారు. అదే పనిగా చూస్తారు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, ఆ ప్రేమను అర్థం చేసుకుంటాను కాబట్టి, తర్వాత నవ్వుకుంటాను. ⇔ అవునూ... ముప్ఫైఒక్క మంది పిల్లలకు తల్లయ్యారు కదా.. భార్య ఎప్పుడవుతారు? అయ్య బాబోయ్. ఈ ప్రశ్న వింటే పక్కన బాంబు పడినట్లు అనిపించింది. కానీ, భలే నవ్వొస్తోంది. పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందండీ. నా ఏజ్ జస్ట్ పాతికేళ్లే కదా. అప్పుడే పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నారా? ⇔ సమాజంలో జరిగే దారుణాలు విన్నప్పుడు ఏమనిపిస్తోంది? బాధపడటం తప్ప మనమేం చేయలేం. తప్పు చేయకూడదనే భావన ఎవరికి వాళ్లకి ఉండాలి. తప్పు చేసే ముందు దీనివల్ల ఎంతమంది బాధపడతారు? అని ఆలోచిస్తే తప్పులు చేయరేమో. తప్పు చేయకుండా బతికితే, ఎంత హాయిగా ఉంటుందో ఆలోచించ మంటున్నా. ‘మనం ఎవరికీ హాని చేయడంలేదు’ అనే భావన మనల్ని ధైర్యంగా బతికేలా చేస్తుంది. ⇔ ఆ 31 మంది చిల్డ్రన్ గురించి చెప్పండి.. అసలు ఇంత మందిని ఎందుకు దత్తత తీసుకోవాలనిపించింది? నా విషయంలో దేవుడు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడని నా ఫీలింగ్. మంచి కుటుంబంలో పుట్టాను. ఆర్థిక కష్టాలు తెలియవు. అందుకే ఆ కష్టాల్లో ఉన్న పిల్లలను ఆదుకోవాలనిపించింది. డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాక పిల్లలను దత్తత తీసుకోవడం మొదలుపెట్టాను. వాళ్లందరూ అనాథలు కాదు. తల్లిదండ్రులు ఉన్నారు. కానీ, పిల్లల కనీస అవసరాలను తీర్చలేని స్థితిలో ఉన్నారు. వారికి ఆహారం, చదువు వంటి విషయాలను నేను చూసుకుంటాను. ⇔ ఈ మధ్య కొందరు హీరోయిన్లు ‘ఇండస్ట్రీలో హెరాస్మెంట్ ఎక్కువండీ బాబూ’ అంటున్నారు.. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నవాళ్లు అంటున్నారేమో. నేనైతే హ్యాపీ. టీనేజ్‌లో ఇక్కడికొచ్చా. ప్రపంచం పెద్దగా తెలియని వయసు. ఒకవేళ నాకిక్కడ పరిస్థితులు సరిగ్గా అనిపించకపోయి ఉంటే వెళ్లిపోయేదాన్ని. చాలా విషయాల్లో నేను లక్కీ. సినిమాల్లోకి రావడం, సక్సెస్ అవ్వడం, తెలుగు నుంచి తమిళ్‌కి వెళ్లడం, అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగడం.. అంతా బాగుంది. ⇔ ఇంతమంది పిల్లలకు కావల్సిన సౌకర్యాలు సమకూర్చడం అంటే చాలా టైమ్ కావాలి కదా? ఆ విషయంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. మా అమ్మగారు ఉన్నారు కదా. ఆవిడ చూసుకుంటారు. ⇔ మీతో పాటు మీ అమ్మగారు కూడా షూటింగ్ లొకేషన్స్‌కి వచ్చేవారు. ఇప్పుడూ అంతేనా? స్టార్టింగ్‌లో వచ్చేవారు. అప్పుడు టీనేజ్‌లో ఉన్నాను. ఏమీ తెలియదు కాబట్టి, నాతో పాటు లొకేషన్లో ఉండేవారు. నాకు ఇండస్ట్రీ అలవాటయ్యేవరకూ సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు నేను పాతికేళ్ల అమ్మాయిని. మేనేజ్ చేసుకోగలను. అందుకే అమ్మ రావడం లేదు. పైగా దత్తత తీసుకున్న పిల్లల వ్యవహారాలు చూసుకోవాలి. అలాగే లొకేషన్లో గంటలు గంటలు కూర్చుని ఉండటం వల్ల పెద్ద వయసువాళ్లకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇన్నేళ్లు అమ్మ నన్ను వెన్నంటే ఉండి నా బాగోగులు చూసుకుంది. ఇప్పుడైనా రెస్ట్ ఇవ్వాలి కదా. ⇔ ఇంతకీ సినిమాలంటూ బిజీగా ఉండటమేనా? కొత్తగా ఎవరితోనైనా లవ్‌లో పడ్డారా? సినిమాలు ఫ్రంట్ సీట్.. లవ్ బ్యాక్‌సీట్. ప్రస్తుతానికి దృష్టంతా ఫ్రంట్ స్ట్రీట్ పైనే. ⇔ పిల్లల్ని చదివిస్తున్నారు.. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు... దేశం కోసం ప్రాణాలు సైతం వదలడానికి వెనకాడని మన సైనికుల గురించి ఏమంటారు? ఎవరో వస్తారు.. ఏదో చేసేస్తారు? అనే భయం వెంటాడితే మనం ప్రశాంతంగా ఉండగలమా? సరిగ్గా తిండి తినగలుగుతామా? హాయిగా నిద్రపోగలుగుతామా? ఇక్కడ మనం మన కుటుంబ సభ్యులతో చీకూ చింతా లేకుండా ఉంటున్నాం. కానీ, అక్కడ మనవాళ్లు నిద్రాహారాలు లేకుండా దేశాన్ని రక్షించడానికి పాటుపడుతున్నారు. ప్రాణాలతో తిరిగొస్తారనే గ్యారెంటీ లేదు. అది తెలిసి కూడా వెళుతున్నారంటే ఎంత గొప్ప వ్యక్తులో అర్థం చేసుకోవచ్చు. అందుకే మన సైనికులందరికీ నా ‘సెల్యూట్’. ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేశాక సోల్జర్స్ కోసం ఏదైనా చేయాలి. ఇప్పుడు వాళ్ల గురించి ఇంత మాట్లాడాక, ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. తప్పకుండా చేస్తా. – డి.జి. భవాని -
అనాథ పిల్లలకు రూ.10వేల సాయం
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంట(హుజూరాబాద్): అనాథ పిల్లలందరినీ గుర్తించి సర్కారు బడుల్లో చేర్చుతామని, వారి భవిష్యత్ కోసం ప్రభుత్వం నుంచి రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వర్తకసంఘంలో మేదర ఉద్యోగుల సంఘం నాయకులు చదువులో ప్రతిభ చూపిన అనాథలకు ప్రతిభా పురస్కార్ అవార్డులు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ పేద కుటుంబాల పిల్లలు, అనాథలను ఆదుకునేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనాథలు ఎంతమంది ఉన్నా.. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిళి రమేశ్, సహకార సంఘాల యూనియన్ రాష్ట్ర చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అనాథ పిల్లల వివరాలు అందజేయాలి
పోచమ్మమైదాన్ : జిల్లాలోని స్వచ్ఛం ద సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న 18 ఏళ్లలోపు అనాథ పిల్లల వివరాల ను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అందజేయాలని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అని తారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిల్లల వివరాలను www.missingperson.tg.nic.in పెట్టి లైసెన్స్‌లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీడబ్ల్యూసీకి వివరాలు అందజేయకుండా సంస్థలను నడిపి తే నేరమన్నారు. వారిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంటాం
దత్తతకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలు నవాబుపేట: ఆ ఇద్దరు అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటామని పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. సార్.. మమ్మల్ని చదివించండి’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన నందిని, శృతి గురువారం నిర్వహించిన రెవెన్యూ దర్బార్‌లో తహసీల్దార్ చెన్నకిష్టప్పకు మొరపెట్టుకున్నారు. దీనిపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి హైదరాబాద్‌కు చెందిన సర్వ్‌నీడి, మెటాస్కాన్ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ విషయంలో తహసీల్దార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి అందరి అనుమతితో దత్తత తీసుకుని చదివిస్తామని వెల్లడించాయి. కాగా, గురుకుంటకు చెందిన నందిని, శృతిల మేనత్త, గ్రామస్తులతో చర్చించి వారి దత్తత విషయం ప్రకటిస్తామని, చిన్నారులదే తుది నిర్ణయమని తహసీల్దార్ చెన్నకిష్టప్ప వివరించారు. -
అంతటా చీకటే..!
ఏపీ, తెలంగాణలో భయానకంగా అనాథ బాలల పరిస్థితి అభం శుభం ఎరుగని చిన్నారులు వారు.. తల్లిదండ్రులూ లేక, తమవారనేవారెవరూ లేక అనాథ శరణాలయాల పాలవుతున్నారు.. నిర్వాహకుల దుష్కృత్యాలకు బలయిపోతున్నారు.. మగపిల్లలు కట్టుబానిసలుగా, పారిపోయి దొంగలుగా మారిపోతుంటే.. ఈడొచ్చిన ఆడపిల్లలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు, వ్యభిచార గృహాలకు తరలుతున్నారు.. నిండా అంధకారంలో మగ్గిపోతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనాథ బాలల పరిస్థితి భయానకంగా ఉంది. ఇరు రాష్ట్రాల్లో 1998లో నమోదైన 12 ఏళ్లలోపు అనాథ బాలికల సంఖ్య 4.75 లక్షలు. ఇప్పుడు వారి సగటు వయసు దాదాపు 25 ఏళ్లు. మరి వారంతా ఎక్కడున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎలాంటి జీవితం గడుపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆందోళన కలిగించేవిగా ఉంటున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగా అత్యధికుల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయి. చాలా మంది వ్యభిచార గృహాలకు చేరి దుర్భర జీవితం గడుపుతున్నారు. గత పదేళ్లలో పోలీసులు పలుమార్లు పుణే, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లోని వ్యభిచార గృహాలపై దాడులు జరిపినపుడు బయటపడ్డ తెలుగు అమ్మాయిల్లో అత్యధికులు అనాథ శరణాలయాల్లో పెరిగినవారే. వాటి నిర్వాహకుల స్వార్థానికి బలైనవారే. నిర్వాహకులకు సంపాదన తెచ్చిపెట్టే ‘వస్తువులు’గా మారుతున్నారు. కొందరు నిర్వాహకులు బాలికలను లైంగిక దోపిడీకి గురి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న ఓ అనాథ శరణాలయంలో ఆరుగురు అమ్మాయిలు పెళ్లికాకుండానే గర్భం దాల్చిన ఘటన అనాథ బాలికల భయానక పరిస్థితులకు ప్రత్యక్ష సాక్ష్యం. ఆ ఆరుగురికి పుట్టిన పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని శిశు సదనంలో అనాథలుగానే పెరుగుతున్నారు. - శరణాలయాల నిర్వాహకుల స్వార్థానికి బలవుతున్న బాల్యం - వెట్టిచాకిరీ, లైంగిక దోపిడీతో నిత్యం సతమతం - వ్యభిచార గృహాలకు తరలుతున్న ఆడపిల్లలు - ఆశ్రమాల్లో ఉన్నప్పుడే గర్భం దాల్చుతున్న దుస్థితి - కట్టుబానిసలుగా మారుతున్న మగపిల్లలు - ఆ బాధలు తట్టుకోవడానికి పారిపోయి దొంగలుగా జైళ్లకు.. - పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - నానాటికీ పరిస్థితి మరింత ఆందోళనకరం అలివేలు ఎక్కడ? చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు గా మిగిలిన శేఖర్, అలివేలు వేర్వేరు అనాథాశ్రమాల్లో పెరిగారు. అలివేలు కంటే రెండేళ్లు పెద్దయిన శేఖర్‌కు చదువుకోవడం ఇష్టం లేదు. దీంతో అనాథాశ్రమం నిర్వాహకుడు తన ఇంటి పనులకు ఆ బాలుడ్ని వినియోగించుకున్నాడు. పద్నాలుగేళ్లు వచ్చాక సదరు నిర్వాహకుడి ఇంటి నుంచి శేఖర్ పారిపోయి ఓ హోటల్లో పనిచేస్తూ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. పోలీసులు అరెస్టు చేసి జువెనైల్ హోమ్‌కు తరలించారు. మైనారిటీ తీరడంతో ఇప్పుడు అతను చర్లపల్లి జైలులో ఉన్నాడు. మరి అతని చెల్లెలు అలివేలు ఏమైంది? ఆమె ఆచూకీ లేదు. విజయవాడలో ఓ అనాథాశ్రమంలో ఉందని మాత్రమే అతనికి తెలుసు. అతనిచ్చిన సమాచారం మేరకు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆ అనాథాశ్రమానికి వెళ్లి ఆరా తీస్తే తమ వద్ద లేదని చెప్పారు. వారి స్వస్థలమైన ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఆరా తీసినా... ఆమె ఆచూకీ తెలియలేదు. మరి అలివేలు ఏమైంది.. ఎక్కడుంది? వ్యభిచార గృహాలకు విధి వంచితులు విధి వంచితులై అనాథాశ్రమాల్లో చేరుతున్న బాలికల్లో వేలాది మంది ఆచూకీ లేదు. కొందరు స్వార్థపరులైన అనాథాశ్రమాల నిర్వాహకులు బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్న ఆరోపణలున్నాయి. మరికొందరు వారి పనుల కోసం పలుకుబడి కలిగిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల దగ్గరకు అనాథ బాలికలను పంపుతున్నారు. ఇటీవల తెలంగాణ సీఐడీ పోలీసులు పుణెలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసినప్పుడు దొరికిన అమ్మాయిల్లో అత్యధికులు బలవంతంగా ఆ రొంపిలోకి దిగినవారే. వారిలో అత్యధికులు అనాథ బాలికలే. 2011లో ఉమ్మడి రాష్ట్ర పోలీసులు ఢిల్లీలో వ్యభిచారగృహాలపై దాడులు నిర్వహించినప్పుడు దొరికిన వంద మంది మహిళల్లోనూ 43 మంది అనాథాశ్రమాల నుంచి వ్యభిచారగృహాలకు తరలించబడ్డవారే. ‘‘పుణె, ముంబై, కోల్‌కతా, ఢిల్లీలలోని వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న తెలుగు వారిలో అత్యధికులు అనాథ బాలికలే. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో దాదాపు 540 మందిని ఆ కూపం నుంచి బయటకు తీసుకువచ్చాం. వారు వ్యభిచార కేంద్రాలకు ఎలా చేరుకుందీ తెలుసుకుని, బాధ్యులైన 63 మందిపై కేసులు నమోదు చేశాం. అందులో అరడజను మంది వ్యభిచార నిర్వాహకులు ఉన్నారు..’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దుర్మార్గాలకు నేతల అండ! అనాథాశ్రమాల ముసుగులో నిర్వాహకులు బాల బాలికల శ్రమను దోపిడీ చేస్తున్నారని కేంద్రానికి అందిన నివేదిక స్పష్టం చేసింది. బాలికలను లైంగిక దోపిడీ చేస్తున్నారని, వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారని వెల్లడించింది. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం... మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఢిల్లీలోని 63 అనాథాశ్రమాలపై వేటువేసింది. వాటిలోని బాల బాలికలను ప్రభుత్వరంగంలోని ఆశ్రమాలు, కార్పొరేట్ సంస్థల అధీనంలోని శరణాలయాలకు తరలించాలని ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఏపీలో 11 అనాథాశ్రమాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అప్పటి పార్లమెంట్ సభ్యుడొకరు కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాశారు. తనతో పాటు మరికొందరు పార్లమెంట్ సభ్యుల సంతకాలతో వినతిపత్రం అందజేశారు. ఆందోళనకర విషయం ఏమిటంటే ఆ జాబితాలో ఉన్న ఓ అనాథ శరణాలయానికి (హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలో) చెందిన అరడజను మంది బాలికలు పెళ్లికాకుండానే గర్భవతులై పిల్లలను కన్నారు. వారంతా ఇప్పుడు అమీర్‌పేట శిశుసదనంలో అనాథలుగానే పెరుగుతున్నారు. దశాబ్దకాలంలో రూ.1,186 కోట్లు అనాథ బాలల సంరక్షణ బాధ్యతలు చూస్తున్నామంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 128 స్వచ్ఛంద సంస్థలు గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం, విదేశీ దాతృత్వ సంస్థలు, దేశంలోని వివిధ ప్రైవేట్ ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుంచి దాదాపు రూ.1,186 కోట్ల మేర విరాళాలు అందుకున్నాయి. అంటే సగటున రూ.పదికోట్ల చొప్పున అనాథ శరణాలయాలకు అందాయి. అన్ని సంస్థలు ఈ నిధులు ఖర్చు చేస్తున్నాయా లేదా సొంతంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నాయా అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కింద విచారణకు ఆదేశించినా... ఇప్పటికీ ఆ నివేదిక ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇలా ఓ వైపు విరాళాలు అందుకుంటూనే మరోవైపు బాల బాలికల చేత భిక్షాటన చేయిస్తున్న శరణాలయాలు ఏపీ, తెలంగాణల్లో చాలా ఉన్నాయి. అనాథల పేరిట వసూళ్లు హైదరాబాద్‌లో ఏ జంక్షన్లో అయినా రెడ్‌లైట్ పడిందంటే చాలు అరడజను మంది బాలికలు కార్లు, ద్విచక్రవాహనదారుల దగ్గరకు వెళ్లి.. అ నాథల కోసం అని రాసిఉన్న ఒక బాక్స్ చూపి తోచినంత డబ్బు వేయాలని అడుగుతారు. ఇప్పుడు హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణల్లోని ప్రముఖ నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్‌లలో ఇది నిత్యకృత్యం. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఈ దృశ్యాన్ని చూసిన ఓ ఐపీఎస్ అధికారి వీరి వెనుక కథేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సైనిక్‌పురిలోని ఓ అనాథ శరణాలయం నిర్వాహకుడు అందులో ఉంటున్న బాలికల చేత ఈ పని చేయిస్తున్నట్లు తేలింది. ఆ నిర్వాహకుడిని పిలిచి ప్రశ్నిస్తే విరాళాలు వసూలు చేయడానికి తనకు కేంద్రం అవకాశం కల్పించిందంటూ హోం శాఖ నుంచి వచ్చిన ఒక లేఖను చూపారు. హైదరాబాద్‌లో ఇలాం టి ఎన్ని సంస్థలకు విరాళాలు వస్తున్నాయో తెలుసుకునేందుకు విచారణ జరుగుతోంది. 29 లక్షల మందికి పైనే.. ఏపీ, తెలంగాణల్లో కలిపి 29 లక్షల మంది అనాథలు ఉన్నట్లు ఒక అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ ఏజెన్సీ నిర్వహించిన సర్వే ప్రకారం వారిలో 13 లక్షల మంది బాలికలు, మహిళలు ఉన్నారు. మొదటిసారిగా 1998లో సర్వే నిర్వహించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అనాథల సంఖ్య 11 లక్షలు, తొమ్మిదేళ్ల తర్వాత 2007లో ఆ సంఖ్య 18 లక్షలకు పెరిగింది. 2011లో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సర్వే చేసినప్పుడు ఉమ్మడి ఏపీలోని అనాథాశ్రమాల్లో 29 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. వీరిలో 13 లక్షల మంది బాలికలు, మహిళలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో మొక్కుబడిగా సర్వే చేసి చేతులు దులుపుకోవడమే తప్ప వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అతి కొద్ది అనాథ శరణాలయాలు, క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న సంస్థలు మినహాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొంది నడుస్తున్న వాటిలో అత్యధికం బోగస్‌వేనని కేంద్రానికి 2011లో నివేదిక అందింది. -
అనాథలంతా సర్కారు బిడ్డలే: ఈటల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో తల్లిదండ్రుల్లేని అనాథ పిల్లలందరికీ ఇకపై ప్రభుత్వమే అమ్మనాన్నగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 69వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ ‘‘అనాథలకు ప్రభుత్వమే అమ్మనాన్నలా కొనసాగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘం లోతుగా అధ్యయనం చేసి నివేదికను కూడా అందజేసింది. ఇకపై అనాథ పిల్లలకు ప్రభుత్వమే అమ్మనాన్న. 18 ఏళ్ల వరకు వారి ఆలనాపాలనా ప్రభుత్వానిదే. చదువు చెప్పించడంతోపాటు పెళ్లి చేసి ఆ కుటుంబాలకు అన్నిరకాలుగా సాయం చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. రేపో మాపో ఈ గొప్ప నిర్ణయం వెలువడబోతోంది’’ అని పేర్కొన్నారు. -
నేనూ పెరుగుతా..
ఇక్కడున్న పిల్లలు పెరుగుతారు.. అయితే.. వారితోపాటు వాళ్ల కాళ్లకు తగ్గట్లు చెప్పులు కూడా పెరిగితేనో..? ఈ పాదరక్షల గొప్పతనమే అది. ఎలాగంటారా.. ముందు, వెనక, పక్కకు ఉన్న పిన్నుల ద్వారా ఈ చెప్పుల సైజును పెంచుకోవచ్చు. అమెరికాకు చెందిన కెంటన్ లీ అనే డిజైనర్ కెన్యాలో ఉద్యోగం చేస్తుండగా అక్కడి అనాథ పిల్లలను చెప్పుల్లేకుండా చూసి చలించి పోయాడట.. దీంతో వారికి ఏ విధంగానైనా సహాయం చేయాలన్న కోరిక నుంచి పుట్టిందే ఈ అడ్జస్టబుల్ చెప్పుల ఆలోచన. ఆఫ్రికాలోని పేద, అనాథ పిల్లలకు వీటిని అందించడమే తన లక్ష్యమని లీ చెబుతున్నాడు.. -
అనాథలు, బాలకార్మికులకు వరం ‘స్మైల్’
మెదక్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ స్మైల్ పథకం అనాథ పిల్లలకు వరంలా మారింది. ఇందుకోసం పోలీసులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అనాథ పిల్లలును, బాలకార్మికులను గుర్తించి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జనవరి 1న ప్రారంభించిన ఈ పథకం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. కాగా ఇందుకోసం డివిజన్ స్థాయి అధికారిని ఏర్పాటు చేశారు. ఆ అధికారి సమక్షంలో నలుగురు పోలీసులు పనిచేస్తారు. కాగా మెదక్ డివిజన్‌స్థాయి అధికారిగా మెదక్ పట్టణానికి చెందిన సబ్ఇన్స్పెక్టర్ అంజయ్యను నియమించారు. అలాగే మెదక్ రూరల్ కానిస్టేబుల్ మల్లేశం, పట్టణ కానిస్టేబుల్ దుర్గపతి, టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, నారాయణఖేడ్‌కు చెందిన అహ్మద్ హుస్సేన్‌ను నియమించారు. వీరు తప్పిపోయిన పిల్లల కోసం ఆరా తీయడం, ఇటుక బట్టీలు, హోటళ్లు, కార్ఖానాల్లో, రైల్వేస్టేషన్లు, కోళ్లఫారాల్లో పని చేసే పిల్లలను గుర్తించి వారితల్లి తండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి బడుల్లో చేర్పించడం చేస్తారు. ఒకవేళ అనాథపిల్లలు అయిఉంటే వారిని వెంటనే సంగారెడ్డి శిశువిహర్ తరలించటం లేదా, వసతిగృహాల్లో చేర్పించి చదువు చెప్పించటం వీరివిధి. ఈ పథకం కింద విధులు నిర్వహించే సిబ్బందికి గతనెలలో శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 14 బాలుడు మహేష్ చదువు మానేసి అదేగ్రామంలోని కోళ్లఫారంలో పనిచేస్తుండగా ఆపరేషన్‌స్మైల్ సిబ్బంది గుర్తించి వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి మక్తభూపతిపూర్ ఉన్నతపాఠశాలలో చేర్పించారు. అలాగే నారాయణఖేడ్‌లో శివ అనే 10లోపు బాలుడు బస్టాండ్‌లో బిక్షాటన చేస్తుండగా గుర్తించి అక్కడే ఉన్న వసతి గృహంలో చేర్పించి బడికి పంపించామని ఆపరేషన్‌స్మైల్ డివిజన్ అధికారి అంజయ్య తెలిపారు. కాగా మెదక్ పట్టణం గాంధీనగర్‌కు చెందిన 12 ఏళ్ల మహి అనే బాలుడు ఈనెల21న స్నేహితుడితో కలిసి ఏడుపాయల జాతర వెళ్లి తప్పిపోయినట్లు తండ్రి తమకు ఫిర్యాదు చేశాడని అతని గురించి ఆరా తీస్తున్నట్లు సిబ్బంది ఒకరు తెలిపారు. బాలకార్మికులతో ఎవరు పనిచేయించిన వెంటనే తమదృష్టికి తేవాలని ఆపరేషన్‌స్మైల్ సిబ్బంది పేర్కొన్నారు. కార్ఖానాలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో బాలకార్మికుల కోసం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. -
అనాథలతో జట్టు
కష్టాల్లో ఉన్న వారి కన్నీటిని తుడవడం, సాటి వారి బాధకు రెండు కన్నీటి బొట్లను రాల్చడం ఎవరికైనా చేతనైన పని. కానీ కన్నీటి వెనుక కారణం తెలుసుకోవడం, ఆ బాధను రూపుమాపడానికి ప్రయత్నించడం కొందరు మా త్రమే చేసే పని. అలాంటి ‘కొందరు’ వ్యక్తుల్లో ఒకరు జట్టు పారినాయుడు. స్థాపించిన సంస్థ పేరునే ఇంటి పేరుగా మలుచుకున్న ఆయన జీవితం ఓ పాఠం. ఆయన ఎక్కడైతే చీత్కారాలు ఎదుర్కొన్నారో... అక్కడే సత్కారాలు అందు కున్నారు. ఎక్కడైతే ‘నిన్ను చంపేస్తాం’ అన్న బెదిరింపులు విన్నారో... అక్కడే ‘నువ్వు దేవుడివి’ అన్న ప్రశంసలు విన్నారు. ఏ చోటనైతే తండ్రి ప్రేమకు దూరమయ్యారో... అదే చోట పదుల సంఖ్యలో అనాథలకు తండ్రిగా సేవలందిస్తున్నారు. తన జీవిత పయనం గురించి పారినాయుడు ‘సాక్షి’కి తెలిసిన వివరాలు ఆయన మాటల్లోనే... మాది గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి గ్రామం. మా నాన్న గోపినాయుడుకు ఇద్దరు భార్యలు కావడం వల్ల మా అమ్మ సన్యాసమ్మ వద్ద పెరిగి దాదాపు తండ్రి ప్రేమకు దూరమయ్యాను. అప్పుడే తండ్రి ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందో అనుభవించాను. ‘జట్టు’ స్థాపించడానికి అది మొదటి కారణమైంది. చిన్నప్పటి నుంచే సమాజ సేవ చేయాలని నాకుండేది. మంచి ఊరు, అందులో ఓ గ్రంథాలయం, అందరికీ మంచినీరు, సదుపాయాలు ఉండాలనేది నా కల. ఆరేళ్ల నాడు నా ఊహా ప్రపంచం ఇది. రాను రాను ఈ కల నాలో బలపడి ఈ స్థాయికి వచ్చింది. ఐదో తరగతి చదువుతున్నప్పుడే మా ఊరిలో బాల గణపతి ఉత్సవాలను తోటి పిల్లలతో నిర్వహించేవాడిని. మా ఊరి పొలాలను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం నిర్మించిన వట్టిగెడ్డ రిజర్వాయరు నుంచి వచ్చిన సాగునీటి కోసం రైతుల మధ్య పొడచూపిన విబేధాలు, కొట్లాటల నేపథ్యంలో పేద రైతు నుంచి కారిన ర క్తాన్ని చూసి ఆరో తరగతి చదువుతున్నప్పుడే ‘ఎర్రనీరు’ అనే నాటికను రచించాను. మా ఊరిలోని లెఫ్ట్ సానుభూతిపరులు, ఆ నాటికను ప్రదర్శించడం విశేషం. చదువు తర్వాత గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ ప్రాథమిక పా ఠశాలల ప్రధానోపాధ్యాయునిగా 1988లో బాధ్యతలు స్వీ కరించాను. అప్పటి నుంచి సేవా కార్యక్రమాల పరిధి బా గా పెరిగింది. రాత్రి బడులు, కుట్టు శిక్షణా కేంద్రాలు, ప్ర జా సంఘాలు ఏర్పాటు చేయడం వంటి పనులతో బిజీబి జీగా ఉండేవాడిని. గ్రామీణాభివృద్ధి సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య పేరిట ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. అలాగే అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల సహకారంతో గ్రామ గ్రామానికి గిరిజన మహిళా సంఘాలు ఏర్పాటయ్యాయి. నాటుసారాపై పోరు... సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే మా చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే అక్రమాలపై పోరాడేవాడిని. అడ్డ పొగా కు, వంట సారాయికి వ్యతిరేకంగా సభలు, సమావేశలు నిర్వహించాను. రాన్రాను వంట సారాయి వ్యతిరేక ఉద్య మం తీవ్రరూపం దాల్చింది. గిరిజన మహిళలు, యువకులు పోరుబాట పట్టారు. అలాగే లోవ ముఠాలో విచ్చల విడిగా చెట్లను నరికి బొగ్గును కాల్చే వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. బుడ్డెంఖర్జ గ్రామంలో జరిగిన సేవాసం ఘం తీర్మానాలు బొగ్గు వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అప్పట్లో అక్రమ కలప రవాణాపై కూడా స్థానికులతో కలిసి పోరాటం చేశాం. ఈ పోరాటం ఓ సంచలనమైంది బెదిరింపులూ వచ్చాయి... అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంతో రాజకీయ నాయకులు చంపేస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. అయినా ఎక్కడా ఎప్పుడూ భయపడలేదు. స్థానిక, బడా రాజకీయ వేత్తలు పార్టీలతో నిమిత్తం లేకుండా విజ యనగరం జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో నాపై కొంతమంది కక్ష కట్టి నక్సలైట్ ఇన్ఫార్మరంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం నేను పని చేస్తున్న గొరడ గ్రామంలో నేను నివాసముం టున్న ఇంటికి సమీపంలో 30 మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు ఎస్ఐలు ఒక సీఐతో ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. గొరడలో జరుగుతున్న కార్యక్రమాలను చూడటానికి వచ్చిన వావిలాల గోపాల క్రిష్ణయ్యకు స్థానిక విలేకరులు ఇక్కడి పరిస్థితులు వివరించిన తర్వాత ఆయన అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డికి సంగతంతా వివరించడంతో జిల్లా అధికారుల్లో మార్పు వ చ్చింది. అక్షరాస్యతలో భాగస్వామ్యం ఈ పోరాటాల తర్వాత నాకు అప్పటి కలెక్టర్ వి.నాగిరెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కరికా ల్ వళవన్లు గిరిజన అక్షరాస్యత కార్యక్రమంలో కన్వీనర్ బాధ్యతలను అప్పగించారు. 1995 లో విజయనగరం కలెక్టరుగా వచ్చిన టి. విజయకుమార్ సహకారంతో ‘మాబడి’ కార్యక్రమాన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ పథకం బాధ్యతలను పార్వతీపురం ఏజెన్సీలో విస్తృతంగా అమలు చేశా. అయితే అధికారులతో పాటు పథకాలూ మారుతుండడంతో ఐటీడీఏ కార్యక్రమాలకు దూరమయ్యాను. గమ్యాన్ని మార్చిన ‘జట్టు’... చిన్నప్పటి నుంచి కలగా మిగిలిన జీవిత గమ్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1998 మేలో జట్టు ట్రస్టు ప్రారంభించాను. ట్రస్టు ఆధ్వర్యంలో నెలకొల్పిన జట్టు భావ స మాఖ్య సేవాశ్ర మం ఎందరో అనాధ పిల్లలకు, అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం 67 మంది అనాథ బాలలు, 11 మంది వృద్ధులు ఆ శ్రయం పొందుతున్నారు. స్థానిక ప్రజలు సుమారు 40 లక్షల విలువ కలిగిన స్థలాలను భవనాలను విరాళంగా ఇచ్చారు. అయితే జట్టు స్థాపిం చిన తర్వాత కూడా నాపై అభియోగాలు ఆగలేదు. ఈ సారి నేను పోలీస్ ఇన్ఫార్మర్నంటూ ఎవరో తప్పుడు స మాచారం ఇచ్చారు. దీంతో నా అనుచరులైన ముగ్గురు యువకులను నక్సలైట్లు అడవుల్లోకి తీసుకువెళ్లి కొట్టారు. నన్ను ఏజెన్సీ విడిచిపోవాలని చెప్పి పోస్టర్లు అంటించారు. అదే సమయంలో విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జట్టు ట్రస్టుకు ఏ ప్రభుత్వ పథకాలూ మంజూరు చేయరాదని తీర్మానించారు. నక్సలైట్లు ఏజెన్సీ వదిలి వెళ్లిపోమంటే ఎందుకు వెళ్లలేదని రాజకీయ నాయకులు చర్చలు చేశారు. దీనికి స్పందనగా పత్రికా ముఖంగా కాస్తంత ఘాటుగానే సమాధానం ఇచ్చాను. ఆనాడు నాకు దివంగత ఎస్.ఆర్.శంకరన్, టి. విజయకుమార్, ఎల్.వి. సుబ్రహ్మణ్యం, ఎం. భూపాల్ లాంటి ప్రముఖులతో పాటు వేలాది మంది గిరిజనులు అండగా నిలిచారు. జట్టు నుంచి ప్రకృతి ఆది దేవో భవకు... 2009లో గ్రూప్-1 అధికారిగా పనిచేస్తున్న వి.పద్మజ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆశ్రమంలోని పిల్లలకు, వృద్ధులకు సేవ చేయడానికి ‘వాలంటీర్’గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కొంత వెసులుబాటు ఉండడంలో పార్వతీపురం ఆశ్రమానికి దగ్గరలోని తోటపల్లిలో ప్రకృతి ఆది దేవోభవ క్యాంపస్‌ను స్థాపించాను. ఇందులో భాగంగా రెండెకరాల స్థలంలో సేంద్రీయ పద్ధతులతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులను ఎలా సాధించవచ్చో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి దేశంలో ఇప్పటికే నిరూపితమైన నమూనాలను ప్రదర్శన క్షేత్రాలుగా ఏర్పాటు చేశాను. వాటిలో ముఖ్యమైనవి... ఒక వంగ మొక్కకు 233 వంకాయలు కాసేలా, 10 గుంటల నమూనాలో ఒక సంవత్సరానికి ఒక లక్షా మూడువేల రూపాయలు అధిక దిగుబడులు సాధించాను. 2010లో సొంత అనుభవాలతో రూపొందించిన ‘అరెకరంలో అన్నపూర్ణ నమూనా’ ను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అత్యుత్తమ ఆహార భద్రతా నమూనాగా గుర్తించి, ఈ నమూనా ను ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో అమలు చేయడానికి నిర్ణయించింది. అలాగే జిల్లాలో గ్రం థాలయ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం మరిచిపోలేని అనుభూతి. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాల క్రిష్ణయ్య, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయ అధికారి ప్రొఫెసర్ నరసింహరాజు, జయంతి రామలక్ష్మణమూర్తి, దామరాజు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా అనుభవాలతో శాంతియోధులు, త్రివి క్రమం, మనసంఘం, మన విటిడిఏ, ఉద్యమాల జ్వాల వావిలాల, మన ఎరువులు-కషాయాలు, అన్నపూర్ణ, గిరిజన కళాతరంగిణి, నిజంగానే, బడి నుండి పొలం బడికి ఇంకా అనేక పుస్తకాలను ముద్రించా. అవార్డులు... అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా ‘గిరిజ్యోతి’ అందుకున్నాను. బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ‘రైతు నేస్తం’, అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు, సత్య గాంధీ-అవార్డు, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్-హైదరాబాద్ వారిచే మూడుసార్లు ఎక్స్‌లెన్సీ అవార్డులు, జిల్లా కలెక్టరు ద్వారా రెండుసార్లు ఉత్తమ ఉద్యోగిగా అవార్డులు, బొబ్బిలి- రాజ్యలక్ష్మీ అ వార్డు, వీటితో పాటు అనేక సత్కారాలు, సన్మానాలు అందుకున్నాను. ఇవి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను. -
శహభాష్... సుబ్బాయమ్మ...!
ఎన్నెన్ని ప్రసవ వేదనలు, ఎన్నెన్ని ఆనందాలు, ఎన్నెన్ని సంతోషాలు, ఎన్నెన్ని నిరాశలు... 44 ఏళ్ల ప్రస్థానంలో సుబ్బాయమ్మ చూసిన విశేషాలెన్నెన్నో. ఇన్నేళ్లలో ఆమె వేలాది మంది శిశువులను ప్రపంచానికి పరిచయం చేసింది. వేలాది మంది తల్లుల కన్నీరు తుడిచింది. వారి బాధలు పంచుకుంది. ఇప్పుడు ఎనభై నాలుగేళ్ల వయసులోనూ సేవే పరమార్థంగా గడుపుతోంది. ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయని సుబ్బాయమ్మ ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లకు గురువు. అమ్మగర్భం మరో బ్రహ్మలోకం అంటారు. ఆ లోకంలో ఉన్న పసిమొగ్గలను ఈ లోకంలోకి తెస్తూ... 44 ఏళ్లుగా సేవ చేస్తున్న సుబ్బాయమ్మ గురించి... * జీవితంలో సంపాదించిందంతా అనాథాశ్రమానికిచ్చిన త్యాగమూర్తి... * 84 ఏళ్ల వయసులో పదేళ్లుగా అనాథ పిల్లలకు సేవ చేస్తూ...తరిస్తున్న సేవామూర్తి... * మా వైద్యులందరికీ గురవని కితాబిచ్చిన పట్టణ సీనియర్ వైద్యులు... * ఆశ్రమం ధైర్యంగా నడుస్తోందంటే 84ఏళ్ల సుబ్బాయమ్మ అనుభవమే...నిర్వాహకులు... * సుబ్బాయమ్మ త్యాగం...కావాలి మరికొందరికైనా స్ఫూర్తి... పార్వతీపురం: ఆమె ఓ సాధారణ మాతృమూర్తి. కానీ 44 ఏళ్లు అసాధారణంగా సేవలు చేస్తున్నారు. అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ వైద్యాధికారులకు సైతం గురువుగా పేరు సంపాదించారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. నిలబడి పది మందికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు కూడా తన సంపాదనలో కొంత భాగాన్ని జట్టు ఆశ్రమానికి ఇచ్చి అనాథలకు సేవలు అందిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లిగా... ఆశ్రమం నడిపే నిర్వాహకులకు పెద్ద దిక్కుగా తన 84 ఏళ్ల అనుభవాన్ని ఆమె ఇలా పంచుకున్నారు. అమ్మా, నాన్నలే నాకు స్ఫూర్తి... నా పేరు ఆదిమడపల సుబ్బాయమ్మ. మాది గుంటూరు జిల్లా బాపట్ల. మా నాన్న ముత్తిరెడ్డి రాఘవయ్య వ్యవసాయంతోపాటు రెండెడ్ల బండి తోలేవాడు. మా అమ్మ కనకమ్మ. మేము ఐదుగురు సంతానం. నాకు ఊహ తెలిసినప్పటి నుండే మా అమ్మా, నాన్నలు సంపాదించిన దానిలో కొంత సాటివారికి సహాయం చేసేవారు. మాది సాధారణ కుటుంబం అయినప్పటికీ మాకున్నంతలో తోటివారికి సహాయం చేసేవారు. అప్పటి నుంచే నాకు చేతనైనంత తోటివారికి సహాయం చేయడం అలవడింది. అప్పటి నుంచే ఆనందం తెలిసింది. బాపట్ల నుంచి సాలూరుకు... నా వివాహం తర్వాత బాపట్ల నుంచి సాలూరుకు వచ్చాం. తర్వాత పిల్లలతో పాటు 65 ఏళ్ల క్రితం పార్వతీపురం వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. నాకు ఇద్దరు పిల్లలు పాప, బాబు. భర్త చనిపోయాక పిల్లల్ని పెంచే బాధ్యత నాపై పడింది. నాకు అక్షరం ముక్క రాదు. దీంతో ఓ పెద్దావిడకు తోడుగా పురుడు పోసేందుకు వెళ్లేదానిని. ఆమె వద్ద నాకు ఈ విద్య అబ్బింది. అప్పటి నుంచి అదే జీవనోపాధిగా మారింది. ఆ రోజుల్లో ఒక్కో పురుటికి రూ.50లు నుంచి *60లు ఇచ్చేవారు. కొంతమంది పేదవారు అది కూడా ఇవ్వలేకపోయేవారు. ఒక్కో రోజు 7 వరకు ప్రసవాలు చేసేదాన్ని. ఆ రోజుల్లో ఇం తగా ఆపరేషన్లు, వైద్య సదుపాయాలుండేవి కాదు. ఆస్పత్రుల్లోను, వీధులు, గ్రామాల్లోను ఇంటింటికి వెళ్లి ప్రసవాలు చేసేదాన్ని. 44 ఏళ్ల పాటు... అలా మొదలైన నా జీవిత ప్రస్థానం 44 ఏళ్ల పాటు సాగింది. దీనిలో భాగంగా పురిటికి రూ.50 నుంచి 500లు పెరిగింది. దీంతో నేను సుమారు రూ.6లక్షలు వరకు సంపాదించాను. అప్పటికే పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో జట్టు వ్యవస్థాపకులు డొల్లు పారినాయుడు అనాథాశ్రమాన్ని స్థాపించారు. టీచర్ ఉద్యోగం వదులుకొని ఆ రోజుల్లో అనాథపిల్లల కోసం పాటుపడుతున్న పారినాయుడు అంటే మనసులో ఎనలేని అభిమానం ఏర్పడింది. ఎలాగైనా నా వంతుగా సహాయం చేయాలనుకున్నాను. తొలుత రూ.20వేలు ఆశ్రమానికి విరాళమిచ్చాను. అనాథ పిల్లలకు సేవ చేయాలనే... అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్లి ఏదైనా పిల్లలకివ్వాలన్న కోరిక ఉండేది. ఓ మారు పిండి వంటలు చేసి పిల్లలకు తీసుకెళ్లాను. అప్పటికి ఉన్నత ఉద్యోగాలను విడిచిపెట్టి అనాథ పిల్లలకు సేవ చేసేందుకు వచ్చిన జట్టు నిర్వాహకురాలు వి.పద్మజను చూసిన నాకు...పిల్లలకు నేనెందుకు సేవ చేయకూడదనిపించింది. బాగా ఆలోచించి ఈ విషయాన్ని జట్టు వ్యవస్థాపకులు, నిర్వాహకులతో చెప్పాను. వారు ఆనందంగా స్వాగతించారు. సంపాదనంతా జట్టు ఆశ్రమానికే... అప్పటికే నా వద్ద ఉన్న సంపాదన రూ.2లక్షలు ఆశ్రమానికి చ్చి, పిల్లలకు సేవ చేస్తూ జీవితాన్ని ఎనలేని సంతృప్తితో గడుపుతున్నాను. తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లిదండ్రినై, మలిదశలో ఆసరా లేని వృద్ధులకు తోడునై ఆశ్రమంలో ఆనందంగా గడుపుతున్నాను. తల్లిదండ్రులను మరిపించే సేవలు ఆమె సొంతం... ఇదిలా ఉండగా జట్టు ఆశ్రమంలో ఉన్న అనాథపిల్లలు, వృద్ధులకు సుబ్బాయమ్మ 84 ఏళ్ల వయసులో కూడా తల్లిదండ్రులను మరిపించే సేవలందిస్తోంది. వారి పెంపకంలో తన అనుభవాన్ని జత చేస్తూ జట్టు ఆశ్రమానికే పెద్ద దిక్కుగా నిలుస్తోంది. వైద్యులందరికీ గురువు! ‘ఆమె చేయి చల్లదనం...నాడు వేలాది మంది గర్భిణులకు ధైర్యాన్నిచ్చింది. ఆమె పురుడు పోసేందుకు వచ్చిందంటే మరికొద్ది సేపులో పండంటి బిడ్డ తమ చేతికొస్తుందనే కొండంత ధైర్యం ఆ ఇంటివాళ్లకు కలిగేది. పురిటి నొప్పులు భరించలేని స్త్రీకి మరి కొద్ది సేపులో మాతృమూర్తి మాధుర్యాన్ని, అమ్మతనంలోని కమ్మదనాన్ని చవిచూస్తావంటూ ధైర్యాన్ని చెప్పి ఎంతమందికో గుండె ధైర్యాన్నిచ్చిన సుబ్బాయమ్మను...పట్టణ సీనియర్ వైద్యులు సైతం మాకు గురువని మెచ్చుకుంటున్నారు. సుబ్బాయమ్మ ఆశయం... కావాలి మరికొందరికైనా స్ఫూర్తి... జీవితంలో పైసా పైసా కూడబెట్టి...సంపాదించినదంతా పిల్లలకు అప్పగించి మలి దశ లో ప్రశాంతంగా జీవించాలనేది ప్రతి వ్యక్తి సాధారణమైనఆశ. కాని సుబ్బాయమ్మ మాత్రం తన పిల్లల జీవితాలను స్థిరపరచి, వారి అనుమతితో స్థానిక జట్టు ఆశ్రమంలో ఆనాథ పిల్లలకు సేవలందిస్తూ...తన జీవితాశయాన్ని నెరవేర్చుకుంటున్న ఆదిమడపల సుబ్బాయమ్మ మరికొందరికైనా స్ఫూర్తి కావాలి. -
అనాథ బాలలకు ఆశాకిరణం
స్ఫూర్తి ఊరు కాని ఊరు... రాష్ట్రం కాని రాష్ర్టంలో రోడ్డు పక్కన ఉండే అనాథ పిల్లల ఆక్రందనలు ఆమెను కదిలించాయి. ఓ మంచి కార్యానికి సంసిద్ధురాలిని చేశాయి. తను, తన కుటుంబం మాత్రం బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో అనాథలను, వీధిబాలలను ఆదుకోవడానికి ఆమె దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకూ ఈమె ఎవరో, ఈమె చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలు ఎక్కడో చూద్దామా..! ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వాణి, హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ భార్యాభర్తలు. ఉద్యోగరీత్యా వీరిద్దరూ ముంబాయిలో నివసిస్తున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లాక, ఇంట్లో ఒంటరిగా ఉండలేక వాణి ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. ఆమె ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లే క్రమంలో దారిలో ఎందరో అనాథలు, వీధిబాలలు దయనీయమైన స్థితుల్లో తిరగాడుతుండటాన్ని చూసి చలించిపోయింది. వారికోసం ఏదైనా చేయాలనుకుంది. తన ఆలోచనను స్నేహితులతో పంచుకుంది. బెంగాల్‌కు చెందిన దేవాంజలి ఆమెకు తోడ్పాటును అందించేందుకు సిద్ధమైంది. వీరికి మరికొందరు స్నేహితులు జత కలిశారు. మొదట్లో వీరందరూ కలిసి దుప్పట్లు, దుస్తులు కొనుగోలు చేసి అనాథలకు అందించేవారు. వివిధ ఆశ్రమాల్లో ఉండేవారికి, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి దుస్తులు, పండ్లు పంపిణీ చేసేవారు. ఇదే సమయంలో వీధిబాలలు చాలామంది ఆకలితో అలమటిస్తుండటాన్ని వీరు గుర్తించారు. దాంతో ఇంటి వద్దనే వండిన ఆహారాన్ని తీసుకెళ్లి మురికివాడల్లో నివసించే పిల్లలకు తినిపించటంతో బాటు వారికి పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా అందిస్తున్నారు. వీరి సేవా కార్యక్రమాలను చూసిన పలువురు తమవంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. దాంతో 75 మంది పిల్లలకు చదువుతోపాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరు ‘ఆశాకిరణ్’ పేరుతో ఒక పాఠశాలను, ఒక ఉచిత ఉపశమన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో పిల్లలకు విద్య మాత్రమే కాకుండా చిత్రలేఖనం, వృత్తి విద్య, నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. అతి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఆశాకిరణ్’ ఇప్పుడు ఇక్కడి చిరునామాలలో ల్యాండ్ మార్క్‌గా మారడం విశేషం. పేరుకు తగ్గట్టే మురికి వాడలలోని వారికి వీరి పాఠశాల ‘ఆశాకిరణం’లా వెలుగునిస్తోంది. మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, సేవాభావం, దానిని నెరవేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే, ఎక్కడైనా, ఎంతైనా చేయవచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి! - కొమ్మినేని వెంకటేశ్వర్లు, సాక్షి, ఖమ్మం ఆసరా ఇస్తే ఖమ్మంలోనూ పాఠశాల ప్రారంభించాలని ఉంది! ‘నేను చేస్తున్న సేవలకు పలువురు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో పాఠశాల నిర్వహిస్తున్నాను. అయితే మా సొంత పట్టణమైన ఖమ్మంలో కూడా అనాథలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది. దాతలు ముందుకొస్తే అక్కడ కూడా అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని ఉంది’ - వాణి -
అమ్మకు... ‘అమ్మ ఒడి’ ఆశ్రయం
వెంకటాపురం : అందరూ ఉండి అనాథగా మారి రామప్పలో కాలం వెళ్లదీస్తున్న అమ్మకు నర్సింహులపేట మండలంలోని పెద్దముప్పారం ‘అమ్మ ఒడి’ ప్రేమ శరణాలయం ఆశ్రయం కల్పించింది. పరకాల మండలంలోని మాధన్నపేటకు చెందిన నా గుల ప్రమీల అనే మహిళను మూడు నెలల క్రితం కన్నకొడుకు సాంబయ్య జీపులో తీసుకవచ్చి రామ ప్ప ఆలయ పరిధిలో వదిలివెళ్లాడు. దీంతో ఈనెల 21న ‘అమ్మా.. నీకు రామలింగేశ్వరస్వామే దిక్కు’ అనే కథనాన్ని ‘సాక్షి’లో ప్రచురించడంతో స్పందిం చిన అమ్మ ఒడి ఆశ్రమం అధ్యక్షుడు గుంటుపల్లి దిలీప్ అదివారం రామప్ప కు చేరుకొని స్థానికుల సహా యంతో అనాథగా మిగిలిన నాగుల ప్రమీలను ఆశ్రమానికి తీసుకవెళ్లాడు. ఈ సం దర్భంగా దిలీప్ ‘సాక్షి’తో మాట్లాడారు. వృద్ధులను, అనాథ పిల్లల కోసం 2011లో ఆశ్రమాన్ని స్థాపించినట్లు తెలిపారు. ఆశ్రమంలో ప్రస్తుతం 14 మంది వృద్ధులు, నలుగురు పిల్లలు ఉన్నారన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథ వృద్ధులు ఉంటే 9949582234 నంబర్‌కు సమాచారం అందిస్తే ఆశ్రమంలో చేర్చుకుంటామని తెలిపారు. అయనతో పాటు ఆశ్రమం సభ్యుడు శ్రీనివాస్ ఉన్నారు. -
హీల్.. సేవే గోల్
జిల్లాలో హీల్ సేవా ప్రస్థానం ఆరంభం ఆగిరిపల్లి మండలంలో రూ.50కోట్లతో అనాథ, అంధుల పాఠశాల అత్యాధునిక వసతులతో నిర్మాణం ముందుకొచ్చిన ఎన్ఆర్ఐ దాతలు ఒంటరి అన్న భావన భరించలేనిది. అనాథలా బతకడం భారమైనది. అంతా ఉండి ఎవరూ లేనట్టుగా జీవించడం కష్టమైనది.. జీవితంలో ఇలాంటి నిరాశ, నిస్పృహలు అలముకుని అనాథలుగా బతుకుతున్న చిన్నారులకు నేనున్నానంటూ భరోసా ఇస్తోంది ‘హీల్’ సంస్థ. కారు చీకట్లు కమ్ముకున్న జీవితాల్లో అక్షర కాంతులనే వెలుగు దారులు వేస్తోంది. అనాథలు, అంధుల కోసం రూ.50కోట్లతో ప్రత్యేక వసతులు కలిగిన పాఠశాలను నిర్మించి తన సేవా ప్రస్థానానికి పరిమితి లేదని నిరూపించింది. నరసింగపాలెం (ఆగిరిపల్లి) : అనాథ పిల్లలు, అంధ బాలబాలికల పాలిట వరంగా మారింది హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ (హీల్) ప్యారడైజ్. అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోరుు నిరాదరణకు గురైన పిల్లలు, అంధ బాలికలకు ఆశ్రయం కల్పించి విద్యాదానం చేస్తోంది. ఆగిరిపల్లి మండల పరిధిలోని నరసింగపాలెంలో రూపుదిద్దుకుంటున్న ఈ హీల్ ప్యారడైజ్‌లో 1,300 మంది అనాథలు, అంధులు ఆశ్రయం పొందవచ్చు. ఇందులో అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ప్రాథమిక పాఠశాల గత బుధవారమే ప్రారంభమైంది. ‘హీల్’ ప్రారంభమైంది ఇలా.. 1992లో యూకేలో హీల్ సంస్థ ప్రారంభమైంది. విజయవాడలోని పటమటకు చెందిన కోనేరు సత్యప్రసాద్ ఫౌండర్, చైర్మన్‌గా 1993లో గుంటూరులో హీల్-ఇండియా మొదలైంది. అనంతరం గుంటూరు జిల్లా చోడవరంలో హీల్ విలేజ్ ఏర్పాటుచేశారు. అక్కడ నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 250 మంది అనాథలు చదువుకుంటున్నారు. వీరికి ఉన్నత చదువులతో పాటు బయటి కళాశాలల్లో చదువుతున్న మరో 250మంది పేద విద్యార్థులకు అవసరమైన ఫీజులు, ఇతర అవసరాలను హీల్ సంస్థే చూసుకుంటుంది. జిల్లాలో సేవా ప్రస్థానం కృష్ణాజిల్లాలోని కానూరు జెడ్పీ పాఠశాలను 2009లో దత్తత తీసుకోవడంతో ఇక్కడ హీల్ తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ స్కూల్ విద్యార్థులకు కావాల్సిన నోట్ పుస్తకాలు, బ్యాగులు, ఫీజులను ఆ సంస్థే చెల్లించింది. సైన్స్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. తరువాతి ప్రయత్నంగా ఆగిరిపల్లి మండల పరిధిలోని నరసింగపాలెంలో ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా, దాతల ప్రోత్సాహంతో రూ.50 కోట్లతో హీల్ ప్యారడైజ్‌కు శ్రీకారం చుట్టింది. ఎంతోమంది దాతల సహకారంతో... రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఈ హీల్ ప్యారడైజ్‌లో సుమారు 1,300 మంది అనాథ, అంధ విద్యార్థుల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, కిండర్ గార్డెన్, ఆరోగ్య కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఒకేషనల్ సెంటర్, అంధ పాఠశాల ఏర్పాటుచేయనున్నారు. ప్రాథమిక పాఠశాలను హీల్ ఇండియా వ్యవస్థాపకుడు కోనేరు సత్యప్రసాద్ తన తల్లిదండ్రులు లలిత, రామ కృష్ణారావు జ్ఞాపకార్థం ఇచ్చిన విరాళంతో నిర్మించారు. ఇక్కడ 400 మంది విద్యార్థులకు ఆంగ్లంలో సెంట్రల్ సిలబస్ బోధిస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం ఉండేలా ఢిల్లీకి చెందిన హాన్స్ ఇండియా ప్రత్యేక అత్యాధునిక భవనాన్ని నిర్మిస్తోంది. హీల్ ప్యారడైజ్‌లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అంధుల పాఠశాల, కిండర్ గార్డెన్, ఒకేషనల్ శిక్షణా కేంద్రానికి చెందిన విద్యార్థులకు హీల్ ఆధ్వర్యంలోనే వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అంధుల పాఠశాలను ప్రవాస భారతీయుడు చుండూరి ధనుంజయరావు దంపతులు వారి కుమారుడు ఫణీంద్ర పేరు మీద అందించే విరాళంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ వందమంది అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతారు. ఇంటిగ్రేటెడ్ ఒకేషనల్ శిక్షణా కేంద్రాన్ని ప్రవాస భారతీయుడు చుండూరి కృష్ణబాబు తన తల్లి పేరు మీద అందించే విరాళంతో నిర్మిస్తున్నారు. కంప్యూటర్ కోర్సులతో పాటు ఇతర వృత్తివిద్యా కోర్సులపై 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రవాస భారతీయులు డాక్టర్ బెల్లం శివప్రసాద్, విజయ దంపతులు విరాళం ఇచ్చారు. ఈ మేరకు కోటి రూపాయల విరాళాన్ని వారి కుమారుడు కృష్ణ హీల్ ప్యారడైజ్ చైర్మన్ పిన్నమేనేని ధనప్రకాశ్కు గత బుధవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఇందులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లోని 30 గ్రామాలను దత్తత తీసుకుని మొబైల్ వైద్యసేవలు అందించనున్నారు. దీని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అలాగే, కిండర్‌గార్డెన్ పాఠశాలను ప్రవాస భారతీయులు పిన్నమనేని కవిత, లెనిన్ దంపతుల విరాళంతో నిర్మిస్తున్నారు. హీల్ ప్యారడైజ్ నిర్వహణ కార్యాలయ భవనాన్ని పిన్నమనేని ధనప్రకాశ్ విరాళంతో నిర్మించనున్నారు. అనాథలకే ప్రథమ ప్రాధాన్యం హీల్ ప్యారడైజ్‌లోని ప్రాథమిక పాఠశాలలో ప్రవేశానికి ప్రప్రథమంగా అనాథలు, రెండో ప్రాధాన్యం కింద తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలు, మూడో ప్రాధాన్యం కింద ఆర్థిక స్థోమత లేని ఆశక్తులైన తల్లిదండ్రులు కలిగిన పిల్లలకు అర్హత కల్పిస్తాం. ఇందులో ప్రవేశం కావాలనుకునేవారు చిరునామా తెలిపే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, సంరక్షకుని వివరాలు ముందుగానే అందజేయాలి. వివరాలకు 0866-2842777, 8500122577 నంబర్లను సంప్రదించాలి. ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాం. మరో నాలుగు నెలల్లో వసతిగృహం, అంధుల పాఠశాల, ఒకేషనల్ శిక్షణా కేంద్రాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాదికి ప్రాథమికోన్నత పాఠశాల, కిండర్‌గార్డెన్ పాఠశాల, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి హీల్ ప్యారడైజ్ పరిపూర్ణంగా అందుబాటులోకి వస్తుంది. - పిన్నమనేని ధనప్రకాశ్, మోడల్ డెయిరీ చైర్మన్, హీల్ ప్యారడైజ్ చైర్మన్ -
నడివీధులే నివాసాలు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, ఈ మహానగరంలో పేదలు, నిర్వాసితులకు వసతి దొరకడం అసాధ్యంగా మారుతోంది. ఇప్పటికీ 37 వేల మంది పేద పిల్లలు రోడ్లపైనే ఉంటున్నారని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇందులో 24.4 శాతం పిల్లలు బాల కార్మికులు కాగా, 15 శాతం పిల్లలు మత్తుపదార్థాలకు బానిసలయ్యారు. టాటా సమాజ్ విజ్ఞాన్ సంస్థ, యాక్షన్ ఎయిడ్ ఇండియా అనే రెండు సామాజిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు విభ్రాంతికర వాస్తవాలు బయటికి వచ్చాయి. వీటి నివేదిక ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఫ్లై ఓవర్ల కింద బతుకీడుస్తున్న బాలల్లో 44 శాతం పిల్లలు మానసిక, శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు. నగర రహదారులు, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల వంటి ప్రదేశాల్లో మొత్తం 36,154 మంది పిల్లలు నివసిస్తుండగా వీరిలో 70 శాతం బాలురు, 30 శాతం బాలికలు ఉన్నారు. కాగా 905 మంది పిల్లలు రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫారాలపై నివాసముంటున్నట్లు తెలిసింది. పాఠశాలకు వెళ్లే వయసున్న పిల్లల్లో 24 శాతం మంది నిరక్షరాస్యులే. నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న 31 శాతం మంది పిల్లలు ఆంగన్వాడీ పాఠశాలలకు వెళుతున్నారు. బాలకార్మికుల్లో ఎక్కువ మంది రోడ్లపై పూలు, దినపత్రికలు విక్రయిస్తుంటారు. మరికొందరు హోటల్, భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. మరికొందరు భిక్షాటన చేసి డబ్బు సంపాధించి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయినప్పటికి 25 శాతం మంది పిల్లలకు రెండు పూటలా భోజనం సరిగా లభించడంలేదని ఈ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో ‘పే అండ్ యూజ్’ సులభ్ కాంప్లెక్స్‌లు వాడే పిల్లలు 50 శాతం మంది కాగా, సార్వజనిక మరుగుదొడ్లు వాడే పిల్లలు 40.2 శాతం మంది ఉన్నారు. మత్తుపదార్థాలకు బానిసలైన 15 శాతం పిల్లలు తంబాకు, సిగరెట్లు, నాటుసారా, గుట్కా, వెటైనర్ (సిరా తొలగించేది) లాంటివి సేవిస్తున్నట్లు తెలిసింది. వీటిని ఉపయోగించడం వల్ల రోజంతా పడిన శ్రమ మర్చిపోయి మత్తులోకి జారుకుంటారు. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు నగరంలో దాడులు జరిపిన తరువాత భద్రతా కారణాల దృష్ట్యా నగర రహదారులపై అక్రమంగా నివాసముంటున్న పేదలను ఖాళీ చేయించారు. దీంతో కొందరు శివారు ప్రాంతాలకు, మరికొందరు స్వగ్రామాలకు తరలిపోయారు. ఫలితంగా రహదారులపై నివాసముండే పేదల సంఖ్య అప్పట్లో గణనీయంగా తగ్గింది. కాలక్రమేణా పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. రోడ్లపై నివాసముంటున్న పేదలకు కొన్ని స్వయంసేవా సంస్థలు అండగా ఉంటున్నాయనే విషయం వారిలో చాలామందికి తెలియదు. దీంతో కొందరు నిర్వాసితులు జంక్షన్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, లోకల్‌రైళ్లు, ప్రార్థన మందిరాలు, ఇతర ధార్మిక స్థలాలు, బస్టాండ్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ఉంటున్నారు. పిల్లలతోపాటు పెద్దలూ ఈ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తుంటారు. మరికొందరు బాలలను అద్దెకు తీసుకుని వారితో బిచ్చమెత్తిస్తుంటారు. ఇందుకోసం బాలలను కిడ్నాప్ చేసే ముఠాలు కూడా ముంబైలో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పసివాళ్లపై జాలిపడి బిచ్చం వేస్తారు కాబట్టే ఈ దురాచారం పెరుగుతోందని తెలిపారు. సదరు బాలలకు సంపాదనలో కొంత చెల్లించడం, ఆలనాపాలనా చూసుకునే బాధ్యత కూడా అద్దెకు తెచ్చే వారిపైనే ఉంటుంది. ఎలాంటి శ్రమ లేకుండా డబ్బులు సంపాదించేందుకు సులభమైన మార్గం అడుక్కోవడమే కావడంతో చాలామంది పేదలు యాచక వృత్తినే ఎంచుకుంటున్నట్లు ఈ రెండు సంస్థలు తమ నివేదికలో వెల్లడించాయి. ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని కోరాయి.