అనాథ పిల్లలకు రూ.10వేల సాయం
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
జమ్మికుంట(హుజూరాబాద్): అనాథ పిల్లలందరినీ గుర్తించి సర్కారు బడుల్లో చేర్చుతామని, వారి భవిష్యత్ కోసం ప్రభుత్వం నుంచి రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వర్తకసంఘంలో మేదర ఉద్యోగుల సంఘం నాయకులు చదువులో ప్రతిభ చూపిన అనాథలకు ప్రతిభా పురస్కార్ అవార్డులు అందించారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ పేద కుటుంబాల పిల్లలు, అనాథలను ఆదుకునేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనాథలు ఎంతమంది ఉన్నా.. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిళి రమేశ్, సహకార సంఘాల యూనియన్ రాష్ట్ర చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.