అందమైన ప్రేమ | Hansika Motwani – Adoptive Mother of 28 | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమ

Published Sat, Jul 8 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

అందమైన ప్రేమ

అందమైన ప్రేమ

ప్రేమలో అందం.. అందం కానిది.. రెండూ ఉంటాయా?
ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది కదా?
మరి హన్సిక ప్రేమే అందమైనదని ఎందుకనుకోవాలి?
చిన్నప్పుడు అమ్మను ప్రేమిస్తాం..
టీచర్‌ని ప్రేమిస్తాం... తోబుట్టువులను ప్రేమిస్తాం..
మరీ స్ట్రిక్ట్‌గా లేకపోతే నాన్నని కూడా ప్రేమించేస్తాం
హన్సిక అంత వయసొచ్చిన తర్వాత ‘ఆ... ప్రేమలు’ ఎలాగూ ఉంటాయి.


కానీ, హన్సిక మాత్రం...
30 మంది అనాథ పిల్లల్ని ప్రేమించింది.
సైనికులను ప్రేమించింది.. వృద్ధుల్ని ప్రేమించింది.
ప్రేమలో ఇంతకు మించిన అందం ఉంటుందా?
మరి... ఇంతగా ప్రేమించే అమ్మాయికి అంతే అందంగా ప్రేమించే అబ్బాయి దొరకాలి కదా...
వియ్‌ హోప్‌ సో...


అప్పుడప్పుడూ తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగు ఇండస్ట్రీకి గెస్ట్‌లా అయ్యారు. మీ ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు తెలుసా?
నా మీద అంత ప్రేమ ఉందని వినడానికి బాగుంది. సేమ్‌ టైమ్‌ బాధగానూ ఉంది. ఇప్పుడు గోపీచంద్‌ పక్కన చేసిన ‘గౌతమ్‌ నంద’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగులో ఇప్పటివరకూ చేయని పాత్రని ఇందులో చేశా. అంత వెరైటీ రోల్‌లో చూసి, నా ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతారనుకుంటున్నా.

ఇంతకీ తెలుగు ఇండస్ట్రీలో ఏమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా ఏంటి? ఇక్కడ సినిమాలు తగ్గించేశారు?
అబ్బే.. అలాంటిదేమీ లేదండీ. ఇక్కడివాళ్లు వెరీ స్వీట్‌. ఇక చేదు అనుభవాలు ఎందుకుంటాయి చెప్పండి? సౌత్‌లో నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినది తెలుగు పరిశ్రమే. నాకు తల్లిలాంటిది. బిడ్డను తల్లి ఇబ్బందుల పాలు చేస్తుందా? ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఛాన్స్‌ ఇస్తుంది. ముఖ్యంగా మంచి క్యారెక్టర్‌ ఉంటే ఇక్కడివాళ్లు నాకు ఆఫర్‌ చేయకుండా ఉండరు. తమిళంలో ఈ మధ్య మంచి ఆఫర్స్‌ రావడంతో అక్కడి సినిమాలకు సైన్‌ చేశా.

అంటే... తెలుగులో ఎగై్జటింగ్‌ ప్రాజెక్ట్స్‌ తగ్గాయంటున్నారా?
నా ఉద్దేశం అది కాదు. నేనేదో ఒక తమిళ సినిమాకి డేట్స్‌ ఇచ్చిన టైమ్‌లో సరిగ్గా తెలుగు నుంచి ఒక మంచి ఆఫర్‌ వస్తుంది. బాధపడుతూనే ఆ సినిమా వదులుకుంటా. ఇలా డేట్స్‌ క్లాష్‌ వల్ల ఈ మధ్య కొన్ని సినిమాలు వదులుకున్నా. ఎంత బిజీగా ఉన్నానంటే.. ప్రతి సంవత్సరం రెండు వెకేషన్స్‌ ప్లాన్‌ చేసుకుంటా. ఈ సమ్మర్‌లో ఏదైనా ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుందామని ట్రై చేశా. ఊహూ.. కుదరలేదు. మరి.. ఈ ఇయర్‌లో ఇంకో వెకేషన్‌ కుదురుతుందో లేదో చూడాలి.

తెలుగు, తమిళ్‌ చేసేశారు.. సౌత్‌లో వేరే భాషల్లో ..?
ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నా. అందులో మోహన్‌లాల్‌ హీరో. నాది గెస్ట్‌ రోల్‌. కొంచెం నెగటివ్‌ టచ్‌ ఉన్న క్యారెక్టర్‌.  

బహుశా మీరు గత జన్మలో సౌత్‌లో పుట్టి ఉంటారేమో.. అందుకే ఇక్కడ హీరోయిన్‌గా సెటిలైపోయారు?
మా అమ్మగారు కూడా ఇలానే అంటారు. నాక్కూడా ఆ ఫీలింగ్‌ ఉంది. మరి.. తెలుగు వాళ్లింట్లో పుట్టానో... తమిళ వాళ్లింట్లో పుట్టానో. ఇప్పుడు మలయాళ సినిమా చేస్తున్నా కాబట్టి, కేరళలో పుట్టానో (నవ్వుతూ). మొత్తానికి సౌత్‌తో స్ట్రాంగ్‌ కనెక్షనే ఉందనిపిస్తోంది.

గత జన్మలను నమ్ముతారా ?
అసలెప్పుడూ వాటి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు టాపిక్‌ వచ్చింది కాబట్టి అలా అన్నాను. మన ఊహకందని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయ్‌. గత జన్మ అనేది ఉంటుందా? ఆ విషయంలో నా నమ్మకం ఎలా ఉన్నా దేవుణ్ణి మాత్రం ఫుల్‌గా నమ్ముతాను.

దేవుణ్ణి నమ్ముతారు కానీ, పాపం గుడికి వెళ్లి ప్రశాంతంగా దండం పెట్టుకోవడం కష్టం కదా?
అది నిజమే. వారంలో ఒక్కసారైనా నాకు ఏదో ఒక గుడికి వెళ్లే అలవాటు ఉంది. దర్శనం చేసుకుని, ప్రదక్షిణాలు చేయడం ఇష్టం. నేనేమో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే, నా చుట్టూ కొంతమంది తిరుగుతారు. అదే పనిగా చూస్తారు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, ఆ ప్రేమను అర్థం చేసుకుంటాను కాబట్టి, తర్వాత నవ్వుకుంటాను.

అవునూ... ముప్ఫైఒక్క మంది పిల్లలకు తల్లయ్యారు కదా.. భార్య ఎప్పుడవుతారు?
అయ్య బాబోయ్‌. ఈ ప్రశ్న వింటే పక్కన బాంబు పడినట్లు అనిపించింది. కానీ, భలే నవ్వొస్తోంది. పెళ్లికి ఇంకా చాలా టైమ్‌ ఉందండీ. నా ఏజ్‌ జస్ట్‌ పాతికేళ్లే కదా. అప్పుడే పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నారా?

సమాజంలో జరిగే దారుణాలు విన్నప్పుడు ఏమనిపిస్తోంది?
బాధపడటం తప్ప మనమేం చేయలేం. తప్పు చేయకూడదనే భావన ఎవరికి వాళ్లకి ఉండాలి.  తప్పు చేసే ముందు దీనివల్ల ఎంతమంది బాధపడతారు? అని ఆలోచిస్తే తప్పులు చేయరేమో. తప్పు చేయకుండా బతికితే, ఎంత హాయిగా ఉంటుందో ఆలోచించ మంటున్నా. ‘మనం ఎవరికీ హాని చేయడంలేదు’ అనే భావన మనల్ని ధైర్యంగా బతికేలా చేస్తుంది.

ఆ 31 మంది చిల్డ్రన్‌ గురించి చెప్పండి.. అసలు ఇంత మందిని ఎందుకు దత్తత తీసుకోవాలనిపించింది?
నా విషయంలో దేవుడు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడని నా ఫీలింగ్‌. మంచి కుటుంబంలో పుట్టాను. ఆర్థిక కష్టాలు తెలియవు. అందుకే ఆ కష్టాల్లో ఉన్న పిల్లలను ఆదుకోవాలనిపించింది. డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాక పిల్లలను దత్తత తీసుకోవడం మొదలుపెట్టాను. వాళ్లందరూ అనాథలు కాదు. తల్లిదండ్రులు ఉన్నారు. కానీ, పిల్లల కనీస అవసరాలను తీర్చలేని స్థితిలో ఉన్నారు. వారికి ఆహారం, చదువు వంటి విషయాలను నేను చూసుకుంటాను.

ఈ మధ్య కొందరు హీరోయిన్లు ‘ఇండస్ట్రీలో హెరాస్‌మెంట్‌ ఎక్కువండీ బాబూ’ అంటున్నారు..
అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నవాళ్లు అంటున్నారేమో. నేనైతే హ్యాపీ. టీనేజ్‌లో ఇక్కడికొచ్చా. ప్రపంచం పెద్దగా తెలియని వయసు. ఒకవేళ నాకిక్కడ పరిస్థితులు సరిగ్గా అనిపించకపోయి ఉంటే వెళ్లిపోయేదాన్ని. చాలా విషయాల్లో నేను లక్కీ. సినిమాల్లోకి రావడం, సక్సెస్‌ అవ్వడం, తెలుగు నుంచి తమిళ్‌కి వెళ్లడం, అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగడం.. అంతా బాగుంది.


ఇంతమంది పిల్లలకు కావల్సిన సౌకర్యాలు సమకూర్చడం అంటే చాలా టైమ్‌ కావాలి కదా?
ఆ విషయంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. మా అమ్మగారు ఉన్నారు కదా. ఆవిడ చూసుకుంటారు.

మీతో పాటు మీ అమ్మగారు కూడా షూటింగ్‌ లొకేషన్స్‌కి వచ్చేవారు. ఇప్పుడూ అంతేనా?
స్టార్టింగ్‌లో వచ్చేవారు. అప్పుడు టీనేజ్‌లో ఉన్నాను. ఏమీ తెలియదు కాబట్టి, నాతో పాటు లొకేషన్లో ఉండేవారు. నాకు ఇండస్ట్రీ అలవాటయ్యేవరకూ సపోర్ట్‌ కావాలి కదా. ఇప్పుడు నేను పాతికేళ్ల అమ్మాయిని. మేనేజ్‌ చేసుకోగలను. అందుకే అమ్మ రావడం లేదు. పైగా దత్తత తీసుకున్న పిల్లల వ్యవహారాలు చూసుకోవాలి. అలాగే లొకేషన్లో గంటలు గంటలు కూర్చుని ఉండటం వల్ల పెద్ద వయసువాళ్లకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇన్నేళ్లు అమ్మ నన్ను వెన్నంటే ఉండి నా బాగోగులు చూసుకుంది. ఇప్పుడైనా రెస్ట్‌ ఇవ్వాలి కదా.

ఇంతకీ సినిమాలంటూ బిజీగా ఉండటమేనా? కొత్తగా ఎవరితోనైనా లవ్‌లో పడ్డారా?
సినిమాలు ఫ్రంట్‌ సీట్‌.. లవ్‌ బ్యాక్‌సీట్‌. ప్రస్తుతానికి దృష్టంతా ఫ్రంట్‌ స్ట్రీట్‌ పైనే.

పిల్లల్ని చదివిస్తున్నారు.. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు... దేశం కోసం ప్రాణాలు సైతం వదలడానికి వెనకాడని మన సైనికుల గురించి ఏమంటారు?
ఎవరో వస్తారు.. ఏదో చేసేస్తారు? అనే భయం వెంటాడితే మనం ప్రశాంతంగా ఉండగలమా? సరిగ్గా తిండి తినగలుగుతామా? హాయిగా నిద్రపోగలుగుతామా? ఇక్కడ మనం మన కుటుంబ సభ్యులతో చీకూ చింతా లేకుండా ఉంటున్నాం. కానీ, అక్కడ మనవాళ్లు నిద్రాహారాలు లేకుండా దేశాన్ని రక్షించడానికి పాటుపడుతున్నారు. ప్రాణాలతో తిరిగొస్తారనే గ్యారెంటీ లేదు. అది తెలిసి కూడా వెళుతున్నారంటే ఎంత గొప్ప వ్యక్తులో అర్థం చేసుకోవచ్చు. అందుకే మన సైనికులందరికీ నా ‘సెల్యూట్‌’. ఓల్డేజ్‌ హోమ్‌ ఏర్పాటు చేశాక సోల్జర్స్‌ కోసం ఏదైనా చేయాలి. ఇప్పుడు వాళ్ల గురించి ఇంత మాట్లాడాక, ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. తప్పకుండా చేస్తా.
– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement