నిజం చెబుతున్నా
నిజం చెబుతున్నా నమ్మండి. ఎదుటి వ్యక్తులు మనమాటలను విశ్వసించనప్పుడు వాడే పదం ఇది. అలాంటి పదం నటి హన్సిక నోటి నుంచి వచ్చిం దంటే ఆమె చెప్పేది నమ్మశక్యంగా లేదని భావించాల్సి ఉంటుందన్నమాట. ఇంతకీ ఈ బ్యూటీ చెప్పిన ఆ విషయం ఏమిటి? ప్రస్తుతం హన్సిక అంటేనే హాటెస్ట్ హీరోయిన్. తమిళం, తెలుగు భాషలలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. అలాంటి ఈ భామ పలు వదంతులకు కేంద్ర బిందువుగా మారడం విశేషం. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం జరిపారు. మొదట ప్రేమ లేదు దోమా లేదు అంటూ కొట్టిపారేసినా ఆ తరువాత అవును మేము ప్రేమించుకుంటున్నాం.
పెళ్లి కూడా చేసుకుంటాం అంటూ బహిరంగంగా ప్రకటించారు. ఆ తరువాత శింబుతో ప్రేమ పటాపంచలైంది. ప్రేమ కథ కంచికి చేరడం జరిగిపోయింది. ఈ వ్యవహారంలో కాస్త కలత చెందిన హన్సిక కొన్ని రోజులు మౌనం వహించారు. తాజాగా ఉయిరే ఉయిరే చిత్రంలో హీరో సిద్ధార్థ్‌తో ప్రేమ పాఠాలు వల్లివేస్తున్నట్టు ప్రచారం జోరందుకుంది. సిద్ధార్థ్ సీనియర్ నటి జయప్రద కుటుంబ సభ్యుడు. ఈయన హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో హన్సిక హీరోయిన్. వీరిద్దరి గురించి వచ్చిన పుకార్లపై నటి హన్సిక స్పందిస్తూ అవన్నీ నిరాధార వార్తలన్నారు.
సిద్ధార్థ్ తన సహ నటుడు మాత్రమేనని పేర్కొన్నారు. నిజానికి ఉయిరే ఉయిరే చిత్ర షూటింగ్ ఆరు నెలల క్రితమే పూర్తి అయ్యిందని చెప్పారు. ఆ తరువాత తాను సిద్ధార్థ్ తారసపడిన సందర్భమే లేదన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే సారించినట్లు తెలిపారు. ఇప్పుడు తన చేతిలో తొమ్మిది చిత్రాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను నటుడు శింబుతో కలిసి బెంగుళూర్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. నిజం చెబుతున్నా తనకు ప్రేమించడానికి టైమ్ లేదు. ఇప్పటికీ తన ప్రేమ అంతా నటనపైనేనని హన్సిక అంటున్నారు.