అనాథలంతా సర్కారు బిడ్డలే: ఈటల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో తల్లిదండ్రుల్లేని అనాథ పిల్లలందరికీ ఇకపై ప్రభుత్వమే అమ్మనాన్నగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 69వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ ‘‘అనాథలకు ప్రభుత్వమే అమ్మనాన్నలా కొనసాగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘం లోతుగా అధ్యయనం చేసి నివేదికను కూడా అందజేసింది. ఇకపై అనాథ పిల్లలకు ప్రభుత్వమే అమ్మనాన్న. 18 ఏళ్ల వరకు వారి ఆలనాపాలనా ప్రభుత్వానిదే. చదువు చెప్పించడంతోపాటు పెళ్లి చేసి ఆ కుటుంబాలకు అన్నిరకాలుగా సాయం చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. రేపో మాపో ఈ గొప్ప నిర్ణయం వెలువడబోతోంది’’ అని పేర్కొన్నారు.