అనాథ బాలలకు ఆశాకిరణం | Hopeful to orphaned children | Sakshi
Sakshi News home page

అనాథ బాలలకు ఆశాకిరణం

Published Wed, Oct 22 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

అనాథ బాలలకు ఆశాకిరణం

అనాథ బాలలకు ఆశాకిరణం

స్ఫూర్తి
ఊరు కాని ఊరు... రాష్ట్రం కాని రాష్ర్టంలో రోడ్డు పక్కన ఉండే అనాథ పిల్లల ఆక్రందనలు ఆమెను కదిలించాయి. ఓ మంచి కార్యానికి సంసిద్ధురాలిని చేశాయి. తను, తన కుటుంబం మాత్రం బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో అనాథలను, వీధిబాలలను ఆదుకోవడానికి ఆమె దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకూ ఈమె ఎవరో, ఈమె చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలు ఎక్కడో చూద్దామా..!
 
ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వాణి, హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ భార్యాభర్తలు. ఉద్యోగరీత్యా వీరిద్దరూ ముంబాయిలో నివసిస్తున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లాక, ఇంట్లో ఒంటరిగా ఉండలేక వాణి ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. ఆమె ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లే క్రమంలో దారిలో ఎందరో అనాథలు, వీధిబాలలు దయనీయమైన స్థితుల్లో తిరగాడుతుండటాన్ని చూసి చలించిపోయింది. వారికోసం ఏదైనా చేయాలనుకుంది.

తన ఆలోచనను స్నేహితులతో పంచుకుంది. బెంగాల్‌కు చెందిన దేవాంజలి ఆమెకు తోడ్పాటును అందించేందుకు సిద్ధమైంది. వీరికి మరికొందరు స్నేహితులు జత కలిశారు. మొదట్లో వీరందరూ కలిసి దుప్పట్లు, దుస్తులు కొనుగోలు చేసి అనాథలకు అందించేవారు. వివిధ ఆశ్రమాల్లో ఉండేవారికి, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి దుస్తులు, పండ్లు పంపిణీ చేసేవారు. ఇదే సమయంలో వీధిబాలలు చాలామంది ఆకలితో అలమటిస్తుండటాన్ని వీరు గుర్తించారు. దాంతో ఇంటి వద్దనే వండిన ఆహారాన్ని తీసుకెళ్లి మురికివాడల్లో నివసించే పిల్లలకు తినిపించటంతో బాటు వారికి పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా అందిస్తున్నారు.
 
వీరి సేవా కార్యక్రమాలను చూసిన పలువురు తమవంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. దాంతో 75 మంది పిల్లలకు చదువుతోపాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరు ‘ఆశాకిరణ్’ పేరుతో ఒక పాఠశాలను, ఒక ఉచిత ఉపశమన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో పిల్లలకు విద్య మాత్రమే కాకుండా చిత్రలేఖనం, వృత్తి విద్య, నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. అతి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఆశాకిరణ్’ ఇప్పుడు ఇక్కడి చిరునామాలలో ల్యాండ్ మార్క్‌గా మారడం విశేషం. పేరుకు తగ్గట్టే  మురికి వాడలలోని వారికి వీరి పాఠశాల ‘ఆశాకిరణం’లా వెలుగునిస్తోంది. మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, సేవాభావం, దానిని నెరవేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే, ఎక్కడైనా, ఎంతైనా చేయవచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి!
  - కొమ్మినేని వెంకటేశ్వర్లు, సాక్షి, ఖమ్మం                                                                                                                                                                                                                                                                                                        
 
ఆసరా ఇస్తే ఖమ్మంలోనూ పాఠశాల ప్రారంభించాలని ఉంది!  
‘నేను చేస్తున్న సేవలకు పలువురు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో పాఠశాల నిర్వహిస్తున్నాను. అయితే మా సొంత పట్టణమైన ఖమ్మంలో కూడా అనాథలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది. దాతలు ముందుకొస్తే అక్కడ కూడా అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని ఉంది’  
 - వాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement