inspiration
-
సివిల్స్‌లో సక్సస్ కాలేదు..కానీ ఇవాళ ఓ కంపెనీ సీఈవో..!
ఒక్కోసారి మనం వెళ్లేదారిలో గమ్యం కానరాకపోవచ్చు. సక్సస్ అంత తేలిగ్గా రాకపోవచ్చు. లేదా మనం ఎంపిక చేసుకున్నదాంట్లో సక్సెస్ రాకపోవచ్చు అయినంత మాత్రాన ఓడిపోయినట్లు, అసమర్థులు కాదు. ఇంకోచోట గెలుపుని అందుకోవచ్చు. అది మనం ధైర్యంగా తీసుకునే నిర్ణయంలో ఉంటుంది. ఆ దిశగా ఫెయిల్యూర్స్ వైపు చూడకుండా వెళ్తే..సక్సస్ కచ్చితంగా మన కాళ్ల వద్దుకు వచ్చి తీరుతుందని చేసి చూపించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన స్ఫూర్తిదాయకమైన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు.అతడే చాయ్ సుత్తా బార్ సహ వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే. సోషల్ మీడియా పోస్ట్‌లో యూపిఎస్సీ కల చెదరిపోవడంతో తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తన స్నేహితుడితో కలిసి తీసుకున్న ఆ నిర్ణయం తన లైఫ్‌నే ఛేంజ్ చేసిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఒక్కచోట విజయం అందుకోలేదని అక్కడే నిరీక్షించటం కంటే మరో చోట ప్రయత్నించి చూస్తే.. సక్సెస్ తథ్యం అంటున్నాడు. తాను యూపీఎస్సీకి ప్రిపేరవుతున్నప్పుడూ..వరుసగా వైఫల్యాలు పకరిస్తూనే ఉన్నాయి. ఇక రాసే ఛాన్స్ అయిపోయింది. ఇంకో పక్క జీవితంలో ఏం సాధించలేకపోయానన్న ఆత్మనూన్యత నిరాస నిస్ప్రుహలతో సతమతమవుతున్న తరుణంలో స్నేహితుడితో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచన తెరతీశాడు. ఆ నిర్ణయం కరెక్టో కాదో కూడా తెలియదు. కానీ ఏదో నమ్మకం, గెలవాలన్న పట్టుదల అంతే..ఆ కసితోనే చిన్ని టీ స్టార్టప్‌తో వచ్చాను. మట్టికప్పుల్లో టీ సర్వ్ చేయాలన్న విన్నూత్న ఆలోచనే తన స్టార్టప్‌ని విస్తరించేలా చేసింది. 300 కి పైగా నగరాల్లో 500కి పైగా టీ రిటైల్ చైన్‌గా విస్తరించింది. అదోకా బ్రాండ్లా తన చాయ్ సుత్తా బార్ స్టార్టప్‌ని తీసుకొచ్చాడు. ఇలా తన టీస్టాల్ పేరు వెరైటీగా ఉండటం కూడా ప్రజాదరణకు కారణమైంది. ఇండోర్‌కు చెందిన ఈ చాయ్ సుత్తా బార్ (CSB) అతిపెద్ద టీస్టాల్ విక్రేతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అలా తన బ్రాంచ్‌లన్నింటికి హెడ్‌గా సహా వ్యవస్థాపకుడిగా మారాడు. "తాను చదువులో బ్యాక్బెంచర్ని. చిన్నప్పటి నుంచి ఎలాంటి అవార్డులు, సర్టిఫికేట్లు పొందలేదు. కానీ ఈరోజు తన చాయ్ సుత్తా బార్ (CSB) క్యాబిన్ ంనిండా అవార్డులు, సర్టిఫికేట్లతో నిండిపోయింది. గెలుపురాలేదని అలానే ఉండిపోవద్దు..మరోచోట కచ్చితంగా అంతకుమించిన సక్సెస్‌ని చవిచూస్తారు. ధైర్యంగా ముందడుగు వేయండి అని విలువైన సందేశంతో పోస్ట్‌ని ముగించారు అనుభవ్ దూబే.This is for those who haven’t received any award or recognition in their life.Till the age of 25, I hadn’t received a single award. I was a backbencher. Awards, certificates se mera door door tak koi lena dena nahi tha.When I started feeling that I might not clear my UPSC… pic.twitter.com/CxX8sCVObR— Anubhav Dubey (@tbhAnubhav) March 18, 2025 (చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..) -
ఉమెన్స్ డే స్పెషల్.. తల్లి, చెల్లితో సాయిపల్లవి (ఫోటోలు)
-
నా ఇన్సిపిరేషన్ అమ్మ.. ఎందుకంటే..
‘నాకు ఏడేళ్లప్పడు మా అమ్మ నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను తీసుకుని నాన్న దగ్గర్నుంచి బయటకు వచ్చేసింది. ఆ ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు ‘మనం ఊరెళ్లిపోతున్నాం’ అని చెప్పింది అమ్మ. ‘ఎందుకు?’ అడిగాను. ‘నేను కొడుకును కనివ్వలేను కాబట్టి’ అంది. నాన్న వాళ్లింట్లోంచి వచ్చేప్పుడు అనుకున్నాను ‘ఎప్పటికైనా ఆ ఇంటిని కొంటాను’ అని! అనుకోవడమే కాదు అమ్మతో చెప్పాను కూడా! చాలెంజెస్ ఫేస్ చేయడం ఆ రోజునుంచే మొదలైంది. డబుల్, ట్రిబుల్ జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించాను. ఆ ఇంటిని కొనేంత కూడబెట్టాను. ఒకరోజు అక్కడికి వెళ్లి అమ్మకు ఫోన్ చేశాను. ‘చిన్నప్పుడు వదిలి వచ్చేసిన ఇంటి దగ్గరున్నానమ్మా’ అని! అప్పుడు అమ్మ ‘ప్రతీకారకాంక్ష మనల్ని దహించేస్తుంది.. విలువైన సమయాన్ని వృథా చేస్తుంది. మన ఎనర్జీని నిరుపయోగమైన వాటివైపు మళ్లిస్తుంది. అందుకే మనల్ని హర్ట్ చేసిన వాళ్లను క్షమించి, మరచిపోవాలి. మనకు కోపం తెప్పించే వాటిని ఇగ్నోర్ చేయాలి. మన ఎనర్జీని పదిమందికి ఉపయోగపడే విషయాలపై వెచ్చించాలి’ అని చెప్పింది. ఆ మాట నా దిశను మార్చేసింది. అందుకే మా అమ్మే నా ఇన్సిపిరేషన్, టీచర్, గైడ్, ఫిలాసఫర్!’ -
నాకు స్ఫూర్తి మా నానమ్మ
ఎందుకంటే.. ‘ఒక పొజిషన్ అచీవ్ చేయమనెప్పుడూ చెప్పలేదు మా నానమ్మ. అయితే ఒక పొజిషన్లో ఉంటే చేయగలమో చెప్పింది. మన పనులతో ఎంతమందిని ప్రభావితం చేయగలమో చెప్పింది. మా పేరెంట్స్, మా నాన్నమ్మ ఎప్పుడూ మమ్మల్ని అబ్బాయిలకు డిఫరెంట్ అని పెంచలేదు. అందుకే మేం వాళ్లతో ఈక్వల్ కాదనే భావన మాకెప్పుడూ రాలేదు. అమ్మ కానీ, నానమ్మ కానీ మాకు ఎక్కడ తగ్గాలో నేర్పారు. అది మహిళలకున్న సహజగుణమని మేం గ్రహించేలా చేశారు. నిజానికి మనకు ఎక్కడ నెగ్గాలో తెలుస్తుంది. కానీ ఎక్కడ తగ్గాలో తెలియదు. అది తెలుసుకోవాలి. సహనం మనకున్న సహజమైన లక్షణం. దాన్నెందుకు కోల్పోవాలి మనం! అది మనకున్న ఆరా! దాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ నేను మా నానమ్మ, అమ్మ ద్వారే తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. సో నాకు వాళ్లే స్ఫూర్తి!’ -
‘గత విజయాలే నాకు ప్రేరణ’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు సాధించిన ఘనతలు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సహా ఐదు పతకాలు మాత్రమే కాదు... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలతో తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్ ట్రోఫీలతో ఆమె ఎన్నో అద్భుత విజయాలతో ఆమె తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుంది. అయితే గత ఏడాది కాలంగా ఆమె కెరీర్ కాస్త ఒడిదుడుకులకు లోనవుతోంది. ఆశించిన స్థాయిలో ఆమె ప్రదర్శన ఉండటం లేదు. దాంతో 29 ఏళ్ల సింధు భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి. కానీ సింధు వీటన్నింటిని కొట్టిపారేసింది. ఆటలో మరింత కాలం కొనసాగే సత్తా తనలో ఉండటమే కాదు... విజయాలు సాధించాలనే తపన, ఆకలి కూడా మిగిలి ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. సరిగ్గా చెప్పాలంటే తాను సాధించిన గత విజయాలు తనకు స్ఫూర్తినిస్తాయని ఆమె పేర్కొంది. ‘మున్ముందు కెరీర్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తపన నాలో ఇంకా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను గొప్ప విజయాలు అందుకున్న గత వీడియోలు చూస్తే ఎంతో సంతోషం కలగడమే కాదు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి కూడా. వాటిని చూస్తే చాలు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా కొన్ని టైటిల్స్ నేను చాలా చిన్న వయసులోనే గెలుచుకున్నాను. అప్పుడు అంతా బాగా చేయగా లేనిది ఇప్పుడు చేయలేనా అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. అక్కడినుంచే మళ్లీ విజయాల వేట మొదలవుతుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. కోలుకొని చెలరేగడం కొత్త కాదు... గతంలో తాను వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో వెనుకబడిపోయానని, కానీ ఎప్పుడూ ఆశలు వదులుకోలేదని ఆమె వెల్లడించింది. ‘క్రీడల్లో నేను ఎంతో నేర్చుకున్నాను. గాయాలతో ఆటకు దూరమై అసలు తిరిగొస్తానో లేదో అనే సందేహాల మధ్య కూడా నాపై నేను నమ్మకం ఉంచాను. 2015లో నేను గాయపడినప్పుడు ఇలా జరిగింది. కానీ ఆ తర్వాత కోలుకొని రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాను. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు సాధించాను. ఇన్ని గెలిచిన నేను ఎంతో అదృష్టవంతురాలిని. అవన్నీ నాతో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గెలుపోటములు ఆటలో, జీవితంలో భాగం. కష్టసమయాల్లో ఓపిగ్గా ఉండటం అనేది నేను నేర్చుకున్నాను. సరైన సమయం కోసం ఎదురు చూడటం ఎంతో ముఖ్యం’ అని సింధు విశ్లేషించింది. గడ్డు కాలం అధిగమించాను... 2024లో ఆడిన చివరి టోర్నీ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలవడం మినహా గత ఏడాది సింధు చెప్పుకోగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. మరో పతకం ఆశలతో బరిలోకి దిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కూడా నిరాశపర్చింది. అయితే ఇలాంటి దశను దాటి మున్ముందు మంచి విజయాలు అందుకుంటానని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘మనం అనుకున్న విజయాలు సాధించనప్పుడు, కోర్టులో కష్ట సాగుతున్నప్పుడు సహజంగానే బాధ వేస్తుంది. ఇలాంటప్పుడు మరింత పట్టుదలగా ఉండాలి. నేను ఎన్నో మ్యాచ్‌లలో గెలుపునకు బాగా చేరువగా వచ్చి కూడా ఓడిపోయాను. నాకు ఇలా జరుగుతోందేమిటి అని ఆలోచించిన సందర్భాలు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ గడ్డు సమయంలో మన సన్నిహితులు అండగా నిలవడం కీలకం. అప్పుడే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. నా తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులు కావడం నా అదృష్టం. గెలుపోటముల సమయంలో ఎలా ఉండాలో వారు నాకు నేర్పారు. ఇంకా సాధించాల్సింది, నిరూపించుకోవాల్సింది ఏమీ లేకపోయినా సరే ఓటములు బాధించడం సహజం. నాకు సంబంధించి ఫిట్‌గా ఉంటే నేను ఇంకా చాలా ఆడగలనని, ఎన్నో టోర్నీలు గెలవగలననే నమ్మకం ఉంది’ అని సింధు స్పష్టం చేసింది. ఫిట్నెస్ ప్రధానం... 2025లో తన ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొంటూ ఫిట్నెస్ను కాపాడుకుంటానని సింధు వెల్లడించింది. ‘ప్రతీ నెలలో పెద్ద సంఖ్యలో టోర్నమెంట్లు జరుగుతాయి. దాదాపు 15–20 రోజులు బయటే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి టోర్నిలను ఎంపిక చేసుకొని బరిలోకి దిగుతాను. పూర్తి ఫిట్నెస్తో ఉంటేనే వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆడాల్సిన టోర్నీలు కాకుండా మిగతా వాటిలో కొన్నింటిని ఆటగాళ్లు ఎంచుకోవడం సహజం. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరో పతకం, ఆల్ ఇంగ్లండ్‌లో పతకం గెలవడం నా ప్రణాళికల్లో ఉన్నాయి. ఎన్ని గెలిచినా మైదానంలో దిగగానే ఎవరైనా ఇంకా గెలవాలనే కోరుకుంటారు’ అని ఆమె చెప్పింది. ఇంకా నేర్చుకుంటున్నా... ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఇంకా తాను ఆటలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని... ఆటలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్నానని సింధు పేర్కొంది. ‘బ్యాడ్మింటన్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్లేయర్ల డిఫెన్స్ చాలా దుర్బేధ్యంగా మారుతోంది. దానిని బద్దలు కొట్టాలంటే మరింత శ్రమించాలి. ప్రతీసారి అటాక్ చేసే అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా నేను ఎత్తుగా ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా అటాక్ చేయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు. నా డిఫెన్స్ కూడా మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. భారత బ్యాడ్మింటన్‌లో నా తర్వాత ఎంతో మంది యువ తారలు వేగంగా దూసుకొస్తున్నారు. ఉన్నతి, మాళివకల ఆట బాగుంది. వారికి సరైన మార్గనిర్దేశనం లభిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సింధు అభిప్రాయపడింది. కొత్త కోచ్ అండగా... సింధు కొత్త సీజన్లో కొత్త కోచ్ శిక్షణలో బరిలోకి దిగనుంది. ఇండోనేసియాకు చెందిన ఇర్వాన్స్యా ఆది ప్రతమ ఆమెకు ఇకపై కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని సింధు ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా బెంగళూరులో ప్రతమ పర్యవేక్షణలో సింధు సాధన చేస్తోంది. నేటి నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ వీరిద్దరి భాగస్వామ్యంలో తొలి టోర్నీ కానుంది. ‘కోచ్, ప్లేయర్ మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. అది కుదిరేందుకు కొంత సమయం పడుతుంది. మరికొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత ఒకరిపై మరొకరికి స్పష్టమైన అవగాహన రావచ్చు. ప్రతమ గురించి చాలా విన్నాను. నాకు సరైన కోచ్‌గా అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని సింధు వెల్లడించింది. -
ఆ ఊరి పేరు ఐఏఎస్ ఫ్యాక్టరీ... స్త్రీ విద్యతో ఆ ఊరి పేరే మారింది!
ఒకప్పుడు ఆ ఊరి పేరు వినబడగానే ‘వామ్మో’ అనుకునేవారు. దొంగతనాలు, అక్రమ మద్యం వ్యాపారానికి పేరు మోసిన రాజస్థాన్‌లోని నయాబస్ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆదర్శ గ్రామం అయింది. అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి కారణం ఈ గ్రామానికి చెందిన మహిళలు ఐపీఎస్ నుంచి జడ్జీ వరకు ఉన్నత ఉద్యోగాలు ఎన్నో చేయడం. జడ్జీగా ఎంపికైన అభిలాష జెఫ్ విజయాన్ని ఊరు ఊరంతా సెలబ్రెట్ చేసుకుంది. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు అభిలాష రోల్ మోడల్...ఒక ఇంట్లో పెద్ద ఉద్యోగం వస్తే... ఆ సంతోషం ఆ ఇంటికి మాత్రమే పరిమితమైపోతుంది. కానీ అభిలాష జెఫ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె జడ్జీగా ఎంపికైన సందర్భం ఊరంతటికీ పండగ అయింది. అభిలాషను వీధుల్లో ఊరేగిస్తూ డీజే, డ్యాన్స్‌లతో ఆమె విజయాన్ని గ్రామస్థులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్నారు.ఈ ఊరేగింపులో పాల్గొన్న సరితా మీనా ఇలా అంటుంది... ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను. ఏదో ఒకరోజు మా అమ్మాయి అభిలాషలాగే పెద్ద ఉద్యోగం చేస్తుంది’ సరితా మీనాలాగే కలలు కన్న తల్లులు, ఎన్ని కష్టాలు వచ్చినా తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివిస్తామని ప్రతిజ్ఞ చేసిన తల్లులు ఆ ఊరేగింపులో ఎంతోమంది ఉన్నారు. రాజస్థాన్‌లోని నీమ్ కా ఠాణా జిల్లాలోని నయాబస్ గ్రామంలోని యువతులకు ఆ సంతోషకరమైన రోజు ఒక మలుపు.‘అభిలాషలాంటి అమ్మాయిల వల్ల ఊరికి జరిగిన మేలు ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కూతుళ్లను పెద్ద చదువులు చదివించాలనుకుంటారు. పది చాలు, పై చదువులు ఎందుకు అనే ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది కర్ణిక అనే గృహిణి.అభిలాషకు ముందు అల్కా మీనాను కూడా ఇలాగే ఊరేగించారు. ఈ గ్రామానికి చెందిన అల్కా మీనా ఐపీఎస్ పంజాబ్‌లో డిఐజీగా విధులు నిర్వహిస్తోంది. అల్కా మీనా నుంచి అభిలాష వరకు ఎంతోమంది మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. విశేషం ఏమిటంటే నయాబస్ను ఇప్పుడు ‘ఐఏఎస్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఊరి నుంచి ఐఏఎస్‌లాంటి ఉన్నత సర్వీసులకు ఎంపికైన వారు కూడా ఉన్నారు.ఇప్పుడు గ్రామంలో ఎటు చూసినా అల్కా మీనా, అభిలాషలాంటి విజేతల పోస్టర్లు కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. కోచింగ్ సెంటర్ల వారు అంటించిన ఈ పోస్టర్లలో ‘ఇలాంటి విజేతలు మీ ఇంట్లో కూడా ఉన్నారు’ అని ఉంటుంది.ఈ గ్రామంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు వారి ప్రపంచంలో మాత్రమే ఉండిపోకుండా ఎప్పుడూ ఊరితో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుకు సంబంధించి చొరవ తీసుకుంటారు. ఒకప్పుడు ఈ ఊళ్లో ఒకే స్కూల్ ఉండేది. అమ్మాయిల సంఖ్య అంతంత మాత్రమే. ఇప్పుడు మాత్రం ‘బాలికల పాఠశాల’తో కలిసి మూడు స్కూల్స్ ఉన్నాయి.చదువు వల్ల నయాబస్ ఆదర్శగ్రామం కావడం ఒక కోణం అయితే, స్త్రీ సాధికారత మరో కోణం. చదువు వల్ల అమ్మాయిలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం నుంచి ఆర్థిక భద్రత, ఉన్నత ఉద్యోగం వరకు ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంటున్నారు. తమ కలలను నిజం చేసుకుంటున్నారు.ఆటల్లోనూ...ఉన్నత చదువు, ఉద్యోగాలలోనే కాదు ఆటల్లో రాణిస్తున్న వారు కూడా నయాబస్లో ఎంతోమంది ఉన్నారు. దీనికి ఉదాహరణ... సలోని మీనా. గత ఏడాది ఇండో–నేపాల్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఇరవై ఏళ్ల మీనా మూడోసారి స్వర్ణం గెలుచుకొని ఊళ్లో సంబరం నింపింది. రాబోయే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడాలనేది తన లక్ష్యం అని చెబుతుంది మీనా. భవిష్యత్‌కు సంబంధించి సలోని మీనాకు భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఊరు అండ ఉంది. ఇంకేం కావాలి! చదువు అనేది వజ్రాయుధం, తిరుగులేని మహా ఉద్యమం అని మరోసారి నయాబస్ గ్రామం విషయంలో నిరూపణ అయింది. ఇల్లే ప్రపంచంగా మారిన ఎంతోమంది అమ్మాయిలు చదువుల తల్లి దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారు. -
అంబేడ్కర్ దారిలో అలుపెరుగక..
‘ఈ ప్రపంచాన్ని జయించడానికి ప్రేమతో మొదలవ్వు. ప్రేమ త్యాగమై, యుద్ధ గీతమై, అదో గొప్ప పోరాటాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. నిన్ను విజేతగా నిలబెడుతుంది’ అంటారు 71 ఏళ్ల సాహితీ వేత్త, దళితోద్యమ నాయకుడు డా‘‘ కత్తి పద్మారావు. ఆయన జీవితం – సాహిత్యం – ఉద్యమాలు వేర్వేరు కావు. పరిణామ క్రమంలో ప్రవాహ సదృశ్యంగా కొన సాగుతూ వచ్చిన, గుణవాచి అయిన కాల ధర్మం! అంబేడ్కర్ దార్శనికతనూ, తాత్వికతనూ, వివేచనా నిపుణతనూ ఆకళింపు చేసుకున్న ప్రథమ శ్రేణి ఆచరణ శీలుడాయన.అంబేడ్కర్ మార్గంలో పూలే నుండి పెరియార్ మీదగా చార్వాకుడు, బుద్ధుని వరకూ... ఆ తరువాతి నవ్య సిద్ధాంతకర్తలనూ, చరిత్రకారులనూ పరి శీలించి ఆకలింపు చేసుకున్నారు. సంస్కృత పాండిత్యం వల్ల అపా రమైన అధ్యయనం, పరిశీలన, రచనా శక్తి అబ్బింది. జలపాతం సదృశ్యమైన వాక్చాతుర్యం, సమయ స్ఫూర్తి, ఉత్తేజ పరచటం, వాదనా పటిమలతో అత్యుత్తమ రీతిలో ప్రజ లకు చేరువయ్యారు. కారంచేడు, కొత్తకోట, నీరుకొండ, పిప్పర్ల బండ్ల పల్లి, చుండూరు, పదిరి కుప్పం, వేంపెంట, లక్షింపేట వంటి ఉద్యమాలలో నాయకునిగా నిలిచి, ప్రభుత్వాలతో పోరాడి, ప్రజాయుద్ధంతో విజ యాన్ని సాధించారు.కారంచేడు, చుండూరు వంటి ఉద్యమాలలో బాధితుల పక్షాన నిలబడి వారికి వందల ఎకరాల భూములు ఇప్పించి, బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ సహాయం ఏర్పాటు చేసి, ఉద్యోగాలు ఇప్పించి, చిల్లిగవ్వ కూడా ప్రభుత్వ సొమ్ములను ఆశించకుండా నిజాయితీగా, నిబద్ధతతో తమ రచనలను నమ్ముకుని, అమ్ముకుని జీవనం సాగిస్తున్న అక్షర సంపన్ను లాయన. పార్లమెంటు సాక్షిగా 111 మంది ఎంపీలతో ‘1989 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టా’న్ని తీసుకు రాగలిగారు.‘బౌద్ధ దర్శనం’, ‘చార్వాక దర్శనం’, ‘దళితుల చరిత్ర,’ ‘బ్రాహ్మణవాద మూలాలు’, ‘కులం ప్రత్యామ్నాయ సంస్కృతి’, ‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ’, ‘భారత రాజకీయాలు – కులాధిపత్య రాజకీయం – ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాలు’, ‘అంబేడ్కర్ చూపు’ వంటి 89 రచనలను అందించారు. ఆయన కుటుంబం అంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. స్వయంగా తన చేతుల మీదుగా కొన్ని వేల కులాంతర వివాహాలు జరిపించడం ద్వారా ఒక సామాజిక మార్పునకు మార్గదర్శిగా నిలిచారు. మొత్తంగా ఆయన రచనల సారాంశం... ఉద్యమ రూపం, ప్రశ్న, ప్రతిఘటన, ప్రగతిగా సాగుతుంది. సమకాలీన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సామా జిక రంగాల్లో కత్తి పద్మారావు పాత్ర ఎవరూ తిరస్కరింపలేనిది. – శిఖా ఆకాష్, నూజివీడు, 93815 22247 (రేపు డా. కత్తి పద్మారావు 71వ జన్మదినం సందర్భంగా...) -
‘నాన్నే నా ప్రాణం’.. చిరాగ్ భావోద్వేగ పోస్ట్
బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మూడోసారి ఎంపీగా ఎన్నికై, తొలిసారి మోదీ కేబినెట్లో మంత్రి అయ్యారు. మోదీ 3.0 క్యాబినెట్లో చిరాగ్ పాశ్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఒకప్పుడు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు.ఈ పోస్టుకు తన తండ్రికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను జతచేశారు. నాడు రాష్ట్రపతి భవన్లో రామ్ విలాస్ పాశ్వాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటోను చిరాగ్ పోస్ట్ చేశారు. అలాగే తాను తన తండ్రితో ఉన్నప్పటి ఫొటోలను కూడా షేర్ చేశారు. వీడియోలో రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డ్ చేసిన వాయిస్ ప్లే అవుతుంది. అలాగే ఇదే వీడియోలో చిరాగ్ మాట్లాడుతూ ఈ దీపం(చిరాగ్) దేశానికి, ప్రపంచానికి వెలుగు నిచ్చేదిగా మారినందుకు సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు.చిరాగ్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు మూడు కోట్ల మంది వీక్షించగా, 11 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో చిరాగ్‌ను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో బీహార్ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కొందరు పేర్కొన్నారు. -
జగత్తంతా ఈశ్వరమయం!
ద్వారకలో శ్రీకృష్ణుడు సభలో కొలువుతీరి ఉండగా, ఒకరోజు ఒక బోయవాడు చేతిలో ఉత్తరంతో వచ్చి శ్రీకృష్ణుడి దర్శనాన్ని కోరగా, సేవకులు అతడిని శ్రీకృష్ణుడి సముఖానకు తెచ్చి, వచ్చిన పనియేదో ప్రభువుల వారితో విన్నవించుకోమనగా, ఆ బోయవాడు ‘కుండినపురంలోని భీష్మక మహారాజు సభలో అమాత్యులవారు వ్రాసి ఇచ్చిన వర్తమానాన్ని యేలినవారి సముఖాన పెట్టడానికి రయాన వచ్చాను ప్రభూ!’ అని వివరం చెప్పాడు.‘మహారాజశ్రీ అఖండలక్ష్మీ సమేతులైన శ్రీకృష్ణులవారికి మేము వ్రాసి పంపించే విన్నపము. ఇక్కడి సర్వక్షేమ స్థితిని శ్రీవారికి ఈవరకే తెలిపియుంటిమి. ఇప్పుడు విన్నవించుకొనుట యేమనగా– భీష్మక మహారాజులవారు వారి కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించి, స్వయంవరానికై రాజులందరికీ వర్తమానాలు పంపించారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణులవారు కూడా వేంచేయాలని కోరుకుంటూ ఎంతో ఆదరంతో మిమ్ములను ఆహ్వానించమని మాకు ఉత్తరువులను ఇచ్చారు.కనుక స్వామివారు తప్పక విచ్చేయగలరని మా విన్నపము!’ అని ఆ లేఖలోని విషయాన్ని మంత్రివర్యులు చదివి వినిపించగా విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, సభలో కొలువై ఉన్న వారిని ఉద్దేశించి ‘కూతురు పెళ్ళి ఘనంగా చేయాలని ఉత్సాహంతో భీష్మక మహారాజు పంపిన వర్తమానాన్ని విన్నారు కదా! ఆ ఆహ్వానంపై మీ అభిప్రాయాన్ని ఆలోచించి చెబితే బాగుంటుంది. ఆప్తులైన మీరందరూ మేలైనదిగా ఏది అనుకుంటారో, ఆ దారిలో నడుచుకుంటేనే కదా ప్రభువునైన నాకు శుభం చేకూరుతుంది!’ అని అంటాడు. శ్రీకృష్ణుడి మాటలకు సభలోని అందరూ ముగ్ధులై–"నీరజనాభ కార్యముల నిశ్చయమిట్టిదటంచు దెల్పగా నేరుచువారలుం గలరె నీయెదుటన్ సకలాంతరాత్మవై నేరిచినట్టివారలను నేర్వనివారనిపించి దిద్దగానేరిచినట్టి దేవుడవు నీకొకరా యెఱిగించు నేర్పరుల్"‘ఓ పద్మనాభ స్వామీ! జరగవలసిన పనిని గురించి ‘ఇది ఇలా జరిగితే బాగుంటుంది’ అని మీకు చెప్పగలిగినవారు ఉన్నారా? సకలమూ తెలుసునని భావించేవారి చేత కూడా వారికి ఏమీ తెలియదని వొప్పించగలిగే నేర్పు కలిగిన దేవుడవైన మీకు చెప్పగలవారు ఎవరైనా ఈ ముల్లోకాలలోనూ ఉన్నారా?’ అని భక్తితో బదులిచ్చారని కోటేశ్వరకవి రచించిన ‘భోజసుతా పరిణయం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని సన్నివేశంలో రసవత్తరంగా వర్ణించబడింది. ‘సకలాంతరాత్మవు’ అని ఒక్క మాటలో ‘జగత్తులోని ప్రతిదీ ఈశ్వరాంశయే!’ అని చెప్పడం ఇందులో గ్రహించదగినది. – భట్టు వెంకటరావు -
బౌద్ధవాణి: మణి–దీపం!
వేసవి ఎండ తీవ్రంగానే ఉంది. కానీ ఆ మామిడి తోటలో చల్లగానే ఉంది. ఆ మామిడితోట వేణువనానికి ఒక మూలన ఉంది. ఆ తోట మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద విశాలమైన అరుగు. ఆ అరుగు దగ్గరకు నెమ్మదిగా, మందహాసంతో నడిచి వచ్చాడు బుద్ధుడు. ఆయన రాకను గమనించాయి తోటలో ఉడతలు. మనిషి అలికిడి తగిలితే ΄ారి΄ోయే ఉడతలు, బుద్ధుణ్ణి చూస్తే దగ్గరకు వచ్చేస్తాయి.అది ఎప్పటినుండో వాటికి అలవాటు. భిక్షా΄ాత్రలోంచి కొన్ని పళ్ళు తీసి అరుగు పైన ఒక పక్కన చల్లాడు. అవి కుచ్చుతోకలు విప్పుకుని, పైకెత్తుకుని వచ్చి, పండ్లు ఏరుకుని తినసాగాయి. కొంత సమయం గడిచింది.సకుల ఉదాయి అనే పరివ్రాజకుడు వచ్చాడు. బుద్ధునికి నమస్కరించి కూర్చున్నాడు. అతను రాగానే కొన్ని ఉడతలు చెట్లెక్కాయి. వాటిని చూసి– ‘‘భగవాన్! మీ కరుణ అమోఘం. ఉడతలు కూడా మిమ్మల్ని మిత్రునిగా భావిస్తాయి. ఇది విచిత్రం. మీ జీవ కారుణ్యానికి మచ్చుతునక. మీకు మరోమారు ప్రణమిల్లుతాను’’ అని వంగి నమస్కరించాడు. ‘‘సకుల ఉదాయీ! వచ్చిన విషయం?’’ అని అడిగాడు బుద్ధుడు. ‘‘మా గురువుగారు నిగంఠ నాధుల వారు నిన్న ‘పరమ సత్యం, పరమ వర్ణం’’ అంటూ ‘‘పరమం’’ గురించి చె΄్పారు. మీ దృష్టిలో పరమ వర్ణం ఏది? అని అడిగాడు. ‘‘ఉదాయీ! పరమం అంటే?’’‘‘మీకు తెలియంది కాదు. దేని కంటే ఉన్నతమైంది మరొకటి ఉండదో... అదే పరమం’’ ‘‘నీకు ఈ లోకం ఎంత తెలుసు. అందులో ఇదే పరమం అని ఎలా నిర్ణయిస్తావు? నూతిలోని కప్పకి నుయ్యే ప్రపంచం. చెరువులోని చేపకి చెరువే ప్రపంచం. ఈ అనంతమైన విశ్వానికి హద్దులు ఎలా గీస్తావు?’’ అని అడిగాడు భగవానుడు. సకుల ఉదాయి మౌనం వహించాడు.‘‘ఉదాయీ! ఒక చీకటి గదిలో ఒక పసుపురంగు కంబళిలో ఒక సానబెట్టిన మణి ఉంది. అది ఆ చీకటిలో ప్రకాశిస్తుంది. అంతలో ఆ గదిలోకి ఒక మిణుగురు పురుగు వచ్చింది. అప్పుడు ఆ మణి వెలుగు ఎక్కువ ప్రకాశంగా ఉంటుందా? మిణుగురు వెలుగా?’’ అని అడిగాడు. ‘‘భగవాన్! మిణుగురు వెలుగే మిగుల ప్రకాశం’’ అన్నాడు ఉదాయి.‘‘ఇందులో ఒక వ్యక్తి నూనె దీపం తెచ్చాడు. అప్పుడు ఏ వెలుగు ప్రకాశం?’’‘‘దీపం వెలుగే భగవాన్!’’ ‘అలా ఉదాయీ! దీపం వెలుగు కంటే నెగడు వెలుగు ప్రకాశం. దాని కంటే వేగుచుక్క వెలుగు, దానికంటే చంద్రుని వెలుగు, దానికంటే సూర్యుని వెలుగు ప్రకాశం.... ఉదాయీ! సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగులు కూడా ఉంటాయి.’’ అన్నాడు. ఉదాయి మనస్సు తేటబడింది. ఆ తేటదనం అతని ముఖంలోంచి తొంగి చూస్తోంది! ఉడతలు కిచకిచ మంటూ బుద్ధుని దగ్గరకు వచ్చాయి. ఆయన ΄ాత్రలో నుంచి మరికొన్ని పళ్ళను వాటిముందు ΄ోశాడు. అవి వాటి పనిలో మునిగి ΄ోయాయి. ‘‘ఉదాయీ! మిణుగురు పురుగు కంటే తక్కువ ప్రకాశించే మణి వెలుగునే ‘పరమం’ అనుకుంటున్నావు? అన్నాడు.‘విజ్ఞానం, విశ్వం, అన్నీ అనంతాలే’ అని గ్రహించాడు. సకుల ఉదాయీ! బుద్ధునికి ప్రణమిల్లాడు! అతని ముఖంలో అనుమాన ఛాయలు తొలిగాయి. సంతోష కాంతులు వెలిగాయి! దోసిలి చాచాడు. బుద్ధుడు కొన్ని పండ్లను అతని దోసిట్లో ΄ోశాడు. ఉదాయి, కొద్దిగా ముందుకు వంగి ఉడతలకు దోసిలి చూ΄ాడు. అవి అతని ముఖం కేసి చూశాయి. ధైర్యంగా దోసిలి లోని పండ్లు అందుకున్నాయి. – డా. బొర్రా గోవర్ధన్ -
Mohini Dey: మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో..
పదకొండు సంవత్సరాల వయసులోనే బాస్ గిటారిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది మోహిని డే. మోహిని మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి సుజయ్ డే బాస్ గిటార్ చేతికి అందించాడు. అలా మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో మోహిని ఫ్రెండ్షిప్ మొదలైంది. జాజ్ ఫ్యూజన్ గిటారిస్ట్‌గా సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుజయ్ ఆ తరువాత జాజ్‌కు దూరమై కుటుంబ పోషణ కోసం కోల్కత్తా నుంచి ముంబైకి వచ్చాడు. సెషన్స్ ఆర్టిస్ట్‌గా మారాడు. మోహిని విషయానికి వస్తే తండ్రి సుజయ్ తొలి మ్యూజిక్ టీచర్. తండ్రి సహకారంతో చిన్న వయసులోనే పేరున్న పెద్ద కళాకారులతో కలిసి సంగీత కచేరీలు చేసింది మోహిని. పదమూడు సంవత్సరాల వయసులో ప్రసిద్ధ పృథ్వీ థియేటర్ నుంచి మోహినికి ఆహ్వానం అందింది. ‘మ్యూజిక్ ప్రాక్టిస్ చేస్తున్న నా దగ్గరకు నాన్న వచ్చి రంజిత్ అంకుల్ నుంచి కాల్ వచ్చింది, బ్యాగ్ సర్దుకో అని చెప్పారు. పృథ్వీ థియేటర్‌కు వెళ్లిన తరువాత అక్కడ జాకీర్ హుస్సేన్‌ను, ఫిల్మ్స్టార్స్ను చూశాను. రంజిత్ అంకుల్ నన్ను జాకీర్ అంకుల్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత స్టేజీ మీద బాస్ గిటార్ ప్లే చేశాను. మంచి స్పందన వచ్చింది’ అంటూ తన మ్యూజికల్ మెమోరీలోకి వెళుతుంది మోహిని. తండ్రి సుజయ్ బాస్ గిటారిస్ట్. ఎంత బిజీగా ఉన్నా కూతురికి సంగీత పాఠాలు నేర్పడానికి అధికప్రాధాన్యత ఇచ్చేవాడు. విక్టర్ వుటెన్ నుంచి మార్కస్ మిల్లర్ వరకు ఎంతో మంది గిటారిస్ట్ల ప్రభావం మోహినిపై ఉంది. ఒకే స్టైల్‌కి పరిమితం కాకుండా రకరకాల స్టైల్స్‌ను ప్లే చేయడంలోప్రావీణ్యం సంపాదించింది. ‘రకరకాల స్టైల్స్నుప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను అధిగమించగలిగినప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. స్కూల్, కాలేజి రోజుల్లో నా ఆలోచనలు స్నేహితులకు వింతగా అనిపించేవి. నా ఆలోచనలు, ఐడియాలు ఎప్పుడు నా వయసు వారి కంటే చాలా భిన్నంగా ఉండేవి’ అంటుంది మోహిని. ‘ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు మోహిని ఇచ్చే జవాబు ఇది.. ‘సొంతంగా మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది నా కల. జంతుసంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలనుకుంటున్నాను. వోన్ మ్యూజిక్ షోతో ప్రేక్షకులకు నచ్చే మ్యూజిక్ అందించాలనుకుంటున్నాను’ తల్లిదండ్రులే నా సంగీత పాఠశాల.. తల్లిదండ్రులే నాకు వరం. వారు నాకు సంగీత పాఠశాలలాంటి వారు. ప్రశంస ఎవరికైనా సరే ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఎన్నో ప్రశంసలు వచ్చినప్పటికీ అహం ప్రదర్శించలేదు. ఇది కూడా నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదే. బాస్ గిటార్‌తో జీవనోపాధికి ఇబ్బంది అని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనుకునే సమయంలో యువతకు బాస్ గిటార్‌పై ఆసక్తి పెరిగేలా చేశాను. – మోహిని డే ఇవి చదవండి: Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది! -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్‌గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిపోయారు. వారిని యూనిఫామ్‌లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్‌లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్‌లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్‌ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్‌గా చేరింది. ఫ్రెషర్‌గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్‌లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్‌గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్‌ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్‌పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్‌తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్‌మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
Renuka Jagtiani: 'ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 జాబితాలో' తన ల్యాండ్ మార్క్..
సంపన్న కుటుంబ నేపథ్యం లేని మిక్కీ జగ్తియాని ‘ల్యాండ్‌మార్క్’తో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రపంచ కుబేరుల సరసన నిలిచాడు. భర్త అడుగు జాడల్లో నడిచి వ్యాపార నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని ‘ల్యాండ్ మార్క్’కు తనదైన మార్క్ జోడించి ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. తాజాగా.. ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 జాబితాలో చోటు సాధించింది. రేణుకా జగ్తియాని నేతృత్వంలోని దుబాయ్ చెందిన రిటైలింగ్ దిగ్గజం ‘ల్యాండ్‌మార్క్’ 21 దేశాలలో పాదరక్షల నుంచి గృహోపకరణ వస్తువుల వరకు వివిధ బ్రాండ్లతో విజయపథంలో దూసుకుపోతుంది. హాస్పిటాలిటీ బిజినెస్‌లో కూడా గెలుపు జెండా ఎగరేసింది. ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో ముందుకువెళ్లే రేణుక మిడిల్ ఈస్ట్, ఇండియా, ఆగ్నేయాసియాలోని కీలక మార్కెట్లలో రాబోయే కాలంలో వందలాది స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎలాంటి వ్యాపార అనుభవం లేని రేణుక 1993లో ల్యాండ్‌మార్క్ గ్రూప్‌లోకి అడుగు పెట్టింది. ‘ఇది సాధ్యమా!’ అనుకునే వాళ్లు సందేహాల దగ్గరే తచ్చాడుతారు. ‘కచిత్చంగా సాధ్యమే’ అనుకునే వాళ్లు ముందుకు దూసుకుపోతారు. రేణుక రెండోకోవకు చెందిన మహిళ. వేగంగా వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడమే కాదు ఫాస్ట్–ఫ్యాషన్ బిజినెస్ ‘స్ప్లాష్’తో తనదైన ముద్ర వేసింది. ‘స్ప్లాష్’ పదకొండు దేశాలలో 200 స్టోర్స్ వరకు విస్తరించింది. మన దేశంలో 1999లో లైఫ్‌స్టైల్, హోమ్ సెంటర్ అండ్ మాక్స్‌లాంటి అయిదు ఫార్మట్స్‌లో ప్రస్థానం ప్రారంభించి 900 స్టోర్స్‌లో విస్తరించింది ల్యాండ్‌మార్క్. 2017లో రేణుక ల్యాండ్ మార్క్ గ్రూప్ చైర్పర్సన్, సీయీవోగా బాధ్యతలు స్వీకరించింది. రేణుక భర్త మిక్కీ జగ్తియాని సౌత్ ఆఫ్రికా ఇమిగ్రెంట్స్‌ను దృష్టిలో పెట్టుకొని బహ్రెయిన్‌లో బేబీ ్ర΄÷డక్ట్స్ స్టోర్‌ను మొదలుపెట్టాడు. అక్కడినుంచిప్రారంభమైన బుడి బుడి అడుగుల వ్యాపారం ‘ల్యాండ్‌మార్క్’ రూపంలోఎక్కడికో వెళ్లింది. భర్త నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టడం అంత సులువు కాదు. కాని ఎక్కడా రేణుక వెనకడుగు వేయలేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో కంపెనీలపై పడినట్లే కోవిడ్ సంక్షోభ ప్రభావం ‘ల్యాండ్‌మార్క్’ పై పడింది. రెండు నెలలకు పైగా స్టోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ తరువాత మెల్లమెల్లగా కొత్త గైడ్‌లైన్స్‌తో తెరుచుకోవడం మొదలైంది. ‘విపత్కరమైన పరిస్థితుల్లో ఆపరేషనల్ప్రాసెస్లో ర్యాపిడ్ చేంజెస్ చేశాము. ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. క్వారంటైన్లో ఉన్న ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించాం, వారిలో ధైర్యం నింపాం. ఆఫీస్, స్టోర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశాం. ఉద్యోగుల కోసమే కాదు కోవిడ్ బాధితుల కోసం మా ఫౌండేషన్ తరపున ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు చేపట్టాం’ అంటూ ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటుంది రేణుక. చిన్న వ్యాపారంగా మొదలైన ‘ల్యాండ్‌మార్క్’ గల్ఫ్‌కు సంబంధించి ‘కింగ్ ఆఫ్ రిటైల్’గా పేరు తెచ్చుకుంది. విజయపథంలో దూసుకుపోతున్న ‘ల్యాండ్‌మార్కు’ ముందున్న కర్తవ్యం.. సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఆదరించిన ప్రజలకు అండగా ఉండాలి. పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకుప్రాధాన్యత ఇస్తున్న ల్యాండ్ మార్క్ గ్రూప్ చెన్నై, ముంబై మురికివాడల్లో రకరకాల సేవాకార్యక్రమాలు చేపడుతోంది. రేణుక జగ్తియాని భర్త మిక్కీ జగ్తియాని 71 సంవత్సరాల వయసులో చనిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రిపోర్టర్ ఆయనను ‘మీ నెక్ట్స్ ΄్లాన్ ఏమిటి?’ అని అడిగాడు. దీనికి మిక్కీ జగ్తియాని చెప్పిన జవాబు.. ‘నా గురించి నేను పూర్తిగా తెలుసుకోవడానికి ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. వ్యాపార సంబంధిత విషయాల గురించి కాకుండా నేనెవరిని? జీవితపరమార్థం ఏమిటి? లాంటి విషయాల గురించి ఆలోచిస్తుంటాను. వ్యాపార లాభాలే కాదు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలలో ఆనందం దొరుకుతుంది’ భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపార నైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతో పాటు సేవాకార్యక్రమాలకు కూడాప్రాధాన్యత ఇస్తోంది. భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపారనైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతోపాటు సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఇవి చదవండి: Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి -
Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
‘కోరుకున్న రంగంలో రాణించాలంటే మనలో ఒక తపన ఉండాలి. ఒక తపస్సులా ఆ రంగాన్ని స్వీకరించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి’ అంటారు ఐదు పదుల వయసు దాటిన విపుల్ వర్షిణే. లక్నోవాసి అయిన విపుల్ వర్షిణే ముప్పైఏళ్లుగా ఆర్కిటెక్చర్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, గుర్తింపు పొందారు. ఒక్కరూ తన మాట వినడం లేదు అనే నిరాశ నుంచి రెండు విమానాశ్రయాల రూపకల్పన చేసేంత స్థాయికి ఎదిగారు. విపుల్ వర్షిణే తనను తాను శక్తిగా మలుచుకున్న విధానం నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘నా పేరు విపుల్ అనే ఉండటంతో మగ ఆర్కిటెక్ట్ అనుకుని, సంప్రదించేవారు. నేను మహిళను అని తెలిసి వర్క్ ఇవ్వడానికి వెనకడుగు వేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొంతమార్పు చూస్తున్నాను కానీ, 30 ఏళ్ల క్రితం నేను ఆర్కిటెక్ట్ అని చెబితే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు నేను రెండు విమానాశ్రయాలను డిజైన్ చేసే స్థాయికి ఎదిగాక ఈ రంగంలో అమ్మాయిలూ రాణించగలరు అనే స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను చేసిన ప్రయత్నం ఆషామాషీ కాదు. సృజనతో అడుగు పుట్టి, పెరిగింది లక్నోలో. స్కూల్ ఏజ్ నుంచి పెయిం టింగ్స్ వేయడం, కార్టూన్స్ గీయడం వంటివి చూసి వాటిని పత్రికలకు పంపించే వారు నాన్న. మొదట నేను మెడిసిన్ చదవాలని కోరుకున్న మా నాన్న నాలోని సృజనాత్మకత చూసి ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేయమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ సైన్స్, సృజనాత్మకతల సమ్మేళనంగా ఉంటుంది. మా నాన్న మనసులో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, అది నాకు సురక్షితమైనదని భావించేవారు. నేను ఎంచుకున్న రంగం చాలా శ్రమతో కూడుకున్నదని ఆయనకు తెలియదు. అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి రాత్రంతా డ్రాయింగ్ బోర్డ్ పైనే పని చేయాల్సి వచ్చేది. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.. ’’నేను ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఈ వృత్తిలో అబ్బాయిలదే అధిపత్యమని అప్పుడు అర్థమైంది. కాలేజీలో చదివే సమయంలోనే పెళ్లి అయ్యింది. మావారు సివిల్ ఇంజనీర్ కాబట్టి పెళ్లయ్యాక ఆయనతోనే కెరీర్ప్రారంభించాను. భవనాలు కట్టే లొకేషన్‌కు వెళ్లేటప్పుడు నాతో మాట్లాడేందుకు కూలీలు తడబడేవారు. మేస్త్రీలు నా మాటలను అస్సలు పట్టించుకునేవారు కాదు. ఒక మహిళ యజమానిగా మారడం వారెవరికీ ఇష్టం ఉండదని అప్పుడు అర్ధమైంది. అసలు నన్ను వారు నిర్మాణశిల్పిగా అంగీకరించలేదు. నిరాశగా అనిపించేది. కానీ, నా డిజైన్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని నా నిర్ణయాన్ని సున్నితంగానూ, అంతే కచ్చితంగానూ తెలియజేశాను. అక్కడ నుంచి ఆర్కిటెక్ట్‌గా ఎదగడానికి నన్ను నేను మార్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్‌లో నాకు, నా భర్తకు విడివిడిగా క్యాబిన్లు ఉండేవి. క్లయింట్స్ వచ్చినప్పుడల్లా నా సలహా తీసుకోవాలని నా భర్త తరచూ వారికి చె΄్పాల్సి వచ్చేది. తీసుకున్నప్రాజెక్ట్ పూర్తి చేయడం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టేదాన్ని. కానీ వచ్చిన వాళ్లు మాత్రం ‘మిస్టర్ విపుల్ వర్షిణే ఎప్పుడు వస్తారు’ అని అడిగేవారు. నేనే విపుల్ అని, ఆర్కిటెక్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయేవారు. 200 భవనాల జాబితా భవన నిర్మాణంలో నా వర్క్‌ని కొనసాగిస్తూనే లక్నోలోని చారిత్రక కట్టడాలపై, వాటి పరిరక్షణ గురించిప్రాజెక్ట్ వర్క్ చేశాను. అక్కడి వారసత్వ కట్టడాల పట్ల ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదని తెలుసుకొని దాదాపు 200 భవనాల జాబితాను తయారు చేశాను. ఆ జాబితాను పురావస్తు శాఖకు అప్పగించాను. ఆ సమయంలోనే 500 పేజీల ఆప్రాజెక్ట్ వర్క్‌ని పుస్తకంగా తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న సన్నిహితుల సలహాతో బుక్‌గా తీసుకువచ్చాను. అలా రచనా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు మన దేశ వారసత్వ సంపదపైన ముఖ్యంగా లక్నో సంస్కృతి, వారసత్వ నగరం, చరిత్ర ద్వారా నడక, మ్యూజింగ్స్ ఇన్ బెనారస్, ఎ కెలిడోస్కోప్ ఆఫ్ ది హార్ట్, లక్నో ఎ ట్రెజర్ పేర్లతో 5 పుస్తకాలు ప్రచురిత మయ్యాయి. ఇటేవలే అయోధ్యకు సంబంధించి ఎ వాక్ త్రూ ది లివింగ్ హెరిటేజ్ ప్రచురితమైంది. ‘షామ్ ఎ అవద్ పుస్తకంలో లక్నో సంస్కృతిపై స్కెచ్‌లు కూడా వేశాను. లక్నోలోని చికంకారీ ఎంబ్రాయిడరీ, ఈ నగరంలోని వీధులు, మార్కెట్ల గురించి ప్రస్తావించాను. లక్నో ఇన్టాక్కి కన్వీనర్‌గా ఉన్నాను. లేహ్ విమానాశ్రయం .. ఓ సవాల్! 2018లో లేహ్ ఎయిర్పోర్ట్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. ఈప్రాజెక్ట్ నాకు అత్యంత సవాల్‌గా ఉండేది. ఎందుకంటే అక్కడ భూమి, పర్యావరణం చాలా భిన్నంగా ఉంటాయి. పర్వతాల కారణంగా భూభాగం చాలా తేడాగా ఉంటుంది. విమానాశ్రయం అరైవల్, డిపార్చర్ లాంజ్‌ల మధ్య 3 అంతస్తుల వ్యత్యాసం ఉంది. అక్కడ లగేజీ బెల్ట్ రివర్స్ చేయాల్సి వచ్చింది. ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి, ఎయిర్ కండీషనర్లలో ఉపయోగించే ద్రవం ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి, దానిని ఏర్పాటు చేశాను. లేహ్‌లో అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం వద్ద 30 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఉంచాను. అక్కడి స్థానిక సంస్కృతి, కళ, హస్తకళలను దృష్టిలో ఉంచుకుని రంగు రంగుల వలలు,ప్రార్థన చక్రాలను ఏర్పాటు చేయించాను. అయోధ్య విమానాశ్రయం పనిప్రారంభించినప్పుడు అక్కడ మహంతులు, సాధువులను కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడి నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సరైన సమాచారం కోసం చాలా పుస్తకాలు చదివాను. వివిధ వృత్తులలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. దీంతో అయోధ్యపై నాకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దానినే పుస్తకంగా తీసుకు వచ్చాను. ఒక సృజనాత్మక వ్యాపకం నన్నూ నా దిశను మార్చింది. సవాల్‌గా ఉన్న రంగంలో సమున్నతంగా నిలబడేలా చేసింది. ఏ రంగం ఎంచుకున్నా అందులో మనదైన ముద్ర తప్పక వేయాలి. అప్పుడే, ఎక్కడ ఉన్నా సరైన గుర్తింపు లభిస్తుంది’ అని వివరిస్తారు విపుల్ వర్షిణే. -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
మనుషులకూ.. మూగ ప్రాణులకు ఒక ధర్మాచరణ ఉంది!
నరజన్మకూ, మిగిలిన ప్రాణులకూ ఒక ప్రత్యేకమైన భేదం ఉంది. ఇతరప్రాణులకు ఒకే ధర్మం–పశుధర్మం. ఆకలి, నిద్ర, ప్రత్యుత్పత్తి.. అంతకుమించి వాటికి ధర్మం అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైనది – ధర్మాచరణ. అయితే దీనిలో ఒక సంక్లిష్టత ఉంది. ఇదే ధర్మము.. అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. భార్యముందు నిలబడితే–భర్త ధర్మం. తల్లి ముందు నిలబడితే–పుత్ర ధర్మం. సోదర ధర్మం... ఉద్యోగ ధర్మం.. అలా నిరంతరం మారిపోతుంటుంది. దేశాన్నిబట్టి, కాలాన్నిబట్టి మారిపోతుంది. ఉత్తర భారతదేశంలో చలి కారణం చేత వీలయినంతగా శరీరాన్ని కప్పుకుని పూజాదులు చేయడం అక్కడి ధర్మం. దక్షిణ భారతదేశంలో.. కేవలం ఉత్తరీయం పైన వేసుకుని అభిషేకాలు, పూజలు చేయడం ఇక్కడి ధర్మం. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు, సన్యాసికి.. ఇలా ధర్మం మారుతుంటుంది. బ్రహ్మచారి ఏదీ కూడబెట్టకూడదు. విద్యార్థిగా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని మననం చేసుకోవడం ఒకటే ధర్మం. అదే గృహస్థాశ్రమంలో భోగం అనుభవించవచ్చు. భార్యాబిడ్దలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. రేపటి అవసరాలకోసం సంపాదించి దాచుకోవచ్చు. వానప్రస్థు భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ గడపవచ్చు. చిట్టచివరన అన్నీ పరిత్యజించి ఏకాకిగా వైరాగ్యంలో ఉండడం ధర్మం. అలా ధర్మం మారిపోతున్నా ఎక్కడికక్కడ ధర్మం నియమాలకు కట్టుబడి ఉంటుంది. అసలు ధర్మం లేకుండా ఉండడం, దానిని పాటించకుండా జీవించడం సాధ్యం కాదు. ధర్మాచరణతోనే మనుష్యప్రాణి ఉత్తమగతులు పొందగలడు. శాస్త్రం చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ శరీరం పతనమయిన తరువాత స్వర్గలోకం వెళ్ళవచ్చు. పుణ్యఫలితం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకోవచ్చు.‘నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు. ఈ పుణ్యకర్మలు నేను చేయను. నాకు ఏది సంతోషం అనిపిస్తే, నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే, నా మనసుకు ఏ భోగం అనుభవించాలనుకుంటే దానిని అనుభవిస్తూ శాస్త్రాన్ని పక్కనబెట్టి ప్రవర్తిస్తే.. ఆ పాటిదానికి నరజన్మ అవసరం లేదని తిర్యక్కుగా (వెన్నుపూసలేని జీవిగా) జన్మ లభిస్తుంది. అలా కాదు, నాకు పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు. నేను ఈ మంచిపని చేసి పుణ్యం కావాలనుకోవడం లేదు, నేను కేవలం భగవంతుడు చెప్పినట్లు బతకడం నాకు సంతోషం. నేను చేయవలసినివి కాబట్టి చేస్తున్నా.. దానినుంచి నేను ఏ ప్రయోజనమూ ఆశించడం లేదనుకున్నప్పుడు అది చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది ఏదో ఒకనాడు భగవంతుని అనుగ్రహానికి కారణమయి, జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసి దేవతాపదవిని అధిష్టించగలడు. ధర్మాచరణను పక్కనబెట్టి పతనమమై తిర్కక్కు అయిపోగలడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణచేసి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి ధర్మం కన్నా గొప్పది మరొకటి లేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవి చదవండి: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట! -
Sports: తాను '700ల మైలు రాయిని' దాటిన వండర్సన్..!
41 సంవత్సరాల 7 నెలల 8 రోజులు.. ఈ వయసులో అంతర్జాతీయ క్రీడల్లో చాలా మంది రిటైర్మెంట్ తీసుకొని ఎక్కడో ఒక చోట కోచ్‌గానో లేక వ్యాఖ్యాతగానో పని చేస్తూ ఉంటారు. లేదంటే ఆటకు దూరంగా దానితో సంబంధం లేకుండా కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు. కానీ జేమ్స్ అండర్సన్ ఇంకా క్రికెట్ మైదానంలో పరుగెడుతూ ఉన్నాడు. పట్టుదలగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ పోరాటతత్త్వమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏకంగా 700 వికెట్ల మైలురాయిని అందుకునేలా చేసింది. 21 ఏళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ కెరీర్ అతని స్థాయి ఏమిటో చూపిస్తే, అలసట లేకుండా సాగుతున్న ప్రయాణం ఎన్నో అద్భుత ప్రదర్శనలను ప్రపంచ క్రికెట్ అభిమానులకు అందించింది. సాధారణంగా బ్యాటర్లు ఎక్కువ సంవత్సరాలు ఆటలో కొనసాగడంలో విశేషం లేదు. గతంలోనూ చాలామంది ఇంతకంటే ఎక్కువ ఏళ్లు క్రికెట్ ఆడారు. కానీ ఎంతో కఠోర శ్రమతో కూడిన పేస్ బౌలింగ్‌లో అన్ని ప్రతికూలతలను, గాయాలను దాటి ఒక బౌలర్ ఇలా సత్తా చాటడం ఎంతో అరుదైన విషయం. 2002లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జిమ్మీ అండర్సన్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 187 టెస్టు మ్యాచ్‌లు.. జిమ్మీ అండర్సన్ కెరీర్ ఇది. ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) మాత్రమే ఇంతకంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. 16 ఏళ్లకే అరంగేట్రం చేసిన బ్యాటర్‌గా సచిన్‌తో పోలిస్తే 20 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన అండర్సన్ కెరీర్ ప్రస్థానం పూర్తిగా భిన్నం. టి–20ల కాలంలో నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోతున్న ఈతరం బౌలర్లతో పోటీ పడుతూ రోజుకు 15–20 వరకు అంతర్జాతీయ టెస్టుల్లో బౌలింగ్ చేయడం అసాధారణం. వీటికి 194 వన్డేలు అదనం. టెస్టులు, వన్డేలు కలిపి అతను దాదాపు 50 వేల బంతులు బౌలింగ్ చేశాడు. వన్డేలకు దాదాపు 9 ఏళ్ల క్రితమే వీడ్కోలు పలికినా టెస్టుల్లో ఇంకా అదే జోరును అండర్సన్ కొనసాగించి చూపిస్తున్నాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జేమ్స్ అండర్సన్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. అతను చిన్నప్పటినుంచే క్రికెట్ అంటే బాగా ఇష్టపడ్డాడు. చూడటంతో పాటు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా ఆడేవాడు. అందుకే ఇంట్లోనూ ప్రోత్సాహం లభించింది. స్కూల్ క్రికెట్నుంచే అతను బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు. సాధనతో ఆపై పూర్తి స్థాయి పేస్ బౌలర్‌గా సత్తా చాటాడు. దాంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్థానిక లాంక్షైర్ కౌంటీ మైనర్ లీగ్‌లలో అండర్సన్ సత్తా చాటాడు. దాంతో లాంక్షైర్ ప్రధాన కౌంటీ టీమ్ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అండర్సన్ ఎంత మెరుగ్గా కౌంటీల్లో ప్రభావం చూపించాడంటే లాంక్షైర్ తరఫున కేవలం 3 వన్డేలు ఆడగానే అతనికి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు లభించడం విశేషం. తన జెర్సీపై కనీసం తన పేరు, నంబర్ కూడా లేకుండానే హడావిడిగా టీమ్‌తో కలిసిన అండర్సన్ అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. దాంతో 2003 వరల్డ్ కప్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇలా మొదలైన ఆరంభం రెండు దశాబ్దాలుగా గొప్పగా సాగుతూనే ఉంది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలతో.. అండర్సన్ కెరీర్ ఆరంభంలో రెండు పార్శా్వలతో సాగింది. చక్కటి బౌలింగ్‌తో లయతో సాగుతున్నప్పుడు అతనిలాంటి మంచి బౌలర్ ఎవరూ లేరన్నట్లుగా వికెట్ల వర్షం కురిసింది. కానీ ఒక్కసారి లయ కోల్పోతే అంత చెత్త బౌలర్ లేరన్నట్లుగా బ్యాటర్లు చితకబాదారు. లార్డ్స్ మైదానంలో తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లతో తన రాకను ఘనంగా చాటడం, ఆ తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్‌పై వన్డేల్లో హ్యట్రిక్ అతడికి తగిన గుర్తింపును తెచ్చి పెట్టాయి. కానీ అప్పటికే ఇంగ్లండ్ జట్టులో పలువురు సీనియర్లు పాతుకుపోయి ఉండటంతో తగినన్ని అవకాశాలు దక్కలేదు. దాంతో విరామాలతో వచ్చిన అవకాశాల్లో అండర్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే 2005 తర్వాత ఇంగ్లండ్ ప్రధాన పేసర్లంతా ఆటకు గుడ్‌బై చెప్పడంతో వచ్చిన అండర్సన్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై చెలరేగి ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించడంతో టీమ్‌లో స్థానం సుస్థిరమైంది. సంప్రదాయ స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో పాటు రివర్స్ స్వింగ్ విద్యలో కూడా ఆరితేరిన తర్వాత అండర్సన్ మరింత ప్రమాదకరంగా మారాడు. కెరీర్ ఆరంభంలో తన యాక్షన్‌ను మార్చుకొని కొంత ఇబ్బందిపడిన అతను కొద్ది రోజులకే మళ్లీ తన పాత్ సైడ్ ఆర్మ్ యాక్షన్‌కు వచ్చి అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 2010 తర్వాత అండర్సన్ తనను తాను అత్యుత్తమ పేసర్‌గా తీర్చి దిద్దుకున్నాడు. ఇంగ్లండ్‌లో హీరో లేదా జీరో అయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉండే సిరీస్ యాషెస్. సొంత గడ్డపై పలుమార్లు ఆసీస్ బ్యాటర్ల పని పట్టిన అండర్సన్ కెరీర్లో 2010–11 ఆస్ట్రేలియా పర్యటన హైలైట్‌గా నిలిచింది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై 3–1తో చిత్తుగా ఓడించడంలో 24 వికెట్లతో అండర్సన్ ప్రధాన పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు 2015 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పిన అండర్సన్ తాను అనుకున్నట్లుగా ఈ ఫార్మాట్లో మరిన్ని గొప్ప ప్రదర్శనలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగి.. అండర్సన్ సొంత మైదానాల్లో మాత్రమే రాణిస్తాడని, వాతావరణంలో కాస్త మంచు, తేమ ఉంటేనే స్వింగ్‌తో చెలరేగుతాడనేది అతనిపై పలు సందర్భాల్లో వచ్చిన విమర్శ. అయితే ఒక్కో ఏడాది ఆటలో రాటుదేలుతూ పోయిన తర్వాత ఇలాంటి విమర్శలకు అతను చెక్ పెట్టాడు. ఇంగ్లండ్‌లోని అన్ని వేదికలపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో సహజంగానే అతని పేరు కనిపిస్తుంది. కానీ వీటికి తోడు శ్రీలంకలోని గాలేలో 6 వికెట్లు, కేప్‌టౌన్‌లో 5 వికెట్లు, అడిలైడ్‌లో 5 వికెట్లు, 2012లో నాగ్‌పూర్‌లో భారత్‌పై 4 కీలక వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన.. ఇలా విదేశీ గడ్డపై అండర్సన్ తీసిన వికెట్లు అతని ప్రభావాన్ని చూపించాయి. ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఇప్పటి వరకు అతని ఆటలో సాగిన పురోగతి, వేర్వేరు ప్రత్యర్థులపై నమోదు చేసిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. మాస్టర్ ఆఫ్ స్వింగ్ నుంచి అతను మాస్టర్ ఆఫ్ ఆల్ కండిషన్స్గా మారాడు. 700 వికెట్లు ముగ్గురే సాధించగా వారిలో మురళీధరన్, వార్న్ స్పిన్నర్లు కాగా అండర్సన్ తొలి పేస్ బౌలర్. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ ఎక్కువ టెస్టులు ఆడటం సహజంగానే అండర్సన్‌కు కలిసి వచ్చినా, అతను ఆటడం మాత్రమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే వైన్‌లాగా అతను మారాడు. అతని వికెట్లను మూడు దశలుగా విడగొడితే; తొలి 44 టెస్టుల్లో సగటు 35 కాగా, తర్వాతి 47 టెస్టుల్లో అది 28కి తగ్గింది. ఇక 2014నుంచి ఆడిన 96 టెస్టుల్లో సగటు ఏకంగా 22.66కి తగ్గడం అంటే బౌలర్‌గా అతను ఎంత మెరుగయ్యాడో అర్థమవుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండర్సన్ ఏకంగా 220 వికెట్లు తీయడం విశేషం. స్వింగ్‌కు పెద్దగా అనుకూలించని ఉపఖండపు పిచ్‌లపై కూడా గత పదేళ్లలో అండర్సన్ 23.56 సగటును నమోదు చేయడం అతను ఎంత ప్రభావం చూపించాడో చెబుతుంది. మురళీధరన్ (800 వికెట్లు)ను చేరుకోవడం చాలా కష్టం కాబట్టి మరో 9 వికెట్లు తీసి షేన్‌వార్న్ (708)ను దాటడం అండర్సన్ తదుపరి లక్ష్యం. ఇంగ్లండ్ బోర్డు అతనిపై నమ్మకముంచితే, అతని ఘనతలను పరిగణనలోకి తీసుకొని వేటు వేయకుండా మరికొంత కాలం ఆడే అవకాశం కల్పిస్తే సచిన్ అత్యధిక టెస్టుల (200) రికార్డును అండర్సన్ అధిగమించగలడు. ఒకవేళ ఆ లోపే అతని ఆట ముగిసిపోయినా, వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా అతను సాధించిన ఘనతల విలువ ఏమాత్రం తగ్గదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది. -
స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!'
విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు. తనతో పాటు తన అయోధ్యానగర పౌరులందరికీ స్వర్గవాసం కల్పిస్తేనే వస్తానన్నాడు. హరిశ్చంద్రుడి కోరికను దేవేంద్రుడు మన్నించాడు. వేలాది విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో పాటు అయోధ్య వాసులందరినీ స్వర్గానికి తరలించుకుపోయాడు. హరిశ్చంద్రుడి స్వర్గారోహణం చూసి దైత్యగురువు శుక్రాచార్యుడు చకితుడయ్యాడు. ‘హరిశ్చంద్రుడిలాంటి ప్రభువు ముల్లోకాల్లోనూ మరొకరు లేరు. తన త్యాగంతో, దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి, తన పౌరులను కూడా స్వర్గానికి తీసుకుపోయాడంటే అతడిది ఎంతటి త్యాగనిరతి! హరిశ్చంద్రుడి వంటి రాజు ఇంకెవడుంటాడు?’ అని శ్లాఘించాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత, అప్పటికి పన్నెండేళ్లుగా గంగా నదిలో మెడలోతు వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉన్న వశిష్ఠుడు తన తపస్సును చాలించి బయటకు వచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడికి కులగురువు. తన శిష్యుడైన హరిశ్చంద్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేరుగా అయోధ్యకు వెళ్లాడు. అక్కడి జనాల ద్వారా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పెట్టిన బాధలను తెలుసుకుని, అమిత ఆగ్రహం చెందాడు. ‘ఈ విశ్వామిత్రుడు ఎంతటి దుర్మార్గుడు! పూర్వం నా వందమంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అప్పుడు కూడా అంత కోపం రాలేదు. సత్యధర్మ నిబద్ధుడైన హరిశ్చంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేసినందుకు మాత్రం నాకు పట్టరాని కోపం వస్తోంది’ అనుకున్నాడు వశిష్ఠుడు. ఎంత నియంత్రించుకోవాలనుకున్నా కోపం తగ్గకపోవడంతో వశిష్ఠుడు ‘దుర్మార్గుడు, బ్రహ్మద్వేషి, క్రూరుడు, మూర్ఖుడు, యజ్ఞవినాశకుడు అయిన విశ్వామిత్రుడు కొంగ రూపాన్ని పొందుగాక’ అని శపించాడు. వశిష్ఠుడి శాపాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నన్ను శపించ సాహసించిన వశిష్ఠుడు బాతు రూపం పొందుగాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. పరస్పర శాపాల కారణంగా విశ్వామిత్రుడు కొంగగా, వశిష్ఠుడు బాతుగా మారిపోయారు. వారి రూపాలు సామాన్యమైన కొంగ, బాతుల మాదిరిగా లేవు. కొంగ మూడువేల యోజనాల పొడవు ఉంటే, బాతు రెండు వేల యోజనాల పొడవు ఉంది. భీకరమైన కొంగ, బాతు రూపాలు పొందిన విశ్వామిత్ర, వశిష్ఠులు పరస్పరం తారసపడ్డారు. పూర్వవైరం ఇంకా చల్లారని వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. బాతు, కొంగల రూపాల్లో వారు హోరాహోరీగా పోరు సాగిస్తుంటే, వారి ధాటికి మహావృక్షాలు నేలకూలాయి. పర్వతాల నుంచి గిరిశిఖరాలు నేల మీదకు దొర్లిపడ్డాయి. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారి హోరెత్తాయి. భీకరమైన బాతు, కొంగల కాళ్ల కిందపడి ఎన్నో జీవులు మరణించాయి. ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా అవేమీ పట్టకుండా బాతు కొంగల రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రులు హోరాహోరీగా రోజుల తరబడి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యుద్ధానికి దేవతలు కూడా భీతిల్లారు. అందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. ‘ఓ విధాతా! వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పర శాపాలతో బాతు కొంగ రూపాలు పొంది భూమ్మీద పోరు సాగిస్తున్నారు. వారి యుద్ధంలో ఇప్పటికే ఎన్నో జీవులు మరణించాయి. ప్రకృతి అల్లకల్లోలంగా ఉంది. వారి యుద్ధాన్ని నివారించకుంటే, భూమ్మీద ప్రళయం వచ్చేలా ఉంది. వారి పోరును నువ్వే అరికట్టాలి. భూలోకానికి పెను విపత్తును తప్పించాలి’ అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలసి భూమ్మీద పోరు జరుగుతున్న చోటుకు హుటాహుటిన వచ్చాడు. ‘వశిష్ఠ విశ్వామిత్రులారా! ఏమిటీ మూర్ఖత్వం? తక్షణమే యుద్ధాన్ని ఆపండి’ ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బాతు కొంగ రూపాల్లో ఉన్న వారిద్దరూ బ్రహ్మదేవుడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మరింత ఘోరంగా యుద్ధం చేయసాగారు. ‘ఇప్పటికే మీ వల్ల ఎంతో అనవసర ప్రాణనష్టం జరిగింది. బుద్ధి తెచ్చుకుని యుద్ధాన్ని మానుకోండి’ మరోసారి హెచ్చరించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠ విశ్వామిత్రులు అప్పటికీ అతడి మాటలను పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించారు. చివరకు బ్రహ్మదేవుడు తన శక్తితో వారిద్దరి తామస గుణాన్ని హరించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వరూపాల్లోకి వచ్చారు. బ్రహ్మదేవుడి వద్ద చేతులు జోడించి నిలుచున్నారు. ‘వశిష్ఠా! విశ్వామిత్రుడి తప్పేమీ లేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి చాటడానికే అతణ్ణి పరీక్షలకు గురిచేసి, స్వర్గానికి పంపించాడు. నువ్వు అదేదీ గ్రహించకుండా అతణ్ణి శపించావు. ఈ విశ్వామిత్రుడు కూడా కోపాన్ని అణచుకోలేక నిన్ను శపించాడు. మీ వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇకనైనా తామస గుణాన్ని విడనాడి, శాంతం వహించండి. మీ వంటి మహర్షులకు తామసం తగదు’ అని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. బ్రహ్మదేవుడి మాటలకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ సిగ్గుపడ్డారు. పరస్పరం క్షమాపణలు చెప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఈ దృశ్యం చూసి దేవతలంతా సంతోషించారు. బ్రహ్మదేవుడితో కలసి అక్కడి నుంచి సంతృప్తిగా నిష్క్రమించారు. — సాంఖ్యాయన ఇవి చదవండి: నా స్టూడెంట్ టీచర్ అయింది! -
సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం!
'చేసే పని పట్ల నిబద్ధత.. నిజాయితీ ఉంటే చాలు.. ఫలితం ఏదైనా గ్రాఫ్ స్టడీగానే ఉంటుంది. సిద్ధి ఇద్నానీ విషయంలో అదే జరిగింది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినా నటిగా ఆమె మాత్రం ఫెయిల్ అవలేదు. కెరీర్లో గ్యాప్ వచ్చింది కానీ ఆమె తెరమరుగు కాలేదు. ఆమె నటించిన ఇటీవలి ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం. జయాపజయాలతో సంబంధంలేని పాపులారిటీని సొంతం చేసుకున్న సిద్ధి వివరాలు కొన్ని..' సిద్ధి.. ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి.. సింధీ, తల్లి.. గుజరాతీ. వాళ్లది ప్రేమ వివాహం. అమ్మ.. హిందీ టెలివిజన్ సీరియల్స్, గుజరాతీ చిత్రాల్లో నటించేవారు. నాన్న బిజినెస్ మేన్. చిన్నతనంలో అమ్మతో కలసి సీరియల్ సెట్స్‌కి వెళ్లేది. ఆ ప్రభావంతోనే తనూ నటి కావాలనుకుంది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ బాంబే టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో థర్డ్ రన్నరప్‌గా నిలిచింది. దాంతో ‘గ్రాండ్ హాలీ’ అనే గుజరాతీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ అనుకొని మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది. సీరియల్స్, కమర్షియల్స్ చేస్తున్నప్పుడే ఒకసారి.. ఓ ఏజెన్సీ వాళ్లు సిద్ధికి ఫోన్ చేసి సినిమా ఆడిషన్‌కి పిలిచారు. అలా ఆమె తెలుగులో ‘జంబలకిడి పంబ’తో హీరోయిన్గా మారింది. తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘ప్రేమకథా చిత్రం 2’ సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ‘వెందు తనిందది కాడు’ చిత్రంతో తమిళ్లోనూ ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంది. వరుసగా కొన్ని చాన్స్లైతే వచ్చాయి కానీ.. విజయం ఇంకా ఎదురుచూపుల్లోనే చిక్కుకుపోయింది. కొంచెం గ్యాప్ తీసుకొని.. దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’లో నటించింది. అందులోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈసారి సక్సెస్ ‘గ్రాండ్’ అనే విశేషణాన్ని జత చేర్చుకుని తన పాత బాకీలనూ తీర్చేసుకుంది. ఈ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్‌లో ఉంది. 'నా దృష్టిలో యాక్టింగ్ అంటే యాక్టింగే. భావమే దాని భాష. అందుకే భాష కన్నా కథ.. నా పాత్రే నాకు ముఖ్యం.' – సిద్ధి ఇద్నానీ ఇవి చదవండి: అవమానించిన వాళ్లే అభినందిస్తున్నారు! -
ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుతున్న.. 'గౌరి మినోచా'
'నవతరం ఆలోచనలు సృజనాత్మకంగానే కాదు జనంతో మమేకం అయ్యే విషయాలపట్ల అవగాహనతోనూ ఉంటున్నాయనడానికి ఉదాహరణ గౌరీ మినోచా. ఢిల్లీ వాసి అయిన గౌరి ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుకుంటున్న వర్ధమాన కళాకారిణి. అభిరుచితో నేర్చుకున్న పెయింటింగ్ ఆర్ట్, చదువుతో ఒంటపట్టించుకున్న సైకాలజీ ఈ రెండింటి కాంబినేషన్‌తో రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక్కుంది. ఈ శైలిలోనే వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ స్కూల్, కాలేజీ పిల్లల మానసిక ఒత్తిడులను దూరం చేస్తుంది. ఆర్ట్ సైకోథెరపీతో ప్రజాదరణ పొందుతూ ఈ తరానికి కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. తను ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావిస్తూ..' ‘‘కళ–మనస్తత్వ శాస్త్రం రెండూ హృదయానికి దగ్గరగా ఉంటాయి. నేను ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ బిఏ ఆనర్స్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాను. పన్నెండవ తరగతిలో 99 శాతం మార్కులు రావడంతో సైకాలజీని ఎంచుకున్నాను. ఢిల్లీలో ఆర్ట్ సైకోథెరపీ సెంటర్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాను. కళ – మనస్తత్వ శాస్త్రం రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. ఆర్ట్ సైకోథెరపీలో... డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు పెయింటింగ్స్ వేసి వారికి ఇస్తుంటాను. వారి చేత కూడా రంగులతో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చిత్రించమని అడుగుతాను. వారికి ఏమీ రాకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా వారిలో నిరాశ, ఆందోళన స్థాయులను చెక్ చేస్తాను. ఇదొక రిలాక్సేషన్ టెక్నిక్. విదేశాలలో చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందలేదు. దీనికి కొన్ని స్కూళ్లు, కాలేజీలను ఎంచుకొని ఉచితంగా వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటాను. చిన్ననాటి నుంచి.. మా అమ్మ ఆర్టిస్ట్. వ్యాపారవేత్త కూడా. ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతోంది. ఇందులో అనేకమంది ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్ ప్రదర్శనలు జరుగుతాయి. ఆమె పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్ క్లాసులు కూడా తీసుకుంటుంది. రంగులు, చిత్రాలు, కళాకారుల మధ్య నా బాల్యం గడిచింది. అలా నాకు చిత్ర కళ పట్ల అభిరుచి పెరిగింది. ఒకసారి ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అతని గుర్రపు పెయింటింగ్‌ను కాపీ చేశాను. అమ్మ నాలో ఉన్న ఆర్టిస్ట్‌ను గుర్తించి, సహకరించింది. ఈ కళలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కళతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాను. ఒత్తిడి లేకుండా చదువు.. నేను క్లాస్‌రూమ్‌లో కంటే ఆర్ట్ రూమ్‌లో ఎక్కువ సమయం గడిపాను. కానీ, నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాలేజీ స్థాయికి వచ్చాక ఆర్ట్ నీ సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్‌లాగే నేనూ నా కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించాను. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్‌లో చేయాలా, సైకాలజీలో ఏ సబ్జెక్ట్ చేయాలో అర్థం కాక కొన్నిరోజులు మథనపడ్డాను. కానీ, ఆర్ట్ నా అభిరుచి, కెరియర్ సైకాలజీ రెండింటిలోప్రావీణ్యం సాధించాలనుకున్నాను. పగలు కాలేజీ, రాత్రి సమయంలో ఎంతసేపు వీలుంటే అంత టైమ్ పెయింటింగ్ చేస్తుంటాను. వ్యాపారంలోనూ నైపుణ్యం.. స్కూల్ ఏజ్ నుంచే నా పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసే దాన్ని. మొదటి పెయింటింగ్‌కు ఐదు వేల రూపాయలు వచ్చాయి. మొదట్లో నా పెయింటింగ్స్‌ని బంధువులందరికీ పంపాను. తమ ఇంట్లో పెయింటింగ్స్ అలంకరించినప్పుడు వారి ఇళ్లకు వచ్చిన బంధువులు ఆ పెయింటింగ్స్ చూసి తమకూ పంపమని కాల్స్ చేయడంప్రారంభించారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి నా పెయింటింగ్స్ అమెరికా, లండన్, ముంబై, ఢిల్లీ సహా అనేకప్రాంతాలకు చేరాయి. ఈ రోజు ఢిల్లీని ఆర్ట్ హబ్‌లో నా 12 పెయింటింగ్స్‌లో 9 అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కళాకారుడు తన సొంత మార్కెట్ విలువను సృష్టించుకోవడం, ప్రచారం కూడా ముఖ్యం. సృజనాత్మకతతోపాటు వ్యాపారంలో కూడా నైపుణ్యం సాధించాలి’’ అంటూ నవతరానికి బిజినెస్ టెక్నిక్స్ కూడా చెబుతుంది గౌరి మినోచా. ఇవి చదవండి: WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత -
మూగ జీవుల సేవలో.. 'సారా అయ్యర్'!
'ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణిని ఆదరించు.. అని చెప్పింది అమ్మ. ఒక మూగజీవి గాయాలతో రోదిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఒకప్రాణి కడుపులో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే దాని ఆకలి తీర్చకుండా నా దారిన నేను వెళ్లలేను. ఒకరోజు గాయపడిన ఓ కుక్కపిల్ల ఏడుపు నాలోని తల్లి మనసును కదిలించింది. దాని బాధ చూసిన తర్వాత మనసు కలచివేసింది. ఆ కుక్కపిల్ల ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలా మొదలైన ఈ సేవ ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుక్కలతో సాగుతోంది’ అన్నారు 58 ఏళ్ల సారా అయ్యర్.' చెన్నైకి చెందిన సారా అయ్యర్ స్పెషల్ ఎడ్యుకేటర్. స్పెషల్ చిల్డ్రన్ని సమాజంలో సాధారణ పౌరుల్లా తీర్చిదిద్దడంలో దాదాపు పాతికేళ్లు పని చేశారు. ఐదేళ్ల కిందట మూగజీవుల సేవ వైపు మలుపు తీసుకుందామె జీవితం. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిపోయిన మార్పులను ఇలా చెప్పారామె.. ‘‘మా అమ్మయి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ పనుల కోసం నేను టీచింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా వెళ్లిన తర్వాత ఇంట్లో ఏర్పడే వెలితి. ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ అనేటంత పెద్ద పదం చెప్పను కానీ కొంత మానసికమైన ఖాళీ ఏర్పడిందనే చెప్పాలి. జనవరి ఒకటో తేదీన నేను, నా భర్త గెర్రీ ఇద్దరం పీకే సినిమాకి వెళ్లి వస్తున్నాం. దాదాపుగా ఇంటికి దగ్గరకు వచ్చేశాం. ఎక్కడి నుంచో చిన్న కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. క్షణాల్లోనే తెలిసింది అది అరుపు కాదు ఏడుపు అని. ఎవరో పెంచుకోవడానికి కుక్కపిల్లను తెచ్చుకున్నారు, అది బెంగతో ఏడుస్తుందేమో అనుకున్నాను. అది నిస్సహాయంగా ఏడుస్తోందని కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇక ఊరుకోలేకపోయాను. దాని గొంతు వినవస్తున్న దిశగా వెళ్లాను. అది పార్కు చేసిన కారుకి గోడకు మధ్య ఇరుక్కు పోయి ఉంది. తీవ్రంగా గాయపడింది. బయటకు తీయడానికి దగ్గరకు వెళ్తున్నా రానివ్వలేదు. నేను దానిని ఊరడిస్తూ ఉంటే మా వారు మరో వైపు నుంచి వెళ్లి దానిని బయటకు తీశారు. అయితే... కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్లినిక్‌లన్నీ మూసేసి ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్లి మాకు చేతనైన చికిత్స చేసి ఆ మరునాడు దానికి వైద్యం చేయించాం. ఆ కుక్కపిల్ల మామూలయ్యే వరకు మాతోనే ఉంది. ఆ తర్వాత కూడా మాతోనే ఉండిపోయింది. అలా మొదలైన సేవ ఇది. ఓ రోజు.. ఒక ఇండియన్ బ్రీడ్ కుక్క నాలుగు పిల్లలను పెట్టి అలసటతో ఉంది. ఆ దారిన ఓ వ్యక్తి లాబ్రిడార్ను వాకింగ్‌కు తీసుకువెళ్తున్నాడు. వాళ్లను చూసి ఈ కుక్క అరవసాగింది. ఆ వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తన చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు. అతడు ఆ కుక్క నడవలేనంత తీవ్రంగా గాయపరిచాడని ఆ మరునాడు తెలిసింది. అప్పుడు ఆ కుక్కను, పిల్లలను ఇంటికి తెచ్చాను. నేను మా వారు ఇద్దరమూ వాటికి ఆహారం పెట్టడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం, ఫిజియోథెరపీ చేయడం అన్నీ నేర్చుకున్నాం. మాకు తెలిసిన అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి ‘కుక్కలు, కుక్క పిల్లలు గాయపడి నిరాశ్రయంగా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెచ్చివ్వండి, లేదా సమాచారం ఇవ్వండి, మేము సంరక్షిస్తాం’ అని మెసేజ్ పెట్టాం. మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ అలా ఏర్పడింది. ఇప్పుడు మా దగ్గర గాయపడినవి, చూపు కోల్పోయినవి, అనారోగ్యాలతో పుట్టినవి, ఆదరించే వాళ్లు లేక ఇక్కడే ఉండిపోయినవి అన్నీ కలిసి నాలుగు వందలకు పైగా ఉన్నాయి. మా సర్వీస్‌కి మెచ్చిన మా అమ్మ, అత్తమ్మ ఇద్దరూ తమ వంతుగా ఈ మూగజీవుల సంరక్షణకు అవసరమైన వస్తువులు, ఇతర అవసరాల కోసం డబ్బు ఇచ్చి అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. ‘ఆశ్రయం కోసం వచ్చిన ఏప్రాణినీ నిర్లక్ష్యం చేయవద్దు’ అని వారు మాకు చెప్పిన మాట మాతోనే ఉంది. మేము స్థాపించిన మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ... తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో కలిసి పని చేస్తోంది. ఈ మా ప్రయాణంలో ఇన్ని కుక్కలను సంరక్షించడానికి అవసరమైన విశాలమైన స్థలం పెద్ద సమస్య అయింది. చెన్నై నగర శివారు, మహాబలిపురం రూట్లో ఈస్ట్కోస్ట్రోడ్లో మా ఫ్రెండ్‌కి ఓ స్థలం ఖాళీగా ఉంది. దానిని అద్దెకు తీసుకుని కుక్క పిల్లలకు, గాయపడిన వాటికి, అనారోగ్యం పాలైన వాటికి వేరు వేరుగా కెన్నెల్స్ కట్టించి సంరక్షిస్తున్నాం. అవి మమ్మల్ని పేరెంట్స్‌గా ప్రేమిస్తాయి’’ అంటూ తనను ముద్దాడడానికి వచ్చిన పెట్‌ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు సారా అయ్యర్. తన సంరక్షణలో ఉన్న కుక్కలన్నింటికీ పేర్లు పెట్టారామె. వాటికి రిజిస్టర్ నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు ఏ మందులు వేశారు, ఇంకా ఎప్పుడు ఏ ఇంజక్షన్లు వేయించాలి... వంటి వివరాలను నమోదు చేస్తారామె. ఇవి చదవండి: Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి -
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
ఉన్నత చదువులు చదువుతూనే..ఒగ్గు కథలు చెబుతున్న యువత!
అవును.. వాళ్లు కథలు చెబుతున్నారు. ఊ కొట్టే కథలు కావు. పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన కథలు. పల్లెల్లో ఆధ్యాత్మిక భావాలు నింపే ఒగ్గుకథలు. దశాబ్దం క్రితం కులవృత్తి అంటే చిన్నచూపు చూడడంతో జానపదుల కళలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలోనే నేటి యువత ఇటు చదువుతోపాటు అటు కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకుంటుంది. బీటెక్, బీఈడీ, డిగ్రీలు, పీజీలు చదువుతూనే ఒగ్గుకథలు, మల్లన్నపట్నాల కథలు చెబుతున్నారు. కులవృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒకప్పుడు మల్లన్నపట్నాలు అంటేనే కథకులు పెద్ద వయసు వారు వచ్చేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. పాతికేళ్లు కూడా నిండని యువత మల్లన్నపట్నాల బాధ్యతలు తమ బుజాలపై వేసుకుంటున్నారు. కథలు చెబుతూ పల్లెప్రజల మన్ననలు అందుకుంటున్నారు. మూడు నెలలు కథలు చెబుతూ.. తాతలు.. తండ్రుల నుంచి వచ్చిన కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకున్న నేటి యువత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే కథలు చెబుతున్నారు. ఈ మూడునెలల్లో ప్రతీ ఆదివారం మల్లన్నపట్నాల పూజలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఒకరి ఇంట్లో మల్లన్నపట్నాల పూజలకు ముగ్గురు యువకులు వెళ్లి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. మల్లన్న పట్నాలలో ఆడ వేషధారణలో కథలు చెబుతున్న యువ కళాకారుడు కులవృత్తిపై మమకారంతో.. కులవృత్తిపై మమకారంతో ఇటీవల యువత మల్లన్నపట్నాలు, భీరప్ప కథలు చెప్పేందుకు ముందుకొస్తున్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో దాదాపు 50 మంది ఒగ్గుకథ కళాకారులు ఉన్నారు. ఇందులో 20 మంది వరకు పాతికేళ్లు కూడా నిండని యువతే. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల్లో ప్రతీ ఆదివారం, సోమవారం మల్లన్న పట్నాల పూజలకు వెళ్తుంటారు. కులవృత్తిని గౌరవిస్తూనే ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. బోయినపల్లి మండలానికి చెందిన కళాకారులు వేములవాడ, బావుపేట, కందికట్కూర్, వాసంపల్లి, అయ్యోరుపల్లి గ్రామల మధ్యలో విస్తరించి ఉన్న ప్రాంతంలో మల్లన్నపట్నాల పూజలు చేస్తుంటారు. వివిధ దేవుళ్లు, జానపదల కథలు చెబుతుంటారు. ఇవి చదవండి: దశకుంచెల చిత్రకారుడు! ఏకకాలంలో రెండు చేతులతో.. -
'రిపబ్లిక్ డే' పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా ఏఐ శకటం!
'ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శకటాన్ని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. కృత్రిమ మేధ(ఏఐ)లో మన దేశం సాధించిన పురోగతికి అద్దం పట్టేల, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, విద్య, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ప్రతిఫలించేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.' శకటంలో ఒక మహిళా రోబోట్ కృత్రిమ మేధస్సును ప్రతిబింబించేలా ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన సెమీకండక్టర్ చిప్ 3డీ మోడల్‌ను శకటంలోఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాన్ని తెలియజేసేలా శకటానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లతో అలంకరించిన సర్క్యూట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ) లాంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్లో మన దేశం సాధించిన పురోగతిని కూడా ఈ శకటం హైలెట్ చేస్తుంది. శకటం మధ్య విభాగంలో లాజిస్టిక్స్‌పై దృష్టి పెట్టారు. కలర్ కోడింగ్ ఆధారంగా పార్శిల్ గుర్తింపు, విభజనకు సాంకేతికత ఎలా సహాయపడుతుందో తెలియజేసేలా ఉంటుంది. శకటం వెనుక భాగం విద్యారంగంపై దృష్టిని మళ్లిస్తుంది. వీఆర్ హెడ్సెట్ ధరించి వర్చువల్ రియాలిటీ ద్వారా రిమోట్ క్లాసును నిర్వహించే ఉపాధ్యాయుడి లార్జర్ దెన్ లైఫ్ స్టాచ్యూ ఉత్తేజకరంగా ఉంటుంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సెన్సర్ల ద్వారా ఏఐ అప్లికేషన్ల ఉపయోగం, నావిగేషన్‌కు సంబంధించి దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు సహాయపడే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని ఈ ఏఐ శకటం హైలెట్ చేస్తుంది. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
మ్యూజిక్ వరల్డ్‌లో.. తను ఒక సుమధుర 'ధ్వని'
స్కూలు, కాలేజి రోజుల నుంచి రోజుల తరబడి పాటలు వినేది ధ్వని భానుశాలి. అందరూ తనను సరదాగా ‘సాంగ్ ఈటర్’ అని పిలిచేవారు. రికార్డ్ బ్రేకింగ్ సాంగ్ ‘వాస్తే’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ధ్వని సింగర్‌గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది. మంత్రముగ్ధులను చేసే అందమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చిత్రపరిశ్రమలో గొప్ప సంగీతదర్శకులతో కలిసి పనిచేసే అదృష్టాన్ని సొంతం చేసుకుంది. ధ్వని పాడిన ‘దిల్బార్’ పాట బిల్బోర్డ్ యూట్యూబ్‌లో మ్యూజిక్ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో నిలిచిన తొలి భారతీయ సింగిల్‌గా చరిత్ర సృష్టించింది. ‘ఒక ఆర్టిస్ట్ నుంచి స్ఫూర్తి తీసుకోవచ్చు. కానీ వారి శైలిని కాపీ కొట్టకూడదు’ అంటున్న ధ్వని సంగీతప్రపంచంలో తనదైన అందమైన సంతకాన్ని సృష్టించుకుంది. ధ్వని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ప్రోత్సాహకంగా మాట్లాడిన వారు తక్కువే. దీని గురించి ఇలా స్పందిస్తుంది ధ్వని... ‘ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. రకరకాల అభిప్రాయాలు వినడం వల్ల మనం ఎంచుకున్న దారి సరిౖయెనదేనా అనే డౌటు వచ్చి అయోమయంలోకి వెళతాం. ఇలాంటి సమయంలో మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. నా ప్రయాణంలో నేను అది కోల్పోలేదు’ అంటుంది ధ్వని భానుశాలి. ఇవి కూడా చదవండి: 'దీపెన్' దారి దీపం.. -
ఎవరీ ఉమ్ముల్ ఖేర్? ఏకంగా 16 ఫ్రాక్చర్లు 8 శస్త్ర చికిత్పలు..
కటిక దారిద్య్రానికి తోడు నయం కానీ వ్యాధితో సహవాసం చేసింది ఆమె. అడగడుగున కఠినతరమైన కష్టాలు. అయినా వెరవక లక్ష్యం కోసం ఆహర్నిశలు పోరాటమే చేసింది. చివరికి అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచింది. వివరాల్లోకెళ్తే..రాజస్తాన్‌కి చెందిన ఉమ్ముల్ ఖేర్ బాల్యం డిల్లీలోని నిజాముద్దీన్‌లో మురికివాడలో సాగింది. పైగా ఖేర్ పుట్టుకతో ఎముకలకు సంబంధించిన డిజార్డర్‌తో బాధపడుతోంది. అయినప్పటికి చదువును కొనసాగించింది. అలా ఆమె ఢిల్లీ విశ్వ విద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత జేఎన్‌యూ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఏ చేసింది. అక్కడితో ఆగకుండా ఎంఫిల్ చేస్తూనే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యింది. ఈక్రమంలో 2012లో చిన్న ప్రమాదానికి గురయ్యింది. అయితే ఆమెకు ఉన్న బోన్ డిజార్డర్ కారణంగా శరీరంలో ఏకంగా 16 ఫ్రాక్చర్లు అయ్యాయి. దీంతో ఖేర్ దాదాపు ఎనిమిది సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇన్ని కష్టాల ఐఏఎస్ అవ్వాలనే అతి పెద్ద లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకోగలనా? అన్న సందేహానికి తావివ్వకుండా తన లక్ష్యం వైపుగా అకుంఠిత దీక్షతో సాగిపోయింది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి ఆరోగ్యం వరకు ఏవీ ఆమె గమ్యానికి సహకరించకపోయినా.. నిరాశ చెందలేదు. పైగా అవే తనకు 'ఓర్చుకోవడం' అంటే ఏంటో నేర్పే పాఠాలుగా భావించింది. ప్రతి అడ్డంకిని తన లక్ష్యాన్ని అస్సలు మర్చిపోనివ్వకుండా చేసే సాధనాలుగా మలుచుకుంది. చివరికీ ఆ కష్టాలే ఆమె సంకల్ప బలానికి తలవంచాయేమో! అన్నట్లుగా ఉమ్ముల్ ఖేర్ సివిల్స్‌లో 420వ ర్యాంకు సాధించింది. తాను కోరుకున్నట్లుగానే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఎందరికో ప్రేరణగా నిలిచింది. ద టీజ్ ఉమ్ముల్ ఖేర్ అని ప్రూవ్ చేసింది. -
'మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా..' : ఆర్.కే. రోజా
నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్ లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవంను పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్ధేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పేర్కొన్నారు. హిందూ యోగిగా స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెప్పిన తొలి వ్యక్తి అని కొనియాడారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు నేడు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని వివరించారు. అందుకనే 120 సంవత్సరాల తరువాత కూడా స్వామి వివేకానంద గొప్పతనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనం చేసుకున్న అదృష్టమని మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. నేటి యువత మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా నిలవటానికి వారి వారి రంగాల్లో విశేష కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద సముద్ర కెరటం నాకు ఆదర్శమన్నారని, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలోనే ఓడిపోకూడదని, యువత తమ జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తథ్యమని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని ప్రతి ఏడాది యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ ఏడాది థీమ్ యూత్ ఫర్ డిజిటల్ ఇండియా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రధమంగా నిలిచిన విజేలందరినీ, ఈ ఏడాది నాసిక్ లో నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనటానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చూపి మన రాష్ట్రానికి మరిన్నీ బహుమతులు తీసుకురావాలని మంత్రి ఆర్.కె. రోజా కోరారు. రండి-మెల్కోండి-లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్ధేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండటం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక ధారుడ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన నాలుగు చిన్న కథలను విద్యార్థులకు వివరించి అందులోనుంచి సమయస్ఫూర్తి, శారీరక బలం, మానసిక బలం, ధైర్యం ప్రాముఖ్యతను యువతకు వివరించారు. ఈ నాలుగు జీవితంలో భాగం చేసుకోవాలని అప్పుడే యువత తమ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటారన్నారు. స్వామి వివేకానంద దేశ భవిష్యత్ గురించి కూడా చెప్పారని రాబోయే తరాలు మన సంస్కృతికి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారని అన్నారని గుర్తుచేశారు. రామకృష్ణ మిషన్ స్వామిజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుచుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్ప తనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందచేశారు. అలాగే యువజన శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది మన రాష్ట్రం సాధించిన లార్జెస్ట్ యూత్ ఐకాన్ ఫెస్టివల్ అవార్డును మంత్రి రోజా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నకు అందచేశారు. వేదికపై చెస్ మాస్టర్ ఎం. లలిత్ బాబును మంత్రి రోజా శాలువా, పూలామాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె. శారదాదేవి, డిప్యూటీ మేయర్ ఎ. శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్. ఆసీఫ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు. - కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. -
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
స్వావలంబనకు చుక్కాని... రుబీనా!
'అది హైదరాబాద్, దారుల్షిఫా, మలక్‌పేట్, నూర్ఖాన్ బజార్‌లోని బాల్షెట్టీ ఖేత్ గ్రౌండ్. పది నుంచి పదిహేనేళ్ల వయసు బాలికలు ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. వారి మధ్యలో ఓ అరవై ఏళ్ల మహిళ. ఆ మహిళకు హైఫైవ్ ఇస్తూ, ఫిస్ట్ పంచ్‌లతో ఆడుకుంటున్నారు. ఆ బాలికలు సంతోషంగా రెక్కలు విచ్చుకోవడానికి కారణం ఆ మహిళ. ఆమె పేరు రుబీనా నఫీస్ ఫాతిమా. అమ్మాయిలు గడపదాటి బయటకు రావడానికి ఆంక్షలున్న కుటుంబాల ఆడపిల్లలకు ఆకాంక్షల రెక్కలు తొడిగారామె. ఆశయాల లక్ష్యాలను వారి మెడలో హారంగా వేశారు. ఇందుకోసం సఫా అనే సంస్థను స్థాపించారు. బాలికలు తమ కలలను సాధించుకోవడానికి తగిన సాధన కోసం గ్రౌండ్‌ను వారి కోసం కేటాయిచేలా చేశారు. ఇస్లాం సంప్రదాయాల గౌరవానికి విఘాతం కలగని విధంగా దుస్తులు ధరించి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తారు. పదిహేనేళ్లుగా వ్యవస్థీకృతంగా సేవలందిస్తున్న రుబీనా నఫీస్ ఫాతిమా తన స్వచ్ఛంద సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.' తాతగారి స్ఫూర్తితో.. ‘‘మా నాన్న లెఫ్టినెంట్ కల్నల్ ఖాన్. అమ్మ మిలటరీ స్కూల్లో టీచర్. మా కుటుంబం అభ్యుదయ భావాలతో ఎదగడానికి కారణం మా తాతగారు సులేమాన్ ఆఫ్తాబ్ అలీ (అమ్మవాళ్ల నాన్న). మహిళలు చదువుకోవాలని, ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకూడదని, అప్పుడే సమాజంలో మహిళకు గౌరవం దక్కుతుందని చెప్పేవారు. ఆయన అమ్మను అలాగే పెంచారు. ఇక పేరెంట్స్ ఉద్యోగరీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరిగాను. సెక్యులర్ వాతావరణంలో పెరగడంతో పాటు అన్ని రకాల సంస్కృతులను గౌరవించడం నేర్చుకున్నాను. ఆడపిల్ల అనే కారణంగా ఇంట్లో నాకు ఎటువంటి ఆంక్షలూ లేవు. బాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయస్థాయిలో ఆడాను కూడా. ఇరవై ఏళ్లకే స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేశాను. పెళ్లి తర్వాత భర్తతో΄ాటు సౌదీ అరేబియాకు వెళ్లాను. అక్కడ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేసిన భారతీయ మహిళను. కొంతకాలానికి ఇండియాకి వచ్చేశాం. ఇక్కడకు వచ్చిన తర్వాత సొంతంగా బిజినెస్ మొదలుపెట్టి దారుణమైన నష్టాలను చూశాను. ఆ తర్వాత నాకు బాగా తెలిసిన పర్యాటక రంగంలో శిక్షణ, ప్లేస్‌మెంట్స్ నన్ను విజేతగా నిలిపింది. నాకు సర్వీస్ మీదున్న ఆసక్తికొద్దీ కొంత సమయం మహిళల కోసం పని చేయడం మొదలుపెట్టాను. సేవలను మరింత సమగ్రంగా చేయడం కోసం సీఎస్ఐఎమ్ నుంచి సర్టిఫికేట్ కోర్సులు చేశాను. మా తాత, నాన్నగారి పేర్లు కూడా వచ్చేటట్లు నా సేవా సంస్థకు సఫా అనే పేరు ఖాయం చేసుకున్నాను. సఫా ద్వారా 2008 నుంచి ముస్లిమ్ మహిళల ఆర్థిక సామాజిక పురోగతి కోసం పని మొదలుపెట్టాను. అప్పటినుంచి కొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ఈ గ్రౌండ్లో క్రీడాకారులు పుట్టారు! సాధారణంగా మగపిల్లలను స్వేచ్ఛగా పెరగనిస్తారు. బాలికలకు కూడా ఆడుకోవాలని ఉంటుంది. వాళ్లు ఆడుకోవడానికి నేను అండగా నిలిచాను. ఒకరోజు ఓ వ్యక్తి బైక్‌తో నేరుగా గ్రౌండ్ మధ్యకు వచ్చేసి బాలికలు ఆడుకోవడాన్ని ప్రశ్నించారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న ఆడపిల్లల మీద మగపిల్లలు రాళ్లు రువ్వారు. జీహెచ్ఎమ్సీ అధికారులతో మాట్లాడి ఈ గ్రౌండ్‌ను రోజూ రెండు గంటలపాటు బాలికల కోసం రిజర్వ్ చేయించాను. ఆ సమయంలో మగవాళ్లు గ్రౌండ్లో అడుగుపెట్టడానికి వీల్లేకుండా అడ్డుకోగలిగాం. ఇప్పుడు రోజూ బాలికలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆడుకుంటున్నారు. ఈ గ్రౌండ్ నుంచి ఇద్దరు బాలికలు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫుట్‌బాల్ ప్లేయర్లుగా ఎదిగారు. నగరంలో 542 గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి గ్రౌండ్ లోనూ బాలికల కోసం రెండు గంటలు కేటాయించి ఆటలను ప్రోత్సహించాలి. క్రీడాకారులుగా ఎదుగుతారు. కనీసం సూర్యరశ్మి తగిలేలా మెలిగితే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ‘గోల్స్ ఫర్ గాళ్స్’ సంస్థ బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి శిక్షణనిస్తుంది. ఆ శిక్షణ కోసం పాత బస్తీ నుంచి బాలికలు వెళ్లడం గొప్ప విజయం అనే చెప్పాలి. పేదమహిళల ఆర్థిక స్వావలంబన సాధన మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక సంస్కరణ చేయగలిగానని గర్వంగా చెప్పగలను. – రుబీనా నఫీస్ ఫాతిమా, సంఘ సేవకురాలు ఇంటింటికీ వెళ్లాను! మహిళలను చైతన్యవంతం చేయడానికి గడపగడపకూ వెళ్లాను. వాళ్ల ఇళ్లలో కూర్చుని బయట ప్రపంచం గురించి చెప్పాను. మహిళ ఎలా ఎదగవచ్చో వివరించాను. వాళ్లతో మాట్లాడిన తరవాత నాకు తెలిసినదేమిటంటే... మహిళలకు ఆలోచనలున్నాయి, ఆశయాలున్నాయి, ఆకాంక్షలున్నాయి. వాటన్నింటినీ మొగ్గలోనే తుంచి వేస్తున్న ఆంక్షలు కూడా ఉన్నాయి. పెద్దల గౌరవానికి భంగం కలిగించకుండా, మనోభావాలకు విఘాతం కలగకుండా ఎదగడం నేర్పించాను. బోలా నగర్లో చిన్నగదిలో రెండు సెకండ్ హ్యాండ్ టైలరింగ్ మెషీన్లతో మొదలైన నా సర్వీస్ ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్, లైవ్లీహుడ్, క్లౌడ్ కిచెన్, ధనక్బజార్ వంటి పదిహేను ప్రాజెక్టులకు విస్తరించింది. ఆరువందల మందికి వండగలిగిన ఇండస్ట్రియల్ కిచెన్ ఉంది. లుక్మా బ్రాండ్ తో మా మహిళలు తయారు చేసే ఆహార ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. ‘ఆర్టిజానియా’ పేరుతో టైలరింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఉద్యోగం కోసం బయటకు వెళ్లడానికి ఇష్టపడని వాతావరణం ఇంకా ఉంది. అలాంటి కొంతమంది ఇళ్లలోనే హ్యాండీక్రాఫ్ట్సŠ, ఇతర వస్తువులు తయారు చేసి వారానికొకసారి మేము ఏర్పాటు చేసే ధనక్ బజార్లో స్టాల్ పెట్టుకుని విక్రయిస్తారు. చదువుకు నోచుకోక ఇంతవరకూ పెన్ను వాడని వాళ్లు కూడా పెన్ హోల్డర్లు తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడం ఒక ఎత్తయితే బాలికలను క్రీడాకారులుగా తయారు చేయడం మాత్రం కత్తిమీద సాములా మారింది. శిక్షణనిచ్చాను... పని చూపించాను! నేను ఎవరికీ ఏదీ ఉచితంగా ఇవ్వలేదు. పని నేర్పిస్తాను, పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తాను. వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడాలి. ఒకరు సంపాదించి, ఐదుగురు తినాలంటే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదిగేది ఎప్పటికి? ఇద్దరు సంపాదిస్తుంటే... పిల్లలకు మంచి చదువు సాధ్యమవుతుంది. అందుకే మహిళల ఆర్థిక వృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాను. స్వయం ఉపాధి మార్గాల కోసం జీహెచ్ఎంసీతో అనుసంధానమయ్యాం. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ మహిళలు సాధికారత సాధిస్తున్నారు. సఫా సేవలు హైదరాబాద్ నగరంలో 48 స్లమ్ ఏరియాలకు విస్తరించాయి. మొత్తానికి పాతబస్తీలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాగలిగాను. బాలికలు చదువుకుంటున్నారు, మహిళలు సొంతంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. పిల్లల, పోషణ, పెంపకం గురించి బాధ్యతగా ఉంటున్నారు. తల్లి సంపాదిస్తున్నప్పుడే పిల్లలు ఆమెను గౌరవిస్తారు అని తాతగారు చెప్పిన మాటను ఆచరణలో చూస్తున్నాను’’ అన్నారు రుబీనా నఫీజ్ ఫాతిమా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ ఇవి చదవండి: ఖైదీల రూటు జ్యూట్ వైపు -
'2023 – తెలంగాణ మహిళ!' ఈ ఏడాది స్ఫూర్తి వీరే..
"తమను తాము బాగు చేసుకోవడంతోపాటు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో ఈ యేడాది తెలుగు మహిళ నిరూపించింది. విభిన్న రంగాలలో విశేషమైన కృషి చేసి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ మహిళను మరోసారి స్ఫురణకు తెచ్చుకుందాం. రాబోయే సంవత్సరానికి ప్రేరణగా వీరితో కలిసి మరెన్నో అడుగులు వేద్దాం.!" ఊరంతా బాగు! మూడేళ్లక్రితం వరకు ఒక మామూలు పల్లె అది. కానీ, నేడు దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచే స్థాయికి ఎదిగింది. దానికి కారణం సర్పంచ్ మీనాక్షి గాడ్గె. ఆమె కృషి, పట్టుదల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మఖరా గ్రామాన్ని అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాయి. ఇంటర్మీడియెట్ వరకు చదివిన మీనాక్షి ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎన్నియ్యింది. మరుగుదొడ్లు కట్టించడం, తాగునీరు ప్రతి ఇంటికి అందేలా చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వాన నీరు ఆ గుంటలో పోయేలా చేసిందామె. వాగుపైన వంతెన కట్టించింది. పక్కా రోడ్ల నిర్మాణం, సైడు కాలవల శుభ్రత, స్కూల్‌కు కొత్త భవనం, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను ఏర్పాటు చేయించింది. ఊళ్లో సంపూర్ణ మద్య నిషేధం అమలుతో΄ాటు హరిత హారంలో భాగంగా పదివేల మొక్కలు నాటించి, వాటి బాధ్యతను గ్రామస్తులే తీసుకునేలా చేసింది. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి, పంచాయితీకి లాభం చేస్తోంది. సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసింది. ఊళ్లోనే నర్సరీ ఉంది. ఊళ్లో జరిగే అంగడిలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారు, తడిచెత్త– ΄÷డి చెత్త విభజనను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ΄ాటిస్తున్నారు. ఇన్ని మార్పులు తీసుకు వచ్చిన మీనాక్షిని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఈ యేడాది స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డ్‌తో సత్కరించింది. - మీనాక్షి గాడ్గె (సర్పంచ్) భారతజట్టులో స్థానం! భద్రాచల వాసి త్రిష అండర్–19 మహిళల వరల్డ్ కప్ –2023 ఫైనల్లో టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులోనే క్రికెట్లో ఓనమాలు దిద్దిన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్ –16 జట్టులో చేరింది. తర్వాత హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీలో చేరి, క్రికెటర్‌గా తనను తాను మెరుగుపరుచుకుంటూ భారతజట్టులో స్థానం దక్కించుకుంది. చదువు, ఆటలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే తన ముందున్న లక్ష్యాలు అని చెప్పే త్రిష నవతరపు అమ్మాయిలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. - గొంగడి త్రిష (యువ క్రికెటర్) సాహసమే ఊపిరి.. రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల అన్వితారెడ్డి పర్వతారోహణలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఎవరెస్టు శిఖరాన్ని ఐదురోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి వార్తల్లో నిలిచింది. పడమటి అన్వితారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లావాసి. ప్రస్తుతం భువనగరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తోంది. ఎంతోమంది ఔత్సాహిక యువతీయువకులకు మెలకువలు నేర్పిస్తూనే అడ్వాన్స్డ్ కోర్సులను పూర్తి చేసింది. పర్వతారోహణలో మొదటి ప్రొఫెషనల్ కోచ్‌గానూ గుర్తింపు పొందింది. గతంలో సిక్కింలోని రీనాక్, బీసీరాయ్, కిలిమంజారో, లదాక్‌లోని కడే, ఎబ్బ్రూస్ పర్వతాలు అధిరోహించింది. పర్వతారోహణలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, సవాళ్లను అధిగమించే స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి, సాధన అవసరం. అన్విత ఏర్పరుచుకున్న ఆశయాలు ప్రతి ఆడపిల్లకు ఆదర్శం. అన్విత సాహసాలు ఎందరికో మార్గ నిర్దేశం చేస్తున్నాయి. - అన్వితారెడ్డి (పర్వతారోహకురాలు) అవగాహనే ప్రధానం జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం నుంచి రేగట్టె వెంకటరమణ ఎంపికయ్యింది. విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డును అందుకొని వార్తల్లో నిలిచింది వెంకటరమణ. ఇంటింటికీ వెళ్లి మహిళలు, పిల్లల ఆరోగ్యం గురించి కనుక్కోవడం, జాగ్రత్తలు సూచించడం, కౌన్సెలింగ్స్ ఇవ్వడం దినచర్యగా చెబుతుంది. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలను పురస్కరించుకొని అందరికీ ఆరోగ్యం కోసం అవగాహన కల్పించడంలో ముందుండే వెంకట రమణ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. -రేగట్టె వెంకటరమణ (అంగన్వాడీ టీచర్) ప్రైవేటుకు దీటుగా మంచిర్యాల జిల్లా రెబ్బెనపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నూగూరి అర్చన ఈ యేడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో΄ాటు ఆమె సొంత ఖర్చులతో పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన చేస్తూ రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటే అందరూ మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. గిరిజన చిన్నారులకు ప్రత్యేకంగా స్కూల్‌కి ఆటోలు ఏర్పాటు చేసి, మరీ చదువుకు ఊతమిస్తున్నారు. అర్చన విద్యాసేవకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ పురస్కారం అందుకున్న అర్చన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. - నూగూరి అర్చన (ప్రధానోపాధ్యాయురాలు) ఇవి చదవండి: మనీమంత్ర కవితాగానం -
రిక్షానే ఆసరాగా.. 'చినాబ్ లోయలోనే' తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా..
'జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా, పరిమళాలు వెదజల్లే పూలపాన్పులా ఉండదు. తమకున్న వనరులను ఉపయోగించుకుని పైగి ఎదగడానికి ప్రయత్నించి పెద్దవాళ్లు అయిన వాళ్లే ఎక్కువ. వీరు ఎంతోమందికి ప్రేరణగా కూడా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మీనాక్షి దేవి. జీవితాన్ని కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోనివ్వకుండా.. ఈ–రిక్షా లాగుతూ కుటుంబానికి జీవనాధారంగా మారింది. ఇలా తనకెదురైన కష్టాలకు ఎదురీదుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి దేవి.' జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లా భదర్వా టౌన్‌కు చెందిన 39 ఏళ్ల మీనాక్షి జీవితం ఏడాది క్రితం వరకు ఆనందంగా సాగింది. భర్త పమ్మి శర్మ, ఇద్దరు పిల్లలతో ఎంతో చక్కగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని ఉపద్రవం ఏర్పడింది. మీనాక్షి భర్తకు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్సకోసం అనేక ఆసుపత్రులు తిరిగారు. మెడికల్ బిల్లులు పెరిగాయి కానీ సమస్య తీరలేదు. ఈ క్రమంలో వారు దాచుకున్న డబ్బులు మొత్తం ఆవిరైపోయాయి. ఉన్న కారు అమ్మేసి, వ్యాపారాన్ని మూసేసి అప్పులు తీర్చినా ఇంకా కొన్ని అప్పుల భారం అలానే ఉండిపోయింది. ఏ దారీ దొరక్క.. భర్త సంపాదించే స్థితిలో లేకపోవడంతో మీనాక్షి దేవి కుటుంబ పోషణ కోసం పని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ తను చేయగలిగింది దొరకలేదు. ఈఎమ్ఐ ద్వారా కొన్న ఆటో ఒకటి ఇంట్లో ఉండడంతో అప్పుడప్పుడు పమ్మిశర్మ మీనాక్షికి సరదాగా ఆటో నేర్పించేవాడు. అప్పటి డ్రైవింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగు పరుచుకుని ఆటో నడపాలనుకుంది మీనాక్షి. ఆమె కోరిక మేరకు ఆటో నడపడాన్ని పూర్తిస్థాయిలో నేర్పించాడు ఆమె భర్త. ఆ తరువాత సబ్సిడీలో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోని, దాన్ని నడపడం ప్రారంభించింది మీనాక్షి. దానిమీద వచ్చిన డబ్బులతో భర్త మెడికల్ బిల్స్ కట్టడంతోపాటు, కొడుకులిద్దరి బాగోగులను చూసుకుంటోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన మీనాక్షి దేవి చినాబ్ లోయలోనే తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా నిలవడం విశేషం. మరో ఆప్షన్ లేక.. "ప్రారంభంలో ఆటో నడుపుతానన్న నమ్మకం మీనాక్షికి లేదు. రద్దీగా ఉండే భదర్వా టౌన్లో ఆటో నడపడానికి చాలా భయపడేది. కుటుంబం గడవడానికి మరో గత్యంతరం లేదు. అందుకే ఎంతో కష్టపడి, ధైర్యంగా ఆటో నడపడం నేర్చుకుని అండగా నిలుస్తోంది. మీనాక్షిని చూస్తే నాకు తృప్తిగానే గాక, గర్వంగానూ ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న మెడికల్ బిల్స్ నన్ను తీవ్రంగా కుంగతీసేవి. ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై.. పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన పడేవాడిని. నా రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. ఎంతకాలం ఉంటానో కూడా తెలియని పరిస్థితుల్లో నా భార్య ఆటో నడుపుతూ నాకు మానసిక ప్రశాంతతను కల్పిస్తోంది" అని మీనాక్షి భర్త ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘‘నాలుగు నెలల క్రితం తొలిసారి ఆటోతో ఆటోస్టాండ్‌లో అడుగు పెట్టాను. అక్కడ ఉన్న మిగతా డ్రైవర్లంతా నన్ను ఒక ఏలియన్లా చూశారు. కొంతమంది అయితే ఈమె కస్టమర్లను భద్రంగా ఇంటికి తీసుకెళుతుందో లేదో అంటూ చెవులు కొరుక్కునేవారు. లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఆటో నడపవద్దు అని నిరుత్సాహ పరిచారు. కానీ ఇది నా కుటుంబ జీవనాధారం. అందుకే నేను ఎవరి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాను. రోజురోజుకీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నాను’’ అని మీనాక్షి సగర్వంగా చెబుతోంది మీనాక్షి దేవి. ఇవి చదవండి: Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత -
సుధాచంద్రన్ వీడియో కాల్..ఎమోషనల్ అయిన అంజన శ్రీ
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా భరతనాట్యంలో రాణిస్తోంది జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన బొమ్మకంటి అంజనశ్రీ. నాట్యమయూరి సుధాచంద్రన్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అంజనా శ్రీ టాలెంట్ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సుధాచంద్రన్ వీడియో కాల్ చేసి మాట్లాడగా, ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యింది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు అని అంజనాశ్రీ రుజువు చేస్తుంది. వివరాల ప్రకారం.. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన బొమ్మకంటి నాగరాజు-గౌతమి కూతురు అంజనశ్రీ నాలుగేళ్ల ప్రాయంలో రహదారి ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయింది. ఏడాది కూడా గడవక ముందే రెండో కాలు ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుని భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇప్పటికే త్యాగరాజు గానసభతో పాటు, పలుచోట్ల భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొని ఔరా అనిపించింది. అంజన ప్రతిభకు ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు దక్కాయి. కాలు లేకున్నా తన లక్ష్యం వైపు సాగుతున్న చిన్నారి అంజనా శ్రీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అంగవైకల్యం శరీరానికి తప్ప మనిషికి కాదని నిరూపించింది. అంజనా శ్రీ ప్రతిభ గురించి మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నాట్యమయూరి సుధాచంద్రన్ వీడియోకాల్ ద్వారా అభినందించారు. కుత్రిమకాలుతోనూ అంజనశ్రీ నాట్యంలో రాణించడం గర్వంగా ఉందని, భరతనాట్యంలో మరింత రాణించాలని సూచించింది. తన గురువు దగ్గర్నుంచి కాల్ రావడంతో భావోద్వేగానికి గురైన అంజన ఎమోషనల్ అయ్యింది. ఇక సుధాచంద్రన్ స్వయంగా ఫోన్ చేయడంతో అంజనా శ్రీ కుటుంబసభ్యులు సైతం ఎంతో సంతోషించారు. -
విభిన్న రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలి
చేబ్రోలు: ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు కలిగిన దేశమేదైనా ఉందంటే అది భారతదేశమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో సోమవారం 11వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు, విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి, ఇండియన్ చెస్ ప్లేయర్ కోనేరు హంపిలకు గౌరవ డాక్టరేట్లను, 1,820 మందికి డిగ్రీలు, మరికొంతమందికి గోల్డ్ మెడల్స్, అవార్డులను అందజేశారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు మాత్రమే కాకుండా కొత్త మెటీరియల్స్, రేర్ మినరల్స్, మెటీరియల్ సైన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే ఇస్రో చంద్రయాన్–3 ద్వారా దక్షిణ ధృవం మీదకు వెళ్లగలిగామని, 2040 నాటికి మానవ రహిత ప్రయోగానికి పూనుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. 2035 లోపు ‘భారత స్పేస్ స్టేషన్’ను పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఇస్రోకు ప్రధాని మోదీ సూచించారని తెలిపారు. చంద్రయాన్–3 విజయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చంద్రయాన్ నమూనాను బహుమతిగా అందజేశారు. రాష్ట్ర మంత్రి బుగ్గన మాట్లాడుతూ విద్యార్థుల మేధోపరమైన, విద్యాపరమైన అన్వేషణను వారి వృత్తిపరమైన విజయాలను కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవడానికి ఇది చిరస్మరణీయ వేదిక అని అన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వీసీ నాగభూషణ్ పాల్గొన్నారు. -
మిత్రద్రోహికి మించిన ద్రోహి! కుష్టి వ్యాధి కంటే భయంకరమైన వ్యాధి..
బుద్ధుడు ధర్మ ప్రబోధం చేస్తూ, సుబాహుడనే ఓ రైతు కథ చెప్పాడు. పూర్వం ఒక గ్రామంలో సుబాహుడు అనే రైతు ఉండేవాడు. అతనికి అడవిని ఆనుకుని పంటపొలం ఉంది. ఒకరోజున పొలం దున్ని నాగలి విప్పాడు. ఎద్దుల్ని పచ్చికలో తోలాడు. తాను పొలం పనుల్లో మునిగిపోయాడు. చాలాసేపటికి గమనిస్తే ఎద్దులు కన్పించలేదు. వాటిని వెతుక్కుంటూ అడవిలోకి పోయాడు. అడవి మధ్యకు చేరాడు. దారి తప్పాడు. ఆకలి వేసింది. అక్కడ కొండ అంచున తిందుక వృక్షం కనిపించింది. మెల్లగా చెట్టెక్కాడు. ఒక కొమ్మ మీదికి చేరి పండ్ల గుత్తిని అందుకోబోయాడు. కొమ్మ విరిగి బావి లాంటి పెద్ద గుంటలో పడ్డాడు. బయటకు రాలేకపోయాడు. అలా రోజులు గడిచాయి. నీరసించి శక్తి సన్నగిల్లి మూలుగుతూ పడి ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం తిందుక ఫలాల కోసం ఒక పెద్ద తోక వానరం అక్కడికి వచ్చింది. గుంటలోంచి వచ్చే మూలుగును వింది. జాలి పడింది. అరచి పిలిచింది. వాడు కళ్ళు తెరచి చూశాడు. ‘‘మానవా! భయపడకు నిన్ను కాపాడుతాను’’ అంది. ఆ పక్కనే ఉన్న రాతిబండలు గోతిలోకి జారవిడిచి మెట్లుగా పేర్చింది. గోతిలోకి దిగి, అతణ్ణి భుజాన ఎత్తుకుని పైకి చేర్చింది. ఆకు దొన్నెలో నీరు తెచ్చింది. తిందుక ఫలాలు తినిపించింది. వాడు నెమ్మదిగా శక్తి తెచ్చుకున్నాడు. తన వివరాలు చెప్పాడు. ‘‘సుబాహూ.. చింతిల్లకు.. నా వీపున ఎక్కి భుజాలు పట్టుకో’’ అంది. సుబాహుని తీసుకుని అతని గ్రామంవైపు సాగింది. కొంతసేపటికి అలసిపోయింది. ‘‘సుబాహూ... అలసటగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ ప్రాంతంలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, చిరుతలు తిరుగుతూ ఉంటాయి. నీవు జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవసరమైతే నన్ను లేపు’’ అని, ఆ ప్రక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కునుకు తీసింది వానరం. ‘ఈ వానరం బలంగా ఉంది. దీని మాంసం చాలా రుచిగానూ ఉంటుంది. దీన్ని చంపి తిన్నంత తిని మిగిలినది దార్లో తింటూ పోవచ్చు.’ అనే దురాలోచన కలిగింది సుబాహుకు. వెంటనే పక్కనే ఉన్న రాయి ఎత్తి తలమీద కొట్టబోయాడు. కానీ శక్తి లేకపోవడం వల్ల చేయి వణికింది. గురి తప్పింది. వానరం లేచింది. సుబాహు వైపు చూసింది. వాడు గడగడ వణికిపోతున్నాడు. దానికి జాలి వేసింది. ‘‘మానవా! అన్నిటి కంటే పెద్దనేరం మిత్రద్రోహం. అయినా, నేను ధర్మాన్ని తప్పను. నిన్ను నమ్మను. నేను చెట్లకొమ్మల మీదినుండి వెళ్తూ ఉంటాను. నీవు నేలమీద ఆ వెనుకే రా.. నీ గ్రామానికి చేరుస్తాను’’ అంది. అలా అడవి చివరకు చేర్చి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు ఆ నీటిలో దిగి దాహం తీర్చుకున్నాడు. స్నానం చేశాడు. ఆ తరువాత వాడి శరీరంలో మార్పులు వచ్చాయి. ఒళ్ళంతా బొబ్బలు లేచాయి. అవి మానని గాయాలుగా మారాయి. సుబాహు కుష్ఠువ్యాధి పీడితుడయ్యాడు’’ అని చెప్పి–‘‘భిక్షువులారా! కుష్ఠువ్యాధి కంటే భయంకరమైంది మేలు చేసిన వారికి కీడు చేయడం. మిత్ర ద్రోహిని, చేసిన మేలు మరిచే వారిని చూసి అసహ్యించుకోవాలి. వ్యాధిగ్రస్తుల్ని, రోగాల్ని చూసి కాదు’’ అన్నాడు. – బొర్రా గోవర్ధన్మిత్రధర్మం (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!) -
‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పనెందుకు!
స్నేహితుల దినోత్సవం సందర్భంగా అంతర్జాలంలో అలనాటి సినిమా ‘దోస్తి’ (1964) తప్పనిసరిగా ప్రస్తావనకు వస్తుంది. సత్యన్‌బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టింది. ‘బెస్ట్ ఫిల్మ్’ తో సహా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్లు గెలుచుకుంది. ఒక యాక్సిడెంట్లో కాలు కోల్పోయిన రాము, కంటిచూపు లేని మోహన్ అనే ఇద్దరు కుర్రాళ్ల మధ్య స్నేహానికి అద్దం పట్టే చిత్రం ఇది. ఈ ఇద్దరు స్నేహితులకు పాట స్నేహితురాలు. అన్నదాత. ఎన్నో కష్టాలు, ప్రలోభాలు ఎదురైనా వారి స్నేహ ప్రపంచం చెక్కు చెదరదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చూడాల్సిన సినిమాలలో ఇదొకటి. అలాగే 'స్నేహంలో విభేదాలు ఉండవు’ అని అనుకోవడానికి లేదు. ఎన్నో కారణాల వల్ల ఫ్రెండ్షిప్ బ్రేక్‌డౌన్ కావచ్చు. మళ్లీ కలుసుకోవాలని, మునపటిలా హాయిగా మాట్లాడుకోవాలని ఉన్నా ఏవో ఇగోలు అడ్డుపడుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాశ్చాత్య దేశాల్లో ‘ఇన్విజిబిలియా: థెరపీ విత్ ఫ్రెండ్స్’ అనే ట్రెండ్ మొదలైంది. అనగా ఒక సైకాలజిస్ట్ విడిపోయిన ఇద్దరు స్నేహితులను ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఒకటి లేదా రెండు మూడు రోజుల సెషన్లతో వారి స్నేహాన్ని తిరిగి పట్టాలకెక్కిస్తారు. ‘ఇదంతా ఎందుకు?’ అనుకునేవారు దూరం అయిన ఫ్రెండ్‌కు ‘సారీ రా’ అని మెసేజ్ పెట్టి చూడండి చాలు...‘సారీ’కి ఉండే పవర్ ఏమిటో మీకే తెలుస్తుంది! ఆ నలుగురు స్నేహితులు ఇంగ్లీష్ సింగర్, సాంగ్ రైటర్, మ్యూజిషియన్, పీస్ యాక్టివిస్ట్ జాన్ లెనన్ తన ‘ఇమేజిన్’ పాటలో ఏం అంటాడు? నీ తల మీద ఆకాశం తప్ప, స్వర్గనరకాలు, మతాలు, కులాలు, సరిహద్దు ద్వేషాలు లేని ఒక కొత్త ప్రపంచం, ఆస్తులు, అంతస్తుల తేడా లేని సరికొత్త సమాజాన్ని ఊహించుకో అంటాడు. ‘ఐయామ్ ఏ డ్రీమర్ బట్ ఐయామ్ నాట్ ది వోన్లీ వన్’ అని కూడా అంటాడు. ప్రపంచంలో ఎంతోమందిలాగే ఈ పాటతో ప్రభావితమైన వాళ్లలో బెంగళూరుకు చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు. మెలిషా, వినోద్ లోబో, నితిన్ కుమార్, విగ్నేష్‌లు ‘ఇమేజిన్’ సాంగ్ స్ఫూర్తితో ‘ఇమేజిన్ ట్రస్ట్’ ప్రారంభించారు. సేవా కార్యక్రమాలకు సంబంధించి తొలి దశలో భాగంగా ‘క్లాత్ బ్యాంక్’కు శ్రీకారం చుట్టారు. దాతల నుంచి సేకరించిన ఈ దుస్తులను పేదలు రూపాయి ఇచ్చి కొనవచ్చు. వన్స్‌మోర్ ఫ్రెండ్షిప్ డైలాగ్‌లు నిజమైన స్నేహితులు కన్నీటి చుక్కల్లాంటి వారు. మనసు బాధగా ఉన్నప్పుడు చప్పున బయటికి వస్తారు’ ‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పని ఎందుకు!’ – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమా నిజమైన స్నేహితుడు, స్నేహితుడి తప్పులను తన తప్పులుగా భావించి క్షమిస్తాడు. – ఏ రస్తే ప్యార్ కే స్నేహితుడు చనిపోవచ్చు. స్నేహం చనిపోదు. – ఎల్వోసీ కార్గిల్ స్నేహం అనేది ఎలా బతకాలో మాత్రమే కాదు ఎలా చావకూడదో నేర్పుతుంది. – ఏబీసీడి–ఎనీబడి కెన్ డ్యాన్స్ స్నేహితులు ఉన్న వారే అసలైన సంపన్నులు – రంగ్ దే బసంతీ స్నేహంలోని ఒక నియమం...నో సారీ...నో థ్యాంక్! – కుచ్ కుచ్ హోతా హై (చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!) -
ఛత్రపతి శివాజీ జీవితం స్ఫూర్తిదాయకం
ముంబై: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన నిరంతరం తపించారని చెప్పారు. శివాజీ విధానాలు, పాలనా వ్యవస్థ ఈనాటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. మరాఠా రాజుగా ఛత్రపతి పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోటపై రాష్ట్రస్థాయి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం పంపించారు. శివాజీ దార్శనికత, అరుదైన వ్యక్తిత్వం చరిత్రలోని ఇతర రాజుల కంటే భిన్నమని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ నినాదమైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ శివాజీ మహారాజ్ ఆలోచనలు, ఆశయాలకు ప్రతిబింబమని వివరించారు. ఆయన వీరత్వం, భయానికి తావులేని కార్యాచరణ, వ్యూహాత్మక నైపుణ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో 22న మోదీ ప్రసంగం వాషింగ్టన్: భారత ప్రధాని మోదీ జూన్ 21నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో అధికారికంగా పర్యటించనున్నారు. 22న అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించనున్నారు. భవిష్యత్ భారతం, రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన ప్రసంగిస్తారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. 22న వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు. ఉభయసభలైన ప్రతినిధుల సభ, సెనేట్నుద్దేశించి మోదీ మొదటిసారిగా 2016లో ప్రసంగించారు. -
రికార్డు సృష్టించిన ట్రాన్స్‌జెండర్ ఆషాఢం ఆశ.. ఎలా అంటే?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆ ఇద్దరూ.. ఊహ తెలిసినప్పటి నుంచీ.. తాము స్త్రీలమా.. పురుషులమా.. అన్న విషయం తెలియక మథనపడ్డారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ ఇలా ప్రతి చోటా గుర్తింపు సమస్యే. పైపెచ్చు హేళన, వివక్ష. దీంతో మరింత మనోవేదనకు గురయ్యారు. ఇలాగే ఉంటే.. తమ మనుగడ కష్టమవుతుందని భావించారు. ఇంటి గడప దాటి తమలా ఉండే వారితో కలిసి జీవిస్తున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడే గౌరవ ప్రదమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తోటివారికి సైతం సహకరిస్తున్నారు. సమాజంలో అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారే కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ, నక్కా సింధు. స్వయం ఉపాధికి ప్రభుత్వ రుణం సంపాదించిన రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆషాఢం ఆశ రికార్డు సృష్టించింది. అదేవిధంగా స్వయం ఉపాధి కోసం డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన రాష్ట్రంలోని రెండో ట్రాన్స్‌జెండర్‌గా నక్కా సింధు గుర్తింపు సాధించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ తమ కమ్యూనిటీకి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ అనగానే.. ట్రాఫిక్ సిగ్నళ్లు, రైళ్లు, రైల్వేస్టేషన్లలో డబ్బులు వసూలు చేసేవాళ్లే కాదు.. అని కుండబద్ధలు కొడుతున్నారు. తమకు అవకాశాలిస్తే.. నైపుణ్యంతో సొంతకాళ్ల మీద నిలబడతామని ఢంకా భజాయిస్తున్నారు. ఫొటోగ్రఫీ వృత్తి కోసం 5 లక్షల రుణం సాధించిన ఆశ ప్రభుత్వ రుణం సంపాదించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు కాలేజీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు.. కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ మగాడిలా పుట్టినా.. చిన్ననాడే తన ఆలోచనలన్నీ అమ్మాయిలా ఉన్నా యని ఆమెకు అర్థమైపోయింది. ఆమె ప్రవర్తనను మొదట్లో కుటుంబసభ్యులు వ్యతిరేకించినా తర్వాత అర్థం చేసుకున్నారు. తన ఇష్టం మేరకు చదివించి హోటల్ మేనేజ్మెంట్లో సైతం చేర్పించారు. కానీ ఆఖరి సెమిస్టర్లో తాను థర్డ్ జెండర్ అని గుర్తించిన క్లాస్మేట్స్ వేధించడం ప్రారంభించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆశ.. ఆపరేషన్లు చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారింది. తీరా వెళ్లి సర్టిఫికెట్లు కావాలని అడిగితే కాలేజీ నిరాకరించింది. విధిలేని పరిస్థితుల్లో ఫొటోగ్రఫీ, గ్రాఫిక్స్ నేర్చుకుంది. మొదట్లో ఆల్బమ్‌లు అందంగా డిజైన్ చేసేది. తర్వాత తానే స్వయంగా ఫొటోలు తీయడం ప్రారంభించింది. మెల్లిగా ఈవెంట్లకు ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చాలామంది అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మెప్మా అధికారుల ద్వారా కలెక్టర్ కర్ణన్‌ను కలిసింది. ఆయన వెంటనే రూ.5 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించడంతో ఫొటోగ్రఫీ వృత్తిని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. సమాజం మారుతోంది.. సహకారం లభిస్తోంది సమాజంలో మాపై చిన్నచూపు ఇంకా ఉంది. తొలి నాళ్లలో నేను ఫొటోలు బాగా తీసినా థర్డ్ జెండర్నని చెప్పి వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. మా సమస్యలను సమాజం మెల్లిగా అర్థం చేసుకుంటోంది. ప్రముఖ నటులు లారెన్స్, సుధీర్‌బాబు, అక్షయ్ కుమా ర్లు మాలాంటి వారి కథలతో సినిమాలు తీయడం ద్వారా మా ఇబ్బందులు సమాజానికి తెలిసేలా చేశారు. ప్రభుత్వాలు, కోర్టుల నుంచి మాకు గుర్తింపు, సహకారం లభించడం గొప్ప విషయం. మాలాంటి వారికి ఆధార్, పాన్, ఓటరు తదితర గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సాయాల సాధనకు కృషి చేస్తున్నా. ట్యాక్సీ కోసం డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సింధు సహచర థర్డ్ జెండర్లలో స్ఫూర్తి నింపుతున్న వైనం విజయగాథలతో స్ఫూర్తి పొంది.. కరీంనగర్‌కే చెందిన నక్కా సింధు కొన్నినెలల క్రితం వరకు ఎలాంటి పనిలేకుండా ఉండేది. ఆశ లాగానే థర్డ్ జెండర్ కావడం వల్ల ఎవరూ పనిచ్చేవారు కాదు. స్కూలు వరకే చదువుకోవడం, బయట వివక్ష , హేళన కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కానీ ఉస్మాని యాలో ప్రభుత్వ డాక్టర్లుగా చేరిన ట్రాన్స్జెండర్లు డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రుతు జాన్పాల్ల గురించి తెలుసుకున్నాక సింధు జీవితంలో మార్పు వచ్చింది. తమిళనాడులో థర్డ్‌జెండర్ కోటాలో ఎస్సై ఉద్యోగం సాధించిన ప్రతీక యాష్మీ విజయ గాథ కూడా ఆమెలో స్ఫూర్తినింపింది. ఎలాగైనా తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో కరీంనగర్ మెప్మా వారి సాయంతో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండో థర్డ్‌జెండర్‌గా (తొలి లైసెన్స్ జనగామ జిల్లాలోని డాలీ పేరిట జారీ అయింది) ప్రత్యేక రికార్డు సాధించింది.వెంటనే ట్యాక్సీ తీసుకునేందుకు అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. చిన్నచూపు పోవాలి.. నాకు చాలాకాలం పాటు ఎలాంటి పని దొరకక పోవడంతో చాలా కుంగిపోయా. కానీ నాలాంటి వారు కొందరి గురించి తెలుసుకున్నాక కొత్త ధైర్యం వచ్చింది. కరీంనగర్ మెప్మా వారి ప్రోత్సాహం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే పట్టుదలతో కలెక్టర్ గారి సహకారంతో డ్రైవింగ్ లైసెన్స్ సాధించా. ప్రస్తుతం ట్యాక్సీ తీసుకోవడానికి అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. సమాజంలో థర్డ్ జెండర్లపై చిన్నచూపు పోవాలి. అప్పుడే మాలాంటి వారికి అవకాశాలు వస్తాయి. – నక్కా సింధు -
నాటి పేపర్ బాయ్.. నేడు అమెరికాలో సైంటిస్టు
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా): కన్నవారు దూరమైన దుర్భర బాల్యం. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దైన్యం. అవమానాలు, ఆటంకాలు, మరెన్నో ప్రతిబంధకాలు. కష్టాలన్నీ కట్టకట్టుకు వచ్చినా ఆయన పట్టుదల, పరిశ్రమ ముందు అవి తలవంచక తప్పలేదు. బాల్యంలోనే ఎన్నో సవాళ్లను చెరగని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వీధుల్లో పేపర్ బాయ్‌గా తిరిగిన ఓ యువకుడు అంచెలంచెలుగా ఎదిగి నేడు అమెరికాలో మంచి సైంటిస్టుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘‘సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్’’ డిప్యూటీ డైరెక్టర్‌గా మల్టీ డిసిప్లినరి రీసెర్చి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎన్నో అద్భుత విజయాలు తన ఖాతాలో వేసుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కడప నాగరాజుపేటకు చెందిన ఆయన పేరు డాక్టర్ రావూరి సుదీర్‌కుమార్. బాల్యం గడిచిందిలా! పసితనంలోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అవ్వ చల్లా కమలమ్మ అక్కున చేర్చుకుంది. ఐదవ తరగతి వరకు నాగరాజుపేట గుండాచారి బడిలో చదువుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన అవ్వ కమలమ్మకు చదువు విలువ ఏమిటో బాగా తెలుసు. చదువే నిజమైన ఆస్తి అంటూ మనవడికి తరచూ నూరిపోసేది. అవ్వ మాటలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. గుంతకల్లు, గుత్తిలో పిన్ని ఇంట హైస్కూల్ విద్యాభ్యాసం సాగింది. సైన్స్ పట్ల జిజ్ఞాస గుత్తి రైల్వే ఇంగ్లీషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆకుల నుంచి విద్యుత్ తయారవుతుందని ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ’ అనే పత్రికలో చదివాడు. అందుకు జిల్లేడు, బొంత జెముడు ఆకులు పనికి వస్తాయని సు«దీర్ కనుగొన్నారు. ఇలా ఆయన బయో లాజికల్ బ్యాటరీ తయారు చేశాడు. అప్పట్లో హైదరాబాదులో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రపతి వెంకట్రామన్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. సిమ్లాలో జరిగిన ఇంటర్ స్టేట్ సైన్స్ ఫెయిర్‌కు ఈ ప్రయోగం ఎంపికైంది. ఇంటర్మీడియేట్ కడప సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో, 1994–97లో ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. తాను ఇంకొకరికి భారం కారాదని భావించి పేపర్ బాయ్‌గా, వీడియో కెమెరామెన్‌గా కొన్నాళ్లు పనిచేశారు. గ్రూప్-4, బ్యాంకు పరీక్షలు రాశారు. బీఈడీలో ఉచిత సీటు వచ్చింది. సైంటిస్టు కావాలన్న బలమైన ఆకాంక్ష వల్ల వాటిని వదులుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ వైరాలజీ ప్రవేశానికి కిశోర్ అనే స్నేహితుడు రూ. 400 సాయం చేసి దరఖాస్తు చేయించగా సీటు వచ్చింది. తిరుపతిలో ఉన్న మరో పిన్ని ఇంటిలో ఉంటూ చదువు కొనసాగించారు. తన ఖర్చులు తాను సంపాదించుకోవాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పార్ట్ టైం అధ్యాకునిగా పనిచేశారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తన జుట్టు తానే కట్ చేసుకోవడం నేర్చుకున్న ఆయన ఒక సెలూన్ కూడా ప్రారంభించాలని భావించారు. వెటర్నరీ వైరాలజీ పైన ఎమ్మెస్సీ ప్రాజెక్టు వర్క్‌ను తిరుపతిలో చేశారు. 1999లో ఎమ్మెస్సీ పూర్తయ్యాక అక్కడి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో ఐసీఏఆర్–ఐఏఆర్‌టీ ఫెలోషిప్ జాబ్ చేశారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులో ఉన్న బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)లో మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌పై పనిచేశారు. వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో డయాగ్నస్టిక్స్ చేశారు. ఈ సమయంలో రెడ్డీస్ ల్యాబ్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే అదే సమయంలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో హెచ్ఐవీ–1పై పనిచేసే అవకాశం తలుపు తట్టగా, దాన్నే ఎంచుకున్నారు. దీంతో ఆయన జీవితం పెద్ద మలుపు తిరిగింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తిలో రోగ నిరోధకశక్తి తగ్గిపోయి త్వరగా మరణానికి చేరువవుతాడు. అలాంటి వ్యక్తుల్లో వచ్చిన జన్యుపరమైన మార్పులను గుర్తించి దానికి తగ్గట్టు కాంబినేషన్ మందుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై పరిశోధన చేశారు. ఆయనకు 2006లో పీహెచ్‌డీతోపాటు పేటెంట్ హక్కులు లభించాయి. అమెరికాలో పరిశోధనలు సుదీర్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోగల పిట్స్బర్గ్ యూనివర్సిటీకి పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్‌పై వెళ్లారు. మెంటార్‌గా కూడా పనిచేశారు. రీసెర్చి అసోసియేట్‌గా తొమ్మిదేళ్లు పిట్స్‌బర్గ్‌లో ఉన్నారు. నిర్వీర్యం చేసిన హెచ్ఐవీ వైరస్‌లోకి ఉపయోగకరమైన జన్యువులను పంపి తద్వారా వచ్చిన నిర్వీర్య వైరస్‌ను మూల కణాల ఉత్పత్తి, రొమ్ము క్యాన్సర్ నిరోధానికి ఉపయోగించడంపై పరిశోధన చేశారు. కొలరాడోలోని స్టెడ్మన్ ఫిలిప్పన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఎస్‌పీఆర్‌ఐ)లో ‘వార్థక్య దశకు చెందిన కణాలను గుర్తించి నిర్మూలించడం ద్వారా మెరుగైన వృద్ధాప్య జీవితం’ అనే అంశంపై పరిశోధన చేశారు. అక్కడి ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో కలిసి జీన్ థెరఫి, స్టెమ్‌సెల్ బయాలజీ, టిష్యూ ఇంజినీరింగ్ అంశాల్లో పనిచేశారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, డిపార్టుమెంటు ఆఫ్ డిఫెన్స్, యూఎస్ ఒలంపిక్ అండ్ పారాలింపిక్ నేషనల్ మెడికల్ సెంటర్లో పరిశోధనలు చేశారు. గ్రాంట్ అవార్డ్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ప్లాస్టిక్ సర్జరీ ఫౌండేషన్ గ్రాంటు, కో ఇన్వెస్టిగేటర్‌గా ఎన్ఐహెచ్, డీఓడీ ప్రభుత్వ గ్రాంటు, కో ప్రిన్సిపల్ సైంటిస్టుగా ప్రైవేటు ఇండస్ట్రీ ఫండింగ్ లభించాయి. ఎడిటోరియల్ బోర్డు మెంబర్, గెస్ట్ ఎడిటర్, సైంటిఫిక్ రివ్యూవర్‌గా పలు అంతర్జాతీయ రీసెర్చి జనరల్స్‌లో పనిచేశారు. పలు సైంటిఫిక్ సమ్మిట్స్‌కు చైర్ పర్సన్, కో చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో అఫిలియేట్ సైంటిస్టుగా నియమితులయ్యారు. కండరాల్లో మూల కణాలు కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జానీ హువర్డ్‌తో కలిసి ప్రస్తుతం సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్ (సీఆర్‌ఎస్‌ఎం)లో మల్టీ డిసిప్లినరీ రీసెర్చి ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? ఆకాంక్షతోపాటు నిరంతర కృషి అవసరం ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి వెళ్లాలన్న ఆకాంక్ష ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టు నిరంతర కృషి ఉన్నప్పుడే లక్ష్యాన్ని అందుకోగలమని విద్యార్థులు గుర్తించాలి. నిరుత్సాహ పడకుండా అవకాశాలు వచ్చేంత వరకు ఓపిక అవసరం. ఒకప్పుడు ఏమీ లేని నేను ఇప్పుడు ఒక స్థాయి లో ఉన్నానంటే అది మా అవ్వ కమలమ్మ, మా ఇద్దరు పిన తల్లులతోపాటు స్నేహితులు కిశోర్, ప్రసాద్, రాజు, మేనమామ చల్లా రాజేంద్ర వరప్రసాద్ (సీఆర్వీ ప్రసాద్), టీచర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన సహకారమే కారణం. – -డాక్టర్ రావూరి సుధీర్‌కుమార్, నాగరాజుపేట, కడప -
Bhavi Barad: స్ఫూర్తి ప్రవాహమై కదలింది
‘నేను, నా చదువు మాత్రమే’ అని ఎప్పుడూ అనుకోలేదు దిల్లీకి చెందిన 26 సంవత్సరాల భావి బరాద్. సామాజిక సేవ నుంచి యువతరం హక్కుల వరకు ఎన్నో విషయాలపై తన గొంతు వినిపిస్తోంది. ప్రస్తుతం యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘ప్రవాహ్’లో పని చేస్తున్న భావి బరాద్ ‘పదిమందితో కలిసి పనిచేయడంలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ అంటుంది. కోవిడ్ సమయంలో ఎంతోమంది బాధితులకు అండగా నిలబడింది. సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. ‘వర్గ, కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి శాంతిసౌభాగ్యాలతో జీవించాలి’ అనేది తన కోరిక. ఐక్యరాజ్య సమితి ‘ఇండియా యువ అడ్వకేట్స్’గా ఫస్ట్ బ్యాచ్‌కు ఎంపికైన ఆరుగురిలో భావి బరాద్ ఒకరు. ‘సామాజిక సేవలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఫలితం ఆశించకుండా నిజాయితీగా కష్టపడడం. అయితే నిజాయితీగా పనిచేసే వారికి మంచి ఫలితం దూరంగా ఉండదు. వారిని మరో రెండు అడుగులు ముందుకు నడిపిస్తుంది’ అంటుంది భావి బరాద్. సమాజసేవకు సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటుంది బరాద్. స్కూల్, కాలేజీలలో జెండర్ ఈక్వాలిటీ నుంచి పర్యావరణ స్పృహ వరకు రకరకాల విషయాలపై మాట్లాడడం, యూత్ కెరీర్‌కు సంబంధించి ప్యానల్ డిస్కషన్లలో చురుగ్గా పాల్గొంటుంది. ‘పుస్తకాలు చదవడం అంటే ఇష్టం’ అంటున్న భావి బరాద్ సమాజాన్ని చదవడం ద్వారా మర్ని విషయాలను తెలుసుకుంటుంది. (క్లిక్ చేయండి: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..) -
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే అందరూ పని చేయాలి : భట్టి విక్రమార్క
-
మహిళలూ... పరిశ్రమించండి!
‘ఇంజినీరింగ్ సీట్ అమ్మాయిలకెందుకు?’ ఇది నలభై ఏళ్ల నాటి మాట. విద్యావంతులు కూడా కనుబొమలు ముడివేస్తున్న రోజులవి. ‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను’ సంధ్య అనే ఓ అమ్మాయి పట్టుదల అది. ‘మెకానికల్లోనా అసలే కుదరదు... కావాలంటే ఎలక్ట్రానిక్స్‌లో చేరు’ కొద్దిగా రాజీపడుతూ ఆ అమ్మాయికి సీటిచ్చారు. ఇప్పుడామె దేశ రక్షణ రంగానికి పరికరాలు సమకూరుస్తున్నారు. ఆమే కోవె డైరెక్టర్ సంధ్యారెడ్డి. చేత వచ్చిన పనులతో కుటీర పరిశ్రమ లేదా చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు స్థాపించా లనుకుంటూ గ్రామాల్లో ఉన్న కారణంగా ఏ మార్గమూ లేదని నిరుత్సాహ పడుతున్న వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమా లను, మెంటార్షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది ఔత్సాహిక గ్రామీణ ప్రాంతాల మహిళలకు శిక్షణనిస్తున్నారామె. హైదరాబాద్ బోరబండలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అసలామెకు ఈ ఆలోచన రావడానికి గల కారణాలేమిటో వివరించారు. అవి ఆమె మాటల్లోనే... ‘‘మాది చాలా సింపుల్ బ్యాక్‌గ్రౌండ్. నాన్న హైదరాబాద్, ఎల్ఐసీలో చేసేవారు, అమ్మ గృహిణి. అమ్మ పూర్తిగా గ్రామీణ నేపథ్యం, చదువుకోలేదు. కానీ ఆమె ఆలోచనలు, లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉండేవి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలనే పట్టుదలతో ఉండేది. నాన్న కూడా ఆడపిల్లలు అనే ఆంక్షలు లేకుండా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. దాంతో నాకు అమ్మాయి అనే కారణంగా పరిమితులు తెలియదు. సమాజం చిన్న చట్రంలో ఇమిడి ఉందనే విషయం కూడా ఇంజినీరింగ్‌లో సీటు దగ్గరే మొదటిసారిగా తెలిసింది. ఇంజినీరింగ్ సీటు ఆడపిల్లలకు ఇస్తే ఆ సీటు వేస్టవుతుందనే అపోహ ఉండేదప్పట్లో. బెంగళూరులో రెండేళ్లు ఉద్యోగం చేసి, తిరిగి హైదరాబాద్‌కి వచ్చి 1989లో సొంత ఇండస్ట్రీ పెట్టాను. తర్వాత యూఎస్‌కి వెళ్లి ఎనిమిదేళ్లు ఐటీ ఇండస్ట్రీ నడిపించాను. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమ స్థాపించాను. మా కెన్రా టెక్నాలజీస్ ఇప్పుడు రక్షణ రంగానికి హై క్వాలిటీ పవర్ సప్లయ్ సిస్టమ్స్, లాండ్ బేస్డ్, ఎయిర్ బోర్న్, నావల్ ప్రాజెక్ట్‌లకు అవసరమైన పరికరాలను అందిస్తోంది. ఈ స్థాయికి చేరడానికి ఎంతగా శ్రమించానో నాకు తెలుసు. అందుకే పారిశ్రామిక రంగంలోకి రావాలనుకునే మహిళల కోసం ఒక వేదిక ఉంటే బావుంటుందని భావసారూప్యం కలిగిన అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనతో 2004లో మొదలైంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (కోవె). విస్తరించిన ‘పౌష్టిక్’ కోవె దేశవ్యాప్తంగా 13 వందలకు పైగా సభ్యులతో 11 చాప్టర్స్తో పని చేస్తోంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలకే పరిమితమై పని చేసింది. గ్రామీణ, పట్టణాల్లో ఉండే మహిళలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో జిల్లాలకు విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టాం. ఇందుకోసం ‘పౌష్టిక్’ అనే కార్యక్రమాన్ని రూపొందించాం. మహిళలు పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇంట్లోనే వండి, పోటీలు జరిగే ప్రదేశానికి తెచ్చి ప్రదర్శించాల్సి ఉంటుంది. తెలంగాణలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి. ఏపీలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, వైజాగ్‌లో నిర్వహించాం. ఆహారంతో మొదలుపెట్టడంలో మా ఉద్దేశం మహిళలకు పోషకాహారం ఆవశ్యకతను గుర్తు చేయడం, అందరికీ తెలిసిన ఆహారం నుంచి ఉపాధికి మార్గం వేసుకోవడం ఎలాగో నేర్పించడం అన్నమాట. మహబూబ్ నగర్ లో ఈ కార్యక్రమం రేపు ఉంది. ప్రతిచోటా వంద మంది వరకు పాల్గొంటున్నారు. పోటీల్లో గెలిచిన వాళ్లకు పోషకవిలువల గురించి వివరించగలగడం, ప్యాకేజింగ్, షెల్ఫ్‌లైఫ్‌ను అంచనా వేయడం వంటి అంశాల్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్లంతా అక్టోబర్ లో జరిగే లైవ్ కిచెన్ పోటీలో పాల్గొనాలి. ఈ పోటీల్లో గెలిచిన మహిళల్లో దాదాపుగా అందరూ సొంత పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వస్తారని నమ్మకం. అందిపుచ్చుకోండి కోవెని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా, శ్రీలంక, ఈజిప్టు వంటి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆర్గనైజేషన్లతో అనుసంధానం చేశాం. సాధారణంగా పరిశ్రమ అనగానే మధ్యతరగతి మహిళలను అనేక రకాల భయాలు వెంటాడుతుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, కంపెనీ రిజిస్ట్రేషన్ వంటి ప్రక్రియల దగ్గరే వెనక్కిపోయేవాళ్లూ ఉంటారు. మహిళలకు తోడుగా ఈ పనులకు తిరగడానికి ఇంట్లో మగవాళ్లు మొదట విసిగిపోతారు. అలాంటప్పుడు ఆడవాళ్లలో ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోతుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కోవెలో పరిశ్రమ స్థాపన, నిర్వహణకు అవసరమైన రిజిస్ట్రేషన్, ఐటీ ఫైలింగ్, మార్కెటింగ్ సర్వీస్‌లన్నీ అందిస్తున్నాం. యంత్ర పరికరాలు అవసరమయ్యే పరిశ్రమల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యంతో ఇన్క్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేశాం. పరిశ్రమ పెట్టాలనుకునే మహిళ తొలిదశలోనే పెట్టుబడి కోసం ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు, మేము ఏర్పాటు చేసిన ఇన్ క్యుబేషన్ సెంటర్లో పని మొదలుపెట్టి, తన మీద తనకు నమ్మకం కుదిరిన తర్వాత యంత్రాలు కొనుక్కుని సొంత పరిశ్రమ ప్రారంభించవచ్చు. ఈ సౌకర్యాలను అందిపుచ్చుకోండి’’ అని ఔత్సాహిక మహిళలకు పిలుపునిచ్చారు సంధ్యారెడ్డి. – వాకా మంజులారెడ్డి, ఫొటో: గడిగె బాలస్వామి అవకాశాలు విస్తరించాలి! పౌష్టిక్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మహిళల్లో రాజమండ్రి వాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలామంది ఇప్పటికే ‘ఫుడ్ ఇండస్ట్రీ లైసెన్స్ కోసం ఎలా అప్లయ్ చేయాలి’ వంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో వాళ్ల సందేహాలను తీరుస్తున్నాం. ఏపీలో ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే... మా తరంలో ఇన్ని అవకాశాల్లేవు. ఒక మహిళ పారిశ్రామిక వేత్తగా నిలదొక్కుకోవడం చాలా కష్టమయ్యేది. అనేకమంది ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎదురీదలేక ఆగిపోయిన వాళ్లూ ఉన్నారు. నగరాల్లోనే ఇలా ఉంటే ఇక గ్రామాలు, పట్టణాల మహిళలకు ప్రయత్నం చేసే అవకాశం కూడా తక్కువే. అందుకే వాళ్ల చేత ఒక అడుగు ముందుకు వేయించాలనేదే కోవె సంకల్పం. – సంధ్యారెడ్డి కేశవరం -
పుష్ప.. 66 వయసులోనూ తగ్గేదేలే..!
‘వయసు అనేది అంకె మాత్రమే’ అనడం చాలా తేలిక. వయసును సవాలు చేయడం మాత్రం కష్టం! ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది పుష్ప భట్. 66 సంవత్సరాల వయసులో వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రామారథాన్లో పాల్గొనబోతుంది... మరో రెండురోజుల్లో ‘వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రా మారథాన్ ఖార్దుంగ్ లా ఛాలెంజి’లో పాల్గొనబోతోంది 66 సంవత్సరాల పుష్పభట్. ముంబైకి చెందిన పుష్ప 63 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఈ సాహసోపేత మారథాన్‌లో పాల్గొంది. ‘ఇలాంటి మారథాన్‌లో పాల్గొనడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. సంకల్పబలం కూడా ఉండాలి’ అంటుంది పుష్ప. తాను పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. చదువు కొనసాగించడానికి పదిహేడేళ్ల వయసు నుంచి చిన్నాచితకా పనులు చేస్తుండేది. ‘బీఏ పూర్తి చేయగలనా?’ అనుకుంది. చేయడమే కాదు ఆ తరువాత ఎంబీయే కూడా చేసింది. ఒక కంపెనీలో సెక్రెటరీగా చేరింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒక షిప్పింగ్ కంపెనీలో ఎక్కువ జీతంతో చేరింది. ఆ తరువాత... ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కోరికతో యాభై ఏళ్ల వయసులో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో... స్టాండర్డ్ చార్టెడ్ ముంబై మారథాన్‌లో పాల్గొనడానికి సహా ఉద్యోగులు ఉత్సాహం చూపుతున్న సమయంలో తాను కూడా చూపింది. ‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అనుకుంటూ నలభైఏడు సంవత్సరాల వయసులో తొలిసారిగా మారథాన్‌లో పాల్గొంది. ‘మనవల్ల ఎక్కడవుతుంది. మహా అంటే పదిహేను నిమిషాలసేపు పరుగెత్తగలనేమో’ అనుకుంది. కష్టం అనిపించినా సరే, పట్టుదలగా పరుగెత్తి మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలోనే పరుగెత్తడంలో ఉన్న కష్టం ఏమిటో పుష్పభట్కు తెలిసింది. అయితే ‘మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగాను’ అనే ఉత్సాహం ఆ కష్టాన్ని వెనక్కి నెట్టేసింది. ఇక అప్పటి నుంచి ఎనిమిది ఆల్ట్రా మారథాన్స్, పదకొండు ఫుల్ మారథాన్లలో పాల్గొంది. న్యూయార్క్ మారథాన్‌లో పాల్గొనడం తనకు మరచిపోలేని అనుభవం. బ్రిడ్జీలు, జనసమూహాలను దాటుకుంటూ 4 గంటల 58 నిమిషాలు పరుగెత్తింది. ప్రయాణాలు చేయడం, ప్రయాణంలో స్ఫూర్తిదాయకమై పుస్తకాలు చదవడం, తన భావాలను కవిత్వంగా రాయడం పుష్పకు ఇష్టం. ఒకానొక సంవత్సరం ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి లడఖ్‌లోని ఖార్దుంగ్ లా పాస్‌కు వెళ్లింది. అప్పుడే ‘ఖార్దుంగ్ లా ఛాలెంజ్’పై ఆసక్తి కలిగింది. ‘ఇక్కడ శ్వాసించడానికే ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఈ రఫ్ అండ్ టఫ్ మార్గంలో పరుగెత్తగలనా’ అనుకుంది. శిక్షణ తీసుకున్న తరువాత బరిలోకి దిగింది. మసక మసకగా కనిపించేదారి, జారుతున్న కాళ్లు... చాలా కష్టపడాల్సి వచ్చింది. తాను గతంలో పాల్గొన్న మారథాన్లకు, సముద్ర మట్టానికి 17,852 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో జరిగే మారథాన్‌కు మధ్య ఉన్న భారీ తేడాను గమనించింది. అమెరికన్ కాలేజి ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్స్ పూర్తి చేసి 65 సంవత్సరాల వయసులో ‘క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్’ అనిపించుకుంది. మరింత ఉత్సాహంతో రెండోసారి ‘ఆల్ట్రా మారథాన్ ఖార్దుంగ్ లా ఛాలెంజ్’లో పాల్గొనబోతుంది. పుష్పభట్ మరోసారి అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుందాం. సుఖంగా అనిపించే పనుల్లో కంటే, కష్టంగా అనిపించే పనుల ద్వారానే మనకు క్రమశిక్షణ అలవడుతుంది. క్రమశిక్షణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. – పుష్ప భట్ -
నా పేరు జోన్ జండాయ్; అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..
నేను నా జీవితంలో పొందే అతి కొన్ని చిరాకులతో పాటు అత్యంత ఎక్కువ సంతోషాన్ని ఎప్పుడూ పొందుతూనే ఉన్నాను. నిన్నటి నా జీవితం నాకు జోన్ జండాయ్ ని బహుమతిని చేసింది. తెలుసుకున్న కొద్ది జీవితాన్నిమరింత సంతోషంలో ముంచెత్తే సాధారణ జీవన దూత ఈయన. జోన్ జండాయ్ ఒక రైతు, థాయ్‌లాండ్‌లో కెల్లా అత్యంత సంతోషకరమైన వ్యక్తి గా ప్రపంచం ఈయనను తెలుసుకుంది. జోన్ జండాయ్ థాయ్‌లాండ్‌లోని యాసోథార్న్ రాష్ట్రానికి చెందినవారు. ఈయన వ్యవసాయం చేస్తారు. ఇంకా మట్టి గృహాలను నిర్మిస్తారు. 2003 లో పన్ పన్ అనే విత్తన సంరక్షణ సంస్థను స్థాపించారు. జోన్ జోండాయ్ చేసిన ఒక ప్రసంగ పాఠాన్ని విని ఎంత సంతోష పడ్డానో మాటల్లో చెప్పలేక ఈ ఆనందాన్ని నలుగురితో పంచుకోడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ వ్యాస రూపం. - అన్వర్ జీవితంలో నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది, ఎప్పటికి చెప్పగలిగేది ఒకే ఒక మాట ఉంది. అది ఏమిటంటే " Life Is Simple". అవును జీవితం అత్యంత సులభమైనది, సరదా అయినది. "జీవితం సులభం" అనే సులభతరమైన విషయం తెలుసుకోవడం మాత్రం నాకు అంత సులభంగా జరగలేదు. నేను ఇంతకు మునుపు బ్యాంకాక్‌లో ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు నా జీవితం చాలా కష్టంగా, చాలా చాలా సంక్లిష్టంగా ఉండేది. "జీవితం సులభం" అనే విషయం గురించి నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించడానికి సమయం కూడా నాకు అప్పుడు లేదు. నా పేరు జోన్ జండాయ్. నేను ఈశాన్య థాయ్‌లాండ్ ప్రాంతంలోని ఒక చిన్నగ్రామంలో జన్మించాను. నా చిన్నప్పుడు మా ఊరు, ఆ వాతావరణం, గాలి, మాట, వెలుతురు, పలకరింపు.. ప్రతీది సరదాగా, సులభంగా ఉండేది. అప్పుడు జీవితం సహజంగా ఉండేది కాబట్టి జీవితం అనేది సులభం అనే ఎరుక నాకు అప్పుడు లేదు. అత్యంత సహజమైన మానవ జీవితపు లక్షణాలు ఎప్పుడు ప్రత్యేక ఎరుక అయి ఉండవు కదా. ఒక రోజు మా ఊరికి టెలివిజన్ వచ్చింది. ఆ టీవి తో పాటు దానికి తీసుకు వచ్చిన పట్నవాసపు మనుషులూ వచ్చారు. ఆ యంత్రం, దానిని నడిపేవారు ఇద్దరూ కలిసి మాకు మునుపు తెలియని, ఆలోచించని, అసలు ఆ జ్ఞానమే లేని ఒక కొత్త మాట మాకు నేర్పారు "ఒరే! నాయనా మీరు మీరు కడు పేదవారు, కటిక దరిద్రులు. మీ జీవితాంతం వరకు మీరు ఇలా దరిద్రపు గొట్టుగా ఉండనక్కర లేదు. మీరు మేల్కోవాలి. మీ జీవితంలో విజయాన్ని వెంబడించాలి, విజయం యొక్క అయిదు మెట్లు ఎక్కాలి. ఆ అయిదు మెట్లు ఎక్కడానికి మీరు బ్యాంకాక్ వెళ్లాలి" అని చెప్పారు. (నేను మా నూనెపల్లె నుండి హైద్రాబాద్ వరకు దేకినట్లు అన్నమాట) కాబట్టి నేను బ్యాంకాగ్ వచ్చాను, నేను కడు దరిద్రుడిని అని తెలుసుకోడం నాకు ఎంతో చెడుగా అనిపించింది. నేను కటిక పేదరికం వాడిని అని తెలుసుకోడం నా మనసుకు భరించరాని కష్టం వేసింది. కాబట్టి ఎట్టి పరిస్తితుల్లో నేను బ్యాంకాక్‌కు వెళ్లాలి విజయం సాధించాలి. నేను బ్యాంకాక్‌కి వెళ్ళాలని నిర్ణయించుకోవడం.. అక్కడికి చేరుకోవడం అప్పుడు నాకు చాలా గొప్పగా, గర్వంగా ఉండిది. మనం చాలా నేర్చుకోవాలి, గొప్ప చదువు చదువుకోవాలి మరియు చాలా కష్టపడాలి. అలా చేస్తూ ఉంటే ఆ పై మీరు విజయం సాధించవచ్చు అనే మాటలు పదే పదే నా చెవుల్లో ధరించిన నిత్య మంత్రాలు అయ్యాయి. అందుకని నేను చాలా కష్టపడటం ప్రారంభించాను. రోజుకు ఎనిమిది గంటలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండేవాన్ని. అంత కష్టపడి పని చేసి చివరికి నేను భోజనానికి సంపాదించుకున్నది కేవలం ఒక కప్పు నూడుల్స్ మాత్రమే. లేదా గిన్నెడు ఫ్రైడ్ రైస్. ఇంకా బ్యాంకాగ్ లో నేను నివసించిన గది ఎలా ఉండేది అనుకున్నారు! అది చాల చెడ్డగా ఉండేది. మహా మురిగ్గా ఉండేది. భరించలేనంత వేడిగా ఉండేది . ఆ వేడితో పాటు నాతో పాటు ఆ గది పంచుకుని ఉన్న చాలా మంది ఊపిరి వేడి . ఇటువంటి పరిస్తితుల మధ్య నేను ఇంకా చాలా తీవ్రంగా కష్టపడటం మొదలుపెట్టాను. నాకు అప్పుడు ఓ అనుమానం కలిగింది. కష్టపడి పని చేయడం అనే సూత్రం వెనుక ఏదో తేడా ఉందని నాకు అనిపిచింది. నేను ఇంత కష్టపడి పనిచేస్తూ పోతున్న కొద్దీ నా జీవితం సులువు కావాలి కదా! కానీ ఇంకా ఎందుకు కష్టతరమవుతుంది? గిన్నెడు అన్నం, కాళ్ళు చాపుకోడానికి తగినంత స్థలం లేని గది ప్రాప్తం అవుతుంది ఎందుకని? కాబట్టి ఎక్కడో ఏదో తప్పుగా ఉండాలి. ఎందుకంటే నేను కష్టపడి పని చేసి చాలా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాను కానీ నేను వాటిని నా వినియోగం కోసం పొందలేను. నేను సంపాదించే డబ్బుతో అవేమి కొనగలిగే శక్తి నాకు సమకూరడం లేదు. ఒక్క వళ్ళు వంచి పని చెయ్యడమే కాదు, నేను బుర్రా ఉపయోగించి చదువు, జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. విద్యని అధ్యయనం చేయడానికి ప్రయత్నించాను. నేను యూనివర్సిటీలో చదువుకోవడానికి బయలుదేరాను. కానీ యూనివర్సిటీలో నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చదువుకోవడం అనే పనిని విద్యాలయాలు చాలా బోరింగ్ చేసి పెట్టాయి. నేను ఇక్కడ ఈ చదువుల భవనాల్లోని ప్రతి అధ్యాపకుడిలోను, వారు విశ్వవిద్యాలయంలో బోధించే విషయాలను చూసినప్పుడు, వారిలో చాలామందికి ఉన్నదంతా విధ్వంసక జ్ఞానం. నాకు యూనివర్సిటీలో ఉత్పాదక జ్ఞానం అసలు దొరకలేదు. ఒక ఆర్కిటెక్చర్ లేదా ఇంజినీర్ కావడం అంటే అర్థం ఏమిటంటే.. మీరు ఈ భూమిని, ఈ సహజ సంపదని మరింత, వీలయినంత మరింత ఎక్కువ నాశనం చేసేవారిగా తయారు కావడం. ఈ విధ్వంసక వాస్తువేత్త వ్యక్తులు ఎంత ఎక్కువ తయారు అయితే వారు అంత ఎక్కువ పనిచేసి ఈ భూమి మీది, పర్వతాలు, నదులు, అడవులు మరింత నాశనం చేయడమే అన్నమాటే. ఈ పచ్చదనాన్ని, ఈ సహజ వర్ణాలని తమ బూడిదరంగు మెదడుల న్నుండి బయటికి తీసిన జ్ఞానంతో కొలతలు వేసి ఈ ప్రపంచమంతా కాంక్రీట్ నింపడం. కనుచూపు మేర అంతా బూడిద రంగు, బూడిద రంగు బిల్డింగులు, బూడిద రంగు రోడ్లు, బూడిదరంగు ఆకాశం, బూడిద రంగు జ్ఞానం.. భూమికి బూడిద రంగు కట్టడపు పన్ను, చెరువులోని నీటికి ఇంటి ట్యాంకర్ లలో బంధించిన పన్ను. వ్యవసాయానికి పురుగు మందుల విషపు పన్ను. జీవితం చాలా కష్టంగా ఉంది నేను నిరాశకు గురయ్యాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను, నేను అసలు బ్యాంకాక్‌లో ఎందుకు ఉండాలి? నా చిన్నప్పుడు మా పల్లెలో ఎవరూ రోజుకి ఎనిమిది గంటలు పని చేయడం నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ప్రతి ఒక్కరూ రోజుకు రెండు గంటలు, సంవత్సరానికి కేవలం రెండు నెలలు పనిచేశారు, ఒక నెలలో వరినాట్లు నాటడం, మరో నెలలో వరి కోయడం అనేదే పని. మిగిలినది అంతా ఖాళీ సమయం, పది నెలల ఖాళీ సమయం. అందుకే మా థాయ్‌లాండ్‌లో ప్రజలు చాలా పండుగలను కలిగి ఉన్నారు. ప్రతి నెలా మాకు ఒక పండుగ ఉంటుంది. ఎందుకంటే జీవితం గడపడానికి, జీవితాన్ని పండగ చేసుకొడానికి అక్కడ చాలా ఖాళీ సమయం ఉంది. జీవితం పండగ కావడం కన్నా జీవితం మరింకేం కోరుకుంటుంది? అక్కడ రాత్రి పూటే కాదు మధ్యాహ్నపు భోజనం ముగించి ప్రతి ఒక్కరూ కూడా నిద్రపోతారు. (మా నూనెపల్లెలో వర్షాలు పడే రాత్రిళ్ళు తప్పనిస్తే, మేము ఎప్పుడూ ఇంటి గోడల మధ్యనో, తడికల మధ్యనో నిద్ర పోయిందే లేదు. నిద్ర అంటే అంతా మా ఊరి రోడ్ల మీదే, రాత్రుల్లు మా ఊరి దారులన్ని మంచాలు మొలిచిన పొలాల్లా ఉండేవి. ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు అయితే అర్ధరాత్రి ఊరి సెంటర్ లో టీ తాగడానికి అని పోతూ పోతూ తన ఇంటి రోడ్డు ముందు నిద్రపోతున్న మనిషిని మంచంతో సహా లేపుకు వెళ్ళి మరో ఇంటిముందు దింపేవాళ్ళం, కొంటెగా. ఆ ఇంటి ముసలమ్మ మా ఇంటి ముసలమ్మతో రాత్రంతా కబుర్లు చెప్పుకోడానికి మనవడితో మంచం మోపించుకు వచ్చి ఈ మంచం పక్కన ఆ మంచం కుదిర్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయేవారు. పిల్లలూ అంతే చంకలో దుప్పటి దిండు పెట్టుకుని పక్కింటి నేస్తుడితో మహా మహా ముచ్చట్లు ఆడటం లేదా రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం వింటూ అక్కడే బజ్జోడం. అర్థరాత్రి దాటాకా మనుషులు, మంచాలే కాదు మా ఊరి రహదారులూ, జట్కా బళ్ళు, సైకిల్ రిక్షాలు అన్నీ నిద్ర పోయేవి. కేవలం కీచు రాళ్ళ చప్పుడు, లేదా అప్పుడప్పుడు కప్పల బెకబెకలు. ఇప్పుడు రోడ్డులకు అసలు నిద్ర లేదు. రోజుకు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక బండి గాన్లు దాన్లను తొక్కుతూనే పోతుంటాయి. హారన్లు రోడ్డులను దోమల్లా కుడుతూనే ఉంటాయి) మధ్యాహ్న భోజనానంతర నిద్ర మేల్కొన్న తర్వాత హాయిగా మేం వీధి అరుగులపై కూచుని కేవలం కబుర్లు చెప్పుకుంటాం. ముచ్చట్లు ఆడుకుంటాం. దారిన పోయే అందరి యోగక్షేమాలు విచారిస్తాం "ఏం బ్బా! మీ అల్లుడు ఎలా ఉన్నాడు, మీ భార్య, కోడలు ఎలా ఉన్నారు, మీ కోడి, మేకా ఎలా ఉన్నాయి" ఊళ్ళో జనాలకు ఏం ఉన్నా లేకపోయినా చాలా సమయం ఉండేది. వారికి తమతో తాము ఉండటానికి సమయం ఉంది. తమతో తాము ఉండటానికి సమయం ఉన్నప్పుడు మనిషికి తనను తాను అర్థం చేసుకోడానికి సమయం ఉంటుంది. ప్రజలు తమను తాము అర్థం చేసుకున్నప్పుడు వారు తమ జీవితంలో ఏమి కోరుకుంటున్నారో సులభంగా, స్పష్టంగా గ్రహించగలరు. చాలా మంది ప్రజలు తమకు ఆనందం కావాలి, ప్రేమ కావాలి.. తమ జీవితాలను హాయిగా సంపూర్ణంగా ఆస్వాదించాలని కోరుకుంటారు, తీరిక, తీరుబడి ఉన్న ప్రజలు తమ జీవితంలో చాలా అందాలను చూస్తారు కాబట్టి వారు ఆ అందాన్ని అనేక విధాలుగా వ్యక్తం చేసేవారు. కొంతమంది హాయిగా ఇంటి బయట కూచుని తమ కత్తి పిడిని నునుపు చేసుకునే వారు, వాటిపై బొమ్మలు చెక్కేవారు, బుట్టా, గంప చక్కగా అల్లుకునేవారు, తడికలకు, చాటలకు కాగితపు గుజ్జు పసుపు అలికేవారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదు. ప్రజలు ప్రతి చోటా ప్లాస్టిక్‌ని ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ పీలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ జీవితంలో ఏదో తప్పు ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నేను ఈ విధంగా జీవించలేను కాబట్టి నేను యూనివర్సిటీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకని తిరిగి నా చిన్న ఊరికి తిరిగి వెళ్ళాను. నేను ఇంటికి తిరిగి వచ్చి నేను చిన్నతనంలో ఉన్నట్లుగా, నాకు గుర్తుండేలా జీవించడం మొదలుపెట్టాను. నేను ఇక్కడ సంవత్సరానికి రెండు నెలలు పని చేయడం ప్రారంభించాను. వ్యవసాయంలో నాకు నాలుగు టన్నుల బియ్యం వచ్చింది. మేము మొత్తం మా కుటుంబంలో ఉన్నది ఆరుమందిమి. మేమంతా కలిపి సంవత్సరానికి అర టన్ను కంటే తక్కువ తింటాము. కాబట్టి మిగిలిన బియ్యాన్ని అమ్మవచ్చు. ఇంకా నేను రెండు చిన్న చేపల చెరువులు తీసుకున్నాను. మాకు ఏడాది పొడవునా తినడానికి హాయిగా చేపలు ఇక్కడ దొరుకుతాయి. అంతే కాక నేను నాకున్న అర ఎకరం కంటే తక్కువ చిన్న స్థలంలో ఒక చిన్న తోటను కూడా వేసాను. తోట పని కోసం రోజుకు 15 నిమిషాలు గడుపవలసి వస్తుంది. నేను ఈ తోటలో 30 కంటే ఎక్కువ రకాల కూరగాయలను పండిస్తున్నాను. అన్ని కూరగాయలను మేం ఆరుగురం ఎట్లాగో తినలేం కాబట్టి మాకు కావలసినవి కొన్ని ఉంచుకుని మిగతా వాటిని మార్కెట్లో అమ్మడం వల్ల కొంత ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. జీవితం ఇక్కడ చాలా సులభం. నేను ఏడేళ్లపాటు బ్యాంకాక్‌లో ఉండాల్సి వచ్చింది. గంటల తరబడి కష్టపడి పని చేశాను, అంత కష్టపడి పని చేసినా సంపాదించుకున్నది తినడానికి సరిపోలేదు.. కానీ ఇక్కడ, సంవత్సరానికి రెండు నెలలు మరియు రోజుకు 15 నిమిషాలు మాత్రమే పనిచేసి నేను ఇంట్లో ఆరుగురికి ఆహారం ఇవ్వగలను. జీవితం అంటే సులువుగా ఉండటం. ఇంకో ముఖ్యమైన విషయం. చిన్నతనంలో స్కూల్లో ఎప్పుడూ మంచి గ్రేడ్ సాధించని నాలాంటి తెలివితక్కువవారికి జీవితంలో ఇల్లు అనేది రాసిపెట్టి ఉండదని నేను అనుకున్నాను. నేనే కాదు ఇది చాలామంది అభిప్రాయం కూడా. ఎందుకంటే నాకంటే తెలివైనవారు, ప్రతి సంవత్సరం క్లాసులో నంబర్ వన్ అయిన వారు మంచి ఉద్యోగం పొందుతారు. మంచి ఉద్యోగం వల్ల మంచి వేతనం లభిస్తుంది. కాబట్టి అటువంటి వారు ఒక స్వంత ఇల్లు పొందడానికి అత్యంత అర్హులు. కానీ నాకు, నావంటి యూనివర్సిటి చదువు పూర్తి చేయలేని వారు కూడా ఒక ఇంటిని కలిగి ఉంటారా? నాలాంటి, తక్కువ విద్య ఉన్న వ్యక్తులకు ఇల్లు అనేది ఒక ఆశాజనకపు ఎప్పటికీ పూర్తి కాని కల. కానీ, ఇక్కడ నా పేద గ్రామంలో నాకడుపుకు, కుటుంబ అవసరాలకు ఆహార ఉత్పత్తి సాధించిన నేను ఇప్పుడు భూసంబంధమైన భవనాలు చేయడం ప్రారంభించాను, ఇళ్ళు కట్టడం అంటారా అది చాలా సులభం అయింది నాకు ఇక్కడ. నేను రోజూ ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, రెండు గంటల సమయం ఇల్లు కట్టడానికి వెచ్చించాను. మూడు నెలల సమయంలో నాకు స్వంత ఇల్లు వచ్చింది. మట్టి, రాయి, గడ్డి, వెదురు కలిస్తే ఇల్లు. నేను చదువుకునేప్పుడు నా క్లాస్‌లో అత్యంత తెలివైన స్నేహితుడు ఒకరు, అతను తన ఇంటిని నిర్మించడానికి నాకు లాగానే మూడు నెలల సమయం తీసుకున్నాడు. ఆ ఇంటికి గృహ సంబంధమైన వస్తు సంచయంతో పాటు అప్పులూ చేయాల్సి వచ్చింది. అతను 30 సంవత్సరాల పాటు తన అప్పు చెల్లించాలి. కాబట్టి, అతనితో పోలిస్తే, నాకు 29 సంవత్సరాల 10 నెలల ఖాళీ సమయం అనేది మిగిలింది. జీవితం అనేది సులభమైనది. ఈ సులభమైన జీవితాన్ని దానిపై అప్పులు, వడ్డీల ఋణం వేసి బరువుగా ఎందుకు బ్రతుకుతున్నాము మనం. నా మొదటి ఇల్లు కట్టేంత ముందు వరకు కూడా అంత తేలికగా, సులువుగా ఒక ఇల్లు నిర్మించవచ్చని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడు కనీసం ప్రతి సంవత్సరం నేను ఒక ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కానీ ఇల్లు మాత్రం నాకు చాలా ఉన్నాయి. సమస్య అల్లా ఈ రాత్రి నేను ఏ ఇంట్లో నిద్ర పోవాలి అనేదే. కాబట్టి, ఇల్లు అనేది ఒక సమస్య కాదు, ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు. మా దగ్గర చిన్న పిల్లలు, 13 సంవత్సరాల వయస్సు వాళ్ళు ఒక పాఠశాల కట్టుకున్నారు. అదీను వారు స్వంతంగా చేసుకున్న ఇటుకలను ఉపయోగించి తరువాత నెలలో ఆ పాఠశాలకు ఒక లైబ్రరీ కూడా. కాబట్టి ఇల్లు కట్టుకోడం పెద్ద విషయం కాదు మమ్మల్ని చూసి ఒక ముసలి సన్యాసిని కూడా ఆమె కోసం ఒక గుడిసెను నిర్మించుకున్నది కాబట్టి జీవితం లాగే, ఇల్లూ కూడా సులభం, మీరు నన్ను నమ్మకపోతే పోనీ, మీరూ ఒకమారు ప్రయత్నించండి. జీవితం అంటే, నివాసం అంటే, హాయిగా బ్రతకడం చాలా సులువు. ఇంటి తరువాత తదుపరి విషయం దుస్తులు. నేను అందగాడిని కాదు కాబట్టి అందంగా కనిపించడానికి ఖరీదయిన దుస్తులు ధరించడం ఒక మార్గం అనిపించింది. బాగా కనిపించడం కోసం. నేను నాకు నచ్చిన ఒక సినీ నటుడిలా దుస్తులు ధరించడానికి ప్రయత్నించాను. అందుకని ఒక జత జీన్స్ కొనడానికికని డబ్బు ఆదా చేయడానికి ఒక నెల బాగా కష్టపడ్డాను. చివరికి ఆ దుస్తులు కొని వాటిని ధరించి అద్దంలో చూసుకుంటూ నేను ఎడమవైపు నుండి కుడివైపుకు తిరిగాను. కుడి నుండి ఎడమవైపుకు మళ్ళాను. అద్దంలో నా చుట్టూ నేను తిరిగాను. నేను చూసిన ప్రతిసారీ నేను ఒకే వ్యక్తిని, ఆ పాత నేనుని మాత్రమే చూసాను. ఒక నెలపాటు చెమట రక్తం ధారవోసి కొన్న అత్యంత ఖరీదైన ప్యాంటు, చొక్కా కూడా నా మొహాన్ని, జీవితాన్ని మార్చలేదు. అద్దంలో కనబడిన నాకు నేను చాలా వెర్రివాడిని అనిపించింది. ఖరీదయిన దుస్తుల కొసం, అత్యంత ఆధునిక పొకడల వస్త్రాల వెంట పరిగెట్టి డబ్బు ఎంతగానయినా కూడపెట్టండి. అది మనల్ని ఏమాత్రం మార్చలేదు. నేను దాని గురించి మరింత తెలుసుకోవడం, ఆలోచించడం మొదలుపెట్టాను. మనం ఎందుకని ఫ్యాషన్‌ని అనుసరించాలి? ఆలోచించిన కొద్ది నాకు జవాబు దొరకలేదు. వంటిని కాపాడటమే దుస్తుల కేవల ఉద్దేశం. ఆ తర్వాత, 20 సంవత్సరాల వరకు, నేను ఏ బట్టలు కొనలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న బట్టలన్నీ ప్రజల నుండి వచ్చినవే ప్రజలు నన్ను సందర్శించడానికి వచ్చినప్పుడు, మరియు వారు ఇక్కడి నుండి వెళ్ళేప్పుడు వారు ఇక్కడ చాలా దుస్తులను వదిలివేస్తారు. కాబట్టి నా దగ్గర ఇప్పుడు టన్నుల కొద్దీ బట్టలు ఉన్నాయి. ఏం చేస్తాం? వద్దనుకున్నవి ఎంత ఉండినా ఏం ప్రయోజనం. ఇలా ఆలోచించినప్పుడు నాకు మరింత స్వేచ్ఛగా అనిపిస్తుంది. అవసరానికి మించి ఏదీ వద్దు అనుకోవడంలో ఉన్నస్వేచ్చ మరి ఎందులో లేదు. ఇక చివరి విషయం ఏమిటంటే, అనారోగ్యం. నేను జబ్బుపడినప్పుడు సంగతి. అప్పుడు ఏమి చేయాలి? నేను నా పాత జీవితాన్ని కొత్త గా మొదలు పెట్టేముందు అంత సులువుగా మొదలు కాలేదు, దాని గురించి చాలా ఆందోళన చెందాను, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, మందు మాకులు, వైద్యం, ఆస్పత్రి.. వీటి ఖర్చులు! నేను దీని గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను, మానవుడికి అనారోగ్యం సాధారణమైనది, అనారోగ్యం అంత చెడ్డ విషయం ఏమీ కాదు. అనారోగ్యం అయింది అంటే దాని అర్థం- మన జీవితాల్లో, మనం గడుపుతున్న జీవిత విధానంలో మనం ఏదో తప్పు చేశామని మన శరీరం మనకు గుర్తుచేసే విషయం. అందుకే మనం అనారోగ్యానికి గురవుతాము. కాబట్టి, నాకు జబ్బు వచ్చినప్పుడు, నేను కాస్త ఆగిపోయి నా దగ్గరకు నేను రావాలి. దాని గురించి కాస్త ఆలోచించాలి. ఇదిగో ఇది నేను చేసిన తప్పు. కాబట్టి ఈ తరహా పని మరలీ చేయరాదు. డబ్బు లేకపోతే ఏవుంది, నన్ను నేను నయం చేసుకోవడానికి నీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. భూమి, దాని మన్ను నన్ను స్వస్థపరచడానికి ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. నాకు ఇది ఆరోగ్య స్వేచ్ఛ లాంటిది అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఉన్న జీవిత విధానంలో స్వేచ్ఛగా ఉన్నాను. నేను దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందను. నాకు భయం తక్కువ, నా జీవితంలో నేను కోరుకున్నది నేను చేయగలను. మునుపు గడిపిన బ్యాంకాగ్ జీవితం నాకు చాలా భయం కల్పించింది, దాని నీడన నేను ఏమీ చేయలేకపోయాను. కానీ, ఇప్పుడు నేను స్వేచ్ఛగా భావిస్తున్నాను, నన్ను నేను ఈ భూమిపై ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా అనుకుంటున్నా, నాలాగా ఎవరూ లేరు, నన్ను నేను ఎవరిలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. విజయానికి అడుగెట్టాల్సిన ఏ మెట్టు వెదకవలసిన అవసరం లేదు. నన్ను పోగొట్టుకుని ఎవరినో ధరించడానికని పూనుకుని అన్వేషణకు బయలుదేరాల్సిన అవసరమూ లేదు. ఆహారం, ఆవాసం, ఆరోగ్యం ఆ తర్వాత ఇక ఏం చేయాలి? నేను బ్యాంకాక్‌లో ఉన్నప్పటి జీవితపు మనస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, నా జీవితంలో అప్పుడు చాలా చీకటిగా అనిపించింది. ఆ సమయంలో చాలా మంది నాలాగే ఆలోచిస్తారని, అలోచిసూ ఉంటారని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కాబట్టి, నావంటి భావసారూప్యత కల వారిమి కలిసి చింగ్ మాయిలో "పన్ పన్ 'అనే కార్యశాలని ప్రారంభించాము (చియాంగ్ మాయి పర్వత ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఒక నగరం.) మా ఆలోచనల ప్రధాన లక్ష్యం కేవలం విత్తనాన్ని సేకరించడమే! విత్తనాన్ని కాపాడటమే.! విత్తనం అంటే ఆహారం, ఆహారం అంటే జీవితం. విత్తనం లేకపోతే, జీవితం లేదు. విత్తనం లేదంటే స్వేచ్ఛ లేదు. విత్తనం లేకపోతే ఆనందం లేదు. ఎందుకంటే మన జీవితం ఆహారం పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని కాపాడటం చాలా ముఖ్యం. అందుకే విత్తనాల పొదుపుపై దృష్టి పెట్టాం. ఇది "పన్ పన్లో "ప్రధానమైనది. విత్తనం తరువాత రెండవ విషయం ఏమిటంటే ఒక కూడిక కేంద్రాన్ని నెలకోల్పడడం. ఇది ఒక అభ్యాస కేంద్రం. ఇదెందుకు అంటే, మనం జీవితాన్ని మళ్ళీ నేర్చుకోవడానికి, జీవితాన్ని సులభతరం చేసుకోడం తెలుసుకోవడానికి అన్నమాట. ఎందుకంటే మనం ఈ జీవితాన్ని వీలయినంత సంక్లిష్టంగా మరియు గొప్ప కంగాళిగా ఎలా గడపాలో నేర్పించాము. దానిని ఇప్పుడు ఆ సంక్లిష్టత బారినుండి విముక్తం చేయాలి. జీవితాన్ని ఎలా సులభతరం చేయవచ్చు? చేయడం సులభం, కానీ ఎలా సులభతరం చేయాలో చెప్పడం మాకు తెలియదు. ఎందుకంటే మనం దానిని విముక్తం చేయడానికి సూత్రాలు సులువుగా దొరకనంత చిక్కుగా చేసాము. గొలుసుల మీద గొలుసులు, ముడుల మీద ముడులు, వస్తువుల మీద వుస్తువులు... చెత్త చేసాము మనం జీవితాన్ని. అందుకని ఇప్పుడు ముడులు విప్పడం నేర్చుకోవడం మొదలుపెడదాము. అందరం కలిసి ఉండడం నేర్చుకుందాము. అన్నిటి నుండి డిస్కనెక్ట్ కావడం నేర్చుకుందాము. మనం సంతోషంగా ఉండాలంటే, మన ఆలోచనా స్వేచ్చ మనకు తిరిగి రావాలి అందుకని మళ్లీ మనతో మనం కనెక్ట్ అవ్వాలి, ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వాలి, మన మనస్సు మరియు శరీరాన్ని మళ్ళీ కలపాలి. జీవితం అనేది సులభం. దానిని చూసి భయపడకండి. వెనక్కి రండి. మొదలు నుండి ఇప్పటి వరకు, నేను నేర్చుకున్నది నాలుగు ప్రాథమిక అవసరాలు: ఆహారం, ఇల్లు, బట్టలు మరియు వైద్యం. ఈ నాలుగు- ప్రపంచంలో అందరికి చౌకగా మరియు అందుబాటులోకి సులభంగా ఉండాలి. నాకరికత అంటే అర్థం అదే. కానీ మనం వందలూ, వేలు కాదు ఈ కేవల నాలుగు సంఖ్హ్యల విషయాలను పొందడానికి ఈ భూమి మీద నివసించే అనేక మందికి కష్టతరం చేసి పెట్టాము. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏ విధంగా నాగరికమైనదో దానిని చూసి మనం ఎలా గర్వంగా పడగలమో నాకు తెలియడం లేదు. ఈ భూమిపై ఇప్పుడు ఉన్నది అత్యంత నాగరికమైన యుగం అని భావించేవారు ఉన్నారు. భూమిపై చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మన దగ్గర మహా మహా విశ్వవిద్యాలయాల చదువు పూర్తి చేసిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ భూమిలో అసాధారణమైన అత్యంత తెలివైన వ్యక్తులు ఉన్నారు. మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు.. ఒక్కరని కాదు, రకరకాలు. కానీ, జీవితం ఎలా ఉంది అంటారు? కష్టంగా ఉంది కష్టాతి కష్టంగా ఉంది. ఇంత కష్టం మనం ఎవరి కోసం పడుతున్నట్టు? దేనికోసం పరిగెడుతున్నట్లు? ఈ నడుస్తున్న జీవన వ్యాకరణం తప్పు అని నాకు అనిపిస్తోంది, ఈ తరహా జీవన విధానం సాధారణమైనది కాదు, ప్రాకృతమైనది కాదు. కాబట్టి, నేను దానినుండి సాధారణ మానవ స్థితికి రావాలనుకుంటున్నాను. మనిషి ఒక సాధారణత్వానికి మరలిపోవాలి. అతను జంతువులతో సమానంగా ఉండాలి. అవును మీరు సరిగా చదివారు. జంతువులతో సమానంగా పక్షులు ఒకటి లేదా రెండు రోజుల్లో గూడు కట్టుకుంటాయి. ఎలుక ఒక్క రాత్రిలో తన నివాస రంధ్రం చేస్తుంది. కానీ సృష్టిలో మనలాంటి తెలివైన మనుషులు ఒక ఇంటి కోసం 30 సంవత్సరాలు గడుపుతారు. అప్పులు చేసి మరీ జీవితాన్ని క్లిష్టతరం చేసుకుంటారు. ఇంత కష్టమైన జీవితంలో కూడా ఈ భూమి మీద వసించే చాలామంది వ్యక్తులకు తమ జీవితంలో ఒక ఇంటిని కలిగి ఉంటారని నమ్మలేము. కాబట్టి ఇదంతా తప్పు జరుగుతుంది. మనం మన ఆత్మను ఎందుకు నాశనం చేసుకుంటున్నాము? మనం మన సామర్థ్యాన్ని ఎందుకు అంతగా నాశనం చేసుకుంటున్నాము? ఈ ఆలోచనలో నన్ను నేను వెదుక్కుంటూ వెనక్కి వచ్చాను. నేను ఒక సాధారణుడ్ని అయ్యాను అనుకుంటున్నాను. మీరంతా సాధారణ మార్గంలో అనుకునే ఒక అసాధారణమైన రీతిలో జీవిస్తున్నారు. మీకు తెలియదు, మీకు మీ గురించి ఆలోచించే సమయం, స్వేచ్చ లేదు. నిజానికి ఇప్పుడు ఈ రోజు నేను సాధారణంగా ఉండటానికి, మామూలుగా బ్రతకడానికి, సహజంగా ఉండేలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రజలు నన్ను ఒక అసాధారణ వ్యక్తి అనుకుంటున్నారు లేదా పిచ్చివాడు, కానీ అదేమీ నేను పట్టించుకోను. ఎందుకంటే అది నా సమస్య కాదు వారి సమస్య. జీవితం నాకు ఇప్పుడు సులభంగా, తేలికగా ఉంది. అది నాకు చాలు. అది నాకు చాలా ఎక్కువ. ప్రజలు ఏమైనా అనుకోవచ్చు. వారు అనుకోడాన్ని, వారి అభిప్రాయాలను మార్చడానికి, నచ్చచెప్పడానికి నేను ఏమీ చేయలేను. నేను చేయగలిగేది ఒక్కటే, నన్ను, నా మనసును మార్చుకోవడం. నా మనస్సును నేనే నిర్వహించుకోవడం. ఎంపిక అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఎన్నిక. మీకు ఏం కావాలో మీరు మీరు ఎంపిక చేసుకోవచ్చు. సులభంగా నుండి కష్టంగా ఉండటానికి ఎంపిక. కష్టంగా నుండి సులభంగాఉండటానికి ఎంపిక, అది మీ పై ఆధారపడి ఉంటుంది. ధన్యవాదాలు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) -
సౌమిత బసు.. వీల్‌చైర్ నుంచి సీఈవో వరకు
జీవితమంటేనే కష్టసుఖాల కలయిక. సాఫీగా ఆనందంగా సాగిపోతున్న ప్రయాణంలో కొన్నిసార్లు తగిలే దెబ్బలు మనిషిని పాతాళంలోకి నెట్టేస్తాయి. నాట్యమయూరిలా నాట్యం చేస్తోన్న సౌమిత బసుని కూడా అనుకోని ఉపద్రవం అథఃపాతాళంలోకి తోసేసింది. అయినా ఆమె ఏమాత్రం అధైర్యపడలేదు. తనకెదురైన చేదు అనుభవాలకు ఏమాత్రం కృంగిపోకుండా, వాటిని ప్రేరణగా తీసుకుని ఏకంగా ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. కోల్‌కతాకు చెందిన చెందిన సౌమిత బసు చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేది. భరతనాట్యం నేర్చుకుని అనేక స్టేజి ప్రదర్శనలతోపాటు, మంచి క్రియేటివ్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎంతో ఆనందంగా సాగిపోతున్న 32 ఏళ్ల సౌమితను 2014లో సోరియాటిక్ ఆర్థరైటిస్ కబళించేసింది. దీంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. క్రమంగా ఆరోగ్యం క్షీణించి ఎనభై శాతం కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైంది. రెండేళ్లపాటు అన్నింటికి దూరంగా అలా పడుకుని ఉండాల్సి వచ్చింది. బట్టలు వేసుకోవాలన్న మరొకరి సాయం తీసుకోవాలి. ఏ పనీ సొంతంగా చేసుకోలే ని పరిస్థితిలో.. అప్పటివరకు తనలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా కోల్పోసాగింది. ఒకరోజు అనుకోకుండా ‘‘నాకు ఈ ఆర్థరైటిస్ వచ్చిన దగ్గర నుంచి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. కానీ పుట్టుకతోనో, ప్రమాదాల వల్లనో అవయవాలు కోల్పోయినవారు సైతం ఇటువంటి ఇబ్బందులే పడుతున్నారు. అలాంటి వారు ఎలా బట్టలు వేసుకుంటున్నారా..’’ అనిపించింది సౌమితకు. అప్పటినుంచి ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపాలని ఆలోచించసాగింది. వీల్‌చైర్ నుంచి సీఈవోగా.. ఒకపక్క తన బట్టలు తను వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మరొకరి సాయం తీసుకోకుండా వేసుకునేలా బట్టలు ఉండాలి. తనలాంటి వాళ్లు సులభంగా వేసుకునే బట్టలు మార్కెట్లో ఏమేం ఉన్నాయా అని వెతకడం ప్రారంభించింది. ఈ వెతుకులాటలో ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్లకు బట్టలు అందించే బ్రాండ్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవికూడా అంత సౌకర్యంగా లేవు అని గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో వికలాంగుల జనాభా శాతం అంత తక్కువేమి కాదు. వీరికి నప్పే బట్టలను డిజైన్ చేయగలిగితే ..వారికి సాయం చేయడంతోపాటు ఆదాయం వస్తుందని గ్రహించి తనకు తెలిసిన వారి దగ్గర కొంత డబ్బుని అప్పుగా తీసుకుని 2020 జనవరిలో తల్లితో కలిసి ‘జైనిక’ బ్రాండ్‌ను ప్రారంభించి స్టార్టప్‌కు సీఈవో అయ్యింది. తన కోసం చేసుకున్నవి.. ప్రారంభంలో సౌమిత తను వేసుకోవడానికి వీలుగా ఉండే వస్త్రాన్ని ఎంపికచేసి, దానితో డ్రెస్‌లు డిజైన్ చేసుకుంది. ఆ డిజైన్లు కస్టమర్లకు నచ్చి తమకూ కావాలని అడగడంతో..వారి కోరిక మేరకు డ్రెస్‌లు రూపొందించి విక్రయించేది. తరువాత ‘‘పూర్తిగా ఒకరిమీద ఆధారపడడం, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎవరి సాయం తీసుకోని వారు, పాక్షికంగా ఇతరుల మీద ఆధారపడే వారు’’ ఇలా కస్టమర్లను మూడు కేటగిరీలుగా తీసుకుని వారి అవసరాలకు తగ్గట్టుగా దుస్తులను డిజైన్ చేస్తోంది. వృద్ధులు, ఆర్థరైటిస్, పార్కిన్సన్స్, ఫైబ్రోమైలాగి, దీర్ఘకాలిక వ్యాధులు, ఆటిజం, మస్తిష్క పక్షవాతం, క్యాన్సర్, ఫ్రోజెన్ షోల్డర్స్ వంటి అనేకరకాల సమస్యలతో బాధపడుతోన్న వారికి జైనిక డ్రెస్‌లను అందిస్తోంది. పిల్లల నుంచి పెద్దవాళ్లదాక.. ప్రత్యేక అవసరాలు కలిగిన స్త్రీ పురుషులకేగాక, పిల్లలకు కూడా జైనిక డ్రెస్‌లను రూపొందిస్తోంది. క్యాజువల్సే కాకుండా, వృత్తిపరమైన డ్రెస్‌లు, కొంచెం కూడా వంగకుండా వేసుకోగల ట్రౌజర్లు, డ్రెస్‌లా కట్టుకునే చీరలు, టాప్‌లు, స్త్రీలు, పురుషులు ధరించే లోదుస్తులు కూడా అందిస్తోంది. జైనిక డ్రెస్‌లు వాడుతోన్న ఎంతోమంది వికలాంగులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయని చెబుతుండడం విశేషం. బహిరంగ ప్రదేశాల్లో వికలాంగులు సైతం టాయిలెట్స్ వాడుకునే విధంగా డ్రెస్‌లు ఇక్కడ లభ్యమవుతున్నాయి. కేవలం ఇరవై ఒక్కవేల పెట్టుబడితో ప్రారంభించిన జైనిక నేడు లక్షల టర్నోవర్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం నలభై ఏళ్ల వయసులో వీల్ చెయిర్లో తిరుగుతూ సౌమిత .. కోల్‌కతాలో ఉన్న తయారీ యూనిట్‌ను మిగతా ప్రాంతాలకు విస్తరించి మహిళలు, వికలాంగులకు ఉపాధి కల్పిచడం, నాణ్యతతోపాటు, పర్యావరణ హితంగా ఉండే డ్రెస్‌లు రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. సెకన్లలో ధరించవచ్చు ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఒక షర్ట్ వేసుకోవాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది. ఇది నా స్వానుభవమేగాక నాలాంటి వారు ఎంతోమంది ఇలానే ఇబ్బంది పడుతున్నారు. నేను డిజైన్ చేసిన షర్ట్ కేవలం తొంబైసెకన్లలో వేసుకోవచ్చు. చీర అయితే ముఫ్పై సెకన్లలోనే కట్టుకోవచ్చు. ఇప్పటి ఫ్యాషన్‌కు తగ్గట్టుగా శరీర తత్వాన్ని బట్టి సౌకర్యవంతంగా... ఫ్యాషన్‌బుల్‌గా ఉండే డిౖజñ న్లను అందుబాటు ధరల్లోనే అందిస్తున్నాను. నా ఆరోగ్యం బాగోనప్పుడు అమ్మే అన్నీ తానై చూసుకుంటూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. – సౌమిత బసు, సీఈవో జైనిక -
ఎమ్మెల్యేగా విశేష సేవలు.. సెంటు భూమి, ఇల్లు కూడా లేని నేత
స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆయన భావాలు చీకటిలో చిరుదివ్వెలు. మనం ఏమి చేశామని కాకుండా.. మనకు ఏమి లాభం అని ఆలోచించే మనుషుల్లో, స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించి చిల్లిగవ్వ ఆశించని మహానుభావుడు. దేశం కోసం పక్కనపెడితే.. ఊరికి కాస్త మంచి చేసినా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ అడుగడుగునా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. ఆయన మిగుల్చుకుంది నాలుగు జతల బట్టలు మాత్రమే. భూమి ఇస్తామన్నా.. ఇల్లు తీసుకోమన్నా.. తృణప్రాయంగా తిరస్కరించిన ఆ దేశభక్తుడు ప్రజల గుండెల్లో తనపేరు చిరస్థాయిగా ఉంటే చాలని కోరుకోవడం చూస్తే ఎలాంటి వారైనా ‘సెల్యూట్’ చేయాల్సిందే. అచ్చ తెలుగు భారతీయత ఉట్టిపడే పంచె, లాల్చీ ధరించిన.. వయస్సు శత వసంతాలు దాటిన ఆయనతో స్వాతంత్య్రోద్యమ మాట కలిపితే.. ఆ పోరాట పటిమ తూటాలా పేలుతుంది.. ఆ వయస్సులోనూ, ప్రతి మాటలోనూ ‘రాజ’సం ఉట్టిపడుతుంది.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోంది.. భరతమాత ముద్దుబిడ్డగా ఆయన మనస్సు త్రివర్ణ శోభితమవుతోంది. పలమనేరు: ‘‘ప్రభుత్వం నుంచి ఏనాడు ఏమి ఆశించలేదు. ఇప్పుడు నాకు నాలుగు జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు అని స్వాతంత్య్ర సమరయోధులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న(టీసీ) రాజన్ వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ప్రాంతంలోని స్వాతంత్య్ర సమరయోధులు, మృతి చెందిన వారి సతీమణులను సన్మానించే కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు బుధవారం నిర్వహించారు. పలమనేరుకు చెందిన టీసీ రాజన్, దివంగత రామ్మూర్తి సతీమణి జయలక్షుమమ్మకు మేళతాళాలమధ్య ఘనస్వాగతం పలికి వారి అనుభవాలను ఆలకించి ఘనంగా సన్మానించారు. నాటి పరిస్థితులు ఆయన మాటల్లోనే.. నా వయస్సు ఇప్పుడు 104 ఏళ్లు మరో రెండు నెలల్లో 105లో పడతాను. చెవులు సరిగా వినపడవు, కంటిచూపు తగ్గింది. జిల్లాలో బతికున్న ఫ్రీడం ఫైటర్లలో బహుశా నేనే మిగిలానేమో. దేశానికి స్వాతంత్య్రం కోసం నాడు ఎందరో వీరులు పడిన కష్టాలను నేటి సమాజానికి తెలిసేలా ప్రభుత్వం చేస్తున్న మంచి పని ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. ఆపై కొన్ని పార్టీలొచ్చాయి. 1956లో రాజాజీ స్వతంత్ర పార్టీని స్థాపిస్తే అందులో రంగాను జాతీయ అధ్యక్షునిగా నియమించారు. నన్ను చిత్తూరు జిల్లా కార్యదర్శిని చేశారు. 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెనాలిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసి రంగా ఓడిపోయారు. అనంతరం చిత్తూరు ఎంపీగా ఉన్న అనంతశయనం అయ్యంగార్ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ గవర్నర్‌గా నియమించింది. దీంతో ఇక్కడి ఎంపీ స్థానానికి 1962లో ఎన్నిక వస్తే రంగాను స్వతంత్ర పార్టీ ఇక్కడ పోటీలో పెట్టింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాథ రెడ్డిపై 19వేల మెజారిటీతో గెలిచారు. ఈ విజయానికి నేను చేసిన కృషికి మెచ్చి, 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ పలమనేరు అభ్యర్థిగా నన్ను నిలబెట్టింది. ఈ ఎన్నికలో నేను 9వేల మెజారిటీతో గెలిచాను. గ్రామాల్లో తిరిగాను గెలిచిన తరువాత నెలకు 15 రోజులు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొన్నా. ఆ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. రైతులు పండించిన బియ్యాన్ని రవాణా చేయకుండా బెల్ట్ ఏరియాగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఆరేడు చెక్ పోస్టులుండేవి. ఈ సమస్యను అసెంబ్లీలో చర్చించి దాన్ని రద్దు చేయించా. పాలార్ బేసిన్ స్కీమ్ మేరకు నదులపై చెక్‌డ్యామ్‌లు నిషేధం పెట్టారు. దీనిపై పోరాటం సాగించా. ఆ పోరాటం వల్లే రాష్ట్రంలో నదులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. దీనిపై అసెంబ్లీలో చర్చించి అన్ని గ్రామాల్లోనూ వెలుగులు నింపా. ఊరూరా పండగే జెండా పండగ వచ్చిందంటే ఊరు ముందు పచ్చతోరణాలను కట్టి జెండా ఎగురవేసే వాళ్లు. ఆ జెండా ఎగురవేయడం కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. జెండా ఎగురవేసి తరువాత నిర్వహించే సమావేశంలో గ్రామ పెద్దలు, స్వాతంత్య్రం కోసం పాటు పడిన వారు ప్రసంగిస్తుంటే వినేందుకు ఎగబడేవారు. అందరూ తెల్లటి దుస్తులను ధరించి కార్యక్రమానికి వచ్చేవారు. ఊరూరా జెండా పండుగ రోజు స్థానిక ప్రముఖులు, విద్యావేత్తలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేవారు. శాకాహారిని నేను పక్కా శాకాహారిని. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు భోజనంలో తీసుకుంటా. నేను ఇంత ఆరోగ్యంగా ఉండానంటే మా వంశంలోని జీన్స్ కారణమే. మా అక్క 108 ఏళ్లు బతికింది. మా అన్నలు 98 ఏళ్లు బతికారు. ప్రత్యేకంగా నేను ఆహారమేమీ తీసుకోనూ. అయితే మితంగా తింటాను. ప్రస్తుతం బెంగళూరులోని పటేల్ లేఅవుట్, వర్తూర్‌లో కుమారుడి వద్ద ఉంటున్నాను. ఈ దేశమే నాది అయినప్పుడు ఇక ఇల్లెందుకు, పొలమెందుకు.. నేను దేశం కోసమే పుట్టాను. దేశం కోసమే పోరాడాను. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే నజరానాలపై మోజు పడలేదు. స్వాతంత్య్ర పోరాటంలో నన్ను అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినా వెనుకడుగు వేయలేదు. 55 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా సేవలందించా. అప్పట్లో స్వాతంత్య్ర సంబరాన్ని ఊరూరా ప్రజలే స్వచ్ఛందంగా జెండా ఎగురవేసి దేశభాక్తిని చాటుకునేవారు. ఈ దేశం నా కోసం ఏం చేసిందని కాకుండా, నా దేశానికి నేనేం చేయగలనని మాత్రం ఆలోచించాను. ఈ జీవితంలో దేశం కోసం చేయాల్సిందంతా చేశాను. – టీసీ రాజన్, స్వాతంత్య్ర సమరయోధుడు జైల్లోనే పరిచయాలు టెలిగ్రాఫ్లైన్ల (ప్రభుత్వ ఆస్తుల)ను ధ్వంసం చేసిన అభియోగం కింద అప్పటి ఎస్పీ సుబ్బరాయన్ నన్ను మూడు నెలలు రాజమండ్రి జైల్లో పెట్టారు. అదే జైల్లో ఉన్న టీకే నారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రాచకొండ నరసింహులు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. మరింత దేశభక్తి పెరిగింది. అప్పట్లో నరసింహారెడ్డి, సీతారామయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నా. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి వద్దనుకున్నా. తామ్రపత్రమూ వద్దనే చెప్పాను. మాజీ ఎమ్మెల్యేలకు పింఛను వద్దని వ్యతిరేకించాను. ప్రభుత్వం ఇచ్చే 15 ఎకరాల భూమి కూడా తీసుకోలేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలమూ వద్దని చెప్పాను. ఉట్టి అన్నానికి ఉప్పుకూడా ఇచ్చేవారు కాదట గాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిస్తే నా భర్త రామమూర్తి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు టెలిఫోన్ కమ్మీలను కత్తిరించిన కేసులో ఆయన్ను జైలులో పెట్టారు. ఆ సమయంలో ఒట్టి అన్నం మెతుకులు పెట్టారంట. అది తినేందుకు చప్పగా ఉంటుందట. కాస్త ఉప్పు ఇవ్వమని అడిగితే చాలా హింసించేవారని నా భర్త చెప్పేవారు. అలాంటి ఆంగ్లేయుల బానిస సంకెళ్లను తెంచి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులను స్మరించుకోవడం మన ధర్మం. - నాటి స్వాతంత్య్ర సమరయోధులు రామమూర్తి సతీమణి జయలక్షుమమ్మ -
చదువు చెప్పిస్తూ.. భరోసా కల్పిస్తూ .. అంధుల జీవితాల్లో ‘వెలుగు’ రేఖ
ఈ పోటీ ప్రపంచంలో అడుగు తీసి అడుగు వేయాలన్నా ఏదో తెలియని భయం వెనక్కు లాగుతూనే ఉంటుంది. ఆర్థిక స్థోమత.. కుటుంబ నేపథ్యం.. పరిస్థితులు.. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవాంతరం ఉండనే ఉంటుంది. అన్నీ అవయవాలు బాగున్న వాళ్ల పరిస్థితే విజయం, అపజయం మధ్య ఊగిసలాడుతుంటుంది. అలాంటిది అసలు కళ్లే కనిపించకపోతే. అందునా ఎవరి ప్రోత్సాహం లేకపోతే.. లోకులు కాకులైతే.. ఆ జీవితం ‘అంధకారమే’. అదే చీకటి సంధించిన ప్రశ్నలకు సమాధానంగా వేసిన అడుగు.. ఓ అంధుని బంగారు భవితకు బాటగా మారింది. అలాంటి ఎన్నో జీవితాల్లో ‘వెలుగు’లు నింపుతోంది. గూడూరు(తిరుపతి జిల్లా): ఓజిలి మండలం, కురుగొండకు చెందిన బచ్చల సుబ్బారెడ్డి, సుదర్శనమ్మల రెండో సంతానం శివకుమార్‌రెడ్డి. ఐదేళ్ల వయసులోనే చూపు మందగించింది. క్రమంగా అంధత్వానికి దారితీసింది. విధి ఆ చిన్నారికి చూపు లేకుండా చేసిందే కానీ.. ఆ వయస్సులోనే విద్యపై చిగురించిన ఆసక్తిని తుడిచేయలేకపోయింది. కళ్లే కనిపించని పిల్లాడికి చదువు ఎందుకన్నారు.. ఇంట్లో వాళ్ల మెదళ్లలోనూ ఆ విషబీజం నాటుకుంది. ఆ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం అండగా నిలిచింది. చదువుకుంటేనే తాను సమాజంలో నిలదొక్కుకోగలననే విషయం అర్థమైంది. అలా మొక్కవోని దీక్ష తోడు కావడంతో పదో తరగతి వరకు వెంకటగిరిలో.. ఆ తర్వాత ఇంటర్మీడియెట్, డిగ్రీ తిరుపతి ఎస్వీ ఆర్ట్ కళాశాలలో పూర్తయింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్‌లో ఎంఏ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ మాస్‌కమ్యూనికేషన్ చేసి విమర్శలకు నోళ్లు మూయించాడు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీలతో పాటు డిప్లొమో ఇన్ కమ్యూనికేట్ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ హ్యూమన్ రైట్స్, డిప్లొమో ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పూర్తిచేసి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్నారు. యూజీసీ ప్రతి ఏటా నిర్వహించే మాస్ కమ్యూనికేషన్ పరీక్షను మొదటి ప్రయత్నంలోనే పూర్తి చేసి ఏఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోగా దేశంలోనే ఆ ఖ్యాతి దక్కించుకున్న తొలి అంధ విద్యార్థిగా నిలవడం విశేషం. పది మందికి సహాయపడాలని.. చదువుకుంటున్న రోజుల్లోనే తనలాంటి వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. ఈ కోవలోనే తల్లిదండ్రులు.. సోదరుడు నారాయణరెడ్డి, వదిన లీలావతి సహకారంతో నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొందరు అంధులను చేరదీశాడు. వాళ్లకు చదువు చెప్పిస్తూ బాగోగులు చూసుకున్నాడు. ఇదంతా ఉద్యోగం రాకముందు వచ్చిన ఫెలోషిప్ డబ్బుతోనే సాధించారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం వరించడంతో ఆయన చేరదీసిన అంధుల సంఖ్య కూడా పెరిగింది. అలా ఓ అంధుల పాఠశాలను ఏర్పాటు చేసి సుమారు 40 మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. నిద్రలేని రాత్రులెన్నో.. ఉద్యోగం వచ్చే వరకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఇంట్లో, బయటా వీడేం చదువుతాడు.. దండగన్న వాళ్లే. ఎంతో కుంగిపోయేవాన్ని. విద్యలో రాణిస్తున్న కొద్దీ నా పట్ల అందరి దృక్పథంలోనూ మార్పు వచ్చింది. ప్రోత్సాహం లభించింది. జీవితంలో స్థిరపడాలనే దృఢ సంకల్పం నన్ను విజయతీరాలకు చేర్చింది. ఇప్పుడు నేను మరికొందరికి సహాయం చేసే స్థితిలో ఉండడం గర్వంగా ఉంది. అప్పటి కష్టాలను ఈ జీవితం మరిపిస్తోంది. – శివకుమార్‌రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్, నెల్లూరు రోడ్డు దాటేందుకే గంట.. నేను 2001లో హైదరాబాద్‌లో డిగ్రీ చదివే రోజుల్లో షాపింగ్‌కు వెళ్లా. అక్కడ రోడ్డు దాటేందుకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. సుమారు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులే.. చదువుతో పాటు చదరంగంలోనూ పట్టు సాధించే క్రమంలో ఇతర రాష్ట్రాల్లో పర్యటించా. మూడు పర్యాయాలు జాతీయ స్థాయిలో రాణించా. ఆయా రాష్ట్రాల్లో అంధులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉండటాన్ని గమనించా. అయితే మన రాష్ట్రంలో అంధులు అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులుగానే ఉండిపోతున్నారు. .. ఈ రెండు ఘటనలు నాలో కసిపెంచాయి. ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు మంచి స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత నాలాంటి వాళ్లకు ఉన్నంతలో అండగా నిలవాలనుకున్నా. ఇలాంటి చీకటి జీవితాలకుశివకుమార్ దిక్సూచి ఆయన చలువతోనే.. శివన్న సహకారంతో 9వ తరగతి నుంచి బీకాం వరకు చదువుకున్నా. ఆయనను కలిశాక జీవితంపై నాలో పట్టుదల పెరిగింది. ఆ కసితోనే ఎల్ఐసీలో ఏఓగా(అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) ఉద్యోగం సాధించా. ఇప్పుడు నా జీతం రూ.80వేలు. నా కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇదంతా ఆయన చలువే. – బి.సురేష్, గుడినరవ, ఉదయగిరి మండలం కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో.. నాకు ఐదేళ్ల వయసు నుంచి శివన్నే చదివిస్తున్నారు. ప్రస్తుతం బీకాం రెండో సంవత్సరం. మొదటి సంవత్సరంలో 9.3 గ్రేడ్ వచ్చింది. బాగా చదవి అన్నకు మంచి పేరు తీసుకొస్తా. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. – యనమల జీవిత, ముత్యాలపాడు, చిల్లకూరు మండలం భుజం తట్టండి.. చూపు లేకపోవడం మా తప్పు కాదు. అంత మాత్రాన సమాజం మమ్మల్ని చులకనగా చూడటం సరికాదు. ఇలా చేయడం మమ్మల్ని ఎంతగానో కుంగదీస్తుంది. శివన్నలా భుజం తట్టి ప్రోత్సహిస్తే మేము కూడా అద్భుతాలు సృష్టిస్తాం. – ఎస్.తరుణ్, కొణిదెల, కర్నూల్ జిల్లా -
ఆత్మ విశ్వాసంతో ఆడండి..!!
-
వయసు 9.. మొక్కలు నాటడంలో సు'ప్రసిద్ధి'
తొమ్మిదేళ్ల ప్రసిద్ధి సింగ్‌కి ‘డయానా అవార్డ్ 2022’ దక్కింది. ఆ అమ్మాయిని అంతా ‘ఎకో వారియర్’ అంటారు. ‘క్లయిమేట్ ఛాంపియన్’ అని కూడా. ఎందుకు? మొక్కలు నాటుతుంది. చెట్లను పెంచుతుంది. అడవులను నిర్మించాలనుకుంటోంది. ఇప్పటికి 28 పండ్లతోటలు ప్రసిద్ధి ప్రోత్సాహంతో ఊపిరి పోసుకున్నాయి. పచ్చగా లేని ప్రపంచంలో జీవించలేము అంటుంది ప్రసిద్ధి. ఈ వానాకాలంలో ప్రసిద్ధిలా ఆలోచిస్తే నాలుగు మొక్కలు కనీసం కుండీల్లో అయినా పడతాయి. మూడేళ్ల పిల్లలు మట్టితో ఆడుకుంటారు. కాని ప్రసిద్ధి సింగ్ మొక్కలతో ఆడుకుంది. వాళ్ల నాన్న ప్రవీణ్ సింగ్ ఆ పాపను మూడేళ్ల వయసు నుంచే మొక్కలతో పరిచయం చేయించాడు. పాప చేత మొదటగా పెరట్లో నాటించింది ‘మిరప గింజల’ని. అవి మొక్కలుగా ఎదగడం చూసి ఆశ్చర్యపోయింది ప్రసిద్ధి. తండ్రి, కూతురు కలిసి దక్షిణ చెన్నై శివార్లలో ఉండే ‘మహేంద్ర వరల్డ్ సిటీ’లో ఉంటారు. దానికదే ఒక ప్రపంచం. పచ్చగా ఉండేది. అయితే 2016లో అంటే ప్రసిద్ధికి మూడేళ్ల వయసులో వచ్చిన వర్ధా తుఫాను ఆ పచ్చదనాన్ని ధ్వంసం చేసింది. చిన్నారి ప్రసిద్ధి మీద ఆ విధ్వంసం ముద్ర వేసింది. ‘నువ్వు మొక్కలు పెంచాలి. చూడు ఎలా నాశనం అయ్యాయో’ అని తండ్రి చెప్పిన మాట పని చేసింది. అంత చిన్న వయసులో అందరు పిల్లలూ ఆడుకుంటుంటే తనకు చేతనైన మొక్కలు నాటడం మొదలెట్టింది ప్రసిద్ధి. అది మొదలు. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రసిద్ధి ఫౌండేషన్ ‘నాకు చెట్లన్నా, తేనెటీగలన్నా, సముద్రమన్నా చాలా ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా ఓటమిని అంగీకరించకు అని చెప్తాయి చెట్లు. నలుగురిని కలుపుకుని పని చెయ్ అంటాయి తేనెటీగలు. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో అని చెబుతుంది సముద్రం. అందుకే అవి నాకు స్ఫూర్తి’ అంటుంది ప్రసిద్ధి. చెట్లమీద ప్రేమతో 6 ఏళ్ల వయసులోనే ‘ప్రసిద్ధి ఫౌండేషన్’ను స్థాపించింది. ‘నా చేతుల మీదుగా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించాను’ అంటుంది ప్రసిద్ధి. ఇప్పటికి ఎన్ని నాటిందో తెలుసా? 46,000. అవును... అన్ని వేల మొక్కలు ప్రసిద్ధి పూనిక వల్లే పచ్చగా తలలు ఎత్తాయి. అందుకే అందరూ ప్రసిద్ధి క్లయిమేట్ ఛాంపియన్ అంటున్నారు. పండ్ల మొక్కలే లక్ష్యం జపాన్‌కు చెందిన ‘అకిర మియావకి’ గొప్ప పర్యావరణవేత్త. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సహజ అడవులను తలపించే ‘మియావకి ఫారెస్ట్’ను అతడు వృద్ధి చేశాడు. అంటే ఇందులో అన్నిరకాల చెట్లు, మొక్కలు, తీగలు ఉండి దానికదే ఒక అడవిగా మారుతుంది. దీని నుంచి స్ఫూర్తి పొందిన తాను ‘ఫూట్ ఫారెస్ట్’లను చెన్నై చుట్టుపక్కల వృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. అయితే తాను పెంచదలుచుకున్నవన్నీ స్థానిక (భారతీయ) పండ్ల మొక్కలే. ‘నాకు ఫ్రూట్ ఫారెస్ట్లు పెంచాలని ఎందుకు అనిపించిందంటే పండ్లు జనానికి అందుతాయి, తింటారు అని. ఇవాళ అన్ని రసాయనాల పండ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. రసాయనాలు లేని పండ్లు అందించాలి’ అంటుంది ప్రసిద్ధి. మామిడి, జామ, సపోట, నారింజ, నిమ్మ, రేగు, తాటి, సీమచింత ఇలా దేశీయంగా ఉండే పండ్ల మొక్కలు, చెట్లను పెంచడం ప్రసిద్ధి లక్ష్యం. 28 పండ్ల తోటలు ప్రసిద్ధి పెంచుతున్న ఫ్రూట్ ఫారెస్ట్‌లను మనం పండ్ల తోటలు అనవచ్చు. ఈ తోటలు ఎలా పెంచుతుంది? ‘భాగస్వామ్యం వల్ల’ అంటుంది ప్రసిద్ధి. స్కూళ్లలో ఉన్న ఖాళీ స్థలాలు, పారిశ్రామిక సంస్థలకు ఉన్న ఖాళీ స్థలాలు, ప్రయివేటు వ్యక్తుల దగ్గర ఉన్న ఖాళీ స్థలాలు వీటిని పండ్లతోటలకు ఇమ్మని అభ్యర్థిస్తుంది. ఫౌండేషన్‌లో స్వచ్ఛందంగా పని చేయడానికి వచ్చిన కార్యకర్తలు కూడా ఈ స్థలాలను గుర్తిస్తారు. ప్రసిద్ధి ఆ యాజమాన్యాలకు లేఖలు రాస్తుంది. ‘వారిని ఒప్పించడం కష్టమే గాని పరిస్థితి వివరిస్తే ఒప్పుకుంటారు’ అంటుంది నవ్వుతూ. అంతెందుకు? ప్రసిద్ధి తాను చదువుతున్న మహేంద్ర వరల్డ్ స్కూల్లో వంద పండ్ల మొక్కలు నాటింది. అవి ఎదుగుతున్నాయి. ఒకసారి స్థలం దొరికాక తన కార్యకర్తలు వెళ్లి ఫౌండేషన్ ద్వారా సేకరించిన మొక్కల్ని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలోని మొక్కల్ని తీసుకెళ్లి ప్రసిద్ధి ఆధ్వర్యంలో నాటుతారు. ‘మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం. 2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను’ అంటుంది ప్రసిద్ధి. ప్రసిద్ధి చేస్తున్న పనికి చాలా మంది మద్దతు ఇస్తున్నారు. సహకరిస్తున్నారు. అలాగని చదువును నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రసిద్ధి అనేక నగరాలకు తిరుగుతూ పర్యావరణ రంగంలో పని చేస్తున్న సంస్థలతో కలిసి ప్రకృతిని ఏదో ఒక స్థాయిలో కాపాడాలని చూస్తోంది. ఇది చదివాక మన వంతు. మేము నాటుతాం సరే. కొందరు నీళ్లు పోయరు. కొన్నిచోట్ల నీళ్లు ఉండవు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. కొన్నిచోట్ల తోటమాలిని పెడతాం. 2021లో నాకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కితే ఆ డబ్బుతో ఒక తోటకు కంచె వేయించి బావి తవ్వించాను. – ప్రసిద్ధి సింగ్ -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇంద్రావతి.. పాపులర్ ఎలా అయింది
కన్నీటి సముద్రంలో మునిగిపోతే... కష్టాలు మాత్రమే కనిపిస్తాయి. పనే దైవం అనుకుంటే... ఆ దైవమే దారి చూపుతుంది. ఇది ఇంద్రావతి నిజజీవిత కథ... ఇంద్రావతికి బైక్‌లు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నయ్య మనోజ్ తనకు బైక్‌రైడింగ్ నేర్పించాడు. ఇంద్రావతి బైక్‌పై రాజసంగా వెళుతుంటే చూసి మురిసిపోయేవాడు. అలాంటి అన్నయ్య ఒక దురదృష్టకరమైన రోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. అంతే...ఆ కుటుంబంపై పిడుగు పడింది. మధ్యప్రదేశ్‌లోని మండ్ల జిల్లాకు చెందిన ఇంద్రావతి తల్లిదండ్రులు చిన్నాచితక పనులు చేస్తారు. మనోజ్ చేసే ఉద్యోగం ద్వారా వచ్చే జీతమే వారికి ప్రధాన ఆధారం. ఇంటికి నిట్టాడిలాంటి కొడుకు చనిపోవడంతో ఇంద్రావతి భవిష్యత్ గురించి ఆలోచిస్తూ కుమిలేపోయేవారు తల్లిదండ్రులు. అయితే ఇంద్రావతి ప్రస్తుతం వారికి భవిష్యత్‌గా మారింది. అన్నయ్య జ్ఞాపకాలు అనంతమైన దుఃఖాన్ని మోసుకొస్తూ తనను అల్లకల్లోలం చేస్తున్న సమయంలో...ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఇంద్రావతి. ఆ సమయంలో తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి ఆ ఆలోచన మానుకుంది. ‘ఏడుస్తూ కూర్చుంటే దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ఏదైనా పనిలో పడితే మంచిది’ అని పెద్దలు సలహా ఇచ్చారు. ‘ఏంచేయాలి? అని ఆలోచిస్తున్న సమయంలో ఒక స్వచ్ఛంద సంస్థ గురించి విన్నది. ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ (ప్రధాన్) సంస్థ సహాయంతో బైక్ రిపేరింగ్ నేర్చుకుంది. ఆతరువాత...మెకానిక్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. జబల్పూర్లోని టూ–వీలర్ సర్వీస్ సెంటర్లో ఇంద్రావతికి ఉద్యోగం వచ్చింది. ఒకవైపు బైక్‌లు రిపేర్ చేస్తూనే, మరోవైపు చదువు కొనసాగించింది. ‘ఆడపిల్లలకు బైక్ రిపేర్ చేయడం ఏం వస్తుంది!’ అంటూ మొదట్లో ఆమె దగ్గరికి రావడానికి సంశయించేవారు. అయితే రోజులు గడిచేకొద్దీ∙ఇంద్రావతి ప్రతిభ గురించి అందరికీ తెలిసిపోయింది. ఆలస్యం చేయకుండా, బైక్‌లను వేగంగా రిపేర్ చేయడంలో మరింత ప్రావీణ్యం సంపాదించింది. సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన ఇంద్రావతి నారాయణ్‌గంజ్‌లో ఒక వర్క్‌షాప్ మొదలు పెట్టి, పేదింటి అమ్మాయిలకు బైక్ రిపేరింగ్ నేర్పించి వారికి ఉపాధి మార్గాలు చూపించాలనుకుంటుంది. ‘బైక్ రిపేరింగ్ అనేది నాకు ఆత్మసై్థర్యాన్ని ఇవ్వడమే కాదు, కుటుంబానికి ఆదాయాన్నీ ఇచ్చింది. ఏ దారిలో వెళ్లాలో తెలియక ఒకప్పుడు నేను అయోమయానికి గురయ్యాను. నాలాంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. వారికి ధైర్యం చెప్పి, పని నేర్పితే సొంతకాళ్ల మీద నిలబడతారు’ అంటుంది ఇంద్రావతి. ‘నెల నెలా ఠంచనుగా వచ్చే జీతాన్ని వదులుకొని రిస్క్ తీసుకోవడం ఎందుకు?’ అంటున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇంద్రావతికి వారి మాటలు వినిపించడం లేదు. లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది! -
ఒకసారి టర్నోవర్ కోట్లలో.. ఒకసారి పుస్తెలతాడు కూడా తాకట్టులో..!
ఏమీ లేని చోట కూడా వనరుల కల్పనకు కృషి చేయవచ్చు అని నిరూపించారు సాకా శైలజ. బీడీ కార్మికులను బ్యూటీషియన్లుగా తీర్చిదిద్దారు. వెయ్యి రూపాయల అద్దె కట్టడానికి లేని రోజుల నుంచి కోటి రూపాయల టర్నోవర్ చేరేవరకు కృషి చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని కరీంనగర్లో రోజాస్ ఇండస్ట్రీ పేరుతో సినోవ్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేస్తున్న సాకా శైలజ జీవన ప్రయాణం ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. పూర్తిగా మహిళా ఉద్యోగులు మాత్రమే పని చేసే సంస్థను నడుపుతున్నారు శైలజ. ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్, కెమికల్ హౌస్ క్లీనర్స్‌ను తయారుచేసే కంపెనీయే కాదు, బ్యూటిషియన్ కోర్సులనూ ఇస్తున్నారు. ఇరవై ఏళ్లలో 30 వేల మంది మగువలను బ్యూటీషియన్లుగా తీర్చిద్దారు. పాతికేళ్ల వయసులో మొదలుపెట్టిన వ్యాపారం గురించి శైలజ వివరిస్తూ.. అడవిలో ఇంగ్లిషు పాఠాలు ‘‘నాకు పంతొమ్మిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారికి టీచర్‌గా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పోస్టింగ్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, డిగ్రీ చేసిన నేను పెళ్లవగానే ఓ అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఖాళీ టైమ్‌లో అక్కడి పిల్లలను చేరదీసి, ఇంగ్లిష్ నేర్పించేదాన్ని. దానినే ట్యూషన్‌గా మార్చుకున్నాను. అలా ఆర్నెళ్లు తిరిగేసరికి మా వారికన్నా రెట్టింపు ఆదాయాన్ని సంపాదించేదాన్ని. తర్వాత పిల్లలు పుట్టడం, వారి పెంపకంలో హైదరాబాద్ వచ్చినప్పుడు బ్యూటిషియన్ కోర్సు నేర్చుకున్నాను. మా వారికి సిరిసిల్ల ట్రాన్స్ఫర్ అయితే, అక్కడ బ్యూటీపార్లర్ ఏర్పాటుకు ప్రయత్నించా. చాలా మంది విమర్శించారు ఊళ్లో బ్యూటీపార్లరా అని. ఇల్లు కూడా ఎవరూ అద్దెకు ఇవ్వలేదు. దళిత్ అనే వివక్ష కూడా చాలా చోట్ల ఎదుర్కొన్నాను. చివరకు అద్దె వరకు ఆదాయం వచ్చినా చాలని ఒక రూమ్‌లో పార్లర్ ప్రారంభించాను. ఉచితంగా శిక్షణ పార్లర్లో పనిచేయడానికి వచ్చిన అమ్మాయిలు ఇంటి వద్ద బీడీలు చుడతామని చెప్పారు. అలా వచ్చే ఆదాయం వారికేం సరిపోతుందని, బ్యూటిషియన్ పని నేర్పించాను. అలా మరికొంత మంది అమ్మాయిలు చేరారు. వారికీ ఉచితంగా శిక్షణ ఇచ్చాను. హైదరాబాద్‌లోని బ్యూటీ సెలూన్ వారితో మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాను. ఆ తర్వాత కరీంనగర్‌కు ట్రాన్స్ఫర్. ఇక్కడా మరో బ్రాంచ్ ప్రారంభించి, బ్యూటీపార్లర్ నడుపుతూ, మహిళలకు శిక్షణ ఇస్తూ వచ్చాను. అలా బ్యూటీ కోర్సులో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఉత్పత్తుల తయారీ ఒక డాక్టర్ని కలిసినప్పుడు, ‘మీ వర్క్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరమో మీకు బాగా తెలుసు కాబట్టి వాటిని మీరే తయారుచేయవచ్చు కదా’ అన్నారు. అప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసి, బ్యాంక్‌కు వెళ్లాను. అది కోటి రూపాయల ప్రాజెక్ట్. నేనెప్పుడూ చూడని అంకె అది. కానీ, ప్రయత్నించాను. నెల రోజులకు బ్యాంక్ లోన్ వచ్చింది. అప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ ప్రారంభించాను. మార్కెట్ పెద్ద టాస్క్ ఉత్పత్తుల తయారీ చాలా బాగుంది. మా పార్లర్స్‌లోనే వాటిని ఉపయోగిస్తున్నాం. బయట కూడా మార్కెట్ చేయాలి అని సెర్చ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్లో స్లాట్ ఓకే అయ్యింది. అక్కడ నా ప్రొడక్ట్స్ పెట్టినప్పుడు, ఫారినర్స్ చూసి ఆర్డర్ ఇచ్చారు. మా యూనిట్‌కి వచ్చి, చూసి, ప్రతీది తెలుసుకున్నారు. ప్రతి యేడాది కోటి రూపాయల మార్కెట్ చేస్తున్నాను. కరోనా వేసిన వేటు ఈ యేడాది మార్చ్ వరకు 70 లక్షల టర్నోవర్ చేశాను. మార్కెట్ పెరగడానికి కరోనా ఓ అడ్డంకి అయ్యింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మూసి వేశారు. కానీ, నేను ఆగకుండా నడిపించాను. కరోనా టైమ్‌లోనే చైనా బార్డర్లో ఉన్న ప్రాంతానికి ఆరు రోజుల ఆలశ్యంగా ప్రొడక్ట్ డెలివరీ అయ్యింది. లేట్ అయ్యిందనే కారణంతో ప్రొడక్ట్‌ని రిజక్ట్ చేశారు. దానిని వెళ్లి తీసుకురాలేక వదిలేయాల్సి వచ్చింది. కరోనా సీజన్లో నా దగ్గర డబ్బు లేదు. దీంతో బంగారం తాకట్టు పెట్టాను. అదే సమయంలో రా మెటీరియల్ సప్లయ్ చేసే అతని ఆరోగ్యం బాగోలేక, డబ్బు వెంటనే కావాలన్నారు. ఆ సమయంలో వేరే దారిలేదు. నా మెడలో పుస్తెలతాడు, గాజులు, చెవి కమ్మలు తీసి మా అబ్బాయితో బ్యాంక్‌కు పంపించాను. బిజినెస్‌లో చాలా సవాళ్లు ఉంటాయి, డీలా పడిపోకూడదు. నా సంస్థ ఎప్పుడూ మంచి ఆదాయాన్ని ఇచ్చేదే. ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది. నాకున్న లక్ష్యం ముందు మిగతా సమస్యలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. బ్యాలెన్స్ ఒక సవాల్ ఇటీవల మా వారికి గుండెపోటు వచ్చింది. ఇదే సమయంలో కంపెనీ స్థలం ఓనర్ ఆ భూమిని వేరొకరికి అమ్మారు. దీంతో ఎటూ తేల్చుకోలేక, లాయర్ సలహా తీసుకున్నాను. మా వారి ఆరోగ్యం, పిల్లలు, కంపెనీ.. దేనినీ వదులుకోలేను. అలాగే, సమస్య అంటూ ఇంటికి వచ్చే అమ్మాయిలకు కౌన్సెలింగ్, సాయం ఎలాగూ ఉంటుంది. వ్యాపారంలో ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటుంది. దానిని అధిగమిస్తేనే విజయం. వర్కింగ్ క్యాపిటల్ పెరిగితే ఐదు కోట్ల బిజినెస్ చేయాలన్నది ఈ యేడాది ప్లానింగ్. బ్యూటిషియన్ స్కూల్‌తో పాటు, ప్రొడక్ట్స్ తయారీలోనూ అంతా మహిళలే. ఒక్కోసారి ఇంతమందికి ఉపాధి కల్పించాం కదా అని గర్వంగా ఉంటుంది. నా దగ్గర పనిచేసే మహిళలు కూడా సొంతంగా చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాను’’ అని వివరించారు శైలజ. – నిర్మలారెడ్డి -
బ్రూస్ లీ ఆరాధించిన భారత్ ఫహిల్వాన్ ఎవరో తెలుసా?
మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం.. దివంగత హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రూస్ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.చరిత్ర పుటల్లోకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా బ్రూస్ లీ పేరు గుర్తుకువస్తుంది. కెమెరా కూడా అతని వేగాన్ని అందుకోలేదు. చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌పై పట్టు సాధించి గొప్ప పేరు సంపాదించాడు. 32 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్' సినిమాతో విశ్వవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ సాధించాడు. మరి బ్రూస్ లీ ఆరాధించే వ్యక్తి ఎవరో తెలుసా.. భారత్‌కు చెందిన మహ్మద్ భక్ష్ భట్.. అలియాస్ గ్రేట్ గామా ఫహిల్వాన్. గామా ఫహిల్వాన్ ఫిజిక్కు ముచ్చటపడిన బ్రూస్ లీ అతనిలా కండలు పెంచాలని అనుకున్నాడు. అందుకోసం మహ్మద్ ఎక్సర్సైజ్ ఫుటేజీలు, రెజ్లింగ్ టెక్నిక్స్‌ను కేవలం ఫోటోల ద్వారా నేర్చుకున్నాడు. గామా ఫహిల్వాన్ పేరు మీద వచ్చిన ఆర్టికల్స్‌ను తప్పకుండా చదివేవాడు. ఒక రకంగా తాను మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధించడానికి గామా ఫహిల్వాన్ దారి చూపాడని బ్రూస్ లీ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. కాగా గామా ఫహిల్వాన్ ఇవాళ(మే 22) ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్ అతని ఫోటోను డూడుల్‌గా ఉపయోగించింది. వ్రిందా జవేరీ అనే ఆర్టిస్ట్ గూగూల్‌కు గామా ఫహిల్వాన్ కార్టూన్‌ను గీసిచ్చాడు. భారత రెజ్లర్‌గా ఎనలేని గుర్తింపు సాధించిన మహ్మద్ భక్ష్ భట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రింగ్‌లో ఓటమి ఎరుగని రెజ్లర్‌గా పేరు పొందిన ఆయన దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచాడు. భారతీయ సంస్కృతికి గౌరవ ప్రతీకగా ఉన్నాడు. గామా ఫహిల్వాన్ను స్మరించుకోవడం మన అదృష్టం అని గూగుల్ రాసుకొచ్చింది. మహ్మద్ భక్ష్ భట్ తన అంతర్జాతీయ రెజ్లింగ్ కెరీర్లో 1910లో వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్, 1927లో వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలిచాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత టైగర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి రజత తామరపత్రం అందుకున్నాడు. Gama Pehelwan's 124th Birthday pic.twitter.com/8j5kQrDXbV — Akash Kharade (@cricaakash) May 22, 2022 -
కాళ్లలో లేదు చలనం ఆశల్లో ఉంది జీవనం
19 ఏళ్లు..ఉత్సాహం ఉరకలెత్తే వయస్సు..ఎగసే అలల్లా జీవితంపై ఎన్నో ఆశలు..ఆకాంక్షలు..ఈ చురుకైన యువకుడ్ని చూసి విధికి కన్నుకుట్టింది. 2009లో జరిగిన ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబంలో నిశ్శబ్ధ వాతావరణం..ఎదిగిన తమ బిడ్డ ఇలా దివ్యాంగుడిగా మారిపోవడం తల్లిదండ్రులు జీర్జించుకోలేకపోయారు. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయితే ఆ యువకుడు కుంగిపోలేదు. సంద్రంలో అలలే స్ఫూర్తిగా తీసుకున్నాడా యువకుడు. జీవితంలో అవిటితనం ఓ చిన్న సమస్యే..అంతకు మించి జిందగీలో చాలా ఉందని భావించాడు. సూర్యుడు ఉదయిస్తాడు... అస్తమిస్తాడు... అస్తమించినంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు...ఈ రవివర్మ కూడా అంతే...ఉదయించే సమయంలో విధి ఓటమి పాల్జేస్తే... నడవలేని స్థితిలో రవి ఆ విధిపై విజయం సాధించాడు. ర్యాప్ అనే ఫౌండేషన్ స్థాపించి ఎందరో దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు...ఆ విజేతే మన సీతమ్మధారకు చెందిన రవివర్మ. సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రమాదానికి ముందు రవివర్మకు పర్యాటక ప్రాంతాలు వీక్షించడమంటే చాలా ఇష్టం. అయితే నడవలేని స్థితిలో ఉన్న రవి దాదాపు చాలా రోజులు యాత్రలకు వెళ్లలేకపోయాడు. తరువాత తనకుతాను స్ఫూర్తి నింపుకున్నాడు. ఇది కాదు జీవితం...లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్...దానిని ఆస్వాదించాలనుకున్నాడు. తన పనులు తాను చేసుకునేస్థాయిలో వచ్చాడు. వీలు చైర్లోనే నగరంలో తనకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేవాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టాడు. కారుకు ప్రత్యేక మార్పులు చేయించాడు. తనుకు అనుకూలంగా కారును డిజైన్ చేయించుకున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు విశాఖ నుంచి సోమవారం బయలుదేరాడు. వెలుగు రేఖ వెతకాలి జీవితంలో ఓటమి ఎదురైందని చీకట్లో కూర్చుంటే వెలుగే కనిపించదు..మనసులో కుంగిబాటు అనే కర్టెన్ తీసేయాలి..అప్పుడు ఎంతటి బాధనైనా... అంగవైకల్యమైనా మనల్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది. నా జీవితమే ఇందుకు ఓ ఉదాహారణ. కుంగిపోయి కూర్చుంటే నేనీరోజు దేశవ్యాప్తంగా యాత్ర చేసే స్థాయికి చేరుకునేవాడ్ని కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు కామన్..వాటిని అధిగమిస్తే విజేతగా నిలవవచ్చు. వంద రోజులకు పైగా దేశవ్యాప్త యాత్రలో వేల మంది దివ్యాంగులను కలిసి వారికి మనోధైర్యం నింపాలన్నదే నా లక్ష్యం. – రవి వర్మ ఇటువంటి యాత్రలంటే ఇష్టం రవి వర్మకు ప్రమాదం జరగక ముందు నుంచి ఇంటువంటి యాత్రలు చేయడం ఇష్టం. ప్రమాదం జరిగిన తరువాత మేమంతా ధైర్యం కోల్పోయాం. రవివర్మ మాత్రం ధైర్యం తెచ్చుకొని తన సాధారణ జీవితం గడిపేలే ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఇన్ని రోజులు కారు యాత్రకు వెళ్తూ అందరిలో స్ఫూర్తి నింపాలనుకోవడం చాలా గర్వంగా ఉంది. – తల్లి రాజేశ్వరి, సోదరి పూజిత. సాహసయాత్ర ప్రారంభం వీలుచైర్ కారు ద్వారా 24 వేల కిలోమీటర్లు యాత్ర చేస్తున్న రవివర్మ అందరికీ స్ఫూర్తి అని ఎంపీ ఎంవీవీ సత్యరాయణ అన్నారు. యాత్రను ఆయన సోమవారం బీచ్‌రోడ్డులో జెండా ఊపి ప్రారంభించారు. సాధారణ వ్యక్తికి సైతం 24 వేల కిలోమీటర్లు కారు యాత్ర చేయటం చాలా కష్టం. అటువంటిది రవివర్మ చేయడం నిజంగా సాహసమే. యాత్రలో ఎటువంటి ఇబ్బందుల లేకుండా విజవంతంగా పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జీవీ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం!) -
పేదింట్లో వైద్య కాంతులు.. ఆ కల వాళ్లని ఇంత వరకు నడిపించింది!
సాక్షి,మల్యాల(చొప్పదండి): నిరుపేద కుటుంబాల విద్యార్థులు చదువులో సత్తాచాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సీటు సాధించి తమ కలలను సాకారం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా లక్ష్యసాధనకు నిరంతరం తపించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన వైద్య విద్య వారి దరికి చేరింది. కష్టసుఖాలు.. తాము అనుభవించిన పేదరికాన్ని పిల్లలు అనుభవించకూడదనే తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా.. సమాజానికి సేవ చేసే ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే తమ కలలను నెరవేర్చుకున్నారు. పేదరికాన్ని రుచి చూస్తూ పెరిగిన పిల్లలు వైద్య వృత్తి బాటలో పయనిస్తూ నిరుపేదలకు చేయూతనందిస్తామంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బింగి నర్సయ్య– మంజుల కూతురు మనీషా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వైద్య విద్యవైపు అడుగులు వేసింది. తండ్రి బట్టల వ్యాపారి, తల్లి బీడీ కార్మికురాలు. నూకపల్లి మోడల్స్కూల్లో పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్లో 985 మార్కులు సాధించింది. తండ్రి గ్రామాల్లో తిరుగుతూ బట్టల వ్యాపారం, మరోవైపు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కూతురు మనీషా ఈ ఏడాది నీట్లో 543 మార్కులు సాధించి వైద్యురాలిగా తన కల నెరవేర్చుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. చిన్న కూతురు అనూషను సైతం నీట్ కోసం సిద్ధం చేస్తున్నారు. విరిసిన దళిత కుసుమం.. మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబం పద్మ–గంగయ్యల ఒక్కగానొక్క కూతురు నిఖిత. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టాడు. ఆది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. పదో తరగతిలో 9.3 జీపీఏ, ఇంటర్లో 953 మార్కులు సాధించింది. గతేడాది వైద్య విద్యలో సీటు సాధించి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకుంది. వైద్య విద్య అడ్మిషన్‌కు కూడా డబ్బులు కట్టలేని స్థితిలో నిఖితకు “సాక్షి’ తోడుగా నిలవగా.. డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకుంది. తనలాంటి పేద విద్యార్థులకు చేయూతనందిస్తానని, నిరుపేదలకు ఉచితంగా సేవలందిస్తానని నిఖిత చెబుతోంది. తండ్రి కల నెరవేర్చిన తనయ మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి మల్లేశం కూతురు అలేఖ్య. గ్రామంలో రెండు దశాబ్దాలుగా మల్లేశం ఆర్ఎంపీగా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య గీత బీడీ కార్మికురాలు. తన కూతురును డాక్టర్ చేయాలనే తండ్రి ఆశయానికి తోడు తనయ కష్టపడి చదివి ఉస్మానియాలో ఉచితంగా సీటు సాధించింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్లో 988 సాధించింది. మూడేళ్లక్రితం ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు సాధించి, తండ్రి ఆశయాన్ని, తన కలను నెరవేర్చుకుంది. ఆది నుంచి ముందువరుసలో.. మల్యాల మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ రెండు దశాబ్దాలుగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. డాక్టర్ కావాలంటూ చిన్నప్పటి నుంచి తన కుమారుడు గాయత్రినందన్కు బీజాలు నాటాడు. తండ్రి మాటలకు అనుగుణంగా గాయత్రినందన్ డాక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆదినుంచి ప్రణాళికతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 988 మార్కులు సాధించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే నీట్లో 583 మార్కులు సాధించి ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచితంగా సీటు సాధించాడు. మట్టి పరిమళం కల్పన మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన మిర్యాల మల్లారెడ్డి– వనిత దంపతులది వ్యవసాయ కుటుంబం. డాక్టర్ కావాలనే కూతురు కల్పన కలకు బాసటగా నిలిచారు. చదువుకోసం వ్యవసాయ భూమి అమ్మేందుకుసైతం వెనకాడబోమని భరోసానిచ్చారు. తల్లిదండ్రుల భరోసాతో కల్పన మరింత కష్టపడి చదివింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్ మొదటి సంవత్సరంలో 436/440 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకులో నిలిచింది. అదే ఉత్సాహంతో ఇంటర్లో 986 మార్కులు సాధించింది. కష్టపడి చదివి ఉచితంగా వైద్య కళాశాలో సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతోంది. గ్రామంలో నెట్వర్క్ లేకపోతే చదువుకు ఆటంకం కలుగవద్దని నేరుగా శ్మశానంలో కూర్చుండి కూడా ఆన్లైన్ తరగతులు వింటూ చదువును కొనసాగించి, డాక్టర్ కావాలనే తనలోని దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది. -
ఫ్యాబ్రిక్ ఇంజినీర్!
‘‘జీవితంలో అది అవ్వాలనుకుని ఇదయ్యాం! కాలం కలిసి రాక నేను అనుకున్నది జరగలేదు అందుకే చివరికి ఇలా స్థిరపడ్డాను’’ అని వాపోతుంటారు చాలామంది. అయితే, మనలో నైపుణ్యం, సాధించాలన్న పట్టుదల, అడుగు ముందుకేసే ధైర్యం ఉంటే.. కాస్త ఆలస్యం అయినా అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు సంజుక్తా దత్త. అసోంలోని నాగౌన్ జిల్లాలో పుట్టిన సంజుక్తా దత్తాకు చిన్నప్పటినుంచి చీరలంటే మక్కువ. అస్సామీ మహిళలు సాంప్రదాయంగా ధరించే మేఖల ఛాడర్ (రెండు రకాల బట్ట, రంగులలో తయారయ్యే చీర) అంటే బాగా ఇష్టం. ఈ చీరలను మరింత అందంగా ఎలా తీర్చిదిద్దవచ్చో ఆలోచించి, వివిధ రకాల డిజైన్లతో చీరలు రూపొందించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొన్ని తనకోసం తయారు చేసేది. అవి అందర్నీ ఆకర్షిస్తుండడంతో.. ఫ్యాషన్ డిజైనింగ్ మీద మరింత ఆసక్తి పెరిగింది. కానీ ఇంట్లో వాళ్ల ఇష్టం మేరకు ఇంజినీరింగ్ చదివింది. ఇంజినీరింగ్ అయిన వెంటనే ఉద్యోగం రావడంతో ‘అసోం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్’లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ తన మనసు మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్‌పైనే ఉంది. పదేళ్ల ఉద్యోగం వదిలేసి... ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా తనకిష్టమైన ఫ్యాబ్రిక్ డిజైన్ ను చేస్తుండేది. తన డిజైన్లు నచ్చిన వారంతా ‘చాలా బావున్నాయి’ అని పదేపదే పొగుడుతుండడంతో... ఫ్యాషన్ డిజైనింగ్‌కు పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకుంది. పదేళ్లుగా చేస్తోన్న ఇంజినీర్ ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసి, గువహటీలో మేఖల ఛాడర్ల చేనేత యూనిట్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్లో స్వయంగా డిజైన్ చేసిన వస్త్రాలను ఏడాదిన్నరలోనే మూడు వేల వరకు విక్రయించింది సంజుక్తా. ఒక్క యూనిట్‌తో ప్రారంభమైన సంజుక్తా చేనేత యూనిట్ రెండేళ్లలోనే వందల యూనిట్లుగా విస్తరించింది. దాంతో కమర్షియల్ బోటిక్‌ను కూడా ప్రారంభించింది. ఈ బోటిక్‌ను కొనుగోలుదారులు కూడా సందర్శించే వీలు కల్పించడంతో మంచి స్పందన వచ్చింది. ఈ ప్రోత్సాహంతో అస్సామీ సాంప్రదాయ జ్యూవెల్లరి దగ్ దుగి, కెరు మోనీ, జున్ బైరీలను సరికొత్తగా తీర్చిదిద్ది విక్రయించింది. ఒకపక్క అస్సామీ పట్టు, మరోపక్క సాంప్రదాయ జ్యూవెల్లరీలను తనదైన డిజైన్లతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందేలా చేసింది. అస్సామీ పట్టు ఎంతో నైపుణ్యం కలిగిన ఛాడర్ కళాకారులతోనే మేఖల ఛాడర్ను తయారు చేయించడం సంజుక్తా డిజైన్ల ప్రత్యేకత. స్థానికంగా దొరికే పట్టు దారాలు, ఛాడర్లను అనుభవజ్ఞులైన చేనేత కళాకారులతో రూపొందిస్తోంది. ప్రస్తుతం సంజుక్తా స్టూడియో, యూనిట్లలో వందలసంఖ్యలో కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్క గువహటీలోనేగాక ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ధరించే ఈ ఛాడర్లకు మంచి డిమాండ్ ఉండడంతో సంజుక్తా డిజైన్లు త్వరగానే పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియా ప్రచారం ద్వారా కూడా మరిన్ని ఆర్డర్లు తీసుకుంటూ తన డిజైన్ లను దేశం నలుమూలలకు విస్తరించి, ప్రస్తుతం కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. ఆల్ఫూల్.. కరిష్మాకపూర్, బిపాషా బసు, హేమమాలిని, జహీర్‌ఖాన్ వంటి సెలబ్రిటీలు కూడా సంజుక్తా డిజైన్ చేసిన డ్రెస్‌లను పలు ఈవెంట్లలో ధరించారు. బ్రిటిష్ రాజవంశానికి చెందిన కేట్ మిడిల్టన్ 2015లో ‘కాజీరంగా జాతీయ పార్క్’ సందర్శించినప్పుడు సంజుక్త రూపొందించిన డ్రెస్‌ను ధరించారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతోన్న న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ – 2022లో ‘ఆల్ఫూల్’ పేరిట తన కొత్త డిజైను ప్రదర్శించింది. అసోం పట్టుతో నేసిన చీరలు, గౌన్లు, డ్రేప్ స్కర్ట్స్ ఇండో వెస్ట్రన్ లెహంగాలను రూపొందించి, 25 రోజులపాటు సమయం కేటాయించి తుదిమెరుగులు దిద్దారు. దీంతో ధగధగ మెరుస్తోన్న పట్టు డ్రెస్‌లు చూపరులనే గాక అంతర్జాతీయ డిజైనర్లనూ ఆకట్టుకుంటున్నాయి. -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
ఆ మాత్రం ఎవరైనా చేస్తారు.. రాబియా వేరే పని కూడా చేసింది!
ఆమె క్లాస్‌లో ఆమె అమ్మ, అమ్మమ్మ విద్యార్థుల్లా పాఠాలు విన్నారు. అమ్మమ్మ తన మనవరాలిని ‘టీచర్’ అంటూ పిలిచేది. ఆ పల్లెటూళ్లో చదువురాని గృహిణులందరూ ఆమె స్కూల్లో బుద్ధిగా చదువుకునేవారు. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె కూడా స్ఫూర్తి. జీవితం ఆమెను చిన్నప్పుడే చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. కాని చదువే మనిషికి చలనం ఇస్తుందని అందరికీ చదువు అందే పనిని చూసింది. కె.వి.రాబియా కేరళలో ఎందరికో స్ఫూర్తి. నేడు పద్మశ్రీ ప్రకటనతో దేశానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. 56 ఏళ్ల రాబియా జీవితం కేరళలో స్కూలు పిల్లల టెక్ట్స్‌బుక్స్‌లో పాఠ్యాంశంగా ఉంది. కేరళ అనే ఏముంది... దేశంలో ఏ భాషలోని పిల్లలలైనా ఆమె జీవితాన్ని పాఠంగా చదువుకోవాలి. స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే అలాంటి పోరాటం చేసిన వారు చాలా తక్కువ ఉంటారు. స్త్రీలలో మరీ తక్కువగా ఉంటారు. అందుకే ప్రతి చిన్నారి, యువతి, గృహిణి, ఉద్యోగిని రాబియాను చూసి జీవితంలో అలుపెరగని పోరాటం ఎలా చేయవచ్చో నేర్చుకోవచ్చు. ఎందుచేత ఆమె స్ఫూర్తి? ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి రేషన్‌షాప్ ఉండేది. రాబియాకు చదువుకోవాలని బాగా కోరిక. కాని 9వ క్లాసుకు రాగానే ఆమెకు రెండు కాళ్లకూ పోలియో వచ్చింది. అయినా సరే ఇంటర్ వరకూ మేనమామ సహాయంతో కాలేజీకి వెళ్లింది. కాని ఇంటర్లో నడుము కింద నుంచి పూర్తిగా చచ్చుబడి వీల్‌చైర్‌కు పరిమితం అవ్వాల్సి వచ్చేసరికి ఇక కాలేజీ మానుకుంది. కాని చదువంటే ఇష్టం. ఎలా? ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ ఆ తర్వాత పిజి చదవడం మొదలెట్టింది. ఆ మాత్రం ఎవరైనా చేస్తారు? రాబియా వేరే పని కూడా చేసింది. ఆడవాళ్ల స్కూలు రాబియా ఉన్న పల్లెటూళ్లో అందరూ పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఆ ఇళ్ల ఆడవాళ్లకు అక్షరం ముక్క చదువు లేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నా కదా వీరికి ఎందుకు చదువు చెప్పకూడదు అని డిగ్రీలోనే రాబియాకు అనిపించింది. వెంటనే ఆమె తన ఇంటిలోనే స్కూల్ ప్రారంభించింది. కేవలం ఆడవాళ్లకే ఆ స్కూలు. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఆమె ఇల్లు ‘కడలుండి’ అనే నది ఒడ్డున ఉంటుంది. మెల్లగా అదొక గురుకులంలాగా తయారైంది. రాబియా టీచర్ అసలు ఏమాత్రం రాజీ పడకుండా ఆడవాళ్లకు చదువు చెప్పడం, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపాధి అవకాశాలు అందుతాయో తెలియచేసి, ప్రతి ఇంటికి ఏదో ఒక దారి చూపడం మొదలెట్టింది. రాబియా తల్లి, అమ్మమ్మ ఇది గమనించి ఆఖరుకు వారు కూడా ఆమె స్టూడెంట్స్‌గా మారక తప్పలేదు. తనను ఎత్తుకుని ఆడించినవారు తన దగ్గర బుద్ధిగా పాఠాలు వినడం రాబియాకు చాలా సంతోషం కలిగించింది. ఈ వార్త అటూ ఇటూ వెళ్లి ప్రభుత్వానికి చేరింది. ఒకరోజు అధికారులు వచ్చేసరికి రాబియా క్లాసులో 80 ఏళ్ల పెద్దామె నుంచి 8 ఏళ్ల పాపాయి వరకూ చదువుకుంటూ కనిపించారు. అధికారులు చాలా సంతోషించి ఏం కావాలి అని అడిగితే మా ఊరికి రోడ్ వేయండి అంది రాబియా. వెంటనే రోడ్ వేసిన అధికారులు దానికి ‘అక్షర రోడ్’ అని పేరు పెట్టారు. అంతే కాదు లైట్లు, నీటి వసతి ఇలాంటివన్నీ రాబియా వల్ల ఆ ఊరికి వచ్చాయి. ‘చలనం’ సంస్థ రాబియాకు తెలుసు... తాను తన కాళ్ల మీద నడవలేనని. కాని తన చదువు సమాజాన్ని నడిపించగలదు... తాను చెప్పే చదువు నలుగురికీ చలనం ఇవ్వగలదు... అందుకే ఆమె ‘చలనం’ అనే సంస్థను స్థాపించి ముఖ్యంగా దివ్యాంగులకు, మానసిక అవస్థలు ఉన్న పిల్లలకు స్కూళ్లు తెరిచింది. అంతే కాదు... తన ఇంటిని ఒక నాలెడ్జ్ సెంటర్‌గా మార్చింది. లైబ్రరీ, కౌన్సెలింగ్... అన్నీ అక్కడే. తన్నుకొని తనదగ్గరకు వచ్చిన భార్యాభర్తలకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చేది. అయితే ఆమె జీవితానికి ఇంకా పరీక్షలు ఎదురయ్యాయి. కేన్సర్ సర్వయివర్ 32 ఏళ్ల వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది. దానిని ఆమె విజయవంతంగా ఎదుర్కొంది. శరీర బలం కంటే మనోబలంతోనే ఆమె దానిని జయించింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో ఆమె బాత్రూమ్లో పడటంతో వెన్నుపూస ఆమె శరీరాన్ని మరింత చలనం లేకుండా చేసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా మంచం మీద ఉండి ‘మౌన రోంబనంగల్’ (నిశ్శబ్ద కన్నీరు) అనే తన జ్ఞాపకాల గ్రంథాన్ని రాసింది. అది హిట్ అయ్యి వచ్చిన డబ్బుతో ఆమె వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత ‘స్వప్నాలకు రెక్కలుంటాయి’ అనే పేరుతో ఆత్మకథను రాసింది. మనిషి ఎంత వీలుంటే అంత చదువుకోవాలని జ్ఞానమే సమాజాన్ని మరింత వికాసంలోకి తీసుకెళుతుందని రాబియా గట్టిగా నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది. ఆమె కృషి వల్ల ఆమె ఊరి చుట్టుపక్కల 8 గ్రామాలు పూర్తిగా అక్షరాస్యతలోకి ప్రయాణించాయి. ప్రజలు రాబియాను ఎంతో అభిమానిస్తారు. ఏ కృషీ వృధా పోదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గొప్పవాళ్లు కొందరు చక్రాల కుర్చీకి పరిమితం కావచ్చు. కాని వారి సంకల్పం ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. ఆ సంకల్పం అందరికీ దక్కాలి. రాబియాను అభినందిస్తున్న పలువురు ప్రముఖులు -
ఈ అక్కచెల్లెళ్లు సూపర్..
సాక్షి, కామారెడ్డి: వాళ్లిద్దరు అక్కా చెల్లెళ్లు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నరు. సొంత ఇళ్లు లేదు. సొంతంగా పంట భూమి కూడా లేదు. కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరిలా కాకుండా పద్దతిగా పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మగవారికి ధీటుగా మంచి పంటలు పండిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు పెద్ద మల్లవ్వ, చిన్న మల్లవ్వలు చేస్తున్న పంటల సాగు నలుగురికి మెచ్చేలా, నచ్చేలా ఉంటోంది. పొద్దున నిద్రలేచి ఇద్దరూ కలిసి వంట పని చేసుకుని సద్దిమూటతో కాలినడకన పొలం బాటపడతారు. సాయంత్రానికి గానీ ఇంటికి రారు. మగవారికి ధీటుగా పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. పెద్ద మల్లవ్వకు కూతురు జమున ఏడాదిన్నర వయసులో ఉన్నపుడు భర్త గంగారెడ్డి చనిపోయాడు. దీంతో తల్లిగారి ఊరయిన కుప్రియాల్‌కు వచ్చి ఉంటోంది. కూలీనాలీ చేసి బిడ్డను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. చిన్న మల్లవ్వ భర్తకు దూరమై అక్కతో కలిసి ఉంటోంది. పదేళ్లుగా అక్కా చెల్లెల్లిద్దరూ అద్దె ఇళ్లు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో వెంకటరెడ్డికిక చెందిన నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. భూమి యజమాని సహకారంతో ఈ ఇద్దరు అక్కా చెల్లెల్లు ఆధునిక పద్దతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రెండెకరాల్లో చెరకు పంట, ఎకరంనర భూమిలో వరి సాగు చేస్తున్నారు. మిగతా స్థలంలో కూరగాయలు పండిస్తున్నారు. చెరకు సాగులో అధిక దిగుబడులు.... ఈ అక్కాచెల్లెల్లు సాగు చేస్తున్న చెరకు పంట అధిక దిగుబడులు వస్తోంది. నాటడం నుంచి అన్ని పనులూ వీళ్లిద్దరే చేసుకుంటారు. చెరకు నరకడానికి మాత్రమే కూలీలు వస్తారు. మిగతావన్నీ వాళ్లే చూసుకుంటారు. చెరకు నాటడం, కలుపు తీయడం నుంచి ప్రతీ పని వాళ్లే చేసుకుంటారు. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. గత ఏడాది ఎకరాకు 55 టన్నుల దిగుబడి సాధించారు. ప్రతీ సంవత్సరం చెరకు సాగులో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సారి కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని చెబుతున్నారు. పంటకు కోడి ఎరువు, పశువుల పేడ వాడుతారు. చాలా మంది వీళ్ల సాగు విధానాన్ని చూసి వెళుతుంటారు. గాయత్రీ షుగర్స్ అధికారులు కూడా మల్లవ్వలు సాగు చేస్తున్న పంటను చూడమని ఇతర గ్రామాల రైతులకు చెబుతుంటారు. కూలీకి వెళ్లరు..కూలీలను పిలవరు... ఇద్దరు అక్కా చెల్లెళ్లు తాము సాగు చేస్తున్న పంట చేనుదగ్గరకు ప్రతీ రోజూ వెళ్లి పనులు చూసుకుంటారు. గ్రామం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న పొలం దగ్గరికి కాలినడకన వస్తారు. సాయంత్రం తిరిగి కలిసి వెళతారు. ఏ ఒక్కనాడూ కూలీ పనులకు వెళ్లరు. తమ పొలానికి కూలీలను పిలవరు. పంటకు రసాయన ఎరువులను కూడా వీళ్లే పిచికారీ చేస్తారు. భుజానికి స్ప్రే పంప్ తగిలించుకుని దర్జాగా పొలంలో తిరుగుతూ పంటకు పిచికారీ చేస్తారు. ప్రతీ పనిని తామే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే కూరగాయల సాగు ద్వారా చేతి ఖర్చులన్నీ వెల్లదీసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం ఉంది.... మాకు సొంత భూమి లేకున్నా వెంకటరెడ్డి సారు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నం. మాకు సారు అన్ని విధాల సహకారం అందిస్తారు. పొలం పని మీద దృష్టి పెడితే మంచి ఫలితాలే వస్తాయి. ఎప్పుడో ఒక సారి నష్టం రావచ్చు. రెక్కల కష్టం నమ్ముకుని బతుకుతున్న మాకైతే మంచిగనే ఉన్నది. ఎవల మీద ఆధారపడకుండా మా పని మేము చేసుకుని బతుకుతున్నం. మాకు సొంత ఇళ్లు లేదు. జాగ లేదు. అదొక్కటే బాధ ఉంది. వంగి కష్టం చేస్తే మంచి పంటలు తీయవచ్చు. –పెద్ద మల్లవ్వ, చిన్న మల్లవ్వ -
నెలల వయసున్న చిన్నారికి.. ఇంత పెద్ద ఐడియా ఎలా వచ్చింది?
సాధారణంగా ఏదైనా.. నేర్చుకోవాలనే తపన.. సాధించాలనే ఆశయం ఉన్నవారు చుట్టు జరుగుతున్న ప్రతి సంఘటన నుంచి ప్రేరణ పొందుతుంటారు. చాలా మంది తమ జీవితంలో గొప్ప గొప్ప కలలు, ఆశయాలను పెట్టుకుంటారు. దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు.. కొన్ని ఆటంకాలు ఎదురుకాగానే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. మరికొందరు మాత్రం.. తమ పట్టును వదలకుండా చివరి వరకు ఉండి తమకు కావాల్సిన దాన్ని సాధించుకుంటారు. వారికి మాత్రమే గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తాజాగా, ఇలాంటి స్ఫూర్తివంతమైన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు. దానికి ‘ కోశిశ్ కర్నేవాలోకీ హార్ నహీ హోతి హై..’ అంటే ‘నిరంతరం ప్రయత్నం చేసేవారు.. ఎప్పటికీ ఓటమి బారినపడరంటూ’ ట్యాగ్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నెలల వయసున్న అందమైన బుజ్జాయి మంచంపై కూర్చోని ఉంది. ఆ పసిపాప దగ్గరలో ఆమె తల్లిదండ్రులు లేరు. అయితే.. ఆ పాప.. తన తల్లికోసం అటూ ఇటూ చూసింది. మంచంపై నుంచి దిగాలనుకుంది. మంచం ఎత్తుగా ఉండటంతో ఆ బాలిక కిందపడిపోతానేమోనని భయపడింది. మంచంపైన కొన్ని దిండులు, బెడ్షీట్లు ఉన్నాయి. ఆ బాలిక నెమ్మదిగా పాకుతూ.. ఒక బెడ్షిట్ను మెల్లగా మంచం కింద పడేసింది. దాన్ని ఆధారంగా చేసుకుని దిగాలనుకుంది. నెమ్మదిగా చూసింది. పాపం.. చిన్నారికి కాళ్లు అందలేవు. ఆ తర్వాత.. మరో బెడ్షిట్ను కిందపడేసి చూసింది. అప్పుడు కూడా ఆధారందొరకలేదు. ఇప్పుడు అలాకాదని.. ఒక దిండుని లాగి కిందపడేసింది. ఇప్పుడు.. కొద్దిగా అందినట్లే ఉన్నా.. పూర్తి స్థాయిలో ఆధారం దొరకలేదు. చివరకు ఇలాకాదని .. ఆ బాలిక మరో ట్రిక్ వేసింది. మంచంపై ఉన్న మరో దిండును లాగి కింద పడేసింది. ఆ తర్వాత.. నెమ్మదిగా ఆ దిండును ఆధారం చేసుకుని నవ్వుతూ.. ఆనందంగా కిందకు దిగేసింది. చివరకు తన ప్రయత్నం ఫలించినందుకు చిన్నారి ఆనందంతో ముసిముసినవ్వులు నవ్వింది. కాగా, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. చిన్నారి ఎంత ముద్దుగా ఉందో..’, అంత చిన్న వయసులో ఐడియా ఎలా తట్టింబ్బా..’,‘ కష్టపడేవారికి ఎప్పటికైన విజయం లభిస్తోందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. -
‘ఇది చూస్తే చాలు భయాలన్నీ పోతాయ్’- ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: వ్యక్తిగత జీవితమైనా వ్యాపారమైనా ఎత్తు పల్లాలు సహాజం. కానీ కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు.. ఆ విపత్కర పరిస్థితులను ఎలా అధిగమించామన్నది ఎంతో కీలకం. ముఖ్యంగా వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న వ్యాపార రంగంలో ఉన్న వారు నిరంతరం ఒడిదుడుకుల మార్గంలో పయణిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో తనకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే ఓ వీడియోను మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలో ఓ చిన్నారి గోడను ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతీ కదలిక కష్టంగా ఉంటుంది. అయినా సరే చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆ చిన్నారి.. చివరకు గోడను ఎక్కేస్తుంది. This video is from a couple of years ago, but I don’t think it will ever be ‘dated.’ I like to put it on every now & then, especially when some personal or business goal is looking intimidating or impossible! All my fears vanish instantly… pic.twitter.com/9XtuyBVxwJ — anand mahindra (@anandmahindra) November 8, 2021 ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు ఆనంద్ మహీంద్రా ‘ ఈ వీడియో రెండేళ్ల కిందటిది. కానీ ఇది అవుట్డేడెట్ అనుకోవడం లేదు. చాలా తరచుగా ఈ వీడియోను నేను చూస్తుంటాను. ముఖ్యంగా వ్యక్తిగతంగా, బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు.. ఈ పని చేయలేం.. అసాధ్యం అనిపించినప్పుడు తప్పకుండా చూస్తాను. వెంటనే నా భయాలన్నీ మాయం అవుతాయి’ అంటు చెప్పుకొచ్చారు. చదవండి:మీరు నిజమైన సూపర్ హీరో: ఆనంద్ మహీంద్రా -
ప్రమోద్ భగత్ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం
సాక్షి, వెబ్‌డెస్క్: పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని మరోసారి నిరూపితం చేశాడు.. ప్రమోద్ భగత్. 1988 జూన్ 4న ఒడిశాలో జన్మించాడు. చిన్న వయసులోనే ప్రమోద్ భగత్ పోలియో బారిన పడ్డాడు. పోలియోతో ప్రమోద్ ఎడమకాలు చచ్చుబడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్ తండ్రి అందరిలాగా బాధపడలేదు. తన కొడుకును ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ప్రమోద్ ఎన్నో కష్టాలనోర్చి బ్యాడ్మింటన్‌లో మెలుకువలు నేర్చుకున్నాడు. అలా బ్యాడ్మింటన్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ప్రపంచ నెంబర్‌వన్ పారా షట్లర్‌గా ఎదిగాడు. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో ప్రమోద్ భగత్ స్వర్ణం సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్-3 కేటగిరీలో ప్రపంచనెంబర్‌వన్‌గా ఎదిగిన ప్రమోద్ భగత్ జీవితం ఇప్పుడు అందరికీ ఆదర్శం. చదవండి: చరిత్ర సృష్టించిన ప్రమోద్ భగత్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రమోద్ భగత్ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ ఆటకు ఆకర్షితుడయ్యాడు. తన ఇంటి పక్కనవాళ్లు బ్యాడ్మింటన్‌ను ఆడుతుండగా చూసిన ప్రమోద్ దానినే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో బాడ్మింటన్‌లో మెళుకువలు నేర్చుకున్న ప్రమోద్ తొలుత జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో టైటిల్స్ కొల్లగొట్టాడు. అనంతరం పారా బ్యాడ్మింటన్‌వైపు అడుగులు వేసిన ప్రమోద్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తాజాగా 2019లో దుబాయ్ వేదికగా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో పోటీ పడిన ప్రమోద్ స్వర్ణం సాధించి జాతిని గర్వించేలా చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకం తెచ్చేవారిలో ప్రమోద్ భగత్ ముందు వరుసలో ఉండగా.. తాజా విజయంతో దానిని సాకారం చేశాడు. చదవండి: అంధ అథ్లెట్‌కు ట్రాక్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన గైడ్ ప్రమోద్ భగత్ సాధించిన పతకాలు.. రికార్డులు ►SL3 కేటగిరీలో వరల్డ్ నెం .1 పారా-బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ప్రమోద్ భగత్ రికార్డు ►ఐడబ్ల్యూఏఎస్ వరల్డ్ గేమ్స్ 2019 పురుషుల సింగిల్స్, డబుల్స్ ,మిక్సడ్ డబుల్స్ ఈవెంట్లలో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం. ►ఆస్ట్రేలియా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో బంగారు, వెండి పతకాలు. ►ఆసియా పారా గేమ్స్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్స్‌లో గోల్డ్, కాంస్య పతకాలు ►2009 ఆసియా పారా గేమ్స్ సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో రజతం, బంగారు పతకాలు. ►RYLA ఇంటర్నేషనల్ ఛాలెంజర్ టోర్నమెంట్ 2007లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు Meet World No. 1 Para-Shuttler @PramodBhagat83 who has 4 BWF World Championships titles under his name. With hard work & determination, he is now ready to win a medal for 🇮🇳 at @Tokyo2020 #Paralympics Let us #Cheer4India #Praise4Para @PMOIndia @ianuragthakur @NisithPramanik pic.twitter.com/OPzP3SQa6n — SAI Media (@Media_SAI) August 17, 2021 #RaiseARacket 🏸 for Team India's 🇮🇳 medal contender at the @Paralympics in the SL3 category, Pramod Bhagat.#Tokyo2020 Qualifiers 👉 https://t.co/qPz99LGlUs#BadmintonUnlimited pic.twitter.com/B3eRnfa8gD — BWF (@bwfmedia) August 12, 2021 India continues to impress at #Tokyoparalympics2020. History created by #PramodBhagat. Congrats to him for winning #gold medal in Men’s Badminton SL3 category. This is a special moment for all Indians.#ParaBadminton pic.twitter.com/aafvzUmEqv — Y. Satya Kumar (@satyakumar_y) September 4, 2021 -
Two Years YS Jagan Ane Nenu: టార్చ్ బేరర్
వెబ్‌డెస్క్: వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలన అనుభవం రెండేళ్లు. కానీ పథకాలు ప్రవేశ పెట్టడంలో.. ప్రజా రంజక పాలన సాగించడంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రజల మధ్య గడిపిన అనుభవంతో ప్రజల నాడి పట్టుకున్నారు, వాళ్ల అవసరాలేంటో తెలుసుకున్నారు. వారి అక్కర తీర్చడంలో ఓ అన్నలా అలోచించి.. ఓ సీఎంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశానికే టార్చ్ బేరర్‌గా మారారు. అందుకు ఉదాహరణ కరోనా సంక్షోభ సమయంలో ఆనాథ పిల్లల సమస్యలను గుర్తించడంలో ఆయన ముందు చూపు, వారిని ఆదుకోవడంలో ఆయన చూపిన ఆతృత ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మేనమామగా కోవిడ్ మహమ్మారి ధాటికి ఎన్నో కుటుంబాలు చిద్రమైపోయాయి. ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. కానీ వీరందరి కంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన చిన్నారులు. ఆ చిన్నారుల సమస్యను అందరి కంటే ముందుగా పసిగట్టి దానికో పరిష్కారమార్గం చూపి తనలోని మానవీయ కోణం చాటుకున్నారు సీఎం జగన్. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో వారికి భరోసా కల్పించారు. వారికి ఉచితంగా చదువు చెప్పించి.. 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సొమ్ము వారికే దక్కేలా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రతీ సభలో అక్కా చెల్లెమ్మలంటూ నోరారా మహిళలను పిలిచే ముఖ్యమంత్రి జగన్... కోవిడ్ రక్కసికి బలైన అక్కా చెల్లెమ్మల పిల్లలకు మేనమామగా అసరా ఇచ్చారు.. తల్లిదండ్రులు లేని లోటు కొంతైనా పూడ్చేందుకు ప్రయత్నించారు. జగన్ బాటలో ఇతర సీఎంలు జగన్ సర్కారు నిర్ణయానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. సీఎం జగన్ నిర్ణయం ప్రకటించిన కొద్ది కాలానికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అదే బాట పట్టారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు , లేదా వారిలో ఒక్కరిని కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రతీ విద్యార్థికి ఉచితంగా చదువు చెప్పించడమే కాకుండా వారికి 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ. 2,500 నగదు సాయం చేస్తామని ప్రకటించారు. మిగిలిన దేశం కంటే ఒక రోజు ముందుండే కేరళ కూడా ఈ విషయంలో ఏపీ కంటే వెనుకే ఉండి పోయింది. సీఎం జగన్ నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే పినరయి విజయన్ కూడా ముందుకు వచ్చారు. కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలకు తక్షణ సాయంగా మూడు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో పాటు వారికి ఉచితంగా విద్య అందిస్తామని హమీ ఇచ్చారు. అనాథలైన పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ. 2,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇక తమిళనాడు సీఎంగా ఇటీవలే పదవి పగ్గాలు చేపట్టిన ఎంకే స్టాలిన్ రూ. 5,00,000 లక్షల సాయం ప్రకటించారు. ఏపీ బాటలో కేంద్రం ఆఖరికి కేంద్రం కూడా ఏపీ సీఎం జగన్‌ను అనుసరించక తప్పలేదు. కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్యను అందించడమే స్కాలర్షిప్ ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన వారి పేరిట రూ. 10 లక్షల కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేస్తామంది. వారికి 23 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సొమ్ము అందిస్తామంది. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాతో పాటు అనాథ పిల్లల ఉన్నత విద్యకు విద్యారుణం, వడ్డీ కట్టనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. -
దాల్చిని @ యాప్
మహిళలు ఆఫీసులలో పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. గొప్ప గొప్ప ప్రాజెక్టులను అవలీలగా క్లియర్ చేయవచ్చు. కానీ, వారు ఇంటికి తిరిగి రాగానే కుటుంబసభ్యుల నుంచి ‘తినడానికి ఏముంది?’ అనే సాధారణ ప్రశ్నను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఉదయం పనికి వెళ్ళే ముందు కూడా ఆ రోజుకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టి వెళుతుంటారు. వంట అనేది మహిళలకు ఓ పెద్ద సమస్య. దీనినే తన వ్యాపారానికి అవకాశంగా మలుచుకుంది ప్రేరణ. దాల్చిని పేరుతో మొబైల్ యాప్, ఐఓటి వెండింగ్ మెషిన్ల ద్వారా ఇంటి వంటను అందిస్తోంది. 2009లో ఐఎమ్‌టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో రజత పతకం సాధించిన ప్రేరణకు ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం మహిళలకు రోజువారీ వంట ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని దాల్చిని ద్వారా అందిస్తోంది ప్రేరణ. భార త సంప్రదాయ ఇళ్లలో వండిన ఆహారం కోసం ఏర్పాటు చేసిన భౌతిక మార్కెట్ ఇది. ఐఓటి ఆధారిత వెండింగ్ మెషిన్ల ద్వారా టిఫిన్ సేవల నెట్‌వర్క్‌నూ అందిస్తోంది. 36 ఏళ్ల ప్రేరణ మాట్లాడుతూ– ‘ఇంట్లో వండిన భారతీయ వంటకాలు, రొట్టెలు, స్నాక్స్ వంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంచే లక్ష్యంతో దాల్చిని ప్రారంభమైంది’ అని వివరించింది. వైవిధ్యమైన పాత్రలు వ్యాపారిగా, వృత్తి నిపుణురాలిగా, ఆరేళ్ల అమ్మాయికి తల్లిగా ప్రేరణ తన పని గంటల ప్రకారం సమయానుసారంగా కుటుంబసభ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఇబ్బందిని గుర్తించింది. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రేరణ... చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘పట్టణ వయోజన శ్రామిక జనాభాలో 69 శాతానికి పైగా పని కోసం బయల్దేరినవారికి ఇంట్లో వండిన ఆహారం లభించదు. హోమ్ టిఫిన్ సేవల్లో ప్రజలు మరింత రుచి, నాణ్యత, నమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే దాల్చిని ఏర్పాటయ్యింది’ అని వివరిస్తుంది ప్రేరణ. మహిళలే కీలకం ఐఓటీ వెండింగ్ మెషన్ దాల్చిని మెనూలో సోయా మసాలా క్రాకర్స్, మహారాష్ట్ర చివ్డా, మామ్ స్టైల్ అజ్వైని పరాఠా, హెల్తీ దాల్ పరాఠా, పార్సీ కేక్ రస్క్, గ్రీన్ బఠానీ మినీ సమోసా, గోబీ మంచూరియా, వెజిటబుల్ బిర్యానీ, మల్టీగ్రెయిన్ కుకీలు, సాస్‌తో వడాపావ్‌లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న తర్వాత, ఆర్డర్ ద్వారా చెల్లింపులు ఉంటాయి. యాప్ ద్వారా ‘ఆర్డర్లలో ముప్పై శాతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు స్వీకరిస్తాం. వ చ్చిన ఆర్డర్ల ప్రకారం ఆ ప్రాంతంలోని ఇంటి మహిళలకు సమాచారం చేరుతుంది. వారి ద్వారా సమయానుకూలంగా ఆర్డర్ చేసినవారికి వంటను అందిస్తాం. కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మహిళదే కీలకమైన బాధ్యత. పనిచేసే మహిళా నిపుణులకు ఇది సవాల్ లాంటిది. ఇతర వృత్తులలోని మహిళలకు వంట చేసే బాధ్యతను పంచుకునేందుకు తమ ఇంటి నుండి టిఫిన్ సేవలను నడుపుతున్నవారికి దాల్చిని అవకాశం కల్పిస్తుంది. ఇళ్లలోని మహిళా చెఫ్‌లకు అవకాశాలు కల్పించే మంచి యాప్ ఇది. తద్వారా వారు గుర్తింపును పొందుతున్నారు’ అని వివరిస్తుంది ప్రేరణ. -
కోహ్లితో సంభాషణ.. ఆటతీరు మొత్తం మారిపోయింది
జమైకా: గతేడాది జూన్ 2020లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా టెస్టు సిరీస్ తర్వాత పర్యటన రద్దైంది. అయితే మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకుంది. కానీ సిరీస్‌లో మొదటి టెస్టును విండీస్ జట్టు గెలిచి అప్పట్లో సంచలనానికి తెరదీసింది. దీనికి ప్రధాన కారణం.. విండీస్ వైస్ కెప్టెన్ జెర్మైన్ బ్లాక్‌వుడ్. మొదటి టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న విండీస్‌ను బ్లాక్‌వుడ్ తన బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో 154 బంతుల్లో 95 పరుగులు చేసిన బ్లాక్‌వుడ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్ క్రికెటర్లలో దాదాపు అందరూ పొడుగ్గా ఉంటే .. బ్లాక్‌వుడ్ మాత్రం చాలా పొట్టిగా ఉంటాడు. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు గెలిచిన తర్వాత బ్లాక్‌వుడ్‌ను అందరూ పొట్టోడు చాలా గట్టోడు అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచిన బ్లాక్‌వుడ్ మొత్తం రెండు హాఫ్ సెంచరీల సాయంతో 211 పరుగులు సాధించాడు. తాజాగా ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించడంపై ఒక వ్యక్తి కారణమంటూ జెర్మైన్ బ్లాక్‌వుడ్ ఇన్నాళ్ల తర్వాత స్పందించాడు. ఇంతకీ బ్లాక్‌వుడ్‌ను ఇన్స్పైర్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇంగ్లండ్ పర్యటనకు ముందు 2019లో టీమిండియా విండీస్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు రెండు టెస్టులు ఆడింది. అయితే బ్లాక్‌వుడ్ ఒక మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న కోహ్లితో కాసేపు మాట్లాడాడు. సుధీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలంటే చాలా బంతులను ఎదుర్కోవాలని కోహ్లి సూచించినట్లు బ్లాక్‌వుడ్ తెలిపాడు.చదవండి: బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు? '2019లో టీమిండియా మా దేశంలో పర్యటించినప్పుడు కోహ్లితో మాట్లాడేందుకు ప్రయతించా. అంతకముందు సోషల్ మీడియా వేదికగా కోహ్లితో పలుసార్లు చాట్ చేశాను. జమైకాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాను. ఆట ముగిసిన తర్వాత కోహ్లితో చిన్న సంభాషణ జరిగింది. నేను సెంచరీలు, అర్థసెంచరీలు చేయాలంటే ఎలా ఆడాలో చెప్పాలంటూ కోహ్లిని అడిగాను.. దానికి టెస్టులో సెంచరీ చేయాలంటే ఎన్ని బంతులు ఎదుర్కోవాలో చెప్పగలవా.. అంటూ నన్ను ప్రశ్నించాడు. నేను సుమారు 212 బంతులు ఎదుర్కొంటే సెంచరీ చేసే అవకాశం ఉంటుంది అని సమాధానమిచ్చాను. నువ్వు చెప్పిన జవాబులో అర్థం ఉంది.. అంటే ఎన్ని బంతులు సమర్థంగా ఆడగలిగితే అన్ని సెంచరీలు చేయొచ్చు అని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లితో సంభాషణ తర్వాత నా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. టెస్టు మ్యాచ్‌లో ఆడితే కనీసం 200- 300 బంతులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా... దాని ఫలితమే నాకు ఇంగ్లండ్ పర్యటనలో కనిపించింది.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా విండీస్ తరపున బ్లాక్‌వుడ్ ఇప్పటివరకు 33 టెస్టులాడి 1789 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు.. 13 అర్థసెంచరీలు ఉన్నాయి.చదవండి: 'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్ చేయండి' -
ఆ గుండె ఆగిపోలేదు
రెండేళ్ల క్రితం కశ్మీర్లో ఉగ్రవాదులతో ముఖాముఖి పోరాడుతూ మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తున్న క్షణాల్లోనూ చివరి వరకు మేజర్ కౌస్తుభ్ రాణే గుండె.. దేశం కోసమే కొట్టుకుంది. ఆ గుండె ఆగిపోదని, భార్యగా తను బతికున్నంత వరకు దేశం కోసం కొట్టుకుంటూనే ఉంటుందని శత్రువుకు చెప్పదలచుకున్నారు కనికా రాణే. అందుకే ఆర్మీలో చేరారు. శిక్షణ పూర్తి చేశారు. ఇప్పుడిక కమాండెంట్‌గా విధులకు సిద్ధమౌతున్నారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి నలభై తొమ్మిది వారాల శిక్షణను ముగించుకుని శనివారం నాడు క్యాంపస్ బయటికి వచ్చిన 230 మంది ఆర్మీ ఆఫీసర్లలో 29 ఏళ్ల కనికా కౌస్తుభ్ రాణే కూడా ఒకరు. నిజానికైతే ఆమె ఇప్పుడు ఏ మల్టీనేషనల్ కంపెనీలోనో ప్రాజెక్టు మేనేజరుగా లేదా అంతకంటే పైస్థాయిలో కొనసాగుతూ ఉండవలసినవారు. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేసి, ఎంబీఏలో పట్టభద్రురాలై ఉన్న కనికకు తను ఎంచుకున్న కెరియర్లో కొన్ని లక్ష్యాలు ఉండేవి. కొన్ని ధ్యేయాలు ఉండేవి. కొన్ని కలలు ఉండేవి. అవన్నీ పక్కనపెట్టి.. భర్త లక్ష్యాలు, భర్త ధ్యేయాలు, భర్త కలల్ని కనురెప్పల మధ్య ఒత్తుల్లా వెలిగించుకుని గత ఏడాది వార్ విడోస్ విభాగంలో సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష రాసి, ర్యాంకు సంపాదించి ఆర్మీలో చేరేందుకు అర్హత సంపాదించారు. అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్‌గా కమాండెంట్ బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. ఆ బాధ్యతలు ఆమె భర్త కౌస్తుభ్ రాణే మిగిల్చి వెళ్లినవి! రాణే భారత సైన్యంలో మేజర్. దేశమే ఆయన సర్వస్వం. దేశ రక్షణ, దేశ భద్రత, దేశ గౌరవం కోసమే ప్రతిక్షణం ఆలోచించాడు. అనుక్షణం కార్మోన్ముఖుడు అయి ఉన్నాడు. ప్రాణాలను ఫణంగా పెట్టి కశ్మీర్లో ఉగ్రవాదులతో తలపడుతూ ఆ భీకర పోరులో నేల కొరుగుతున్న క్షణంలోనూ ఆయన గుండె దేశం కోసమే కొట్టుకుంది. అయితే భార్యగా తను బతికి ఉన్నంత కాలం అతడి గుండె తన దేశం కోసం కొట్టుకుంటూనే ఉంటుందని శత్రువుకు చెప్పదలచుకున్నారు కనిక. అందుకే ఆర్మీలో చేరారు. 2018 ఆగస్టులో.. శ్రీనగర్‌కు 125 కి.మీ. దూరంలోని బందీపురా జిల్లా గురెజ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖను దాటి దేశం లోపలికి వస్తున్న ఉగ్రవాద చొరబాటు దారులతో పోరాడుతూ మేజర్ కౌస్తుభ్ రాణే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు హమీర్సింగ్, మన్‌దీప్‌సింగ్, విక్రమ్‌జీత్‌సింగ్ అనే ముగ్గురు సైనికులు వీర మరణం పొందారు. మేజర్ రాణేకు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు లభించింది. ఆయన భార్య కనిక ముంబై నుంచి ఉధంపూర్ వెళ్లి ఆ అవార్డును ఎంత అపురూపంగా అందుకుని వచ్చారో.. శనివారం చెన్నై పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆర్మీ యోగ్యత పత్రాలను అంతే అపురూపంగా, దీక్షగా అందుకున్నారు. ‘‘నా భర్త కలల్ని నిజం చేయడానికి ఆయన స్థానంలో నేను ఆర్మీలోకి వచ్చాను’’ అని ఆమె చెబుతున్న వీడియోను రక్షణశాఖ పీఆర్వో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘నా భర్త ఎప్పుడూ నా కలల్ని నిజం చేసుకోడానికి ప్రోత్సహించేవారు. ఆయన మరణంతో ఆయన కలలే నా కలలయ్యాయి’’ అని కనిక అన్నారు. ‘‘మా పాత్రలు మారాయంతే. లక్ష్యం, ధ్యేయం ఒక్కటే. దేశ భద్రత, దేశ రక్షణ’’ అని ఆమె చెబుతున్నప్పుడు ఆమె మాటలో పట్టుదల ప్రస్ఫుటమయింది. ఆర్మీ శిక్షణను కూడా ఆమె అంతే పట్టుదలతో పూర్తి చేశారు. ‘‘శిక్షణలో శారీరకబలం కంటే కూడా మానసిక బలం ఎక్కువ అవసరం. నేనెప్పుడూ వంద మీటర్ల దూరానికి మించి పరుగు తీయలేదు. ఇప్పుడు 40 కి.మీ. వరకు పరుగెత్తగలను! మనసు గట్టిగా ఉంటే మనిషికి గట్టితనం వస్తుంది’’ అన్నారు కనిక. ఆమెకొక కొడుకు. అగస్త్య (4). భర్త తల్లిదండ్రులు కూడా ఆమెతో ఉంటున్నారు. వారి బాధ్యతను తీసుకున్నట్లే, దేశ రక్షణ విధులనూ నిర్వర్తించేందుకు సిద్ధం అయ్యారు ఆర్మీ లెఫ్టినెంట్ కనిక. -
పడవ మీద తిరిగే ప్రాణదాత
మహారాష్ట్ర నందున్‌బర్ జిల్లాలోని చిమల్‌ఖడీ అనే అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తుంది రేణు వాసావె. నర్మదా నది పరీవాహం చుట్టుపక్కల పల్లెల నుంచి గర్భిణులు, నవజాత శిశువులు ఆమె దగ్గరకు పరీక్షకు, ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారానికి వచ్చేవారు. కాని లాక్డౌన్ తర్వాత గత ఆరు నెలల నుంచి గర్భిణులు కరోనా భయంతో రావడం లేదు. అయితే వారిని నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు రేణు. నర్మదా నదిలో తానే పడవ మీద తిరుగుతూ వారి వద్దకే వెళ్లి వస్తోంది. గత ఆరు నెలలు ఆమే వారి ఇంటికి వచ్చే ప్రాణదాతగా నిలిచింది. ‘సాయంత్రమైతే నా చేతులు లాగేస్తాయి. కాని పట్టించుకోను. గిరిజన మహిళల కోసం సేవ చేస్తున్నాన్న తృప్తి ఉంది నాకు’ అంటుంది రేణు వాసవె. ఆమె ఒక సాదా సీదా అంగన్వాడీ వర్కర్. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ తను చేయవలసిన పనులేవో చేస్తే ఆమెకు వచ్చే ఢోకా ఏమీ లేదు. ఆమెకు వీలు లేని పని చేయకపోతే ఎవరూ ఏమీ అనరు కూడా. కాని ఆమె అలా ఊరికే ఉండలేదు. తన డ్యూటీ తాను సక్రమంగా చేయాలనుకుంది. నది మీద తిరిగే ప్రాణదాతగా మారింది. అడవి స్త్రీల కోసం రేణు పని చేస్తున్నది చిమల్‌ఖడి అనే ఏజెన్సీ ప్రాంతంలో. అక్కడి అంగన్వాడి కేంద్రానికి గతంలో అయితే చుట్టుపక్కల గర్భిణులు, బాలింతలు వచ్చి తమకు కావలిసిన పరీక్షలు చేయించుకుని ఇచ్చే రేషన్‌ను తీసుకెళ్లేవారు. కాని కోవిడ్ వల్ల వారి రాకపోకలు హటాత్తుగా ఆగిపోయాయి. కొత్తగా గర్భం దాల్చినవారు, పిల్లల్ని కన్నవారు అంగన్వాడి కేంద్రాలకు రావడం మానుకున్నారు. కాని వారి ఆరోగ్యాన్ని పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి అందే ఆహారం, సౌకర్యాలు అందించడం అంగన్వాడి వర్కర్‌గా రేణు విధి. అందుకే ఆమె తానే వారి దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకుంది. అయితే ఆ గిరిజన పల్లెలకు రోడ్లు సరిగా ఉండవు. కాని వాటన్నింటి గుండా నర్మదా నది ప్రయాణిస్తుంది. అందుకే రేణు తన ప్రాంత బెస్తవాళ్ల దగ్గర పడవను అద్దెకు తీసుకుంది. ఆ పడవలో తెడ్డు వేసుకుంటూ పల్లెలకు తిరగసాగింది. 18 కిలోమీటర్లురోజూ ఉదయం ఏడున్నరకే రేణు వాసవె తన అంగన్ వాడీ కేంద్రానికి వెళుతుంది. అక్కడి రోజువారీ పనులు ముగించుకుని మధ్యాహ్నం భోజనం చేసి పడవ మీద నర్మదా నదికి బయలుదేరుతుంది. నదిలో దాదాపు 9 కిలోమీటర్లు వెళ్లి 9 కిలోమీటర్లు వచ్చి, అంటే 18 కిలోమీటర్లు తిరుగుతుంది. ఆమె తిరిగేది మర పడవ కాదు. తెడ్లు వేయాల్సింది. ఒక్కోసారి ఆమె బంధువు, మరో అంగన్వాడి కార్యకర్త సంగీత తోడు వస్తుంది. పడవలో ఆమె రోజు గర్భిణులకు, చంటి పిల్లలకు ఇవ్వాల్సి ఆహారం, బరువు తూచే మిషన్ తీసుకువెళుతుంది. ‘ప్రస్తుతం నేను 25 మంది చంటిపిల్లలను, 7 మంది గర్భిణులను పర్యవేక్షిస్తున్నాను’ అంటోంది రేణు. ఈత వచ్చు రేణుకు నర్మద నదిపై ఒక్కతే పడవ నడపడం అంటే భయం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమెకు ఈత వచ్చు. నది పై పడవ నడపడం కూడా వచ్చు. ‘మా ఆయనకు ఈత రాదు. కొంచెం భయపడుతుంటాడు నా గురించి. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు నన్ను మెచ్చుకుంటారు’ అంటుంది రేణు. గత ఆరు నెలలుగా వారంలో ఐదు రోజులు పడవ మీద తిరుగుతున్న రేణుని చూసి గిరిజన మహిళలు చాలా సంతోషపడతారు. ఆమెను తమ ఆత్మీయురాలిగా భావిస్తారు. చంటి పిల్లల్ని చేతుల్లోకి తీసుకుని ‘అత్త వచ్చింది చూడు’ అని రేణును చూపిస్తారు.అందరు ఉద్యోగులు ఇలా ఉండరు. ఇలాంటి వారే ఉద్యోగాలకు గొప్పతనాన్ని తెస్తారు. రేణు ఒక ఆత్మీయ బంధువు. – సాక్షి ఫ్యామిలీ -
కాలు లేదని కుంగిపోకుండా.. ఆత్మస్థైర్యంతో
సాక్షి, పాల్వంచ : శరీర అవయవాలన్నీ బాగున్నా..పనికి ఒళ్లొంచాలంటే సాకులు చెప్పేవారు ఇతడిని చూస్తే తమ తీరు మార్చుకుంటారు. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామానికి చెందిన బోగి ఉపేందర్ ఓ రోడ్డు ప్రమాదంలో తన కాలును కోల్పోగా..అంతే కుంగిపోతూ ఉండకుండా కోలుకుని ధైర్యంగా జీవిస్తున్నాడు. వంటి కాలుతో ఆటోనడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలుకు చేరుస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఇతను పాల వ్యాపారం చేసేవాడు. 2010 మార్చి28న పాల్వంచలో పాలుపోసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లక్ష్మీదేవిపల్లిలోని పెట్రోల్ బంక్ సమీపంలో భద్రాచలం జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడి కుడి కాలు నుజ్జునుజ్జవడంతో వైద్యులు మోకాలి వరకు తొలగించారు. కోలుకున్నాక..బాగా దిగాలు చెందాడు. అయితే..తనే ఆలోచించి ఇలా ఖాళీగా ఉండొద్దని భావించి ఆటో నడపాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో క్లచ్ ఉండడంతో డ్రైవింగ్ ఇబ్బందిగా మారలేదు. ఎవరి సహాయం తీసుకోకుండానే ప్రతిరోజూ అన్ని పనులూ తానే చేసుకుంటూ..ఆటో నడుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లి..సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాడు. భద్రంగా డ్రైవింగ్ చేస్తానని, అతివేగంగా అస్సలే వెళ్లనని, ఆటోలో కూర్చున్న వారిని సురక్షితంగా చేరవేస్తానని అంటున్నాడు. భార్య సౌజన్య, ముగ్గురు పిల్లలను ప్రేమగా చూసుకుంటానని, వారే తన బలమని ఎంతో ఆనందంగా చెబుతున్నాడు. -
స్మృతి ఇరానీ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా..
న్యూఢిల్లీ: దేశంలోనే ప్రముఖ వైవిద్య రాజకీయ నాయకులలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒకరు. సామాజిక సమస్యలపై నిత్యం స్పందిస్తు సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా తన అభిప్రాయాలను చెబుతుంటారు. తన జీవితంలో జరిగిన ప్రేరణ కలిగించే సంఘటనలను నిరంతరం పోస్ట్ చేస్తు అభిమానులను ఉత్సాహ పరుస్తుంటారు. తాజాగా స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేశారు. ‘ఇతరులకు మంచి చేయడానికి ప్రజలందరు ప్రయత్నించాలని.. మీరు చేసే మంచి పని వల్ల ఉహించని విధంగా లబ్ది చేకురుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు’. ఒకవేళ మంచి చేసే అవకాశం రాకపోతే కనీసం మంచి ఆలోచనలు చేయాలని సలహా ఇచ్చారు. ఈ పోస్ట్ ద్వారా ప్రజలకు ప్రేరణ కలిగించేందుకు స్మృతి ఇరానీ ప్రయత్నించారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 17,000మంది నెటిజన్లు స్మృతి ఇరానీ పోస్ట్‌కు లైక్ చేశారు. స్మృతి ఇరానీ పోస్ట్‌పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. చదవండి: మిస్సింగ్ పోస్టర్లు: 'స్మృతి ఇరానీ ఎక్కడ?' View this post on Instagram ..... even if it doesn’t do good anyways .Good thoughts , Good words , Good deeds #zarathustra 🙏 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Jun 6, 2020 at 12:59pm PDT -
మహాత్ముడు మహమ్మారిని జయించాడు
‘గాంధీ ప్రాణాలపై ఆయనకు కాదు, దేశానికి హక్కు ఉంది.. ఎందుకంటే ఆయన దేశం ఆస్తి’1918లో దేశం నలుమూలలా వినిపించిన మాట. అప్పటికి ఆయన ‘జాతిపిత’అనిపించుకోలేదు. ఆయన గురించి ఇంకా అంత గొప్ప ప్రచారం జరగలేదు. అయినా జనం ఇలా కోరుకున్నారు. ఆంగ్లేయులను తరిమే ఆశాకిరణంగా ఆయనను అప్పటికే భావించారు. వారి ఆవేదనకు అసలు కారణం.. దేశాన్ని శవాల దిబ్బగా మార్చిన స్పానిష్ ఫ్లూ బారిన ఆయన పడటమే. నీతులు చెప్పే ముందు ఆచరించి చూపే తత్వం ఉన్న గాంధీ, ఆరోగ్యమే మహాభాగ్యం సూత్రాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. మరి దాని ప్రభావమేనేమో.. ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ వైరస్‌ను జయించి ఆంగ్లేయుల పాలన అంతు చూసేందుకు అడుగు ముందుకేశారు.. సాక్షి, హైదరాబాద్: ఆంగ్లేయులను ఓడించటానికి ముందే మహాత్మా గాంధీ మహమ్మారిని జయించారు. రక్తం చిందించకుండా శాంతి మంత్రాన్నే ఆయుధంగా చేసుకుని ఆంగ్లేయులను జయిస్తే.. ఆరోగ్య సూత్రాలను నిరంతరం పాటించే అలవాటున్న ఆయన ప్రాణాంతక స్పానిష్ ఫ్లూ మహమ్మారిపై విజయం సాధించారు. నాడు మహాత్ముడు చెప్పిన ఆరోగ్య సూత్రాలను ప్రజలు పాటించి ఉంటే ఇప్పుడు కరోనా విషయంలో మన దేశం ఇంతగా భయపడి ఉండేది కాదేమో.. కనీసం ఇప్పటికైనా జాతిపిత ఆరోగ్య సందేశాన్ని మననం చేసుకుని ఆచరించే మనసుపెడితే భవిష్యత్తులో మహమ్మారుల వ్యాక్సిన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా మన ఇమ్యూనిటీతోనే తరిమికొట్టొచ్చు..!!! దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చి సరిగ్గా నాలుగేళ్లయింది.. 48 ఏళ్ల మహాత్మాగాంధీ సబ ర్మతి ఆశ్రమంలో నిరంతరం దీర్ఘాలోచనతో ఉంటున్నారు. అప్పుడు దేశంలోని చాలా ప్రాంతాలు కరువుకోరల్లో చిక్కుకున్నాయి. కాలం కలసిరాక అన్నదాత చెమట చుక్క బీళ్లు తేలి న భూముల్లో ఆవిరైంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం పన్నుల కోసం వేధిస్తోంది. ‘కరువు తీవ్రం గా ఉన్న సమయంలో పన్ను లు చెల్లించం’నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నదే గాంధీ దీర్ఘాలోచనకు కారణం. అందుకు ఆయన సత్యాగ్రహాన్ని నమ్ముకున్నారు. ఆ సత్యాగ్రహం ఎలా ఉండాల న్న విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో కలసి సమాలోచనలు చేస్తూ దానికి తుది రూపం ఇస్తున్నారు. కానీ కరువును మించిన ప్రమాదకారి అప్పటికే దేశంలోకి చొరబడిందన్న సంగతి మహాత్ముడికి తెలియదు. అదే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మందికిపైగా పొట్టనపెట్టుకున్న స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా. ఆ ప్రమాదకర వైరస్ తొలి దాడి సాధారణంగా ఉన్నా, రెండో విడత విరుచుకుపడింది. చూస్తుండగానే దేశం అల్లకల్లోలమైంది. కోటిన్నర మంది (కచ్చితమైన అంచనా లేదు) మన దేశంలో దానికి బలయ్యారు. అంతటి ప్రమాదకర వైరస్ దాడి ప్రారంభమైన సమయం. సబర్మతి ఆశ్రమంలో తన అనుచరులతో కలసి ఉన్న మహాత్ముడిని కూడా అది వదల్లేదు. తీవ్ర జ్వరం, అలసట, నీరసం, ప్రాణం ఉంటుందో లేదోనన్న బాధ.. స్పానిష్ ఫ్లూ ఆవహించిందని మహాత్ముడు సులభంగానే గ్రహించారు. సత్యాగ్రహాన్ని విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యం.. దాన్ని సాధించాలంటే ముందుగా వైరస్ చెర నుంచి విడిపించుకోవాలి. వెరసి బాపూ ముందు రెండు టార్గెట్లు.. ఆరోగ్య సూత్రాలే కాపాడి ఉంటాయి.. ప్రపంచం మొత్తాన్ని కబళించాలన్న కసితో పంజా విసిరిందా అన్నట్టు నాటి స్పానిష్ వైరస్ ఉగ్రరూపాన్ని చూసి మానవజాతే వణికిపోయిం ది. అంతటి భయంకరమైన వైరస్ బారిన పడ్డ వృద్ధుల్లో చాలామంది చనిపోయా రు. అలా అని మధ్య వయస్కులంతా బయటపడలేకపోయారు. కానీ శరీరం లో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నవారిలో చాలామంది వైరస్ సోకినా కూడా ప్రాణా లు దక్కించుకోగలిగారు. 48 ఏళ్ల వయసు కావటం వల్లనేమో గాంధీ కూడా దాన్ని తరిమేయగలిగారు. అయితే, అది అంత సులువుగా జరిగింది కాదు. గాంధీ జీవితంలో ఎక్కువ రోజు లు అనారోగ్యంతో గడిపిన సందర్భం అదేనట. కొన్ని నెలల పాటు ఆయన అనారోగ్యంతో పోరాడి గెలిచా రు. క్రమశిక్షణకు మారుపేరైన కరంచంద్ గాంధీ.. ఆరోగ్యం విషయంలోనూ అలాగే ఉండేవారు. ముఖ్యంగా ఆయన భోజన అలవాట్లు చాలా ఆరోగ్యకరం గా ఉండేవి. రాత్రి తొందరగా పడుకోవటం, ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేవడం, ధ్యానం, యోగా, వేళకు భోజనం, అదీ మితంగా, అందులోనూ సాత్వికాహారం.. వెరసి ఆయన శరీరం తన చేతుల్లో ఉండేది. కఠోర కాలాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించదగ్గ మానసిక స్థితి గాంధీని కాపాడిందని చరిత్రకా రులు చెబుతారు. ‘వందేళ్ల నాడు దాదాపు భారతీయులందరూ ఈ వైరస్ బారినపడ్డవారే.. కొందరిలో దాని తీవ్రత ఎక్కువ, కొందరిలో తక్కువ. చాలామందికి అసలు వైరస్ సోకిందన్న సంగతే తెలియదు. రోగ నిరోధక శక్తి ఉన్నవారు మామూలు జలుబు జ్వరంగానే భావించి దాని నుంచి బయటపడ్డారు. గాంధీ శరీరంలోకి చేరిన వైరస్ తీవ్రత గురించి తెలియదు. కానీ, క్రమశిక్షణతో కూడిన జీవనం, ఆహార అలవాట్లున్న వారు కాస్త తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వైరస్ నుంచి తేరుకోగలరు. గాంధీ అలా బయటపడి ఉండొచ్చు’ అని చరిత్రకారుడు డాక్టర్ రాజారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ సమయమే పోరాటపటిమను పెంచింది.. దేశం నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టాలన్న కసితో ఉన్న గాంధీకి ఆ వైరస్ సోకిన సమయం గొప్ప పోరా ట పటిమను పెంచిందంటారు. దేశంలో కోటిన్నర మంది చనిపోయేంత అతి తీవ్ర పరిస్థితులు నెలకొన్నా బ్రిటిష్ పాలకులు సరిగా వ్యవహరించకపోవటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. వారిని తరిమికొట్టే వరకు పోరు ఆపొద్దని గట్టిగా సంకల్పించుకున్నారు. ‘ఆరోగ్య’ నినాదానికి పదునప్పుడే.. స్వాతంత్య్రోద్యమంలో ప్రజలను సమాయత్తం చేసేందుకు దేశం నలుమూలలా తిరిగిన గాంధీ, వారిలో ఉత్తేజం నింపే ఉద్యమ మాటలే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడుకునే గొప్ప నినాదాన్నీ వారికి నూరిపోశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని ఊరూరుకు తీసుకెళ్లగలిగారు. ఇందుకు నాటి వైరస్ రోజుల్లో అనుభవించిన కష్టాలే కారణం. అప్పటికే ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చే గాంధీ, స్పాని ష్ ఫ్లూ లాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉండాలని పిలుపిచ్చారు. మహాత్ముడు.. మేక పాలు: ఆవు, గేదె పాలు తాగొ ద్దని నిర్ణయించుకుని చివరకు మేక పాలు తాగటాన్ని అలవాటు చేసుకున్న గాంధీ.. ఆ నిర్ణయాన్ని కడవరకూ ఎలా అమలు చేశారో ఆయన చరిత్రలో కథలు కథలుగా చెప్పుకొంటారు. మేకలు అన్ని చోట్లా ఉన్నా, వాటి పాలు అందుబాటులో ఉండవు. వాటిని తాగే వారి సంఖ్య అతి తక్కువగా ఉండటమే కారణం. గాంధీ వేరే ప్రాంతానికి వెళ్తే మేక పాలు దొరికేవి కావు. ఒకసారి ఆవు, గేదె పాలు తాగొద్దని నిర్ణయించుకున్నాక వాటిని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకపోవటం ఆయన నియమం. అందుకోసం ఆయన ఎక్కడికెళ్లినా వెంట మేకను తీసుకెళ్లే వారు, విదేశాలకు వెళ్లినా ఆయన వెంట రెండు మేకలు కూడా ఉండేవి. ఆ మాటలు ఆచరించి ఉంటే కరోనా కష్టాల తీవ్రత తగ్గేది ఆరోగ్యం విషయంలో మహాత్ముడు చెప్పిన అంశాలను నాటి జనం విన్నా, నేటి తరం పెడచెవిన పెడుతోంది. ఆరోగ్యం బాగుంటేనే ఉద్యమం చేయగలుగుతామని నాటి స్వాతంత్య్ర సమర సమయంలో గాంధీ తేల్చుకున్నారు. వైరస్ దెబ్బకు దేశం మొత్తం కుదేలవటాన్ని కళ్లారా చూసిన ఆయన, తొలుత ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితేనే బ్రిటిష్ వారిని తరమగలరని భావించారు. అందుకే తన ఉద్యమ ఉపన్యాసంలో ‘ఆరోగ్య మంత్రాన్నీ’చేర్చారు. తాను ఆచరించి చూపితేనే ప్రజలు అమలు చేస్తారని భావించి వారికి అదర్శంగా నిలిచారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ మాటను ఆయన నిజం చేసుకున్నారు ‘గాంధీలోని గొప్ప లక్షణం ఏంటంటే తను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుగా తను ఆచరించే జనాన్ని అనుసరిం చాలని కోరేవారు. ఆరోగ్యం విషయంలోనూ అంతే. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంద ని బలంగా నమ్మిన ఆయన, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ జనానికి చేసిన హిత బోధ మామూలుది కాదు. ఈ విషయంలో ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆరోగ్య సూత్రాలు పాటించే తత్వం అయినందునే ఆయన అత్యంత ప్రమాదకరంగా చరిత్రలో నిలిచిపోయిన స్పానిష్ ఫ్లూ నుంచి బయటపడ్డారని భావిస్తాను. నేను పాఠశాల విద్యార్థిగా ఉండగా, ఆయన ఫ్లూ బారిన పడి మళ్లీ పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎదిగిన తీరుపై మాట్లాడుకోవడం విన్నాను...’ – చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త -
చదివింది ఐదు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్
న్యూఢిల్లీ: కష్టపడితే విద్యార్హతలతో సంబంధం లేకుండా మెరుగైన ఉద్యోగం సాధించవచ్చని బెంగుళూరుకు చెందిన మహ్మద్ తన్వీర్ నిరూపించాడు. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ తన్వీర్ ఆర్థిక పరిస్థితులు సహకరించక కేవలం 5వ తరగతి మాత్రమే చదివాడు. ఆ తర్వాత వెల్డర్‌గా కొంత కాలం పని చేశాడు. కానీ అతనికి జరిగిన ఓ ప్రమాదం తన్వీర్ జీవితాన్నే మార్చేసింది. అప్పుడే అతను జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని నిశ్చయించుకున్నాడు. డిగ్రీలు లేకపోయినా సరే, పెద్ద ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రమాదం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో..మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్సు చేస్తున్న తన్వీర్ సోదరి అతడిని ఎంతగానో ప్రోత్సహించింది. ఆమె సహాయంతో అతను ఇంగ్లీషు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. తరువాత టైపింగ్ కోర్సు చేసి డాటా ఎంట్రీ ఉద్యోగం సంపాదించాడు. కానీ తన్వీర్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉండేది. దీంతో తొలుత అతను డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈవో స్పెషలిస్ట్ ఉద్యోగాలు చేశాడు. సాఫ్ట్వేర్ కొలువు సాధించాలని ఉన్నా డిగ్రీ అర్హతలు లేకపోవడంతో అతని మనసులో ఏదో మూలన నిరాశ తొంగిచూసేది. సరిగ్గా అదే సమయంలో మాసై స్కూల్ ఆఫ్ బిజినెస్ అతని లక్ష్యానికి దారి చూపింది. ఏ అర్హతలు లేకున్నా అతనికి 6నెలల కోడింగ్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కల్పించింది. కేవలం 6నెలల్లోనే తనకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం సాధించడానికి కావాల్సిన నైపుణ్యాన్ని అందించింది. దీంతో నేడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా ఉన్నత స్థాయిలో నిలదొక్కుకున్నానని తన్వీర్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కాగా ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని..వారి విద్యార్హతలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాసై సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ శుక్లా పేర్కొన్నారు. -
సెరెనా, మేరీలే స్ఫూర్తి!
విజయవాడ: అమ్మగా మారిన తర్వాత కూడా ఆటలో సత్తా చూపేందుకు బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌లే తనలో స్ఫూర్తి కలిగించారని ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి వెల్లడించింది. తన ఇటీవలి విజయం విశేషాలను వెల్లడిస్తూ హంపి ఈ వ్యాఖ్య చేసింది. తల్లి అయిన తర్వాత కూడా మేరీ కోమ్, సెరెనాలు వారి వారి క్రీడాంశాల్లో విశేషంగా రాణిస్తున్నారని, వారిలా తాను కూడా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తనకిష్టమైన రంగంలో పునరాగమనం చేయాలని అనుకున్నానని హంపి అన్నారు. అయితే ప్రపంచ చాంపియన్ అనే బిరుదు ఇంత త్వరగా లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇందులో తన కుటుంబం పాత్ర ఎంతో ఉందని ఆమె తెలిపింది. ‘ నేను నా పునరాగమనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. అందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నా. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే విధంగా చేశాను కూడా.’ అంటూ హంపి తన ప్రణాళిక గురించి తెలియజేసింది. ఓవరాల్‌గా తన 2019 ఏడాది ఘనంగా గడిచిందని... క్లాసికల్ విభాగంలో 30 రేటింగ్ పాయింట్లను, ర్యాపిడ్ విభాగంలో 45 రేటింగ్ పాయింట్లను సాధించానని గర్వంగా చెప్పుకుంది. -
ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు
సాక్షి, హుస్నాబాద్(సిద్దిపేట) : మారుమూల గ్రామాలకు సైతం కాన్వెంట్ బస్సులు వచ్చేస్తున్నాయి. సర్కాడు బడులంటే సమస్యల చిరునామాగా మారాయి. ప్రైవేటు పాఠశాలలో ఉన్న వసతులు ప్రభుత్వ బడుల్లో లేవు. చిన్న సంపాదన పరుడైనా పిల్లలకు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రైవేటు బడులకు పంపుతున్నారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను తను పని చేస్తున్న పాఠశాలలోనే పిల్లలను చేర్పించి చదివిస్తున్నాడు. ప్రైవేటు బడుల్లో ఎన్ని హంగులు ఉన్నా.. సర్కారు బడిలో నాణ్యమైన విద్య అందుతుందని పాటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తను పని చేసే బడిలోనే చేర్పించాడు.. మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోగిటి సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టపడి 1998లో డీఎస్సీ ద్వారా టీచర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇదే మండలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యాను బోధిస్తున్నారు. తను నడిచిన మార్గంలోనే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను ప్రభుత్వ బడికే పంపడం ప్రైవేట్ పాఠశాలల్లో రూ. వేలు ఖర్చు చేసి పిల్లలను చదివించే తల్లదండ్రులు సైతం ప్రభుత్వ బడి గురించి ఆలోచించేలా చేస్తుంది. సత్యనారాయణ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని భార్య విమల, గ్రామస్తులు అభినందిస్తున్నారు. పలువురు ఆయన బాటలోనే నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. బోధనలోనూ ప్రత్యేక శైలీ మండలంలోని తంగళ్లపల్లి పాఠశాలలో పనిచేసే సమయంలో సత్యనారాయణ విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించేవారు. ప్రత్యేక్షంగా వాటిని చూపించి పాఠం అర్థమయ్యేలా చేస్తారు. బరువులు కోలతల గురించి చౌకదారుల దుకాణం తీసుకెళ్లి అవగాహన కల్పించడం, లీటర్లు, కిలో గ్రాముల గురించి వివరించారు. వివిధ వస్తువుల వినియోగాన్ని ప్రత్యేక్షంగా చూపించి ఆ పరిసరాలను వారికి తెలియజేసి భోదించేవారు. అక్షయ ఫౌండేషన ద్వారా సేవ.. తన మిత్రులలో కలసి సత్యనారాయణ అక్షయ ఫౌండేషన్ ద్వారా గ్రామంతోపాటు చుట్టుపక్కల పల్లెల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ సంవత్సరం ఎండాకాలంలో రెండు నెలల పాటు 200 మందికి ఉచిత మజ్జిక పంపిణీ అందిస్తారు. పేద ప్రజలకు దుస్తులలతోపాటు దుప్పట్లు పంపిణీ చేస్తారు. విద్యార్థులకు చదువుకు అవసరమైన వస్తువులు అందజేసి వారిని చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటారు. పలు విషయాల్లో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పారుచుకున్న తోగిటి సత్యనారాయణ జిల్లా విద్యాధికారి అభినందించారు. -
మనతో మనం కనెక్ట్ అవ్వాలి
‘ఆర్టిస్టులను ప్రేక్షకులు చూసే కోణం వేరు, మమ్మల్ని మేము చూసుకునే కోణం వేరు. అందరికీ నేను నటి నిత్యా మీనన్‌ని కావచ్చు. కానీ నాకు కాదు’’ అంటారు నిత్యా మీనన్. షూటింగ్ లేని రోజు లేదా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఈ బ్యూటీ ఏం చేస్తారో తెలుసా? ఆ విషయం గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ – ‘‘నటిగా నా మీద ప్రేక్షకులకు కొన్ని అంచనాలు, అభిప్రాయాలు ఉండొచ్చు. అవన్నీ బయట నుంచి చూస్తూ ఏర్పరుచుకున్నవి. నా వరకూ నేను నటి నిత్యను కాదు. నార్మల్‌గా నాలాగే ఉండాలనుకుంటాను. నాతో నేను క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటాను. షూటింగ్ చేస్తున్న సమయంలో చాలా అలసిపోతాం. కోల్పోయిన శక్తినంతా ఖాళీ సమయాల్లో తిరిగి సంపాదించుకుంటాను. సెల్‌ఫోన్ బ్యాటరీలు రీచార్జ్ చేసుకున్నట్టే ఇది కూడా (నవ్వుతూ). మనతో మనం కనెక్ట్ అయితేనే నేచర్‌తో కనెక్ట్ అవగలం. నా శక్తినంతా నేచర్ నుంచి తెచ్చుకుంటాను. కేవలం శక్తి మాత్రమే కాదు నా ఇన్స్పిరేషన్ కూడా నేచరే’’ అన్నారు. -
ఇన్స్పిరేషన్ #తనూటూ..!
‘మీటూ’తో పెద్దపెద్ద హీరోల నిజస్వరూపాలనుబయటపెట్టేందుకు ప్రేరణగా నిలిచిన తనుశ్రీ..అకస్మాత్తుగా కామ్ అయిపోయారెందుకు?ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఇన్స్పిరేషన్గా నిలిచి, ‘ఇన్స్పిరేషన్’ అనే లఘుచిత్రాన్ని కూడా తీసిన తనుశ్రీ దత్తా ఆఖరి నిముషంలో చిత్రంలోని కథను ఎందుకు మార్చేశారు? ‘మీటూ’ పోరాటాన్ని మధ్యలోనే వదిలివెళ్లేలా ఆమెపై ఒత్తిడి తెచ్చినశక్తులే, ఆమె ‘ఇన్స్పిరేషన్’నూ దెబ్బతీశాయా?! తనుశ్రీ దత్తా తీసిన షార్ట్ ఫిల్మ్.. ‘ఇన్స్పిరేషన్’ ఈ నెల 8న మహిళా దినోత్సవానికి విడుదల కావలసి ఉంది. కానీ కాలేదు! మార్చి 19 తనుశ్రీ బర్త్ డే. ఆ రోజు కూడా ‘ఇన్స్పిరేషన్’ విడుదల అవలేదు! విడుదలై ఉంటే ఈసరికి బాలీవుడ్‌లోని పురుష పుంగవులు గగ్గోలు పెడుతూ ఉండేవారు. ‘ఇన్స్పిరేషన్’.. బాలీవుడ్ ‘మీటూ’ చీకటి కథల లఘుచిత్రం. అతుల్ భల్లా డైరెక్ట్ చేశారు. డైలాగ్స్ తనుశ్రీవే. భల్లా మునుపెన్నడూ సినిమాల్ని డైరెక్ట్ చెయ్యలేదు. కానీ స్త్రీపక్షపాతి. జర్నలిస్టు. గత ఏడాది ‘వధాయాన్ జీ వధాయాన్’ (శుభాకాంక్షలండీ శుభాకాంక్షలు) అనే పంజాబీ సినిమాకు మాత్రం డబ్బులు పెట్టాడు. రొమాంటిక్ కామెడీ అది. కామెడీకి డబ్బులు పెట్టిన మనిషిని, ‘సెక్సువల్ హెరాస్మెంట్’ థీమ్‌కి మనసు పెట్టమని అడిగారు తనుశ్రీ. ఓకే అన్నాడు ఆయన. తీశాడు కూడా. కానీ రిలీజ్ కాలేదు!! మాఫియా ఎంటర్ అయిందా?! ‘ఇన్స్పిరేషన్’ని రిలీజ్ చెయ్యొద్దని ఎవరైనా తనుశ్రీని బెదరించారా? బాలీవుడ్ మాఫియా రంగంలోకి దిగిందా? లేకా తనుశ్రీనే ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారా? తలనొప్పి ఎలా ఉంటుందో తనుశ్రీకి బాగా తెలుసు. ఆరు నెలలు ఇండియాలో ఉండి, ఇటీవలే ఆమె తిరిగి యు.ఎస్.వెళ్లిపోయారు. ఉండడం అక్కడి న్యూజెర్సీలో. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇండియా వచ్చిపోతున్నారు. ఈ ట్రిప్పులో మాత్రం ఊరికే వెళ్లలేదు తనుశ్రీ. ‘మీటూ’కు ఆజ్యం పోసి వెళ్లారు. ఆజ్యం అనే మాట కరెక్ట్ కాదు. ‘మీటూ’ను రాజేసి వెళ్లారు.అమెరికా నుంచి రెండేళ్ల తర్వాత గత ఏడాది జూలైలో ఇండియా చేరుకున్న మాజీ అందాలరాణి, బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి కొన్ని నిముషాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలో రూపురేఖలు మారిపోయి పూర్తిగా కొత్త మనిషిలా కనిపించడం పెద్ద విశేషం అయింది! తొలి చిత్రం ‘ఆషిక్ బనాయా అప్నే’లో ఎమ్రాన్ హష్మీతో నటించి, బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తనుశ్రీని విమానాశ్రయంలో కొద్దిమంది ఫొటోగ్రాఫర్లు మాత్రం గుర్తుపట్టారు. అంతేతప్ప ఆమె కారణంగా ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఊపిరి అందుతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె వచ్చేటప్పటికే మన దేశంలో మీటూ గురించి అక్కడో మాట ఇక్కడో మాట వినిపిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం.. ఈ మూడు చిత్రపరిశ్రమల నుంచి కొంతమంది నటీమణులు బయటికి వచ్చి.. ‘ఒకవేళ లైంగిక వేధింపులు ఉంటే వాటిని ఖండించవలసిందే’ అన్నంత వరకు మాట్లాడగలిగారు. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, సుస్మితాసేన్, రీమా ఛద్ధా, రాధికా ఆప్టే కూడా.. ‘మీటూ’ అన్నది సపోర్ట్ చేయవలసిన మూవ్మెంట్ అన్నంత వరకే స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారు. ఒక బాధితురాలిగా తొలిసారి బయటికి వచ్చి మీటూ ఫిర్యాదు చేసింది మాత్రం తనుశ్రీ దత్తానే. ఆమె ఇచ్చిన ధైర్యంతో బాలీవుడ్‌లోని అజ్ఞాత బాధిత మహిళలు, దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లోని మహిళా నటులు తామెలా లైంగిక వేధింపులకు గురైందీ రివీల్ చేశారు. సాజిద్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, అనూ మాలిక్, కైలాష్ ఖేర్, సుభాష్ కపూర్, సుభాష్ ఘాయ్, అలోక్ నాథ్.. ఇలా ఆరోపణలు వచ్చినవాళ్లంతా పరువు కోసం పరుగులు మొదలు పెట్టారు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. వారిలో నానా పటేకర్ ముఖ్యుడు. మనసుకు సర్దిచెప్పుకోలేకే..! నానా పటేకర్ జెంటిల్మన్. రైతు జన బాంధవుడు. ముంబై చుట్టుపక్కల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి వాళ్లకు ఒక్కొక్కరికీ లక్ష చొప్పున నగదు చెక్కులను ఇస్తూ కాస్త మంచి పేరును కూడపెట్టుకున్నాడు. తనుశ్రీ వచ్చి ఆ పేరును కూలగొట్టేశారు. పేరును కూలగొట్టడం ఆమె ఉద్దేశం కాదు. ఆత్మాభిమానం దెబ్బతిన్న కారణంగా పదేళ్లుగా ఆమె రగిలిపోతున్నారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రంలో ఒక సాంగ్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నప్పుడు నానా పటేకర్ ఆమెను వేధించాడు. అప్పటికి ఆయన స్టార్ యాక్టర్. అప్పటికి ఆమె మిస్ ఇండియా. కొత్తగా సినిమాల్లోకి వచ్చింది. వచ్చీ రాగానే చేదు అనుభవం. ఆ దెబ్బతో ఆమె సినిమాలు వద్దనుకుని వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఏకంగా హిమాలయాలకు వెళ్లి కూర్చున్నారు. అప్పటికి ఆమె వయసు ఇరవై ఐదేళ్లు. నానా పటేకర్ వయసు అప్పటికి 58 ఏళ్లు. అప్పుడు ఏమీ చేయలేక వెళ్లిపోయిన తనుశ్రీ, తిరిగొచ్చాక అతడి ముసుగు తొలగించారు. అయితే ఇదంతా కూడా తనుశ్రీ కల్పించినదే తప్ప నిజం కాదని ఆరోపిస్తూ ఆమెపై కేసు వేశారు నానా పటేకర్. కానీ ఆయన కరెక్ట్ మనిషా కదా అనే దానిపై పెద్దగా చర్చ జరగలేదు. తనుశ్రీని మాత్రం ఇండస్త్రీలోని అమ్మాయిలు, సీనియర్ మహిళా ఆర్టిస్టులు నమ్మారు. ఎక్కడో యు.ఎస్.లో ఉన్న మనిషి, ఇండియా వచ్చి, లేనిపోని తలనొప్పిని ఎందుకు తెచ్చుకుంటుంది అనే అనుకున్నారు. ఆ మాట నిజమే. తనుశ్రీకి మంచి లైఫ్ ఉంది. కానీ ఆ లైఫ్‌ని పశ్చాత్తాపం లేకుండా లీడ్ చెయ్యడానికి పాతవి తుడిచేసుకోవాలి కదా. ఇప్పుడు సమయం వచ్చింది. యు.ఎస్.లో మొదలైన మీటూ ఆమెలోని ఆనాటి నిస్సహాయతకు శక్తినిచ్చి, నిద్రాణంగా ఉన్న నిస్సత్తువను పోగొట్టింది. ‘వెళ్లి ఫైట్ చెయ్యి’ అని ప్రేరేపించింది. కథ ఎందుకు మారింది?! ఎందరికో ఇన్స్పిరేషన్ ఇచ్చి.. బాలీవుడ్లో, కోలీవుడ్‌లో, మాలీవుడ్‌లో.. ఎందరో బాధితుల్ని బయటికి రప్పించి, మర్యాదస్తుల అసలు రంగును బట్టబయలు చేసిన తనుశ్రీ తిరిగి తన ప్రశాంత జీవనంలోకి.. న్యూజెర్సీకి వెళ్లిపోయారు. అయితే అది నిజమైన ప్రశాంతతేనా?! కాదు అన్నదే సమాధానం. అందుకే ఆమె అర్థంతరంగా ముగించిన వెళ్లిన పోరాటాన్ని షార్ట్ ఫిల్మ్‌తో కొనసాగించాలనుకున్నారు. గత పదేళ్లలో ఎవరెవరు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైందీ సమాచారం సేకరించారు. స్క్రిప్టు రాసుకున్నారు. డైరెక్టర్నీ పెట్టుకున్నారు. ఫిల్మ్ కంప్లీట్ అయింది. కానీ రిలీజ్ కాలేదు. ఉద్యమంలోంచి వెనక్కు తగ్గినట్లే ఫిల్మ్ లోంచీ వెనక్కు తగ్గారా తనుశ్రీ. బాలీవుడ్ మాఫియా ఆమెను ఏమైనా హెచ్చరించిందా? అందుకే ఫిల్మ్‌ని చెత్తబుట్టలో వేసేశారా? అలాంటిదేమీ లేదంటున్నారు తనుశ్రీ. మొన్న బర్త్‌డే రోజు కూడా ఫిల్మ్ త్వరలో రిలీజ్ కాబోతోందని చెప్పారు. అయితే కథ మాత్రం అది కాదు అన్నారు!! అందులో బాలీవుడ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎపిసోడ్స్ ఏమీ లేవని చెప్పారు. మరి ఏం ఉంటుంది? ఇన్స్పిరేషనల్ టాక్ ఉంటుందట తనది. అది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంకే ఉండబోతోంది! అదీ చెప్పారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను ఉద్దేశించి ‘డూస్ అండ్ డోంట్స్’ ఉంటాయట. హార్వర్డ్ కి వెళ్లొచ్చాక ‘బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అతిథి వక్తగా ప్రసంగించడానికి నాకు అవకాశం వచ్చింది. నేను చాలా ఎక్సయిటెడ్గా ఉన్నాను’’ అని ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో తనుశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. పోస్ట్‌కి తగిలించిన తన ఫొటోలో కూడా ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించారు. కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వుతో అచ్చు హార్వర్డ్ స్కూల్ విద్యార్థినిలాగే ఉన్నారు. హార్వర్డ్ స్కూల్లో స్పీచ్ ఇవ్వడం అంటే మామూలు సంగతేం కాదు. ప్రపంచ ఆలోచనా ధోరణిని ప్రభావితం చేయగల భిన్న రంగాలలోని సుప్రసిద్ధులకు మాత్రమే ఆ ఆహ్వానం దక్కుతుంది. స్పీచ్ ఫిబ్రవరి 16న. వెళ్లొచ్చారు. చక్కగా మాట్లాడారు. తక్కిన వక్తల నుంచి, తన ప్రసంగానికి హాజరైన విద్యార్థుల నుంచి ఆమెకు ప్రశంసలు లభించాయి. మీడియా, మూవీస్, హ్యూమన్ ట్రెండ్స్.. ఇలా చాలావాటి గురించి తనుశ్రీ మాట్లాడారు. సమాజంలోని ‘మిసాజిని’ (స్త్రీద్వేషం) పైన ఆమె అభిప్రాయాలకు మాత్రం మంచి అటెన్షన్ లభించింది. ప్యానల్ డిస్కషన్లో కూడా తనుశ్రీ కూర్చున్నారు. ఒకరిద్దరు.. ఇండియాలో మీటూ పయనీర్‌గా ఆమెను గుర్తించారు. తనుశ్రీ నవ్వారు. ‘‘ధైర్యంగా బయటికి వచ్చిన ప్రతి స్త్రీ కూడా పయనీరే’’ అన్నారు. చొరవ, నాయకత్వ గుణం మాత్రమే స్త్రీలను వారు ఎదుర్కొనే ఇబ్బందులనుంచి బయటపడేస్తాయని చెప్పారు. స్త్రీ నుంచి పురుషుడికి లభించే సపోర్ట్ కన్నా, స్త్రీ నుంచి స్త్రీకి లభించే సపోర్టే ఎక్కువగా ఉంటుందనీ, అది మాత్రమే నమ్మకమైనది’’ అని తనుశ్రీ అన్నారు. హార్వర్డ్ స్పీచ్ ఇచ్చి వచ్చాక తనను కలిసిన ఫిల్మ్ క్రిటిక్, జర్నలిస్ట్ సుభాష్ కె. ఝాతో మాట్లాడినప్పుడు ఆమెలో అతడికి మునుపటి తనుశ్రీ కన్నా భిన్నమైన వ్యక్తి సాక్షాత్కరించారు. ముఖ్యంగా ఆమె తీస్తున్న ‘ఇన్స్పిరేషన్’ ఫిల్మ్ గురించే ఆయన తరచి తరచి అడిగారు. 20 నిముషాల నిడివి ఉండే ఆ చిత్రం ఇన్‌సైట్‌తో (లోతైన దృష్టి), క్రిస్ప్‌గా (సంక్షిప్తంగా) డైరెక్టుగా (నీళ్లు నమలకుండా) ఉంటుందని ఆమె చెప్పారు. అంటే.. చిత్రం ఎలా ఉంటుందన్నది మాత్రమే తనుశ్రీ చెప్పారు. ఏం ఉండబోతోందన్న చెప్పలేదు. ఇప్పుడు అదీ క్లియర్ చేసేశారు. అదొక ఆసక్తికరమైన హార్వర్డ్ స్పీచ్‌లా మాత్రమే ఉండబోతోంది. -
స్ఫూర్తిని నింపిన ‘సమరశంఖారావం’
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ సీపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో సోమవారం కాకినాడలో జరిగిన ‘సమరశంఖారావం’ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ శ్రేణులకు ఓ వైపు ధైర్యం నూరిపోస్తూ, టీడీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ చేసిన ప్రసంగం పార్టీ కేడర్‌కు ఇతోధిక స్ఫూర్తిని కలిగించింది. నాలుగున్నరేళ్ళుగా ప్రతి కార్యకర్తా ఆర్థికంగా, కేసుల పరంగా ఎంతగానో నష్టపోయారని, వీరందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయంటూ జగన్ ధైర్యం నూరిపోశారు. రానున్న నెలరోజులు ఎంతో కీలకమని, ప్రతి కార్యకర్తా బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక జరిగిన తొలి సభ కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు తరలి రావడంతో సభాప్రాంగణం ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. ఆయా ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. మంచిరోజులు రానున్నాయన్న ఆనందం పార్టీ శ్రేణుల్లో కనిపించింది. సైనికుల్లా పనిచేయాలి రానున్న నెలరోజులూ ఎంతో కీలకం. ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలి. బూత్‌స్థాయి కన్వీనర్లు, సభ్యులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రూపొందించిన నవరత్న పథకాలను ప్రజలకు చేరవేయాలి. పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి. – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ పచ్చి అవకాశవాది చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దగా చేసిన బీజేపీతో ఇంతకాలం కొనసాగి ఇప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకులు చేసే గిమ్మిక్కులను ప్రజలు నమ్మేస్థితిలో లేరు. – కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు -
మెకానిక్ అరుణ
సాక్షి, కొత్తకోట: మెకానిక్‌లు అంటే పురుషులే ఎక్కువగా ఉండటం మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద వాహనాలకు టైర్లు విప్పి పంక్చర్ చేయడం.. గాలి పట్టించడం పురుషులకే కష్టంగా ఉంటుంది. కానీ వీటన్నింటిని సునాయసంగా చేస్తోంది ఓ మహిళ. ఒకవైపు భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. పిల్లల చదువు, కుటుంబ పోషణకు అండగా నిలుస్తోంది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన అరుణ. అడ్డాకుల మండలం కాటారం గ్రామానికి చెందిన అరుణకు కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన మద్దిలేటితో ఎనిమిదేళ్ల క్రిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఆర్థిక స్థోమత లేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. భర్త మద్దిలేటి వాహనాల టైర్ల పంక్చర్లు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే మద్దిలేటి వద్దకు రోజురోజుకు పంక్చర్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికితోడు ఇంట్లో ఖర్చులు సైతం అధికమయ్యాయి. దీంతో పనిచేస్తున్న భర్తను చూసిన అరుణ మొదట టైర్లు విప్పడానికి కావాల్సిన సామగ్రిని అందజేసేది. అలాగే మెల్లగా ద్విచక్రవాహన టైర్లను విప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్క బైక్ టైర్లనే కాకుండా ఆటో, కారు, వ్యాను, లారీ టైర్లను విప్పుతూ పంక్చర్లు చేస్తూ తోడుగా ఉంటుంది. రుణం ఇచ్చి ఆదుకోవాలి స్వయం కృషిని నమ్ముకొని పనులు చేసుకుంటున్న మాలాంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కష్టపడి పనిచేస్తూ బతికే వారు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటారు. రుణం ఇస్తే దుకాణాన్ని మరింత పెద్దగా చేసి ఆర్థికంగా మెరుగుపడి మా పిల్లలను బాగా చదివించుకుంటాం. – అరుణ, మెకానిక్, కొత్తకోట -
ఫియర్లెస్ జర్నలిస్ట్
పేరు ఫే డిసూజా.. ఫియర్లెస్ జర్నలిస్ట్. మిర్రర్ నౌ ఎడిటర్. ఆశారాం బాపూ దగ్గర్నుంచి శానిటరీ నాప్కిన్స్ దాకా అన్ని విషయాల మీద నిష్పక్షపాతంగా చర్చను కొనసాగిస్తుంది. జర్నలిస్ట్‌గా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడ్డానికి కృషిచేస్తోంది. ఈ క్రమంలో చాలాసార్లు ట్రోలింగ్కి గురైంది. అయినా వెరవలేదు. తన పంథా మార్చుకోలేదు. ఫే డిసూజా నిర్వహించే ప్యానెల్ డిస్కషన్‌కి రావడానికి చాలామంది పెద్దలు ఇష్టపడ్తారు. అరవడాలు, వచ్చిన వాళ్ల నోరు మూయించే ప్రయత్నాలు లేకుండా.. చర్చ చక్కగా.. ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా ఉంటుందని. జెండర్ ఈక్వాలిటీ గురించి కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతుంది. ఆమె ఎక్కడ కనపడ్డా.. గుర్తుపట్టి పరిగెత్తుకొస్తారు.. ‘‘మీరంటే నాకు ఇష్టం’’ అని.. ‘‘మీరంటే మాకు అడ్మిరేషన్’’ అని, ‘‘మీరు మాకు ఇన్స్పిరేషన్’’ అని అభిమానం కురిపిస్తారు. ఆమె స్వస్థలం బెంగుళూరు. అక్కడి మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో జర్నలిజం చదివింది. అప్పుడే బెంగళూరు ఆల్ ఇండియా రేడియోలో న్యూస్‌రీడర్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది. సీఎన్‌బీసీ టీవీ18తో కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత బిజినెస్ రిపోర్టింగ్ వైపు మళ్లింది. 2008లో ఈటీ(ఎకనమిక్ టైమ్స్)లో పర్సనల్ ఫైనాన్స్ ఎడిటర్‌గా చేరింది ఫే డిసూజా. -
ముందడుగు
ద ఇయర్ ఫర్ విమెన్.. 2018 సంవత్సరపు ఇంటర్నేషనల్ విమెన్స్ డే థీమ్. నిజంగా.. నిస్సందేహంగా అది మహిళల సంవత్సరమే. చరిత్ర ఎప్పుడూ బలవంతుల చెప్పుచేతల్లోనే ఉంటుంది. కాని 2018.. దీనికి భిన్నం. అణగారిన జెండర్ వైపు నిలబడింది. ఇన్నాళ్లూ ఏ ఎవరికివారే నిశ్శబ్దంగా భరించిన అవమానాలను తోటి స్త్రీకి చెప్పుకోవడం మొదలైంది. ఆమె విన్నది. రోజూ తనకు జరుగుతున్నవే. తోడు ఉండాల్సిన అవసరాన్ని గ్రహించింది. చేయి పట్టుకుంది. ఆ సఖ్యత ప్రపంచమంతా నిండింది. పురుషాధిపత్యంపై మహిళలు చేస్తున్న ఈ పోరుకు మద్దతునిచ్చింది 2018.. ఓ చెలిలా! విజయాన్ని కాంక్షిస్తూ చరిత్రలో ఓ కొత్త పుటలా మెరవనుంది! 1. చట్టబద్ధత కోసం ఐర్లాండ్‌లో అబార్షన్‌ను చట్టబద్ధం చేయాలని ఆ దేశ స్త్రీలు చేసిన న్యాయపోరాటం గెలిచింది. అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించాలంటే ఆ దేశ రాజ్యంగాన్ని సవరించాలి. దాని కోసం ఓటింగ్ జరిగింది. అలా గతేడాది మేలో ఐర్లాండ్ రాజ్యాంగం ఎనిమిదవ సవరణ ద్వారా అబార్షన్ చటబద్ధమైంది. ఇదీ అక్కడి మహిళలు సాధించుకున్న హక్కే. 2. హయ్యస్ట్ ఫిమేల్ కేబినేట్ జూన్‌లో స్పెయిన్ ప్రధానమంత్రి.. తన మంత్రివర్గంలో పురుషుల కన్నా ఎక్కువ మంది స్త్రీలకు చోటిచ్చాడు. కేబినేట్లో మొత్తం పదిహేడు మంది మంత్రులుంటే అందులో పదకొండు మంది మహిళలను మంత్రులుగా నియమించి స్పెయిన్ పాలనలో కొత్త మార్పుకు నేతృత్వం వహించాడు. దీంతో యూరప్‌లోనే హయ్యస్ట్ ఫిమేల్ కేబినేట్ కంట్రీగా స్థానం దక్కించుకుంది స్పెయిన్. 3. చేతికి డ్రైవింగ్ వీల్ గత యేడాది జూన్.. సౌది అరేబియా స్త్రీలకు రెక్కలు తొడిగింది. చేతికి డ్రైవింగ్ వీల్ అప్పగించింది. యెస్.. అప్పటిదాకా ఆ దేశంలో మహిళలు డ్రైవింగ్ చేయకూడదు అని ఉన్న నియమాన్ని డాష్‌బోర్డ్‌లో దాచి.. ఆడవాళ్ల చేతులకు వెహికిల్స్ తాళాలు అప్పగించింది. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇప్పించింది. ఆడవాళ్ల డ్రైవింగ్ మీదున్న బ్యాన్‌ను తొలగించింది. 4. మీ టూ.. టైమ్స్ అప్.. విమెన్ ఆఫ్ కలర్ స్త్రీలను గౌరవించే విషయంలో అగ్రరాజ్యం అమెరికాకూ చాలా అవలక్షణాలున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహిళల మీద చేసే వాఖ్యలే ఇందుకు ప్రధాన నిదర్శనాలు. మీ టూ మూవ్‌మెంట్‌కు పుట్టిల్లు కావడమూ మరో సాక్ష్యం. మీ టూ తర్వాత టైమ్స్ అప్ కూడా అక్కడే రాజుకోవడమూ తదుపరి ఉదాహరణ. అంతే చైతన్యమూ ఉందని రుజువు చేశాయి నవంబర్‌లో ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికలు. రికార్డ్ సంఖ్యలో మహిళా ప్రతినిధులను ఎన్నికొని. ముఖ్యంగా బ్లాక్ విమెన్ ఎక్కువ మంది ఎన్నికయ్యారు. వాళ్లలో ఆఫ్రికన్ ముస్లిం ఇల్హా ఒమర్ ఒకరు. 5. ఇరాన్ స్త్రీల సాహసం.. ఇరాన్లో పురుషులతో కలిసి మైదానంలో ఆటలను చూడ్డం స్త్రీలకు నిషేధం. అయినా లెక్కచేయకుండా గత యేడాది జూన్ 25న టెహరాన్‌లోని ఆజాది స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ గ్రూప్ బి ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూశారు ఇరానీ ఆడపడుచులు.‘‘ పురుషులతో కలిసి’’. 6. మరిన్ని మంచి సంగతులు.. 2018 నోబెల్‌కు కూడా ఓ ప్రత్యేకత ఉంది... ఆ యేడు నోబెల్ శాంతి బహుమతిని ఇద్దరు కలిసి తీసుకున్నారు. వాళ్లలో ఒకరు డాక్టర్. రేప్ బాధితులకు వైద్యసేవలందించే సర్జన్.. డెనిస్ ముక్వేజ్. ఇంకొకరు రేప్ విక్టిమ్. నాదియా మురాద్. ఇరాక్‌లోని యజిది అనే ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన యువతి. ఐఎస్ఐఎస్ చెరకు చిక్కి.. కొన్నేళ్లు లైంగిక హింస భరించి చివరకు తప్పించుకుని యాక్టివిస్ట్‌గా మారి.. తనలాంటి ఎందరో రేప్విక్టిమ్స్కు సేవలందిస్తున్న సాహసి. వీళ్లద్దరూ కలిసి ఆ యేటి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. – సరస్వతి రమ ప్రపంచంలో... మహిళల హక్కుల సాధనలో 2018 ప్రపంచానికి అద్భుతమైన ప్రేరణను.. తర్వాత సంవత్సరాలకు గొప్ప స్ఫూర్తినీ పంచింది. ఉదాహరణలు చాలా... కొన్నిటిని ప్రస్తావన.. ఆస్కార్స్‌తో శుభారంభం... ఆస్కార్‌లో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగాల్లో మహిళలే ఆస్కార్స్ గెలుచుకొని ఈ యేటికి శుభారంభం పలికారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘షాలో’ (ఎ స్టార్ ఈజ్ బార్న్)కి లేడీగాగా, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్కిగాను (బ్లాక్‌పాంథర్ సినిమా) రుత్ కార్టర్, బెస్ట్ ప్రొడక్షన్‌కు (బ్లాక్ ఫాం«థర్) హాన్నా బీచ్లర్ ఆస్కార్ పురస్కారం పొందారు. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ (షార్ట్)కోసం ‘పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్’కు దర్శకత్వం వహించిన రేయ్‌కా జెహతాబ్చీ ఆస్కార్ అందుకున్నారు. 2018 .. అమెరికా రాజకీయ చరిత్రలో వర్ణ వివక్ష (మహిళ విషయంలో)ను బ్యాలెట్ బాక్స్‌ల్లో కుక్కేస్తే.. 2019.. ఆస్కార్ స్టేజ్ మీద ఓడించింది.. నల్ల కలువలను గెలిపించి. ఈ యేడాదంతా ఈ ఒరవడే సాగుతుందని.. తర్వాత సంవత్సరాలకూ బదిలీ చేస్తుందని విశ్వసిద్దాం. -
స్పూర్తి కథలు
క్రిస్మస్ ప్రత్యేకం పవిత్ర గ్రంథం మనకు చెప్పేది కరుణలో, క్షమాగుణంలో, ప్రేమలో, ఆదరణలో, త్యాగంలో, సేవలో పవిత్రత ఉంటుందని. మన జీవితాలను నలుగురికి పనికి వచ్చేలా కొందరికి ఉదాహరణగా, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రార్థిస్తూ మీకు అందిస్తున్న కొన్ని స్ఫూర్తికథలు... పంచదార మానేశాడు! కలకత్తాలో ఒకసారి పంచదారకు కొరత ఏర్పడింది. ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ హోమ్‌లోని పిల్లలకు పాలలో కలిపి ఇవ్వడానికి కూడా పంచదార దొరకడం లేదని ఎట్లా తెలిసిందో, నాలుగేళ్ల పసివాడు తన తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు! వాళ్ల చేతిలో పంచదార పొట్లం ఉంది. మదర్ థెరిసాకు ఆశ్చర్యమేసింది.‘‘ఏం చెప్పి మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు’’అని వాళ్లను అడిగారు మదర్.‘‘మూడు రోజులుగా వీడు పాలలో పంచదార వేసుకోవడం లేదు’’.. చెప్పింది తల్లి.‘‘తన కోసం వేసే పంచదారను మిగిల్చి మీ హోమ్‌లోని పిల్లలకు ఇమ్మన్నాడు’’ అని చెప్పాడు తండ్రి.పసివాడిని దగ్గరకు తీసుకున్నారు మదర్. ఆమె పేరు పలకడం కూడా వాడికి రాదు. కానీ తను చేయవలసింది ఏమిటో ఆ వయసుకి అర్థమయింది!! ఉన్నదాన్ని పంచుకోవాలన్న ఆలోచన తప్ప,ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నించే వయసు కూడా కాదది.‘‘భగవంతుడు మనిషి మనసును ఎంత అందంగా సృష్టించాడు!’’ అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్నారు మదర్.ఆ పిల్లవాడు అలా చేశాడంటే నమ్మాలని అనిపించకపోవచ్చు.దేవుడి మహిమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తుంటాం. దేవుడి గొప్పతనం, ప్రేమ గొప్పతనం, పలకరింపు గొప్పదనం, ప్రశాంతత గొప్పతనం, చిరునవ్వు గొప్పతనం తెలుసుకోవాలంటే ఎవరికైనా సేవ చేసి చూడండి. ‘‘గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. చిన్న పనులనే గొప్ప ప్రేమతో చెయ్యండి చాలు’’ అన్నది మదర్ చెప్పిన మాటే. ఎన్నో గుండెల తడి నారాయణరావుది శ్రీకాకుళం. చాలా రోజుల నుంచి గుండెనొప్పి వస్తుండటంతో హైదరాబాద్‌కు వచ్చి పెద్ద డాక్టర్‌కు చూపించుకోవాలనుకున్నాడు. మంచి పేరున్న ఓ డాక్టర్ గారి క్లినిక్‌కు కొడుకుతో పాటు వచ్చాడు. సరిగ్గా క్లినిక్ ముందు తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్ వాళ్లు నారాయణరావును దగ్గర్లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.. ఉచితంగానే! పెద్దాసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స మొదలుపెట్టాక గుండె స్పందనలు కాస్త బలహీనంగానే మొదలైనట్టు డాక్టర్లు గుర్తించారు. అయితే స్పృహతప్పి ఉండటంతో మెదడు చేతనంగా ఉందో లేదో తెలియదు. కానీ తన తండ్రిని ఎలాగైనా బతికించమని కోరిన కొడుకు కన్సెంట్ మేరకు నారాయణరావుకు యాంజియోప్లాస్టీ చేశారు. ఆయన పేదరికం గమనించిన ఆసుపత్రివర్గాలు అత్యవసరమైన కొన్ని ఖర్చులకు తప్ప దాదాపుగా ఫీజు మాఫీ చేశాయి. ఇంతలో మరో కాంప్లికేషన్. అతడి కిడ్నీ ఫెయిలయ్యింది. నెఫ్రాలజిస్ట్ వచ్చారు. ఆయనా తన సేవల్ని చాలావరకు ఉచితంగానే అందించారు. మిగతా చికిత్సకోసం ఉస్మానియాకు తీసుకెళ్లమని, అక్కడ చికిత్సలన్నీ ఉచితంగానే జరిగేలా చూస్తామంటూ డాక్టర్లు సూచించారు. కానీ ఒకసారి చూపించుకొని వెళ్దామనుకున్న తాము ఇప్పటికే చాలా రోజులు హైదరాబాద్‌లో ఉండిపోవాల్సి వచ్చిందనీ, విశాఖపట్నానికి వెళ్తే తమకు ఒకింత సౌకర్యంగా ఉంటుందంటూ రోగి బంధువులు ఆయన్ని విశాఖకు తీసుకెళ్లారు. మొట్టమొదట చికిత్స అందించిన డాక్టర్ అతడి గురించి మరచిపోయారు. సరిగ్గా మూడు నెలల తర్వాత ఒకరోజు నారాయణరావు తన కొడుకుతో కలిసి డాక్టర్గారి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించాడు. నారాయణరావు కొడుకు డాక్టర్‌కు పాదాభివందనం చేశాడు. దాదాపు మృత్యువు ఒడిలో ఉండి, కిడ్నీలు దాదాపుగా పూర్తిగా విఫలమైన అతడు బతుకుతాడని అప్పుడెవరూ అనుకోలేదు. కానీ నారాయణరావు బతికి అలా నడిచివస్తుండటం చూసి డాక్టర్గారికి చాలా సంతోషంగా అనిపించింది. మొదట తాను, తర్వాత అంబులెన్స్‌వారు, పిమ్మట ఆసుపత్రి యాజమాన్యం, ఆ తర్వాత నెఫ్రాలజిస్ట్ చేయగలిగినంతా చేసి, రోగికి ఖర్చులు తగ్గించారు. విశాఖలోనూ అతడికి సేవల్ని చాలామంది దయతో అందించారని తెలిసింది. ఆ కొడుకు కూడా తనకు ఉన్నదంతా తండ్రి వైద్యం కోసం తెగనమ్మేశాడు. విలువలు లుప్తమైపోయాయని మనలో చాలామంది అనుకుంటుంటారు. కానీ.. మనిషిలో మానవత్వం,కళ్లలో దయ, గుండె కింద తడి, మనసులో ఆర్ద్రత ఇంకా ఉన్నాయనీ ఈ సంఘటనతో మరోమారు రుజువైంది. తరాలుగా కృతజ్ఞత 1955 –1960ల నాటి రోజులు. ఒక పెద్దాయన తన కొడుకును చూడటానికి దాదాపు 200 కి.మీ. దూరం నుంచి వస్తున్నాడు. గమ్యం మరో 50 కి.మీ. ఉందనగా బస్సు ఫెయిలయ్యింది. అప్పటికి సాయంత్రం నాలుగయ్యింది. మరో రెండు గంటల్లో చీకటి పడితే బస్సులుండవు. పైగా చుట్టూ అడవి. చేసేదేమీ లేక ఆ పెద్దాయన తన తలపాగా బిగించికట్టి గమ్యం వైపునకు నడవడం మొదలుపెట్టాడు. కాసేపట్లో ఒక మోటారు కారు ఆయన పక్కనే ఆగింది. అడవిలో అపరిచితులను నమ్మని ఆ రోజుల్లో కారులోని వారు కిందికి దిగి, ఈ టైమ్‌లో మీరెక్కడికి వెళ్తున్నారంటూ వాకబు చేశారు. పెద్దాయన జరిగింది చెప్పాడు.వాళ్లు నవ్వి.. ‘50 కి.మీ. నడుస్తూ వెళ్లగలరా? అందునా ఈ వయసులో’ అన్నారు. తామూ ఆ ఊరిమీదుగానే నగరానికి వెళ్తున్నామనీ, ఊళ్లో దింపేస్తామంటూ కార్లో ఎక్కించుకుని, కొడుకు దగ్గర దింపేసి వెళ్లారు. ఇప్పుడా పెద్దాయన తాలూకు నాలుగో తరం నడుస్తోంది. అప్పుడు ఆ పెద్దాయనకు సహాయం చేసిన ఆ మోటారు కార్లోని వ్యక్తులు బాగుండాలని, వాళ్ల కుటుంబాల్లోని వాళ్లు చల్లగా ఉండాలని, వాళ్ల తరతరాలూ తరగని వృద్ధిపొందాలంటూ ఈ నాల్గో తరం వారు ఇప్పటికీ ప్రార్థిస్తుంటారు. అలా తమ కృతజ్ఞతను వెల్లడిస్తూనే ఉన్నారు. అవును... మానవత్వం తరతరాలూ సాగితేనే కదా రాబోయే తరాలూ ఆ స్ఫూర్తిని తమ ముందుతరాలకు అందిస్తాయి. ఎవ్వరూ నో చెప్పలేదు! – జయసుధ, సినీ నటి అరుళ్ అనే అబ్బాయి గురించి చెప్పాలి మీకు. ఎప్పటిలాగే చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుని వస్తున్నాను. క్రిస్మస్ సందర్భంగా ఓ ఐదు వేల రూపాయలు సహాయం చేద్దామనుకున్నాను. ఎవరికి అవసరమో తెలియదు కాబట్టి ‘‘నేనొక ఐదువేల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. నిజంగా సాయం అవసరమైన వాళ్లు ఎవరో కొంచెం చెప్పండి’’ అని అక్కడ ఉన్నవాళ్లను అడిగాను. వాళ్లు తలా ఓ పేరు చెప్పారు.సరే అని అనుకొనేలోపు నా వెనకనుంచి ఎవరో ఒకతను సడెన్‌గా వచ్చి ‘‘ 12 ఏళ్ల ఓ బాబు క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. వీలైతే మీరు ఆ అబ్బాయికి సహాయం చేయండి’’ అని ఆ అబ్బాయి ఇంటి అడ్రస్ కూడా చెప్పి వెళ్లిపోయాడు. నేనెప్పుడూ అతనిని అక్కడ చూడలేదు. ఎవరికైనా ఇద్దామనుకున్నా డబ్బే కదా అని, స్వయంగా ఆ అబ్బాయి వాళ్లింటికి బయలుదేరాను. చూసేసరికి చర్చిలో అపరిచిత వ్యక్తి చెప్పినట్టుగానే బాబు పరిస్థితి దయనీయంగా ఉంది. నా చేతిలో ఉన్న ఐదు వేలు ఎందుకు ఉపయోగపడతాయి అనిపించింది. హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతాయి అని వాళ్లమ్మని అడిగాను. ఆమె చెప్పిన నంబర్ (నాలుగు లక్షలు) విని ఏం చేయలో అర్థంకాని నేను కష్టమైనా సరే... నా బడ్జెట్లో లేకపోయినా ఓ 25 వేలు సహాయం చేస్తాను అని చెప్పి ఇంటికొచ్చేశాను. దారి పొడవునా అరుళ్ నాకు గుర్తుకొస్తూనే ఉన్నాడు. నాలుగు లక్షలే కదా, మీరే ఇవ్వలేరా అని మీరు అనుకోవచ్చు. కాని సడెన్‌గా అంత పెద్ద మొత్తం అంటే ఎవరికైనా ఇబ్బందే కదా. ఎవరినన్నా అడుగుదామా అనిపించింది, కానీ నాలో నాకే నువ్వు.. ఇంత పెద్ద ఆర్టిస్టువి, నువ్వు ఎవరికోసమో డబ్బు సాయం చేయమని అడగటమేంటి అని నా మనసుకు అనిపించింది. మళ్లీ అంతలోనే దేవుని మాటలు గుర్తుకొచ్చాయి. ‘నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న మాటలు మళ్లీ మళ్లీ నాకు వినపడ్డాయి. నీకు అంతలేదు, నిన్ను నువ్వు తగ్గించుకొని చూడు, నువ్వు కేవలం జయసుధ అనే మనిషివి మాత్రమే అని దేవుడు అన్నట్లు అనిపించింది. ఇక ఆలస్యం చేయదలచుకోలేదు. ఏమయితే అది అయిందని మొదట నటుడు ప్రకాశ్‌రాజ్‌కి ఫోన్ చేశాను. ఆయన వెంటనే పాజిటివ్‌గా స్పందించి 25వేల రూపాయలు ఇస్తానన్నారు నిండు మనసుతో.అప్పటికి నాకు ఆయనతో అంత పరిచయం కూడా లేదు. హమ్మయ్యా ఇక ఎవరినైనా అడగొచ్చు అనే ధైర్యం వచ్చింది. వెంటనే హీరో అర్జున్‌కు ఫోన్ చేశాను. తర్వాత రాధిక, సుహాసిని, సీత, విజయశాంతిలతో పాటు లత, వాళ్ల తమ్ముడు రాజ్‌కుమార్ , తమిళ దర్శకుడు కె.యస్ రవికుమార్ ఇలా అందరూ ఎవ్వరూ నో చెప్పలేదు, వీళ్లతో పాటు ఇంకా చాలామంది. ఆ పిల్లాడి ట్రీట్మెంట్కి కావాల్సిన మొత్తం డబ్బు అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు గంటలో సమకూరాయి. నా జీవితంలో ఈ సంఘటను ఎన్నటికీ మరువలేను. కారణం ఏంటంటే ఆ రోజు క్రిస్మస్, దేవుడు నన్ను చూస్తున్నాడేమో అనే ఫీలింగ్.. మనల్ని మనం తగ్గించుకొని (అహం), మనకు చేతనైన సాయం చేయడం కంటే ఆత్మ సంతృప్తి ఉండదు. ఒక్కోసారి మాట సాయం కూడా ఓ జీవితాన్ని నిలబెడుతుంది. మంచినీళ్లమ్మ సత్యవతమ్మ అవకాశం వచ్చినప్పుడల్లా తనకు తోచిన మానవ సేవ చేస్తూండేవారు. ఆవిడకు ఆరు పదులు నిండేటప్పటికే చాలా జబ్బు పడ్డారు. ఎన్ని అనారోగ్యాలు వచ్చినా ‘నేను జబ్బు మనిషిని’ అని అనుకోకుండా, ఓపిక ఉన్నంత వరకు ఇతరులకు సేవ చేయాలి’ అనే భావనతో ఉన్నారు సత్యవతమ్మ. పిల్లలకు వివాహాలు అయిపోయి ఎక్కడివారు అక్కడకు వెళ్లిపోయారు. భర్త కాలం చేయడంతో, ఒంటరి అయిపోయారు. నిత్యం సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా బావురుమంది. ఆత్మస్థైర్యంతో, ఒంటరిగా జీవించడానికి అలవాటు పడ్డారు. ఇరుగుపొరుగు వారితోనే కాకుండా, ఆ వీధిలో సంచరించేవారితో సైతం ప్రేమగా ఉంటూ, ఒంటరితనాన్ని మరచిపోయారు. విజయవాడ అంటే ఎండలకు కొదవ ఉండదు. ఎన్ని చలివేంద్రం కేంద్రాలు పెట్టినా మధ్యాహ్నానికి నీళ్లు ఖాళీ అయిపోతాయి. ఒక చిన్న కాలనీలో చిన్న సందులో ఉండే సత్యవతమ్మ, ఆ రోడ్డులో తిరిగే రిక్షావారికి, కూరలు పళ్లు అమ్ముకోవడానికి వచ్చేవారికి మంచినీళ్లు అందించాలనుకున్నారు. నీళ్లు మోయడానికి పనివారి ఆసరా లేదు. మంచి చేయాలనే సంకల్పమే ఆవిడకు బలం చేకూర్చింది. ఒక మట్టి కుండ తీసుకువచ్చి, ఇంటి ముందు గేటు దగ్గర ఉంచారు. ఇంట్లో ఉన్న చిన్న గిన్నెతో పది సార్లు నీళ్లు తీసుకువచ్చి ఆ కుండలో పోశారు. పైన మూత, ఒక స్టీలు గ్లాసు ఉంచారు. ఉదయం ఎనిమిది గంటలకు కుండ నింపేవారు. మధ్యాహ్నం ఓ గంట కునుకు తీసి లేచి వచ్చి కుండ చూసేవారు. అప్పటికి కుండ ఖాళీ అయిపోయేది. ఆవిడ మనసు సంతృప్తితో నిండిపోయేది. అంతే మళ్లీ కుండ నింపేవారు. సాయంత్రానికి ఖాళీ అయిపోయేది. ఇది ఆవిడ దినచర్యగా మారిపోయింది. అలా మార్చి నెల నుంచి జూన్ వరకు నీళ్లు పెట్టేవారు. ఇలా సుమారు పది సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతి వేసవి కాలం ఆ ఇంటి ముందర మంచినీళ్లు దొరుకుతాయన్న భరోసా కలిగింది అందరికీ. ఒక రోజు కుండ చిన్నబోయింది. అదేమిటా అని ఆ వీధిలో నిత్యం సంచరించే రిక్షా వాళ్లు, çపండ్ల అమ్మకాల వాళ్లు ఇంట్లోకి తొంగి చూశారు. సత్యవతమ్మగారు ఆ రోజు తెల్లవారు ఝామున తీవ్రమైన గుండెపోటుతో కాలం చేశారని తెలుసుకున్నారు. ‘అయ్యో! నిన్న రాత్రి కూడా ఆ తల్లిని పలకరించి, మంచినీళ్లు తాగాం’ అనుకుంటూ అందరూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ చేతి నీళ్లు తాగిన వారి కళ్లు వర్షించసాగాయి. బరువెక్కిన గుండెలతో ఆ తల్లిని వేనోళ్ల పొగిడారు. పెద్ద కర్మనాడు వారంతా వచ్చి ‘అమ్మగారి ప్రసాదం’ అని స్వచ్ఛందంగా వచ్చి తిని, ‘మా తల్లి బతికున్నన్నాళ్లు కడుపు నిండా పలకరించే ది, మా దాహం తీర్చింది’ అనుకున్నారు. నెత్తుటి బంధం అప్పుడు జేమ్స్ హారిసన్‌కు పద్నాలుగేళ్లు. అతడిది ఆస్ట్రేలియా. తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు. ఛాతీకి పెద్ద శస్త్రచికిత్స చేయాల్సివచ్చింది. దానికిగానూ పదమూడు లీటర్ల రక్తం అవసరమైంది. ఎవరెవరో ఆయనకు రక్తదానం చేశారు. మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాడు.కోలుకున్నాక, హారిసన్ తనకు తాను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఎవరో తనకు పేరు కూడా తెలియనివాళ్లు ఇచ్చిన రక్తం వల్ల తాను బతికినప్పుడు, తాను కూడా మరొకరు బతకడానికి కారణం కావాలని అనుకున్నాడు. అట్లా ఆయన రక్తదానాలు చేయడం మొదలుపెట్టాడు.1936లో జన్మించిన హారిసన్ 1954లో తన తొలి రక్తదానం చేశాడు. కుదిరినప్పుడల్లా ఇస్తూ వచ్చాడు. అయితే కొన్ని దానాల తర్వాత వైద్యులు ఆయన రక్తపు ప్లాస్మాలో ఒక అరుదైన విశేషం ఉందని కనుగొన్నారు.సృష్టిలో కొన్ని ఎందుకు జరుగుతాయో అంతు పట్టదు. ఒక గర్భిణి రక్తంలోని యాంటీ బాడీస్ ఒక్కోసారి గర్భంలో ఉన్న శిశువు రక్తకణాలను ధ్వంసం చేస్తాయి. దాంతో శిశువుకు రక్తహీనత కలుగుతుంది, కామెర్లు వస్తాయి. దీనికి విరుగుడు ఇవ్వకపోతే ప్రాణాపాయం. ఈ స్థితిని రీసస్ డిసీజ్ అంటారు. అయితే, దీనికి విరుగుడుగా పనికొచ్చే యాంటీ–డీ మెడిసిన్ అందరి రక్తంలో లభించదు. అది హారిసన్ రక్తంలో ఉందని కనుగొన్నారు. అరుదుగా తప్ప దొరకని యాంటీ–డీ హారిసన్ రక్తంలో ఉండటం ఒక విచిత్రమైతే, ఆయన ఎన్నో దానాలు చేయడానికి సంకల్పించుకుని ఉండటం మరో విశేషం. దీనివల్ల లభ్యత శాతం అత్యధికమైంది. 60 ఏళ్ల కాలంలో హారిసన్ అక్షరాలా 1,172 సార్లు రక్తదానం చేశాడు. అయితే, తన 81వ ఏట ఇంకా రక్తం ఇవ్వడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరించిన పిమ్మట, పైగా ఎనభై ఏళ్లు పైబడినవాళ్లు రక్తదానం చేయకూడదని ప్రభుత్వ నిబంధన కూడా ఉండటంతో మొన్న మే 11న తన చివరిదైన 1,173వ రక్తదానం చేసి తన పని నుంచి విరమణ తీసుకున్నాడు.హారిసన్ రక్తం నుంచి సేకరించిన యాంటీ–డీ మెడిసిన్ వల్ల సుమారు 24 లక్షల మంది పసివాళ్లకు ప్రాణాపాయం తప్పిందని అంచనా. ‘మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్’( బంగారం చేయి కలవాడు)గా ఆయన్ని ఆస్ట్రేలియన్లు ముద్దుగా పిలుచుకుంటారు. విడువని చెయ్యి లక్ష్మి గుర్తుందా? యాసిడ్ దాడి జరిగిన లక్ష్మి.. వెంట పడుతున్న ప్రేమకు ‘నో’ అని చెప్పినందుకు ఒంటి మీద యాసిడ్ కుమ్మరించారు. ఆమెతో పాటు దేశాన్నీ భయోత్పతంలోకి నెట్టిన సంఘటన అది.జరిగిన దారుణానికి భీతిల్లినా కుంగిపోలేదు. న్యాయపోరాటం చేసింది లక్ష్మి. ఆ పోరాటంలో ఆమెకు అండగా నిలబడ్డాడు యాక్టివిస్ట్ అలోక్ దీక్షిత్. ఆమెను చూసిన లోకం జడుసుకుని పక్కకు తప్పుకుంటుంటే ఆమె చేయి పట్టుకుని వెన్నంటి ఉన్నాడు. జీవన సహచరుడిగా మారాడు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు. సామాజిక అడ్డంకులు ఎదురైనా ఆమె చేయి విడువలేదు. అలోక్ ఇచ్చిన సపోర్ట్‌తో న్యాయపోరాటంలో విజేతగా నిలిచింది. పోయిన సంతోషం తిరిగి ఆమె మొహంలో నవ్వై మెరిసింది. లక్ష్మి.. ఇప్పుడొక బిడ్డకు తల్లి! బాధను పంచుకుని.. ధైర్యాన్నిచ్చి నిజమైన స్నేహితుడిగా.. అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు అలోక్ దీక్షిత్. కైండెస్ట్ బాస్ అలు భత్రానియా... జేఆర్డీ (జహంగీర్ రతన్జీ దాదాభాయి)కి పదిహేనేళ్లుగా సెక్రటరీగా పనిచేశారు. కింది ఉద్యోగుల పట్ల ఆయన ఉండే తీరు, ఇచ్చే గౌరవం, చూపించే ఆపేక్ష గురించి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్బుక్ పేజ్‌లో ఆమె ఇలా షేర్ చేసుకున్నారు. ‘‘మాది మధ్యతరగతి కుటుంబం. కష్టపడి పనిచేయడం నేర్పారు మా వాళ్లు. కాలేజ్‌లో ఉన్నప్పుడే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ నాన్నకు హెల్ప్ చేసేదాన్ని. 1961లో గ్యాడ్యుయేషన్ పూర్తయ్యాక టాటా స్టీల్‌లో చేరాను టెంపరరీ ఎంప్లాయ్‌గా. తర్వాత పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. ఈలోపే ఉద్యోగం చేస్తూనే లా కూడా కంప్లీట్ చేశాను. 1970ల చివర్లో ‘బాంబే హౌజ్’ ఫోర్త్ ఫ్లోర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. జేఆర్డీ టాటాకు సెక్రటరీగా రిక్రూట్ చేస్తున్నట్టు. నమ్మలేకపోయా. అప్పటి దాకా ఆయన గురించి వినడమే.. ఫొటోల్లో చూడ్డమే. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన దగ్గర పనిచేయడం. ఆ రోజు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే.. ఆయన దగ్గర ఫస్ట్ డిక్టేషన్ తీసుకుంటున్నా.. చెమటతో అరచేతులు తడిసి ముద్దయిపోయాయి. అది ఆయన గ్రహించి వెంటనే చాలా క్యాజువల్‌గా మాట్లాడ్డం మొదలుపెట్టారు. నా పట్లే కాదు కింది ఉద్యోగుల అందరిపట్లా ఆయనలాగే ఉండేవారు. అంతే కేరింగ్ చూపించేవారు. కైండెస్ట్ బాస్. ఫారిన్‌కి వెళ్లినప్పుడల్లా తోటమాలి పిల్లల కోసం చాక్లెట్స్ తెచ్చేవాళ్లు. లెక్కలేనంత మందికి ఆయన సహాయం చేయడం కళ్లతో చూశా. సాఫ్ట్ అండ్ హంబుల్ పర్సన్. బిజినెస్ పనులతో ఊపిరిసల్పనంత బిజీగా ఉన్నా.. చుట్టూ ఉన్న మనుషులతో గడిపేవాళ్లు. తనను నమ్ముకున్న వాళ్ల క్షేమాన్ని కాంక్షించేవాళ్లు. ఆయనతో కలిసి పనిచేయడమంటే ప్రతి రోజూ ఇన్స్పైర్ అవడమే. నిజాయితీ, హార్డ్‌వర్క్, పరులకు హెల్ప్ చేయడం.. ఆయనను చూసి.. తెలుసుకుని అలవర్చుకోవాల్సిన క్వాలిటీస్. ప్రపంచానికి ఆయన బిజినెస్‌మన్.. బట్ ది పర్సన్ హి వజ్ ట్రూలీ ఎ జెమ్. ఈ రోజుల్లో అలాంటి వాళ్లు కనిపించరు. ఆయనలో హాస్య చతురత కూడా అంతే.ఒకసారి నా బర్త్‌డేకి మా ఫ్యామిలీని ఒబేరాయ్లోని ఫ్రెంచ్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. భోజనం అయిపోయాక బిల్ తెమ్మని అడిగారు. హోటల్ మేనేజర్ పరుగుపరుగున వచ్చి.. ‘‘మీరు బిల్ పే చేయడం ఏంటీ సర్’’ వద్దు అన్నాడు. ‘‘అయ్యో.. ఆ ముక్క ముందే చెబితే ఇంకొన్ని ఆర్డర్ చేసేవాళ్లం కదా’’ అన్నారు టాటా ఇన్నోసెంట్‌గా. ఆయనకు సెక్రటరీగా పదిహేనేళ్లు ఆయనకు సెక్రటరీగా పనిచేయడం నిజంగా నా బిగ్గెస్ట్ ప్రివిలేజ్. జేఆర్డీ టాటా సర్.. యూ ఆర్ స్పెషల్ బియాండ్ వర్డ్స్!’’ అని రాసుకున్నారు అలు భత్రానియా. శిబి, కర్ణుడు చిన్నబోయారు – ఆర్. నారాయణమూర్తి, నటుడు మానవత్వం అనగానే నలభై ఏళ్ల క్రితం నేను ఆమె పాదాలకు దణ్ణం పెట్టడం మాత్రమే గుర్తుకు వస్తుంది. అది 1970 ల ప్రాంతం. నేను డిగ్రీ చదువుతున్నాను. కాలేజి ప్రెసిడెంట్‌గా, సోషల్ సర్వీస్ సెక్రటరీగా చాలా యాక్టివ్‌గా తిరుగుతుండేవాడిని. ఆ టైమ్‌లో బీహార్‌లో బీభత్సమైన వరదలు వచ్చాయి. భారత ప్రభుత్వం దానిని జాతీయ విపత్తుగా పరిగణించింది. అప్పుడు మా కాలేజికి కూడా సహాయ సహకారాలు అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మా కాలేజ్ పెద్దాపురంలో ఉండేది. కాలేజీ తరపున విద్యార్థులందరం వీధి వీధికి వెళ్లి అందరినీ బియ్యం, బట్టలు ఇవ్వాలని అడుగుతున్నాం. అలా అన్ని వీధులు తిరిగిన తర్వాత నేను, నా ఫ్రెండ్స్ కొంతమందిమి కళావంతుల వీధికి వెళ్లాం. అక్కడ ఉన్న ఓ మహిళ దేనికోసం ఇదంతా చేస్తున్నారు అని అడిగారు. మేము జరిగిన విషయం చెప్పాం. అయ్యో! అవునా పాపం, ఆగండి అని చెప్పి ఇంట్లోకి వెళ్లి , ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు తెచ్చి ఇచ్చింది. తర్వాత అందరిలో ఉన్న నన్ను కొద్దిగా పక్కకు పిలిచి ‘‘నేను దేవదాసి పనిచేస్తాను. రాత్రి బేరాలు ఏమీ రాలేదు.అందుకే డబ్బులు ఇవ్వలేక పోయాను. మీరు ఓ పని చెయ్యండి, రేపు ఉదయం వచ్చి నన్ను కలవండి. ఈ రోజు మంచి బేరాలు చూసుకుని వచ్చిన డబ్బంతా మీకే ఇస్తాను’’ అని అన్నది. సరే అనుకుని మా దారిన మేము వెళ్లిపోయాం. తర్వాత రోజు మేము సేకరించినవన్నీ తీసుకుని కాలేజీకి వెళ్లాం. అక్కడ నా స్నేహితుడు ఒకడు ‘‘మూర్తీ నిన్న మనం కళావంతుల వీధీలో ఒకామె డబ్బులు ఇస్తాను అన్నది కదా. ఓసారి వెళ్లి అడుగుదామా’’ అన్నాడు. అలాగే అంటూ ఇద్దరం కలిసి వెళ్లాం. ఆమె మాకు ఎదురొచ్చి ‘‘మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఈ రోజు వస్తారా, రారా అనుకుంటున్నాను. రాత్రి బాగా బేరం జరిగింది. ఇవిగో తీసుకోండి’’ అంటూ ఆమె దగ్గరున్న మొత్తం డబ్బు నా చేతిలో పెట్టింది. అంతే నా కళ్లల్లో నీళ్లు ఆగలేదు. ఒక్కసారిగా ఆమె కాళ్లమీద పడి దణ్ణం పెట్టాను. ‘‘ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవటం కంటే మంచి పని ఏదీ ఉండదు బాబూ. అదే మనల్ని కాపాడుతుంది’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆవిడలో ఉన్న దయ, కరుణ, మానవత్వం ముందు శిబి చక్రవర్తి, కర్ణుడు చిన్నగా కనిపించారు. నలభై ఏళ్లుగా ఈ విషయం గుర్తొస్తూనే ఉంటుంది. అయ్యో.. ఆమె పేరు అడగడం మర్చిపోయానే అని బాధతోపాటు. ఆమెలో కరుణ, దయ, మానవత్వం చూశాను. ఇద్దరు అతిథులు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే కేరళ రాజ్‌భవన్‌లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్రపతికున్న అధికారానుసారం ఆయన ఓ ఇద్దరిని తన అతిథులుగా రాజ్‌భవన్‌కు ఆహ్వానించాలి. ఆ సమయంలో కలాం ఆహ్వానించిన అతిథులు ఎవరో తెలుసా.. తిరువనంతపురంలోని ఓ రోడ్డు పేవ్మెంట్ మీద చెప్పులు కుట్టే వ్యక్తి, ఓ చిన్న హోటల్ ఓనర్. ఈ ఇద్దరూ అబ్దుల్‌కలాం మిత్రులు. తిరువనంతపురంలో ఆయన సైంటిస్ట్‌గా పనిచేసినప్పుడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరే చెప్పులు రిపేర్చేయించుకునేవారు. ఆ హోటల్లో తినేవారు. ఆ స్నేహమే ఆ ఇద్దరినీ రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి అతిథులను చేసింది. ఇంకొక సందర్భం. ఒకసారి వారణాసిలోని ఐఐటిలో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లారు అబ్దుల్‌కలాం. వేదిక మీద అయిదు కుర్చీలు వేశారు. మధ్యలో పెద్దగా.. ప్రత్యేకంగా ఉన్న కుర్చీని కలాంకు కేటాయించారు. మిగిలిన నాలుగు యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ల కోసం. ఆ ప్రత్యేకతను గమనించిన కలాం ఆ కుర్చీలో కూర్చోడానికి తిరస్కరించి.. మిగిలిన నాలుగింటిని పోలిన కుర్చీనే తెప్పించి అందులోనే ఆసీనులయ్యారు. ఈ రెండు సంఘటనలు.. ఎదిగినకొద్దీ ఒదగమనే విషయాన్ని చెప్తున్నాయి. వెళ్లినవాళ్లు వెనక్కి వచ్చారు ‘‘ఒకపక్కనేమో చీకటి పడుతోంది... ఇంటికెళదామంటే కారు టైర్ పంక్చర్. వయసా 80 దాటుతోంది పక్కనే 75 ఏళ్ల శ్రీమతి. పోనీలే ఎవరికైనా ఫోన్ చేసి రమ్మందామా అంటే సిగ్నల్ అస్సలు లేదు. ఐదేళ్ల క్రితం ధార్వాడ శివార్లలో ఉండే కెల్గేరి సరస్సు వద్ద ఇదీ నా పరిస్థితి. సాయంకాలం అలా కాసేపు తిరిగి వద్దామని సరస్సు వద్దకు వెళ్లామా.. కారు పార్క్ చేసి ఇల్లాలితో మాట కలిపి నాలుగు అడుగులేశామో లేదో.. టైమ్ అస్సలు తెలియలేదు. తిరిగి కారు దగ్గరకొచ్చి చూస్తే టైర్ పంక్చర్. ఏం చేయాలబ్బా అనుకుంటూ తలగోక్కున్నా.. ఏదైతే అది అయిందనుకున్నాం. కారు హెడ్లైట్లు వేసిపెట్టాలని తీర్మానించుకున్నాం. కాసేపటికే ఓ ట్రక్కు రయ్యి మంటూ దూసుకెళ్లిందిగానీ.. మా కేకలు వినిపించాయో లేదో... ఆగలేదు. బిక్కుబిక్కు మంటూ సాయం కోసం ఎదురుచూస్తున్న టైమ్ వచ్చారు వాళ్లునలుగురు ఉన్నారు. రెండు బైక్‌లపై మమ్మల్ని దాటుకుంటూ కాస్త దూరం వెళ్లిన వాళ్లు కాస్తా వెనుదిరిగారు. దగ్గరికి వచ్చారు. ‘‘తాతా ఏమైనా ఇబ్బందా?’’ అని అడిగారు. ప్రాణం లేచొచ్చినట్లు అయింది నాకు. విషయం చెప్పా. ‘‘కార్లో కిట్ ఉందేమో చూడండ్రా’’ అని వాళ్లల్లో ఒకరు బైక్ దిగాడు. డిక్కీ ఓపెన్ చేస్తూంటే వాళ్లు తమని అనిల్, సునిల్, ప్రతీక్, వికాస్‌లుగా పరిచయం చేసుకున్నారు. దగ్గరలోని ఊళ్లో మంచానపడ్డ తాతను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తున్నారంట. అనిల్, సునీల్‌లు బైక్ హెడ్‌లైట్ ఆన్ చేసి కారుపై ఫోకస్ చేస్తే.. ప్రతీక్, వికాస్‌లు డిక్కీలోని కారు బయటకు తీయడం.. పంక్చరైన టైర్ స్థానంలో బిగించడం టకటకా జరిగిపోయాయి. సమయానికి దేవుళ్లలా వచ్చారయ్యా అంటూ కాసిన్ని డబ్బులు వాళ్ల చేతుల్లో పెట్టబోయో... ‘‘మా తాతతోనైతే డబ్బులు తీసుకుంటామా?. ఒద్దు పెద్దాయన’’ అనేశారు. వాళ్లదారిన వాళ్లు.. నా దారిన నేను వచ్చేశాం. ఐదేళ్లు అవుతున్నా.. ఈ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా... మనసంతా హాయిగా అనిపిస్తుంది’’ – అమృత్ రావు కాలే, బెంగళూరు గాజు పెంకులు డిఆర్డివో ప్రాజెక్ట్ బిల్డింగ్ పూర్తయ్యాక అబ్దుల్‌కలామ్ దాని ప్రారంభోత్సవానికి వచ్చాడు. ప్రహరీ గోడ మీదుగా చూసిన ఆయన ఆశ్చర్యపోతూ అక్కడే ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్‌తో ‘ఆ గోడ మీదుగా గాజు పెంకులన్నీ ఎందుకలా అమర్చి పెట్టారు చుట్టూతా అన్నాడు.’ రక్షణ కోసం అలా గాజు పెంకులను అమర్చాం’ అన్నాడు అతను మరింత నైపుణ్యాన్ని చూపామని గర్వంగా! ‘మన రక్షణ అనుకున్నది మరొకరి పాలిట శిక్ష అవుతుంది. ఆ గాజు పెంకుల మీద పక్షులు వాలితే ..’ అని ఆగిపోయాడు అబ్దుల్‌కలామ్. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ వెంటనే ఆ గాజు పెంకులను తొలగించడానికి మనుషులను పురమాయించాడు. డబ్బులే తీసివ్వాలా? రెడ్ సిగ్నల్ కనిపించడంతో ఫుట్‌పాత్ సపోర్ట్ తీసుకుంటూ బండిని ఆపా. సరిగ్గా సిగ్నల్‌కు ఎదురుగా.. ఫుట్‌పాత్ ఎండింగ్లో ఏదో గొడవ జరుగుతోంది. ఏంటా గొడవ? ముందున్న వ్యక్తిని అడిగా.. ఏమో తెలియదన్నాడు. బండి మీదే కాస్త పైకి లేచి చూశా... ముసలాయన, ఓ యువకుణ్ని పట్టుకొని తిడుతున్నాడు.. రేయ్.. నీకు సిగ్గులేదా? చూడ్డానికి ఆంబోతులా ఉన్నావ్..! తల్లిని రోడ్డు మీద అడుక్కోమని కూర్చోబెడుతున్నావ్! అసలు నువ్వు మనిషివేనా? అని. దానికి ఆ యువకుడు సమాధానమేదీ చెప్పకుండానే నవ్వుతూ వెళ్లిపోయాడు. ముసలాయన తిట్లు మాత్రం ఆగడం లేదు. అలా తిట్టుకుంటూ నావైపే వచ్చాడా ముసలాయన. ఏం తాతా.. ఎందుకు తిడుతున్నావని అడిగా. ‘లుచ్చాగాడు’.. కాళ్లు లేని తల్లిని తీసుకొచ్చి, అడుక్కోమని ఇక్కడ కూర్చుండబెట్టి వెళ్తున్నాడు. మళ్లీ వస్తాడు.. డబ్బులన్నీ తీసుకొని పోతాడు. లుచ్చాగాడు.. లుచ్చాగాడు. తిట్టుకుంటూ వెళ్లిపోయాడు తాత. ముసలాయన అంతగా తిట్టినా.. ఆ యువకుడు మాత్రం నవ్వుకుంటూ వెళ్లడం నాకెందుకో ఆశ్చర్యం కలిగించింది. తిరిగి చూశా.. ఆ యువకుడి ఎక్కి వెళ్లిపోతున్న ఆటో ఎంతో దూరం పోలేదు. వెంటనే బండి యూటర్న్చేసి ఆటో వద్దకు వెళ్లా. అరేయ్.. బాబు, ఆ పెద్దాయన అంతగా ఎందుకు తిట్టాడు నిన్ను? అని అడిగా.సమాధానం చెప్పలేదు. మీ అమ్మను అడుక్కోవడానికి రోజూ ఇక్కడ కూర్చోబెతావట.. నిజమేనా? అని అడిగా. సమాధానం చెప్పలేదు! నేనెవరో తెలుసా? రిపోర్టర్‌ను.. పోలీసులకు చెప్పి, లోపలికి పంపించమంటావా? అని బెదిరించా. అప్పుడు ఆ యువకుడు చెప్పిన మాట విని.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయా!‘ఆమె మా అమ్మకాదు.. మా అపార్ట్మెంట్ పక్కన రేకుల ఇంట్లో ఉంటది. రెండు కాళ్లు లేవు.. ఏ పనీ చేయలేదు. మొన్నటిదాకా అమెతోపాటు ఓ పిల్లగాడుంటుండే. రోజూ వాడే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి, తీసుకెళ్లెటోడు. వారం కిందట.. ఇంట్లో పైసలన్నీ తీసుకొని పరారైండట. ముసల్ది.. లబోదిబోమంటూ ఏడుస్తుంటే.. వారం రోజులుగా నేనే ఇక్కడికి తీసుకొచ్చి దించుతున్నా. ఆమెకు ఇయ్యడానికి నా దగ్గర పైసల్లేవ్..! నేనే.. పైసల కోసం స్విగ్గీల పనిచేస్తున్నా. కమ్ సె కమ్ ఇడదాక దించుతేనైనా ఆమెకు బతకనీకి కొన్ని పైసలొస్తయ్’ అని చెప్పడంతో నా నోట మాట రాలేదు. మరి ఆ ముసలాయన అంతగా తిడుతుంటే.. చెప్పొచ్చుగా? అని అడిగితే.. ‘ఆ పెద్దాయన తిట్టి ఎళ్లిపోయిండు. నిన్న ఒకోడైతే చెంపమీదనే కొట్టిండ’ని చెబుతుండగానే ఆటో కదిలింది. ఆ యువకుడు వెళ్లిపోయాడు. జర్నలిస్టును కదా.. వాడు చెప్పిన దాంట్లో నిజమెంతో? అబద్ధమెంతో? తెలుసుకుందామని.. సిగ్నల్దగ్గర అడుక్కుంటున్న ఆమె దగ్గరకు వెళ్లి అడిగా.. ఆ యువకుడు చెప్పింది అక్షరాలా నిజమే! చెంపదెబ్బతో సహా. సాయం చేయాలంటే జేబులో నుంచి డబ్బులే తీసియ్యాలా? మనసులోని దయా, కరుణను కాస్త ఖర్చుచేసినా చాలనిపించింది! – సుధాకర్, హైదరాబాద్ పిట్టలకు ప్రాణమిచ్చాడు అసలే ఆయన ఓ రైతు.. పేరు అశోక్ సోనులే. ఉండేదేమో మహారాష్ట్రలో. అది కూడా కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కొల్హాపూర్ ప్రాంతంలో! ఉన్నదేదో ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని మరీ ఖర్చుపెడతాడని అనుకునేందుకు ఇంతకంటే పెద్ద వివరాలు అక్కరలేదు. కానీ.. నిజం ఇది కాదు. అరకొర వర్షాలతో పంటలు పండని దుస్థితి ఉన్నా... చేసిన అప్పులు తీరక తోటిరైతులు అంత విషం తీసుకుని నేలకు ఒరుగుతున్నా...తనకున్న పిసరంత ఆసరాను కూడా పాలపిట్టలకు, పిచ్చుకలకు వదిలేసిన గొప్పమనసు అశోక్ సోనులేది. కొల్హాపూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని గడ్మడ్షింగీలో ఇద్దరు సంతానంతో కలిసి పొలం పనులకెళ్లే అశోక్‌కు తండ్రుల నుంచి వచ్చిన భూమి ఓ పావు ఎకరం మాత్రం ఉంది. ఎప్పట్లానే ఆ ఏడాది కూడా జొన్నలైతే విత్తాడు కానీ.. వర్షాభావంతో పంటపై ఆశమాత్రం పెట్టుకోలేదు. చిత్రమో.. మహత్యమో తెలియదుగానీ.. ఆ ఏడాది అశోక్ పంట విరగకాసింది. హమ్మయ్యా.. ఏళ్ల తరువాతైనా ఒక్క పంట చిక్కింది కదా అనుకున్నాడు. కోతలకు సిద్ధమయ్యాడు. పొలం మధ్యలో ఉన్న బాబూల్ చెట్టును కూడా కొట్టేస్తే నాలుగు గింజలు ఎక్కువ దొరుకుతాయి కదా అని గొడ్డలితో బయలుదేరాడు. తొలి వేటు వేసేలోపు... చెట్టుపైనే గూడు కట్టుకున్న పిట్టలు కువకువలు మొదలుపెట్టాయి. వాల్మీకికి పక్షుల శోకం నుంచి శ్లోకం పుట్టుకొచ్చినట్లు.. బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయమైనట్లు అశోక్ మదిలో చెట్టు కొట్టేస్తే.. పిట్టల పరిస్థితి ఏమిటన్న ఆలోచన మొదలైంది. గొడ్డలి పక్కకు ఒరిగిపోయింది.తన కష్టాలు తనకెలాగూ ఉన్నాయి. చెట్టు కొట్టేస్తే పిట్టల గూళ్లు చెదరిపోతాయి. పంట తీసేస్తే కాసిన్ని గింజలూ దొరకవు కదా? అనుకున్నాడు. కోతలకు స్వస్తి చెప్పేశాడు. కుటుంబంతో కలిసి ఆ పక్షులకు కాసిన్ని నీళ్లు అందేలా ఏర్పాట్లు చేసేశాడు. అమ్మకు అన్నం పెట్టాలన్నా లక్ష లెక్కలేసుకునే ఈ రోజుల్లో అశోక్ వంటి వారు అరుదే! చిట్టి చేతులు అది పెంపుడు కుక్క కాదు. చెత్త కుప్ప దగ్గర కడుపు నింపుకునే వాటిలో అదీ ఒకటి. చలాకీగా ఉండేది. ఊరంతా తనదే అయినట్టు తిరిగేది. అలాంటిది అది తల నేలకేసి పదే పదే బాదుకుంది. ముందరి కాళ్లతో టపీ టపీమని ముఖాన్ని కొట్టుకుంది. కానీ, ముఖానికి పట్టుకున్న భూతాన్ని వదిలించుకోవడం దాని వల్ల కావడంలేదు. పొడవాటి తెల్లటి డబ్బా అది. మెడ నుంచి మూతిని దాటి నాలుగు అంగుళాల ముందుకు పొడుచుకువచ్చింది. దాని శక్తి కొలదీ బాదుతూ ఉండటం వల్ల డబ్బా అడుగు భాగం అయితే పూర్తిగా పగిలింది కానీ, ఆ డబ్బా ఊడిరాలేదు. బహుశా చెత్త కుప్ప దగ్గర పడి ఉన్న డబ్బాలోని ఆహారం తినడానికి అందులో మూతి పెట్టి ఉంటుంది. వీలుకాక మూతి బయటకు తీసేటప్పుడు దానికి తెలియలేదు ఆ డబ్బా తన తలను మింగేసిందని. తను విశ్వ ప్రయత్నం చేసింది. డబ్బా ఊడిరాలేదు.వాడవాడలా తిరిగింది. ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని రోజులయ్యిందో గుక్కెడు నీళ్లు తాగి. ఒంట్లో శక్తి లేక ముందరి కాళ్లతో మాత్రమే అతి కష్టంగా అడుగులు వేస్తూ వెనక కాళ్లను ఈడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. చివరాఖరకు తన చావు ఖాయం అనుకుంది. ఓ పాడుబడిన గోడ కనిపిస్తే ఎలాగోలా దేహాన్ని ఈడ్చుకుంటూ దాని దాపుకు చేరింది. తల నిలబెట్టే శక్తిలేక నేలకు వాల్చింది. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ తలను ఓ రెండు చేతులు ఎత్తిపట్టుకున్నాయి. దాని కళ్లు మెరిశాయి. ఒంట్లోకి ఏదో శక్తి వచ్చినట్టు తల పైకెత్తింది. తన తలను పట్టుకున్న చేతులు డబ్బాను చీల్చుతున్నాయి. తనకు పట్టిన భూతంతో ఏ దేవుడో యుద్ధం చేస్తున్నాడు. అపురూపంగా చూస్తోంది అది. డబ్బా ముందు భాగమంతా తీసేసిన ఆ చేతులు మెడకు పట్టిన మిగతా భాగాన్ని కూడా జాగ్రత్తగా విరగ్గొట్టాయి. పోయిందనుకున్న ప్రాణం లేచొచ్చింది. ప్రాణం పోసిన ఆ చిట్టి చేతులను భక్తిగా నాలుకతో స్పర్శించింది అది. తోటి పిల్లలతో ఆడుకుంటూ, పడిపోయిన బాల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ ఐదేళ్ల పిల్లాడి ముఖం విప్పారింది. జానే కహా గయే వో దిన్ పాటలో భావం, రాగం మాత్రమే కాదు కనికరం కూడా ఉంటుంది. ముఖేశ్ పాటలు దయగా, వాత్సల్యంగా, వేదనలో సహబాటసారుల్లా ఉంటాయి. ‘కిసీకా దర్ద్ మిల్ సకేతో లే ఉధార్’ అన్నాడాయన ఒక పాటలో. అంటే ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని అప్పుగా అయినా అడిగి తీసుకో అని అర్థం. అలా తీసుకోవడాన్నే జీవితం అంటారనీ ‘జీనా ఇసీకా నామ్ హై’ అని కూడా అన్నాడు.ముఖేశ్ అప్పట్లో స్టార్డమ్లో ఉన్నాడు. ఆయనకు శివుడంటే ప్రీతి. ఆయన పేరు కూడా శివునిదే కదా. ఒకసారి ఆయన అభిమానులను కలుస్తూ నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయాన్ని దర్శించాలని అనుకున్నాడు. ఆయన వస్తున్న కబురు ముందే అందింది. కాని ఆయన రాక మాత్రం ఆలస్యమైంది. దాదాపు రాత్రి పది గంటలు దాటేశాయి. అప్పటికే ఆలయం మూసేయాల్సిన సమయం కానీ ముఖేశ్ వస్తున్నాడని అధికారులు తెరిచిపెట్టారు. అప్పటికి అది చలికాలం. డిసెంబర్ నెలలో ఆ ప్రాంతంలో చలి గడ్డ కట్టించేలా ఉంటుంది. ముఖేశ్ ఆలయానికి చేరుకున్నాడు. అందరూ ఎదురొచ్చి స్వాగతం చెపుతూ లోపలికి తీసుకెళ్లబోయారు. ఆయన మెట్లెక్కుతూ ఆ మెట్ల మీద ఉన్న బిచ్చగాళ్లను చూసి ఆగిపోయాడు. వాళ్లు కప్పుకోవడానికి దుప్పట్లు లేక చలికి వొణుకుతున్నారు. ‘వీళ్లంతా ఇలా పడుకున్నారేమిటి? దుప్పట్లు లేవా?’ అని అడిగాడు ముఖేశ్. ‘వాళ్లకది మామూలే. మీరు పదండి’ అన్నారు నిర్వాహకులు.‘లేదు.. లేదు.. వీళ్లిలా వణుకుతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా. ముందు దుప్పట్లు, కంబళ్లు తీసుకురండి. డబ్బిస్తాను’ అని డబ్బులు తీశాడు.నిర్వాహకులు ఇరకాటంలో పడ్డారు.‘సార్... ఇప్పుడు దుకాణాలు ఉండవు. రేపు ఉదయం తెచ్చి ఇస్తాం. ముందు మీరు పదండి. దర్శనానికి ఆలస్యం అవుతుంది’ అన్నారు.‘ముందు మానవ సహాయం... తర్వాతే దైవ సేవ’ అన్నాడు ముఖేశ్.నిర్వాహకులు పడుతూ లేస్తూ ఊళ్లో తెరిచిన వారి దుకాణం తెరిపించి దుప్పట్లు, కంబళ్లు ముఖేశ్ డబ్బుతో కొని తెచ్చారు. ముఖేశ్ వాటిని ఆ బిచ్చగాళ్లందరికీ పంచాడు. వాళ్లు వాటిని తీసుకుని కప్పుకోవడం చూసే తృప్తిగా గుడిలోకి అడుగు పెట్టాడు. ఇలా చేసిన వాడి పాట దేవుడు వినకుండా ఉంటాడా? పెద్ద మచ్చ 1961లో రాజ్‌కపూర్ తాష్కెంట్ టూర్ చేశాడు. అప్పటికే అతడు సోవియెట్ రష్యాలో కూడా సూపర్‌స్టార్. తాష్కెంట్ సోవియెట్‌లో భాగం. అక్కడ తన ట్రూప్‌తో షోలు చేయడానికి వెళ్లాడు. తనతో పాటు అప్పుడప్పుడే గుర్తింపు పొందుతున్న గాయకుడు మహేంద్ర కపూర్‌ను కూడా తీసుకెళ్లాడు. రాజ్ కపూర్ ప్రతి షోలో ‘మేరా జూతా హై జపానీ’ పాడితే జనం వెర్రెత్తి పోయేవారు. కాని మహేంద్ర కపూర్ అప్పటికే తనకు హిట్‌గా నిలిచిన ‘హే... నీలే గగన్ కే తలే’ పాటను రష్యన్ భాషలో అనువదించి తమ స్లాట్ వచ్చినప్పుడు హిందీ వెర్షన్ కాకుండా ఆ రష్యన్ వెర్షన్ పాడటం మొదలెట్టాడు. ఆ దెబ్బకు అక్కడి జనం మహేంద్ర కపూర్‌కు జేజేలు పలకడం మొదలెట్టారు. రాజ్‌కపూర్‌కు ఒకటి అర్థమైంది. షోస్ తన వల్ల హిట్టేగానీ మహేంద్ర కపూర్ వల్ల ఇంకా హిట్ అయ్యాయని. ఆ రోజు రాత్రి హోటల్‌ను మహేంద్ర కపూర్ కలిసినప్పుడు ‘నువ్వు రావడం మంచిదయ్యింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి ఏదైనా కృతజ్ఞత చూపించాలనుకుంటున్నాను. కాని నిన్ను నా గాయకుడిగా పెట్టుకోలేను. ఎందుకంటే ముకేశే నా పాటలన్నీ పాడతాడు. కాని నేను వెంటనే తీయబోయే సినిమాలో సెకండ్ హీరోకి మాత్రం నీచే ఒక పాటైనా పాడిస్తాను’ అన్నాడు. రాజ్ కపూర్ సినిమాలో పాట అవకాశం అంటే చాలా పెద్ద లాటరీ కిందే లెక్క.మహేంద్ర కపూర్ నవ్వి ‘సార్.. మీరు చాలా పెద్దవారు. ఇప్పుడు ఈ ఉద్వేగంలో ఇలా అంటారు. కాని ఇండియా వెళ్లాక మీ పనుల్లో పడి ఇచ్చిన మాటను మర్చిపోతారు’ అన్నాడు.రాజ్ కపూర్ ఒక నిమిషం ఆగి మహేంద్ర కపూర్‌ని చూశాడు. ఆ క్షణంలో తను తాగుతున్న సిగరెట్‌ను నోట్లో నుంచి బయటకు తీసి వెంటనే మణికట్టు మీద చిన్నగా కాల్చుకున్నాడు.మహేంద్ర కపూర్ ఉలిక్కి పడ్డాడు.‘చూడు... ఇక్కడ మచ్చ పడింది. ఈ మచ్చ నీకిచ్చిన మాట నాకు గుర్తు చేస్తుంది. ఈ మచ్చ కంటే కూడా పెద్ద మచ్చ ఏమిటో తెలుసా? ఇచ్చిన మాటను మర్చిపోవడం. మాట నిలబెట్టుకోవడం కూడా ఒక రకమైన దైవారాధనే’ అన్నాడు.ఇండియాకు తిరిగి వచ్చాక రాజ్ కపూర్ తీసిన సినిమా ‘సంగమ్’.అందులో మహేంద్ర కపూర్ ఏ పాట పాడాడో మీరే గుర్తించండి. ‘మీరే వీఐపీలు’ అది 1990 ఎండాకాలం. లీనాశర్మది అస్సాం. ఇండియన్ రైల్వే (ట్రాఫిక్) సర్వీస్ ప్రొబేషనరీ ఆఫీసరుగా పనిచేస్తున్న లీనా తన స్నేహితురాలితో కలిసి లక్నోలో ఢిల్లీ వెళ్తున్న ట్రెయిన్ ఎక్కారు. వీళ్ల బోగీలో ఇద్దరు ఎంపీలు ప్రయాణిస్తున్నారు. ఎంపీలతో పాటు రిజర్వేషన్లేని మరో పన్నెండు మంది మగవాళ్లు ఉన్నారు. వాళ్లు అతిగా అరవడం, దుర్భాషలాడటం, వీళ్ల సీట్లలో వీళ్లను కూర్చోలేకుండా చేయడం, ఇంత జరుగుతున్నా ఆ ఎంపీలు నోరు మెదపకపోవడం జరిగింది. ఆ రాత్రి దుర్భరంగా గడిచాక తెల్లారి వీళ్లు ఢిల్లీలో దిగారు.అక్కడినుంచి అహ్మదాబాద్ ట్రెయిన్ పట్టుకున్నారు. కానీ రిజర్వేషన్ చేయించే వీలు లేదు. వీళ్లు టీటీఈని కలిసి తమ పరిస్థితి చెప్పుకున్నారు. ఆయన ఒక కూపె దగ్గరికి తీసుకెళ్లి, ‘ప్రస్తుతానికి ఇందులో కూర్చోండి’ అన్నాడు. ఆ కూపెలో ఇద్దరు కూర్చున్నారు. వాళ్ల ఖాదీ బట్టలను చూస్తే రాజకీయ నాయకులని అర్థమవుతోంది. పెద్దాయనేమో నలభైల్లో ఉన్నాడు. చిన్నాయన ముప్పైల్లో ఉన్నాడు. రాత్రే మరో అనుభవం జరిగివున్న దృష్ట్యా ఈ యువతులు తటపటాయిస్తుంటే టీటీఈ, ‘ఏం ఫర్లేదు, వీళ్లు ఈ రూట్లో రెగ్యులర్ ప్యాసెంజర్లే’ అని భరోసా ఇచ్చాడు.ఆ నాయకులిద్దరూ తాము మూలకు సర్దుకుని బెరుగ్గా ఉన్న యువతులను వీలైనంత సౌకర్యంగా కూర్చునేలా చూశారు. నెమ్మదిగా మాటలు కలిశాయి. వాళ్లు గుజరాత్ బీజేపీ నాయకులని తెలిసింది. చరిత్ర, రాజకీయాలు, హిందూ మహాసభ, ముస్లిం లీగ్ దాకా చర్చ సాగింది. ఇంతలో నాలుగు ప్లేట్ల భోజనం వచ్చింది. బిల్లు వీళ్లను కట్టనీయకుండా ఆ యువనాయకుడు చెల్లించాడు.ఈలోపు టీటీఈ తిరిగొచ్చి, ‘ఎక్కడా బెర్తులు లేవు, ఏమీ చేయలేను’ అని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఆ యువతులు ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తుంటే, ఆ ఇద్దరు నాయకులు ‘మరేం ఫర్లేదు, మేము సర్దుకుంటాం’ అని చెప్పి, ఈ ఆడవాళ్లకు బెర్తులు ఇచ్చేసి వాళ్లు కింద బట్టలు పరుచుకుని పడుకున్నారు. తెల్లారి వీళ్లు దిగేముందు, అహ్మదాబాద్‌లో ఎక్కడ బస చేశారనీ, అవసరమైతే తమ ఇంటికి రావొచ్చనీ పెద్దాయన వీళ్లను ఆహ్వానించాడు. తాను దిమ్మరిని కాబట్టి తనకో ప్రదేశమంటూ లేదనీ, కానీ పెద్దాయన ఆహ్వానాన్ని మీరు అంగీకరించవచ్చనీ చిన్నాయన వత్తాసు పలికాడు. వసతికి తమకే ఇబ్బంది లేదని చెప్పి, దిగేముందు మరిచిపోకుండా రాసుకుందామని వాళ్లపేర్లు అడిగారు లీనాశర్మ. అప్పుడు వాళ్లు చెప్పిన పేర్లు: శంకర్‌సింగ్ వాఘేలా, నరేంద్ర మోదీ. శుద్ధమైన కోరిక గాయకుడు రఫీ భారతదేశంలో చాలా గొప్పవాడు అయి ఉండవచ్చు. గొప్ప గాయకుడు అయి ఉండవచ్చు. లక్షలాది మంది అభిమానులు అతడికి ఉండవచ్చు. కాని దైవం ముందు అతడొక మామూలు భక్తుడు. మక్కాలో కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శతకోటి మంది భక్తులలో అతనూ ఒక్కడు. అందరికంటే ఎక్కువ మంది అభిమానులను సకల చరాచర సృష్టి ఆరాధనను కలిగి ఉన్నది ఒకే ఒక్కడు– ఈశ్వరుడు. అతని ముందు విమన్రంగా ఉండక తప్పదు. 1969లో రఫీ హజ్ యాత్ర చేశాడు. ఆయనతో పాటు నాటి పాకిస్తాన్ స్టార్ సింగర్ మసూద్ రాణా కూడా ఉన్నాడు. హజ్‌కు వెళితే ఆ నియమాలను పాటించి తిరిగి రావాలి ఎవరైనా. కాని రఫీకి కాబా గృహం దగ్గర నమాజు వేళకు అధికారికంగా ఇచ్చే అజాన్‌ను తనకు ఇవ్వాలనిపించింది. ఇంత మధురమైన గాయకుణ్ణి, పెద్ద గాయకుణ్ణి నేను అజాన్ ఇస్తే ఎంత బాగుంటుందో కదా అని వెళ్లి హజ్ నిర్వాహక కమిటీని అడిగాడు. కమిటీ ఒక్క నిమిషంలో అతడి కోరికను కొట్టిపడేసింది. ఇక్కడి పద్ధతుల అనుసారం బయటి వాళ్లు అజాన్ ఇచ్చే ఆనవాయితీ లేదని చెప్పేసింది. రఫీ నిరాశగా తిరిగి వచ్చాడు. ఈసారి తన గాయక హోదాతో మరెవరినో తీసుకుని కమిటీ దగ్గరకు వెళ్లాడు. మళ్లీ అనుమతి నిరాకరించబడింది. మళ్లీ ఇంకేదో రికమండేషన్‌తో వెళ్లాడు. అదీ నడవ లేదు. ఇలా నాలుగైదు రోజులు గడిచాయి. ఒకరోజు తెల్లవారుజామున రఫీ కాబా చుట్టూ ప్రదిక్షిణం చేస్తూ– ప్రభూ... నేను గాయకుణ్ణి కాదు.. ఒత్త నీ విశ్వాసిని... నీ జీవుడిని... నీ పట్ల అపారమైన ఆరాధన కలవాడిని... ఒక మామూలు భక్తుడిగా అడుగుతున్నాను... నీ పుణ్యక్షేత్రంలో నాకు అజాన్ ఇచ్చే అవకాశం ఇవ్వు అని వేడుకున్నాడు. అలా అనుకుని మళ్లీ కమిటీ దగ్గరకు వెళ్లాడు. కమిటీ వాళ్ల ఎదురుగా నిలుచుని ఉన్నది గాయకుడు కాదు సెలబ్రిటీ కాదు ఒక మామూలు ముసల్మాన్. వాళ్లు అనుమతి ఇచ్చారు. ఆ తెల్లవారుజాము నమాజు కోసం రఫీ ఇచ్చిన అజాన్ అక్కడ ఉన్నవాళ్లందరినీ ఎంత కరుణలో ముంచెత్తిందంటే దైవస్పృహలో వారందరి కళ్లు ధారాపాతం అయ్యాయి. అలాంటి అజాన్‌ను వారు ఇంతకు ముందు వినలేదు. వాళ్లు రఫీని ఆలింగనం చేసుకున్నారు.అంతేనా? రఫీ అక్కడ ఉన్నన్నాళ్లు ప్రతిరోజూ తెల్లవారుజాము అజాన్ ఇచ్చే అనుమతి అతనికి లభించింది. అహం వదులుకుంటే కరుణ దొరికే తీరుతుంది. ఒక్క చిరునవ్వు 19వ శతాబ్దిలో అమెరికన్ నవలా రచయితలలో పేరెన్నికగన్నవాడు మార్క్‌ట్వెయిన్. మార్క్ చదివే స్కూల్లో విద్యార్థులకు టీచర్ జనరల్ నాలెడ్జికి సంబంధించిన పరీక్ష పెట్టారు. ఆ ప్రశ్నాపత్రంలోని చివరి ప్రశ్న ‘రోజూ ఈ స్కూల్‌ని శుభ్రపరిచి, ఆయాగా పనులు చేసే ఆమె పేరు ఏమిటి?’ అని ఉంది. పిల్లలందరికీ ఆమె రూపం జ్ఞప్తికి వచ్చింది. రోజూ ఆమెను తమందరూ చూస్తారు. ఆమె పొడుగ్గా ఉంటుంది, నల్లటి జుట్టు ఉంటుంది, యాభై ఏళ్లకు పైనే వయసు ఉంటుంది. కానీ, పిల్లలెవెరికీ ఆమె పేరు తెలియదు. టీచర్ తమను ఆటపట్టించడానికే ఆ ప్రశ్న ఇచ్చారని, ఇదెందుకు పనికివస్తుందని విద్యార్థులందరూ అనుకున్నారు. క్లాస్ చివరలో ఒక విద్యార్థి లేచి ‘సర్ ఈ ప్రశ్నకు సమాధానం రాయకపోయినా మా ర్యాంకు తగ్గదు కదా’ అన్నాడు. టీచర్ ‘కచ్చితంగా తగ్గదు’ అంటూనే ‘మీ జీవితంలో ఎంతో మంది మీకు తారసపడుతూ ఉంటారు. మరెంతో మందిని కలుస్తూ ఉంటారు. ఎంతోమంది మీకు ఏదో రూపంలో సేవలు చేస్తూనే ఉంటారు. వారిలో నిరుపేదలే ఎక్కువ. వారందరూ గుర్తించదగినవారే! వారు మీ నుంచి కోరుకునేది ఒక్క చిరునవ్వు, చిన్న పలకరింపు. అదే మిమ్మల్ని దైవానికి దగ్గర చేరుస్తుంది’ అని చెప్పాడు. ‘ఆ రోజే ఆ ఆయా పేరు డోరతి అని తెలుసుకున్నానని, ఈ పాఠం జీవితంలో తనెప్పుడూ మర్చిపోలేద’ని డైరీలో రాసుకున్నాడు మార్క్. నాన్నకు ప్రేమతో.. క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. అతను ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటే, అతన్ని అడ్డుకట్ట వేస్తూ, ‘మీ కుటుంబం ఏమిటి, సంపాదన సరిపోతుందా’ అనే ప్రశ్నలు వేస్తూ సంభాషణను జయప్రదంగా దారి మళ్ళించాను. కానీ అతడు చెప్పిన సంగతులు వింటే ఏ తండ్రికి అయినా ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనిపించింది.పేద కుటుంబంలో పుట్టాడు. ఒక్కడే కొడుకు. చదువు సరిగా అబ్బక పోవడంతో సంసారం నడపడానికి స్టీరింగ్ చేతబట్టాడు. తండ్రికి వేరే సంపాదన లేదు. టాక్సీ నడిపిన రోజుల్లో బాగానే గిట్టుబాటయ్యేది. ఒక్కోసారి రోజువారీ ఆదాయం వేలల్లో వుండేదిట. సంసారం కాస్త తెరిపిన పడింది. దేశంలో తిరగని ఊళ్ళు లేవు. రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు. తండ్రికి జబ్బు చేసింది. ఏ క్షణాన ఆసుపత్రికి తీసుకువెళ్ళాలో తెలవదు. దేశం పట్టుకుని తిరుగుతూవుంటే సంపాదన బాగా ఉండొచ్చు కానీ, ఇంట్లో ఏదైనా అవసరం పడితే చప్పున రావడం కష్టం.అందుకని రాబడి తగ్గినా పరవాలేదనుకుని హైదరాబాదులోనే ఉండేలా ట్రావెల్స్ లో చేరాడుట.‘నాకు మా నాన్న ఆరోగ్యం ముఖ్యం. సంపాదన కానీ, ఏదైనా కానీ దాని తర్వాతే’ అన్నాడు నెమ్మదిగా. వెనక సీట్లో కూర్చోవడం వల్ల అతడి మొహం నాకూ, నా మొహం అతడికీ కనబడే వీలు లేదు. కానీ నాకు మల్లేనే అతడి కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి. – బండారు శ్రీనివాసరావు, పాత్రికేయుడు గ్లాసెడు పాలు ఒక రోజు ఒక నిరుపేద పిల్లవాడు తల్లి అమ్ముకురమ్మన్ని ఇచ్చిన కొన్ని బొమ్మలున్న బుట్టను తల మీద పెట్టుకొని దారుల్లో తిరుగుతున్నాడు ఎవరైనా ఒక్క బొమ్మనైనా కొనకపోతారా అని. ఒక్క బొమ్మా అమ్ముడుపోలేదు. ఆకలికి కళ్లు తిరుగుతున్నాయి. శోష వచ్చేలా ఉంది. ‘ఈసారి వెళ్లే ఇంట్లో వాళ్లని కొంచెం భోజనం పెట్టమని అడుగుదాం’ అనుకొని ఓ ఇంటి తలుపు తట్టాడు. ఒక యువతి తలుపు తీసింది.భోజనం అడుగుదామనుకున్న ఆ పిల్లవాడు అడగలేక ‘తాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వగలరా..’ అన్నాడు. ఆ పిల్లవాడు ఆకలిగా ఉన్నాడేమో అనిపించిన ఆమె పొడవాటి గ్లాసు నిండా పాలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ పిల్లవాడు ఆ గ్లాసు అందుకొని నెమ్మదిగా ఆ పాలు తాగి ‘మీకు ఎంతో రుణపడి ఉన్నాను. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?’ అన్నాడు. ఆమె సన్నగా నవ్వుతూ ‘దయ చూపడంలో తల్లి ధరను కోరుకోదు’ అంది. ‘మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఆ పిల్లవాడు అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు. కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒక నడి ఈడు స్త్రీ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చింది. ఆ నగరంలోనే ప్రముఖుడైన డాక్టర్ హావర్డ్ కెల్లీనే ఈ జబ్బును నయం చేయగలడని అతని వద్దకు పంపించారు స్థానిక డాక్టర్. డాక్టర్ హావర్డ్ కెల్లీ ఆమెకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశాడు. ఆమెకు జబ్బు పూర్తిగా నయమయ్యేదాక ఆసుపత్రిలోనే ఉంచి, ఆమె ఆసుపత్రి బిల్లును ఆ డాక్టరే చెల్లించాడు. ఆమె ఆశ్చర్యపోతూ డాక్టర్ చెల్లించిన ఆ బిల్లును చూసింది. ఆ బిల్లు అడుగున ‘గ్లాసెడు పాల రుణం ఇప్పుడు తీర్చుకున్నాను’ ఇట్లు డాక్టర్హావర్డ్ కెల్లీ అని రాసుంది. ఆమె కళ్లు సంతోషంతో వర్షించాయి. -
ఇదీ క్రీడా స్ఫూర్తి..!
ఫుట్‌బాల్ మ్యాచ్ అంటేనే యుద్ధం మాదిరిగా రెండు జట్ల మధ్య చావోరేవో అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఆశించిన మేర ఫలితం రాకపోతే ఇరుజట్ల అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, రక్తపాతాలకు దారి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా అందుకు పూర్తి విరుద్ధంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. బెల్జియంతో జరిగిన మ్యాచ్ చివర్లో జపాన్ జట్టు ఆశలు గల్లంతు కావడంతో స్టేడియంలోని అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రష్యాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లు చూసేందుకు జపాన్ నుంచి వెళ్లిన వేలాదిమంది ఈ ఓటమితో ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు వైదొలగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినా పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రం చేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగు మ్యాచ్‌లలోనూ ఇదే రకమైన నైతిక విలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ మ్యాచ్ తర్వాత నీలం రంగు ‘సమురాయ్ డ్రెస్’ ధరించిన అభిమానులు స్టేడియమంతా కలియతిరుగుతూ చెత్త ఏరుతున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓటమి చవిచూసిన జపాన్ జట్టు కూడా అత్యున్నత క్రీడా స్ఫూర్తిని, తమ దేశ క్రమశిక్షణను చేతల్లో చూపింది. స్టేడియంలోపల తమ జట్టుకు కేటాయించిన లాకర్ రూమ్‌లోని కుర్చీలు, సామగ్రిని ఆటగాళ్లు మిలమిల మెరిసేలా శుభ్రపరిచారు. ఓటమికి కుంగిపోకుండా రష్యన్ భాషలో ‘ధన్యవాదాలు’ అనే నోట్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు నిష్క్రమించినా జపాన్ ఆటగాళ్లు, అభిమానులు అందరి మనసులు గెలుచుకున్నారు. జపాన్ వ్యాప్తంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల తర్వాత అభిమానులు ఈ విధంగా స్టేడియాలను శుభ్రపరచడం జపనీస్ సంస్కృతిలో అంతర్భాగమని ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ స్కాట్ మ్యాక్ఇన్టైర్ చెబుతున్నారు. జపాన్ దేశ క్రీడాభిమానుల నుంచి స్ఫూర్తి పొందిన సెనెగల్ అభిమానులు కూడా గతంలో స్టేడియాన్ని శుభ్రపరిచారు. తమ జట్టు పోలాండ్‌పై గెలిచిన ఉత్సాహంతో వారు ఆ పనిచేశారు. -
లేమితో చెలిమి
సివిల్స్‌లో అత్యధిక ప్రతిభ కనబరిచిన వారంతా పెట్టి పుట్టిన వాళ్లేం కాదు. ఐదు రూపాయలకి టీ అమ్ముకునే చాయ్‌వాలా నుంచి, రోజుకూలీ వరకు కష్టజీవుల కుటుంబాల్లోంచి పుట్టుకొచ్చిన వారే! చదువుకు కలిమితో పని లేదనీ.. కష్టపడే తత్వం, సాధించగలనన్న నమ్మకం ఉంటే చాలుననీ నిరూపించిన వాళ్లే వీళ్లంతా. ఆ కోవలోకే వస్తారు 2015లో తమిళనాడు సివిల్స్ టాపర్‌గా నిలిచిన పశువుల కాపరి వన్మతి. పశువుల్ని మేపుకుంటూ కలెక్టరుగా ఎదిగిన ఆమె జీవితం సివిల్స్ స్వాప్నికులకు ఆదర్శం.మహారాష్ట్ర నందర్బార్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వన్మతిని ఎవరైనా ‘మీ హాబీస్ ఏంటి?’ అనడిగితే.. ‘తనకు పశువులను మేపడమంటే చాలా ఇష్టం’ అని చెబుతారు! ఎందుకంటే జీవితమెంత కష్టమైనదైనా ఇష్టంగా మలుచుకోవడం ఆమెకు తెలుసు కనుక. కష్టం లేకుండా సుఖం దక్కదని ఆమె నమ్ముతారు కనుక. చదువుకుంటూనే ఆమె పశువులను కాసేందుకు వెళ్లింది కనుక. స్కూలు నుంచి రాగానే కలలూ, కన్నీళ్లూ కలగలిసిన జీవితం వన్మతిది. ఆమెకు, ఆ ఇంటికీ నాలుగు పశువులే జీవనా ఆధారం. కుటుంబ పోషణ కోసం వన్మతి తల్లి పాడిని నమ్ముకుంది. తండ్రి చెన్నయ్యప్ప డ్రైవర్. ఆయనకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కావడంతో తల్లి పశుపోషణలో తనవంతు సాయంగా వన్మతి సాయంత్రాలు పశువుల ఆలనాపాలనా చూసుకునేది. చదువుని ఎంతగా ప్రేమిస్తుందో తన ఇంట్లో అమ్మ కష్టాన్నీ అంతే ఆనందంగా పంచుకుంటుంది వన్మతి. పలకా బలపంతో బడికెళ్లిన ప్పట్నుంచి నుంచి సివిల్స్ రాసే వరకూ చదువూ, గేదెలే ఆమె లోకం. ఇంటికి రాగానే పుస్తకాల సంచీ కొయ్యకి తగిలించి పశువులను తోలుకొని వాటితో పాటే ఆరు బయట ఆహ్లాదాన్ని వెతుక్కుంటూ వెళ్లేది. కలెక్టరమ్మను చూశాక వన్మతి స్వగ్రామమైన తమిళనాడులోని ఇండోర్ జిల్లా సత్యమంగళం. బళ్లో ఉన్నా, పచ్చికబయళ్లలో ఉన్నా ఆమె కలలు కనడం మాత్రం ఆగలేదు. చిన్నప్పటినుంచి ఐఏఎస్ కావాలనే కోరిక నిరంతరం చదువుని ప్రేమించేలా చేసింది. ఇంట్లోనూ, అడవిలోనూ ఓ పాఠ్య పుస్తకం ఆమె వెంట ఉండేది. ఓ రోజు వాళ్ల కాలేజీకి వచ్చిన జిల్లా కలెక్టరు మాటలూ, ఆదరణ కూడా వన్మతి ఆశలకు మరింత బలం చేకూర్చాయి. తన కాలేజీకొచ్చిన మహిళా కలెక్టరు గారిని చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అంతా గౌరవించడం వన్మతికి గొప్పగా అనిపించింది. అంతే. తను కూడా కలెక్టర్ అవ్వాలని ఆ క్షణమే అనుకుంది. ఎందులోనైనా మంచీ, చెడూ రెండూ ఉంటాయి. కావాల్సిన మంచిని ఎంచుకొని చెడుని వదిలేయాలని వన్మతికి ఆమె తల్లి చెప్పేది. అంతే కాదు తను చూసిన టీవీ సీరియల్ ‘గంగా, జమునా, సరస్వతి’ నుంచి కూడా ఐఏఎస్ కావాలనే స్ఫూర్తి పొందారు వన్మతి. ఇంటర్ తర్వాత కూడా చదువెందుకూ పశువులు కాసుకోడానికి ఈ చదువు చాలదా అన్నవాళ్లే.. వన్మతి బంధువులు, చుట్టపక్కల వాళ్లూ! వాళ్లతోపాటు ఆడపిల్లలకు పెళ్లే పరమార్థం అని బోధించే వాళ్లు కూడా చివరికి వన్మతి పట్టుదల ముందు వీగిపోయారు. ఎవరొద్దన్నా వినలేదు మంచి మార్కులతో డిగ్రీ పూర్తిచేసిన వన్మతి ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగంలో చేరింది. ఆశయాలను సాధించుకునేందుకు డబ్బు అవసరమే తప్ప డబ్బే సర్వస్వం కాదన్నది వన్మతి అభిప్రాయం. నిజంగా డబ్బే ముఖ్యమనుకుంటే ఆమె ఏ ఇతర ఉద్యోగాలనో సంపాదించుకోగలదు. కానీ ఆమె లక్ష్యం అది కాదు. జిల్లా కలెక్టరై పదిమందికి సహాయపడాలని అనుకుంది. అందుకే ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే, సివిల్స్ ప్రిపరేషన్ని కొనసాగించింది. వన్మతి తండ్రి, తల్లీ ఇద్దరూ వన్మతి ఇష్టాలని గౌరవించారు. పెద్దగా చదువుకోని ఆ తల్లిదండ్రులు కూతురి చదువుకోసం ఎంతైనా కష్టపడాలనుకున్నారు. చుట్టుపక్కల వాళ్ల మాటలతో ఆమె కలలు చెదరకుండా కాపాడారు. మనసుని చదువుపై కేంద్రీకరించమన్నారు. పేదరికం అడ్డుపడుతున్నా, తమ కష్టార్జితంతో కన్నకూతురి అవసరాలను తీర్చారు. ఆమె చదువుతానన్న పుస్తకాన్నల్లా కొనిచ్చారు. వారి ప్రోత్సాహంతో ఆమె తన లక్ష్యంపై గురిపెట్టింది. దృష్టంతా చదువుపైనే. తొలిసారి యుపిపిఎస్సీ పరీక్షల్లో అపజయంతో పరీక్షలో కష్టాన్ని అంచనా వేసుకుంది వన్మతి. మరింత కష్టపడి చదివింది. రెండోసారి కూడా రాలేదని అధైర్యపడలేదు. అపజయాన్నుంచే ధైర్యాన్ని అందిపుచ్చుకుంది. కసిగా చదివింది. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడింది. మూడోసారి విజయం తనని వెతుక్కుంటూ వచ్చింది. సివిల్స్‌లో 152 ర్యాంకుతో తమిళనాడు రాష్ట్రానికీ, తన ఊరికీ కీర్తిని తెచ్చిపెట్టింది వన్మతి. తండ్రికి తోడుగా ఆసుపత్రిలో ఇంటర్వ్యూ కి ఇక రెండు రోజులే ఉన్నప్పుడు ఆమె తన తండ్రితో ఐసియూలో ఉంది. జీవితమంతా డ్రైవర్‌గా గడిపిన తండ్రి వెన్నెముకకి వచ్చిన వ్యాధితో ఐసీయూలో పోరాడుతూనే తన కూతుర్ని చిర్నవ్వుతో ఇంటర్వ్యూకి సాగనంపారాయన. 2015 యుపిఎస్సీలో ర్యాంకు సాధించి లాల్‌బహదూర్ శాస్త్రి ట్రైనింగ్ అకాడమీలో శిక్షణని పూర్తిచేసుకొన్న వన్మతికి ఫస్ట్ పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది. ప్రస్తుతం నందర్బార్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న వన్మతి తన ప్రజాసేవా సంకల్పాన్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. ఒక్క అపజయంతోనే కుంగిపోయే యువతరానికి వన్మతి పట్టుదల ఒక స్ఫూర్తి. – అరుణ -
ఈ పాఠం మన పిల్లలూ చదవాలి
కష్టాలను గానుగలో వేసి పిండిన సంధ్య, దుర్గాభవానీల చాప్టర్ ఇది. పుస్తకం చదివేది జ్ఞానమూ, విజ్ఞానమూ, సంస్కారం కోసమే కదా! అయితే వీళ్ల చాప్టర్ స్ఫూర్తికోసం చదవాలి. మనందరం పాఠాలు నేర్చుకున్న వాళ్లమే. మన పిల్లలు కూడా. కానీ ఈ బంగారాలు జీవితానికే ఓ పాఠం నేర్పించారు. ‘ఆకాశంలో మెరుపు మెరిసినా, హరివిల్లు విరిసినా తమ కోసమేనని మురిసిపోయే బాల్యంలో ఈ చిన్నారులు ఇంటి బాధ్యతల్ని మోస్తూనే. చదువుల్లో మెరుపులయ్యారు. సర్కారీ బడిలో హరివిల్లులై విరబూశారు. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఏడాది టెన్త్‌లో 9.7 జీపీఏ సాధించి సంధ్య, 9.5 జీపీఏతో మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. ఊహ తెలిసేనాటికి సంధ్యకు నాన్న లేడు. కానీ నాన్న నడిపిన పానీపూరీ బండి ఉంది. బండెడు భారాన్ని మీదేసుకున్న అమ్మ తోడుగా ఉంది. బండి నడిస్తేనే బడి. బండి నడిపితేనే బతుకు. అలా అక్షరాలు దిద్దే చేతులతోనే సంధ్య పానీపూరీ తయారు చేసింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గప్చుప్పులు విక్రయించింది. అమ్మకు చేదోడుగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి పదింటి వరకు బండి. ఆ తర్వాత ఏ తెల్లవారు జామునో నిద్ర లేచి పుస్తకాలతో పోటీ పడిన చిన్నారి సంధ్య పదో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచింది. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలకే వన్నె తెచ్చింది. అదే స్కూల్ నుంచి సెకెండ్ టాపర్‌గా నిలిచిన దుర్గాభవానీ కూడా తల్లిదండ్రులతో పాటు తనూ ‘బతుకు బండి’ని లాగుతూనే ఉంది. అమ్మతో పాటు చెరుకుబండిని నడుపుతూ ఉంది. వీరిద్దరి ప్రతిభపై సాక్షి ఫ్యామిలీ స్పెషల్ రిపోర్ట్. సంధ్య సికింద్రాబాద్‌లోని సంగీత్ చౌరస్తా నుంచి క్లాక్‌టవర్ వైపు వెళ్తుంటే ఎడమ వైపు ఓరియంటల్ బ్యాంకు మూలన ఉంటుంది ఆ పానీపూరీ బండి. భర్త దత్తూరాం ఉన్నప్పటి నుంచి అతనితో పాటే పానీపూరీ బండి నడిపింది రాధ. బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం నారాయణ్‌ఖేడ్ నుంచి వీరి కుటుంబం నగరానికి వలస వచ్చింది. పెళ్లయిన ఆరేళ్లకే దత్తూరాం గుండెపోటుతో చనిపోయాడు. ఛాట్బండి, రెండు మూడేళ్ల వయస్సు తేడాతో ఉన్న ముగ్గురు కూతుళ్లు, ఆర్నెల్ల వయస్సున్న కొడుకు, ఒక అద్దె గది మిగిలాయి. దుఃఖాన్ని దిగమింగి, పిల్లల్ని భుజానేసుకొని బండిని ముందుకు కదిలించింది రాధ. ఆమెతో పాటు సంధ్య చిట్టి చేతులు కూడా బండిని ముందుకు తోశాయి. అలా ఆ బండి ఆకలికి అన్నం పెట్టింది. చదువు చెప్పించింది. పదోతరగతి కూడా పూర్తి చేయకుండానే పెద్దమ్మాయి అంబికకు పెళ్లి చేశారు కానీ, రెండో అమ్మాయి మనీష, మూడో అమ్మాయి సంధ్య మాత్రం ఇద్దరు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. మనీష ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సంధ్య ఈ ఏడాదే పదోతరగతి పూర్తి చేసింది. అబ్బాయి మహేశ్ సర్కారీ బడిలోనే ఏడో తరగతి చదువుతున్నాడు. ‘‘పిల్లలే నా కలల పంట, పెళ్లయిన ఆరేళ్లకే ఆయన పోయినప్పుడు ఇక బతికేదెట్లా అని భయపడ్డాను.అప్పటికి నా కొడుకు 20 రోజుల పసికందు. ఆదుకొనే వాళ్లు కనుచూపు మేరలో లేరు. ఉన్నదల్లా బండి ఒక్కటే. మరోదారి కనిపించలేదు. ఆ బండిని నమ్ముకొనే ఇంతవరకు లాక్కొచ్చాను. పెద్దమ్మాయిని చదివించలేకపోయాననే బాధ ఉంది. కానీ మిగతా ఇద్దరమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మనీషను ఇంజనీరింగ్ చదివించాలనుంది. సంధ్య సీఏ చేస్తానంటుంది. ఇంకెన్ని కష్టాలు, బాధలు వచ్చినా సరే వాళ్లను బాగా చదివిస్తాను’’ అంటున్నారు రాధ. దుర్గాభవానీ సికింద్రాబాద్‌లోనే రసూల్‌పురా పేదల బస్తీ. ఆ బస్తీలో వికసించిన విజ్ఞాన జ్యోతి దుర్గాభవానీ. వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలోనే ఈ ఏడాది సంధ్యతో పాటు కలిసి చదువుకొని 9.5 జీపీఏతో సెకండ్ టాపర్‌గా నిలిచింది. ఐపీఎస్ ఆమె కల. కల మాత్రమే కాదు ఆశయం కూడా. గత 30 ఏళ్లుగా ప్యారడైజ్ సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ బస్టాపు వద్ద పాన్ డబ్బా నడుపుకొంటున్న దుర్గ తండ్రి బాబూరావు, అక్కడే చెరుకు బండి ఏర్పాటు చేసుకున్న తల్లి రాణీల కల కూడా అదే. అక్షరం అంటే ఏంటో తెలియని తమ జీవితాల్లో అక్షర జ్యోతై వెలుగుతున్న దుర్గా భవానీ కోసం కొవ్వొత్తుల్లా కరిగిపోయి అయినా సరే ఆమెను ఐపీఎస్‌ను చేయాలని ఆకాంక్షిస్తున్నారా తల్లిదండ్రులు. ‘‘ఈ సిటీలో పుట్టి పెరిగినం. కానీ ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతుకుతున్నవాళ్లం. ఎండాకాలం చెరుకుబండి. వానాకాలం ఛాట్ బండి. అదే మా ఉపాధి. మాతో పాటే పిల్లలు పని చేస్తారు ఇంటిల్లిపాది కష్టపడితేనే బతుకు బండి నడిచేది’’ అన్నారు దుర్గాభవాని తల్లి రాణి. కూతురు దుర్గతో పాటు, కొడుకు శివను కూడా కష్టపడి చదివిస్తున్నారు. ‘‘పదో తరగతిలో అమ్మాయి సాధించిన ఫలితాన్ని చూస్తే జీవితంలో నేనే గెలిచినంత సంతోషం కలిగింది. ఇంకెన్ని కష్టాలొచ్చినా సరే ఆమె కోరుకున్న చదువు చదివిస్తాను’’ అని చెప్పారు బాబూరావు. కష్టంతోనే జీవితం ‘‘చిన్నప్పటి నుంచి అమ్మ పడిన కష్టాలు తెలుసు. ఆమె బాధలు చూస్తూనే ఉన్నాం. ఆ కష్టాల్లో, బాధల్లోనే పుట్టి పెరిగిన వాళ్లం. కష్టపడి వచ్చిన ఫలితంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదనిపిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నది నా లక్ష్యం.’’ ఇంటర్లో చేరిన తరువాత ఆ లక్ష్యం దిశగా పట్టుదలతో చదువుతాను’’. – సంధ్య తప్పకుండా ఐపీఎస్ అవుతా ‘‘ఉదయం బడికి పోయి, సాయంత్రం ఇంటికి వచ్చి.. ఏ పనీ చేయకుండా ఉంటే ఇల్లెట్లా గడుస్తది. అమ్మతో పాటు ఇంటి పని చేస్తాను. సాయంత్రం బండి మీదకి వచ్చి చెరుకు రసం తీస్తాను. అప్పుడప్పుడు నాన్న బయటికెళితే పాన్ డబ్బాలో ఉంటాను. ఎందుకంటే ఇదే మా జీవితం కదా. నేను తప్పకుండా ఐపీఎస్‌ను అయితీరుతాను. – దుర్గాభవానీ చదువుల గుడి మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల అమ్మాయిల చదువులకు కల్పవల్లిగా ఉంది. అత్యుత్తమ బోధనతో పాటు పిల్లలకు చక్కటి క్రమశిక్షణను అలవరుస్తున్నారు. ఈ ఏడాది సంధ్య, దుర్గాభవానీలతో పాటు, శ్రీదేవి (9.2), జ్యోతి (9.2), రమ్య (9.0)లు కూడా మంచి ఫలితాలను సాధించారు. ‘‘ప్రతి ముగ్గురు పిల్లలకు ఒక టీచర్ బాధ్యత తీసుకుంటారు. ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసి చదువుకోవాలని చెబుతారు. మా టీచర్లు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. ఎక్కడా ఒత్తిడనిపించదు. చాలా సంతోషంగా, ఆడుతూ, పాడుతూ చదువుకున్నాం. మంచి ఫలితాలను తెచ్చుకున్నాం’’ అని చెప్పారు సంధ్య, దుర్గాభవానీలు. – పడిగిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ సాక్షిలో సంధ్య, దుర్గా భవాని వార్త (ఈ పాఠం మన పిల్లలూ చదవాలి) చదివిన పలువురు దాతలు తాము సాయమందిస్తామంటూ ముందుకు వస్తున్నారు. వారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కింద అందచేస్తున్నాం. సంధ్య ఫోన్ నెంబరు: 9959132466 దుర్గా భవానీ సెల్ నెంబర్: 9866160698 -
సివిల్స్ టాపర్‌కు నేను స్ఫూర్తి : వర్మ
సాక్షి, హైదరాబాద్ : ట్విటర్లో తనదైన వ్యాఖ్యాలతో.. విరుచుకుపడే రామ్ గోపాల్‌వర్మ తనను విమర్శించే వారికి ఓ సూచన చేశాడు. ‘నేను ఎప్పుడూ క్రిమినల్స్ నుంచి, బూతు నుంచి స్ఫూర్తి పొందుతానని భావించేవారు.. ఈ సివిల్స్ టాపర్ ఏం చెప్పాడో ఒకసారి చూడండి. నేను చదువంటే భయపడే విద్యార్ధినే.. సివిల్ ఇంజనీరింగ్ రెండు సార్లు ఫెయిల్ అయినప్పటికి నేను గర్వపడతాను’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ‘ఒక సివిల్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వ్యక్తి ఓ సివిల్స్ టాపర్‌కి స్పూర్తి కల్గించాడు. యెడవల్లి అక్షయ్ నేను నిన్ను తప్పక కలుస్తాను.. మనం ఎడ్యుకేషన్ గురించి చర్చిద్దాం’ అని పోస్ట్ చేశారు. For all those who thought i inspire only criminals and perverts take a listen to what this Civil Topper is saying ..The irony is that I was a terrible student and failed in Civil engineering twice but proud about it😎 https://t.co/HVSy898CUh — Ram Gopal Varma (@RGVzoomin) May 9, 2018 Yedavalli Akshay kumar a Civils Topper takes inspiration from a failed Civil engineer ..Watch from 23:45 to 28:30 Hey Akshay I would like to meet you and talk to u about education https://t.co/BCECyhUpYI — Ram Gopal Varma (@RGVzoomin) May 9, 2018 -
విజయానికి గొడుగు పట్టింది
ఉద్యోగం చేస్తే ఒకరు చెప్పినట్టుగా చేయాలి.స్వయం ఉపాధి అయితే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. చదవిన చదువుకు ప్రయత్నం తోడైతే ఏమవుతుందో పద్మావతిని చూస్తే అర్థమవుతుంది. ఆమె ఇప్పుడు పుట్టగొడుగుల రైతు. ఇంటి వద్దే ఉంటూ మంచి సంపాదన పొందుతున్న గృహిణి. యూట్యూబ్ చూడటం ఆమెకు లాభించింది.ఒక వీడియో ఆమెను ఆకర్షించింది. హైదరాబాద్ నగరంలోని నాగోలు లక్ష్మీనరసింహ స్వామి కాలనీ(రోడ్ నెం:9) నివాసి ద్రోణంరాజు పద్మావతి జీవశాస్త్రంలో పట్టభద్రురాలు. స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లాలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి నగరానికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈ దశలో మరో ఉద్యోగం వెతుక్కోవడం కన్నా స్వయం ఉపాధి కోసం సొంతంగా ఏదైనా చేయాలని సంకల్పించారు. ఆ సమయంలోనే పుట్టగొడుగుల పెంపకంపై యూట్యూబ్‌లో తారసపడిన వీడియో ఆమెను ఆకర్షించింది. మనమెందుకు పుట్టగొడుగులు పెంచకూడదు అనిపించింది. జీవశాస్త్రంలో లోతైన అవగాహన కలిగిన పద్మావతికి తర్వాత ఏం చేయాలో పెద్దగా చెప్పాల్సిన పని లేకపోయింది. 40 రోజులకు తొలి దిగుబడి తన ఇంటి వద్ద 300 చదరపు అడుగులలో రేకుల షెడ్డు నిర్మించి 3 నెలల క్రితం పుట్టగొడుగుల పెంపకాన్ని పద్మావతి ప్రారంభించారు. 4 ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేసి 350 బెడ్స్‌లో పుట్టగొడుగులు పెంచుతున్నారు. వాట్సప్, ఫోన్ ద్వారా ఈ రంగంలో నిష్ణాతులైన వారి దగ్గర సందేహాలను తీర్చుకుంటూ పుట్టగొడుగుల దిగుబడి మొదలెట్టారు. బెడ్ తయారు చేసి విత్తనం (స్పాన్) వేసిన 40 రోజులకు పుట్టగొడుగు చేతికి వస్తుంది. నెలన్నర కాలం పాటు ఆ బెడ్స్ నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుందని ఆమె అన్నారు. రోజుకు 5–10 కిలోల మిల్కీ పుట్టగొడుగులను విక్రయిస్తున్నానన్నారు. టోకుగా కిలో రూ. 200కు, రిటైల్‌గా రూ. 300 వరకు ధర పలుకుతున్నదని, లాభసాటిగా ఉందన్నారు. పుట్టగొడుగులలో చాలా రకాలు ఉన్నాయని అంటూ.. మిల్కీ పుట్టగొడుగులు హైదరాబాద్ వాతావరణంలో బాగా పెరుగుతున్నాయన్నారు. తొలి సీజన్లో గడించిన అనుభవంతో పుట్టగొడుగుల సాగును త్వరలో మరో రెండు గదులకు విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. ‘చాలా చేయాలని ఉంది. బ్యాంకులు లోన్ ఇస్తే బాగుండు’ అన్నారామె. అతి జాగ్రత్త పాటించాలి వరిగడ్డిని ఉడకబెట్టి బెడ్ తయారు చేయడం దగ్గర నుంచి, కొద్దిరోజుల పాటు చీకటి గదిలో నిల్వచేయడం, కలుషితం కాకుండా చూసుకోవడం, గాలిలో తేమ, గది ఉష్ణోగ్రత వంటివన్నీ జాగ్రత్తగా చేయడం ద్వారా పుట్టగొడుగుల పెంపకాన్ని నేర్చుకోగలిగానని ఆమె తెలిపారు. ఐసీయూలో ఉన్న రోగి మాదిరిగా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని అంటూ.. అప్పుడే చక్కని దిగుబడి పొందగలుగుతామని పద్మావతి అన్నారు. సాధారణంగా మార్చి–నవంబర్ మధ్య కాలం పుట్టగొడుగుల సాగుకు అనువైన కాలమని.. అయితే, తాను చలికాలంలో ప్రారంభించడం వల్ల గది ఉష్ణోగ్రత, గాలిలో తేమ సరిచూసుకోవడానికి యంత్రాలను సమకూర్చుకోవలసి వచ్చిందని ఆమె అన్నారు. తొలి దశలో మౌలిక సదుపాయాలకు కొంత పెట్టుబడి అవసరమవుతుందని, తదనంతరం అంత పెద్దగా ఖర్చు ఉండదని ఆమె తెలిపారు. – చిత్రం సైదులు, సాక్షి, నాగోలు, హైదరాబాద్ రసాయనాలు వాడటం లేదు ఎటువంటి రసాయన ఎరువులు కలపకుండా ఆరోగ్యకరమైన మిల్కీ పుట్టగొడుగులను పెంచుతున్నాను. పుట్టగొడుగులు వారానికి రెండు సార్లు తినొచ్చు. శరీరంలోని చెడు కొవ్వు కరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. విటమిన్ బీ, సీ తోపాటు కాల్షియం, మినరల్స్ అందుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పోతాయి. ప్రస్తుతం నగరంలో వీటికి మంచి డిమాండ్ ఉంది. అడిగిన వారికి ఊరగాయ కూడా పెట్టి ఇస్తున్నా. – ద్రోణంరాజు పద్మావతి (94907 55366), లక్ష్మీనరసింహస్వామి కాలనీ, నాగోలు, హైదరాబాద్ -
రెండు తరాలుగా వారికి కులంలేదు!
‘నమస్తే అండీ.. నా పేరు క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని ఆయన చెప్పగానే.. ప్రజలు ఆయన వైపు అయోమయంగా చూస్తారు. ఏమిటీ వింత పేరు అన్నట్టుగా ఉండే వారి అయోమయం చూపులను చూసి.. క్యాస్ట్‌లెస్ జూనియర్ లోలోపల నవ్వుకుంటారు. కానీ, అత్యంత అరుదైన ఆయన నామం వెనుక పెద్ద కథే ఉంది. ఆయనే కాదు.. ఆయన తోబుట్టువుల పేర్లు విన్నప్పుడు కూడా జనం ఇలాగే విస్తుపోతుంటారు. ఆయన సోదరుడి పేరు క్యాస్ట్‌లెస్ (కులం లేదు). సోదరి పేరు షైన్ క్యాస్ట్‌లెస్. కేరళ రాజధాని కొచ్చి నుంచి 67 కిలోమీటర్లు ప్రయాణించి.. కొల్లాం జిల్లాలోని పునలూరుకు వెళితే.. అక్కడ ఓ ఉన్న ఇంటి నేమ్‌ప్లేట్‌పై ఇలాంటి ఓ అరుదైన పేరు దర్శనమిస్తుంది. ‘కులంలేని ఇల్లు’ అని మలయాళంలో రాసి ఉంటుంది. ఆ ఇంటి పెద్ద ఫసులుద్దీన్ అలికుంజ్. పుట్టుకతో ముస్లిం. ఆయన సహచరి ఏజ్నెస్ గాబ్రియెల్.. క్రైస్తవ మతస్తురాలు. ఇద్దరూ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. ఫసులుద్దీన్ను ఏజ్నెస్ ప్రేమిస్తుందని తెలిసి.. కుటుంబసభ్యులు ఆమెను ‘హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఫసులుద్దీన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి మరీ ఆమెను విడిపించారు. 1973లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు వారు ఒకటయ్యారు. కానీ పెళ్లి చేసుకోలేదు. కనీసం మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకోకుండా 19 సంవత్సరాలు సహజీవనం చేశారు. వారు ఏ మతాన్ని పాటించలేదు. అయితే, తమ ఆచరణ వల్ల పిల్లలకు ఇబ్బంది ఎదురుకాకూడదని 1992లో వారు తమ కలయికను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయించారు. తమ ఆస్తులు వారసత్వంగా తమ పిల్లలకు దక్కడంలో ఇబ్బంది ఎదురుకాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో తాను పదో తరగతిలో ఉన్నట్టు గుర్తుచేసుకుంటారు వారి రెండోకొడుకు క్యాస్ట్‌లెస్ జూనియర్. అయితే, ఆ సమయంలో ఇటు ఫసులుద్దీన్, అటు ఏజ్నెస్ కుటుంబాలు.. వారికి పుట్టబోయే పిల్లలు తమ మతాన్నే అనుసరించాలని ఒత్తిడి తెచ్చారు. వారి పిల్లలను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఫసులుద్దీన్కానీ, ఏజ్నెస్కానీ ఆ ఒత్తిడికి తలొగ్గలేదు. ‘మా తల్లిదండ్రులిద్దరూ హేతువాదులు. వారు లౌకికవాదాన్ని ఆచరించేవారు. తమ కుటుంబసభ్యుల ఒత్తిడిని లెక్కచేయక వారు జీవనాన్ని సాగించారు’ అని అంటారు క్యాస్ట్‌లెస్ జూనియర్. సహజంగా తండ్రి మతమే పుట్టబోయే పిల్లలకు వస్తుందనే చాలామంది నమ్ముతారు. ‘కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. 1974లో మా అన్నయ్య పుట్టినప్పుడు.. అమ్మనాన్నలు అతనికి ‘క్యాస్ట్‌లెస్’ అని పేరు పెట్టారు’ అని నవ్వుతారు క్యాస్ట్‌లెస్ జూనియర్. ఆ తర్వాత 1975లో తమకు పుట్టిన రెండో బాబుకు ‘క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని, 1983లో పుట్టిన చిన్నకూతురికి ‘షైన్ క్యాస్ట్‌లెస్’ అని నామకరణం చేశారు ఫసులుద్దీన్ దంపతులు. కులాన్ని, మతాన్ని అనుసరించకపోవడం వల్ల తమ పిల్లలు ఎలాంటి హక్కులు కోల్పోలేదని, స్కూల్ రికార్డ్స్ల్లోగానీ, ఇతర ప్రతాల్లోగానీ కులం, మతం అని ఉన్న చోట ‘నిల్’ అని రాసేవారని ఫసులుద్దీన్ గుర్తుచేసుకుంటారు. కాన్వెంట్ స్కూల్వాళ్లు తమ ఇంటికి వచ్చి పిల్లలు పేర్లు మార్చాలని అడిగేవారని, కానీ 18 ఏళ్లు వచ్చిన తర్వాత తమ పేర్లపై పిల్లలే నిర్ణయం తీసుకుంటారని స్కూల్వాళ్లకు చెప్పి పంపేవాళ్లమని ఆయన చెప్తారు. క్యాస్ట్‌లెస్, క్యాస్ట్‌లెస్ జూనియర్, షైన్ క్యాస్ట్లెస్లకు పెళ్లిళ్లు జరిగినప్పుడు ఎవరూ మతపరమైన ఆచారాలు పాటించలేదు. కట్నంగానీ, పూజారిగానీ లేకుండా కేవలం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారు తమ వివాహాలను రిజిస్టర్ చేయించుకున్నారు. ‘పెళ్లికి చాలాముందే మా భాగస్వాములకు మా దృక్పథం ఏమిటో చెప్పాం. వాళ్లు అంగీకరించారు’ అంటారు క్యాస్ట్‌లెస్. మీ పిల్లలకు పెళ్లిళ్లు కావని, వారికి మంచి సంబంధాలు రావని ఫసులుద్దీన్, ఏజ్నెస్ను వాళ్ల కుటుంబాలు బెదిరించేవి. ఆ బెదిరింపులు ఉత్తవేనని వీరి పెళ్లిళ్లు నిరూపించాయి. సమాజం కూడా తమ కుటుంబ జీవనవిధానాన్ని అంగీకరించిందని క్యాస్ట్‌లెస్ అంటారు. కులం నేపథ్యం చూడకుండా ఒక్క ఓటు కూడా వేయని మన సమాజంలో పునలూరు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో తాను గెలుపొంది.. 2005-10 మధ్యకాలంలో వైస్ చైర్మన్‌గా సేవలు అందించానని ఆయన గుర్తుచేసుకుంటారు. క్యాస్ట్‌లెస్ ఆయన తోబుట్టువులు కూడా తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఎంబీఏ చేసిన క్యాస్ట్‌లెస్ భార్య పేరు సబిత, దుబాయ్‌లో నివాసముంటారు. వీరు తమ పిల్లలకు ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్’, ‘ఇండియన్ క్యాస్ట్‌లెస్’ అని పేరు పెట్టారు. న్యాయవాది అయిన క్యాస్ట్‌లెస్ జూనియర్.. పునలూరు బార్ అసోసియేషన్ సభ్యుడు. హిందు మహిళ అయిన రాజలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.. ‘అగ్నా క్యాస్ట్‌లెస్ జూనియర్’, ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని పేరు పెట్టారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పీహెచ్డీ చేస్తున్న షైన్ క్యాస్ట్‌లెస్ వ్యాపారవేత్త చెగువరెను పెళ్లాడారు. వీరికి అలైదా చెగువరె అనే కూతురు ఉంది. క్యాస్ట్‌లెస్ అనే పేరును కొనసాగించడం అన్నది తమ వ్యక్తిగత అభీష్టమని, దీనిని పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదని ఫసులుద్దీన్ కుటుంబం అంటుంది. అయినా, మీరు చనిపోతే.. మీ మృతదేహాలను ఖననం చేస్తారా? లేక పూడ్చిపెడతారా? అంటూ బంధువులు కొత్త కొత్త సందేహాలతో తమ వద్దకు వస్తారని, తమ మృతదేహాలను సైంటిఫిక్ కమ్యూనిటీకి అందజేసి.. వారికి ఉపయోగిపడితే చాలు అని తాము భావిస్తున్నామని, ఇది అప్పుడు బతికి ఉన్న కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకుంటారని క్యాస్ట్‌లెస్ జూనియర్ ‘ద న్యూస్ మినిట్’ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ అన్నారు. కులానికి అతీతంగా సమాజంలో హుందాగా బతకగలమని చాటిన ‘క్యాస్ట్‌లెస్’ కుటుంబం అందరికీ ఆదర్శప్రాయం.. కాదంటారా? ఈ ఆర్టికల్‌పై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో పంచుకోండి. -
ఆ న్యాయమూర్తుల నుంచి స్ఫూర్తి పొందుదాం
సాక్షి, హైదరాబాద్: స్వీయ ప్రయోజనాలకు కాక వ్యవస్థ విలువలను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చిన న్యాయమూర్తుల నుంచి న్యాయవ్యవస్థలో ఉన్నవారందరూ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. న్యాయమూర్తుల నైతికత అన్న పునాదిపైనే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమైందని తెలిపారు. ఈ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ప్రతీ న్యాయమూర్తి, న్యాయవాది శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం 69వ గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన ఏసీజే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెహ్రూ కాలంలో జరిగిన ఓ ఉదంతాన్ని వివరించారు. ‘1954లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పతంజలి శాస్త్రి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ పదవిని స్వీకరించాలని జస్టిస్ బిజోన్ కుమార్ ముఖర్జీని ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కోరారు. ఈ వినతిని జస్టిస్ ముఖర్జీ సున్నితంగా తిరస్కరించారు. తనకన్నా సీనియర్ ఉండగా, తాను ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టలేనని తేల్చి చెప్పారు. నెహ్రూ ఒత్తిడి చేయగా, న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తానే తప్ప పదవిని చేపట్టబోమని అన్నారు. జస్టిస్ ఎం.సి.మహాజన్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాతనే జస్టిస్ ముఖర్జీ ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్టించారు. స్వీయ ప్రయోజనాల కన్నా వ్యవస్థ ప్రయోజనాలను ఉన్నత స్థితిలో నిలిపిన ఇటువంటి న్యాయమూర్తులను అనుసరించి, వారి నుంచి మనం అందరం స్ఫూర్తి పొందాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యంగ రచన ఎలా జరిగింది.. అందుకు కారకులెవరు.. తరువాత పరిణామాలను ఆయన వివరించారు. తాత్కాలిక భవనంలో హైకోర్టు తగదు తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చల్లా ధనంజయ తప్పుపట్టారు. దీనిపై అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం న్యాయవాదుల సంఘానికి ఇవ్వాలని ఆయన ఏసీజేను కోరారు. కాగా గణతంత్ర వేడుకల్లో హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తడంపై ఏసీజే ఒకింత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ అడ్వొకేట్స్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జల్లి కనకయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
యువతకు వివేకానంద స్ఫూర్తి
జిన్నారం(పటాన్చెరు): యువతకు వివేకానంద స్ఫూర్తి అని డీసీసీ అ«ధ్యక్షురాలు సునితారెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిన్నారం మండలంలోని ఇమాంనగర్‌లో శనివారం వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వివేకానందుడి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన యువకులను అభినందించారు. పటాన్చెరు నియోజకర్గం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. ఇమాంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకులే నిధులు కేటాయించారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఏర్పాటవుతుందని, ఇందుకు నాయకులు కాటాశ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్, శశికళా, శంకర్‌యాదవ్‌లు ఉన్నారని తెలిపారు. పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జెడ్పీఫ్లోర్ లీడర్ ప్రభాకర్, నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, శంకర్ యాదవ్, శశికళ, నిర్మల, నాగేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మద్దివీరా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ గౌడ్, మల్లేశ్ తదతరులు పాల్గొన్నారు. -
ఉద్యమస్ఫూర్తికి ఏదీ గౌరవం?
అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తరువాత రాష్ట్ర ఏర్పాటు చరిత్రాత్మక ఘట నలు. సకల జనులు కలసి, సబ్బండ వర్గాలు ఏకమై సుదీర్ఘ కాలం పోరాడారు. ఉద్యమాల ఫలితంగా, త్యాగాల కారణంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోవడమే పెద్ద విషాదం. ఈ అంశాన్ని వెల్లడించమే అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఉద్దేశం. గోచికట్టి గొంగడేసుకుని పాట పాడి, వంటా వార్పూ చేసి, రాస్తారోకోలలో పాల్గొని, రైలు పట్టాల మీద బైఠాయించి, బంద్‌లు పాటించి, సమ్మెలు చేసి, సత్యాగ్రహాలు నిర్వహించి తెలంగాణ ప్రజలు తమ ప్రత్యేక రాష్ట్ర కలను నిజం చేసుకున్నారు. ఆంధ్ర పాలకులతో తెగించి కొట్లాడినారు. ఉద్యమానికి ఊతమిచ్చి తిరిగిరాని లోకాలకు తరలిపోయిన వారు ఎందరో. తరువాత ఎన్నికలలో తెలంగాణవాదుల గెలుపుకోసం రకరకాల మార్గాలలో ప్రచారాలు చేసి, నేను సైతం అన్న తీరులో ప్రతి వ్యక్తి సమరశీలతతో కదం తొక్కారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సంకుచితమైనది కాదు. ఆంధ్రా పాలకులను వ్యక్తిగతంగా వ్యతిరేకించడానికి ఇది సాగలేదు. అసలు ఆంధ్రపాలకులను ద్వేషించడమే దాని ధ్యేయం కాదు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే ఉద్యమం ఎదిరించింది. ‘సచి వాలయంలో కూర్చుని చక్రం తిప్పడం కుదరదు’ అని రాష్ట్ర సాధనోద్యమం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్రోద్యమం గురించి కాళోజీ నారాయణరావు చేసిన వ్యాఖలను గుర్తు చేసుకోవాలి. ‘మాకొద్దీ తెల్లదొరతనము...’ అన్న గరిమెళ్ల వారి గేయంలోని మాటలను ఉటంకిస్తూ కాళోజీ, ‘స్వాతంత్య్రోద్యమం తెల్లవారిని వెళ్లగొట్టడం కోసమే కాదు, దొరతనాన్ని కూడా అంతం చేయడానికి సాగింది’అని పేర్కొనేవారు. సామాజిక, ఆర్థిక రంగాల మీద గుప్పెడు మంది పెత్తనాన్ని కూలదోయాలని తెలంగాణ ఉద్యమం అనుకున్నది. ఉద్యమ ఆకాంక్షలు సమష్టి అధికారాన్ని సమష్టి ప్రయోజనాలకు ఉపయోగించడానికి బదులుగా సీమాంధ్ర పాలకులు కార్పొరేట్ శక్తులకూ, కాంట్రాక్టర్లకూ, రియల్ ఎస్టేట్ డీలర్లకూ మేలు కలిగించే రీతిలో వ్యవహరించారు. అందువల్లనే ప్రజలు, ప్రధానంగా రైతులు, కార్మికులు, కుటీర పరిశ్రమలకు చెందినవారు, చిరువ్యాపారులు బాగా నష్టపోయారు. ఇజ్జత్‌తో బతకగలమన్న విశ్వాసం అడుగంటి పోవడంతో 1990 దశకం నుంచి రైతులు, చేతివృత్తుల వారు అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వనరులలో వాటా, అ«ధికారంలో భాగం దక్కుతుందని తెలంగాణ ప్రజానీకం ఆశించింది. అభివృద్ధి నమూనా మారిపోయి బతుకు తెరువు అవకాశాలు పెరుతాయని, అందివస్తాయని భావించింది. ఉద్యోగాలు దొరుకుతాయని యువతీయువకులు బలంగా విశ్వసించారు. అసలు సమష్టి జీవితాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించుకోవాలన్న ఆశయంతోనే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. కానీ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదు. ఆంధ్ర పాలకుల వలెనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజలనూ, వారి ఆకాంక్షలనూ పక్కన పెట్టింది. ఆంధ్ర కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టింది. చిల్లరపైసలు ఇక్కడి ప్రజల ముఖాన కొట్టి గొప్ప ఘనకార్యమేదో చేసినట్టు పేజీలకు పేజీలు పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజా ప్రయోజన పథకాల మీద వెచ్చించిన దానికంటే, ఆ ప్రకటనలకే ఎక్కువ ఖర్చయిందేమో కూడా! మిషన్ భగీరథ పేరుతో, ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు ఆంధ్ర పాలకుల జేబులలోనికే వెళ్లాయి. ఉద్యోగాల ఊసే లేదు నీళ్లు, నిధులు, నియామకాలు... ఈ నినాదాలే తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌లైన్. ఇందులో నియామకాల నినాదానికి ఆకర్షితులు కావడం వల్లనే యువతీ యువకులు ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ వారికి ఉద్యోగాలు దొరుకుతాయని ఉద్యమం కోసం ఆత్మార్పణం చేసుకున్నవారు రాసిపెట్టిన నోట్లలో పేర్కొన్నారు కూడా. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగింది వేరు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పటికి 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగ భర్తీ ప్రకటనలు వెలువడతాయన్న ఆశతో అభ్యర్థులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్ క్లాసులకు హాజరవుతున్నారు. కానీ పోస్టులు మాత్రం అందని ద్రాక్షలుగానే మిగిలిపోతున్నాయి. జరిగిన పరీక్షలైనా అస్తవ్యస్తంగా జరిగాయి. పోటీ పరీక్షలను సక్రమంగా నిర్వహించడానికీ, ఉపాధి అవకాశాలు పెంచడానికీ ఇచ్చిన అన్ని సూచనలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఉద్యోగాల భర్తీకి క్యాలండర్‌ను ప్రకటించాలని, ప్రైవేట్ సంస్థలలో భూమిపుత్రులకు రిజర్వేషన్లు పాటించాలని చేసిన కీలక విజ్ఞాపనలు ప్రభుత్వం చెవికెక్కలేదు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలన్న సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. సమాన పనికి సమాన వేతనం అన్న సూత్రం ప్రకారం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచే విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో కదలిక లేదు. సంక్షోభంలో వ్యవసాయం ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా రైతుల బలవన్మరణాలు ఆగలేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,900 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ మూడేళ్లలో పంటల ధరలు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు రాక సుమారు రూ. 500 కోట్లు తాము నష్టపోవడం జరిగిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. కరువు నష్టానికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ముట్టలేదు. కనీసం కేంద్రం ఇచ్చిన రూ. 800 కోట్ల పరిహారం కూడా చేరలేదు. రైతులు ఏం పంట వేసుకోవాలో చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారాలు ప్రభుత్వానికి తోచక పోవచ్చునని రైతు సంఘాలన్నీ కలసి వ్యవసాయ శాఖ కార్యదర్శికి వివరమైన, విలువైన సూచనలు ఇచ్చాయి. రైతు ఆదాయాన్ని పెంచటానికి సమగ్ర వ్యవసాయ విధానం రావాలన్నారు. రైతులను ఆదుకోవటానికి వ్యవసాయ కమిషన్ వేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం చేయాలన్నారు. బ్యాంకుల నుంచి రైతులకు కావలసిన అప్పులు ఇప్పించాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులను కఠినంగా శిక్షించాలని, పంటల ధరలు పడిపోయినప్పుడు మద్దతు ధర చెల్లించి ఆదుకోవటానికి నిధిని ఏర్పాటు చేయాలని, చిన్న రైతులకు కావలసిన వ్యవసాయ పరికరాలను సబ్సిడీకి ఇవ్వాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు. సంక్షేమ పథకాల అమలు–తీరుతెన్నులు ప్రజలకు అవసరమయ్యే ఏ పథకం కూడా అమలు కావడం లేదు. ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలు చెల్లించక పోయేసరికి చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఉద్యోగాలకు అర్హత కోల్పోయారు. సింగరేణిలో ఓపెన్ కాస్టు గనులను ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల పునరుద్ధరణ జరగనే లేదు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి. చిన్న, సూక్ష్మ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రయత్నమే లేదు. నిజాం షుగర్స్‌ను తెరిచి, నడిపిస్తామన్న హామీని మరిచి ఇవాళ పూర్తిగా మూసేశారు. నిర్వాసితుల కోసం 2013 భూసేకరణ చట్టం కల్పించిన మానవీయ పద్ధతులు రద్దయిపోయాయి. దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకోవడానికి, నిర్వాసితుల హక్కుల రద్దు కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి నల్లాలు ఉన్నాయి. కానీ వాటిని తవ్వి మళ్లీ కొత్త పైపులు పరుస్తున్నారు. అదికూడా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే. అందుకైన వేల కోట్ల నిధుల దుర్వినియోగాన్ని ఆపగలిగితే డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి కావలసినన్ని నిధులుండేవి. ఇప్పటివలెనే అమలైతే మూడెకరాల పథకం కింద భూమిలేని దళితులందరికీ భూమి పంచడానికి 230 సంవత్సరాలు పడుతుంది. సాగునీటి పథకాల ఖర్చు తగ్గించే లక్ష్యంతో డిజైన్ చేస్తే సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరతే ఉండదు. అది అట్లుండగా వార్తలకెక్కిన భూ కుంభకోణాలు అధికార దుర్వినియోగాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, రియల్ ఎస్టేట్ డీలర్లతో కుమ్మక్కై వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. అప్రజాస్వామిక వైఖరి అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు. ముఖ్యమంత్రి ఎవ్వరినీ కలువరు. గజేంద్రుడు వేడుకుంటే వైకుంఠపురిలోని విష్ణుమూర్తి దిగొచ్చాడు. కానీ ఎన్ని మొక్కినా మన ముఖ్యమంత్రి బయటకు రాడు. ప్రజలను కలువడు. తమ సమస్యలు నలుగురికీ వినిపించడానికి ఉన్న ఒక్క వేదిక ఇందిరా పార్కు వద్దనున్న ధర్ణాచౌకును కూడా మూసివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్త కూడా రాయవద్దని మీడియాపై జులుం చెలాయిస్తున్నారు. రాష్ట్రాన్ని తేవడానికి ప్రజలు చేసిన త్యాగాలకు, బలిదానాలకు ఇవాళ గుర్తింపు లేదు. విలాసాలు, హైదరాబాద్ చుట్టుప్రక్కల ఆస్తులు, కాంట్రాక్టుల పంపకాలు, ప్రచారాలు ఇదీ పాలకుల వ్యవహారం. దీన్ని ప్రజలకు తెలియజెప్పడానికే అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నాం. తెలంగాణ ఆకాంక్షలను పరిరక్షించడానికే మొదలుపెట్టినాం. ప్రజలు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎంతోమంది నియంతల పాలనను అంతం చేసిన మనకు ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించుకోవడం పెద్ద పని కాదు. - వ్యాసకర్త టీజేఏసీ ఛైర్మన్ యం. కోదండ రామ్ మొబైల్ : 98483 87001 -
హిందూ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం
కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకరవిజయేంద్ర సరస్వతి కోలంక (కాజులూరు) : హిందూ దేశ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శప్రాయమైనవని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు. గ్రామానికి చెందిన విశాఖపట్నం గాయత్రీ విద్యా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పులగుర్త వ్యాఘ్రేశ్వరశర్మ దంపతుల ఆహ్వానం మేరకు మంగళవారం ఆయన కోలంక వచ్చారు. స్వామీజీకి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ఆలయంలో స్వామీజీ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరూ హిందూ సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలన్నారు. అష్ట సోమేశ్వరాలయాల్లో ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున ఉన్న కోలంక పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఆలయాల పురోహితులు వింజరపు సత్యనారాయణాచార్యులు, ఖండవిల్లి శ్రీనివాసాచార్యులు, కొత్తలంక సుబ్రహ్మణ్యశర్మ, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వరదా శేషారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు డీవీ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి నింపిన క్రీడలు
భానుగుడి (కాకినాడ) : వారు చీకటిలో వెలుగును వెతుకుతూ పరుగెత్తారు.లక్ష్యాన్ని ఊహించుకుని బరువులు విసిరారు. విధి వంచించినా ప్రతి క్రీడలోనూ తమదైన ప్రతిభ చాటారు. మొత్తానికి అందరిలో స్ఫూర్తి నింపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో మంగళవారం నిర్వహించిన పలు పోటీల్లో వారు చూపిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. చూపరుల హృదయాలను కదిలించింది.ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ ఈ పోటీలు నిర్వహించింది. విద్యార్థులకు రన్నింగ్, లాంగ్ జంప్, చందరంగం, క్యారమ్స్, షాట్‌ఫుట్, సైకిల్ రేస్ వంటి పలుక్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 850 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్రీడా పోటీలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. విజేతలకు డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో బహుమతీ ప్రధానం చేస్తామని వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. -
కేరళ పంచాయతీ వ్యవస్థ దేశానికే ఆదర్శం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: కేరళలోని పంచాయతీ పాలనా విధానం దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం కేరళ ఎర్నాకులం జిల్లా పరక్కడావు బ్లాక్ పంచాయతీ, శ్రీమూలనగరం గ్రామ పంచాయతీలను మంత్రి బృందం సందర్శించింది. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థలో అమలుచేస్తున్న పథకాల తీరుపై అక్కడి అధికారులను జూపల్లి అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి జిల్లాగా గుర్తింపు పొందిన ఎర్నాకులంలో విద్యా వ్యవస్థ తీరును కూడా మంత్రి పరిశీలించారు. తెలంగాణాలో పర్యటనకు రావాలని అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. అనంతరం కేరళ మాజీ సీఎం ఊమెన్చాందీతో జూపల్లి కొద్దిసేపు భేటీ అయ్యారు. శనివారం రాత్రి జూపల్లి, కమిషనర్ నీతూకుమారిప్రసాద్, ఇతర అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. -
షష్టి స్ఫూర్తి
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ భగవద్ రామానుజస్వామి... వారిది మిలీనియమ్ మార్చ్! దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు! అతి శక్తిమంతమైన ‘నారాయణ మంత్రం’ దాచుకోకుండా పంచిపెట్టారు! పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్! తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం పోరాడారు... నిరతాగ్నిహోత్రంతో... దేశమంతటా... 108 ‘శ్రీరామక్రతువు’లు చేశారు. భక్తులతో ‘రామ’కోటి రాయించి, సమతా ‘స్తూపాల’ను ప్రతిష్ఠించారు. మహానుభావులు... ‘ధర్మం’ కోసం కృషి చేశారు. చిన్న జీయర్ స్వామి... వీరిది ప్రోగ్రెసివ్ మార్చ్! వేదానికి అధ్యయన జ్యోతి... అంధులకు అక్షర కాంతి... గిరిజనులకు విద్యాక్రాంతి. భగవద్ రామానుజ, పెద్ద జీయర్ స్వాముల పరంపరకు ‘జెండాపై కపిరాజు’. మనకు తెలిసిన స్వామి... మనలో ఒకడైన స్వామి... కళ్ళతో పలకరిస్తారు... చిరునవ్వుతో సాంత్వన కలిగిస్తారు. ఊరి పెరటిలో... తులసి మొక్క... సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి! వీరికి 60 ఏళ్ళు... వీరి పరంపరకు వెయ్యేళ్ళు... వీరి స్ఫూర్తి... పదికాలాలు విరాజిల్లు!! - రామ్, ఎడిటర్, ఫీచర్స్ నమస్కారం స్వామీజీ! మీకు 60 వత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తిరునక్షత్ర మహోత్సవం చేస్తామని భక్తులు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏమనిపించింది? (సాలోచనగా ఆగి... దేహం వంక చూపిస్తూ) 60 ఏళ్ళనేది ఈ శరీరానికి గడిచాయని అంటున్నారు. నిజానికి, సన్న్యాసికి శారీరకమైన జన్మ, వయస్సు ఉండవు. సన్న్యాసం స్వీకరించినప్పటి నుంచి మరుజన్మ కిందే లెక్క. అయితే, భక్తులు ప్రేమగా చేసుకుంటామని అన్నప్పుడు కాదనడానికి మనమెవరం! అయితే ఏదైనా ఘనకార్యం సాధిస్తే, అప్పుడు ఆ ఘనకార్యానికి ఉత్సవం చేసుకోవచ్చు. అలాంటివి ఏం చేశామని! గడచిన 36 ఏళ్ళ పైచిలుకు సన్న్యాసాశ్రమ ప్రస్థానంలో అంధులకు విద్యాలయాలు, వేద పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజన విద్యాలయాల లాంటివెన్నో ఏర్పాటు చేశారు కదా! (చిరు దరహాసంతో...) అవును. కానీ, సమాజానికి చేయాల్సినది ఇంకా ఎంతో ఉంది! విదేశాలకు వెళ్ళి, వేదధర్మాన్ని ప్రచారం చేసిన తొలి జీయర్ కూడా మీరే! విదేశాలకు వెళ్ళడమే తప్పు అనుకొనే సంప్రదాయంలో అంతటి సాహసం ఎలా చేశారు? విదేశాల్లో భారతీయ ధర్మ ప్రచారానికి వెళ్ళడం వెనుక ఒక దైవికమైన ఘటన ఉంది. 1992లో, 1993లో కూడా ధర్మప్రచారానికి నన్ను విదేశాలకు రమ్మని అడిగారు. కానీ, మేము రామని చెప్పాము. 1993లో ఒక సన్నివేశం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏడాది దీపావళి వేడుక తరువాత అర్ధరాత్రి విజయవాడ దగ్గర సీతానగరంలోని మా ఆశ్రమం నుంచి మేము ఆరాధించే కోదండ రామస్వామి విగ్రహాలు చోరీ అయ్యాయి. మూడు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రాహారాలు లేవు. ఆ రాత్రి అక్కడ బీట్‌లో ఉన్న కోటేశ్వరరావు అనే ఎస్.ఐ. ఇదంతా చూసి, ‘దేవుడి విగ్రహాలు దొరికే వరకు కట్టుకున్న దుస్తులు కూడా మార్చను’ అని దీక్ష పట్టారు. నాలుగో రోజున దొంగల్ని పట్టుకున్నారు. విగ్రహాలు సాధించారు. మాకు ఆ సమాచారమిచ్చారు. అయిదో రోజున విగ్రహాలు రావడంతో, వెయ్యి కలశాలతో మా స్వామికి అభిషేకం చేసి, ఆరాధించాం. అప్పటి నుంచి ప్రతి ఏటా దానికి గుర్తుగా మా ఆరాధ్యదైవమైన కోదండరామ స్వామికి ‘సహస్ర కలశాభిషేకం’ చేస్తున్నాం. ఇవాళ్టికీ కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా, ఆ రోజున ఆ కార్యక్రమానికి వస్తారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారి. ఆయన వచ్చాక, ఆయన చేతులకు తాకించి కానీ, ఆ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టం. ఈ విగ్రహాల చోరీ వ్యవహారం జరిగాక, సాక్షాత్తూ స్వామే ఎలాగూ బయటకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, మనమే స్వయంగా తీసుకొని ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది. అది స్వామి ఆదేశంగా భావించి, అప్పటి నుంచి ధర్మప్రచారం కోసం విదేశాలకు వెళ్ళి వస్తున్నాం. సంపన్న అమెరికా నుంచి, వర్ధమాన భారతం దాకా ప్రపంచమంతా తిరిగారు కదా! అన్నిచోట్లా సమస్యలే! అన్నిచోట్లా అశాంతే! కారణం ఏమిటంటారు? ఇవాళ శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు... ఒకటి- ఉగ్రవాదం, రెండు - ఆర్థిక అసమానతలు. రెండూ అశాంతికి దారి తీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తొలగించాలంటే, వ్యక్తుల్లో విద్యను పెంచాలి. దిగువ వర్గాల వారు కూడా ఉన్నత వర్గాల వారితో పోటీపడేలా, వారిలో నైపుణ్యం పెంచాలి. అవకాశాలు కల్పించాలి. ఇక, ఉగ్రవాదాన్ని తగ్గించడానికి శాసనాలు, ప్రేమతత్త్వం రెండే మార్గాలు. చాలాదేశాల్లో కఠిన శాసనాలున్నాయి. కానీ, మన దేశంలో ఉన్న శాసనాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దాలి. మరోపక్క వ్యక్తిలో తోటివారి పట్ల ప్రేమను పెంచాలి. మనమంతా సహోదరులమనే భావన కలిగించాలి. అలాంటి భావన ఇవ్వగలిగింది మన వైదిక వాఙ్మయం. ఇతర మతాల్లో, వారి గ్రంథాల్లో కూడా ఆ భావన ఉంది. కానీ వాటిని బోధించడంలో, ఆచరించడంలో వస్తున్న తప్పులు, తేడాల వల్ల కొన్నిసార్లు ఉపద్రవం సంభవిస్తోంది. కానీ, హిందూ ధర్మంలోనూ రకరకాల శాఖలు, రూపాలు ఉన్నాయిగా!? మన ‘భగవద్గీత’ మొదలైన గ్రంథాలేవీ, ‘దైవాన్ని ఇలానే నమ్మాలి, ఇలానే పూజించాలి’ అని కట్టడి చేయడం లేదు. పరస్పర విద్వేషం చెప్పడం లేదు. భగవద్గీతలోనే పరమాత్మ ‘యాన్తి దేవవ్రతో దేవాన్...’ అని చెప్పాడు. ‘నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలో కనిపిస్తాను’ అన్నాడు. కాబట్టి ఎన్ని రూపాలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నా దేవుడు ఒక్కడే! ఎవడు ఏ విధానంలో ఆరాధన చేసినా, ఫలితం పొంది తీరతాడు. మతమార్పిడి తప్పు. అందుకే, మేము ‘స్వీయ ఆరాధన... సర్వ ఆదరణ’ అని మేము చెబుతాం. వివరంగా చెప్పాలంటే, ‘నీ మతాన్ని నువ్వు ఆరాధించు. నీది కానిదేదో దాన్ని గౌరవించు, ఆదరించు!’ మన భారతదేశానికి ఇదే జీవనాడి. మన రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛనిచ్చింది కదా! మతస్వేచ్ఛ నిచ్చింది. పరస్పరం గౌరవాదరాలతో బతకాలనే చెప్పింది. కానీ, అమలుపరచడం దగ్గరకొచ్చే సరికే సమస్యలు. కొన్ని వేల ఏళ్ళుగా మన పక్కనే ఏ ఆలయం ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి ఉన్నా, గౌరవించి, ఆదరించిన సంస్కృతి మనది. కానీ, ఇప్పుడు కొందరు తమ మతగ్రంథాల సారాన్ని తప్పుగా బోధించడం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించం కానీ, ఈ పౌరసత్వం, ఇక్కడి హక్కులు అన్నీ కావాలంటే ఎలా? మనం ముందు భారతీయులం... ఆ తరువాతే ఏమైనా! ప్రపంచంలోని ఈ సమకాలీన విషయాలు మీకెలా తెలుస్తుంటాయి? ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అవి చూసే భక్తులున్నారు. చెబుతుంటారు. మీరు కూడా టెక్నాలజీనీ, ల్యాప్‌టాప్ లాంటివి బాగా వాడతారట? (నవ్వుతూ... తల పంకించారు...) సైన్సు, మతం పరస్పర భిన్నమైనవనే వాదన గురించి ఏమంటారు? నిరూపణ జరిగిన సిద్ధాంతాలన్నీ సైన్స్ అయితే, నిరూపణ కానివి ఫిలాసఫీ అని అని కదా ప్రసిద్ధి (నవ్వులు...). అయితే, సైన్స్‌కు అందని నిజాలు చాలానే ఉన్నాయి. సైన్స్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటివి మీరు ఒప్పుకోరని విన్నాం! పరిణామం అనేది అనివార్యం. కానీ, (నవ్వుతూ...) వాళ్ళు చెప్పే పద్ధతిలో పరిణామ సిద్ధాంతాన్ని మేము అంగీకరించం. చూడండి. మనం గింజ వేస్తే దాని నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లతో చెట్టు వస్తోంది. అది పరిణామం. కానీ, ఆ గింజలో లేని ఆకు, వేరు, పువ్వు, పండు రావడం లేదు కదా! ఆ గింజలోనే అవన్నీ సూక్ష్మరూపంలో ఉన్నాయి. పరిణామంలో అవి పైకి కనిపించాయి. అంతే! సూక్ష్మరూపంలో లేనిది స్థూలరూపంలోకి రాదు. మీరు ఒకప్పుడు దైవాన్ని కూడా ఒప్పుకొనేవారు కాదట! మరి, అటు నుంచి ఇటు వైపు ప్రయాణం... (నవ్వేస్తూ...) చిన్నప్పుడు అవకాశమున్న పుస్తకమల్లా చదివేవాళ్ళం. ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ లాంటి వాటిల్లో వచ్చే సీరియల్స్ కాగితాలు చించి, కుట్టుకొని, బైండ్ చేయించుకొని సేకరించిపెట్టేవాళ్ళం. అలా చాలా కథలు చదివాం. ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ లాంటి అనువాద సాహిత్యం చాలా చదివాం. అలా చదివిన సాహిత్యంతో లోలోపల అనేక ప్రశ్నలు వస్తుండేవి. వాటికి సమాధానాల కోసం అన్వేషిస్తుండేవాళ్ళం. అవన్నీ మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు వచ్చాక, తీరాయి. తెనాలి దగ్గర నడిగడ్డపాలెంలో గురువులు గోపాలాచార్యుల వద్ద మాకు వేదాంత గ్రంథాల బోధన జరిగింది. గోపాలాచార్యులు, మా పెద్ద స్వామి వారు సహాధ్యాయులు. కలసి వేదాంత ప్రచారం చేశారు. స్వామి వారు ఊరూరా తిరుగుతూ క్రతువులు చేస్తుంటే, గోపాలాచార్యుల వారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో ఉంటూ, అందరికీ వేదాంత శిక్షణనిచ్చేవారు. మేమూ అక్కడ కొన్నాళ్ళు ఉండి, అవి అధ్యయనం చేశాం. అలా పూర్తిగా ఇటువైపు వచ్చాం. స్వామీజీ! ఒకప్పుడు మీలో మార్క్సిస్టు భావాలుండేవనీ, ఆ పుస్తకాలు చదివేవారనీ... (మళ్ళీ నవ్వేస్తూ...) అవన్నీ ఒకప్పటి సంగతులు. ఇప్పటికీ సమాజసేవ, దిగువ వర్గాల అభ్యున్నతి లాంటి విషయాల్లో మీది వామపక్ష భావజాలమేనేమో... (నవ్వులు...) సమాజం మన శరీరం లాంటిది. ఇందులో ఏ అంగం ఎక్కువ, ఏది తక్కువ అంటే ఏం చెబుతాం! సమాజంలో అన్ని వర్గాలూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒకరు, మరొకరిని అణచివేస్తానంటే ఎలా? అదే సమయంలో అందరూ పనిచేయాలి. చేసేవాడు చేస్తూ ఉంటే, తిని కూర్చొనేవాడు కూర్చుంటానంటే కుదరదు. పనిచేయడానికి బద్ధకించేవాణ్ణి పనిచేసేవాడిగా మార్చాలి. అందుకని ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంపొందింపజేయాలి. ఉన్నత వర్గాలతో పోటీ పడేలా దిగువ వర్గాలకీ అవకాశం కల్పించాలి. వారిని తీర్చిదిద్దాలి. దీన్ని కేవలం వామపక్షం, వామభావజాలం అంటే ఎలా? నిజానికి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం అంటాను. అయితే, అదే సమయంలో - నైపుణ్యం లేకపోయినా 20 మార్కులతో పాస్ అయిన వ్యక్తిని విమానానికి పైలట్‌గానో, అల్లోపతి డాక్టర్‌గానో పెడితే... వాట్ హ్యాపెన్స్ టు ది క్వాలిటీ ఆఫ్ దిస్ కంట్రీ? మొత్తం సమాజమే నష్టపోతుంది. అసమర్థుడైన వ్యక్తిని ఆపరేషన్‌కి డాక్టర్‌గా పంపిస్తే ఏమవుతుందో ఊహించుకోండి! అన్నట్లు... మీరు కూడా మంచి వైద్యులట! మంచి మందులిస్తారట! (నవ్వేస్తూ...) హోమియో వైద్యం నేర్చుకుంటున్నా. మందులు ఇస్తుంటా. మీ తాత గారు, తండ్రి గారిలా వైద్యవిద్య వంశపారంపర్యంగా వచ్చినట్లుందే! పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. ఇక మాకు జన్మనిచ్చిన తండ్రి గారు ఆ రోజుల్లోనే చెన్నైలో చదువుకొన్న ఎల్.ఐ.ఎం (లెసైన్స్డ్ ఇండియన్ మెడిసిన్) డాక్టర్. ఇద్దరూ వైద్యంలో దిట్టలే! కానీ, ఇవాళ మనం డాలర్ల జబ్బును రూపాయలిచ్చి కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఖరీదై, అల్లోపతి వైద్యం సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో అది మాత్రమే పద్ధతి కాదు, ఇంకో పద్ధతి ఉందంటూ వచ్చిన హోమియోపతి మంచి ప్రత్యామ్నాయం. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశ పరిస్థితికి శ్రమ, ఖర్చు తక్కువైన ఈ వైద్యవిధానం బాగా సరిపోతుంది. రోగి లక్షణాలు సరిగ్గా తెలుసుకొని ఔషధమిచ్చే మంచి వైద్యుడుంటే మందు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నవారు లేకపోలేదు. అందుకనే, అందరికీ ఈ వైద్యం అందుబాటులోకి రావాలని ‘ఇంటిగ్రేటివ్ సిస్టమ్’లో మా శంషాబాద్ ఆశ్రమంలో ‘జిమ్స్’ హోమియో కాలేజ్, ఆసుపత్రి నడుపుతున్నాం. అంటే, ఇటు ప్రజల శారీరక ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికతతో మానసిక ఆరోగ్యం రెండూ మీరు చూస్తున్నారన్న మాట! (నవ్వుతూ...) అంతే అనుకోవచ్చు! కానీ, సన్న్యాసంలో ఉంటూ సామాజిక సంస్కరణ, సముద్ధరణ చేయడమెలా వచ్చింది? వెయ్యేళ్ళ క్రితం రామానుజాచార్యులూ ఇదే చేశారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక నాయకులే కాదు. ఆ రోజుల్లోనే అందరి మోక్షం కోసం గోపురమెక్కి, ‘తిరుమంత్రం’ ఎలుగెత్తి చాటిన సామాజిక సంస్కర్త. ఆయన స్ఫూర్తితో వచ్చిన మా పెద్ద స్వామి వారైతే స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం పోరాడారు. ఆ రోజుల్లోనే ప్రజల బాగు కోసం గ్రామాలు పట్టుకు తిరిగారు. సొంత భూములు హరిజనులకిచ్చి, వారి ఉద్ధరణకు కృషి చేశారు. స్త్రీలు ఘోషాలో ఉండే ఆ రోజుల్లోనే భార్యకు రాట్నం మీద నూలు వడకడం నేర్పించి, ఆ నూలు దుస్తులు భుజాన వేసుకొని, ఊరూరా పంపిణీ చేసేవారు. దుర్భిక్ష సమయంలో పొలాల్లో తిరిగి, ఎకరానికి ఒక కట్ట చొప్పున గ్రాసం తీసుకొని, పశువులకు మేత పెట్టేవారు. సన్న్యాసాశ్రమం స్వీకరించాక కూడా ఆయన సామాజిక ఉద్ధరణ మార్గంలోనే వెళ్ళారు. మాది కూడా ఆ బాటే! ఇన్నేళ్ళ ఈ బాటలో... ఈ షష్ట్యబ్ది పూర్తివేళ మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులంటే..? (ఆసనంలో ఒక్కసారి వెనక్కి వాలి... దీర్ఘంగా శ్వాస విడుస్తూ...) చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు, మా పెద్ద స్వామి వారు, మేము ఈ స్థితికి చేరడానికి కారణమైన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు, తీర్చిదిద్దిన వ్యక్తులు, కలసి ప్రయాణించిన, ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజమహేంద్రిలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ‘నారాయణా! నువ్వు తెలివిగలవాడివి. నీకు పాతికకి పాతిక మార్కులు వేస్తే, కొమ్ములొస్తాయిరా’ అంటూ, అంతా సరిగ్గా రాసినా లెక్కల్లో కూడా ఇరవై అయిదుకి ఇరవై నాలుగున్నర మార్కులే వేసిన మా మాస్టారిని స్మరించుకోవాలి. ‘ప్రపంచం గురించి చెప్పి, ఇలా ఉండాలి సుమా’ అని చెప్పిన మార్క్సిస్టు మిత్రులున్నారు. చిన్నప్పటి నుంచి మాలో ఒక క్రమశిక్షణ నేర్పిన రామచంద్ర అనే ఆర్.ఎస్.ఎస్. కుర్రాడు ఉన్నాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జీవితమంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన అనుభవాలున్నాయి. ఇలా ఎందరో, ఎన్నెన్నో! ఆ పూర్వాశ్రమ జీవితంలో ఎదురైన అనుభవాల వివరాలు ఏమైనా...! అప్పట్లో మేము సికింద్రాబాద్‌లో క్యారవాన్ దగ్గర ఉండేవాళ్ళం. కోఠీ వైపు వెళ్ళాలి. పురానాపూల్, అఫ్జల్‌గంజ్, ఘోషామహల్ పక్క నుంచి వెళుతుండేవాళ్ళం. పైసా.. పైసాకి కష్టపడుతూ, కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తే! ఒకసారి కష్టపడి ఒక సైకిల్ కొనుక్కున్నాం. కానీ, కొన్న మూడో రోజునే దాన్ని ఎవరో పట్టుకుపోయారు. అదంతా జీవితంలో ఒక దశ. సామాన్య ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూశాం, అనుభవించాం. మరి, ఆధ్యాత్మిక విద్యకు ముందు అప్పట్లో మీరు చదివిన లౌకికమైన చదువులు... ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ చదివాం. ఆ తర్వాత పై చదువుల కోసం ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చేది. పరీక్షలకు హాజరు కాలేకపోయాం. టైప్, షార్ట్‌హ్యాండ్‌ల్లో హయ్యర్ పాసయ్యాం. మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు చేరినప్పుడు ‘ఆలయాల జీర్ణోద్ధరణ కమిటీ’ తరఫున మేము అన్ని రకాల క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళం. లెక్కలు, స్టేట్మెంట్స్ తయారుచేసేవాళ్ళం. స్వామి వారి దగ్గరకు వచ్చాక అంతకు ముందు మాకున్న అనేక సందేహాలు తీరాయి. మళ్ళీ మా మనసు మారకుండా ఉండడం కోసం మా సర్టిఫికెట్లన్నీ మేమే చింపేశాం. మీరు అమెరికన్ యాసలో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. రష్యన్ కూడా నేర్చుకున్నారట! (నవ్వుతూ...) పూర్వాశ్రమంలో హైదరాబాద్‌లోనే ‘సీఫెల్’ (ఇప్పటి ‘ఇఫ్లూ’)లో సరదా కోసం చదివాం. కానీ, ఆశ్రమజీవితంలోకి వచ్చినప్పుడు ఆ కఠోర దీక్ష, క్లిష్టమైన వేదాంత విద్య ఎలా అలవడ్డాయి? ఒక రకంగా నన్ను మా పెద్ద స్వామి వారి పాదాల దగ్గరకు చేర్చింది మా తల్లి గారే! ‘నీకు ఏది మంచిదో వారు నిర్ణయిస్తారు’ అన్న ఆమె మాట! భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి అనుకున్నది ఎలాగైనా పూర్తి చెయ్యాలనే మనస్తత్త్వం, పట్టుదల అలవడ్డాయి. అప్పట్లో ఒకసారి పెద్ద స్వామి వారి క్రతువు కోసం కొన్ని మూర్తులు అవసరమయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి, అందించి వచ్చే పని నాకు అప్పగించారు. తీరా నేను బయల్దేరితే రైలు మిస్సయింది. బస్సు మిస్సయింది. కానీ, ఆయనకు అవి ఇచ్చే రావాలి తప్ప, ఇంటికి వెనక్కి రాకూడదనే పట్టుదల నాది. అప్పటికి ఈ తరం పిల్లల్లాంటి లోకజ్ఞానం కూడా లేని పల్లెటూరి బైతులం మేము. అయినా సరే, సామర్లకోట దాకా బండిలో, తరువాత మరో వాహనంలో, ఆ పైన నడక... ఇలా ఎట్టకేలకు తెల్లవారు జామున పెద్ద స్వామి వద్దకు చేరాం. అనుకున్న ముహూర్తానికి అన్నీ సక్రమంగా అందించగలిగాం. ఆ తరువాత ఈ ఆశ్రమజీవితంలోకి వస్తున్నప్పుడు కూడా వేద, వేదాంత విద్యల అధ్యయనంలోనూ అదే పట్టుదల. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో చుండూరు ఘటన, తిరుమలలో వెయ్యికాళ్ళ మండపం లాంటి కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలపై వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు ఏమనిపించేది? అప్పట్లో చుండూరు ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి చెప్పడానికే మాట్లాడాను. ఇతరులు చాలామంది, చివరకు మీడియా కూడా వెనుకంజ వేస్తుంటే, చుండూరులో జరిగింది కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాదు... అది మతసంబంధమైన ఘర్షణ కూడా అని వాస్తవం చెప్పాం. అప్పట్లో ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ విలేఖరి వచ్చి, నాతో అన్నీ మాట్లాడారు. కానీ, పత్రికలో మాత్రం వాస్తవాన్ని కాస్తంత దాచిపెడుతూనే రాశారు. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ధైర్యం చేయలేదు. కానీ, మేము మాత్రం సత్యమే చెప్పాను. చివరకు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం విషయంలో కూడా! మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. క్రమాన్నీ, ధర్మాన్నీ తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, మనం మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మిగతావాళ్ళకు సాహసం లేదు. మేము విమర్శల్ని పట్టించుకోకుండా, వాస్తవం మాట్లాడాల్సిన కర్తవ్యం నిర్వర్తించాం. అంతే! సమాజోద్ధరణ ధ్యేయమైన మీ లాంటి కొందరిని మినహాయిస్తే, ఇవాళ అసలు ‘గాడ్’ కన్నా‘గాడ్మన్’ల హవా ఎక్కువైందని ఒక విమర్శ! నిజమే. దానికి కారణం - దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన ప్రక్రియ లేకుండా కొందరు ఒక స్థానంలో కూర్చోవడమే! అధ్యయనం లేకుండానే ఒక పీఠంపై కూర్చొన్నప్పుడు, వేలమంది వచ్చి మొక్కుతూ ఉంటే, తెలియని ఉద్ధతి, గర్వం వస్తాయి. మనకు తెలియకుండానే రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు - ఇలా కొమ్ములు మొలుస్తాయి. అందుకే, ఎప్పుడూ అవి లేకుండా, రాకుండా అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట! ఒకసారి ఆ గర్వం వస్తే అందరూ మన మాటే వినాలనుకుంటాం. కాదని ఎవరైనా అంటే, వారి మీద కసి, కోపం పెరుగుతాయి. దాంతో, ఏదో అంటాం. ఇవన్నీ అధ్యయనం, వినయం లేకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు. రోజూ తెల్లవారు జాము నుంచి రాత్రి దాకా మానవ సేవ, మాధవ సేవ, భక్తజనం మధ్య ఉండడంతో, మాకైనా అధ్యయనానికి తీరిక దొరకదు. కానీ, అధ్యయనం చేయాలి. మానకూడదు. వేదకాలం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఇవాళ్టి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? స్త్రీలను గౌరవించడం మనందరి విధి. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే సమాజానికి క్షేమం. అందుకే, ‘ఉమెన్స్ హెల్త్ కేర్’ అనే ప్రాజెక్ట్ పెట్టాం. ఇవాళ స్త్రీలలో ఎక్కువ మందిని బాధిస్తున్నవి - సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. వీటి పట్ల స్త్రీ మూర్తుల్లో చైతన్యం కలిగిస్తూ, వాళ్ళకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాం. ఇప్పటి దాకా తెలుగు నేలపై 5 లక్షల 25 వేల మందికి ఉచితంగా ఈ స్క్రీనింగ్ చేశాం. ఇక, స్త్రీల ప్రవర్తన విషయానికి వస్తే ఆధునిక తరంలో ధర్మం పట్ల లక్ష్యం తక్కువవుతోంది. తమిళనాడు, ఉత్తరాది లాంటి చోట్ల స్త్రీలలో ధర్మం పట్ల జాగృతి కాస్త ఉన్నా, మన తెలుగు నేలపై ధర్మం పట్ల సుముఖత తగ్గుతున్నట్లుంది. వేదాలు, ఆగమాలు చదివిన పురోహితుల్ని పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు, పిల్లనిచ్చేవారు సిద్ధంగా లేరంటే ఏమనాలి? అందరూ సాఫ్ట్వేర్ వరుల వెంటపడుతున్నారు. నిజానికి, స్త్రీలు ఇవాళ విద్యలో, సహనంలో, కృషిలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి, ఇక వారిలో మనది ఈ జాతి, మనది ఈ ధర్మం, మనది ఈ సంప్రదాయం అనే భావన కలిగించాల్సి ఉంది. అందు కోసం కృషి చేస్తున్నాం. మరోపక్క, స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూసే పురుషులూ ఇవాళ ఎక్కువయ్యారేమో? నిజమే. అది కూడా మన విద్యావిధానంలోని లోపమే. వ్యక్తిని వ్యక్తిగా చూడాల్సిన విజ్ఞత నేర్పాల్సింది విద్యే కదా! కానీ, పిల్లలకు మంచి చెడు చెప్పే తీరిక, మన సంస్కృతి, సంప్రదాయం నేర్పే ఓపిక తల్లితండ్రులకు లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయే సరికి, పిల్లలకు అవన్నీ నేర్పే తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో లేరు. ఎంతసేపూ చదువులు, మార్కుల మీదే శ్రద్ధ. విద్య సంస్కారాన్ని కలిగించాల్సింది పోయి, సంస్కారాన్ని తొలగిస్తోంది! ఇప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఒక తరం నష్టపోయింది. దాని ప్రభావమే స్త్రీల పట్ల చులకన భావం. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పిల్లల్లో మన ధర్మం మీద శ్రద్ధ, రుచి కలిగించాలి. వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. మరి, అందుకు ఏం చేయాలంటారు? పెద్దలకూ, పిల్లలకూ మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియాలి. మన దేశ ఘనచరిత్రకు ప్రతిరూపాలైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలెన్నో ఉన్నాయి. కానీ, జీర్ణోద్ధరణ అనో, సుందరీకరణ అనో పేరు పెట్టి, వాటి రూపాన్ని మార్చకూడదు. శంకరాచార్యులు, రామానుజాచార్యుల కాలం నాటి నిర్మాణాలున్నాయి. వేదవ్యాసుడు తిరుగాడిన బదరికాశ్రమం లాంటివి ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, కొన్ని వేల ఏళ్ళ నాటి మన జాతి చరిత్ర తెలిసి, మనకు పెద్ద అండ వచ్చినట్లవుతుంది. మన దేశాన్నీ, శ్రీలంకనూ కలుపుతూ సముద్రంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన ‘నల సేతు’ ఇప్పటికీ ఉందని ‘నాసా’ వారి ఉపగ్రహ ఫోటోలు చూపిస్తున్నాయి. ఇవాళ్టికీ దర్భశయనం దగ్గరకు వెళితే 6 అడుగుల లోపల నీటిలో ఆ సేతువు రూపం కనిపిస్తుంది. మేము చూశాం. రామాయణ కాలం నాటి ఆ వారధిని కాపాడుకొంటే, మనం అక్కడకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి మానసికంగా వెళతాం. మనలో హనుమంతుడి అంత శక్తి వస్తుంది. ఇంత చరిత్ర, వారసత్వం ప్రపంచంలో మన భారత జాతికి తప్ప మరొకరికి లేదు. జనంలో ఈ చైతన్యం తేవాలి. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేళ మీరు చేపట్టిన ‘సమతామూర్తి స్ఫూర్తికేంద్రం’ అలాంటిదేనా? అవును. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసిన భగవద్ రామానుజాచార్యులు 1017లో జన్మించి, 120 ఏళ్ళు కృషి చేశారు. ఆయన కేవలం మతాచార్యులే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఆయన సహస్రాబ్ది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ‘జీయర్ ఇన్టిగ్రేటెడ్ వేదిక్ అకాడెమీ’ (జీవా)కు అనుబంధంగా 45 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తై రామానుజాచార్యుల వారి పంచలోహ మూర్తి నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే 2017లో ఈ పాటి కల్లా దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం. ఇంకా, 108 దివ్యదేశాలు, వైదిక ధర్మ ప్రదర్శనశాలల నిర్మాణం కూడా చేస్తాం. విజయవాడ, సీతానగరం దగ్గర కొండ మీద 108 అడుగుల మరో భారీ విగ్రహం పెట్టాలని కూడా యోచన. అంతా భగవత్ సంకల్పం! ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు తృప్తినిచ్చిన విషయం? ఇవాళ్టికీ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళకు ఏదైనా చెబితే చక్కగా వింటారు. అర్థం చేసుకుంటారు. ఆచరిస్తారు. అలా గ్రామ గ్రామానికీ వెళ్ళి, మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ, సమాజ ఉద్ధరణకు పాల్పడడం బాగుంటుంది. మరి, మీరింకా చేయాలని అనుకుంటున్నవి? మనం చేయగలిగినవి, చేయాల్సినవి, జరగాల్సినవి (చేతులు చాచి చూపిస్తూ...) బోలెడన్ని ఉన్నాయి! ఇప్పటి దాకా చేసింది కేవలం సముద్రంలో నీటిబొట్టే! చివరిగా, ఈ దీపావళి పండుగ వేళ ప్రజలకు మీరిచ్చే సందేశం? ఇవాళ చుట్టుపక్కల నుంచి దేశానికి అభద్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సరైన చర్యలు చేపట్టే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రకంగా ప్రజలకు అదృష్టకాలం వచ్చింది. ప్రజలంతా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి మన సైనిక సంక్షేమ నిధికి ఇచ్చినా, అది కొన్ని వందల కోట్ల నిధిగా మారి, దేశ భద్రతకు పనికొస్తుంది. దేశానికి నిప్పు పెట్టే స్థితి కొంతైనా అడ్డుకుంటాం. ఈ ఉద్యమంలో కుల, మత, జాతి విచక్షణ లేకుండా భారతీయులందరూ పాల్గొనాలి. ఒక భారతీయ హిందువుగా, ఒక భారతీయ ముసల్మానుగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరం మన భారతదేశ భద్రతకు తోడ్పడాలి. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరివి ఏమైనా, భారతదేశమనే ఈ గృహరక్షణ మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. దానికోసం సమాయత్తం కావాల్సిన సమయం ఇదే. అది చేయడమే నిజంగా మనకు దీపావళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
‘అమ్మ’సేవలు ఆదర్శవంతం
సామాజిక సేవా కార్యక్రమాల్లో ’అమ్మ ఫౌండేష¯ŒS’ పలు రంగాల్లో ఉచిత శిక్షణ సామాజిక సేవా కార్యక్రమాలతో ‘అమ్మ’ ఫౌండేష¯ŒS పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, గృహిణులకు కుట్టు శిక్షణ, కారు డ్రైవింగ్ వంటి రంగాలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో అమ్మ ఫౌండేష¯ŒS రెండేళ్లుగా ముందుకు సాగుతోంది. నగరం ప్రధాన కేంద్రంగా మన జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఈ ఫౌండేష¯ŒS ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని మాకనపాలెం గ్రామానికి చెందిన మట్టపర్తి నవీ¯ŒS 2014లో నగరం కేంద్రంగా అమ్మ ఫౌండేష¯ŒS ఏర్పాటు చేశారు. నగరంతో పాటు అప్పనపల్లి, అయినవిల్లి మండలం నేదునూరు, పెదపాలెం, అంబాజీపేట మండలం వక్కలంక కొత్తపేట మండలం వాడపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, సీతారామపురంలో ఫౌండేష¯ŒS కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంప్యూటర్, కుట్టు శిక్షణ ఇస్తున్నారు. – మామిడికుదురు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు... పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిర్వహణలో అమ్మ ఫౌండేష¯ŒS విశేషంగా సేవలందిస్తోంది. అనాథ పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు అందించడంతో పాటు కళాశాల విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్‌లు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. స్వచ్ఛభారత్, గోదావరి, కృష్ణా పుష్కరాల్లో ఈ ఫౌండేష¯ŒS సభ్యులు విశేషంగా సేవలందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. సేవలకు నెలకు రూ.రెండు లక్షలు పేద కుటుంబానికి చెందిన మట్టపర్తి నవీ¯ŒS 9వ తరగతి వరకు చదువుకున్నారు. ఎన్నో కష్టాలు పడిన ఆయన పేదలకు తనవంతుగా సేవలందించాలని అమ్మ ఫౌండేష¯ŒSను ఏర్పాటు చేశారు. తనకు ఉన్న వాహనాల ద్వారా నెలకు రూ.4.50 లక్షల ఆదాయం వస్తోందని దానిలో రూ.రెండు లక్షలు సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నానని నవీ¯ŒS చెప్పారు. వృద్ధాశ్రమం ఏర్పాటే లక్ష్యం వృద్ధుల కోసం భవనం నిర్మించి అందులో 50 మందికి ఆశ్రయం కల్పించాలన్నది నా అశయం. కుటుంబ సభ్యుల ఆదరణ నోచుకోనివారికి ఆసరాగా నిలవాలన్నది నా ప్రయత్నం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. – మట్టపర్తి నవీ¯ŒS కుట్టు శిక్షణతో ఉపాధి అమ్మ ఫౌండేష¯ŒS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నా. నాతో పాటు ఎంతో మంది మహిళలు ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. – లక్కింశెట్టి సాయిసీతామహలక్ష్మి, శివకోడు -
అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడు
గుంటూరు (అరండల్‌పేట): యువత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సినీహీరో సుమన్ పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో కలాం 85వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం వంటి వ్యక్తి మన దేశంలో జన్మించడం దేశ ప్రజల అదృష్టమన్నారు. విద్యార్థులు, యువత ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని అబ్దుల్‌కలాం జీవితాన్ని చూస్తే తెలుస్తుందన్నారు. చివరి వరకు దేశసేవ కోసం ఆయన పరితపించారని పేర్కొన్నారు. కలలు కనండి. సాకారం చేసుకోండి అంటూ యువతకు ఆయన చ్చిన సందేశాన్ని అందరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి యామ మురళీ, పోతురాజు శ్రీనివాస్, టి.శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. -
భగత్‌సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలి
– ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు స్టాలిన్ చిలుకూరు: విద్యార్థులు భగత్‌సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు స్టాలిన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 23 ఏళ్ల వయస్సులో భగత్‌సింగ్ స్వాంతత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాడని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందియన్నారు. అనంతరం భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, ఎంపీటీసీ పుట్టపాక శ్రీనివాస్ యాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కొండల్, సహాయ కార్యదర్శి కొండూరి వెంకటేష్, జిల్లా, మండల విద్యార్థి సంఘం నాయకులు తమ్మనబోయిన నరేశ్, ఉపేందర్, యాదగిరి, రంగా, నవీన్, భారతీ, శైలజ, సావిత్రి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక ఉద్యమకారుల స్ఫూర్తి
ఆచార్య కొలకలూరి ఇనాక్ తెనాలి: సమాజాన్ని మార్చిన మేధావుల స్ఫూర్తిగా సామాజిక, సాంస్కృతిక అంశాల్లోని సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సాహితీవేత్త, ప్రతిష్టాత్మక మూర్తిదేవి అవార్డుకు ఎంపికైన ఆచార్య కొలకలూరి ఇనాక్ సూచించారు. సామాజిక పరివర్తన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇక్కడి పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో ‘సామాజిక పరివర్తనలో సెప్టెంబర్’ సదస్సు నిర్వహించారు. ఇనాక్ మాట్లాడుతూ.. తొలిసారిగా సత్యశోధక్ సమాజ్ స్థాపనతో సామాజిక ఉద్యమానికి జ్యోతిబా పూలే సెప్టెంబరు 24న నాంది పలికారని గుర్తుచేశారు. అట్టడుగువర్గాల అభ్యున్నతిని ఆశించిన మహాకవి గుర్రం జాషువా, కుసుమ ధర్మన్నకవి, డాక్టర్ బోయి భీమన్న జయంతి ఇదే నెలలోనేనని చెప్పారు. అంబేడ్కర్ కృషితో పూనా ఒడంబడిక, రిజర్వేషన్ల సాధన వంటి అనేక సంఘటనలు సెప్టెంబరు 24నే జరిగాయని వివరించారు. కేంద్రం అధ్యక్షుడు అంబటి అనిల్‌కుమార్ అధ్యక్షత వహించిన సదస్సులో రచయిత్రి గుజ్జర్లమూడి స్వరూపరాణి, వివిధ సంస్థలు, ఉద్యోగ, సాంస్కృతిక సంఘాల నేతలు మాతంగి దిలీప్‌కుమార్, వున్నవ వినయ్‌కుమార్, ఎస్.ఎస్.ఎస్ సుకుమార్, ఎస్.ఎం.ప్రకాష్‌కుమార్ ప్రసంగించారు. -
మౌనికను స్ఫూర్తిగా తీసుకోవాలి
నిడమనూరు : కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన గురుకుల పాఠశాల విద్యార్థిని వుగ్గె మౌనిక విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. నిడమనూరులో శుక్రవారం పర్వతోహకురాలు వుగ్గె మౌనిక సన్మాన సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిభ చూపిన వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మౌనిక అదే స్ఫూర్తితో చదువుతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ చూపాలని కోరారు. లయన్స్కబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ –2 రామానుజాచార్యులు మాట్లాడుతూ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి రాజకీయ దార్శనికుడని అన్నారు. ఎంతో గర్వంగా ఉంది : మౌనిక మహామహుల సమక్షంలో స్టేజీ ఎక్కడం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినప్పటి కంటే ఎక్కువ సంతోషంగా ఉందని వుగ్గె మౌనిక అన్నారు. శుక్రవారం తన అభినందన, సన్మాన కార్యక్రమంలో మౌనిక మాట్లాడారు. డార్జిలింగ్ వెళ్లినప్పుడు ఎవ్వరూ గుర్తించలేదని, అప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. నిడమనూరు లయన్స్‌క్లబ్ వ్యవస్థాపకుడు చేకూరి హన్మంతరావు పర్వతాన్ని అధిరోహించిన విషయం పత్రికల ద్వారా తెలుసుకుని తనకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారని సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పుడూ ముందడగు వేయాలని అప్పుడే విజయాలు వాటంతట అవే వస్తాయని మౌనిక అన్నారు. ఈసందర్భంగా మండలస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 22మందిని సన్మానించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్–1 చిలుకల గోవర్దన్, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ ఇందిర, ఎంఈఓ బాలు నాయక్, జెడ్పీటీసీ అంకతి రుక్మిణిసత్యం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చేకూరి వంశీచరణ్, నిడమనూరు లయన్స్‌క్లబ్ బాధ్యులు ముంగి శివమారయ్య, అంకతి సత్యం, మెరుగు మధు, ఉన్నం చిన వీరయ్య, సర్పంచ్ రుద్రాక్షి ముత్తయ్య, కట్టెబోయిన గోవర్దన్, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం
భీమవరం టౌన్ : బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ఉమామేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక ప్యాడి మర్చంట్స్ హాల్లో ఆదివారం విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేపట్టిన వినాశకర విద్యుత్ సంస్కరణలు, అధిక విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ 9 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుతో ప్రజలు ఉద్యమించారన్నారు. ఈ ఉద్యమం మహత్తర పోరాటంగా రూపాంతరం చెందిందని చివరకు చంద్రబాబు ప్రభుత్వం బషీర్‌బాగ్‌లో ఉద్యమకారులను గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించారని, ఈ పోరాటంలో రామకృష్ణ, బాలా స్వామి, విష్ణువర్థన్‌రెడ్డి ప్రాణాలు విడిచారని గుర్తు చేశారు. అమరవీరుల ఉద్యమ స్ఫూర్తి ఎన్నటికీ వృథా కాదన్నారు. ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం గతంలో మాదిరిగానే సామాన్యుల సమస్యలను గాలికి వదిలి భూములు గుంజుకోవడం, కార్మికచట్టాలను నీరుగార్చడం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జుత్తిగ నర్సింహమూర్తి, జేఎన్వీ గోపాలన్, డి.సత్యనారాయణ, బీవీ వర్మ, బి.ఆంజనేయులు పాల్గొన్నారు -
చీకటి బతుకున వేగుచుక్కలా..
-
చీకటిబతుకున వేగుచుక్కలా..
అంధుడిని పెళ్లాడిన యువతి జియోన్ పాఠశాలలో వివాహ వేడుక కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ‘వెలుగుకు నోచని నీ బతుకులో వేగుచుక్కనవుతా.. కొత్త వేకువనవుతా.. నీ కనులు చూడలేకపోయినా..నేనే నీ చూపై ఈ లోకాన్ని చూపిస్తా.. జీవితమంతా నీ తోడైనీడై ఉంటా..’ అంటూ ఓ యువతి అంధుడికి జీవితభాగస్వామి అయింది. రాజమహేంద్రవరంలోని జియోన్ అంధుల పాఠశాల శుక్రవారం వారి పరిణయ వేదికగా మారింది. విశాఖపట్నం పరదేశీపాలెంకు చెందిన శ్యామల జిల్లాలోని ప్రత్తిపాడుకు చెందిన కొండబాబు అనే అంధుడిని వివాహమాడింది. 25 ఏళ్ల శ్యామలకు చిన్ననాటి నుంచే అంధులంటే సానుభూతి. వారికి చేతనైనంత వరకూ చేదోడు వాదోడుగా నిలిచేది. ఆమె తమ్ముడు రేచీకటితో బాధపడి మృతి చెందాడు. కాగా 30 ఏళ్ల కొండబాబుకు మూడో ఏటే చూపు పోయింది. జియోన్ అంధుల పాఠశాలలో చదువుకుని ప్రస్తుతం అక్కడే ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్నాడు. కొండబాబుకు వివాహం చేయాలనుకున్న పాఠశాల నిర్వాహకురాలు ఎస్తేరురాణి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమెకు శ్యామల గురించి తెలిసి ం ది. స్వతహాగా అంధులంటే జాలీ, దయా ఉన్న ఆమెను కొండబాబుకి ఇచ్చి వివాహం చేస్తే వారి దాంపత్యజీవితం ఒడిదుడుకులు లేకుండా సాగుతుందని ఎస్తేరు రాణి భావించారు. శ్యామల కు టుంబసభ్యులను సంప్రదించారు. ముం దు నుంచే అంధులంటే సానుభూతి కలిగి న ఆమె కొండబాబును పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. శుక్రవారం ఇరుకుటుంబాల సమక్షంలో లాలాచెరువు హోస న్నా మందిరం పాస్టర్ జాన్‌వెస్లీ సమక్షంలో వివాహం జరిపించారు. ఈ జంట ను మేయర్ పంతం రజనీశేషసాయి, 50వ వార్డు కార్పొరేటర్ గుత్తుల మురళీధరరావు, పలువురు నగర ప్రముఖులు ఆశీర్వదించారు. కాగా జేఎమ్ జ్యూయలర్స్ వధువుకు తాళిబొట్టును బహూ కరించి, ఆహూతులకు విందు ఏర్పాటు చేసింది. తుమ్మిడి బ్రదర్స్ వారు వధూవరులకు నూతన వస్త్రాలను, రవి షామియానా సప్లయ్ వారు టెంట్, ఇతర సామగ్రిని ఇచ్చారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు రూ.5 వేలు అందించారు. అం ధుల ఇబ్బందులు గమనిం చిన తనకు వారికి చేతనైన సాయం చేయాలనుండేద ని, ఈ క్రమంలోనే కొండబాబు ను పెళ్లి చేసుకున్నానని శ్యామల చెప్పింది. ఇంటర్ వరకూ చదివిన తాను కూడా ఉద్యోగం చేస్తానని చెప్పింది. -
బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవ
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ కల్చరల్: కుల రహిత సమాజం కోసం పాటు పడిన బసవేశ్వరుడిని స్ఫూర్తిగా తీసుకొని, ధార్మిక, సామాజిక సేవల్లో తరించాలని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. వీరశైవ లింగాయత్ –లింగబలిజ సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం స్థానిక గోపాల్‌రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘కాయకమే కైలాసం’ (కçష్ట పడితేనే ముక్తి, భుక్తి) అంటూ చాటి చెప్పిన బసవేశ్వరుడు గొప్ప మానవతా వాది అన్నారు. 12వ శతాబ్దంలోనే ‘అనుభవ మండపం’ అనే పార్లమెంటను ఏర్పాటు నిర్వహించారని గుర్తు చేశారు. బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వీరశైవ లింగాయత్‌లకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీలో చేర్చిన ఘనత వైఎస్‌దే.. ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సంగేశ్వర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో తయ కులస్థులను బీసీల్లో చేర్చారని అన్నారు. ఓబీసీలుగా గుర్తించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అనంతరం రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి శివరత్నం నూతన కార్యవర్గ సభ్యులచే పదవీ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా నేతలువన్నె ఈశ్వరప్ప,కవితా దేశ్‌ముఖ్, శేఖర్, పవన్, రేణుక,సోమశేఖర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జేపీఎన్సీఈ చైర్మెన్ కేఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తిదాయకం హరితహారం
బూర్గంపాడు: తెలంగాణ హరితహారం అందరిలో స్ఫూర్తిని నింపాలని తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి అన్నారు. స్థానిక సివిల్ ఆస్పతి ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయ్‌గాంధీలతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బూర్గంపాడు మండలం హరితహారంలో జిల్లాలో అగ్రగామిగా నిలవాలన్నారు. పినపాక పట్టీనగర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఐసీyీ ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీపీ రోశిరెడ్డి, జెడ్పీటీసీ గాంధీ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, ఐసీడీఎస్ సీడీపీఓ స్వర్ణలత లెనినా, ఎంఈఓ కే వెంకటేశ్వరరావు, సర్పంచ్ పుట్టి కుమారి, ఈజీఎస్ ఎపీఓ శ్రీలక్ష్మీ, ఈసీ నవీన్, సివిల్ ఆస్పత్రి వైద్యులు భాస్కర్‌నాయక్, శ్వేత, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
'చైనా ఆర్థిక విజయాలు మాకు ఆదర్శం'
గాంగ్జౌ: చైనాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం భారత్-చైనా బిజినెస్ ఫోరంలో ప్రసంగించారు. భారత- చైనాల పాత బంధాలను బలోపేతం చేయడానికి ఇదొక అద్భుత సమయమని ప్రణబ్ తెలిపారు. చైనా సాధించిన ఆర్థిక విజయాలు భారత్ కు ఆదర్శం అని ఆయన కొనియాడారు. మా ఉత్పత్తులకు చైనా మార్కెట్లో డిమాండ్ పెరగాలని భారత్ ఎదురు చూస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కీలక ప్రాంతాల్లో సమగ్ర సంస్కరణలు ప్రవేశపెట్టడంతో భారత్‌లో వ్యాపారం చేయడం సులభతరంగా మారిందని పేర్కొన్నారు. చైనా నుంచి భారత్‌లో పెట్టుబడులు పెరగడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నామని ప్రణబ్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ భారత వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. గురువారం బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర నాయకులతో రాష్ట్రపతి చర్చిస్తారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఆ దేశ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ ఝాంగ్ డేజియాంగ్‌లతో కూడా భేటీ అవుతారు. -
ఈ అష్టావక్ర.. అందరికీ ఆదర్శం!
బ్రెసీలియా: అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వారిలోనే కొంత మంది జీవితంలో తమ సొంతకాళ్లపై నిలబడలేరు. ప్రపంచాన్ని తల కిందులుగా అర్థం చేసుకుంటారు. జీవితంలో నిరాశా నిస్పృహలకు గురవుతారు. చివరకు పనికి రాకుండా పోతారు. కానీ ఈ తల కిందులుగా ఉన్న మనిషి ప్రపంచాన్ని సరిగ్గానే చూస్తున్నారు. తలను వెనక్కి విరిచి వేలాడేసినట్లుగా ఉన్న 40 ఏళ్ల క్లాడియో వియెర్రా డీ అలవీరకు చేతులు, కాళ్లు కూడా సరిగ్గాలేక అష్టావక్రగా కనిపిస్తారు. కానీ ఏనాడూ నిరాశా నిస్పృహలకు గురికాలేదు. వ్యక్తిగత పనులకు గానీ, సామాజిక జీవనానికి గానీ ఎవరి మీదా ఆధారపడడం లేదు. నోట్లో పెన్ను పెట్టుకొని రాస్తారు. పెదవులతోనే ఫోన్ పట్టుకోగలరు, మాట్లాడగలరు. నోటితోనే మౌజ్ పట్టుకొని కంప్యూటర్ ఆపరేట్ చేయగలరు. ఇంట్లో తన అన్ని పనులు తానే చేసుకోగలరు. చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతూ వచ్చిన అలవీర ఇప్పుడు బ్రెజిల్‌లోని ఓ యూనివర్శిటీలో అకౌంటెంట్ ఉద్యోగానికి క్వాలిఫై అయ్యారు. అంతర్జాతీయ వేదికలపై అకౌంటెన్సీ, ఇతర అంశాలపై అలవోకగా మాట్లాడుతూ అందరిని అబ్బుర పరుస్తున్నారు. జీవితంలో తన అనుభవాలను తాజాగా ఓ పుస్తకంగా రాసి అరుదైన వ్యక్తిగా ప్రపంచ పుటల్లోకి ఎక్కారు. బ్రెజిల్‌లోని మాంటే సాంటేలో పుట్టిన అలవీరను పురిట్లోనే చంపేయమని డాక్టర్లే ఆయన తల్లి మారియా జోస్ మార్టిన్‌కు సలహా ఇచ్చారు. ఏ అవయం సరిగ్గా లేకుండా అష్టావక్రగా ఉన్న అలవీరను తిండి పెట్టకుండా చంపేయమంటూ ఇరుగు పొరుగువారు కూడా పోరు పెట్టారు. అయినా వారెవరి మాటలను పట్టించుకోలేదు మారియా. పురిటి బిడ్డను అల్లారు ముద్దుగానే పెంచుతూ వచ్చింది. ఎనిమిదేళ్ల వరకు తల్లి మీద ఆధారపడి బతికిన అలవీర ఆ తర్వాత తన పనులు తాను చేసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత బడికెళ్లి చదువుకుంటానని మొండి కేశారు. తోటి పిల్లలు ఎలా చూసినా పట్టించుకోకుండా కష్టపడి చదువుకున్నారు. తన కొడుకు తన పనులు తాను చేసుకునేందుకు వీలు ఇంట్లోని ఎలక్ట్రానిక్ స్విచ్‌లన్నీ కిందకు ఏర్పాటు చేశానని, టీవీ, రేడియోలు కూడా అందుబాటులో ఉంచానని తల్లి మారియా తెలిపారు. సరిగ్గా పనిచేయని కాళ్లకు గాయాలు కాకుండా ఇంటి ఫ్లోరింగ్‌ను కూడా మర్పించానని ఆమె చెప్పారు. ఇలా ఎదుగుతూ వచ్చిన తాను ఏనాడు నిరాశా నిస్పహలకు గురికాలేదని, వీధిలోకి వెళ్లేందుకు కూడా ఏనాడూ సిగ్గు పడలేదని, జీవితాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని, ఎప్పుడు సాధారణ వ్యక్తికి తనకు తేడా ఉందని అనుకోలేదని చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి లెక్చర్లు ఇవ్వాల్సిందిగా తనకు ఆహ్వానాలు అందుతున్నాయని, జీవితం తనకు ఎందో అనందంగా ఉందని అలవీర తన పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా తెలిపారు. సావో పావులోని ఆర్ట్ మ్యూజియంలో ఆయన రాసిన ‘ఎల్ ముండో ఎస్టా ఏ కాంట్రమానో (ది వరల్డ్ ఈజ్ రాంగ్ వే అరౌండ్)’ను ఇటీవల ఆవిష్కరించారు. కనీసం వీల్ చైర్లో కూడా కూర్చోలేని అలవీర ‘ఆర్దోగ్రిపోసిస్’ అనే అరుదైన జబ్బు కారణంగా అష్టావక్రగా జన్మించారు. ఈ జబ్బు కారణంగా అన్ని జాయింట్ల వద్ద శరీరం ముడుచుకుపోయి కుంచించుకుపోతుంది. పిల్లలు ఇలా పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. తల్లి గర్భాశయం చాలా చిన్నగా ఉండడం లేదా కండరాలు, నరాల సమస్యలు ఉన్న కారణంగా ఇలా జన్మిస్తారు. చిన్నప్పుడు ఫిజియో థెరపీ, సర్జరీల వల్ల వారిలో కొందరు కోలుకుంటారు. అలా కోలుకోని అలవీర అన్నీ అవయవాలున్న మనబోటి వారికి మేలుకొల్పు అవుతున్నారు. -
మెగాస్టార్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా..?
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. ఓ దశలో బిగ్ పనిఅయిపోయిందన్న విమర్శలు వచ్చాయి. అయినా పడిలేచిన కెరటంలా దిగ్విజయంగా దూసుకెళ్తున్నారు. విజయాలు, పరాజయాలు ఏవి ఎదురైనా అమితాబ్‌కు స్ఫూర్తి కలిగిస్తూ ముందుకు నడిపించేది ఎవరంటే..? కోట్లాది అభిమానులట. 73 ఏళ్ల బిగ్ బీ స్వయంగా ఈ విషయం చెప్పారు. 'అభిమానులు చూపే ప్రేమ, అనురాగాన్ని నిర్వచించేందుకు పదాలు చాలవు. వాళ్లు నిరంతరం అండగా ఉంటూ మద్దతు ఇస్తున్నారు. నాపై ఎంతో విశ్వాసం చూపుతున్నారు. దీన్ని ఎంతో గొప్పగా భావిస్తున్నా. అభిమానుల ప్రేమ నాలో స్ఫూర్తి కలిగిస్తోంది. ప్రతి నిమిషం బలాన్ని ఇస్తోంది. ఈ ప్రేమ స్వచ్ఛమైనది. ఎప్పుడూ కలుషితం కాదు. ఇదేదో సాదాసీదా కృత్రిమమైన ప్రేమ కాదు. ఈ ప్రేమ గురించి వర్ణించడానికి పదాలు చాలవు. వెలకట్టలేనిది. అందరికీ ధన్యవాదాలు' అని అమితాబ్ ట్వీట్ చేశారు. -
నాసాను చూసి..!
వాషింగ్టన్: నాసా శాస్త్రవేత్తలు తయారుచేసిన 'యాంటీ-గ్రావిటీ సూట్' ను ఆదర్శంగా తీసుకున్న ఓ కంపెనీ 'మిరాకిల్ సూట్' అనే పేరుతో ప్రసవంలో ఎక్కవ రక్తస్రావం అవకుండా ఉండేందుకు కొత్త ఆవిష్కరణను చేసింది. కాలిఫోర్నియాలోని జోఎక్స్ కార్పొరేషన్ అనే స్టార్టప్ కంపెనీ సూట్ లో ప్రెజర్ ను ఉపయోగించి మహిళలకు ప్రసవాన్ని చేయడం వల్ల ఎక్కువ రక్తాన్ని కోల్పోకుండా ఉండేలా చేసింది. మిలటరీ, ఏవియేషన్ రంగాల్లో లాగా ఎక్కువ ప్రెజర్ తో అవసరం ఉండదు కాబట్టి, పాత తరహా జీ-సూట్ మోడల్ లోనే ఈ సూట్ ను తయారుచేశారు. తాజాగా నాసా ఏమ్స్ పరిశోధనా కేంద్రం, మరికొన్ని పరిశోధనా కేంద్రాలు చేసిన స్టడీల్లో పాకిస్తాన్ లో ప్రసవం కోసం వచ్చిన 14 మంది గర్భిణీ స్త్రీలలో 13 మంది మహిళల ప్రాణాలను ఈ సూట్ కాపాడినట్లు తేలింది. ఈజిప్టు, నైజీరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం రక్తస్రావ మరణాలను తగ్గించినట్టు మరో పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, శిశు మరణాలకు తగ్గించేందుకు కృషి చేస్తున్నఓ సంస్థ ఈ సూట్ గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు స్త్రీ, శిశు మరణాల రేటు తగ్గించడానికి చాలా ప్రయత్నించామని అయినా ఇంత పెద్ద మొత్తంలో ఫలితాలు రాబట్టలేకపోయామని పేర్కొంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజిస్ట్స్ లు ఈ మిరాకిల్ సూట్ ను అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉపయోగించుకోవాలని సూచించాయి. ఇప్పటివరకు 20 దేశాలు స్పందించి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ప్రపంచంలో ప్రతి ఏడాది 70,000 మంది మహిళలు డెలివరీ సమయంలో రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారు. -
గుండె నిండా పేదల జెండా
♦ పతాకావిష్కరణలు.. సేవా కార్యక్రమాలు ♦ అధికార పార్టీ కుట్రలు.. కుతంత్రాలను ఎదుర్కొందాం ♦ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం ♦ పేదల పక్షాన పోరాటమే దానికి మార్గం ♦ వేడుకల్లో నాయకుల పిలుపు.. కార్యకర్తల ప్రతిన సాక్షి, విశాఖపట్నం: ఉద్యమాలే ఊపిరిగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. తమ గుండెల్లో కొలువైన దివంగత వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఏర్పడిన పార్టీ ఐదో పుట్టిన రోజు వేడుకలను శనివారం జిల్లా అంతటా పార్టీ శ్రేణులే కాదు.. వివిధవర్గాల ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంతోపాటు జిల్లా నలుమూలలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మారుమూల పల్లెల్లో సైతం పార్టీ జెండాలను ఆవిష్కరించి కేకులు కట్ చేసి.. నిరుపేదలు. వృద్ధులు. అనాధలు, రోగులకు పండ్లు, పాలు, వస్త్రాలు పంపిణీ చేశారు. వైఎస్సార్ సంక్షేమ ఫలాలు మళ్లీ అందాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. కుట్రలు.. కుతంత్రాలు ఛేదిస్తూ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి తరపున అలుపెరగని పోరాటం సాగిస్తున్న పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడతామని ప్రతినబూనారు. కుట్రలు, కుతంత్రాలను తిప్పికొడదాం: బూడి మహానేత వైఎస్సార్ హఠన్మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసారో... చేస్తున్నారో మనమంతా చూశాం. చూస్తున్నాం.. దొంగ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీని బలహీనపర్చేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. ైవైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసే వరకు పార్టీ శ్రేణులు అలుపెరగని పోరు సాగించాలని పిలుపునిచ్చారు. దేవరాపల్లి మండలం కలిగొట్ల గ్రామంలో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బూడి పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. యలమంచలిలో.. కోఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు యలమంచలి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మునగపాకలో పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొడ్డెడ ప్రసాద్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పాయకరావుపేటలో.. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఎస్.రాయవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్బంగా బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రానున్నయన్నారు. మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ సెల్ అధ్యక్షుడు డి.వి.సూర్యనారాయణరాజు నక్కపల్లిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ నక్కపల్లిలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. నర్సీపట్నంలో.. పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకరగణేష్ నర్సీపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఐదు రోడ్లు జంక్షన్లో గల పార్టీ కార్యాలయ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అబీద్సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. రావికమతంలో డిసిఎంఎస్ చైర్మన్ ముక్కా మహలక్ష్మినాయుడు పార్టీ నేతలతో కలిసి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పాడేరులో.. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో స్థానిక ఎంపీపీ, జెడ్పీ టీసీలు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అనకాపల్లిలో పార్టీ పట్టణాధ్యక్షు డు జానీ పార్టీ నేతలు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ దక్షిణంలో.. గత రెండేళ్లుగా పెదబాబు-చినబాబులు కలిసి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని.. అవనీతికి తలుపులు బార్లా తెరవడంతో ఆ పార్టీ నేతలు కూడా దండుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ అన్నారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులతో కలిసి జగదాంబ సెంటర్లో పార్టీ పతాకాన్ని అమర్నాధ్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఈస్ట్‌లో.. రెండేళ్ల అవినీతి పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని విశాఖ తూర్పు కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని పార్టీపతాకాలను ఆవిష్కరించారు. ఆటో డ్రైవర్లకు ఖాకీ దుస్తులు పంపిణి చేశారు. ఉత్తర నియోజకవర్గంలో.. పోరాటాలతో పుట్టిన వైఎస్సార్సీపీదే భవిష్యత్ అని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ అన్నారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలోని పలు వార్డుల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో తైనాల పాల్గొని పేదలు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. పలు కూడళ్లలో జెండాలు ఆవిష్కరించారు. గాజువాకలో.. సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి గాజువాక నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు పండ్లు, పాలు. వస్త్రాలు పంపిణీ చేశారు. పెందుర్తిలో.. సమన్వయకర్త అదీప్‌రాజు నియోజకవర్గంలోని వివిధ వార్డులు, గ్రామాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. 69వ వార్డులో మహానేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భీమిలిలో.. సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం భీమిలి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తగరపువలస, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అంతా వైఎస్సార్‌సీపీదేనని.. జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు. -
రాజన్న స్ఫూర్తితో ముందడుగు
వాడవాడలా ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం పేదలకు అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రానికే పెద్దాయనగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయ రంగం లో ముందడుగు వేద్దామని పలువురు వైఎస్సార్సీపీ నేతలు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులుఅర్పించారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ పాలనను మళ్లీ రాష్ట్ర ప్రజలకు అందించాలంటే జగనన్న ఒక్కడే దిక్కని పేర్కొన్నారు. అందుకోసం ఇప్పటినుంచే కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మమేకమవుతూ నిరంతరం సమస్యలపై పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ♦ తిరుపతిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జగనన్న వ్యక్తిత్వం, ప్రజలపట్ల ఆయనకున్న ఆప్యాయత, పార్టీకి ఆభరణమని ఈ సందర్భంగా కరుణాకర రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాపరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్కె బాబు తదితరులు పాల్గొన్నారు. ♦ చంద్రగిరి, శెట్టిపల్లె పంచాయతీల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీలో కార్యకర్తగా, ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన జగనన్నతోనే సాధ్యమని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మునీశ్వరరెడ్డి, హేమేంద్రకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు ఆధ్వర్యంలో అవిలాలలోని ఆశ్రయ వేల్ఫేర్ అర్గనైజేషన్ ఆశ్రమంలో వృద్ధులు, అనాథలకు అన్నదానం చేశారు. ♦ మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనాథాశ్రమంలో పేదలకు అన్నదానం చేశారు. ♦ వాల్మీకిపురంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ♦ చిత్తూరులోని సంతపేటలో బీసీ సెల్ నగర కన్వీనర్ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకలకు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ♦ హస్తి పట్టణంలో నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిల్లలకు పలకలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే వైఎస్ విగ్రహం వద్ద పేద మహిళలకు చీరలు, జాకెట్లు పంచిపెట్టారు. ♦ పలమనేరులో పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారీ కేక్ కట్‌చేసి కార్యకర్తలు, నాయకులకు పంచిపెట్టారు. ♦ సత్యవేడులో నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టారు. వరదయ్యపాళెంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ♦ నగరిలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి, పార్టీ టీయూసీ రాష్ట్ర ప్రధాన ర్యదర్శి కెజె కుమార్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. ♦ కుప్పంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసమూర్తి, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బీ.కొత్తకోటలో మండల అధ్యక్షుడు జాఫర్ బాషా, జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డెప్ప రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ♦ గంగాధర నెల్లూరు, తంబళ్లపల్లి, పూతలపట్టు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పార్టీ మండల అధ్యక్షులు జెండాను అవిష్క రించారు. -
మీ స్ఫూర్తికి సలామ్!
మిగిలిన చాలా ఆటలతో పోలిస్తే టెన్నిస్ ఆడటం చాలా కష్టం. దీనికి ఫిట్నెస్ ఎక్కువ అవసరం. కోర్టు నలువైపులా పాదరసంలా కదులుతూ షాట్లు ఆడాలంటే చెమటలు కక్కాల్సిందే. అలాంటిది రెండు కాళ్లూ లేకుండా టెన్నిస్ ఆడాలంటే..? ఊహించడానికే భయంగా ఉంది కదా... ఓ చేత్తో కుర్చీని కదుపుకుంటూ బంతి దగ్గరకు వెళ్లాలి. మరో చేత్తో రాకెట్ పట్టుకుని బంతిని ప్రత్యర్థి కోర్టులోకి పంపాలి... నెట్ దగ్గర పడే బంతిని అందుకోవడానికి బేస్‌లైన్ బయటి నుంచి వేగంగా కుర్చీని జరుపుకుంటూ వస్తుంటే... వాళ్ల గొప్పతనాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మన దేశంలో పెద్దగా ఆదరణ లేకపోయినా వీల్‌చెయిర్ టెన్నిస్ ప్రపంచవ్యాప్తంగా మంచి స్థితిలోనే ఉంది. అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా ఉన్నత శిఖరాలకు చేరుకున్న క్రీడాకారులెందరో ఉన్నారు. ఇందులో విజేతలే కాదు... ఆడుతున్న వాళ్లందరి స్ఫూర్తికీ సలామ్. సాక్షి క్రీడావిభాగం: శరీరంలో నడుము నుంచి కింది భాగంలో వైకల్యం ఉన్నవారు మాత్రమే వీల్ చెయిర్ టెన్నిస్ ఆడేందుకు అర్హులు. 1976లో అమెరికాకు చెందిన బ్రాడ్ పార్క్స్ కృషి కారణంగా ఈ వీల్ చెయిర్ టెన్నిస్ వెలుగులోకి వచ్చింది. ప్రారంభంలో రిక్రియేషనల్ ఆట స్థాయిలో ఉన్నా తదనంతరం ప్రొఫెషనల్ క్రీడగా మారింది. 1982లో ఫ్రాన్స్... యూరప్‌లో తొలిసారిగా వీల్ చెయిర్ టెన్నిస్ టోర్నీ నిర్వహించింది. ఆ తర్వాత ఈ ఆటను విశ్వవ్యాప్తం చేసేందుకు 1988లో అంతర్జాతీయ వీల్‌చెయిర్ టెన్నిస్ సమాఖ్య (ఐడబ్ల్యూటీఎఫ్) ఏర్పడింది. అదే ఏడాది1988 సియోల్ పారాలింపిక్స్ క్రీడల్లో ఈ ఆటను ఓ ప్రదర్శన ఈవెంట్‌గా పరిచయం చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు 1992 బార్సిలోనా పారాలింపిక్స్‌లో పూర్తి స్థాయి క్రీడాంశంగా మారింది. ఇందులో 16 దేశాలు పాల్గొన్నాయి. అటు 1998, జనవరి 1 న ఐడబ్ల్యూటీఎఫ్... అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)లో విలీనమైంది. ఐటీఎఫ్ కూడా ఈ ఆటపై ఎలాంటి వివక్ష చూపకుండా ‘వరల్డ్ క్లాస్’గా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలనూ చేస్తుండటం విశేషం. నిబంధనలు వీల్ చెయిర్ టెన్నిస్‌లో నిబంధనలు దాదాపుగా రెగ్యులర్ టెన్నిస్‌లో ఉన్నట్టుగానే ఉంటాయి. * కోర్టుల పరిమాణం, బంతులు, రాకెట్స్ ఇలా వేటిలోనూ మార్పు ఉండదు. ఆటగాళ్లు వీల్ చెయిర్లో కూర్చుని ఆడడమే తేడా. * అలాగే బంతి రెండు సార్లు బౌన్స్ అవ్వచ్చు. రెండోసారి అయ్యే బౌన్స్ కోర్టు లోపల లేదా బయట పడినా పరిగణనలోకి తీసుకుంటారు. * కానీ కచ్చితంగా మూడో బౌన్స్ అయ్యేలోపు ఆటగాడు బంతిని రిటర్న్ చేయాలి. లేకుంటే పాయింట్ కోల్పోతాడు. * పురుషులు, మహిళలు, క్వాడ్స్ (రెండు కాళ్లతో పాటు రెండు చేతులు కూడా పనిచేయని వారు) విభాగాల్లో పోటీలు ఉంటాయి. * క్వాడ్స్ విభాగంలో ఆటగాళ్లు తమ చేతికి రాకెట్ హ్యాండిల్‌ను టేపుతో అతికించి ఎలక్ట్రిక్ వీల్ చెయిర్లో కూర్చుని ఆడతారు. * అన్ని సింగిల్స్ మ్యాచ్‌లు మూడు సెట్ల పాటు జరుగుతాయి. అన్ని సెట్లలో టైబ్రేక్ పద్ధతి ఉంటుంది. * అయితే 2013 సీజన్ నుంచి డబుల్స్ మ్యాచ్‌ల్లో మ్యాచ్ టైబ్రేకర్స్ను అమల్లోకి తెచ్చారు. అయితే ఇది ఐటీఎఫ్-1 అంతకన్నా తక్కువ స్థాయి టోర్నీల్లోనే ఉపయోగిస్తారు. గ్రాండ్‌స్లామ్స్‌లో ఆడేటప్పుడు వాటి నిబంధనలే ఉంటాయి. టాప్ స్టార్స్ * ప్రస్తుతం పురుషుల విభాగంలో వీల్‌చెయిర్ టెన్నిస్‌ను శాసిస్తున్న ఆటగాడు జపాన్‌కు చెందిన షింగో కునీడా. ఇప్పటికి సింగిల్స్‌లో 20, డబుల్స్‌లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు (2008 బీజింగ్, 2012 లండన్) సాధించాడు. మహిళల్లో జిస్కే గ్రిఫియోన్ (నెదర్లాండ్స్), క్వాడ్‌లో డైలాన్ అల్కాట్ (ఆస్ట్రేలియా) టాప్‌లో ఉన్నారు. * మహిళల్లో ఏస్తర్ వర్గీర్ (నెదర్లాండ్స్)ను లెజెండ్‌గా చెప్పుకోవచ్చు. ఎనిమిదేళ్ల ఆమె కెరీర్లో 42 గ్రాండ్‌స్లామ్స్(సింగిల్స్, డబుల్స్ కలిపి)తో పాటు 22 సీజన్ ఆఖరి చాంపియన్‌షిప్స్, ఏడు పారాలింపిక్స్ టైటిళ్లను నెగ్గి రికార్డు సృష్టించింది. 1999 నుంచి రిటైరయ్యే (2013) వరకు నంబర్‌వన్‌గా కొనసాగింది. 2003 జనవరి నుంచి కెరీర్‌ను ముగించేవరకు 470 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. మొత్తం 700 మ్యాచ్‌ల్లో 25 మాత్రమే ఓడింది. * పారాలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశంగా నెదర్లాండ్స్ (32) నిలిచింది. * అలాగే ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో ఈ ఆట ఆడుతున్నారు. వీల్ చెయిర్లో కూర్చుని ఆడే ఆటల్లో ఈ క్రీడదే అగ్రస్థానం. మేజర్ టోర్నీలు * ‘వీల్‌చెయిర్ టెన్నిస్ టూర్’లో భాగంగా ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ, సూపర్ సిరీస్, ఐటీఎఫ్ 1,2,3 సిరీస్... ఐటీఎఫ్ ఫ్యూచర్ సిరీస్ జరుగుతాయి. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్... ఈ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలోనూ పోటీలు జరుగుతాయి. * ‘వీల్‌చెయిర్ టెన్నిస్ మాస్టర్స్’టోర్నమెంట్లో పురుషులు, మహిళల్లో టాప్ -8, క్వాడ్‌లో టాప్-4 ర్యాంకర్స్‌ను సింగిల్స్‌లో ఆడనిస్తారు. * డబుల్స్ మాస్టర్స్‌లో టాప్- 8 పురుషుల, టాప్ -6 మహిళల, టాప్ -4 క్వాడ్ డబుల్స్ జట్లు ఆడతాయి. * ‘వరల్డ్ టీమ్ కప్’ బాగా ఫేమస్. ఇది ఐటీఎఫ్‌కు చెం దిన అధికారిక వీల్‌చెయిర్ టెన్నిస్ టీమ్ ఈవెంట్. ఓవిధంగా వారికిది డేవిస్ కప్ లాంటిది. ఏడాదిలో ఓసారి వివిధ దేశాల్లో పురుషుల, మహిళల, క్వా డ్స్, జూనియర్ విభాగాల్లో జరుగుతుంది. ఆతిథ్య దేశం ఐటీఎఫ్ సభ్యత్వం కలిగి ఉండాలి. * ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో ఏటా 160 టోర్నీలు జరుగుతాయి. మనకూ ఉన్నాడొక హీరో భారత్‌లో వీల్‌చెయిర్ టెన్నిస్ ఇంకా ఎదగలేదు. నిజానికి చాలా మందికి ఇలాంటి ఆట ఒకటుందని కూడా తెలీదు. అయితే ఈ ఆటకు ఆదరణ తెచ్చేందుకు అఖిల భారత లాన్‌టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) 2010 నుంచి జాతీయ వీల్‌చెయిర్ టెన్నిస్ టోర్నీ జరుపుతోంది. ఇక ఈ క్రీడలోనూ మన దేశంలో చెప్పుకోదగ్గ ఆటగాడు ఉన్నాడు. తను బెంగళూరుకు చెందిన హ్యారీ బోనీఫేస్ ప్రభు. 1993లో ప్రొఫెషనల్‌గా మారిన ప్రభు క్వాడ్ విభాగంలో ఆడతాడు. నాలుగేళ్ల ప్రాయంలో వెన్నెముక వ్యాధితో వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యాడు. అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన టెన్నిస్‌లో రాటుదేలాడు. 1978లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించడమే కాకుండా అన్ని గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌లోనూ మెయిన్ ‘డ్రా’ వరకు వెళ్లి సత్తా చాటుకున్నాడు. 43 ఏళ్ల ప్రభు సింగిల్స్‌లో అత్యుత్తమ ప్రపంచ ర్యాంక్ 17 కాగా ప్రస్తుతం 48వ స్థానంలో ఉన్నాడు. కెరీర్లో 11 టైటిళ్లు సాధించాడు. 2014లో ఆయన్ని భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరిం చింది. దేశంలో వీల్‌చెయిర్ క్రీడలకు ప్రభు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. -
రేవతిలా యాక్ట్ చేయమనే వాళ్లు
ఎంత పెద్ద నటీనటులైనా తమకు నచ్చిన సినీ తారల నటనను ఇన్స్పిరేషన్గా తీసుకుని తెరపై ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కొంతమందిని అనుకరిస్తూ ఉంటారు కూడా. తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్‌గా వెలుగుతున్న సమంత తాను మంచి నటిగా కొనసాగడానికి కారణం రేవతి అన్నారు. ఇటీవల రేవతితో కలిసి సమంత ఓ యాడ్‌లో నటించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ -‘‘ ‘ఏ మాయ చేశావే’ సినిమాలో అవకాశం రాకముందు నేను కొన్ని ఆడిషన్స్‌లో పాల్గొన్నా. సెలెక్ట్ కాలేదు. చాలా బాధపడ్డాను. కొంతమంది దర్శకులు నన్ను రేవతిలా యాక్ట్ చేయమని అనేవాళ్లు. ఆవిడ నటించిన సినిమాలు చూపించేవాళ్లు. నాకు ఇష్టమైన నటి రేవతి. ఆమె సినిమాలంటే చాలా ఇష్టం. ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అద్దం ముందు గంటల తరబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. రేవతిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నా శైలిలో నటించడం మొదలుపెట్టాను’’ అని చెప్పుకొచ్చారు. -
లాడెన్ నోట గాంధీ మాట
మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ తన శ్రేణులకు పిలుపు అమెరికా వస్తువులను బహిష్కరించాలని సూచన వెలుగులోకి వచ్చిన 1993 నాటి లాడెన్ ఉపన్యాసాలు లండన్: 'భారత జాతిపిత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుందాం.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకొని అమెరికా వస్తువులను బహిష్కరిద్దాం' ఇలా పిలుపునిచ్చింది ఎవరో శాంతి కాముకుడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్-ఖైదాకు ఒకప్పటి అధినేత ఒసామా బిన్ లాడెన్ స్వయంగా తన మద్దతుదారులతో పలికిన మాటలు ఇవి. 1993 లో ఒక ఉపన్యాసంలో తన శ్రేణులను ఉద్దేశించి లాడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన ఆడియో టేపులు ఇటీవల బయటపడ్డాయి. 1997 నుంచి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ స్థావరంగా లాడెన్ ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అమెరికా సైన్యం 2001లో అఫ్గాన్‌పై దాడి చేయడంతో లాడెన్‌తో పాటు అతడి మద్దతుదారులు చాలామంది అక్కడి నుంచి పారిపోయారు. ఈ సందర్భంలో లాడెన్‌కు సంబంధించిన వేలాది ఆడియో టేపులను అక్కడే వదిలేశారు. ఈ టేపులు చాలా మంది చేతులు మారి చివరకు అఫ్గాన్ మీడియా ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ప్లాగ్ మిల్లర్‌కు చిక్కాయి. అరబిక్ సాహిత్యంలో నిపుణుడైన ప్లాగ్ ఈ టేపులపై పరిశోధన చేసి 'ది ఆడాసియస్ అసెంటిక్' పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. 1960 నుంచి 2001 వరకు లాడెన్‌తో పాటు 20 మంది ప్రముఖుల ఆడియో టేపుల సమాచారం ఈ పుస్తకంలో ఉంది. 1993 సెప్టెంబర్ నాటి ఒక టేపులో తన శ్రేణులనుద్దేశించి ప్రసంగించిన లాడెన్.. మహాత్ముడి గురించి ప్రస్తావించారు. గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అమెరికాకు వ్యతిరేకంగా లాడెన్ మొదటిసారి మాట్లాడింది కూడా ఈ టేపులోనే కావడంవిశేషం. -
షారూక్‌కి స్పూర్తినిచ్చిన బాహుబలి
ముంబై: బాహుబలి సినిమా తనకు స్పూర్తినిచ్చిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రశంసించారు. బాహుబలి ఎంతో కష్టపడి తీసిన సినిమా అని షారుక్ ట్విట్టర్ లో కొనియాడారు. ఈ సినిమా తెరకెక్కించడంలో పని చేసిన ప్రతి ఒక్కరు తనకు ఆదర్శమని కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలితేనే ఆకాశన్నందుకోగలుగుతామని షారుక్ ట్వీట్ చేశారు. బాహుబలి చిత్ బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. Baahubali what a hard worked at film. 2 every1 involved thanx for the inspiration. U can only reach the sky if u r willing to take the leap! — Shah Rukh Khan (@iamsrk) August 2, 2015 -
అక్క కరిష్మానే నాకు ఇన్స్పిరేషన్
‘‘మా అక్క కరిష్మాకపూరే నాకు ఇన్స్పిరేషన్. నా జీవితంలో ఆమెకు సముచిత స్థానం ఉంది’’ అంటున్నారు కరీనా కపూర్. ఒకానొక సమయంలో కరిష్మా బాలీవుడ్లో పేరున్న కథానాయికగా రాణించారు. బాలీవుడ్ అగ్ర కథానాయకులతో ఆడిపాడిన కరిష్మా పెళ్లయ్యాక వెండితెరకు దూరమయ్యారు. కానీ ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయారు. ఆ తర్వాత 2012లో ‘డేంజరస్ ఇష్క్’లో నటించినప్పటికీ ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడంతో మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. ‘‘ఇప్పుడు అక్క ఏ సినిమాలోనూ నటించే పరిస్థితిలో లేదు. ఆమెకు కుటుంబమే లోకం. ఇద్దరు పిల్లల ఆలనాపాలనతో బిజీ బిజీ. కెరీర్‌కు సంబంధించి ఇప్పటికీ అక్క నాకు సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటుంది. అనుభవంతో ఆమె చెప్పే మాటలను విని, ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను’’ అని కరీనా చెప్పుకొచ్చారు. -
సచిన్ స్ఫూర్తితో సివిల్స్ ర్యాంక్
ముంబై: ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్నూ ప్రభావితం చేస్తున్నాడు. పట్టుమని పదోతరగతి కూడా పాస్ కాలేని (పాక్‌తో సిరీస్ కారణంగా పరీక్షలకు హాజరుకాలేదు) సచిన్.. దేశంలోనే అత్యున్నతమైనదిగా భావించే సివిల్స్‌కు.. ఆ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించేవారికి స్ఫూర్తిగా నిలిచాడు. మూడు రోజుల క్రితం విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో మహారాష్ట్ర టాపర్‌గా నిలిచిన ఇబోలి నర్వాణే తన ఉన్నతికి కారణం క్రికెట్ దేవుడేనని గర్వంగా చెబుతోంది. పుణెలో స్కూలింగ్ పూర్తిచేసిన ఇబోలి.. ముంబైలోని ప్రముఖ కాలేజీ నుంచి ఎంఏ (ఎకనామిక్స్) పూర్తిచేసింది. మూడో ప్రయత్నంలో సివిల్స్ ఆలిండియా 78వ ర్యాంక్ సాధించింది. చిన్నప్పటినుంచి సచిన్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన ఇబోలి ఏమాత్రం సమయం చిక్కినా క్రికెట్ దేవుడి జీవిత చరిత్ర పుస్తకాన్ని తిరగేస్తూ, ఆయన ఆడిన అద్భుత ఇన్నింగ్సులు చూస్తుంటుంది. సచిన్ మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశాడని ప్రశ్నిస్తే.. 'ప్రధానంగా మూడు విషయాల్లో టెండూల్కర్ నన్ను గొప్పగా ప్రభావితం చేశాడు. ఒకటి ఆట పట్ల అతను చూపే కమిట్మెంట్. రెండు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సుగుణం. మూడు దేశం కోసం ఇవ్వగలిగిందంతా ఇచ్చేయడం. ఈ మూడు అంశాలన్ని ఎప్పుడూ బేరీజు వేసుకుంటాను. సచిన్‌లా నేనూ కమిట్మెంట్తో ఉన్నానా? ఆయనకు మల్లే దేశంకోసం నేనేదైనా చేయగలనా? అని ప్రతిక్షణం ఆలోచిస్తూఉంటాను. ఆ ఆలోచనలే నన్ను సివిల్స్ వైపు నడిపించాయి. ఐఏఎస్ ఆఫీసర్‌గా భవిష్యత్‌లో సాధించబోయే విజయాల్లో కూడా సచిన్ స్ఫూర్తి తప్పక వుంటుంది' అని సమాధానమిస్తోంది. సివిల్స్‌లో సత్తాచాటిన ఇబోబి ప్రొఫెషనల్ కథక్ డ్యాన్సర్ కూడా. కాలేజీలో, ఆతర్వాతా ఎన్నో ప్రదర్శనలిచ్చింది. తల్లి మీనల్ నర్వాణే ప్రఖ్యాత యశ్వాడా అకాడమీ డైరెక్టర్. తండ్రి సునీల్ నర్వాణే మర్చంట్ నేవీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె మేనమామ రాజీవ్ రణడే ఐఆర్ఎస్ ఆఫీసర్. తన విజయంలో సహోదరి నేహా కులకర్ణీ పాత్రకూడా ఉందటోంది ఇబోబి. -
కోట, ప్రకాష్‌రాజ్ పాత్రలే ఆదర్శం
విలక్షణ నటులు కోట శ్రీనివాస్‌రావు, ప్రకాష్‌రాజ్‌ల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని, వారి నటనే తనకు ఆదర్శమని సినీ ఆర్టిస్ట్ శ్రావణ్ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఆయన తమ సమీప బంధువుల గృహప్రవేశానికి శనివారం సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రావణ్ తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. -సిద్దిపేట అర్బన్ సాక్షి: ప్రస్తుతం మీరు ఎన్ని సినిమాలలో నటిస్తున్నారు. శ్రావణ్: ప్రస్తుతం నేను ఆరు సినిమాల్లో నటిస్తున్నాను. పండగ చేసుకో సినిమాలో హీరో రామ్‌కు మామయ్యగా, హీరో బాలకృష్ణ నటిస్తున్న లయన్ సినిమాలో ప్రకాష్ రాజ్‌కు తమ్ముడిగా నెగెటివ్ రోల్ పోషిస్తున్నాను. సాయికిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న అల్లరి నరేష్ సినిమా లో విలన్ పాత్ర, కొరటాల శివ డెరైక్షన్‌లో మహేష్‌బాబు నటిస్తున్న శ్రీమంతుడు సినిమాలో విలన్‌గా నటిస్తున్నా. తమిళంలో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వైశాలి హీరో ఆది సరసన సెకండ్ హీరో రోల్ చేస్తున్నాను. కన్నడంలో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సజ్జు చేస్తున్న సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. వైజాక్ డిస్ట్రిబ్యూటర్ రాజు తనయుడు కార్తిక్ ‘టిప్పు’ సినిమాలోనూ విలన్ పాత్ర పోషిస్తున్నాను. సాక్షి: మీరు నటించిన గోల్డెన్ ఛాన్స్ సినిమా విశేషాలు? శ్రావణ్: గోల్డెన్ ఛాన్స్ సినిమాలో హీరో హీరోయిన్ను, హీరోయిన్ హీరోను మైండ్‌గేమ్, మనిగేమ్ ఆడుతూ సినిమా ఆధ్యంతం ఆసక్తి కరంగా సాగుతుంది. సాక్షి: ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు..? శ్రావణ్: ఇప్పటి వరకు సుమారు 60కి పైగా సినిమాల్లో నటించాను. అందులో ఓ పది సినిమాల్లో పాజిటీవ్ రోల్స్ చేశాను. మిగితావన్ని నెగెటివ్ రోల్సే చేశాను. సాక్షి : మీకు గుర్తింపు, సంతృప్తినిచ్చిన పాత్రలు? శ్రావణ్ : నేను నటించిన తులసి, లెజెండ్, నమో వెంకటేష, బిందాస్, సై సినిమాలలో నటించిన పాత్రలు గుర్తింపు తేవడంతో పాటు సంతృప్తినిచ్చాయి. సైలో చోటు పాత్ర ఎంతో సంతృప్తిని కలిగించింది. సాక్షి : మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? శ్రావణ్ : అపరిచితుడు సినిమాలో విక్రమ్ చేసిన పాత్ర చేయాలని ఉంది. సాక్షి: విలన్ పాత్ర కోసం ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు..? శ్రావణ్ : కోట శ్రీనివాస్ స్ఫూర్తితో విలన్ పాత్రలు చేస్తున్నాను. ప్రస్తుతం ప్రకాష్‌రాజ్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళుతున్నాను. సాక్షి : హిందీలో ఏదైనా సినిమా చేశారా..? శ్రావణ్ : రాకేష్ శ్రావణ్ దర్శకత్వంలో హిందీలో అమావాస్య్ సినిమాను చేశాను. అందులో పోలీస్ అధికారి పాత్ర పోషించాను. తెలుగులో డెడ్ ఐస్‌గా రూపొందుతుంది. త్వరలోనే హిందీ, తెలుగులో రిలీజ్ కానుంది. సాక్షి: ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటి..? శ్రావణ్ : ప్రేక్షకులు సినిమాను వినోదంగా మాత్రమే చూడాలి. సమాజానికి పనికి వచ్చే సినిమాలను ఆదరించాలి. సినిమాలకు ప్రాంతీయ, భాష తారతమ్యం ఉండవని భావించాలి. -
పట్టుదలే ప్రేరణ: పేస్
చెన్నై: కెరీర్లో మరిన్ని శ్రేష్టమైన ఫలితాలు సాధించాలనే తపన, పట్టుదలే తనను ఆటలో కొనసాగేందుకు ప్రేరణగా నిలుస్తున్నాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. 41 ఏళ్ల వయస్సులోనూ చలాకీగా కదులుతూ అంతర్జాతీయస్థాయిలో మంచి విజయాలు సాధిస్తున్న ఈ కోల్‌కతా టెన్నిస్ స్టార్ జీవితంలో ప్రతి అంశంలో అత్యున్నతంగా నిలువాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు. కుమారుడిగా, దేశభక్తుడిగా, క్రీడాకారుడిగా, నాన్నగా ఇలా ప్రతి విభాగంలో అత్యుత్తమంగా ఉండాలనే పట్టుదలే మరింత పురోగతి సాధించేలా చేస్తోందన్నాడు. ‘కొన్ని ఆటంకాలు మన నియంత్రణలో ఉండవు. వేటినైతే మనం నియంత్రించగలమో వాటి గురించే స్పందించాలి. అనవసరంగా కుంగిపోయి, నిరాశవాదంతో ఉంటే సమస్యలు పరిష్కారం కావు. ఆఖరకు అన్నింటికి నా ఆటతీరే సమాధానం ఇస్తుంది. వెనుకంజ వేయడానికి కారణాలేమీ కనిపించడంలేదు’ అని ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్‌లో డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన పేస్ అన్నాడు. ‘నా జీవితంలో విమర్శకులకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వను. ఏదైతే నమ్ముతానో దాని కోసం పోరాడుతాను. ఎల్లప్పుడూ నిజంవైపే ఉంటాను. అయితే ప్రతికూలతలను ఎదుర్కొనే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’ అని ఇప్పటికే వరుసగా ఆరు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన పేస్ తెలిపాడు. ఒకప్పుడు భారత్ నుంచి ఒకరిద్దరు అంతర్జాతీయస్థాయిలో ఆడేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 15 నుంచి 20 వరకు చేరుకుందన్నాడు. ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తేనే ఫలితం ఉంటుందని అన్నాడు. -
గవర్నెన్స్... వయా ఆర్డినెన్స్
ప్రజాస్వామిక దేశంలో పాలనకి రాజమార్గం చట్ట సభల ద్వారానే ఉంటుంది. ఆర్డినెన్స్ మార్గం అన్నది అత్యవసరానికి ఉద్దేశించినది. చట్టసభలు నిర్వహించే అవకాశం లేనప్పుడు చేబట్టిన విషయం దేశానికి అత్యవసరమైనప్పుడు తాత్కాలిక ఉపశమన ఏర్పాటుగా ప్రభు త్వానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఆ స్ఫూర్తితోనే ప్రభు త్వం ఆర్డినెన్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అది అరుదైన వ్యవహారంగానే తప్ప అలవాటైన వ్యవహా రంగా ఉండరాదు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా జీవనంపై తీవ్రప్రభావం చూడగల ము ఖ్య నిర్ణయాల్ని ఆర్డినెన్స్ మార్గంలో తీసుకురావడం దురదృష్టకరం. ఈ మధ్యనే పార్లమెంటు సమావేశాలు ముగిసి, మళ్లీ రెండు నెలల వ్యవధిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న తరుణంలో ఈ రకమైన చర్య ప్రజాస్వామిక సంప్రదాయాల్ని అగౌరవపరచడమే. పైగా బొగ్గు గనుల కేటాయింపులు అంశం మినహా భూసేకరణ చట్టం గానీ బీమా సవరణల చట్టం గానీ ప్రజాజీవనంపై తీవ్ర ప్రభావం చూపేవి. చట్ట సభల ద్వారా విస్తృత చర్చ జరగా ల్సినవి. ఈ తరహా చర్యల్ని ప్రభుత్వం మానుకొని, రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టసభల గౌరవాన్ని నిలపడం ద్వారానే ప్రజానీకానికి మేలు చేయడం సాధ్యం. - డా॥డి.వి.జిశంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం -
వైఎస్ స్ఫూర్తిగా పేదలకు సాయపడాలి
ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకొని రెడ్డి సామాజికవర్గం ముందుకుసాగాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సూచించారు. ఉండవల్లి కరకట్ట వద్ద గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో ఆదివారం కొండవీడు అకాడమీ రెడ్డి సామాజికవర్గం ఆధ్వర్యంలో వనసమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్యెల్యే ఆర్కే మాట్లాడుతూ డాక్టర్ వైఎస్‌ను స్ఫూర్తిగా తీసుకుని పేదప్రజలకు సహాయపడాలని సూచించారు. వైఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే నేటికీ ప్రజలకు ఎంతగానోల మేలు చేస్తున్నాయని కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినా నేటికీ ప్రజల గుండెల్లో జీవిం చి ఉండడానికి కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇవ్వడమే కారణమని ఆర్కే పేర్కొన్నారు. స్వదేశంలోనేకాక విదేశాల్లో ఉన్న రెడ్డి సామాజికవర్గం సైతం పేద ప్రజల అభ్యున్నతిలో భాగస్వాములు కావాలని కోరారు. వైఎస్నుఆదర్శంగా తీసుకుని తాను ప్రజా సేవచేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆర్కే తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబిం బిస్తూ పంచికట్టుతో పెద్దాయన ఆనే పలకరింపుతో ప్రజల్లో ఒకరిగా జీవిం చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమంటూ అన్నదాతలకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఆ మహానేత స్పూర్తిగా రెడ్డి సామాజికవర్గం విస్కృతంగా సమాజసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొండవీడు అకాడమీకి విరాళాలు అందించిన వారికి ఎమ్మెల్యే ఆర్కే చేతుల మీదుగా సన్మానం చేశారు. కార్యక్రమంలో అఖిల భారతరెడ్డి సామాజికవర్గ సంఘ అధ్యక్షులు వీరారెడ్డి, మానం వెంకటరెడ్డి, కాకతీయ అకాడమీ అధ్యక్షుడు బోయపాటి సుబ్బారెడ్డి, తాడేపల్లి మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనాథ బాలలకు ఆశాకిరణం
స్ఫూర్తి ఊరు కాని ఊరు... రాష్ట్రం కాని రాష్ర్టంలో రోడ్డు పక్కన ఉండే అనాథ పిల్లల ఆక్రందనలు ఆమెను కదిలించాయి. ఓ మంచి కార్యానికి సంసిద్ధురాలిని చేశాయి. తను, తన కుటుంబం మాత్రం బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో అనాథలను, వీధిబాలలను ఆదుకోవడానికి ఆమె దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకూ ఈమె ఎవరో, ఈమె చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలు ఎక్కడో చూద్దామా..! ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వాణి, హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ భార్యాభర్తలు. ఉద్యోగరీత్యా వీరిద్దరూ ముంబాయిలో నివసిస్తున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లాక, ఇంట్లో ఒంటరిగా ఉండలేక వాణి ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. ఆమె ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లే క్రమంలో దారిలో ఎందరో అనాథలు, వీధిబాలలు దయనీయమైన స్థితుల్లో తిరగాడుతుండటాన్ని చూసి చలించిపోయింది. వారికోసం ఏదైనా చేయాలనుకుంది. తన ఆలోచనను స్నేహితులతో పంచుకుంది. బెంగాల్‌కు చెందిన దేవాంజలి ఆమెకు తోడ్పాటును అందించేందుకు సిద్ధమైంది. వీరికి మరికొందరు స్నేహితులు జత కలిశారు. మొదట్లో వీరందరూ కలిసి దుప్పట్లు, దుస్తులు కొనుగోలు చేసి అనాథలకు అందించేవారు. వివిధ ఆశ్రమాల్లో ఉండేవారికి, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి దుస్తులు, పండ్లు పంపిణీ చేసేవారు. ఇదే సమయంలో వీధిబాలలు చాలామంది ఆకలితో అలమటిస్తుండటాన్ని వీరు గుర్తించారు. దాంతో ఇంటి వద్దనే వండిన ఆహారాన్ని తీసుకెళ్లి మురికివాడల్లో నివసించే పిల్లలకు తినిపించటంతో బాటు వారికి పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా అందిస్తున్నారు. వీరి సేవా కార్యక్రమాలను చూసిన పలువురు తమవంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. దాంతో 75 మంది పిల్లలకు చదువుతోపాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరు ‘ఆశాకిరణ్’ పేరుతో ఒక పాఠశాలను, ఒక ఉచిత ఉపశమన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో పిల్లలకు విద్య మాత్రమే కాకుండా చిత్రలేఖనం, వృత్తి విద్య, నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. అతి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఆశాకిరణ్’ ఇప్పుడు ఇక్కడి చిరునామాలలో ల్యాండ్ మార్క్‌గా మారడం విశేషం. పేరుకు తగ్గట్టే మురికి వాడలలోని వారికి వీరి పాఠశాల ‘ఆశాకిరణం’లా వెలుగునిస్తోంది. మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, సేవాభావం, దానిని నెరవేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే, ఎక్కడైనా, ఎంతైనా చేయవచ్చనడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి! - కొమ్మినేని వెంకటేశ్వర్లు, సాక్షి, ఖమ్మం ఆసరా ఇస్తే ఖమ్మంలోనూ పాఠశాల ప్రారంభించాలని ఉంది! ‘నేను చేస్తున్న సేవలకు పలువురు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో పాఠశాల నిర్వహిస్తున్నాను. అయితే మా సొంత పట్టణమైన ఖమ్మంలో కూడా అనాథలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది. దాతలు ముందుకొస్తే అక్కడ కూడా అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని ఉంది’ - వాణి -
ప్రధాని స్ఫూర్తితో ముందుకు
బోడుప్పల్: ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్దామని గోవాగర్నర్ మృదుల సిన్హా పేర్కొన్నారు. మేడిపల్లిలోని మేకల బాల్‌రెడ్డి పంక్షన్ హాల్లో గురువారం జరిగిన సాధీ సౌత్ రీజనల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రం, ఆరోగ్యం, అభివృద్ధిలో మిగతా దేశాలకు దీటుగా నిలవాలన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచ దేశాలు భారత దేశాన్ని ఆదర్శంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ సాధీ నెట్ వర్క్ సేవలు మరింత విస్తరించాలని ఆయన సూచించారు. చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి, తెలంగాణ కోఆర్డినేటర్ శాడకొండ శ్రీకాంత్‌రెడ్డి, జహీదబేగంతో పాలు పలువురికి సాధీ సేవా పురస్కార అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాధీ సౌత్ ఇన్చార్జ్ మంకన శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ ఆర్బి సిన్హా, సాధీ నెట్ వర్క్ స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు మోహినిగార్గ్, ఏపీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మల్లారెడ్డి, కర్ణాటక ఇన్చార్జ్ కరుణాకర్, సింగరేస్ కాలరీస్ డెరైక్టర్ విజయకుమార్, శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ అలోక్
స్ఫూర్తి కొందరు విజయం సాధించడానికి జీవితమంతా పోరాడుతూనే ఉంటారు. కానీ కొందరు విజయం సాధించడం కోసమే పుడతారు. అలోక్శెట్టి ఈ రెండో కోవకు చెందినవారు. ఆయన ఏదైనా అనుకోవడానికి వెనుక ముఖ్యమైన కారణం ఉంటుంది. అనుకున్నది సాధించడం వెనుక అలుపెరుగని కృషి ఉంటుంది. అదే ఆయనను ఇరవై ఎనిమిదేళ్లకే తిరుగులేని విజేతను చేసింది. ఇటీవలే టైమ్స్ వారు ఎంపిక చేసిన ఆరుగురు ‘నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్’లో ఒకరిగా నిలిచిన అలోక్ ప్రస్థానం, ఎంతో ఆసక్తికరం... రెండు దశాబ్దాల క్రితం... బెంగళూరులోని ఓ సైట్లో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అంతలో ఒకాయన తన కొడుకును తీసుకుని వచ్చారు. తను పని చేసుకుంటుంటే, పిల్లాడు ఆడుకుంటాడులే అనుకున్నారాయన. కానీ ఆ అబ్బాయి ఆడుకోలేదు. అక్కడ జరిగే ప్రతి పనినీ గమనించాడు. అప్పుడే కాదు... తన తండ్రితో కన్స్ట్రక్షన్ సైటుకి వెళ్లిన ప్రతిసారీ ఆ బుడతడి కళ్లు అన్నిటినీ నిశితంగా పరిశీలించేవి. అక్కడ చెక్కముక్కలు, ఇనుపరేకులు, విరిగిన ఇటుకలు పడి వుండటం చూసి, అవన్నీ అలా వృథా అయిపోవాల్సిందేనా అనుకునేవాడు. ఆ ఆలోచనే నిర్మాణ రంగంలో సరికొత్త విధానాలకు తెర తీసేందుకు అతణ్ని ప్రోత్సహించింది. వ్యర్థాలతో సైతం నిర్మా ణాలు జరిపేందుకు పురికొల్పింది. అంతే కాదు... నిర్మాణ కూలీల అగచాట్లను చూసి ఆ పసిమనసు కదిలిపోయింది. తల దాచుకోవడానికి సరయిన చోటు కూడా లేక, పని జరిగేచోటే పాలిథీన్ షీట్లతో, గోనెలతో గుడిసెలు వేసుకునే వారి దీనస్థితి, పెద్దయిన తర్వాత పదిమంది గురించీ ఆలోచించేలా చేసింది. ఇవాళ ప్రపంచం ముందు అతణ్ని హీరోగా నిలబెట్టింది. ప్రతి అడుగూ వినూత్నమే... అందరూ చేసే పని అయినా, దాన్ని కొత్త తరహాలో చేయడమే తన శైలి అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించాడు అలోక్. ఈజిప్టు నాగరికతను పరిశీలిస్తే... ఇళ్లన్నీ రాళ్లతో నిర్మితమై ఉంటాయి. ఎందుకంటే, వారికి రాయి విరివిగా దొరికేది. మెసపొటేమియా నాగరికతా కాలంలో ఇటుకలతో నిర్మాణం కావించేవారు. ఎందుకంటే, వారికి మన్ను బాగా దొరికేది. కానీ ఈ కాలంలో ఇళ్లను నిర్మించాలంటే ఎక్కువగా లభించేది ఏంటి? ఈ ప్రశ్నకు అలోక్ చెప్పే సమాధానం చాలా షాకింగ్‌గా ఉంటుంది. ఇంతకీ ఆ సమాధానం ఏమిటో తెలుసా... చెత్త. అవును. అలోక్ అదే చెబుతాడు. ఆయా నాగరికతల కాలంలో దొరికేది వాళ్లు వాడినప్పుడు, మన కాలంలో దొరికేది మనం వాడాలి కదా అంటాడు నవ్వుతూ. మన దేశంలో ఎక్కడ చూసినా కనిపించేది చెత్తే, దానివల్ల కాలుష్యం పెరుగుతుంది, వ్యాధులు ప్రబలుతాయి. పోనీ దాన్ని ఏరి పారేద్దామా అంటే అందుకు కొన్ని కోట్లు ఖర్చవుతాయి. అందుకే చెత్తను రూపుమాపడానికి దాన్ని తన పనికి ముడి సరుకుగా చేసుకున్న మేధావి అలోక్. రీసైక్లింగ్ వస్తువులతో పాటు స్థానికంగా దొరికే కలప, వెదురు వంటి వాటితో అతడు నిర్మించిన ఇళ్లను చూస్తే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. అయితే ఇంత సృజనాత్మకత అతడికి అనుభవంతో రాలేదు. అలోక్ సహజంగానే సృజనశీలి. లేదంటే, పంతొమ్మిదేళ్ల వయసులోనే ఓ ఆసుపత్రిని డిజైన్ ఎలా చేయగలుగుతాడు?! బెంగళూరులోని ఆర్వీ కాలేజీలో ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు... ఓ కాంపిటీషన్ కోసం హాస్పిటల్ నమూనాను రూపొందించాడు అలోక్. మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. అది చూసిన ఓ వ్యాపారవేత్త... తాను జైపూర్‌లో నిర్మించాలనుకున్న హాస్పిటల్ని డిజైన్ చేయమని అడిగారు. ఆ వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అతడు పెద్ద కసరత్తే చేశాడు. పలువురు డాక్టర్లు, నర్సులను కలిశాడు. హాస్పిటల్ ఎలా ఉండాలనుకుంటారు అంటూ వాళ్ల ఆలోచనలను తెలుసుకున్నాడు. పలు ఆసుపత్రుల్లోని పేషెంట్లను కలిసి, మీకు హాస్పిటల్ ఎలా ఉంటే ఇష్టం అనడిగాడు. అందరి అభిప్రాయాలనూ తరచి చూసి, మంచి హాస్పిటల్ అంటే ఎలా ఉండాలో నిర్ణయించుకుని, అలా డిజైన్ చేశాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. మనసుతో చేస్తాడు... ఓ ఇంటిని నిర్మించడమంటే... ఇటుకలు పేర్చి, సిమెంటు రాసి, పైకప్పు పరచడం కాదు అలోక్‌కి. అది చాలా గొప్ప పని అంటాడు. ముఖ్యంగా పేదవారికి ఓ ఇల్లు కట్టేటప్పుడు తను పొందే ఆనందం అంతా ఇంతా కాదంటాడు. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి వచ్చాక, డబ్బు ఎలా సంపాదిద్దాం అని ఆలోచించలేదు అలోక్. తన ప్రతిభను దేశానికి, తనవారికి ఎలా ఉపయోగించాలా అని ఆలోచించాడు. పూరి గుడిసెలు చూసినప్పుడల్లా మథన పడేవాడు. వాన గట్టిగా కురిస్తే ఎగిరిపోయే టార్పాలిన్ పైకప్పులు, వరద నీటి ప్రవాహంలో కరిగి కలిసిపోయే మట్టి గోడలు చూసి... వారి కోసం తానేం చేయగలనా అని ఆలోచించాడు. వానకూ వరదకూ చెక్కు చెదరని ఇళ్లకు రూపకల్పన చేశాడు. వెదురు, కలపల సహాయంతో అతడు నిర్మించే ఆ ఇళ్లు చాలా తేలికగా ఉంటాయి. తుపాను, వరదల సమయంలో వేరే చోటికి కూడా తరలించేసుకోవచ్చు. కొన్ని ఇళ్లయితే డిస్‌మ్యాండిల్ చేసి మళ్లీ అతికించుకోవచ్చు. వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కేవలం పద్దెనిమిది వేల రూపాయలు. అందుకే అంటాడు అలోక్... ‘ఒక ధనవంతుడు సెల్‌ఫోన్ కొనుక్కోవడానికి వెచ్చించే సొమ్ముతో పేదవాడికి ప్రశాంతమైన నివాసాన్ని ఏర్పరచవచ్చు’ అని! ఇంకా నిర్మాణ రంగంలో అతడు చేసిన ప్రయోగాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ఓడల మీద సరుకులను రవాణా చేసే భారీ కంటెయినర్లను రెండు వందలకు మంది పైగా కూర్చోగల ఆడిటోరియమ్స్గా మార్చి చూపించాడు. భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో... వ్యర్థాలతో తయారుచేసిన తేలికైన ఇటుకలతో ఇళ్లు నిర్మించాడు. అవి కూలినా ఆస్తి నష్టం, ప్రాణనష్టం ఉండదు. ఇలా అతడు నిర్మాణరంగంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి కాకముందే తాను నెలకొల్పిన ‘భూమిపుత్ర’ అనే నిర్మాణ సంస్థ ద్వారా తన ఆశయాలను నెరవేర్చుకుంటున్నాడు. మరో పదిమంది ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్స్ సాయంతో దేశవ్యాప్తంతో ఎన్నో భారీ నిర్మాణాలను పూర్తి చేశాడు. అయితే వాటికంటే ఎక్కువ ఆనందం... పేదవారికి గూడు ఏర్పరచినప్పుడే కలుగుతోందని చెప్పే అలోక్ ఆదర్శనీయుడు, అనితరసాధ్యుడు! - సమీర నేలపూడి కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే మా నాన్నను చూసి నేను కూడా నిర్మాణ రంగంలోనే స్థిరపడాలనుకున్నాను. డబ్బు సంపాదించడానికి కాక సమాజానికి ఉపయోగపడే ఆర్కిటెక్టును కావాలను కున్నాను. అలా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాను. అందుకే నేను చేసేదాన్ని ఆర్కిటెక్చర్ అనను. ప్రాబ్లెమ్ సాల్వింగ్ అంటాను. తన భూమిపుత్ర సంస్థ ద్వారా స్కాలర్షిప్ను ఏర్పాటు చేసి, ఎంతోమంది పేద చిన్నారులకు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు అలోక్. బెంగళూరులోని ‘పరిణామ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు అలోక్. తీరిక దొరికితే వెళ్లి చేయడం కాదు... సేవ కోసం తీరిక చేసుకుంటాడు. ‘స్లమ్ డెవెలప్మెంట్ ప్రాజెక్ట్’ ద్వారా వారంలో ఒకరోజు తన టీమ్‌తో కలిసి మురికివాడల్లోని వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే పనిలోనే ఉంటాడు. నిర్మాణాన్ని నిలబెట్టేందుకు ఉపయోగించే బొంగులు, నిర్మాణ సమయంలో మిగిలిపోయే వస్తు వుల్ని సేకరించి, వాటిని పేదవారి ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తుంటాడు. -
అమ్మకు అమ్మయ్యాడు!
స్ఫూర్తి ప్రేమను పంచడానికి మనిషితో సంబంధం లేదు. పంచే హృదయముంటే చాలు. మంచి చేయడానికి వయసుతో సంబంధం లేదు. చేసే మనసుంటే చాలు. అవి ఉన్నాయి కాబట్టే జాస్పర్ పాల్ తక్షణం స్పందించాడు. ఏ సంబంధమూ లేని ఓ వృద్ధురాలి కోసం ఊరంతా పరుగులు తీశాడు. కనీసం పరిచయమైనా లేని ఆమెను కాపాడేందుకు అంతగా తపనపడ్డాడు. మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచాడు!బీటెక్ చదువుతున్న ఓ కుర్రాడి స్ఫూర్తిదాయక కథనమిది... రెండు రోజుల క్రితం... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర నడచుకుంటూ వెళ్తున్నాడు జాస్పర్ పాల్ (19). చుట్టూ చూసుకుంటూ చురుగ్గా అడుగులు వేస్తున్నాడు. ఉన్నట్టుండి అతడి కాళ్లకు బ్రేక్ పడింది. వెళ్తోన్నవాడల్లా ఆగి చూశాడు. రోడ్డు పక్కన.. ఫుట్‌పాత్ మీద.. ఓ వృద్ధురాలు పడుకుని ఉంది. డెబ్భై యేళ్ల వరకూ ఉంటుంది వయసు. తల నెరిసిపోయింది. చర్మం ముడతలు పడింది. లేచి కూర్చునే సత్తువ కూడా లేదు. అందరూ ఆమెను చూసీ చూడనట్టే వెళ్లిపోతున్నారు తప్ప కనీసం పలకరించట్లేదు. చాలా బాధేసింది జాస్పర్‌కి. తానైనా ఆమెకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దగ్గరికెళ్లి ఏం కావాలని అడిగాడు. అప్పుడు తెలిసిన విషయం అతడి మనసును చలింపజేసింది. ఆమె పేరు పద్మావతి. ముగ్గురు పిల్లలను కని, పెంచింది కానీ వాళ్ల ప్రేమను పంచుకోలేకపోయింది. అనాదరణకు గురై రోడ్డున పడింది. అప్పటికి ఐదు రోజుల క్రితం ఆమెను ఓ వాహనం గుద్దేసింది. ఆ క్షణం నుంచీ... రాత్రనకా పగలనకా... ఎండలోను, వానలోను అలానే పడివుంది. కుడిచేతికి పెద్ద గాయముంది. సెప్టిక్ అయ్యిందనడానికి గుర్తుగా ఆ గాయం నిండా పురుగులు! చూడగానే అదోలా అయిపోయింది జాస్పర్ మనసు. కానీ అది ఒక్క క్షణమే. మరుక్షణమే అతడు దృఢంగా నిశ్చయించుకున్నాడు... ఆమెను కాపాడి తీరాలని! చుట్టూ చాలామంది మూగారు. కానీ ఎవ్వరిలోనూ చలనం లేదు. కోపం ముంచుకొచ్చింది జాస్పర్‌కి. ‘అయితే సాయం చేయండి, లేదంటే ఇక్కడ్నుంచి వెళ్లిపోండి’ అంటూ అరిచాడు. అప్పుడైనా వాళ్లు ముందుకు రాలేదు... ఒక్క కుర్రాడు తప్ప. అతడి పేరు రాహుల్ పసుపాల. ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ విద్యార్థి. అతడొక్కడే జాస్పర్‌కి తోడుగా నిలిచాడు. ఇద్దరూ అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కాఫీ తెచ్చి ఆమెకు తాగించారు. అంతలో అంబులెన్స్ వచ్చింది. అడుగడుగునా నిర్లక్ష్యమే... ఈ అస్తవ్యస్త వ్యవస్థలో మనుషులు యంత్రాల్లా పని చేస్తారు తప్ప, మనసుతో పని చేయరని తెలుసుకునే సమయం వచ్చింది జాస్పర్‌కి. పద్మావతిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నిరాకరించారు అంబులెన్స్‌వారు. ఆమె ఎవరో తెలియకుండా ఎలా తీసుకెళ్తాం అన్నారు. కష్టాల్లో ఉన్న మనిషికి సాయపడటానికి వివరాలు కావాల్సి వచ్చాయి వారికి. విధిలేక గోపాలపురం పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేశాడు జాస్పర్. ప్రాణాల కంటే ప్రొటోకాల్ ముఖ్యమన్నట్టు... ముందు జాస్పర్ని పోలీస్ స్టేషన్‌కి రమ్మన్నారు వాళ్లు. దాంతో అక్కడికి పరుగు తీశాడు. ఎలాగైతేనేం... కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి, రాహుల్‌ల సాయంతో పద్మావతిని గాంధీ ఆసుపత్రికి చేర్చాడు. కానీ ఆమెను లోనికి తీసుకెళ్లడానికి వార్డ్‌బోయ్స్ కూడా లేకపోవడంతో వాళ్లే స్ట్రెచర్ మీద వేసి తీసుకెళ్లారు. డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు కానీ వైద్యం చేయడానికి ఉపక్రమించలేదు. మాకిలాంటి కేసులు రోజూ వందల్లో వస్తాయి, అందరికీ సేవ చేస్తూ కూర్చునే సమయం లేదన్నారు. గాయాన్ని శుభ్రం చేయమని వాళ్లకే చెప్పారు. దాంతో ఆ ఇద్దరూ అందుకు పూనుకున్నారు. టర్పైంటైన్ ఆయిల్ వేస్తుంటే గాయంలోని పురుగులు పైకి రాసాగాయి. అయినా అసహ్యించుకోలేదు. ఇయర్ బడ్స్‌ను ఉపయోగించి దాదాపు ముప్ఫై పురుగులను తీశారు. అప్పటికి కానీ వైద్యులు చికిత్స చేయలేదు. నీడ కూడా కల్పించి.... పద్మావతి చేతికి కట్టిన కట్టును చూసి ఊపిరి పీల్చుకున్నాడు జాస్పర్. కానీ మరో సమస్య తలెత్తింది. చీకటి పడుతోంది. తిరిగి వెళ్లాలి. కానీ పద్మావతిని ఎక్కడ ఉంచాలి? ఆసుపత్రి యాజమాన్యం దగ్గరకు వెళ్లారు. ఆ ఒక్కరాత్రికీ ఆమెను అక్కడ ఉండనివ్వమన్నారు. కానీ తమ హృదయ కాఠిన్యాన్ని మరోసారి చాటుకున్నారు ఆసుపత్రివారు. ముక్కూముఖం తెలియనివాళ్లకు చోటివ్వలేం, ఆమె తరఫువాళ్లెవరైనా ఉండాలన్నారు. ‘మీరే తీసుకొచ్చారుగా, మీరే చూసుకోవచ్చుగా’ అంటూ ఎగతాళి చేశారు. అంత నిర్దయగా ప్రవర్తిస్తున్న వాళ్లను చూసి కడుపు మండిపోయింది జాస్పర్‌కి. కానీ తప్పని పరిస్థితి. మూడు గంటల పాటు తంటాలు పడి, చివరకు పోలీసులతో చెప్పించి అనుమతి సంపాదించాడు. ఓ దుప్పటి, కొన్ని మంచినీళ్ల బాటిళ్లు పద్మావతికి ఇచ్చి, రాహుల్‌ని తీసుకుని వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా పద్మావతి గురించే ఆలోచించాడు. అంతలో అతడికి జార్జ్ రాకేష్‌బాబు గురించి తెలిసింది. జీడిమెట్లలో వృద్ధుల కోసం ‘గుడ్ సమారిటన్ హోమ్’ను నడుపుతున్నారు జార్జ్. ఆయ నను కాంటాక్ట్ చేసి, పద్మావతి విషయం చెప్పాడు. జార్జ్ ఆమెకు సాయపడేందుకు ముందుకు రావడంతో పద్మావతిని ఆ సంస్థలో చేర్పించాడు. ఈ అనుభవం గురించి అడిగితే ‘‘నేనేదో గొప్ప పని చేశానని అనుకోవడం లేదు’’ అంటాడు జాస్పర్. ‘‘పద్మావతిగారు కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘నాకెవ్వరూ వద్దు, నువ్వుంటే చాలు. నన్ను నీతో తీసుకెళ్లిపో, నీ దగ్గరే ఉంటాను’ అని ఆవిడ అంటుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి’’ అంటాడు చెమ్మగిల్లిన కళ్లతో. వయసు చిన్నదే అయినా అతడి మనసు ఎంత గొప్పదో చెప్పడానికి... ఆ కంటిచెమ్మ చాలు! - సమీర నేలపూడి ‘‘పద్మావతిగారి పరిస్థితి చూసి ఎంత బాధ కలిగిందో... ఆవిడ విషయంలో అంబులెన్స్‌వారు, హాస్పిటల్ వాళ్లు ప్రవర్తించిన తీరు అంతకంటే ఎక్కువ బాధ కలిగించింది. వాళ్లు అలా ప్రవర్తిస్తారని అస్సలు ఊహించలేదు. దేవుడి దయవల్ల ఆవిడకు ఏమీ కాలేదు. ఇప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. నాకు సహకరించిన రాహుల్‌కి, జార్జ్ గారికి థ్యాంక్స్.’’ -
మర్ధానీ చిత్రం చూసి పాఠాలు నేర్చుకోండి!
పాట్నా: బాలీవుడ్ తార రాణీ ముఖర్జీ నటించిన మర్ధానీ చిత్రం బీహార్ పోలీసులకు స్పూర్తిగా నిలిచింది. ఇటీవల విడుదలైన మర్దానీ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. పోలీసులందరూ మర్ధానీ చిత్రం చూసి పాఠాలు నేర్చుకునేందుకు ఆ చిత్ర ప్రదర్శను బీహార్ లోని అన్ని జిల్లాల ఎస్పీలు, జీఆర్పీ ఎస్పీలు, బీహార్ మిలటరీ పోలీసు కమాండెంట్స్ లకు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర సీఐడీ ఐజీ అరవింద్ పాండే ఆదేశించారు. మర్ధానీ చిత్రం మహిళల అక్రమ రవాణా కథాంశంతో రూపొందించింది. మహిళల అక్రమ తరలింపు ప్రపంచవ్యాప్తంగా కీలక సమస్య మారింది. అవయవ, మహిళల, పసిపాపల అమ్మకాలు లాంటి నేరాలు పెరిగిపోతున్నాయి అని అరవింద్ పాండే ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలను చక్కగా తెరకెక్కించిన మర్ధానీ చిత్రాన్ని చూసి పోలీసులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
త్యాగధనుల స్ఫూర్తితో బాక్సయిట్ ఉద్యమం
టీడీపీ ప్రభుత్వ కుట్రను అడ్డుకుందాం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పాడేరు: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యా గం చేసిన ఎందరో మహానుభావుల స్పూర్తితో ఏజెన్సీలోని బాక్సయిట్ సంపదను కాపాడుకునేందుకు భారీ ఉద్యమాన్ని చేపడతానని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చెప్పా రు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ దేశాన్ని ఆంగ్లేయులు వదిలి వెళ్లినా ప్రస్తుత పాలకులు, అధికారులు గిరిజనుల సంపదను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గనులను దోచుకునేందుకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గిరిజనులంతా అడ్డుకోవాలన్నారు. బాక్సయిట్‌ను వెలికి తీస్తే గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఖనిజాలతో సహా ప్రకృతి సంపద కూడా నాశనమవుతుందని, తాగునీటి వనరుల్లేక దుర్భర జీవితం సాగించాల్సిన పరిస్థితి దాపురిస్తుందన్నారు. బాక్సయిట్ వెలికితీత వల్ల అడవులన్నీ సర్వనాశనమై గిరిజనులు జీవించే పరిస్థితి కూడా ఉండదన్నారు. గిరిజనుల జీవించే హక్కును హరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన దుయ్యబట్టారు. బాక్సయిట్‌ను వ్యతిరేకిస్తూ తాను చేపట్టే మహోన్నత ఉద్యమానికి అన్ని వర్గాల గిరిజనులు, రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు కుట్రలను తిప్పికొట్టాలన్నారు. -
స్ఫూర్తినిచ్చే సినిమాలు చూశారా..
ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, నిలదొక్కుకోవడం అన్నది అంత సులువైన వ్యవహారం కాదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కుంగిపోకుండా పోరాడితేనే విజయం సాధ్యమవుతుంది. ఇందుకోసం స్ఫూర్తినిచ్చేవి చిత్రాలు అనేకం ఉన్నాయి. అలా ఎంట్రప్రెన్యూర్లు చూడతగ్గ ఆస్కార్ అవార్డు స్థాయి హాలీవుడ్ చిత్రాల్లో కొన్ని.. మనీబాల్ వనరులు లేక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బేస్‌బాల్ టీమ్‌ను మళ్లీ పైకి తీసుకొచ్చేందుకు మేనేజర్ (బ్రాడ్ పిట్) చేసిన ప్రయత్నాలు దీని కథాంశం. సాధారణంగా చిన్న వ్యాపారాలు చేసే వారికి అనేక పరిమితులు ఉంటాయి. అలాం టప్పుడు అందుబాటులో ఉన్న స్వల్ప నిధులను, వనరులను సమర్ధంగా ఎలా వినియోగించుకోవచ్చనేది తెలుసుకోవచ్చు. ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అమెరికన్ ఇన్వెస్టర్ క్రిస్టొఫర్ గార్డ్నర్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం ఇది. నిలువ నీడ లేని పరిస్థితుల నుంచి గార్డ్నర్ కోటీశ్వరుడిగా ఎదిగారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ.. లక్ష్యంపై గురి తప్పకూడదని, కష్టాలను ఓర్చుకుంటే అంతిమంగా విజయాన్ని దక్కించుకోవచ్చన్నది ఈ చిత్రం చెప్పే సారాంశం. పైరేట్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థల సృష్టికర్తల బయోగ్రఫీలాంటి చిత్రం ఇది. రెండు కంపెనీల తొలినాళ్ల పరిస్థితులను పోల్చి చూపుతుంది. దీన్ని ఎందుకు చూడొచ్చంటే.. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్.. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రోల్ మోడల్స్ లాంటి వాళ్లు. వారిద్దరూ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు, విజయాలు సాధించారు, టెక్నాలజీ ప్రపంచానికి ఎలా ఆద్యులయ్యారనేది తెలుసుకోవచ్చు. ఫ్లాష్ ఆఫ్ జీనియస్ ఒక ఆటోమొబైల్ ఆవిష్కర్త.. కొత్త ఉత్పత్తిని రూపొందిస్తాడు. ఆటోమొబైల్ రంగంలో అది సంచలనంగా మారినా క్రెడిట్ మాత్రం అతనికి దక్కదు. దీంతో గుర్తింపు, మేథోహక్కుల కోసం అతను పెద్ద కంపెనీలతో పోరాడాల్సి వస్తుంది. ఐడియా మనదే అయినా వాటిని కాపీ కొట్టేసి తమదని చెప్పుకునే పోటీ సంస్థలు చాలా ఉంటాయి. కాబట్టి మన ఐడియాలు చోరీకి కాకుండా చూసుకోవాల్సిన అవసరం గురించి ఇది చెబుతుంది. -
శాంతి యాత్రికుడు
చదువుతున్నది ఇంజనీరింగ్... మధ్యలోనే బ్రేక్... ఆధ్యాత్మిక ఆలోచనలతో ఏదో అన్వేషణ... నాలుగైదేళ్ల పాటు దేశం నలుమూలలా పర్యటన... ఆ పర్యటన ఆ కుర్రాడి జీవితాన్నే మార్చేసింది. ప్రజల మధ్య అసహనం, కోపతాపాలు... ఇవన్నీ ప్రయాణంలో గమనించిన బెంగళూరు కుర్రాడు అనిల్ ఆలోచనలో పడ్డాడు. ‘శాంతి భావన’ చిన్నబోవడాన్ని చూసి బాధపడడం కంటే ‘బాధ్యత’ను తలకెతు ్తకోవడం కనీస బాధ్యత అనుకున్నాడు. అంతే... ‘పీస్ ప్రాజెక్ట్’ ప్రారంభించాడు. ఇరవై ఏడేళ్ళ వయసులో శాంతి యాత్రికుడయ్యాడు... కర్ణాటకలోని ఉడిపి దగ్గరల్లో ఉన్న కుందాపుర గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్శెట్టి కళాశాల వరకూ స్థానికంగానే చదివారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్య కళాశాలలో చేరారు. అప్పటి నుంచి ‘భగవద్గీత’ చదవడం అలవాటు చేసుకున్నారు. అనిల్ ఆలోచన విధానాన్ని భగవద్గీత మార్చింది. ఆధ్యాత్మిక జీవనంపై ఆసక్తిని పెంచింది. ఏడాదిన్నర ఇంజనీరింగ్ కోర్సు తర్వాత చదువును మధ్యలోనే ఆపేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు అనిల్. మొదట్లో తల్లిదండ్రులు వారించినా తర్వాత మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో దాదాపు నాలుగైదేళ్ల పాటు దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు అనిల్. ప్రజల మధ్య సఖ్యత లోపించడాన్ని, ద్వేషం పెరగడాన్ని ఈ ప్రయాణంలో గమనించారు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య శాంతిని పెంపొందింపజేయడమే లక్ష్యంగా 2012 చివర్లో ‘ద వరల్డ్ పీస్ కీపర్స్ మూమెంట్’ను స్థాపించారు. ఇందులో భాగంగా ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడం, శాంతియుతంగా మెలగడం తదితర విషయాలపై సెమినార్లు, వర్క్‌షాపులు నడుపుతున్నారు. అంతేకాదు... ప్రజల వద్దకే ‘ది వరల్డ్ పీస్ కీపర్స్ మూమెంట్’ను తీసుకువెళ్లాలని భావించి ‘పీస్ ఆటో’ ప్రాజెక్టుకు 2013లో శ్రీకారం చుట్టారు. ఆటో గ్రంథాలయం... ఆటోలో ప్రయాణికులకు కుడివైపున అరలున్న చిన్నపాటి అల్మరా ఉంటుంది. ఇందులో ఆరోజు వార్తాపత్రికతోపాటు మ్యాగజైన్లు, శాంతిని బోధించే పుస్తకాలతో పాటు అనిల్శెట్టి రాసిన ‘మేకింగ్ ఆఫ్ ఐ’ పుస్తకం ఉంటుంది. చిన్నచిన్న కారణాలకే రోడ్లపై గొడవలు ఎలా జరుగుతున్నాయి, ఆ సమయంలో మనం ప్రవర్తించే విధానం వ్యక్తిగత ప్రతిష్ఠను ఎలా దెబ్బ తీస్తుంది... మొదలైన విషయాలు ఈ పుస్తకంలో చిన్నచిన్న కథల రూపంలో ఉంటాయి. కావాలనుకుంటే ప్రయాణికులు ఈ పుస్తకాన్ని ఉచితంగా తీసుకుని వెళ్లవచ్చు. పీస్ ఆటోలో ప్రయాణ సమయంలో డ్రైవర్ ప్రవర్తన, తదితర విషయాల గురించి ఆటోలో ఉన్న ఫీడ్‌బ్యాక్ పుస్తకంలో నమోదు చేయవచ్చు. ఆదర్శ ఆటోలు... ఈ పీస్ ఆటో మూమెంట్లో చేరాలనుకునే వారు ఎటువంటి రుసుములూ చెల్లించనక్కరలేదు. అయితే సదరు డ్రైవర్ నడవడిక గురించి క్షుణ్ణంగా వాకబు చేసిన తర్వాతనే పీస్ ఆటో ప్రాజెక్టులోకి చేర్చుకుంటారు. ప్రాజెక్టు మొదలై దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఈ ప్రాజెక్టులో ఆటోల సంఖ్య రెండు వందలు మాత్రమే. దీంతో ఈ ప్రాజెక్టుకు ఎంపిక విధానం ఎంత కచ్చితంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘‘నగరంలో ప్రస్తుతం రెండు వందల పీస్ ఆటోలు ఉన్నాయి. ఒక్కొక్క ఆటో రోజుకు ఆరు ట్రిప్పుల చొప్పున తిరుగుతుంది అనుకుందాం. ట్రిప్పుకు సగటున ముగ్గురు ప్రయాణికులను లెక్కకు తీసుకున్నా రోజుకు పీస్ ఆటోల్లో మూడు వేల ఆరువందల మంది ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు పీస్ ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య లక్షకు పై మాటే. ఇందులో పదేపదే ఆటోల్లో వెళ్ళే ప్రయాణికులు 50 వేల మంది అనుకున్నా మిగిలిన 50 వేల మంది కొత్తవారే. వీరందరికీ శాంతియుతంగా ఎలా మెలగాలి? అనేదాన్ని గురించి ఆటోడ్రైవర్లు తమ ప్రవర్తన ద్వారా కొంత, ఆటోలో ఉన్న పుస్తకాల ద్వారా మరికొంత తెలియజేస్తారు. ఈ లక్షమందిలో నెలకు వెయ్యి మంది తమ స్వభావాన్ని మార్చుకున్నా... కొన్నేళ్లలో నేననుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాను’’ అంటున్నారు అనిల్. ‘పీస్ మూమెంట్’లో భాగంగా ప్రయాణికుల ద్వారా ఉత్తమ ఆటోడ్రైవర్లుగా గుర్తించబడినవారితోపాటు విధి నిర్వహణలో శాంతియుతంగా మెలిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ను వివిధ మార్గాల ద్వారా (ఎస్.ఎం.ఎస్, ఫేస్బుక్ తదితర విధానాల ద్వారా) ఎంపిక చేసి ‘అన్సంగ్ హీరోస్’ పేరుతో అనిల్శెట్టి సత్కరించారు. త్వరలో పింక్ ఆటోలు... ‘ది వరల్డ్ పీస్ కీపర్స్ మూమెంట్’ త్వరలో పింక్ ఆటోలను తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో మహిళలే డ్రైవర్లుగా ఉంటారు. అనిల్ ఆశయాలు, ఆచరణలు నచ్చిన కొన్ని ప్రైవేటు సంస్థలు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తున్నాయి. త్వరలోనే ‘షాపింగ్ ఇన్ ద స్పిరిచ్యువల్ సూపర్ మార్కెట్’ అనే పుస్తకాన్ని పూర్తి చేసి అందులో విషయాలను ఆటోల ద్వారా ప్రజలకు చేరువ చేయడం ద్వారా వారిలో ఆధ్యాత్మిక, శాంతియుత భావనలు పెంపొందించే ప్రయత్నంలో ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల అనిల్. - బేల్దార్ సజ్జేంద్ర కిషోర్, సాక్షి, బెంగళూరు ఫోటో: ధనుంజయ టి.కె నెలకు పీస్ ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య లక్షకు పై మాటే. ఇందులో పదేపదే ఆట్లో వెళ్ళే ప్రయాణికులు 50 వేల మంది అనుకున్నా మిగిలిన 50 వేల మంది కొత్తవారే. వీరందరికీ శాంతియుతంగా ఎలా మెలగాలి? అనేదాన్ని గురించి ఆటోడ్రైవర్లు తమ ప్రవర్తన ద్వారా కొంత, ఆటోలో ఉన్న పుస్తకాల ద్వారా మరికొంత తెలియజేస్తారు. ఈ లక్షమందిలో నెలకు వెయ్యి మంది తమ స్వభావాన్ని మార్చుకున్నా... కొన్నేళ్లలో నేననుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాను. -
హిట్లర్‌గారి మీసం కథ!
కథా కమామీషు హిట్లర్ అనగానే అతని అరాచకాల కంటే ముందుగా చాలా మందికి ‘టూత్‌బ్రష్’ మీస కట్టు గుర్తుకొస్తుంది. హిట్లర్ రాజకీయ జీవితంతో సరిసమానంగా ఆయన మీస కట్టు గురించి కూడా చర్చ జరిగింది. ‘‘హిట్లర్ అనే పేరులో ఎంత గాంభీర్యం ఉందో, ఆయన మీస కట్టులో అంత కామెడీ ఉంది. నిజానికి...ఆయనకు పొడవాటి మీసాలు ఉండి ఉంటే బాగుండేది. మీసాలలో కూడా పేరు తాలూకు గాంభీర్యం ఉట్టిపడితే బాగుంటుండేది’’ అనుకునేవాళ్లు ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే, వీరప్పన్‌లాగా ఒకప్పుడు హిట్లర్‌కు కూడా పొడవాటి మీసాలు ఉండేవి. సందర్భానుసారంగా మీసాలు తిప్పుతూ మాట్లాడేవాడట. మరి పొడుగు మీసాల హిట్లర్ పొట్టి మీస కట్టులోకి ఎందుకు షిఫ్ట్ అయ్యాడు? ‘‘ఆయన పొట్టివాడు కాబట్టి’’ అని నవ్వులాట సమాధానం అయితే చెప్పుకోవచ్చుగానీ అది మాత్రమే అసలు సమాధానం కాదు కదా! విషయం ఏమంటే, హిస్టరీ ఛానల్ తన మూడు భాగాల మినీ సిరిస్‌లో భాగంగా హిట్లర్ మీసంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. చరిత్రకారులు, రాజకీయనాయకులు, రాజకీయ విశ్లేషకులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఆరు గంటల ఈ చర్చలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. హిట్లర్ పొట్టి మీస కట్టుపై రెండు వాదనలు వినిపించాయి. ఒకటి: సైనికుడిగా పని చేస్తున్న సమయంలో హిట్లర్ తన మీసకట్టును మార్చుకున్నాడు. దీనికి కారణం...గ్యాస్ మాస్క్ బిగించుకునే సమయంలో పొడుగు మీసాలు ఇబ్బంది పెడుతుండడం. దీంతో తన మీసకట్టును అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా చతురస్రాకారంలో కట్ చేసుకొని దాన్నే జీవితాంతం కొనసాగించాడు. రెండోది: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పొట్టి మీస కట్టు అనేది ప్రసిద్ధి చెందిన మీస కట్టు. అందులో భాగంగానే హిట్లర్ దీన్ని ఎంచుకున్నాడు తప్ప ప్రత్యేక కారణం ఏదీ లేదు. -
ముందుగానే ‘టిప్’ ఇద్దాం..
ప్రేరణ కొన్నిసార్లు ఎంతో సాధారణమైన సంఘటన కూడా మన జీవితాలపై ఎనలేని ప్రభావం చూపిస్తుంది. అది ఒక విలువైన పాఠంగా మారుతుంది. కొన్నేళ్ల క్రితం అలాంటి సంఘటనే నాకు కూడా ఎదురైంది. నేను, నా స్నేహితుడు కలిసి లంచ్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడి పరిశుభ్రత నచ్చింది. భోజనం చాలా బాగుంది. ఆహ్లాదకరమైన రెస్టారెంట్ వాతావరణంలో నేను, నా ఫ్రెండ్ చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? నేను ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అక్కడే జరిగింది. భోజనానికి ముందే టిప్ మేము రెస్టారెంట్‌కు వెళ్లి, టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్న తర్వాత నా మిత్రుడు తన జేబులోంచి పర్సు తీశాడు. వంద రూపాయల నోటును బయటకు లాగి అక్కడి వెయిటర్‌కు ఇచ్చేశాడు. అతడు చిరునవ్వుతో ఆ నోటును స్వీకరించాడు. ఇది నాకు అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్ద నోటు అని కాదు, ఇచ్చిన సమయం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇలాంటిది చూడడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సాధారణంగా ఎవరైనా భోజనం ముగించిన తర్వాత వెయిటర్‌కు టిప్ ఇస్తారు. కానీ, వంటకా లు ఆర్డర్ చేయకముందే నా ఫ్రెండ్ టిప్ ఇచ్చాడు. తర్వాత మాకు రాచమర్యాదలు జరిగాయని చెప్పనవసరం లేదు కదా! వెయిటర్ మాతో గౌరవంగా మసలుకొన్నా డు. తన ముఖంపై చిరునవ్వు చెదరనీయకుండా సర్వీస్ చేశాడు. వంటకాలను వేడివే డిగా వడ్డించాడు. నిజంగా ఆ రోజు లంచ్‌ను చాలా ఎంజాయ్ చేశాం. రెస్టారెంట్ నుంచి ఆనందంగా బయటికొచ్చాం. అందరికీ ఒక మంచి పాఠం రెస్టారెంట్ సంఘటన గురించి ఆలోచిస్తే.. అందులో అందరికీ ఒక మంచి పాఠం ఉందనిపిస్తుంది. ఇతరులకు అప్పగించిన పనిని ప్రారంభించడానికి ముందే వారికి తగిన బహుమానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అనుకున్న పని మొదలు పెట్టడానికి ముందు మనకి మనం కూడా బహుమతి ఇచ్చుకోవచ్చు. అది గొప్ప ప్రేర ణగా పనిచేస్తుంది. అంతేకాకుండా పని విజయవంతంగా పూర్తికావడానికి దోహదప డుతుంది. రెస్టారెంట్లో టిప్ ముందే ఇవ్వడం ద్వారా నా మిత్రుడు వెయిటర్‌కు.. నువ్వు బాగా పని చేస్తావని, మాకు మంచి సర్వీస్ అందిస్తావని తెలుసు! అంటూ పరోక్షంగా సందేశం ఇచ్చాడు. నేను బాగా పనిచేస్తానని వారు నమ్ముతున్నారు. వారి నమ్మకం నిజం చేస్తా, మంచి సర్వీస్ ఇస్తా.. అని వెయిటర్ తనకు తాను చెప్పుకొని ఉంటాడు. నా ఫ్రెండ్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది. ముందే రిస్టువాచీ దురదృష్టవశాత్తూ.. చాలామంది షరతులతో కూడిన ప్రేమ, గుర్తింపుతో పెరుగుతుం టారు. ‘క్లాస్‌లో ఈసారి నీకు ఫస్టు ర్యాంకు వస్తే రిస్టు వాచీ ఇస్తా..’ అంటూ తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు ఆశ పెడుతుంటారు. క్లాస్‌లో ఫస్టు ర్యాంకు ఒక్కరికే వస్తుం ది. మరి మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి? తమకు తెలివితేటలు లేవని, చదువురాదని అనుకుంటూ కుంగిపోతుంటారు. పరీక్ష జరగడానికి ముందే రిస్టువాచీ ఇస్తే ఏం జరు గుతుందో ఊహించండి. విద్యార్థి ఆలోచన మారిపోతుంది. తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తిస్తాడు. దాన్ని నిలబెట్టాలని కష్టపడి చదువుతాడు. ఫస్టు ర్యాంకు రాక పోయినా తన శక్తిమేర ప్రయత్నిస్తాడు. దీంతో అతడిలో అసలైన ప్రతిభ బయటపడు తుంది. ఇది మంచి పరిణామమే కదా! కోర్సు ప్రారంభానికి ముందే యునెటైడ్ కింగ్డమ్ (యూకే)లో ప్రతిష్టాత్మకమైన సంగీత కళాశాల ఉంది. అందులో చేరేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా పోటీ ఉంటుంది. ఆ కాలేజీలో చేరిన తర్వాత కొంద రు విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. అనవసరంగా భయపడుతుంటారు. ఇక్కడ కోర్సు విజయవంతంగా పూర్తిచేయగలనా? లేదా? అని మథనపడుతుంటారు. ఇలాంటివారిని దారిలో పెట్టడం అధ్యాపకులకు సమస్యగా మారింది. దాన్ని పరిష్కరిం చేందుకు ఓ మంచి మార్గం కనిపెట్టారు. అదేమిటంటే... ఏడాదికల్లా ప్రతి ఒక్కరూ ‘ఎ’ గ్రేడ్ సాధించబోతున్నారంటూ కోర్సు ప్రారంభానికి ముందే చెప్పేస్తారు. మరుసటి ఏడాది తేదీతో ఇప్పుడే ఓ లేఖ రాయాలని కోరతారు. కోర్సులో ‘ఎ’ గ్రేడ్ ఎలా సాధించా రు? ఇక్కడ ఏం నేర్చుకున్నారు? ఎంత సాధించారు? సంగీతంలో నిష్ణాతుడిగా ఎలా మారారు? తదితర ప్రశ్నలకు ఆ లేఖలో సమాధానాలు ఉండాలని చెబుతారు. సాధించ బోయే విజయాన్ని ఊహించుకుంటూ విద్యార్థులు లేఖలు రాసి ఇచ్చేవారు. భయాన్ని వదిలేసి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా చదువుకొనేవారు. ఏడాది తిరిగేసరికల్లా అందరూ ‘ఎ’ గ్రేడ్ సర్టిఫికెట్తో బయటికొచ్చేసేవారు. మార్పు చూడండి ఇక్కడొక మంచి ఎక్సర్సైజ్ ఉంది, ప్రయత్నించండి. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ లేదా ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ పేరుతో మీకు మీరే బహుమతి ఇచ్చుకోండి. ఏడాది తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ లేదా కంపెనీ సీఈఓ మిమ్మల్ని అభినందిస్తున్నట్లుగా లేఖ రాసుకోండి. మీరు సాధించిన విజయాలను వారు ఎలా పొగుడుతున్నారో వారి మాటల్లోనే రాయండి. తర్వాత మార్పు చూడండి. ఆయా విజయా లను మీరు కచ్చితంగా సాధిస్తారు. అది మీ జీవితంలో మర్చిపో లేని సంవత్సరంగా నిలిచిపోతుంది. వెయిటర్లు, మ్యుజీషియన్లు, మీరు, నేను.. మనందరం పని ప్రారంభానికి ముందే బహుమతి ఇచ్చుకుందాం. జీవితాలను మార్చుకుందాం. - ప్రకాశ్ అయ్యర్, ఎండీ, కింబర్లీ - క్లార్క్ లీవర్ -
బాధ్యత తీసుకోండి
ప్రేరణ ఎవరి జీవితం ఎలా ఉంటుందనేది వారి పనులను బట్టే ఉంటుంది. ఎవరి భవితవ్యానికి వారే బాధ్యత వహించాలి. మరెవరో బాధ్యత తీసుకోవడం కష్టమైన పని. నా జీవితం ఇలా కావడానికి ఫలానా వ్యక్తులు, పరిస్థితులే కారణమంటూ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తే నష్టపోయేది ముమ్మాటికీ మీరే. ఇతరులపై నిందలేయడం సరి కాదు. ముళ్ల పొదల్లా గజిబిజిగా ఉన్న జీవితాన్ని సుందర నందనవనంగా మార్చుకోవాలి. ఒకేరకమైన పరిస్థితుల మధ్య పెరిగిన ఇద్దరు కుర్రాళ్లు వాటిని తమ జీవితానికి ఏ విధంగా అన్వయించుకున్నారో తెలుసుకుందాం.. పేద కుటుంబం, నాన్న తాగుబోతు ఓ నగరంలో ఓ యువకుడు చిన్న నేరం చేసి పోలీసులకు దొరికాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో చిన్నచిన్న నేరాలు చేస్తూ బతుకుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇలా ఎందుకు మారావని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘మాది చాలా పేద కుటుంబం. రెండు పూటలా కడుపు నింపుకోవడానికి కూడా డబ్బు లేదు. మా నాన్న తాగుబోతు. నన్ను, మా తమ్ముడిని చావ బాదేవాడు. చదువుకుందామంటే డబ్బుల్లేవు. మాది చిన్న ఇల్లు. అందులో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన నేను దొంగను కాక ఇంకేమవుతాను? నేను ఇలా మారిపోవడానికి కచ్చితంగా మా నాన్న, నేను పుట్టి పెరిగిన పరిస్థితులే కారణం’’ అంటూ.. చెప్పాడు. ఈ యువకుడి వాదన ఇలా కొనసాగుతుండగా ఇక్కడికి సమీపంలోనే ఓ సన్మాన కార్యక్రమం జరుగుతోంది. విధిని, తలరాతను నేనే నిర్దేశించుకున్నా.. మురికివాడలో పుట్టి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన యువకుడిని అక్కడ సన్మానిస్తున్నారు. అతడికి పూల దండలేసి, శాలువాలు కప్పి గొప్పవాడంటూ పొగిడారు. ఇదంతా ఎలా సాధించావో చెప్పాలని కోరగా ఆ యువకుడు ఇలా ప్రసంగించాడు.. ‘‘మాది చాలా పేద కుటుంబం. రెండు పూటలా కడుపు నింపుకోవడానికి కూడా డబ్బు లేదు. మా నాన్న తాగుబోతు. మద్యం మత్తులో నన్ను, మా అన్నను చావ బాదేవాడు. చదువుకుందామంటే డబ్బుల్లేవు. మాది చిన్న ఇల్లు. అందులో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి, మంచి జీవితం గడపాలంటే బాగా కష్టపడాలని అర్థం చేసుకున్నాను. నా జీవితానికి నేనే బాధ్యత తీసుకున్నాను. నా విధిని, తలరాతను నేనే నిర్దేశించుకున్నాను. రాత్రింబవళ్లూ శ్రమించి అనుకున్నది సాధించాను’’ అని చెప్పాడు. మనం ఎలా స్పందిస్తున్నాం? ఇప్పుడు మీరు ఊహించింది నిజమే. వారిద్దరూ సొంత అన్నదమ్ములే. కారణం చిన్నదే.. అన్న తన జీవితానికి ఇతరులను బాధ్యులను చేసి, చిల్లర దొంగగా మారిపోయాడు. తమ్ముడేమో బాధ్యతను తన భుజాలపైనే వేసుకొని, బతుకును బంగారంగా మార్చుకున్నాడు. మనకు ఏం జరిగింది అనే దాన్ని బట్టి కాకుండా.. జరిగిన దాని పట్ల మనం ఎలా స్పందిస్తున్నాం అనేదాన్ని బట్టే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇతరులను, పరిస్థితులను నిందించడం, సాకులు చెప్పడం ద్వారా మనం బాధ్యత నుంచి తప్పుకుంటున్నాం. తద్వారా జీవితాలను మార్చుకొనే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటున్నాం. నిమ్మరసం చేయడం నేర్చుకోవాలి ‘జీవితం నీకు నిమ్మకాయ ఇస్తే.. దాంతో నిమ్మరసం చేసుకోవడం నేర్చుకో..’ అనే సామెత ఉంది. నిమ్మకాయలో చేదు కూడా ఉంటుంది. చేదు తగలకుండా రసాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పరిస్థితులు కూడా అలాంటివే. వాటిలో చెడును వదిలేసి, మంచిని గ్రహించడం మన చేతుల్లోనే ఉంది. నిందలు, సాకులు మానేయండి పరిస్థితులపై నిందలేయడం, సాకులు వెతకడం ఈరోజే మానేయండి. అదృష్టం, తలరాత, తల్లిదండ్రులు, టీచర్లు, యజమానులు.. మీ జీవితానికి వీరిని బాధ్యులను చేయకండి. మిమ్మల్ని మీరే బాధ్యులను చేసుకోండి. అనుకున్నది సాధించి చూపండి. మీ మనస్సు అనే కాక్‌పిట్‌లో ఒకే సీటు ఉంది. అందులో ఏ పైలట్‌ను కూర్చోబెడతారు. బాధ్యత నుంచి తప్పించుకొనే సాకునా? లేక బాధ్యతనా? నిర్ణయించుకోవాల్సింది మీరే. -‘కెరీర్‌స 360’ సౌజన్యంతో.. ప్రకాశ్ అయ్యర్, ఎండీ, కింబర్లీ- క్లార్క్ లీవర్ -
పట్టు వదలకు... గెలుపు మరువకు!
స్ఫూర్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఏముండాలి? ‘చాలా ధైర్యం ఉండాలి’... ఆ ధైర్యంలో కొంచెం అయినా మనలో ఉంటే, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బెదిరిపోతుంది. విజయం మనతో చెలిమి చేస్తుంది. చీకటి భయపెట్టిన చోటే... వెలుగురేఖలు స్వాగతం పలుకుతాయి. సమర్థతకు పట్టం కడతాయి. అరుణ్ పండిట్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు... ఒకప్పుడు! ఆత్మహత్య చేసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. పోరాడాలి. గెలవాలి అంటున్నాడు... ఇప్పుడు!! ఆ మార్పు వెనుక కథను తెలుసుకుందాం... స్నేహితులందరినీ పేరు పేరునా గుర్తు తెచ్చుకున్నాడు. అలా గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వారితో తనను తాను పోల్చి చూసుకున్నాడు. ‘వారితో పోల్చితే నేను ఎందుకూ పనికిరాను. అసమర్థుడిని’ అని వందోసారి అనుకున్నాడు. ‘అసమర్థుడిగా బతకడం కంటే చనిపోవడమే మంచిది!’ ఈసారి చాలా గట్టిగా అనుకున్నాడు. మళ్లీ ఏ మూలో చిన్న అలజడి. ‘చనిపోవాలా?’ ‘చనిపోయేంత తప్పు తాను ఏం చేశానని!’ సుజన్పూర్ (హిమాచల్‌ప్రదేశ్)లో చదువుకునే రోజుల్లో అపజయాలు అరుణ్ పండిట్‌ను వరుసగా పలకరించేవి. ఒకరోజు ఒక అపజయం ఎదురైతే, మరొకరోజు అంతకంటే బలమైన అపజయం ఎదురయ్యేది. ఇక చదువు విషయానికి వస్తే ప్రతి పరీక్షలోనూ ఫెయిల్ కావడమే! ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’లో చేరాలని తనకు ఒక కల ఉండేది. ఒకవేళ తాను కన్న కల నిజమైతే ఇప్పటి వరకు తనను చిన్న చూపు చూసిన వాళ్లే తరువాత నాలుగు మంచి మాటలు మాట్లాడతారు. విమర్శకుల నోరు మూయించడానికైనా తాను ఎన్డీఎలో చేరాలనుకున్నాడు. మొదటి ప్రయత్నం చేశాడు... ఫెయిల్. రెండో ప్రయత్నం చేశాడు... ఫెయిల్. ముచ్చటగా మూడో ప్రయత్నం చేశాడు... ఫెయిల్! ‘‘కల మాత్రమే కనగల శక్తి ఉంది. దాన్ని నిజం చేసుకునే శక్తి నాలో లేదు’’ నిరాశలో పడిపోయాడు. అపజయాలకు తోడు అనారోగ్యం కూడా అరుణ్‌ను పట్టి పీడించింది. కొంతకాలం ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తరువాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాస్తే షరా మూమూలుగా ఫెయిలయ్యాడు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం, ఒక కల కనడం... ఒక అడుగుపడే లోపే పరాజయం ఎదురుకావడం... జీవితం అంటేనే అసహ్యం అనిపించేది. బతికినా ఒకటే చచ్చినా ఒకటే అనుకున్నాడు. అందుకే ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ‘వైఫల్యం కూడా తప్పుతో సమానం. అందుకు శిక్ష చనిపోవడమే’ అనుకుంటూ సెల్‌ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇక సెలవు’ అని దగ్గరి స్నేహితులందరికీ యస్ఎంయస్ పెట్టాడు అరుణ్ పండిట్. అరుణ్‌కు నచ్చజెప్పడానికి, ఆత్మహత్య ప్రయత్నం నుంచి అతణ్ణి విరమింపచేయడానికి స్నేహితుల నుంచి ఫోన్లు వరదలా వచ్చాయి. కానీ ఏ ఫోన్‌కు అరుణ్ స్పందించలేదు. కానీ, ఒక యస్‌యమ్‌ఎస్ మాత్రం అతనిలో ఆలోచన రేకెత్తించింది. అందులో ఇలా ఉంది: ‘నా కాళ్లకు చెప్పులు లేవని ఏడుస్తుంటే, కాళ్ల్లు లేని వ్యక్తి కనిపించాడు. నా ఏడుపు ఆగిపోయింది. ఈ ప్రపంచాన్ని సవాలుగా తీసుకో... నిన్ను నువ్వు నిరూపించుకో’. ఎందుకో ఆ మెసేజ్‌ను మళ్లీ మళ్లీ చదవాలనిపించింది. అలా చదువుతున్న క్రమంలో జీవితం విలువ మెల్లగా అర్థం కావడం మొదలైంది. ఆత్మహత్య చేసుకోవాలన్న తన నిర్ణయం ఎంత తప్పో తెలిసింది. ఇలాంటివే కొన్ని మెసేజ్‌లు చదివేసరికి మూసుకుపోయిన కళ్లు తెరుచుకున్నాయి. జాడ లేని ఆత్మవిశ్వాసం పదునైన ఆయుధంతో తన ముందు నిల్చొని - ‘‘యుద్ధం చెయ్’’ అని పిలుపునిచ్చింది. అప్పటికప్పుడు తనలో ఒక చిన్న ఆలోచన మెరుపులా మెరిసింది. ‘‘ఒక చిన్న మెసేజ్ నన్ను ఆత్మహత్య ప్రయత్నం నుంచి రక్షించింది. దేశంలో ఎంతోమంది ఎన్నో బాధలతో ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పేలా, ఆత్మవిశ్వాసం నూరిపోసేలా ఒక వెబ్సైట్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది?’’ అనే అరుణ్ ఆలోచన నుంచి ‘డోన్ట్ గివ్ అప్ వరల్డ్’ వెబ్సైట్ ప్రారంభమైంది. అనూహ్యమైన స్పందన సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఈ సైట్‌ను ఇరవై అయిదు లక్షల మంది వరకు చూశారు. అరుణ్ పండిట్ ఇప్పుడు ‘డిజిడబ్ల్యు’ నిర్వాహకుడు మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. పెద్ద పెద్ద పుస్తకాల నుంచి కాకుండా, నిత్యజీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆధారంగా చేసుకొని అతను చేసే ఉపన్యాసాలు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నాయి. రకరకాల ఆప్స్‌ను లాంచ్ చేయాలని, ఆన్లైన్ సైకలజికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని... ఇలా ఎన్నో ఆలోచనల్లో తలమునకలై క్షణం తీరిక లేకుండా ఉన్నాడు అరుణ్ పండిట్. ఇక నిరాశ అనే శత్రువు అతడి దగ్గరకు ఎలా వస్తుంది! సానుకూల దృక్పథంతో... స్ఫూర్తిదాయకమైన ఛాయాచిత్రాలు ‘డోన్ట్ గివ్‌అప్’లో ఉంటాయి. వీటిని ఎవరైనా పంపవచ్చు. అక్షరాల ద్వారా కాకుండా చిత్రాల ద్వారా ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం ఇది. గొప్ప వాళ్ల ఉపన్యాసాల నుంచి సేకరించిన మంచిమాటలు ఉంటాయి. తమ శక్తిసామర్థ్యాలను పెట్టుబడిగా పెట్టి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, గెలుపు పతాకం ఎగరేసిన వారి విజయగాథలు ఉంటాయి. కథలు, కవితలు, ఇంటర్వ్యూలు, వీడియోలు ఉంటాయి. అరుణ్ పండిట్ ఇప్పుడు ‘డిజిడబ్ల్యు’ నిర్వాహకుడు మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. పెద్ద పెద్ద పుస్తకాల నుంచి కాకుండా, నిత్యజీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆధారంగా చేసుకొని అతను చేసే ఉపన్యాసాలు ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాయి. -
స్ఫూర్తి ప్రదాతలు
సాధారణంగా క్రీడాకారులంటేనే పోరాటయోధులు. ఒక మ్యాచ్‌లో లేదా టోర్నీలో ఓడిపోయినా నీరు గారిపోరు.. కసితో మళ్లీ బరిలోకి దిగుతారు. ఓటమిని జీవన్మరణ సమస్యగా తీసుకుని తాము అనుకున్నది సాధిస్తారు. అయితే ఎదుటివారికి ఆదర్శంగా నిలిచే స్పోర్ట్స్ స్టార్లు కొందరు నిజ జీవితంలోనూ జీవన్మరణ సమస్యల్ని ఎదుర్కొన్నారు. తీవ్రమైన వ్యాధుల బారిన పడినా, వాటిని అధిగమించి మళ్లీ మైదానంలో సత్తా చాటారు. మరికొందరు రిటైర్మెంట్ తర్వాత వ్యాధుల బారిన పడి, వాటిని అధిగమించారు. కొందరైతే తాము అనుభవించిన బాధలు ఎదుటివాళ్లు పడొద్దన్న ఉద్దేశంతో చారిటీలను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి... - శ్యామ్ తిరుక్కోవళ్లూరు యువరాజ్ క్రికెట్ కెరీర్‌ను కొనసాగిస్తూ క్యాన్సర్ బారిన పడిన ఏకైక క్రికెటర్ యువరాజ్.. 2011లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆ అనారోగ్యానికి కారణం క్యాన్సర్ కణితిగా పరీక్షల్లో తేలింది. యువరాజ్ ఎడమ ఊపిరితిత్తిలో కణితి ఉందని గుర్తించడంతో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లి కీమో థెరపీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇండియానాలోనూ చికిత్స పొందాడు. 2012లో పూర్తిగా కోలుకుని మళ్లీ బ్యాట్ పట్టి అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ.. ఐపీఎల్ ఏడో సీజన్లో రాణించాడు. మొత్తానికి రీ ఎంట్రీలోనూ అదరగొడుతున్న యువరాజ్ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇక యువరాజ్ ‘యు వియ్ కెన్’ పేరుతో క్యాన్సర్ చారిటీని ఏర్పాటు చేశాడు. ఈ చారిటీ ద్వారా క్యాన్సర్ రోగులను ఆదుకుంటున్నాడు. టిమ్ హోవార్డ్ అమెరికా స్టార్ గోల్ కీపర్. సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియంతో మ్యాచ్‌లో 16 గోల్ ప్రయత్నాలను అడ్డుకుని చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ గోల్‌కీపర్‌కు సాధ్యం కాని రీతిలో గోల్‌పోస్ట్ దగ్గర అద్భుతమైన విన్యాసాలు చేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా చిత్తయినా... బెల్జియం ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించేందుకు చేసిన ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు అతను చేసిన విన్యాసాలు చూసిన వారేవరికైనా సూపర్మ్యాన్లా కనిపించాడు. టిమ్ హోవార్డ్ అద్భుత ప్రదర్శనకు 9 ఏళ్ల వయసులో అతనికి వచ్చిన టోరెట్టె సిండ్రోమే కారణం. ఈ సిండ్రోమ్ బారిన పడటం వల్ల హోవార్డ్‌కు వెంటనే స్పందించే లక్షణాలు వచ్చాయని న్యూరో స్పెషలిస్టులు చెబుతున్నారు. మెదడులో న్యూరో సెక్రియాట్రిక్ రుగ్మతతో బాధపడిన హోవార్డ్, ఆ తర్వాత దానిని అధిగమించాడు. టోరెట్టె సిండ్రోమ్ నుంచి కోలుకుని గోల్‌కీపర్‌గా రాణించడమంటే మాటలు కాదు.. కఠోర శ్రమ వల్లే అతను ఈ స్థాయికి చేరుకోగలిగాడు. ప్రపంచకప్‌లో హోవార్డ్ అద్భుత ప్రదర్శన అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఆకట్టుకోవడమే కాదు.. ఆయన నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. మొత్తానికి ప్రపంచకప్‌తో అమెరికా ఫుట్‌బాల్‌కు నయా స్టార్ దొరికాడు. మార్టినా నవ్రతిలోవా టెన్నిస్ దిగ్గజాల్లో మార్టినా నవ్రతిలోవా కూడా ఒకరు. ఒకప్పుడు అంతర్జాతీయ టెన్నిస్‌లో ఓ వెలుగు వెలిగిన నవ్రతిలోవా.. మార్టినా హింగిస్ లాంటి టెన్నిస్ స్టార్లకు ఆదర్శం. ప్రస్తుతం కోచ్‌గా సేవలందిస్తున్న ఈ మాజీ చెక్, అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి బ్రెస్ట్ కాన్సర్ బారిన పడింది. నాలుగేళ్ల కిందట (2010లో) ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. దీనిపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. ఈ సమస్య నుంచి బయటపడిన మార్టినా నవ్రతిలోవా అందరికీ ఆదర్శంగా నిలిచింది. విల్మా రుడాల్ఫ్ ఈమె జీవితమే ఒక పాఠం.. చిన్నతనంలో పోలియో బారిన పడింది. 12 ఏళ్ల వయసులో రుడాల్ఫ్ కోరింత దగ్గు, తీవ్ర జ్వరం, తట్టు ఇలా అనారోగ్యం నుంచి బయటపడి చివరికి అథ్లెట్‌గా తానేంటో నిరూపించుకుంది. పోలియో కారణంగా ఎడమ కాలులో తేడా ఉండటంతో దాన్ని సరిచేసుకుని ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తా చాటింది. 1960 ఒలింపిక్స్‌లో రుడాల్ఫ్ మూడు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఫాస్టెస్ట్ అథ్లెట్‌గా అందరి మన్ననలు పొందిన రుడాల్ఫ్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది. వీనస్ విలియమ్స్ అమెరికా టెన్నిస్ బ్యూటీ... తన చెల్లెలు సెరెనా విలియమ్స్‌తో కలసి టెన్నిస్ కోర్టులో అద్భుతాలు సృష్టించింది. 2000 నుంచి 2010 వరకు టెన్నిస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన వీనస్.. జగ్రెన్స్ సిండ్రోమ్ అనే అరుదైన స్వయం నిరోధిత లోపంతో బాధపడింది. ఆయాసం, కీళ్లనొప్పి కారణంగా 2011లో యూఎస్ ఓపెన్ మధ్యలోనే నిష్ర్కమించింది. జగ్రెన్స్ నుంచి బయటపడిన ఈ అమెరికా స్టార్.. 2012లో వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో సెరెనాతో కలసి టైటిల్‌ను చేజిక్కించుకుంది. అదే ఏడాది లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. మళ్లీ టెన్నిస్‌లో తనదైన ముద్ర వేసేందుకు ఈ బ్లాక్ బ్యూటీ ప్రయత్నిస్తోంది. లో గెహ్రాగ్ అమెరికాకు చెందిన అద్భుతమైన బేస్‌బాల్ ఆటగాడు. అమ్యోట్రోఫిక్ లాటరల్ స్ల్కేరోసిస్(ఏఎల్ఎస్) కారణంగా 37 ఏళ్లకే కన్నుమూసిన గెహ్రాగ్.. తాను ఈ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కెరీర్‌ను కొనసాగిస్తున్న సమయంలోనే బయట పెట్టాడు. సాధారణంగా ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. అయితే గెహ్రాగ్ మాత్రం అలా చేయలేదు. ఏఎల్ఎస్ విషయాన్ని బయట పెట్టడంతో ఇప్పుడు అంతా దీన్ని లో గెహ్రాగ్ వ్యాధి అని పిలుస్తుంటారు. అంతేకాదు తనకు వ్యాధి ఉందన్న సంగతిని బయటపెట్టిన తొలి క్రీడాకారుడు కూడా గెహ్రాగే. మొహమ్మద్ అలీ అమెరికాకు చెందిన 72 ఏళ్ల బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ.. కెరీర్ ముగిశాక పార్కిన్సన్ వ్యాధి బారిన పడ్డాడు. మూడుసార్లు హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ సాధించి చరిత్ర సృష్టించిన అలీలో తొలిసారిగా 1981లో పార్కిన్సన్ లక్షణాలు కనిపించాయి. అయితే మూడేళ్ల తర్వాత (42 ఏళ్ల వయసులో) అది పార్కిన్సనే అని డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అప్పటికే బాక్సింగ్ కెరీర్‌ను ముగించిన బాక్సింగ్ దిగ్గజం ఈ వ్యాధిని ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు. 30 ఏళ్లుగా పార్కిన్సన్తో పోరాడుతున్న అలీ తనలా వేరేవాళ్లు ఈ వ్యాధి బారిన పడకుండా... 1997లో పార్కిన్సన్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. వ్యాధుల బారిన పడిన ఇతర ప్లేయర్లు... అర్థర్ యాష్ (టెన్నిస్)-ఎయిడ్స్/హెచ్ఐవీ కరీం అబ్దుల్ జబ్బార్ (బాస్కెట్‌బాల్)-లుకేమియా -
ఉమన్ విత్ నో మనీ..!
స్ఫూర్తి ఒక్కసారిగా ప్రపంచ ‘ఆర్థిక వ్యవస్థ’ కుప్పకూలితే... అసలు ద్రవ్యమానం అనే దానికి చెల్లుబడి లేకుండా పోతే.. ఏదీ కొనే పరిస్థితి, అమ్మే పరిస్థితి లేకపోతే... అప్పుడు మనిషి ఎలా బతుకుతాడు, కొనడం, అమ్మడం అనే ప్రక్రియ లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుంది? అనే సందేహం వచ్చింది 30 ఏళ్ల గ్రేటా టౌబర్ట్కు. అయితే గొప్ప ఆర్థికవేత్తలతో సహా అనేక మంది ఆమెకు వచ్చిన సందేహానికి సమాధానాన్ని చెప్పలేక నీళ్లు నమిలారు. దాంతో తనే సొంతంగా ఆ అంశం గురించి అధ్యయనం చేయాలనుకొంది గ్రేటా. డబ్బు లేకపోతే... అనేది తన సందేహం కాబట్టి... తను దేన్నీ డబ్బుతో ‘కొనకూడదు’ అని నిర్ణయించుకొంది. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకూ అవి నిత్యావసరాలు అయినా... అత్యవసరాలు అయినా... దేనినీ కొనకూడదు! వీలైతే తయారు చేసుకోవడం, లేకపోతే సెలైంట్‌గా ఉండటం. ఈ ప్లాన్ ప్రకారం బతకాలని ప్రణాళిక రచించుకొంది. అందుకు తగ్గట్టుగా సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే ఒక షాప్‌ను సందర్శించి, వాళ్లకు తను తయారు చేసిన కాంపోస్టు ఎరువును ఇచ్చి బట్టలు తెచ్చుకొంది. అలాగే టూత్ పేస్ట్‌ల దగ్గర నుంచి ఫేస్‌క్రీమ్‌ల వరకూ అన్నింటినీ అందుబాటులో ఉన్న వాటితోనూ, వస్తుమార్పిడి ద్వారా కొనుక్కోదగిన వాటితోనూ సమకూర్చుకుంది. ఈ విధంగా ఏడాది పాటు గడిపేసిందామె. డబ్బు అనేది ఖర్చు చేయకుండా ఆమె కొనసాగించిన జీవనశైలిని, పైసా ఖర్చు చేయకుండానే తూర్పు జర్మనీలోని తన ఊరి నుంచి 1,700 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బార్సిలోనా చేరుకొన్న విధానం గురించి పూర్తి వివరాలను గ్రంథస్థం చేసింది.‘అపోకలిప్స్ జెట్జ్’ పేరుతో ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇదిగాక ఏడాది పాటు అందరికీ భిన్నంగా గడపడం ద్వారా సాధించింది ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ‘‘ఎన్నో పాఠాలు’’ అని చెబుతుందామె. ఈ ప్రయాణంలో తన మదిలో జరిగిన చింతనతో ఆహార వృథాపై ఆందోళన తలెత్తిందని ఆమె చెబుతోంది. ఆర్థికమాంద్యంతో అల్లాడుతున్న దేశాలు కూడా ఇంకా ఆహార వృథాను అరికట్టడం లేదని, ప్రపంచానికి ఇదే పెనుప్రమాదం అవుతుందని అభిప్రాయపడింది. ఆమె చెప్పిన మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం సమాజంలో డబ్బు ఖర్చు పెట్టకుండా బతకడం అనేది చాలా కష్టమైన పని, అలా ‘రాడికల్’గా బతకడం ఎక్కువ కాలం సాధ్యమయ్యే పని కాదు... వృథా ఖర్చు, ఆ ఖర్చు ద్వారా వనరులను వృథా చేయకుండా మాత్రం జీవితాంతం బతకగలనని విశ్వాసం వ్యక్తం చేసింది! -
పేదింటి అమ్మ కట్టించిన పెద్ద ఆసుపత్రి!
స్ఫూర్తి సుభాషిణీ మిస్త్రీ ఆసుపత్రి కట్టాలనుకున్నారు. కాని మనసులో ఆరాటం తప్ప, చేతిలో కానీ లేదు. అయితేనేం...గుండెలనిండా ఆత్మవిశ్వాసం ఉంది... పేదలకు సేవ చేయాలన్న తపన ఉంది... అహరహం శ్రమించింది... అందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహకారం తోడైంది... అందరి కృషి ఫలించింది... ‘హ్యూమానిటీ హాస్పిటల్’ పేరుతో ఆసుపత్రి వెలసింది. ఎందరో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తోంది. సుభాషిణిలో చుట్టు పక్కల వారిని నవ్వించే హాస్యచతురత అంతగా ఏమీ లేదు. ఎప్పుడూ కాస్త గంభీరంగానే ఉంటుంది ఆవిడ. కానీ, ఆమె ఒక మాట అంటున్నప్పుడు మాత్రం...వినేవాళ్లు నవ్వినంత పని చేసేవారు. కొందరు వెటకారం కూడా చేసేవారు. అయినా ఆమె వాటికి పెద్దగా స్పందించేది కాదు. ఇంతకీ, కోల్‌కతాకు సమీపంలోని హన్సుపుకుర్ గ్రామానికి చెందిన సుభాషిణీ మిస్త్రీ ఏమనేవారు? ‘‘పేదవాళ్ల కోసం ఆసుపత్రి కడతాను. వాళ్లకు ఏ కష్టం లేకుండా ఉచితంగా వైద్యం చేయిస్తాను’’ పేదవాళ్లకు ఉచిత వైద్యసేవ చేయాలనుకున్న సుభాషిణి పెద్దింటావిడ ఏమీ కాదు. ఊళ్లో పలుకుబడి ఉన్న మహిళ అంతకంటే కాదు. ఆమె ఒక సాధారణమైన పేద మహిళ. ఎర్రటి ఎండల్లో కూలీ పని చేసేది. పెద్దవాళ్ల ఇంట్లో ఇంటి పని చేసేది. వీధి వీధి తిరుగుతూ కూరగాయలు అమ్మేది. ఏ రోజుకు ఆరోజు అన్నట్లుగానే ఉండేది ఆమె ఆర్థిక పరిస్థితి. ఇంతకీ ఆమె ఆసుపత్రి ఎందుకు కట్టాలనుకున్నారు? 23 ఏళ్ల వయసులోనే సరియైన వైద్యసదుపాయాలు లేని స్థితిలో సుభాషిణి భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఎన్ని కష్టాలు పడిందో ఆ దేవుడికే తెలుసు. కడుపు నిండా తిన్న రోజుల కంటే పస్తులు ఉన్న రోజులే ఎక్కువ. భర్త మాత్రమే కాదు...ఆమె బంధువులలో కొద్దిమంది సరైన వైద్యం లేక చిన్నవయసులోనే చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఆసుపత్రి కట్టాలనేది ఆమె కల, ఆశయం. ఒక పేదరాలికి ఆసుపత్రి కట్టించేంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో సుభాషిణితో అన్నారట- ‘‘ఇదేమన్నా సినిమా అనుకున్నావా? జీవితం’’ అని. అలా అంటారు గానీ, నిజానికి చాలా సినిమాలకు జీవితమే ప్రేరణ. జీవితంలోని ఎగుడుదిగుళ్ల నుంచే ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. సుభాషిణిది కూడా అలాంటి కథే. ఇప్పుడు మళ్లీ ఒకసారి వెనక్కి వెళదాం... సకాలంలో వైద్యం అందక, నిస్సహాయస్థితిలో తన భర్తలాగా ఇకముందు ఎవరూ చనిపోకూడదనుకుంది సుభాషిణీ. భవిష్యత్తు కలను దృష్టిలో పెట్టుకొని తనకు వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదువు చేయడం ప్రారంభించింది. కొన్నిసార్లయితే ఓవర్‌టైమ్ కూడా చేసేది. ఒక భూస్వామి కొంత భూమిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసి అతడిని కలిసింది. అతడి కాళ్ల మీద పడి తన ఆశయం గురించి చెప్పింది. తాను పొదుపు చేసిన డబ్బుతో మార్కెట్ రేటుతో పోల్చితే కాస్త తక్కువ ధరకే ఆ భూమిని కొన్నది. ‘‘తొలి విజయం సాధించాను’’ ఆమె తనలో తాను గర్వంగా అనుకుంది. ఇల్లలకగానే పండగ కాదు కదా! ఆ విషయం...ఆమెకు స్పష్టంగా తెలుసు. ‘పండగ’ వచ్చే రోజు కోసం మరింత ఎక్కువ కష్టపడాలనే విషయం కూడా తెలుసు. ఆసుపత్రి కోసం పైసా, పైసా కూడబెడుతున్న తనకు పిల్లల్ని చదివించడం కష్టమైపోతుందనే విషయం అర్థమై ముగ్గురు పిల్లలలో ఇద్దరిని అనాథాశ్రమంలో చేర్పించింది. ‘హవ్వా’ అనుకున్నారు చుట్టాలు పక్కాలు. ‘‘మీ ఆయన చనిపోవచ్చు. నువ్వు బతికే ఉన్నావు కదా! అలా పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించవచ్చా?’’ అన్నాడు ఒక సన్నిహిత బంధువు. ఎవరేమన్నా ఆమె మౌనంగా ఉండేది. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని వైద్యశాస్త్రం చదివించాలని కూడా ఆమె బలంగా అనుకునేది. అనుకున్నట్లే రెండో కొడుకు అజయ్ మెడిసిన్ చదివాడు. రెండో విజయం! తన తల్లి కల నెరవేర్చడానికి తన వంతు పాత్ర పోషించాడు అజయ్. 1993లో గ్రామస్థుల సహకారంతో ఒకే ఒక్క గదిలో ‘హ్యూమానిటీ హాస్పిటల్’ పేరుతో చిన్నగా మొదలైంది ఆసుపత్రి. ప్రజలు తమకు తోచిన రీతిలో సహాయం అందించారు. కొందరు డబ్బు ఇచ్చారు. కొందరు తమ దగ్గర ఉన్న కలప ఇచ్చారు. కొందరు శ్రమదానం చేశారు. కొందరు ఏమీ ఇవ్వక పోయినా ధైర్యాన్ని మాత్రం ఇచ్చారు. మూడు సంవత్సరాల తరువాత శాశ్వత ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కె.వి.రఘునాథరెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పేదలు ఈ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యచికిత్స పొందారు. పొందుతున్నారు. ‘‘చూడడానికి పొట్టిగా కనిపించే సుభాషిణి ఈ ఆసుపత్రి నిర్మాణంతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది’’ అంటారు గ్రామస్థులు. దేశవిదేశాల నుంచి ఎన్నో పురస్కారాలు సుభాషిణిని వరించాయి. అయితే ఇవేవీ కాదు... వైద్యసేవలు పొందిన తరువాత పేదరోగుల కళ్లలో కనిపించే సంతృప్తినే అతి పెద్ద పురస్కారంగా భావిస్తుంటుంది డెబ్బై సంవత్సరాల సుభాషిణీ మిస్త్రీ. నేను చదువుకోలేదు. గడియారం చూసి టైమ్ చెప్పడం కూడా నాకు రాదు. అయినప్పటికీ ఏదో ఒకరోజు నా కోరిక నెరవేరుతుందనే నమ్మకం బలంగా ఉండేది. - సుభాషిణి -
మీనన్‌భాయ్ గాంధీగిరి!
స్ఫూర్తి ‘లగేరహో మున్నాభాయ్’ సినిమా చూశారా? గాంధీగిరితో సంజయ్‌దత్ అన్నీ సాధిస్తుంటాడు. ఆక్రమించుకున్న తన ప్రేయసి ఇంటి తాళాలు ఇవ్వమంటూ విలన్ ఇంటిముందు నిలబడతాడు. అలాంటివి చూసినప్పుడు సినిమాల్లో తప్ప బయట అలా చేస్తారా అనుకుంటాం మనం. కానీ చేస్తారు. ఒకాయన చేస్తున్నాడు. ఒకటీ రెండూ కాదు... నాలుగేళ్లుగా చేస్తున్నాడు. కేరళకు చెందిన సుకుమారన్ మీనన్ నలభై తొమ్మిదేళ్ల క్రితమే బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగం నుంచి రిటైరయ్యాక ఓ డైరీఫామ్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. తను అప్పుడప్పుడూ దాచిన సొమ్ముతో ఓ స్థలం కొనుక్కున్నారు. అక్కడ ఓ చిన్న ఇల్లు కట్టుకున్నారు. అయితే ఉన్నట్టుండి కర్ణాటక ప్రభుత్వం ఆ స్థలాన్ని సీజ్ చేసి, బెంగళూరు-మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ కారిడార్ ప్రాజెక్టుకు కేటాయించింది. వాళ్లు రాత్రికి రాత్రి వచ్చి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. దాంతో మీనన్ దంపతులు రోడ్డున పడ్డారు. అద్దె ఇల్లు వెతుక్కున్నారు. తమకు న్యాయం చేయమంటూ ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నో యేళ్లు ప్రభుత్వోద్యోగిగా సేవలందించిన తనకు ఇలాంటి ఇబ్బంది వచ్చినా పట్టించుకోని ప్రభుత్వంపై మీనన్‌కి కోపం వచ్చింది. అప్పట్నుంచీ గాంధీగిరీ మొదలుపెట్టారు. నాలుగేళ్లుగా రోజూ ఉదయం 8 గంటలకు వచ్చి ఎం.జి.రోడ్డులోని పార్కు బయట ఉన్న బెంచీ మీద కూర్చుంటారు. సాయంత్రం ఆరు గంటల వరకూ అలానే కూర్చుని వెళ్తారు. నినాదాలు చేయరు. ప్లకార్డులు పట్టుకోరు. మౌనంగా నిరసన ప్రకటించి వెళ్తారంతే! మౌనంగా ఉంటే పని అవుతుందా అంటే... ‘‘మాట్లాడాల్సింది నేను కాదు... ప్రభుత్వం’’ అంటారాయన. ఓ 75 యేళ్ల వ్యక్తి నాలుగేళ్లుగా ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నా... ఇంతవరకూ ప్రభుత్వం స్పందించలేదంటే ఏమనాలి!! -
ఎవరూ నడవని బాటలో...
స్ఫూర్తి ఎంత చదువుకున్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా... ఆడపిల్లలు అనగానే కొన్ని రకాల ఉద్యోగాలు చేస్తేనే బాగుంటుందని తేల్చేస్తారంతా. నాగరికత బాగా అభివృద్ధి చెందింది అని చెప్పుకునే పాశ్చాత్య దేశాల్లో కూడా ఇలాంటి మాటలు వినిపిస్తాయి. సారాకి ఆ మాటలు అస్సలు నచ్చవు. అందుకే ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే వెంటనే ప్రశ్నించేది. ఇవే ఎందుకు చేయాలి? ఇవి ఎందుకు చేయకూడదు? అని నిలదీసేది. ఏదో తెలియక అడుగుతోంది అనుకునేవారు కానీ... నిజంగానే ఎవరూ సాగని బాటలో సాగుతుందని, ఆడపిల్లలు వెళ్లని రంగంలోకి అడుగుపెడుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. అమెరికాకు చెందిన సారా చిన్నతనం నుంచే వైవిధ్యంగా ఆలోచించేది. ఆడవాళ్లు మగవాళ్లకు ఏమాత్రం తీసిపోరని ఆమె ఉద్దేశం. అందుకు తగ్గట్టే సాహసాలు చేసేది. మహిళలు నడపడానికే భయపడే పెద్ద పెద్ద వాహనాలను నడపాలని సరదా పడేది. వాటిని నడుపుతున్నప్పుడు బండిలో ఏదైనా లోపం తలెత్తితే దాని గురించి స్టడీ చేసేది. ఆ శ్రద్ధ కాస్తా ఆమెను మెకానిజం వైపు లాక్కెళ్లింది. ఎలాగైనా సరే వాహనాలను బాగు చేయడం నేర్చుకోవాలని నిర్ణయించుంది. సారా నిర్ణయం గురించి విన్న కుటుంబ సభ్యులు... ‘ఆడపిల్లవై ఉండి మెకానిక్‌గా పని చేస్తావా?’ అన్నారు. స్నేహితులు పరిహాసమాడారు. కానీ సారాకి మాత్రం అది జోక్ చేయాల్సిన విషయంలా అనిపించలేదు. అందుకే ఓ ఇన్స్టిట్యూట్లో చేరి కార్ల మెకానిజం నేర్చుకుంది. మెకానిక్ షెడ్ కూడా పెట్టింది. ఆమెను చూసి మొదట నవ్వినవాళ్లు... ఆమె బళ్లను బాగుచేసే తీరు చూసి మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఆమెను చూసి ఫ్రెండ్స కూడా ఆ పని చేయాలని సరదాపడ్డారు. వాళ్లకు కూడా ఆ పని నేర్పింది సారా. వారితో కలిసి ‘180 డిగ్రీ ఆటోమోటివ్’ అనే సంస్థను స్థాపించింది. కాలం గిర్రున తిరిగింది. సారా పేరు అమెరికా అంతటా పాకిపోయింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ లేడీ అంటూ దేశమంతా ఆమెను పొగిడింది! -
పులిబిడ్డ!
స్ఫూర్తి సాహసం చేసే వాళ్లు మాత్రమే ‘పులిబిడ్డలు’ కాదు. మంచి పని చేసే వారు కూడా పులి బిడ్డలే. పులుల క్షేమంకోసం నడుం బిగించిన హన్స్ దలాల్.... అక్షరాలా పులిబిడ్డే! రకరకాల శబ్దాల గురించి, తన కెరీర్ గురించి తప్ప... హన్స్ దలాల్ పులుల గురించి ఆలోచించిన సందర్భం మునుపెన్నడూ లేదు. అదేమి చిత్రమో, మధ్యప్రదేశ్‌లోని కాన్హా నేషనల్ పార్క్‌లో పులిని చూసిన క్షణం నుంచి... పులుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనలో వెల్లువెత్తింది. ముంబైలోని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ రాత్రి దలాల్‌కు నిద్ర పట్టలేదు. సాధారణంగా పులి అనగానే ఒకలాంటి గాంభీర్యం కళ్ల ముందు కదలాడుతుంది. తనకేమో వాటి దీనత్వం మాత్రమే కనిపించింది. వాటి మూగరోదన కళ్లలో కనిపించింది. పులుల గురించి సమాచారాన్ని అంతర్జాలంలో చదువుతున్నప్పుడు అవి ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయనే విషయం అర్థమై దలాల్ మనసు కదిలిపోయింది. ‘‘పులులను వేటాడడం సాహసం కాదు. అది పిరికివాళ్లు మాత్రమే చేస్తారు. పులులను రక్షించడం సాహసం. అది కొందరు మాత్రమే చేస్తారు’’ అనుకున్న దలాల్ ఆ కొందరిలో తాను ఒకడు కావాలనుకున్నాడు. ‘ప్రావ్ల్’ (ప్రిజర్వేషన్ ఆఫ్ వైల్డ్ ల్యాండ్‌స్కేప్స్) పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. నిజానికి అప్పటికీ ఆయనకు కొన్ని స్వచ్ఛందసంస్థల మీద సదభిప్రాయం లేదు. పులుల సంరక్షణ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాడు. వర్క్‌షాప్‌లు, క్యాంపులు నిర్వహించాడు. పులులకు సంబంధించి ఫుల్‌టైం ‘సమాచార కార్యకర్త’గా మారిపోయాడు. పట్టణంలో కంటే అడవుల దగ్గరే ఎక్కువ కాలం గడపడం అలవాటు చేసుకున్నాడు. పులుల వేట మీద హృదయం ద్రవించే డాక్యుమెంటరీని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రాజస్థాన్‌లోని మోగియ తెగ ప్రజలకు చూపెట్టాడు. మోగియలకు తరతరాలుగా వేట అనేది ప్రధాన వృత్తి. పులిని వేటాడిన వారిని ‘మొనగాడు’గా పరిగణిస్తారు. మొఘల్‌ల కాలానికి ముందు వీరికి ‘రాయల్ హంటర్’లుగా పేరు. రాజులతో కలిసి వేటకు వెళ్లేవారు. ఒకవిధంగా చెప్పాలంటే వారికి అడవిలో వేట తప్ప బయటి ప్రపంచం తెలియదు. వారిని అర్థం చేసుకోవడానికి దలాల్ అడవుల్లో చాలారోజుల పాటు గడిపాడు. ‘‘మీరు ఇలా కాదు... అలా ఉండాలి’’ అని చెప్పడానికి కూడా చాలామంది భయపడేవారు. ఎందుకంటే వారికి కోపం ఎక్కువ! అలాంటి వారు సైతం దలాల్ రూపొందించిన డాక్యుమెంటరీ చూసి చలించిపోయారు. ముంబై యూనివర్శిటీ, మెల్బోర్న్ యూనివర్శిటీల నుంచి ఆడియో ఇంజనీరింగ్‌లో డిగ్రీలు తీసుకున్న దలాల్ ముంబైలోని దేవానంద్ రికార్డింగ్ స్టూడియోలో మొదటి ఉద్యోగం చేశాడు. ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సౌండ్ ఇంజనీర్‌గా కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో... దలాల్ ఇలా పులుల సంరక్షణ అంటూ అడవులు పట్టుకు తిరగాలన్న నిర్ణయం గురించి విని ఆశ్చర్యపోయిన వారు తప్ప ‘మంచి నిర్ణయం’ అన్నవారు లేరు. ‘‘వణ్యప్రాణులను రక్షించాలనుకునే వాళ్లకు సహకారం అందించడమే మా సంస్థ ధ్యేయం’’ అని చెబుతున్న దలాల్ తొలి దశలో భాగంగా ఫారెస్ట్ గార్డ్లకు చేరువ కావాలనుకుంటున్నాడు. నిజానికి వణ్యప్రాణులను రక్షించడంలో వారు రకరకాల ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. కొందరు వేటగాళ్ల చేతిలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ‘‘వన్యప్రాణుల కోసం వాళ్లు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దురదృష్టమేమిటంటే చాలామంది చేతిలో కాలం చెల్లిన పరికరాలు మాత్రమే ఉన్నాయి. మా స్వచ్ఛందసంస్థ నిర్వహించిన రకరకాల కార్యక్రమాలు, వర్క్‌షాప్‌ల నుంచి వచ్చిన డబ్బులతో ఫస్ట్-ఎయిడ్ కిట్స్లాంటివి వారికి ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నాడు దలాల్. గమ్యం దిశగా తొలి అడుగు వేశాను అంటున్న దలాల్ ‘‘వణ్యప్రాణుల కళ్లలో భయం లేని కాలం రావాలి’’ అని కోరుకుంటున్నాడు. అతని కోరిక ఫలించాలని ఆశిద్దాం. ప్రతికూల పరిస్థితిలో... చిన్నప్పుడు ‘సెరెబ్రల్ పాల్సి’ అనే మెదడుకు సంబంధించిన రుగ్మతతో బాధ పడ్డాడు హన్స్ దలాల్. సానుకూల దృక్పథంతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుండేవాడు. సంగీతకారుడు కావాలనేది దలాల్ కల. కానీ ఎలాంటి సంగీత పరికరాన్ని పట్టుకోవడానికీ చేతులు సహకరించేవి కాదు. నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవాడు. బడిలో చదువు కంటే కళల మీదే ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. వయసు పెరుగుతున్నకొద్దీ సంగీతం మీద ఆసక్తి అంతకంతకూ పెరిగింది. గిటారు వాయించడానికి ప్రయత్నించేవాడుగానీ, చేతి వేళ్లు సహకరించేవి కాదు. ఇంకా పాక్షికంగా ఆ ప్రభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. -
పెన్సిల్, ఎరేజర్
ప్రేరణ మీలో ఉన్న సహజ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేయండి. పెన్సిల్‌తో రాసిన అక్షరాలను చెరిపేసే రబ్బర్ ముక్క(ఎరేజర్), పెన్సిల్ మధ్య జరిగిన ఆసక్తికరమైన ఊహాత్మక సంభాషణను ఇటీవలే ఒకరు నా చెవిన వేశారు. అదేమిటో మీరు కూడా తెలుసుకోండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నమ్మకంగా చెప్పగలను. పెన్సిల్: నన్ను క్షమించు! ఎరేజర్: ఎందుకు చెబుతున్నావ్ పెన్సిల్: నా వల్ల నువ్వు ఎంతో కష్టపడుతున్నావ్, నష్టపోతున్నావ్. నేను ఏదైనా తప్పుగా రాసిన ప్రతిసారి నువ్వు దాన్ని చెరిపేస్తున్నావ్. నా రంగు అంటుకొని నల్లగా, వికారంగా మారుతున్నావ్. క్రమంగా అరిగిపోతూ ఆకారంలో చిన్నగా మారిపోతున్నావ్. చివరికి పూర్తిగా కనిపించకుండా పోతావ్. ఎరేజర్: నిజంగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. నేనిక్కడ ఉన్నది నువ్వు తప్పు చేసినప్పుడు సరిచేసేందుకే! నా పని నేను చేసుకుంటున్నందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఏదో ఒకరోజు నేను పూర్తిగా అరిగిపోక తప్పదని నాకు తెలుసు. అప్పుడు నా స్థానంలో మరో ఎరేజర్ వస్తుంది. నీ తప్పును చెరిపేసే అవకాశం దక్కడం నాకు గర్వంగా ఉంది. నా గురించి విచారిస్తూ నువ్వు రాయడం మానుకోవద్దు. నీ బాధ్యత నీదే, నా బాధ్యత నాదే! ఎవరి పని వారు చేయాల్సిందే!! విద్యార్థుల జీవితాల్లో ‘ఎరేజర్లు’ మీ జీవితాల్లోని ఎరేజర్లను ఎప్పుడైనా గుర్తించారా? లేకపోతే ఆ పని ఇప్పుడే చేయండి. విద్యార్థుల తప్పులను సరిచేసే ఎరేజర్లు నిస్సందేహంగా వారి ఉపాధ్యాయులే. పెన్సిల్ లాంటి విద్యార్థులు చేసే తప్పులను గురువులే సరిచేస్తారు. అందుకోసం వారు తమవంతు శ్రమిస్తారు. ఈ క్రమంలో కొంత శక్తిని, సమయాన్ని కోల్పోయినప్పటికీ ఏ మాత్రం చింతించరు. కారణం.. వారు గురువుల స్థానంలో ఉన్నది విద్యార్థుల తప్పులను సరిదిద్ది, ఉత్తములుగా తీర్చిదిద్దేందుకే. ఉపాధ్యాయుల శ్రమ వల్లే విద్యార్థులు పరిశుద్ధులుగా మారతారు. ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదుగుతారు. పాఠశాల నుంచి కళాశాలకు.. అక్కడి నుంచి వృత్తి లేదా ఉద్యోగాల్లోకి.. ఎక్కడికి వెళ్లినా మార్గదర్శనం చేసే కొత్తకొత్త గురువులు ఎదురుపడుతూనే ఉంటారు. మీ ఉన్నతిని చూసి గర్వించే ఆయా గురువులను సందర్భం వచ్చినప్పుడల్లా స్మరించుకోండి. పెన్సిల్ రాసిన రాతలకు గుర్తింపు వచ్చిదంటే.. అది కేవలం ఎరేజర్ వల్లే.. నిస్వార్థ తోటమాలులు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నిలిపే లక్షణం ఏమిటంటే.. ప్రతి విద్యార్థిలో దాగిఉన్న సహజ ప్రతిభా పాటవాలను పసిగట్టే సామర్థ్యాన్ని కలిగి ఉండడం. సొంత అన్నదమ్ములైన ఇద్దరు విద్యార్థుల్లో తెలివితేటలు ఒకేస్థాయిలో ఉండకపోవచ్చు. ఒకరు చదువుల్లో చురుగ్గా దూసుకుపోతుంటే మరొకరు వెనుకంజ వేస్తుండవచ్చు. కొందరికి అన్ని సబ్జెక్టులపై ఒకే రకమైన ఆసక్తి లేకపోవచ్చు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు, ర్యాంకులే ప్రామాణికం కాదు. నా స్నేహితురాలికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో పెద్దవాడు చదువులో ప్రథమ శ్రేణిలో నిలుస్తున్నాడు. చిన్నబ్బాయికి చదువుపై అంతగా శ్రద్ధ లేదు. అతడు సాధిస్తున్న గ్రేడ్లు నిరాశపరుస్తున్నాయి. తన రెండో కుమారుడి భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న నా మిత్రురాలు అతడి ఉపాధ్యాయుడిని కలిసింది. తన బిడ్డ తీరుపై గోడు వెళ్లబోసుకుంది. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఆమెకు తగిన భరోసా ఇచ్చాడు. ‘‘మీ కుమారుడి గురించి విచారించకండి. చదువులో చురుగ్గా లేకున్నా.. అతడిలో మంచి తెలివితేటలు ఉన్నాయి. జామ చెట్టుకు మామిడికాయలు కాయాలనే అత్యాశ సరికాదు. వేర్వేరు రకాల చెట్లు తమవైన వేర్వేరు రకాల పళ్లను ఇస్తాయి. దేని రుచి దానిదే. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కేవలం నిస్వార్థంగా పనిచేసే తోటమాలులు మాత్రమే. చెట్టుకు నీరు పోసి, ఎరువు వేసి ఆరోగ్యంగా ఎదగనీయడం వరకే వారి బాధ్యత’’ అని పూర్తి చేశాడు. నా స్నేహితురాలి ఇద్దరు కుమారులు తాము ఎంచుకున్న రంగాల్లో ఇప్పుడు వృద్ధిలోకి వచ్చారు. విజయవంతమైన వ్యక్తులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎరేజర్.. మీ చేతుల్లోనే జీవితంలో తెలిసీ తెలియక చేసిన తప్పులను పదేపదే గుర్తుచేసుకొని బాధపడుతూ కూర్చుంటే ఉన్నచోటు నుంచి అంగుళం కూడా ముందుకెళ్లలేరు. పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు అవసరమైన ‘ఎరేజర్’ మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. మీరు ఇంజనీరో, డాక్టరో కాకపోవచ్చు. గొప్ప పదవిలో ఉండకపోవచ్చు. అందుకు చింతించాల్సిన పని లేదు. మీకు మీరుగా ఉత్తమంగా ఉండేందుకు మీరు చేయగలిగినంత కృషి చేయండి. జామ చెట్లకు మామిడి కాయలు కాయవు. జామ చెట్లు జామ కాయలనే ఇస్తాయి. మీదైన ప్రత్యేకతను నిలబెట్టుకోండి. మీరు మీలాగే ఉండేందుకు తోడ్పాటునందించిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేయండి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
పొగ మీద పగబట్టారు!
స్ఫూర్తి ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా గుర్తుందా? అందులో మద్యపానం కారణంగా నాశనమైపోతున్న ఓ ఊరిని మార్చడానికి హీరో నానా తంటాలు పడతాడు. త్యాగాలు చేస్తాడు. కానీ గరిపెమా గ్రామాన్ని బాగు చేయడానికి ఏ హీరో రాలేదు. ఆ ఊరిలోని ప్రతి వ్యక్తీ ఓ హీరో అయ్యాడు. అందుకే ఇప్పుడు గరిపెమా పేరు రికార్డులకెక్కింది. నాగాల్యాండ్ రాజధాని కోహిమాకి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గరిపెమా గ్రామం. ఒకప్పుడు గరి అనే వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఊరికా పేరు వచ్చింది. మూడొందల కుటుంబాలు, ఓ బడి, ఓ ఆసుపత్రి... ఇంతే ఆ ఊరు. కానీ ఇప్పుడది సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. దేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంగా రికార్డు సాధించింది గరిపెమా. మన దేశంలో యేటా 2.200 మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారు. క్యాన్సర్‌తో చనిపోతున్న భారతీయుల్లో నలభై శాతం మంది ధూమపానం వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారే. 90 శాతం మందికి నోటి క్యాన్సర్ పొగాకు వల్లే వస్తోంది. నాగాల్యాండ్‌లో కూడా ధూమపానం చేసేవారి సంఖ్య అధికమే. కానీ ఇప్పుడు ఆ ఊళ్లో ఒక్కరు కూడా పొగాకు జోలికి పోవడం లేదు. పొగ తాగాలని పరితపించడం లేదు. గ్రామ పెద్దలు, గ్రామంలోని యువసంఘం, విద్యార్థి సంఘాలు కలిసి ఊరిలో పొగాకు అన్నమాటే వినబడకుండా చేశాయి. అది మాత్రమే కాదు... ఎక్కడా మద్యం, గుట్కా కూడా లభించకుండా చేశారు. గ్రామస్తులెవరైనా పొగతాగితే ఐదు వందలు, మద్యం సేవిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ ఊరివారే కాదు... సందర్శకులకు, ఊరివారి కోసం వచ్చే బంధుమిత్రులు కూడా వీటిని పాటించాల్సిందే. ఈ నియమాలన్నిటినీ రాసిన ఓ పెద్ద బోర్డు గ్రామంలో అడుగుపెట్టగానే కనిపిస్తుంది. అందరూ అత్యంత కచ్చితంగా నియమాలను అనుసరించడంతో భారతదేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంతో గరిపెమా అవతరించింది. దేశంలోని ఇతర ప్రాంతాలన్నిటికీ ఆదర్శంగా నిలబడింది! -
తండ్రికే పాఠం నేర్పాడు!
స్ఫూర్తి చిన్నపిల్లలకు ఏమీ తెలియదు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు వాళ్లు పెద్దవాళ్లకే పాఠాలు నేర్పుతుంటారు. కెన్ కూడా తన తండ్రికి ఓ పాఠం నేర్పాడు. కానీ అది పాఠం కాదు గుణపాఠమంటాడు కెన్ తండ్రి. ఫిలిప్పైన్సకు చెందిన తొమ్మిదేళ్ల కెన్‌లో ఉన్నట్టుండి ఏదో మార్పు కనిపించింది అతడి తండ్రికి. రోజూ స్కూలు నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్లిపోతున్నాడు కెన్. ఆడుకోవడానికి వెళ్తున్నాడేమో అనుకున్నాడు తండ్రి మొదట. కానీ రోజూ వీపునకు బ్యాగ్ ఒకటి తగిలించుకుని వెళ్లడం చూసి అనుమానమొచ్చింది. రెండు వారాలు చూసిన తరువాత ఓ రోజు కొడుకుని అనుసరించాడు తండ్రి. కెన్ చేస్తున్న పని చూసి అతడు అవాక్కయ్యాడు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ తిరుగు తున్నాడు కెన్. ఎక్కడ వీధికుక్కలు కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నాడు. తన బ్యాగ్‌లోంచి బిస్కట్లు, కేక్ ముక్కలు, తీసి... వెంట తెచ్చిన పేపర్ ప్లేట్లలో వేసి కుక్కలకు పెడుతున్నాడు. ఆ దృశ్యం చూసి విస్తుపోయాడు తండ్రి. వెంటనే వెళ్లి కొడుకుని హత్తుకున్నాడు. ఏమిటిదంతా అని అడిగితే... ‘‘నాకు నువ్వు తిండి పెడతావ్ కదా డాడీ! పాపం వీటికెవరు పెడతారు’’ అన్నాడు కెన్. కొడుకు అన్న ఆ మాటలు తండ్రి మనసును తాకాయి. ఆ రోజు నుంచి ప్రతిరోజూ తన కొడుకుతో పాటు తను కూడా ఆహారం తీసుకుని బయలుదేరడం మొదలుపెట్టాడు. ‘‘మురికిపట్టి వీధుల్లో తిరిగే ఆ కుక్కలను ఎన్నోసార్లు అసహ్యించుకుని తరిమికొట్టాను. కానీ నా కొడుకు వాటిని ప్రేమించాడు. నాకు చాలా సిగ్గుగా ఉంది’’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. వీధికుక్కల కడుపు నింపుతోన్న తన కొడుకు ఫొటోలను కూడా అప్లోడ్ చేశాడు. అవి చూసి చాలామంది కెన్కి ఫ్యాన్స అయిపోయారు. వాళ్లంతా కెన్ చిరునామా తెలుసుకుని విరాళాలు పంపడం మొదలు పెట్టారు. వాటితో కెన్ ‘హ్యాపీ యానిమల్స్ క్లబ్’ను ప్రారంభించాడు. తండ్రితో కలిసి దిక్కులేని మూగజీవులను తెచ్చి పెంచుతున్నాడు. హ్యాట్సాఫ్ కెన్! -
సామాన్యుల దరికి సంగీతం
స్ఫూర్తి ఈమధ్య చెన్నైలో అద్భుతమైన కర్ణాటక సంగీతకచేరి ఒకటి జరిగింది. చెన్నైలోని మున్సిపల్ స్కూళ్ళలో చదివే పేద పిల్లల సంగీత కచ్చేరి అది. ఆ పిల్లలను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతుంటే అనిల్ శ్రీవాస్తవన్ కళ్లు ఒకింత గర్వంగా మెరిసాయి. ఎవరీయన? పియానిస్ట్‌గా చేయి తిరిగిన చెన్నైవాసి అనిల్ శ్రీవాస్తవన్ అమెరికాలో చదువుకున్నారు. నిజానికి ఆయన మనసంతా సంగీతమే. మూడు సంవత్సరాల వయసులో పియానో ప్రేమలో పడిన శ్రీవాస్తవన్ దాన్ని వాయించడంలో మెలకువలు నేర్చుకున్నాడు. స్కూల్లో అతనికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది పియానో. సంగీతమే శ్వాస అనుకున్న శ్రీవాస్తవన్ పదిహేడు సంవత్సరాల వయసులో సంగీతానికి దూరం కావాల్సి వచ్చింది. నాన్న అనారోగ్యంతో ఇంటిని ఆర్థికసమస్యలు చుట్టుముట్టాయి. ‘‘కుటుంబ పరిస్థితి చూస్తున్నావు కదా...పియానో మీద కాదు చదువు మీద దృష్టి పెట్టు’’ అని చెప్పింది అమ్మ. దీంతో తన సంగీత స్వప్నాలను వెనకకుర్చీలో కూర్చో పెట్టక తప్పింది కాదు. ఎకనామిక్స్‌లో మంచి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ముంబయిలో పనిచేశాడు. కొంత కాలం తరువాత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యంబిఏ చేశాడు. జీవన ప్రయాణంలో పరుగులు పెడుతూనే ఉన్నాడు. అయితే తన జీవితంలో సంగీతం లేదని గుర్తుకొచ్చినప్పుడల్లా బాధగా ఉంది. టర్నింగ్ పాయింట్1 ఒకసారి సెలవులకు ఇండియాకు వచ్చినప్పుడు మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్‌లను కలుసుకున్నాడు. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు తనలోని సంగీతాన్ని ఎవరో తట్టిలేపినట్లు అనిపించింది. అలా మళ్లీ సంగీతానికి దగ్గరయ్యాడు. రాజేష్‌తో కలిసి ‘ఇన్ టు ది లైట్’ ఆల్బమ్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది తన జీవితానికి టర్నింగ్ పాయింట్. కొలంబియాలో పీహెచ్‌డి చేస్తున్నప్పుడు ఎక్కువ సమయం మ్యూజిక్ డిపార్ట్మెంట్లోనే గడిపేవాడు. అక్కడ కొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఒకానొక రోజు ‘‘సంగీతం కోసం పిహెచ్డి వదిలేస్తున్నాను’’ అని అమ్మకు మెసేజ్ పెట్టాడు. స్కూల్లో తన కంటే జూనియర్ గురుచరణ్‌ను ఒకానొక సందర్భంలో కలుసుకోవడం కూడా శ్రీవాస్తవన్ త్వరగా సంగీతం వైపు రావడానికి కారణమైంది. గురుచరణ్‌కు కూడా సంగీతం అంటే ప్రాణం. అతనితో కలిసి చేసిన ‘మదిరాక్షి’ అనే ఆల్బమ్‌కు మంచి స్పందన లభించింది. ‘‘ఆల్బమ్‌కు వచ్చిన స్పందన పద్నాలుగు సంవత్సరాల బాధను మాయం చేసింది’’ అంటాడు శ్రీవాస్తవన్. ఎందరో ప్రముఖులతో కలిసి ఆల్బమ్‌లు రూపొందించిన శ్రీవాస్తవ త్వరలో ‘కీ టు ఇండియా’ అనే ఆల్బమ్‌ను విడుదల చేయనున్నాడు. టర్నింగ్ పాయింట్2 పిల్లలంటే ఇష్టపడే శ్రీవాస్తవన్... వాళ్లతో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాడు. అలా ఒకసారి తిరువరూర్లో ప్రభుత్వపాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న క్రమంలో సంగీతానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు వారిని అడిగాడు. అప్పుడు ఆయనకు అర్థమయ్యిందేమిటంటే, పిల్లలకు సినిమా జ్ఞానం తప్ప సంగీతజ్ఞానం బొత్తిగా లేదని. ఇది శ్రీవాస్తవన్ను బాధకు గురి చేసింది. ‘పాఠశాలలో సంగీతానికి ప్రాధాన్యత లేదు’ ‘సంగీత పట్టభద్రులకు ఉద్యోగాలు లేవు’ బాధగా అనుకున్నాడు తనలో తాను. సంగీతాన్ని, సంస్కృతిని పిల్లలకు చేరువ చేయాలనే ఆలోచనతో ఇరవై రెండు లక్షల రూపాయలతో ‘రాప్సోడీ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ’ని స్థాపించాడు. గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్లి మ్యూజిక్‌ను ఒక సబ్జెక్ట్‌గా చేర్చి, దానికి సంబంధించిన విద్యావిధానానికి రూపకల్పన చేస్తుంది రాప్సోడీ. రాప్సోడీ నుంచి ఉపాధ్యాయులు ప్రభుత్వపాఠశాలలకు వెళ్లి సంగీత పాఠాలు బోధిస్తుంటారు. ‘మ్యూజిక్ అండ్ ది మైండ్’ పేరుతో డా.సుధా రాజాతో కలిసి పాఠ్యప్రణాళికను రూపొందించాడు శ్రీవాస్తవన్. ‘‘గణితం, భూగోళశాస్త్రం, చరిత్ర, సైన్స్‌లాగే సంగీతాన్ని కూడా ఒక సబ్జెక్ట్‌గా పరిగణించాలి’’ అనేది ఆయన కోరిక. విశేషం ఏమిటంటే సైన్స్ పాఠాలను పాటలుగా రూపొందించి పిల్లలతో పాడిస్తున్నారు. దీంతో సంగీతం వచ్చినట్లు ఉంటుంది, సబ్జెక్ట్ వచ్చినట్లూ ఉంటుంది. ఆర్థికసమస్యల వల్ల సంగీతం నేర్చుకోవడం అనేది ఒకప్పుడు పేదపిల్లలకు కష్టమైన పని కావచ్చు. కాని శ్రీవాస్తవన్ కృషి వల్ల ఇప్పుడు సంగీతం అనేది పేదపిల్లలను వెదుక్కుంటూ మరీ వస్తుంది. దేశవ్యాప్తంగా పేద విద్యార్థులకు సంగీతాన్ని చేరవేయాలనేది శ్రీవాస్తవన్ కల. ఆ దిశగా ఆయన అభినందన పూర్వకమైన ప్రయత్నం చేస్తున్నారు. -
ఆదర్శ రైతు... రామ్‌శరణ్
స్ఫూర్తి అందరూ చేసేది అనుసరించేయడంలో గొప్పేమీ లేదు. కానీ అందరూ చేసేదాన్ని కొత్తగా చేయాలనుకోవడమే గొప్ప. అలా చేశాడు కాబట్టే రామ్‌శరణ్ వర్మ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలోని దౌలత్‌పూర్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు రామ్‌శరణ్. చదువులో పెద్దగా రాణించలేకపోవడంతో ఎనిమిదో తరగతితోనే బడికి బైబై చెప్పేశాడు. తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవాడు. తండ్రి మరణించిన తరువాత ఆరు ఎకరాల పొలంలో తనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది రామ్శరణ్కి. వ్యవసాయం పట్ల ప్రత్యేక ఆసక్తి లేదు. అలాగని అనాసక్తీ లేదు. కానీ తండ్రి పొలం ఎప్పుడైతే తన చేతికి వచ్చిందో అప్పట్నుంచీ పంటల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. వరి, గోధుమ, బంగాళదుంపలను పండించడం మొదలు పెట్టారు. దిగుబడి బాగుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. దాంతో వ్యవసాయాన్ని సవాలుగా తీసుకున్నారు. రకరకాల పంటల గురించి, వాటి సాగు గురించి పరిశోధ నలు చేయడం మొదలుపెట్టారు. వ్యవసాయం గురించి వెలువడే ప్రతి పత్రికా చదివారు. ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యారు. విదేశాల్లో ఉన్న టెక్నాలజీ గురించి తెలుసు కున్నారు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా పంటలు పండించడం మొదలుపెట్టారు. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ ఆకర్షించింది. ఆయన దగ్గరకు వచ్చి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయడమెలాగో నేర్పమని అడిగారు. అలా అలా రామ్‌శరణ్ పేరు పాకిపోయింది. కొన్ని వందల గ్రామాల రైతులకు ఆయన వ్యవసాయ గురువుగా మారిపోయారు. పదిహేనేళ్లలో ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల వ్యవసాయ రూపురేఖల్ని మార్చేశారాయన. దాదాపు ఎనభై అయిదు ఎకరాల్లో రామ్‌శరణ్ పండించే టొమాటో, అరటి, బంగాళాదుంపలు, వరి వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి! -
పిల్లల కోసం బళ్లో...
స్ఫూర్తి అప్పుడెప్పుడో కాలేజీ బుల్లోడు అనే సినిమా వచ్చింది. కోట్ల ఆస్తి ఉండి కూడా కొడుకుని దార్లో పెట్టడానికి ఏఎన్నార్ కాలేజీలో చేరతారు. ఆ వయసులో కాలేజీకి వెళ్లడమేంటి, సినిమా కాబట్టి సరిపోయింది అనుకున్నారంతా. కానీ సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా అలా జరుగు తుందని ముంబైకి చెందిన జయశ్రీ కానమ్ నిరూపించింది. నలభయ్యొక్కేళ్ల వయసులో జయశ్రీ బడిలో చేరింది. అయితే ఏఎన్నార్లాగా పిల్లల్ని దారిలో పెట్టడానికి కాదు.. తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తునూ తీర్చిదిద్దడానికి! చిన్నప్పుడు ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసింది జయశ్రీ. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేది. యుక్త వయసు వచ్చిన తరువాత జయంత్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడ పిల్లలకు తల్లయ్యింది. అంతా ఆనందంగా ఉంది అనుకున్న సమయంలో ఆమె జీవితం అల్లకల్లోలం అయ్యింది. 2005లో... ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న జయంత్ హఠాత్తుగా వచ్చిన వరద నీటిలో చిక్కుకుని మరణించాడు. దాంతో కూతుళ్ల బాధ్యత జయశ్రీ మీదే పడింది. ఇళ్లల్లో వంట పని చేస్తూ కూతుళ్లను చదివించసాగింది. అంతలో అనుకోకుండా అంగన్వాడీలో పనిచేసే అవకాశం వచ్చింది జయశ్రీకి. అక్కడ చిన్న పిల్లలకు తనకు తెలిసిన చదువు చెప్పేది. ఆమె తెలివితేటలను గుర్తించిన ఓ ప్రభుత్వాధికారి, ‘నువ్వు చదువుకుని ఉంటే ఇంకా మంచి పని ఇప్పించే వాడిని, పిల్లల్ని ఇంకా బాగా పెంచుకునేదానివి’ అన్నారు. అంతే... ఆ క్షణమే ఆమె చదువుకోవాలని నిర్ణయించుకుంది. జయశ్రీ పెద్ద కూతురు షీతల్ ఇంటర్ చదువుతోంది. రెండో కూతురు శ్వేత ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. కూతురితో పాటే జయశ్రీ కూడా పరీక్షలు రాసింది. డిగ్రీ కూడా చేస్తానంటోంది. ఇన్నేళ్ల తరువాత చదువుకుంటు న్నందుకు సంతోషపడటం లేదామె. తన కూతుళ్ల కోసం చదువుకుంటున్నందుకు సంబరపడుతోంది. తమ కోసం కష్టపడుతోన్న తల్లికి షీతల్, శ్వేతలు సహాయ పడుతున్నారు. తాము కూడా బాగా చదివి తల్లిని మహరాణిలా చూసు కుంటామంటున్నారు. అమ్మ రుణం తీర్చుకోవడానికి వాళ్లు ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటారు! -
తన కోపమే తన శత్రువు
ప్రేరణ ‘తన కోపమే తన శత్రువు’ అని పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం. కోపంతో శత్రువులను పెంచుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. క్షణికావేశం అంతులేని అనర్థాలకు దారితీస్తుంది. నిరర్థకమైన ఆగ్రహం నుంచి విముక్తి కోసం ప్రయత్నించాలి. తన శాంతమే తనకు రక్ష అనే సూక్తిని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆచరించాలి. ఎప్పుడూ కోపంతో మండిపడే తన కుమారుడికి ఓ తండ్రి ఎలా జ్ఞానోదయం కలిగించాడో ఇప్పుడు తెలుసుకుందాం.. అతడి అనుభవం నుంచి మనం పాఠం నేర్చుకుందాం.. ప్రతి చిన్న విషయానికి ఆవేశమొద్దు: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరానికి సమీపంలో ఉండే నవయువకుడు మార్టిన్ ఎంతో చురుకైనవాడు. ఒళ్లు దాచుకోకుండా కష్టపడతాడు. కానీ అతడిలో ఉన్న దుర్గుణం ఏమిటంటే.. విపరీతమైన కోపం. ప్రతిచిన్న విషయానికీ తీవ్ర ఆవేశానికి లోనవుతుంటాడు. కోపంతో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. స్నేహితులను, కుటుంబ సభ్యులను కఠినమైన పదజాలంతో దూషిస్తుంటాడు. అలాంటి మాటలు ఎంత చేటు చేస్తాయో కూడా కోపం కోరల్లో చిక్కిన మార్టిన్ గుర్తించలేడు. తన కుమారుడి కోపావేశాలు బాగా తెలిసిన మార్టిన్ తండ్రి.. అతడిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. మార్టిన్‌కు ఓ సంచి నిండా మేకులు ఇచ్చాడు. ఇకపై కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకును ఇంటి వెనకున్న చెక్కలోకి దిగగొట్టమని సూచించాడు. అప్పుడు ఏ మూడ్‌లో ఉన్నాడోగానీ మార్టిన్ దీనికి వెంటనే అంగీకరించాడు. మొదటిరోజు అతడి ప్రకోపానికి 35 మేకులు ఖర్చయ్యాయి. రోజులు గడుస్తున్నకొద్దీ చెక్కలోకి దిగుతున్న మేకుల సంఖ్య క్రమంగా తగ్గసాగింది. ఎందుకంటే.. కోపం వచ్చిన ప్రతిసారీ మేకు, సుత్తి తీసుకొని ఇంటి వెనక్కి వెళ్లడం మార్టిన్‌కు కష్టంగా తోచసాగింది. దీనికంటే కోపాన్ని తగ్గించుకోవడమే సులభం అని అనిపించింది. దీనివల్ల అతడు ఆగ్రహానికి గురయ్యే సందర్భాలు తగ్గాయి. చివరగా ఒకరోజు ఒక్క మేకుకు కూడా పనిచెప్పే పరిస్థితి రాలేదు. అంటే.. ఆ రోజు అతడికి ఒక్కసారి కూడా కోపం రాలేదు. ఈ పరిస్థితి మార్టిన్‌కు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగింది. తనలో వచ్చిన మార్పును నమ్మలేకపోయాడు. వెంటనే తండ్రికి ఈ విషయాన్ని తెలిపాడు. అనకూడని మాటలతో ప్రతికూల ప్రభావాలెన్నో: కుమారుడికి నేర్పాల్సిన పాఠం ఇంకా మిగిలే ఉండడంతో.. తండ్రి ఇప్పుడు మార్టిన్‌కు మరో పని అప్పజెప్పాడు. అదేమిటంటే.. ఒక్కసారి కూడా కోపం రాని రోజు ఒక్కో మేకును చెక్కలోంచి బయటకు తీయమని సూచించాడు. మార్టిన్ తన తండ్రి చెప్పినట్టే చేశాడు. రోజురోజుకి అతడు తీస్తున్న మేకుల సంఖ్య పెరగసాగింది. కొన్ని నెలల తర్వాత అన్ని మేకులు తిరిగొచ్చాయి. మార్టిన్‌కు ఇది మళ్లీ ఆశ్చర్యాన్ని కలిగించింది. విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లాడు. మార్టిన్‌ను తండ్రి తమ ఇంటి వెనకున్న చెక్క దగ్గరికి తీసుకెళ్లాడు. ‘‘మార్టిన్! నువ్వు నేను చెప్పినట్లే చేశావు. నీవు చేసిన పనికి నేనెంతగా గర్విస్తున్నానో మాటల్లో చెప్పలేను. నీవు కొట్టిన మేకుల వల్ల చెక్కలో ఏర్పడిన రంధ్రాలను చూశావా? రంధ్రాలతో అందవిహీనంగా మారిన చెక్కను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం సాధ్యమా? నీ కోపం కూడా అలాంటిదే. ఆవేశంలో ఒళ్లు మరిచి మాట్లాడే మాటలు వికృతమైన మరకలను సృష్టిస్తాయి. తర్వాత ఎన్నిసార్లు క్షమాపణలు కోరుకున్నా.. ఆ మరకలను చెరిపివేయలేం. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటావని ఆశిస్తున్నా...’’ అంటూ మార్టిన్ తండ్రి తన హితబోధను పూర్తిచేశాడు. ఈ ఆచరణాత్మక బోధనతో మార్టిన్‌లో పూర్తిగా మార్పు కలిగింది. ప్రశాంతంగా ఉంటేనే ఇతరులు గౌరవిస్తారు: మార్టిన్‌కు అతడి తండ్రి నేర్పిన పాఠం మనకు సైతం విలువైనదే. ఇది మనసులో నాటుకుపోతే ఇకపై అనర్థదాయకమైన కోపానికి గురయ్యే అవకాశం ఉండదు. ప్రశాంతచిత్తంతో వ్యవహరిస్తే అనుబంధాలు మెరుగవుతాయి. ఇరుగుపొరుగు మిమ్మల్ని కచ్చితంగా ఇష్టపడతారు. మిమ్మల్ని అమితంగా గౌరవిస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటే ఇతరులు సైతం మీతో అలాగే ఉంటారు. ఈసారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. మార్టిన్ లాగా మేకులు దిగగొట్టడం లాంటి ఏదైనా ఒక చిన్న శిక్ష వేసుకోండి. ఆ శిక్ష అనుభవించడం కంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే సులభమని మీరు తప్పకుండా గుర్తిస్తారు. కోపంలో, ఆవేశంలో ఉన్నప్పుడు అనుకున్నది సాధించలేమన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆవేశానికి లోనుకాకూడదు: కాగితంపై పెన్సిల్‌తో రాసిన దాన్ని చెరిపేయాలనుకుంటే రబ్బర్(ఎరేజర్) ఉపయోగిస్తాం. అక్షరాలను చెరిపేసినా అక్కడ మరక మాత్రం పూర్తిగా పోదు. ‘క్షమాపణ’ కూడా ఎరేజర్ లాంటిదే. ఆవేశంలో తప్పుగా మాట్లాడి క్షమాపణలు కోరినంత మాత్రాన వ్యక్తులపై పడిన ప్రతికూల ప్రభావం పూర్తిగా పోతుందనుకోవడం పొరపాటు. కాబట్టి ఆవేశానికి లోనుకాకుండా అప్రమత్తంగా ఉండడమే సదా మంచిది. ఆవేశం వల్ల అనర్థాలెన్నో: ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుండడంతో మనుషులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అనకూడని మాటలు అంటే అవి వేగంగా వ్యాపిస్తున్నాయి. ఎంతో నష్టాన్ని తెస్తున్నాయి. సెల్ఫోన్లలో ఎస్ఎంఎస్లు, ఈ-మెయిళ్ల వంటి వాటి విషయంలో జాగరూకత అవసరం. ఇతరులపై ఉన్న కోపంతో వారికి వ్యతిరేకంగా ఏదైనా సందేశాన్ని టైప్ చేసినప్పుడు వెంటనే పంపించకుండా కొద్దిసేపు ఓపిక పట్టండి. దాన్ని ‘డ్రాఫ్ట్ బాక్స్’కే పరిమితం చేయండి. ఆవేశపడి ‘సెండ్’ చేయొద్దు, దాని ఫలితం అనుభవించొద్దు. సహనం కోల్పోతే జీవితంలో ఎంతో పోగొట్టుకుంటామన్న విషయాన్ని తెలుసుకోవాలి. కోపం తెచ్చుకోనని బలంగా అనుకోండి: ఈసారి మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు ఇతరులతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మొదట బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. కొద్దిసేపు ఆగండి. మీ కోపం తీవ్రత తగ్గిపోయిన తర్వాత చెప్పాలనుకున్నది నిదానంగా చెప్పండి. ఇకపై ఎప్పుడూ కోపగించుకోనని తీర్మానించుకోండి. కోపం మీ మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని మింగేయకుండా చూసుకోండి. కోపం మీకు శత్రువుల్ని సృష్టించకుండా జాగ్రత్తపడండి. మీలో రావాల్సిన మార్పును ఈరోజే ప్రారంభించండి. ‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని పాతబస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు విద్యావకాశాలను కల్పించడంతో పాటు అర్హులైన విద్యార్థులకు హాస్టల్ వసతిని కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. జిల్లాలో నిరక్షరాస్యతా శాతం రోజురోజుకు తగ్గిపోతోందన్నారు. దళిత సంఘాల నాయకులు సామాజిక సేవా దృక్పథంతో బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఆంగ్ల బాషవైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని అందుకు ప్రతి మండల కేంద్రంలో ఆంగ్ల భాషలో బోధించేందుకు మోడ ల్ పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని ఈ పాఠశాలలో 6 నుంచి ఇంటర్ వ రకు హాస్టల్ వసతితో పాటు ఆంగ్ల భాషలో బోధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే ఉండాలని అంతే తప్ప పనిలో ఉండరాదని సూచించారు. అదనపు ఎస్పీ మధుమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కుల వివక్షత ఎక్కడైనా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. కార్యక్ర మంలో డీఆర్వో దయానంద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సత్యనారాయణతో పాటు దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో అదనపు జేసీ మూర్తి హాజరయ్యారు. అనంతరం ఏజేసీ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి ఫలితంగానే విద్యావకాశాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. గ్రామీణ వికాస్ బ్యాంక్ జిల్లా కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజీవరావు అంబేద్కర్ సేవలను కొనియాడారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ప్రధాన కార్యదర్శి అడివయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
మాటలతో బాట వేసుకుంది!
స్ఫూర్తి మనసులో ఉన్నది చెప్పేందుకు మాట్లాడటం వేరు... మనసులను తాకేట్టుగా మాట్లాడటం వేరు. ఆ కళ, అలా మాట్లాడే తెగువ అందరికీ ఉండవు. కానీ రచనకు ఉన్నాయి. అందుకే ఆమె మాటలతోనే బాట వేసుకుంది. తన మాటలనే అస్త్రాలుగా మార్చి సమస్యలపై ఎక్కుపెడుతోంది. ఎందరి ఆలోచనలకో పదునుపెడుతోంది. మన దేశం ముందుకెళ్తోందని చాలామంది అంటూంటారు కానీ... వెనకబడిన ప్రాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లాంటి అతి పెద్ద రాష్ట్రంలో ఉన్న పలు చిన్ని చిన్ని గ్రామాల్లో అభివృద్ధి అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. వసతులు ఉండవు. ఆధునికత అన్నమాటకు నిర్వచనం కూడా తెలియదు వారికి. అలాంటిచోట పుట్టిన అమ్మాయి రచన. ఆడపిల్లలు గడపదాటి బయటకు వెళ్లకూడదు, అందరూ వినేలా మాట్లాడకూడదు లాంటి కట్టుబాట్ల మధ్య నలిగిపోయిందామె. ఆడపిల్ల అంటే ఇక ఇంతేనా, నోరు విప్పి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అనుకునేది. ఆడపిల్ల అంటే ఏంటో మాటలతోనే అందరికీ చెప్పాలని తహతహలాడేది. ఆ తపనే ఆమెను రేడియో జాకీని చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ జిల్లాలో ఎనభైకి పైగా గ్రామాలున్నాయి. అక్కడి పరిస్థితులను మార్చేందుకు జిల్లా మెజిస్ట్రేట్ రణవీర్ ప్రసాద్ ఓ సరికొత్త ప్రణాళిక వేశారు. పలు సమస్యల మీద అవగాహన కల్పించేందుకు ‘లలిత్ లోక్వాణి’ పేరుతో ఓ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ని స్థాపించారు. అందులో పనిచేయడానికి రావాలని, మహిళల సమస్యలపై గళం విప్పాలని ఆహ్వానించారు. కానీ ఏ ఒక్కరూ వెళ్లేందుకు ధైర్యం చేయలేదు... రచన తప్ప. ఇంట్లోవాళ్లు కాదన్నా, కట్టడి చేయాలని ప్రయత్నించినా ఆగలేదామె. ఇంటి గడప దాటి రేడియో స్టేషన్ గడపలో అడుగుపెట్టింది. మాట్లాడవద్దన్నవాళ్లందరినీ తన మాటలతో ముగ్ధుల్ని చేయడం మొదలుపెట్టింది. ఆమెను చూసి పలువురు అమ్మాయిలు స్ఫూర్తి పొందారు. తామూ జాకీలుగా పనిచేస్తామంటూ వెళ్లారు. ఇప్పుడు ఆ రేడియో స్టేషన్లో చాలామంది మహిళా జాకీలు ఉన్నారు. తమ జిల్లాలోని పలు సమస్యల గురించి వివరిస్తూ అందరినీ చైతన్యవంతుల్ని చేస్తున్నారు. -
మూడేళ్లకే మోడల్...ఐదేళ్లకే ఫ్యాషన్ డిజైనర్!
స్ఫూర్తి పిల్లల్ని పెద్దయ్యాక ఏం చేస్తావ్ అని అడగడం సహజం. డ్యూడా బున్షెన్ని ఆ ప్రశ్న అడగాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే... అడిగే చాన్స్ ఆ చిన్నారి ఇవ్వలేదు. పెద్దయ్యాక చేసేదేంటి, ఇప్పుడే చేసేస్తా అంటూ ఐదేళ్ల వయసులోనే తన ప్రతిభను చాటింది. బుజ్జి ఫ్యాషన్ డిజైనర్‌గా సంచలనం సృష్టిస్తోంది. బ్రెజిల్‌కి చెందిన సూపర్ మోడల్ జిసెల్ బున్షెన్ మేనకోడలు డ్యూడా. చిన్నప్పట్నుంచీ అత్త ఎక్కడికెళ్లినా నేనూ వస్తానని మారాం చేసేది డ్యూడా. జిసెల్ కూడా వద్దనేది కాదు. డ్యూడా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తులు వేసి మరీ తీసుకెళ్లేది. దాంతో ఫొటోగ్రాఫర్లు పోటీపడి ఫొటోలు తీసేవారు. అవి కాస్తా ఓ దుస్తుల కంపెనీ కంట్లో పడ్డాయి. తాము తయారుచేసే చిన్నపిల్లల దుస్తులకు డ్యూడాని మోడల్‌గా తీసుకుంటామని వాళ్లు జిసెల్ని అడిగారు. ఆమె ఆనందంగా అంగీకరించింది. దాంతో మూడేళ్లకే మోడల్ అయిపోయింది డ్యూడా. రాను రాను ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఏవి వేసుకుంటే బాగుంటుందో డ్యూడాకి అర్థమైపోసాగింది. తనకిలాంటి డ్రెస్ కావాలని వచ్చీరాని మాటలతో వివరించేది. ఆమె చెప్పేది విని... ఇంత చిన్న వయసులో ఇంత ఫ్యాషన్ సెన్స్ ఎలా వచ్చిందా అని టైలర్లు విస్తుపోయేవారు. బ్రెజిల్‌కి చెందిన ‘బ్రాండిలి ముండీ’ అనే టెక్స్టైల్ కంపెనీ అయితే... తమ కంపెనీకి చిన్నపిల్లల దుస్తులు డిజైన్ చేసేందుకు డ్యూడాని నియమించుకుంది. దాంతో అతి చిన్న ఫ్యాషన్ డిజైనర్‌గా డ్యూడా రికార్డులకెక్కింది! -
తెంచుకోండి.. నమ్మకాల బంధనాలు
ప్రేరణ మీరు జీవితంలో ఏం సాధించగలరనేది మీలోని శక్తిసామర్థ్యాలు నిర్ణయించాలే తప్ప మీ చిన్నప్పటి నమ్మకాలు, అనుభవాలు కాదు. సర్కస్‌లో ఏనుగు విన్యాసాలను చూసి మీరు ఆనందించే ఉంటారు కదా! అంతటి బలమైన జంతువు కూడా రింగ్‌మాస్టర్ చెప్పినట్టల్లా నడుచుకుంటుంది. ప్రదర్శన పూర్తయ్యాక దాని కాలును మామూలు ఇనుప గొలుసుతో ఒక చిన్న చెక్కకొయ్యకు కట్టి ఉంచుతారు. 10 అడుగుల ఎత్తు, 5000కిలోల బరువున్న బలమైన ఏనుగుకు ఆ గొలుసును తెంచడం పెద్ద కష్టం కాదు. అయినా, ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయదు. అక్కడి నుంచి పారిపోవాలనుకుంటే గొలుసు తెంచుకొని పారిపోవడం ఏనుగుకు చేతకాదా?... ఎందుక్కాదు! కచ్చితంగా చేతనవుతుంది. మరి ఎందుకు పారిపోదు? కొయ్యను పెకిలించి, గొలుసును తెంచుకోవడం అసాధ్యమని దాని మనసులో బలంగా ముద్రించుకుపోయింది కాబట్టి!! అలా ఎందుకు జరిగింది? పిల్లగా ఉన్నప్పుడు ఎదురైన బాధాకరమైన అనుభవం ఏనుగు మనసులో గట్టిగా నాటుకుపోయింది. ఇప్పటికీ అదే నిజమని నమ్ముతోంది. బంధనాన్ని తెంచుకొని, స్వేచ్ఛ పొందడం తనవల్ల కాదని అనుకుంటోంది. సర్కస్‌లో విన్యాసాలు చేసే గజరాజుకు చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తుంటారు. అప్పుడు దాని కాలుకు బలమైన ఇనుప గొలుసును బిగించి, భూమిలోకి దిగగొట్టిన ఉక్కు కొయ్యకు కట్టేస్తారు. అక్కడి నుంచి పారిపోయేందుకు అది తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఉక్కు కొయ్యను పెకిలించి, గొలుసును తెంచేయాలని పోరాడుతుంది. కాలును లాగుతున్న కొద్దీ, ఇనుప గొలుసు కోసుకుపోతుంది. కాలులోంచి రక్తం కారి, విపరీతంగా నొప్పి పుడుతుంది. కాలిపై గాయం ఏర్పడుతుంది. పారిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ బాధాకరమైన అనుభవమే ఎదురవుతుంది. దాంతో ఇక పారిపోవాలనుకోవడం వ్యర్థ ప్రయత్నమేనని చివరికి బుల్లి ఏనుగు భావిస్తుంది. తనకు ఇక స్వేచ్ఛ లభించదని నమ్ముతుంది. అప్పటినుంచి గొలుసుతో కట్టేసిన కాలును లాగే ప్రయత్నం కూడా చేయదు. ఆ నొప్పి, అనుభవం దాని మనసులో జీవితాంతం నిలిచిపోతాయి. ఏనుగు పెరిగి పెద్దదయ్యింది. దాని ఆకారం, బరువు, బలం ఎన్నో రెట్లు పెరిగాయి. అయినా దాన్నిప్పుడు మామూలు గొలుసుతో, చిన్న చెక్క కొయ్యకే కట్టేస్తున్నారు. అది ఎక్కడికీ పారిపోదని తెలుసు కాబట్టే అలాంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగు తన బలమేంటో తెలుసుకోవడం లేదు. గొలుసు ఎంత పొడవుంటే అంత వరకే వెళ్తోంది తప్ప దాన్ని లాగేసే ప్రయత్నం చేయడం లేదు. అది తన ప్రస్తుత దుస్థితి నుంచి విముక్తి పొందలేకపోతోంది. రింగ్‌మాస్టర్ చేతిలో దెబ్బలు తింటూ అతడు చెప్పినట్టల్లా చేస్తోంది. మనుషుల్లోనూ గజ బలం! ఏనుగు కష్టాలకు కారణమేంటో తెలిసిందా?చిన్నప్పటి అనుభవాన్ని, నమ్మకాన్ని ఇంకా పట్టుకొని వేలాడ్డమే దాని దుస్థితికి కారణం. మనందరం కూడా సర్కస్ ఏనుగులాంటి వాళ్లమే. మనలో కూడా నమ్మశక్యం కానంత బలం దాగి ఉంది. అలాగే మనం ధైర్యంగా ముందుకెళ్లకుండా బంధిస్తున్న గొలుసులు, చెక్క కొయ్యలు కూడా ఉన్నాయి. మనసుల్లో ఎప్పుడో ఏర్పడ్డ నమ్మకాలు, అనుభవాలు మనుషులను బంధించి ఉంచుతున్నాయి. అవి వారిని వారే తక్కువ అంచనా వేసుకునేలా చేస్తున్నాయి. చిన్నతనంలో ఏర్పడ్డ ఒక్క నమ్మకం, ఎదురైన అనుభవం, పలకరించిన ఒక చిన్న వైఫల్యం, ఎవరో చెప్పిన ఒక విషయం.. ఇలాంటివన్నీ ఇనుప గొలుసులుగా, చెక్క కొయ్యలుగా మారిపోతున్నాయి. మనుషులు తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా చేస్తున్నాయి. చేయగలిగే పనిని కూడా చేయకుండా ఆపుతున్నాయి. సాధించగలిగే విజయాలను సాధించకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు నిజాయతీగా ప్రశ్నించుకోండి. మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఇనుప గొలుసులు, చెక్క కొయ్యలు ఏమిటో తెలుసుకోండి. నువ్వు ఆ పని చేయొద్దు, నీ వల్ల కాదు, నీకు అంత సత్తా లేదు, నువ్వొక దద్దమ్మ, నీలో తెలివి తేటలు లేవు.. బాల్యంలో చాలామంది ఇలాంటి మాటలు అనిపించుకున్నవారే! దురదృష్టం ఏమిటంటే.. వాటిని నిజమేనని నమ్మేస్తుంటారు. తమలో నిజంగా ఎలాంటి శక్తిసామర్థ్యాలు లేవని, బలహీనులమని అనుకుంటారు. జీవితాంతం అదే భ్రమలో బతికేస్తుంటారు. తమ అపజయాలకు కారణాలు వెతుక్కుంటారు. పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారినా, ఉక్కు కొయ్య స్థానంలో చెక్క కొయ్య వచ్చినా.. ఆ విషయం కూడా తెలుసుకోలేరు. ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నా చేయలేరు. ‘నా వల్ల కాదు’ అనే పాత నమ్మకమే వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. బలహీనులుగా మార్చొద్దు మనుషులు కొన్నిసార్లు ఏనుగుల శిక్షకుడి పాత్రను పోషిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు, ఉపాధ్యాయులు విద్యార్థులకు, మిత్రులు తమ సహచరులకు తెలిసో తెలియకో బలహీనతను నూరిపోస్తుంటారు. తద్వారా వారికి మేలు చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. ఇది తప్పు ఆలోచన. మీ కింద ఉన్నవారిని, సహచరులను ఇనుప గొలుసుతో కట్టేయాలని చూడకండి. తాము నిజంగానే బలహీనులమని వారు భ్రమపడేలా చేయకండి. సంకెళ్ల నుంచి విముక్తి చెందండి ఏనుగులో ఉన్నంత బలం మనుషుల్లోనూ ఉందని నమ్మండి. ఇనుప గొలుసులకు, చెక్క కొయ్యలకు లొంగిపోకండి. మీరు ముందుకెళ్లకుండా బంధించి ఉంచుతున్న నమ్మకాలను పటాపంచలు చేయండి. మీరు జీవితంలో ఏం సాధించగలరనేది మీలోని శక్తిసామర్థ్యాలు నిర్ణయించాలే తప్ప మీ చిన్నప్పటి నమ్మకాలు, అనుభవాలు కాదు. చెక్క కొయ్యను విరిచేయండి, ఇనుప గొలుసును తెంచేయండి.. మీ పాత భావనల నుంచి విముక్తి పొందండి. అనుకున్నది సాధించి చూపండి.. స్వేచ్ఛగా!! -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో.. -
వెదికిపెడతారు!
స్ఫూర్తి ఏడేళ్లక్రితం నేపాల్‌లో వచ్చిన వరదలపుడు జనుక అనే రెండేళ్లమ్మాయి తప్పిపోయింది. ఎవరో స్వచ్ఛందసంస్థవారు జనుకను ఓ అనాథాశ్రమంలో చేర్పించారు. వరదబీభత్సం కారణంగా అందరూ ఉండి కూడా అనాథగా మారిపోయిన జనుక ఈ మధ్యనే తన తల్లిని కలుసుకుంది. ఏడేళ్ల తర్వాత జనుక ఫోన్ చేసి తల్లితో మాట్లాడిన దృశ్యాన్ని చూసి ఆశ్రమంలోని వారంతా చలించిపోయారు. ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న అనాథాశ్రమంలోనే తన బిడ్డ ఉందని కనుక్కోలేకపోయిన ఆ తల్లి జనుకను గుండెలకు హత్తుకుని చెప్పిన మాట ‘....అంతా ఎన్‌జిఎన్ (నెక్ట్స్ జనరేషన్ నేపాల్) పుణ్యం’ అని.. ఎన్‌జిఎన్ అనేది ఒక స్వచ్ఛందసంస్థ. తప్పిపోయినవారి వివరాలిస్తే ఎన్ని తిప్పలు పడైనా వెదికిపెడుతుందన్నమాట. జనుక తల్లి చెప్పిన వివరాల ఆధారంగా రకరకాల శోధనలు చేసి తల్లినీ బిడ్డనీ కలిపింది ఎన్‌జిఎన్. అలాగే నేపాల్‌లోని హుమ్లా ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ వయసు పన్నెండు. పాఠశాల విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన లక్ష్మణ్ అకస్మాత్తుగా మాయమయ్యాడు. తప్పిపోయాడని కొందరు, అపహరించారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసి ఊరుకున్నారు. చివరికి ఈ కేసు ఎన్‌జిఎన్ బృందం చేధించింది. ఇలా తమ దృష్టికి వచ్చిన మిస్సింగ్ కేసులన్నింటినీ ఛేదిస్తున్న ఎన్‌జిఎన్ సేవలను నేపాల్ ప్రజలంతా ముక్తకంఠంతో అభినందిస్తున్నారు. -
ఆకలి బాధల నుంచి ఐఏయస్ వరకు
స్ఫూర్తి స్కూల్లో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకొని ‘శభాష్’ అనిపించుకునే పేమ్‌కు పెద్దగా కలలేమీ ఉండేవి కావు. మంచి కళాశాలలో చదువుకోవాలనే కోరిక మాత్రం ఉండేది. కాలేజీ చదువు కోసం షిల్లాంగ్ వెళ్లడం అతని జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. అప్పుడు తానొక కల కన్నాడు... ఐఏయస్ అవ్వాలని. కల సంపన్నంగా ఉంది. ఇంట్లో తిష్ఠ వేసిన బీదరికం మాత్రం వెక్కిరించింది. అయితే వెక్కిరింపులకు వెరవకుండా కష్టాలకు ఎదురీది అనుకున్నది సాధించాడు. ఐఏయస్ అయ్యాడు. ఐఏఎస్ ట్రైనింగ్ కాలంలో వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. తప్పనిసరి పరిస్థితిలో నాన్నను విడిచి వెళ్లాల్సి వచ్చింది. క్లాసులో కూర్చున్నా మనసంతా నాన్న మీదే ఉండేది. ఒకరోజు నాన్నకు సీరియస్‌గా ఉందనే వార్త తెలిసి ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఆయన చనిపోయారు. కన్నీళ్లు ఆగలేదు. ‘‘మా నాన్న చివరి రోజుల్లో దగ్గర లేను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది’’ అంటాడు బాధగా పేమ్. ‘‘బీదవాళ్లకు సహాయపడు’’ అని నాన్న చెప్పిన మాట మాత్రం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటాడు. మణిపూర్‌లో కొన్ని జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసినప్పుడు తన పరిధిలో పేదవాళ్లకు సహాయపడ్డాడు. ముప్పైతొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించి ఎందరి జీవితాలనో ప్రభావితం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ ఆయనకు ఆదర్శం. మండేలా, మదర్ థెరిసా అంటే కూడా చాలా అభిమానం. ‘‘బాగా కష్టపడి పని చేసే అధికారి’’ అన్న పేరును తక్కువ కాలంలోనే సంపాదించుకున్నాడు ఇరవై తొమ్మిది ఏళ్ళ పేమ్. మేఘాలయాలోని జెమి నాగ తెగలో తొలి ఐఏయస్ అధికారి అయిన పేమ్ ప్రస్తుతం మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో జాయింట్ సెక్రటరీ హాదాలో పనిచేస్తున్నాడు. -
నాన్నే స్ఫూర్తి ప్రదాత
నాకు నాన్న సహకారం సదా ఉంటుంది. నాకు గొప్ప స్ఫూర్తి ప్రదాత కూడా ఆయనే. నేను నాన్నతో కలిసి నటించకపోయినా సంగీతపరంగా ఆయనతో అనుభూతిని ఎప్పుడూ పంచుకుంటాను. చక్కని ఆత్మీయతానుబంధాన్ని తెలిపే ఈ వ్యాఖ్యలు చేసింది కమల్ హాసన్ ప్రథమ పుత్రిక, ప్రముఖ కథానాయకి నటి శ్రుతి హాసన్. ఎలాంటి సందర్భంలో ఈమె ఈ వ్యాఖ్యలు చేశారంటే, శ్రుతి హాసన్ ముందు సంగీత కళాకారిణి. ఆ తరువాతే నటీమణి అన్న విషయం తెలిసిందే. ఈమెలో మంచి సంగీత దర్శకులు, గాయని ఉన్నారు. తొలుత పలు సంగీత ఆల్బమ్స్ రూపొందించారు. ఆ తరువాత తన తండ్రి నటించిన ఉన్నైపోల్ ఒరువన్ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా సినీ రంగానికి పరిచయం అయ్యారు. అసలు విషయం ఏమిటంటే శ్రుతి హాసన్ అస్సామి సంగీత కళాకారుడు జాయ్ బరువాతో కలిసి ప్రతిబి గురే అనే పాటను 2012లో రూపొందించారు. దీనికి తమిళ సాహిత్యాన్ని కమల్ హాసన్ రాయడం విశేషం. ఈ సాంగ్‌తో కూడిన వీడియో ఆల్బమ్ ఇటీవలే తయారయ్యింది. వైవిద్యభరితమయిన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఆల్బమ్ సంగీత ప్రియుల నుంచి చాలా మంచి ఆదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. శృతి హాసన్ మాట్లాడుతూ విభిన్న సంగీత కళాకారులతో కలిసి పని చేయడం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. అది స్వతంత్ర సంగీత కళాకారులయినా, సిని సంగీత కళాకారులయినా కావచ్చన్నారు. భిన్న సంస్కృతుల మన దేశాన్ని కొత్తగా చూపాలన్న ఆలోచనే ఈ ఆల్బమ్ రూపకల్పనకు కారణం అని పేర్కొన్నారు. ఇందులో సంగీతం, సాహిత్యం చాలా ప్రయోగాత్మకంగా ఉంటాయన్నారు. దీనికి తన తండ్రి కమల్ హాసన్ తమిళ సాహిత్యాన్ని అందించారని తెలిపారు. తెర్కే ఒరు దురువం అనే పల్లవితో సాగే ఈ పాటను తన తండ్రి సాహిత్యం మరింత వన్నె తెచ్చిందని పేర్కొన్నారు. ఈ పాటను పూర్తిగా విన్న తర్వాత కమల్ స్పందనేమిటన్న ప్రశ్నకు కాన్సెప్ట్ బాగుంది పాట జాయ్‌ఫుల్‌గా ఉందని ప్రశంసించారని తెలిపారు. నాన్నతో కలిసి నటించకపోయినా సంగీత పరంగా నాన్న తనకు గొప్ప స్ఫూర్తి ప్రదాత అన్నారు. సంగీత సాహిత్యంలో ఆయన సహకారం తనకెప్పుడూ ఉం టుందని శ్రుతి అంటున్నారు. -
మూగజీవాలే ఆమె ప్రపంచం
జంతువులంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ వాటి కోసం జీవితాన్ని అంకితం చేసేంత ఇష్టం ఉన్నవాళ్లు అరుదుగానే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తే... తమరా రాబ్. రొమేనియాకు చెందిన ఈమె... మూగజీవాలను సంరక్షించడమే ధ్యేయంగా జీవిస్తోంది. తమరా డబ్బున్న వ్యక్తేమీ కాదు. ఉపాధి కోసం ట్రక్కును నడుపుతూ ఉంటుంది. ఓ పక్క తన విధుల్ని నిర్వర్తిస్తూనే మూగజీవాల సంరక్షణ కోసం పాటు పడుతోంది. చిన్నప్పట్నుంచీ నోరు లేని జీవాలంటే చెప్పలేని జాలి తమరాకి. రోడ్ల మీద ఏదైనా జంతువు కనిపిస్తే తన దగ్గరున్న తినుబండారాల్ని వాటికి పెట్టేసేది. పెద్దయ్యేకొద్దీ ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఓసారి రోడ్డుమీద పడివున్న ఓ కుక్క కళేబరాన్ని చూసి కదలిపోయిందామె. వాహనం కింద పడి నుజ్జునుజ్జయిన ఆ కళేబరాన్ని తీయడానిక్కూడా ఎవరూ ముందుకు రాకపోవడం కలచివేసిందామెని. మరే జీవికీ అలాంటి చావు రాకూడదు అనుకుంది తమరా. అప్పట్నుంచీ ఎక్కడైనా కుక్కలు, పిల్లుల్లాంటివి కనిపిస్తే వాటిని ఇంటికి తీసుకెళ్లిపోవడం మొదలుపెట్టింది. వాటిని సాకడంలో ఎంతో సంతోషం ఉందని అంటుందామె. ఇంట్లో సగభాగాన్ని జంతువులకే కేటాయించింది తమరా. కుక్కలు, పిల్లులు కలిపి ఓ యాభై వరకూ ఉన్నాయి ఆమె దగ్గర. తన జీతంలో కొంత భాగానికి కొందరు దాతలు ఇచ్చే సొమ్మును జతచేసి వాటిని పోషిస్తూ ఉంటుంది. అయితే ఆమె జంతుప్రేమ అక్కడితో ఆగిపోలేదు. ప్రతియేటా క్రిస్మస్ పండుగకి తన వ్యాన్ నిండా పెట్ ఫుడ్, మందులు వంటివి నింపుకొని బయలుదేరుతుంది తమరా. రొమేనియాలోని జంతు సంరక్షణ కేంద్రా లన్నింటికీ వెళ్లి వాటిని పంచిపెడుతుంది. వాటి ఆహారానికి, వ్యాన్ డీజిల్‌కి ఎంత ఖర్చయినా ఈ పని చేయడం మాత్రం మానదు తమరా. ఇదంతా నీకు కష్టమనిపించడం లేదా అంటే... ‘‘నిజానికి వాటన్నిటినీ తెచ్చుకుని పెంచేసుకోవాలనిపిస్తుంది, కానీ సాధ్యం కాదు కదా, అందుకే చేయగలిగింది చేస్తున్నాను’’ అంటుంది నవ్వుతూ!