పొగ మీద పగబట్టారు!
స్ఫూర్తి
ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా గుర్తుందా? అందులో మద్యపానం కారణంగా నాశనమైపోతున్న ఓ ఊరిని మార్చడానికి హీరో నానా తంటాలు పడతాడు. త్యాగాలు చేస్తాడు. కానీ గరిపెమా గ్రామాన్ని బాగు చేయడానికి ఏ హీరో రాలేదు. ఆ ఊరిలోని ప్రతి వ్యక్తీ ఓ హీరో అయ్యాడు. అందుకే ఇప్పుడు గరిపెమా పేరు రికార్డులకెక్కింది.
నాగాల్యాండ్ రాజధాని కోహిమాకి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గరిపెమా గ్రామం. ఒకప్పుడు గరి అనే వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఊరికా పేరు వచ్చింది. మూడొందల కుటుంబాలు, ఓ బడి, ఓ ఆసుపత్రి... ఇంతే ఆ ఊరు. కానీ ఇప్పుడది సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. దేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంగా రికార్డు సాధించింది గరిపెమా.
మన దేశంలో యేటా 2.200 మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారు. క్యాన్సర్‌తో చనిపోతున్న భారతీయుల్లో నలభై శాతం మంది ధూమపానం వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారే. 90 శాతం మందికి నోటి క్యాన్సర్ పొగాకు వల్లే వస్తోంది. నాగాల్యాండ్‌లో కూడా ధూమపానం చేసేవారి సంఖ్య అధికమే. కానీ ఇప్పుడు ఆ ఊళ్లో ఒక్కరు కూడా పొగాకు జోలికి పోవడం లేదు.
పొగ తాగాలని పరితపించడం లేదు. గ్రామ పెద్దలు, గ్రామంలోని యువసంఘం, విద్యార్థి సంఘాలు కలిసి ఊరిలో పొగాకు అన్నమాటే వినబడకుండా చేశాయి. అది మాత్రమే కాదు... ఎక్కడా మద్యం, గుట్కా కూడా లభించకుండా చేశారు. గ్రామస్తులెవరైనా పొగతాగితే ఐదు వందలు, మద్యం సేవిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు.
ఆ ఊరివారే కాదు... సందర్శకులకు, ఊరివారి కోసం వచ్చే బంధుమిత్రులు కూడా వీటిని పాటించాల్సిందే. ఈ నియమాలన్నిటినీ రాసిన ఓ పెద్ద బోర్డు గ్రామంలో అడుగుపెట్టగానే కనిపిస్తుంది. అందరూ అత్యంత కచ్చితంగా నియమాలను అనుసరించడంతో భారతదేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంతో గరిపెమా అవతరించింది. దేశంలోని ఇతర ప్రాంతాలన్నిటికీ ఆదర్శంగా నిలబడింది!