poga
-
పొగాకు... హెల్త్‌కు దగా ఆకు!
నేడు పొగాకు వ్యతిరేక దినం పొగాకు ఆరోగ్యానికి ‘దగా ఆకు’ అనీ, అనేక రకాల క్యాన్సర్ రూపాలలో ఇది మనకు చేసే దగా అంతా ఇంతా కాదని ఎన్నెన్నో ‘నో టొబాకో డే’ సందర్భాల్లో అనేక మార్లు చెప్పుకున్నాం. అది వెలువరించే దాదాపు 7,000 రకాల హానికరమైన రసాయనాల గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అందులో 60కి పైగా క్యాన్సర్‌ను తెప్పించేవే అని ఆందోళన పడ్డాం. అయినా ఇంకా చాలామంది సిగరెట్ తాగడాన్ని స్టైల్ సింబల్‌గానో, పొగాకు నమలడాన్ని స్ట్రెస్ నుంచి బయటపడవేసే మార్గంగానో భావిస్తున్నారు. కానీ వాస్తవం కూడా పొగాకు లాగే చాలా చేదు.ఆరోగ్యానికి అది ఎంతో చేటు. ఆ విషయాన్ని కాస్త విభిన్నంగా, వివరంగా చెప్పుకుందాం. ఊపిరితిత్తుల సౌధం ధ్వంసం ఇలా! మీకు తెలుసా? మన ఊపిరితిత్తులు బహుళ అంతస్తుల సముదాయం లాంటివి. ఎలా అంటారా? గాలి పీల్చుకునేందుకు ఉపయోగపడే ప్రధాన నాళం ముక్కు దగ్గర్నుంచి మొదలై గొంతు దగ్గర రెండుగా చీలుతుంది. ఒకటే ఉన్న నాళాన్ని ట్రాకియా అంటారు. అది రెండుగా చీలినప్పుడు ఆ రెండు నాళాలను బ్రాంకై అంటారు. ట్రాకియా ఒక అంచె లేదా మొదటి అంతస్తు అనుకుందాం. అప్పుడు బ్రాంకై రెండో అంతస్తు. అలా ఊపిరితిత్తుల మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌లో చివరిది 28వ అంతస్తు. ఆ చిట్టచివరి అంతస్తులో చిట్టిచిట్టి గదులు 30 కోట్లు ఉంటాయి. ఆ గాలిగదులనే ‘ఆల్వియోలై’ అంటారు. అక్కడ వాయువుల మార్పిడి జరుగుతుంది. ఇక మన బహుళ అంతస్తుల భవనాల పరిభాషలోనే చెప్పుకోవాలంటే... గాలి మార్పిడి జరిగేలా వీలు కల్పించేందుకు చివరి అంతస్తు మీద ఉండే ‘పెంట్‌హౌజ్’లు 30 కోట్లు అన్నమాట! మనం సిగరెట్ తాగుతున్నామంటే చివరి గాలి గది కూడా కూలిపోయేలా పునాది నుంచి ధ్వంసం చేస్తున్నామన్నమాట. సిగరెట్ తాగేటప్పుడు నోటి నుంచి ముక్కుల నుంచి వెలువడుతున్న ఆ పొగలే... భవనం కూలిపోయేటప్పుడు వెలువడే దుమ్మూధూళీ అని గుర్తుపెట్టుకోండి. మళ్లీ ఎప్పుడూ పొగ తాగాలనిపించదు. మెదడును మాయ చేసే నికోటిన్ మనం సిగరెట్ తాగే సమయంలో లోపలికి తీసుకునే రసాయనాలన్నింటిలోనూ మనల్ని బానిసగా చేసుకునేది ‘నికోటిన్’ మాత్రమే. ఇది అంత హానికరం కాదుగానీ... మిగతా 7000 రసాయనాలూ బాగా హానిచేసేవి. ఇక అందులోని 60 మాత్రం ఒక్కసారి పీల్చినా క్యాన్సర్ తెచ్చిపెట్టగల సామర్థ్యం ఉన్నవే. అందుకే మనల్ని బానిసగా మార్చుకునే ఈ నికోటిన్‌ను తక్షణమే వదిలించుకోవాలి. అప్పుడు మిగతా 7000 రసాయనాలనూ తేలిగ్గా దూరం పెట్టవచ్చు. అయితే వదిలించుకోవాలనుకున్న సమయంలో ఈ నికోటిన్ సామాన్యమైన మాయలు చేయదు! ఇవి చేసే మాయలు ఎన్నో తెలుసా? మెదడును అనేక రకాల భ్రమల్లో ఉంచుతుందిది. నోరు దాహంతో పిడచగట్టుకుపోయేలా చేస్తుంది. అయోమయంలో ముంచేసి గడబిడగా గందరగోళంగా ఉండేలా చూస్తుంది. ఈ క్షణమో, మరుక్షణమో ప్రాణాలు పోతాయేమో అన్న భ్రాంతినీ, ఆందోళననూ కలిగిస్తుంది. ఈ మాయలన్నింటినీ చేసి మళ్లీ సిగరెట్ తాగితేగానీ ఊరుకోనంతగా ప్రేరేపిస్తుంది. అయితే మానాలనే సంకల్పం బలంగా ఉన్నవారిలో పైన పేర్కొన్న లక్షణాలు కాసేపలా బాధపెట్టాక క్రమంగా తగ్గిపోతాయి. కానీ కొంతమందికి విత్‌డ్రావల్ సింప్టమ్స్ మరీ ఎక్కువగా ఉంటాయి. అందుకే సిగరెట్ మానాలనుకునేవారికి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఈ రకమైన చికిత్సలో భాగంగా నికోటిన్‌ను వేర్వేరు రూపాల్లో అందిస్తారు. అందులో నికోటిన్ బిళ్లలు ముఖ్యమైనవి. ఇవేగాక నేసల్ స్ప్రేలు, ఇన్హేలర్లు, లాజెంజెస్‌లు కూడా ఉంటాయి. వాటన్నింటి సహాయంతో సిగరెట్ మానేస్తే ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క పఫ్.. హెల్త్ ఉఫ్... మనం ఒక సిగరెట్ తాగినప్పుడు ఒక 100 చదరపు మీటర్ల వైశాల్యంలోని 30 కోట్ల గాలి గదుల్లో, 2400 కిలోమీటర్ల నిడివి ఉండే ఊపిరితిత్తుల రక్తనాళాల పొడవునా ప్రతి భాగం పొగచూరిపోతుంది. మనం ఈ 30 కోట్ల గదులను దూరి బయటకు వచ్చేందుకు ఒక్కొక్క సెకన్ సమయం తీసుకున్నా గదులన్నీ పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 10 ఏళ్లు (కచ్చితంగా చెప్పలంటే తొమ్మిదిన్నర ఏళ్లకు కాస్త పైచిలుకు). కానీ సిగరెట్ అంత సమయం తీసుకోదు. ఒక్క పఫ్‌లో అన్ని గదులనూ, అన్ని రక్తనాళాలనూ, అన్ని గోడలనూ చుట్టుముడుతుంది. అన్నింటినీ పొగచూరిపోయేలా చేస్తుంది. అన్ని భాగాలను తూట్లు పొడుస్తుంది. లంగ్స్... పొగచూరిన వంటగదులే ప్రతిరోజూ మనం దాదాపు 22 వేల సార్లు శ్వాసిస్తాం. రోజుకు సగటున 16 వేల లీటర్ల గాలిని పీలుస్తాం. అంత గాలినీ ఒక్క సిగరెట్‌తో కలుషితం చేసేస్తాం. అంతేకాదు... మన ఊపిరితిత్తుల బహుళ అంతస్తుల భవనంలో ఎస్కలేటర్లు కూడా ఉంటాయి. ఆ ఎస్కలేటర్లను వైద్య పరిభాషలో సీలియా అంటారు. మ్యూకస్, సీలియా కలిసి ఉండే ఈ ఎస్కలేటర్లను ‘మ్యూకోసీలియా ఎస్కలేటర్స్’ అని కూడా అంటారు. మనకు సరిపడని దుమ్ము, ధూళి, పొగ లాంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వాటిని ఈ ఎస్కలేటర్లు ఊపిరితిత్తులనుంచి బయటకు వెళ్లేలా చేస్తాయి. కానీ అవి బయటకు పంపించే కాలుష్యం కంటే మనం లోపలికి పంపించే పొగ ఎక్కువ. దాంతో అవి అలసిపోతాయి. ఊపిరితిత్తుల లోపలి భాగం... పాత ఇండ్ల వంటగదుల్లా పొగచూరి... మసిబారిపోతాయి. తాగే వారికే కాదు... పక్క వారికీ...! సిగరెట్... దానిని తాగేవాళ్లతోపాటు ఇంట్లో వారి ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. మరొకరు వదిలిన పొగను పీల్చడాన్ని ‘ప్యాసివ్ స్మోకింగ్’ అంటారు. నేరుగా పొగతాగడం వల్ల ఎంత హాని జరుగుతుందో... ప్యాసివ్ స్మోకింగ్తోనూ అంతే హాని జరుగుతుంది. ఒక అధ్యయనంలో తేలినదేమిటంటే... ప్రతి ఏడాదీ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల 34,000 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనూ, 46,000 మంది గుండెజబ్బులతోనూ చనిపోతున్నారు. అంతేకాదు... ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ఆస్తమా, నిమోనియా, బ్రాంకైటిస్, తలనొప్పి, దగ్గు వంటి అనారోగ్యాలూ, అనర్థాలూ, ఆపదలూ అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా సొంత తల్లిదండ్రులు తమ పిల్లలకు క్యాన్సర్‌నూ, ఆస్తమా, ఎంఫసిమా, నిమోనియా, బ్రాంకైటిస్, దగ్గూ ఆయాసాలు లేదా నెలలు నిండటానికి ముందే ప్రసూతి (ప్రీ–టర్మ్ డెలివరీ), మృతశిశువు జన్మించడం (స్టిల్ బర్త్), పుట్టిన శిశువు బరువు బాగా తక్కువగా ఉండటం, పుట్టిన శిశువు అకస్మాత్తుగా చనిపోవడం, ముత్యాల గర్భం, పుట్టిన పిల్లల్లో గ్రహణం మొర్రి కనిపించడం (క్లెఫ్ట్ పాలెట్) లాంటి అనర్థాలను గిఫ్ట్‌గా ఇస్తారా ఎవరైనా? సిగరెట్ కాలుస్తున్న విస్తీర్ణం? మన ఊపిరితిత్తుల నిర్మాణమే ఒక అద్భుతం. అవి కేవలం 2.3 కిలోగ్రాముల బరువుతో, జానెడు పొడవు మాత్రమే ఉండే గాలితిత్తులని మనకు అనిపించవచ్చు. వాటి నిర్మాణ అద్భుతాన్ని మడతలు విప్పి చూస్తే ఊపిరితిత్తుల గొప్పదనం అర్థమవుతుంది. ముక్కు చివర ఉండే వాయునాళం (ట్రాకియా) శ్వాసవ్యవస్థలోని మొదటి అంతస్తు అయితే, బ్రాంకై రెండో అంతస్తు అయితే, ఊపిరితిత్తుల్లోని గాలిగది (ఆల్వియోలై) చివరి అంతస్తు అని మనం చెప్పుకున్నాం కదా. శ్వాసవ్యవస్థలోని 14వ అంతస్తు నుంచి మరింత సన్నగా చీలే ఈ ఊపిరితిత్తుల్లోని గాలినాళాల నిర్మాణాలు కంటికి కనిపించనంత సంక్లిష్టంగా ఉంటాయి. అంటే 28వ అంతస్తుకు చేరేటప్పటికి ఎంత సంక్లిష్టంగా ఉంటాయో ఊహించుకోండి. అలా ఆ 28 అంతస్తులన్నింటినీ చదునుగా పరిచామనుకోండి. ఆ విస్తీర్ణం ఒక టెన్నిస్ కోర్టు పరిమాణమంత! దాదాపు 100 చదరపు మీటర్లు. ఇక ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల పొడవు 2400 కిలోమీటర్లు. ఇంత విస్తృతమైన దాన్ని మనం కర్చిఫ్ మడతలు వేసినట్లుగా జానెడు పొడవుకు మడిచి, ఛాతీలో అమర్చుకున్నాం. కర్చిఫ్‌ను ఒకచోట కాలిస్తే... ఒక్క రంధ్రం పడుతుంది. అదే కర్చిఫ్‌ను 28 మడతలు వేశాక... ఒక్క చోట కాల్చి మడతలు విప్పితే... ప్రతి మడతలోనూ కాలిన రంధ్రం ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి. మనం ఒక్క సిగరెట్ తాగిన ప్రతిసారీ ఊపిరితిత్తులకు ఎన్నెన్ని రంధ్రాలు పెడుతున్నామో! ఒకసారి అణుబాంబు వేసినప్పుడు మాడిపోయే ప్రదేశపు విస్తీర్ణం కంటే సిగరెట్‌తో పదే పదే మాడ్చేసే ప్రాంతపు విస్తీర్ణం చాలా చాలా ఎక్కువ. పొగ మానితే తక్షణ ప్రయోజనాలు... ∙ఆహారం రుచి తెలియడం ∙వాసన గ్రహించే శక్తి సాధారణ స్థాయికి రావడం ∙దుర్వాసన పోయి శ్వాస, జుట్టు, బట్టలు తాజా వాసనతో ఉండటం ∙పళ్లు, గోళ్లు పచ్చబారకుండా మిలమిల మెరుస్తూ ఉండటం ∙మెట్లెక్కడం, చిన్న చిన్న పనులు తేలికవడం. దీర్ఘకాలిక ప్రయోజనాలు సిగరెట్ మానేసిన తొమ్మిది నెలల్లో దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలపడి శ్వాస సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇన్ఫెక్షన్స్ ముప్పు తొలగిపోతుంది. ఏడాది తర్వాత కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఐదేళ్లు మానేస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక 15 ఏళ్ల పాటు మానేస్తే... మామూలు మనిషి అయిపోయినట్లే. కాబట్టి పొగతాగే అలవాటున్న వాళ్లే కాదు... కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పొరుగువాళ్ల... ఆయుర్దాయమూ పెరుగుతుంది. పొగమానడానికి మంచి ముహూర్తం ఈ రోజే! డాక్టర్ సీహెచ్ మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్. ఫోన్: 98480 11421 కర్నూలు: 08518–273001 -
పగాకు ....
పొగాకు రైతులకు ఈ సీజన్లో మిగిలింది అప్పులే.. బ్యారెన్‌కు రూ.2లక్షల వరకు నష్టం తిరిగి విధుల్లో చేరిన బోర్డు చైర్మన్ గుంటూరు పొగాకు రైతులకు ఈ సీజను అప్పులనే మిగిల్చింది. ఏ రైతును కదిలించినా బ్యారెన్‌కు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధను తట్టుకోలేక ఇప్పటికే 11 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఇద్దరు గుండె ఆగి మృతి చెందారు. ఈఏడాది మార్చి11న ప్రారంభమైన పొగాకు వేలం ఒకటి రెండు రోజుల్లో పూర్తికానుంది. సెప్టెంబరు 31 వరకు రాష్ట్రంలోని పొగాకు వేలం కేంద్రాల్లో 189.96 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పొగాకు అమ్మకాలు పూర్తికాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో మరో వారం రోజులు జరగనున్నాయి. -
పొగచూరకు... మసిబారకు!!
సిగరెట్ల వల్ల నష్టాలు ఎన్ని రెట్లు అన్నది చెప్పడానికి ఎన్ని సెట్ల ఇంటర్నెట్లు అయినా సరిపోవు.పొగచెట్ల వల్ల ఎన్ని వ్యాధులు కట్లు విప్పుకుంటాయో నమోదు చేయడానికి కంప్యూటర్ బైట్లూ చాలవు.వ్యసనం వదిలిపోకుండా ఉండటానికి పొగాకులోని నికోటిన్ మెదడుపై చేసే మాయలను రాయడానికి ఎన్ని పెన్నులైనా సరిపోవు.అయినా... ఓసారి పొగాకు ఆరోగ్యానికి పెట్టే చికాకును చూస్తే ఎవరైనా దాన్ని వదిలేయాల్సిందే.మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా పొగాకు హెల్త్‌కు కల్పించే చిరాకును తెలుసుకొని, దాన్ని వదిలించుకుంటారనే ఆశతో, ఆశయంతో ఈ కథనం. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది చేటు. సిగరెట్టు ఆరోగ్యంపై వేటు. చుట్ట చుట్టలు చుట్టుకొని ఉన్న విషం నిండిన పాముల చుట్ట. రోగాల పుట్ట. గుట్కాతో ప్రాణాలు గుటుక్కు. నశ్యం వదిలేయడం అవశ్యం. పొగాకు చేసే చెరుపు గురించి, ఆ వ్యాధులు పుట్టించే వెరపు గురించి అవగాహన ఉన్న ఎవరైనా చెప్పే మాటలివి. ఈ సందర్భంగా పొగాకు హెల్త్‌ను దగా చేసే ఆకు ఎలాగైందో చూద్దాం. ఊపిరితిత్తులకు : పొగ పీల్చగానే నేరుగా అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ముక్కు మొదటి అంతస్తు అనుకుంటే గాలిమార్పిడి జరిగే ‘ఆల్వియోలై’ అనే గాలి గది 28వ అంతస్తు. అక్కడ గాలి మార్పిడి... అంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అంది, మలినమైన కార్బన్‌డై ఆక్సైడ్ మార్పిడి ‘ఆల్వియోలై’ అనే గాలిగదిలో జరుగుతుంది. కానీ పొగలో ఉండే కార్బన్‌మోనాక్సైడ్, సైనైడ్ వంటి విషపదార్థాల వల్ల ఆ గాలిగది స్వరూపమే మారిపోతుంది. వాస్తవానికి అక్కడ హిమోగ్లోబిన్ అనే వాహకం మీద ఆక్సిజన్ చేరి శరీరంలోని అన్ని కణాలకూ అందాలి. కానీ పొగాకులోని విషపదార్థాల్లో ఉండే కార్బన్‌మోనాక్సైడ్... హీమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దాంతో రక్తంలోని హీమోగ్లోబిన్‌కు ఆక్సిజన్‌ను మోసుకుపోయే సామర్థ్యం తగ్గుతుంది. ఇది ఎలాంటి బంధమంటే చెడు స్నేహాల వల్ల మంచి స్నేహితుడు దూరమయ్యే పరిస్థితి లాంటిది. దీంతో శరీరంలోని అన్ని కణాలూ కార్బన్‌మోనాక్సైడ్‌తో విషపూరితమవుతాయి. ఫలితంగా ఎంఫసిమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) లాంటి ప్రమాదకరమైన వ్యాధులూ వస్తాయి. ఫలితంగా కొద్దిదూరం కూడా నడవలేని పరిస్థితి. కదిల్తే నీరసం, నడిస్తే ఆయాసం. ఎడతెరిపి లేకుండా వచ్చే విపరీతమైన దగ్గు. పొగాకులో ఉండే ‘ఆక్రోలిన్’ అనే అత్యంత విషపదార్థం సీఓపీడీని కలిగించడమే కాదు... క్యాన్సర్‌కూ కారణమవుతుంది. అంతేకాదు... సిగరెట్ పొగలో ఉండే పాలీసైక్లిక్ అరోమ్యాటిక్ హైడ్రోకార్బన్స్, బెంజోపైరీన్, నైట్రోజమైన్ ఇవన్నీ క్యాన్సర్‌ను కలిగించేవే. ఇక క్యాన్సర్ కారక గుణాలతో పాటూ రేడియో యాక్టివ్ గుణాలున్న సీసం (లెడ్-210), పొలోనియం లాంటివీ పొగలో ఉండి జీవితాన్ని పొగచూరిపోయేలా చేస్తాయి. తల నుంచి కాలిగోటి వరకు పొగాకు వల్ల జరిగే నష్టాలను స్పర్శిస్తూ పోదాం... తల : సిగరెట్‌ను నోట్లో పెట్టుకుని కాల్చే సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందొక్కటే. సిగరెట్ మండే చివరను అగ్నిపర్వతపు మండే భాగం (బర్నింగ్ ఎండ్), దాని చివరన వెలువడే నుసి అగ్నిపర్వతపు బూడిద అనుకుంటే... ఆ సిగరెట్ వెలువరించే ‘లావా’... బయటివైపునకు కాకుండా శరీరం లోపలి వైపునకు ప్రవహిస్తుందని గుర్తుంచుకోండి. అలా సిగరెట్ వల్ల నోట్లోకి వచ్చే లావా రాళ్లనూ కరిగించుకున్నట్లుగా మన చెంపల లోపలి పొరను దెబ్బతీస్తుంది. మెత్తనైన చిగుర్లను కరిగించివేస్తుంది. అందుకే చిగుర్లు కరిగిపోతాయి కాబట్టి పళ్లు ఎక్కువగా బయటపడతాయి. ఇలా చిగుర్లు కరగడాన్ని ‘జింజివల్ రిసెషన్’అంటారు. పళ్లరంగు మారిపోతుంది. నోటిలోపలి మృదువైన పొరలు దెబ్బతిని పుండ్లలా (మ్యూకోజల్ లీజన్స్) మారడమే కాదు, ఆ ప్రాంతంలో క్యాన్సర్లూ వస్తాయి. ఇలా వచ్చేముందర సిగరెట్ పొగ తాలూకు ప్రభావంతో నోటిలోపల తెల్లని మచ్చలు ఏర్పడతాయి. వాటినే ‘ల్యూకోప్లేకియా’ అంటారు. ఈ ల్యూకోప్లేకియా మచ్చలు క్యాన్సర్ ఆవిర్భావానికి తొలి రూపాలు. చిగుర్లపై మచ్చలు రావడం (స్మోకర్స్ మెలనోసిస్), పళ్లు పసుపుపచ్చగా మారడం జరుగుతుంది. నాలుక నల్లగా మారే ‘బ్లాక్ హెయిరీ టంగ్’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు. వేడిలావాలా విషాలు నోట్లోకి ప్రవహించడం వల్ల నోట్లోని లాలాజలం ఆవిరైపోతుంది. అది తగ్గడంతో నోట్లో విషక్రిములూ, దుర్వాసనా... ఒకటేమిటి అన్నీ అనర్థాలే. నోరు, నాలుక, అంగిలి, ట్రాకియా, ఈసోఫేగస్... ఇలా నోటి పొరుగున ఉన్న ప్రతి భాగమూ క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతు : నోటి తర్వాత గొంతు భాగానికి వస్తే... గొంతులో ఉండే ప్రతి అవయవమూ మళ్లీ పొగ బారిన పడి క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతునుంచి ఊపిరితిత్తులోకి వెళ్లే బ్రాంకియా... ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని పై అవయవాలన్నింటికీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. గుండె : సిగరెట్ పొగ మన గుండెకు చేసే చెరుపూ అంతా ఇంతా కాదు. సిగరెట్ ముట్టించిన మరుక్షణం గుండె వేగం అదుపు తప్పి పెరిగిపోతుంది. పదినిమిషాల పాటు అదేపనిగా సిగరెట్ తాగితే గుండె వేగం 30 శాతానికి పైగా పెరుగుతుంది. అంటే అవసరానికి మించి గుండె కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. అంటే గుండె లయ తప్పి కొట్టుకోవడం వల్ల జరిగే అనర్థాలన్నీ సిగరెట్ వల్ల కలుగుతాయి. గుండె, రక్తప్రవాహవ్యవస్థ (హార్ట్ అండ్ కార్డియోవ్యాస్క్యులార్ సిస్టమ్)కు జరిగే నష్టాలను చూస్తే... సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది (విస్కాసిటీ పెరుగుతుంది). దాంతో రక్తప్రవాహం సాఫీగా జరగక రక్తనాళాల మధ్యన రక్తపు గడ్డలు ఏర్పడి గుండెకు రక్తం అందకపోవచ్చు. ఏ భాగానికి రక్తం అందకపోయినా... ఆక్సిజన్, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోతుందన్న విషయం తెలిసిందే. ఇదే పరిణామం గుండెకు రక్తసరఫరా చేసే కరొనరీ ఆర్టరీలో జరిగితే గుండెపోటు వచ్చి ప్రాణానికే ముప్పు వాటిల్లవచ్చు. ఇక ఇదే రకమైన ప్రమాదం మెదడుకూ ఉంది. మన శరీరాన్ని నియంత్రించే కీలకమైన భాగం మెదడే. దానికి ఆక్సిజన్ అందజేసే కెరోటిడ్ రక్తనాళాల్లో గానీ, లేదా ఇతర రక్తనాళాల్లోగాని రక్తం చిక్కబడి అక్కడ అది చిక్కుబడితే... మెదడుకు రక్తప్రవాహం అందక పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి పక్షవాతం వస్తే ఇక ఆ రోగి జీవితాంతం ఎవరిపైనైనా ఆధారపడుతూ దుర్భర జీవితాన్ని గడపాల్సిందే. అందుకే అలాంటి దుస్థితి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు... సిగరెట్ పొగ వల్ల మెదడుకు అందే రక్తం తగ్గడం వల్ల ఏదైనా విషయాలను అవగాహన చేసుకునే (కాగ్నిటివ్) శక్తిసామర్థ్యాలు 50 శాతానికి పైగా తగ్గుతాయి. దీర్ఘకాలంలో అవి ప్రపంచంలోని అన్ని విషయాలనూ మరచిపోయేలా చేసే అల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వాటికి దారితీస్తాయి. పురుషులకు ప్రమాదాలివే : సిగరెట్‌ను స్టైల్‌గా ముట్టించి పొగ వదలడాన్ని పురుషత్వానికి చిహ్నంగా కొన్ని ప్రకటనలలో చూపిస్తారు. కానీ సిగరెట్ పురుషత్వాన్ని కబళిస్తుంది. సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడిపోతుందన్న విషయం తెలిసిందే కదా. ఇదే పరిణామం పురుషాంగానికి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో (ఆర్టరీలలో) జరగడం వల్ల అంగస్తంభన సమస్యలు (ఎరక్టైల్ డిస్ఫంక్షన్) వస్తాయి. అంతేకాదు... వీళ్లలో శుక్రకణాల సంఖ్య (స్పెర్మ్‌కౌంట్) గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా తాము గర్వపడే విషయంలోనే గర్బభంగం జరిగే పరిస్థితి సిగరెట్ తెచ్చిపెడుతుంది. బ్లాడర్క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్... ఈ తరహా క్యాన్సర్లన్నింటికీ పొగతాగడం ఒక ప్రధాన కారణం. కాళ్లు : తల నుంచి మొదలుపెట్టిన ప్రస్థానాన్ని ఇప్పుడు కాళ్ల చివరకు చేర్చుదాం. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్’ అనే వ్యాధి వస్తుంది. దీన్నే బర్జర్స్ డిసీజ్ అని కూడా అంటారు. దీనివల్ల పాదాల చివరకు రక్తం అందకపోవడం అనే పరిణామం ఏర్పడితే పాదం కుళ్లిపోయి, పాదాలతో పాటు కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి తెచ్చే దుర్మార్గమైన అలవాటు ఈ పొగతాగడం. ఇలా పొగతాగడం అన్న అలవాటు తల మొదలుకొని కాళ్ల చివరల వరకూ ఉండే ప్రతి అవయవాన్నీ... లోపల ఉండే అన్ని అవయవాలను అంటే... కాలేయం, ప్యాంక్రియాస్, చిన్నపేగులు, పెద్దపేగులు, కోలోరెక్టల్... ఇలా నోటి నుంచి మొదలుకొని జీర్ణవ్యవస్థలోని చివరి భాగం వరకూ ఏ అవయవానికైనా క్యాన్సర్ కలిగించే గుణం పొగాకుకు ఉంది. మహిళలకూ ఎంతో కీడు : ఇక మహిళల విషయంలోనూ సిగరెట్ పొగ అంతే కీడు చేస్తుంది. ఒక కుటుంబంలో పురుషులు తాగే సిగరెట్ పొగ కేవలం వారిని మాత్రమే కాదు... వారి జీవిత భాగస్వామినీ అంతే తీవ్రంగా దెబ్బతీస్తుంది. పురుషులు తాగే సిగరెట్ తాలూకు కాలేచివరి నుంచి వచ్చే పొగ, పీల్చాక ఊపిరితిత్తుల్లోంచి వచ్చే పొగ... ఈ రెండూ కలిసి రెట్టింపు నష్టాలను కుటుంబ సభ్యులకూ కలగజేస్తాయి. సిగరెట్ పొగ వల్ల మహిళల్లో ఓవరీస్ దెబ్బతింటాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పాదనపై సిగరెట్ పొగ దుష్ర్పభావం చూపడం వల్ల అండం ఉత్పాదన తగ్గిపోతోంది. ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్ కూడా దెబ్బతింటుంది. మహిలల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అంతేకాదు. ఒకవేళ కృత్రిమంగా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి చేద్దామనుకున్నా దానికి అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. పైగా అబార్షన్లు పెరగడం, ఒకవేళ పిండం ఎదిగినా చివర్లో మృతశిశువులు జన్మించడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. డాక్టర్ సిహెచ్. మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఏపీ రాబడికి భారీ గండి!
పెట్రోల్, పొగాకు ఉత్పత్తులపై పన్నులను జీఎస్టీ పరిధి నుంచి తొలగించండి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ వినతి సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధి నుంచి పలు రకాల పన్నులు తొలగించకపోతే రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. జీఎస్టీ బిల్లు నుంచి పెట్రోల్, పొగాకు ఉత్పత్తులు, వ్యాపార ప్రకటనలపై పన్నులను మినహాయించాలని కేంద్రాన్ని కోరింది. అలాగే అంతరాష్ట్ర మద్యం రవాణాపై పన్నునూ జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. తొలుత మద్యంపై పన్నును కూడా జీఎస్టీ కిందకు తీసుకువచ్చిన కేంద్రం.. రాష్ట్రాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కితగ్గింది. అంతరాష్ట్ర మద్యం రవాణా పన్నును మాత్రం జీఎస్టీ నుంచి తొలగించలేదు. ఇది రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులపై 33.50 శాతం వ్యాట్‌ను విధిస్తోంది. తద్వారా నెలకు రూ.600 కోట్ల మేర ఆదాయం వస్తోంది. పెట్రోల్ ధరలు ఎంత పెరిగితే అంత ఎక్కువ మొత్తంలో రాష్ర్ట ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో ఆదాయం వస్తుంది. (ఇటీవలి కాలంలో పెట్రోల్ లీటర్ ధర రూ.పదికి పైగా తగ్గిపోయింది.దీనితో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయంలో రూ.2,000 కోట్ల మేరకు గండిపడుతుందని అంచనా. అంతరాష్ట్ర మద్యం రవాణాపై ప్రవేశ పన్ను విధించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏపీకి మద్యం రవాణా అవుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపన్ను విధిస్తోంది. మరోవైపు పొగాకు ఉత్పత్తులపై విధించే పన్ను ద్వారా రాష్ట్రానికి నెలకు రూ.32 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక సిగరెట్లపై పన్ను జీఎస్టీ పరిధిలోకి వెళ్లనుంది.ప్రకటనలు, బెట్టింగ్, గాంబ్లింగ్‌లపై పన్నును స్థానిక సంస్థలు వసూలు చేస్తాయని, వాటని జీఎస్టీ పరిధిలోకి తీసుకువెళితే స్థానిక సంస్థలు నష్టపోతాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. -
పొగ మీద పగబట్టారు!
స్ఫూర్తి ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా గుర్తుందా? అందులో మద్యపానం కారణంగా నాశనమైపోతున్న ఓ ఊరిని మార్చడానికి హీరో నానా తంటాలు పడతాడు. త్యాగాలు చేస్తాడు. కానీ గరిపెమా గ్రామాన్ని బాగు చేయడానికి ఏ హీరో రాలేదు. ఆ ఊరిలోని ప్రతి వ్యక్తీ ఓ హీరో అయ్యాడు. అందుకే ఇప్పుడు గరిపెమా పేరు రికార్డులకెక్కింది. నాగాల్యాండ్ రాజధాని కోహిమాకి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గరిపెమా గ్రామం. ఒకప్పుడు గరి అనే వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఊరికా పేరు వచ్చింది. మూడొందల కుటుంబాలు, ఓ బడి, ఓ ఆసుపత్రి... ఇంతే ఆ ఊరు. కానీ ఇప్పుడది సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. దేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంగా రికార్డు సాధించింది గరిపెమా. మన దేశంలో యేటా 2.200 మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారు. క్యాన్సర్‌తో చనిపోతున్న భారతీయుల్లో నలభై శాతం మంది ధూమపానం వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారే. 90 శాతం మందికి నోటి క్యాన్సర్ పొగాకు వల్లే వస్తోంది. నాగాల్యాండ్‌లో కూడా ధూమపానం చేసేవారి సంఖ్య అధికమే. కానీ ఇప్పుడు ఆ ఊళ్లో ఒక్కరు కూడా పొగాకు జోలికి పోవడం లేదు. పొగ తాగాలని పరితపించడం లేదు. గ్రామ పెద్దలు, గ్రామంలోని యువసంఘం, విద్యార్థి సంఘాలు కలిసి ఊరిలో పొగాకు అన్నమాటే వినబడకుండా చేశాయి. అది మాత్రమే కాదు... ఎక్కడా మద్యం, గుట్కా కూడా లభించకుండా చేశారు. గ్రామస్తులెవరైనా పొగతాగితే ఐదు వందలు, మద్యం సేవిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ ఊరివారే కాదు... సందర్శకులకు, ఊరివారి కోసం వచ్చే బంధుమిత్రులు కూడా వీటిని పాటించాల్సిందే. ఈ నియమాలన్నిటినీ రాసిన ఓ పెద్ద బోర్డు గ్రామంలో అడుగుపెట్టగానే కనిపిస్తుంది. అందరూ అత్యంత కచ్చితంగా నియమాలను అనుసరించడంతో భారతదేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంతో గరిపెమా అవతరించింది. దేశంలోని ఇతర ప్రాంతాలన్నిటికీ ఆదర్శంగా నిలబడింది! -
క్షయవ్యాధి నివారణకు పాటుపడాలి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్,సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క రూ క్షయవ్యాధి నివారణకు పాటుపడాలనికలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్ర వైద్యశాలలో క్షయ నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్ర జల భాగస్వామ్యం, డాక్టర్ల అంకితభావంతో పనిచేస్తే క్షయవ్యాధిని సంపూర్ణ ంగా నిర్మూలించవచ్చునన్నారు. మసూ చీ, ప్లేగు, పోలియో వ్యాధులను శాశ్వతంగా నిర్మూలించగలిగామన్నారు. కానీ ప్రజలను చైతన్యపరచని కారణంగా మలేరియా, పైలేరియా, క్షయ వ్యాధుల ను నిర్మూలించలేకపోతున్నామని విచా రం వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపం, అవగాహన రాహిత్యం కారణంగా క్షయవ్యాధి పెరిగిపోతుందన్నారు. కొన్ని రకా ల వృత్తులు కూడా క్షయ, ఇతర అంటురోగాలకు కారణమవుతున్నాయని చె ప్పారు. సిగరేట్, గుట్కా, పొగాకు ఇత ర వ్యసనాలు విడిచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీలు నిజ మైన వైద్య సేవలు అందించాలన్నారు. సేవాభావంతో పనిచేసే ఆర్ఎంపీలకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే చైనా తర్వాత ఇండియా క్షయవ్యాధిలో 2వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 4 వేల మంది రోగులకు వైద్య సౌకర్యం అంది స్తున్నట్లు తెలిపారు. అనంతరం క్షయవ్యాధి నియంత్రణకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ మెమోంటో, ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ అరుంధతి, డీఐఓ డాక్టర్ ఎబీనరేంద్ర, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయ్‌కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ హరినాథ్, డాక్టర్ గౌరి శ్రీ, డెమో తిరుపతయ్య పాల్గొన్నారు.