పొగాకు... హెల్త్‌కు దగా ఆకు! | Today is the opposite of tobacco | Sakshi
Sakshi News home page

పొగాకు... హెల్త్‌కు దగా ఆకు!

Published Wed, May 31 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

పొగాకు... హెల్త్‌కు దగా ఆకు!

పొగాకు... హెల్త్‌కు దగా ఆకు!

నేడు పొగాకు వ్యతిరేక దినం

పొగాకు ఆరోగ్యానికి ‘దగా ఆకు’ అనీ, అనేక రకాల క్యాన్సర్‌ రూపాలలో ఇది మనకు చేసే దగా అంతా ఇంతా కాదని ఎన్నెన్నో ‘నో టొబాకో డే’ సందర్భాల్లో అనేక మార్లు చెప్పుకున్నాం. అది వెలువరించే దాదాపు 7,000 రకాల హానికరమైన రసాయనాల గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అందులో 60కి పైగా క్యాన్సర్‌ను తెప్పించేవే అని ఆందోళన పడ్డాం. అయినా ఇంకా చాలామంది సిగరెట్‌ తాగడాన్ని స్టైల్‌ సింబల్‌గానో, పొగాకు నమలడాన్ని స్ట్రెస్‌ నుంచి బయటపడవేసే మార్గంగానో భావిస్తున్నారు. కానీ వాస్తవం కూడా పొగాకు లాగే చాలా చేదు.ఆరోగ్యానికి అది ఎంతో చేటు. ఆ విషయాన్ని కాస్త విభిన్నంగా,  వివరంగా చెప్పుకుందాం.

ఊపిరితిత్తుల సౌధం ధ్వంసం ఇలా!
మీకు తెలుసా? మన ఊపిరితిత్తులు బహుళ అంతస్తుల సముదాయం లాంటివి. ఎలా అంటారా? గాలి పీల్చుకునేందుకు ఉపయోగపడే ప్రధాన నాళం  ముక్కు  దగ్గర్నుంచి మొదలై గొంతు దగ్గర రెండుగా చీలుతుంది. ఒకటే ఉన్న నాళాన్ని ట్రాకియా అంటారు. అది రెండుగా చీలినప్పుడు ఆ రెండు నాళాలను బ్రాంకై అంటారు. ట్రాకియా ఒక అంచె లేదా మొదటి అంతస్తు అనుకుందాం. అప్పుడు బ్రాంకై రెండో అంతస్తు. అలా ఊపిరితిత్తుల మల్టీ స్టోరీడ్‌ బిల్డింగ్‌లో చివరిది 28వ అంతస్తు. ఆ చిట్టచివరి అంతస్తులో చిట్టిచిట్టి గదులు 30 కోట్లు ఉంటాయి. ఆ గాలిగదులనే ‘ఆల్వియోలై’ అంటారు. అక్కడ వాయువుల మార్పిడి జరుగుతుంది. ఇక మన బహుళ అంతస్తుల భవనాల పరిభాషలోనే చెప్పుకోవాలంటే... గాలి మార్పిడి జరిగేలా వీలు కల్పించేందుకు చివరి అంతస్తు మీద ఉండే ‘పెంట్‌హౌజ్‌’లు 30 కోట్లు అన్నమాట! మనం సిగరెట్‌ తాగుతున్నామంటే చివరి గాలి గది కూడా కూలిపోయేలా పునాది నుంచి ధ్వంసం చేస్తున్నామన్నమాట. సిగరెట్‌ తాగేటప్పుడు నోటి నుంచి ముక్కుల నుంచి వెలువడుతున్న ఆ పొగలే...  భవనం కూలిపోయేటప్పుడు వెలువడే దుమ్మూధూళీ అని గుర్తుపెట్టుకోండి. మళ్లీ ఎప్పుడూ పొగ తాగాలనిపించదు.

మెదడును మాయ చేసే నికోటిన్‌
మనం సిగరెట్‌ తాగే సమయంలో లోపలికి తీసుకునే రసాయనాలన్నింటిలోనూ మనల్ని బానిసగా చేసుకునేది ‘నికోటిన్‌’ మాత్రమే. ఇది అంత హానికరం కాదుగానీ... మిగతా 7000 రసాయనాలూ బాగా హానిచేసేవి. ఇక అందులోని 60 మాత్రం ఒక్కసారి పీల్చినా క్యాన్సర్‌ తెచ్చిపెట్టగల సామర్థ్యం ఉన్నవే. అందుకే మనల్ని బానిసగా మార్చుకునే ఈ నికోటిన్‌ను తక్షణమే వదిలించుకోవాలి. అప్పుడు మిగతా 7000 రసాయనాలనూ తేలిగ్గా దూరం పెట్టవచ్చు. అయితే వదిలించుకోవాలనుకున్న సమయంలో ఈ నికోటిన్‌ సామాన్యమైన మాయలు చేయదు! ఇవి చేసే మాయలు ఎన్నో తెలుసా? మెదడును అనేక రకాల భ్రమల్లో ఉంచుతుందిది. నోరు దాహంతో పిడచగట్టుకుపోయేలా చేస్తుంది. అయోమయంలో ముంచేసి గడబిడగా గందరగోళంగా ఉండేలా చూస్తుంది.

ఈ క్షణమో, మరుక్షణమో ప్రాణాలు పోతాయేమో అన్న భ్రాంతినీ, ఆందోళననూ కలిగిస్తుంది. ఈ మాయలన్నింటినీ చేసి మళ్లీ సిగరెట్‌ తాగితేగానీ ఊరుకోనంతగా ప్రేరేపిస్తుంది. అయితే మానాలనే సంకల్పం బలంగా ఉన్నవారిలో పైన పేర్కొన్న లక్షణాలు కాసేపలా బాధపెట్టాక క్రమంగా తగ్గిపోతాయి. కానీ కొంతమందికి విత్‌డ్రావల్‌ సింప్టమ్స్‌ మరీ ఎక్కువగా ఉంటాయి. అందుకే సిగరెట్‌ మానాలనుకునేవారికి నికోటిన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఈ రకమైన చికిత్సలో భాగంగా నికోటిన్‌ను వేర్వేరు రూపాల్లో అందిస్తారు. అందులో నికోటిన్‌ బిళ్లలు ముఖ్యమైనవి. ఇవేగాక నేసల్‌ స్ప్రేలు, ఇన్‌హేలర్‌లు, లాజెంజెస్‌లు కూడా ఉంటాయి. వాటన్నింటి సహాయంతో సిగరెట్‌ మానేస్తే ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

ఒక్క పఫ్‌.. హెల్త్‌ ఉఫ్‌...
మనం ఒక సిగరెట్‌ తాగినప్పుడు ఒక 100 చదరపు మీటర్ల వైశాల్యంలోని 30 కోట్ల గాలి గదుల్లో, 2400 కిలోమీటర్ల నిడివి ఉండే ఊపిరితిత్తుల రక్తనాళాల పొడవునా ప్రతి భాగం పొగచూరిపోతుంది. మనం ఈ 30 కోట్ల గదులను దూరి బయటకు వచ్చేందుకు ఒక్కొక్క సెకన్‌ సమయం తీసుకున్నా గదులన్నీ పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 10 ఏళ్లు (కచ్చితంగా చెప్పలంటే తొమ్మిదిన్నర ఏళ్లకు కాస్త పైచిలుకు). కానీ సిగరెట్‌ అంత సమయం తీసుకోదు. ఒక్క పఫ్‌లో అన్ని గదులనూ, అన్ని రక్తనాళాలనూ, అన్ని గోడలనూ చుట్టుముడుతుంది. అన్నింటినీ పొగచూరిపోయేలా చేస్తుంది. అన్ని భాగాలను తూట్లు పొడుస్తుంది.

లంగ్స్‌...  పొగచూరిన వంటగదులే  
ప్రతిరోజూ మనం దాదాపు 22 వేల సార్లు శ్వాసిస్తాం. రోజుకు సగటున 16 వేల లీటర్ల గాలిని పీలుస్తాం. అంత గాలినీ ఒక్క సిగరెట్‌తో కలుషితం చేసేస్తాం. అంతేకాదు... మన ఊపిరితిత్తుల బహుళ అంతస్తుల భవనంలో ఎస్కలేటర్లు కూడా ఉంటాయి. ఆ ఎస్కలేటర్లను వైద్య పరిభాషలో సీలియా అంటారు. మ్యూకస్, సీలియా కలిసి ఉండే ఈ ఎస్కలేటర్లను ‘మ్యూకోసీలియా ఎస్కలేటర్స్‌’ అని కూడా అంటారు.  మనకు సరిపడని దుమ్ము, ధూళి, పొగ లాంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వాటిని ఈ ఎస్కలేటర్లు ఊపిరితిత్తులనుంచి బయటకు వెళ్లేలా చేస్తాయి. కానీ అవి బయటకు పంపించే కాలుష్యం కంటే మనం లోపలికి పంపించే పొగ ఎక్కువ. దాంతో అవి అలసిపోతాయి. ఊపిరితిత్తుల లోపలి భాగం... పాత ఇండ్ల వంటగదుల్లా పొగచూరి... మసిబారిపోతాయి.

తాగే వారికే కాదు... పక్క వారికీ...!
సిగరెట్‌... దానిని తాగేవాళ్లతోపాటు ఇంట్లో వారి ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. మరొకరు వదిలిన పొగను పీల్చడాన్ని ‘ప్యాసివ్‌ స్మోకింగ్‌’ అంటారు. నేరుగా పొగతాగడం వల్ల ఎంత హాని జరుగుతుందో... ప్యాసివ్‌ స్మోకింగ్‌తోనూ అంతే హాని జరుగుతుంది. ఒక అధ్యయనంలో తేలినదేమిటంటే... ప్రతి ఏడాదీ ప్యాసివ్‌ స్మోకింగ్‌ వల్ల 34,000 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనూ, 46,000 మంది గుండెజబ్బులతోనూ చనిపోతున్నారు. అంతేకాదు... ఈ ప్యాసివ్‌ స్మోకింగ్‌ వల్ల ఆస్తమా, నిమోనియా, బ్రాంకైటిస్, తలనొప్పి, దగ్గు వంటి అనారోగ్యాలూ, అనర్థాలూ, ఆపదలూ అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా సొంత తల్లిదండ్రులు తమ పిల్లలకు క్యాన్సర్‌నూ, ఆస్తమా, ఎంఫసిమా, నిమోనియా, బ్రాంకైటిస్, దగ్గూ ఆయాసాలు లేదా నెలలు నిండటానికి ముందే ప్రసూతి (ప్రీ–టర్మ్‌ డెలివరీ), మృతశిశువు జన్మించడం (స్టిల్‌ బర్త్‌), పుట్టిన శిశువు బరువు బాగా తక్కువగా ఉండటం, పుట్టిన శిశువు అకస్మాత్తుగా చనిపోవడం, ముత్యాల గర్భం, పుట్టిన పిల్లల్లో గ్రహణం మొర్రి కనిపించడం (క్లెఫ్ట్‌ పాలెట్‌) లాంటి అనర్థాలను గిఫ్ట్‌గా ఇస్తారా ఎవరైనా?

సిగరెట్‌ కాలుస్తున్న విస్తీర్ణం?
మన ఊపిరితిత్తుల నిర్మాణమే ఒక అద్భుతం. అవి కేవలం 2.3 కిలోగ్రాముల బరువుతో, జానెడు పొడవు మాత్రమే ఉండే గాలితిత్తులని మనకు అనిపించవచ్చు. వాటి నిర్మాణ అద్భుతాన్ని మడతలు విప్పి చూస్తే ఊపిరితిత్తుల గొప్పదనం అర్థమవుతుంది. ముక్కు చివర ఉండే వాయునాళం (ట్రాకియా) శ్వాసవ్యవస్థలోని మొదటి అంతస్తు అయితే, బ్రాంకై రెండో అంతస్తు అయితే, ఊపిరితిత్తుల్లోని గాలిగది (ఆల్వియోలై) చివరి అంతస్తు అని మనం చెప్పుకున్నాం కదా. శ్వాసవ్యవస్థలోని 14వ అంతస్తు నుంచి మరింత సన్నగా చీలే ఈ ఊపిరితిత్తుల్లోని గాలినాళాల నిర్మాణాలు కంటికి కనిపించనంత సంక్లిష్టంగా ఉంటాయి. అంటే 28వ అంతస్తుకు చేరేటప్పటికి ఎంత సంక్లిష్టంగా ఉంటాయో ఊహించుకోండి. అలా ఆ 28 అంతస్తులన్నింటినీ చదునుగా పరిచామనుకోండి. ఆ విస్తీర్ణం ఒక టెన్నిస్‌ కోర్టు పరిమాణమంత! దాదాపు 100 చదరపు మీటర్లు.

ఇక ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల పొడవు 2400 కిలోమీటర్లు. ఇంత విస్తృతమైన దాన్ని మనం కర్చిఫ్‌ మడతలు వేసినట్లుగా జానెడు పొడవుకు మడిచి, ఛాతీలో అమర్చుకున్నాం. కర్చిఫ్‌ను ఒకచోట కాలిస్తే... ఒక్క రంధ్రం పడుతుంది. అదే కర్చిఫ్‌ను 28 మడతలు వేశాక... ఒక్క చోట కాల్చి మడతలు విప్పితే... ప్రతి మడతలోనూ కాలిన రంధ్రం ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి. మనం ఒక్క సిగరెట్‌ తాగిన ప్రతిసారీ ఊపిరితిత్తులకు ఎన్నెన్ని రంధ్రాలు పెడుతున్నామో! ఒకసారి అణుబాంబు వేసినప్పుడు మాడిపోయే ప్రదేశపు విస్తీర్ణం కంటే సిగరెట్‌తో పదే పదే మాడ్చేసే ప్రాంతపు విస్తీర్ణం చాలా చాలా ఎక్కువ.

పొగ మానితే తక్షణ ప్రయోజనాలు...
∙ఆహారం రుచి తెలియడం ∙వాసన గ్రహించే శక్తి సాధారణ స్థాయికి రావడం ∙దుర్వాసన పోయి శ్వాస, జుట్టు, బట్టలు తాజా వాసనతో ఉండటం ∙పళ్లు, గోళ్లు పచ్చబారకుండా మిలమిల మెరుస్తూ ఉండటం ∙మెట్లెక్కడం, చిన్న చిన్న పనులు తేలికవడం.

దీర్ఘకాలిక ప్రయోజనాలు
సిగరెట్‌ మానేసిన తొమ్మిది నెలల్లో దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలపడి శ్వాస సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇన్ఫెక్షన్స్‌ ముప్పు తొలగిపోతుంది. ఏడాది తర్వాత కరోనరీ హార్ట్‌ డిసీజ్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఐదేళ్లు మానేస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక 15 ఏళ్ల పాటు మానేస్తే... మామూలు మనిషి అయిపోయినట్లే. కాబట్టి పొగతాగే అలవాటున్న వాళ్లే కాదు... కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పొరుగువాళ్ల... ఆయుర్దాయమూ పెరుగుతుంది. పొగమానడానికి మంచి ముహూర్తం ఈ రోజే!

డాక్టర్‌ సీహెచ్‌ మోహన వంశీ
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌
ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్‌.
ఫోన్‌: 98480 11421
కర్నూలు: 08518–273001

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement