బడ్జెట్‌లో ఆదాయపన్ను తగ్గింపు, ఇతర పన్ను ప్రతిపాదనలతో బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లు పెరగనున్నాయి. సుమారు రూ.40,000 నుంచి 45,000 కోట్ల వరకు బ్యాంకుల్లోకి డిపాజిట్లు(Bank Deposit)గా రావొచ్చని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై ఆదాయం రూ.40,000 మించినప్పుడు (60 ఏళ్లలోపు వారికి) బ్యాంక్‌లు 10 శాతం మేర టీడీఎస్ వసూలు చేస్తుండగా, ఈ పరిమితిని రూ.50,000కు పెంచడం గమనార్హం. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000గా ఉన్న పరిమితిని రూ.లక్షకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే.
‘పన్ను రాయితీని పెంచడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.20,000 కోట్లు డిపాజిట్ల రూపంలో రావొచ్చు. సేవింగ్స్ డిపాజిట్లపై వృద్ధులు ఆర్జించే వడ్డీపై టీడీఎస్ పరిమితిని పెంచడం వల్ల మరో రూ.15,000 కోట్లు రావొచ్చు’ అని నాగరాజు వివరించారు. సీనియర్లు కాని ఇతర వ్యక్తులకు పన్ను ఆదా రూపంలోనూ మరో రూ.7,000 కోట్ల మేర డిపాజిట్లుగా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: త్వరలో భారత్ సొంత జీపీయూ
క్యాన్సర్ సంస్థలతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
క్యాన్సర్‌పై పరిశోధనలు, పేషంట్ల సంరక్షణ కార్యక్రమాలకు తోడ్పాటు అందించే దిశగా దేశీయంగా మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో చేతులు కలిపినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్స్ వీటిలో ఉన్నట్లు వివరించింది. తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల కింద ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ విజయ్ మూల్‌బగల్ తెలిపారు. ప్రధానంగా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, క్యాన్సర్ నివారణ .. చికిత్సపై అవగాహన కల్పించే సంస్థలు, అలాగే పేషంట్ల సంరక్షణ మొదలైన వాటికి సహాయసహకారాలు అందించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు. సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్స్ సంస్థ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయం అందించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment