పొగచూరకు... మసిబారకు!! | smoke soot to fathom | Sakshi
Sakshi News home page

పొగచూరకు... మసిబారకు!!

Published Sat, May 30 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

పొగచూరకు... మసిబారకు!!

పొగచూరకు... మసిబారకు!!

సిగరెట్ల వల్ల నష్టాలు ఎన్ని రెట్లు అన్నది చెప్పడానికి ఎన్ని సెట్ల ఇంటర్‌నెట్లు అయినా  సరిపోవు.పొగచెట్ల వల్ల ఎన్ని వ్యాధులు కట్లు విప్పుకుంటాయో నమోదు చేయడానికి కంప్యూటర్ బైట్లూ చాలవు.వ్యసనం వదిలిపోకుండా ఉండటానికి పొగాకులోని నికోటిన్ మెదడుపై చేసే మాయలను రాయడానికి ఎన్ని పెన్నులైనా సరిపోవు.అయినా... ఓసారి పొగాకు ఆరోగ్యానికి పెట్టే చికాకును చూస్తే ఎవరైనా దాన్ని వదిలేయాల్సిందే.మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా పొగాకు హెల్త్‌కు కల్పించే చిరాకును తెలుసుకొని, దాన్ని వదిలించుకుంటారనే ఆశతో, ఆశయంతో ఈ కథనం.
 
పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది చేటు. సిగరెట్టు ఆరోగ్యంపై వేటు. చుట్ట చుట్టలు చుట్టుకొని ఉన్న విషం నిండిన పాముల చుట్ట. రోగాల పుట్ట. గుట్కాతో ప్రాణాలు గుటుక్కు. నశ్యం వదిలేయడం అవశ్యం. పొగాకు చేసే చెరుపు గురించి, ఆ వ్యాధులు పుట్టించే వెరపు గురించి అవగాహన ఉన్న ఎవరైనా చెప్పే మాటలివి. ఈ సందర్భంగా  పొగాకు హెల్త్‌ను దగా చేసే ఆకు ఎలాగైందో చూద్దాం.
 ఊపిరితిత్తులకు : పొగ పీల్చగానే నేరుగా అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ముక్కు మొదటి అంతస్తు అనుకుంటే గాలిమార్పిడి జరిగే ‘ఆల్వియోలై’ అనే గాలి గది 28వ అంతస్తు. అక్కడ గాలి మార్పిడి... అంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అంది, మలినమైన కార్బన్‌డై ఆక్సైడ్ మార్పిడి ‘ఆల్వియోలై’ అనే గాలిగదిలో జరుగుతుంది. కానీ పొగలో ఉండే కార్బన్‌మోనాక్సైడ్, సైనైడ్ వంటి విషపదార్థాల వల్ల ఆ గాలిగది స్వరూపమే మారిపోతుంది. వాస్తవానికి అక్కడ హిమోగ్లోబిన్ అనే వాహకం మీద ఆక్సిజన్ చేరి శరీరంలోని అన్ని కణాలకూ అందాలి. కానీ పొగాకులోని విషపదార్థాల్లో ఉండే కార్బన్‌మోనాక్సైడ్... హీమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దాంతో రక్తంలోని హీమోగ్లోబిన్‌కు ఆక్సిజన్‌ను మోసుకుపోయే సామర్థ్యం తగ్గుతుంది.

ఇది ఎలాంటి బంధమంటే చెడు స్నేహాల వల్ల మంచి స్నేహితుడు దూరమయ్యే పరిస్థితి లాంటిది. దీంతో శరీరంలోని అన్ని కణాలూ కార్బన్‌మోనాక్సైడ్‌తో విషపూరితమవుతాయి. ఫలితంగా ఎంఫసిమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) లాంటి ప్రమాదకరమైన వ్యాధులూ వస్తాయి. ఫలితంగా కొద్దిదూరం కూడా నడవలేని పరిస్థితి. కదిల్తే నీరసం, నడిస్తే ఆయాసం. ఎడతెరిపి లేకుండా వచ్చే విపరీతమైన దగ్గు. పొగాకులో ఉండే ‘ఆక్రోలిన్’ అనే అత్యంత విషపదార్థం సీఓపీడీని కలిగించడమే కాదు... క్యాన్సర్‌కూ కారణమవుతుంది. అంతేకాదు... సిగరెట్ పొగలో ఉండే పాలీసైక్లిక్ అరోమ్యాటిక్ హైడ్రోకార్బన్స్, బెంజోపైరీన్, నైట్రోజమైన్ ఇవన్నీ క్యాన్సర్‌ను కలిగించేవే. ఇక క్యాన్సర్ కారక గుణాలతో పాటూ రేడియో యాక్టివ్ గుణాలున్న సీసం (లెడ్-210), పొలోనియం లాంటివీ పొగలో ఉండి జీవితాన్ని పొగచూరిపోయేలా చేస్తాయి.

తల నుంచి కాలిగోటి వరకు పొగాకు వల్ల జరిగే నష్టాలను స్పర్శిస్తూ పోదాం...
తల : సిగరెట్‌ను నోట్లో పెట్టుకుని కాల్చే సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందొక్కటే. సిగరెట్ మండే చివరను అగ్నిపర్వతపు మండే భాగం (బర్నింగ్ ఎండ్), దాని చివరన వెలువడే నుసి అగ్నిపర్వతపు బూడిద అనుకుంటే... ఆ సిగరెట్ వెలువరించే ‘లావా’... బయటివైపునకు కాకుండా శరీరం లోపలి వైపునకు ప్రవహిస్తుందని గుర్తుంచుకోండి. అలా సిగరెట్ వల్ల నోట్లోకి వచ్చే లావా రాళ్లనూ కరిగించుకున్నట్లుగా మన చెంపల లోపలి పొరను దెబ్బతీస్తుంది. మెత్తనైన చిగుర్లను కరిగించివేస్తుంది. అందుకే చిగుర్లు కరిగిపోతాయి కాబట్టి పళ్లు ఎక్కువగా బయటపడతాయి. ఇలా చిగుర్లు కరగడాన్ని ‘జింజివల్ రిసెషన్’అంటారు. పళ్లరంగు మారిపోతుంది. నోటిలోపలి మృదువైన పొరలు దెబ్బతిని పుండ్లలా (మ్యూకోజల్ లీజన్స్) మారడమే కాదు, ఆ ప్రాంతంలో క్యాన్సర్లూ వస్తాయి. ఇలా వచ్చేముందర సిగరెట్ పొగ తాలూకు ప్రభావంతో నోటిలోపల తెల్లని మచ్చలు ఏర్పడతాయి. వాటినే ‘ల్యూకోప్లేకియా’ అంటారు. ఈ ల్యూకోప్లేకియా మచ్చలు క్యాన్సర్ ఆవిర్భావానికి తొలి రూపాలు. చిగుర్లపై మచ్చలు రావడం (స్మోకర్స్ మెలనోసిస్), పళ్లు పసుపుపచ్చగా మారడం జరుగుతుంది. నాలుక నల్లగా మారే ‘బ్లాక్ హెయిరీ టంగ్’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు. వేడిలావాలా విషాలు నోట్లోకి ప్రవహించడం వల్ల నోట్లోని లాలాజలం ఆవిరైపోతుంది. అది తగ్గడంతో నోట్లో విషక్రిములూ, దుర్వాసనా... ఒకటేమిటి అన్నీ అనర్థాలే. నోరు, నాలుక, అంగిలి, ట్రాకియా, ఈసోఫేగస్... ఇలా నోటి పొరుగున ఉన్న ప్రతి భాగమూ క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది.

గొంతు : నోటి తర్వాత గొంతు భాగానికి వస్తే... గొంతులో ఉండే ప్రతి అవయవమూ మళ్లీ పొగ బారిన పడి క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతునుంచి ఊపిరితిత్తులోకి వెళ్లే బ్రాంకియా... ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని పై అవయవాలన్నింటికీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

గుండె : సిగరెట్ పొగ మన గుండెకు చేసే చెరుపూ అంతా ఇంతా కాదు. సిగరెట్ ముట్టించిన మరుక్షణం గుండె వేగం అదుపు తప్పి పెరిగిపోతుంది. పదినిమిషాల పాటు అదేపనిగా సిగరెట్ తాగితే గుండె వేగం 30 శాతానికి పైగా పెరుగుతుంది. అంటే అవసరానికి మించి గుండె కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. అంటే గుండె లయ తప్పి కొట్టుకోవడం వల్ల జరిగే అనర్థాలన్నీ సిగరెట్ వల్ల కలుగుతాయి.  గుండె, రక్తప్రవాహవ్యవస్థ (హార్ట్ అండ్ కార్డియోవ్యాస్క్యులార్ సిస్టమ్)కు జరిగే నష్టాలను చూస్తే... సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది (విస్కాసిటీ పెరుగుతుంది). దాంతో రక్తప్రవాహం సాఫీగా జరగక రక్తనాళాల మధ్యన రక్తపు గడ్డలు ఏర్పడి గుండెకు రక్తం అందకపోవచ్చు. ఏ భాగానికి రక్తం అందకపోయినా... ఆక్సిజన్, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోతుందన్న విషయం తెలిసిందే. ఇదే పరిణామం గుండెకు రక్తసరఫరా చేసే కరొనరీ ఆర్టరీలో జరిగితే గుండెపోటు వచ్చి ప్రాణానికే ముప్పు వాటిల్లవచ్చు.

ఇక ఇదే రకమైన ప్రమాదం మెదడుకూ ఉంది. మన శరీరాన్ని నియంత్రించే కీలకమైన భాగం మెదడే. దానికి ఆక్సిజన్ అందజేసే కెరోటిడ్ రక్తనాళాల్లో గానీ, లేదా ఇతర రక్తనాళాల్లోగాని రక్తం చిక్కబడి అక్కడ అది చిక్కుబడితే... మెదడుకు రక్తప్రవాహం అందక పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి పక్షవాతం వస్తే ఇక ఆ రోగి జీవితాంతం ఎవరిపైనైనా ఆధారపడుతూ దుర్భర జీవితాన్ని గడపాల్సిందే. అందుకే అలాంటి దుస్థితి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు... సిగరెట్ పొగ వల్ల మెదడుకు అందే రక్తం తగ్గడం వల్ల ఏదైనా విషయాలను అవగాహన చేసుకునే  (కాగ్నిటివ్) శక్తిసామర్థ్యాలు 50 శాతానికి పైగా తగ్గుతాయి. దీర్ఘకాలంలో అవి ప్రపంచంలోని అన్ని విషయాలనూ మరచిపోయేలా చేసే అల్జైమర్స్, పార్కిన్‌సన్స్ డిసీజ్ వంటి వాటికి దారితీస్తాయి.

పురుషులకు ప్రమాదాలివే : సిగరెట్‌ను స్టైల్‌గా ముట్టించి పొగ వదలడాన్ని పురుషత్వానికి చిహ్నంగా కొన్ని ప్రకటనలలో చూపిస్తారు. కానీ సిగరెట్ పురుషత్వాన్ని కబళిస్తుంది. సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడిపోతుందన్న విషయం తెలిసిందే కదా. ఇదే పరిణామం పురుషాంగానికి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో (ఆర్టరీలలో) జరగడం వల్ల అంగస్తంభన సమస్యలు (ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్) వస్తాయి. అంతేకాదు... వీళ్లలో శుక్రకణాల సంఖ్య (స్పెర్మ్‌కౌంట్) గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా తాము గర్వపడే విషయంలోనే గర్బభంగం జరిగే పరిస్థితి సిగరెట్ తెచ్చిపెడుతుంది. బ్లాడర్‌క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్... ఈ తరహా క్యాన్సర్లన్నింటికీ పొగతాగడం ఒక ప్రధాన కారణం.
 కాళ్లు : తల నుంచి మొదలుపెట్టిన ప్రస్థానాన్ని ఇప్పుడు కాళ్ల చివరకు చేర్చుదాం. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్’ అనే వ్యాధి వస్తుంది. దీన్నే బర్జర్స్ డిసీజ్ అని కూడా అంటారు. దీనివల్ల పాదాల చివరకు రక్తం అందకపోవడం అనే పరిణామం ఏర్పడితే పాదం కుళ్లిపోయి, పాదాలతో పాటు కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి తెచ్చే దుర్మార్గమైన అలవాటు ఈ పొగతాగడం.
 ఇలా పొగతాగడం అన్న అలవాటు తల మొదలుకొని కాళ్ల చివరల వరకూ ఉండే ప్రతి అవయవాన్నీ... లోపల ఉండే అన్ని అవయవాలను అంటే... కాలేయం, ప్యాంక్రియాస్, చిన్నపేగులు, పెద్దపేగులు, కోలోరెక్టల్... ఇలా నోటి నుంచి మొదలుకొని జీర్ణవ్యవస్థలోని చివరి భాగం వరకూ ఏ అవయవానికైనా క్యాన్సర్ కలిగించే గుణం పొగాకుకు ఉంది.
 
మహిళలకూ ఎంతో కీడు : ఇక మహిళల విషయంలోనూ సిగరెట్ పొగ అంతే కీడు చేస్తుంది. ఒక కుటుంబంలో పురుషులు తాగే సిగరెట్ పొగ కేవలం వారిని మాత్రమే కాదు... వారి జీవిత భాగస్వామినీ అంతే తీవ్రంగా దెబ్బతీస్తుంది. పురుషులు తాగే సిగరెట్ తాలూకు కాలేచివరి నుంచి వచ్చే పొగ, పీల్చాక ఊపిరితిత్తుల్లోంచి వచ్చే పొగ... ఈ రెండూ కలిసి రెట్టింపు నష్టాలను కుటుంబ సభ్యులకూ కలగజేస్తాయి. సిగరెట్ పొగ వల్ల  మహిళల్లో ఓవరీస్ దెబ్బతింటాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పాదనపై సిగరెట్ పొగ దుష్ర్పభావం చూపడం వల్ల అండం ఉత్పాదన తగ్గిపోతోంది. ఎంబ్రియో ట్రాన్స్‌పోర్ట్ కూడా దెబ్బతింటుంది. మహిలల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అంతేకాదు. ఒకవేళ కృత్రిమంగా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి చేద్దామనుకున్నా దానికి అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. పైగా అబార్షన్లు పెరగడం, ఒకవేళ పిండం ఎదిగినా చివర్లో మృతశిశువులు జన్మించడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి.
 
 డాక్టర్ సిహెచ్. మోహనవంశీ
 చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
 ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement