Dr. CH. Mohana Vamsi
-
పొగచూరకు... మసిబారకు!!
సిగరెట్ల వల్ల నష్టాలు ఎన్ని రెట్లు అన్నది చెప్పడానికి ఎన్ని సెట్ల ఇంటర్నెట్లు అయినా సరిపోవు.పొగచెట్ల వల్ల ఎన్ని వ్యాధులు కట్లు విప్పుకుంటాయో నమోదు చేయడానికి కంప్యూటర్ బైట్లూ చాలవు.వ్యసనం వదిలిపోకుండా ఉండటానికి పొగాకులోని నికోటిన్ మెదడుపై చేసే మాయలను రాయడానికి ఎన్ని పెన్నులైనా సరిపోవు.అయినా... ఓసారి పొగాకు ఆరోగ్యానికి పెట్టే చికాకును చూస్తే ఎవరైనా దాన్ని వదిలేయాల్సిందే.మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా పొగాకు హెల్త్‌కు కల్పించే చిరాకును తెలుసుకొని, దాన్ని వదిలించుకుంటారనే ఆశతో, ఆశయంతో ఈ కథనం. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది చేటు. సిగరెట్టు ఆరోగ్యంపై వేటు. చుట్ట చుట్టలు చుట్టుకొని ఉన్న విషం నిండిన పాముల చుట్ట. రోగాల పుట్ట. గుట్కాతో ప్రాణాలు గుటుక్కు. నశ్యం వదిలేయడం అవశ్యం. పొగాకు చేసే చెరుపు గురించి, ఆ వ్యాధులు పుట్టించే వెరపు గురించి అవగాహన ఉన్న ఎవరైనా చెప్పే మాటలివి. ఈ సందర్భంగా పొగాకు హెల్త్‌ను దగా చేసే ఆకు ఎలాగైందో చూద్దాం. ఊపిరితిత్తులకు : పొగ పీల్చగానే నేరుగా అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ముక్కు మొదటి అంతస్తు అనుకుంటే గాలిమార్పిడి జరిగే ‘ఆల్వియోలై’ అనే గాలి గది 28వ అంతస్తు. అక్కడ గాలి మార్పిడి... అంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అంది, మలినమైన కార్బన్‌డై ఆక్సైడ్ మార్పిడి ‘ఆల్వియోలై’ అనే గాలిగదిలో జరుగుతుంది. కానీ పొగలో ఉండే కార్బన్‌మోనాక్సైడ్, సైనైడ్ వంటి విషపదార్థాల వల్ల ఆ గాలిగది స్వరూపమే మారిపోతుంది. వాస్తవానికి అక్కడ హిమోగ్లోబిన్ అనే వాహకం మీద ఆక్సిజన్ చేరి శరీరంలోని అన్ని కణాలకూ అందాలి. కానీ పొగాకులోని విషపదార్థాల్లో ఉండే కార్బన్‌మోనాక్సైడ్... హీమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దాంతో రక్తంలోని హీమోగ్లోబిన్‌కు ఆక్సిజన్‌ను మోసుకుపోయే సామర్థ్యం తగ్గుతుంది. ఇది ఎలాంటి బంధమంటే చెడు స్నేహాల వల్ల మంచి స్నేహితుడు దూరమయ్యే పరిస్థితి లాంటిది. దీంతో శరీరంలోని అన్ని కణాలూ కార్బన్‌మోనాక్సైడ్‌తో విషపూరితమవుతాయి. ఫలితంగా ఎంఫసిమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) లాంటి ప్రమాదకరమైన వ్యాధులూ వస్తాయి. ఫలితంగా కొద్దిదూరం కూడా నడవలేని పరిస్థితి. కదిల్తే నీరసం, నడిస్తే ఆయాసం. ఎడతెరిపి లేకుండా వచ్చే విపరీతమైన దగ్గు. పొగాకులో ఉండే ‘ఆక్రోలిన్’ అనే అత్యంత విషపదార్థం సీఓపీడీని కలిగించడమే కాదు... క్యాన్సర్‌కూ కారణమవుతుంది. అంతేకాదు... సిగరెట్ పొగలో ఉండే పాలీసైక్లిక్ అరోమ్యాటిక్ హైడ్రోకార్బన్స్, బెంజోపైరీన్, నైట్రోజమైన్ ఇవన్నీ క్యాన్సర్‌ను కలిగించేవే. ఇక క్యాన్సర్ కారక గుణాలతో పాటూ రేడియో యాక్టివ్ గుణాలున్న సీసం (లెడ్-210), పొలోనియం లాంటివీ పొగలో ఉండి జీవితాన్ని పొగచూరిపోయేలా చేస్తాయి. తల నుంచి కాలిగోటి వరకు పొగాకు వల్ల జరిగే నష్టాలను స్పర్శిస్తూ పోదాం... తల : సిగరెట్‌ను నోట్లో పెట్టుకుని కాల్చే సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందొక్కటే. సిగరెట్ మండే చివరను అగ్నిపర్వతపు మండే భాగం (బర్నింగ్ ఎండ్), దాని చివరన వెలువడే నుసి అగ్నిపర్వతపు బూడిద అనుకుంటే... ఆ సిగరెట్ వెలువరించే ‘లావా’... బయటివైపునకు కాకుండా శరీరం లోపలి వైపునకు ప్రవహిస్తుందని గుర్తుంచుకోండి. అలా సిగరెట్ వల్ల నోట్లోకి వచ్చే లావా రాళ్లనూ కరిగించుకున్నట్లుగా మన చెంపల లోపలి పొరను దెబ్బతీస్తుంది. మెత్తనైన చిగుర్లను కరిగించివేస్తుంది. అందుకే చిగుర్లు కరిగిపోతాయి కాబట్టి పళ్లు ఎక్కువగా బయటపడతాయి. ఇలా చిగుర్లు కరగడాన్ని ‘జింజివల్ రిసెషన్’అంటారు. పళ్లరంగు మారిపోతుంది. నోటిలోపలి మృదువైన పొరలు దెబ్బతిని పుండ్లలా (మ్యూకోజల్ లీజన్స్) మారడమే కాదు, ఆ ప్రాంతంలో క్యాన్సర్లూ వస్తాయి. ఇలా వచ్చేముందర సిగరెట్ పొగ తాలూకు ప్రభావంతో నోటిలోపల తెల్లని మచ్చలు ఏర్పడతాయి. వాటినే ‘ల్యూకోప్లేకియా’ అంటారు. ఈ ల్యూకోప్లేకియా మచ్చలు క్యాన్సర్ ఆవిర్భావానికి తొలి రూపాలు. చిగుర్లపై మచ్చలు రావడం (స్మోకర్స్ మెలనోసిస్), పళ్లు పసుపుపచ్చగా మారడం జరుగుతుంది. నాలుక నల్లగా మారే ‘బ్లాక్ హెయిరీ టంగ్’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు. వేడిలావాలా విషాలు నోట్లోకి ప్రవహించడం వల్ల నోట్లోని లాలాజలం ఆవిరైపోతుంది. అది తగ్గడంతో నోట్లో విషక్రిములూ, దుర్వాసనా... ఒకటేమిటి అన్నీ అనర్థాలే. నోరు, నాలుక, అంగిలి, ట్రాకియా, ఈసోఫేగస్... ఇలా నోటి పొరుగున ఉన్న ప్రతి భాగమూ క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతు : నోటి తర్వాత గొంతు భాగానికి వస్తే... గొంతులో ఉండే ప్రతి అవయవమూ మళ్లీ పొగ బారిన పడి క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతునుంచి ఊపిరితిత్తులోకి వెళ్లే బ్రాంకియా... ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని పై అవయవాలన్నింటికీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. గుండె : సిగరెట్ పొగ మన గుండెకు చేసే చెరుపూ అంతా ఇంతా కాదు. సిగరెట్ ముట్టించిన మరుక్షణం గుండె వేగం అదుపు తప్పి పెరిగిపోతుంది. పదినిమిషాల పాటు అదేపనిగా సిగరెట్ తాగితే గుండె వేగం 30 శాతానికి పైగా పెరుగుతుంది. అంటే అవసరానికి మించి గుండె కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. అంటే గుండె లయ తప్పి కొట్టుకోవడం వల్ల జరిగే అనర్థాలన్నీ సిగరెట్ వల్ల కలుగుతాయి. గుండె, రక్తప్రవాహవ్యవస్థ (హార్ట్ అండ్ కార్డియోవ్యాస్క్యులార్ సిస్టమ్)కు జరిగే నష్టాలను చూస్తే... సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది (విస్కాసిటీ పెరుగుతుంది). దాంతో రక్తప్రవాహం సాఫీగా జరగక రక్తనాళాల మధ్యన రక్తపు గడ్డలు ఏర్పడి గుండెకు రక్తం అందకపోవచ్చు. ఏ భాగానికి రక్తం అందకపోయినా... ఆక్సిజన్, పోషకాలు అందక ఆ భాగం చచ్చుబడిపోతుందన్న విషయం తెలిసిందే. ఇదే పరిణామం గుండెకు రక్తసరఫరా చేసే కరొనరీ ఆర్టరీలో జరిగితే గుండెపోటు వచ్చి ప్రాణానికే ముప్పు వాటిల్లవచ్చు. ఇక ఇదే రకమైన ప్రమాదం మెదడుకూ ఉంది. మన శరీరాన్ని నియంత్రించే కీలకమైన భాగం మెదడే. దానికి ఆక్సిజన్ అందజేసే కెరోటిడ్ రక్తనాళాల్లో గానీ, లేదా ఇతర రక్తనాళాల్లోగాని రక్తం చిక్కబడి అక్కడ అది చిక్కుబడితే... మెదడుకు రక్తప్రవాహం అందక పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి పక్షవాతం వస్తే ఇక ఆ రోగి జీవితాంతం ఎవరిపైనైనా ఆధారపడుతూ దుర్భర జీవితాన్ని గడపాల్సిందే. అందుకే అలాంటి దుస్థితి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు... సిగరెట్ పొగ వల్ల మెదడుకు అందే రక్తం తగ్గడం వల్ల ఏదైనా విషయాలను అవగాహన చేసుకునే (కాగ్నిటివ్) శక్తిసామర్థ్యాలు 50 శాతానికి పైగా తగ్గుతాయి. దీర్ఘకాలంలో అవి ప్రపంచంలోని అన్ని విషయాలనూ మరచిపోయేలా చేసే అల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వాటికి దారితీస్తాయి. పురుషులకు ప్రమాదాలివే : సిగరెట్‌ను స్టైల్‌గా ముట్టించి పొగ వదలడాన్ని పురుషత్వానికి చిహ్నంగా కొన్ని ప్రకటనలలో చూపిస్తారు. కానీ సిగరెట్ పురుషత్వాన్ని కబళిస్తుంది. సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కబడిపోతుందన్న విషయం తెలిసిందే కదా. ఇదే పరిణామం పురుషాంగానికి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో (ఆర్టరీలలో) జరగడం వల్ల అంగస్తంభన సమస్యలు (ఎరక్టైల్ డిస్ఫంక్షన్) వస్తాయి. అంతేకాదు... వీళ్లలో శుక్రకణాల సంఖ్య (స్పెర్మ్‌కౌంట్) గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా తాము గర్వపడే విషయంలోనే గర్బభంగం జరిగే పరిస్థితి సిగరెట్ తెచ్చిపెడుతుంది. బ్లాడర్క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్... ఈ తరహా క్యాన్సర్లన్నింటికీ పొగతాగడం ఒక ప్రధాన కారణం. కాళ్లు : తల నుంచి మొదలుపెట్టిన ప్రస్థానాన్ని ఇప్పుడు కాళ్ల చివరకు చేర్చుదాం. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్’ అనే వ్యాధి వస్తుంది. దీన్నే బర్జర్స్ డిసీజ్ అని కూడా అంటారు. దీనివల్ల పాదాల చివరకు రక్తం అందకపోవడం అనే పరిణామం ఏర్పడితే పాదం కుళ్లిపోయి, పాదాలతో పాటు కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి తెచ్చే దుర్మార్గమైన అలవాటు ఈ పొగతాగడం. ఇలా పొగతాగడం అన్న అలవాటు తల మొదలుకొని కాళ్ల చివరల వరకూ ఉండే ప్రతి అవయవాన్నీ... లోపల ఉండే అన్ని అవయవాలను అంటే... కాలేయం, ప్యాంక్రియాస్, చిన్నపేగులు, పెద్దపేగులు, కోలోరెక్టల్... ఇలా నోటి నుంచి మొదలుకొని జీర్ణవ్యవస్థలోని చివరి భాగం వరకూ ఏ అవయవానికైనా క్యాన్సర్ కలిగించే గుణం పొగాకుకు ఉంది. మహిళలకూ ఎంతో కీడు : ఇక మహిళల విషయంలోనూ సిగరెట్ పొగ అంతే కీడు చేస్తుంది. ఒక కుటుంబంలో పురుషులు తాగే సిగరెట్ పొగ కేవలం వారిని మాత్రమే కాదు... వారి జీవిత భాగస్వామినీ అంతే తీవ్రంగా దెబ్బతీస్తుంది. పురుషులు తాగే సిగరెట్ తాలూకు కాలేచివరి నుంచి వచ్చే పొగ, పీల్చాక ఊపిరితిత్తుల్లోంచి వచ్చే పొగ... ఈ రెండూ కలిసి రెట్టింపు నష్టాలను కుటుంబ సభ్యులకూ కలగజేస్తాయి. సిగరెట్ పొగ వల్ల మహిళల్లో ఓవరీస్ దెబ్బతింటాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పాదనపై సిగరెట్ పొగ దుష్ర్పభావం చూపడం వల్ల అండం ఉత్పాదన తగ్గిపోతోంది. ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్ కూడా దెబ్బతింటుంది. మహిలల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అంతేకాదు. ఒకవేళ కృత్రిమంగా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి చేద్దామనుకున్నా దానికి అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. పైగా అబార్షన్లు పెరగడం, ఒకవేళ పిండం ఎదిగినా చివర్లో మృతశిశువులు జన్మించడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. డాక్టర్ సిహెచ్. మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ -
డిజిటల్ 3డి మామోగ్రఫీతో రొమ్ముక్యాన్సర్‌ను ముందే గుర్తించండి!
రొమ్ముక్యాన్సర్ అంటే గతంలో ఒక ఆందోళన. బిడ్డకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని సమకూరుస్తూ, స్త్రీత్వానికి ప్రతీకగా నిలుస్తూ పరిపూర్ణనిచ్చే రొమ్ముకు అనారోగ్యం వస్తే గుండెకే గాయం అయినట్లవుతుంది. ఆ గాయాలు గడ్డల రూపంలో, కణుతుల రూపంలో ఉంటాయి. వాటిని తొలిదశలోనే గుర్తిస్తే ... అవి ఒకవేళ రొమ్ము క్యాన్సర్ రూపాన్ని సంతరించుకున్నా సరే పూర్తిగా తగ్గిపోతాయి. ఇక ఇలా రొమ్ముక్యాన్సర్నుంచి ప్రాణాపాయం తప్పడం అనే ప్రధాన వరం దక్కాక, మరో చిన్న అనుగ్రహమూ చిక్కితే బాగుంటుందనే ఆశ. అదే రొమ్మును తొలగించకుండా దాన్ని యథాతథంగా ఉంచడమనే కోరిక. ఇలా ఆరోగ్యమూ అందమూ... ఈ రెండూ దక్కాలనే ఆకాంక్ష. ఆ ఆశా, ఆకాంక్షా నెరవేరే రోజులు వచ్చేశాయి. ఇప్పుడు క్యాన్సర్‌కు శస్త్రచికిత్స, అందాన్ని పరిరక్షించే మేలుచికిత్సా ఒకేసారి దక్కే అవకాశాలు విచ్చేశాయి. దీన్నే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. దీనికి మనం చేయాల్సిందేమిటి? ముందుగా తెలుసుకొని, సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే రొమ్ముక్యాన్సర్‌పై, రొమ్ములోని గడ్డలపై తిరుగులేని పోరాటం చేయడమే. రొమ్ములో గడ్డలనే ఆ శత్రువులను తెలుసుకోడానికి ఇప్పుడు మరింత మెరుగైన ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. అవే... డిజిటల్ మామోగ్రాఫీ. మామోగ్రఫీ మునుపు కూడా ఉన్న పరిజ్ఞానమే. దీనికి మరింత ఆధునిక సాంకేతికత తోడై... బ్రెస్ట్ టోమోసింథసిస్ / 3డి మామోగ్రాఫీ అనే అత్యంతాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒమెగా హాస్పిటల్స్‌లో నెలకొల్పిన ఈ అత్యాధునిక ఉపకరణంతో సంప్రదాయ పద్ధతుల్లో కంటే మరింత ముందుగానే గడ్డను చూడవచ్చు. దాని పరిణామాన్ని ముందుకంటే ప్రభావపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఫలితంగా రొమ్ములో కేవలం క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాన్ని తొలగించడానికి వీలవుతుంది. పక్కనున్న కణజాలం క్యాన్సర్ గడ్డతో కలగలసి పోయి, రెండింటినీ స్పష్టంగా, నిర్దిష్టంగా గుర్తించలేని పరిస్థితి పూర్తిగా తొలగిపోయి, కాన్సర్ గడ్డ, కణితి ఉన్న భాగం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో చికిత్స మరింత సులువుగా, సమర్థంగా, ప్రభావపూర్వకంగా అవుతుంది. దాంతో గతంలోలా వ్యాధి తిరగబెట్టడానికి ఉండే అవకాశాలు 30 శాతం తగ్గుతాయంటేనే అర్థం చేసుకోవచ్చు... గతం కంటే ఇప్పుడు పరిస్థితి ఎంతగా మెరుగుపడిందో! డిజిటల్ మామోగ్రఫీ గురించి తెలుసుకునే ముందు అసలు మామోగ్రఫీ ఎన్ని రకాలో చూద్దాం. మొదటిది ఇంతకు ముందూ అందుబాటులో ఉన్న సంప్రదాయ స్క్రీన్ మామోగ్రఫీ, రెండోది 2-డి మామోగ్రఫీ, మూడోది 3-డి మామోగ్రఫీ. డిజిటల్ మామోగ్రఫీ ఎంత మెరుగైనదంటే... గతంలో రొమ్ము పరీక్ష చేసే సంప్రదాయ మామోగ్రఫీతో పోలిస్తే డిజిటల్ మామోగ్రఫీతో ఏయే ప్రయోజనాలున్నాయో చూద్దాం. ఇప్పటివరకూ మనం తీస్తూ వచ్చిన సంప్రదాయ స్క్రీన్ మామోగ్రఫీలో గడ్డలు లేదా కణుతుల సైజు 9 మి.మీ. కంటే ఎక్కువగా ఉంటేనే అవి తెలుస్తాయి. పైగా స్క్రీన్ తీసే ప్రక్రియలో విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ. ఒకవేళ మొదటిసారి తీసింది అంత బాగా రాకపోతే మళ్లీ మళ్లీ తీయల్సి వచ్చేది. దీన్ని ఎంత సైజ్ కావాలో అంతగా పెంచి చూడటానికి వీలయ్యేది కాదు. నలభై లోపు వయసున్న మహిళల్లో ఉపయోగించడానికి సరికాదు. అంటే మెనోపాజ్ కంటే ముందుగా లేదా ఆ ప్రాంతంలో ఉన్న మహిళలపై దీన్ని ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు. అయితే ఇక డిజిటల్ మామోగ్రఫీ (2డి మామోగ్రఫీ) విషయానికి వస్తే పైన పేర్కొన్న పరిమితులన్నింటినీ అది అధిగమించగలదు. అయితే ఇందులో గడ్డ తాలూకు చిత్రం కేవలం పరిమాణం తెలుసుకోడానికే వీలవుతుంది తప్ప... దాని 3-డి ప్రతిబింబం కనిపించదు. పైగా ఏదో ఒక వైపు నుంచి చూస్తే కనిపించే దృశ్యమే తప్ప... అన్ని కోణాల్లోనూ గడ్డ/కణితి ఎలా కనిపిస్తుందో తెలిసే అవకాశం ఉండదు. అయితే 3-డి డిజిటల్ మామోగ్రఫీలో మాత్రం సాధారణ సంప్రదాయ స్క్రీన్ పద్ధతిలోనూ, 2-డిలోనూ ఉన్న అన్ని పరిమితులను అధిగమించి, గడ్డ లేదా కణితి తాలూకు స్పష్టమైన చిత్రాన్ని చూడటానికి వీలువుతుంది. అందుకే అన్ని వైద్య ఆరోగ్య విషయాల్లో సురక్షితత్వానికి ప్రాధాన్యం ఇచ్చే అమెరికా అత్యున్నత సంస్థ అయిన ఎఫ్‌డీఏ ‘3-డి డిజిటల్ మామోగ్రఫీ చిత్రం ద్వారా క్యాన్సర్ గడ్డ లేదా సాధారణ గడ్డను చూడటం అన్నది చాలా త్వరితంగా బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఒక స్పష్టమైన మార్గం’ అంటూ కితాబిస్తూ... సాంకేతిక రంగంలో ఇదో మైలురాయి, అద్భుతమైన పురోగతి అంటూ పేర్కొంది. 3డి డిజిటల్ మామోగ్రఫీతో ప్రయోజనాలివి... ఒక మందపాటి ఆకును అడ్డుగా కోశామనుకోండి. అప్పుడు దాని తొడిమ దగ్గర ఉన్న అడ్డుకోత చిత్రానికీ, మధ్య భాగం అడ్డుకోత చిత్రానికీ, అంచున ఉండే అడ్డుకోత చిత్రానికీ తేడా ఉంటుంది కదా. అదే తరహాలో రొమ్ము తాలూకు 3-డి చిత్రం కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రతిబింబిస్తుందనుకుందాం. అక్కడ గడ్డ మొదలైన చోట ఎలా ఉంది, మరో మూడు నాలుగు మిల్లీ మీటర్ల ఆవల ఎలా ఉంది, మరో ఆరేడు మిల్లీమీటర్ల అవతల ఎలా ఉంది అన్నది బయటి నుంచి చూస్తే తెలియదు. రొమ్మును అలా ప్రతి మిల్లీ మీటరుకు ఒకసారి కోసి చూడలేం. కానీ ఈ 3డి డిజిటల్ మామోగ్రఫీ (టోమోసింథసిస్) ప్రక్రియలో రొమ్ము లోపలి గడ్డను చూడదలచుకుంటే... రొమ్మును ఒక మూతలాగా తొలగించి, ఆ గడ్డను పై నుంచి ఎంత స్పష్టంగా చూడటానికి వీలవుతుందో ... అలాగే, ప్రతి మిల్లీమీటరు లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ గడ్డ స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి వీలైనన్ని సూక్ష్మ భాగాలుగా చూడటానికి వీలవుతుందన్నమాట. మనం ఈ గడ్డ ప్రతిబింబాన్ని 3డి లో చూస్తున్న సమయంలోనే ఒకవేళ మనకు 2డి చిత్రం కావాలనుకున్నా... అప్పటికప్పుడు అదే సమయంలో దాన్ని తీసుకోవచ్చు. సాధారణ మామోగ్రఫీలో కణితి లేదా గడ్డ తాలూకు చిత్రాన్ని చూడటానికి కాస్తంత వ్యవధి పడుతుంది. అదే 2-డి మామోగ్రఫీలోనైతే అదే ప్రతిబింబాన్ని కంప్యూటర్ స్క్రీన్‌పై చూపించాలంటే ప్రత్యేకంగా ఒక డిజిటల్ కెమెరా కావాలి. కానీ... 3డి డిజిటల్ మామోగ్రఫీలో మాత్రం ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా కంప్యూటర్ స్క్రీన్‌పై వచ్చిన చిత్రాన్ని తక్షణం చూడవచ్చు. డాక్టర్ సిహెచ్.మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్: 9848011421 -
ముందుగా గుర్తిస్తే మేలు... అప్పుడు పెద్దపేగు క్యాన్సర్‌కు చిన్నపాటి చికిత్సే చాలు...
పేరుకూ, విధులకూ... ఈ రెండిటి విషయంలోనూ పెద్దది... పెద్దపేగు. దీన్నే ఇంగ్లిష్‌లో కోలన్ అంటారు. ఈ అవయవానికి క్యాన్సర్ వస్తే దాన్ని ‘కోలన్ క్యాన్సర్’ అని పిలుస్తారు. మనం తిన్న ఆహారంలో అన్ని పోషకపదార్థాలను ఒంటికి పట్టేలే చేసేవి చిన్న పేగులైతే... శరీరానికి అవసరమైన నీటిని, పొటాషియం లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను ఒంటికి పట్టేలా చేసే బాధ్యత పెద్దపేగుదే. ఆ తర్వాత వ్యర్థాలను మల ద్వారం గుండా బయటికి పంపివేయడం కూడా దానిపనే. మలద్వారాన్ని రెక్టమ్ అంటారు. పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే దాన్ని కోలన్ క్యాన్సర్ అని, మలద్వారానికీ అది సోకితే రెక్టల్ క్యాన్సర్ అనీ అంటారు. ఇప్పుడు ముందుగానే గుర్తిస్తే కోలన్ క్యాన్సర్‌కు సమర్థంగా చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ సోకినప్పుడు పెద్దపేగుకు కండపెరిగినట్లుగా కొన్ని బొడిపెలు వస్తాయి. వాటినే పాలిప్స్ అని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి బొడిపెలూ లేకుండా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది వంశపారంపర్యంగా రాదు. కాకపోతే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఉంటే ఇది వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. అందుకే ఇలా వచ్చిన వారి పిల్లలకు 15 ఏళ్ల వయసు నుంచే తరచూ స్క్రీనింగ్ చేయడం అవసరం. ఎందుకంటే కోలన్ క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత బాగా నయమవుతుంది. లక్షణాలు / గుర్తించడం ఎలా... కోలన్ క్యాన్సర్ లక్షణాలు పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన ప్రదేశం, దాని పరిమాణం, ఏయే భాగాలకు అది వ్యాపించింది వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణ లక్షణాలు: మలద్వారం నుంచి రక్తస్రావం మలం, మలవిసర్జనలో మార్పులు అజీర్తి లేదా విరేచనాలు పొట్ట కింది భాగంలో నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ పోవడం జిగురుతో మలం రావడం అకారణంగా నీరసం, బరువు తగ్గడం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)... అయితే ఇక్కడ పేర్కొన్న లక్షణాల్లో అజీర్తి, మలబద్ధకం, నీళ్ల విరేచనాల వంటివి మనలోని చాలామందిలో కనిపించేవే. ముఖ్యంగా మల విసర్జనలో రక్తస్రావం అన్నది పైల్స్ (మూలశంక) వ్యాధి ఉన్నవారిలో చాలా సాధారణం. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, తగిన పరీక్షలు చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు. ఒకవేళ క్యాన్సర్ అని తేలితే, ముందుగానే గుర్తిస్తారు కాబట్టి నయమయ్యే అవకాశాలు ఎక్కువే. అయితే ఆలస్యం చేసిన కొద్దీ క్యాన్సర్ ఒకచోటి నుంచి మరోచోటికి (అంటే కాలేయం వంటి కీలక భాగాలకు లేదా లింఫ్ గ్రంథులకు) పాకుతుంది. దీన్నే మెటస్టాసిస్ అంటారు. ఇలా క్యాన్సర్ గనక కాలేయానికి లేదా లింఫ్ గ్రంథులకు చేరితే అది చాలా ప్రమాదం. కాబట్టి లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవడం ఎంతో మేలు. రిస్క్ ఫ్యాక్టర్లు : పెరిగే వయసు స్థూలకాయం డయాబెటిస్, ఫాస్ట్‌ఫుడ్, రెడ్‌మీట్ ఎక్కువగా తీసుకోవడం పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం పొగతాగడం మద్యపానం తల్లిదండ్రుల్లో ఎవరికైనా అంతకుమునుపే కోలన్ క్యాన్సర్ వచ్చి ఉండటం...ఇవీ సాధారణ రిస్క్ ఫ్యాక్టర్లు. సాధారణంగా కోలన్ క్యాన్సర్ 50 ఏళ్లు పైబడ్డాకే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పైన పేర్కొన్న రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు చిన్న వయసులోనైనా రావచ్చు. నిర్ధారణ ఇలా... పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పడు వెంటనే తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాలి. అప్పుడు డాక్టర్లు రోగిని భౌతికంగా పరీక్షించడంతోపాటు ఫ్యామిలీ, మెడికల్ హిస్టరీని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొలనోస్కోపీ, బేరియమ్ అనీమా, ఎక్స్-రే వంటి పరీక్షలు చేస్తారు. కొలనోస్కోపీ అంటే సన్నటి గొట్టాన్ని మలద్వారంనుంచి లోపలికి ప్రవేశపెట్టి లోపల ఏవైనా కణుతులు ఉన్నాయేమో చూడటం. ఒకవేళ కణుతులు కనిపిస్తే వాటినుంచి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపుతారు. అక్కడ అవి క్యాన్సర్ కణాలా కాదా అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. బేరియమ్ మింగించి ఎక్స్‌రే తీస్తే క్యాన్సర్ ఉన్న ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. ఇక స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనే చిన్న పరీక్ష ద్వారా కూడా దీన్ని సులువుగా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ రెక్టమ్ (మలద్వారం)లోనే సమస్య ఉంటే దాన్ని వేలి ద్వారానే డాక్టర్లు చాలా సులువుగా గుర్తించగలరు. ఒకవేళ క్యాన్సర్ సోకినట్లు తెలిస్తే అప్పుడది ఏ మేరకు విస్తరించి ఉందో చూడటానికి పెట్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి. చికిత్స : పెద్దపేగు క్యాన్సర్‌కు చికిత్స అన్నది వ్యాధి దశను బట్టి ఉంటుంది. వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ అనే ప్రక్రియతో క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగిస్తారు. ఈ తరహా శస్త్రచికిత్సను ఇప్పుడు కీ-హోల్ (ల్యాపరోస్కోపిక్) ప్రక్రియ ద్వారా కూడా నిర్వహించవచ్చు. ఇలా చేసిన శస్త్రచికిత్సలో పూర్తిగా కోత అవసరం లేకుండా చిన్న గాటు మాత్రమే ఉంటుంది కాబట్టి రోగి వేగంగా కోలుకుంటాడు. ఒకవేళ కోలన్ క్యాన్సర్ అన్నది లింఫ్ గ్రంథులకూ పాకితే వాటినీ తొలగించాల్సి వస్తుంది. క్యాన్సర్ గనక మలద్వారాన్ని గట్టిగా బిగుసుకుపోయేలా ఉంచి, మలాన్ని బయటకు రాకుండా చేసే స్ఫింక్టర్కూ వ్యాప్తిస్తే దాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది. అప్పుడు మలవిసర్జనకు వీలుగా పేగును బయటకు అమర్చాల్సిన శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. ఇక క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా ఈ రెండూ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్‌ను చివరిదశలో గుర్తిస్తే, కీమోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే మందుల ద్వారా రోగి జీవితకాలాన్ని గణనీయంగా పెంచవచ్చు. నివారణ: దీని నివారణకు చేయాల్సిన పనులు చాలా సులభం. ఆరోగ్యకరమైన విసర్జక అలవాట్లు అంటే... రోజూ క్రమబద్ధంగా మల విసర్జనకు వెళ్లడం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటివి లేకుండా చూసుకోవడం మంచిది. వేళకు సాఫీగా మలవిసర్జన జరగాలంటే శరీరానికి తగినంత వ్యాయామం, కదలికలు ఉండాలి. అందుకే తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి. ఇది కేవలం కోలన్ క్యాన్సర్‌కు మాత్రమే కాదు... అన్ని రకాల క్యాన్సర్లకూ నివారణ. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముందుగా కనుగొంటే చికిత్స ద్వారా చాలా వరకు నయమవుతుంది. ఒకవేళ ఆలస్యంగా కనుగొన్నా జీవితకాలాన్ని చాలావరకు పొడిగించడం సాధ్యమవుతుంది. ఆహారం - ప్రాధాన్యం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కోలన్ క్యాన్సర్‌ను నివారించడం సులువే. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అంటే... కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తాజా ఆకుకూరలను, పండ్లను ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాన్ని పరిమితంగా తినడం అందులోనూ కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలను మాత్రమే తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలోనూ పీచు ఎక్కువగా ఉండే కాయధాన్యాల వంటివాటికి ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. డాక్టర్ సిహెచ్.మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్: 98480 11421