ముందుగా గుర్తిస్తే మేలు... అప్పుడు పెద్దపేగు క్యాన్సర్‌కు చిన్నపాటి చికిత్సే చాలు... | we may avoid colan cancer with Habits of Healthy Eating | Sakshi
Sakshi News home page

ముందుగా గుర్తిస్తే మేలు... అప్పుడు పెద్దపేగు క్యాన్సర్‌కు చిన్నపాటి చికిత్సే చాలు...

Published Sun, Oct 27 2013 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

ముందుగా గుర్తిస్తే మేలు... అప్పుడు పెద్దపేగు క్యాన్సర్‌కు చిన్నపాటి చికిత్సే చాలు...

ముందుగా గుర్తిస్తే మేలు... అప్పుడు పెద్దపేగు క్యాన్సర్‌కు చిన్నపాటి చికిత్సే చాలు...

పేరుకూ, విధులకూ... ఈ రెండిటి విషయంలోనూ పెద్దది... పెద్దపేగు. దీన్నే ఇంగ్లిష్‌లో కోలన్ అంటారు. ఈ అవయవానికి క్యాన్సర్ వస్తే దాన్ని ‘కోలన్ క్యాన్సర్’ అని పిలుస్తారు. మనం తిన్న ఆహారంలో అన్ని పోషకపదార్థాలను ఒంటికి పట్టేలే చేసేవి చిన్న పేగులైతే... శరీరానికి అవసరమైన నీటిని, పొటాషియం లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను ఒంటికి పట్టేలా చేసే బాధ్యత పెద్దపేగుదే. ఆ తర్వాత వ్యర్థాలను మల ద్వారం గుండా బయటికి పంపివేయడం కూడా దానిపనే. మలద్వారాన్ని రెక్టమ్ అంటారు. పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే దాన్ని కోలన్ క్యాన్సర్ అని, మలద్వారానికీ అది సోకితే రెక్టల్ క్యాన్సర్ అనీ అంటారు. ఇప్పుడు ముందుగానే గుర్తిస్తే కోలన్ క్యాన్సర్‌కు సమర్థంగా చికిత్స చేయవచ్చు.
 
 క్యాన్సర్ సోకినప్పుడు పెద్దపేగుకు కండపెరిగినట్లుగా కొన్ని బొడిపెలు వస్తాయి. వాటినే పాలిప్స్ అని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి బొడిపెలూ లేకుండా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది వంశపారంపర్యంగా రాదు. కాకపోతే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఉంటే ఇది వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. అందుకే ఇలా వచ్చిన వారి పిల్లలకు 15 ఏళ్ల వయసు నుంచే తరచూ స్క్రీనింగ్ చేయడం అవసరం. ఎందుకంటే కోలన్ క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత బాగా నయమవుతుంది.
 
 లక్షణాలు / గుర్తించడం ఎలా...
 కోలన్ క్యాన్సర్ లక్షణాలు పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన ప్రదేశం, దాని పరిమాణం, ఏయే భాగాలకు అది వ్యాపించింది వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
 
 సాధారణ లక్షణాలు:

 మలద్వారం నుంచి రక్తస్రావం  
 మలం, మలవిసర్జనలో మార్పులు  
 అజీర్తి లేదా విరేచనాలు  
 పొట్ట కింది భాగంలో నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ పోవడం  
 జిగురుతో మలం రావడం
 అకారణంగా నీరసం, బరువు తగ్గడం  
 ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)... అయితే ఇక్కడ పేర్కొన్న లక్షణాల్లో అజీర్తి, మలబద్ధకం, నీళ్ల విరేచనాల వంటివి మనలోని చాలామందిలో కనిపించేవే. ముఖ్యంగా మల విసర్జనలో రక్తస్రావం అన్నది పైల్స్ (మూలశంక) వ్యాధి ఉన్నవారిలో చాలా సాధారణం. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, తగిన పరీక్షలు చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు. ఒకవేళ క్యాన్సర్ అని తేలితే, ముందుగానే గుర్తిస్తారు కాబట్టి నయమయ్యే అవకాశాలు ఎక్కువే. అయితే ఆలస్యం చేసిన కొద్దీ క్యాన్సర్ ఒకచోటి నుంచి మరోచోటికి (అంటే కాలేయం వంటి కీలక భాగాలకు లేదా లింఫ్ గ్రంథులకు) పాకుతుంది. దీన్నే మెటస్టాసిస్ అంటారు. ఇలా క్యాన్సర్ గనక కాలేయానికి లేదా లింఫ్ గ్రంథులకు చేరితే అది చాలా ప్రమాదం. కాబట్టి లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవడం ఎంతో మేలు.
 
 రిస్క్ ఫ్యాక్టర్లు :
 పెరిగే వయసు
 స్థూలకాయం  
 డయాబెటిస్,  
 ఫాస్ట్‌ఫుడ్, రెడ్‌మీట్ ఎక్కువగా తీసుకోవడం  
 పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం  
 పొగతాగడం  
 మద్యపానం తల్లిదండ్రుల్లో ఎవరికైనా అంతకుమునుపే కోలన్ క్యాన్సర్ వచ్చి ఉండటం...ఇవీ సాధారణ రిస్క్ ఫ్యాక్టర్లు. సాధారణంగా కోలన్ క్యాన్సర్ 50 ఏళ్లు పైబడ్డాకే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పైన పేర్కొన్న రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు చిన్న వయసులోనైనా రావచ్చు.
 
 నిర్ధారణ ఇలా...
 పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పడు వెంటనే తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాలి. అప్పుడు డాక్టర్లు రోగిని భౌతికంగా పరీక్షించడంతోపాటు ఫ్యామిలీ, మెడికల్ హిస్టరీని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొలనోస్కోపీ, బేరియమ్ అనీమా, ఎక్స్-రే వంటి పరీక్షలు చేస్తారు. కొలనోస్కోపీ అంటే సన్నటి గొట్టాన్ని మలద్వారంనుంచి లోపలికి ప్రవేశపెట్టి లోపల ఏవైనా కణుతులు ఉన్నాయేమో చూడటం. ఒకవేళ కణుతులు కనిపిస్తే వాటినుంచి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపుతారు. అక్కడ అవి క్యాన్సర్ కణాలా కాదా అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. బేరియమ్ మింగించి ఎక్స్‌రే తీస్తే క్యాన్సర్ ఉన్న ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. ఇక స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనే చిన్న పరీక్ష ద్వారా కూడా దీన్ని సులువుగా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ రెక్టమ్ (మలద్వారం)లోనే సమస్య ఉంటే దాన్ని వేలి ద్వారానే డాక్టర్లు చాలా సులువుగా గుర్తించగలరు. ఒకవేళ క్యాన్సర్ సోకినట్లు తెలిస్తే అప్పుడది ఏ మేరకు విస్తరించి ఉందో చూడటానికి పెట్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి.
 
 చికిత్స : పెద్దపేగు క్యాన్సర్‌కు చికిత్స అన్నది వ్యాధి దశను బట్టి ఉంటుంది. వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ అనే ప్రక్రియతో క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగిస్తారు. ఈ తరహా శస్త్రచికిత్సను ఇప్పుడు కీ-హోల్ (ల్యాపరోస్కోపిక్) ప్రక్రియ ద్వారా కూడా నిర్వహించవచ్చు. ఇలా చేసిన శస్త్రచికిత్సలో పూర్తిగా కోత అవసరం లేకుండా చిన్న గాటు మాత్రమే ఉంటుంది కాబట్టి రోగి వేగంగా కోలుకుంటాడు. ఒకవేళ కోలన్ క్యాన్సర్ అన్నది లింఫ్ గ్రంథులకూ పాకితే వాటినీ తొలగించాల్సి వస్తుంది. క్యాన్సర్ గనక మలద్వారాన్ని గట్టిగా బిగుసుకుపోయేలా ఉంచి, మలాన్ని బయటకు రాకుండా చేసే స్ఫింక్టర్‌కూ వ్యాప్తిస్తే దాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది. అప్పుడు మలవిసర్జనకు వీలుగా పేగును బయటకు అమర్చాల్సిన శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. ఇక క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా ఈ రెండూ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్‌ను చివరిదశలో గుర్తిస్తే, కీమోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే మందుల ద్వారా రోగి జీవితకాలాన్ని గణనీయంగా పెంచవచ్చు.
 
 నివారణ: దీని నివారణకు చేయాల్సిన పనులు చాలా సులభం. ఆరోగ్యకరమైన విసర్జక అలవాట్లు అంటే... రోజూ క్రమబద్ధంగా మల విసర్జనకు వెళ్లడం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటివి లేకుండా చూసుకోవడం మంచిది. వేళకు సాఫీగా మలవిసర్జన జరగాలంటే శరీరానికి తగినంత వ్యాయామం, కదలికలు ఉండాలి. అందుకే తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి. ఇది కేవలం కోలన్ క్యాన్సర్‌కు మాత్రమే కాదు... అన్ని రకాల క్యాన్సర్లకూ నివారణ.
 
 ఇప్పుడు కోలన్ క్యాన్సర్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముందుగా కనుగొంటే  చికిత్స ద్వారా చాలా వరకు నయమవుతుంది. ఒకవేళ ఆలస్యంగా కనుగొన్నా జీవితకాలాన్ని చాలావరకు పొడిగించడం సాధ్యమవుతుంది.
 
 ఆహారం - ప్రాధాన్యం
 ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కోలన్ క్యాన్సర్‌ను నివారించడం సులువే.
 ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అంటే...  కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తాజా ఆకుకూరలను, పండ్లను ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాన్ని పరిమితంగా తినడం అందులోనూ కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలను మాత్రమే తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలోనూ పీచు ఎక్కువగా ఉండే కాయధాన్యాల వంటివాటికి ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 డాక్టర్ సిహెచ్.మోహనవంశీ

 చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
 ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
 ఫోన్: 98480 11421

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement