X - Ray
-
ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా..
లండన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం థర్డ్‌వేవ్ విజృంభణకు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు కొత్తగా పుట్టుకొస్తున్న భిన్నరకాల వేరియంట్లు మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. అయితే, శాస్త్రవేత్తలు కరోనాను ఎదుర్కొవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వివిధ రకాల వ్యాక్సిన్లపై ఇప్పటికి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచదేశాలు ప్రధానంగా.. కరోనాను గుర్తించడానికి ర్యాపిడ్ ఆంటిజెన్, ఆర్టీపీసీఆర్లను పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటితో చాలా వరకు వ్యక్తిలో వైరస్ ఉన్నది.. లేనిది నిర్ధారణ అవుతుంది. కొన్నిసార్లు టెస్ట్‌ల సంఖ్య పెరగడంతో ఆర్టీపీసీఆర్ ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. దీంతో ఆయా వ్యక్తులు ఫలితం వచ్చేవరకు ఒకింత ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు ఒక తీపి కబురు అందించారు. ఇక నుంచి కరోనాను కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిర్ధారించవచ్చని తెలిపారు. దీనితో.. ఒక వ్యక్తి పాజిటివ్‌గా ఉన్నాడా లేదా అన్నదానిని ఎక్స్‌రే టెక్నిక్‌ను ఉపయోగించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే సులభంగా గుర్తించవచ్చు. ఇది ఆర్టీపీసీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూకే శాస్త్రవేత్తల ప్రకారం.. కొత్త ఎక్స్‌రే విధానంలో ఖచ్చితంగా, తక్కువ సమయంలో కరోనాను నిర్ధారించవచ్చని తెలిపారు. దీనితో వేచి ఉండే సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. దీని కోసం శాస్త్రవేత్తల బృందం కృత్రిమ మేధస్సును ఉపయోగించినట్లు తెలిపారు. దీనికోసం కరోనాతో బాధపడుతున్న వారు, నిమోనియాలో బాధపడుతున్నవారు, ఆరోగ్యవంతుల్లోని ఎక్స్‌రే స్కాన్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. దాదాపు 3000 ఎక్స్‌రేలను చూశామని, వీటిలో కరోనా నిర్ధారణ 98 శాతం ఖచ్చితత్వంతో నిర్ధారించిందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ స్కాట్లాండ్ (యూడబ్ల్యూఎస్)లో ఒక బృందం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనితో ఇక నుంచి టెస్ట్‌ల సంఖ్య పెంచుకోవచ్చు. ప్రపంచంలో చాలా చోట్ల వైరస్ విజృంభణతో కరోనా కిట్ల కొరత నెలకొంది. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ నయీమ్ రంజాన్ మాట్లాడుతూ.. ఇది కరోనాను వెంటనే నిర్ధారిస్తుందని తెలిపారు.ఇది ఆర్టీపీసీఆర్కు ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతుందని తెలిపారు. ప్రపంచంలో కేసులు పెరగడం, రోగ నిర్ధారణ సాధనాల తక్కువడా ఉండటం వలన పెద్ద సంఖ్యలో కొవిడ్ పరీక్షలు నిర్వహించలేకపోతున్నాయని పేర్కొన్నారు. అయితే, కొత్త ఎక్స్ రే విధానంతో సులభంగా కరోనాను గుర్తించవచ్చని తెలిపారు. అయితే, ఎక్స్‌రే రేటియేషన్తో మానవునిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఈ కిరణాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. వైద్యులు కొవిడ్ పరీక్షల కోసం తక్కువ మోతాదులో రేటియేషన్ ఉపయోగిస్తారని తెలిపారు. అయితే, ఈ కొత్త సాంకేతికను ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారనేది భవిష్యత్తులో తెలుస్తుందని ప్రొఫెసర్ రంజన్ అభిప్రాయపడ్డారు. చదవండి: ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. బైడెన్ కంటే -
కేంద్రాస్పత్రిలో డిజిటల్ ఎక్సరే ఫిల్మ్‌ల కొరత..!
జిల్లాకే తలమానికమైన కేంద్రాస్పత్రికి రోగులు ఎక్స్‌రే కోసం వెళ్తే ముప్పతిప్పలు పడాల్సిందే...ఎక్స్‌రే తీసుకున్న మరుసటి రోజు దాని కోసం మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో రోగులు ఎక్స్‌రే కోసం డబ్బులు మిగిలాయనుకుంటే తిరగడానికి చేతి చమురు వదులుతోందని ఆవేదన చెందుతున్నారు. – వేపాడ మండలానికి చెందిన సోములమ్మ కడుపు నొప్పితో ఈ నెల 9న కేంద్రాస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే తీయించమని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని డిజిటల్ ఎక్స్‌రే విభాగానికి వెళ్లగా అక్కడ వారు ఎక్స్‌రే తీసారు. ఫిల్మ్ అడిగితే ఫిల్మ్‌లు లేవు. రిపోర్టు మరోసటి రోజు ఇస్తామని చెప్పారు. దీంతో గత్యంతరం లేక వేపాడ వెళ్లిపోయారు. – గంట్యాడ మండలానికి చెందిన సిహెచ్.ముత్యాలునాయుడు ట్రాక్టర్‌పై నుంచి పడిపోవడంతో కొద్ది రోజుల కిందట కేంద్రాస్పత్రిలో చూపించుకున్నాడు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీసుకోమని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని వెళ్లగా అక్కడ సిబ్బంది ఎక్స్‌రే తీశారు. ఫిల్మ్ అడిగితే ఫిల్మ్‌లు లేవని చెప్పారు. రిపోర్టు కోసం మరుసటి రోజు రమ్మని చెప్పారు. విజయనగరం ఫోర్ట్: ఇది ఈ ఇద్దరి రోగుల పరిస్థితే కాదు. అనేక మంది రోగులు కేంద్రాస్పత్రిలో ఎదుర్కొంటున్న దుస్థితి. ఆస్పత్రిలో డిజిటల్ ఎక్స్‌రేలు తీస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారు. వాటి ఫిల్మ్‌లు ఇవ్వకపోవడం వల్ల రోగులు రోజుల తరబడి రిపోర్టు కోసం తిరగాల్సిన పరిస్థితి. గత 15 రోజులుగా కేంద్రాస్పత్రిలో ఇదే పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజులో 40 నుంచి 50 మంది వరకు... జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వాస్పత్రి కావడంతో అధిక సంఖ్యలో కేంద్రాస్పత్రికి వస్తారు. రోజుకు సగటున 40 నుంచి 50 మంది వరకు డిజిటల్ ఎక్సరేలు కోసం వస్తారు. కొద్ది రోజులు కిందట వరకు డిజిటల్ ఎక్స్‌రే ఫిల్మ్‌లు రోగులకు ఇచ్చేవారు. దీంతో అవి పట్టుకుని వైద్యులకు చూపించేవారు. వచ్చిన రోజే రోగులకు ఊరట లభించేది. ఫిల్మ్‌లు అయిపోవడంతో అధికారులు తెప్పించకుండా నాన్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్‌లు ఇవ్వకపోవడం వల్ల రోగులు రిపోర్టు కోసం మరుసటి రావాల్సిన దుస్థితి. ఫిల్మ్‌లు ఇవ్వడం వల్ల ప్రభుత్వం టెలీ రేడియాలజికి చెల్లిస్తున్న డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అవస్థలు పడుతున్న రోగులు ఒక రోజు ఎక్స్‌రే తీసుకుంటే దాని రిపోర్టు కోసం మరుసటి రోజు రావాల్సిన దుస్థితి. దీని వల్ల రోగులకు ప్రయాణ చార్జీలు, భోజన వసతి కోసం చేతిచమురు వదలించుకోవాల్సిన దుస్థితి. అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలాలు నుంచి రోగులు వస్తారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్ల అవస్థలు పడుతున్నారు. డిజిటల్ ఫిల్మ్‌లు వచ్చాయి... ఎక్స్‌రే విభాగానికి ఎందుకు ఇవ్వడం లేదో కనుగొంటాం. ఫిల్మ్‌లు రోగులు చేతికి ఇవ్వకూడదు. వార్డు బాయ్‌లు పట్టుకుని వెళ్లి వైద్యునికి చూపించాలి. రోగులకు ఇవ్వకూడదని ఆదేశాలు వచ్చాయి. –కె. సీతారామరాజు, కేంద్రాస్పత్రి, సూపరింటెండెంట్ -
రేడియేషన్ పొల్యూషన్ ఈ కాలుష్యాన్నీ నివారించుకుందాం రండి..!
మనం ‘రేడియేషన్’ అనే మాటను కనీసం అదేమిటో తెలియకుండానే మనం తరచు ఉపయోగిస్తుంటాం. అసలు రేడియేషన్ అంటే ఏమిటి? అది చెడ్డదా? మంచిదా? దాంతో ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా? క్యాన్సర్ లాంటి చికిత్సలకు రేడియేషన్ లాంటి ఉపయోగాలు ఉన్నాయనుకుందాం. అప్పుడది మంచిదే కావాలి కదా! కానీ దానికి ఎక్స్పోజ్ కావడాన్ని ఎందుకు కీడుగా పరిగణిస్తాం. ఇటీవల ఆ రేడియేషన్ కాలుష్యం వాతావరణంలో పెరుగుతుండటంతో దాని గురించిన జాగ్రత్తలూ అవసరమవుతున్నాయి. వైద్యశాస్త్రంలో, వైద్య చికిత్సల్లో విరివిగా ప్రస్తావనకు వచ్చే రేడియేషన్ గురించిన అవగాహన కోసమే ఈ కథనం. రమేశ్‌కు క్యాన్సర్ గడ్డ తొలగించాక ఉన్న కొద్దిపాటి క్యాన్సర్ భాగాన్నీ కాల్చివేయడానికి రేడియేషన్ ఇచ్చారట. ఇక సురేశ్ విషయంలో ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. అదేమిటంటే... నిత్యం రేడియేషన్‌కు గురికావడం వల్ల సురేశ్‌కూ క్యాన్సర్ వచ్చిందట. అది బ్లడ్ క్యాన్సర్ట. అదేమిటి? ఒక జబ్బు ను తగ్గించిన రేడియేషన్, మరోచోట అదేలాంటి మరో జబ్బును కలిగించిందా? అసలీ రేడియేషన్ అంటే ఏమిటనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? వాటికి సమాధానాలు చూద్దాం. రేడియేషన్ అంటే ఏమిటి? మనం రోజూ ఎండ రూపంలో కాంతిని చూస్తాం కదా! ఈ కాంతి సూర్యుడి నుంచి తరంగాల రూపంలో వస్తుంది. ఈ తరంగాలలో మన కళ్లకు కనపడే కాంతికిరణాలేగాక... కంటికి కనపడని కిరణతరంగాలూ ఉంటాయి. కాంతితో వచ్చే ఈ తరంగాలన్నీ వేర్వేరుగా ఉంటాయి. మన కంటికి కనపడే కాంతిని విజిబుల్ లైట్ అంటారు. ఇదిగాక... దీనికి ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలు, అల్ట్రావయొలెట్ కిరణాలు ఇలా చాలా రకాలుంటాయి. అయితే ఆకాశం నుంచి వచ్చే ఈ కిరణాలను ఒక పోలిక కోసం కాసేపు ఓ చెట్టు మొదలు సైజ్‌లో ఉంటాయనుకుందాం. అందులో మనకు కనిపించే ‘కాంతి’ కేవలం మధ్యలోని ఓ పూచిక పుల్లంత మాత్రమే. మిగతాభాగంలో ఆయా తరంగదైర్ఘ్యాల (వేవ్లెంగ్త్ల)ను బట్టి ఒక వైపున ఇన్ఫ్రారెడ్ కిరణాలు, మైక్రోవేవ్ తరంగాలు, రేడియోతరంగాలు ఉంటాయి. మరోవైపున ఆల్ఫా, బీటా, గామా తరంగాలు ఉంటాయి. కాంతితో సహా ఈ కిరణాల సముదాయాన్నంతటినీ కలిపి ‘రేడియేషన్’ అంటారు. రేడియేషన్‌ను రోజూ చూస్తామా? కాంతిని తప్ప మరిదేన్నీ కంటితో చూడలేం. కానీ రేడియేషన్‌లోని తరంగాలన్నింటినీ రోజూ మనం వాడుకుంటాం. ఉదాహరణకు... కాంతి కంటే తక్కువ వేవ్లెంత్ ఉన్న రేడియో తరంగాల సహాయంతోనే మనం రేడియో వింటాం. వాటికంటే కాస్త పవర్‌ఫుల్‌గా ఉండే మైక్రోవేవ్ తరంగాలు విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. కాబట్టి వాటి సహాయంతో వంట వండుకుంటాం. మనం మొబైల్ వాడేటప్పుడు ఒకరితో మరొకరికి అనుసంధానం ఈ తరంగాల వల్లనే కలుగుతుంది. ఈ కిరణాల్లో ఒక రకమైన రాడార్ తరంగాల సహాయంతో వాతావరణాన్ని తెలుసుకోవడం, సముద్రంలోని ఓడలు దారి తప్పకుండా చూడటం, సమాచారాలను పంచుకోవడం చేస్తుంటాం. అంతెందుకు పెద్ద పెద్ద భవంతుల్లోకి వెళ్లినప్పుడు తలపై స్మోక్ డిటెక్టర్స్ అని ఉంటాయి. భవనంలో ఎక్కడైనా పొగను పసిగట్టి మనల్ని హెచ్చరించేలా చేసుకోడానికి ఈ తరంగాలనే ఉపయోగించుకుంటున్నాం. ఇలా ఈ రేడియేషన్ తరంగాల తో మనం అనేకరకాల సేవలు చేయించుకుంటున్నాం. కాంతికి ఈ వైపు ఉన్న ఈ తరహా కిరణాలు ఏదైనా వస్తువుపై పడితే వాటికి ఎలాంటి విద్యుదావేశమూ కలిగించవు కాబట్టి వాటిని ‘నాన్ ఐయొనైజింగ్ రేడియేషన్’ అంటారు. ఇక ఇప్పుడు ఐయొనైజింగ్ రేడియేషన్ కిరణాల దగ్గరకు వద్దాం. ఇవి కాంతికిరణాలకు మరోవైపున ఉంటాయి. వాటి శక్తి కాస్త ఎక్కువ. వాటిలో ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ తరంగాలు అని రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఆల్ఫా పార్టికల్స్ ఉంటాయి గాని ఇవి మనిషి చర్మంలోకి చొచ్చుకుపోయేంత శక్తి కలిగి ఉండవు. కాకపోతే ఎక్కడైనా గాయం ఉంటే దాన్లోంచి మనిషి శరీరంలోకి వెళ్లగలవు. అయితే కాగితంలోంచి అతి కష్టం మీద అట్నుంచి ఇటు వెళ్లగలిగే ఇవి... దుస్తుల్లోంచి మాత్రం వెళ్లలేవు. ఇక బీటా పార్టికిల్స్ వాటి కంటే మరికాస్త ఎక్కువ శక్తి ఉంటుంది. అవి శరీరంలోకి ఒకింత దూరం ప్రవేశించగలవు. కానీ దుస్తుల్లోంచి దూరలేవు. అందుకే దుస్తులు వేసుకోవడం వల్ల అటు ఆల్ఫా, బీటా తరంగాల నుంచి రక్షణ కలుగుతుంది. మన చర్మంలో ‘జెర్మినేషన్ లేయర్’ అనే పొర ఉంటుంది. మన చర్మం ఎప్పుడూ మనకు రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఈ క్రమంలో శిథిలమైన చర్మకణాల స్థానంలో కొత్తకణాలు వచ్చి చేరుతుంటాయి. ఆ కొత్త కణాలు ఎప్పుడూ పుడుతుండే పొరే... ఈ జర్మినేషన్ లేయర్. ఒకవేళ ఏ కారణంగానైనా బీటా తరంగాలు ఈ పొర వరకు చేరితే కొత్త కణాలు పుట్టే ప్రక్రియకు హాని చేకూరుతుంది. ఆల్ఫా, బీటా తరంగాలతో పోలిస్తే గామా తరంగాలు మరింత శక్తిమంతమైనవి. అవి మానవ దేహాల్లోకి చొచ్చుకుపోగలవు. గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు... ఈ రెండూ దాదాపుగా ఒకేలా ఉంటాయి. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోతాయి. కాబట్టే ఈ ఎక్స్-రే ల సహాయం తో విరిగిన ఎముకలు, విరిగిన పంటి భాగాలను, ఇతరత్రా కణజాలాలను చూసి తగిన చికిత్స చేయడానికి సాధ్యమవుతుంది. ఇలా ఎక్స్-రే రూపంలో రేడియేషన్ కూడా మానవుల వైద్యశాస్త్రంలో, వైద్య చికిత్సల్లో కీలక భూమిక పోషిస్తోంది. అలాగే గామా రేస్ కూడా వైద్యవిజ్ఞానంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కోబాల్ట్-60 అనే మూలకం నుంచి ఇవి ఉత్పత్తి అయ్యేలా చూస్తున్నారు. ఈ గామా కిరణాలను ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలోనూ, వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేయడంలోనూ ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ఉపయోగకరమైన రేడియేషన్ గురించి ఆందోళన ఎందుకు? మనకు వైద్యశాస్త్రంలో ఇంతగా ఉపయోగపడే రేడియేషన్ కిరణాల గురించి ఆందోళన ఎందుకు? ఎందుకంటే... ఇవి మనిషి కణజాలాల్లోని కణంపైన ప్రభావం చూపినప్పుడు అందులోని జన్యుస్వరూపాన్ని మార్చగలవు కాబట్టి. జన్యుస్వరూపం అంతా జెనిటిక్ కోడ్ రూపంలో కణంలో నిక్షిప్తమై ఉంటుంది. మన అన్ని జీవక్రియలకు ఇదే ప్రాతిపదిక. ఒకవేళ జన్యుస్వరూపంలో మార్పు వస్తే ఆ మేరకు అది జీవక్రియల్లోనూ ప్రతిఫలిస్తుంది. దాంతో జీవక్రియలు అస్తవ్యస్తమైపోతాయి. ఇలా అస్తవ్యస్తన జీవక్రియలు దీర్ఘకాలంలో మృత్యువుకు సైతం దారితీయవచ్చు. అందుకే ఇలా దీర్ఘకాలంలో రేడియేషన్‌కు గురవుతూంటే క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కాబట్టి రేడియేషన్‌కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రేడియేషన్ కంటామినేషన్ కూడా ఉంటుందా? వ్యాధి ఇతరులకు సోకినట్లుగా రేడియేషన్ కూడా ఇతరులకు సోకుతుందా? ‘రేడియేషన్ కంటామినేషన్’ కూడా ఉంటుందా? అన్న ప్రశ్నకు ‘ఉంటుంది’ అన్నదే జవాబు. రేడియేషన్ ఎక్కడైనా ఉంటుంది. ఆఖరికి మన సాధారణ వాతావరణంలో కూడా ఉండనే ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు అది మనకు హాని చేసేంత మోతాదులో ఉండదు. కాబట్టి వాతావరణంలో, కాంతికిరణాలతో పాటు నిత్యం ఉండే రేడియేషన్ వల్ల మనకు హాని జరగదు కాబట్టే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఒకవేళ ఏదైనా రేడియేషన్‌ను వెలువరించగల వస్తువులుంటే అవి దుస్తులపై ఉన్నా, అవి ఒకరి నుంచి మరొకరికి తాకి కంటామినేషన్కు దారితీయవచ్చు. రేడియేషన్‌ను వెలువరించగల పదార్థాల వద్ద ఆవలించినప్పుడు లేదా శ్వాసించినప్పుడు అవి మనలోకి వెళ్లవచ్చు లేదా చర్మంపైన రేడియేషన్ పేరుకున్నప్పుడు... దురదృష్టవశాత్తు అక్కడ ఏదైనా గాయం ఉంటే అది శరీరంలోకి ప్రవేశించవచ్చు. అలాంటప్పుడు దాని దుష్ర్పభావాలను ఎంతోకొంత చూపించే ప్రమాదమూ ఉంది. పెరుగుతున్న రేడియేషన్ కాలుష్యం... ఇప్పుడు మనం ప్రతిరోజూ రేడియేషన్ ఉపయోగాలను పెంచుకుంటుండంతోనూ, రేడియేషన్ కిరణాలతో ఉపయోగించే వస్తువుల (ఉదా: మొబైల్ఫోన్లు, స్మోక్ డిటెక్టర్లు, మైక్రోవేవ్ అవెన్ వంటివి) వాడకం కూడా పెరగడంతోనూ వాతావరణంలో నిత్యం ఉండే పాళ్ల కంటే రేడియేషన్ మరింతగా పెరుగుతోంది. దాంతో రేడియేషన్ వల్ల మనపై పడే దుష్ర్పభావాలూ పెరుగుతాయి కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. అందుకే గతంలో నిపుణులకు మాత్రమే పరిమితమైన రేడియేషన్ గురించి, వారితో పాటు సాధారణ ప్రజలకూ అవగాహన అవసరం. రేడియేషన్కూ కొలత ఉంటుందా? ఉంటుంది. మన చుట్టూ ఉండే రేడియేషన్ పాళ్లనూ కొలవగలం. దీనికి యూనిట్ ‘గ్రే’ అనీ, ‘సీవెర్ట్స్’ అని కొలతకు ప్రమాణాలు కూడా ఉంటాయి. ఇంకొక విషయం... కేవలం సూర్యుడు ఉన్నప్పుడు ఎండవేళల్లోనే కాంతికిరణాలతో పాటు రేడియేషన్ వస్తుందని అపోహ పడకూడదు. సూర్యుడి శక్తి భూమిలో నిక్షిప్తమై రాత్రివేళల్లో బయటికి వస్తున్నప్పుడు, దానితోపాటు భూమిలో ఉండే రేడియేషన్‌ను వెలువరించే ఖనిజాలు, మూలకాల నుంచి కూడా రేడియేషన్ బయటకు వస్తుంటుంది. ఆకాశం నుంచి వచ్చే రేడియేషన్‌ను ‘కాస్మిక్ రేడియేషన్’ అంటారు. భూమి నుంచి వచ్చే రేడియేషన్‌ను ‘టెరెస్ట్రియల్ రేడియేషన్’ అంటారు. ఇలా రేడియేషన్ అన్నది వానలా ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది. అయితే దానిపాళ్లను ప్రమాదకరం కాకుండా పర్యావరణ స్పృహతో అదుపులో ఉంచుకోవడమంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కూడానని గ్రహించాలి. - నిర్వహణ: యాసీన్ రేడియేషన్ ప్రమాదాల నుంచి జాగ్రత్తలు నిత్యం పొడవు చేతుల చొక్కాలు, శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులు ధరించడం మంచిది. అవి మనల్ని కేవలం వాతావరణ దుష్ర్పభావాల నుంచి మాత్రమే గాక... ఇలాంటి రేడియేషన్ దుష్ర్పభావాల నుంచి కూడా ఎంతో కొంత కాపాడుతుంటాయి. ఒకవేళ దుస్తులు రేడియేషన్‌తో కంటామినేట్ అయ్యాయని గ్రహిస్తే వాటిని విడిచి, మళ్లీ పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. రేడియేషన్‌ను వెలువరించే వస్తువులు ఉండే కంటెయినర్ వద్దకు వెళ్లినప్పుడు దాన్ని ప్రత్యక్షంగా ముట్టుకోకూడదు. డాక్టర్లు ఎక్స్-రే వంటి పరీక్షలు చేయించుకోమన్నప్పుడు ఎక్స్-రే తీసేవారు చెప్పే సూచనలను విధిగా పాటించాలి. ఎక్స్-రే గాని లేదా రేడియేషన్ ప్రమేయం ఉండే సీటీ స్కాన్ వంటి అన్ని రకాల పరీక్షలు అన్ని జాగ్రత్తలతో చేయించుకోవాలి. (ఇక్కడ అల్ట్రాసౌండ్ పరీక్షలను రేడియేషన్ పరీక్షలుగా పొరబడేవారు చాలామంది ఉంటారు. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో కేవలం ఒకరకమైన శబ్దతరంగాలను ఉపయోగించి దేహం లోపలి భాగాలను చూస్తారు. వాటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కాబట్టి గర్భవతుల విషయంలో చేసే అల్ట్రాసౌండ్ పరీక్షలతో ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందకూడదు. అది అనవసరమైన భయాలను పెంపొందించుకోవడమే. అయితే గర్భవతులు మాత్రం వీలైనంతవరకు రేడియేషన్‌కు గురికావలసిన ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలను చేయించుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరై చేయించాల్సి వస్తే, తాము ఎన్నో నెల గర్భవతి, ఏ అవసరాల కోసం చేయించుకోవాల్సి వస్తుందో డాక్టర్‌తో విపులంగా చర్చించాలి. మీరు రేడియేషన్‌కు గురైన తర్వాత, రేడియేషన్ సోకిందని అనుకున్న భాగాన్ని సబ్బు (నాన్-అబ్రేసిడ్ సోప్)తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటప్పుడు అక్కడ గరుకుగా ఉండే సబ్బు (అబ్రెసివ్ సోప్)ను వాడకూడదని గుర్తుంచుకోండి. డాక్టర్ రావూరి పవర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
ముందుగా గుర్తిస్తే మేలు... అప్పుడు పెద్దపేగు క్యాన్సర్‌కు చిన్నపాటి చికిత్సే చాలు...
పేరుకూ, విధులకూ... ఈ రెండిటి విషయంలోనూ పెద్దది... పెద్దపేగు. దీన్నే ఇంగ్లిష్‌లో కోలన్ అంటారు. ఈ అవయవానికి క్యాన్సర్ వస్తే దాన్ని ‘కోలన్ క్యాన్సర్’ అని పిలుస్తారు. మనం తిన్న ఆహారంలో అన్ని పోషకపదార్థాలను ఒంటికి పట్టేలే చేసేవి చిన్న పేగులైతే... శరీరానికి అవసరమైన నీటిని, పొటాషియం లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను ఒంటికి పట్టేలా చేసే బాధ్యత పెద్దపేగుదే. ఆ తర్వాత వ్యర్థాలను మల ద్వారం గుండా బయటికి పంపివేయడం కూడా దానిపనే. మలద్వారాన్ని రెక్టమ్ అంటారు. పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే దాన్ని కోలన్ క్యాన్సర్ అని, మలద్వారానికీ అది సోకితే రెక్టల్ క్యాన్సర్ అనీ అంటారు. ఇప్పుడు ముందుగానే గుర్తిస్తే కోలన్ క్యాన్సర్‌కు సమర్థంగా చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ సోకినప్పుడు పెద్దపేగుకు కండపెరిగినట్లుగా కొన్ని బొడిపెలు వస్తాయి. వాటినే పాలిప్స్ అని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి బొడిపెలూ లేకుండా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది వంశపారంపర్యంగా రాదు. కాకపోతే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఉంటే ఇది వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. అందుకే ఇలా వచ్చిన వారి పిల్లలకు 15 ఏళ్ల వయసు నుంచే తరచూ స్క్రీనింగ్ చేయడం అవసరం. ఎందుకంటే కోలన్ క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత బాగా నయమవుతుంది. లక్షణాలు / గుర్తించడం ఎలా... కోలన్ క్యాన్సర్ లక్షణాలు పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన ప్రదేశం, దాని పరిమాణం, ఏయే భాగాలకు అది వ్యాపించింది వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణ లక్షణాలు: మలద్వారం నుంచి రక్తస్రావం మలం, మలవిసర్జనలో మార్పులు అజీర్తి లేదా విరేచనాలు పొట్ట కింది భాగంలో నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ పోవడం జిగురుతో మలం రావడం అకారణంగా నీరసం, బరువు తగ్గడం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)... అయితే ఇక్కడ పేర్కొన్న లక్షణాల్లో అజీర్తి, మలబద్ధకం, నీళ్ల విరేచనాల వంటివి మనలోని చాలామందిలో కనిపించేవే. ముఖ్యంగా మల విసర్జనలో రక్తస్రావం అన్నది పైల్స్ (మూలశంక) వ్యాధి ఉన్నవారిలో చాలా సాధారణం. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, తగిన పరీక్షలు చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు. ఒకవేళ క్యాన్సర్ అని తేలితే, ముందుగానే గుర్తిస్తారు కాబట్టి నయమయ్యే అవకాశాలు ఎక్కువే. అయితే ఆలస్యం చేసిన కొద్దీ క్యాన్సర్ ఒకచోటి నుంచి మరోచోటికి (అంటే కాలేయం వంటి కీలక భాగాలకు లేదా లింఫ్ గ్రంథులకు) పాకుతుంది. దీన్నే మెటస్టాసిస్ అంటారు. ఇలా క్యాన్సర్ గనక కాలేయానికి లేదా లింఫ్ గ్రంథులకు చేరితే అది చాలా ప్రమాదం. కాబట్టి లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవడం ఎంతో మేలు. రిస్క్ ఫ్యాక్టర్లు : పెరిగే వయసు స్థూలకాయం డయాబెటిస్, ఫాస్ట్‌ఫుడ్, రెడ్‌మీట్ ఎక్కువగా తీసుకోవడం పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం పొగతాగడం మద్యపానం తల్లిదండ్రుల్లో ఎవరికైనా అంతకుమునుపే కోలన్ క్యాన్సర్ వచ్చి ఉండటం...ఇవీ సాధారణ రిస్క్ ఫ్యాక్టర్లు. సాధారణంగా కోలన్ క్యాన్సర్ 50 ఏళ్లు పైబడ్డాకే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పైన పేర్కొన్న రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు చిన్న వయసులోనైనా రావచ్చు. నిర్ధారణ ఇలా... పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పడు వెంటనే తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాలి. అప్పుడు డాక్టర్లు రోగిని భౌతికంగా పరీక్షించడంతోపాటు ఫ్యామిలీ, మెడికల్ హిస్టరీని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొలనోస్కోపీ, బేరియమ్ అనీమా, ఎక్స్-రే వంటి పరీక్షలు చేస్తారు. కొలనోస్కోపీ అంటే సన్నటి గొట్టాన్ని మలద్వారంనుంచి లోపలికి ప్రవేశపెట్టి లోపల ఏవైనా కణుతులు ఉన్నాయేమో చూడటం. ఒకవేళ కణుతులు కనిపిస్తే వాటినుంచి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపుతారు. అక్కడ అవి క్యాన్సర్ కణాలా కాదా అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. బేరియమ్ మింగించి ఎక్స్‌రే తీస్తే క్యాన్సర్ ఉన్న ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. ఇక స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనే చిన్న పరీక్ష ద్వారా కూడా దీన్ని సులువుగా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ రెక్టమ్ (మలద్వారం)లోనే సమస్య ఉంటే దాన్ని వేలి ద్వారానే డాక్టర్లు చాలా సులువుగా గుర్తించగలరు. ఒకవేళ క్యాన్సర్ సోకినట్లు తెలిస్తే అప్పుడది ఏ మేరకు విస్తరించి ఉందో చూడటానికి పెట్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి. చికిత్స : పెద్దపేగు క్యాన్సర్‌కు చికిత్స అన్నది వ్యాధి దశను బట్టి ఉంటుంది. వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ అనే ప్రక్రియతో క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగిస్తారు. ఈ తరహా శస్త్రచికిత్సను ఇప్పుడు కీ-హోల్ (ల్యాపరోస్కోపిక్) ప్రక్రియ ద్వారా కూడా నిర్వహించవచ్చు. ఇలా చేసిన శస్త్రచికిత్సలో పూర్తిగా కోత అవసరం లేకుండా చిన్న గాటు మాత్రమే ఉంటుంది కాబట్టి రోగి వేగంగా కోలుకుంటాడు. ఒకవేళ కోలన్ క్యాన్సర్ అన్నది లింఫ్ గ్రంథులకూ పాకితే వాటినీ తొలగించాల్సి వస్తుంది. క్యాన్సర్ గనక మలద్వారాన్ని గట్టిగా బిగుసుకుపోయేలా ఉంచి, మలాన్ని బయటకు రాకుండా చేసే స్ఫింక్టర్కూ వ్యాప్తిస్తే దాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది. అప్పుడు మలవిసర్జనకు వీలుగా పేగును బయటకు అమర్చాల్సిన శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. ఇక క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా ఈ రెండూ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్‌ను చివరిదశలో గుర్తిస్తే, కీమోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే మందుల ద్వారా రోగి జీవితకాలాన్ని గణనీయంగా పెంచవచ్చు. నివారణ: దీని నివారణకు చేయాల్సిన పనులు చాలా సులభం. ఆరోగ్యకరమైన విసర్జక అలవాట్లు అంటే... రోజూ క్రమబద్ధంగా మల విసర్జనకు వెళ్లడం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటివి లేకుండా చూసుకోవడం మంచిది. వేళకు సాఫీగా మలవిసర్జన జరగాలంటే శరీరానికి తగినంత వ్యాయామం, కదలికలు ఉండాలి. అందుకే తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి. ఇది కేవలం కోలన్ క్యాన్సర్‌కు మాత్రమే కాదు... అన్ని రకాల క్యాన్సర్లకూ నివారణ. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముందుగా కనుగొంటే చికిత్స ద్వారా చాలా వరకు నయమవుతుంది. ఒకవేళ ఆలస్యంగా కనుగొన్నా జీవితకాలాన్ని చాలావరకు పొడిగించడం సాధ్యమవుతుంది. ఆహారం - ప్రాధాన్యం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కోలన్ క్యాన్సర్‌ను నివారించడం సులువే. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అంటే... కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తాజా ఆకుకూరలను, పండ్లను ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాన్ని పరిమితంగా తినడం అందులోనూ కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలను మాత్రమే తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలోనూ పీచు ఎక్కువగా ఉండే కాయధాన్యాల వంటివాటికి ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. డాక్టర్ సిహెచ్.మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్: 98480 11421 -
ఆరోగ్యకరమైన బిడ్డ కోసం తొందరపడండి
ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు పెద్దలు. మహిళల్లో గర్భధారణ ఆలస్యమవుతున్నకొద్దీ... పుట్టబోయే బిడ్డలో కొన్ని మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. అందుకే బిడ్డను ప్లాన్ చేసుకోవాలనుకునేవారు... మరీ ముఖ్యంగా లేటు వయసులో గర్భధారణ కోరుకునేవారు ఆ సమయంలో పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశం ఉన్న ‘డౌన్స్ సిండ్రోమ్’ గురించి అవగాహన తప్పక పెంచుకోవాలి. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. ఒక్కోజీవికి నిర్దిష్టమైన క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. వాటినిబట్టే ఆ జీవి ఏమిటన్నది నిర్ణయమవుతుంది. మనిషిలోని క్రోమోజోముల సంఖ్య 46. అందుకే ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు పురుషుడి వీర్యకణం... అండంతో కలిసినప్పుడు ఈ 23 జతలు కలుసుకుని 46 క్రోమోజోములతో కొత్తజీవి ఆవిర్భవించేలా చేస్తుంది ప్రకృతి. ఇదే ప్రక్రియ అన్ని జీవుల్లోనూ జరుగుతుంది. మరి ఏదైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే...? అది స్వాభావికం కాదు. అలాంటి పరిస్థితుల్లో సాధారణ మనిషిలో కొన్ని అసాధారణమైన రుగ్మతలు కనిపిస్తాయి. డౌన్స్ సిండ్రోమ్‌లో జరిగేదేమిటి...? ముందుగా చెప్పుకున్నట్లు మనిషిలో 46 (అంటే ఇరవైమూడు జతల) క్రోమోజోములు ఉంటాయి కదా. ఏదైనా కారణాల వల్ల ఈ సంఖ్య కాస్తా 47 కు చేరిందనుకోండి. అప్పుడు సంభవించేదే ‘డౌన్స్ సిండ్రోమ్’ అనే అసాధారణస్థితి. అంటే ఇందులో 21వ క్రోమోజోము కాపీ మరొకటి అదనంగా ఏర్పడుతుంది. ఫలితంగా 46 క్రోమోజోములు కాస్తా 47గా మారిపోతాయి. ఇలా జరిగితే ఈ కండిషన్లో పిల్లలకు కొన్ని మానసికమైన లోపాలు కనిపిస్తుంటాయి. ఇంగ్లాండుకు చెందిన జె.ఎల్. డౌన్ అనే ఫిజీషియన్ ఈ పరిస్థితికి కారణాన్ని కనుగొనడంతో ఆయన పేరిట దీనికి ‘డౌన్స్’ సిండ్రోమ్ అని పెట్టారు. డౌన్స్ సిండ్రోమ్ పిల్లల్లో కనిపించే లోపాలు సాధారణంగా డౌన్స్ సిండ్రోమ్‌తో పుట్టిన పిల్లల్లో కొన్ని శారీరక, మానసిక లోపాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి... త కండరాల పటుత్వం తగ్గి ఉండటం మెడ వెనక భాగంలో చర్మం దళసరిగా ఉండటం ముక్కు చప్పిడిగా ఉండటం (ఫాటెన్డ్ నోస్) పుర్రెలోని ఎముకలమధ్య ఖాళీలు ఎక్కువగా ఉండటం సాధారణంగా మన అరచేతిలో పైన రెండు గీతలు ఉంటాయి. కానీ డౌన్స్ సిండ్రోమ్ ఉన్నవారి అరచేతిలో ఒకటే గీత ఉంటుంది (సిమియన్ ట్రీస్) చెవులు చిన్నవిగా ఉండటం నోరు చిన్నదిగా ఉండటం కళ్లు పైవైపునకు వాలినట్లుగా ఉండటం చేయి వెడల్పుగా, చేతివేళ్లు పొట్టిగా ఉండటం కంట్లోని నల్లగుడ్డులో తెల్లమచ్చలు ఉండటం. వీటిని బ్రష్ఫీల్డ్ స్పాట్స్ అంటారు మిగతావారితో పోలిస్తే తల కాస్త తక్కువ సైజులో ఉండటం. చూడగానే దాని ఆకృతిలో ఏదో మార్పు ఉన్నట్లు కనిపించడం పెద్దగా ఎత్తు పెరగకపోవడం మానసికవికాసం ఆలస్యంగా జరుగుతుండటం. మరికొన్ని అదనపు సమస్యలు ... గుండెకు సంబంధించిన లోపాలు కనిపించవచ్చు. అంటే గుండె గదుల్లో పై గదుల మధ్య గోడలో లోపం (ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్) గాని, కింది గదుల మధ్య గోడలో లోపం (వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్) గాని ఉండవచ్చు మతిమరపు కాటరాక్ట్ వంటి కంటి సమస్యలు జీర్ణకోశ వ్యవస్థలో సమస్యలు (డియొడినల్ అస్ట్రీషియా) తుంటి ఎముక తన స్థానం నుంచి తొలగిపోవడం (హిప్ డిస్లొకేషన్) మలబద్దకం హైపోథైరాయిడిజమ్ వంటి శారీరక సమస్యలు రావచ్చు. నిర్ధారణ: డౌన్స్ సిండ్రోమ్ ఉందని నిర్ధారణ చేయడానికి క్రోమోజోముల పరీక్షను నిర్వహించాలి. దీనికోసం చిన్నారి నుంచి సేకరించిన రక్తంతో కారియోటైపిక్ క్రోమోజోమల్ స్టడీ అనే రక్తపరీక్ష చేయాలి. ఈ ప్రధాన పరీక్షతోపాటు గుండెలో ఏవైనా లోపాలున్నాయేమో తెలుసుకోవడానికి ఈసీజీ, ఛాతీ, జీర్ణకోశవ్యవస్థ తాలూకు పరిస్థితిని తెలుసుకోడానికి ఎక్స్-రే పరీక్షలు చేయాలి. క్రమం తప్పకుండా చేయించాలి ఈ పరీక్షలు డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్యపరీక్షలు చేయిస్తూ ఉండాలి. అవి... చిన్నతనంలో ప్రతి ఏడాదీ కంటిపరీక్షలు చేయించాలి ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి చెవిపరీక్షలు, దంతపరీక్షలు చేయించాలి. (ఇది ఆరు నెలలకోమారా లేదా సంవత్సరానికి ఒకసారా అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు) ప్రతి 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారి ఛాతీ, మెడ ఎక్స్-రే పరీక్ష అమ్మాయిల్లో యుక్తవయసు రాగానే లేదా 21 ఏళ్ల వయసులో పాప్‌స్మియర్ పరీక్ష చేయించాలి ప్రతి యేటా థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలి. బిడ్డ పుట్టకముందే నిర్ధారణ ఎలా...? వివాహం ఆలస్యంగా చేసుకోవడమో లేదా ఏదైనా కారణాల వల్ల ఆలస్యంగా పిల్లలను ప్లాన్ చేసుకోవడమో చేస్తే... పుట్టబోయే చిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ కండిషన్ వచ్చేందుకు అవకాశం ఉందా అన్న విషయాన్ని కొన్ని పరీక్షల ద్వారా ముందే తెలుసుకోవచ్చు. ఇందుకు రెండు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. (అయితే ఈ పరీక్షలు చాలావరకు మంచి సమాచారాన్నే అందిస్తాయి. కానీ పూర్తిగా కచ్చితమైన సమాచారం బిడ్డ పుట్టిన తర్వాతే లభ్యమవుతుందని గుర్తించాలి). స్క్రీనింగ్ పరీక్షలు: ఈ పరీక్షల్లో బాగా ప్రాచుర్యం ఉన్నది ‘ట్రిపుల్ స్క్రీన్’ అని పిలిచే పద్ధతి. ఇది మూడు రకాల పరీక్షల తాలూకు సంయుక్తరూపం. ఈ పరీక్షల్లో రక్తంలోని కొన్ని అంశాల విలువలను మూడుసార్లు పరీక్షించి... సరిపోల్చి డౌన్స్ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష గర్భధారణ జరిగిన 15వ వారం నుంచి 20వ వారం మధ్యలో నిర్వహిస్తారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు మిగతా పరీక్షలతో పాటు నిర్వహిస్తూ కడుపులోని బిడ్డ ఎదుగుదలలో మార్పులను పరిశీలిస్తూ చేస్తారు. వీటివల్ల బిడ్డ భౌతికమైన (ఫిజికల్) అంశాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. వాటిని డౌన్స్ సిండ్రోమ్ లక్షణాలతో సరిపోలుస్తూ అధ్యయనం చేస్తారు. డయాగ్నస్టిక్ పరీక్షలు (నిర్ధారణ కోసం): గర్భధారణ జరిగాక 12 నుంచి 20 వారాల మధ్య సమయంలో గర్భసంచి నుంచి ఉమ్మనీరు తీసి అమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేస్తారు. గర్భధారణ సమయంలోని 8వ వారం నుంచి 12వ వారం వరకు కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అనే పరీక్ష చేస్తారు. గర్భధారణ సమయంలోని 20వ వారంలో పర్క్యుటేనియస్ అంబిలికల్ బ్లడ్ శాంప్లింగ్ పరీక్షను నిర్వహిస్తారు. సంయుక్త పరీక్షలు: డౌన్స్‌సిండ్రోమ్ నిర్ధారణ కోసం పైన పేర్కొన్న రక్తపరీక్షలు, అల్ట్రా సౌండ్ పరీక్షలను సంయుక్తంగా చేస్తుంటారు. రక్తపరీక్షల్లో రక్తనమూనాలను సేకరించి వాటిలో కొన్ని నిర్దిష్టమైన ప్రొటీన్లను, హార్మోన్లను పరిశీలిస్తారు. ఇలా కొన్ని నిర్దిష్టమైన ప్రోటీన్లు, హార్మోన్ల మోతాదులు సాధారణ విలువల కంటే ఎక్కువగా ఉంటే అది డౌన్స్ సిండ్రోమ్స్‌కు సూచిక అన్నమాట. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లోనూ ఒక ప్రత్యేకమైన స్కానింగ్ పరీక్షను చేస్తారు. దీన్ని ‘న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ’ పరీక్షగా చెబుతారు. ఇందులో బిడ్డ మెడ వెనక చర్మం వెనక ఉన్న ఉమ్మనీటిని పరీక్షిస్తారు. ఎందుకంటే... సాధారణ బిడ్డలతో పోలిస్తే డౌన్స్ సిండ్రోమ్ ఉన్న బిడ్డలకు ఈ నీటి మందం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్నిబట్టి పుట్టబోయే బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను బేరీజు వేస్తారు. ఇక కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) పరీక్ష లేదా ఉమ్మనీటిని తీసి చేసే పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు దశలోనే పుట్టబోయే బిడ్డకు ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయా అన్న విషయం తెలుస్తుంది. కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్): గర్భధారణ జరిగాక 10వ వారంలో బిడ్డ తాలూకు బొడ్డు తాడు నుంచి చిన్న ముక్కను సేకరించి చేసే అల్ట్రా సౌండ్ పరీక్ష ఇది. ఆమ్నియోసెంటైసిస్: సాధారణంగా గర్భధారణ తర్వాత 15వ వారం నుంచి 22 వ వారం వరకు ఈ పరీక్ష చేయవచ్చు. ఇందులో తల్లి గర్భంలోంచి ఇంజక్షన్ నీడిల్ ద్వారా కొంత ఉమ్మనీటిని సేకరిస్తారు. ఇలా సేకరించడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సహాయం తీసుకుంటారు. స్కానింగ్‌లో తల్లి గర్భాన్ని పరిశీలిస్తే సిరంజ్ పంపడం ద్వారా సరిగ్గా ఉమ్మనీటినే స్వీకరిస్తున్నామా అన్న విషయాన్ని పరిశీలిస్తూ ఈ నీటిని సేకరిస్తారన్నమాట. చికిత్స: ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. అయితే ఇలా పుట్టిన పిల్లలను మామూలు పిల్లల్లా పెంచడానికి... వ్యాయామాల సూచనకు ఫిజియోథెరపిస్ట్; భాషను చక్కదిద్దడం, చక్కగా వచ్చేలా చేయడానికి సహాయపడే లాంగ్వేజ్/స్పీచ్ థెరపిస్ట్, పెద్దయ్యాక వారు స్వతంత్రంగా బతికేలా తోడ్పడేందుకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్, మంచి ఆహారాన్ని అందించే క్రమంలో డైటీషియన్, వినికిడి సమస్యల పరిష్కారానికి ఆడియాలజిస్ట్, కంటి సమస్యలను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మాలజిస్ట్.. ఇంకా పిల్లల వైద్యనిపుణుడు, గుండె వైద్యనిపుణుల సహాయం అవసరం. నివారణ: కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు. మహిళలో గర్భధారణ 35 ఏళ్ల కంటే ముందుగానే జరిగేలా ప్లాన్ చేసుకోవడం, కుటుంబంలో ఎవరికైనా డౌన్స్ సిండ్రోమ్ ఉంటే ఆ విషయాన్ని గర్భధారణకు ముందుగానే డాక్టర్లకు చెప్పి తగిన కౌన్సెలింగ్ తీసుకోవడం అవసరం. - నిర్వహణ: యాసీన్