మనం ‘రేడియేషన్’ అనే మాటను కనీసం అదేమిటో తెలియకుండానే మనం తరచు ఉపయోగిస్తుంటాం. అసలు రేడియేషన్ అంటే ఏమిటి? అది చెడ్డదా? మంచిదా? దాంతో ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా? క్యాన్సర్ లాంటి చికిత్సలకు రేడియేషన్ లాంటి ఉపయోగాలు ఉన్నాయనుకుందాం. అప్పుడది మంచిదే కావాలి కదా! కానీ దానికి ఎక్స్‌పోజ్ కావడాన్ని ఎందుకు కీడుగా పరిగణిస్తాం. ఇటీవల ఆ రేడియేషన్ కాలుష్యం వాతావరణంలో పెరుగుతుండటంతో దాని గురించిన జాగ్రత్తలూ అవసరమవుతున్నాయి. వైద్యశాస్త్రంలో, వైద్య చికిత్సల్లో విరివిగా ప్రస్తావనకు వచ్చే రేడియేషన్ గురించిన అవగాహన కోసమే ఈ కథనం.
రమేశ్‌కు క్యాన్సర్ గడ్డ తొలగించాక ఉన్న కొద్దిపాటి క్యాన్సర్ భాగాన్నీ కాల్చివేయడానికి రేడియేషన్ ఇచ్చారట. ఇక సురేశ్ విషయంలో ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. అదేమిటంటే... నిత్యం రేడియేషన్‌కు గురికావడం వల్ల సురేశ్‌కూ క్యాన్సర్ వచ్చిందట. అది బ్లడ్ క్యాన్సర్‌ట. అదేమిటి? ఒక జబ్బు ను తగ్గించిన రేడియేషన్, మరోచోట అదేలాంటి మరో జబ్బును కలిగించిందా? అసలీ రేడియేషన్ అంటే ఏమిటనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? వాటికి సమాధానాలు చూద్దాం.
రేడియేషన్ అంటే ఏమిటి?
మనం రోజూ ఎండ రూపంలో కాంతిని చూస్తాం కదా! ఈ కాంతి సూర్యుడి నుంచి తరంగాల రూపంలో వస్తుంది. ఈ తరంగాలలో మన కళ్లకు కనపడే కాంతికిరణాలేగాక... కంటికి కనపడని కిరణతరంగాలూ ఉంటాయి. కాంతితో వచ్చే ఈ తరంగాలన్నీ వేర్వేరుగా ఉంటాయి. మన కంటికి కనపడే కాంతిని విజిబుల్ లైట్ అంటారు. ఇదిగాక... దీనికి ముందుగా ఇన్‌ఫ్రా రెడ్ కిరణాలు, అల్ట్రావయొలెట్ కిరణాలు ఇలా చాలా రకాలుంటాయి. అయితే ఆకాశం నుంచి వచ్చే ఈ కిరణాలను ఒక పోలిక కోసం కాసేపు ఓ చెట్టు మొదలు సైజ్‌లో ఉంటాయనుకుందాం. అందులో మనకు కనిపించే ‘కాంతి’ కేవలం మధ్యలోని ఓ పూచిక పుల్లంత మాత్రమే. మిగతాభాగంలో ఆయా తరంగదైర్ఘ్యాల (వేవ్‌లెంగ్త్‌ల)ను బట్టి ఒక వైపున ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు, మైక్రోవేవ్ తరంగాలు, రేడియోతరంగాలు ఉంటాయి. మరోవైపున ఆల్ఫా, బీటా, గామా తరంగాలు ఉంటాయి. కాంతితో సహా ఈ కిరణాల సముదాయాన్నంతటినీ కలిపి ‘రేడియేషన్’ అంటారు.
రేడియేషన్‌ను రోజూ చూస్తామా?
కాంతిని తప్ప మరిదేన్నీ కంటితో చూడలేం. కానీ రేడియేషన్‌లోని తరంగాలన్నింటినీ రోజూ మనం వాడుకుంటాం. ఉదాహరణకు... కాంతి కంటే తక్కువ వేవ్‌లెంత్ ఉన్న రేడియో తరంగాల సహాయంతోనే మనం రేడియో వింటాం. వాటికంటే కాస్త పవర్‌ఫుల్‌గా ఉండే మైక్రోవేవ్ తరంగాలు విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. కాబట్టి వాటి సహాయంతో వంట వండుకుంటాం. మనం మొబైల్ వాడేటప్పుడు ఒకరితో మరొకరికి అనుసంధానం ఈ తరంగాల వల్లనే కలుగుతుంది. ఈ కిరణాల్లో ఒక రకమైన రాడార్ తరంగాల సహాయంతో వాతావరణాన్ని తెలుసుకోవడం, సముద్రంలోని ఓడలు దారి తప్పకుండా చూడటం, సమాచారాలను పంచుకోవడం చేస్తుంటాం. అంతెందుకు పెద్ద పెద్ద భవంతుల్లోకి వెళ్లినప్పుడు తలపై స్మోక్ డిటెక్టర్స్ అని ఉంటాయి. భవనంలో ఎక్కడైనా పొగను పసిగట్టి మనల్ని హెచ్చరించేలా చేసుకోడానికి ఈ తరంగాలనే ఉపయోగించుకుంటున్నాం. ఇలా ఈ రేడియేషన్ తరంగాల తో మనం అనేకరకాల సేవలు చేయించుకుంటున్నాం.
కాంతికి ఈ వైపు ఉన్న ఈ తరహా కిరణాలు ఏదైనా వస్తువుపై పడితే వాటికి ఎలాంటి విద్యుదావేశమూ కలిగించవు కాబట్టి వాటిని ‘నాన్ ఐయొనైజింగ్ రేడియేషన్’ అంటారు.
ఇక ఇప్పుడు ఐయొనైజింగ్ రేడియేషన్ కిరణాల దగ్గరకు వద్దాం. ఇవి కాంతికిరణాలకు మరోవైపున ఉంటాయి. వాటి శక్తి కాస్త ఎక్కువ. వాటిలో ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ తరంగాలు అని రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఆల్ఫా పార్టికల్స్ ఉంటాయి గాని ఇవి మనిషి చర్మంలోకి చొచ్చుకుపోయేంత శక్తి కలిగి ఉండవు. కాకపోతే ఎక్కడైనా గాయం ఉంటే దాన్లోంచి మనిషి శరీరంలోకి వెళ్లగలవు. అయితే కాగితంలోంచి అతి కష్టం మీద అట్నుంచి ఇటు వెళ్లగలిగే ఇవి... దుస్తుల్లోంచి మాత్రం వెళ్లలేవు. ఇక బీటా పార్టికిల్స్ వాటి కంటే మరికాస్త ఎక్కువ శక్తి ఉంటుంది. అవి శరీరంలోకి ఒకింత దూరం ప్రవేశించగలవు. కానీ దుస్తుల్లోంచి దూరలేవు.
అందుకే దుస్తులు వేసుకోవడం వల్ల అటు ఆల్ఫా, బీటా తరంగాల నుంచి రక్షణ కలుగుతుంది. మన చర్మంలో ‘జెర్మినేషన్ లేయర్’ అనే పొర ఉంటుంది. మన చర్మం ఎప్పుడూ మనకు రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఈ క్రమంలో శిథిలమైన చర్మకణాల స్థానంలో కొత్తకణాలు వచ్చి చేరుతుంటాయి. ఆ కొత్త కణాలు ఎప్పుడూ పుడుతుండే పొరే... ఈ జర్మినేషన్ లేయర్. ఒకవేళ ఏ కారణంగానైనా బీటా తరంగాలు ఈ పొర వరకు చేరితే కొత్త కణాలు పుట్టే ప్రక్రియకు హాని చేకూరుతుంది. ఆల్ఫా, బీటా తరంగాలతో పోలిస్తే గామా తరంగాలు మరింత శక్తిమంతమైనవి. అవి మానవ దేహాల్లోకి చొచ్చుకుపోగలవు. గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు... ఈ రెండూ దాదాపుగా ఒకేలా ఉంటాయి.
మానవ కణజాలంలోకి చొచ్చుకుపోతాయి. కాబట్టే ఈ ఎక్స్-రే ల సహాయం తో విరిగిన ఎముకలు, విరిగిన పంటి భాగాలను, ఇతరత్రా కణజాలాలను చూసి తగిన చికిత్స చేయడానికి సాధ్యమవుతుంది. ఇలా ఎక్స్-రే రూపంలో రేడియేషన్ కూడా మానవుల వైద్యశాస్త్రంలో, వైద్య చికిత్సల్లో కీలక భూమిక పోషిస్తోంది. అలాగే గామా రేస్ కూడా వైద్యవిజ్ఞానంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కోబాల్ట్-60 అనే మూలకం నుంచి ఇవి ఉత్పత్తి అయ్యేలా చూస్తున్నారు. ఈ గామా కిరణాలను ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలోనూ, వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేయడంలోనూ ఉపయోగిస్తున్నారు.
మరి ఇంత ఉపయోగకరమైన రేడియేషన్ గురించి ఆందోళన ఎందుకు?
మనకు వైద్యశాస్త్రంలో ఇంతగా ఉపయోగపడే రేడియేషన్ కిరణాల గురించి ఆందోళన ఎందుకు? ఎందుకంటే... ఇవి మనిషి కణజాలాల్లోని కణంపైన ప్రభావం చూపినప్పుడు అందులోని జన్యుస్వరూపాన్ని మార్చగలవు కాబట్టి. జన్యుస్వరూపం అంతా జెనిటిక్ కోడ్ రూపంలో కణంలో నిక్షిప్తమై ఉంటుంది. మన అన్ని జీవక్రియలకు ఇదే ప్రాతిపదిక. ఒకవేళ జన్యుస్వరూపంలో మార్పు వస్తే ఆ మేరకు అది జీవక్రియల్లోనూ ప్రతిఫలిస్తుంది. దాంతో జీవక్రియలు అస్తవ్యస్తమైపోతాయి. ఇలా అస్తవ్యస్తన జీవక్రియలు దీర్ఘకాలంలో మృత్యువుకు సైతం దారితీయవచ్చు. అందుకే ఇలా దీర్ఘకాలంలో రేడియేషన్‌కు గురవుతూంటే క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కాబట్టి రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
రేడియేషన్ కంటామినేషన్ కూడా ఉంటుందా?
వ్యాధి ఇతరులకు సోకినట్లుగా రేడియేషన్ కూడా ఇతరులకు సోకుతుందా? ‘రేడియేషన్ కంటామినేషన్’ కూడా ఉంటుందా? అన్న ప్రశ్నకు ‘ఉంటుంది’ అన్నదే జవాబు. రేడియేషన్ ఎక్కడైనా ఉంటుంది. ఆఖరికి మన సాధారణ వాతావరణంలో కూడా ఉండనే ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు అది మనకు హాని చేసేంత మోతాదులో ఉండదు. కాబట్టి వాతావరణంలో, కాంతికిరణాలతో పాటు నిత్యం ఉండే రేడియేషన్ వల్ల మనకు హాని జరగదు కాబట్టే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఒకవేళ ఏదైనా రేడియేషన్‌ను వెలువరించగల వస్తువులుంటే అవి దుస్తులపై ఉన్నా, అవి ఒకరి నుంచి మరొకరికి తాకి కంటామినేషన్‌కు దారితీయవచ్చు. రేడియేషన్‌ను వెలువరించగల పదార్థాల వద్ద ఆవలించినప్పుడు లేదా శ్వాసించినప్పుడు అవి మనలోకి వెళ్లవచ్చు లేదా చర్మంపైన రేడియేషన్ పేరుకున్నప్పుడు... దురదృష్టవశాత్తు అక్కడ ఏదైనా గాయం ఉంటే అది శరీరంలోకి ప్రవేశించవచ్చు. అలాంటప్పుడు దాని దుష్ర్పభావాలను ఎంతోకొంత చూపించే ప్రమాదమూ ఉంది.
పెరుగుతున్న రేడియేషన్ కాలుష్యం...
ఇప్పుడు మనం ప్రతిరోజూ రేడియేషన్ ఉపయోగాలను పెంచుకుంటుండంతోనూ, రేడియేషన్ కిరణాలతో ఉపయోగించే వస్తువుల (ఉదా: మొబైల్‌ఫోన్లు, స్మోక్ డిటెక్టర్లు, మైక్రోవేవ్ అవెన్ వంటివి) వాడకం కూడా పెరగడంతోనూ వాతావరణంలో నిత్యం ఉండే పాళ్ల కంటే రేడియేషన్ మరింతగా పెరుగుతోంది. దాంతో రేడియేషన్ వల్ల మనపై పడే దుష్ర్పభావాలూ పెరుగుతాయి కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. అందుకే గతంలో నిపుణులకు మాత్రమే పరిమితమైన రేడియేషన్ గురించి, వారితో పాటు సాధారణ ప్రజలకూ అవగాహన అవసరం.
రేడియేషన్‌కూ కొలత ఉంటుందా?
ఉంటుంది. మన చుట్టూ ఉండే రేడియేషన్ పాళ్లనూ కొలవగలం. దీనికి యూనిట్ ‘గ్రే’ అనీ, ‘సీవెర్ట్స్’ అని కొలతకు ప్రమాణాలు కూడా ఉంటాయి. ఇంకొక విషయం... కేవలం సూర్యుడు ఉన్నప్పుడు ఎండవేళల్లోనే కాంతికిరణాలతో పాటు రేడియేషన్ వస్తుందని అపోహ పడకూడదు. సూర్యుడి శక్తి భూమిలో నిక్షిప్తమై రాత్రివేళల్లో బయటికి వస్తున్నప్పుడు, దానితోపాటు భూమిలో ఉండే రేడియేషన్‌ను వెలువరించే ఖనిజాలు, మూలకాల నుంచి కూడా రేడియేషన్ బయటకు వస్తుంటుంది. ఆకాశం నుంచి వచ్చే రేడియేషన్‌ను ‘కాస్మిక్ రేడియేషన్’ అంటారు. భూమి నుంచి వచ్చే రేడియేషన్‌ను ‘టెరెస్ట్రియల్ రేడియేషన్’ అంటారు. ఇలా రేడియేషన్ అన్నది వానలా ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది. అయితే దానిపాళ్లను ప్రమాదకరం కాకుండా పర్యావరణ స్పృహతో అదుపులో ఉంచుకోవడమంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కూడానని గ్రహించాలి.
- నిర్వహణ: యాసీన్
రేడియేషన్ ప్రమాదాల నుంచి జాగ్రత్తలు
నిత్యం పొడవు చేతుల చొక్కాలు, శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులు ధరించడం మంచిది. అవి మనల్ని కేవలం వాతావరణ దుష్ర్పభావాల నుంచి మాత్రమే గాక... ఇలాంటి రేడియేషన్ దుష్ర్పభావాల నుంచి కూడా ఎంతో కొంత కాపాడుతుంటాయి. ఒకవేళ దుస్తులు రేడియేషన్‌తో కంటామినేట్ అయ్యాయని గ్రహిస్తే వాటిని విడిచి, మళ్లీ పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి.
రేడియేషన్‌ను వెలువరించే వస్తువులు ఉండే కంటెయినర్ వద్దకు వెళ్లినప్పుడు దాన్ని ప్రత్యక్షంగా ముట్టుకోకూడదు.
డాక్టర్లు ఎక్స్-రే వంటి పరీక్షలు చేయించుకోమన్నప్పుడు ఎక్స్-రే తీసేవారు చెప్పే సూచనలను విధిగా పాటించాలి. ఎక్స్-రే గాని లేదా రేడియేషన్ ప్రమేయం ఉండే సీటీ స్కాన్ వంటి అన్ని రకాల పరీక్షలు అన్ని జాగ్రత్తలతో చేయించుకోవాలి. (ఇక్కడ అల్ట్రాసౌండ్ పరీక్షలను రేడియేషన్ పరీక్షలుగా పొరబడేవారు చాలామంది ఉంటారు. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో కేవలం ఒకరకమైన శబ్దతరంగాలను ఉపయోగించి దేహం లోపలి భాగాలను చూస్తారు. వాటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కాబట్టి గర్భవతుల విషయంలో చేసే అల్ట్రాసౌండ్ పరీక్షలతో ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందకూడదు. అది అనవసరమైన భయాలను పెంపొందించుకోవడమే. అయితే గర్భవతులు మాత్రం వీలైనంతవరకు రేడియేషన్‌కు గురికావలసిన ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలను చేయించుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరై చేయించాల్సి వస్తే, తాము ఎన్నో నెల గర్భవతి, ఏ అవసరాల కోసం చేయించుకోవాల్సి వస్తుందో డాక్టర్‌తో విపులంగా చర్చించాలి.
మీరు రేడియేషన్‌కు గురైన తర్వాత, రేడియేషన్ సోకిందని అనుకున్న భాగాన్ని సబ్బు (నాన్-అబ్రేసిడ్ సోప్)తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటప్పుడు అక్కడ గరుకుగా ఉండే సబ్బు (అబ్రెసివ్ సోప్)ను వాడకూడదని గుర్తుంచుకోండి.
డాక్టర్ రావూరి పవర్
కన్సల్టెంట్ రేడియాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
నాంపల్లి, హైదరాబాద్