
పర్యావరణం సమతుల్యత కోల్పోయింది. కాదు... పర్యావరణాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేశాం. మన పనుల ద్వారా భూ ఆవరణాన్ని కాలుష్య కాసారంగా మార్చాం. ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాం. ఈ పూట గడిస్తే చాలు అన్న ట్లుగా వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నాం. ప్రకృతి మాత మూలుగను పీల్చేస్తున్నాం. వెరసి... జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడుకోవాల్సిన పర్యా వరణ వనరుల బడ్జెట్‌ను పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో తెగ వాడేసుకుంటున్నాం.
అవసరాలు తీర్చుకోవటానికి కాకుండా అత్యా శకు పోయి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను ఆగస్టు 1 నాటికే పూర్తిగా కాజేసి... ఆ తర్వాత ప్రతి క్షణం ప్రకృతి మాత మూలుగను అదే పనిగా పీల్చేస్తున్నాం. దాంతో, తిరిగి తిప్పుకోలేని స్థితికి చేరిన భూగోళం గతి తప్పి సమతుల్యతను కోల్పోయింది. మొన్నటి వరకు గతమెన్నడూ ఎరుగనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడేమో అతి భారీ కుండపోత వర్షాలు, భీకర వరదలు; ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం కావటం... ఐక్య రాజ్యసమితి ప్రకటించి నట్లు ఇవన్నీ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’కి ప్రత్యక్ష నిదర్శనాలు. భూగోళం గతమెన్నడూ లేనంత ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశా ల్లోనూ గత 13 నెలలు అత్యంత అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. భూతాపాన్ని పెంచ టంలో, భూగోళం ఆరోగ్యాన్ని క్షీణింప జేయటంలో వ్యవసాయం, ఆహార సరఫరా రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని గణాంకాలు చెబు తున్నాయి. మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తోంది. మనం పండిస్తున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ భారీగా తగ్గి పోయాయి. భూగోళం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా క్షీణింపజేయటంలో పారిశ్రామిక వ్యవసాయ–ఆహార వ్యవస్థల పాత్ర చాలా ఉంది.
2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం...
క్లైమేట్ ఛేంజ్‌పై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన స్టాక్‌హోం రెజిలి యన్స్ సెంటర్ (ఎస్‌ఆర్‌సీ) సమాచారం ప్రకారం... ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగ తీరును బట్టి, భూతాపోన్నతిని బట్టి... భూగోళం ఆరోగ్యాన్ని 9 అంశాల ప్రాతిపదికగా అంచనా వేస్తారు. ఈ 9 అంశాల్లో ఆరింటిలో 2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం. ము ఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ఆరింటిలో ఐదింటికి కారణం వ్యవసాయం, ఆహార వ్యవస్థలేనని ఎస్‌ఆర్‌సీ తేల్చి చెప్పింది.
నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నావెల్ ఎన్‌టిటీస్, నత్రజని/ఫాస్ఫరస్ వంటి రసాయనాల వాడకం... ఈ ఐదు అంశాల్లో పరిస్థితి విషమించటడానికి ఒకానొక మూల కారణం ముఖ్యంగా రసా యనిక/పారిశ్రామిక వ్యవసాయం, ఆహార వ్యవస్థ లేనని ఎస్‌ఆర్‌సీ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమిలో 40 శాతం ఇప్పటికే సాగు యోగ్యం కాకుండాపోయి బంజరుగా మిగిలిపోయింది.
ఈ ఖాళీ భూముల నుంచి, పంట లేని పొలాల నుంచి రీ రేడియేషన్ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి వాతావరణంలోకి పరావర్తనం చెందటం భూతాపోన్నతికి దోహదం చేస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తు సరఫరా వ్యవస్థ చివరి గొలుసు వరకు (అగ్రీఫుడ్ సిస్టమ్స్) వెలువడే కర్బన ఉద్గారాలు క్లైమేట్ ఛేంజ్‌కు 34 శాతం మేరకు కారణభూతాలని గుర్తించాలి. తిరిగి ప్రాణశక్తిని పుంజుకొని సమతుల్యతను సంతరించుకోవడంలో భూగో ళానికి తోడుగా ఉండటానికి మార్గాలేవీ లేవా? తప్పకుండా ఉన్నాయన్నది నిపు ణులు చెబుతున్న గుడ్ న్యూస్. వాటిల్లో ఒకటేమిటంటే... పునరుజ్జీవన (ప్రకృతి/సేంద్రియ) వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తేవటం! తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే క్లైమేట్ సంక్షోభం నుంచి చాలా వరకు బయట పడొచ్చని సుసంపన్న అనుభవాలే తెలియజెబు తున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్, 86397 38658
ఇవి చదవండి: నిదానమే.. ప్రధానం!