Panthangi Rambabu
-
తప్పును సరిదిద్దుకునే మార్గాలు..!
పర్యావరణం సమతుల్యత కోల్పోయింది. కాదు... పర్యావరణాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేశాం. మన పనుల ద్వారా భూ ఆవరణాన్ని కాలుష్య కాసారంగా మార్చాం. ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాం. ఈ పూట గడిస్తే చాలు అన్న ట్లుగా వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నాం. ప్రకృతి మాత మూలుగను పీల్చేస్తున్నాం. వెరసి... జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడుకోవాల్సిన పర్యా వరణ వనరుల బడ్జెట్‌ను పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో తెగ వాడేసుకుంటున్నాం.అవసరాలు తీర్చుకోవటానికి కాకుండా అత్యా శకు పోయి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను ఆగస్టు 1 నాటికే పూర్తిగా కాజేసి... ఆ తర్వాత ప్రతి క్షణం ప్రకృతి మాత మూలుగను అదే పనిగా పీల్చేస్తున్నాం. దాంతో, తిరిగి తిప్పుకోలేని స్థితికి చేరిన భూగోళం గతి తప్పి సమతుల్యతను కోల్పోయింది. మొన్నటి వరకు గతమెన్నడూ ఎరుగనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడేమో అతి భారీ కుండపోత వర్షాలు, భీకర వరదలు; ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం కావటం... ఐక్య రాజ్యసమితి ప్రకటించి నట్లు ఇవన్నీ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’కి ప్రత్యక్ష నిదర్శనాలు. భూగోళం గతమెన్నడూ లేనంత ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశా ల్లోనూ గత 13 నెలలు అత్యంత అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. భూతాపాన్ని పెంచ టంలో, భూగోళం ఆరోగ్యాన్ని క్షీణింప జేయటంలో వ్యవసాయం, ఆహార సరఫరా రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని గణాంకాలు చెబు తున్నాయి. మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తోంది. మనం పండిస్తున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ భారీగా తగ్గి పోయాయి. భూగోళం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా క్షీణింపజేయటంలో పారిశ్రామిక వ్యవసాయ–ఆహార వ్యవస్థల పాత్ర చాలా ఉంది.2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం...క్లైమేట్ ఛేంజ్‌పై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన స్టాక్‌హోం రెజిలి యన్స్ సెంటర్ (ఎస్ఆర్సీ) సమాచారం ప్రకారం... ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగ తీరును బట్టి, భూతాపోన్నతిని బట్టి... భూగోళం ఆరోగ్యాన్ని 9 అంశాల ప్రాతిపదికగా అంచనా వేస్తారు. ఈ 9 అంశాల్లో ఆరింటిలో 2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం. ము ఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ఆరింటిలో ఐదింటికి కారణం వ్యవసాయం, ఆహార వ్యవస్థలేనని ఎస్ఆర్సీ తేల్చి చెప్పింది.నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నావెల్ ఎన్టిటీస్, నత్రజని/ఫాస్ఫరస్ వంటి రసాయనాల వాడకం... ఈ ఐదు అంశాల్లో పరిస్థితి విషమించటడానికి ఒకానొక మూల కారణం ముఖ్యంగా రసా యనిక/పారిశ్రామిక వ్యవసాయం, ఆహార వ్యవస్థ లేనని ఎస్ఆర్సీ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమిలో 40 శాతం ఇప్పటికే సాగు యోగ్యం కాకుండాపోయి బంజరుగా మిగిలిపోయింది.ఈ ఖాళీ భూముల నుంచి, పంట లేని పొలాల నుంచి రీ రేడియేషన్ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి వాతావరణంలోకి పరావర్తనం చెందటం భూతాపోన్నతికి దోహదం చేస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తు సరఫరా వ్యవస్థ చివరి గొలుసు వరకు (అగ్రీఫుడ్ సిస్టమ్స్) వెలువడే కర్బన ఉద్గారాలు క్లైమేట్ ఛేంజ్‌కు 34 శాతం మేరకు కారణభూతాలని గుర్తించాలి. తిరిగి ప్రాణశక్తిని పుంజుకొని సమతుల్యతను సంతరించుకోవడంలో భూగో ళానికి తోడుగా ఉండటానికి మార్గాలేవీ లేవా? తప్పకుండా ఉన్నాయన్నది నిపు ణులు చెబుతున్న గుడ్ న్యూస్. వాటిల్లో ఒకటేమిటంటే... పునరుజ్జీవన (ప్రకృతి/సేంద్రియ) వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తేవటం! తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే క్లైమేట్ సంక్షోభం నుంచి చాలా వరకు బయట పడొచ్చని సుసంపన్న అనుభవాలే తెలియజెబు తున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్, 86397 38658ఇవి చదవండి: నిదానమే.. ప్రధానం! -
లంపీ చర్మ వ్యాధి..: సంప్రదాయ చికిత్స
పశువుల చర్మంపై గడ్డల మారిదిగా వచ్చే ప్రాణాంతక వ్యాధి పేరు లంపీ చర్మ వ్యాధి. ఈ వ్యాధి గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గో సంతతికి సోకింది. గత నెలలో గుజరాత్లో 5 జిల్లాల్లో 1,229 పశువులకు సోకింది. 39 పశువులు ప్రాణాలుకోల్పోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రైతులకు ఇంటిపట్టున దొరికే సంప్రదాయ దినుసులతో కూడిన ఆయుర్వేద చికిత్సా పద్ధతులను రైతులకు అందుబాలోకి తెచ్చింది. లంపీ చర్మ వ్యాధి చికిత్సకు 2 పద్ధతులున్నాయి. 1) తినిపించే మందు: లంపీ చర్మ వ్యాధి చికిత్స కోసం సంప్రదాయ దినుసులతో నోటి ద్వారా తినిపించే మందు తయారు చేసే పద్ధతులు రెండు ఉన్నాయి. మొదటి విధానం: ఈ చికిత్సలో ఒక మోతాదుకు అవసరమయ్యే పదార్థాలు: తమలపాకులు 10, మిరియాలు 10 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. ఈ పదార్థాలన్నిటినీ గ్రైండ్ చేసి పేస్ట్‌లాగా తయారు చేయాలి. తయారు చేసిన పేస్ట్‌కు తగినంత బెల్లం కలిపి పశువుకు తినిపించాలి. మొదటి రోజున ఇలా తాజాగా తయారు చేసిన ఒక మోతాదు మందును ప్రతి 3 గంటలకోసారి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి.. రెండు వారాల పాటు.. రోజుకు మూడు సార్లు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) తాజాగా తయారు చేసిన మందును తినిపించాలి. రెండవ విధానం: లంపీ చర్మ వ్యాధికి సంప్రదాయ పద్ధతిలో మందును రెండు మోతాదులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. వెల్లుల్లి 2 పాయలు, ధనియాలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, తులసి ఆకులు గుప్పెడు, బిరియానీ ఆకులు పది గ్రాములు, మిరియాలు పది గ్రాములు, తమలపాకులు 5, ఉల్లిపాయలు చిన్నవి రెండు, పసుపు పది గ్రామలు, నేలవేము ఆకుల పొడి 30 గ్రాములు, కృష్ణ తులసి ఆకులు గుప్పెడు, వేపాకులు ఒక గుప్పెడు, నేరేడు ఆకులు ఒక గుప్పెడు.. ఇంకా బెల్లం వంద గ్రాములు. ఈ మందును కూడా ప్రతి సారీ తాజాగా తయారు చేయాలి. అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి, దానిలో బెల్లం కలపాలి. మొదటి రోజు ప్రతి 3 గంటల కోసారి తాజా మందు తయారు చేసి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి ప్రతిరోజూ మందును తాజాగా తయారు చేసి రోజుకు రెండుసార్లు చొప్పున పొద్దున్న, సాయంత్రం పశువు స్థితి మెరుగుపడే వరకు తినిపించాలి. 2) గాయంపై రాసే మందు: లంపీ చర్మం జబ్బు సోకిన పశువు చర్మంపై గాయం ఉంటే గనక, అందుకోసం ప్రత్యేకంగా సంప్రదాయ పద్ధతిలో మందు తయారు చేసి పై పూతగా పూయాలి. కావలసిన సామగ్రి: కుప్పింటాకులు 1 గుప్పెడు, వెల్లుల్లి పది రెబ్బలు, వేపాకులు ఒక గుప్పెడు, కొబ్బరి లేదా నువ్వుల నూనె 500 మిల్లీ లీటర్లు. పసుపు 20 గ్రాములు, గోరింటాకు ఒక గుప్పెడు, తులసి ఆకులు ఒక గుప్పెడు. తయారు చేసే విధానం.. అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేయాలి. దానిలో 500 మిల్లీ లీటర్ల కొబ్బరి లేదా నువ్వుల నూనె కలిపి మరిగించి, తర్వాత చల్లార్చాలి. రాసే పద్ధతి: గాయాన్ని శుభ్రపరచి దాని మీద ఈ మందును రాయాలి. గాయం మీద పురుగులు గనక ఉన్నట్లయితే.. సీతాఫలం ఆకుల పేస్ట్ లేదా కర్పూరం, కొబ్బరి నూనె కలిపి రాయాలి. National Dairy Development Board యూట్యూబు ఛానల్లో లంపీ చర్మ వ్యాధికి చికిత్సపై తెలుగు వీడియో అందుబాటులో ఉంది.. ఇలా వెతకండి.. Ethno-veterinary formulation for Lumpy Skin Disease-Telugu. -
నల్ల తామరతో జాగ్రత్త!
మిరప పంటను నల్ల తామర పురుగులు గత ఏడాది తీవ్రంగా నష్టపరిచాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడిన రైతులు ఎక్కువగా పంట నష్టాన్ని చవిచూశారు. రసాయన రహిత పద్ధతుల్లో సేద్యం చేసిన రైతులు తక్కువ ఖర్చుతోనే పంటను చాలా వరకు రక్షించుకోగలిగారు. బ్లాక్ త్రిప్స్ లేదా నల్ల తామర (త్రిప్స్ పర్విస్పినస్).. కొత్త రకం పురుగు ఇది. గత ఏడాది మిరప తోటల్లో విధ్వంసం సృష్టించి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. తెలుగు రాష్ట్రాలు సహా ఆరు రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో వందలాది గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) నిపుణులతో కూడిన కమిటీ లెక్క తేల్చింది. బ్లాక్ త్రిప్స్ 2015లో తొలిసారి బెంగళూరు పరిసరాల్లో బొప్పాయి తోటల్లో మొదటిసారి ఈ కొత్త రకం తామరపురుగు ను శాస్త్రవేత్తలు గుర్తించారు. 2018–19లో కర్ణాటకలో అనేక జాతుల అలంకరణ మొక్కలకు సోకింది. 2021లో మిర్చి పంటను తొలి సారి ఆశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, చత్తిస్‌ఘడ్ రాష్ట్రాల్లో పంటలకు నష్టం కలిగించింది. మిరపకు అత్యధికంగా దిగుబడి నష్టం కలిగించింది. మిరపతో ఆగలేదు. 2021 అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో కేంద్ర శాస్త్రవేత్తల బృందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పర్యటించినప్పుడు మిరపతోపాటు వంగ, మినుము, కంది, పుచ్చ, కీర దోస, సొర, మామిడి, పత్తి పంటల్లోనూ బ్లాక్ త్రిప్స్ కనిపించింది. ప్రపంచ మిరప సాగు విస్తీర్ణంలో 40% మన దేశంలోనే ఉంది. అత్యధిక మిరప ఉత్పత్తిదారు, ఎగుమతిదారు కూడా మన దేశమే. హెక్టారుకు రూ.2.5 లక్షల నుంచి 4 లక్షల మేరకు రైతులు పెట్టుబడి పెట్టే వాణిజ్య పంట కావటంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో మిరప పంటను సాగు చేసుకునే పద్ధతిని ఏపీ రైతు సాధికార సంస్థ నిపుణులు కంచర్ల రామచంద్రం రైతులకు ఈ కింది విధంగా సూచించారు. తామర పురుగులు 1–2 ఎం.ఎం. పొడవుంటాయి. మిరప పైరును ఆశించి ఆకులు, పూత నుంచి రసం పీల్చటం వలన ఆకులు పైకి ముడుచుకుంటాయి. మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత రాలిపోతుంది. కాయలు గిడసబారి పొట్టిగా ఉంటాయి. దిగుబడులు పూర్తిగా తగ్గుతాయి. తామర పురుగుల బెడద తగ్గాలంటే మిరప రైతులు ఈ పద్ధతులను పాటించాలి. 1. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడొద్దు. ఘన, ద్రవ జీవామృతాలను మాత్రమే వాడాలి. ఘన జీవామృతం ఎకరాకు 1500 కిలోలు దుక్కిలో వేసి బోదెలు తోలాలి. మిరప మొక్కలు నాటే రోజు 500 కిలోల ఘన జీవామృతాన్ని మొక్కల మొదళ్ల దగ్గర వేస్తూ నాటాలి. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతంను నీటి తడులతో పారించాలి. స్ప్రే కూడా చేయాలి. 2. మిరప పంటను ఏకపంటగా సాగు చేయకూడదు. అంతర పంటలుగా.. ఉల్లి, కొత్తిమీర, ముల్లంగి వంటి పంటలను.. ప్రతి రెండు మిరప మొక్కలకు మధ్య నాటాలి. 3. మిరపలో ఎర పంట (ట్రాప్ క్రాప్)గా ఎకరానికి 200–300 బంతి మొక్కలు నాటాలి. 4. ప్రతి ఎకరాకు 25–30 నీలి రంగు జిగురు అట్టలను పొలంలో అక్కడక్కడా పెట్టాలి. 5. మిరప పొలం చుట్టూ 3 లేదా 4 వరుసల్లో మొక్కజొన్న/జొన్నను రక్షక పంటగా విత్తాలి. 6. మిరప మొక్కలు నాటిన 10వ రోజు నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి: ► మొదట 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ∙3 రోజుల తర్వాత గంజి ద్రావణం పిచికారీ చేయాలి. ∙7 రోజుల తర్వాత కోడిగుడ్లు+నిమ్మ రసం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ∙15 రోజులకు పేడ+మూత్రం+ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ► 22వ రోజు వంద లీటర్ల నీటిలో 10 లీ. ద్రవ జీవామృతంతోపాటు 250 గ్రా. వర్టిసిల్లియమ్ లెకాని స్ప్రేచేయాలి. ► 30వ రోజు దశపర్ణి కషాయం స్ప్రే చేయాలి. ► 37వ రోజు మట్టి ద్రావణం స్ప్రే చేయాలి. ► 45వ రోజు నల్లేరు కషాయం స్ప్రే చేయాలి. తదుపరి అవసరాన్ని బట్టి పై షెడ్యూల్ ప్రకారం తిరిగి అదే వరుసలో మరోసారి పిచికారీ చేయాలి. ఏపీ రైతు సాధికార సంస్థ నిపుణులు కంచర్ల రామచంద్రంను 90004 00515 నంబరులో సంప్రదించవచ్చు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మనందరి పూర్వీకుల పురిటిగడ్డ ఆఫ్రికా...
తెలుగు తల్లి.. భారత మాత.. మనకు తెలుసు. ఈ ‘ఆదిమ అమ్మ’ ఎవరు? ఎప్పుడూ వినలేదే.. అనే కదా మీ ఆశ్చర్యం..?! ‘ఆదిమ అమ్మ’ గురించి తెలుసుకోవాలంటే.. మనందరి పూర్వీకుల పురిటిగడ్డగా భావిస్తున్న ఆఫ్రికా వెళ్లాలి! ఇంకా చెప్పాలంటే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరానికి దగ్గర్లో ఉన్న అతి పురాతన గుహల్లోకి వెళ్లాల్సిందే!! మనిషి బుద్ధిజీవి. అసలు మనిషి పుట్టుకకు ముందు సుదీర్ఘమైన పరిణామ క్రమం ఉంది. పురాతన కాలపు చరిత్రకు శాస్త్రీయ, సజీవ, సుసంపన్న, అమూల్య సాక్ష్యంగా నిలిచింది ఆఫ్రికా.. మరీ ముఖ్యంగా సౌతాఫ్రికా! 98 ఏళ్లుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇందుకు గట్టి సాక్ష్యాలు దొరికాయి. అనేక ఆదిమ, ఆధునిక మానవ జాతులకు సంబంధించిన శిలాజాలను శాస్త్రవేత్తలు సేకరించి, విశ్లేషించారు. అందుకే ఈ గుహల సముదాయానికి ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ అని పేరు వచ్చింది. ప్రపంచ మానవాళికి పురుడుపోసిన ఈ ‘క్రెడిల్’ను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఇటీవల జోహన్నెస్‌బర్గ్ వెళ్లిన సందర్భంగా అక్కడ నేను తెలుసుకున్న విశేషాలు... 25 లక్షల ఏళ్ల నాటి ‘మిసెస్ ప్లెస్’ జోబర్గ్(స్థానికంగా జోహన్నెస్‌బర్గ్‌ను అలా అంటారు)కు 45 కిలోమీటర్ల దూరంలో విస్తారమైన గడ్డి భూముల నడుమ ఆదిమానవులు లక్షలాది ఏళ్ల క్రితం నివసించిన గుహలున్నాయి. ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’గా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతం సుమారు 450 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో దాదాపు 300 చారిత్రక గుహల సముదాయం ఉంది. కనీసం 15 గుహల్లో మానవాళి పుట్టుక ఇక్కడే అని ధ్రువీకరించే కీలక శిలాజాలు లభించాయి, ఇంకా లభిస్తున్నాయి. అటువంటి సుసంపన్న శిలాజ గనుల్లో అతి ముఖ్యమైనది ‘స్టెర్క్ఫాంటీన్’ గుహ. కుటుంబ సభ్యులు, సహ పర్యాటకులతో కలసి ఎంతో ఉత్సుకతతో ఈ గుహలోకి అడుగుపెట్టాను. లక్షల ఏళ్ల క్రితం అక్కడ జీవించి, అదే మట్టిలో కలిసిపోయిన మానవ జాతుల విశేషాల గురించి గైడ్ ఉద్వేగంగా చెబుతుండగా.. అదే గుహలో 1947లో ‘పాలియో ఆంత్రపాలజిస్టు’లు డా. రాబర్ట్ బ్రూమ్, డా. జాన్ టి. రాబిన్సన్లు కనుగొన్న పురాతన మహిళ ‘మిసెస్ ప్లెస్’ కపాలం నమూనాను చేతుల్లోకి తీసుకున్నాను. 25 లక్షల సంవత్సరాల క్రితం ఆమె జీవించిందట. డోలమైట్‌తో కలగలిసిన సున్నపు రాతి నిల్వలున్న గుహ అది. అక్కడి మట్టిని తాకి.. చిన్న సున్నపు రాతి ముక్కను తీసుకున్నాను. గుహ అడుగున కొద్దిపాటి నీటి మడుగు ఉంది. సుదీర్ఘ మానవ చరిత్రను మౌనంగా వీక్షిస్తున్న ఆ చల్లని నీటిని చేతి వేళ్లతో తాకాను. ఉన్నట్టుండి.. మా చేతుల్లో ఉన్న టార్చ్లైట్లన్నిటినీ ఒక్క నిమిషం ఆర్పేయమని గైడ్ చెప్పింది. 60 గజాల లోతున చల్లని గుహంతా చిమ్మచీకట్లతో కూడిన నిశ్శబ్దం ఆవరించింది. మన అందరి కుటుంబ వృక్షం వేరు మూలాలను తడుముతున్నట్లు ఆ క్షణంలో.. నా మనసంతా మాటల్లో చెప్పలేని ఉద్వేగంతో నిండిపోయింది! షీ ఈజ్ అజ్! మనుషులంటే పురుషుడేనా? మహిళ కాదా? తెల్లజాతీయుల నుంచి దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్న మనమే ఇలా పప్పులో కాలేస్తే ఎలా? అని మరపెంగ్ సమచార కేంద్రం నిర్వాహకులు ఆలస్యంగా నాలుక కరచుకొని ఆనక దిద్దుబాటు చేశారు. ఆసియావాసుల పోలికలతో చామన ఛాయలో ఉన్న ఆధునిక మహిళ ముఖచిత్రాన్ని సైతం రెండేళ్ల క్రితం జోడించి ఈ ప్రపంచ వారసత్వ మ్యూజియానికి పరిపూర్ణత చేకూర్చారు. అంతేకాదు మనం ఏ దేశవాసులమైనా ప్రపంచ ప్రజలందరి పూర్వీకులూ బంధువులేనన్న భావనతో ‘ఆమే మనం (షీ ఈజ్ అజ్)’ అని కూడా ప్రకటించారు! ఇదీ దక్షిణాఫ్రికాలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’లో మెరిసిన మన ‘ఆదిమ అమ్మ’ కథ!! ∙∙ శాస్త్ర సాంకేతిక పురోగతి వెలుగులో అనేకానేక సంక్లిష్టతలను అధిగమిస్తున్నప్పటికీ పురాతన చారిత్రక విషయాల్లో ఊహకు అందని చీకటి అంకాలెన్నో ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ కారణంగానే సాధ్యమైనంత వరకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ దృష్టికోణం నుంచే ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిలాజాల పుట్ట దక్షిణాఫ్రికాలోని జోబర్గ్ సమీపంలో హాటెంగ్, నార్త్‌వెస్ట్ రాష్ట్రాల సరిహద్దుల్లో 47 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రమణీయ కొండ కోనల మధ్య విస్తరించిన అందమైన గడ్డి భూముల్లో సుమారు 300 వరకు పురాతన గుహలున్నాయి. వీటిలో పన్నెండు గుహల్లో ఎన్నో ఆది, ఆధునిక మానవ జాతుల ఉనికిని బలంగా ఎలుగెత్తి చాటే శిలాజాలు లభించాయి. 1924లో ‘టాంగ్ చైల్డ్’, మొదలుకొని మిసెస్ ప్లెస్, ‘హోమో నలెడి’ వరకూ.. గత 98 ఏళ్లుగా ఈ గనుల్లో లభించిన అనేక శిలాజాలే ఇందుకు నిదర్శనాలు. యునెస్కో 1999లో ‘ప్రపంచ వారసత్వ స్థలం’గా గుర్తించడంతో.. విశ్వ పర్యాటకులకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ ఆకర్షణగా నిలిచింది. మరో 9 వారసత్వ స్థలాలు కూడా సౌతాఫ్రికాలో ఉన్నాయి. చెట్టుదిగి నడవటమే గొప్ప మలుపు సుమారు 2,600 కోట్ల ఏళ్లకు పూర్వం (నియో ఆర్చియన్ యుగంలో) ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ ప్రాంతం సముద్రపు నీటిలో మునిగి ఉండేది. కాలక్రమంలో సున్నపు రాళ్లు–డోలమైట్‌తో కలగలిసిన గుహలు రూపుదిద్దుకున్నాయి. అటువంటి వందలాది అతిపురాతన గుహలు జోబర్గ్ పరిసర ప్రాంతంలో ఉన్నాయి. వాతావరణ మార్పుల మూలంగా క్రమంగా సముద్రం వెనక్కి తగ్గటంతో.. తదనంతర కాలంలో చింపాంజీలు, ఏప్(వాలిడులు)లకు, ఆది మానవులకు, జంతుజాలానికి భూమి ఆలవాలమయింది. మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఆదిమానవులు అడవిలో చెట్ల మీద నుంచి నేల మీదకు దిగి, రెండు కాళ్లపై నిలబడి పచ్చిక బయళ్లున్న ప్రాంతాల్లోకి నడిచారు. మానవ పరిణామ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం ఇది! అయితే, ఏప్‌ల నుంచి మనిషి ఎలా విడిపోయాడనేదానికి ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. శీతోష్ణ పరిస్థితుల రీత్యా ఆఫ్రికా గడ్డపైనే ఈ పరిణామం చోటు చేసుకుందని చెబుతారు. ఆ విధంగా అనేక ఆదిమ జాతులతో పాటు కాలక్రమంలో దాదాపు 2 లక్షల ఏళ్ల నాడు ఆలోచనా శక్తి కలిగిన ఆధునిక మానవజాతి (హోమోసెపియన్) ఆవిర్భవించింది. మొదటి శిలాజ ఆవిష్కరణ మానవాళి చరిత్రలో దక్షిణాఫ్రికా ప్రాధాన్యాన్ని లోకానికి చాటిన మొదటి శిలాజ ఆవిష్కరణ ‘టాంగ్ చైల్డ్’. ఇది ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతి శిశువుకు చెందిన కపాల శిలాజం. 1924 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని టౌంగ్లో దీన్ని క్వారీ కార్మికులు గుర్తించారు. జోహన్నెస్‌బర్గ్‌లోని విట్వాటర్స్రాండ్ విశ్వవిద్యాలయ శరీర నిర్మాణ శాస్త్రవేత్త ప్రొ. రేమండ్ డార్ట్ దీని విశిష్టతను గుర్తించి ‘నేచర్’లో వ్యాసం రాశారు. దీనికి ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ లేదా ‘ఆఫ్రికా దక్షిణ కోతి‘ అని పేరు పెట్టినప్పటికీ, శిలాజం తాలూకు శిశువుకు మనిషి లక్షణాలున్నాయని ఆయన గుర్తించారు. మానవ పరిణామాన్ని మలుపు తిప్పిన శిలాజాలు లభించిన మరికొన్ని ప్రపంచ వారసత్వ స్థలాల గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఇండోనేషియా జావాలోని సంగిరన్ ఎర్లీ మాన్ సైట్, చైనాలోని జౌకౌడియన్, ఇథియోపియాలోని లోయర్ వాలీ ఆఫ్ ద అవష్, లోయర్ వ్యాలీ ఆఫ్ ఓమోతోపాటు.. టాంజానియాలోని ఓల్డ్వాయ్ జార్జ్, ఎర్లీ హోమినిడ్ ఫుట్‌ప్రింట్స్ (లెటోలి). వీటిలో 36 లక్షల ఏళ్ల నాటి పురాతన మానవుల శిలాజాలు లభించటం విశేషం. ‘తెలివి’కి 2 లక్షల ఏళ్లు! మానవ పరిణామ చర్రితను స్థూలంగా ‘హోమోసెపియన్’ జాతికి ముందు.. తర్వాత.. అని విభజిస్తే అర్థం చేసుకోవటం సులభం. ఈ జాతీయులకు అంతకు పూర్వీకులైన ‘ఆస్ట్రాలోపిథెసిన్’ల కంటే పెద్ద మెదడు ఉంది. రాతి పనిముట్లను రూపొందించే శారీరక సామర్థ్యంతో పాటు.. మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న మొదటి మానవ జాతి ఇది. ‘హోమోసెపియన్’ జాతీయులు సుమారు 23 లక్షల సంవత్సరాల క్రితం తొలుత ఆఫ్రికాలో జీవించారు. ఇందులో అనేక ఉప జాతులున్నాయి. మొదటిది.. హోమోహబిలిస్. వీరు 19 లక్షల సంవత్సరాల క్రితం జీవించారు. వీళ్ల వారసులే ‘హోమోఎర్గాస్టర్’లు. దాదాపు 17 లక్షల సంవత్సరాల క్రితం జీవించారట. ఆధునిక సాధనాల ఉపయోగం, వంట, వెచ్చదనం కోసం అగ్నిని ఉపయోగించుకునే సామర్థ్యం వీరికుంది. ఈ సామర్థ్యమే వీరి వారసులు ఆఫ్రికాను వదలి చల్లని ప్రదేశాలకు వలస వెళ్లేలా చేసిందట. ఆ కొన్నాళ్లకే ‘హోమోఎరెక్టస్’ ఉద్భవించింది. హోమోసేపియన్ జాతీయులు అభివృద్ధి చెందే కొద్దీ, నైపుణ్యాలను అందిపుచ్చుకునే కొద్దీ వారి మెదడు కూడా వికసించింది. ఆ క్రమంలోనే సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం తొలి ఆధునిక మానవులైన ‘హోమోసేపియన్లు’ ఆఫ్రికాలో ఉద్భవించారు. లాటిన్లో హోమో అంటే ‘మానవులు‘, సేపియన్స్ అంటే ‘తెలివైన’అని అర్థం. క్రీ.శ. 1758లో కార్ల్ లిన్నేయస్ ఈ పదబంధాన్ని తొలిసారి వాడారు. ఇథియోపియాతోపాటు దక్షిణాఫ్రికాలో హొమో సేపియన్ జాతి శిలాజాలు కొన్ని బయటపడ్డాయి. ఈ క్రమంలోనే కనీసం 70 వేల సంవత్సరాల నుంచే మనుషులు అలంకరణ, కళాకృతుల తయారీ వంటి ఆధునిక పోకడలను సైతం అలవర్చుకున్నారు. హోమో సేపియన్లు కాలక్రమంలో ఆఫ్రికా నుంచి భూగోళం మీదున్న అన్ని భూభాగాలకూ విస్తరించారంటున్నారు పరిశోధకులు. నిజంగా మానవాళి పురిటి గడ్డేనా?∙ 1920–30లలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన శిలాజాల చారిత్రక ప్రాముఖ్యతను చాలా మంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఆఫ్రికా వెలుపల ఉన్నవారు, తొలుత కొట్టిపారేశారు. 1912లో ఇంగ్లండ్‌లోని ససెక్స్‌లో బయటపడిన ‘పిల్ట్‌డౌన్ మ్యాన్‘ అనే మానవ కపాల శిలాజంపైనే వారి దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమైంది. దీన్ని ‘ఎయోంత్రోపస్ డాసోని’ జాతిగా వర్గీకరించారు. ఈ పుర్రెను చార్లెస్ డాసన్ కనుగొన్నందున ఆయన పేరునూ దీనికి జోడించారు. ఐరోపాలో వెలుగుచూసిన సుదూర మానవ పూర్వీకుడుగా ‘పిల్ట్‌డౌన్ మ్యాన్’ ను అభివర్ణించారు. కోతిలాంటి దవడను, ఆధునిక మానవు (హోమోసేపియ¯Œ )ల మాదిరిగా పెద్ద మెదడు కలిగిన జీవిగా చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో శిలాజాల ప్రాధాన్యాన్ని తెలియజెబుతూ ప్రొ. రేమండ్ డార్ట్, డా. రాబర్ట్ బ్రూమ్ చేసిన విశ్లేషణలపై పాశ్చాత్య శాస్త్రవేత్తలు వివాదానికి దిగారు. వీరిద్దరూ దక్షిణాఫ్రికాలో కనుగొన్న ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ శిలాజాల మెదడు పరిమాణం చిన్నగా ఉండటం విమర్శకులకు అనుకూలించింది. అయితే, దశాబ్దాలు గడచిన తర్వాత, నిజం నిలకడ మీద బయటపడింది. ‘పిల్ట్‌డౌన్ మ్యాన్’ శిలాజం నకిలీదని చివరికి 1953లో శాస్త్రీయ పరిశోధనల్లో బట్టబయలైంది. మానవ పుర్రెకు ఒరాంగుటాన్ జంతువు దవడ (దంతాలను అరగదీసి మనిషివిగా చిన్నగా కనిపించేలా చేశారు)తో కలిపి పాతిపెట్టి.. సహజమైన శిలాజంగా నమ్మించే ప్రయత్నం చేశారని తేలింది. పిల్ట్‌డౌన్ బూటకం చాలామంది శాస్త్రవేత్తలను 40 ఏళ్లకు పైగా తప్పుదోవ పట్టించింది. దక్షిణాఫ్రికా శిలాజాల చారిత్రక ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించడం ఆ మేరకు ఆలస్యమైనా.. శాస్త్రీయంగా రూఢి అయ్యింది. ఈ బూటకపు శిలాజం సృష్టికర్తలెవరో నేటికీ కచ్చితంగా తెలియరాలేదు. దక్షిణాఫ్రికాలో ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతికి చెందిన అనేక శిలాజాల ఆవిష్కరణలు ఆ తర్వాత కూడా వెలుగులోకి వస్తుండటం, పిల్ట్‌డౌన్ స్కామ్ బహిర్గతం కావటంతో.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ‘మానవజాతి పురిటి గడ్డ’ ఆఫ్రికా అని ఎట్టకేలకు అంగీకరించారు. దక్షిణాఫ్రికా శిలాజ వారసత్వం ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి తరం ఆంగ్ల శాస్త్రవేత్తల్లో సర్ విల్ఫ్రెడ్ లీ గ్రాస్ క్లార్క్ ఒకరు. ∙∙ ఈ పూర్వరంగంలో పురాతన నాగరికతలు 10,000 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్నాయి. లిపి ఆవిర్భవించిన తర్వాత మానవ వికాసం మనకు తెలిసిన చరిత్రే. మానవ జనాభా 2000 ఏళ్ల క్రితం 20 కోట్లు ఉండేది. 790 కోట్లకు పెరిగింది. భూగోళంపైన, కొండ శిఖరాల నుంచి దీవుల వరకు, మట్టి కనిపించే ప్రతి చోటుకూ మనం విస్తరించాం. ధ్వని కన్నా వేగంగా భూగోళం ఆ దరి నుంచి ఈ దరికి ప్రయాణించగలుగుతున్నాం. కానీ, పుడమి పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం.. ప్రకృతిసిద్ధమైన జంతుజాలం ఆవాసాలను నాశనం చేస్తున్నాం.. అత్యాధునిక రూపాల్లో యుద్ధాలకు తెగబడుతున్నాం.. సుదీర్ఘ పరిణామ క్రమంలో అందివచ్చిన గొప్ప తెలివి తేటలు మనల్ని దీర్ఘకాలం జీవించనిస్తాయా? లేక గంపగుత్తగా దుంపనాశనం చేస్తాయా? పుట్టింటికి పునరాహ్వానం! యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’కు సంబంధించిన అధికారిక మ్యూజియం కమ్ సమాచార కేంద్రం పేరు ‘మరపెంగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’. మేం చూసిన ‘స్టెర్క్ఫాంటీన్’ గుహకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. 29 మిలియన్ డాలర్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 2005 డిసెంబర్ 7న ప్రారంభమైన ‘మరపెంగ్’.. మానవ పరాణామ విజ్ఞానశాస్త్ర గని అని చెప్పొచ్చు. పర్యాటకులను, మానవ పరిణామ శాస్త్ర అధ్యయనకారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే రీతిలో విశేషాలేన్నిటినో ఇక్కడ పొందికగా ఆవిష్కరించారు. మరపెంగ్ అంటే.. స్థానిక ‘సెస్త్వానా’ భాషలో ‘పుట్టింటికి పునరాహ్వానం’ అని అర్థం. ‘వెల్కమ్ హోమ్.. ఎక్స్ప్లోర్ యువర్ హ్యూమన్ హెరిటేజ్’ అంటూ తెల్లని పతాకం మనల్ని లోపలికి ఆహ్వానిస్తుంటుంది. విశ్వం, భూమి, జీవుల పుట్టుక.. తదనంతర పరిణామక్రమంలో ఆది మానవుల పుట్టుక, నిప్పు వాడుక/ నియంత్రణ, రాతి పరికరాల వాడటం.. ఆధునిక మానవుల పుట్టుక, జీవన వికాసాలకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ‘మరపెంగ్’లోని భూగర్భ మ్యూజియం అత్యద్భుతంగా పర్యాటకుల కళ్లకు కడుతోంది. ఆదిమ, ఆధునిక మానవ జాతులకు ప్రతీకలుగా రూపొందించిన కొన్ని విగ్రహాలను, సజీవ వ్యక్తులను తలపించేలా చారిత్రక ఔచిత్యంతో రూపకల్పన చేసిన ముఖచిత్రాలను ప్రదర్శించారు. కోతిని పోలిన నలుపు/చామన ఛాయ ఆదిమానవుల దగ్గర నుంచి జర్మనీ మూలాలున్న నియాండర్తల్ తెల్ల జాతీయుడి ముఖచిత్రం వరకు ఇందులో ఉన్నాయి. అయితే, వాటిలో చాలా వరకు పురుషుల ముఖ చిత్రాలే! భూగర్భ వ్యోమగాములు! అవును.. మీరు చదివింది నిజమే.. వ్యోమగాముల అవసరం రోదసిలోనే కాదు, ఒక్కోసారి భూగర్భంలోనూ ఉంటుంది. గుహలో అత్యంత క్లిష్టమైన స్థితిలో శిలాజాల అన్వేషణలో క్లిష్ట దశను అధిగమించడానికి అవసరమైంది. ఆ సాహస కార్యాన్ని ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు అద్భుతంగా నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. ‘భూగర్భ వ్యోమగాముల’ను మేం ముద్దుగా పిలుచుకుంటున్న ఈ ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు లేకుండా మన దగ్గరి బంధువైన ఓ కొత్త జాతి ఆవిష్కరణ సాధ్యమయ్యేది కాదని ప్రధాన పరిశోధకుడు ప్రొ. లీ బెర్గర్ 2015 సెప్టెంబర్‌లో ప్రకటించారు. ఈ ఆదిమ జాతికి ‘హోమో నెలడి’ అని పేరుపెట్టారు. ఏడేళ్ల కిందట.. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ గుహల సముదాయంలోని రైజింగ్ స్టార్ అనే గుహలో శిలాజాల కోసం అన్వేషణ ఉత్కంఠభరితంగా సాగుత్ను రోజులవి. 18 సెం.మీ. ఖాళీలోంచి.. ప్రొ. లీ బెర్గర్ బృందం గని లోపల తవ్వకాలు చేస్తుండగా. ఆది మానవుల శిలాజాలు కొన్ని దొరికాయి. అక్కడి నుంచి కిందికి చిన్న దారి కనిపించింది. ఆ లోపల 30 మీటర్ల కింద మరో చిన్న గది కనిపించింది. అందులో ఇంకా మానవ శిలాజాలు ఉన్నాయని ప్రత్యేక పరికరాల ద్వారా త్రీడీ స్కాన్ ద్వారా కనుగొన్నారు. అయితే, ఆ దారిలో రెండు బండరాళ్ల మధ్య కేవలం 18 సెంటీమీటర్ల (ఫుట్‌బాల్ కన్నా తక్కువ) ఖాళీ మాత్రమే ఉంది. మనిషి లోపలికి వెళ్లకుండా శిలాజాలను సేకరించలేం. అంత సన్నని దారిలోంచి లోపలికి వెళ్లటం ఎలా? అంత సన్నగా ఉండే మనుషులైతే లోపలికి వెళ్లగలరన్న ఆలోచనతో ప్రొ. లీ బెర్గర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. 18 సెం.మీ. కన్నా సన్నని శరీరం కలిగిన పురావస్తు తదితర శాస్త్రాల్లో పీజీ చదివి ఉండి, గుహల్లోకి దిగే అనుభవం ఉన్న వారెవరైనా సంప్రదించమని కోరారు. పది రోజుల్లో 60 దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అన్ని అర్హతలున్న 6గురు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. వారే.. ఈ భూగర్భ వ్యోమగాములు.. మెరీనా ఇలియట్ (కెనడా), బెక్కా పీక్సోటో (వాషింగ్టన్ డిసి), లిండ్సే హంటర్ (అయోవా), ఎలెన్ ఫ్యూరిగెల్ (ఆస్ట్రేలియా), హన్నా మోరిస్ (ఒహైయో), అలియా గుర్టోవ్ (విస్కాన్సిన్). 30 మీటర్ల దిగువ వరకు పాక్కుంటూ వెళ్లి శిలాజాలను వెలికితీయటమే ఈ మహిళా శాస్త్రవేత్తలు చేసిన సాహసం. దాదాపు 3 వారాల పాటు సాగిందీ అన్వేషణ. దాదాపు 15 మందికి చెందిన 1500 ఎముకలు లభించాయి. ఆఫ్రికాలో ఒకేచోట ఇన్ని మానవ శిలాజాలు దొరకటం ఓ రికార్డు. యూరేసియా కూడా ముఖ్య రంగస్థలమే! ఆఫ్రికాయే మానవుల పురిటిగడ్డ అనే వాదనతో విభేదించే వారూ లేకపోలేదు. వీరిలో హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ రైక్ ఒకరు. ‘హూ వియార్ అండ్ హౌ వియ్ గాట్ హియర్’ అనే పుస్తకాన్ని ఇటీవలే వెలువరించారు. ప్రాచీన మానవ డీఎన్ఏ విశ్లేషణకు తోడ్పడిన పదిమంది మార్గదర్శకులలో ఒకరిగా డేవిడ్ రైక్‌కు గుర్తింపుంది. మానవ సంబంధ ఆవిష్కారాలన్నీ ఆఫ్రికాలోనే సంభవించాయని, అక్కడి వారే మిగతా ప్రపంచమంతా విస్తరించారనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు డేవిడ్ రైక్ . మానవ పరిణామక్రమంలో పురాతన మానవ జాతి నియాండర్తల్స్ నివసించిన యూరేసియా (యూరప్, ఆసియాలు మొత్తం విస్తరించిన ప్రాంతం) కూడా ముఖ్య రంగస్థలమే అంటున్నారాయన. ‘మానవులు అంతర్గతంగా మిశ్రమ పూర్వీకుల నుంచి ఉద్భవించారు. ఏ జనసమూహం కూడా స్వచ్ఛమైనది కాదు. భిన్నమైన సమూహాల కలయిక మానవ స్వభావపు సాధారణ లక్షణం. గతం నుంచి మనం నేర్చుకోవాలి.. మరింత కనెక్ట్ అవ్వాలి’ అంటున్నారు ప్రొ. డేవిడ్ రైక్. -పంతంగి రాంబాబు , సాక్షి ప్రత్యేక ప్రతినిధి, (జోహన్నెస్‌బర్గ్ నుంచి) -
మనం వాడే నూనె మంచిదేనా?
పత్తి పంటను పండిస్తున్నది దూది కోసం మాత్రమే కాదు. తరచి చూస్తే ఇది నూనె గింజల పంట కూడా అని అర్థమవుతుంది. ప్రధాన ఉత్పత్తి దూది... ఉప ఉత్పత్తులు నూనె, చెక్క. పత్తి గింజల ఉప ఉత్పత్తులు దేశ విదేశాల్లో అనాదిగా ఉపయోగంలో ఉన్నవే. అయితే, పత్తి విత్తనాల్లో విషతుల్యమైన బీటీ(బాసిల్లస్ తురింగీనిసిస్ అనే సూక్ష్మజీవి) జన్యువును ‘జన్యుమార్పిడి సాంకేతికత’ ద్వారా చొప్పించి జన్యుమార్పిడి పత్తి విత్తనాలను రూపొందిస్తున్నారు. ఇలా తయారైన బీటీ పత్తి గింజల నుంచి తీసిన నూనెను వంట నూనెల్లో, నూనె తీసిన తర్వాత మిగిలిన చెక్కను పశువుల దాణాలో కలుపుతున్నారు. 20 ఏళ్లుగా మన దేశంలో మన ఆహార చక్రంలో ఇవి కలుస్తున్నాయి. జన్యుమార్పిడి సోయా చిక్కుళ్ల చెక్క (జీఎం సోయా మీల్) దిగుమతిపై నిషేధాన్ని గత నెలలో కేంద్ర ప్రభుత్వం తొలిసారి సడలించడంతో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో బీటీ పత్తి గింజల నూనె, చెక్కలో మిగిలి ఉండే బీటీ విష ప్రభావం ప్రజలు, పశువుల ఆరోగ్యంపై ఎలా ఉందనేది ఆసక్తిగొలిపే అంశం. వినియోగం భారత్‌లోనే ఎక్కువ కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సి.ఐ.సి.ఆర్.) సమాచారం ప్రకారం– 20వ శతాబ్దం తొలి నాళ్ల నుంచి పత్తి గింజల ఉత్పత్తుల వినియోగం ప్రారంభమైంది. మన దేశంలో దేశీ రకాల పత్తి గింజలను పశువులకు దాణాగా పెట్టేవారు. 1914లో ఇండియన్ ఆయిల్ కంపెనీ తొలి పత్తి గింజల నూనె మిల్లును ఏర్పాటు చేసింది. మిల్లు ఆడించిన పత్తి గింజల బరువులో 45% పత్తి చెక్క, 16% ముడి నూనె వస్తాయి. జన్యుమార్పిడి బీటీ పత్తి సాగు మన దేశంలో ప్రారంభమయ్యే నాటికి, 2002లో మన దేశంలో 41.32 లక్షల టన్నుల పత్తి గింజల నుంచి 4.13 లక్షల టన్నుల నూనె ఉత్పత్తి అయ్యింది. ఇందులో దేశవాళీ పత్తి గింజల నుంచి తీసిన నూనె 90% వరకు ఉంటుంది. 2020వ సంవత్సరం నాటికి 90%కి పైగా మన దేశంలో బీటీ పత్తి సాగులోకి వచ్చింది. 13.9 లక్షల టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా బీటీ పత్తి గింజల నూనెను ఉత్పత్తి చేసి, వినియోగించే దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ఇదే సంవత్సరంలో చైనాలో 13.7 లక్షల టన్నులు, బ్రెజిల్లో 6.8 లక్షల టన్నులు, పాకిస్తాన్లో 3.2 లక్షల టన్నులు, అమెరికాలో 2.2 లక్షల టన్నుల పత్తి గింజల నూనె ఉత్పత్తయ్యింది. ఆ దేశాలు కూడా 90% పత్తిని జన్యుమార్పిడి వంగడాలతోనే పండిస్తున్నాయి. లోతైన పరిశోధనల ఆవశ్యకత జన్యుమార్పిడి ఆహారతోత్పత్తుల వల్ల మనుషుల్లో ఎలర్జీలు, పశువుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. బీటీ పత్తి గింజల్లో ఉండే బీటీ జన్యువులు, బీటీ ప్రొటీన్లు నూనెలో ఎంత మేరకు ఉన్నాయనేది కనుగొనటం సాంకేతికంగా పెద్ద సవాలని సి.ఐ.సి.ఆర్. పూర్వ సంచాలకులు, డాక్టర్ కేశవ్ ఆర్.క్రాంతి అంటున్నారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ పత్తి సలహా సంఘం సాంకేతిక సమాచార విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ‘‘2000–2002 వరకు నాగపూర్‌లోని సీఐసీఆర్ ప్రయోగశాలలో మేం జరిపిన ప్రయోగాల్లో బీటీ పత్తి గింజల ముడి నూనెలో బీటీ జన్యువు, బీటీ విషం ఆనవాళ్లు కనిపించాయి. అయితే, శుద్ధిచేసిన తర్వాత కనిపించలేదు’’ అని ఆయన అన్నారు. ‘‘అయితే, మేము ఎలీసా, పీసీఆర్‌లతో పరీక్షలు జరిపాం. వీటిని ప్రాథమిక ప్రయోగాలుగా భావించవచ్చు. క్వాంటిటేటివ్ పీసీఆర్ లేదా ఆర్టీ–పీసీఆర్ (రియల్‌టైమ్ పీసీఆర్) పరీక్షలంతటి మెరుగైన ఫలితాలను ఈ పరీక్షలు ఇవ్వలేవు. నూనెను వేడి చేసి వాడతాం కాబట్టి లేశమాత్రంగా ఉన్న బీటీ జన్యువులు, బీటీ ప్రొటీన్ల ద్వారా మనుషులకు హాని జరగడానికి అవకాశాలు లేవు. ఏదేమైనా, ఈ అంశంపై అత్యాధునిక పద్ధతుల్లో లోతైన శాస్త్రీయ అధ్యయనాలు భారత్‌లో జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నది నా దృఢమైన అభిప్రాయం’’ అని వ్యాస రచయితకు ఇచ్చిన ఈ–మెయిల్ ఇంటర్వ్యూలో కేశవ్ క్రాంతి అభిప్రాయపడ్డారు. చెత్తబుట్టలో స్థాయీ సంఘం సిఫారసులు లక్షల టన్నుల్లో వినియోగంలో ఉన్న బీటీ పత్తి గింజల నూనె, చెక్క వంటి జన్యుమార్పిడి ఆహారోత్పత్తులపై శాస్త్రీయమైన భద్రతా పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను ప్రజలకు తెలియజెప్పవలసిన గురుతర బాధ్యత జెనిటిక్ ఇంజినీరింగ్ అప్రూవల్ కమిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలపై ఉంది. బీటీ పత్తి సాగుపై నిర్ణయం తీసుకున్నప్పుడే నూనె, చెక్కల ప్రభావం గురించి కూడా నియంత్రణ సంస్థలు పట్టించుకొని ఉండాల్సింది. కలుపు మందును తట్టుకునేలా జన్యుమార్పిడి పత్తి అక్రమంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఈ పత్తి గింజల నూనె, చెక్కతో మరింత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం క్షుణ్ణంగా అధ్యయనం చేసి దశాబ్దం క్రితమే ఇచ్చిన సిఫారసులను సైతం వరుస కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా పెడచెవిన పెట్టడం వల్లనే ప్రజారోగ్యం పెనుప్రమాదంలో పడిందని గుర్తించాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో అయినా, బహుళజాతి సంస్థల ఒత్తిళ్లను పక్కన పెట్టి, పాలకులు దృష్టి సారించాల్సిన అతి ముఖ్యమైన అంశాలివి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
గ్రీన్ సిటీ ప్లానింగ్.. రొసారియో సక్సెస్ స్టోరీ ఇది!
పట్టణాలు.. నగరాల సరిహద్దు కమతాలు ప్లాట్లుగా.. బహుళ అంతస్తుల భవనాలుగా కనిపిస్తున్న సంగతి తెలుసు! అవే పట్టణాలు, నగరాల పొలిమేర భూములే కాదు.. నడిబొడ్డు ఖాళీస్థలాలు కూడా కూరగాయలు పండించే తోటలుగా మారుతున్న వైనం తెలుసా?! దీన్నే అర్బన్.. పెరీ అర్బన్ హార్టికల్చర్’ అంటున్నారు. సింపుల్‌గా ‘గ్రీన్ సిటీస్ ప్లానింగ్’ అన్నమాట!! ఇదే ప్రస్తుత ప్రపంచ ఒరవడి.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు గొప్ప వరం! అనుసరిస్తే పోయేది మురికివాడలు.. పెరిగేది ఉపాధి.. సిద్ధించేవి పర్యావరణ ప్రియ ప్రాంతాలు!! ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించడానికి వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ‘ప్రైజ్ ఫర్ సిటీస్’ అవార్డులనూ అందిస్తోంది రెండేళ్లకోసారి. ఈ ఏడు అర్జెంటీనాలోని ‘రొసారియో’ ఆ అవార్డ్‌ను అందుకుంది. అసలు గ్రీన్ సిటీస్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? రొసారియో సక్సెస్ స్టోరీ ఏంటీ? వివరాలు ఈ కవర్ స్టోరీలో.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరాలు, పట్టణాలు గతమెన్నడూ ఎరుగనంత వేగంగా విస్తరిస్తున్నాయి. ఉపాధిని వెతుక్కుంటూ పొట్ట చేత పట్టుకొని గ్రామీణులు వలస బాట పడుతున్న కారణంగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరాలు/పట్టణ ప్రాంత జనాభా నానాటికీ భారీగా పెరుగుతోంది. ప్రపంచంలో సగానికిపైగా జనం ఇప్పటికే నగరవాసులు. 2050 నాటికి ప్రపంచ జనాభా (900 కోట్లు)లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు పట్టణ ప్రాంతవాసులవుతారట. 2025 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో సగానికి సగం (350 కోట్ల) మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారని ఓ అంచనా. ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో నగరీకరణకు శతాబ్దాల కాలం పట్టింది. అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామికీకరణ నేపథ్యంలో వేగంగా పెరుగుతున్న తలసరి ఆదాయం మూలంగా రెండు–మూడు తరాల్లోనే నగరీకరణ వేగవంతమవుతోంది. ఉపాధి అవకాశాల మెరుగుకన్నా అధిక జననాల రేటు కారణంగానే ఈ పట్టణ ప్రాంతాల్లో జనాభా సాంద్రత పెరుగుతోంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని అల్పాదాయ దేశాల్లోని నగరాల జనాభా ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ నగరీకరణతో పేదరికం, నిరుద్యోగం, ఆహార అభద్రత కూడా పోటీపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు తగినంత ఆరోగ్య, నీటి, పారిశుద్ధ్య సదుపాయాలకు నోచుకోక, కాలుష్యపు కోరల్లో చిక్కి, కిక్కిరిసిన మురికివాడల్లో జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నగరాలు, పట్టణాల్లో నివాసం ఉండే 77 కోట్ల మందిలో సుమారు 30% మంది నిరుద్యోగులు లేదా అత్యల్ప ఆదాయంతో బతుకులీడుస్తున్న నిరుపేదలు. లాటిన్ అమెరికా దేశాల్లో పేదల్లో 85% మంది.. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని పేదల్లో సగానికి సగం మంది ఇప్పటికే నగరాలు, పట్టణ ప్రాంతాలకు చేరి ఉపాధి వెతుక్కుంటున్నారు. దీని అర్థం ఏమిటంటే.. సాంఘిక భద్రత, ఉపాధి అవకాశాలు కొరవడిన పేదలతో మన పట్టణాలు, నగరాలు గతమెన్నడూ ఎరుగనంతగా కిక్కిరిసిపోయి ఉన్నాయి. గ్రీన్ సిటీలే శరణ్యం చారిత్రకంగా నగరీకరణలో ఆశావహ పరిస్థితి కొరవడిందని చెప్పలేం. అయితే, నగరీకరణ జరుగుతున్న తీరు మాత్రం ప్రజలకు సుస్థిరమైన జీవనాన్ని అందించే రీతిలో లేదన్నది వాస్తవం. వందల కిలోమీటర్ల దూరం నుంచి రవాణా అయ్యే ఆహారోత్పత్తులపైనే నగరాలు, పట్టణాలు అమితంగా ఆధారపడుతుండటం పెను సవాలుగా నిలిచింది. దూర ప్రాంతాల నుంచి ఆహారోత్పత్తుల్ని తరలించడం వల్ల భూతాపం పెరుగుతున్నది. అస్థిర పద్ధతుల నుంచి మళ్లించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా నగరీకరణను నడిపించడం ఇప్పుడు మానవాళి ముందున్న పెద్ద సవాలు. నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్థానికంగా ఉత్పత్తి చేసుకునే పౌష్టికాహార లభ్యతతో కూడిన మెరుగైన సుస్థిర జీవనం వైపు.. ఆశావహమైన అవకాశాల దిశగా అడుగులు వేయాలంటే ‘గ్రీనర్ సిటీస్’ను నిర్మించుకోవటం అనివార్యమని, అసాధ్యమూ కాదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. భరోసా ఇస్తోంది. అర్బన్ హార్టికల్చర్‌కు పెద్ద పీట పర్యావరణ మార్పుల్ని తట్టుకోవటం, స్వావలంబన, సాంఘిక, ఆర్థిక, పర్యావరణ సుస్థిరత ప్రధానాంశాలే గ్రీన్ సిటీస్ భావన. పర్యావరణ అనుకూల సూత్రాలను ఇముడ్చుకున్న అత్యాధునిక భవన నిర్మాణ పద్ధతులు, సైకిల్ గ్రీన్‌వేస్, పట్టణ వ్యర్థాల పునర్వినియోగం.. వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. దీన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పటి నుంచో అమలుపరుస్తున్నాయి. అల్పాదాయ దేశాల్లో స్థితిగతులు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భిన్నంగా ఉన్నప్పటికీ గ్రీనర్ సిటీస్ నమూనాతో కూడిన పట్టణాభివృద్ధి ప్రణాళికను అనుసరించవచ్చు. ఆహార భద్రతను కల్పించడం, గౌరవప్రదమైన పనిని, ఆదాయాన్ని పొందే మార్గాలు చూపటం, శుద్ధమైన పర్యావరణాన్ని, సుపరిపాలనను ప్రజలందరికీ అందించాలన్నవి ఈ నమూనాలో ముఖ్యాంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే పట్టణ, నగర పరిధిలో, పరిసర ప్రాంతాల్లో ప్రకృతికి, ప్రజారోగ్యానికి హాని కలగని వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు వంటి ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యమివ్వటం గ్రీనర్ సిటీస్ నమూనా. అటు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, ఇటు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం గ్రీన్ సిటీ ప్లానింగ్‌లో ‘అర్బన్ అండ్ పెరీ అర్బన్ హార్టికల్చర్’కు చోటు కల్పిస్తుండటం ఆధునిక ధోరణిగా ప్రాచుర్యంలోకి వస్తోంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బంగాళదుంపలు, బీట్రూట్ వంటి దుంప పంటలు, అలంకరణ, ఔషధ మొక్కలను సాగు చేయవలసింది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాదు. పట్టణాలు, నగరాలు వాటి పరిసర ప్రాంతాల్లోనూ చేయాలి. ఇలా ప్రత్యేక శ్రద్ధతో రైతులు, పట్టణ పేదలతో సాగు చేయించడాన్నే ‘అర్బన్, పెరీ అర్బన్ హార్టికల్చర్’ అంటున్నాం. పట్టణాలు, నగరాల్లో తమ కుటుంబం తినటం కోసం, మిగతాది అమ్మటం కోసం ఉద్యాన పంటలు పండించే అర్బన్ ఫార్మర్స్ ఆఫ్రికాలో 13 కోట్ల మంది, లాటిన్ అమెరికాలో 23 కోట్ల మంది ఉన్నారని ఎఫ్.ఎ.ఓ. అంచనా. గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్ ప్రాంతాలకు వలస వచ్చిన పేదలు ఉద్యాన పంటలు సాగు చేసి పొట్టపోసుకోవటం కొన్ని దేశాల్లో సాధారణమే. మరికొన్ని దేశాల్లో అర్బన్ హార్టికల్చర్‌పై నిషేధం అమల్లో ఉంది. అయితే, క్రమంగా ఈ ధోరణిలో మార్పు వస్తోంది. సిటీ ఫార్మర్స్‌కు అడ్డంకిగా ఉన్న నిబంధనలు తొలగించి, ప్రోత్సాహకాలను అందించటం, శిక్షణ ఇవ్వటం వంటి విషయాలపై విధాన సహాయం కోసం ఇటీవల కాలంలో 20 ఆఫ్రికా దేశాలు ఎఫ్.ఎ.ఓ.ను ఆశ్రయించడం ట్రెండ్ మారుతున్నదనడానికి నిదర్శనం. నగర పరిసర ప్రాంతాల్లో వాణిజ్యస్థాయిలో విస్తృతంగా పంటల సాగు, మురికివాడల్లో మట్టి లేకుండా హైడ్రోపోనిక్ పద్ధతుల్లో మైక్రో గార్డెన్ల నిర్వహణ.. నగరాల్లో కిక్కిరిసిన ఇళ్లపై రూఫ్‌టాప్ కిచెన్ గార్డెన్ల సాగుపై ఎఫ్.ఎ.ఓ. మార్గదర్శనం చేస్తోంది. పట్టణ పేదలకు పౌష్టికాహార, ఆహార భద్రతను కల్పించడంలో, సాధికారత చేకూర్చడంలో అర్బన్, పెరీ అర్బన్ హార్టీకల్చర్ నిస్సందేహంగా దోహదపడుతున్నట్లు ఎఫ్.ఎ.ఓ. తదితర సంస్థల కార్యక్రమాల ద్వారా రుజువైంది. అర్బన్ హార్టీకల్చర్కు నగర అభివృద్ధి ప్రణాళికల్లో పెద్ద పీటవేయడం ద్వారా గ్రీన్ సిటీల వికాసం సాధ్యమేనని వివిధ దేశాల అనుభవాలూ తెలియజెబుతున్నాయి. రొసారియో.. ఓ వేగుచుక్క! లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనా లోని రొసారియో నగరం అర్బన్ హార్టికల్చర్‌పై ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. నగరాభివృద్ధి ప్రణాళికలో అర్బన్ హార్టికల్చర్‌ను అంతర్భాగం చేయటం ద్వారా బహుళ ప్రయోజనాలు సాధిస్తూ ప్రపంచ నగరాలకు ఆదర్శంగా నిలిచింది. మురికివాడల్లోని నిరుపేదలకు నగరంలో, నగర పరిసరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను శాశ్వత ప్రాతిపదికన లీజుపై కేటాయించారు. ఆయా స్థలాల్లో సేంద్రియ కూరగాయలు, పండ్లు పండించుకునేందుకు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో శిక్షణ ఇవ్వటంతోపాటు రొసారియో మునిసిపల్ కార్పొరేషన్ సదుపాయాలు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉద్యాన అధికారులను నియమించింది. కర్షక కుటుంబాలు తినగా మిగిలిన కూరగాయలు, పండ్లను, వాటితో తయారు చేసిన అనేక రకాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేసింది. తద్వారా వారు ఉపాధి పొందేందుకు వినూత్న అవకాశం కల్పించింది. నగరంలో ప్రతి పౌరుడికి 12 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న అత్యంత ఆకుపచ్చని అర్జెంటీనా నగరంగా రొసారియోను అమెరికా అభివృద్ధి బ్యాంకు 2019లో గుర్తించింది. నగరంలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగుతో పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా నగర వాతావరణాన్ని సైతం చల్లబరచుకోవచ్చని, భూతాపాన్ని తగ్గించవచ్చని రొసారియో రుజువు చేస్తోంది. ప్రజలకు అవసరమైన పంటలను వందల కిలోమీటర్ల నుంచి తీసుకురాకుండా నగరం పరిధిలోనే సాగు చేసుకొని తింటున్నందున హరిత గృహ వాయువులు 95% మేరకు తగ్గాయని రొసారియో నేషనల్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. 20 ఏళ్ల కృషి అర్జెంటీనాలో మూడో పెద్ద నగరం రొసారియో. ప్రముఖ మార్క్సిస్టు విప్లవకారుడు చేగువేరా జన్మస్థలం ఇదే. ప్రస్తుత జనాభా 17.5 లక్షలు. పరనా నది ఒడ్డున రొసారియో మునిసిపల్ కార్పొరేషన్ 179 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. పారిశ్రామిక కేంద్రంగా, వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విరాజిల్లిన రొసారియో.. 2001లో, సరిగ్గా 20 ఏళ్ల క్రితం, పెను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. చాలా పరిశ్రమలు మూతపడి నగరంలో సగానికిపైగా జనాభా నిరుపేదలుగా మారిపోయారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. ఆహారం ధరలు నాలుగు రెట్లు అధికమై.. జనం ఆకలి దాడులకు పాల్పడాల్సిన దుస్థితి. అటువంటి సంక్షోభ కాలంలో రొసారియో మునిసిపల్ కార్పొరేషన్ 2002లో అర్బన్ హార్టికల్చర్ పథకం ‘ప్రో–గార్డెన్’ అమలుకు శ్రీకారం చుట్టింది. రసాయనాలు వాడకుండా ఉద్యాన పంటలు సాగు చేయటంలో 700 కుటుంబాలకు తొలుత శిక్షణ ఇచ్చారు. వీరంతా పేదలే. మహిళలు, వయోవృద్ధులు, యువత, వలస జీవులు. మొదట్లో జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, స్థానికంగా ఆహార భద్రత, ఆదాయ భద్రత ఏర్పడుతున్న విషయం అర్థమయ్యేటప్పటికి అర్బన్ హార్టికల్చర్ ప్లాట్లకు, ఉమ్మడిగా నిర్వహించుకునే కమ్యూనిటీ గార్డెన్లకు గిరాకీ పెరిగింది. కనీస వేతనం కన్నా ఎక్కువగానే సంపాదన కనిపించసాగింది. ఒక దశలో పదివేలకు పైగా పేద కుటుంబాలు ఈ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. తొలి రెండేళ్లలోనే 800కు పైగా పౌర బృందాల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు నగరపరిధిలో ఉన్న ఖాళీ స్థలాలు 185 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సాగు చేస్తున్నారు. నగర పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో 2,400కు పైగా పేద కుటుంబాలు సొంతంగా ఫ్యామిలీ గార్డెన్లను పెంచుతున్నాయి. జాతీయ కుటుంబ వ్యవసాయదారుల జాబితాలో వీరి పేర్లు నమోదు కావడంతో సాంఘిక భద్రతా పథకాల ద్వారా ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటును వీరు అందుకోగలిగారు. పండించిన సేంద్రియ ఉద్యాన ఉత్పత్తులను ప్రజలకు విక్రయించుకునేందుకు 7 చోట్ల ప్రత్యేక శాశ్వత మార్కెట్లను నెలకొల్పారు. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో ఎక్కువగా జన్యుమార్పిడి సోయా చిక్కుళ్లను ఏకపంటగా రసాయనిక సాగు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. నగర పరిసరాల్లోని 1,977 ఎకరాల అర్బన్ భూముల్లో చిన్న ప్లాట్లలో రకరకాల సేంద్రియ ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా 2,500 టన్నుల సేంద్రియ పండ్లు, కూరగాయలను సాగు చేస్తూ స్థానిక ప్రజలకు అందిస్తున్నారు. 25 మంది ఉద్యాన నిపుణుల ప్రత్యక్ష సేవలను ఉపయోగించుకుంటూ ఆశాజనకమైన సేంద్రియ దిగుబడులు సాధిస్తున్నారు. ఇటు మునిసిపాలిటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు రెండు దశాబ్దాలు చురుగ్గా పాల్గొనడంతో రొసారియో అర్బన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ నగర పేదలకు ఆహార, ఆరోగ్య, ఆదాయ భద్రతతోపాటు గణనీయమైన స్థాయిలో పర్యావరణ సేవలను సైతం అందించడంతో సూపర్ హిట్ అయ్యింది. దీన్ని అర్బన్ ప్లానింగ్‌లోనూ చేర్చారు. ప్రకృతి వనరులను కలుషితం చేయకుండా, వ్యర్థాలను పునర్వినియోగిస్తూ ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తిని చేపట్టడంతో సిటీలోని అర్బన్ ఫామ్స్ ద్వారా కనీసం 40 వేల మందికి ఆహార భద్రత చేకూరింది. 340 ఉత్పాదక బృందాలు పంట దిగుబడులకు విలువ జోడించి రకరకాల ఉత్పత్తులను తయారు చేసే సామాజిక వ్యాపార సంస్థలుగా మారాయి. నగరంలో ఖాళీగా ఉండి ఎందుకూ పనికిరావనుకున్న ఖాళీ స్థలాలు, గతంలో చెత్తాచెదారం పోసిన డంపింగ్ యార్డులను సైతం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పునరుజ్జీవింప జేయటంతో పట్టణ ప్రాంతం అంతా పచ్చని పంటలతో నిండిపోయింది. అర్బన్ లాండ్ బ్యాంక్ ఉద్యాన పంటల కోసం అర్బన్ గార్డెన్లను ఏర్పాటుచేయడంతో అనాదరణకు గురైన పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ఉపాధి అవకాశాలు దొరికాయి. సాంఘికంగా పరపతి పెరిగింది. రొసారియో యూనివర్సిటీ ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాల వివరాలతో డేటాబేస్ తయారు చేసింది. మునిసిపల్ అధికారులు అర్బన్ లాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి, భూయజమానులకు, అర్బన్ ఫార్మర్స్‌కు అనుసంధానంగా పనిచేస్తూ దీర్ఘకాలిక కౌలు ఒప్పందం అమలు చేయడంతో ఇది సజావుగా సాగుతోంది. సామాజికంగా పరస్పరం సహకరించుకుంటూ నగర పేదలు సేంద్రియ ఆహారాన్ని ఉత్పత్తి చేసే సానుకూల పరిస్థితులు నెలకొనటం అర్బన్ హార్టికల్చర్ పథకం సాధించిన మరో ఘనతగా చెప్పవచ్చు. సేంద్రియ అర్బన్ హార్టికల్చర్ క్షేత్రాలను ‘ఆహార పర్యాటక’ కేంద్రాలుగా తీర్చిదిద్దటం మరో విశేషం. ‘రొసారియో గ్రాస్ రూట్స్’ పేరిట ప్రతి వసంత రుతువులో నిర్వహించే ఉత్సవానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు. అర్బన్ హార్టికల్చర్ ప్రయోజకతకు మా అనుభవమే రుజువు! 20 ఏళ్లుగా నిరంతరాయంగా విధానపరమైన మద్దతుతో అర్బన్ హార్టికల్చర్ పథకం దిగ్విజయంగా అమలవుతోంది. ‘ప్రైజ్ ఫర్ సిటీస్’ పురస్కారం ఉత్సాహంతో ఈ పథకం అమలును మరింత బలోపేతం చేస్తాం. అర్బన్ హార్టికల్చర్ ద్వారా సుస్థిర ఆహారోత్పత్తితోపాటు సాంఘిక, పర్యావరణపరమైన ప్రయోజనాలనూ చేకూర్చవచ్చని మా అనుభవం రుజువు చేస్తోంది. ప్రకృతితో వ్యవహరించే తీరు మార్చుకోవాల్సిన అవసరం గతమెన్నడూ లేనంతగా ఇప్పుడు మనకు అర్థమవుతోంది. – పాబ్లో జావ్కిన్, రొసారియో నగర మేయర్, అర్జెంటీనా ప్రైజ్ ఫర్ సిటీస్ ఈ నేపథ్యంలో రొసారియో నగరం ప్రతిష్ఠాత్మకమైన ‘ప్రైజ్ ఫర్ సిటీస్ అవార్డు–2021’ను ఇటీవల గెలుచుకుంది. వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ రెండేళ్లకోసారి రెండున్నర లక్షల డాలర్లతో కూడిన ఈ పురస్కారాన్ని అందిస్తుంటుంది. ‘మారుతున్న వాతావరణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటున్న నగరం’ పేరిట నిర్వహించిన పోటీకి 54 దేశాల నుంచి 262 నగరాలు దరఖాస్తు చేయగా రొసారియో విజేతగా నిలిచింది. అర్బన్ హార్టికల్చర్ పథకాలకు అమృతాహారం ద్వారా నగర పేదలు, మధ్యతరగతి ప్రజల ఆహార, ఉపాధి అవసరాలను తీర్చడంతోపాటు.. కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న నగరానికి పర్యావరణాభివృద్ధి చేకూర్చి ‘గ్రీన్ సిటీ’గా మార్చే శక్తి కూడా సమృద్ధిగా ఉందని రొసారియో సుసంపన్న అనుభవం చాటిచెబుతోంది. నగర పాలకులూ వింటున్నారా? – పంతంగి రాంబాబు -
రైతు బాగుంటేనే దేశం బాగు
రాజేంద్రనగర్: దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు బిడ్డ కూడా రైతే కావాలని కోరుకునే రోజు రావాలన్నారు. రాజేంద్రనగర్‌లోని వాలంతరీలో సోమవారం జరిగిన జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం రైతులు తమ సంతానాన్ని రైతుగా చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాబోయే రెండేళ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి, నీటి పారుదలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రయోగశాలలోని ఫలితాలు వ్యవసాయ క్షేత్రాలకు చేరాలని పేర్కొన్నారు. రెండు నెలల పాటు శిక్షణ పొంది సర్టిఫికెట్లు అందుకున్న రైతులు గ్రామాల్లో తిరుగుతూ సమగ్ర వ్యవసాయంపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, వాలంతరీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ జర్నలిస్టుకు అవార్డు.. సాక్షి దినపత్రిక జర్నలిస్టు పంతంగి రాంబాబుకు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అవార్డు అందించారు. రాంబాబు ‘సాక్షి’లో సాగుబడి శీర్షికపై వార్తలను అందిస్తున్నారు. అలాగే టీ న్యూస్‌లో చేను చెలక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యాసాగర్‌రెడ్డికి కూడా అవార్డు అందించారు. -
‘సాక్షి’ పాత్రికేయుడు రాంబాబుకు వ్యవసాయ అవార్డు
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): ‘సాక్షి’దినపత్రికలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు పంతంగి రాంబాబుకు ‘ప్రకృతి వ్యవసాయ విద్యారత్న’ అవార్డు లభించింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో శనివారం దేశీయ విత్తన మేళా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మేళాను సౌత్ ఏసియన్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అసోసియేషన్(సారా), ఎస్వీయూ పర్స్ సెంటర్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. పంతంగి రాంబాబు ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇంటి పంట’ పేరుతో కథనాలతో పాటు ‘సాగుబడి’ శీర్షికన ప్రతి వారం వ్యవసాయ వార్తలను అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అనేక కథనాలు రాశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ వి.దామోదరం నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అలాగే బెంగళూరుకు చెందిన సహజ సీడ్స్ సంస్థ యజమాని జి.కృష్ణ ప్రసాద్‌కు ‘దేశవాళీ విత్తన సంరక్షక’ అవార్డు లభించింది. కృష్ణప్రసాద్ దక్షిణ భారతదేశంలోని 786 సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లకు వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలను అందిస్తున్నారు. -
వెలుగులు నింపే ‘ఓలిక్’ వేరుశనగ!
వేరుశనగలో అత్యంత మేలైన , మెట్ట ప్రాంత రైతులకు అధిక రాబడిని అందించే రకాలేవి? ఓలిక్ యాసిడ్ ఎక్కువ శాతం ఉండే రకాలు! ఎందుకని?.. సాధారణ వేరుశనగలు 2 నెలల్లోనే మెత్తబడి పోతాయి. వీటిలో ఓలిక్ యాసిడ్ 45–50% వరకు ఉండటమే కారణం. కాబట్టి, ఇటువంటి వేరుశనగలతో వివిధ ఉత్పత్తులను తయారు చేయటం కష్టం. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉంటే.. 9 నెలల వరకు మెత్తబడి పాడు కాకుండా నిల్వ చేయొచ్చు! అంతేకాదు.. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగలు వినియోగదారుల ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయి. అందుకే.. మన దేశంలో, ఇతర ఆసియా దేశాల్లోని ఆహార శుద్ధి కంపెనీలు ఆస్ట్రేలియా నుంచి ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉన్న వేరుశనగలను ప్రతి ఏటా వేలాది టన్నులు దిగుమతి చేసుకుంటున్నాయి. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగ రకాలను మనమే అభివృద్ధి చేసుకోగలిగితే ఎంతబావుంటుందో కదా..? ఆ రకాలు అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తిక్క తెగులు, తుక్కు తెగుళ్లను కూడా సమర్థవంతంగా తట్టుకొనగలిగినవైతే మన రైతులకు మరింత మేలు కదూ? సరిగ్గా ఏడేళ్ల క్రితం డా. పసుపులేటి జనీలకు ఈ ఆలోచన వచ్చింది. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ(ఇక్రిశాట్)లోని వేరుశనగ వంగడాల అభివృద్ధి విభాగంలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఏడేళ్ల పాటు కొనసాగించిన పరిశోధన సఫలీకృతమైంది. గుజరాత్‌లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తిరుపతి పరిశోధనా కేంద్రం, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలెం పరిశోధనా కేంద్రం, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో, క్షేత్రప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. జన్యుమార్పిడి విత్తనాలు కావు.. తిరిగి వాడుకోవచ్చు.. ఇక్రిశాట్లో డా. జనీల ఆధ్వర్యంలో 2011 నుంచి ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వంగడాలపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే అమెరికన్ వంగడం(సనోలిక్95ఆర్)తో స్థానిక వంగడాలను సంకరపరచి 16 కొత్త వంగడాలను రూపొందించారు. జన్యుమార్పిడి పద్ధతులను అనుసరించలేదు. మాలిక్యూలర్ మార్కర్స్తోపాటు అనేక సాంకేతికతలను వినియోగించడం ద్వారా సాధారణం కన్నా 3–4 ఏళ్ల ముందుగానే పరిశోధనను తక్కువ ఖర్చుతోనే కొలిక్కి తెచ్చామని డా. జనీల సంతోషంగా చెప్పారు. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉండే ఐ.సి.జి.వి. 03043 అనే రకంతో పాటు మరో రెండు వేరుశనగ వంగడాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రకాలను సాగు చేసే రైతులు తమ పంట నుంచి కొన్ని కాయలను పక్కన పెట్టుకొని తిరిగి విత్తనంగా వాడుకోవచ్చు. స్థానికంగా క్షేత్ర ప్రయోగాలు చేసిన తర్వాత వేరుశనగ విస్తారంగా సాగయ్యే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 2017లో ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌కు చెందిన నరసింహారెడ్డి తదితర రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకూ రైతులు ఇష్టపడి సాగుచేస్తున్న వేరుశనగ రకాల కన్నా (5–15% నుంచి 84% వరకు) అధిక దిగుబడి వచ్చిందని, ఓలిక్ యాసిడ్ 80% వరకు వచ్చిందని డా. జనీల ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. సాధారణంగా మన వేరుశనగ గింజల్లో 48% వరకూ వచ్చే నూనె దిగుబడి.. ఐ.సి.జి.వి. 03043 రకంలో 53% రావటం విశేషమన్నారు. ఆరోగ్యదాయకం.. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వేరుశనగలు వినియోగదారులకు మరింత ఆరోగ్యదాయకమైనవి. ఓలిక్ యాసిడ్ తక్కువగా ఉండే సాధారణ వేరుశనగలు లేదా వాటితో తయారు చేసిన ఆహారోత్పత్తులు రెండు నెలల్లో మెత్తబడుతాయి. కాబట్టి, ఆహార శుద్ధి కర్మాగారాల యాజమాన్యాలు ఆస్ట్రేలియా నుంచి 9 నెలల పాటు నిల్వ సామర్థ్యం కలిగిన, అధిక ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశనగలను ఏటా భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు సిద్ధమైన కొత్త వంగడాలు పూర్తిగా సాగులోకి వస్తే ఈ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోని ఆహార శుద్ధి కర్మాగారాలకు ఇంకా ఓలిక్ యాసిడ్ ప్రాధాన్యంపై తగినంత చైతన్యం లేదని ఆమె అన్నారు. వీరిలో చైతన్యం పెంపొందించడంతోపాటు రైతులకు కొత్త వంగడాలను అందిస్తే పరిశ్రమకు, రైతులకు, వినియోగదారులకు కూడా మేలు కలుగుతుంది. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల వేరుశనగ నూనె వాసన మెరుగ్గా ఉంటుందని, గుండె జబ్బుల నివారణతోపాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరతాయని ఆమె అన్నారు. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు ఆహార శుద్ధి కంపెనీలతో ముందస్తు ఒప్పందాల మేరకు ఈ వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ వంగడాలను సాగు చేయటం వల్ల రైతులకు అధిక ఉత్పత్తితోపాటు కనీసం 10% అధిక ధర కూడా లభిస్తుందని డా. జనీల చెబుతున్నారు. గుజరాత్లో సుమారు 8 వేల మంది రైతులతో కూడిన ఖెదుత్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ అనే సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా కొత్త వంగడాలను సాగు చేయించారు. మార్కెట్ అవసరాలకు తగినంత నాణ్యత కలిగిన వేరుశనగలను వారు పండించి లబ్ధిపొందుతున్నారని డా. జనీల వివరించారు. ప్రస్తుతం దేశంలో 48 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతోంది. ఇక్రిశాట్ రూపొందించిన కొత్త వంగడాలు తక్కువ ఎరువులు, పురుగుమందులతోనే మంచి దిగుబడినిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అత్యధికంగా 40 వరకు ఊడలు వస్తున్నందున ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటాయని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయదారులు కూడా ఈ వంగడాలను సాగు చేయడం ద్వారా మంచి గిట్టుబాటుధర పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు. చెట్టుకు 30కి పైగా కాయలున్నాయి..! పదేళ్లుగా వేరుశనగను సాగు చేస్తున్నా. కె6, టాగ్ 24 రకాలు మచ్చ(తిక్క) తెగులును తట్టుకోవటం లేదు. దిగుబడి 3, 4 క్వింటాళ్లే వస్తున్నది. ఈ ఏడాది ఐ.సి.జి.వి. 03043 రకం సాగు చేశా. మచ్చ తెగులును తట్టుకోవటంతో చేనంతా పచ్చగా ఉంది. ఊడలు ఎక్కువగా వచ్చాయి. 60 రోజుల తర్వాతే ఊడలు వస్తున్నాయి. చెట్టుకు 30కి పైగా కాయలు ఉన్నాయి. 5 నెలల పంట కాలం. ఆకుమచ్చ తెగులు రాలేదు కాబట్టి ఆకు రాల్లేదు. మంచి పశుగ్రాసం కూడా వస్తుంది. తుప్పు తెగులు ఒకటి, రెండు మొక్కలకు తప్ప రాలేదు. 10 రోజుల్లో కాయలు కోస్తాం. బాగా లాభదాయకంగా ఉంటుందనుకుంటున్నా. – మల్లాయపల్లి నరసింహారెడ్డి (86869 55757), వేరుశనగ రైతు, శ్రీరంగాపూర్, వనపర్తి జిల్లా నారాయణ, కె6 కన్నా అధిక దిగుబడి.. ఉత్పత్తిదారుల సంఘాలకు విత్తనాలిస్తాం! ఈ కొత్త వేరుశనగ వంగడాలను ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేయించగా.. నారాయణ రకంతో సమానంగా దిగుబడి వచ్చింది. ఓలిక్ యాసిడ్ 80% వచ్చింది. అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తుప్పు తెగులు, తిక్క తెగులును తట్టుకున్నాయి. తెలంగాణలో కె6 కన్నా మెరుగైన దిగుబడి వచ్చింది. 2018లో కూడా క్షేత్రస్థాయి ప్రయోగాలు కొనసాగుతాయి. ఆ తర్వాత అధికారికంగా విడుదల అవుతాయి. అయితే, ఈ లోగానే కొంత మేరకు విత్తనోత్పత్తి కోసం వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు, జాతీయ విత్తన సంస్థ(ఎన్.ఎస్.సి.)కు వచ్చే ఖరీఫ్ నాటికి కొత్త విత్తనాలను అందించాలనుకుంటున్నాం. – డా. పసుపులేటి జనీల (99899 30855), ముఖ్య శాస్త్రవేత్త, ఇక్రిశాట్, పటాన్చెరు, మెదక్ జిల్లా. p.janila@cgiar.org వేరుశనగ రకాల మధ్య తేడాలను వివరిస్తున్న రైతు నరసింహారెడ్డి – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
గ్రామీణ ఆవిష్కర్తలకు జేజేలు!
వ్యవసాయదారులు, గ్రామీణుల అభివృద్ధికి తోడ్పడే వినూత్న ఆవిష్కరణలను వెలువరించిన వారిని గుర్తించి, సముచిత రీతిలో ప్రోత్సహించడం అత్యవసరం. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.పి.ఆర్.) ఈ విషయాన్ని గుర్తించి.. గత నెల 23,24 తేదీల్లో తొట్టతొలి సారిగా జాతీయ స్థాయి గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శనను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పార్వతీపురానికి చెందిన రైతు శాస్త్రవేత్త డి. బాబూరావుకు రూ. 50 వేల బహుమతి లభించింది. గ్రామీణ రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను డిజైన్ పరంగా అభివృద్ధి చేసి, వాటిని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్.ఐ.ఆర్.పి.ఆర్.లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం విశేషం. అక్కడ ప్రదర్శించిన కొన్ని వ్యవసాయ సంబంధిత ఆవిష్కరణల గురించి ఇక్కడ ముచ్చటించుకుందాం.. మొక్కజొన్న ఒలిచే / చెరకు ముచ్చెలు కత్తిరించే యంత్రం రైతు శాస్త్రవేత్త డి. బాబూరావు స్వస్థలం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం. బహుళ ప్రయోజనకారి అయిన స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్‌సీడర్‌ను గతంలో ఆవిష్కరించి పేరుగడించిన ఆయన తాజాగా.. ఒకేసారి నాలుగు మొక్కజొన్న పొత్తుల్లో నుంచి గింజలు ఒలిచే యంత్రాన్ని ఆవిష్కరించారు. ఈ యంత్రానికి చిన్న బ్లేడ్లు మార్చుకొని.. చెరకు ఒంటికన్ను ముచ్చెలను లేదా 3 అంగుళాల ముక్కలను కత్తిరించడానికి కూడా వినియోగించుకోవచ్చు. బరువు 20 కిలోలు కావడంతో ఎక్కడికైనా, కొండల మీదికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. ఖరీదు రూ. 16 వేలు. చెరకు విత్తన మార్కర్ : దీనితోపాటు చెరకు విత్తన మార్కర్‌ను సైతం బాబూరావు రూపొందించారు. చెరకు సాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉంచాలి. చెరకు మొక్కలను విడి విడిగా కాకుండా.. 14 అంగుళాల రింగ్‌లో 4 చెరకు ముచ్చెలను నాటాలి. రింగ్‌కు రింగ్‌కు మధ్య 3 అడుగుల దూరం ఉంచాలి. ఇలా చేయడం వల్ల గాలులకు చెరకు పడిపోకుండా ఉంటుంది. ఎకరానికి కనీసం 300 కిలోల చెరకు విత్తనం సరిపోతుంది. బాబూరావును 94409 40025 నంబరులో సంప్రదించవచ్చు. – సేకరణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : కందల రమేష్‌బాబు, సీనియర్ ఫొటో జర్నలిస్టు మండే ఎండల్లో చెమటను చిందించే మహిళా రైతులకు గొడుగుల ద్వారా నీడ కల్పిస్తే వారి కష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చని అంటున్నారు రేపల్లె షణ్ముఖరావు (94921 13609). మహబూబ్‌నగర్ జిల్లా కంబాలపల్లి ఆయన స్వస్థలం. ఇందుకోసం రెండు రకాల పెద్ద గొడుగులను ఆయన రూపొందించారు. సాళ్ల మధ్యలో ఈ గొడుగును నిలబెట్టి.. దీని నీడలో మహిళలు పనులు చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ముందుకు జరుపుకోవచ్చు. దీని ధర రూ. 1,500. ప్రతిసారీ జరుపుకోనవసరం లేకుండా.. సౌరవిద్యుత్‌తో నడిచే సెన్సర్ల ద్వారా దానంతట అదే ముందుకు జరిగే ఆటోమేటిక్ గొడుగును కూడా ఆయన రూపొందించారు. దీని ధర రూ. 5,000. పురుగు పట్టనివ్వదు! ఎటువంటి రసాయనాలు కలపకుండా వ్యవసాయోత్పత్తులను నిశ్చింతగా భద్రపరచుకునేందుకు ఉపయోగపడే సురక్షితమైన ప్లాస్టిక్ సంచులను మహారాష్ట్ర పుణేకి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ షా రూపొందించారు. 70 మైక్రాన్ల మందాన ఉండే పారదర్శకమైన ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ సంచులలో నింపి బియ్యం, పప్పులు, ఇతర ధాన్యాలను రెండేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చంటున్నారు. ఇథనాల్ వెనాల్ ఆల్కహాల్ (ఇ.వి.ఓ.హెచ్.) అనే అత్యాధునిక జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని తయారు చేశారు. రెండేళ్లపాటు నిల్వ చేసినా ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలకు పురుగు పట్టదని, పోషకాల నష్టం జరగదని, రుచి, రంగు మారదని షా చెబుతున్నారు. ఇంట్లో, గోదాముల్లో వ్యవసాయోత్పత్తుల నిల్వకు ఈ సంచులు ఉపకరిస్తాయని, ఎన్నేళ్లయినా పునర్వినియోగానికి అనుకూలంగా ఉంటాయన్నారు. ఒక సంచి ధర రూ. 70. తమిళనాడు తంజావూరులోని భారతీయ పంట పరిరక్షణ సాంకేతికతా సంస్థ (ఐ.ఐ.సి.పి.టి.)తోపాటు ఎఫ్.డి.ఎ., సి.ఈ. వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ సంచుల నాణ్యతను నిర్థారించాయని షా చెబుతున్నారు. వివరాలకు 098220 12969, 020672 73830 నంబర్లలో సంప్రదించవచ్చు. -
120 రోజుల పత్తి‘యుగాంక్’!
⇒ నాగపూర్‌లోని సి.ఐ.సి.ఆర్.అద్భుత ఆవిష్కరణ ⇒ 4 నెలల్లోనే పూర్తి దిగుబడినిచ్చే ‘యుగాంక్’ పత్తి వంగడాలు ⇒ పత్తి సాగు కాలంతోపాటు సగానికి తగ్గనున్న ఖర్చుl ⇒ మెట్ట పొలాల్లో వర్షాధార సేద్యానికి బాగా అనువైనది ⇒ వత్తుగా విత్తుకుంటే హైబ్రిడ్‌తో దీటుగా దిగుబడి ⇒ పత్తి తర్వాత రెండో పంటగా అపరాల సాగుకు వీలు మెట్ట పొలాల్లో వర్షాధారంగా పత్తిని సాగు చేసే రైతుల కష్టాలు తీర్చే అద్భుతమైన స్వల్పకాలిక పత్తి వంగడాన్ని నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సి.ఐ.సి.ఆర్.) శాస్త్రవేత్తలు రూపొందించారు. 100–120 రోజుల్లో పూర్తి దిగుబడినివ్వడం దీని విశిష్టత. పత్తి సాగులో రైతులకు శాపంగా మారిన అనేక సంక్లిష్ట సమస్యలకు ‘యుగాంక్’ అనే ఈ స్వల్పకాలిక అపూర్వ పత్తి వంగడాలు చక్కని పరిష్కారమని డాక్టర్ కేశవ్ క్రాంతి ‘సాక్షి’కి తెలిపారు. వరంగల్ జిల్లా కాజీపేట ఆయన స్వస్థలం. సి.ఐ.సి.ఆర్. డైరెక్టర్‌గా మొన్నటి వరకు సేవలందించిన ఆయన వారం క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ పత్తి సలహా మండలి (ఐ.సి.ఎ.సి.)లో సాంకేతిక విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ‘యుగాంక్’ పత్తి వంగడాలకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. తొమ్మిదేళ్ల కృషి ఫలితం కర్ణాటకలోని ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగపూర్ సి.ఐ.సి.ఆర్. సంయుక్త కృషితో ‘యుగాంక్’ పత్తి వంగడం రూపుదాల్చింది. ధార్వాడ్‌కు చెందిన సీనియర్ పత్తి ప్రజనన శాస్త్రవేత్త డా. ఎస్.ఎస్. పాటిల్ అందించిన బేసిక్ మెటీరియల్‌తో నాగపూర్ సి.ఐ.సి.ఆర్.లో పరిశోధన విజయవంతమైంది. డా. క్రాంతి పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్త డా. హెచ్.బి. సంతోష్ గత తొమ్మిదేళ్లుగా కొనసాగించిన పరిశోధనల ఫలితంగా ఎట్టకేలకు స్వల్పకాలిక పత్తి వంగడాలు సిద్ధమయ్యాయి. డా. పాటిల్ కుమారుడు ‘యుగాంక్’ అకాల మరణం చెందడంతో అతని పేరును ఈ వంగడాలకు పెట్టారు. ప్రతి ఏటా విత్తనాలు కొనాల్సిన పని లేదు తిరిగివాడుకోదగిన (నాన్ బీటీ) సూటి రకంతో పాటు.. శనగపచ్చ పురుగును తట్టుకునే సామర్థ్యం కలిగిన (నాన్ హైబ్రిడ్) బీటీ సూటి రకాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఈ రెండు రకాల విత్తనాలనూ తాము పండించిన పత్తిలో నుంచి తీసి దాచుకొని, తర్వాత సంవత్సరం రైతులు వాడుకోవచ్చు. ఇప్పటి మాదిరిగా ప్రతి ఏటా కంపెనీల నుంచి కొనాల్సిన అవసరం ఉండదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే 6–8 నెలల పాటు సాగు చేయాల్సిన హైబ్రిడ్ బీటీ పత్తి రకాలు సాగులో ఉన్నాయని.. రైతులను అష్టకష్టాలు పెడుతున్న ఈ రకాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం రానే వచ్చిందని డా. క్రాంతి ఉద్వేగభరిత స్వరంతో అన్నారు. పూత,కాత దశలోనే నీరు,పోషకాల అవసరం ఎక్కువ ఇప్పుడు మన రైతులు పండిస్తున్న బీటీ హైబ్రిడ్ పత్తి రకాల పంటకాలం 170–240 రోజుల (6 నుంచి 8 నెలలు) వరకు ఉంది. ఆస్ట్రేలియా, చైనాల్లో 150 రోజుల వరకు ఉంది. వర్షాకాలం పూర్తయ్యి, మెట్ట భూములు బెట్టకొచ్చే రోజుల్లో పత్తి చేలు పూత, కాత దశలో ఉంటున్నాయి. నిజానికి నీరు, పోషకాలు 80–85% వరకు ఈ దశలోనే అవసరం. కానీ, అప్పటికే వర్షాకాలం ముగియడం వల్ల నీటి వసతి లేని పొలాల్లో పత్తి దిగుబడి తగ్గిపోతున్నది. స్వల్పకాలిక రకం సాగు చేస్తే వర్షాకాలంలోనే పూత, కాత వస్తుంది కాబట్టి మెట్ట సాగులో సమస్య ఉండదు. నవంబర్ నాటికి పత్తి తీత పూర్తవుతుంది.. దీర్ఘకాలిక పత్తి పంటకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్ తర్వాతే గులాబి రంగు కాయతొలిచే పురుగు సోకుతుంది. అయితే, ఈ కొత్త వంగడం ‘యుగాంక్’ వేసుకుంటే నవంబర్ నాటికి పత్తి తీయటం కూడా పూర్తవుతుంది. కాబట్టి ఈ పురుగు బెడద నుంచి తప్పించుకోవచ్చు. రసంపీల్చే పురుగులు, ఇతర చీడపీడల బెడద కూడా తగ్గిపోతుంది. ఖర్చు సగం తగ్గుతుంది.. హైబ్రిడ్ బీటీ పత్తి సాగుకు పంటకాలం 6–8 నెలలు. యుగాంక్ రకం పత్తి సాగు కాలం మూడున్నర నుంచి నాలుగు నెలలకు తగ్గిపోవడం వల్ల సాగు ఖర్చు ఇప్పటితో పోల్చితే సగానికన్నా ఎక్కువే తగ్గుతుందని డా. క్రాంతి తెలిపారు. ఎరువుల అవసరం తగ్గిపోతుంది. పురుగుమందులను ఒకటి, రెండుసార్లు పిచికారీ చేస్తే చాలు. మొత్తంగా పంట యాజమాన్యం చాలా సులభమవుతుంది. పత్తి పూర్తయ్యాక పప్పుధాన్య పంటలు వేసుకుంటే రైతుకు అదనపు ఆదాయంతోపాటు భూమి కూడా సారవంతమవుతుంది. తొలి వర్షాలకు కలుపును మొలవనిచ్చి, పీకేసిన తర్వాత పత్తిని విత్తుకుంటే కలుపు సమస్య తగ్గుతుంది. ఎరువుల అవసరం, ఖర్చు కూడా తగ్గిపోతుంది. జూలైలో విత్తుకుంటే నవంబర్ నాటికి పత్తి తీత కూడా పూర్తవుతుంది. పత్తి నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ‘యుగాంక్’ పత్తి వంగడంతో రైతు స్థాయిలోనే విత్తనోత్పత్తి చేసుకోవడం కూడా సులువేనని డా. క్రాంతి అన్నారు. అందుకే ఈ వంగడం పత్తి సాగుకు సుస్థిరతనివ్వడంతోపాటు కొత్త దిశను నిర్దేశిస్తుందని భావించవచ్చు. పత్తి సాగులో ఉన్న మెట్ట ప్రాంతాల్లోనే ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వంగడాలు రైతులకు ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ పత్తి శాస్త్రవేత్తగా పాతికేళ్ల అనుభవంలో ఇది అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం! ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో వాడుతున్న దీర్ఘకాలిక బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలకు ‘యుగాంక్’ పత్తి వంగడం సరైన ప్రత్యామ్నాయం. 9 ఏళ్లు కష్టపడి మన శాస్త్రవేత్తలు రూపొందించిన ‘యుగాంక్’ వంగడాలు 100 నుంచి 120 రోజుల్లోనే పూర్తిస్థాయి పత్తి దిగుబడినిస్తాయి. పత్తి సాగు చరిత్రను తిరగరాయగల అద్భుత ఆవిష్కరణ ఇది. వర్షాధారంగా మెట్ట పొలాల్లో పత్తి సాగు చేస్తున్న భారతీయ రైతులకు, ముఖ్యంగా మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణ రాష్ట్రాల్లో రెతులకు ఈ సరికొత్త పత్తి వంగడాలు గొప్ప వరం. ఎన్నో విధాలుగా మేలైన ఇంత తక్కువ రోజుల్లో దిగుబడినిచ్చే పత్తి వంగడాలను రూపొందించగలమని నేను కలలో కూడా ఊహించలేదు. పత్తి శాస్త్రవేత్తగా నాకున్న పాతికేళ్ల పరిశోధనా అనుభవంలో ఇది అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం. ప్రపంచవ్యాప్తంగా పత్తి దిగుబడులు తగ్గిపోతుండడం పెద్ద సవాలు. బీటీ టెక్నాలజీ కొన్నాళ్లు పనిచేసింది. ఇప్పుడు బహుళజాతి కంపెనీల దగ్గర కూడా సమాధానాలు లేవు. అందుకే వాషింగ్టన్‌లోని ఐ.సి.ఎ.సి.లో సాంకేతిక విభాగం బాధ్యతలు చేపడుతున్నా. అక్కడున్నా మన పత్తి రైతులకు ఉపయోగపడే ‘యుగాంక్’ వంగడాలను గమనిస్తూనే ఉంటా. – డా. కేశవ్ క్రాంతి, సి.ఐ.సి.ఆర్.(నాగపూర్), పూర్వ సంచాలకులు, అంతర్జాతీయ పత్తి సలహా మండలి (ఐ.సి.ఎ.సి.) సాంకేతిక విభాగం అధిపతి, వాషింగ్టన్ krkranthi@gmail.com రెండేళ్ల తర్వాతే రైతులకు.. తొమ్మిదేళ్లు కష్టపడి ‘యుగాంక్’ పత్తి వంగడాలను సంప్రదాయ పద్ధతుల్లోనే రూపొందించాం. మొక్క పొదలాగా కాకుండా తక్కువ స్థలంలో నిటారుగా పెరుగుతుంది. పొట్టిగా ఉంటుంది. మొక్కకు 20 వరకు పెద్ద కాయలు కాస్తాయి. మూడున్నర నుంచి 4 నెలల్లో పంట పూర్తవుతుంది. కాయలన్నీ దాదాపుగా ఒకేసారి పక్వానికి వస్తాయి. ఒకటి, రెండు సార్లు పత్తి తీస్తే చాలు. పెద్ద రైతులు యంత్రంతో పత్తి తీతకు అనుకూలంగా ఉంటుంది. ఈ విత్తనాలను ప్రతి ఏటా కొనాల్సిన అవసరం లేదు. ఒకసారి కొంటే, ఇతర రకాలతో కలిసిపోకుండా జాగ్రత్తపడితే, రైతులు కనీసం ఐదారేళ్లు తాము పండించిన పత్తిలో నుంచి తీసిన విత్తనాలను తిరిగి నిశ్చింతగా విత్తుకోవచ్చు. చేతితో ఉపయోగించే చిన్న యంత్రాలతో పత్తి నుంచి విత్తనాలు తీసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతుకు విత్తన స్వాతంత్య్రం లభిస్తుంది. ఖర్చు, సమయం ఆదా అవుతుంది. ప్రైవేటు బీటీ హైబ్రిడ్ పత్తి పంట కన్నా 5 రెట్లు ఎక్కువ వత్తుగా విత్తుకోవడానికి ఈ వంగడాలు అనుకూలమైనవి. కాబట్టి, పత్తి దిగుబడి అధికంగానే ఉంటుంది. యుగాంక్ వంగడాలను 60“30, 60“10 సెంటీమీటర్ల దూరంలో విత్తితే నాగపూర్‌లో దిగుబడి బాగుంది. వివిధ రాష్ట్రాల్లో దిగుబడి ఎలా వస్తుందో ప్రయోగాత్మకంగా సాగు చేయించబోతున్నాం. సాగు ఖర్చును, సమయాన్ని సగానికి సగం తగ్గించే ఈ విత్తనాలు రెండేళ్ల తర్వాతే రైతులకు అందుబాటులోకి వస్తాయి. – డా. హెచ్.బి. సంతోష్,‘యుగాంక్’ పత్తి వంగడాల రూపశిల్పి,కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సిఐసిఆర్), నాగపూర్, మహారాష్ట్ర -
రసాయనిక ఎరువులతో ప్రజారోగ్యానికి ముప్పు!
దేశంలో వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ప్రభావంపై 31 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన స్థాయీ సంఘం (2015-16) అధ్యయనం చేసింది. బీజేపీ ఎంపీ హుకం దేవ్‌నారాయణ్ యాదవ్ అధ్యక్షతన గల ఈ స్థాయీ సంఘం ఈనెల 11వ తేదీన పార్లమెంటు ఉభయ సభలకు నివేదికను సమర్పించింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అతిగా వాడటం వల్ల భూసారం దెబ్బతినడం, పంట దిగుబడుల్లో పెరుగుదల మందగించడంతోపాటు.. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి, పశువుల ఆరోగ్యానికి ముప్పు వచ్చిందని ఆందోళన వెలిబుచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకుంటూనే.. సేంద్రియ రైతులకు సాంకేతిక సహాయంతోపాటు నేరుగా ఆర్థిక తోడ్పాటునివ్వడం అవసరమని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.. 1960వ దశకం నుంచి దేశంలో అమలుచేస్తున్న హరిత విప్లవం వల్ల వరి, గోధుమల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగి మన అవసరాలు తీరడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే దశకు చేరామని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక వివరించింది. 1960-61లో 8.3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014-15 నాటికి 25.27 కోట్ల టన్నులకు పెరిగింది. 1960వ దశకంలో 10 లక్షల టన్నుల కన్నా తక్కువగానే రసాయనిక ఎరువులు వాడేవాళ్లం. 2014-15 నాటికి వీటి వాడకం 2.56 కోట్ల టన్నులకు పెరిగింది. హెక్టారుకు బంగాళదుంపల సాగులో 347 కిలోలు, చెరకు సాగులో 239 కిలోలు, పత్తి సాగులో 193 కిలోలు, గోధుమ సాగులో 177 కిలోలు, వరి సాగులో 165 కిలోల రసాయనిక ఎరువులు వాడుతున్నాం. ప్రజారోగ్యంపై రసాయనిక ఎరువుల ప్రభావం ఎలా ఉంది? అని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగాన్ని ప్రశ్నించింది. ఈ విభాగం ఏం చెప్పిందంటే.. మోతాదుకు మించి / అశాస్త్రీయంగా రసాయనిక ఎరువులు పంటలకు వేయటం వల్ల పర్యావరణానికి హాని జరగడంతోపాటు ప్రజల ఆరోగ్యం పరోక్షంగా దెబ్బతింటున్నది. మనుషులతోపాటు జంతువులను కూడా రసాయనిక ఎరువులు తీవ్రమైన జబ్బుల పాలు చేస్తున్నాయి. రసాయనిక ఎరువుల్లో ఉండే పాదరసం, సీసం, సిల్వర్, నికిల్, సెలీనియం, థాలియం, వనాడియం, కాడ్మియం, యురేనియం వంటి భార ఖనిజాలు మనుషుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయని కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగం పేర్కొంది. ఈ భార ఖనిజాలు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం పనితీరును దెబ్బతీస్తుండడంతోపాటు కేన్సర్ కారకాలుగా మారుతున్నాయి. రసాయనిక ఎరువుల కారణంగా మనుషుల్లో బ్రెయిన్ కేన్సర్, లింఫొమ, ప్రొస్టేట్ కేన్సర్, లుకేమియా, పెద్ద పేగు కేన్సర్ ముప్పు ఆరు రెట్లు పెరిగింది. రసాయనిక ఎరువుల వాడకంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే చాలా ఎక్కువగా ఉందని స్థాయీ సంఘం స్పష్టం చేసింది. రసాయనాల ప్రభావంపై సమగ్ర సర్వే అవసరం వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయోత్పత్తుల వృద్ధి రేటు 1960-70లలో 8.37% ఉండగా, 2000-2010 నాటికి 2.61%కి తగ్గిపోయింది. సాంద్ర వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం, రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరగడంతో భూసారం బాగా క్షీణించింది. జింక్, ఐరన్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలు భూమిలో లోపించడం వల్ల, ఆ భూముల్లో పండించిన పంటలు తిన్న మనుషులకు అనేక జబ్బులు వస్తున్నాయని.. మనుషులు, పశువుల్లో ఎదుగుదల దెబ్బతింటున్నదని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ర్పభావం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఏ విధంగా ఉందో కచ్చితంగా తెల్సుకునేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2025 నాటికి 30 కోట్ల టన్నుల మేరకు మన దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచుకోవాల్సి ఉంది. కాబట్టి రసాయనిక ఎరువులను భూసార పరీక్షల ఆధారంగా సముచితంగా వాడేలా రైతులను చైతన్యవంతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టాలని స్థాయీ సంఘం సూచించింది. ద్రవరూప సేంద్రియ ఎరువులకూ సబ్సిడీ భూసారాన్ని, సూక్ష్మజీవరాశిని పెంపొందించే పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు, జీవన ఎరువుల వాడకం, పంట మిగుళ్లను తిరిగి భూమిలో కలియదున్నటం వంటి పద్ధతులపై రైతుల్లో అవగాహన కలిగించాలని సూచించింది. రసాయనిక ఎరువుల సబ్సిడీ విధానాన్ని సమూలంగా మార్చాలి. ప్రకృతికి అనుగుణమైన జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, ప్రభావశీలమైన ద్రవరూప సేంద్రియ (జీవామృతం, పంచగవ్య వంటి) ఎరువులను దక్షిణాది రైతులు ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడే సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులకు నేరుగా నగదు సబ్సిడీ అందించే మార్గాలను అన్వేషించాలని, మన దేశానికి అనుగుణమైన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి స్థాయీ సంఘం సిఫారసు చేసింది. సేంద్రియ సేద్యం చేపట్టే రైతులకు నేరుగా సాయం పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని, పశుసంపదను రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ర్పభావం నుంచి కాపాడేందుకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వెనువెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థాయీ సంఘం కోరింది. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయంలోకి మారదలచుకునే రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయాన్ని వారికే నేరుగా అందించాలని.. అందుకు అవసరమైన సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించడంతోపాటు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరులను సమన్వయ పరచి, దీక్షతో ప్రణాళికాబద్ధమైన కృషి చేయాలని కేంద్రానికి స్థాయీ సంఘం సూచించింది. సేంద్రియ సేద్యంలోకి మారే దశలో రైతులకు విస్తరణ సేవలందించే యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని పేర్కొంది. ఎన్‌పిఎం పద్ధతులను ప్రోత్సహించాలని, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని నియంత్రించేందుకు పెస్టిసైడ్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని స్థాయీ సంఘం అభిప్రాయపడింది. రైతుసంఘాలు, నిపుణులు, స్వచ్ఛంద / పరిశోధనా సంస్థల ప్రతినిధులతో సంప్రదించి ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968కు ఇప్పటి అవసరాలకు అనుగుణంగా సవరణలు చేయాలని కూడా స్థాయీ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. - పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ పురుగుమందుల సంగతేమిటి? పంటలపై రసాయనిక పురుగుమందులు విచక్షణారహితంగా వాడటం వల్ల ఎటువంటి ప్రభావం ఉంది? అని కేంద్ర వ్యవసాయ శాఖను పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశ్నించింది. అయితే, రసాయనిక పురుగుమందుల ప్రభావాలపై తమ శాఖ ఎటువంటి అధ్యయనమూ చేయలేదని కేంద్ర వ్యవసాయ శాఖ సెలవిచ్చింది! -
కందకాలతో కరువు నుంచి రక్షణ!
♦ ‘సాక్షి’ స్ఫూర్తితో గత ఏడాది కందకాలు తవ్వించా.. ♦ కందకాలు నిండేలా వర్షం పడింది ఒక్కసారే ♦ 30 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంతటి కరువు వచ్చింది ♦ అయినా, కందకాల వల్లే మా తోట పచ్చగా నిలబడింది.. ♦ సీనియర్ ఉద్యాన రైతు మల్లికార్జునరావు పండ్ల తోటల సాగులో వై.కె.డి. మల్లికార్జునరావుకు 30 ఏళ్ల అనుభవం ఉంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పెద్దివేడు గ్రామంలో 50 ఎకరాల్లో మామిడి, జామ, ఉసిరి, సపోట తోటలతోపాటు 2 ఎకరాల్లో మలబారు వేపను సాగు చేస్తున్నారు. గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న దశలో చేనుకిందే చెరువు పేరిట ‘సాక్షి’ మీడియా గ్రూప్, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన కందకాల ఉద్యమంతో స్ఫూర్తి పొందారు. వేదిక నేతలు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డిలను సంప్రదించి, స్వయంగా తీసుకెళ్లి తోటను చూపించారు. వారి సూచనల మేరకు తోటలోని సుమారు 20 ఎకరాలలో అక్కడక్కడా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. మీటరు లోతు, మీటరు వెడల్పున 25 మీటర్ల పొడవున వాలుకు అడ్డంగా గత ఏడాది సెప్టెంబర్‌లో కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన పది రోజుల్లో పెద్ద వర్షం కురిసింది. పొలంలో పారిన నీరు కందకాల్లోకి నిండుగా చేరి, భూమిలోకి ఇంకాయి. అయితే, ఆ తర్వాత గత ఏడాదంతా వర్షం లేదు. మళ్లీ 2016 మే 8వ తేదీ రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసే వరకు.. చుక్క వాన పడలేదు. తమ తోటలో ఉన్న 5 బోర్లలో 3 బోర్లు ఎండిపోయాయని మల్లికార్జునరావు తెలిపారు. రెండు బోర్లూ కలిపి రెండించుల నీరు పోస్తున్నాయన్నారు. 500 అడుగుల లోతు తవ్విన బోర్లు ఎండిపోయినా.. మామిడి తోటలో కందకాలకు దగ్గరగా ఉన్న 200 అడుగుల బోరు కొంచెంగానైనా నీరు పోస్తుండడం విశేషం అన్నారాయన. గత ఏడాది మేలుకొని కందకాలు తవ్వడం వల్లనే తన తోటలో చెట్లు పచ్చగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మామిడికి అధిక ఉష్ణోగ్రత దెబ్బ మల్లికార్జునరావుతోటలో మామిడి దిగుబడి ఈ ఏడాది 20% మేరకే వచ్చింది. గత డిసెంబర్లో వచ్చిన పూత నిలబడిందని, జనవరి ఆఖరులో పూత బాగా వచ్చిందని, ఆ పూత అధిక ఉష్ణోగ్రత వల్ల రాలిపోయిందని తెలిపారు. గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆయన అంటున్నారు. వాతావరణ మార్పుల దుష్ర్పభావం వల్లనే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారిందన్నారు. కందకాలు తవ్వుకోవడం ద్వారా వాన నీటిని పూర్తిగా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారానే కరువును ఎదుర్కోవడం సాధ్యపడుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. కందకాలు.. జీవామృతం.. కరువును తట్టుకోవాలంటే.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడంతోపాటు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం తప్ప మరో మార్గం లేదని మల్లికార్జునరావు అంటున్నారు. ఆయన గత ఐదేళ్లుగా పశువుల ఎరువు, ట్రైకోడర్మా విరిడి వాడుతున్నారు. మామిడి తోటకు రెండేళ్లుగా జీవామృతాన్ని నెలకోసారి పిచికారీ చేస్తున్నారు. 15 రోజులకోసారి డ్రిప్పర్కు లీటరు చొప్పున జీవామృతం చెట్ల వద్ద పోస్తున్నారు. ఈ ఏడాది ఘన జీవామృతం తయారు చేయించి నిల్వ చేశారు. వర్షాలు పడినప్పుడు డ్రిప్పర్ల కింద పెడతామన్నారు. 12 x 12 దూరంలో మామిడి సాగు మేలు మల్లికార్జునరావు తన మామిడి తోటలో 12x12, 26x26, 20x20 దూరాల్లో మామిడి మొక్కలు పాతికేళ్ల నాడు నాటారు. వీటిలో 12ఁ12 దూరంలో నాటిన మామిడి తోట మంచి దిగుబడులనిస్తున్నదని ఆయన అంటున్నారు. చెట్లు దగ్గర దగ్గరగా ఉండడం వల్ల గాలులకు కాయ రాలకుండా ఉంటుందన్నారు. ప్రతి ఏటా పంట పూర్తవగానే ప్రూనింగ్ చేస్తున్నారు. 25 ఏళ్లు గడిచిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌లో 3 అడుగుల ఎత్తున కొమ్మలు నరికించారు. దీన్నే డీహెడింగ్ అంటున్నారు. ఈ తోటలో వచ్చే ఏడాదికి పూర్తిస్థాయి దిగుబడి మళ్లీ ప్రారంభమవుతుందని, మరో పాతికేళ్లు ఢోకా ఉండదని ఆయన ధీమాగా ఉన్నారు. ప్రతి ఏటా వర్షాలు ప్రారంభం కాగానే బొబ్బర, ఉలవ, జనుము వంటి పచ్చి రొట్ట ఎరువులను విధిగా చల్లి, 45 రోజులకు భూమిలో కలియదున్నడం వల్ల భూమి సారవంతంగా ఉన్నదన్నారు. జీవామృతం వాడిన తర్వాత కాయ బలంగా ఊరుతోందని ఆయన తన అనుభవంగా చెబుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: పోల్కంపల్లి నాగరాజు, సాక్షి ఫొటోగ్రాఫర్ కందకాల వల్లనే తోట పచ్చగా ఉంది..! ‘సాక్షి’ అందించిన స్ఫూర్తితో గత ఏడాది 20 ఎకరాల్లో మాత్రమే కందకాలు తవ్వించాను. ఒకటే వర్షం పడింది. అయినా, రెండు బోర్లు ఎండిపోకుండా ఉండడానికి, తోట పచ్చగా ఉండడానికి ఈ కందకాలు ఉపయోగపడ్డాయనుకుంటున్నాను. ఈ ఏడాది మంచి వర్షాలు పడే సూచనలున్నాయి. మా తోట అంతటా పూర్తి స్థాయిలో కందకాలు తవ్వించాలనుకుంటున్నాను. కందకాలు తవ్వుకోవడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడమే కరువును ఎదుర్కోవడానికి మేలైన మార్గమని నమ్ముతున్నాను. పొలంలో కురిసిన ఒక్క చినుకును కూడా బయటకుపోకుండా కందకాలు తవ్వుకోమని పాలేకర్ కూడా చెప్పారు. - వై.కె.డి. మల్లికార్జునరావు (94904 64498), పెద్దివేడు, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా -
జీవామృతం 9 రోజుల తర్వాత వాడితే మేలు!
♦ బెంగళూరు వ్యవసాయ వర్శిటీలో పదేళ్లుగా పరిశోధన ♦ జీవామృతం కలిపిన 9 నుంచి 12 రోజుల్లోనే అత్యుత్తమ ఫలితాలు ♦ సాక్షి ‘సాగుబడి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్ ఎన్. దేవకుమార్ వెల్లడి ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయంలో భూమిని సారవంతం చేయడమే మంచి దిగుబడుల సాధనకు అత్యంత కీలకాంశం. రసాయనాలతో నిస్సారమైన నేలను తిరిగి సారవంతం చేసుకోవడానికి ఉన్న సులువైన మార్గం జీవామృతం, పంచగవ్య ద్రవరూప ఎరువులే. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం వీటిపై అధ్యయనం చేసి ప్రామాణీకరించింది. ద్రవ రూప ఎరువులపై ప్రత్యేక శ్రద్ధతో పదేళ్లుగా పరిశోధన చేస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఇది. సంస్థ సమన్వయకర్త అయిన డాక్టర్ ఎన్. దేవకుమార్ హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన కిసాన్ స్వరాజ్ సమ్మేళనానికి విచ్చేశారు. ఆ సందర్భంగా ‘సాగుబడి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు జీవామృతాన్ని తయారు చేసిన రెండు రోజుల తర్వాత ప్రారంభించి తదుపరి 7 రోజుల్లోగా వాడుతున్నారు. అలాకాకుండా.. తయారు చేసిన నాటి నుంచి 9 నుంచి12 రోజుల మధ్యలో వాడితే అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని డా. దేవకుమార్ వెల్లడించారు. చెట్టు చిక్కుడులో జీవామృతం మోతాదు పెంచి వాడితే దిగుబడి 30% పెరిగిందన్నారు.. ఇంటర్వ్యూలోని మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. సేంద్రియ ద్రవరూప ఎరువులపై దీర్ఘకాలంగా పరిశోధన చేస్తున్నందుకు మీకు అభినందనలు. మీ కేంద్రం ఎలా ప్రారంభమైనదో చెప్పండి.. జీవామృతం, పంచగవ్య వంటి ద్రవ రూప సేంద్రియ ఎరువులపై గత పదేళ్లుగా నిశితంగా అధ్యయనం చేస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధనా స్థానం మాది. 2006-07 యడ్యూరప్ప కేటాయించిన రూ. 2 కోట్ల నిధులతో షిమోగలో సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రారంభమైంది. ప్రత్యేక కెమికల్ ఎనాలిసిస్ లేబరేటరీ, మైక్రోబయాలజీ లేబరేటరీలను ఏర్పాటు చేశాం. బీజామృతం, జీవామృతం, పంచగవ్య తదితర ద్రవరూప ఎరువులపై అధ్యయనాలు చేస్తున్నాం. వీటి తయారీ, వినియోగంపై ప్రామాణిక గణాంకాలను నమోదు చేస్తున్నాం. వీటిలో సూక్ష్మజీవరాశి ఏ యే దశల్లో ఎంత ఉంది? ఏయే మోతాదుల్లో వాడినప్పుడు పంట పొలాల్లో వీటి పని తీరు ఎలా ఉందో ఓపెన్ మైండ్‌తో అధ్యయనం చేస్తున్నాం. విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తున్నారు. మా పరిశోధనలో తేలిన విషయాలను ఎప్పటికప్పుడు స్వచ్ఛంద కార్యకర్తలు, సేంద్రియ రైతులకు తెలియజేస్తున్నాం. చాలా మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ద్రవరూప ఎరువులు సేంద్రియ సేద్యంలో ఎంతమేరకు ప్రయోజనకరం? బీజామృతం, జీవామృతం, పంచగవ్య చాలా ప్రభావశీలమైనవి. మేలుచేసే సూక్ష్మజీవరాశి వీటిలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీటి గొప్పతనం ఏమిటంటే.. మారుమూల గ్రామాల్లో కూడా రైతులు స్వల్ప ఖర్చుతోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. అయితే, వీటిని రైతులు తమకు నచ్చిన మోతాదులో, పద్ధతుల్లో వాడుతున్నారు. అంత ప్రభావశీలమైన ద్రవరూప ఎరువులపై పరిశోధన చేసి టెక్నాలజీని స్థిరీకరించాలన్నదే మా లక్ష్యం. బీజామృతం కలిపిన మొదటి రోజే విత్తన శుద్ధికి వాడితే చాలా బాగా పనిచేస్తుంది. అందులోని మేలుచేసే సూక్ష్మజీవరాశి రెండో రోజు నుంచి తగ్గిపోతూ ఉంటుంది. దేశీ ఆవు పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లం, గుప్పెడు మట్టితో జీవామృతం తయారు చేసి పరీక్షించాం. మేలుచేసే సూక్ష్మజీవరాశి ఎంత ఉన్నదీ తయారుచేసిన మొదటి రోజు నుంచి 30 రోజుల వరకు ప్రతిరోజూ నమూనాలను సేకరించి శాస్త్రబద్ధంగా అధ్యయనం చేసి, ఫలితాలను నమోదు చేశాం. మేలు చేసే అనేక సమూహాల సూక్ష్మజీవులు జీవామృతంలో ఉన్న విషయాన్ని కనుగొన్నాం. నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు, ఫాస్ఫేట్ను కరిగించి అందించే సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పంట దిగుబడులనివ్వడంలో కీలకపాత్రవహించే యాక్టినోమైసిటిస్ వంటి ముఖ్యమైన ఐదు సూక్ష్మజీవుల సమూహాలను గుర్తించాం. ఇవన్నీ 9 నుంచి 12వ రోజు మధ్యలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందుకే జీవామృతాన్ని కలిపిన తర్వాత 9,10,11,12 రోజుల్లో వాడితే అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయి. మా విశ్లేషణల ఫలితాలను ఎప్పటికప్పుడు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సేంద్రియ రైతులకు తెలియజేస్తూ ప్రచారం కల్పించాం. వీటిని పాటిస్తూ మా రాష్ట్రంలో అభ్యుదయ, సేంద్రియ రైతులంతా 9-12 రోజుల మధ్యలోనే జీవామృతాన్ని వినియోగిస్తూ ప్రయోజనం పొందుతున్నారు. జీవామృతం కలిపిన 12వ రోజు తర్వాత నుంచి సూక్ష్మజీవరాశి తగ్గిపోతూ ఉంటుంది. 15వ రోజుకు వీటి సంఖ్య కొంచెం పెరిగినప్పటికీ అంతకు ముందున్నంతగా లేదు. అందువల్లే 9-12 రోజుల మధ్యలో వాడుకుంటే రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతోంది. జీవామృతం కలిపిన రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు వాడొచ్చని సుభాష్ పాలేకర్జీ చెబుతున్నారు. పుస్తకాల్లోనూ అదే రాశారు కదా. మీ విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో జీవామృతాన్ని మరోసారి పరీక్షించి చూడాల్సిన అవసరం లేదంటారా? పాలేకర్జీ చెప్తున్న దాని గురించి నేనేమీ వ్యాఖ్యానించను. శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత నమోదు చేసిన గణాంకాలను గురించే మేం చెబుతున్నాం. పాలేకర్జీకి కూడా ఈ వివరాలు తెలియజేశాం. ఆయన వాటిని అంగీకరించలేదు. మేం ఒకటి రెండు, మూడు సార్లు పరీక్షలు చేసి చూశాం. మళ్లీ అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. మా పరిశోధనా స్థానంతో సంబంధంలో ఉన్న రైతులందరూ జీవామృతాన్ని 9-12 రోజుల మధ్యలోనే వాడుతూ చక్కటి ప్రయోజనం పొందుతున్నారు. కేవలం జీవామృతంతో పంటలు పండిస్తున్నారా? సేంద్రియ కర్బనం (ఓసీ) బాగా ఉన్న భూమిలో జీవామృతం వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. 0.5% - 0.6% మేరకు సేంద్రియ కర్బనం ఉన్న భూముల్లో జీవామృతం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, మన నాసిరకం నేలల్లో 0.4% మేరకు మాత్రమే ఉంది. ఈ భూముల్లో జీవామృతంతోపాటు పంచగవ్యతోపాటు.. వివిధ రకాల సేంద్రియ సేద్య పద్ధతులను అనుసరించడం మేలు. ద్విదళ, ఏకదళ పంటలు కలిపి పండించడం, పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయడం, పంటల మార్పిడి పాటించడం.. కంపోస్టు లేదా పశువుల ఎరువు వీలైనంత ఎక్కువ మోతాదులో వేయాలి. భూమికి ఆచ్ఛాదన కల్పించాలి.. ఈ పద్ధతులన్నీ పాటిస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా భూముల్లో ఓసీ 0.3% ఉందని చెబుతున్నారు.. జీవామృతం వాడడంతోపాటు ఈ భూములను బాగు చేసే మార్గాలేమి ఉన్నాయి..? సేంద్రియ కర్బనం 0.3% అంటే చాలా తక్కువగా ఉన్నదని అర్థం. అటువంటి భూముల్లో రైతులు చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఎండు గడ్డి తదితరాలతో, పీకేసిన కలుపు మొక్కల వంటి ఏదైనా సేంద్రియ పదార్థంతో నేలకు ఆచ్ఛాదన కల్పించాలి. భూసారాన్ని పెంపొందించడానికి రైతులు చాలా శ్రమించాల్సి ఉంటుంది. బొత్తిగా వనరుల్లేని చిన్నకమతాల నిరుపేద రైతులకు సాధ్యమేనా? సాధ్యమే.. చూడండి సార్.. ఇది మైండ్‌సెట్‌కు సంబంధించిన అంశం. మనసుంటే మార్గం ఉంటుంది. తన పొలాన్ని సేంద్రియ సేద్యంలోకి మార్చి తీరాలన్న తపన ఉన్న రైతు తర్వాత 3,4 ఏళ్ల పాటు దీక్షగా కృషి చేయాలి. చుట్టుపక్కల బంజరు భూముల్లో చెట్టూ చేమా నరికి తెచ్చి కంపోస్టు చేయొచ్చు. పొలంలో ఆచ్ఛాదనగా వేయొచ్చు. పచ్చిరొట్ట పంటలు వేయి కలియదున్న వచ్చు. పశువుల ఎరువు సమకూర్చుకోవాలి. జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు, వీలైతే వారానికోసారి భూమికి ఇవ్వగలిగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అంతేకాదు.. ఆలోచించి చేయాల్సింది సేంద్రియ వ్యవసాయం. రసాయనిక వ్యవసాయంలాగా కాదు. ప్రతి సేంద్రియ పొలమూ ప్రత్యేకమైనదే. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. రసాయనిక వ్యవసాయంలో పంట అవసరాన్ని బట్టి మనం ఎన్.పి.కె. ఎరువులు వేస్తాం. సేంద్రియ వ్యవసాయంలో భూమి సారాన్ని పెంచుతాం. సారవంతమైన భూమి దిగుబడినిస్తుంది. జీవామృతాన్ని భూమికి ఇవ్వడంతోపాటు పిచికారీపై కూడా అధ్యయనం చేశారా? జీవామృతాన్ని పంట భూముల్లో పోయడంపైనే అధ్యయనం చేశాం. పిచికారీపై చేయలేదు. పిచికారీకి పంచగవ్య బాగా ఉపయోగపడుతుంది. జీవామృతాన్ని పంట భూములకు ఎకరానికి 200 లీటర్ల చొప్పున ఇస్తుంటారు. మా పరిశోధనలో భాగంగా చెట్టు చిక్కుడు (ఫీల్డ్ బీన్) పంటకు.. పది రెట్లు ఎక్కువగా.. ఎకరానికి రెండు వేల లీటర్ల చొప్పున జీవామృతాన్ని మూడు విడతలుగా (15 రోజులకు, 30 రోజులకు, 45 రోజులకు) ఇచ్చినప్పుడు చిక్కుడు దిగుబడి అంతకుముందుకన్నా 30% పెరిగింది. గ్రాము జీవామృతంలో ఎన్ని సూక్ష్మజీవులుంటాయి? స్థిరంగా ఉండదు. బ్యాచ్‌ను బట్టి మారుతూ ఉంటుంది... గ్రాము జీవామృతంలో 20 - 30 లక్షల వరకు నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు ఉంటాయి. మిగతావన్నీ కలిపితే అంతకు పది రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే.. ద్రవరూప సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా సేంద్రియ సేద్యం చేయడం సులువైన మార్గం. సేంద్రియ కూరగాయల సాగులో పోషకాల లోపం ఉంది.. మీరేమంటారు? దేశీ ఆవు పేడ, మూత్రం, పంట వ్యర్థాలు, వేప, కానుగ, సీతాఫలం, పార్థీనియం తదితర మొక్కల సేంద్రియ వ్యర్థాలను ప్రత్యేకంగా నిర్మించిన సిమెంటు తొట్టె (బయోడెజైస్టర్ )లో వేసి 20-25 రోజులు (బెల్లం, మజ్జిగ కలిపితే ఇంకా ముందే వాడొచ్చు) కదిలించకుండా మురగబెట్టి.. ఆ ద్రవాన్ని నీటితోపాటు పంటలకు ఇవ్వొచ్చు. పిచికారీ చేయొచ్చు. రాగి, వేరుశనగ, వరి తదితర పంటల్లో ఇది మంచి ఫలితాలనిచ్చింది. ఈ ద్రవరూప ఎరువు అదనపు పోషకాలను అందించడంతోపాటు చీడపీడలను తట్టుకునే శక్తినిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే శిక్షణ ఇస్తారా? స్వల్ప ఖర్చుతో రైతు స్థాయిలో తయారు చేసుకోగల సేంద్రియ ద్రవ రూప ఎరువులపైనే ఎక్కువగా మేం అధ్యయనం చేస్తున్నాం. దీనిపై ఆసక్తి ఉంటే తప్పకుండా శిక్షణనిస్తాం. అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధమే. మీ వాళ్లెవరైనా తెలుగులోకి తర్జుమా చేసి చెప్పగలిగితే తెలుగు రైతులకు కూడా శిక్షణ ఇస్తాం. కనీసం 25-35 మంది ఉండాలి. కనీసం 3 రోజులు శిక్షణ ఇవ్వొచ్చు. లిఖితపూర్వకంగా విజ్ఞాపన పంపితే శిక్షణ ఇస్తాం. అంతేకాదు.. జీవామృతం, పంచగవ్య తదితర ద్రవరూప ఎరువుల నమూనాలను స్వల్ప ధరకే మా లేబరేటరీలో పరీక్షించి.. నివేదికలు అందజేస్తాం. - ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్ prambabu.35@gmail.com -
బొరియలు చేసే వానపాములతోనే భూమికి బలిమి!
విదేశీ వానపాములతో భూములకు ఉపయోగం లేదు.. కంపోస్టు తయారీకే అవి పరిమితం! అనుదినం భూసారాన్ని పెంచేది మన భూముల్లో ఉండే దేశీ (స్థానిక) వానపాములే! డా. సుల్తాన్ అహ్మద్ ఇస్మాయిల్ వెల్లడి మన భూములను నిరంతరం సారవంతం చేయడం మన నేలల్లో స్వతహాగా ఉండే స్థానిక వానపాముల ద్వారానే సాధ్యమవుతుందని.. విదేశీ వానపాములతో వర్మీ కంపోస్టు తయారు చేయవచ్చే తప్ప, వీటి వల్ల మన నేలలకు ఎటువంటి ప్రయోజనమూ లేదని డాక్టర్ సుల్తాన్ అహ్మద్ ఇస్మాయిల్ తేల్చి చెప్పారు. మట్టిలో జీవరాశి, పర్యావరణంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన శాస్త్రవేత్త డా. సుల్తాన్. చెన్నై న్యూ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ‘ఎకోసైన్స్ రీసెర్చ్ ఫౌండేషన్’ అనే సంస్థను నెలకొల్పారు. నిస్సారమైన మన భూములను స్థానిక వానపాముల ద్వారా తిరిగి సారవంతం చేసే పద్ధతులపై కృషి చేస్తున్నారు. ఆయన ఆంగ్లంలో రచించిన ‘ద ఎర్త్‌వార్మ్ బుక్’ ప్రసిద్ధి పొందింది. ఆయన భారతీయ సేంద్రియ రైతుల సంఘానికి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన శాశ్వత వ్యవసాయ సదస్సుకు అతిథిగా విచ్చేసిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. మన దేశంలో వానపాములకు, ఐసినా ఫోటిడా వంటి విదేశీ వానపాముల మధ్య ఉన్న తేడాలేమిటి? ప్రపంచం మొత్తమ్మీద రెండు రకాల వానపాములున్నాయి. అవి.. 1. మెగాస్కోలెసిడె, 2. లూంబ్రిసిడె. లూంబ్రిసిడ్స్ పాశ్చాత్య దేశాల్లో ఉండే వానపాములు. ఐసినా ఫోటిడా రకం వానపాములు అటువంటివే. ఇవి కేవలం కంపోస్టు తయారీ కోసమే తెప్పించారు. భూమి లోపలికి వెళ్లకుండా పైపైనే ఉండే ఇటువంటి వానపాములే కంపోస్టింగ్‌కు పనికొస్తాయి. ఇక మెగాస్కోలెసిడ్స్.. మన భారతదేశంలోని భూముల్లో సహజంగా ఉండే వానపాములు ఈ కోవకు చెందుతాయి. వీటిల్లో కొన్ని ఉపజాతులున్నాయి. పేడ ఉన్న చోట ఇవి కనిపిస్తాయి. ఇవి నిరంతరం భూమికి బొరియలు చేస్తూ కిందికీ పైకీ తిరుగుతూ భూమిని చక్కగా సారవంతం చేస్తుంటాయి. అయితే, మన వాళ్లకు విదేశీ వానపాములంటే మోజు. వీటి పని తినటం, విసర్జించడం.. అంతే. విదేశీ వానపాముల వల్ల మన భూములకు ఎటువంటి ఉపయోగమూ లేదు! విదేశీ వానపాముల వల్ల భూములకు ఉపయోగమే లేదంటారా? అవును. వీటి వల్ల మన భూములకు అసలేమీ ఉపయోగం లేదు. ఇవి కంపోస్టు తయారీకి మాత్రమే ఉపయోగపడతాయి. అందువల్లనే ఇవి కంపోస్టు షెడ్లలోనే కనిపిస్తాయి. భూమిలోకి బొరియలు చెయ్యవు కాబట్టి వీటి వల్ల భూములకు నేరుగా ఎటువంటి ఉపయోగమూ లేదు.. అవి తింటాయి, విసర్జిస్తాయి. అదే కంపోస్టు. దాన్ని పొలాలకు వేస్తున్నాం. అది పోషక విలువలతో కూడినదేనా? ఆ.. ఆ.. కంపోస్టు భూమికి పోషకాలను అందిస్తుంది. అందులో సందేహం లేదు. కానీ, ఇక్కడ విషయమేమిటంటే.. మన భారతీయ వానపాములు కంపోస్టును అందించడంతో పాటు.. భూమిలోకి లోతుగా బొరియలు చేస్తున్నాయి. తద్వారా భూమి పొరల్లోకి గాలి ప్రసరించేలా చేస్తున్నాయి. వేర్లు పెరుగు దలకు దోహదపడతున్నాయి. సేంద్రియ పదార్ధాన్ని భూమి లోతుల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇవీ వానపాముల వల్ల అదనంగా సమకూరుతున్న ప్రయోజనాలు. ఎంత ఎక్కువ వర్మీ కంపోస్టును బయటి నుంచి తెచ్చి పొలాల్లో వేస్తున్నాం అన్నది కాదు ముఖ్యం.. భూమికి తన సొంత వానపాములంటూ ఉండాలి. అప్పుడే ఆ భూమి సంపూర్ణంగా సారవంతంగా ఉండగలుగుతుంది.. అంటే.. పంట భూమిలో స్థానిక వానపాములను పెంపొందించే పనులు చేయకుండా.. కేవలం వర్మీ కంపోస్టును తీసుకెళ్లి వేయడం వృథా అనేనా మీ అభిప్రాయం..? వృథా అని కాదు, నా అభిప్రాయం.. భూసారాన్ని పెంపొందించే ప్రక్రియను మొదలు పెట్టడానికి వర్మీ కంపోస్టు ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం అందుతుంది. అంతే. స్థానిక వానపాముల వంటి జీవులు భూమిలో ఉండి పనిచేస్తే తప్ప నిస్సారమైపోయిన భూమి తిరిగి జవజీవాలను సంతరించుకోలేదు. ఉదాహరణకు... డాక్టర్ వ్యాధిని తగ్గించడానికి ఔషధం ఇస్తాడు. అయితే, ఆరోగ్యవంతం కావడం అనేది దేహం లోపలి నుంచే జరగాలి! అలాగే వర్మీ కంపోస్టును భూమికి ఔషధం మాదిరిగానే అందిస్తున్నాం.. ఐసినా ఫోటిడ వానపాములతో వర్మీ కంపోస్టు తయారు చేస్తే కంపోస్టులో భారఖనిజాలు వస్తాయని అంటున్నారు..? అలా జరగదు. వానపాములన్నీ రైతు మిత్రులే. కంపోస్టుకు మాత్రమే ఉపయోగపడే వానపాముల కన్నా.. భూమికి బొరియలు చేసే రకం వానపాములతో మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఐసినా ఫోటిడ వానపాములకు వేసే పేడ, ఇతర వ్యర్థాలలో భారఖనిజాలుంటే.. కంపోస్టులో కూడా భారఖనిజాలు ఉంటాయి. అందులో లేకపోతే.. కంపోస్టులోనూ ఉండవు. కంపోస్టు చేయడానికి వాడే ముడిపదార్థాల విషయంలో చాలా జాగ్రత్తవహించాలి. కొందరు మున్సిపాలిటీ చెత్తకుప్పల్లో నుంచి చెత్తను తీసుకెళ్లి కంపోస్టు చేయకుండానే నేరుగా పొలాల్లో వేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. రసాయనిక ఎరువులు వల్ల భూముల్లో 0.4 శాతానికి తగ్గిపోయిన సేంద్రియ కర్బనాన్ని పెంచే మార్గం ఏమిటి? పంట భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు పుష్కలంగా ఉంటేనే ఆ భూమి సజీవంగా, సారవంతంగా ఉంటుంది. రసాయనిక ఎరువులు ఎక్కువగా వేసిన భూముల్లో సూక్ష్మజీవులు, వానపాములు నశించిపోయాయి. నేలల్లో సేంద్రియ కర్బనం శాతాన్ని పెంపొందించాలన్నా, సూక్ష్మజీవులు, వానపాములను పెంపొందించాలన్నా.. గడ్డీ గాదాన్ని పొలంలో కలియదున్నాలి. పశువుల ఎరువును తగినంత వాడాలి. పూర్వం ఎకరం పొలానికి ఒకటి చొప్పున రైతుల దగ్గర ఆవులు ఉండేవి. పశువులు లేకుండా వ్యవసాయాన్ని తిరిగి నిలబెట్టడం సాధ్యం కాదు. జెర్సీ ఆవు పేడ కన్నా.. నాటు ఆవు పేడ అధిక ప్రయోజనకరమన్న అభిప్రాయం ఉంది. మీరేమంటారు..? డబ్బున్న రైతులే జెర్సీ ఆవులను పెంచుతున్నారు. పేద రైతుల దగ్గర ఉన్నది నాటు (దేశీ) ఆవులే. నాటు ఆవులతో పాటు జెర్సీ తదితర విదేశీ ఆవుల పేడలపై అధ్యయనం చేయగా.. పెద్ద తేడా కనిపించలేదు. భూములను బాగు చేసుకోవడం అత్యవసరం. పేద రైతులు తమ దగ్గరున్న ఏ పశువు పేడైనా, మూత్రమైనా సరే ఉపయోగించవచ్చు. ఇంకా చెప్పాలంటే.. మనిషి విసర్జితాలనూ ఎరువుగా వాడొచ్చు. అయితే, బాగా వేడి పుట్టే పద్ధతిలో కంపోస్టు చేసిన తర్వాతేవాడాలి. పశువుల మూత్రం మాదిరిగానే.. మనిషి మూత్రాన్ని కూడా ఒకటికి పది పాళ్లు నీరు కలిపి పంటలకు వాడుకోవచ్చు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలూ అవసరం లేదు. (డా. సుల్తాన్ ఇస్మాయిల్‌ను 093848 98358 నంబరులో లేదా sultanismail@gmail.com ద్వారా సంప్రదించవచ్చు) ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పకృతి సేద్య సూత్రాలన్నీ పాటిస్తేనే సత్ఫలితాలు!
మార్కెటింగ్ సమస్యలు అధిగమించడం ఎలా? మార్కెట్ వ్యవస్థను నమ్ముకోవచ్చు. రైతులే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవాలి. వినియోగదారులకూ నమ్మకమైన సహజాహారం సమంజసమైన ధరకు లభిస్తుంది. రైతులకూ మేలు జరుగుతుంది. తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించుకునే హక్కు రైతులకుంది. అయినా, మార్కెట్లో ఉత్పత్తుల రిటైల్ ధరపై 50%కు మించకుండా ప్రకృతి వ్యవసాయదారులు ధర నిర్ణయించుకోవడం ఉత్తమం. రైతులతో ముఖాముఖిలో సుభాష్ పాలేకర్ స్పష్టీకరణ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరోబడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ -జెడ్.బి.ఎన్.ఎఫ్.) పద్ధతులను అనుసరిస్తూ చక్కని పంట దిగుబడులు సాధిస్తున్న అన్నదాతలు తెలుగునాట నలుచెరగులా ఉన్నారు. గత కొన్నేళ్లుగా విస్తృతంగా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్న జెడ్.బి.ఎన్.ఎఫ్. పితామహుడు సుభాష్ పాలేకర్ వేలాది మంది రైతులకు ఆచరణాత్మక వెలుగుబాట చూపుతున్నారనడంలో సందేహం లేదు. ఒక రోజు, మూడు రోజులు, 5 రోజుల పాటు జరిగే శిక్షణా శిబిరాల్లో నేరుగా పాలేకర్ శిక్షణ పొందిన రైతులెందరో ఉన్నారు. వీరితోపాటు పుస్తక జ్ఞానంతో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులు మరికొందరున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తున్న క్రమంలో రైతులకు ఎన్నెన్నో సందేహాలు తలెత్తుతాయి. ఇవి తీరక రైతులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో పాలేకర్ రైతుల ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు స్వయంగా ఉపక్రమించారు. హైదరాబాద్‌లో ఇటీవల గ్రామభారతి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ముఖాముఖిలో రైతుల సందేహాలను పాలేకర్ నివృత్తి చేశారు. వాటిలో ముఖ్యమైన కొన్నిటిని ‘సాగుబడి’ పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం.. ప్రశ్న: జీరోబడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రెండేళ్ల క్రితం నుంచి దానిమ్మ తోట సాగు చేస్తున్నాం. కాయలకు పగుళ్లు వస్తున్నాయి. పరిష్కారం ఏమిటి? - సంజీవరెడ్డి, అనంతపురం పాలేకర్: జీరోబడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోని మూలసూత్రాలన్నిటినీ పాటిస్తే నూటికి నూరు శాతం ఫలితాలు పొందవచ్చు. సగం సగం చేస్తే ప్రయోజనం లేదు. దానిమ్మ చెట్ల మధ్య మునగ మొక్కలు నాటాలి. ద్విదళ, ఏకదళ పంటల గడ్డితో ఆచ్ఛాదన చేయాలి. సాలు వదిలి సాలులో కందకాలు తవ్వాలి. పప్పుధాన్య పంటలను అంతర పంటలుగా సాగు చేయాలి. వీటిలో ఏది లోపించినా ఫలితం ఉండదు. వీటిని 50% లేదా 70% అమలు చేస్తే ఫలితం రాదు. ఉండీ లేనట్టుండే నీడనివ్వడం కోసం రెండు దానిమ్మ మొక్కల మధ్య మునగ మొక్క నాటాలి. మహారాష్ట్రలో షోలాపూర్ మండలం పండరిపురంలో శరత్ షిండే (090285 98955) భగువ రకం దానిమ్మను జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 1.75 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తొలి 22 నెలల్లోనే రూ. 9,60,000 ఆదాయం పొందారు. వెళ్లి చూడండి. ప్రశ్న: నాకు 4 ఎకరాల బత్తాయి తోట ఉంది. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఆరేళ్లుగా సాగు చేస్తున్నా. ప్రకృతి వ్యవసాయంలోకి మారొచ్చా? - సి. భగవంతరావు, తుర్కపల్లి, నల్గొండ జిల్లా పాలేకర్: మీ తోటలో తప్పకుండా వెంటనే ప్రకృతి వ్యవసాయం ప్రారంభించవచ్చు. బత్తాయి మొక్కల మధ్య మునగ మొక్కలు నాటాలి. సాలు వదిలి సాలులో 3 అడుగుల వెడల్పు, అడుగు లోతులో కందకం తవ్వాలి. అలసంద, ఉలవ వంటి అపరాల పంటలను అంతరపంటలుగా వేయాలి. ప్రశ్న: పాలీహౌస్‌లలో పంటలకు బ్యాక్టీరియా, ఫంగస్ తెగుళ్లతో సతమతమవుతున్న రైతులు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలోకి మారటం సాధ్యమేనా? పాలేకర్: పాలీహౌస్‌లలో నిస్సందేహంగా ప్రకృతి సేద్యం చేయొచ్చు. ముఖ్యంగా రెండు ప్రధాన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి వాడకాన్ని పది శాతానికి తగ్గించడం, మొక్కల వేరు వ్యవస్థ వద్ద సూక్ష్మ వాతావరణం ఏర్పడేలా జాగ్రత్తపడటం అత్యవసరం. పాలీహౌస్‌లలో కూడా మల్చింగ్ చాలా అవసరం. మల్చింగ్గా వేసే గడ్డీ గాదంలో 75% ఏకదళ పంటల (వరి, జొన్న్డ, కొర్ర..) గడ్డి + 25% ద్విదళ పంటల (కంది, మినుము, పెసర, ఉలవ..) గడ్డి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే భూసారాన్ని పెంచే జీవనద్రవ్యం (హ్యూమస్) ఏర్పడుతుంది. ఏదో ఒక రకం గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే ప్రయోజనం ఉండదు. ప్రశాంత్ నికం (086001 15057), అవినాష్ మొకాటె(086050 02369) , రాంధోరాథ్ (పుణే, మహారాష్ట్ర), డా. శంకర్ పాటిల్ (నాందేడ్) తదితర రైతులు పాలీహౌస్‌లు, షేడ్నెట్లలో ప్రకృతి సేద్యంతో నిక్షేపంగా పూలు, కూరగాయలు పండిస్తున్నారు. ప్రశ్న: టమాటా తోటను సాగు చేస్తున్నాను. చేను చుట్టూ గట్టు మీద కంది మొక్కలు వేశాను. వరిగడ్డి ఆచ్ఛాదనగా వేశాను. జీవామృతం వాడుతున్నాను. అయినా టమాటాకు వైరస్ వచ్చింది. పరిష్కారం ఏమిటి? - పన్నాల వాసురెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా పాలేకర్: టమాటా పంట దిగుబడి బాగా రావాలంటే.. ముఖ్యంగా రెండు విషయాలు గ్రహించాలి. మల్చింగ్ సక్రమంగా చేయడంతోపాటు పాక్షికంగా నీడనిచ్చే కంది లేదా మునగ లేదా మొక్కజొన్న పంటను టమాటాలో అంతరపంటగా సాగు చేయాలి. వరి గడ్డి ఒక్కటే ఆచ్ఛాదనగా వేయడం అంటే.. అర్థం ఏమిటంటే.. ఇడ్లీ ఒక్కటే పెడుతున్నారు, సాంబార్ ఇవ్వటం లేదు. పాలానికి ఆచ్ఛాదనగా వరి గడ్డి లేదా చెరకు ఆకులు మాత్రమే వేస్తే చాలదు. ఇటువంటి ఏక దళ పంటల గడ్డిని మాత్రమే ఆచ్ఛాదనగా వేసినప్పుడు ప్రతి 80 కిలోల సేంద్రియ కర్బనానికి ఒక కిలో చొప్పున నత్రజని భూమికి అందుతుంది. కర్బనం, నత్రజని 10 : 1 పాళ్లలో అందుబాటులో ఉంటేనే భూమిలో జీవనద్రవ్యం ఏర్పడి పంటలు బలంగా పెరుగుతాయి. ఇందుకోసం.. వరి గడ్డితోపాటు నత్రజనిని అందించే పప్పుధాన్య పంటల కట్టెను కూడా కనీసం 25 % మేరకు వేయాలి. హ్యూమస్ పుష్కలంగా ఉంటే పంట బలంగా ఉంటుంది. అది తక్కువగా ఉంటే పంట బలహీనమై వ్యాధుల బారిన పడుతుంది. ఇక రెండో విషయం ఏమిటంటే.. టమాటా ఆకులు తీవ్రమైన ఎండను తట్టుకోలేవు. కాసేపు నీడ, కాసేపు ఎండ (డాన్సింగ్ షాడో) పడుతూ ఉంటే టమాటా పంట దిగుబడి బాగా వస్తుంది. ఎందుకంటే.. ఆరుబయట ఎండ తీవ్రత 8,000 నుంచి 12,000ల ఫుట్ క్యాండిళ్ల (ఫుట్ కాండిల్ అంటే.. చదరపు అడుగు విస్తీర్ణంలో వత్తుగా కొవ్వొత్తులను వెలిగిస్తే వచ్చే వేడి) మేరకు ఉంటుంది. కానీ, టమాటా పంటకు 5 వేల నుంచి 7 వేల వరకు సరిపోతుంది. అందుకే.. ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగయ్యే టమాటా తోటలో కంది, మునగ, మొక్కజొన్న వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయడం తప్పనిసరి. తద్వారా టమాటా మొక్కలకు తగిన నీడను అందించి, అధిక దిగుబడి పొందవచ్చు. మీరు అంతర పంటలుగా మునగ, మొక్కజొన్న వేయండి. ఈ లోగా 100 లీ. నీటికి 10 లీ. జీవామృతం కలిపి పంట మీద పిచికారీ చేస్తుండండి. టమాటాలు సగం సైజుకు పెరిగినప్పుడు సప్తధాన్యాంకుర్ కషాయం పిచికారీ చేయండి. మంచి దిగుబడి వస్తుంది. ప్రశ్న: ఆకులపై నల్లమంగు తెగులు వస్తోంది. ఏం చేయాలి? పాలేకర్: 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల జీవామృతం + 5 లీటర్ల పుల్ల మజ్జిగ కలిపి పిచికారీ చేస్తే శిలీంద్రాలు / వైరస్ల సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ప్రశ్న : మామిడి చెట్లపై పిండినల్లిని నియంత్రించడం ఎలా? పాలేకర్: మిత్రపురుగుల ద్వారా సహజ పద్ధతుల్లో పిండినల్లిని నియంత్రించడమే సులభమార్గం. పిండినల్లిని తినే మిత్రపురుగులు 36 రకాలున్నాయి. వీటిలో రెండు రకాలు మరింత ప్రభావశీలంగా పనిచేస్తాయి. ఈ మిత్రపురుగులు మీ తోటలో పుష్కలంగా ఉండాలంటే అలసంద, బంతి, మొక్కజొన్న, మునగ, తులసి వంటి పంటలను అంతరపంటలుగా సాగు చేయాలి. జీవ నియంత్రణ పద్ధతులతో ప్రకృతిసిద్ధంగా పరిష్కారం ఉంది. రసాయనిక పురుగు మందులు చల్లవద్దు. ప్రశ్న : ఆకుకూరల్లో ఆచ్ఛాదన (మల్చింగ్) సాధ్యం కావడం లేదు. వరిపొట్టును ఆచ్ఛాదనగా వాడొచ్చా? పాలేకర్: మల్చింగ్ మూడు రకాలు. పంట పొలంలో మొక్కల మధ్య ఖాళీని గడ్డీగాదంతో ఆచ్ఛాదన (స్ట్రా మల్చింగ్) చేయవచ్చు. అసలు ఖాళీయే లేకుండా వత్తుగా పంటలను సాగు చేయవచ్చు (లైవ్ మల్చింగ్). ఈ రెండూ సాధ్యం కాని చోట పంట మొక్కల మధ్య ఎండపడే నేలను (ఒకటి, రెండు అంగుళాల లోతున) తవ్వడం (సాయిల్ మల్చింగ్). ఆకుకూరలు సాగు చేసే మడుల్లో సాధారణంగా సజీవ ఆచ్ఛాదన ఏర్పడుతుంది. కాబట్టి ఈ మడుల్లో మళ్లీ వరి పొట్టుతో మల్చింగ్ చేయనవసరం లేదు. అయితే, మిరప, టమాట, వంగ, బెండ, గోరుచిక్కుడు, కాలీఫ్లవర్ తదితర కూరగాయల తోటల్లో వరి పొట్టును మల్చింగ్గా వాడొచ్చు. ఒక సాలులో మల్చింగ్ వేస్తే, మరో సాలులో నీటిని అందించేందుకు కాలువ తవ్వాలి. ఈ తోటల్లో వరి పొట్టును మల్చింగ్గా వేసే సాళ్లలో పప్పుధాన్యాల పంటలను అంతర పంటలుగా సాగు చేయాలి. మల్చింగ్ వల్ల పగలు ఎండ నుంచి నేలను రక్షించడంతోపాటు రాత్రి పూట మంచు నీటిని ఒడిసిపట్టి నేలకు అదనపు తేమను అందిస్తుంది. ఇందువల్లనే జీరోబడ్జెట్ ప్రకృతి సేద్యంలో కరువు కాలంలోనూ 10% నీటితోనే చక్కగా కూరగాయ పంటలు పండించవచ్చు. ప్రశ్న: మునగ తోటలో ఆకులు తినే గొంగళి పురుగులు దశపర్ణి కషాయం, అగ్నిఅస్త్రం చల్లినా కంట్రోల్ కావడం లేదు...? పాలేకర్: ఈ సమస్య దేశీ మునగ వంగడాల సాగు చేసే పొలాల్లో ఉండదు. పీకేఎం1, పీకేఎం2, హైబ్రిడ్ మునగ వంగడాలతోనే ఈ సమస్య వస్తున్నది. మునగలో పసుపు, అల్లం, మిరప వంటి అంతరపంటలు వేయాలి. 100 లీ. నీటిలో 5 లీ. దశపర్ణి కషాయం కలిపి పిచికారీ చేయండి. కొమ్మలు కత్తిరించండి. మొక్కలోని శక్తిని రొట్ట పెరుగుదలకు కాకుండా కాయలకు అందించడానికి ఇది అవసరం. ప్రశ్న: బొప్పాయి తోటకు వైరస్ బెడద ఎక్కువగా ఉంది...? - పడాల గౌతమ్, ముల్కనూరు, ఆదిలాబాద్ జిల్లా పాలేకర్: బొప్పాయి మొక్కలకు నీటిని తగుమాత్రంగా ఇవ్వాలి. ప్రకృతి వ్యవసాయంలో ఒకానొక మూల సూత్రమైన ‘వాఫస’ ఏర్పడేలా చూడాలి. అంటే వేళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పంట మొక్కల వేళ్లకు కావాల్సింది నీరు కాదు, నీటి ఆవిరి మాత్రమేనని గుర్తించాలి. పంటల వేరు వ్యవస్థ దగ్గర రెండు మట్టి కణాల మధ్య నీరు ఉండకూడదు.. 50% నీటి ఆవిరి, 50% గాలి అణువులు కలిసి ఉండాలి. ఈ స్థితినే ‘వాఫస’ అంటున్నాము. ఇది జరగాలంటే.. మిట్ట మధ్యాహ్నం మొక్క / చెట్టు చుట్టూ నీడ పడే చోటుకు ఆరు అంగుళాల దూరంలో చిన్న కాలువ తవ్వి నీరందించాలి. ప్రశ్న :వేరుశనగలో పొగాకు లద్దె పురుగు తీవ్రతను అరికట్టేదెలా? - ఊర్మిళమ్మ, రైతు పాలేకర్: వేరుశనగ పంటకు తీవ్రమైన ఎండ అక్కర్లేదు. 4 వేల నుంచి 7 వేల ఫుట్ క్యాండిళ్ల ఎండ చాలు. ఖరీఫ్‌లో కంది, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు.. రబీలో ఆవాలను అంతర పంటగా వేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల ఘన జీవామృతం వెదజల్లాలి. పూత దశలో మరో 100 కిలోల ఘనజీవామృతం వెదజల్లాలి. ప్రతి 15 రోజులకోసారి జీవామృతం పిచికారీ చేయాలి. అయినా, చీడపీడలొస్తే.. నీమాస్త్రం, అగ్రిఅస్త్రం, దశపర్ణి కషాయం పిచికారీ చేయాలి. ప్రశ్న: సెలైన్ నేలలను తిరిగి సాగుకు అనుగుణంగా మార్చుకోవడం సాధ్యమేనా? పాలేకర్: ఈ ప్రశ్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లను అడగాలి. రసాయనిక ఎరువులు వాడమని చెప్తున్నది వాళ్లే. పొలాల్లో వేసిన యూరియాలో 30% అమ్మోనియా మాత్రమే పంటలకు ఉపయోగపడుతోంది. మిగిలిపోయిన 70 % అమ్మోనియా భూమిలో జీవనద్రవ్యాన్ని రూపొందించే సూక్ష్మజీవరాశిని నాశనం చేస్తున్నది. లవణాల సాంద్రతతో భూమి చౌడు బారిపోతున్నది. అటువంటి సమస్యాత్మక భూముల్లో మడుల మధ్య కందకాలు తవ్వి.. 3 అంగుళాల మందాన గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేయించి జీవామృతం పిచికారీ చేస్తుంటే.. నేలలో పోగుపడిన లవణాలు క్రమంగా తగ్గుతాయి. - సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ప్రకృతి పూలు!
జెర్బెరా సాగులో కొత్తపుంతలు ♦ పాలిహౌస్‌లో ప్రకృతి సేద్యంతో కొత్తపుంతలు ♦ జీవామృతం, పుల్లమజ్జిగతో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులుకు కళ్లెం ♦ ట్రైకోడెర్మాతో బూజు తెగులుకు చెక్ ♦ పెరిగిన పూల నిల్వ సామర్థ్యం ♦ భారీగా తగ్గిన సాగు ఖర్చు..పెరిగిన నికరాదాయం పాలిహౌస్‌లో ఖరీదైన అలంకరణ పూల పెంపకం అంటే.. కత్తి మీద సామే! పాలిహౌస్ రైతులంతా సాధారణంగా రసాయనిక వ్యవసాయ పద్ధతినే అవలంబిస్తున్నారు. పాలిహౌస్ రైతులు ఖర్చుకు వెనకాడకుండా శ్రద్ధగా సేద్యం చేస్తున్నప్పటికీ.. ఎడతెగని చీడపీడలు గడ్డు సమస్యగానే మిగిలిపోతున్నాయి. ఎప్పుడు ఏ తెగులొస్తుందోనన్న దిగులుతో నిద్రపట్టని స్థితి. అయితే, విద్యాధికుడైన యువ రైతు యల్లారెడ్డి.. పాలిహౌస్ సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాటకు మలిపి.. ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తున్నారు. నాణ్యమైన పూల దిగుబడి తీస్తూ నిశ్చింతగా అధిక నికరాదాయం పొందుతున్నారు. పచ్చని సేద్యాన్ని పాలిహౌస్లోకి ప్రవేశపెట్టి.. తెలుగునాట కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పాలిహౌస్ సేద్య చరిత్రలో నిస్సందేహంగా ఇదొక విప్లవమే! సామ యల్లారెడ్డికి 34 ఏళ్లు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం లింగంపల్లిలో పుట్టారు. బీకాం కంప్యూటర్స్ చదివిన తర్వాత ఫ్రాన్స్ వెళ్లి ఎంబీఏ (కమ్యూనికేషన్స్) పూర్తిచేసి.. ఆ దేశంలోనే మాడ్రిడ్ నగరంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఎనిమిదేళ్లు గడిచాయి. సీనియర్ కన్సల్టెంట్‌గా నెలకు రూ. 2 లక్షల ఆదాయం వచ్చేది. గ్రీన్కార్డుంది. రోజంతా కంప్యూటర్ ముందే కూలబడడం.. ఏడాదిలో ఎక్కువ నెలలు మంచు కురిసే ప్రతికూల వాతావరణంలో జీవనం.. ప్రకృతికి దూరమైన గానుగెద్దు జీవితంలో ఏదో తీరని వెలితి! యోగ, మెడిటేషన్ చేయడంతోపాటు నలుగురికీ నేర్పించడం వంటి పనుల్లో లీనమైనా.. ఒకరకమైన పరాయితనమేదో వెంటాడుతుండేది.. యల్లారెడ్డి, సునీత దంపతులు ఇక చాలు అనుకొని 2012లో తమ రెండేళ్ల బాబును చంకనెత్తుకొని ఇంటికొచ్చేశారు. మళ్లీ ఉద్యోగంలో చేరకుండా.. మెదక్ జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లిలోని తమ ఆరెకరాల వ్యవసాయ క్షేత్రంలో 2013లో వ్యవసాయం చేపట్టారు. ప్రభుత్వ సబ్సిడీతో అరెకరంలో పాలిహౌస్ నిర్మించారు. అందులో గత ఏడాది ఫిబ్రవరి నుంచి జెర్బెరా పూలను సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో, తక్కువ కూలీలతో, తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి తీయాలన్న లక్ష్యంతో పాలిహౌస్ సేద్యం ప్రారంభించారు. ఎర్రమట్టిలో పశువుల ఎరువు, ఊక కలిపి బెడ్స్ తయారు చేసుకొని ఎరుపు, పసుపు, తెలుపు వంటి ఏడు రంగుల పూలనిచ్చే 11,500 జెర్బెరా మొక్కలు నాటారు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రసాయనిక ఎరువులు, మైక్రోన్యూట్రియంట్లు, యాంటీబయోటిక్స్, గ్రోత్ప్రమోటర్లు, యాసిడ్లు.. ఎప్పుడు ఏది అవసరమైతే అది వాడుతూ శ్రద్ధగా సేద్యం చేశారు. ‘సగటున రోజుకు 1600 పూలను కత్తిరించి మార్కెట్‌కు తరలించే వాళ్లం. అయితే, కొద్ది నెలలకు పరిస్థితిలో మార్పొచ్చింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా క్రమంగా ఏదో ఒక చీడపీడల సమస్య నిత్యం వెంటాడుతూ ఉండేద’ని యల్లారెడ్డి అంటారు. ముఖ్యంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు (బ్యాక్టీరియల్ బ్లైట్) ముప్పుతిప్పలు పెట్టింది. రసాయనిక పురుగుమందులు, యాంటీబయోటిక్స్.. కొనుగోళ్లకే నెలకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు ఖర్చు చేసినా ఫలితం ఆశించినంతగా లేదు. తెలంగాణ రాష్ట్ర పాలిహౌస్ యజమానుల సంఘం కార్యదర్శి కూడా అయిన యల్లారెడ్డి తనకు తెలిసినంతలో ఉత్తమ కన్సల్టెంట్లను సంప్రదించారు. ఒకరి తర్వాత మరొకరు ముగ్గురు కన్సల్టెంట్లను మార్చినా ఫలితం లేదు. రూ. 80 వేల వరకు ఖర్చయినా ఆకుమచ్చ తెగులు అదుపులోకిరాలేదు. దీని బారిన పడిన మొక్క చనిపోదు కానీ, ముడుచుకుపోయి ఎదుగుదలకు నోచుకోదు. పూల దిగుబడి దెబ్బతింటుంది. పాలీహౌస్లో 20-30% జెర్బెర మొక్కలకు ఆకుమచ్చ తెగులు సోకిన దశలో.. ఇక రసాయనిక వ్యవసాయ పద్ధతిలో దీన్ని అదుపు చేయడం సాధ్యం కాదని యల్లారెడ్డి నిర్థారణకు వచ్చారు. వెతకబోయిన తీగ... అటువంటి సంక్షోభ దశలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి తన మిత్రుల ద్వారా ఆయన తెలుసుకున్నారు. 2015 జూన్ 1-3 తేదీల్లో కరీంనగర్లో గ్రామభారతి నిర్వహించిన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం మూలసూత్రాలను ఆకళింపు చేసుకున్న తర్వాత.. యల్లారెడ్డికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. తన జెర్బెరా తోటలో ఎదురవుతున్న గడ్డు సమస్యలకు సరైన పరిష్కారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో లభిస్తాయన్న నమ్మకంతో ముందడుగు వేశారు. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులుకు కళ్లెం పాలిహౌస్ వ్యవసాయంలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. రసాయనిక వ్యవసాయంలో దీనికి పరిష్కారం లేదని యల్లారెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఇది మరీ తీవ్రమైతే మొక్కలు పీకేసి మళ్లీ వేసుకోవడమో, లేకుంటే ఏకంగా కొత్త బెడ్స్ వేసుకోవడమే మేలంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో యల్లారెడ్డి తన పాలిహౌస్‌లో జూన్ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ధైర్యంగా అమలు పరిచారు. కొద్ది రోజుల్లోనే ఆకుమచ్చ వ్యాప్తి ఆగిపోయింది. ఒక మోస్తరుగా సోకిన మొక్కలు తిప్పుకొని, తిరిగి పూలు పూచాయి. జీవామృతం, పుల్లమజ్జిగ వాడి ఉండకపోతే ఈపాటికి 30% వరకు మొక్కలకు బ్లైట్ విస్తరించి ఉండేదని ఆయన అంచనా. రసాయనాలు వాడకుండా సున్నితమైన జెర్బెరా తోటను కాపాడుకోవడం విశేషం. జీవామృతంతో బెడ్స్ సారవంతం.. తన అరెకరం పాలిహౌస్‌లో 30 లీటర్ల జీవామృతాన్ని 5-7 రోజుల మధ్యలో డ్రిప్ ద్వారా నేలకు ఇస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు 25-30 నిమిషాలపాటు నీరందించే వారు. ఇప్పుడు 15 నిమిషాలపాటు ఇస్తే సరిపోతోంది. డ్రిప్ ద్వారా మొదటి 5 నిమిషాలు నీరు, తర్వాత 5 నిమిషాలు జీవామృతం కలిపిన నీరు, చివరి 5 నిమిషాలు నీరు ఇస్తున్నారు. జీవామృతం పిచికారీ చేయడం వల్ల మొక్కల ఆకులు, కాండం తడిసి వేరు వరకు వెళ్లి బ్లైట్ ఇన్ఫెక్షన్ను అరికడుతోంది. మొక్కకు 800 ఎం.ఎల్. వరకు ఇచ్చే నీటిని 400 ఎం.ఎల్.కు తగ్గించారు. జీవామృతం ప్రభావం వల్ల బెడ్స్‌లో మట్టి గుల్లబారింది. జెర్బెర మొక్కల కింది ఆకులను నెలకోసారి తీసి బయట పారేసేవాళ్లు. పాలేకర్ సూచన మేరకు ఎండాకులను మొక్కల వద్దే ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ఆ తర్వాత వానపాముల సంఖ్య బాగా పెరిగింది. రసాయనిక సేద్యంలో మాదిరిగా బెడ్స్‌లో మట్టిని కూలీలను పెట్టి గుల్లపరచాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడా పనిని సూక్ష్మజీవులు, వానపాములే చేస్తున్నాయి. సూక్ష్మపోషకాల లోపం అన్న మాటే లేదు. పువ్వు ఐదు రోజులు వాడిపోకుండా ఉంటుంది.. గతంలో అరగంట వరకు నీరు వదిలినా బెడ్లపై మట్టి గట్టిగా ఉండడం వల్ల నీరు లోపలికి ఇంకేది కాదు. బెడ్ పైనుంచే పొర్లిపోయేది. మొక్కల వేళ్లకు తేమ అందేది కాదు. ఇప్పుడు ఆ సమస్య లేకపోవడాన్ని యల్లారెడ్డి గమనించారు. నీటి తేమతోపాటు ప్రాణవాయువు కూడా సక్రమంగా అందడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, బలంగా ఎదుతున్నాయి. కాడ బలంగా ఉంటున్నది. పువ్వులు ఇంతకుముందు మూడో రోజుకే వాడిపోయేవి. ఇప్పుడు ఐదు రోజుల వరకు బాగుంటున్నాయి. అందువల్ల ఢిల్లీ మార్కెట్‌కు ఇవి అనువుగా ఉండటం విశేషం. ట్రైకోడెర్మాతో బూజు తెగులుకు చెక్ చలికాలంలో సాధారణంగా వచ్చే బూజు తెగులును పారదోలడానికి ట్రైకోడెర్మా విరిడి ద్రావణాన్ని వాడుతున్నారు. ప్లాస్టిక్ డ్రమ్ములో వంద లీటర్ల నీరు పోసి, కిలో ట్రైకోడెర్మా విరిడి పొడిని, కిలో బెల్లం, కిలో పప్పుల పిండిని కలిపి.. రెండు రోజులు మురగబెట్టిన తర్వాత పిచికారీ చేస్తున్నారు. వంద లీటర్ల నీటికి 5 లీటర్ల ద్రావణాన్ని 5 రోజులకోసారి చల్లితే బూజు తెగులు పరారవడం యల్లారెడ్డి అనుభవంలో తేలింది. ప్రకృతి సేద్యంలోకి మారితే.. నేలలో ఇంతకుముందున్న ఎరువుల నిల్వలతో ఒకటి -రెండు నెలలే దిగుబడి బాగుంటుందని, ఆ తర్వాత తగ్గిపోతుందని కొందరు హెచ్చరించారు.. అయినా యల్లారెడ్డి వెనుకంజ వేయలేదు. పట్టుదలతో ముందడుగేసి కొత్త ఒరవడి సృష్టించడం ప్రశంసనీయం. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ‘ఫైవ్ లేయర్’లోనూ జెర్బెరా పూలు! రసాయనిక వ్యవసాయంతో విసిగిపోయిన నాకు పాలేకర్ ప్రకృతి వ్యవసాయం కొత్తదారి చూపించింది. జెర్బెరా పూలను పెంచడానికి పాలిహౌసే ఉండాలనేమీ లేదు. మామూలు పొలంలోనూ పెంచవచ్చు. అయితే, పాలేకర్ చెబుతున్న విధంగా.. వేర్వేరు ఎత్తులకు ఎదిగే ఐదు రకాల పంటలను కలిపి (ఫైవ్ లేయర్ మోడల్) సాగు చేస్తూ.. ఆ పంటల నీడన జెర్బెరా వంటి ఖరీదైన పూల సాగును కూడా చేపట్టవచ్చన్న నమ్మకం నాకుంది. ఇటీవలే ఒక ఎకరంలో ఈ తరహా సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించాను. ఎరువులను ప్రత్యేకంగా మనం పంటలకు అందించాల్సిన అవసరం లేదు. పోషకాలను అందించే విధంగా భూమిని జీవామృతం, ఆచ్ఛాదన, మిశ్రమ పంటల సాగు ద్వారా సారవంతం చేస్తూ ఉంటే చాలు. పాలిహౌస్‌లో ప్రతి 4 జెర్బెర మొక్కల మధ్యన ఒక బొబ్బర /అలసంద మొక్క నాటమని పాలేకర్ సూచించారు. త్వరలో ఆ పని చేయబోతున్నా. జెర్బెరా మొక్కల జీవనకాలం మూడేళ్లంటారు. మా తోట ఐదేళ్లూ ఉంటుందనుకుంటున్నా. - యల్లారెడ్డి సామ (99597 42741), విశ్వనాథపల్లి, కొండపాక మండలం, మెదక్ జిల్లా దిగుబడి తగ్గలేదు.. ఖర్చు తగ్గింది..! అరెకరం పాలిహౌస్‌లో 11,500 మొక్కలున్నాయి. సగటున రోజుకు 1,600 పూలు కోస్తున్నారు. తోట తొలి రోజుల్లో రోజుకు 2 వేల వరకు కోసేవారు. తర్వాత చీడపీడల వల్ల దిగుబడి తగ్గింది. రసాయనిక వ్యవసాయంలో నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారిన తర్వాత అంత దిగుబడి రాదని కొందరు భయపెట్టారు. అయితే, ఇప్పుడు కూడా సగటున రోజుకు 1,600 పూలు వస్తున్నాయని యల్లారెడ్డి సంబర పడుతున్నారు. రసాయనిక వ్యవసాయంలో కూలీల ఖర్చు సహా నెలకు రూ. 60 వేల నుంచి రూ. 70 వేలు అయ్యేది. ప్రకృతి సేద్యంలో ఇది రూ. 18 వేలకు తగ్గింది. అరెకరం పాలిహౌస్ ద్వారా ఇప్పుడు నెలకు సగటున రూ. 75 వేల నికరాదాయం వస్తోందని యల్లారెడ్డి సంతోషంగా చెప్పారు. -
తన పంటకు ధర నిర్ణయించుకునే హక్కు రైతుకుంది!
ఐటీ, తదితర వృత్తి నిపుణుల శిబిరంలో పాలేకర్ స్పష్టీకరణ ప్రకృతి ఆహారం వట్టి ఆహారం మాత్రమే కాదని.. అది ఔషధమని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులకు ఇటీవల హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన ఉత్పత్తులకు ధర నిర్ణయించుకునే హక్కు రైతుకు ఉన్నదన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే ఆహారోత్పత్తులను రైతులు మార్కెట్ కన్నా అధిక ధరలకు అమ్మటం ఎంతవరకు సమంజసం? ప్రకృతి వ్యవసాయదారులు పండించి మీకు అందించేది మామూలు ఆహారం కాదు.. అది ఔషధం! తాను పండించిన పంటకు తానే ధరను నిర్ణయించుకునే హక్కు రైతులకు ఉంది. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు. మార్కెట్లో ఏ వస్తువు ధరనైనా ఉత్పత్తిదారుడే నిర్ణయించి అమ్ముతాడు. వాళ్లు చెప్పిన ధరకు కొనడంలో లేని అభ్యంతరం రైతు దగ్గరకొచ్చేటప్పటికి ఎందుకో నాకు అర్థం కావటం లేదు. అసలు రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులను (మార్కెట్ హెచ్చుతగ్గులతో నిమిత్తం లేకుండా) ముందుగా నిర్ణయించిన ధరకే రైతులు నేరుగా వినియోగదారులకు విక్రయించుకోవడం మంచిది. ఇందుకోసం రైతుల బృందాలు, వినియోగదారుల బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. గోబర్ గ్యాస్ స్లర్రీని ద్రవ జీవామృతం తయారీలో వాడొచ్చా? ద్రవ జీవామృతం తయారీలో భాగంగా పులియబెట్టే ప్రక్రియ కోసం, భూమిలో జీవనద్రవ్యం (హ్యూమస్)ను పెంపొందించడం కోసం మనకు ఏరోబిక్ బ్యాక్టీరియా అవసరం. ఈ బ్యాక్టీరియాకు ఆక్సిజన్ అవసరమవుతుంది. గోబర్ గ్యాస్ స్లర్రీలో ఏరోబిక్ బ్యాక్టీరియా ఉండదు. ఎనరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ద్రవ జీవామృతం తయారీకి స్లర్రీ పనికిరాదు. కానీ, గోబర్ గ్యాస్ స్లర్రీని ఘన జీవామృతం నంబర్ 2 తయారీకి వాడుకోవచ్చు. దీనికి గాను.. స్లర్రీని ఆరుబయట ఎండబెట్టి, ఎండిన స్లర్రీని పొడిగా మార్చి వాడుకోవచ్చు. స్లర్రీ పొడి 50 కేజీలు, 40 కేజీల దేశీ ఆవు పేడతో పాటు, కిలో బెల్లం, కిలో పప్పుల (శనగపప్పు పొడి, మినప్పప్పుపొడి.. ఏదైనా పప్పుల) పొడిని వేసి కలిపి కుప్పగా చేయాలి. 48 గంటల తర్వాత ఆ మిశ్రమాన్ని ఆరుబయట ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత ఈ ఘన జీవామృతాన్ని నిల్వ చేసుకొని ఎకరంలో పంటలకు వాడుకోవచ్చు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి అధిక సాంద్రతలో పంటలను సాగు చేయవచ్చా? నిస్సందేహంగా చేయొచ్చు. అధిక సాంద్రతలో విజయవంతంగా సాగు చేస్తున్న అనేక పంటల నమూనాలు మన ముందున్నాయి. ముడి బియ్యం లేదా సింగిల్ పాలిష్ బియ్యం మిల్లు పట్టించిన తర్వాత నిల్వ చేసేటప్పుడు పురుగు పట్టకుండా బోరిక్ పౌడర్ కలపవచ్చా? వద్దు.. వద్దు.. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆహార ధాన్యాల్లో బోరిక్ పౌడర్ కలపడం మంచిది కాదు. ఆహార ధాన్యాలకు తగు మాత్రంగా ఆముదం కలిపి ఎండబెట్టాలి. ఆ తర్వాత వేపాకులు వేసి గన్నీ బాగ్స్‌లో వీటిని నిల్వచేయాలి. దానిమ్మలో మునగను అంతర పంటగా సాగు చేయొచ్చా? దానిమ్మ తోటలో మునగను నిస్సందేహంగా సాగు చేయొచ్చు. రెండు దానిమ్మ మొక్కల మధ్య మునగ మొక్క నాటుకోవాలి. మిరప, అల్లం, పసుపు, శనగతోపాటు కూరగాయ పంటలను సైతం దానిమ్మ తోటలో అంతర పంటలుగా సాగు చేయవచ్చు. ఈ పద్ధతిలో చక్కని దిగుబడులిస్తున్న దానిమ్మ తోటలు మహారాష్ట్రలో ఉన్నాయి. మీరు వచ్చి చూడండి. టై గార్డెన్లో తరచూ మట్టిని మార్చుతున్నాం.. ఇది సరైనదేనా? మేడపైన మడులు, కుండీల్లో మట్టిని మార్చనక్కర్లేదు. కొత్త పంటలు వేసినప్పుడు ఆ మట్టిలోనే కొద్ది మొత్తంలో ఘన జీవామృతాన్ని కలిపి అదే మట్టిని తిరిగి వాడుకోవచ్చు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
హెక్టారుకు 12 టన్నుల దిగుబడి
గ్రీన్ సూపర్ రైస్.. త్వరలో విడుదల! విపత్కర పరిస్థితులు సృష్టిస్తున్న వాతావరణ మార్పులు (అధిక ఉష్ణోగ్రత, కరువు, కుండపోత వానలు, నీటి ముంపు..), అంతకంతకూ తరిగిపోతున్న ప్రకృతి వనరులు (భూసారం, సాగునీరు..), వేగంగా పెరుగుతున్న సేద్యపు ఖర్చులు.. ప్రపంచవ్యాప్తంగా వరి సేద్యానికి పెను సవాళ్లుగా మారాయి. మన దేశంలో గత పదేళ్లుగా వరి దిగుబడుల్లో పెరుగుదల స్తంభించిపోయింది. రసాయనిక ఎరువుల మోతాదు ఎంత పెంచినా దిగుబడి పెరగని పరిస్థితుల్లో వరి సేద్యం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన స్థానం (ఇరి), చైనీస్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ (కాస్) ఉమ్మడి కృషితో వందలాది సంప్రదాయ వరి వంగడాల్లో సద్గుణాలను కలబోసి.. గ్రీన్ సూపర్ రైస్ (జీఎస్సార్) పేరిట సరికొత్త వరి వంగడాలు రూపొందించి, అనేక దేశాల్లో క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ‘భారత్‌లో 13 జీఎస్సార్ వంగడాలు గత రెండేళ్లుగా సాగు చేయించాం. వీటిల్లో 4 లేక 5 వంగడాలు చాలా మెరుగైన ఫలితాలనిచ్చాయి. 2016లో వీటిని అధికారికంగా భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నామ’ని జీఎస్సార్ ప్రాజెక్ట్ లీడర్, దక్షిణాసియా - ఆఫ్రికా ప్రాంతీయ సమన్వయకర్త డా. జవహర్ అలీ వెల్లడించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన డా. అలీ ఫిలిప్పీన్స్ నుంచి ఇటీవల స్వస్థలానికి వచ్చిన సందర్భంగా.. గ్రీన్ సూపర్ రైస్ ప్రాజెక్ట్ డెరైక్టర్, ‘కాస్’ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డా. లి ఝి-కంగ్తో కలిసి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘సాగుబడి’ కథనాల ఫలితంగా తెలుగునాట ఇప్పటికే వందల మంది రైతులకు ఈ వంగడాలు చేరడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘2 వారాల వరకు నీటి ముంపు లేదా తీవ్రమైన బెట్ట పరిస్థితులను తట్టుకొని నిలబడటమే కాదు.. సగటు కన్నా అధిక దిగుబడినివ్వడం, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు 25% తక్కువ వనరులతోనే సగటు కన్నా అనేక రెట్లు ఎక్కువ దిగుబడినివ్వటం జీఎస్సార్ వంగడాల ప్రత్యేకత. ఎల్‌నినో వల్ల తీవ్ర కరువు పరిస్థితులున్నప్పటికీ ఫిలిప్పీన్స్, భారత్, ఆఫ్రికా దేశాల్లో జీఎస్సార్ వంగడాలు రైతులకు సంతృప్తికరమైన దిగుబడులను ఇస్తున్నాయి. భారత్‌లో 13 జీఎస్సార్ సూటి రకం వంగడాల్లో 4,5 రకాలు చాలా బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతులు నీటి కొరత లేని పరిస్థితుల్లో హెక్టారుకు 12 టన్నుల వరకు దిగుబడి సాధించారు (భారత్ సగటు వరి దిగుబడి హెక్టారు/ 2.5 టన్నులు). అందువల్ల ఈ వంగడాలను 2016లో బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాం. తొలి దశలో రైతుల నుంచి రాయల్టీ వసూలు చేయబోము. భారత ప్రభుత్వం చప్పున ఈ వంగడాలను అందిపుచ్చుకోగలిగితే రైతుల నికరాదాయం పెరుగుతుంది..’. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
జీఎం ఆహారానికి గడ్డుకాలం
జన్యుమార్పిడి(జీఎం) పంటలు రంగంలోకి వచ్చిన తర్వాత సాధారణ విత్తనాల ద్వారా పండిన ధాన్యాలు, ఆహారోత్పత్తుల్లో జన్యుమార్పిడి విత్తనాల ద్వారా పండిన ధాన్యాలు, ఆహారోత్పత్తులు కలిసిపోతుండడం అంతర్జాతీయ సమస్యగా మారింది. ఆహార కల్తీ ప్రపంచవ్యాప్త సమస్య. సాధారణంగా నాణ్యమైన ఆహారోత్పత్తులను నాసిరకం ఉత్పత్తులతో కల్తీ చేస్తుం టారు. కానీ, జన్యుమార్పిడి(జీఎం) పంటలు రంగంలోకి వచ్చిన తర్వాత సాధారణ విత్తనాల ద్వారా పండిన ధాన్యాలు, ఆహారోత్పత్తుల్లో జన్యుమార్పిడి విత్తనాల ద్వారా పండిన ధాన్యాలు, ఆహారోత్పత్తులు కలిసిపోతుండడం అంతర్జాతీయ సమస్యగా మారింది. జన్యుమార్పిడి పంటల సంఖ్య, సాగు విస్తీర్ణం పెరుగుతున్నకొద్దీ ఇది జటిలమవుతోంది. గత ఏడాది నవంబరు చివర్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 60 వేల టన్నుల మొక్కజొన్నల్లో జీఎం మొక్కజొన్నలు కలిసినట్లు తేలడంతో చైనా వాటిని వెనక్కి పంపేయడం ఇందుకు ప్రబల నిదర్శనం. జన్యుమార్పిడి పంటలపై ఆహార, వ్యవసాయ సంస్థ సర్వే నిర్వహించడం విశేషం. జన్యుమార్పిడి పంటల వల్ల వినియోగదారులకు, పర్యావరణానికి దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలు ఎదురవుతాయన్న బలమైన సందేహాలతో కొన్ని దేశాలు పటిష్టమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. 25 దేశాల్లో చుక్కెదురు ఇతర దేశాల నుంచి తాము దిగుమతి చేసుకున్న ధాన్యాల్లో అవాంఛిత జన్యుమార్పిడి ధాన్యాలు కలిసినట్టు పసిగట్టిన 25 దేశాలు ఆ దిగుమతులను తిరస్కరించాయని ఇటీవల ఎఫ్ఏవో నిర్వహించిన సర్వేలో తేలింది. మొక్కజొన్నలను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం అమెరికా. అమెరికా నుంచి మొక్కజొన్నలను దిగుమతి చేసుకుంటున్న ముఖ్యదేశాల్లో మూడోది చైనా. 2013-14లో భారీగా 70 లక్షల టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోదలచిన చైనా... గత నవంబర్ చివర్లో ఒకేసారి 60 వేల టన్నుల మొక్కజొన్నలను వెనక్కి పంపేయడం వాణిజ్య వర్గాల్లో కలకలం రేపింది. జీఎం పంటలను చైనా సాగుచేస్తున్నప్పటికీ జన్యుమార్పిడి మొక్కజొన్నలను ఆ దేశ చట్టాలు అనుమతించడం లేదు. దీంతో అమెరికా జీఎం మొక్కజొన్నలు కలిసిన దిగుమతులకు చైనా నిర్ద్వంద్వంగా ‘నో’ చెప్పేసింది. ఆ కొద్దిరోజులకే ఎఫ్ఏవో హుటాహుటిన రంగంలోకి దిగి, జన్యుమార్పిడి ఆహార ధాన్యాల వాణిజ్యం తీరుతెన్నులపై మొట్టమొదటిగా అంతర్జాతీయ సర్వే నిర్వహించింది. 198 సంఘటనల నమోదు సర్వేలో భాగంగా 28 ఐరోపా దేశాలు సహా 193 సభ్యదేశాలకు ఎఫ్ఏవో జీఎం పంటలకు సంబంధించిన 21 ప్రశ్నలు పంపగా, 75 దేశాలు మాత్రమే స్పందించాయి. 2002-2012 మధ్యకాలంలో దిగుమతైన ఆహారధాన్యాల్లో అవాంఛనీయ జీఎం ఆహార ధాన్యాల కల్తీని 198 సార్లు గుర్తించినట్లు ఈ సర్వేలో తేలింది. అవిసె(లిన్సీడ్), బియ్యం, గోధుమ, మొక్కజొన్న, బొప్పాయి వంటి పంటల్లో జన్యుమార్పిడి కల్తీ చోటుచేసుకున్నట్లు గుర్తించారు. 2009 తర్వాత మూడేళ్లలోనే 138 సంఘటనలు నమోదయ్యాయి. అమెరికా, కెనడా, చైనా దేశాల నుంచి వెళ్లిన ఎగుమతుల్లోనే ఎక్కువగా జీఎం ఆహార ధాన్యాలు ప్రమాదవశాత్తూ కలిశాయని ఎఫ్ఏవో చెబుతోంది. మనదేశం నుంచి వెళ్లిన ఎగుమతుల్లోనూ ఒకటి, రెండుసార్లు జీఎం అవశేషాలున్నట్లు తేలింది. ఈ విషయం గుర్తించిన తర్వాత ఆ ధాన్యాలను నాశనం చేశారు లేదా ఎగుమతి చేసిన దేశానికి తిప్పిపంపారు. కొన్ని దేశాల్లో అయితే ఈ ధాన్యాలను జీవ ఇంధన తయారీలో వినియోగించారు. జన్యుమార్పిడి ఆహారోత్పత్తుల కల్తీని కనిపెట్టాలంటే ముందు అందుకు తగిన చట్టాలు ఆయా దేశాల్లో ఉండి ఉండాలి. కానీ, సర్వేలో పాల్గొన్న 75 దేశాలకుగాను 17 దేశాల్లో అసలు ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాలే లేవు. జన్యుమార్పిడి పంటలు మామూలు పంటలకు దగ్గరి పొలాల్లో సాగవుతున్నప్పుడు పుప్పొడి గాలికి వచ్చిపడడం ద్వారా జీఎం కల్తీ జరగొచ్చు. అప్పుడు కాకపోయినా నూర్పిళ్ల తర్వాత శుద్ధి, ప్యాకింగ్, నిల్వ, రవాణా చేస్తున్నప్పుడు జరగొచ్చు. జీఎం కల్తీ ఎంత స్వల్ప మోతాదులో ఉంటే సహించవచ్చన్న అంశంపై వివిధ దేశాల మధ్య ఏకీభావం లేకపోవడం వాణిజ్యానికి ప్రతిబంధకంగా మారింది. ఈ విషయమై ఏకరూపత కోసం ఎఫ్ఏవో కసరత్తు ప్రారంభించింది. జన్యుమార్పిడి పంటలను ఒకసారి అనుమతించడం అనేది జరిగితే కల్తీని అరికట్టడం ఎవరి తరమూ కాదని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్న విషయంలో ఎంత నిజముందో ఎఫ్ఏవో సర్వే రుజువుచేసింది. ఆహార పంటల్లో జన్యుమార్పిడిని అనుమతించకపోవడం ప్రజారోగ్యం దృష్ట్యానే కాకుండా ఎగుమతుల దృష్ట్యా కూడా అత్యవసరమని ఇప్పటికైనా గుర్తించడం మంచిది. -పంతంగి రాంబాబు -
నేలకొరిగిన ‘సేంద్రియ’ శిఖరం!
తెల్లని గడ్డం, తలపాగా, ఆకుపచ్చని పైపం చె, పచ్చని పంటపై నుంచి వీచే పైరుగాలిలా చెరగని చిరునవ్వు.. వెరసి డాక్టర్ జీ నమ్మాళ్వార్! అరుదైన సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తగా, రైతాంగ ఉద్యమకారుడిగా, సుస్థిర సేద్యాన్ని ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా పూనికతో ఆచరించిన సాధువు. ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు.. అటు సాధారణ రైతుల్లో ఒకరై.. సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగు ఆవశ్యకత గురించి, జన్యుమార్పిడి పంటలతో ముప్పు గురించి మామూలు మాటల్లో విడమర్చి చెప్పిన నేతగా గుర్తింపు పొందారాయన. రైతుల హక్కుల కోసం ఐదు దశాబ్దాలు పోరాడిన నమ్మాళ్వార్ 75 ఏళ్ల వయసులో తంజావూరు జిల్లాలోని తన స్వగ్రామం ఎలాంగడులో డిసెంబర్ 30న తుదిశ్వాస విడిచారు. 1939 ఏప్రిల్ 16న జన్మించిన నమ్మాళ్వార్ అన్నామలై యూనివర్సిటీలో వ్యవసా యశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. 1963లో కోవిల్‌పట్టిలోని ప్రభుత్వ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. హరిత విప్లవం ప్రారం భ దినాలవి. మెట్టపొలాల్లో పత్తి, చిరుధాన్యాల సాగులో హైబ్రీడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వంటి ఖరీ దైన ఉత్పాదకాలు వాడటంపై పరిశోధనలు జరిగిన రోజులు. వర్షాధార ప్రాంతంలో నిరుపేద రైతులు ఖరీదైన ఉత్పాదకాలు కొని వాడ టం తలకుమించిన భారం కావడంతోపాటు భూసారం నాశనమవుతుందని, ఈ పద్ధతి రైతులకు మేలు చేయబోదని నమ్మాళ్వార్ తొలి దశలోనే గుర్తించారు. నేలతల్లిని నమ్ముకొని జీవించే పేద మెట్ట రైతులకు ఖరీదైన రసాయనిక వ్యవసాయం అలవాటు చేయడం నష్టదాయకమని వాదించారు. ప్రభుత్వ పరి శోధన ప్రాథమ్యాలను సమూలంగా సమీక్షిం చాల్సిన అవసరం ఉందని పట్టుబట్టారు. తన గోడు వినిపించుకున్న నాథుడు లేకపోవడం తో.. ఆరేళ్లకే ప్రభుత్వోద్యోగానికి స్వస్తి పలికి సేంద్రియ వ్యవసాయోద్యమ బాటపట్టారు. నోబెల్ బహుమతి గ్రహీత డోమినిక్ పైర్ స్థాపించిన ఐలాండ్ ఆఫ్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున తమిళనాడులో పదేళ్ల పాటు పనిచేశారు. సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేశారు. పంటల గడ్డీ గాదం ఎందుకూ పనికిరాని వ్యర్థాలని భావిస్తున్న రోజులవి. గడ్డిని తిరిగి భూమిలోనే కలిసేలా చేయడం ద్వారా పోషకాలు సహజంగా తిరిగి భూమికి చేరతాయని ఆయన గ్రహించారు. కాబట్టి, రసాయనిక ఎరువుల వంటి ఖరీదైన ఉత్పాదకాలను వేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ గ్రహింపే సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తగా నమ్మాళ్వార్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తదనంతరం రసాయనిక ఉత్పాదకాల అవసరం లేదని ఉధృతంగా ప్రచారం చేశారు. 1970వ దశకంలో పాలో ఫ్రైరీ, వినోబా భావే వంటి వారి బోధనలతో నమ్మాళ్వార్ ప్రభావితుడయ్యారు. విద్య పరమ లక్ష్యం స్వేచ్ఛను కల్పించడమేని, స్వావలంబనకు స్వేచ్ఛ పునాది అన్న భావన మేల్కొంది. ఈ జ్ఞానాన్ని రైతుల్లో పాదుకొల్పడం కోసం 1979 లో కుడుంభం అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. స్థానిక రైతులతో మమేకమై, వారి సమస్యలను అర్థం చేసుకొని, తగిన పరిష్కారాలు వెదకడంపై దృష్టి కేంద్రీకరించారు. 1984లో బెర్నార్డ్ డిక్లార్క్తో కలిసి పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులపై దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. 2004లో సునామీ వల్ల దెబ్బతిన్న పంట పొలాల పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. కడవూరులో ‘వనగం’ పేరిట ఆయన నెలకొల్సిన 55 ఎకరాల సేం ద్రియ వ్యవసాయ క్షేత్రంలో ఎందరో రైతులు శిక్షణ పొందారు. ఆహారం, వ్యవసాయం, ప్రకృతి మధ్య ఉన్న అవినాభావ సంబంధా న్ని, ఆధ్యాత్మిక స్ఫూర్తిని పామర రైతుల మనసుకు హత్తుకునేలా, వారి నుడికారంలో, సామెతలు మేళవించి చెప్పడం నమ్మాళ్వార్ ప్రత్యేకత. ‘ప్రకృతి వనరులు, భూసార పరిరక్షణ’ కోసం 2004లో నమ్మాళ్వార్ చేపట్టిన పాదయాత్ర కావేరీ డెల్టా జిల్లాల్లో రైతాంగాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు ఆకర్షించింది. 344 గ్రామాల్లో 25 రోజుల పాటు 550 కిలోమీటర్ల పొడవున ఆయన కదం తొక్కారు. తన జీవన ప్రస్థానంలో నమ్మాళ్వార్ దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించి ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయ పద్ధతులపై నిశిత పరిశీలన చేస్తూ.. అవగాహనను పరిపుష్టం చేసుకున్నా రు. అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. గాం ధీగ్రామ్ గ్రామీణ విశ్వవిద్యాలయం (దిండిగల్) ఆయనకు డాక్టరేట్ ఆఫ్ సైన్స్ పట్టాను 2007లో ప్రదానం చేసింది. ప్రతిపాదిత మిథే న్ వెలికితీత ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా గత నెలలో ప్రచారోద్యమం నిర్వహించారు. జీవితాంతం తాను నమ్మిన లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పోరా ట పటిమతో ఉద్యమించిన నమ్మాళ్వార్.. పండుటాకులా చటుక్కున ప్రకృతిలో లీనమైపోయారు. 2013తోపాటే కనుమరుగైపోయా రు. అయినా.. ఆయన ఊపిర్లూది సాకిన సేం ద్రియ వ్యవసాయోద్యమం కొనసాగుతూనే ఉంటుంది. భారతీయ సేంద్రియ వ్యవసాయోద్యమ శిఖరంగా భాసిల్లిన నమ్మాళ్వార్ స్థానాన్ని భర్తీ చేయగలిగిన వారెవరూ లేరు. పంతంగి రాంబాబు.