తెలుగు తల్లి.. భారత మాత.. మనకు తెలుసు. ఈ ‘ఆదిమ అమ్మ’ ఎవరు? ఎప్పుడూ వినలేదే.. అనే కదా మీ ఆశ్చర్యం..?! ‘ఆదిమ అమ్మ’ గురించి తెలుసుకోవాలంటే.. మనందరి పూర్వీకుల పురిటిగడ్డగా భావిస్తున్న ఆఫ్రికా వెళ్లాలి! ఇంకా చెప్పాలంటే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరానికి దగ్గర్లో ఉన్న అతి పురాతన గుహల్లోకి వెళ్లాల్సిందే!!
మనిషి బుద్ధిజీవి. అసలు మనిషి పుట్టుకకు ముందు సుదీర్ఘమైన పరిణామ క్రమం ఉంది. పురాతన కాలపు చరిత్రకు శాస్త్రీయ, సజీవ, సుసంపన్న, అమూల్య సాక్ష్యంగా నిలిచింది ఆఫ్రికా.. మరీ ముఖ్యంగా సౌతాఫ్రికా! 98 ఏళ్లుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇందుకు గట్టి సాక్ష్యాలు దొరికాయి. అనేక ఆదిమ, ఆధునిక మానవ జాతులకు సంబంధించిన శిలాజాలను శాస్త్రవేత్తలు సేకరించి, విశ్లేషించారు.
అందుకే ఈ గుహల సముదాయానికి ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ అని పేరు వచ్చింది. ప్రపంచ మానవాళికి పురుడుపోసిన ఈ ‘క్రెడిల్’ను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఇటీవల జోహన్నెస్‌బర్గ్ వెళ్లిన సందర్భంగా అక్కడ నేను తెలుసుకున్న విశేషాలు...
25 లక్షల ఏళ్ల నాటి ‘మిసెస్ ప్లెస్’
జోబర్గ్(స్థానికంగా జోహన్నెస్‌బర్గ్‌ను అలా అంటారు)కు 45 కిలోమీటర్ల దూరంలో విస్తారమైన గడ్డి భూముల నడుమ ఆదిమానవులు లక్షలాది ఏళ్ల క్రితం నివసించిన గుహలున్నాయి. ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’గా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతం సుమారు 450 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో దాదాపు 300 చారిత్రక గుహల సముదాయం ఉంది. కనీసం 15 గుహల్లో మానవాళి పుట్టుక ఇక్కడే అని ధ్రువీకరించే కీలక శిలాజాలు లభించాయి, ఇంకా లభిస్తున్నాయి.
అటువంటి సుసంపన్న శిలాజ గనుల్లో అతి ముఖ్యమైనది ‘స్టెర్క్‌ఫాంటీన్’ గుహ. కుటుంబ సభ్యులు, సహ పర్యాటకులతో కలసి ఎంతో ఉత్సుకతతో ఈ గుహలోకి అడుగుపెట్టాను. లక్షల ఏళ్ల క్రితం అక్కడ జీవించి, అదే మట్టిలో కలిసిపోయిన మానవ జాతుల విశేషాల గురించి గైడ్ ఉద్వేగంగా చెబుతుండగా.. అదే గుహలో 1947లో ‘పాలియో ఆంత్రపాలజిస్టు’లు డా. రాబర్ట్ బ్రూమ్, డా. జాన్ టి. రాబిన్సన్‌లు కనుగొన్న పురాతన మహిళ ‘మిసెస్ ప్లెస్’ కపాలం నమూనాను చేతుల్లోకి తీసుకున్నాను.
25 లక్షల సంవత్సరాల క్రితం ఆమె జీవించిందట. డోలమైట్‌తో కలగలిసిన సున్నపు రాతి నిల్వలున్న గుహ అది. అక్కడి మట్టిని తాకి.. చిన్న సున్నపు రాతి ముక్కను తీసుకున్నాను. గుహ అడుగున కొద్దిపాటి నీటి మడుగు ఉంది. సుదీర్ఘ మానవ చరిత్రను మౌనంగా వీక్షిస్తున్న ఆ చల్లని నీటిని చేతి వేళ్లతో తాకాను. ఉన్నట్టుండి.. మా చేతుల్లో ఉన్న టార్చ్‌లైట్లన్నిటినీ ఒక్క నిమిషం ఆర్పేయమని గైడ్ చెప్పింది. 60 గజాల లోతున చల్లని గుహంతా చిమ్మచీకట్లతో కూడిన నిశ్శబ్దం ఆవరించింది. మన అందరి కుటుంబ వృక్షం వేరు మూలాలను తడుముతున్నట్లు ఆ క్షణంలో.. నా మనసంతా మాటల్లో చెప్పలేని ఉద్వేగంతో నిండిపోయింది!
షీ ఈజ్ అజ్!
మనుషులంటే పురుషుడేనా? మహిళ కాదా? తెల్లజాతీయుల నుంచి దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్న మనమే ఇలా పప్పులో కాలేస్తే ఎలా? అని మరపెంగ్ సమచార కేంద్రం నిర్వాహకులు ఆలస్యంగా నాలుక కరచుకొని ఆనక దిద్దుబాటు చేశారు.
ఆసియావాసుల పోలికలతో చామన ఛాయలో ఉన్న ఆధునిక మహిళ ముఖచిత్రాన్ని సైతం రెండేళ్ల క్రితం జోడించి ఈ ప్రపంచ వారసత్వ మ్యూజియానికి పరిపూర్ణత చేకూర్చారు. అంతేకాదు మనం ఏ దేశవాసులమైనా ప్రపంచ ప్రజలందరి పూర్వీకులూ బంధువులేనన్న భావనతో ‘ఆమే మనం (షీ ఈజ్ అజ్)’ అని కూడా ప్రకటించారు!
ఇదీ దక్షిణాఫ్రికాలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’లో మెరిసిన మన ‘ఆదిమ అమ్మ’ కథ!!
∙∙
శాస్త్ర సాంకేతిక పురోగతి వెలుగులో అనేకానేక సంక్లిష్టతలను అధిగమిస్తున్నప్పటికీ పురాతన చారిత్రక విషయాల్లో ఊహకు అందని చీకటి అంకాలెన్నో ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ కారణంగానే సాధ్యమైనంత వరకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ దృష్టికోణం నుంచే ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శిలాజాల పుట్ట
దక్షిణాఫ్రికాలోని జోబర్గ్ సమీపంలో హాటెంగ్, నార్త్‌వెస్ట్ రాష్ట్రాల సరిహద్దుల్లో 47 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రమణీయ కొండ కోనల మధ్య విస్తరించిన అందమైన గడ్డి భూముల్లో సుమారు 300 వరకు పురాతన గుహలున్నాయి. వీటిలో పన్నెండు గుహల్లో ఎన్నో ఆది, ఆధునిక మానవ జాతుల ఉనికిని బలంగా ఎలుగెత్తి చాటే శిలాజాలు లభించాయి.
1924లో ‘టాంగ్ చైల్డ్’, మొదలుకొని మిసెస్ ప్లెస్, ‘హోమో నలెడి’ వరకూ.. గత 98 ఏళ్లుగా ఈ గనుల్లో లభించిన అనేక శిలాజాలే ఇందుకు నిదర్శనాలు. యునెస్కో 1999లో ‘ప్రపంచ వారసత్వ స్థలం’గా గుర్తించడంతో.. విశ్వ పర్యాటకులకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ ఆకర్షణగా నిలిచింది. మరో 9 వారసత్వ స్థలాలు కూడా సౌతాఫ్రికాలో ఉన్నాయి.
చెట్టుదిగి నడవటమే గొప్ప మలుపు
సుమారు 2,600 కోట్ల ఏళ్లకు పూర్వం (నియో ఆర్చియన్ యుగంలో) ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ ప్రాంతం సముద్రపు నీటిలో మునిగి ఉండేది. కాలక్రమంలో సున్నపు రాళ్లు–డోలమైట్‌తో కలగలిసిన గుహలు రూపుదిద్దుకున్నాయి. అటువంటి వందలాది అతిపురాతన గుహలు జోబర్గ్ పరిసర ప్రాంతంలో ఉన్నాయి. వాతావరణ మార్పుల మూలంగా క్రమంగా సముద్రం వెనక్కి తగ్గటంతో.. తదనంతర కాలంలో చింపాంజీలు, ఏప్(వాలిడులు)లకు, ఆది మానవులకు, జంతుజాలానికి భూమి ఆలవాలమయింది.
మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఆదిమానవులు అడవిలో చెట్ల మీద నుంచి నేల మీదకు దిగి, రెండు కాళ్లపై నిలబడి పచ్చిక బయళ్లున్న ప్రాంతాల్లోకి నడిచారు. మానవ పరిణామ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం ఇది! అయితే, ఏప్‌ల నుంచి మనిషి ఎలా విడిపోయాడనేదానికి ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. శీతోష్ణ పరిస్థితుల రీత్యా ఆఫ్రికా గడ్డపైనే ఈ పరిణామం చోటు చేసుకుందని చెబుతారు.
ఆ విధంగా అనేక ఆదిమ జాతులతో పాటు కాలక్రమంలో దాదాపు 2 లక్షల ఏళ్ల నాడు ఆలోచనా శక్తి కలిగిన ఆధునిక మానవజాతి (హోమోసెపియన్) ఆవిర్భవించింది.
మొదటి శిలాజ ఆవిష్కరణ
మానవాళి చరిత్రలో దక్షిణాఫ్రికా ప్రాధాన్యాన్ని లోకానికి చాటిన మొదటి శిలాజ ఆవిష్కరణ ‘టాంగ్ చైల్డ్’. ఇది ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతి శిశువుకు చెందిన కపాల శిలాజం. 1924 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని టౌంగ్‌లో దీన్ని క్వారీ కార్మికులు గుర్తించారు. జోహన్నెస్‌బర్గ్‌లోని విట్‌వాటర్స్‌రాండ్ విశ్వవిద్యాలయ శరీర నిర్మాణ శాస్త్రవేత్త ప్రొ. రేమండ్ డార్ట్ దీని విశిష్టతను గుర్తించి ‘నేచర్’లో వ్యాసం రాశారు.
దీనికి ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ లేదా ‘ఆఫ్రికా దక్షిణ కోతి‘ అని పేరు పెట్టినప్పటికీ, శిలాజం తాలూకు శిశువుకు మనిషి లక్షణాలున్నాయని ఆయన గుర్తించారు. మానవ పరిణామాన్ని మలుపు తిప్పిన శిలాజాలు లభించిన మరికొన్ని ప్రపంచ వారసత్వ స్థలాల గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఇండోనేషియా జావాలోని సంగిరన్ ఎర్లీ మాన్ సైట్, చైనాలోని జౌకౌడియన్, ఇథియోపియాలోని లోయర్ వాలీ ఆఫ్ ద అవష్, లోయర్ వ్యాలీ ఆఫ్ ఓమోతోపాటు.. టాంజానియాలోని ఓల్డ్‌వాయ్ జార్జ్, ఎర్లీ హోమినిడ్ ఫుట్‌ప్రింట్స్ (లెటోలి). వీటిలో 36 లక్షల ఏళ్ల నాటి పురాతన మానవుల శిలాజాలు లభించటం విశేషం.
‘తెలివి’కి 2 లక్షల ఏళ్లు!
మానవ పరిణామ చర్రితను స్థూలంగా ‘హోమోసెపియన్’ జాతికి ముందు.. తర్వాత.. అని విభజిస్తే అర్థం చేసుకోవటం సులభం. ఈ జాతీయులకు అంతకు పూర్వీకులైన ‘ఆస్ట్రాలోపిథెసిన్’ల కంటే పెద్ద మెదడు ఉంది. రాతి పనిముట్లను రూపొందించే శారీరక సామర్థ్యంతో పాటు.. మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న మొదటి మానవ జాతి ఇది. ‘హోమోసెపియన్’ జాతీయులు సుమారు 23 లక్షల సంవత్సరాల క్రితం తొలుత ఆఫ్రికాలో జీవించారు. ఇందులో అనేక ఉప జాతులున్నాయి. మొదటిది.. హోమోహబిలిస్. వీరు 19 లక్షల సంవత్సరాల క్రితం జీవించారు.
వీళ్ల వారసులే ‘హోమోఎర్గాస్టర్’లు. దాదాపు 17 లక్షల సంవత్సరాల క్రితం జీవించారట. ఆధునిక సాధనాల ఉపయోగం, వంట, వెచ్చదనం కోసం అగ్నిని ఉపయోగించుకునే సామర్థ్యం వీరికుంది. ఈ సామర్థ్యమే వీరి వారసులు ఆఫ్రికాను వదలి చల్లని ప్రదేశాలకు వలస వెళ్లేలా చేసిందట. ఆ కొన్నాళ్లకే ‘హోమోఎరెక్టస్’ ఉద్భవించింది. హోమోసేపియన్ జాతీయులు అభివృద్ధి చెందే కొద్దీ, నైపుణ్యాలను అందిపుచ్చుకునే కొద్దీ వారి మెదడు కూడా వికసించింది. ఆ క్రమంలోనే సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం తొలి ఆధునిక మానవులైన ‘హోమోసేపియన్లు’ ఆఫ్రికాలో ఉద్భవించారు.
లాటిన్‌లో హోమో అంటే ‘మానవులు‘, సేపియన్స్ అంటే ‘తెలివైన’అని అర్థం. క్రీ.శ. 1758లో కార్ల్ లిన్నేయస్ ఈ పదబంధాన్ని తొలిసారి వాడారు. ఇథియోపియాతోపాటు దక్షిణాఫ్రికాలో హొమో సేపియన్ జాతి శిలాజాలు కొన్ని బయటపడ్డాయి. ఈ క్రమంలోనే కనీసం 70 వేల సంవత్సరాల నుంచే మనుషులు అలంకరణ, కళాకృతుల తయారీ వంటి ఆధునిక పోకడలను సైతం అలవర్చుకున్నారు. హోమో సేపియన్లు కాలక్రమంలో ఆఫ్రికా నుంచి భూగోళం మీదున్న అన్ని భూభాగాలకూ విస్తరించారంటున్నారు పరిశోధకులు.
నిజంగా మానవాళి పురిటి గడ్డేనా?∙
1920–30లలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన శిలాజాల చారిత్రక ప్రాముఖ్యతను చాలా మంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఆఫ్రికా వెలుపల ఉన్నవారు, తొలుత కొట్టిపారేశారు. 1912లో ఇంగ్లండ్‌లోని ససెక్స్‌లో బయటపడిన ‘పిల్ట్‌డౌన్ మ్యాన్‘ అనే మానవ కపాల శిలాజంపైనే వారి దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమైంది. దీన్ని ‘ఎయోంత్రోపస్ డాసోని’ జాతిగా వర్గీకరించారు.
ఈ పుర్రెను చార్లెస్ డాసన్ కనుగొన్నందున ఆయన పేరునూ దీనికి జోడించారు. ఐరోపాలో వెలుగుచూసిన సుదూర మానవ పూర్వీకుడుగా ‘పిల్ట్‌డౌన్ మ్యాన్’ ను అభివర్ణించారు. కోతిలాంటి దవడను, ఆధునిక మానవు (హోమోసేపియ¯Œ )ల మాదిరిగా పెద్ద మెదడు కలిగిన జీవిగా చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో శిలాజాల ప్రాధాన్యాన్ని తెలియజెబుతూ ప్రొ. రేమండ్ డార్ట్, డా. రాబర్ట్ బ్రూమ్ చేసిన విశ్లేషణలపై పాశ్చాత్య శాస్త్రవేత్తలు వివాదానికి దిగారు.
వీరిద్దరూ దక్షిణాఫ్రికాలో కనుగొన్న ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ శిలాజాల మెదడు పరిమాణం చిన్నగా ఉండటం విమర్శకులకు అనుకూలించింది. అయితే, దశాబ్దాలు గడచిన తర్వాత, నిజం నిలకడ మీద బయటపడింది. ‘పిల్ట్‌డౌన్ మ్యాన్’ శిలాజం నకిలీదని చివరికి 1953లో శాస్త్రీయ పరిశోధనల్లో బట్టబయలైంది. మానవ పుర్రెకు ఒరాంగుటాన్ జంతువు దవడ (దంతాలను అరగదీసి మనిషివిగా చిన్నగా కనిపించేలా చేశారు)తో కలిపి పాతిపెట్టి.. సహజమైన శిలాజంగా నమ్మించే ప్రయత్నం చేశారని తేలింది.
పిల్ట్‌డౌన్ బూటకం చాలామంది శాస్త్రవేత్తలను 40 ఏళ్లకు పైగా తప్పుదోవ పట్టించింది. దక్షిణాఫ్రికా శిలాజాల చారిత్రక ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించడం ఆ మేరకు ఆలస్యమైనా.. శాస్త్రీయంగా రూఢి అయ్యింది. ఈ బూటకపు శిలాజం సృష్టికర్తలెవరో నేటికీ కచ్చితంగా తెలియరాలేదు. దక్షిణాఫ్రికాలో ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతికి చెందిన అనేక శిలాజాల ఆవిష్కరణలు ఆ తర్వాత కూడా వెలుగులోకి వస్తుండటం, పిల్ట్‌డౌన్ స్కామ్ బహిర్గతం కావటంతో.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ‘మానవజాతి పురిటి గడ్డ’ ఆఫ్రికా అని ఎట్టకేలకు అంగీకరించారు. దక్షిణాఫ్రికా శిలాజ వారసత్వం ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి తరం ఆంగ్ల శాస్త్రవేత్తల్లో సర్ విల్ఫ్రెడ్ లీ గ్రాస్ క్లార్క్ ఒకరు.
∙∙
ఈ పూర్వరంగంలో పురాతన నాగరికతలు 10,000 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్నాయి. లిపి ఆవిర్భవించిన తర్వాత మానవ వికాసం మనకు తెలిసిన చరిత్రే.
మానవ జనాభా 2000 ఏళ్ల క్రితం 20 కోట్లు ఉండేది. 790 కోట్లకు పెరిగింది. భూగోళంపైన, కొండ శిఖరాల నుంచి దీవుల వరకు, మట్టి కనిపించే ప్రతి చోటుకూ మనం విస్తరించాం. ధ్వని కన్నా వేగంగా భూగోళం ఆ దరి నుంచి ఈ దరికి ప్రయాణించగలుగుతున్నాం.
కానీ, పుడమి పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం.. ప్రకృతిసిద్ధమైన జంతుజాలం ఆవాసాలను నాశనం చేస్తున్నాం.. అత్యాధునిక రూపాల్లో యుద్ధాలకు తెగబడుతున్నాం.. సుదీర్ఘ పరిణామ క్రమంలో అందివచ్చిన గొప్ప తెలివి తేటలు మనల్ని దీర్ఘకాలం జీవించనిస్తాయా? లేక గంపగుత్తగా దుంపనాశనం చేస్తాయా?
పుట్టింటికి పునరాహ్వానం!
యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’కు సంబంధించిన అధికారిక మ్యూజియం కమ్ సమాచార కేంద్రం పేరు ‘మరపెంగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’. మేం చూసిన ‘స్టెర్క్‌ఫాంటీన్’ గుహకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. 29 మిలియన్ డాలర్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 2005 డిసెంబర్ 7న ప్రారంభమైన ‘మరపెంగ్’.. మానవ పరాణామ విజ్ఞానశాస్త్ర గని అని చెప్పొచ్చు.
పర్యాటకులను, మానవ పరిణామ శాస్త్ర అధ్యయనకారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే రీతిలో విశేషాలేన్నిటినో ఇక్కడ పొందికగా ఆవిష్కరించారు. మరపెంగ్ అంటే.. స్థానిక ‘సెస్త్వానా’ భాషలో ‘పుట్టింటికి పునరాహ్వానం’ అని అర్థం. ‘వెల్‌కమ్ హోమ్.. ఎక్స్‌ప్లోర్ యువర్ హ్యూమన్ హెరిటేజ్’ అంటూ తెల్లని పతాకం మనల్ని లోపలికి ఆహ్వానిస్తుంటుంది.
విశ్వం, భూమి, జీవుల పుట్టుక.. తదనంతర పరిణామక్రమంలో ఆది మానవుల పుట్టుక, నిప్పు వాడుక/ నియంత్రణ, రాతి పరికరాల వాడటం.. ఆధునిక మానవుల పుట్టుక, జీవన వికాసాలకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ‘మరపెంగ్’లోని భూగర్భ మ్యూజియం అత్యద్భుతంగా పర్యాటకుల కళ్లకు కడుతోంది. ఆదిమ, ఆధునిక మానవ జాతులకు ప్రతీకలుగా రూపొందించిన కొన్ని విగ్రహాలను, సజీవ వ్యక్తులను తలపించేలా చారిత్రక ఔచిత్యంతో రూపకల్పన చేసిన ముఖచిత్రాలను ప్రదర్శించారు. కోతిని పోలిన నలుపు/చామన ఛాయ ఆదిమానవుల దగ్గర నుంచి జర్మనీ మూలాలున్న నియాండర్తల్ తెల్ల జాతీయుడి ముఖచిత్రం వరకు ఇందులో ఉన్నాయి. అయితే, వాటిలో చాలా వరకు పురుషుల ముఖ చిత్రాలే!
భూగర్భ వ్యోమగాములు!
అవును.. మీరు చదివింది నిజమే.. వ్యోమగాముల అవసరం రోదసిలోనే కాదు, ఒక్కోసారి భూగర్భంలోనూ ఉంటుంది. గుహలో అత్యంత క్లిష్టమైన స్థితిలో శిలాజాల అన్వేషణలో క్లిష్ట దశను అధిగమించడానికి అవసరమైంది. ఆ సాహస కార్యాన్ని ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు అద్భుతంగా నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. ‘భూగర్భ వ్యోమగాముల’ను మేం ముద్దుగా పిలుచుకుంటున్న ఈ ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు లేకుండా మన దగ్గరి బంధువైన ఓ కొత్త జాతి ఆవిష్కరణ సాధ్యమయ్యేది కాదని ప్రధాన పరిశోధకుడు ప్రొ. లీ బెర్గర్ 2015 సెప్టెంబర్‌లో ప్రకటించారు. ఈ ఆదిమ జాతికి ‘హోమో నెలడి’ అని పేరుపెట్టారు. ఏడేళ్ల కిందట.. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ గుహల సముదాయంలోని రైజింగ్ స్టార్ అనే గుహలో శిలాజాల కోసం అన్వేషణ ఉత్కంఠభరితంగా సాగుత్ను రోజులవి.
18 సెం.మీ. ఖాళీలోంచి..
ప్రొ. లీ బెర్గర్ బృందం గని లోపల తవ్వకాలు చేస్తుండగా. ఆది మానవుల శిలాజాలు కొన్ని దొరికాయి. అక్కడి నుంచి కిందికి చిన్న దారి కనిపించింది. ఆ లోపల 30 మీటర్ల కింద మరో చిన్న గది కనిపించింది. అందులో ఇంకా మానవ శిలాజాలు ఉన్నాయని ప్రత్యేక పరికరాల ద్వారా త్రీడీ స్కాన్ ద్వారా కనుగొన్నారు. అయితే, ఆ దారిలో రెండు బండరాళ్ల మధ్య కేవలం 18 సెంటీమీటర్ల (ఫుట్‌బాల్ కన్నా తక్కువ) ఖాళీ మాత్రమే ఉంది. మనిషి లోపలికి వెళ్లకుండా శిలాజాలను సేకరించలేం. అంత సన్నని దారిలోంచి లోపలికి వెళ్లటం ఎలా?
అంత సన్నగా ఉండే మనుషులైతే లోపలికి వెళ్లగలరన్న ఆలోచనతో ప్రొ. లీ బెర్గర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. 18 సెం.మీ. కన్నా సన్నని శరీరం కలిగిన పురావస్తు తదితర శాస్త్రాల్లో పీజీ చదివి ఉండి, గుహల్లోకి దిగే అనుభవం ఉన్న వారెవరైనా సంప్రదించమని కోరారు. పది రోజుల్లో 60 దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అన్ని అర్హతలున్న 6గురు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు.
వారే.. ఈ భూగర్భ వ్యోమగాములు.. మెరీనా ఇలియట్ (కెనడా), బెక్కా పీక్సోటో (వాషింగ్టన్ డిసి), లిండ్సే హంటర్ (అయోవా), ఎలెన్ ఫ్యూరిగెల్ (ఆస్ట్రేలియా), హన్నా మోరిస్ (ఒహైయో), అలియా గుర్టోవ్ (విస్కాన్సిన్).
30 మీటర్ల దిగువ వరకు పాక్కుంటూ వెళ్లి శిలాజాలను వెలికితీయటమే ఈ మహిళా శాస్త్రవేత్తలు చేసిన సాహసం. దాదాపు 3 వారాల పాటు సాగిందీ అన్వేషణ. దాదాపు 15 మందికి చెందిన 1500 ఎముకలు లభించాయి. ఆఫ్రికాలో ఒకేచోట ఇన్ని మానవ శిలాజాలు దొరకటం ఓ రికార్డు.
యూరేసియా కూడా ముఖ్య రంగస్థలమే!
ఆఫ్రికాయే మానవుల పురిటిగడ్డ అనే వాదనతో విభేదించే వారూ లేకపోలేదు. వీరిలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో జెనెటిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ రైక్ ఒకరు. ‘హూ వియార్ అండ్ హౌ వియ్ గాట్ హియర్’ అనే పుస్తకాన్ని ఇటీవలే వెలువరించారు. ప్రాచీన మానవ డీఎన్‌ఏ విశ్లేషణకు తోడ్పడిన పదిమంది మార్గదర్శకులలో ఒకరిగా డేవిడ్ రైక్‌కు గుర్తింపుంది. మానవ సంబంధ ఆవిష్కారాలన్నీ ఆఫ్రికాలోనే సంభవించాయని, అక్కడి వారే మిగతా ప్రపంచమంతా విస్తరించారనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు డేవిడ్ రైక్ .
మానవ పరిణామక్రమంలో పురాతన మానవ జాతి నియాండర్తల్స్ నివసించిన యూరేసియా (యూరప్, ఆసియాలు మొత్తం విస్తరించిన ప్రాంతం) కూడా ముఖ్య రంగస్థలమే అంటున్నారాయన. ‘మానవులు అంతర్గతంగా మిశ్రమ పూర్వీకుల నుంచి ఉద్భవించారు. ఏ జనసమూహం కూడా స్వచ్ఛమైనది కాదు. భిన్నమైన సమూహాల కలయిక మానవ స్వభావపు సాధారణ లక్షణం. గతం నుంచి మనం నేర్చుకోవాలి.. మరింత కనెక్ట్ అవ్వాలి’ అంటున్నారు ప్రొ. డేవిడ్ రైక్.
-పంతంగి రాంబాబు , సాక్షి ప్రత్యేక ప్రతినిధి, (జోహన్నెస్‌బర్గ్ నుంచి)
Comments
Please login to add a commentAdd a comment