జోహెన్నెస్‌బర్గ్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్)ల దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిని విస్తరించాలన్న ప్రతిపాదనతో భారత్ ముందుకు వచ్చింది. అయితే ఈ విస్తరణ ఏకాభిప్రాయంతో జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో బుధవారం నాడు ప్రధాని మోదీ ప్రసంగించారు.
అద్భుతమైన భవిష్యత్‌కు బ్రిక్స్ సంసిద్ధంగా ఉండాలంటే మనం మన సమాజాలను భవిష్యత్‌కు సిద్ధం చేయాలని ప్రధాని మోదీ చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని తాము ప్రతిపాదిస్తున్నట్టుగా చెప్పారు. ‘‘జీ 20 సదస్సును భారత్‌లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నాం. బ్రిక్స్ దేశాలన్నీ అందులో శాశ్వత సభ్యులే. ఆఫ్రికన్ యూనియన్‌కు కూడా జీ–20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మేము ప్రతిపాదిస్తున్నాం.
బ్రిక్స్ భాగస్వామ్య పక్షాలన్నీ ఇందుకు అంగీకరిస్తాయని భావిస్తున్నాం’’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు బ్రిక్స్ సదస్సులో ప్రాధాన్యం కల్పించడాన్ని ప్రధాని స్వాగతించారు. జీ–20 సదస్సులో భారత్ కూడా గ్లోబల్ సౌత్ దేశాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాల్లో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో అత్యంత అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించాయని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధిలో బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవలెప్‌మెంట్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రైల్వే రీసెర్చ్ నెట్‌వర్క్, స్టార్టప్ రంగాల్లో భారత్ చేసిన సూచనలతో అపారమైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు.
పశ్చిమ దేశాల వల్లే ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్
బ్రిక్స్ సదస్సులో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం పశ్చిమ దేశాల పాపమేనని ఆరోపించారు. డాన్‌బాస్ ప్రాంతంలో నివసించే ప్రజలకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో యుద్దానికి దిగుతున్నాయని నిందించారు. యుద్ధాన్ని నిలిపివేయడమే రష్యా మిలటరీ లక్ష్యమని పుతిన్ అన్నారు. దక్షిణాఫ్రికాకు వస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు మేరకు తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నట్టు చెప్పారు.
BRICS summit 2023: బ్రిక్స్ విస్తరణకు భారత్ మద్దతు
Published Thu, Aug 24 2023 5:18 AM | Last Updated on Thu, Aug 24 2023 10:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment