జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరం జొహన్నెస్‌బర్గ్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 73 మంది చనిపోయారు. మరో 52 మంది గాయపడ్డారు. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన ఈ ఘటనలో బాధితులంతా బతుకుదెరువు కోసం వచ్చిన వలసదారులేనని అధికారులు తెలిపారు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో భవనంలో చెలరేగిన మంటలకు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
ప్రమాదం విషయం తెలియగానే తమ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారని నగర అత్యవసర సేవల విభాగం ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జి అన్నారు. భవనంలోని అయిదంతస్తుల్లోనూ మంటలు వ్యాపించాయన్నారు. అందులో చిక్కుకున్న వారిని సాధ్యమైనంత వరకు రక్షించామన్నారు. మొత్తం 73 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన, ఊపిరాడక స్పృహతప్పిన మరో 52 మందిని ఆస్పత్రులకు తరలించామన్నారు.
‘భవనంలోని ప్రతి అంతస్తులోనూ అనధికారికంగా పలు నిర్మాణాలు ఉండటంతో చాలా మంది లోపలే చిక్కుకుపోయారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. నేరగాళ్ల ముఠాలు తిష్ట వేయడంతో భవనానికి కరెంటు, నీరు, శానిటేషన్ వసతులను మున్సిపల్ అధికారులు కట్ చేశారు. ఇవి లేకున్నా వలసదారుల కుటుంబాలు ఉంటున్నాయి. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి భవనాలు ఇక్కడ చాలానే ఉన్నాయి’అని రాబర్ట్ చెప్పారు.
దక్షిణాఫ్రికాలో పెను విషాదం
Published Fri, Sep 1 2023 5:23 AM | Last Updated on Fri, Sep 1 2023 7:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment