
షాపింగ్ మాల్‌లో మంటలు.. 46 మంది దుర్మరణం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడంతస్తుల షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగి 46 మంది సజీవ దహనమయ్యారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గ్యాస్ లీకేజీయే కారణమని భావిస్తున్నారు. బైలీ రోడ్డు ప్రాంతంలోని గ్రీన్ కోజీ కాటేజీలో పలు రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు ఉన్నాయి.
ఈ భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్‌లో రాత్రి 9.50 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు పై అంతస్తులకు శరవేగంగా వ్యాపించాయి. దీంతో అందులోని వారంతా ప్రాణభయంతో పై అంతస్తులకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సుమారు 75 మందిని నిచ్చెనల సాయంతో కిందికి దించారు. మంటలను అర్ధరాత్రి 12.30 గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఘటనపై ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment