ఢాకా: బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది సజీవదహనమయ్యారు. 450 మందికిపైగా కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రసాయనాలు ఉంచిన ఒక కంటైనర్ డిపోలో తొలుత అగ్నికీలలు చెలరేగి ఆ తర్వాత వరస పేలుళ్లు సంభవించడంతో భారీ ప్రమాదం జరిగింది. దేశంలో ప్రధాన రేవు పట్టణమైన చిట్టగాంగ్‌కి సమీపంలోని సీతాకుంద్‌లో షిప్పింగ్ కంటైనర్లు ఉంచే బీఎం కంటైనర్ డిపోలో శనివారం రాత్రి అగ్గి రాజుకుంది. ఆ తర్వాత వరసపెట్టి పేలుళ్లు సంభవించాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు.
రాత్రి 11.45 గంటలకు మంటలు మొదలయ్యాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనం నింపిన కంటైనర్లు కావడంతో ఒక దాని తర్వాత మరొకటి పెద్దగా శబ్దాలు చేస్తూ పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి మంటల్ని అదుపులోకి తీసుకురావడం శక్తికి మించిన పనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. ప్రమాదం విషయం తెల్సి ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు.
వణికిపోయిన చుట్టుపక్కల ప్రాంతాలు
ఈ పేలుడు ధాటి ప్రభావం నాలుగు కిలో మీటర్ల వరకు చూపించింది. భవనాలు ఊగాయి. పైకప్పులు చెదిరిపడ్డాయి. హుటాహుటిన 19 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఆరు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలతో నింపిన కంటైనర్లు కావడంతో ఒక దానికి నిప్పు అంటుకోగానే వరుసగా వెంట వెంట నే అన్నీ పేలిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment