
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఓ శ్రీలంక జాతీయుడు సహా 19 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు. బనానీ ప్రాంతంలో ఉన్న 22 అంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవంతిలో వస్త్ర దుకాణాలు, ఇంటర్నెట్ సేవలందించే ఆఫీస్‌లు ఉన్నాయి. 8వ అంతస్తులో మొదలైన మంటలు పైకి ఎగబాకి 11వ అంతస్తు వరకు చేరి, పక్కనున్న మరో రెండు భవనాలకూ వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి కారణాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు.
శ్రీలంకకు చెందిన నిరాస్ చంద్ర అనే వ్యక్తి సహా మొత్తం ఆరుగురు మంటల నుంచి తప్పించుకోవడానికి బిల్డింగ్ నుంచి కిందకు దూకడంతో చనిపోయారని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. 21 మంది అగ్నిమాపకదళ సిబ్బందితోపాటు, వైమానిక, నౌకా దళాలు కూడా ఐదు హెలికాప్టర్లతో నీటిని చల్లి మంటలను ఆర్పివేశాయి. కాగా, బంగ్లాదేశ్‌లో 10 ఏళ్ల కాలంలో 16 వేల అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయని 1590 మంది మృతి చెందారని సుప్రీంకోర్టు న్యాయవాది సయిద్ రిజ్వానా హుస్సేన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment