tribes
-
‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు..
గిరిజనులకు తల్లీ తండ్రి ప్రకృతే. కొరత లేకుండా ధాన్యాన్ని పస్తులు ఉంచకుండా పంటల్ని పుష్కలంగా ఇవ్వడమే కాదు తమకు అనువైన తోడును కూడా ప్రకృతి మాతే తీసుకువస్తుందన్నది ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం పెళ్లీడుకు వచ్చిన పడతుల్లో కోటి ఆశలను విరబూయిస్తుంది. ఆ ఆశలే ఇంటింటా సంబరమవుతాయి.పంట సాగు నుండి కన్నెపిల్లల పరిణయాల వరకు అంతా ప్రకృతి చెప్పిన విధంగానే నడుచుకుంటారు గిరిజనులు. అంతటి ప్రాధాన్యత కల్గిన వాటిల్లో ‘తీజ్’ పండుగ ముఖ్యమైనది."నాకు అరవై ఏళ్లు. మా చిన్నప్పుడు కూడా తీజ్ పండుగ చేసుకున్నాం. తీజ్ పెరిగిన తీరును చూసి మా అమ్మానాన్నలు, తండా పెద్దలు నాకు పెళ్లి చేశారు. ఇదే ఆనవాయితీ మా పిల్లలు కూడా చేస్తున్నారు0." – భూక్యా వీరమ్మ గన్యాతండ, మహబూబాబాద్తీజ్ అంటే..పెళ్లీడుకు వచ్చిన గిరిజన (లంబాడ) అమ్మాయిలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. గోధుమ నారునే కాదు ఈ కాలాన కనిపించే ఆరుద్ర పురుగులనూ తీజ్ అంటారు. ఎర్రగా అందంగా ఉండే ఆరుద్ర పురుగులను దేవుడు తమకోసం పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు మనసులో కోరుకున్న కోరిక ఫలిస్తుందని వీరి నమ్మకం.ఇంటింటి ఆశీస్సులు..పెళ్లీడుకు వచ్చిన యువతులు తమకు కావాల్సిన వరుడి కోసం చేసే ఈ పండగకు ముందు గా తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. యువతులందరు ఇంటింటికి వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారు కానుకగా ఇచ్చే విరాళం తీసుకోవడంతో తండా అంతా సందడిగా మారుతుంది. ఇలా సేకరించిన విరాళం (ధాన్యం) తో తమకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతర సామాన్లు కొనుగోలు చేస్తారు.గోధుమ మొలకలు..తీజ్ పండుగలో ముఖ్యమైనది తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్ళి దుస్సేరు తీగలు తెచ్చి, బుట్టలను అల్లి, తమ ఆరాధ్య దైవం తుల్జా భవాని, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి, పుట్టమట్టిని తెస్తారు. మేకల ఎరువును కలిపి తండా నాయక్ చేతిలో ఉంచిన బుట్టలో ΄ోస్తారు. అప్పటికే నానబెట్టి ఉంచిన గోధుమలను అందులో వేస్తారు. శనగలకు రేగుముళ్లుతీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనగలకు యువతులు రేగుముళ్లు గుచ్చుతారు. ఈ ప్రక్రియను బావ వరుసయ్యే వారు పడతుల మనస్సు చెదిరేలా వారిని కదిలిస్తూ ఉంటారు.నియమ నిష్టలతో..తండాలోని యువతులందరు తమ బుట్టలను ఒకేచోట పెడతారు. ఈ తొమ్మిది రోజులు పెట్టిన బుట్టలకు నీళ్లు ΄ోస్తూ, వాటి చుట్టూ తిరుగుతూ గిరిజన నృత్యాలు, పాటలు పాడుతూ గడుపుతారు.ఏడవ రోజు ఢమోళీ.. ఏడవరోజు జరిగే ఢమోళీ చుర్మోను మేరామా భవానీకి నివేదిస్తారు. వెండితో చేసిన విగ్రహం, రూపాయి బిళ్ల అమ్మవారి ముందు పెట్టి మేక΄ోతులు బలి ఇచ్చే తంతును‘ఆకాడో’ అంటారు.దేవతల ప్రతిరూపాలకు..ఎనిమిదవ రోజు మట్టితో ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సాంప్రదాయాల ప్రకారం పెండ్లి చేస్తారు. ఆడపిల్లలు పెళ్లి కూతురుగా, మగ పిల్లలు పెళ్లికొడుకుగా ఊహించుకుంటూ ఈ తంతులో పాల్గొంటారు. పెళ్లి తర్వాత తమ కుటుంబ సభ్యులను విడిచి పెడుతున్నట్లు ఊహించుకుని ఏడ్వడం, వారిని కుటుంబ సభ్యులు ఓదార్చడంతో ఈ తంతును నిర్వహిస్తారు.తొమ్మిదవ రోజు నిమజ్జనం..డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను అందజేస్తారు. యువతులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ పూజాఫలంగా పెరిగిన తీజ్‌ను అన్నదమ్ముళ్లకు ఇచ్చి.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తర్వాత యువతీ, యువకులు బుట్టలను పట్టుకొని ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్, ఫొటోలు: మురళీ కృష్ణ -
అడవి బిడ్డల ఆనందం
సాక్షి, అమరావతి: అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ సంపదతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచే అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం, పోడు భూముల సాగును ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నేతృత్వంలో ఇ.రవీంద్రబాబు, జి.చిన్నబాబు, నాగరాజు చిక్కాల రూపొందించిన నివేదికను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు జె.వెంకట మురళి ఆవిష్కరించారు. గిరిజన యువత, కళాకారులు, నాయకులు, అధికారులతో సహా పలువురిని భాగస్వాములను చేశారు. ఆర్వోఎఫ్ఆర్, పీసా, 1 ఆఫ్ 70 చట్టాలు, గిరిజన జీవనోపాధి, సంప్రదాయ కళారూపాలు, అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించడంతోపాటు గిరిజనులకు సంబంధించిన పలు పుస్తకాలను అధ్యయనం చేశారు.సాగు.. నైపుణ్యాభివృద్ధి.. మార్కెటింగ్పాడేరు, రంపచోడవరం, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16 గ్రామాల్లో అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించారు. సాగు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయవచ్చని నివేదిక సూచించింది. పంటల సాగులో మెళకువలతోపాటు నైపుణ్యాభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. నల్ల మిరియాలు, మిర్చి, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులు, సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించవచ్చని సూచించింది. ప్రధానంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలైన (పీవీటీజీ) మూక దొర, భగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి తెగల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆదాయం లభించేలా కొండ చీపుర్లు, గడ్డి పెంపకం, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, అవగాహన కల్పించాలని నిర్దేశించింది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా నల్ల మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మిర్చి రకాల సాగుపై అవగాహన పెంచడం, అధిక దిగుబడులు సాధించేలా పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ధర దక్కేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.అడవి బిడ్డలకు అండగా సీఎం జగన్⇒ గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలిచారు. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో గిరిజన కుటుంబాలకు ఏకంగా 3.22 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతోపాటు డీకేటీ పట్టాలు పంపిణీ చేసి ఆ భూములను సాగులోకి తెచ్చేందుకు ఉపాధి హామీతో చేయూతనందించారు. ⇒ దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండంగా నిలిచారు. కాఫీ తోటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు లాంటివి అందించారు. అంతర పంటగా మిరియాల సాగుకు అవసరమైన పరికరాలు అందించారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా జీసీసీ చెల్లిస్తోంది. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల ద్వారా సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్‌తో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన రైతులకు వ్యవసాయం, కాఫీ సాగుకు జీసీసీ రుణాలు అందచేస్తోంది. -
ప్రకృతి ఒడిలో పల్లవించే సంగీతం
వాయిద్యాలు వారికి సరిగమలు తెలియవు. శృతి లయలు అసలే తెలీదు. కానీ శ్రవణానందంగా పాడగలరు. శ్రోతలను రంజింపజేయగలరు. తకిట తథిమి అనే సప్తపదులు నేర్చుకోలేదు. కానీ లయ బద్ధంగా అడుగులు వేయగలరు. సంప్రదాయ నృత్యరీతుల్లో ఎన్ని మార్పులొచ్చినా... తరతరాలుగా అలవాటైన పద విన్యాసాలనే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ప్రకృతిని పరవశింపజేస్తున్నారు. ఇందుకోసం వినియోగించే వాయిద్య పరికరాలు కూడా వారు సొంతంగా తయారు చేసుకున్నవే. ఇంతగొప్ప నైపుణ్యం గలిగిన వీరు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారు. పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తూప్రకృతి ప్రసాదించిన అడవితల్లి ఒడిలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి జీవనం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. బుట్టాయగూడెం: దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కొండరెడ్డి గిరిజనుల జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. సంస్కృతీ, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వీరికి బయటి ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే వారికి ఆలవాలం. చుట్టూ కొండకోనలు వాగు వంకలతో అలరారే గిరి పల్లెల్లో ప్రకృతి నేరి్పన సంగీతం, నాట్యంతోనే జీవితాన్ని ఆనందంగా మలచుకుంటున్నారు.గిరిజనుల్లోనే కోయ తెగకు చెందిన వారు ‘రేరేలయ్య.. రేల... రేరేలా... రేలా..’ అంటూ పాడుకుంటే... కొండరెడ్లు ‘జొన్నకూడు.. జొన్న విల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త’ అంటూ కొత్త పంటలు వచ్చిన సమయంలో పసుపు పచ్చ పండగ, మామిడి పండగ, చింత పండగ, భూదేవి పండగల్లో పాడుకుంటారు. అలాగే పెళ్లిళ్ల సమయంలో కొండరెడ్లు ‘కళ్లేడమ్మ.. కళ్లేడమ్మ.. గోగుల పిల్లకు.. కెచ్చెల పిల్లోడు’ అంటూ పెళ్లికి సంబంధించిన పాటలు పాడుతూ లయ బద్ధంగా డోలు వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇప్పటికీ గిరిపల్లెల్లో పండుగలు, శుభ కార్యాల్లో ఆదివాసీ గిరిజన సంప్రదాయ డోలు, కొమ్ముల నృత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. సొంతంగా వాయిద్య పరికరాల తయారీ కొండరెడ్డి గిరిజనులు వాయిద్య పరికరా లు సొంతంగా తయారు చేసుకుంటారు. అడవిలో లభించే ఉస్కటేకు, వేగెసా చెట్ల తో డప్పుల నమూనాలను తయారు చేసి వాటికి మేక చర్మాలను అతికించి వాయి ద్య పరికరాలను తయారు చేసుకుంటారు. అలాగే అడ్డతీగ గిల్లలతో గుత్తులు కట్టి డప్పు వాయిద్యాల నడుమ ఆ గిల్లలు ఊపుతూ చక్కటి తాళంతో మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా గ్రామాల్లో పండగ సమయాల్లో నృత్యాలు చేస్తారు. బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగ నాడు వీరి ఆటపాటలతో కొండలు ప్రతిధ్వనిస్తుంటాయి. పోడు వ్యవసాయమే జీవనాధారం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సుమారు 11వేల మంది కొండరెడ్డి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే వీరు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కొండ దిగి బయట ప్రపంచం వైపు రారు. ఆయా గ్రామాల్లో అందరూ కలిసి కట్టుగా ఉంటూ అన్ని శుభకార్యాలను వారి సంప్రదాయంలో ఎంతో వైభవంగా చేసుకుంటారు. పూర్వికుల నుంచి వస్తున్న సంప్రదాయం మా పూర్వీకుల నుంచి గ్రామాల్లో శుభకార్యాలకు డోలు కొయ్య నృత్యాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్నే మేం కొనసాగిస్తున్నాం. సమాజంలోని మార్పుల వల్ల ఎన్ని కొత్త రకాల వాయిద్యాలు వచ్చినా మా డోలు కొయ్యి వాయిద్యమే మాకు వినసొంపుగా ఉంటుంది. అందులోనే మాకు సంతోషం ఉంటుంది. మాకు ప్రకృతి నేరి్పన సంగీతమిది. – బొల్లి విశ్వనాథరెడ్డి ఆ నృత్యాల్లో అందరం మైమరచిపోతాం మా గిరిజన గ్రామాల్లో ఏటా వేసవిలో బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మేం తయారు చేసుకొన్న వాయిద్య పరికరాలు వాయిస్తూ లయబద్ధంగా నృత్యాలు చేస్తాం. ఆ సమయంలో చిన్నాపెద్ద తేడా ఉండదు. అందరూ కలసి సంతోషంగా ఆనందంగా నృత్యాలు చేస్తాం. ఇది మా పూర్వికుల నుంచి వస్తున్న ఆచారం. – గోగుల గంగరాజు రెడ్డి -
ఆదిలాబాద్ లో ఆదివాసీల అరెస్ట్
-
నేతలకు మేం ఓట్లప్పుడే గుర్తుకు వస్తాం: గిరిజనులు
-
చీమల చట్నీ-గోంగూర, తింటారు నోరూర! తేడా వస్తే చీమల చికిత్స కూడా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గల్లీలో ఉండే చిన్న హోటల్లోనే పొద్దున ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా ఇంకా ఎన్నో వెరైటీ టిఫిన్లు దొరుకుతాయి. ఇక మధ్యాహ్నం అన్నం, రెండు మూడు రకాల కూరలు, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ లేనిదే ముద్ద దిగదు. ఇక ఏ స్టార్ హోటల్‌కి వెళ్లినా ఏ దేశపు వంటకాలైనా ఆర్డర్‌చేస్తే చాలు టేబుల్‌పై హాజరు... ఇవీ మైదాన ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు. కానీ అడవుల్లో జీవించే ఆదివాసీలు ఏం తింటారు? సీజన్లో దొరికే గోంగూర, చింతపండు, మిరపకాయలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార సేకరణ కష్టంగా మారిన సమయంలో ఎర్రచీమలతో పచ్చడి నూరుకుని కూడా తింటుంటారు. అయితే మారిన పరిస్థితుల్లో విద్య, ఉద్యోగాల కోసం అడవుల నుంచి బయటపడుతున్న వారి ఆహారపు అలవాట్లలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు చోటు చేసుకుంటోంది. వలస ఆదివాసీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు ఆశ్రయం ఇస్తున్నాయి. వలస ఆదివాసీల్లో అనేక తెగలు ఉండగా, వీరిలో 90 శాతం మంది రోడ్డు, నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి. గోంగూర.. పండుగే.. వానాకాలంలో మొలకెత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి. ఆ సమయంలో ఆదివాసీలు గోంగూర పండుగ చేసుకుంటారు. చింతకాయలు అందుబాటులోకి వచ్చే వరకు గోంగూరే వీరి ప్రధాన ఆహారం. వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకుని వేసవి వరకు వాడుకుంటారు. ఎండాకాలంలో చింతకాయలు రాగానే పచ్చడి చేసుకుంటారు. గోంగూరతో పాటు పచ్చకూర (చెంచలి), బొద్దుకూర, నాగళి, టిక్కల్ అనే ఆకుకూరలు, కొన్ని రకాలైన దుంపలను కూడా వండుకుంటారు. కారం కావాలంటే.. మొదట్లో అటవీ ఫలసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసీలను కారం రుచి మైమరపించింది. గోంగూర, చింతకాయ పచ్చడికి అవసరమైన మిరపకాయలు అపురూపమైన ఆహారంగా మారింది. దీంతో మిరపకాయల కోసమే ఎత్తయిన కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ.. వాగులు, వంకలు దాటుతూ రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి గోదావరి తీరానికి చేరుకునేవారు. ప్రారంభంలో భద్రాద్రి ఏజెన్సీలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను దొంగిలించుకెళ్లేవారట. ఆ తర్వాత ఇక్కడ పనిచేసి, కూలీగా మిర్చి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక పోడు సాగు కోసం ఆదివాసీలు అడవిని నరికేటప్పుడు ఇప్ప, మద్ది, తునికి, చింత, పాల చెట్లు తారసపడితే ముట్టుకోరు. ఇక ఇప్ప చెట్టునయితే దైవంతో సమానంగా కొలుస్తారు. చీమలు... ఆహారంగానే కాదు.. వైద్యానికి కూడా ఆకు రాలే కాలం మొదలైన తర్వాత వసంతం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియాగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడమేకాక ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, తలనొప్పి, జ్వరంగా అనిపించినా చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పేసుకుని చీమల గూడును ఒంటిపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా.. మంట పుట్టి క్షణాల్లో ఒళ్లంతా చెమటలు వస్తాయి. రెండు, మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని వారి నమ్మకం. కాగా, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలనే పండించి ఆహారంగా తీసుకునేవీరు క్రమంగా బియ్యానికి అలవాటు అవుతున్నారు. వ్యవసాయంలో ఎరువులు సైతం ఉపయోగిస్తున్నారు. గతంలో ఆవు పాలు తీసుకోని వీరు.. ఇప్పుడిప్పుడే పాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ గిరిజన పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నెమ్మదిగా మైదాన ప్రాంత ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు. చీమల చట్నీకి జీఐ ట్యాగ్.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఆదివాసీలు తమ ఆహారంలో చీమల చట్నీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రచీమలతో తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. చీమల చట్నీకి జీఐ టాగ్ సైతం లభించడం గమనార్హం. జొన్నలు, సజ్జలు తింటే తొందరగా ఆకలి వేయదు ఇంతకు ముందు జొన్నలు, సజ్జలు తినేవాళ్లం. పొద్దున తిని అడవికి వెళితే రాత్రి వరకు ఆకలి అనేది ఉండకపోయేది. కానీ బియ్యంతో చేసిన అన్నం అయితే రోజుకు రెండుసార్లు తినాల్సి వస్తోంది. ఇది తప్పితే బియ్యంతో చేసిన అన్నం బాగుంది. – మామిడి అరవయ్య (కూలీ, రెడ్డిగూడెం ఎస్టీ కాలనీ, పాల్వంచ మండలం) -
కామారెడ్డిలో ఫారెస్ట్ అధికారులను నిర్బంధించిన తండావాసులు
-
కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు
వారే వారసులు.. అనాది జీవన విధానానికి, అపురూప సంస్కృతికి, అరుదైన సంప్రదాయాలకు శాశ్వత చిరునామా వారు. వారు వారధులు కూడా.. నిన్నటి తరం వదిలిపెట్టిన వన సంపదను రేపటి తరానికి అందించే బాధ్యతను మోస్తున్నారు. పచ్చటి కొండకోనలను వేల ఏళ్లుగా రక్షిస్తూ, బతుకులను అడవి తల్లి సంరక్షణకు అర్పిస్తూ ఆదివాసీలు అందరికీ మేలు చేస్తున్నారు. అడవి ఇంకా బతికి ఉందంటే అదంతా వారి పుణ్యమే. అందుకే ఓ చల్లటి గాలి వీచినా, వెచ్చటి చినుకు పడినా మొదటి కృతజ్ఞత వారికే దక్కాలి. నేడు ఆదివాసీ దినోత్సవం. ఆహారం నుంచి ఆహార్యం వరకు అన్నింటా విభిన్నంగా కనిపించే వారి జీ‘వన’శైలి ఎప్పటికీ ప్రత్యేకమే. ఎల్ఎన్ పేట: కళ్లు తెరిస్తే పచ్చటి అడవి. తలెత్తి చూస్తే కొండ శిఖరం. అడుగు మోపితే ఆకుల తివాచీలు. ఆదివాసీల జీవనం ఎంత విశిష్టమో అంతే విభిన్నం కూడా. ఉద్యోగాలు వచ్చి కొందరు వనం వదలి వచ్చేసినా ఇంకా ఆ అడవి ఒడిలో ఎందరో బతుకుతున్నారు. కొండపోడు చేసుకుంటూ అడవి తల్లికి కాపు కాస్తున్నారు. వారి కట్టు, బొట్టు పరిశీలిస్తే అనాది సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయనడానికి సాక్ష్యం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో.. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయి. మన్యం జిల్లాగా విడిపోయిన తర్వాత సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, భామిని ఈ నాలుగు మండలాలు మన్యం జిల్లాకు వెళ్లగా.. మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో 74వేల గిరిజన కుటుంబాలు, సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు. 301 గిరిజన గ్రామ పంచాయతీల్లో 103 షెడ్యుల్ గ్రామాలు కాగా, 1282 నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. పోడు పంటలే ప్రధానం గిరిజనులకు పోడు పంటలే జీవనాధారం. జొన్నలు, సజ్జలు, రాగులు, గంటెలు, కంది, అరటి, బొప్పాయి, జీడి, సీతాఫలం, పైనాపిల్, పనస, పసుపు, అల్లం, కొండ చీపుర్లు, ఆగాకర, కర్రపెండ్లం, చీమ మిరప, జునుములు వంటి అనేక పంటలు పండిస్తారు. ఉదయాన్నే పనిచేసుకునేందుకు కుటుంబమంతా పోడు వద్దకు చేరుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని పంటలు పండిస్తారు. ఐకమత్యమే బలం.. గిరిజనుల్లో ఎన్ని మూఢ నమ్మకాలు ఉన్నా.. అంతా కలిసికట్టుగా బతకడమే వారి బలం. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అంతా ఒక చోట కు చేరి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, కార్యక్రమం చేయాలన్నా అందరూ తలో కొంత సాయం చేసుకుంటారు. ఒకరు మాట ఇచ్చారంటే ఊరంతా ఆ మాటకు కట్టుబడి ఉంటారు. కట్నం ఉండదు గిరిజనుల ఇంట పెళ్లి జరిగితే కట్నం అనే మాట ఉండదు. కట్నం ఎందుకు తీసుకోవటం లేదని ఎవరైనా వారిని ప్రశ్నిస్తే.. ‘ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు ఇస్తారు. అప్పు కోసం వారు ఎన్నో బాధలు పడాలి. అలాంటి డబ్బు తీసుకోక పోవటమే మంచిది’ అంటారు. అయితే సారె సామాన్లు మాత్రం స్వీకరిస్తారు. జిల్లాల విభజన తర్వాత.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత శ్రీకాకుళంలో ఉన్న సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలోకి వెళ్లింది. ఐటీడీఏను ఉమ్మడిగా కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఇటు శ్రీకాకుళం, అటు మన్యం జిల్లా పార్వతీపురంతో కలిసి సీతంపేట ఐటీడీఏ కొనసాగుతోంది. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి. ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు అటు అధికారులు, ఇటు గిరిజన సంఘాల నాయ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. (క్లిక్: కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?) మరింత ప్రోత్సాహం ఇవ్వాలి.. గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా అనేక మంది గిరిజనులు అమాయకంగానే జీవిస్తున్నారు. పోడు భూమికి పట్టాలు ఇచ్చి పూర్తి హక్కు కల్పించాలి. పోడు పంటలు పండించే గిరిజన రైతులను గుర్తించి అంతరించి పోతున్న పంటల సాగును ప్రోత్సహించాలి. – పడాల భూదేవి, చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం అధ్యక్షురాలు, శ్రీకాకుళం -
కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?
‘జల్, జంగిల్, జమీన్ ఔర్ ఇజ్జత్’ కోసం పోరాడే ఆదివాసీ ప్రజలను ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరిట అంతం చేస్తూనే ఆ తెగ బిడ్డనే రాష్ట్రపతిని చేయడం ఓ కళ! ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనలో దళితులు, ఆదివాసీలు తీవ్రమైన దాడులకు గురవుతున్నారు. వారి హక్కులు హరించివేయబడుతున్నాయి. రాజ్యాంగం 5వ షెడ్యూల్లోని భూమిని వినియోగించుకునేందుకు గిరిజనుల అంగీకారం కావాలన్న క్లాజును తొలగించారు. గనులపై ఉన్న గిరిజన హక్కులను కాలరాశారు. షెడ్యూల్డు కులాల, తెగల సబ్ ప్లాన్ నిధులు భారీకోతలకు గురవుతున్నాయి. ఆటవీ సంరక్షణ చట్టం –1980 ప్రకారం రూపొందించబడిన ప్రస్తుత అటవీ సంరక్షణ నియమాలను సవరించడానికి... ‘అటవీ సంరక్షణ నియమాలు– 2022’ పేరుతో కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2022 జూన్ 28న నోటిఫికేషను విడుదల చేసింది. 2004, 2014, 2017లలో సవరణల తర్వాత రూపొందించిన అటవీ సంరక్షణ నియమాలను ఈ కొత్త సవరణలు మార్పు చేస్తాయి. రియల్ ఎస్టేట్ చేపట్టే భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు, ప్రాజెక్టులు, చెట్ల నరికివేత, ఇతర అభివృద్ధి పనులకు నిబంధనల్ని సడలించారు. అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులు, ఇతరుల అనుమతి అవసరం లేకుండా... భూముల కేటాయింపు జరగనున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ ఇకపై ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆదివాసీలకు నష్టపరిహారం చెల్లించే విధానం రియల్ మాఫియాకు అనుకూలంగా కేంద్రం మార్చింది. ఉదాహరణకు 5 నుంచి 40 హెక్టార్ల అటవీ భూములపై స్క్రీనింగ్ కమిటీ 60 రోజుల్లో కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నోటిఫై చేసిన కొత్త నిబంధనావళిపై పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందని ఆదివాసీ లు ఆరోపిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం 2003–06లో పేర్కొన్న నిబంధనావళి స్థానంలో కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైన విధానమనీ ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2006 అటవీ హక్కులు చట్టం ప్రకారం మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కట్టడం చేపట్టాలన్నా, ఇతర పనులు చేపట్టలన్నా... అక్కడ నివసించే అడవి బిడ్డల అనుమతి, అంగీకారం తప్పనిసరి. అటవీ భూముల్ని ప్రభుత్వాలు ఏకపక్షంగా వేరే అవసరాలకు వాడటానికి వీల్లేదు. ప్రస్తుత చట్ట సవరణల వల్ల... ఏదైనా ప్రయివేటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, ఇకపై ప్రయివేటు డెవలపర్స్ భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్వాసితులు, బాధితులకు నష్టపరిహారం అందజేస్తుంది. ఇదంతా అయిన తర్వాత బాధితుల పునరావాసం, వారి అటవీ హక్కుల పరిరక్షణ జరిగిందా? లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆదివాసీలు, గిరిజనుల అంగీకారంతో సంబంధం లేకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. (క్లిక్: ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనా?) కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ‘అటవీ సంరక్షణ నియమావళి 2022’ ఉపసంహరించాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహ రించుకోవాలి. ఆదివాసీ ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. (క్లిక్: రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం) - వూకె రామకృష్ణ దొర ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ (ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) -
సీత్ల పండుగ; ఆటా, పాటా సంబురం
గిరిజనులైన లంబాడీలు (బంజారాలు) ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ. ఆ రోజు సీత్లా భవానీని పూజిస్తారు. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా భవానీ కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటివి పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, అటవీ సంపద తరగకూడదనీ, సీత్ల తల్లికి మొక్కులు తీర్చు కుంటారు. వివిధ తండాల్లో ఆయా తండాల పెద్ద మనుషు లంతా కలిసి ఆషాఢమాసంలో ఒక మంగళవారాన్ని ఎంచుకొని సీత్ల పండుగను జరుపుతారు. ఇలా ప్రతి సంవత్సరం మంగళవారం రోజు మాత్రమే జరపడం ఆనవాయితీగా వస్తోంది. తండాల సరిహద్దుల్లోని పొలి మేరల కూడలి వద్ద సీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారు ఉన్న ప్రదేశానికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. ఓ బంజారా పెద్ద మనిషిని పూజారిగా ఉంచి ఆయన చేతుల మీదుగా దేవత పూజా కార్యక్రమం నిర్వహిం చడం బంజారాల ఆచారం. పూజా కార్యక్రమం అంతా గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. – నరేష్ జాటోత్, నల్లగొండ -
సంచారుల కేరాఫ్ అడ్రస్.. మిత్తల్ పటేల్
అవి చేద్దాం ఇవి చేద్దాం అని జీవితంలో ఎన్నో కలలు కంటుంటాం కానీ, అన్నీ నిజం కావు. కొంతమంది కలలు ఒకరకంగా ఉంటే వారి డెస్టినీ మాత్రం మరోలా ఉంటుంది. కొన్నిసార్లు కల చెదిరినప్పటికీ డెస్టినీ చూపిన మార్గంలో మరెంతోమంది కలలను నిజం చేసే అవకాశం లభిస్తుంది. ఇలా లభించిన అవకాశంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది మిత్తల్ పటేల్. చిరునామా లేని వేలమందికి గుర్తింపు కార్డులతోపాటు, ఒక అడ్రెస్‌ను ఏర్పాటు చేసి, జనజీవన స్రవంతిలో కలుపుతోంది. గుజరాత్‌లోని సంఖల్‌పూర్‌లోని ఓ రైతు కుటుంబంలో పుట్టింది మిత్తల్ పటేల్. చిన్నప్పటి నుంచిఐఏఎస్ అధికారి కావాలనేది ఆమె కల. బీఎస్సీ అయ్యాక ఐఏఎస్ కోచింగ్ కోసం అహ్మదాబాద్ వెళ్లింది. ఒకపక్క ఐఏఎస్‌కు సన్నద్ధమవుతూనే గుజరాత్ విద్యాపీఠ్‌లో జర్నలిజం కోర్సులో చేరింది. ఇక్కడే ఆమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. రెండు నెలల ఫెలోషిప్‌లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లింది మిత్తల్. అక్కడ ఓ సంచార తెగను చూసింది. ఈ తెగకు చెందిన వాళ్లలో కొందరు ఏవో చిన్నపాటి గుడ్డపీలికలు మాత్రమే ధరించడం, మరికొందరు అదీ లేకుండా అలాగే ఒకచోటనుంచి మరో చోటుకి వలస వెళ్తుండడం వల్ల రోజుల తరబడి తిండిలేక బక్కచిక్కిన శరీరాలను చూసి ఆమె చలించిపోయింది. పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది మిత్తల్‌కు. వీరికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. రెండేళ్ల పాటు సంచార జాతుల గురించి పూర్తిగా తెలుసుకుని వారి కనీస అవసరాలు తీర్చి, వారికో గుర్తింపు ఇవ్వాలని పూనుకుంది. వీరి గురించి ఎంతోమంది అధికారులకు విన్నవించింది. వారికి సాయం చేయడానికి ఏ సీనియర్ అధికారీ ముందుకు రాలేదు. ప్రభుత్వ అధికారులే ఏం చేయలేనప్పుడు .. నేను ఆఫీసర్‌ను అయితే మాత్రం ఏం లాభం అనుకుంది. అప్పటిదాకా ఐఏఎస్ పరీక్షకు సిద్ధమైన మిత్తల్ ప్రిపరేషన్‌ను పక్కన పెట్టింది. విచారత సంస్థాన్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్‌లోనే 40 రకాలు ఉన్నారు. ముఫ్పై నుంచి నలభై లక్షల వరకు జనాభా ఉండే ఈ సంచారులకు ఆధార్ కార్డు, ఓటరు కార్డు, జనన ధ్రువీకరణ, చిరునామా సంబంధిత పత్రాలు ఏవీలేవని గుర్తించింది. వీరికి కనీస అవసరాలు కల్పించడానికి పూర్తిస్థాయిలో పనిచేయాలనుకుంది. భర్త ప్రోత్సహించడంతో 2015 విచారత కమ్యునిటీ పేరిట ఎన్జీవోను ప్రాంభించింది. సంచార జాతులను వెతకడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరికి సంబంధించిన పెళ్లిళ్లు, ఇతర విందు వినోద కార్యక్రమాల వద్దకు వెళ్లి వారి గురించి వివరాలు అడిగేది. ఈమె ఎవరో ఏమిటో తెలియక మొదట్లో తిరస్కరించినప్పటికీ తరువాత ఆమెను నమ్మి తమ వివరాలు చెప్పేవారు. వాళ్లు నివసించే ప్రాంతంలో టెంట్ వేసుకుని మరీ వారి స్థితిగతులను అధ్యయనం చేసేది. ఈ క్రమంలోనే పద్నాలుగు వందల కుటుంబాలకు పక్కా ఇళ్లను సమకూర్చింది. విచారత ఆధ్వర్యంలో మూడు హాస్టల్స్‌ను నిర్మించింది. వీటిలో వందలమంది సంచారుల పిల్లలు చదువుకుంటున్నారు. ఐడెంటిటీతో అందర్ని కదిలించింది గుజరాత్ ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరి చుట్టూ తిరిగి సంచారులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని వినతి పత్రం సమర్పించింది. చివరికి 2010లో తొంబై వేలమంది సంచారులకు రాష్ట్రప్రభుత్వం ఐడెంటిటీ కార్డులు జారీ చేసింది. ఇదే సమయంలో విచారత సంస్థాన్ ‘అమె పన్ చియే’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సంచారులకు ఐడెంటిటీ కార్డులు అందించారు. అప్పట్లో ఈ కార్యక్రమం అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఆకర్షించింది. దీంతో ఆ తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలన్నీ సంచారులకు అనేక హామీలు ఇచ్చాయి. ఊరు, పేరు లేని సంచారులకు ఐడెంటిటీని కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మిత్తల్‌ని 2017లో ‘నారీ రత్న’ అవార్డు వరించింది. దాదాపు పదిహేనేళ్లుగా సంచారుల అభ్యున్నతికి పాటుపడుతోన్న మిత్తల్ ప్రస్తుతం రాజాస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని సంచార, బంజార జాతుల అభివృద్ధే లక్ష్యంగా నిర్విరామంగా కృషిచేస్తోంది. చదవండి: అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్! -
మనందరి పూర్వీకుల పురిటిగడ్డ ఆఫ్రికా...
తెలుగు తల్లి.. భారత మాత.. మనకు తెలుసు. ఈ ‘ఆదిమ అమ్మ’ ఎవరు? ఎప్పుడూ వినలేదే.. అనే కదా మీ ఆశ్చర్యం..?! ‘ఆదిమ అమ్మ’ గురించి తెలుసుకోవాలంటే.. మనందరి పూర్వీకుల పురిటిగడ్డగా భావిస్తున్న ఆఫ్రికా వెళ్లాలి! ఇంకా చెప్పాలంటే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరానికి దగ్గర్లో ఉన్న అతి పురాతన గుహల్లోకి వెళ్లాల్సిందే!! మనిషి బుద్ధిజీవి. అసలు మనిషి పుట్టుకకు ముందు సుదీర్ఘమైన పరిణామ క్రమం ఉంది. పురాతన కాలపు చరిత్రకు శాస్త్రీయ, సజీవ, సుసంపన్న, అమూల్య సాక్ష్యంగా నిలిచింది ఆఫ్రికా.. మరీ ముఖ్యంగా సౌతాఫ్రికా! 98 ఏళ్లుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇందుకు గట్టి సాక్ష్యాలు దొరికాయి. అనేక ఆదిమ, ఆధునిక మానవ జాతులకు సంబంధించిన శిలాజాలను శాస్త్రవేత్తలు సేకరించి, విశ్లేషించారు. అందుకే ఈ గుహల సముదాయానికి ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ అని పేరు వచ్చింది. ప్రపంచ మానవాళికి పురుడుపోసిన ఈ ‘క్రెడిల్’ను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఇటీవల జోహన్నెస్‌బర్గ్ వెళ్లిన సందర్భంగా అక్కడ నేను తెలుసుకున్న విశేషాలు... 25 లక్షల ఏళ్ల నాటి ‘మిసెస్ ప్లెస్’ జోబర్గ్(స్థానికంగా జోహన్నెస్‌బర్గ్‌ను అలా అంటారు)కు 45 కిలోమీటర్ల దూరంలో విస్తారమైన గడ్డి భూముల నడుమ ఆదిమానవులు లక్షలాది ఏళ్ల క్రితం నివసించిన గుహలున్నాయి. ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’గా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతం సుమారు 450 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో దాదాపు 300 చారిత్రక గుహల సముదాయం ఉంది. కనీసం 15 గుహల్లో మానవాళి పుట్టుక ఇక్కడే అని ధ్రువీకరించే కీలక శిలాజాలు లభించాయి, ఇంకా లభిస్తున్నాయి. అటువంటి సుసంపన్న శిలాజ గనుల్లో అతి ముఖ్యమైనది ‘స్టెర్క్ఫాంటీన్’ గుహ. కుటుంబ సభ్యులు, సహ పర్యాటకులతో కలసి ఎంతో ఉత్సుకతతో ఈ గుహలోకి అడుగుపెట్టాను. లక్షల ఏళ్ల క్రితం అక్కడ జీవించి, అదే మట్టిలో కలిసిపోయిన మానవ జాతుల విశేషాల గురించి గైడ్ ఉద్వేగంగా చెబుతుండగా.. అదే గుహలో 1947లో ‘పాలియో ఆంత్రపాలజిస్టు’లు డా. రాబర్ట్ బ్రూమ్, డా. జాన్ టి. రాబిన్సన్లు కనుగొన్న పురాతన మహిళ ‘మిసెస్ ప్లెస్’ కపాలం నమూనాను చేతుల్లోకి తీసుకున్నాను. 25 లక్షల సంవత్సరాల క్రితం ఆమె జీవించిందట. డోలమైట్‌తో కలగలిసిన సున్నపు రాతి నిల్వలున్న గుహ అది. అక్కడి మట్టిని తాకి.. చిన్న సున్నపు రాతి ముక్కను తీసుకున్నాను. గుహ అడుగున కొద్దిపాటి నీటి మడుగు ఉంది. సుదీర్ఘ మానవ చరిత్రను మౌనంగా వీక్షిస్తున్న ఆ చల్లని నీటిని చేతి వేళ్లతో తాకాను. ఉన్నట్టుండి.. మా చేతుల్లో ఉన్న టార్చ్లైట్లన్నిటినీ ఒక్క నిమిషం ఆర్పేయమని గైడ్ చెప్పింది. 60 గజాల లోతున చల్లని గుహంతా చిమ్మచీకట్లతో కూడిన నిశ్శబ్దం ఆవరించింది. మన అందరి కుటుంబ వృక్షం వేరు మూలాలను తడుముతున్నట్లు ఆ క్షణంలో.. నా మనసంతా మాటల్లో చెప్పలేని ఉద్వేగంతో నిండిపోయింది! షీ ఈజ్ అజ్! మనుషులంటే పురుషుడేనా? మహిళ కాదా? తెల్లజాతీయుల నుంచి దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్న మనమే ఇలా పప్పులో కాలేస్తే ఎలా? అని మరపెంగ్ సమచార కేంద్రం నిర్వాహకులు ఆలస్యంగా నాలుక కరచుకొని ఆనక దిద్దుబాటు చేశారు. ఆసియావాసుల పోలికలతో చామన ఛాయలో ఉన్న ఆధునిక మహిళ ముఖచిత్రాన్ని సైతం రెండేళ్ల క్రితం జోడించి ఈ ప్రపంచ వారసత్వ మ్యూజియానికి పరిపూర్ణత చేకూర్చారు. అంతేకాదు మనం ఏ దేశవాసులమైనా ప్రపంచ ప్రజలందరి పూర్వీకులూ బంధువులేనన్న భావనతో ‘ఆమే మనం (షీ ఈజ్ అజ్)’ అని కూడా ప్రకటించారు! ఇదీ దక్షిణాఫ్రికాలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’లో మెరిసిన మన ‘ఆదిమ అమ్మ’ కథ!! ∙∙ శాస్త్ర సాంకేతిక పురోగతి వెలుగులో అనేకానేక సంక్లిష్టతలను అధిగమిస్తున్నప్పటికీ పురాతన చారిత్రక విషయాల్లో ఊహకు అందని చీకటి అంకాలెన్నో ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ కారణంగానే సాధ్యమైనంత వరకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ దృష్టికోణం నుంచే ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిలాజాల పుట్ట దక్షిణాఫ్రికాలోని జోబర్గ్ సమీపంలో హాటెంగ్, నార్త్‌వెస్ట్ రాష్ట్రాల సరిహద్దుల్లో 47 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రమణీయ కొండ కోనల మధ్య విస్తరించిన అందమైన గడ్డి భూముల్లో సుమారు 300 వరకు పురాతన గుహలున్నాయి. వీటిలో పన్నెండు గుహల్లో ఎన్నో ఆది, ఆధునిక మానవ జాతుల ఉనికిని బలంగా ఎలుగెత్తి చాటే శిలాజాలు లభించాయి. 1924లో ‘టాంగ్ చైల్డ్’, మొదలుకొని మిసెస్ ప్లెస్, ‘హోమో నలెడి’ వరకూ.. గత 98 ఏళ్లుగా ఈ గనుల్లో లభించిన అనేక శిలాజాలే ఇందుకు నిదర్శనాలు. యునెస్కో 1999లో ‘ప్రపంచ వారసత్వ స్థలం’గా గుర్తించడంతో.. విశ్వ పర్యాటకులకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ ఆకర్షణగా నిలిచింది. మరో 9 వారసత్వ స్థలాలు కూడా సౌతాఫ్రికాలో ఉన్నాయి. చెట్టుదిగి నడవటమే గొప్ప మలుపు సుమారు 2,600 కోట్ల ఏళ్లకు పూర్వం (నియో ఆర్చియన్ యుగంలో) ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ ప్రాంతం సముద్రపు నీటిలో మునిగి ఉండేది. కాలక్రమంలో సున్నపు రాళ్లు–డోలమైట్‌తో కలగలిసిన గుహలు రూపుదిద్దుకున్నాయి. అటువంటి వందలాది అతిపురాతన గుహలు జోబర్గ్ పరిసర ప్రాంతంలో ఉన్నాయి. వాతావరణ మార్పుల మూలంగా క్రమంగా సముద్రం వెనక్కి తగ్గటంతో.. తదనంతర కాలంలో చింపాంజీలు, ఏప్(వాలిడులు)లకు, ఆది మానవులకు, జంతుజాలానికి భూమి ఆలవాలమయింది. మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఆదిమానవులు అడవిలో చెట్ల మీద నుంచి నేల మీదకు దిగి, రెండు కాళ్లపై నిలబడి పచ్చిక బయళ్లున్న ప్రాంతాల్లోకి నడిచారు. మానవ పరిణామ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం ఇది! అయితే, ఏప్‌ల నుంచి మనిషి ఎలా విడిపోయాడనేదానికి ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. శీతోష్ణ పరిస్థితుల రీత్యా ఆఫ్రికా గడ్డపైనే ఈ పరిణామం చోటు చేసుకుందని చెబుతారు. ఆ విధంగా అనేక ఆదిమ జాతులతో పాటు కాలక్రమంలో దాదాపు 2 లక్షల ఏళ్ల నాడు ఆలోచనా శక్తి కలిగిన ఆధునిక మానవజాతి (హోమోసెపియన్) ఆవిర్భవించింది. మొదటి శిలాజ ఆవిష్కరణ మానవాళి చరిత్రలో దక్షిణాఫ్రికా ప్రాధాన్యాన్ని లోకానికి చాటిన మొదటి శిలాజ ఆవిష్కరణ ‘టాంగ్ చైల్డ్’. ఇది ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతి శిశువుకు చెందిన కపాల శిలాజం. 1924 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని టౌంగ్లో దీన్ని క్వారీ కార్మికులు గుర్తించారు. జోహన్నెస్‌బర్గ్‌లోని విట్వాటర్స్రాండ్ విశ్వవిద్యాలయ శరీర నిర్మాణ శాస్త్రవేత్త ప్రొ. రేమండ్ డార్ట్ దీని విశిష్టతను గుర్తించి ‘నేచర్’లో వ్యాసం రాశారు. దీనికి ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ లేదా ‘ఆఫ్రికా దక్షిణ కోతి‘ అని పేరు పెట్టినప్పటికీ, శిలాజం తాలూకు శిశువుకు మనిషి లక్షణాలున్నాయని ఆయన గుర్తించారు. మానవ పరిణామాన్ని మలుపు తిప్పిన శిలాజాలు లభించిన మరికొన్ని ప్రపంచ వారసత్వ స్థలాల గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఇండోనేషియా జావాలోని సంగిరన్ ఎర్లీ మాన్ సైట్, చైనాలోని జౌకౌడియన్, ఇథియోపియాలోని లోయర్ వాలీ ఆఫ్ ద అవష్, లోయర్ వ్యాలీ ఆఫ్ ఓమోతోపాటు.. టాంజానియాలోని ఓల్డ్వాయ్ జార్జ్, ఎర్లీ హోమినిడ్ ఫుట్‌ప్రింట్స్ (లెటోలి). వీటిలో 36 లక్షల ఏళ్ల నాటి పురాతన మానవుల శిలాజాలు లభించటం విశేషం. ‘తెలివి’కి 2 లక్షల ఏళ్లు! మానవ పరిణామ చర్రితను స్థూలంగా ‘హోమోసెపియన్’ జాతికి ముందు.. తర్వాత.. అని విభజిస్తే అర్థం చేసుకోవటం సులభం. ఈ జాతీయులకు అంతకు పూర్వీకులైన ‘ఆస్ట్రాలోపిథెసిన్’ల కంటే పెద్ద మెదడు ఉంది. రాతి పనిముట్లను రూపొందించే శారీరక సామర్థ్యంతో పాటు.. మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న మొదటి మానవ జాతి ఇది. ‘హోమోసెపియన్’ జాతీయులు సుమారు 23 లక్షల సంవత్సరాల క్రితం తొలుత ఆఫ్రికాలో జీవించారు. ఇందులో అనేక ఉప జాతులున్నాయి. మొదటిది.. హోమోహబిలిస్. వీరు 19 లక్షల సంవత్సరాల క్రితం జీవించారు. వీళ్ల వారసులే ‘హోమోఎర్గాస్టర్’లు. దాదాపు 17 లక్షల సంవత్సరాల క్రితం జీవించారట. ఆధునిక సాధనాల ఉపయోగం, వంట, వెచ్చదనం కోసం అగ్నిని ఉపయోగించుకునే సామర్థ్యం వీరికుంది. ఈ సామర్థ్యమే వీరి వారసులు ఆఫ్రికాను వదలి చల్లని ప్రదేశాలకు వలస వెళ్లేలా చేసిందట. ఆ కొన్నాళ్లకే ‘హోమోఎరెక్టస్’ ఉద్భవించింది. హోమోసేపియన్ జాతీయులు అభివృద్ధి చెందే కొద్దీ, నైపుణ్యాలను అందిపుచ్చుకునే కొద్దీ వారి మెదడు కూడా వికసించింది. ఆ క్రమంలోనే సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం తొలి ఆధునిక మానవులైన ‘హోమోసేపియన్లు’ ఆఫ్రికాలో ఉద్భవించారు. లాటిన్లో హోమో అంటే ‘మానవులు‘, సేపియన్స్ అంటే ‘తెలివైన’అని అర్థం. క్రీ.శ. 1758లో కార్ల్ లిన్నేయస్ ఈ పదబంధాన్ని తొలిసారి వాడారు. ఇథియోపియాతోపాటు దక్షిణాఫ్రికాలో హొమో సేపియన్ జాతి శిలాజాలు కొన్ని బయటపడ్డాయి. ఈ క్రమంలోనే కనీసం 70 వేల సంవత్సరాల నుంచే మనుషులు అలంకరణ, కళాకృతుల తయారీ వంటి ఆధునిక పోకడలను సైతం అలవర్చుకున్నారు. హోమో సేపియన్లు కాలక్రమంలో ఆఫ్రికా నుంచి భూగోళం మీదున్న అన్ని భూభాగాలకూ విస్తరించారంటున్నారు పరిశోధకులు. నిజంగా మానవాళి పురిటి గడ్డేనా?∙ 1920–30లలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన శిలాజాల చారిత్రక ప్రాముఖ్యతను చాలా మంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఆఫ్రికా వెలుపల ఉన్నవారు, తొలుత కొట్టిపారేశారు. 1912లో ఇంగ్లండ్‌లోని ససెక్స్‌లో బయటపడిన ‘పిల్ట్‌డౌన్ మ్యాన్‘ అనే మానవ కపాల శిలాజంపైనే వారి దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమైంది. దీన్ని ‘ఎయోంత్రోపస్ డాసోని’ జాతిగా వర్గీకరించారు. ఈ పుర్రెను చార్లెస్ డాసన్ కనుగొన్నందున ఆయన పేరునూ దీనికి జోడించారు. ఐరోపాలో వెలుగుచూసిన సుదూర మానవ పూర్వీకుడుగా ‘పిల్ట్‌డౌన్ మ్యాన్’ ను అభివర్ణించారు. కోతిలాంటి దవడను, ఆధునిక మానవు (హోమోసేపియ¯Œ )ల మాదిరిగా పెద్ద మెదడు కలిగిన జీవిగా చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో శిలాజాల ప్రాధాన్యాన్ని తెలియజెబుతూ ప్రొ. రేమండ్ డార్ట్, డా. రాబర్ట్ బ్రూమ్ చేసిన విశ్లేషణలపై పాశ్చాత్య శాస్త్రవేత్తలు వివాదానికి దిగారు. వీరిద్దరూ దక్షిణాఫ్రికాలో కనుగొన్న ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ శిలాజాల మెదడు పరిమాణం చిన్నగా ఉండటం విమర్శకులకు అనుకూలించింది. అయితే, దశాబ్దాలు గడచిన తర్వాత, నిజం నిలకడ మీద బయటపడింది. ‘పిల్ట్‌డౌన్ మ్యాన్’ శిలాజం నకిలీదని చివరికి 1953లో శాస్త్రీయ పరిశోధనల్లో బట్టబయలైంది. మానవ పుర్రెకు ఒరాంగుటాన్ జంతువు దవడ (దంతాలను అరగదీసి మనిషివిగా చిన్నగా కనిపించేలా చేశారు)తో కలిపి పాతిపెట్టి.. సహజమైన శిలాజంగా నమ్మించే ప్రయత్నం చేశారని తేలింది. పిల్ట్‌డౌన్ బూటకం చాలామంది శాస్త్రవేత్తలను 40 ఏళ్లకు పైగా తప్పుదోవ పట్టించింది. దక్షిణాఫ్రికా శిలాజాల చారిత్రక ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించడం ఆ మేరకు ఆలస్యమైనా.. శాస్త్రీయంగా రూఢి అయ్యింది. ఈ బూటకపు శిలాజం సృష్టికర్తలెవరో నేటికీ కచ్చితంగా తెలియరాలేదు. దక్షిణాఫ్రికాలో ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతికి చెందిన అనేక శిలాజాల ఆవిష్కరణలు ఆ తర్వాత కూడా వెలుగులోకి వస్తుండటం, పిల్ట్‌డౌన్ స్కామ్ బహిర్గతం కావటంతో.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ‘మానవజాతి పురిటి గడ్డ’ ఆఫ్రికా అని ఎట్టకేలకు అంగీకరించారు. దక్షిణాఫ్రికా శిలాజ వారసత్వం ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి తరం ఆంగ్ల శాస్త్రవేత్తల్లో సర్ విల్ఫ్రెడ్ లీ గ్రాస్ క్లార్క్ ఒకరు. ∙∙ ఈ పూర్వరంగంలో పురాతన నాగరికతలు 10,000 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్నాయి. లిపి ఆవిర్భవించిన తర్వాత మానవ వికాసం మనకు తెలిసిన చరిత్రే. మానవ జనాభా 2000 ఏళ్ల క్రితం 20 కోట్లు ఉండేది. 790 కోట్లకు పెరిగింది. భూగోళంపైన, కొండ శిఖరాల నుంచి దీవుల వరకు, మట్టి కనిపించే ప్రతి చోటుకూ మనం విస్తరించాం. ధ్వని కన్నా వేగంగా భూగోళం ఆ దరి నుంచి ఈ దరికి ప్రయాణించగలుగుతున్నాం. కానీ, పుడమి పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం.. ప్రకృతిసిద్ధమైన జంతుజాలం ఆవాసాలను నాశనం చేస్తున్నాం.. అత్యాధునిక రూపాల్లో యుద్ధాలకు తెగబడుతున్నాం.. సుదీర్ఘ పరిణామ క్రమంలో అందివచ్చిన గొప్ప తెలివి తేటలు మనల్ని దీర్ఘకాలం జీవించనిస్తాయా? లేక గంపగుత్తగా దుంపనాశనం చేస్తాయా? పుట్టింటికి పునరాహ్వానం! యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’కు సంబంధించిన అధికారిక మ్యూజియం కమ్ సమాచార కేంద్రం పేరు ‘మరపెంగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’. మేం చూసిన ‘స్టెర్క్ఫాంటీన్’ గుహకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. 29 మిలియన్ డాలర్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 2005 డిసెంబర్ 7న ప్రారంభమైన ‘మరపెంగ్’.. మానవ పరాణామ విజ్ఞానశాస్త్ర గని అని చెప్పొచ్చు. పర్యాటకులను, మానవ పరిణామ శాస్త్ర అధ్యయనకారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే రీతిలో విశేషాలేన్నిటినో ఇక్కడ పొందికగా ఆవిష్కరించారు. మరపెంగ్ అంటే.. స్థానిక ‘సెస్త్వానా’ భాషలో ‘పుట్టింటికి పునరాహ్వానం’ అని అర్థం. ‘వెల్కమ్ హోమ్.. ఎక్స్ప్లోర్ యువర్ హ్యూమన్ హెరిటేజ్’ అంటూ తెల్లని పతాకం మనల్ని లోపలికి ఆహ్వానిస్తుంటుంది. విశ్వం, భూమి, జీవుల పుట్టుక.. తదనంతర పరిణామక్రమంలో ఆది మానవుల పుట్టుక, నిప్పు వాడుక/ నియంత్రణ, రాతి పరికరాల వాడటం.. ఆధునిక మానవుల పుట్టుక, జీవన వికాసాలకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ‘మరపెంగ్’లోని భూగర్భ మ్యూజియం అత్యద్భుతంగా పర్యాటకుల కళ్లకు కడుతోంది. ఆదిమ, ఆధునిక మానవ జాతులకు ప్రతీకలుగా రూపొందించిన కొన్ని విగ్రహాలను, సజీవ వ్యక్తులను తలపించేలా చారిత్రక ఔచిత్యంతో రూపకల్పన చేసిన ముఖచిత్రాలను ప్రదర్శించారు. కోతిని పోలిన నలుపు/చామన ఛాయ ఆదిమానవుల దగ్గర నుంచి జర్మనీ మూలాలున్న నియాండర్తల్ తెల్ల జాతీయుడి ముఖచిత్రం వరకు ఇందులో ఉన్నాయి. అయితే, వాటిలో చాలా వరకు పురుషుల ముఖ చిత్రాలే! భూగర్భ వ్యోమగాములు! అవును.. మీరు చదివింది నిజమే.. వ్యోమగాముల అవసరం రోదసిలోనే కాదు, ఒక్కోసారి భూగర్భంలోనూ ఉంటుంది. గుహలో అత్యంత క్లిష్టమైన స్థితిలో శిలాజాల అన్వేషణలో క్లిష్ట దశను అధిగమించడానికి అవసరమైంది. ఆ సాహస కార్యాన్ని ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు అద్భుతంగా నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. ‘భూగర్భ వ్యోమగాముల’ను మేం ముద్దుగా పిలుచుకుంటున్న ఈ ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు లేకుండా మన దగ్గరి బంధువైన ఓ కొత్త జాతి ఆవిష్కరణ సాధ్యమయ్యేది కాదని ప్రధాన పరిశోధకుడు ప్రొ. లీ బెర్గర్ 2015 సెప్టెంబర్‌లో ప్రకటించారు. ఈ ఆదిమ జాతికి ‘హోమో నెలడి’ అని పేరుపెట్టారు. ఏడేళ్ల కిందట.. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ గుహల సముదాయంలోని రైజింగ్ స్టార్ అనే గుహలో శిలాజాల కోసం అన్వేషణ ఉత్కంఠభరితంగా సాగుత్ను రోజులవి. 18 సెం.మీ. ఖాళీలోంచి.. ప్రొ. లీ బెర్గర్ బృందం గని లోపల తవ్వకాలు చేస్తుండగా. ఆది మానవుల శిలాజాలు కొన్ని దొరికాయి. అక్కడి నుంచి కిందికి చిన్న దారి కనిపించింది. ఆ లోపల 30 మీటర్ల కింద మరో చిన్న గది కనిపించింది. అందులో ఇంకా మానవ శిలాజాలు ఉన్నాయని ప్రత్యేక పరికరాల ద్వారా త్రీడీ స్కాన్ ద్వారా కనుగొన్నారు. అయితే, ఆ దారిలో రెండు బండరాళ్ల మధ్య కేవలం 18 సెంటీమీటర్ల (ఫుట్‌బాల్ కన్నా తక్కువ) ఖాళీ మాత్రమే ఉంది. మనిషి లోపలికి వెళ్లకుండా శిలాజాలను సేకరించలేం. అంత సన్నని దారిలోంచి లోపలికి వెళ్లటం ఎలా? అంత సన్నగా ఉండే మనుషులైతే లోపలికి వెళ్లగలరన్న ఆలోచనతో ప్రొ. లీ బెర్గర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. 18 సెం.మీ. కన్నా సన్నని శరీరం కలిగిన పురావస్తు తదితర శాస్త్రాల్లో పీజీ చదివి ఉండి, గుహల్లోకి దిగే అనుభవం ఉన్న వారెవరైనా సంప్రదించమని కోరారు. పది రోజుల్లో 60 దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అన్ని అర్హతలున్న 6గురు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. వారే.. ఈ భూగర్భ వ్యోమగాములు.. మెరీనా ఇలియట్ (కెనడా), బెక్కా పీక్సోటో (వాషింగ్టన్ డిసి), లిండ్సే హంటర్ (అయోవా), ఎలెన్ ఫ్యూరిగెల్ (ఆస్ట్రేలియా), హన్నా మోరిస్ (ఒహైయో), అలియా గుర్టోవ్ (విస్కాన్సిన్). 30 మీటర్ల దిగువ వరకు పాక్కుంటూ వెళ్లి శిలాజాలను వెలికితీయటమే ఈ మహిళా శాస్త్రవేత్తలు చేసిన సాహసం. దాదాపు 3 వారాల పాటు సాగిందీ అన్వేషణ. దాదాపు 15 మందికి చెందిన 1500 ఎముకలు లభించాయి. ఆఫ్రికాలో ఒకేచోట ఇన్ని మానవ శిలాజాలు దొరకటం ఓ రికార్డు. యూరేసియా కూడా ముఖ్య రంగస్థలమే! ఆఫ్రికాయే మానవుల పురిటిగడ్డ అనే వాదనతో విభేదించే వారూ లేకపోలేదు. వీరిలో హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ రైక్ ఒకరు. ‘హూ వియార్ అండ్ హౌ వియ్ గాట్ హియర్’ అనే పుస్తకాన్ని ఇటీవలే వెలువరించారు. ప్రాచీన మానవ డీఎన్ఏ విశ్లేషణకు తోడ్పడిన పదిమంది మార్గదర్శకులలో ఒకరిగా డేవిడ్ రైక్‌కు గుర్తింపుంది. మానవ సంబంధ ఆవిష్కారాలన్నీ ఆఫ్రికాలోనే సంభవించాయని, అక్కడి వారే మిగతా ప్రపంచమంతా విస్తరించారనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు డేవిడ్ రైక్ . మానవ పరిణామక్రమంలో పురాతన మానవ జాతి నియాండర్తల్స్ నివసించిన యూరేసియా (యూరప్, ఆసియాలు మొత్తం విస్తరించిన ప్రాంతం) కూడా ముఖ్య రంగస్థలమే అంటున్నారాయన. ‘మానవులు అంతర్గతంగా మిశ్రమ పూర్వీకుల నుంచి ఉద్భవించారు. ఏ జనసమూహం కూడా స్వచ్ఛమైనది కాదు. భిన్నమైన సమూహాల కలయిక మానవ స్వభావపు సాధారణ లక్షణం. గతం నుంచి మనం నేర్చుకోవాలి.. మరింత కనెక్ట్ అవ్వాలి’ అంటున్నారు ప్రొ. డేవిడ్ రైక్. -పంతంగి రాంబాబు , సాక్షి ప్రత్యేక ప్రతినిధి, (జోహన్నెస్‌బర్గ్ నుంచి) -
కొమురంభీం జిల్లా దిందా లో పోరుబాట పట్టీన గిరిజనులు
-
అమెజాన్ ఇండియా కారీగర్ మేళా
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా ట్రైబ్స్ ఇండియా సంస్థతో కలిసి కారీగర్ మేళాను ప్రారంభించింది. ఈ ఒప్పందం ప్రకారం సంప్రదాయ గిరిజన ఉత్పత్తులు, భారతీయ హస్తకళల ఉత్పత్తుల కోసం అమెజాన్ తమ పోర్టల్‌లో ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది. బిద్రి, ఇక్కత్, పటచిత్ర తదితర సుమారు 1.2 లక్షల పైచిలుకు ఉత్పత్తులు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 దాకా రెండు వారాల పాటు కారీగర్ విక్రేతలకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ (ఎస్వోఏ) ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు లభిస్తుంది. దేశీ చేనేతకారులు, చేతి వృత్తుల కళాకారులు ఈ–కామర్స్ ద్వారా మరింత వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పడేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. -
Hatsoff Doctors వాగులు దాటారు, కొండలు ఎక్కారు
పాలక్కాడ్: కరోనా కష్టకాలంలో డాక్టర్లలతో పాటు వైద్య సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా కొండకోనల్లో నివసించే ట్రైబల్స్‌ని కాపాడేందుకు కేరళ వైద్యులు చేసిన ప్రయత్నానికి దేశ ప్రజానీకం హ్యట్సాప్ అంటోంది. వారి శ్రమకు దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. మారుమూల గ్రామం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ. ఎన్నో గిరిజన తెగలు ఆ అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. సరైన రహాదారి, కనీస సౌకర్యాలు లేకపోయినా అడవి తల్లినే నమ్మకుని జీవిస్తున్నారు. అయితే ఇటీవల అట్టపడి టౌన్‌కి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మురుగుల గ్రామస్తులు కరోనాతో బాధపడుతున్నట్టు స్థానిక వైద్యులకు సమాచారం అందింది. శ్రమించిన వైద్యులు మురుగులలో కరోన ఆనవాళ్లు ఉన్నట్టు తెలియగానే స్థానిక వైద్యులు సుకన్య, సునిల్ వాసు, శైజిలతో పాటు ఇతర వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాహనంలో కొంత దూరం వెళ్లగానే వారికి భవానిపూల నది ఎదురైంది. అక్కడి ఉంచి వాహనంలో పోవడం సాధ్యం కాకపోవడంతో నదిలోనే నడుములోతు నీళ్లలో డాక్టర్ల బృందం ప్రయాణం మొదలైంది. నది దాటిన తర్వాత 8 కిలోమీటర్ల దూరం కొండ అంచున ప్రయాణిస్తూ మురుగుల గ్రామం చేరుకున్నారు. 7గురికి పాజిటివ్ మురుగులలో వందమందికి పైగా కురుంభ, ఇరుల, ముదుగర్ తెగకు చెందిన జనాభా ఉండగా 30 మందిలో కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వారికి యాంటిజెన్ టెస్టులు అక్కడికక్కడే నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే వారందరినీ ఆస్పత్రికి తరలించారు. అభినందనలు వైద్యులు సకాలంలో స్పందించి ఆ మారుమూల అటవీ గ్రామానికి చేరుకోక పోయి ఉండి ఉంటే ... అరుదైన తెగకు చెందిన ప్రజలు కరోనా బారిన పడి ఉండేవారు. తమ విధుల పట్ల వైద్యులు చూపిన అంకిత భావానికి దేశ నలుమూలల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
ఆపాదమస్తకం.. రామనామం
సాక్షి, భద్రాచలం: ‘ఓ రామ.. శ్రీరామ.. నీ నామమెంతో రుచిరా’అంటూ వేనోళ్ల కీర్తించాడు భక్త రామదాసు. కానీ ఆ గ్రామంలోని అందరూ వయో, లింగ భేదం లేకుండా ఆపాదమస్తకం రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుని తమ దేహాన్నే దేవాలయం గా మార్చుకున్నారు. మనసును, దేహాన్ని శ్రీరామమయంగా మలుచుకున్నారు. అపర రామదాసుల్లా శ్రీరాముడిని నిత్యం కీర్తిస్తుంటారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లా సారంగడ్ తాలూకాలో నందేలి అటవీ ప్రాంతంలో ‘శ్రీరామనామి’తెగ వారు జీవిస్తుంటారు. వారి సంస్కృతి సంప్రదాయాలు చాలా వినూత్నంగా ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శిరస్సు నుంచి పాదం వరకు శ్రీరామ నామాలను పచ్చబొట్టుతో పొడిపించుకుంటారు. శ్రీరాముడిని ఆవహించుకున్నట్లు భక్తిభావంతో ప్రతిరోజూ శ్రీరామ నామాన్ని జపిస్తుంటారు. ఈ తెగలోని వారు మాంసాహారం, ధూమపానం, మద్యపానం సేవించకుండా నియమ నిష్టలతో రాముడిని పూజిస్తుంటారు. తమ పనులు, ఇళ్లలో శుభకార్యాలు జరిగినా శ్రీరామనామంతోనే ప్రారంభిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. దేహాన్నే ఆలయంగా మార్చుకుని.. 19వ శతాబ్దంలో నాటి సామాజిక పరిస్థితుల వల్లే ‘శ్రీరామనామి’తెగ ఆవిర్భవించినట్లు ప్రచారంలో ఉంది. అప్పటి ఉన్నత తెగల వారు దేవాలయాల్లోకి కింది వర్గాల వారిని అనుమతించకపోయేవారు. దీంతో 1890వ దశకంలో పరశురామ్ అనే వ్యక్తి తన నుదిటిపై శ్రీరామ నామాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నాడని ప్రచారంలో ఉంది. ఆయనే ‘శ్రీరామనామి సమాజ్’కు ఆద్యుడు అని చెబుతుంటారు. అప్పటి నుంచి ఆ తెగకు చెందిన వారు శ్రీరామనామాన్ని చెరిగిపోని ముద్రగా భక్తి భావంతో ఉంచుకొని తమ దేహాన్నే దేవాలయంగా మలుచుకొని శ్రీరాముడిని కొలుస్తున్నట్లు చెబుతారు. ఒంటిపైనే కాకుండా వస్త్రాలను, నెమలి ఈకలతో చేసిన శిరస్త్రానంపై కూడా శ్రీరామ నామమే ఉంటుంది. ఏటా మూడ్రోజులు భజన రామనామి తెగ ఆధ్వర్యంలో ఏటా అక్కడ డిసెంబర్, జనవరిలో మూడు రోజుల పాటు భజన మేళా నిర్వహిస్తారు. అక్కడి తెగ వారి సంస్కృతీ సంప్రదాయాలకు విలువిచ్చి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ నేతలు ఈ మేళాకు హాజరవుతారు. జాతరకు పెద్ద సంఖ్యలో తెగకు చెందిన వారు హాజరుకావడంతో పాటు ఆ తెగకు చెందిన యువతీ యువకులకు పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. -
గిరి సీమల్లో భోగి సందడి
సాక్షి, ఆసిఫాబాద్: కనుల విందు చేసే గుస్సాడీల కోలాహలం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో అనేక ఆదివాసీ గ్రామాల్లో భోగి పండుగలను నిర్వహించుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని గిరి సీమలు దండారీలకు ముస్తాబయ్యాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న దండారీ ఉత్సవాలకు గుస్సాడీలకు కావాల్సిన పరికరాలకు పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవంలో ఊరుఊరంతా పాల్గొంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1386 గిరిజన గ్రామాలుండగా.. 1208 గ్రామాల్లో దండారీ ఉత్సవాలు కొనసాగుతాయి. కెరమెరి మండంలోని సాకడ(బి)లో ఏత్మాసార్ పేన్కు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆ నైవేద్యాన్ని ఆరగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటి నుంచి దండారీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చదవండి: విజయశాంతి ప్రకటన.. కాంగ్రెస్‌లో కలకలం -
గిరిజనులు నా సొంత కుటుంబ సభ్యులు
సాక్షి, అమరావతి: గిరిజనులను తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గిరిజనుల ఆదాయం పెంచేందుకు, వారిని రైతులుగా చేసి మంచి జరిగేలా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఏళ్ల నాటి గిరిపుత్రుల కలలను నెరవేరుస్తూ గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు. పలువురు గిరిజన మహిళలకు స్వయంగా క్యాంపు కార్యాలయంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందజేశారు. మొత్తం 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలపై హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల, ఐటీడీఏ పరిధిలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు, విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్లో బటన్ నొక్కి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం వివరాలు ఇలా ఉన్నాయి. గిరిజనుల మేలు కోసమే.. రాష్ట్రంలో దాదాపు 6 శాతం ఉన్న గిరిజనులకు మంచి చేయాలని, వారి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రయత్నం చేస్తున్నాం. నాడు నాన్నగారి హయాంలో ఆ తపన చూశాం. మళ్లీ ఇవాళ దాదాపు 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమం నెల రోజులు కొనసాగుతుంది. హక్కుల పత్రాల పంపిణీ, దాంతో పాటు రైతు భరోసా సొమ్ము ఇస్తాం. గిరిజనులను రైతులుగా చేసి, వారికి మంచి జరిగేలా చేయాలన్నదే మా లక్ష్యం. మాట నిలబెట్టుకున్నాం ఎన్నికల ప్రణాళికను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తామని చెప్పాం. అందులో చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారం పేద గిరిజనులందరికీ కనీసం 2 ఎకరాల భూమి ఇవ్వాలన్న తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాల్టి నుంచి పత్రాలు ఇస్తున్నాం. పట్టాలు పొందిన అక్క చెల్లెమ్మలకు భూమి అభివృద్ధి మాత్రమే కాకుండా, నీటి సదుపాయం, తోటల పెంపకానికి సహాయం చేస్తున్నాం. గిరిజనుల ఆదాయం పెంచడంతో పాటు, అడవుల్లో మరింత పచ్చదనం పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. ఆ దిశలో కలెక్టర్లు, అటవీ అధికారులతో కలిసి పని చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం ఇస్తూ అండగా నిలిచాం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి, ఆ మేరకు చట్టం చేశాం. గిరిజనులకు మరింత మేలు చేసే విధంగా గిరిజన సలహా మండలి కూడా ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల పట్ల చాలా వివక్ష కొనసాగింది. వారికి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. చివరకు సలహా మండలి కూడా ఏర్పాటు చేయలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆలోచన చేయలేదు. ప్రస్తుతం గిరిజనులు నా సొంత కుటుంబం అనుకుని అడుగులు ముందుకు వేస్తున్నాను. గతంలో గిరిజనులకు వైద్యం అందక చనిపోయేవారు. నేను పాదయాత్రలో స్వయంగా చూశాను. ఆ పరిస్థితులను మారుస్తూ పలు చర్యలు చేపడుతున్నాం. పాడేరులో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణ పనులు మొదలు పెడుతున్నాం. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు కూడా ఇవాళే మొదలు పెడుతున్నాం. 5 ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు కూడా ఇవాళే మొదలు పెడుతున్నాం. ఆ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందనున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు, కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో సేవలందించడమే లక్ష్యం. ఎన్నో కార్యక్రమాలతో అండగా.. అమ్మ కడుపులో బిడ్డ పెరగడం మొదలైనప్పటి నుంచి అవ్వా తాతల వరకు అందరికీ మేలు చేసే పనులు చేస్తున్నాం. గర్భిణులు మొదలు పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకు పోషణ పథకంలో పౌష్టికాహారం అందజేస్తున్నాం. 5 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. 500 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పు చేశాం. అనేక పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మేలు చేస్తున్నాం. నాడు–నేడులో పాఠ«శాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇంగ్లిష్ మీడియమ్‌తో పేద కుటుంబాల పిల్లలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. చేతి రాతతో పాటు, తల రాత కూడా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం. స్వచ్ఛమైన మనసున్న గిరిజనులకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. క్యాంపు కార్యాలయంలో ప్రదర్శించిన రంపచోడవరం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, పాడేరు వైద్య కళాశాల నమూనాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, మంత్రులు బొత్స, బాలినేని, సురేష్, సీఎస్ నీలం సాహ్ని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీరు గిరిజన పక్షపాతి కొండల్లో జీవిస్తూ, అటవీ భూములు సాగు చేస్తున్న వారిపై గతంలో కేసులు పెట్టారు. ఇవాళ మీరు అడవి బిడ్డలకు అండగా నిలుస్తూ, ఆ భూములపై హక్కు కల్పిస్తూ, పట్టాలు ఇస్తున్నారు. ఆ విధంగా మీరు గిరిజన పక్షపాతిగా నిల్చారు. నాడు మహానేత వైఎస్సార్ 55,513 మందికి 1,30,679 ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలిచ్చారు. ఆ తర్వాత మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. మీరు వచ్చాకే మాకు నమ్మకం ఏర్పడింది. అందుకే మేమంతా మీ వెంట నడిచాం. ఇప్పుడు మీరు అడగకుండానే మాకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. ఉపాధి, విద్య, వైద్యంతో పాటు మరెన్నో కార్యక్రమాలతో మాకు అండగా నిలిచారు. మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. – పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
మేమున్నామని.. మీకేం కాదని
పాలకొండ రూరల్/సీతంపేట: వైద్యం లేక అల్లాడిపోతున్న గిరిజన ప్రాంతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఊపిరి అందించారు. అపర సంజీవనిగా పేరుగాంచిన 108, 104 సేవలను ఏజెన్సీలో విస్తృతం చేస్తూ నిర్ణయం తీసుకు న్నారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు నియోజకవర్గాలైన పాలకొండ, పాతపట్నం, పలాస, టెక్కలి, నరసన్నపేట పరిధిలో 24 గంటలు వైద్య సేవలను అందించే 27 పీహెచ్‌సీలున్నాయి. అలాగే ఆరోగ్య ఉప కేంద్రాలు 151, ఏరియా ఆస్పత్రులు 2, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 ఉన్నాయి. వీటికి సంబంధించి ఐటీడీఏ ప్రత్యేక అంబులెన్స్‌లు 11 అందుబాటులో ఉన్నాయి. గత టీడీపీ హయాంలో ఏజెన్సీ మండలాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందేవి. దీనికి తోడు అప్పట్లో 108, 104 వాహనాలకు డీజిల్ లేక అవి మూలనపడ్డాయి. సిబ్బందికి అరకొర జీతాలతో వారూ ది గాలుగా ఉండేవారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పరిస్థితులను సమూలంగా మా ర్చివేసింది. ముఖ్యంగా ఏజెన్సీ సబ్‌ప్లాన్ పరిధిలో మెరుగైన వైద్య సేవలకు శ్రీకా రం చుట్టింది. ఏజెన్సీలో మెరుగైన వైద్య సేవలు ఐటీడీఏ సబ్‌ప్లాన్ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలకు మెరుగైన వైద్య సేవలందించడ మే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా సీతంపేట, పాలకొండ మండల కేంద్రాల్లో అ త్యాధునిక హంగులతో ప్రత్యేక ఆస్పత్రుల నిర్మాణాలకు సంబంధించి నిధులు సమకూర్చేందుకు పచ్చజెండా ఊపింది. తాజాగా 104, 108 వాహనాలను కూడా సమకూర్చింది. 2011 నుంచి ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో తిరుగుతున్న వాహనాలు 5 లక్షల కిలోమీటర్లు దాటి ప్రయాణాలు కొనసాగించటంతో నిబంధనల మేరకు ఆ వాహనాలు జీర్ణించుకుపోయాయి. ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఏజెన్సీ గ్రామాలను కలుపుకుని ఉన్న సమీప మండలాలైన పాలకొండ, మందస, పాతపట్నం, కొత్తూరు, సీతంపేట, మెళియాపుట్టి, ఎల్.ఎన్ పేట, సావరకోట, హిరమండలం మండలాలకు ప్రత్యేకంగా సరికొత్త వాహనాలను తొలివిడతలోనే అందించారు. వీటికి తోడు మరో 15 ఫీడర్ అంబులెన్స్‌లు గిరిగ్రామాల్లో చక్కర్లు కొడుతూ సేవలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ కోవలో భామిని, వీరఘట్టం మండలాలకు త్వరలో నూతన వాహనాలు సమకూరనున్నాయి. అత్యాధునిక వైద్య సేవలు నూతన అంబులెన్స్‌లో ప్రభుత్వం అధునాతన వైద్య సేవలకు సంబంధించిన పరికరాలను అమర్చింది. పల్స్‌ఆక్సీ మీటర్, ఫోల్టబుల్ స్ట్రెక్చర్స్, ట్రాన్స్‌పోర్టు వెంటిలేటర్, సాక్షన్ ఆపరేటర్, మల్టీ పారామీటర్, కెమెరా, మొబైల్ డేటా టెర్మినల్(ఎండీటీ) ప్రతి పౌరునికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్ట్స్ నమోదు వంటి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 20 నిమిషాల్లోనే 108 వాహనం రానుంది. ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఈఆర్సీ)కి అనుసంధానం చేశారు. మొబై ల్ మెడికల్ యూనిట్లలో ఒక వైద్యాధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎం ఆశ కార్యకర్త ఉంటారు. సాధారణ సమస్యలతోపాటు ప్రస్తుతం కరో నా వైరస్ బారిన పడుతున్న వారికి సేవలందించటంలో కూడా 108 తోడ్పడుతుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 30 వాహనాల్లో 20 వాహనాలు కోవిడ్ బాధితుల సేవలకు కేటాయించారు. రెట్టించిన ఉత్సాహంతో.. ఇక సిబ్బంది విషయానికి వస్తే 108, 104 వాహన పైలెట్స్‌కు రూ.18 వేల నుంచి రూ.28 వేలు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌కు(ఈఎంటీలు) గతంలో రూ.12 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.20వేలు నుంచి రూ.30 వేలకు జీతాలు పెంచారు. జీతాల పెంపు పై 108, 104 వాహన సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో విధులు చేపడుతుండటం విశేషం. ఉత్సాహంగా పనిచేస్తాం ముఖ్యమంత్రి 108, 104 వాహన సేవలకు కొత్త ఊపిరి అందించారు. గతంలో కనీసం డీజిల్ లేక నెలల తరబడి వాహనాలు మూలనపడ్డాయి. దీంతో అనేక మందికి ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైంది. ఆక్సిజన్ సిలెండర్లు కూడా ఉండేవి కావు. నేడు ఆధునాతన వాహనాలతోపాట ఆధునిక వైద్య పరికరాలు అందించారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభు త్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అలాగే సిబ్బంది జీతాలు పెంచారు. రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందిస్తాం. – డి.ముకుందరావు, పైలెట్, పాలకొండ. సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది పాదయాత్రగా వచ్చినప్పుడు జగనన్నకి మా సమస్యలు విన్నవించుకున్నాం. ఆయన అధికారంలోకి రాగానే మాకు జీతాలు పెంచి మాలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఏజెన్సీలో గత కొద్ది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం. కనీస వసతులు లేని వాహనాలతో ఇబ్బందులు పడేవారం. ఇప్పుడు వాహనాలు అత్యాధునికం. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలం చేరుకోగలం. బాధితులను మరింత తక్కువ సమయంలో ఆస్పత్రికి చేర్చగలుగుతున్నాం. ప్రజల్లో మళ్లీ 104, 108 సేవలపై సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది. – గిరి గణపతి, ఈఎంటీ, పాలకొండ -
కరోనా మృతదేహం కోసం కిడ్నాప్
క్వీటో: అమెజాన్ తెగకు చెందిన గిరిజనులు కిడ్నాప్ చేసిన ఆరుగురు వ్యక్తులను విడుదల చేసినట్లు ఈక్వెడార్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కరోనా వైరస్‌తో మృతి చెందిన తమ నాయకుడి మృతదేహాన్ని తమకే ఇవ్వాలనే డిమాండ్‌తో ఆరుగురు వ్యక్తులను గిరిజనులు కిడ్నాప్ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఇద్దరు సైనికులు, సాధారణ పౌరులను పెరువియన్ సరిహద్దుకు సమీపంలోని కుమయ్ గ్రామ గిరిజన ప్రజలు గురువారం బంధించారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్ నిలిపివేత: డబ్ల్యూహెచ్‌వో) అయితే ప్రభుత్వానికి, గిరిజన తెగ ప్రజలకు మధ్య జరిగిన చర్చల అనంతరం బంధించిన వారిని గిరిజనులు ఆదివారం విడుదల చేశారని ప్రభుత్వం పేర్కొంది. ‘ఆగ్నేయ ఈక్వెడార్‌లోని అమెజాన్ అడవిలో ఉన్న పాస్తాజా ప్రావిన్స్‌లో గిరిజనుల బంధీ నుంచి విడుదలైన పౌరులకు వైద్య పరీక్షలు నిర్వహించాము’ అని ఈక్వెడార్ అంతర్గత మంత్రి పౌలా రోమో ట్విటర్లో తెలిపారు. అదే విధంగా కిడ్నాప్ చేసిన బృందంలో సమారు 600 మంది గిరిజనుల ఉన్నారని పేర్కొన్నారు. (అగ్రరాజ్యంలో కరోనా తాండవం) ఇక బందీలైన పౌరులను విడిపించేందుకు పోలీసు కమాండర్ జనరల్ ప్యాట్రిసియో కారిల్లో చర్చలు జరిపారని చెప్పారు. ముందుగా గిరిజన నేతకు కారోనా సోకడంతో మరణించాడు. దీంతో ఆరోగ్యశాఖ నిబంధనలు మేరకు ఖననం చేశారు. కానీ గిరిజనులు తమ నేత పార్థివదేహం కోసం ఆరుగురు పౌరులను కిడ్నాప్ చేయడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. బంధించిన వారిని వదిలిపెట్టిన అనంతరం గిరిజన నేత మృతదేహాన్ని కుమయ్ గ్రామానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
గిరిజన హక్కులను కాలరాసిన టీడీపీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనాభివృద్ధిని గాలికొదిలేశారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన నేపథ్యంలో ఆమె శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో టీడీపీ తీరును దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో గిరిజనుల హక్కులను కాలరాసేలా నిర్ణయాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. జీవో నంబర్ 3 వీగిపోవడానికి టీడీపీ తప్పిదమే కారణమన్నారు. ఐదేళ్ల పాలనలో గిరిజనుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు.. గిరిజనాభివృద్ధిపై లేఖ రాయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో గిరిజనులు తీవ్ర నిర్లక్ష్యానికి, అవమానాలకు గురయ్యారని, వారి హక్కులను కూడా హరించేలా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగిన ఐదేళ్ల కాలంలో చివరి ఆరు నెలల దాకా కూడా గిరిజనులకు మంత్రి పదవిని ఇవ్వకుండా అవమానించారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గంలో గిరిజన మహిళకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. (అశోక్‌బాబుపై ఏపీఎన్జీవో ఫైర్..) గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గిరిజనాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొనే గిరిజన సలహా మండలి(టీఏసీ)ని ఏర్పాటు చేయాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్ల తర్వాతగానీ టీఏసీని ఏర్పాటు చేయలేదని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల హెచ్చరికలతో టీఏసీని ఏర్పాటు చేసిన టీడీపీ ప్రభుత్వం.. గిరిజన శాసనసభ్యులందరూ వైఎస్సార్సీపీకి చెందిన వారు ఉండటంతో వారి హక్కులను కాలరాసేలా, టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా టీఏసీలో సభ్యులుగా చేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే టీఏసీని ఏర్పాటు చేసారని, ప్రభుత్వం ఏర్పాటయిన ఐదు నెలలకే టీఏసీ సమావేశం కూడా జరిగిందని వివరించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను కూడా ఇచ్చిందని చెప్పారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల మనోభిప్రాయాలను గౌరవిస్తూ బాక్సైట్ అనుమతులను రద్దు చేసారని వెల్లడించారు. (మరో విప్లవానికి ఏపీ సర్కార్ నాంది) గిరిజనాభివృద్ధిని టీడీపీ పట్టించుకోలేదు.. గిరిజనుల విద్యాభివృద్ధిని, వారి ఆరోగ్య సమస్యలను గురించి టీడీపీ ప్రభుత్వం ఏ రోజు కూడా పట్టించుకోలేదని పుష్ప శ్రీవాణి విమర్శించారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల విద్యాభివృధ్దిలో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని, గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను, గిరిజన మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడానికి ఆదేశాలను ఇచ్చారని ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో ఏడు ఐటీడీఏలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించడానికి కూడా చర్యలను తీసుకుంటున్నారని వివరించారు. ఆ వర్గాలతో పాటు గిరిజనులకు కూడా అవకాశం.. మునుపెన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంత పంచాయతీల్లో 100 శాతం వార్డులను, జడ్పీటీసీ స్థానాలను గిరిజనులకు రిజర్వ్ చేశారని ప్రస్తావించారు. మైదాన ప్రాంతాల్లోనూ 100శాతం గిరిజన జనాభా కలిగిన తాండాలలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాలన్నింటినీ కూడా గిరిజనులకే కేటాయించారని గుర్తు చేశారు. 500కు పైబడి జనాభా కలిగిన 146 గ్రామాలను ప్రత్యేక గిరిజన పంచాయితీలుగా మార్చారని, రాష్ట్రంలో 4.76 లక్షల గిరిజన కుటుంబాల గృహావసరాలకు కూడా ఉచిత విద్యుత్తును ఇస్తున్నారని తెలిపారు. నామినేషన్ పనులు, పదవుల్లోనూ ఇస్తున్న 50 శాతం రిజర్వేషన్లలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటుగా గిరిజనులకు కూడా సీఎం జగన్ అవకాశం కల్పించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని స్పష్టం చేసారు. టీడీపీ తప్పిందంతోనే జీవో నంబర్ 3 రద్దు.. జీవో నంబర్ 3 సుప్రీం కోర్టు కొట్టి వేయడానికి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదమే కారణమని పుష్ప శ్రీవాణి ఆరోపించారు. గతంలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 275 అమల్లో ఉండగా దాన్ని నిర్లక్ష్యం చేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్-3 ను తీసుకువచ్చారని, అయితే రాజ్యాగంలో విస్త్తృతమైన అధికారాలు కలిగిన 5(2) అధికరణం ప్రకారం కాకుండా పరిమితమైన అధికారాలు కలిగిన 5(1) అధికరణం ప్రకారంగా ఆ జీవోను తీసుకురావడంతో సుప్రీం కోర్టులో ఈ జీవో వీగిపోవడానికి ప్రధాన కారణమని వివరించారు. జీవో నంబర్ 3 అమల్లో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని దుయ్యబట్టారు. టీడీపీ గోబెల్స్ ప్రచారాలను గిరిజనులు నమ్మరు.. సుప్రీం కోర్టులో కేవలం రివ్యూ పిటిషన్ వేసి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. జీవో నంబర్ 3 పై న్యాయపరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు టీచర్ ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్ వర్తించే విధంగా ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర గిరిజన సలహా మండలిలో కూడా ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందని కూడా గుర్తు చేశారు. తాము అధికారంలో ఉండగా గిరిజనులకు చేసిన ద్రోహాలను మరిచిపోయి సీఎం జగన్‌కు నీతులు చెబుతూ టీడీపీ అధినేత లేఖను రాయడం ఏమాత్రం సబబు కాదన్నారు. గిరిజనాభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ విషయంలో టీడీపీ చేసే గోబెల్స్ ప్రచారాలను గిరిజనులు ఎవరూ నమ్మరని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు -
అడవి బిడ్డే హక్కుదారు
సాక్షి, అమరావతి: అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు (పట్టాలు) మరోసారి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసీ దినోత్సవమైన ఆగస్టు 9వ తేదీన పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 50 వేల ఎకరాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైఎస్సార్ అనంతరం 12 ఏళ్ల తరువాత గిరిజనులకు భూమి హక్కు పత్రాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ అడుగు ముందుకు వేశారు. పట్టాలు పొందడం ద్వారా గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. గిరిజనుల కష్టాలను తెలుసుకుని... దివంగత వైఎస్సార్ రైతును రాజు చేయాలన్న ఆలోచనతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికీ భూమి హక్కు పత్రాలు ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన పాలకులు ఆదివాసీల గురించి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తరువాత గిరిజనులు నమ్ముకున్న పోడు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన పాదయాత్రలో గిరిజనుల సమస్యను తెలుసుకున్న ఆయన అటవీ శాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్వోఎఫ్ఆర్ (రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద పట్టాలివ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 87,166 మంది గిరిజన రైతులు 1,64,616 ఎకరాలపై సాగు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై పరిశీలన కొనసాగుతోంది. ఆ భూమిలో ఎవరు వ్యవసాయం చేస్తుంటే వారి పేరుతోనే పట్టా ఇస్తారు. ఈ సర్వే ఇప్పటికే మొదలైంది. అడవి బిడ్డలకు ఇబ్బంది లేకుండా... పోడు వ్యవసాయం వల్ల అడవులు దెబ్బతింటున్నాయని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. అయితే అడవితల్లినే నమ్ముకున్న గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలివ్వడం ద్వారా పోడు వ్యవసాయానికి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిజనులు చేతుల్లో భూమి హక్కు పత్రాలుంటే అటవీ అధికారుల నుంచి ఇబ్బందులుండవు. ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హత గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలివ్వడం ద్వారా ప్రభుత్వ నుంచి సాయం పొందేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా అందుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు కూడా తీసుకుంటున్నారు. గడువు పెంచాలని కేంద్రాన్ని కోరిన సీఎం ఇప్పటివరకు 2005 డిసెంబరు 13వతేదీ నాటికి ముందు నుంచి సాగు చేస్తున్నవారికే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని, ఆ తరువాత సాగు చేపట్టిన వారికి పట్టాలిచ్చేందుకు వీలు లేదని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనను 2008 జనవరి 1వతేదీ వరకు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. వైఎస్సార్ హయాంలో 2.22 లక్షల ఎకరాలకుపైగా పంపిణీ దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2,22,383.02 ఎకరాల భూమిని గిరిజన రైతులకు పంపిణీ చేశారు. దీనిద్వారా మొత్తం 88,991 మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ వారికి హక్కు పత్రాలు ఇవ్వడంతో అటవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరిజన రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు. 15 మందితో కమిటీ సర్వే... ‘పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతుల దరఖాస్తులపై ప్రస్తుతం సర్వే జరుగుతోంది. 15 మందితో ఫారెస్ట్, రెవెన్యూ శాఖ నుంచి వీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ నుంచి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారితో కూడిన కమిటీ సర్వే చేస్తోంది. పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజనులు ఎంత కాలం నుంచి భూమిలో వ్యవసాయం చేస్తున్నారనేది ప్రధానంగా పరిశీలిస్తారు. జూన్ 25 నాటికి తుది జాబితా తయారవుతుంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీపై సోమవారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందుకు వెళతాం’ – పి రంజిత్‌బాషా, డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ. చాలా సంతోషంగా ఉంది ‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతోమంది గిరిజన రైతులకు పట్టాలిచ్చారు. ఆయన అకాల మరణం తర్వాత పోడు సాగుదారుల గోడు విన్న నాథుడే లేడు. మళ్లీ సీఎం జగన్ చొరవతో పోడు భూములపై అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు పంపిణి చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ – కాకి మధు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. వైఎస్సార్ తరువాత నిర్లక్ష్యం... ‘దివంగత వైఎస్సార్ గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించడంతో జీడి మామిడి మొక్కలు పెంచుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. ఏపీ ఫోరం ఫర్ ల్యాండ్ రైట్స్ తరఫున గత ప్రభుత్వంలో గిరిజన మంత్రిని అనేకసార్లు కలిసినా ప్రయోజనం లేదు. గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తున్న ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది’ – కర్రి అబ్బాయిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఫోరం ఫర్ ల్యాండ్ రైట్స్. కల నెరవేరుతోంది... ‘గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదీవాసీ దినోత్సవం సందర్భంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందచేయనుండటంతో గిరిజనుల సుదీర్ఘ కల నెరవేరనుంది. ఆ రోజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు’ – పాలక రంజిత్‌కుమార్ , గిరిజన సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘాల నాయకుడు, పార్వతీపురం ఇప్పుడు అందరికీ న్యాయం ‘అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంంగా ఉంది. ఇప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాగు భూమి పట్టాలను పంపిణీ చేయలేదు. ఎన్నికలకు ముందు కొంతమందికి మాత్రమే పట్టాలు పంపిణీ చేశారు. తీరా సంబంధిత భూములను వారికి స్వాధీనం చేయలేదు’ – పాచిపెంట అప్పలనర్స, గిరిజన సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాడేరు, విశాఖ జిల్లా రైతు భరోసాతో ఆదుకున్నారు.. ‘రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు మావి. అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం. నిరుపేదలం కావడంతో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా ద్వారా మాకు పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నారు’ –కుంబి అప్పారావు, ఆర్ఒఎఫ్ఆర్ పట్టాదారు, రైతు భరోసా లబ్దిదారుడు,పనసలపాడు గ్రామం, ,పి.కోనవలస పంచాయతి, పాచిపెంట మండలం -
గిరిజనుల ప్రయోజనాలు కాపాడతాం
సాక్షి, అమరావతి: గిరిజనుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్‌తో ముఖ్యమంత్రి ఆదివారం తన నివాసంలో సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు నూరు శాతం రిజర్వేషన్లపై న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచన చేయాలని అడ్వొకేట్ జనరల్‌కు సూచించారు సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. ► గిరిజన ప్రాంతాల్లోని టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో 3ను జారీ చేశారు. ఈ జీవోను కొట్టేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ► జీవోను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన గిరిజన వర్గాల్లో నెలకొందని తెలిపారు. ► ఈ అంశంపై ఇప్పటికే దృష్టిసారించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌తో సమీక్షించి గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ► న్యాయస్థానం తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలని పేర్కొన్నారు. ► ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కాబట్టి తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని ముందడుగు వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. -
అడవి బిడ్డలు ఆగమాగం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో అరకొర వసతుల మధ్య జీవిస్తున్న చెంచులకు లాక్డౌన్ వల్ల మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సాయం చాలా మందికి అందలేదు. కొంత మంది చెంచుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయినా తీసుకోలేని పరిస్థితి. మరికొందరు చెంచులకు అసలు ప్రభుత్వం నగదు సాయం అందజేసినట్లుగా కూడా తెలియకపోవడం గమనార్హం. లాక్డౌన్ ఉన్నందున వారిని అడవిలో నుంచి బయటికి రానివ్వడం లేదు. ప్రస్తుతం రేషన్ బియ్యం మాత్రమే తీసుకున్న చెంచులు, దాతలు అందజేస్తున్న నిత్యావసరాలతోనే జీవనం వెల్లదీస్తున్నారు. మరో పక్క వేసవి కాలం కావడంతో చెంచుపెంటల్లో వేసిన బోర్లు పూర్తిగా అడుగంటి పోయాయి. గ్రామీణ నీటిసరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) ద్వారా అధికారులు ఇప్పటివరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే వారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఆ సదుపాయం కూడా నిలిచిపోయింది. మరో పక్క వాగులు, నీటి చెలిమలు కూడా ఎండిపోయాయి. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న మల్లాపూర్, ఫర్హాబాద్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్ తదితర పెంటల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలంతా ఇప్పుడు ఇళ్లకు చేరుకున్నారు. నీటికొరత కారణంగా వ్యక్తిగత పరిశుభ్రత దూరమైంది. బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. సరుకులకోసం ఇక్కట్లు.. మన్ననూర్‌కు వచ్చి చెంచులు తమకు కావాల్సిన నిత్యావసరాలను తీసుకెళ్లేవారు. కానీ.. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచి పోవడంతో చెంచు పెంటల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. గిరిజన కార్పొరేషన్ ద్వారా కొన్ని సరుకులు మాత్రమే దొరుకుతున్నాయి. ఉపాధిహామీ వల్ల వచ్చిన కూలీతో కొంత జీవనం గడిచేది. ప్రస్తుతం ఉపాధి పనులు కూడా కొన్ని చెంచుపెంటల్లో జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మాత్రమే అందాయి. రూ.1,500 నగదు సాయం తమ ఖాతాల్లో జమ అయిందా.. లేదా అనే అవగాహన కూడా వారికి లేదు. చాలా మందికి బ్యాంకు ఖాతాలు కూడా లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ ఆర్థిక సాయం కూడా చెంచుల దరి చేరలేదు. నగదు సాయం ఇచ్చినట్లు తెలవదు.. పోయిన నెలలో రేషన్ బియ్యం మాత్రమే తీసుకున్నాం. ప్రభుత్వం నగదు సాయం ఇచ్చినట్లు మాకు తెలవదు. మన్ననూర్‌కు కూడా పోనిస్తలేరు. అధికారులు స్పందించి నగదు సాయం అందజేయాలి. – మహేశ్వరి, చెంచుమహిళ, భౌరాపూర్ ఇబ్బందులు లేకుండా చర్యలు.. లాక్డౌన్ వేళ చెంచులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రేషన్‌బియ్యం, నిత్యావసరాలు అందజేస్తున్నాం. తాగునీటికి సం బంధించి 17 హామ్లెట్లకు బోర్లు మంజూరయ్యా యి. త్వరలో బోర్లు వేయిస్తాం. కొంతమందికి రేషన్‌కార్డులు లేవని గుర్తించాం. అలాంటి వారికి కూడా రేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ పనులు అన్ని పెంటల్లో జరుగుతున్నాయి. ఒకవేళ ఏ పెంటల్లోనైనా జరగకపోతే వెంటనే పని కల్పించాలని ఆదేశిస్తాం. –అఖిలేశ్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ, మన్ననూర్, నాగర్‌కర్నూల్ జిల్లా -
నెల వ్యవధిలో ఐదుగురు గిరిజనుల మృతి
కుక్కునూరు: ఏజెన్సీలోని కుక్కునూరు మండలం మారేడుబాక పంచాయతీ చుక్కలలొద్ది గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఐదుగురు గిరిజనులు అంతుచిక్కని వ్యాధులతో మృతిచెందడం కలకలం రేపుతోంది. మార్చిలో ఇద్దరు, ఈ నెలలో ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. మండల కేంద్రమైన కుక్కునూరుకు 10 కి.మీ దూరంలోని అటవీ ప్రాంతంలో చుక్కలలొద్ది గ్రామం ఉంది. 11 ఏళ్ల క్రితం ఛత్తీస్గడ్ రాష్ట్రం నుంచి 20 గుత్తికోయ కుటుంబాలు ఆ గ్రామానికి వలస వచ్చి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. గతనెల మూడో వారంలో మడకం మాడా (38), కొవ్వాసి సోమడ (35) అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందారు. ఈనెల 18, 19 తేదీల్లో మడకం అడమయ్య (50), సోడే సోమ (32), కుడం గంగమ్మ (28) ఇదే విధంగా మృతి చెందడంతో గ్రా మంలో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది సోమవారం చుక్కలలొద్ది గ్రామాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. గిరిజనులు తాగుతున్న నీటి నమూనాలను ల్యాబ్ టెస్టింగ్‌కు పంపేందుకు సేకరించారు. ఈ విషయమై కుక్కునూరు పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ జెస్సీలివింగ్ ఫెయిత్ మాట్లాడుతూ కలుషిత నీరే గ్రామంలో మరణాలకు కారణమై ఉంటుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. అక్కడ నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు.