- గిరిజనులు, మీడియాకు ఓఎస్‌డీ దామోదర్ సూచన
చింతపల్లి/గూడెంకొత్తవీధి: మన్యంలోని ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టుల సమావేశాలు, వారోత్సవాలకు ప్రజలు కానీ, మీడియా సిబ్బంది కానీ వెళ్లవద్దని నర్సీపట్నం ఓఎస్‌డీ దామోదర్ హెచ్చరించారు. భద్రతా బలగాలు భారీఎత్తున మోహరించాయని వెల్లడించారు. అలాగే మావోయిస్టుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులనో, వ్యాపారులనో ఎవరైనా డబ్బుల కోసం బెదిరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో బుధవారం ఆయన చింతపల్లి, జీకేవీధి పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించేందుకు పోలీసు అధికారులు, భద్రతా బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించేందుకు గిరిజనులతో మమేకమవ్వాలని, వారోత్సవాలను తిప్పికొట్టాలని సూచించారు. నక్సల్ ప్రాబల్య ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో మావోయిస్టుల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్ పోలీసు సిబ్బందికి సూచించారు.
గిరిజనుల నమ్మకాన్ని కోల్పోయారు...
మావోయిస్టులు గిరిజనుల నమ్మకాన్ని కోల్పోయారని ఓఎస్‌డీ దామోదర్ అన్నారు. చింతపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మన్యంలో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. నూటికి నూరు శాతం మంది మావోయిస్టులను వ్యతిరేకించారని చెప్పారు.
వారు నాణ్యమైన విద్య, వైద్యం, సరైన రహదారి సౌకర్యాలను కోరుకుంటున్నారని అన్నారు. ఈ సమస్యలు మావోయిస్టుల వల్ల పరిష్కారం కాకపోగా కొత్తవి ఉత్పన్నమవుతున్నాయని అర్థం చేసుకున్నారని చెప్పారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టుల సమావేశాలకు, స్తూపాల నిర్మాణానికి గిరిజనులు సహకరించడం లేదన్నారు. ఈ పర్యటనలో ఓఎస్‌డీ వెంట డీఎస్పీ అశోక్‌కుమార్‌తో పాటు జీకేవీధి, చింతపల్లి సీఐలు రాంబాబు, ప్రసాద్, ఎస్సైలు నర్సింహమూర్తి, తారకేశ్వరరావు ఉన్నారు.